రంగారాయచరిత్రము/తృతీయాశ్వాసము

శ్రీరస్తు

శ్రీహయగ్రీవాయనమః

————

రంగారాయచరిత్రము

తృతీయాశ్వాసము

————

క.

శ్రీకామినీపదాబ్జతు
లాకోటిస్ఫుటఝళంఝళారావయుత
శ్రీకరనిజమణిమందిర
రాకాచంద్రోపమేయ రామారాయా.

1


వ.

అవధరింపు మవ్వలికథావృత్తాంతం బెట్లుండె నని నిలింప
భర్త యత్తాపసప్రవరు నడిగిన నతం డతని కిట్లనియె.

2


శా.

మూసాబూసియనుజ్ఞఁ గైకొని మహామూర్ఖాత్ముఁడౌ ఖానుఁ డు
ల్లాసం బేర్పడఁ బారుదెంచి రణలీలావ్యగ్రచేతస్కులౌ
లాసూముఖ్యుల గొప్పగొప్పసరదార్లన్ వేగ రప్పించి య
త్రాసాటోపవిజృంభితాగ్రహసముద్యన్మూర్తియై యిట్లనున్.

3


క.

ఆహవమున ధైర్యరసో
త్సాహంబు వహించు సాహసప్రాణులు మీ
బాహాబలంబుఁ జూపుఁడు
మోహీ మరుదెంచె నిదె సమున్ముఖ మగుచున్.

4


చ.

మొనఁగల మేటిమానసు లమోఘపరాక్రము లద్రిధైర్యు లి
య్యనుపమదుర్గసాధనరణాయతసంయదుపాయశాలి వం

చనఁ దగువారు మీరలని సన్నుతిఁ జేసి తదర్హవస్త్రవా
హనబిరుదప్రధానముల నందఱఁ దేల్చెముదంబురాసిలోన్.

5


వ.

ఇవ్విధంబునం జాంబూనదాంబరాభరణతాంబూలంబు
లొసంగిన నంగీకరించి సంగరరంగప్రసంగంబునకుం గు
తూహలంబు వొడమి సన్నద్ధులై పరఁగుచు.

6


మ.

ముహురన్యోన్యవిలోకనప్రభవసమ్మోదాతిరేకస్పృహా
రహితాత్మీయవిచారసూచకపరిమ్లానాననాంభోజు లై
రహిఁ జూపట్టియు వార లొప్పి రతిదుర్వారాస్త్రశస్త్రాసిసం
గ్రహణావ్యగ్రరణార్భటీపటుతరక్రౌర్యాతినిశ్శంకతన్.

7


తే.

అపుడ రంధ్రశ్రుతి ప్రభునాజ్ఞ వడసి
తడసి కొన కేగి పడ వాళ్లు దండువెంట
గడి ఘిరాయించి పైనముల్ గం డటంచు
సైనికులకెల్ల మోహీము సాటి రపుడు.

8


చ.

అతనియనుజ్ఞచొప్పునన యాహవకేళికి నెల్లసైన్యముల్
జతనములై జతల్పడి విశాలముగాఁ దగు మందుగుండు న
ద్భుతతరలోహనాళవితతుల్ జినిసీదినుసౌ ఫిరంగు లా
యిత మొనరించి యశ్వముల నేనికలం గయిచేసి రేడ్తెఱన్.

9


వ.

మఱియునుం జమూసమూహంబులు శిరస్త్రాణకంకటంబు
లును శరశరాసనఫలకంబులును పరశుపట్టెసప్రాసముసల
ముద్గరపరిఘకరవాలక్షురికాచక్రప్రముఖనిఖలప్రహ
రణప్రకాండంబులును భండనోచితమండనంబులును ప్రచం
డగతిం బొలిచి రణపాండిత్యంబుఁ దెలుప సన్నద్ధులై తమ
తమవాహినీనాయకులచెంగటం గుతుకంబు నినుపుచు
నిలిచియుండి రయ్యవసరంబున.

10

ఉ.

బాహుజచక్రవర్తి పరిభావితగాండివధన్వుఁడై రణో
త్సాహముతోఁ దురంగమగజవ్రజవీరభటోత్కరంబు లు
గ్రాహవదోహళం బయిన కాంచనరత్నకిరీటమున్ సమి
త్కాహళరాజియున్ మెఱయ ఖానుఁడు మెచ్చఁగ వచ్చెఁ గ్రచ్చఱన్.

11


శా.

సారాహంకృతిమ న్నిరంకుశగతిన్ సంగ్రామరంగస్థలిన్
రారాజన్నవవిక్రమార్కు లనఁగా రాజిల్లువా రెంద ఱే
పేరు ల్గాంచి వెడందరొమ్ములపయిన్ పిస్తో ల్తుపాకీలతో
శూరాగ్రేసరులైన మూసలు ఫరాసుల్ వచ్చి రుగ్రాకృతిన్.

12


చ.

జవజితవైనతేయములు సాహిణము ల్సులతానుచూడ్కికిన్
దవిలిచె నత్తరిన్ ముదము ధౌరితరేచితవల్లితప్లుత
ప్లవనపులాయితాదిగతులన్ కలికాముఖవల్గువ ల్లన
ప్రవణమనస్కసాదిజనభావపదంబుల నాశ్రయించుచున్.

13


మ.

ప్రతిపక్షప్రబలావలేపహరణప్రజ్ఞాసమగ్రంబు ల
ప్రతిమప్రస్తుతగండమండలమదాంభఃక్షేపశామ్యచ్ఛమూ
ద్ధుతరేణూద్గమమున్ ప్రతప్తకలధౌతోద్దీప్తభూషాపరి
ష్కృతముల్ మత్తకరీంద్రముల్ మిగులరాజిల్లెన్ సుబా మెచ్చఁగన్.

14


చ.

పృథురభసంబున న్మొఱసె భీషణఘోషణదూషణక్రియా
బధిరితదిక్ప్రఘాణములు భర్మమయావయవాతిరమ్యము
ల్మథితవిపక్షపక్షబహుళప్రతివీరవిభంగరంగముల్
రథము లసంఖ్యసంఖ్యలు ఫరాసులు యేలికచూడ్కి కింపుగన్.

15


చ.

అతులనిశాతహేతిరుచు లాకస మెల్లను నాక్రమింప ను
ద్ధతగతి నేల యీనినవిధమ్మున లెక్కకు వెక్కసంబుగా

నతనికి వేడ్క నించిరి సీతాసితపీతపిశంగకంచుక
ప్రతతులఁ దాల్చుచున్ యవనబర్బరమల్కపుళిందపుల్కసుల్.

16


మ.

కదనక్షోణికి నిత్తెఱంగున మొనల్ గట్టాయితంబైన దు
ర్మదుఁ డాసాహెబు సర్వసైన్యములలో మాద్యద్భుజావిక్రముం
డు దృఢాటోపి యితం డటంచు నొగి లాడూఖాను నేమించె స
మ్మద మొప్పన్ దళవాయి వీవ యని సన్మానింపుచున్ గ్రచ్చఱన్.

17


శా.

లాడూఖాను కుమందముఁ బటురణాలంఘ్యప్రతాపోజ్వల
త్క్రీడాదర్పితు నివ్విధంబునన నీకిన్యగ్రణిం జేసినన్
వాడున్ జూడగ నొప్పె రావణబలవ్రాతంబులో తొల్లి య
వ్రీడన్ గన్పడు మేఘనాథుని మహోద్వృత్తి న్విడంబించుచున్.

18


మ.

మదదంతిప్రతిమానదేహలతికామందేహుజండ్రాల్మహ
మ్మదుహుస్సేనుమయూరుశాత్రవచమూమత్తాహిదృప్యన్మయూ
రుదవాగ్నిప్రతిమల్లువిగ్రహసమగ్రున్ వానిదోర్వీర్యసం
పదకున్ బాసటగా నమర్చె సమరప్రారంభసంరంభియై.

19


ఉ.

శుంభనిశుంభులన్ దెగడు శూరులు వీరల నా జెలంగి య
స్తంభపరాక్రమక్రమవిశాలతమై జతగూడి వారు దో
స్తంభవిజృంభితాసిముఖదారుణశస్త్రపరంపరాసము
త్తంభితధీధితుల్ దివికిఁ దార్కొన నుక్కునఁ బేర్చి రెంతయున్.

20


శా.

లాడూఖానుని నివ్విధిన్ సమరలీలాకేళికిన్ ముఖ్యుఁగా
నీడం బోవక నూలుకొల్పుచు లడాయీకిన్ వడిన్ మొగ్గరం
బై డాయన్ సమకట్టి జోదులఁ దదీయానీకినీశ్రేణి నా
డాడం బేర్కొని మార్కొనన్ నిలుపువాఁడై ఖానుఁ డత్యుద్ధతిన్.


మ.

నుతసత్వాధరితోగ్రసేనజనుజానూఖానుమీర్జానుజూ
నుతలోత్సారితసర్వపర్వతసమానున్ మానకౌరవ్యు ని

ర్జితనానాహితవర్గదుర్గనిచయున్ సిద్దిబిలాఠానుతో
జతగా నూల్కొలిపెన్ మహోగ్రరణదీక్షాదక్షిణక్రౌర్యుఁడై.

22


శా.

లీలాభర్స్తితదుస్ససేను హసనల్లీఖాను నాయోధనా
భీలప్రక్రమవిక్రమాతిశయవాగ్భీతారిదుర్మానులా
లాలోలాయతవక్త్రుఁ డైన షుకురుల్లాఖానుతో జంటగా
నోలి న్నిల్పె నరాతినిగ్రహకరోద్యోగక్రియాధుర్యుఁడై .

23


శా.

అత్రాసాత్మవరూధినీనికరబాహాహంక్రియాసారచా
రిత్రధ్వస్తసమస్తశాత్రవనృపశ్రేణీభుజాగర్వునిన్
క్షత్రగ్రామణి నుగ్రవిగ్రహుని మూసాబూసి దోట్పాటుగాఁ
జిత్రక్రోధరసాగ్నిభుగ్నతనుఁడై చేర్చెన్ రణేచ్ఛారతిన్.

24


శా.

లాసూదొట్టి ఫరాసుమండలము లోలస్సేనుతో జోడుగా
లాసున్ లాసుకు ధన్నిధన్నికిని కుప్లామంటికుప్లాముతో
మాసున్ మాసుకు కుప్పి కుప్పికిని నై మర్తేను నీరీతిగా
మూసాపూర్వు లశృంఖలాకృతిని గుంపుల్ దీర్చి తోరంబుగన్.

25


వ.

యివ్విధంబున నానావిధసేనానాయకుల సమకట్టి యం
దగ్రభాగంబున లాడూఖాను కుమందమును బిఱిందిదెస
జండ్రాల్మహమ్మదు హుస్సేను మయూరును వారలకు దక్షిణ
పుదిక్కునఁ గన్నాకుగా జానూఖానుమీర్జాసిద్దీబిలాల్ఖాను
లును దదుత్తరదిశను హసనల్లీఖాను షుకురుల్లాఖానులును
బశ్చాత్ప్రదేశంబున ఛత్రపతి రామచందురుప్రముఖరజపు
త్రసమేతంబుగా బాంహ్లీక ఫారసీక యవన బర్బర
పుళింద మల్కపుల్కసాదు లగు సాదులును మధ్యప్రదే
శంబున విజయరామరాజన్యతిలకంబును నుద్ధతులము

ల్కును వారల కిరుగెలంకులం బాసట గాలాసూపురోగ
మఫరాసుమండలంబును బాదుకొల్పి నాసీరంబునం జినిసీ
ఫిరంగు దాదులును ఱెక్కమొనల నుక్కుగల జిరాగుఱా
లఫౌజును దాని కంతటికి జక్రవలయాకారంబులుగాఁ
జెకిముకితుపాకీబారుగడిదీలను దత్తదుచితక్రమక్రమాను
గుణ్యంబుగా నీలపీతారుణగౌరకడారపిశంగవర్ణస్ఫీతకేతన
వాతంబులును భల్లూకవ్యాఘ్రచర్మభర్మమయవర్మ
విశేషంబులును భండనోద్దండమండనప్రకాండంబులునుం
గీలుకొలిపి దండాకారశకటక్రౌంచపద్మవ్యూహప్రకారం
బులుగా మొగ్గరంబులు దీర్చి గడీదిరుగువా రంఘిరాయిం
పు మని యనీకినీనికరంబుల కనుజ్ఞ యొసంగినం గదలి యు
త్తుంగమత్తమతంగజబృంహితంబులును సంగరాభంగుర
తురంగమహేషానిర్ఘొషంబులును శతాంగనేమీవిరావం
బులును నానాయోధనోద్భటభటోత్కరక్ష్వేళారవంబులు
ను శింజినీఠంకారంబులును కేతనపటపటాత్కారఘోరని
స్వనంబులును నరబ్బీబాజాఝాంకరణధ్వనులును డమారం
పుటోకులరవలియు నేకీభవించి సర్వపర్వతప్రపంచంబు
నాక్రమించి పఱతెంచు యుగసమయవిఘూర్ణమానచతు
రర్ణవకలకలంబు ననుకరింపుచుం గోలాహలంబుగా విశ్వ
విశ్వంభరానభోంతరాళంబు నిండి దిగంతదంతావళశ్రవణ
కోటరవిపాటనద్రఢిమంబు రవకట్ట బొబ్బిలిగడీ చుట్టుముట్టి
నిలిచె నంత నచ్చట.

26


ఉ.

హైదరుజంగుపంపున మహాహవకేళికిఁ గోట చుట్టి బా
హాదృఢవిక్రమోద్ధతి రయమ్మున సైన్యము వచ్చి నిల్చె ని

మ్మీదివిచార మెట్లని యమేయపరాక్రము రంగరాయధా
త్రీదయితుం గుఱించి విచరించిరి యచ్చటి పెద్దమానసుల్.

27


క.

 అంతట రంగారాయఁడు
చింత యొకింతయును లేక చెన్నగు ధృతి మ
త్స్వాంతమ్మున బురు జెక్కి త
దంతికగతఖానుసేన నంతయుఁ గాంచెన్.

28


తే.

చూచి తలయూఁచి తద్బలస్తోమభీమ
సమరసన్నాహసాహసోత్సాహములకు
నబ్బురం బంది వీరంద ఱస్మదీయ
లోహనాళంపుగుళ్ల వ్రేలుదురుగాక.

29


చ.

 అని కృతనిశ్చయుం డయి నిజాశ్రితవీరభటప్రతానముం
గని కనుసన్నలో మెలఁగఁగాఁ దగురీతిని నియ్యకొల్పి మీ
రును జతనంబుగాఁ గరసరోరుహకీలితలోహనాళులై
సునిశితకుంతసంతతులు శోభిల నుండుఁ డటంచుఁ బల్కుచున్.

30


తే.

 మనయరాబాసమిష్టి భీమంబు గాఁగ
మందుగుండును గట్టించి పొందుపఱచుఁ
డెందు నెందుల ననవుఁడు గ్రందుకొనుచుఁ
దత్తదధికృతపురుషు లందఱును జెలఁగి.

31


సీ.

నక్రప్రదీపనిర్వక్రశుక్రాభీల
       కీల లొల్కెడు ఫిరంగీలవారు
కాలకూటంబులు జ్వాలాముఖంబులై
       క్రాలెడు జభరుజంగీలగుంపు
కాలకాలాయసాకారఘోరమ్ములై
       పొలుపొందు గుంటికోపులబిడారు

బాడబానలశిఖాపటలీనిరాఘాట
       కీల లీనెడు జఝాయీలగుంపు


తే.

గండుమిగిలిన రేకలాతండములును
లగ్గడింపులు దించె నాలగ్గలముగఁ
గోట నలుచుట్టు లురువడి మాటులందు
బురుజులందును నిలిపి రద్భుతముగాఁగ.

32


మ.

జిగురం బళ్ల పెనంబులున్ దిలరసస్నిగ్ధోష్ణకుంభంబులున్
పొగబాణంబులుఁ జిచ్చుబుడ్లు వసియార్పుం దారుఖండంబులున్
మృగచర్మంబుల మందుతిత్తులును మొద్దీటెల్ సిలాయంత్రముల్
జిగిగా నుంచిరి కోటకొమ్మలపయిం జెన్నౌసుతారమ్ములన్.

33


సీ.

కొనల నింగిలము గీల్కొలిపి జానకిత్రాళ్ల
       వలయముల్ కూర్పరస్థలులఁ జేర్చి
కటిసీమనెఱ్ఱడాల్ కాశలపై మందు
       సచిలాతిముసుగుదప్తా లమర్చి
వలకేలు పిఱిఁదికి వంచి డాకే ల్సాచి
       వెడఁదరొమ్ముల నంట మడమ లూది
గుఱిదప్పనీని యబ్బురపుఁజూడ్కులు వాతి
       యుక్కుటీగలమీఁద నూలుకొలిపి


తే.

శాత్రవభయంకరోద్దండచండపటిమ
మెండుకొనుచుండ నెలగోలు గండు మెఱసి
గండికోటతుపాకీలదండిబారు
బారుగా నిల్చె నురువడిఁ బై గణంగి.

34

మ.

పులితో ల్జల్లుల బారుటీటియలగుంపు ల్లుల్కఱాకంచుటం
దెలపల్లెంబులు బాకులుం దుముకుకత్తీలున్ మొలామాకటా
రులు జందాళులు బేజుమాలు పనిదీర్పుం గప్పువాల్గుజ్జుక
త్తులు నిమ్చాలు ధరించి వీరభటులందు న్నిల్చి రుజ్జృంభతన్.

35


క.

బులుగారు పేటివాలా
జిలుగుసిలేబక్తరులును జికిలీతరవా
రులు సింగిణీతరకసం
బులు దాలిచి నిలచి రెల్లబురుజుల రౌతుల్.

36


సీ.

 ఘనభుజాబలశాలి కాకర్లపూడి వేం
       కటరాజు కొంతసంఘంబుతోడ
నరనుతశౌర్యుఁ డిన్గంటిధర్మారాయ
       భూకాంతుఁ డొకకొంతమూకతోడ
స్థిరతరధైర్యుండు చెలికాని వేంకట
       క్షితిపాలుఁ డొకకొంతసేనతోడ
శాత్రవముఖసరోజాతారి దామెర
       ధర్మరాయఁడు గొంతదళముతోడ


తే.

బశ్చిమోత్తరదక్షిణప్రాగ్దిశాభ్ర
భాగకుడ్యంబులకు నెక్కి ప్రబలబలస
మృద్దిసన్నాహములతోఁ బ్రసిద్ధగరిమ
బారు దీర్చిరి కోట నల్బాజులందు.

37


మ.

ధృతిని న్గంటినృసింహరాయఁడను పృథ్వీభర్త యెంతేసము
ద్ధతమై బాజులయేటు లాడుప్రజకుం దగ్గైన మొగ్గైన మ

ద్దతుగారై ప్రకటించుచు న్నిలిచెఁ జెంత న్పాండవశ్రేణి కి
ష్టతము న్నాజికి సైన్యనాథుఁ డగు ధృష్టద్యుమ్నుచందంబునన్

38


చ.

కరులు రథంబు లశ్వములు కాల్బలముల్ సమరోచితక్రియా
సరణి నలంకృతంబు లయి సత్వరగా నరుదెంచి నంత ని
ష్టురభుజసాహసద్రఢిమ జొప్పడ జాగ్రతతోడ దానునుం
గురుతరలీలమై పసపుకోకలు దాలిచి నిల్చె నాజికిన్.

39


శా.

రంగారాయనృపాలుఁ డిప్పగిది వీరగ్రామణుల్ మెచ్చ స
ర్వాంగాలింగితశాలి బాసి చయహృద్యత్కంచుకభ్రాజియై
వెంగళ్రాయుని కాత్మసోదరున కుర్వీభార మర్పించి సూ
నుం గౌతూహల ముప్పతిల్లఁ దదధీనుం జేసి యాపిమ్మటన్.

40


క.

చెలికాని వెంకభూవరు
నలఘుస్థైర్యంబు మెరయ నవరోధజనం
బుల నాలోకనయాత్రకు
నలువొందఁగ నీయ కొల్పు మని దృఢమతియై.

41


చ.

అపుడు ధరామరాగ్రణుల కానతుఁడై తిలభూహిరణ్యగో
కపిశపిశంగవస్త్రతురగప్రకరాదులు చాల నిచ్చి ని
శ్చపలమనస్కతన్ వివిధసౌరతతిన్ భజియింపుచున్ త్రివి
ష్టపపదవీసమాక్రమణసంభవలగ్నవిచారమగ్నుఁడై .

42


శ.

ఖానునియడకు జిరాయ
త్ఖానాబాయన్న ననిచె కడువడి రంగ
క్ష్మానేత యమరలోక
ధ్యానారూఢాత్ముఁ డిట్లు తగదని తెలుపన్.

43

చ.

 అతఁడును నట్ల యేగి యనయ మ్మిది వారలు పిన్నవారితో
హత మగువారు మీరు తెలియ న్బలుక న్వివరించు కేని యు
ద్ధతమతులై దురం బగు విదారణపుం బని పూని యిట్టిదు
ర్మతి విడ వేని పై నుసురుమానదు నీకు నిజంబు ఖానుఁడా.

44


తే.

 కోట విడిచి పోవ రాటోపములు జూపి
తిరుగబడి దురంబు నెరవనోప
రాత్మఘాతవలన నభిమానరక్షణం
బనుమతించువార లకట వారు.

45


మ.

 నయ మిం తేనియు లేక మీర లటు లన్యాయంబుచే రాగని
ర్భయతం దాల్చుచు మేము మానుషపువర్ణం బౌట మీ కిట్లు ని
ర్దయ యొప్పన్ విధి లేదు చావక యధర్మవ్యాప్తి చేకూరు మీ
పయి చైఁ జేసెడు బుద్ధి లే దిది మనోవాక్కాయకర్మంబులన్.

46


చ.

 మరణము డాసినప్పు డసమానపరాక్రమశక్రసూతిభూ
వరతిలకంబు రంగనృపవర్యుఁడు పోరున నోల మాస చే
కురఁ డటమీఁద నెందఱనుఁ గూల్చునొ చచ్చెడు వాని కుర్వి సా
గర మది జానుదఘ్న మగు గా యని యాయన యేగె క్రమ్మరన్.

47


తే.

 అంత నచ్ఛిద్రకర్ణుఁ డుద్యద్దవాగ్ని
పగిది మండుచు నిప్పుడ బవరమునకు
నూలుకొల్పెద నని లేచి మ్రోలనుండు
పసిడిజలపోతఖాతి నీపైవి దొడిగి.

48

శా.

 బంగారంపుఫరంజుక్రొంజికిలివాల్పట్టెనడాలున్ జిరా
సింగాణిందొనలన్ వహింపుచు సిరాజీఫారసీదేశపున్
టాంగణ్గుఱ్ఱము నెక్కి వచ్చెను నిజాంతఃక్రోధవాఃపూరముల్
పొంగన్ హైదరజంగు జంగ మనగంబో నాచమూభూమికిన్.

49


శా.

 సేనావారముఁ జొచ్చి వచ్చి యతఁ డక్షీణానురాగంబుతో
నానాసైనికనాయకప్రతతిలో నాసీరదేశంబులం
దేనుంగుంగముల న్దురంగమములన్ యేయేనిశానీలతో
జానౌజోదుల నెల్ల నారసి సమిజ్జాగ్రత్త్వరోదగ్రుఁడై.

50


శా.

జానూలాడుఫరాసుసిద్దిరజపూర్జండ్రాల్మహమ్మాదుము
ఖ్యానీకిన్యధినాథయోధులసముద్యద్దర్పసందీప్తులన్
గానిండాలము చాల మేలయిన లగ్నం బంచు రావించె స
న్మానింప న్ద్వర నేగి వారును రణోన్మాదానుమోదాత్తులై.

51


శా.

 డేరీజాకెదుటన్ ఫిరంగులగముల్ ఢీకొల్పి ఘోరాహవో
దారస్వైరవిహారసారకలవాదర్పాంధబంధూభవ
న్నీరంధ్రాదృతవీరపాణులు కృపాణీప్రస్ఫురత్పాణులున్
గ్రూరప్రాణులు నైన దాడుల రవుల్కొల్ప న్నియోగించినన్.

52


మ.

 జినిసీదీర్చి ఫిరంగుదాదులు సముక్షిప్తాంశుకస్తోములై
యనలజ్వాలలు కోలల న్గమిచి హాహారావ ముప్పొంగఁ ద
ద్ఘనవప్రోరుకవాటపాటనకళాగాఢొద్యముల్లక్ష్యదృ
ష్టిని యొక్కుమ్మడి నాదుకొల్పిరి దిశాశ్రేణుల్ కడుంబెగ్గిలన్.

53


చ.

 అపుడు ధరాతలం బదరె నద్రులు మొగ్గతిలెన్ దిశాతల
ద్విపములు దిద్దిరం దిరిగే దీర్ఘము లయ్యె హరిత్పరంపరల్
తపనహిమాంశు లొత్తిలిరి తారలు డుల్లెఁ బయోధు లింకె ని
ట్లపరిమితంబుగా మొఱయు నాజినిశీనినదంబుడంబునన్.

54

శా.

 రుద్రాదిత్యమరుద్వసుప్రతతిభీరూభూతభూరివ్యధా
ముద్రాముద్రితచిత్తతం బొరసి గుంపుల్ గూడె మింటన్ జగ
ద్విద్రావద్రఢిమైకభీకరతమావిర్భూతధూమధ్వజో
న్నిద్రోపద్రవకృచ్ఛతఘ్నిపటలీనీరంధ్రనాదార్భటిన్.

55


తే.

 కటకటా యిట్టిదుస్తంత్రకార్యమునకుఁ
బూనినయతండు మూఁడవపూటయందుఁ
గులీశధారానిహతిఁ గూలు కొండకరణి
గంతుగొనఁగలఁ డని పల్కె గగనవాణి.

56


క.

 నెత్తురుల సోనవాన వి
యత్తలమున నుండి తొరఁగె నవనీస్థలిపై
మొత్తంబు లగుచుఁ గడువడి
నుత్తలపడి రాలె నపుడు నుల్కాతతులున్.

57


సీ.

 తట్టికోట యగల్చి దారుణోష్మలు గ్రమ్మ
       వంక దారుకు డాసి వ్రాలునవియు
నినుపతల్పులు ఘణిల్లునఁ దాకి పిఱిఁదికి
       రవలిమై వచ్చి నెట్టవియు నవియు
ద్వారబంధపుఁగమ్మి దూఱి యవ్వలికంట
       డుస్సి పాఱఁగ నోడి డొల్లునవియు
గుఱిఁ దప్పి పఱతెంచి కోటముంగలిహస్తి
       నఖపుదుమ్ముల రేచి నక్కునవియు


తే.

 నగుచు నొండెడ నెడయీక నంటి తూఁగి
బంతు లాడినపగిది గుభాల్గుభాలు
నినదభయదార్భటుల శతఘ్నిప్రయుక్త
తాళఫలసన్నిభాయసగోళతతులు.

58

సీ.

 గంధాశ్మనికరదుర్గంధధూమస్తోమ
       సంఛాదితాఖిలాశాచయంబు
బహులశతఘ్నిగుభాల్గుభారభటికా
       బధిరీకృతేంద్రసభాతలంబు
కేతనాతతమరుద్వ్రాతఝాంకరణప్ర
       కంపితసకలలోకవ్రజంబు
భేరికాఢాన్నాదభీతావనీధరా
       గ్రస్థలస్థాయి మృగప్రకాండ


తే.

 మశ్వఖురకోటిఘట్టనాయాసచకిత
ధరణిధరణాక్షమాత్తభూత్కరణభగ్న
మానశేషాహిరాట్ఫణామండలంబు
తొలుఫిరంగులజగడంబుకలన నిలిచె.

59


శా.

 జెట్టిం జీమలుబట్టిన ట్లపుడు నిశ్రేణుల్ శిరస్త్రాణముల్
కఱ్ఱుం గోలలు పాటిచిప్పలు సురంగంపున్ సుతారుల్ జురా
తొఱ్ఱుల్ కుంజరపుంజముల్ మడుపుఁగత్తుల్ మొత్తమై రాగడీ
జిఱ్ఱున్ జిఱ్ఱున లగ్గ కెక్కుటకునై చేరె న్బలస్తోమముల్.

60


మ.

 రణఘాటీలును దంధమాలు గడిమోర్చాలున్ ఫిరంగీలు చి
క్కణమౌ సూరతుమందుగుండ్లు పొదులున్ గాఢంబుగా కోటచు
ట్టణుమాత్రం బెడయీక యీక విడిన ట్లంతంతకున్ డాసి రాఁ
గణఁకం గాంచి తదంతరస్థభటసంఘాతంబు నిర్భీతమై.

61


ఉ.

 వచ్చెను హద్దు తప్పి బలవర్గ మనర్గళవిగ్రమోద్ధతిన్
హెచ్చియగడ్త డాసి యని హెచ్చరికం గడిమన్నెవీరుతో
నొచ్చము మాని తెల్పనపు డుక్కున హూయని సన్న కొల్పి మీ

యిచ్చకు వచ్చినట్టు లిఁక నేయుఁ డనె న్జనపాలమౌళియున్.

62


తే.

 సంధి పొసఁగమి నిట్టి దుస్సంధి గూడె
నింకఁ బోదని యొండొరు లెచ్చరింపు
కొనుచు బురుజులఁ దగు ఫిరంగులన గాదు
కొలుప సాగిరి వేనవే ల్గుములు గూడి.

63


చ.

 చొరఁబడి వచ్చువారి గుఱిఁ జూచుచుఁ గొంకక జేరుగళ్లలో
నురువడి వంచిపట్టి యెడ యూదక పై నెలగోలురగ్గడీ
యురువడి వెంబడి న్నిలిచి యోర్చుచు నేయఁగ మూఁగి పెల్లుగాఁ
బరువడి నొక్కపెట్టునఁ దుపాకులు ఢామ్ముఢమీఢమీలునన్.

64


శా.

వాసిం బేర్కొను రంగరాడ్గజనుదవ్యాసంగము ల్మాని యా
మూసాబూసి ముఖాహితానననవాంభోజాతగంధగ్రహే
చ్ఛాసంరంభనిగుంభితారవములై చంచద్గతి న్వచ్చు భృం
గీసంఘంబు లనంగ వ్రాలెను దుపాకీగుండ్లు రివ్రివ్వునన్.

65


సీ.

 కోటపేరిటిశక్తి గ్రుడ్లెఱ్ఱ గావింపఁ
       బొరిఁబొరి రాలునిప్పులొ యనంగ
రణదుర్గమీద నీరంధ్రంబుగాఁ జల్ల
      రాజిల్లు నాచార లాజ లనఁగ
గడిదుర్గ మనియెడి కాలాహి గ్రక్కిన
      క్రొవ్వేడిమివిసంపుగుళిక లనఁగ
రంగరాయక్షమారమణాభ్రమునఁ బుట్టి
      దొరఁగెడు పిడుగుక్కుతునక లనఁగ

తే.

 లెక్క కెక్కుడుగాఁ దూగు రేకలాలు
గుంటికోపులు జబరుజంగులు ఫిరంగు
లొక్కమొగి గాతు గావింప నుక్కు మెఱసె
గుండ్లగుంపులు జడివాన గురిసినట్లు.

66


క.

 ఇరువాగుదొరలదళములు
మొఱసె నగారాలు మేరుముఖపర్వతముల్
దురమున కొండొరు దారసి
యురువడి ఢీఢిక్కులాడు నొఱపునఁ దఱుచై.

67


శా.

 భేరీభాంకరణంబులుం గరిఘటాబృందిష్ఠఘీంకారముల్
ఘోరాటోపవిజృంభితారిజనతాకోదండఠంకారముల్
వీరవ్రాతభయంకరారభటిమద్విఖ్యాతహుంకారముల్
నీరంధ్రంబులుగాఁగ రెండు దెసలన్ నిండెన్ ప్రచండోద్ధతిన్.

68


మ.

 తమప్రాణంబులు వైరికోటులును దత్ప్రాణప్రతానంబులుం
దమకుం గైకొనకుండ మార్పులకు నై దార్కొన్న యాయోధనో
ద్యమలీలావసరంబునం దెగర నేయం దోఁచు పిష్టాతక
క్రమమై వైచె ధరారజంబు హయరింఖాసంఘసంఘాతమై.

69


తే.

అట్టియద్భుతరసదిదృక్షాతిశయము
చొక్కగ విమానతకు లెక్కి నిక్కినిక్కి
చూడసాగె వియచ్చరస్తోమ మప్పు
డభ్రమున నుండి తముఁ దాఁకు ననెడుభీతి.

70


తే.

 అంత నేనును గలహాళి నగుటఁ జేసి
కుతుక ముదయించి వచ్చి భారతరణంబు

నాఁడుగాఁ గూటిపేదనై నేఁటి కిందు
గంటి నని కుంచవిసరుచు నుంటి మింట.

71


మ.

 అపు డన్యోన్యజయాభిలాషల రణాహంకారహుంకారపూ
ర్వపరిస్ఫీతనిజప్రతాపకలనావైదగ్ధ్యముల్ మీఱఁ దో
రపుఁగిన్కన్ రిపుకోటి బి ట్టదుర దుర్గస్థాయులుం గోట బొ
క్కి పడంగా యవనోగ్రసైన్యము ఫిరంగీల్ గుప్పి రొక్కుమ్ముడిన్.

72


మ.

 ఇరువాగుం దళముల్ ఫిరంగులగముల్ హేరాళమై పర్వ ని
ట్లురువేగంబున నేయుగుం డ్లెగిరి యొండొంటి న్వడిం దాకి ని
ష్ఠురనిర్ఘోషముతో డమి న్నొఱయుచు౯ క్షోణీస్థలిన్ వ్రాలి క్ర
చ్చఱ పాతాళతలంబు ముట్ట నరిగెన్ సంగ్రామరంగంబునన్.

73


మ.

 గజముల్ ఘోటకముల్ బడల్పడి చనంగా వారువప్రం బొగిన్
రజమై కుప్పలు గూడి రాలిపడ సంరంభంబుచే వీరలున్
భుజగర్వం బనివార్యమై పొదలఁగాఁ బోరాడి రమ్మన్నెరా
డ్ధ్వజినుల్ మ్లేచ్ఛభటుల్ పరస్పరజయాధ్యాసీనభావంబునన్.

74


శా.

 ఈలామండనముల్ జటిల్పడ జజాయీ ల్రేకలాలున్ ఫిరం
గీలున్ రువ్వినగుండ్ల పెన్బొగలు నింగిం గ్రమ్మె నిమ్మై తమో
జాలంబుల్ సమరాంగణంబు మెఱసెం జాలంగ పీనుంగుపెం
టై లూనాకృతిఁ గాంచె బొబ్బిలి గడీయాలంబు సోలింపుచున్.

75


మ.

 పరుషాంభోధరమండలం బురువడిం బ్రస్ఫీతగర్జాసము
త్కరమై క్రాలు మహాశనిప్రతతి నాఁ గారామసింగీల ఘో
రరవం బొల్కెడు వేడిగుం డ్లురల హోరాహోరిగాఁ బోరిరి
ట్లిరువాగుం దొర లంత భీతికరమై యేపారె నాలం బొగిన్.

76


ఛ.

 బలముల నెచ్చరింపుచుఁ దుపాకులమూఁకలు దంధమాలు ని
ట్టలముగ మోరిజా ల్బురుజు డాయఁ గిలార్పుచు లాడుఖానుఁ డు

జ్జ్వలతరకోపవహ్నికణసంజ్వలితేక్షణుఁ డై కడంగికో
ల్తల నడపించె సైన్యముల దర్బవిజృంభణ ముప్పతిల్లగన్.

77


శా.

శాతాసీప్రభ లాకసం బలమగాఁ జండ్రా ల్మహమ్మాదునం
జాతక్రోధరసప్రసారితజిగీషాభీషణౌద్ధత్యవా
చాతంత్రంబు వెలార్పుచుం గడువడిన్ సన్నద్ధుఁడై తూఁగి సం
ఖ్యాతీతం బగు సేనతో నడచె హుంకారింపుచున్ లగ్గకున్.

78


మ.

 పృతనామండలికుండలీకృతధనుర్బృందంబుతో సందడిం
చి తుపాకు ల్పయినుండి రా ఫలకముల్ శీర్షంబులం జేర్చి యా
తతహేతిప్రకరంబు డుస్సికొని యుద్ఘాటింపుచు న్గోడ కు
ద్ధతిడాబాలును నొడ్డుగుంటలును నండ ల్గాఁగ డాయం జనెన్

79


శా.

 కేడెంబుం దరవారుఁ గేలఁ గొని యక్షిణ ప్రతాపాద్భుత
క్ష్వేడారావ మొసంగ దానును దుపాకిం ద్రిప్పుచుం దేవన
మ్రాడావాసపురంబుపైఁ దొడరు వృత్రప్రక్రియం గ్రుద్ధుఁడై
లాడూభాను కుమంద మేడ్డెఱ గడీ లగ్గల్ గొన న్రావడిన్.

80


చ.

 బురుజులమీఁద నుండి పరిఫుల్లసరోరుహగర్భనిర్గళ
ద్గురుతరచంచరీకములకోపునఁ బెద్ద తుపాకీగుండ్లు ని
ష్ఠురగతి చిత్తవాన తెర సోకినచాడ్పున ఱాలగోల్తలన్
విరిగిరి బెగ్గడిల్లి పురి విచ్చిరి నొచ్చిరి మ్లేచ్ఛు లయ్యెడన్.

81


చ.

 మునుమునఁ దారసిల్లి తన మొగ్గరపుం బలుమానుసు ల్గడున్
వెనుకకు నోల మాస గొని వీఁగినఁ గ్రమ్మఱఁ గూడఁగట్టి మీ
ఘనతరదుర్గసాధననికామపటుత్వముఁ జూపుఁ డంచు నె
ట్టనఁ బురికొల్పి యిట్లలవడన్ నడపించెను లాడుగోడకున్.

82

మ.

 మనలాడూ చెరలాడు సైన్యములతో మాద్యద్గతిన్ గోడ గై
కొనఁ దా లగ్గకుఁ దూగె నంచు విని యక్షుద్రాత్మవర్గంబు నె
క్కొనఁగా రాజవతంసుఁ డుద్ధతులముల్కుం గారు నిస్సాణని
స్వనవిస్ఫోటితదిష్ప్రఘాణు లగుచున్ సన్నద్ధులై తోడ్పడన్.

83


మ.

 తనకుం బాసట గాఁగ నిల్చిన భుజాదర్పాధికప్రాణులన్
ఘనులన్ వారలఁ గాంచి కయ్యమునకుం గాల్ద్రవ్వుచున్ బిచ్చలిం
చిన తోడ్పాటున కుబ్బి బొబ్బిలిగడీఁ జేకొందు నే నిప్పు డం
చును లాడూ తనదోఃప్రసంగగరిమల్ శూరుల్ వితర్కింపఁగన్.

84


చ.

 గజఫరజంగుపెంపున నికామతరత్వరఁ గొల్చుచుం జమూ
వ్రజముల నూలు కొల్పి పురి వాయక యుండ మఱల్చికొంచు భూ
రజము మఱుంగుగా నుఱక రౌతుల బాసటఁ దూఁగి డాసె లా
డజినము నెత్తి నత్తమిల నత్తమి కందఱుఁ దన్నుఁ జూడఁగన్.

85


శా.

మూసాబూసియు రాజు నాశ్వికబలంబుల్ ఫారసీకాగ్రణుల్
లాసూదొట్టిఫరాసుమండలము కిల్లా బెగ్గటిల్లంగ ధా
రాసంపాతము గాఁగ నొక్కమొగి గర్ణాలుం దుపాకీలు సం
త్రాసం బానఁగ గుప్పి రెల్లెడల నీరంధ్రంబుగా నత్తఱిన్.

86


వ.

 ఇ ట్లురువడింపుచు లాడుఖానుండునుం దనయిరుగెలం
కుల నుఱక మొఱయు ఢక్కాహుడుక్కాపటహతమ్మటభే
రీభాంకారంబుఁ గరిఘటాఘీంకారంబులుఁ బ్రమత్తరా
హుత్తప్రకాండకుండలితకోదండమౌర్వీఠంకారంబులుఁ
బదాతిజనహుంకారంబులు బిట్టుఱికి జెట్టిమగలలో నొం
డొరులం బిలిచికొను నెలుంగుల కలకలంబులుఁ దుములం

బులుగా బురుజులపై నుండి వ్రాలు లోహనాళప్రయుక్త
భయదాయకాయోమయఘుటికాపరంపరలతుంపరలకుఁ
జెదరక తురంగమఖురాహతధరాపరాగపటలంబు రోదసీ
కుహరంబు నిండ మెండుకొని నిశ్రేణికానికాయాదిసాధ
నంబులతోఁ గిలార్పుచుం గదియ బఱతెంచు నవసరంబున.

87


మ.

 పటహధ్వానవిఘూర్ణితాఖిలదిశాబ్రహ్మాండభాండంబుగాఁ
బటుసంరంభముతోడ బొబ్బిలిగడీపై నుండు జోదుల్ నిజో
ద్భటదోఃపాండితిఁ జూచి మింట సురబృందంబుల్ వెరంగంద నొ
క్కిట మ్రోయించిరి రామసింగులు ఫిరంగీల్ గుంటికోపు ల్వడిన్.

88


సీ.

 తొలుదొల్త బాడబజ్వలనకణాలోల
       ఖేలనల్ గల తుపాకీ లమర్చి
యావెన్క నుద్వేలదావపావకశిఖా
       భీలంబు లగు జజాయీలు దీర్చి
యాపిఱుందయు గాంతయమదంష్ట్రికాచయో
      త్తాలంబు లగు రేకలాలు నిలిపి
యాపిమ్మట నటద్విరూపాక్షఫాలాగ్ని
      కీల లీనెడు ఫిరంగీలు నించి


తే.

 జబరుజంగులు బెనచి బిట్టుబుక నేయ
బదరికామలకామ్రజాంబవకపిత్థ
తాలకూష్మాండసన్నిభోత్తాళగోళ
జాలమయ మయ్యె యావనసైన్య మపుడు.

89


సీ.

 కత్తళమ్ములు చించి బత్తళమ్ములు ద్రుంచి
      వెడఁదరొమ్ములు డుస్సి వెడలిపాఱి

కండలు తేమలించి గుండెలు గమలించి
       కందనగాయలు గాడిపాఱి
తలలు ముక్కలు జేసి దౌడ లుక్కఱ డాసి
       మెదడు బైలురుకంగఁ బొదువఁ బాఱి
వీనులు వదలించి జానులు విదళించి
       తిత్తులు దిగదీయ హత్తిపాఱి


తే.

 పిక్క యంకిలి చంకిలి ప్రక్క డొక్క
మూపు వీ పనఁ గా ల్గేలు ముక్కుఁ జెక్కు
కన్ను వె న్ననకుండఁ జీకాకుపఱచె
సుడుసుడులు గట్టి యగ్గుండ్లసోనవాన.

90


మ.

 కరియూధములు మొగ్గి బెగ్గిలెఁ దురంగశ్రేణిపై వ్రాలెఁ ద
త్తురగస్తోమము కాల్బలంబుల పయిం దూలాడుచుం గూలెఁ ద
త్వరపాదాతిచయంబు బాఱుగ గడితండంబుపై సోలెఁ జెం
దిరపుం గొండలువోలె నెత్తు రొలుకన్ ధిక్కారముల్ మానుచున్.

91


వ.

 అది మఱియునుం గాక కాకోలకబళనారంభసమయసంరం
భవిజృంభితశాంభవఫాలఫలకవిలోకనజ్వలనకరాళాయ
మానకీలాకలాపంబులం బోని శతఘ్నికాపరంపరలు వఱపి
నం దెఱపి యీక మంటలు గ్రక్కుచుం గ్రిక్కిఱిసి చుఱు
కుచుఱుక్కునం గాడిపాఱం బోఁడిమి చెడి పుడమిం గూలు
మాతంగంబులును మతంగజవ్రజంబుల తిరుగుడులం గుది
వడివడి దప్పి దప్పిగొని కుప్పలుగా నొఱగు తురంగంబు
లును దురంగమనిపాతవేగంబునం గొందలం బంది క్రిందం
బడి నలిగి బొందులు వదలు రాహుత్తులును రౌతులనం

దడిం, బడి కాలు చేయాడక వాలు కాలుబలంబులును
బాదాతిజాలంబులు పలువలుకం బాఱిన జజాయీగుండ్ల
తాఁకునం దేకువ సడలి వడి దరిగి తొఱఁగు గడిదీసమూ
హంబులును రేకలా రాకరకు మైమఱువులు రువుళ్లుగా
డుస్సీ పాఱినం గాయంబులవెంబడిం బాఱు నెత్తురుటేరు
లం దేలియాడు యవనపుల్కసాదికళేబరంబులును దుపాకీ
ఢమాఢమీకారంబులకు నాకులం బంది డిందం బాఱి
కొఱప్రాణంబులతో విలవిలం గుదులుకొను రాజన్యమండ
లంబులును దండధరపురోన్ముఖులై యాత్మవర్గంబులం ద
లఁచి నెవ్వగలం బొగలు రజపుత్రవ్యూహంబులును
పరాసు లగు ఫరాసులును గాందిశీకు లగు ఫారసీకులును
శరణాగతవింధ్యపక్కణు లగు ఢక్కణులును బలాయ
నాయత్తు లగు డలాయత్తులును నొగిలిన వీరభటులును
సాధ్వసస్వాంతు లగు సార్జంతులును నిగూఢప్రచారు
లగు మయూరులును నధిగతార్తప్రణాదు లగు సోలుదా
దులును విహ్వలితాకారు లగు సుబేదారులును దెగిన
కుత్తికలును జిమ్మనగ్రోవులం జిమ్మిన వడువున న్వెడలు రక్త
ధారాపూరంబులును వండం దఱిగినట్లుండు కండలకొండ
లును బ్రేవుల ప్రోవులును బిండిలిపిండు లైన గుండియలును
ఖండంబు లైన కాలఖండంబులును రజంబు లైన భుజం
బులును జెక్కుచె క్కైన డొక్కలును బరెవరె లైన పుఱి
యలును దుత్తునియ లైన మేనులును బగిలిన యురంబు
లును దుమ్ము లైన యమ్ములును లుంఠితంబు లైన కంఠంబు
లును దుండంబు లగు కోదండబులును నిసుము లైన యసి

ముసలంబులును సంజాతవినిపాతంబులగు కేతనంబులునుం
గలిగి రౌద్రరసాతిరేకంబునకు సూచకంబై లులితకేశ
జాలంబు శైవాలంబుగా గళితమణిభూషణమణివిసరం బిను
ముగాఁ దేలియాడు చిందంపుపరువు నురువుగా నడు
గునఁ బేరిన మెదడు కర్దమంబుగా నంతకాంతరంబులం
గనుపట్టు ప్రపదంబులు కూర్మంబులుగా ముక్తాహారవారం
బులు జలవ్యాళంబులుగాఁ గరవాలచక్రంబులు నక్రం
బులుగా నవిరళంబుగాఁ బ్రవహించుశోణితతరంగిణీగణం
బులవలనం దలంపను విలోకింపను దరంబు గాక భీభ
త్సాత్మకంబై కుత్తుకబంటిగా నెత్తురులు గ్రోలి మొత్తం
బులై నృత్తంబులు సలుపుచుం బాతరలాడు భేతాళంబు
లును గ్రొవ్వుముద్ద లుద్దావిడి దద్దయు దనివిదీఱ నార
గించి గుఱ్ఱునం ద్రేచుపిశాచంబులును గండలు మెసఁగి
కొటికలు గొఱికి కండనగాయలం గలిగిన చవులు
వరికించి గుండియలు దిని పిండుఁ గట్టి తాండవం బొనరించు
భూతంబులును పీనుంగులై పడియున్న నేనుంగుల ఫాలం
బులు గద్దియలుగాఁ గులంబుపెద్దల నాసీనులం జేసి కపాల
పాత్రంబుల నతిహితంబు లగు లోహితజలంబులు దెచ్చి
యర్ఘ్యపాద్యంబులం దేల్చి ఖేటకంబులు పళ్లెరంబులు పఱచి
మేదోమాంసమస్తిష్కమజ్జాదిపదార్థంబులు వడ్డించి చుట్టంబు
లకు విందులు వెట్టుఢాకినీలోకంబులును కుణపప్రతానంబుల
పయింబడి యాంత్రంబు లురలం దిగిచి మెసఁగు సృగాల
కంకగృధ్రంబులుం గలిగి భయానకంబునకు దానకం బై

దురవలోకనీయం బగుతత్సంగరం బభంగురభంగిం గను
పట్టె నయ్యవసరంబున.

92


శా.

 చెల్లాకుఁ జెదరైన సైన్యసమితిం జేఁ జాఁచి రావించి యీ
కిల్లా లగ్గల కెక్కు టొక్కగణనా కేడించి పోరా దటం
చల్లాడూ మొదలైన జట్టిమగ లయ్యాజిన్ విజృంభించుచున్
ఫల్లంబుల్ గొని గోడపైఁ దొడరి దోఃపాండిత్యముల్ జూపుచున్.

93


చ.

 బురుజుల నిచ్చెనల్ బెనఁచి భోరున గైతలు లంప తాలుభీ
కరగరిమన్ గిలార్పుచును గత్తులుఁ గేడెములుం గరంబులన్
శిరమునఁ జూచి పట్టి తనచేతికరామిడి మించునట్లుగాఁ
గరమరుదొప్పఁ జిల్లపరిగా నడిపించెను లాడు గోడకున్.

94


ఉ.

 తగ్గఫరాసుమండల ముదగ్రతమై బిరుదుల్ వచింపుచున్
లగ్గల కెక్కి రాబురుజులన్ దగు మన్నెకుమారసైన్యముల్
వెగ్గల మైన కోపమున వెన్కొనుచున్ నురుమాడు వీఁకచే
నగ్గలికన్ దుపాకులఁ గిలార్చుచు నేయుదు రోయుచు న్వడిన్.

95


సీ.

 పొంగులు రాఁ గాగి పొరలు నూనియ ముంచి
       గరిగెల పంచి యుక్కరగఁ జల్లు
జిగురుటంబలి వేడి దిగుపాఱ జాఱగాఁ
       గుండలకొలఁదిగాఁ గ్రుమ్మరించి
వసియార్పు దారుయంత్రసముత్కరంబులు
       మేను లుచ్చి చనంగ మీటివైచి
యొండొంటిఁ దోడుగా గుండియ లౌదలల్
       గుఱి చేసి త్రెంచె నా గుండ్లు దొలిపి

తే.

 బిరుసులఁ దెరల్చి కొంబొగల్ గురియ నినుప
గొట్టములు రాల్చి మొద్దీటెగుముల గ్రుచ్చి
చిచ్చుబుడ్ల నగల్చి నిస్త్రింశతతులఁ
బొడిచి పడఁద్రోచి రాసేన కడిమి దొరఁగ.

96


మ.

 బాకుల మొద్దుటీటియల బల్లెములం జుఱకత్తులం గటా
రీకయిజారులం బొడిచి క్రే ళ్లురుకం బడఁద్రోచి రేఁచి ఖి
ల్లాకరుదెంచు నయ్యవనులం ద్రుటిమాత్రములోన నంత న
మ్మూఁకలలోన లాడు తనముఖ్యత కొంచెము వచ్చెనం చొగిన్.

97


మ.

 కేడెము నెత్తి నుంచుకొని కేవలరౌద్రరసంబు పొంగి రాఁ
బ్రోడ యితం డనంగ నధిరోహిణివెంబడిఁ బెళ్కురౌతులం
దోడుగ నెక్కి రాఁదొణఁగె దుర్మదరోషవిఘూర్ణమానుఁడై
లాడు తుపాకిదెబ్బలఁ గలంకక కైదువఁ గేలఁ ద్రిప్పుచున్.

98


మ.

 తనదర్పం బిరువాగువారు గన నౌద్ధత్యంబునం బేర్చి ని
చ్చెన వెంటన్ బురు జెక్కు నప్పు డదె వచ్చెన్ వ్రేయుఁ డం చొక్కగుం
డున వ్రేయం దల వ్రక్కలై చెదర లాడూఖానుఁ డల్లాన బీ
యనుచుం బిల్లమిరంబు వైచెను గతాహంకారుఁడై యుర్వికిన్.

99


సీ.

 దంభోళిధారావిదారితంబై డస్సి
       యవనిపైఁ గూలు కులాద్రిపగిది
హర్యక్షఖరనఖరాంకురచ్ఛిన్నమై
       తొరఁగెడు మత్తకుంజరముకరణి
వైయాఘ్రనిశితదంష్ట్రాయాసితంబయి
       పొడ వణంగెడు నాలపోఁతుభంగి

శాతపరశ్వధాఘాతనిర్దళితమై
       కడువడి నొరగు వృక్షంబుమాడ్కి


తే.

 బురుజుపై నుండి వ్రాలు నిష్ఠురతరంపు
దెంచె నా గుంటితాఁకు సుదీర్ఘమైన
నెత్తిచేఁ దూలి యిలఁ బడి నెత్తు రొలుక
లాడుఖానాఖ్యుఁ డూడఁ గలంగిరంత.

100


శా.

 హాహాక్రందననిస్వనాకులము భీత్యావేశసంత్యక్తచే
తోహంకారము విస్తృతప్రహరణస్తోమం బుదారస్పృహా
రాహుత్తాశ్వచయంబు విహ్వలితవీరవ్రాత ముత్సారితో
త్సాహాందోళితరాజకంబు నగుచుం దత్సైన్య మార్తిం గనెన్.

101


చ.

 పిడుగులు రాలినట్టు లతిభీషణవేగసముద్గమంబులై
పడియెడు లోహనాళముఖభాంకృతి మద్ఘుటికాపరంపరల్
కడువడి మేను లుచ్చి చనఁగా వెర గాసిలి నిల్వరించుచో
ప్పడరమి వీఁగి పాఱె యవనాధిపసైన్యము దైన్య మందుచున్.

102


చ.

 విశకలితాశ్వికావలియు విహ్వలితోరుచమూసమూహమున్
భృశపరిధావమానకరిబృందమునై వెఱ పేది యిట్లు క
ర్కశుఁ డగు లాడుపాటుఁ గని గాఢవిషాదమనస్కతం జతు
ర్దిశలకుఁ బాఱు సైన్యసమితిం గని ధైర్యదశావశాత్ములై.

103


చ.

 కనుకనిఁ బాఱు సైనికులఁ గ్రచ్చఱ హైదరుజంగు సాంత్వన
ధ్వనులు నిగుడ్చుచున్ బహువిధమ్ముల ర మ్మని క్రమ్మరించి త
ద్ఘనరథినీపరంపరకుఁ గాపులుగాఁ బురికొల్పి కొందఱన్

చ.

మొనల నమర్చె లాసుముఖమూర్ఖఫరాసుల శౌర్యరాసులన్.

104


మ.

 నిబిడక్రోధరసంబు జొబ్బటిల ధన్నీలానుకుప్పీముఖుల్
శిబికావల్గితకాయులై నిజభుజాసివ్రాతరోచిచ్ఛటా
శబరీభూతదిశాదశాంతు లగుచున్ శౌర్యంబు దీపింప కో
టబురుంజుల్ గదియంగ డాసిరి గరిష్ఠం బైన వేగంబునన్.

105


తే.

 ఇత్తెఱంగునఁ బురికొల్పి హెచ్చరింపఁ
గొత్తడములకు లగ్గ కెక్కుటకు నేగి
యాత్మవర్గంబుఁ దోడ్తొడ నరుగుదేర
మార్కొనగడంగెను ఫరాసుమండలంబు.

106


తే.

 ఇ త్తెఱంగున గదియంగ నేగుదెంచి
తన్మహావప్రదుస్సాధ్యదార్ఢ్య మరసి
మొఱకులయ్యును నొచ్చెడివెఱవుదొట్టి
గరిమ దమలోన నొండొరుఁ గాంచికొనుచు.

107


ఉ.

 ఎక్కడికయ్యపుం దమికి నేడ్తెర మార్కొను టబ్బు పౌరుషం
బక్కట యెట్టులైన వెడయాసల గెల్తు మటంచు నిగ్గడీ
కెక్కఁ దలంచి కొండపయి కెక్కు పిపీలిక లట్లు ప్రాకుచో
నుక్కరవాలుగుండ్లజడి నొక్కట రూపరకుండు టెట్లకో.

108


మ.

 అనుచుం గొందలమందు డెందములతో నాందోళనోద్వృత్తి గై
కొనుచుం గొల్తల నప్పరాసులు ననేకుల్ ఖిన్నతం జెంది ఖా
నుని నిందించి రితండెపో మనల నున్మూలంబుగా నొంప వ
చ్చిన దుశ్శీలుఁడ కారణంబ యని తచ్చేష్టావిధుల్ దల్పుచున్.

109

చ.

 రణధరణీతలంబుల ఫరాసు లజేయు లటంచు నెంతయుం
బ్రణుతి వహించి యిత్తఱి నపాకృతవిక్రము లన్న దుర్యశో
వ్రణము భరింప నోపమని వారలు గోడకు లగ్గ కెక్కు కా
రణమునఁ గాలు ప్రోలి కెదురం గమకించిరి చంచలాత్ములై.

110


ఉ.

 అప్పుడు పూసపాటికులజాగ్రణి రాజు ఫరాసువారి కిం
పొప్పఁగఁ దోడు వచ్చి సమరోచితకృత్యములైన యుద్ధతుల్
ముప్పిరిగాఁ గిలార్చి బలముల్ బురికొల్పి తుపాకి నాదుచే
నుప్పరవీథి బిట్టదుర నోహరి సాహరిగాఁ బెనంగఁగన్.

111


సీ.

 పొగబాణములగముల్ నిగుడింప గ్రమ్మెడు
       ధూమంబు పెనుమొగుల్ దొంగలింప
నొర నెడలించిన తరవారు మిస మిస
       ల్దొలుకాఱుమెఱుపులచెలువుఁ జూప
రామసింగులభీకరము లైన మ్రోఁతలు
       యురువడి యురుములతెఱఁగు నింప
బారుతుపాకుల మేరమీఱిన గుండ్లు
       వడగండ్లపాటున వడువు దెలుప


తే.

 వీను లా నంగఁ దిగిచిన విండ్లపెంపు
లింద్రధనురాకృతిస్ఫూర్తి నీసడింప
వాడివాలంపుఁదుంపరవాన గురిసె
రామరాజన్యసైన్యధారాధరంబు.

112


ఉ.

 దానికి వన్నె పెట్టిన విధమ్మున దర్ప మెలర్పఁగా శత
ఘ్నీనిచయంబు రంజకము నించుట యేయుట కన్ను వ్రాల్చినం
తైన యెడంబుఁ జూపక రయన్ డిగి రీతిపులాములాసుమ
ర్తేనుముఖుల్ ధరాసు లడరించిరి యార్చి గుభాల్గుభాలునన్.

113

ఉ.

 చూపఱ కిట్టిబెట్టిదముఁ జూపు ఫిరంగులతాఁకులన్ గడీ
రూపఱకుండునే యని నిరూఢముగా మదిఁ దోఁచనయ్యె న
ట్లాపటు వేగదర్పితమహాధ్వనికి న్వెఱఁ గంది నిండి తా
రాపథమధ్యసీమ నమరప్రకరంబు కరంబు మొత్తమై

114


ఉ.

 ఒండొరు లెచ్చరించుకొని యుక్కున గోడకు డాయ నేగి రు
ద్దండతమై ఫరాసులును ధాత్రిపసైన్యము లొక్కపెట్టునన్
గొండకు నేడ్తెఱన్ గదియు గొఱ్ఱెపొటేల్తెఱంగున న్వియ
న్మండలిఁ బీట లెత్తు గరిమన్ మొరయించు రణావకార్భటిన్.

115


చ.

 బురుజులవెంట నిచ్చెనలు పూనిచి చీమలు ప్రాకినట్టు లు
ద్ధురగతి నెక్కి రమ్మగలు దుర్వహగర్వహృతిప్రచండని
ష్ఠురతరలోహనాళముఖశుంభదురుస్వననిస్సరన్మహ
త్తరఘటికానికాయపరితఃపతనంబున కళ్కుపూనకన్.

116


ఉ.

 అంతట రంగరాయ వసుధాపతిచంద్రుని వీరయోధు ల
భ్రాంతసమున్నతిం జెలఁగునట్టి బురుంజులమీఁదనుండి ది
గ్దంతిచయశ్రవఃపుటవిదారణకారణదారుణాయసా
త్యంతవిశాలనాళగళితామితగోళము లార్చి రుప్పినన్

117


సీ.

 వడివాట్ల కెక్కి వెన్నడితాఁకు రేకలా
       లగ్గలం బైనచో డిగ్గ నుఱికి
బెదరక పైనెక్కి బెడిదంపు టడిదంపు
       పోటుల బెగడొంది పుడమిఁ గూలి
సాబాలు మిడిమించి సాగి రాసురవడి
       క్రొవ్వాడి కైదువుల్ గ్రుచ్చ డుల్లి
కోటకొమ్మలు డాయఁ గుఱుచయీటెల నూటి
       పడఁద్రోయఁ జదికిలపాటుఁ గాంచి

తే.

 రక్తధార పరంపరాసిక్తమైన
ధరణి నరుణితకాయులై పరిణమించి
పొరలుచుండియుఁ గ్రమ్మఱ నురువడించి
లగ్గలకు దూగిరి ఫరాసు లగ్గలికల.

118


శా.

 వేలారుల్ పటుశౌర్యవిస్ఫురణచే వీఁకన్ గడీ కెక్కి రాఁ
గేలిం బెట్టుచు రేకలాజబరుజంగీరామసింగీఫిరం
గీ లొక్కుమ్మడిఁ గ్రందుకో నురవడిం గిల్లాపయి న్బొల్చువా
రాలంపుం గినుకం గిలార్చి ఘనలక్ష్యస్ఫూర్తి బై ల్వెళ్లినన్.

119


శా.

 అంగాంగంబుల వ్రయ్య నుక్కరి పుళిందానీకినీశ్రేణి త
ద్రంగల్లోహవిశాలనాళనిగళద్రాఘిష్ఠగోళావళిన్
భంగంబందుచు వ్రాలెనయ్య హిమరుగ్భానూష్మలం గ్రాఁగి ఖ
ట్వాంగశ్రేణుల రాలు మత్కుణగణవ్యాపార మేపారఁగన్.

120


మ.

 డిగి లీలాసుముఖు ల్ఫరాసుదొర లుడ్డీనాభియానోత్పత
త్ఖగవేగంబున గోడపై కెగరి రాకల్పాంతవేళానట
న్మృగభృచ్ఛేఖరశూలసన్నిభములౌ నిస్త్రింశము ల్డుస్సి యా
పగఱం దాఁకి ఘసుక్కునం బొడిచి చంపం గూలి రుర్వీస్థలిన్.

121


చ.

 ఉరువడి నోహటించి నిజయోధవరు ల్పరవాహినీసము
త్కరముల నీటెనూటులను గైదువపోటుల గుండ్లయేటులం
బరిపరెలై పడం జదుపుపాటవము ల్గనుఁగొంచు రంగభూ
వరతిలకంబు మెచ్చెఁ బెఱవారల ధైర్యవిజృంభణోద్ధతుల్

122


చ.

 అరిమురి రావువంశమణి యక్కజమంద ఫరాసువారిఁ గొం
దఱ బురు జెక్కు పాలకిపదస్థుల దన్నియు దొమ్మిపేరు నా
బరఁగిన జోదుల న్మెఱుఁగు పారినకత్తుల నోది వంపఁగాఁ

గఱకుకఱుక్కున న్నరికి గండలు జేసిరి పద్మనాయకుల్.

123


చ.

 ఎడయిడ కయ్యుసిళ్లు తెర యెత్తినచాడ్పున నగ్గి చాయకు
న్మిడుతలు వోలిమెక్కి మిదిమించుచు మాయిశిఫాయిగుంపు న
ల్గడలఁ గిలార్చి నాకు దుముకత్తుల సాగుల చిప్పటీటెలం
బొడిచి పడంగఁ ద్రోచిరి రిపుప్రతతు ల్వెరం గంది చూడఁగన్.

124


శా.

శ్రీరామాస్త్రనికృత్తరావణశిరశ్శ్రేణీక్రియ న్రావురం
గారాయప్రభువీరయోధవరదోఃఖడ్గప్రహారంబులన్
ఘోరాకారతురుష్కసైనికులు చెక్కుంజెక్కు లౌవారు ప
ల్మాఱున్ మార్కొనువారు నై యరిది గ్రమ్మం బోరి రా గుబ్బఁగన్

125


వ.

 మఱియు నిత్తెఱంగునం బవరంబున కెదిరి యదరుగుండె
యుం బిక్క చెదురు లేక యగ్గడీఁపై గగ్గోలుపడ నడిచి
పొడిచివైచినం గెడలుకొనుచు బిలుకుమార్పం దక్కిన
జోదు లెదురెక్కుచుం దనివి సనక యోల మాసగొనిన వీకం
బెనంగువారును నైనయప్పద్మనాయకానీకినీప్రకరంబు లడి
దంబులం గ్రుచ్చియు గదాఘాతంబులఁ దెరలించియు
గటారంబులఁ గ్రుమ్మియుఁ జిప్పయీటెలం జిమ్మియు లగ్గదిం
పులం బొంపిరివోవునట్లు వైవం జేవ సడలి యడలుచుం
బురివిచ్చి విస్రస్తశిరస్త్రాణంబులును విధ్వస్తకంకటంబులును
విశీర్ణతనుత్రాణంబులును విగళితకరవాలంబులును విదారి
తకోదండంబులును విభ్రష్టభేటకంబులును వీలుంఠితకంఠ
నాళంబులును విఖండితభుజదండంబులును విచ్ఛిన్నఫాల
ఫలకంబులును వినున్నకర్ణపుటంబులును వినిపాతితకేతనం

వ.

బులును విశకలితమతంగజంబులును విపాటితఘోటకంబు
లును విభీతపాదాతంబులును విస్ఫుటితపటహజాలంబులు
నుం గలిగి యత్తొలిగల నంబరాసులు గతాసులై పడినం
దిక్కరి గభీరనీరకాసారంబు గండ్లుపడిన వడువునం బటా
పంచలై చాంచల్యంబు నొంది పుళిందులఫౌఁజు భగా
యించి చనుటయు.

126


మ.

 కృశమై మేనులు డుస్సి పాఱెడు ఫిరంగీగుండ్లచే డస్సి ఫౌఁ
జుశిక స్తయ్యె ఫరాసు లెల్లను బరాసుత్వంబునం బొంది ర
శ్వశతాంగేభభటాలి వ్రాలె ననుచుం జారు ల్నివేదింప ఖా
నుశహా యుక్కరిఁ జెందె లేఁతమొగము న్మూర్ఛాసముచ్ఛ్రాయమున్.

127


ఉ.

 మానసుయోధనుం డయిన మన్నెకుమారుని వీర యోధులు
చ్ఛూనశతఘ్నిక ల్బరపుబోడిమిరీతి పులాములాసుల
స్సేనులసీనులై కలన జిందఱవందఱ లైనవార్త యా
ఖానునిమానసంబునకు గాఢవిషాదము నించె నయ్యెడన్.

128


మ.

 షుకురుల్లాహసనల్లిఖా న్ముఖతురుష్కు ల్ఖానునిం డాసి మ
న్నెకుమారాగ్రణికోట చేకురమికి న్నీ వింత చింతింప నే
టికి లాడూ ప్రభృతు ల్యమావసధవాటిం జేరుమాత్రానఁ దా
వకశౌర్యం బరివోయెనే యకట యీవంత ల్మతి న్మానుమీ.

129


చ.

 అరిజయశౌర్యధుర్యమహిమాతిశయాన్వితు లయినవారి మ
మ్మరయుము నీరిపుప్రతతి యంతయు నుచ్చి చనంగఁ గోట చే
కురు పనిఁ బూని దూగెదము కోలు మసంగెద మోట లేక మా
బిరుదుమగంటము ల్కలను పెంపు గ్రహింపు మటంచుఁ దెల్పినన్.

130

క.

 తెప్పిరి లేచి బిరాలున
ముప్పిరిగొను కినుక విత్తు మోసులు చూపన్
దెప్పరపుదిటముఁ దాల్చుచు
కప్పెరశివసత్తి పోల్కె భానుఁ డంతన్.

131


వ.

 తత్కాలంబుస

132


సీ.

 బిరుదు వక్కాణించి భిన్నీని వేనవే
       ల్తేజీలు గొలువ సిద్ధిబిలాలు
సూరెల సమకట్టి బారుతుపాకుల
       తండము ల్నడువ నుద్ధతులముల్కు
పాలకీ యిరువంక బలసి యీటెలవారు
       పరపంజికొన పూసపాటిరాజు
డాసిరాహుత్తులు డాల్తరవారులు
       డుస్సిరాపీఠీని హస్సనల్లి


తే.

 ఛత్రపతిరామచందురుజానుఖాను
లాదిగాఁ గల్గుజోదు లంతంత నరుగ
నరుఁ గవియవచ్చు కురుబలోన్నతి వహించి
తురకదళళోటి లగ్గల కురువణించె.

133


తే.

 జలజబంధుండు దాఁ గర్మసాక్షి యయ్యు
దారుణము పుట్టఁ గలదని తపనుఁ డగుచుఁ
జూడ నోపక తొలఁగె నాశోభ దొఱఁగి
చరమగిరిగహ్వరముఁ జేర నరిగె నపుడు.

134


తే.

 అరసి చూడ రజోరుణావరణ దీని
నంటఁ గాఁ గూడ దనక లోలాత్ముఁ డగుచు
బగలు పద్మినిఁ గూడిన పాతకంబు

దివసమణి కప్రకాశతఁ దేకయున్నె.

135


చ.

 రణహతవీరయోధతనురక్తతరంగిణులం బరాంతరాం
గణములు ముంచి పాఱె నన గాఢరుచిం బొలు పొందె యాత్మజృం
భణము వెలార్చుచుం గడుజపాకుసుమప్రతిమానశోణితా
గణితనవీనకాంతికలికాకలితమ్ములు సాంధ్యరాగముల్.

136


సీ.

 అరుణకంఖాణరింఖాఘాతమై మించు
       నస్తగైరికరజోవ్యాప్తి యనఁగ
సమయవసంతము తమిరాలియవ్వని
       సొబఁ గొందు చివురాకుజొంప మనఁగ
నిననివేశంబున కిడు ప్రతీచీశైల
       రక్తరాంకవకుటీరం బనంగ
రవి హరిత్వముఁ దాల్ప రహిఁ గొల్వ నేతెంచు
       గరుడునిఱెక్కల కళ యనంగ


తే.

 నపుడు మూర్తిత్రయీమయుఁ డైనలోక
బాంధవుని రాక కెదురేగు పశ్చిమాచ
లాశ్రమర్షికషాయవస్త్రాంశు వనఁగ
సంజకెంజాయ తారకాసరణిఁ బొదలె.

137


చ.

 కొలకొలఁ గూయుచుం గుములు గూడి కులాయగృహాంగణంబులన్
మెలఁగె విహంగమావళులు మిత్రశిలాతతియుం గవోష్ణమై
చెలఁగె మరీచికాప్రభలు జీర్ణములై నిబిడాభివృద్ధులుం
దొలఁగె మలీమసస్థితులతోఁ దులదూఁగె దిగంతరంబులున్.

138


చ.

 దినమను పెందటాక మతితీవ్రగతిం దెగి కాలనీర మె
ల్లను జనఁగాఁ దదంతరవిలక్షితకోకనదంబు తూలి వ్రా

లినగతి వ్రాలె హేళి కడలిం దదుదారసరోరుహోన్నమ
ద్ఘనతరభృంగసంఘములకైవడిఁ బెల్లెగసెన్ తమచ్ఛటల్.

139


సీ.

 గగనతమాలవృక్షము తమోంబుదలీలఁ
       బొలుపొంది పూచినపువ్వు లనఁగఁ
గటికచీఁకటిపేరికాళిందిలోపల
       మొనలెత్తు వెలిదమ్మిమొగ్గ లనఁగ
స్వర్లోకమౌనులు సాంధ్యార్చనకు సేయు
       గంగౌఘసైకతలింగము లన
భయదశతఘ్నికార్భటులకుఁ జదలేటి
       నదటు నేచిన యంచుకొదమ లనఁగ


తే.

 ఘోరసమరస్థలీహతవీరవార
పరిణయావస రాప్సరోభామినీప్ర
కల్పితవితానకలితముక్తాగుళుచ్ఛ
బంక్తులనఁ దారకాతతు ల్బలసె మింట.

140


మ.

 తమిసాయాహ్న విరోధిహేళిపయి సంధ్యారాగరక్తప్రవా
హముగాఁ బోరుచుఁ బట్టి యస్తగిరిదుర్గాంతంబున న్వైవ ద
త్క్రమ మాలించి వియోగచింత నతికార్శ్యం బొందుచుం బద్మినీ
రమణీరత్నము నించు నూర్పు లనఁగా రాజిల్లుఁ గ్రొంజీకటుల్.

141


సీ.

 జంభారిపురిసరిద్గుంభనం బెదఁగోరి
       వర్ధిల్లు యమునాప్రవాహ మనఁగ
గమకించి చక్రవాళము దాఁటి యుద్వృత్తిఁ
       బొదలిన తిమిరంపునది యనంగ
నస్పంద మగుచు మేరుస్పర్ధఁ బెరిగిన

        గజ్జలాచలవలత్కాంతి యనఁగ
గగనలక్ష్మీతనూస్థగితమై నిబిడత
       దులకించు పచ్చికస్తురి యనంగ


తే.

 దండధరగదాదండవేదండతుండ
నీలనీరదనీలిమలాలితంబు
జారిణీజారసమ్మోదకారి యగుచు
నంధతమసంబు పర్వె రోదోంతరమున.

142


తే.

 అట్లు ఘోరాంధకారమాయావరణము
రణ మొనర్పఁగఁ దివురువారలకె కాక
యఖిలజనులకు నిమ్నోన్నతానభిజ్ఞ
తావిచారంబుఁ గఱసె నత్తఱి గణంగి.

143


ఉ.

 నెక్కొని కర్కశుం డయిననిష్ఠురపుందుర కాతఁ డెంతయున్
వెక్కసమైన కోపమున వెన్కొని తమ్మొగి హెచ్చరింపఁగా
నెక్కొనుకోట నల్గడల నిక్కడ నక్కడ నాక తేకువం
గ్రిక్కిఱియంగఁ బాఱి పరికింపఁగ రానిబలం బసంఖ్యమై.

144


శా.

దట్టంబై యపసవ్యసైన్యచయ ముద్ఘాటించుచు న్మించి తా
రిట్టిట్ట్తె కరదీపికాతతు లిలాయీలు న్మతాబా ల్గడీ
చుట్టు న్నిల్పిరి వేనవే ల్వెలమరాజోదు ల్రయాయత్తులై
లట్టా ల్గట్టిగఁ బట్టి బిట్టడచి రా రాహుత్తుల న్బొత్తిగాన్.

145


ఉ.

 వెన్నెల దీర్చి కాచినచవిం గడుచందురుజోతివెల్లువల్
చె న్నెసలార విస్ఫురదసిప్రముఖప్రకరాదిసాధనా
భ్యున్నతి నొంచి చించి రిపుయోధతతిం బదివేవు రన్యమా
సన్నతలైకభాగవినిషణ్ణులఁ జేసిరి మన్నెసైనికుల్.

146


తే.

 కోటచుట్టును బ్రతికోట గొలిపినట్లు

బిట్టలముఁ గాఁగఁ బీనుంగుఁబెంట లయ్యె
నట్టులయ్యును బిరుతీక యవనబలము
లక్షలకొలంది పొదువుచు లగ్గ కెక్కి.

147


శా.

 అర్ణోరాశితరంగమండలభరన్యాయంబుగాఁ బైపయిన్
గర్ణాన్గుండులు నిండి మెండుకొనుచున్ గాఢోద్ధతిం బర్వె నా
కీర్ణాంతర్గృహపంక్తిసంగడుల ముంగిళ్ల న్హరజారంబులన్
నిర్ణిద్రంబుగఁ గోటలో రిపుభటానీకప్రయుక్తంబులై

148


ఉ.

 అప్రతిమాభిమాననిధి యైన మహాగుణశాలి రావువం
శప్రభుమౌళి యిబ్బల మసంఖ్యము దీని వధించు టెట్లు భీ
మప్రదరంబునం బిలుకుమారియు నోటమి లేక మించి యీ
వప్రము నిండబారె ననివారణమై యిఁక నిల్వ వోవునే.

149


ఉ.

 వేలకొలంది చచ్చుచును వీఁగుచు దక్కినవీరు లెక్కుచుం
బోలినకిన్కచే మిగులఁ బోరుచు నుండెద రిట్టిపట్టునన్
నాలుగువేలకాల్బలమునం దిట మూది యపారమైన యి
య్యాలమునన్ జయించు టడియాస నిజం బని తావితాకుఁడై

150


సీ.

 తనతమ్ము నవనిభృద్ధైర్యు మహాశౌర్యు
       వేంగళరాయభూవిభుని నొకనిఁ
దనదుమామ నమేయదర్పదర్పాధీశు
       చెలికాని వేంకటక్షితిపు నొకనిఁ
దనబాంధవుని రిపూత్కరవనీఘోరద
       వాగ్ని దామర్ల దమ్మన్న నొకనిఁ
దనసైనికాగ్రణి ననుపమదోర్వీర్యు
       నినుగంటి నర్సావనీశు నొకనిఁ


తే.

 బిలిచి యసమానకక్ష యిబ్బలముపెంపు

తెంపు సైరింపరా దింకఁ దెగువ జేసి
మనల శుద్ధాంతకాంతాప్రమాపణంబు
నెఱపి యభిమానధనమె మన్నింప లెస్స.

151


చ.

 బలవంతుఁ డగు వైరిపైఁ దొడరి దోఃపాండిత్యము ల్జూపిరన్
విలసత్ఖ్యాతియు మానరక్షణము సద్వృత్తిం బ్రవర్తిల్లి రన్
కులముం బెద్దలు మెచ్చికొంటయును గల్గు న్మీఁద నాతారకా
జలజాతాప్తనిశాకరం బగు యశస్సంపత్తియుం బర్వెడిన్.

152


ఉ.

 మానము గొచుకోఁదలఁచు మానుషము ల్గలవారు పౌరుషే
యానకు భూషణంబు కుల మారడిఁ బుచ్చక సాహసించి నా
కీనిపుణప్రతాపధృతి యెన్నిక గావున నస్థిరంపుఁ బ్రా
ణానకు డాగి శాశ్వతధనంబు యశం బది మాపు టొప్పునే.

153


చ.

 అనిబ హుభంగులం దెలియ నాడినమీఁదటఁ దత్సహోదరుం
డనియె విరోధి దుష్టమతి యైన దురాత్ముఁడు రాజు యావనా
వని పతితద్వశుం డగుచు వర్తిలుఁ గావున వారి నోర్చుచిం
తనమును దౌలదవ్వు లన తారసిలం గల దంచుఁ దెల్పితిన్.

154


క.

 విన రైతి రిట్టి హేతువు
జనియింపఁగ వలసె మనకు సాంఘాతికమై
మొనకొనియె మరణకాలం
బనుమానం బింక నేమి యనవుడు నంతన్.

155


క.

 చెలికానివంశసంభవు
నలఘుతరస్థైర్యు ననిచె నవరోధవధూ
కులకంఠనాళకృంతన
కలనాదారుణవితానకఠినత నెఱపన్.

156


తే.

 అతఁడు నభిమానరక్షణార్హప్రచార

దారుణాకారసాహసౌద్ధత్య మమర
నంతిపురి కేగ మొఱసె దిగంతరములు
ధరణి వడవడ వడఁకె భూతలము బెగడె.

157


తే.

 రాయమణి రాణి తనకుమారాగ్రయాయి
నపుడు కొండొకదాదికి నప్పగించెఁ
గోట వెడలించి బ్రతికించుకొ మ్మటంచు
నట్లు గావించె నద్దాయి యడలువొడమి.

158


తే.

 మఱియు నారాయమన్నీనిమానవతియుఁ
బాణితలమున శాతకృపాణిఁ బూని
దానిచే మేను దొరఁగె మద్వైరివంశ
మకట నిర్వంశ మగుఁగాక యని శపించి.

159


తే.

 అపుడు పశుపక్షిమృగములు నవనిజనము
లభ్రవాణియు విస్మయం బందికొనుచు
నమ్మహావీరపత్ని శాపమ్మువలన
నట్ల కాఁగల దని కొనియాడి రంత.

160


క.

 ఘననిశితఖడ్గధారన్
మొనకొని చెలికానివంశమూర్ధన్యుఁడు పెం
పున వడిపడి నంతఃపుర
వనితాజనతాతిచిత్రవధ విధి నడపెన్.

161


తే.

తక్కుగల యట్టి యభిమానధనులు వెలమ
లొక్కనూరిండ్లవా రనలోగ్రశస్త్ర
నిహతులై రంగనాశిశుసహితు లగుచుఁ
దద్విచారణ మెంతని తలఁపవచ్చు.

162


తే.

 దేవతిర్యఙ్మనుష్యులం దీవిధంబు

పెంపు గనలే దటంచు నిలింపులెల్ల
వెలమవర్ణంపుసాహసవిక్రమములు
భళిభళీ యని పొగడి రభ్రమున నుండి.

163


మ.

 అపు డాశాకరికర్ణకోటరపుటాహంకారనిర్వాపణా
నుపమస్వానవిఘూర్ణమానపటహుం బొక్కంట మ్రోయించి రో
షపరీతం బగు మానసంబున ధరాజంభారి రంగక్షమా
ధిపరత్నంబు బురుంజు లెక్కిన విరోధిశ్రేణిపై మార్కొనెన్.

164


శా.

 దివ్యాస్త్ర ప్రణిపాతనంబునకు నుద్విగ్నంబుఁ గైకోక ప
ద్మవ్యూహం బభిమన్యుఁ డేడ్తెర విభేదప్రౌఢిమై చొచ్చిన
ట్టవ్వాజోద్దతి నేకవీరుఁడయి ఘోరారాతివిభ్రాంతిశ
స్త్రవ్యాపారము చీరికిం గొనక యాశౌర్యాఢ్యుఁ డూల్కొంటయున్.

165


ఉ.

 సింగపుఁబిల్లబారిఁ బడి చిందరవందర లైన కొమ్ముటే
నుంగులుపోలె బెబ్బులిఁ గనుంగొని పారెడు లేళ్లపోల్కె నా
రంగనృపాలుధాటి కెదుర న్దిట మించుకయేని లేనిపే
ర్మిం గడుభీతి నొందియును మేటిమగ ల్తురకల్మషోగ్రులై.

166


చ.

 పలువురు గూడి యొక్కమొగి బాణకృపాణపరంపరాసము
జ్జ్వలతరచాకచక్యము దిశావలయంబుల కెక్కి పాఱ నూ
ర్పులు నిగిడించుచుం జెలగి పోరికిఁ దార్కొనునంత వాలునుం
బలుకయు బూచిపట్టె నరపాలశిఖామణి యోహటించుచున్.

167


చ.

 తరమి ప్రతాపదర్పితులఁ దద్రిపుయోధుల నూచముట్టఁగాఁ
గరములు పెందొడ ల్దలలు కంఠతలంబులు చెక్కుచెక్కుగా
నరకుచు దూగి పాఱ వడి నల్వుర మువ్వుర హత్తి కుత్తుక
ల్దరగెఁ జలంబుచే ధుమికి లాఘవలంఘనలక్ష్యచాతురిన్.

168

చ.

 పరెవరలైన మేనుల నపారములై ప్రవహించుచుండ నె
త్తురు జడిసోనవెల్లువలు తూములు పెట్టినయట్టు వచ్చి పె
న్నురువులు గట్టిపాఱ యవను ల్బెగ డందుచు వీఁగి వచ్చి యు
ద్ధురశరజాలము ల్వఱపి త్రుంచిరి రాయకరాగ్రఖడ్గమున్.

169


ఉ.

 ఉక్కున మిక్కుటంపుఁదమి నొక్కట నుక్కుటలుంగుటీటె కెం
పెక్కఁ గనుంగవం దొరఁగు నింగిలపువ్రజ ముప్పతిల్లగాఁ
గ్రక్కున బూచి పట్టి భుజగర్వసమున్నతు జానుభానునిన్
డొక్క యగల్ప వాఁ డవని ద్రెళ్లెను రాయనికుంతసంహతిన్.

170


మ.

 ఉదితక్రోధమునం బెనంగు నృపవర్యుం జూచి జండ్రాల్మహ
మ్మదుహుస్సేనుమయూరు దారుణరణోన్మాదంబునం డాసి యు
న్మదుఁ డై యమ్మరిఁ బోసి రేఁచి తునిమె న్రావ న్వయోత్తంసుచే
తిదృఢంబైననిశాతకుంతము హఠాద్వేగంబుచే నత్తఱిన్.

171


ఉ.

 రావుకులాగ్రగణ్యుఁ డవురా భళి జోదువు నీవె యంచు వీ
రావలి మెచ్చఁ గ్రచ్చఱ శరాసనముం గొని యంబుఁ గూర్చి నీ
చేవ యణంతుఁ జూడు మని శాతశరంబునఁ ద్రుంచె నిష్ఠురా
రావ మెలర్ప వానితల రౌతులు భీతిల జాతశౌర్యుఁడై.

172


చ.

 అది గని రోషరూషితహృదంతరుఁడై తరవారు డుస్సి దో
ర్మదము వెలార్చుచుం బిలుకుమార్చె ననేకుల యోధవీరులం
గొదగొని సంకెల ల్గెడపుక్రొల్పులిపోలిక నీతఁ డింక నే
జడిపెద వీరినం చెదిరి సాహసశాలి బిలాలురాయనిన్.

173


తే.

 అట్లు చనుదెంచువాని దురాగ్రహగ్ర
హగ్రసితచిత్తు నతిమత్తు నప్రవర్గ్య
ఘోరరథినీయుతునిఁ జూచి యౌర వీని

సాహసోత్సాహ మని కడు సరభసమునన.

174


మ.

 చల ముప్పొంగ నభంగసంగరకళాసంరంభియై యిట్లు మి
న్నులు ముట్ట న్గరులంటఁ దూపుగముల న్నో నేసి యే నేసి య
మ్ములకు మ్ముల్వడి రొమ్ముటెమ్ములగల న్మున్నేసి యన్నేసిమా
ఱులుచే వెళ్లినపోటు లోటుగని తీరున్ బాకు సారించుచున్.

175


మ.

 అరివర్గంబులు జుట్టిముట్టి తనబాహాహంకృతిస్ఫూర్తిఁ జూ
పఱు లగ్గింప నిలింపకోటిచదలం బైపై నిరీక్షింపఁ ద
త్కరవాలమ్మున రంగరాయవసుధాకాంతుం డఖండోద్దతిన్
శిరముం ద్రుంచెఁ గరీంద్ర మబ్జముబలెం శిద్దీబిలాల్ఖానునిన్.

176


వ.

 ఇ ట్లమ్మహీమండలాఖండలుం డుగ్రవేదండంబు శుండాదం
డంబునం గమలషండంబు దెమల్చినపగిది నిజభుజాగ్రజా
గ్రన్మండలాగ్రంబున నుదగ్రభంగిం గదిసి సవ్యాపసవ్య
ప్రచారంబులం జెలంగి సెలగి వైచుచుం బ్రచండగతి నఖం
డదోఃపాండిత్యంబు నెఱపునప్పు డుప్పురం బెగసి ఛత్రపతి
ప్రభృతిరజపుత్రవ్యూహంబును షుకురుల్లాదిసాదినికురుంబం
బులును బహుపదాతివిసరంబులుం బ్రసారితకరవాలభిం
డివాలనిశితవిశిఖజాలప్రముఖనిఖిలసాధనులై యా
యోధనంబున నయ్యశోధనుం బొదివి పదివేవు రేదు వెఱి
కినకరణిం గఱకుటంపజల్లు జల్లునం బయిం జల్లుటయు గా
యమ్ము గాయమ్ముల వఱ్ఱుగా నోనాటినం దొరఁగు శోణితా
సారంబు మేక మీఱం గుసుమితకింశుకాకారంబు పూని
యుం దిటంబు సడలక కొంతసేపటికిం బడలిక గ్రమ్మం గ్రమ్మ
ఱఁ జముదాడువెఱికి జళిపించుచుం బ్రత్యాలీఢపాదస్థుం

డయి నిలిచి హుంకరించుచుం దఱముచుఁ గదిరివయిచు
చుం గొంతదడపు పోరి యనంతరంబ బలిమి దఱగి మైసోలి
తొరఁగి మింటి కెగయు తగరుజక్కేలికపోలికం బ్రద్యోత
మానజ్యోతిర్మయస్వరూపమ్మున నమ్మహావీరపురుషమూర్తి
మూర్తిత్రయీమండలుఁ డగు మార్తాండునిమండలంబుఁ
జించుకొని యభ్యంచితప్రకారంబున నిద్దివిజపురి కరుగు
దెంచె నప్పుడు.

177


ఉ.

 అవ్వల నెట్టులుండెను దదాత్మజుఁ డాధరణీశుసోదరుం
డెవ్విధిఁ గాన రైరి దుర మిట్టి విదారుణవృత్తిఁ బర్వుచో
నెవ్వగ మానె నిట్టికరణిం ధరణీజనకోటి కాత్మనం
చవ్వెయిగండ్లవేల్పడుగ నాలపుదిండ్ల యగారు లిట్లనున్.

178


వ.

 అంత నగ్గడీదుర్గంబునందుఁ గ్రందుకొని యమందమంద
రాచలవిఘూర్ణమానార్ణవమధ్యప్రభూతభీతికరకాలకూ
టానలజ్వాలాభీలంబై దవానలావేశితకుత్కీలంబుచందఁబు
నం గీలిలీలాకలాపం బపారంబై ప్రళయకాలానలంబై ప్రవ
ర్తితవైశ్వానరప్రతాపంబులం దిరస్కరించుచుఁ జటచ్ఛిట
చటచ్ఛటార్భటీనిర్దళితదిక్కోటరం బగుచు నుద్దండదండ
ధరమండలాగ్రంబులం బోని చండజిహ్వామండలంబులు
పుండరీకప్రభవాఁడభాండంబు మండిపడంజేయ భూయః
ప్రకారంబున నిండికొనుచుం గండు మిగిలి యనేకప్రకార
విధ్వస్తస్త్రీబాలవృద్ధాదిబహుప్రాణి లోకభీకరంబై తొంటి
కాలంబునాఁటి ఖాండవదహనంబుచందంబున నిర్ధూమ
ధామంబుగా మండం జొచ్చె నప్పు డుప్పరం బెగసి బురుంజు
లెక్కిన ఫరాసుమండలంబు లుద్దండవేణుదండమండలా

ఖర్వపర్వపటపటాత్కారంబు ఘోరం బై యనేకశతఘ్నికా
నికాయనికామభైరవారావశంక ననుకరింపం జంకు వొడ
మి పుడమికిం దిరుగ నుఱికి మహాద్భుతరసవిభుగ్నమానమా
నసులై గడీక నతిదూరంబునం దిరుగువారం బరువకట్టి
నిలిచి రాసమయంబున.

179


తే.

 దాది గొనిపోవు రంగరాట్తనయమణికి
నడ్డ మేతెంచికొని పోయి యవనపతికి
నప్పగించిరి తద్భటు లాదరమున
నతఁడు నబ్బాలు నతికరుణార్హుఁ జేసి.

180


ఉ.

 ఆదొరసోదరుం డగు బలాఢ్యుఁడు వెంగలరాయమౌళి తా
హైదరుజంగులస్కరునకై నడవం దలఁచె న్యుగాంతవే
ళాదవపావకాకృతి నలంఘ్యపరాక్రమదర్పితాత్మసే
నాదృఢబాహుసాహస మనంతవికాసము నింపఁ దృప్తుఁడై.

181


ఉ.

 భాసురశౌర్యుఁ దాండ్రకులపావనుఁ బాపనృపాలవర్యు ము
న్నే సమకొల్పె రంగధరణీధవమౌళి మదగ్రజుండు దు
శ్శాసను నోహటింపఁ దగు సాహసవంతుఁడు భీమసేనుఁ డే
కాసడి సన్నవాఁ డనినకైవడి రాజు బలంబు డింపఁగన్.

182


ఉ.

 కావున నింక లష్కరు చికాకుపడ న్జగడం బొనర్చు టే
చేవ యటంచు నెంచి నృపసింహ మఖండితరోషమూర్ణమా
నావిలమానసుం డగుచు నాహనదోహళకాహళానకా
రావము మి న్నగల్ప నగరాజితగోపుర మెక్కి యుక్కునన్.

183


తే.

 ప్రకటబలుఁ డందు నిలిచి నాలుకలు గ్రొయు
నుగ్రతక్షకకర్కోటకోపమాన

మాననీయశతఘ్ని కామండలంబు
నాదుకొలిపించె లష్కరుమీఁదఁ బెనఁచి.

184


సీ.

 ఒకఫిరంగీగుండు నికటస్థలీవల
      ద్బహుసామజములఁ గుప్పలుగఁ గూల్చె
నొకజజాయీవ్రేటు ప్రకటధాటినట
      ద్వర ఘోటకములఁ జుప్పర మడంచె
నొకరేకలాదెబ్బ యుద్ధతారాతిరా
      ట్పటకుటీరములకంబము లగల్చె
నొకతుపాకీతాఁకు సకలారిసైనిక
      నికరాంగలతికల వికలపఱచె


తే.

 మాటుమఱుఁగున గుఱిఁ జూచి వేఁటకాండ్రు
మెకములఁ దెరలుచాడ్పున నొకట నొకట
లష్కరు చికాకుపడ నేయ లలి దొరంగి
రాజు శిబిరంబు లేచి దూరంబు దొలఁగె.

185


చ.

 అపు డుదయీద్రిమీఁదఁ గన నయ్యె సుధాంశుఁడు దచ్చతఘ్ని కా
విపులరవార్భటు ల్దెలియు వేడ్క నధోభువనంబున న్సరీ
నృపపతి లేచి పూర్వశిఖరీంద్రము పేరిటి పుట్ట నెత్తున
చ్చపుఫణ మట్ల తత్కలితశార్జ్గిపదం బనఁ దోచు కందుతోన్.

186


క.

 నెల వొడిచెం జెంగలువలు
నలి విడిచెం జక్రవాకనయనోదకముల్
జలజల విడిచె న్వెన్నెల
జిలజిల దిక్కులకు నొడిసెఁ జీఁకటు లెడసెన్.

187

వ.

 తదవసరంబున.

188


సీ.

 కదనరంగస్థలి కలియుగార్జునుఁ డన
       నలరారు రావుచిన్నయ్యగారు
కాకర్లపూడి వెంకటరామరాజాది
       తేజోదివాకరుల్ రాజవరులు
యినుగంటివంశపావనులు ధర్మారాయ
       నరసింహరాయభూనాథముఖులు
పరుషాభియాతిభీకరసాహసౌద్ధత్య
       బాహుశౌర్యులు కంది బండవార


తే.

 లాదిగాఁ గలశూరాగ్రయాయులెల్ల
బలసి యిరుదెస నడతేర నలఘుపటిమ
భర్గభార్గవవిక్రమప్రక్రమంబు
డంబు నెఱపంగ గదలి బీరంబు మెఱయ.

189


సీ.

 బిన్నీనిఁ బఱ తెంచు బిరుదు రాహుత్తుల
       కత్తులతళతళ ల్కార్కొనంగ
నిరుచక్కి గనుపట్టి యెలగోల్తుపాకుల
       మూకలకలకలంబులు చెలంగ
బారుగా నిలిచిన పందీటిమొనగాండ్ర
       కనుగాండ్రతనము భీకరత నెఱప
నురువడిఁ బఱతెంచు నొంటివస్తాదుల
       ముస్తాదు లంతంత మురువుఁ జూప


తే.

 వెలమదొర లెందఱేని దోర్వీర్యకలనఁ
గలనఁ బిరుతీనిమగఁటము ల్దెలుప నుఱక

కఱకుదన మొప్ప నపుడు లష్కరున కెదుర
వెంగలనృపాలమణి కోట వెడలి నడచె.

190


ఉ.

 ఏనిక దోయిమీఁద నెనయించు డమారపుటోకు లాకసం
బానఁ బ్రభాసమానసముదార్భటిమద్భటకోటిసింహనా
దానకు దానకుంఠితమదద్విరదాకృతి గాంచి శత్రుసం
తానము భీతిల న్నడచి దార్కొనె వెంగళరావు లష్కరున్.

191


మ.

 అవనిం బెల్లుగఁ బద్మనాయకులు దృప్యద్వైరివర్గంబుపైఁ
గవియం దానును బద్మనాయకసమాఖ్యం బూని యి ట్లుండు ట
ర్హువె యంచు నుషచే మహోన్నతగజారూఢస్థితిం బొల్చె నా
రవిబింబం బుదయాచలేంద్రశిఖరాగ్రం బెక్కె శోణద్యుతిన్.

192


ఉ.

 దృప్తనిరోధియూధములతో నెదిరించుటకై చతుస్సహ
స్రాప్తబలంబుతో నెదిరి సాహసధుర్యుఁ డితండు జూడ సం
సప్తకకోటిపైఁ దొడర సాగిన క్రీడియె కానిచో సము
ద్దీప్తము లక్షపాయదళ దీని నెదుర్పగ నొర్ల కొప్పునే.

193


చ.

 అని యవనీజనంబులును నభ్రచరు ల్వెరఁ గంది చూడ ము
న్మునుజినిశీకి మార్కొనుట ముఖ్యముగాఁ దలపోసి తూగునె
క్కొనుకినుక న్నిజాప్తభటఘోరశరాగ్నులఁ జుట్టుముట్టి క్ర
క్కన రవళించుచుం దదధికారి పుళిందవని న్దహించుచున్.

194


చ.

 అతులితబాహువిక్రమసమగ్రత ని ట్లరుదెంచు వెంగళ
క్షితిపుబలంబుమీఁద జినిసీపయి కాపు వసించు యోధసం
తతులు ఢమాఢమీనినదదర్పితభూరిశతఘ్నిక ల్రయో
ద్దతి నిగిడింప నప్పగఱఁ దాకి మగంటిమిచూపు తెంపునన్.

195

సీ.

 బహువీరభటవారకహకహార్భటులకు
       రణభేరికాఢాంవిరావములకుఁ
జటులతురంగహేషానిస్వనములకుఁ
       గరిఘటాపటలఘీంకారములకు
రాహుత్తఖడ్గధారాచకచ్చకలకుఁ
       గోదండశింజినీనాదములకుఁ
గెరలి మోఁగెడు తుపాకీఢాంఢమీలకు
       రహఫిరంగీగుండ్లరాకడలకు


తే.

 దిటము చెదరక బెదరక యడరుదొట్టి
కట్టిలము గాక జినిసీని జుట్టుముట్టి
కుప్పికుప్లాము మొదలుగా నొప్పువారిఁ
దదధికారులఁ జంపిరి దర్ప మెసఁగ.

196


తే.

 అప్పటిరణంబునందైన నొప్పి దప్పు
లెన్న నిరువాగునందు న న్నిన్నియనక
జరిగె నభిమన్యుయుద్ధావసరసముద్ధ
వీరరససంహతానేకవీరసరణి.

197


చ.

 కదన మపారమై పఱచెఁ గత్తులు గత్తులు నీటె లీటియల్
గదియ నెకాయెకిం బడి చెకాచెకలై తునియంగ నొండొరుల్
చెదరక గ్రమ్మి నెత్తురులు చిమ్ముకరమ్మున జొత్తుపాపలై
చిదురుపలై ధరం దొఱగి చెయ్వులు దక్కి భయంబు నింపుచున్.

198


మ.

 అమరు ల్దానవులు న్సరోషకలనాహంకారులై తారసి
ల్లి ముదం బుచ్చి చనం బెనంగునటు లోలిం దాఁకి యన్యోన్యఖ

డ్గముఖాఘాతముల న్శిరశ్చరణవక్షకంఠము ల్వస్సి తు
త్తుమురై రయ్యివాగువార లపు డాదోదొమ్మియుద్ధంబునన్.

199


సీ.

 ఈటె లీటెలఁ జుట్టి యెగచి కఠారము
      ల్పెఱకి పేరురముల విరియఁ గ్రుమ్మి
తరువారు తరవారు నొఱసి మిణుంగురు
      ల్గురియంగ జబ్బల కుఱికి నరికి
బల్లెము ల్బల్లేలఁ బాపి చంకిలి డాసి
      యలుగక డంబావ నంటఁ గ్రుచ్చి
కత్తి కత్తి నగల్చి తుత్తునెలై రాల
      విసరి యొండొరువులఁ గసి మసంగి


తే.

 గుండియ ల్వీల నేజాల కొలఁది గ్రుద్ది
ప్రేవు లురులంగ సాదుల జావఁ బొడిచి
పోటుదోటోనిబిరుసునఁ బోరి రిట్టు
లుభయసైనికయోధు లాయోధనమున.

200


చ.

 కణఁగి పరస్పరంబు సెలకట్టకపోరుడు ఘోరయుద్ధ మా
ఫణిపతికి న్వచస్పతికి భారతికి న్వశిపోవ దెంతయున్
గణుతి యొనర్ప నైన నది గన్గొనఁ జొప్పడు తొంటి రామరా
వణులరణంబుకన్నఁ గురుపాండవయుద్ధముకన్న మిన్ననై.

201


వ.

 మఱియు నవ్వీరపుంగవుం డగు వెంగళరాయధరాపురంద
రుని బలంబులు భుజాస్ఫాలనంబులు సలుపుచుం బలంబున
నావిష్కృతక్రోధరసాధీనులయి ముష్కరతురుష్కధాను
ష్కానీకినీనికాయంబుఁ బొదివి హతప్రత్యాహతంబులు
గాఁ బోరిపోరి యితరేతరకరవాలధారానిపాతంబును బర
స్పరకఠారికావిపాటనంబును నన్యోన్యకుంతనికృంతనంబును

మిధఃకర్కశగదావిదారితశారీరావయవంబునుం గావించు
చుం బిరుతివియక ఖడ్గాఖడ్గియుం గుంతాకుంతియుం గచాక
చియును బాహాబాహియునుంగా సంకులాహవం బతి
భయావహం బయి పరఁగం బ్రవర్తిల్లు నప్పుడు.

202


క.

ఒకధూము రేఁగి లస్కరు
పికపికలై తుములరణము పెంపున నన్యో
న్యకరాసిసంహతులచే
వికలతఁ గని రొరులు తమరు వీ రనుకొనకన్.

203


సీ.

 సంకెల ల్దెగ నూడ్చి సాధ్వసావిలములై
       బెగడొంది పఱచు స్తంబేరములును
గట్టుత్రా ళ్లగలించి కళ్లేల కాఁగక
       భీతిల్లి పరువెత్తు వీతితతులు
తరవార్లు మఱచి కత్తళములు జీరాడ
       నూడనిఁబాడు రాహుత్తవరులు
దండుకల్లిల్లిచే నొండొండుగానక
       కానకై జరగెడు కాల్బలంబు


తే.

 లాయురవశిష్టులై తారుగాయగాండ్రు
జీవితాశలు వదలి భుజించుకొనుచు
నోరలు బిబ్బీలు నగుచు లష్కరు చలించె
మందరోన్మథితాంభోధిచంద మొంది.

204


చ.

 అపుడు నబాబు దుర్గమతమాద్భుతశౌర్యపరాంగ వేంగళా
ధిపభటనిర్ణిరోధసముదీర్ణపరాక్రమదీర్ఘనైజయూ
ధపగత దైన్య మారసి నితాంతసమాకులచిత్తవృత్తియై
నృపవరుఁ బూసపాటికులునిం గని యిట్లనియె న్రయమ్మునన్.

205

ఉ.

 వెంగళరాయఁ డెంత రణవీరుఁడొ కాని నితాంతవిక్రమా
భంగురశక్రసూతియయి భాసిలుచు న్మదుదగ్రసర్వసే
నాంగములెల్ల త్రుళ్లడచె నాతని యాహవకేళి కిప్పు డె
న్నంగఁ ద్రిగర్తసైన్యము లనం గనుపట్టెడు నిబ్బలావళుల్.

206


క.

 రేచెర్లగోత్రసంభవు
లై చెన్నగు వెలమవారి యభినవశౌర్య
ప్రాచుర్యబలముఁ బోలిన
దేచాయం జూడ మవని హిందువులందున్.

207


సీ.

 మెకములనడుము చించుకవచ్చు బెబ్బులి
           పోలికె బొబ్బిలిపురినృపాలుఁ
డుడివోని కినుకచేఁ దొడరి యీశిబిరంబు
           నడిబారు చొచ్చి వెన్నడినవారు
ఘోరదావాగ్నిచే నీరసారణ్యంబు
           బోడ వడంగుడునట్లు కడిమి దొరఁగి
చనియె నస్మత్సేన సంగ్రామరంగంబు
           పీనుంగుపెంటయై పేర్చె నింక


తే.

 నేమి సేయంగ నోపుదు నేర్పరించి
వీరు నెవ్వాని నొడఁగూర్తు వీరి నోర్వ
మున్నె సేనాధిపతులెల్లఁ జన్నవార
లంతకునియింటి కంతంత నతిథు లగుచు.

208


తే.

 వారు స్త్రీబాలవృద్ధసంహారఘోర
దారుణవిపత్తి కొడఁబడి బారుకట్టి
మరణమున కెత్తి వచ్చు నమ్మానధనులు
బహుజనహతంబు సేయరే భండనమున.

209

తే.

 రావువారల యుగ్రశౌర్యప్రసంగ
మది యమానుష మని వింటి మ ట్లెఱింగి
నీదురాలోచనాసముత్పాదనమునఁ
గానలే నైతి నిటువంటిహాని యగుట.

210


మ.

 తెగి వంచించినఁ గార్యహాని యగు నీతీవ్రప్రతాపంబు గా
నఁగ నౌ మీఁదటఁ దద్భలప్రథితజన్యప్రౌఢితో నుండి రా
పగ సాధించుట కీవు సైన్యపతివై బాహాబలోద్వృత్తి చూ
పి గురుత్వంబు వహింపు మింక యనినన్ భీతిల్లి రా జోర్పునన్.

211


క.

 విధివోమినట్ల యగు నని
పృథురభసం బొప్పఁ దురగభీషణహేషా
విధురితదిఙ్ముఖుఁ డగుచుం
బ్రథనమునకు నరుగుదెంచి పార్థివుఁ డలుకన్.

212


మ.

 భుజగక్రూరశరాసవల్లరి కరాంభోజంబునం గీలుకొ
ల్పి జిరాగుఱ్ఱపుఫౌఁజుతోడ నతఁడుం బెల్లార్చి కాకర్లపూ
డి జగన్నాథధరాధినాథు లగు రాడ్వేదండము ల్సుట్టి రా
నిజదోశ్శౌర్యము చూపఱు ల్మిగుల మన్నింపంగ నత్యుద్ధతిన్.

213


తే.

 నడచె వెంగలరావుసైన్యంబుమీఁదఁ
దనభుజాదండమండితధనురఖండ
చండమార్వీనినాద ముద్దండ మగుచు
సకలదిక్కాండజనములఁ జెవుడు పఱప.

214


చ.

 పరుషపరాక్రమాభినవభార్గవమూర్తికి వెంగళక్షమా
వరున కెదుర్ప లేననియె వారక తాండ్రకులీను హేతిశాం
కరికసుభిక్ష సేయనగు కాంక్షనొ నెమ్మదిలో జనించె న
త్యురతరమై పలాయనపు యోజన యాజననాథమాళికిన్.

215

శా.

 ఆరాజన్యునిపౌఁజుపైఁ బ్రళయరౌద్రాకారుఁడై చేర్చుచున్
వీరగ్రామణి రావువంశమణి దోర్వీర్యాధరీభూతనా
నారాతిం జెలికానివంశజుని నన్యాసాధ్యు దమ్మన్ననున్
ధీరస్వాంతుల కందిబండకులులం దీకొల్పె నుద్వేగుఁడై.

216


శా.

 వారు న్ఘోరశరాసవల్లరుల నిస్వానంబు లభ్రాపగా
నీరేజాంతరధార్తరాష్ట్రభయకృన్నీరంధ్రమంద్రధ్వనిన్
మీర న్రాజవతంసుసైనికులపై మేకొంటయుం దచ్ఛమూ
వారంబు ల్పురికొల్పి డాసి రతిదుర్వారాసిధారారుచిన్.

217


మ.

 పులులుం గోల్పులులుం గరు ల్కరులునున్ భూమీధ్రము ల్భూధరం
బులు నంభోనిధులం బుధు ల్గదియు చొప్పు లెల్పుచు రాచబి
డ్డలునుం వెల్మదొర ల్దురమ్మునకు నొడ్డారించి క్రొవ్వాడి బా
కులతో గ్రుమ్మైసలాడ సాగి రలుకన్ గోవిందశబ్దార్భటిన్.

218


సీ.

 కరికాండతుండద్రుఘనతాడనంబుల
       వకవకలై కృకాటికలు పగుల
భీకరకరవాలభిండివాలాదుల
       దాకుల నొగిలి కంధరము లగలఁ
బరిఘనిష్ఠురభూరిపరిఘాతనమ్ములఁ
       దుండమ్ము లగుచుఁ బెందొడలు విఱుగఁ
బుంఖానుపుంఖప్రపూరితశరవృష్టి
       నెమ్మోముఁ దమ్ములయెమ్మె చెఱుప


తే.

 నిరుపమానాహవోద్వేగనిర్ణిరోధ
విక్రమక్రమనైపుణివినిహతాత్మ

పరచమూ మండలముగాఁగ నురువడించి
యొండొరులఁ దాఁకి పెనగిరి గండుమెఱసి.

219


మ.

 హయరింఖాతతధూళిధూసరితమై యాగ్నేయయం త్రావళీ
రయనిర్యద్బహుధూమసంవళితమై రక్తాంబుధా రాసము
చ్చయసంచాదితమై ధనుర్వి గళితా స్త్ర ధ్వస్తనేనాతనూ
భయదంబై కనుపట్టెఁ దత్సమరభూభాగంబు భీభత్సతన్.

220


సీ.

 శాక్తీక ప్రతతిపై శాక్తీ కానీకంబు
       చక్రహస్తులమీఁదఁ జక్త్రధరులు
శస్త్రపాణులమీఁద నై స్ప్రింశి కావళుల్
       నై స్త్రింశికులమీఁద నస్త్ర ధారు
లస్త్రధారులమీఁద నసిముసలాయుధు
       లసిమౌసలికులపై నాశ్వికులును
నాశ్వికసమితిపై నలుక గౌంతికులును
       గౌంతిక వ్రజముపై ఁ గావచికులు


తే.

 తూగి యిరులాగు దొరలతోఁ దొడరునపుడు
తుమురుతుమురును బొడిపొడి దుమ్ముదుమ్ము
సున్ని సున్నియు నురుమునై చూడనయ్యెఁ
గదనరంగంబు నూర్పుడికళ్ల మగుచు.

221


మ.

 మరణేచ్ఛారతిఁ బద్మనాయకులధర్మ వ్య క్తదోస్సారసం, గరు:
లై రాచకులంబువారు సరిగాఁ గయ్యంబు వాటించుచోఁ
బరుషా రాతితమస్సముద్ధ తిహృతి బ్రజ్ఞా సరోజాప్తులై, యురు
సంరంభ విజృంభితా గ్రహముచే నొప్పారు వేండ్రంబునన్.

222


సీ.

జగడంపుటంచు టేనుఁగులపై కుఱికి బి
ట్టురిమి తుండంబులు నరికీనరికి

పందీటె లలుగంటిపార నుక్కున శిలే
       బక్తరుగుఱ్ఱాల బసికి బసికి
వెన్నులు సరికట్టి విసిరి సిఫాయీల
       చిప్పయీటెలఁ గ్రుచ్చి చిమ్మి చిమ్మి
కడిఖండములు గాఁగఁ గాల్వుర పేరెద
       ల్చికిలీకఠారులఁ జించి చించి


తే.

 యలుకమై సూర్యసోమవీథులు పడఁగఁ
గొట్టి గోరించి లష్క రిట్టట్టుపఱచి
తూలితుండెంబు వాడుచు దురమునందు
విక్రమప్రౌఢి నెఱపిరి వెలమదొరలు.

223


మ.

 అరిరాజన్యపయోధి నిర్మథనదీక్షారంభసంరంభమం
దరు లౌ వారలఁ గిట్టి నెత్తురు వసంతంపుం జడిం దోఁగఁగా
శరవర్షంబులు గప్పి రప్పు డలుకన్ క్షత్రాగ్రణు ల్కార్ముకో
త్కరమౌర్వీనినదంబు లంబునిధినాదంబు న్విడంబింపఁగన్.

224


మ.

 కరవాలము లొఱ ల్వెడల్చుకొని ఖడ్గాఖడ్గిగా నంత దా
మరదమ్మప్రభుఁ డాదియైన వెలమ ల్మత్తద్విపశ్రేణి తా
మరపువ్వు న్గొలనుంబలెన్ గలనభీష్మప్రౌఢదోఃక్రీడ చూ
పి రొగిన్ నెత్తురుటేటివెల్లివరద ల్పెల్లీఁతలై పాఱఁగన్.

225


మ.

 అపు డన్యోన్యశరాసిభీషణరణవ్యాపారపారీణతన్
రిపులాటోపము లొప్పు రాచకొమరు ల్వెల్మ ల్బహుక్రోధవై
రపరీతాత్ములునై పరస్పరహతిం బ్రాణాంతపర్యంతముం
జపలత్వంబు వహింప కిట్లు పెనఁగెన్ సంగ్రామరంగంబునన్.

226


తే.

 శోణిత నదీ పరంపర ల్సూడనయ్యెఁ
దేలియాడెడు మత్తశుండాలజాల

చలదురుకళేబరముల నావల గమించు
మావటీ ల్కర్ణధారుల ఠీవిఁ దెలుప.

227


తే.

 అట్టిజగడంబుఁబటిమ భయంబు గొలుపు
టంతయు నెఱింగి బాసట యనిచెఁ దనదు
మూలబలముల నారాజముఖ్యుఁ గవియ
నపుడు హైదరుజంగు రయంబు మెఱయ.

228


ఉ.

 ఆదళమీద మార్కొని యహంకృతి మత్పరవాహినీసము
త్పాదితఘోరవీరరణపాండితి యోర్చుచుఁ జెండుబెండుగా
మొదిరి వెల్మవార లసి ముద్గర పట్టెస భిండివాల శూ
లాదుల సాదులం ద్రిజగదద్భుతశౌర్యరసంబుపెంపునన్.

229


శా.

ఆదుస్సాధులు సాదు లప్పుడ యుతాశ్వాసాదితస్తోములై
మీఁదం జెందెడు బాణవర్షములచే మేను ల్సరంధ్రంబులై
ఛేదచ్ఛేదములై పడ న్నడఁచి కాశీసేతుపర్యంతభూ
ప్రాదుర్భూతయశోభిరాము లగుచున్ భాసిల్లి రాభూపతుల్.

230


క.

 శంకాతంకములేక ని
రంకుశగతి నడచి బలచయంబులతోడన్
వెంకయ్య మొదలు గలవీ
రాంకుల మైదొరగి చేరి రమరావతికిన్.

231


తే.

 వెంగళనృపాలమణియు నిజాంగలతిక
గాయములవఱ్ఱుగా మహోగ్రాజియందు
ఖానుసాహెబు ఢేరాకు గదియ నడచి
చేర్చె నిల మేను ప్రాణావశిష్టుఁ డగుచు.

232


తే.

 లక్షదళమీద నాలువేల్దళముతోడ
కయ్యమున కెక్కుట సమానకక్ష యనుచు

నివ్వెరపడంగ వలువదు నవ్వుగాదు
దీప మింతైన బొలుపదే తిమిరహృతికి.

233


ఉ.

 ఆరణమధ్యసీమ హతులైన బలంబులు నిందు నందు వే
ర్వేర వచింప నేల పటువిక్రమధుర్యులు రావువారిలో
వారల రందరున్ యవనవర్గములో గజరాజసంగతం
బై రహి నొక్కలక్ష పడి రందుల నొక్కొకరుండు దక్కఁగన్.

234


వ.

 అప్పు డయ్యవనశిబిరంబు గ్రందుకొని.

235


సీ.

 వాజిశాలలు రిక్తవాహంబు లగుటయు
       నదరురాహుత్రుల రొదలుకతన
నాలానముల వారణావలిఁ గానని
       హస్తిపకుల యంగలార్పుకతన
భర్తృజామాతృసౌభ్రాత్రాదు లాజిలో
       వ్రాలుట కొఱలు బిబ్బీలకతన
రహితాప్తవర్గమై బహువిలాపమ్ములఁ
       బొరలు సైనికసముత్కరముకతన


తే.

నొంచి కాకు వహించి యత్యుగ్రుఁ డగుచుఁ
దడయ కేతెంచి యప్పు డుద్ధతులముల్కు
చాల నిందించె హైదరుజంగుఁ బిలిచి
యిట్టిదురవస్థ నినుఁ గూర్చి పుట్టె ననుచు.

236


ఉ.

 బొబ్బిలివారితో మనకు బొం దుచితం బని మున్గు మందరుం
డుబ్బి లిఖించె నాతనిహితోక్తి గ్రహింపక జిడ్డు దెచ్చి పై
నబ్బురు మైనికిల్బిషపుటంబుధి ముంచితి వింతవట్టు నీ
కబ్బదె కొద్దినాళ్ల కహహా యిఁకఁ జేసినయంతఁ దప్పకన్.

237

క.

 అని నిష్ఠురోక్తు లాడుచు
ననిలో మఱికోటలోన నరయుచుఁ దత్త
జ్జనవిసరమరణదీక్షా
జనితాశ్చర్యంబు మది విషాదముఁ గొలుపన్.

238


తే.

యుద్ధరంగంబునం బడియున్నవీరు
జీవశేషుని వెంగళరావు నరసి
చాల మన్నించెఁ దనకృపాచ్ఛాదనమున
నతనియగ్రజతనయసంయుతము గాఁగ .

239


శా.

మూసాబూసి కృపాప్రసాదమున కామోదించి యావెంగళ
క్ష్మాసంక్రందనుఁ డన్న లేకొమరుతో శారీరశస్త్రవ్రణా
యాసంబుం బెడబాసి సర్వధరణీశాభ్యర్చితఖ్యాతిచే
భాసిల్లెం దనమే ల్సహింపనిరిపుప్రాణాలి జాలిం బడన్.

240


తే.

 విజయరామరాజు వెంగళరావుతో
ననియె నీదు బంధుహితజనంబు
చనిన పిదప నీవు సంత్యక్తనుండవై
చనక బ్రతికి తేల యనెడు నంత.

241


క.

 నీవిభవమెల్లఁ గనుఁగొన
జీవించినవార మిట్టిచేష్టకు నీకుం
గావలయు పనులు దై వము
గావించు నటంచుఁ బలికెఁ గనలి యతండున్.

242


శా.

ఆరాజన్యుని రాకపోకడల తూర్యస్వాన మాలించి దు
ర్వారక్రూరతరాఘపుంజ మితఁ డౌరా యంచు నీనేలపైఁ
బారేచీమలు మింటిత్రోవ నరిగేపక్షుల్మొద ల్గాగ సం
సారు ల్దూరనివారు వానవెలిగాఁ జన్వారు లే రుర్వినిన్.

243

వ.

 తదనంతరంబున నారాజకుఁజరుండు దనయభీష్టసిద్ధికిఁ దద్ద
యుం బ్రమోదం బందుచు నిజశిబిరంబునం బటకుటీరం
బులో నోలగం బుండి బొబ్బిలిపురంబునం బట్టాభిషిక్తుండ
నగుదు నని తత్పురాలంకరణంబునకుం దత్సమయసముచిత
మంగళద్రవ్యానయనంబునకు నచటికిం దనదేవుల సమా
కర్షణంబునకుం బ్రయత్నంబునం బొరలుచుండె నంత
మఱునాటిదివసంబున.

244


శా.

 రాజన్యైకవధావధానవిధికై రంగక్షమానేతమున్
రాజీవాప్తసమానతేజు ననివార్యస్థైర్యు ధైర్యాచలున్
రాజాంకోట నమర్చే నేఘనుని ధీరస్వాంతుఁ డాకీర్తు వి
భ్రాజచ్ఛౌర్యుఁడు తాండ్రవంశజుఁడు తద్భారంబు తాఁ బూనుటన్.

245


మ.

 తనజాయాదినిబర్హణజ్వలితవార్తాకర్ణనోత్ధవ్యధా
జనితంబై పెర రేఁచురోషపటిమన్ క్షత్రాగ్రగణ్యైకహిం
సనదీక్షారతియై పరాక్రమము మించం దాండ్ర పాపయ్య చ
య్యన నాత్మీయుల నిర్వురం దనకు సాహాయ్యంబుఁ గావించుచున్.

246


ఉ.

 దేవులపల్లి పెద్దనృపతిప్రవరుండును బుద్ధరాజు వెం
కావనిభృచ్చిఖామణియు హైహయుసన్నిభవిక్రమాఢ్యులై
క్రేవల నేగుదేరఁ దనకేవలశౌర్యరసప్రభావసం
భావనపిక్కటిల్ల రణపార్థుఁడు తాండ్రకులీనుఁ డత్తఱిన్.

247


తే.

 అధికబలుఁ డైన యతనితో నాహవమున
కెదిరి నడచుట కూడని యిచ్చఁ బేర్చి
యొరు లెఱుఁగకుండ గూఢసంచరణకలనఁ
గడఁగి పరిమార్చు టుచితంబుగా యటంచు.

248

సీ.

 రామచంద్రునివంటి రాజత్పరాక్రమ
       శాలి వాలిని ద్రుంచు జాణతనము
పార్థునంతటిజోదు పరఁగ దేవవ్రతు
       మఱుపెట్టి నొంచిన నెఱతనంబు
ధర్మనందనుని యంతటి మేటికుంభజ
       హరణార్థమై బొంకు దొరతనంబు
ననిలజుఁ డట్టివాఁ డతిరహస్యంబుగాఁ
       గీచకుఁ దునిమిన రాచతనము


తే.

 తప్పు గనకుండుటలు ప్రసిద్ధంబుగాదె
జగతి నటుగాన గూఢప్రచారచర్య
నహితు నొంచుట ధర్మువే యని గ్రహించి
పనిచె నొకచారు నతఁ డుండుపట్టుఁ దెలియ.

249


క.

 ఆకంచుకి యల్లనఁ జని
యాకఱకున్ రాచఱేనియావసథసమా
లోకన మొనర్చి క్రమ్మరి
యాకీ లెఱిఁగింప నెఱిఁగి యెఱిఁగి యతండున్.

250


శా.

అంతం దత్సహచారియుగ్మకముగా నారాత్రివేళ న్మహా
ధ్వాంతం బెంతయు నిండికొన్నయెడఁ దద్రాజన్యసేనాని వే
శాంతస్సంచరణంబున స్సమయపర్యంతంబు ప్రొద్దుచ్చి ని
శ్చింతం జేరిరి శత్రురాట్పటగృహశ్రేణీబహిర్ద్వారమున్.

251


తే.

 చేరి యచ్చేరువ నొకింతసేపు దడసి
యాలకించుచుఁ గడునిశ్చలాక మైన
తరిని ఢేరాకనాతుకు ట్టొరసి దానిఁ
దనక రాచూలిచేఁ జించుకొనుచు నేగి.

252

చ.

 తెలతెల వేగు నంతట నతిస్థిరత న్నృపసుప్తమందిర
స్థలనికటస్థజాగ్రుదురుదర్శకయుగ్మము హెచ్చరించుచున్
నలికిడి పుట్టనీక నిశితాసి నగల్చి మృగంబునొంపు బె
బ్బులిగతిఁ బొంచి పొంచి చని భూపతి యున్నతిరంబు డాయుచున్.

253


సీ.

 మణికుండలద్వయీఘృణీమండలంబుల
       దుమికెడు చెక్కుటద్దములవాని
నలవసంతజయంతనలకూబరాదుల
       నట్టిట్టు పఱచు సోయగమువాని
భాగ్యలక్ష్మీసభాభవనాయితము లైన
       తామరసాభనేత్రములవాని
హంససంసత్తూలికాభ్యంచితంబైన
       హొంబట్టుపఱపుపై నొప్పువాని


తే.

 హస్తకములకృతోపబర్హంబువానిఁ
గించిదున్మీలితాక్షుఁడై మించు విజయ
రామరాజవనుంధరారమణుఁ గాంచి
తాండ్రపాపయ్య కోపంబు దీండ్రిలంగ.

254


తే.

 పులిపులి యటంచు మిగులు నార్పులు నిగుడ్చు
నంతలో మేలుకాంచి యయ్యవనిపాలుఁ
డియ్యెలుంగెల్లఁ దాండ్రపాపయ్యపలుకు
తెఱఁగుఁ దెలిపెడు నంచుఁ జింతిలుచు లేచి.

255


క.

 తరవా రరసెడునెడ త
త్తర వాఱక తాండ్రకులసుధాధాముఁ డుదా
త్తరవారభటిన్మదవ
త్తరవారణమునకుఁ దూగు తద్రిపుసరణిన్.

256

తే.

 కదిసి పైఁ బడి యొకకేల నదిమినట్టి
వాఁడివాలున వక్షఃకవాటపాట
నంబు గావించె నతని యానాభికుహర
విదళితాంత్రవ్రజంబులు వెలికి నుఱుక.

257


సీ.

 నరసింహనఖరకోణప్రభిన్నహిరణ్య
       కశిపుప్రకారంబు గారవించి
మరుదాత్మసంభవు కరవాలదళితదు
       శ్శాసనాకారంబు నీసడించి
కుంభజాతాత్మజాకుంఠకృపాణికా
       భిన్నధృష్టద్యుమ్నుచెన్ను వడసి
వైనతేయత్రోటికానిర్దళన్మహో
       రగరాజతేజంబు రహి వహించి


తే.

 ధరణిఁ దొరఁగెడు పార్థివోత్తమునిఁ జూచి
నల దిలీప భగీరథ నహుష రంతి
శంతనులపోల్కిఁ దగెడు రాజన్యమణికి
నీకు నిటువంటిదశ యబ్బెనే యటంచు.

258


మ.

 అపు డాతాండ్రకులాభిమాననిధి యాహా రాజదేవేంద్ర నీ
విపులప్రాభవశక్తి నీనిఖిలపృథ్వీభారధౌరేయతా
నిపుణత్వంబును భాగ్యము న్వృధ చన న్నీచేయు దుశ్చేష్ట ని
ట్లుపభోగింపఁగ నయ్యె నిట్టి వెత యం చుద్వృత్తి వర్ధిల్లఁగన్.

259


తే.

 తాండ్రపాపయ్య సలుపుధౌర్త్యంబువలన
క్షత్రవర్యుండు పులివాత కండ యయ్యె
ననుడు రొద పుట్టె నంత నయ్యవనినాథు
బలము లార్తరవంబునఁ గలయఁ బర్వి.

260

సీ.

 తనచావు సర్వసిద్ధంబుగా మది గోరి
       సాహసకృతికినై చన్నవానిఁ
దనయేలికవిరోధిదర్పంబు మాపుట
       పరమార్థ మని యేరుపఱచువానిఁ
దమపడినట్టి బన్నముల కిక్కార్యంబు
       ఫలరూప మని యాత్మఁ దలఁచువానిఁ
దనకులస్వాములందఱు మెచ్చుకొన నోర్చి
       పగదీర్చుకొన్న సంభ్రమమువానిఁ


తే.

 దాండ్రకులజునిఁ బొదివిరి దారుణముగ
ఘోరయుద్ధంబు సలిపి యవ్వీరవర్యు
జిదిమి వైచిరి కఠిననిస్త్రింశతతుల
నతని సహచరయుగళసంగతముగాఁగ.

261


సీ.

 లీలమై జాభరల్లీయుబాదుర్లాది
       సర్లస్కరుల గిట్టి జయముఁ గాంచి
యసురు లాఖానుని యంతలేసి సుబాల
       నొగిజిలేబునను గొల్వుంచి మించి
కిమిడిచీఁకటిరాజ్యరమలు చూఱలు గొని
       తద్దుర్గములమీఁద దాడి పెట్టి
యాగౌతమీకటకాంతరాళక్షమా
       తలము నేకాతపత్రముగ నేలి


తే.

 గరిమ జగదేకవీరవిఖ్యాతి నొంది
విక్రమము గన్న రాజన్యచక్రవర్తి
వకట నేఁ డిట్లు తాండ్రపాపయ్య యనెడి
వెలమబెబ్బులిపా లైతివే నరేంద్ర.

262

తే.

 అనుచుఁ బరివేదన మొనర్చి రమ్మహీశు
హితపురోహితబాంధవప్రతతులెల్లఁ
దిట్టితే గుద్దినట్లును గట్టికుడుపె
నితనిదుష్కృత మని పల్కి రితరజనులు.

263


ఉ.

 ఆతదనంతరంబున మహాకులతన్ శిబిరంబులో జన
వ్రాత మొనర్చు క్రందలివిరావముచే నిదమిత్థ మన్న వా
ర్తాతతిశూన్యమై కలవరంపుఁదనంబున నెట్లొ కాకయన్
భీతిపరాసు ఱేడు కొలిపించె నగాదు ఫిరంగు లాపయిన్.

264


తే.

 ఆఫిరంగులరవళికి నానృపాలు
శిబిర మెల్ల చికా కయి చెదరఁ దొణఁగె
నపు డరాజక మైన తదావసథముఁ
గొల్లపఱచిరి కొల్లరు ల్గొల్లగాండ్రు.

265


వ.

 అంతట.

266


తే.

 రావువారిసంబంధి యుగ్రముగ వచ్చి
నృపునిఁ జంపుట నుభయసైనికులు వినిరి
రాజుచావుకు నంత ఫరాసుబలము
సంతసం బందె హైదరుజంగు తక్క.

267


మ.

 చని యారాజకళేబరంబు గని తచ్ఛారీరసంబంధు లం
తనితాంతార్తిని రోదన ల్సలుపుచు న్నానావిధానూనత
ద్ఘననైకాద్భుతకృత్యసంపదలచందంబు ల్వితర్కించుచుం
దనరం దన్మరణాతిచిత్రమహిమ ల్తర్కించి వాక్రుచ్చుచున్.

268


వ.

 అంత.

269


సీ.

 సంపూర్ణరుచి మించు చంద్రబింబములేక
         పరఁగెడు నక్షత్రపంక్తిమాడ్కి

వృషభహీనం బైనవిహ్వలత్వముఁ గాంచి
           కనుగని పరచు గోగణము భంగి
సురుచిరాకృతిఁ బొల్చు తరలరత్నము వీడి
           దొరఁగెడు ముత్తెంపుసరులరీతిఁ
గరచరణాంగరేఖావైఖరులు గల్గి
           శిరముఁ జెందని కళేబరముభంగిఁ


తే.

 జతురచతురంగనికరసంగతము నయ్యు
రాజమణి శూన్య మగుట నిస్తేజ మగుచుఁ
దన్మహారాజసైన్య మంతయును గదలి
వేగతరయానమునఁ జేరె విజయనగరి.

270


శా.

 గంధాంధద్విపమండలంబులు మొద ల్గా తద్ధరిత్రీభుజ
స్కంధావారము చూఱగొన్న తుద మూసాబూసికీరావుసం
బంధుం డొక్కరుఁ డేగుదెంచి బలిమిం బై వ్రాలి రాజన్యహృ
ద్గ్రంథిచ్ఛేదన మాచరించె నను వార్త ల్వచ్చుచో నత్తఱిన్.

271


చ.

 వెలమలసాహనం బమరవీరులయందు సురేంద్రనందనా
దులయెడ నైనఁ గాన మని తోరపుటక్కజ మంది యందిపై
నలఘుపరాక్రమాతిశయుఁడై దగు తాండ్రకులాగ్రగణ్యుదో
ర్బలము నుతించె బూసి బహుభంగులఁ దత్కృత మాత్మ మెచ్చుచున్.

272


శా.

ఎన్న న్రాని మహాభిమానినిధులౌ యీవెల్మవా రింటిపై
కెన్నండు న్వినలేని కృత్యమున కి ట్లేతెంచు రాజన్యుపా
పౌన్నత్యంబునఁ దాండ్రపాపనృపవర్యాకారత న్మృత్యు వా
సన్నంబై తెగటార్చె దుష్కృతి ననిష్టప్రాప్తి గాకుండునే.

273

క.

 అనుచు పరాసులదొరతన
మనమున నివ్వెరఁగు గాంచి మన్నేహంవీ
రుని రావువంశసంభవు
ననఘమతిం బిలువ బంచి యాదర మొదువన్.

274


ఉ.

 వెంగళరాయభూవిభుని విశుత్రకీర్తిని గారవించి త
త్సంగరపాండితీమహిమ తద్విజయద్రఢిమంబునుం దదీ
యాంగబలప్రభావము ముదావహమై బరగ న్నుతించి యి
చ్చెం గడువేడ్క కొత్తపలిసీమమొద ల్గలకొన్నిరాజ్యముల్.

275


క.

 హయములు మఱియుం గుంజర
చయములు మృదులాంబరములు జాగీరు లుదా
రయశుఁడు మూసాబూసియు
రయమున నిడి యేగె హైదరాబాదునకున్.

276


తే.

 అంత నారావువంశనీహారధరుఁడు
కొత్తపలిరాజ్య మేలుచోఁ గొమరు మిగిలి
కలితకళ్యాణవిభవసంగతి వహించె
భావిసౌభాగ్యసూచకప్రౌఢి మెఱయ.

277


మ.

 కలితప్రాభవధుర్యుఁడై కొనియె వెంగల్రాయ డంతన్ విని
శ్చలశౌర్యోన్నతిచేఁ దలిర్చుచు సమంచల్లీలఁ జెల్వొందు బొ
బ్బిలిరా జాములువాటియందు మును తత్పృథ్వీశ్వరాజప్తి ను
న్న లసత్సైన్యముమీఁదఁ దారసిలుచున్ ఠాణా లుఠాయించుచున్.

278


సీ.

 రాజకీయవిధాన యోజనోద్యోగంబు
         లంచితస్థితి విమర్శించుకొనుచు

ననిశ ప్రజానుకాలనమార్గములయందు
            విహితక్రమంబులు వెదకికొనుచు
గురువిప్రబాంధవోత్కరముల పట్టున
            ననువొంద హితవృత్తి నరసికొనుచు
ధర్మార్థసంగ్రహతత్పరజ్ఞానంబు
             తెఱఁగు ప్రాజ్ఞులయందుఁ దెలిసికొనుచుఁ


తే.

 దనయశశ్చంద్రికలు దిగంతమును నిండ
నామృగాంకార్కముగ నతం డాత్మవంశ
ముత్తరోత్తరవృద్ధిఁ బెం పొందుచుండ
సొంపు దీపింప నవని పాలింపుచుండె.

279


క.

 అని బొబ్బిలిరంగారా
యనృపాలచరిత్ర మెల్ల ననిమిషపతికిన్
వినిపించి నారదుండును
ననుమతిఁ గొని చనియె సంత నంతర్హితుఁడై.

280


క.

 ఇది యానుపూర్వితముగాఁ
జదివిన వ్రాసినను వినిన జనులకుఁ గడుస
మ్మద మొదలించును సంప
త్ప్రదమై యభిమానశౌర్యధైర్యాస్పదమై.

281

ఆశ్వాసాంతము

శా.

 సాధుస్తోమనికామరక్షణకళాచంచద్గుణాలంక్రియా
రాధాసూనుసమానదానకలనా రాజన్నిజప్రక్రియా
బోధాగాధరమాధురీణహృదయా పుంభావశుంభద్వయా
మాధుర్యైకనిదానవాక్సముదయా మల్రాజువంశోదయా.

282

క.

 విరియాలగోత్రవారా
కరరాకాకైరవాప్తకారుణ్యరస
స్ఫురణాభరణాధరణీ
భరణక్షమదోఃప్రసరణపండితశరణా.

283


మాలినీ,

 వనధినిభగభీరా వైరివన్యాకుఠారా
తనురుచిజితమారా ధర్మమార్గప్రచారా
జనవినుతవిహారా సత్యవాచోవిచారా
కనకశిఖరిధీరా కాంతమాంబాకుమారా.

284


గద్యము.

 ఇది శ్రీమత్కాశ్యపగోత్ర దిట్టకవివంశపవి త్రాచ్చ
నామాత్యపౌత్ర పాపరాజకవిపుత్ర శ్రీరామచంద్రచర
ణారవిందధ్యానపరాయణ నారాయణాభిధానప్రధాన
మణిప్రణీతం బైన రంగారాయకదనరంగచరిత్రం బను
మహాప్రబంధంబునందు సర్వంబును తృతీయాశ్వాసము.