ముకుందవిలాసము/ద్వితీయాశ్వాసము
ముకుందవిలాసము
ద్వితీయాశ్వాసము
కం.శ్రీముష్టిపల్లి సోమ
క్ష్మామండలనాథ హృదయసారసవర్తీ
శ్రీమయగద్వాలపుర
క్షేమంకరకీర్తి చెన్నకేశవమూర్తీ !
గీ. అవధరింపుము హరికథాశ్రవణ విభవ
లోలుఁడగునట్టి జనక భూపాలునకును
శ్రీహరి స్తవనామృత శ్రీవిశేష
హితరచనయోగి శుకయోగి యిట్టులనియె.
కం. ఈ చందంబున నవ్వన
వైచిత్రిం గనుచు యాదవ ప్రభు వొకచో
లోచనచకోరసమ్మద
సూచనమగు నిందుకాంతసుందర వేదిన్.
చ. సుకృతరసోదయాధిగతసుస్థిర దివ్యఫలాతివేలమున్
సుకరమరుత్కిశోరపరిశోభితకేళి సుధాలవాలముం
బ్రకటితభూరిశైలవన భాసితశీలమునై విశాలమౌ
నొక సురపాలముం గని యదూత్తముఁ డత్తరురాజశాఖికన్.
సీ. అపరంజి మెఱుఁగుటందపు ముఖద్యుతినంచు
జలజరాగచ్ఛాయ నెలవు సేయఁ
గలికి చిన్నారి చొక్కపురెక్కల బెడంగు
మరకతాళిచ్చాయ నెఱుక సేయ
నాకంఠహృదయ పర్యంత కాంతిచ్ఛటల్
పుష్యరాగచ్ఛాయపొందు సేయ
నలుదిక్కు లీక్షించి నయనమరీచికల్
శక్రనీలచ్ఛాయ చనువు సేయ
దివ్యమణిమయమోయనాఁ దేజరిల్లు
సుందరస్పూర్తి గనుగొన్నఁ జూచువార
లౌననంగ జగన్మోహనాంగమైన
యొక్క రాచిల్కఁ గనియె దామోదరుండు.5
ఉ. కాంచి ప్రజాంగనాహృదయ గౌరవచౌర్యధురీణమౌ కటా
క్షాంచలపాళి జాలిఁబడి యా శుకలోకశిఖామణిన్ విమ
ర్శించి యపూర్వవిస్మయవిశేషము చిత్తమునందు సంభ్రమో
దంచితమై పెనంగ హరి దాని విలాసమునెంచి యిట్లనున్.6
కం. ఇది యెయ్యదియో దీనికి
సదనం బెయ్యదియొ దీని జననస్థలమె
య్యదియో హృదయోత్సవగతి
నిది వింతకు వింత యగుచు నింపు ఘటించెన్.7
కం. ఎన్నడు రామో పోమో
యిన్నగవనరాజపాళికీ కీరంబుం
గన్నారమె మున్నొకచో
విన్నారమె దీనివంటి విహగమునెందున్.8
సీ. రమణీయ మణిపంజరములతోఁ బౌలోమి
చెలువుఁ డిచ్చిన జాతిచిలుకలైన
ద్వీపాంతరములలోఁ దెప్పించి జలనిధీ
శ్వరుఁడు దెచ్చిన శుకోత్కరములైన
గనకాంగదాది శృంగారంబులిడి రాజ
రాజు పంచిన కీరరాజియైన
మును విశ్వకర్మఠీవిని వినిర్మించిన
పురముచక్కెరతిండిపులుగులైన
మఱియుఁ దగురాజులెందఱే మత్ప్రియార్థ
మెలమి నొసఁగిన కలికిరాచిలుకలైన
నీ శుకముతోడ సరియౌనె యాశుకలిత
లలితవాచాలలీలావిలాసములను. 9
కం. భారతి చేఁగల శుకమో
యా రతిచేఁగల శుకంబొ యన్యమునకుఁ దా
నీ రుచి యీ శుచి యీయుచి
తారచితవచోవిచిత్రితాకృతి గలదే?10
వ. అదియునుంగాక 11
సీ. వైకుంఠనగరోపవన నికుంజములలో
వేడ్క సల్పుచునుండు విహగమొక్కొ
సత్యలోకోద్యాన సంతానపంక్తిలోఁ
గ్రీడ సేయుచునుండు కీరమొక్కొ
కైలాసశైల సంగత వృక్షవాటిలో
నిలిచి వినోదించు చిలుక యొక్కొ
పాలావారాశిలోపలి తెల్ల దీవిలో
సతతమామోదించు పతగమొక్కొ
లేక భూలోకమునకల్ల లేఖశాఖి
విడిచి వచ్చి మదారామవిటవిసీమఁ
గానఁబడినట్టి యమరశుకంబొ కాక
మనుజఖగమాత్రమున కిట్టి మహిమ గలదె!12
ఉ. మారుని ఘోటకంబగుట మాటికిఁ గూర్చి ఖలీనవైఖరిం
బేరు శుకోన్నతిం దగుట బెంపుగఁ గాంచి సదాగమాంత స
త్కారము పక్షమల్ల హరితత్త్వము నందుట రామసంస్మృతిం
దారిచి కీర మీ సుముఖతాస్థితి మాకనురక్తిఁదెల్పెడిన్.13
గీ. అనుచుఁ బ్రీతి వొడమ నా విహంగమమున్న
చిన్ని మావిగుములు సేర నరిగి
వెసఁ దదీయవదన విగళిత ఫలరసం
బాని సొక్కి యిట్టు లనియెఁ జక్రి.14
కం. ఈ చిలుక ఫలముఖంబున
సూచింపఁబోలు మనకు శోభనఫలలా
భాచరణమునని కరశా
ఖాచతురిమఁ బూని దానిఁ గైకొనువాఁడై.15
సీ. ఘనదివ్యమంగళాంగము గానఁబడకుండఁ
బొదల మాటు నొకింత యొదిగి యొదిగి
చరణాంబుజయుగంబు చప్పుడు గాకుండ
బొంచి పొంచి యొకింత పోయి పోయి
యోరగా భుజపీఠిఁ జాఱు బంగరుశాటి
వలెవాటుగ నొకింత వైచి వైచి
యివురు లడ్డము గాఁగ నింతంతటికి డాయ
సారె శ్రీహస్తంబు సాచి దాచి
కన్నుసన్నల నందఱఁ గడల నుంచి
మౌనముద్ర వహించి యందైనఁ దొలఁగఁ
దివురునో యని దానిపై దృష్టిఁ బూన్చి
ప్రమదమునఁ గేరి కీరంబుఁ బట్టె శౌరి.16
కం. అదియును హరిఁ గనవచ్చిన
యది గావున జాతిచేష్ట కట్టిటు ఱెక్కల్
విదిలింపుచుఁ గొంత తడవు
బెదరినయట్టుండి నిలిచి ప్రీతాంతరమై.17
సీ. కరకల్పశాఖానుగత సుఖానుభవంబు
నెంతయేఁ జింతించుఁ గొంతతడవు
సొగసుపిసాళివాల్జూపుఁదేనియసోనఁ
గ్రోలి యువ్విళులూరుఁ గొంతదడవు
చిలుకు తీయనిపల్కుచీని చక్కెరలాని
గ్రుక్కగ్రుక్కకు సొక్కుఁ గొంతతడవు
వదనచంద్రామృతాస్వాద ప్రసాదంబు
గూర్చి నివ్వెఱ నుండుఁ గొంతతడవు
కాంతదేహ ప్రభానంత గాహనమునఁ
గోర్కె లీడేరఁ గ్రీడించుఁ గొంతతడవు
దివ్యకీరంబు హరిగుణాధీనమగుచు
నాంతర నితాంత సంతృప్తి నంతనంత.18
ఉ. ఆ జలజాతసంభవునకైనఁ గనుంగొనఁగాని యమ్మహా
తేజుని మూర్తి గాంచియుఁ దదీయసమాదృతి నంది తత్కరాం
భోజమునన్ వసించె హరి పూర్ణదయారస దృష్టిఁజూడఁగా
రాజశకంబు తత్కృతపురాతన భాగ్యమహత్త్వ మెట్టిదో!19
వ. అంత నక్కీరపురందరంబు గోవిందకరారవిందంబునం జెంది సనంద
నాదులకు నందరాని పరమానందంబునుం బొంది తదీయ స్వరూప
దర్శనదివ్య సుఖావేశంబునం బరవశంబగు నెమ్మనంబు నెట్టకేలకుం
గ్రమ్మఱ మఱలించి యమ్మహానుభావునకు నిజానుభావంబుఁ దెలుపం
దలచి యతండు వెఱఁగంద నమృతస్యందంబుగా శ్రవణభూషణంబు
లగు మనుజభాషణంబుల నిట్లనియె.20
సీ. సనకాదియోగీంద్ర జనమనః కంజాత
కలితనిత్యధ్యాన కారణము
కలశాభికన్యకా కమనీయకుచకుంభ
కుంకుమపంకారుణాంకితములు
బ్రహ్మేంద్రముఖ్యగీర్వాణ కోటికిరీట
లలితరత్న ప్రభాలాంఛితములు
సముదగ్రకైవల్య సౌధాంతరాళవి
న్యాససౌఖ్యవిశేష భాసురములు
దివ్యలక్షణసౌందర్య దీపితములు
నైన భవదీయ శ్రీచరణారవింద
ములనుఁ గనుగొంటిఁ జిరపుణ్య మొలయఁ గంటి
భక్తరక్షణకృతదీక్ష! పంకజాక్ష!21
వ. అని మఱియు నక్కీరోత్తమంబు మదీయవృత్తాంతంబు విన నవధరింపు
మని యిట్లనియె.22
సీ. ఆపునరావృత్తి నిత్యానంద కందమై
చను సితద్వీపంబు జననసీమ
యశ్రాంత సత్యవ్రతాశ్రమస్థానమౌ
మేరుశృంగంబు విహారభూమి
సుకృతిగమ్యము విరించికులాంగనాపాణి
పంకజాతవరంబు టెంకిపట్టు
చిరజరామరణవర్ణితమైన మందార
ఫలరసామృతధార పారణంబు
పంకజాక్షపితామహ శంకరాల
యాదికంబులు గమనయోగ్యస్థలములు
సహచరులు దివ్యమౌనులు సహజగోష్ఠి
హరికథావళి మాకు లోకైకనాథ!23
కం. ఏకదినంబ చతుర్దశ
లోకంబులు దిరిగి సత్యలోకము జేరం
బ్రాఁకుదు నాలోకింపని
లోకంబులు లేవు నాకు లోకాధీశా!24
సీ. ఒకవేళ నుర్విపై నుండి చివ్వునఁ బ్రాఁకి
తారకాలోకంబుఁ జేరఁ జనుదు
నొకవేళ వాయుమార్గోపాత్తవృత్తి నై
సూర్యచంద్రులజాడఁ జొచ్చి పోదు
నొకవేళఁ గాలచక్రోపరిస్థలినుండి
చక్రవాళముఁ జుట్టి సంచరింతు
నొకవేళ నవలీల నుదయశైల శిఖాగ్ర
ముననుండి యస్తాగమున వసింతు
నొక్క వేళల బ్రహ్మాదియోగ్యమైన
దివ్యలోక విశేష ప్రదేశముల వి
హారములు సల్పి చయ్యన మేరుశిఖర
వాసినై యుందు నీయాన వాసుదేవ!25
గీ. ఇది మదీయవిధము విదితంబుగా మీకు
విన్నవింపఁగంటి వినుము నాకు
దివ్యబోధలబ్ధి దేవ తావక మైన
మహిమ గొంత యెఱుక మాత్ర గలదు.26
తోటకము. మదయుక్తుల నిమ్మహిమండలమున్
వదలింపఁగ యాదవవంశమునం
దుదయించిన విష్ణుఁడవో కమలా
హృదయేశ్వర శౌరి పరేశ హరీ!27
దశావతార కందములు
క. తొలిమినుకుల నల దనుకులుఁఁ
డలుకనుఁ గొన వానిఁ దునిమి యవి సేర్చి విధిన్
వలగొను కృప నల మను నృప
తిలకున కుపదేశ మీవే. తిమివై కృష్ణా!28
క. తామేటి దొరందరువన
దామేటి సుపర్వకోటి తద్గిరిధరముం
దామేటి కనుచుఁ బూనవె
దామేటివ యగుచు సూటి దైవకిరీటీ!29
క. నా కార్యాహృతిఁజేయఁగ
నా కార్యాదృతికి జగములన్నియుఁ బ్రీతిన్
సౌకర్యస్ఫూర్తి గనన్
సౌకర్యస్ఫూర్తి గనవె జగతి మురారీ! 30
క. లోకావనమును దితిసుత
పాకావనమును ఘటించి పౌరుషగతినౌ
నీకేసరి చిత్రాకృతి
నీకేసరిశౌరి దనుజనికరవిదారీ!31
క. నాకజనీనైకధునీ
శ్రీకి జనిస్థానమైన శ్రీపదిమది ర
త్నాకరునకుఁ గూకుదముగ
వీఁకఁ దగంజేయవే త్రివిక్రమమూర్తీ!32
క. నిజశౌర్యానలరసనా
వ్రజతృప్తిఁద్రిశుద్ది నెఱపు వైఖరి సరిగా
భజియింపవె యాహవముల
ద్విజరాజాకృతిని భృగుపతిస్థితి శ్రీశా!33
క. లోకవులనేర్చు రక్షో
లోకవులందునిమి మనుజలోకపులీలన్
నాకవులఁబ్రోవవే ము
న్నాకవులం గూడి రాఘవాకృతిశార్ఙ్గీ!34
క. సీరమునను యమునానది
నీరమునను భేదపఱచి నిరతిశయతనూ
సారమున నసితవసనా
కారమునను వెలయు యదునికరకుశలకరా!35
క. ఆగమ భాగమతంబుల
నాగమతం బొలయ విలసదసురీచేత
స్సౌగతహరణముఁ బూనవె
సౌగతత నుభరణమునను సర్వేశ హరీ!36
క. సాదివిహారత నిల హిం
సాదివిహారకులఁ దునుమనలరి గెలుచు నా
సాదివిదారి దిరుగుతర
సాదివిదారివి గదా గదారిదరాంకా!37
వ. కావున38
సీ. శుభమైన విధి నుండు శ్రుతిహితస్థితి వీవ
క్షితిఁ బూను శ్రీకూర్మపతివి నీవ
జగతి నీడేర్చిన సౌకర్యగతి వీవ
యరుదైన పురుషసింహంబ వీవ
బలి దైన్యహృతికైన పటుతరాకృతి వీవ
గురుహితంబూన్చు ధైర్యరతి వీవ
హరిసూను నేలినయట్టి రాజవు నీవ
యదువంశమునఁ బుట్టినయ్య వీవ
యనఘ సర్వజ్ఞమూర్తివౌ ఘనుఁడ వీవ
పరుషజనహారివగు ఖడ్జపాణి వీవ
నేఁడు వసుదేవునింట జన్మించినట్టి
కీర్తినిధి వీవ కంసారి కృష్ణ శౌరి!39
గీ. స్వామి మీ దర్శనఁబెట్లు సంఘటించు
ననుచు వచ్చితి నేఁ జేయునట్టి పూర్వ
భాగ్యవశమునఁ దనయంతఁ బ్రాప్త మయ్యె
సులభమున నాకు నిదె శుభసూచకంబు.40
క. ఏ నొక తిర్యగ్జంతువు
నైనను నాపయి దయారసామృత దృష్టిం
బూనితి కావున నీ కిదె
దీనావన యొక హితోపదేశ మొనర్తున్.41
గీ. అదియు నల్పమైన నధికంబ యైనను,
గృప వహించి చిత్తగింపవలయు
నఖిలలోకభర్తవైన నీకెందున
నుపకరింతు భక్తి యొకటె కాక.42
వ. అని శుకవతంసంబు దనవచ్చిన ప్రయోజనంబుఁ బ్రశంసించునదియై
కంసభేది కిట్లనియె.43
ఉ. శ్రీకృతసన్నివేశము పరీవహదిక్షుమతీనదీఝరా
స్తోకసరోజహారచయశోభన భాగుపకంఠదేశముం
బ్రాకటనైజవస్తుగతి భాసితసర్వదిశావకాశమో
కేకయదేశ మింపెసఁగుఁగీర్తిఁ దదీయధరిత్రి నెంతయున్. 44
సీ. శ్రీకరంబు రమావశీకరంబు శుభప్ర
జాకరంబనఁగఁ బెంపావహించి
సుందరంబు సువర్ణమందిరంబు శుభాద్రి
కండరంబనఁగఁ బ్రఖ్యాతి గాంచి
పావనంబు మహార్థభావనంబు జనాళి
జీవనంబనఁగఁ బ్రసిద్ధి మించి
భాసురంబు విశిష్టభూసురంబు హృతాబ్జి
నీసరంబనఁగ వన్నియ ఘటించి
వీఁక నతిలోకహృత పాకవిభవ పాక
నైకనృపలోకసుశ్రీకసౌకరీక
ళాకలితనాక సమసంపదాకరంబు
కైకయపురంబు దనరు భోగైకపరము.45
క. ఆ కేకయపురిఁ బుణ్య
శ్లోకయుతుఁడు సకలసుజనలోకనుతుఁడు సు
శ్రీకలితుఁడగుచు సుమతిం
గేకయపతి యలరు దృష్టకేతుఁ డనంగన్.46
గీ. ఆదృతేక్షుమాధుర్యమై యా నదియును
నతిశుభప్రశ్నగణితమై యా పురంబు
నభిహితశుభాంకభావ్యుఁడై యా విభుండు
నలరె నన్వర్థనామవిఖ్యాతి జగతి.47
గీ. ఆ నరేంద్రుఁడు దనకు సంతానమునకు
సాధనముగా రమాసమారాధనంబు
సేయుచుండునేవేళ నజేయుఁ డాతఁ
డీగతి ఘటింపుచు విశేషహితమనీషా!48
క. పద్మనిలయ నిజచేతః
పద్మనిలయ గాఁగఁ దలఁచి పద్మనయనుతో
సద్మమునం దొక కాంచన
పద్మమునం జేసి యునిచి భక్తిస్ఫూర్తిన్.49
క. లక్ష్మీహృదయాదికముల
లక్ష్మీధవహృదయపుటితలలిత జపార్చల్
లక్ష్మీసతికినిఁ ద్రిజగ
ల్లక్ష్మీవసతికి నొనర్చు లక్షణములచేన్.50
సీ. హరివత్సరతికి ధ్యానావాహనంబులు
పీఠంబు హేమాబ్జపీఠగతకుఁ
బాద్యార్ఘ్యములు తీర్థపాదుని దేవికి
స్నానంబు క్షీరాబ్ధిసంభవకును
అంబరంబాద్య విద్యాడంబరకు దివ్య
మంగళాకారకు మండనములు
గంధధూపములు సుగంధికి సురభికి
దీపంబు విజ్ఞానదీపకళకు
నఖిలభోక్త్రి కి మృష్టాన్న మాచమనము
నమృతకరకునుఁ దాంబూల మా సుపర్ణ
గమనకుశలకు నీరాజనములు దైన్య
తిమిరహృతికిఁ బ్రద్మకు మంత్రసుమము లొసఁగి.51
సంస్కృతవిభక్తికందము
కమలాయై నిలయీకృత
కమలాయై కరగృహీతకమలాయై తే
విమలాయై చ నమో నత
విమలాయై సవిభవేసవిభవే యనుచున్.52
క. ఆ జననికి రాజు నిటులఁ
బూజనములు సోపచారములు విప్రయుగీ
భోజనములు తత్కరుణా
భాజనములు గాఁగ నిడు సభాజన మెన్నన్.53
క. ఈ రీతి నాతడా హరి
నారీతిలకంబు గూర్చి నయభక్తిసుధా
ధారాధనార్పణముల స
దారాధనఁ జేయ మెచ్చి యంతఁ దనంతన్.54
గీ. ఒక శుభదినంబునందు నా సుకృతనిధికి
జలజవాసిని కరుణ సాక్షాత్కరించి
యొక కుమారుని సద్గుణయుతు నిజాంశ
నుదితయగునట్టి యొక కూఁతు నొసఁగి చనిన.55
క. శ్రీవిభునిదేవి దయ వసు
దేవునిసోదరి నృపాలుదేవి దగియె గ
ర్భావేశవశత శశిగ
ర్భావేశత నెసఁగు నుదయయగు దిశ యనఁగన్.56
వ. అంత 57
క. శ్రుతకీర్తి పేరఁ దగు వి
శ్రుతకీర్తి తదీయమహిషి శుభలగ్నమునన్
వితతనయు నొక్క తనయున్
గుతనువిలాసయుత నొక్క సుతనుం గనియెన్.58
గీ. అపుడు ద్విరాజకృతశుభ్రమైన వసతి
భూరిమతి బొల్చె గురుకవిబుధులరీతి
తోన లోకేంద్రహిత సముత్తుంగగతులు
దారిచె ననుగ్రహస్థితి తదుదయమున.59
క. సుముఖత శుభవీక్షణతం
గమలకుముద విహితగతివికాసము లెసఁగన్
రమణి కపుడు కను తారక
లమరెం గోరుగతి సంపదనుగతి నంతన్.60
గీ. ఆ కుమారుని సంతర్దనాఖ్యుఁ జేసి
యా రమాంశను గన్న కుమారికను
భద్రగుణలక్షణములు సూపట్టుకతన
భద్ర యను నామమొసఁగె భూపాలమౌళి.61
వ. అయ్యెడ నియ్యెడకు మదీయాగమనవిధంబు వివరించెద నవధ
రింపుము.62
ఉ. ఆ సమయంబునందొక శుభావసరంబున వాణి వైనతే
యాసనురాణి యున్నయెడ కంచినచో నను నా సరోరుహా
ధ్యాసినిఁ జూచి కీరమ! మదంశనుఁ గేకయరాజపుత్రియై
భాసురగాత్రి యొక్కతె విభాసిలు నాసతి యున్నధాత్రికిన్. 63
వ. నీవునుంజని యక్కీరవాణిం దత్తత్కాలోపదేశంబులం బ్రవీణం
గావించుమనిన మహాప్రసాదంబని తదీయప్రాసాదంబు గదలి మదీయ
స్వామినియగు కమలభవభామిని యనుజ్ఞఁ బడసి యెడసేయక నాక
లోకనికాశంబగు కేకయనగరనివేశంబుఁ బ్రవేశించి సుమనస్సమాదర
ణీయ గుణారాముఁడగు నా రాజలలాము నొక్క విప్రవర ముఖంబునం
గనిపించుకొని తత్సంతానంబగు నక్కుమారికావతంసంబునకు నుచిత
ప్రశంస లొనరింపుచుంటి నయ్యవసరంబున.64
క. కానక కన్న కుమారిక
గానం బై నా రమాంశఁ గనినకతన న
మ్మానిని తలిదండ్రులు దయఁ
బూని దినము వింతవింత ప్రోది యొనర్పన్.65
శా. జోలల్ వాడుదు నేను సొంపు గన నించుంబోణికిన్ డోలికాం
దోళక్రీడ ఘటింతు వింతలను బ్రొద్దుల్ బుత్తు నాడింతుఁ గేల్
గేలంబూని యొకింత చిన్నినడకం గీలింతు నత్తత్త నాఁ
జాలంజేయుదు ముద్దుమాటల సుధాస్యందంబుగా బాలికన్.
సీ. శ్రుతకీర్తిసుత గాన సుదతులు బాడేటి
తనమీది పాటలు వినఁగడంగు
దృష్టకేతుని కుమారిక గాన దృక్పాళి
కేళికావృతుల నీక్షింపఁదొడఁగు
భద్రాఖ్యయగుఁ గాన బాలికాతతితోడ
సమముగా మందయానములు నెఱుపు
నిందిరాంశజ గాన యందంద సుకృతఖే
లనులఁ గటాక్షించి చన్నదలంచు
నయపదోన్నతిఁ గేకయాన్వయజ గాన
సర్వముఖ్యాప్తగణవిశేషప్రసక్తి
సెలఁగ బహువచనస్ఫూర్తిఁ బలుకఁ దివురు
ప్రథమశైశవవేళ నబ్బాల కృష్ణ !
గీ. నాటఁ బెంచెటిదాని నేపూటఁ బెంచి
తల్లిదండ్రులు పోషింపఁ దత్కుమారి
యఖిలజనమున కానంద మావహిల్లఁ
బ్రీతి నల్లారుముద్దుగాఁ బెరుగుచుండ.
క. ఒసపరి మొలకై తళుకై
పసిమొగ్గై నిగ్గు బొడమి బటువై యటపై
రససౌరభములు గననగు
కుసుమమువలెఁ దోచె నపుడు కోమలి కృష్ణా!
చ. ఒనరుముఖంబునన్ శశిసహోదరభావము దెల్పఁ బాణులన్
వనరుహలక్ష్మిఁ దెల్పఁ జెలువంపు వచోరచనన్ సుధానువ
ర్తన జననంబుఁ దెల్పఁ గని తద్రమణీమణి యిందిరాంశ జే
యని మది నిశ్చయించితి సుమా కుసుమాయుధజన్మకారణా.70
వ. అంత నయ్యింతి ప్రతిదినప్రవర్ధమానయై 71
సీ. తిలకించి తల్లిదండ్రుల నేమి సూచునో
తలయెత్తి చూడదన్యుల నెవరిని
భ్రాతతోనైన మేరకు మేరయే కాని
లాలించినా పెక్కు పేలదెపుడు
బంధులఁగన్న మున్పడఁ బ్రియోక్తియ కాని
తమకైన కలిమి గర్వమనలేదు
చెలి తోడరాకున్న నిలిచి పిల్చుటె కాని
మఱచైనఁ బల్లంతమాట యనదు
నవ్వు నాతోడనైన మందస్మితంబె
కాని ప్రహసించు టేవేళనైనఁ గాన
నాటప్రాయంబునాఁడె యయ్యంబుజాక్షి
తద్గుణంబులు వర్ణింపఁ దరమె కృష్ణ!72
కం. ఈ లీల సకలగుణముల
పాలికయగు నా తృతీయవరదినశశిబిం
బాళిక బాలిక కేళిం
బాళికలిమి కెదుగఁదగిన ప్రాయం బనుచున్.73
గీ. ఏను తిర్యక్కులీన విద్యానిరూఢ
నగుట శుద్దాంతమున కేగ నర్హ మనుచు
సకలవిద్యలఁ బ్రౌఢగాఁ జలుపు మనుచు
నప్పడఁతితండ్రి తనయ నా కప్పగింప.74
శా. తూచా తప్పక యుండ నేర్పితిని హిందోళాదిరాగావళీ
వైచిత్య్రంబును నాట్యకౌశలముఁ గావ్యప్రౌఢియున్ నాటక
ప్రాచుర్యంబు నలంకృతిప్రతిభ శబ్దజ్ఞానముం దర్కవి
ద్యాచాతుర్యము సత్కవిత్వరచనాధౌరంధరీరేఖయున్.75
క. ఈ విధిని వయోవిద్యా
భావంబులు రా విలాసభావంబులు సం
భావింపఁగ భావంబున
భావజకళ యనఁదనర్చె భామిని యంతన్.76
సీ. ఇనుఁడు వచ్చునటన్న మునుమున్న కుముదంబు
గా నుండు కనుదోయి కమలమయ్యెఁ
బ్రాణనాథస్పర్శ యన గ్రహింపని వీను
లాగుణశ్రుతిహితశ్రీ గణించె
సత్ప్రియుండని యన్న చట్టుఱావలె నుండు
కలికిడెందము చంద్రకాంతమయ్యె
వరజాతి యన్న నివ్వెఱ లజ్జఁగను భావ
మట సుమనస్స్ఫూర్తి నతిశయించెఁ
బురుషసంగతి యన్నను పొన్నలరయుఁ
గన్నె పున్నాగయోగంబు గాఁగఁ దెలిసె
శైశవముఁ బాసి సుమశరావేశ మెనయు
మధ్యభావంబునను వధూమణి రమేశ!77
క. మురభంజన హృదయాం
తరరంజన యగుచుఁ జిన్నఁదనముననే చూ
పఱులకు పరిపరివిధముగ
నరుదొనరించంగఁ గంటి నా కలకంఠిన్.78
క. సోగమెఱుంగు కనుంగవ
రాగలవంబులకుఁ బెంపు రాగల సొంపుం
బాఁగు గల మోవి బంగరుఁ
దీఁగె మిటారించు మేను తెఱవకుఁ బొల్చున్.79
క. మధురసము మీఱు పలుకుల
మధురిమమును రుచిలవంబు మధుకరములకున్
మధుకరమిడు చికురములన్
మధురాధరయందె కలదు మధుమదమథనా!80
క. చిగురాకు జిగిపరాకుం
దెగడుఁ గడున్ మృదువులైన తిన్ననిపదముల్
మగఱాల నగు సరాలన్
నగుఁబోతగబొల్చు నఖరనఖరమ చెలికిన్.81
క. సరియెకద పిఱుఁదుబలువునఁ
దరుణినడక మందమగుట తరువాత మఱీ
మఱి విఱ్ఱవీఁగు కుచకచ
భరమునఁ జెలి దాళియుంట ప్రౌఢిమమె కదా!82
గీ. అతివ మున్ను నాశిక్షచే నా క్షణమున
నతనుశాస్త్రానుభావాప్తి నధిగమించె
నిపుడు నిజభావదీక్షచే నీక్షణమున
నతనుశాస్త్రానుభావాప్తి నతిశయించె.83
వ. అయ్యెడ.84
సీ. కటితటుల్ గమనసంఘటిత చక్రములుగాఁ
దగు నూరుయుగళంబు నొగలు గాఁగ
లలితబాహులు ప్రవాళస్తంభయుగముగాఁ
గంఠంబు విజయశంఖంబు గాఁగ
గలికిపాలిండ్లు చొక్కపుగుండుగిండ్లు గాఁ
బసిడిమైసిరి పట్టుపఱపుగాఁగ
నేత్రమీనములు వన్నెలటెక్కియములుగా
నెఱిగొప్పు నీలిచప్పరము గాఁగఁ
బ్రవచనశుకాశ్వములు ప్రేమపాశములును
కాటుక గుణంబు బొమవిల్లు కళుకుచూపు
తూపుగా నాత్మరథముగా నేపుఁజూపు
చెలువతనువున రథికుఁడై వెలసె మరుఁడు.85
క. ఈరీతినిఁ దారుణ్య
శ్రీరమ్యతఁ జెట్టుగట్టి శృంగారఫల
స్వారస్యములం గనుపడె
నా రామ మదీయదృష్టి కామని యగుచున్.86
క. ఆటలఁ బాటల సొగసుం
దేటల రూపవిభవమునఁ ద్రిభువనములలో
బోటులలోపల నీచెలి
బోఁటులు లేరనుచుఁ దోచెఁ బురుషవరేణ్యా!87
వ. అదియునుంగాక. 88
సీ. నలు పెక్కి దట్టమై నెలకొను చికురముల్
వీఁకఁ గ్రొమ్ముడి కందరాకమున్న
యమృతంబుఁ జిల్కెడు నధరభాగమునకు
రాగవైఖరి కొంత రాకమున్న
కుదు రేరుపడి పాడుకొను కుచాంకూరముల్
పోఁకలతో దీటురాకమున్న
దినదినమొకట వర్ధిలు నితంబమునకు
వ్రేకఁదనం బింత రాకమున్న
చూపులందునుఁ జారువచోనిరూఢిఁ
బ్రౌఢభావ మొకించుక రాకమున్న
చెలువచెలువంబు వచియింప నలవికాదు
నేఁడు వచియింప శక్యమౌనే ముకుంద!89
క. ఐనను నా నేర్చినగతి
మానిని తగువృత్తరూపమహిమ వచింతుం
గాన విన నవధరింపుము
నేనిట్లా యువతిమైత్రి నెఱపఁగనంతన్.90
సీ. నెఱిమీఱు నధరశోణిమ ముక్కున నత్తు చొ
క్కపుముత్తెముల కెంపుకళ లొసంగె
నింపారు నయనపాండిమ తళుక్కనిచెక్కు
వ్రాత కస్తురికప్పురంబుఁ దెలిపె
బ్రమయు ముంగురుల నీలిమకుంకుమపురావి
రేకకస్తురిచుక్కరేక నెఱపె
రుచులీను కరతలారుణిమకేళికిఁ ద్రిప్పు
తెలిదమ్మి కెందమ్మి చెలువొసంగె
నౌర తనకాంతతనుకాంతి యా స్వకాంతి
కాంతరనిశాంతముల హాటకాంతరముల
నెంతయేఁ జేయు సిరికిది వింతయేమి
యనఁగ నింతికిఁ బ్రాయంపుటంద మొదవె.91
వ. అంత 92
సీ. నవనవస్యందసుందర మందహాసంబు
నయనపాండిమతోడ నవ్వులాడఁ
బ్రకటమనోహరభ్రుకుటి కౌటిల్యంబు
నికటకటాక్షముల్ నేర్చుకొనఁగ
నరుణతారుచిమైత్రి నధరబింబమునకుఁ
గరపల్లవము వీటికల నొసంగ
నేకాశ్రయములౌట నాకటీతటి సాటి
కుచవాటియును వృద్ధికోటి గాఁగ
ముంగురులరఁగు చెలిమి మీఱంగ రంగ
దళిసమాపాంగ వీక్షాంగకళ లెసంగ
నంగనామణి కలరెఁ బూర్ణాధికార
యౌవనశ్రీ విహార మయ్యవసరమున.93
క. ఆ కలికి సకలతనురే
ఖాకలన వచింపలేరెకా శేషుఁడు వా
ల్మీకియును శక్తులా లల
నాకచబంధము గభీరనాభి నుతింపన్.94
చ. అమృతరసంబులో మిసిమి యాఱని మీఁగడఁ దీసి దానిలో
సమముగ జాళువామెఱుఁగు సన్నరవల్ సమకూర్చి వెన్నెలం
గమిచి మెఱుంగునన్ మెదిచి కాంచనసూనపరాగపాళిఁ జి
త్రమముగ మేళవించి యొనరింపఁగఁబోలు విధాత యానతిన్.95
చ. సుమముల కేము వోవుటలు చుల్కన యంచుఁ ద్విరేఫముల్ నగా
గ్రముల వ్రతస్థితిం గనుటఁ గాంతశిరోరుహ పంక్తియై ద్విరే
ఫములగుచున్ సుమాశ్రయవిభం గనె నౌ ఘనశేఖరాదృతిం
దము భజియింపరారె మును దాము భజించినవారలందఱున్.96
కం. అడుగుల మీఱిన నిడుపుం
బిడౌజమణిమీఱునిగ్గు ప్రియసఖి సొగసున్
వెడసందిటఁ గ్రిక్కిఱిసెడు
కడు తఱుచుంగురుల సిరులు గలుగుం జెలికిన్.97
మ. అనువై నెన్నుదురొంటుగా పదునొకండై కన్బొమల్ జంటగా
ఘనతం బోల్పఁగ రెండు తొమ్ముదులునై కర్ణద్వయం బొప్పగా
గనపూర్ణస్థితి బర్వలీల నెసఁగంగా నింతయుంగూడ దా
దినసంఖ్యం దిలకింప నిండునెలగా దీపించు మోమింతికిన్.98
క. అల విదియనాటి చంద్రుఁడు
నెలఁత నుదుటి కెనయె వారుణీసంగతిచేఁ
దలఁచినమాత్రనె దాకొ
మ్ములు వెళ్ళినవాడె మిన్నుముట్టిన హెచ్చే!99
గీ. విదియచందురుఁ డతికృశాస్పదతనుండు
చవితిచంద్రుఁడు గడుదోషసంగతాత్ముఁ
డష్టమీశశి శ్రుతికయోగ్యవృత్తి
చెలియ ఫాలంబునకు దీటు సేయుటెట్లు.100
ఉ. పంకభవాప్తిమోడ్చెఁ దమిపద్మములున్ మఱియున్ సదారుణా
తంకమునంది కుందెఁ గుముదస్థితి నుత్పలముల్ గడున్విసా
రాంకములై సభంగగతి నవ్వలఁ జిక్కఁగసాగె మీనముల్
సాంకవగంధినేత్రముల సామ్యము నొందఁగలేమి వేమఱున్.101
గీ. బెళుకుఁదళుకులు గలుగుట బేడిసలగు
నినునిఁ గన వికసించుట వనజములగు
రెంటి సరసమార్గస్థితిఁ గంటదగుట
నతివ రాజీవలోచన యనుట మేలు.102
గీ. విధి లిఖించి నవద్వయద్వీపభర్త
యీ లలనభర్త యని బాల ఫాలసీమ
నందుకై కురులూన్చె మర్మాప్తిననఁగ
శ్రవణనవరేఖ లిరుదెసనువిద కలరు.103
చ. తిలకుసుమంబు మంగళగతిన్ శుభగంధములందు నాసచేఁ
జిలుకలకొల్కి నాస యయి చెందె ననేక సుగంధ యుక్తిఁ బై
మలినతయుం దొలంగి యసమాన సువర్ణసమృద్ధి గాంచె ని
చ్చలు శుభావాసనాన్వితుల సంగతి సౌఖ్య మొసంగునే కదా!104
గీ. భువనజాతంబు గెలిచి యా యువిదమోము
తన కెనగ వచ్చె వీడని కినిసి రెండు
భాగములఁ జేయ భీతిఁ దత్పార్శ్వములనుఁ
గొలుచు నెలతున్క లనఁగఁ జెక్కులు సెలంగు.105
సీ. అమృత మీడందమా యట రుచి సరివచ్చుఁ
గాని కాంతిని సరిగాక నిలిచెఁ
బగడ మీడందమా ప్రతిభచే సరివచ్చుఁ
గాని యారుచి సరిగాక నిలిచెఁ
గెంపు నీడందమా సొంపుచే సరివచ్చుఁ
గాని మెత్తన సరిగాక నిలిచె
బింబ మీడందమా డంబున సరివచ్చుఁ
గాని బుద్ధిని సరిగాక నిలిచె
స్రుక్కిచను ద్రాక్షగడుపులు సెక్కుతేనె
చక్కెరయు ఖండమగుగంట్ల జిక్కు చెఱకు
నగునె తగుదీటు జిగిబిగిసొగసు మృదువు
మధురమునునైన యా చాన యధరమునకు.106
క. మానిని వాతెరలతపై
నానిన పరిపక్వబింబమని శుకములు రా
నేను మదీయకులోక్తుల
వానికిఁ దెలియంగఁ జెప్పి వారింతు హరీ.107
క. రదనంబులు ముత్తెపుఁ జ
క్కఁదనంబులతోడఁ జేయుఁ గదనమ్ములొగిన్
సుధనైనంగేరు విధుం
తుదవేణి మృదూక్తి సరణిఁదుద వేమాఱున్.108
చ. ప్రయతి నగాగ్రవాసతఁ దపఃస్థితి మీఱి రసాలసత్ఫలం
బయగతి నా లతాంగి చుబుకాకృతియై సుముఖాప్తి నంతటం
బ్రియకరయోగ్యవృత్తిఁ దలపింపుచు ముచ్చట లిచ్చె నెచ్చటం
బ్రియకరయోగ్యవృత్తి, దలపింపవె సత్సహకారసంపదల్.109
చ. అరయఁ బసిండికట్లు మొదలౌ బిరుదుల్ ఘటియించి దోర్యుగో
పరితలరమ్యపీఠి నిడి భవ్యసుగంధములందలంద నౌ
మరు విజయాంశంఖమగు మానినికంఠము గాకయున్నచో
సురవకళల్ సువృత్తతయు శోభనరేఖలు గల్గియుండునే.110
క. ఆ రామ విలాసకర
శ్రీరమ్యశుభాంగి మది హరిప్రియమగు నం
చారసి విధి పూన్చిన త
త్సారకుసుమమంజరులు గదా భుజలతికల్.111
సీ. ఘనవయఃస్సురణంబు గలిగియుండుటఁజేసి
జక్కవకవ కొంత సాటివచ్చుఁ
బ్రియపుణ్యఫలలీలఁ బెంపు మీఱుటఁజేసి
జంబీరములు కొంత సవతు వచ్చు
నతివ వక్షఃస్థితి నందమొందుటఁజేసి
వీణెకాయలు కొంత నీడువచ్చు
గంచుకావరణ సంగతులు గాంచుటఁజేసి
ద్రాక్షగుత్తులు కొంత ప్రతినవచ్చు
గాక వృత్తిస్థితిని సరిగావు సిరుల
నెఱసి ప్రక్కల నొరసి క్రిక్కిఱిసి గిరుల
దొరసి మొగమునకెగసి సొంపరసి మెఱసి
తగిన మృగనేత్ర వక్షోజయుగమునకును.112
క. తరుణీతనురుచి పటముగ
హరినీలపుకేతుయష్టి నారుగ నాభీ
సరణి నిదె మరుఁడు లేకే
కరణినటం దుదలఁ దగు మకరలేఖనముల్.113
గీ. అడ్డ మేర్పడ వళియు రోమాళినిడుపుఁ
బడగరేఖాయుగళి హంసపాది వ్రాసె
లేని నడుమునకొక శంకగా నజుండు
జనము లెందున్నదో యని సంశయింప.114
క. చంచ్చంచల కాంచన
కాంచీసంఛన్నఘంటికాశబ్దగుణ
ప్రాంచితమై చంచలదృశ
కాంచీదేశంబు దగియె గగనంబనఁగన్.115
క. తనకన్న వెనుక వచ్చిన
వనితాకుచయుగము చక్రవైఖరి గాంచన్
విన నెన్నికగా నతిభా
వనతనితంబమును క్రవైఖరిఁ గాంచెన్.116
క. సరి రాక నడకు కరి గిరి
తరుణీసాయుజ్యకాంక్షఁ దపమొనరింపన్
శిరము కటిఁ గలసె గలసెం
గరమూరున గమనముననె గమనము గలసెన్.117
క. పిఱుఁదుందీవి జనించిన
యరఁటులుబో యూరుయుగళ మటఁ దన్ముకుళ
స్ఫురణఁగనుఁబో జంఘలు
వరవర్జినికిన్ సువర్ణవరవర్లినికిన్.118
క. మఱి జానువులడుగులుగా
మరు నమ్ములపొదులు సుమ్ము మగువకుఁ బిక్కల్
చరణములాయోగంబున
నరయన్నాళీకసమత నందునె కాకన్.119
క. తమ్ముల లేఁజివురులమొ
త్తమ్ములఁ జెలి నయనపాణితలములు దరమం
దమ్ములవేడఁ బదాబ్జా
తమ్ములు రాగరమగలవె తమలోఁ గొనియెన్.120
క. చెలి నఖములు సితతారా
వళిసఖములు గాకయున్న వానింబలెనే
యిలఁ బుష్కరపదసంగతి
కలనన్ సత్కాంతి నొందఁగారణమేమో!121
క. ఈ మాడ్కి వెలయు లేమన్
వేమాఱులు గొలిచి యామె విభవ మజహరి
స్త్రీమణులకుఁ దెలుపఁజనుదు
వేమఱు నావేళ నొక్క వింత వినఁగదే!122
సీ. ముఖవైఖరికి మోడె మొదలనే శశిరేఖ
యధరంపురుచికి లోనయ్యె సుధయు
నాసకు సరిరాక నలిగెఁదిలోత్తమ
లోచనద్యుతులకు లోగె హరిణి
హాసలీల భ్రమించె నభినవకౌముది
యసదయ్యెఁ గుచవృద్ధి కద్రికయును
ఊరుద్వయస్ఫూర్తి కొదిగి రంభ చలించె
నట గోరునకుఁ బోలదయ్యెఁ దార
యౌర తనుకాంతికినిఁ దక్కువయ్యె హేమ
చిత్రరేఖలఁ గొదవయ్యెఁ జిత్రరేఖ
యేనొకట నాకమునకేగి యీ శుభాంగి
యంగరమలెన్న నప్సరలందు శౌరి!123
క. చిన్నారి చూడ్కి వేలుపుఁ
గన్నెల సొబగు నగు భోగికన్నెల నవ్వున్
మున్నారు తీరులిలఁగల
కన్నెల సరిజోల్పి సిగ్గుగాదే కృష్ణా!124
ఉ. బేడిసమీలు ముద్దుకనుబెళ్కులు చెక్కుల తళ్కులద్దపు
న్నీడల నేలు గుబ్బగవనిగ్గులనంగుని గుండు బంగరున్
మేడలఁబోలు నీ చెలువ మేదినిఁ గల్గిన చిన్నికన్నెరా
చేడెల మేలుబాల నుతి సేయఁగ నా తరమా రమాధవా!125
సీ. కృష్ణ ప్రభావాప్తి కేశవేశంబున
విధువిలాసము ముఖావేశముననుఁ
గమలోదరవికాసకలన నేత్రంబుల
మధుజిత్వ మధరబింబంబునందు
శంఖసుకరలీల సరసకంఠంబున
రుచిరాచ్యుత స్ఫూర్తి కుచసమృద్ధి
హరిభావసంపద యవలగ్నసీమనుఁ
గనదనంతారూఢి కటితటమునఁ
గాంచనాంశుకసౌభాగ్యగరిమ నెల్ల
నతులతను కాంతిఁ దెలిపె నీ యతివగాన
రూఢి నీ పేరునకు సమరూపముగను
దొరయ నిది సకలాంగవైఖరి మురారి.126
క. ఈ యందంబీ చందం
బేయందునుఁ గానఁ గాన నీ యిందుముఖిన్
నీయందఁ జెందఁజేకొను
శ్రీయందనరాదు దీని చెలువము శ్రీశా!127
వ. అదియునుంగాక. 128
చ॥ గళమున శంఖరేఖయు ముఖంబునఁ గన్నులఁ జేతులం బద
స్థలములఁ బద్మరేఖలును చారుకుచంబులఁ జక్రరేఖలుం
గలుగుట చిత్రవైఖరి దగంగఁ గనుంగొని యో శుభాంగ యీ
సులలితగాత్రి కెట్టి సరసుండగునో విభుఁడంచు నెంచుదున్.129
మ॥ వినుమో మాధవ తన్నుఁ దానెఱుఁగకావిర్భూత సంపూర్ణయౌ
వనగర్వోన్నతి గన్న మత్ప్రియసఖిన్ భద్రన్నిరీక్షించి నే
నమవందన్ ధరఁ గల్గు పట్టణములందం దున్విలోకింపుచున్
వినువీధిం దగునట్టి సుందరవరాన్వేషార్థినై వచ్చుచున్.130
కం॥ ఎల్లెడఁ బేర్కొను నగరమ
తల్లులలోఁ గలుగు రాజతనయులలోనం
దెల్ల సరిలేమి మదిఁ జిం
తిల్లుచు నొకచో రహస్యదేశము గాఁగన్.131
కం॥ ఆకడ నేనొక యుద్యా
నాకరమున నూహసేయునటఁ గనకసుమ
శ్రీకాంతాలోకమునా
శ్రీకాంతాలోక మెఱుకజేసిన దానన్.132
కం॥ శ్రీరమణి మదంశజ యని
యా రమణిన్ మున్ను చెప్పినది మదిఁ దోఁపన్
మీరున్నకతన నే నీ
ద్వారకమార్గంబు బట్టి వచ్చి రమేశా.133
కం॥ ఈరైవతకాద్రిపయిం
జేరి మిముం గంటిఁ గార్యసిద్ధియుఁ గనఁజే
కూరెను మీవలన బుధా
ధార సుధాధారవంటి దయ నేఁ గంటిన్.134
క. మీ రేఖాసౌభాగ్యము
మీరేకాసురలకైన మేదిని లేదే
మీరేకాని మఱెవ్వరు
మా రాకాబ్జముఖి తుల్యమారాకొమరుల్.135
వ. దేవా! యింతయుం జెప్పవలసి చెప్పితింగాని యింక నొక్క విన్న
పంబు గల దవధరింపుము.136
క. జనకుఁడు భువిఁగల ప్రాయపు
జనపతులం బటములందు సవరిచి యనుగుం
దనయకడ కనుప నితరము
గననొల్లదు నీ పటంబె కాని మురారీ! 137
చ. విను మొకవింత తండ్రికడ వేడుక వందిజనంబులెల్ల రా
జనుతు లొనర్పఁగా విన నసహ్యపడున్ భవదీయసన్నుతుల్
వినినఁ గను న్వికాసరమ వేమఱు నా కమలాక్షి యక్షిరం
జనత ముఖాబ్జమొప్పఁ గుచచక్రములుబ్బ నినాన్వితస్థితిన్. 138
గీ. ఏను ప్రొద్దుపోక కెల్లరాజతనూజ
కథలు కృతులొనర్చి గానసరణిఁ
బాడుచుండు నన్నుఁ బ్రార్థించు హరిచరి
త్రంబె పాడుమనుచు నంబుజాక్షి.139
క. మీ చిత్రపటముతో సరి
దోచఁగ నద్దమిడి చూడఁదోచెఁ దన తనూ
వైచిత్రి మీకు సరిగా
జూచుకొనెడి దారిభువనసుందరి శౌరీ!140
వ. ఇవ్విధంబున.141
క. యుక్తులనన్నిట మీ యను
రక్తియె తేటపడఁ జూచి రాజాననకున్
భక్తియొ మీపైఁ దమి నా
సక్తియొ యని నేను మది విచారంటొదవన్.142
క. ఆ సూక్ష్మము దెలియుటకై
యా సతి మదిఁ గ్రుచ్చి క్రుచ్చి యడిగి రహస్యా
వాసంబున మీయందుల
నాసఁ గలుగుమాట గొంత యరసితి నీశా!143
సీ. ఉస్సని మదిలోన నుడుకుతాపాగ్నిచే
నొకకొంత వేడినిట్టూర్పుఁ బుచ్చు
నెలకొన్న కూర్మి మున్నీరుబ్బి పొంగారు
చెలువున సాత్వికస్వేద మూన్చు
మీ గుణామృతరుచిమీది చింతనఁజేసి
యఖిలపదార్థంబు లరుచిఁబూను
విరహంబుపేరిటి వేదురు పై కొన్న
నొకట నుండినచోట నుండకుండు
హృదయగోప్యార్థ మొకరి యధీనమైన
బైలుపుచ్చక లోఁగొన్న జాలి మాలి
జాగ్రతయ కాని నిద్దుర జాలియుండు
మిమ్ముఁ జింతించునప్పు డమ్మెలఁత శౌరి.144
చ. పిలిచిన నేమి పల్కదటబేర్చితటాన మిటారికత్తియల్
నిలిచినఁ గూర్మిఁ జిల్క దగణేయమణీమయ భూషణాదులం
దలచినఁ బ్రీతిఁ గుల్కదట దాన సదా నలినాక్షి మీపయిన్
వలచినప్రేమ దొల్క మరువంచనకల్క మరుల్గొనన్ హరీ!145
సీ. పనివారిపై నల్గి పజ్జ గొజ్జగినీట
మజ్జనంబాడదు మంజుచర్య
తను వంటవలదని తత్తజనులఁ బంచి
గుజ్జనల్ గూర్పదు కుంభిగమన
తగుననగాదని తలిరుబోణు లొసంగు
సుమముల నందదు శుభలతాంగి
యొకరీతి కినుకచే సకులపై ముడిబెట్టి
బొమ్మలాడించ దంభోజనయన
నిచ్చ చలువలు గోరదు నెఱివిరాళి
నిచ్చ చలువలు గోరు నమ్మచ్చెకంటి
సాపరాధీనగతినెంచు జగతి చెలుల
నీ పరాధీన యగునట్టి నెలఁత దేవ.146
క. పాటలు నేర్పదు తేఁటుల
కాటలు గూర్పదఁట రాజహంసకు నలుగుం
బోటులఁ దేర్పదు పలుకుం
దేటలఁ జేర్ప దల శుకతతిన్ సతి సామీ!147
వ. మఱియును. 148
సీ. చెలువైన కీచకమ్ముల రవమ్ములు విన్న
మురళీస్వన మటంచు మోహముంచుఁ
దీఁగెయెమ్ముల నెమ్మి సోగ లించుకఁ గన్న
మౌళిపింఛ మటంచు మమతఁ బెంచు
సరసులఁ గమ్ము తమ్మిరజమ్ము తెరలున్న
స్వర్ణాంబర మటంచు సంభ్రమించుఁ
బలువింత చిఱుతమొగ్గలు చాలుకొనియున్న
వనమాలిక లటంచు వలపు నించు
మిమ్ము వినియుంట మీ స్వరూపమ్మె యనుచుఁ
గదియఁజనుఁ గానిచో వేఱె కప్పిపుచ్చుఁ
దలఁచుఁ దపియించుఁ జెలులతోఁ దాను నేను
వనవిహారం బొనర్చుచో వనిత కృష్ణ!149
గీ. ఎవ్వరెఱుఁగనికతన నీ యిందువదన
కెన్నడును లేని యీ తాపమేలఁ గలిగె
ననుచుఁ జింతింప నా కాంతలటకుమున్న
కొమ్మ విధమంత నే నెఱుంగుదునె కాన! 150
క. ఏమమ్మా మేమిట లే
మమ్మా చెప్పరానిదీమర్మమనే
నేమమ్మా పెఱవారల
మేమమ్మా మాకుఁ జెప్పవే మాయమ్మా!151
క. తగదమ్మా యిది యొక విం
త గదమ్మా నీవిటుండఁ దగనివిధమునన్
మృగరాజమధ్య నినుఁ గని
నగరా నగరాంతరమున నగరాజకుచల్.152
వ. అని యేకాంతంబునం బుజ్జగించినం జంచలాక్షి నిలువరించలేక
నాకుం దన వాంఛితంబు వచియించునదియై యిట్లనియె.153
సీ. సురమణీహితలీల సురమణీహితలీల
వలఁపుఠీవిని మోవి దెలుపుననుచు
ఘనకళాతిశయంబు ఘనకళాతిశయంబు
తనుభాతి ననుభూతి ననుపు ననుచు
భావభవస్ఫూర్తి భావభవస్ఫూర్తి
సొంపుననింపునఁ బెంపు ననుచు
సొగసుఁ జూపున యాప్తి సొగసుఁజూపునయాప్తి
చెలువున నలువున మెలవుననుచుఁ
దమ్మిగుణ మోము మోము నదళులు నళులు
ననఁగ హాసంబు మీసంబుఁ బెనుచు ననుచు
మధురిపువిలాసములు సుధామధురిమముగ
విందు నేనెందు వీనులవిందుగాఁగ.154
గీ. ద్వారవతినుండి మా తలిదండ్రి కడకు
వచ్చువారలవలన శ్రీవరుని చెలువుఁ
బిన్నతనముననే నేను విన్నకతన
నాటియున్నది మదిలోన నాఁటనుండి.155
చ. పలికినఁ జాలు వీనులకుఁ బండువుగాఁగఁ గటాక్షలేశముల్
చిలికినఁజాలువానిదమిఁ జిప్పిలుఁ గూరిమిలోన నించుకం
దొలికినఁజాలు సౌఖ్యరసతోయధిఁ దేలుదు నంచు నెంచు నా
కలికి నిజాలుగా మఱియుఁ గామిని స్వామి నినున్ గణించుచున్.156
క. నా కలలో వచ్చినగతి
నాకన్నులఁ గట్టినటుల నాటిన మదిలో
నాకుఁ బ్రియుం డతఁడే యని
శ్రీకృష్ణునియందు నాదు చిత్తము నిలిచెన్.157
సీ. ఏ దివ్యతరమూర్తి నీక్షింప వాంఛాప్తి
చూడ్కి, సాఫల్యంపు సొంపు నింపు
నే దయాంబుధి గుణామృతకణాంశము గ్రోల
నెలమి వీనులు నిత్యతృప్తి నెసఁగు
నే ఘను సరససత్కృతి నందఁజాలిన
స్థిరమహాతాపశాంతిని ఘటించు
నే దేవవరుకల్మి నెనయు పుణ్యముగన్న
జిరవైభవస్ఫూర్తి జెందఁ దనరు
నే పురుషవర్యు తనుయోగ మించుకేని
దలఁపఁ బురుషాంతర భ్రాంతిఁ గలుగనీయ
దట్టి శౌరిదివ్యలీల నా యంతరంగ
పరమఖేలనమునకు నాస్పదము గాదె.158
గీ. అనుచుఁ జెప్పి కీరమా యారమాధీశుఁ
జేరి విన్నపంబు సేయు మనియె
మఱియు స్వామితోడ నెఱిఁ దన మాటగా
నామె యన్న మాట లవియు వినుము.159
సీ. మందారకుందారవిందారత మిళింద
బృందంబు సనునె కోరెందపొదకు
నా మానసామానసీమానటదనూన
మానసౌకము వోనె వానపడకు
సహకారసహకార బహువారసుఖవార
కీరంబు గనునె దుత్తూరవిహృతి
నూతనద్యోతజీమూతనీతజలత
చాతకం బేగునే నూతికడకు
దేవ తావకసౌందర్యదివ్యమంగ
ళాంగశృంగారసార సుధాంబురాశి
నలముకొనియున్న నాదు చేతోంబుజాత
మిచ్ఛయించునె మఱి యన్య మిందిరేశ!160
గీ. అతనుతాపానలజ్వాల నలము నన్నుఁ
జేరి శౌరిదయామృత సేచనమున
నలరఁ జేకొని మీ చరణాంబుజాత
కింకరీభావ మొసఁగి రక్షింపఁగదవె!161
క. అని మీతో నను మని యో
వనజాతోదర స్వకీయవాక్యముగ మఱిం
దన చేతోగతి వలపుల్
గన నాతో నిట్టులనియెఁ గామిని ప్రేమన్.162
క. రమ్మనుమా తనకే భా
రమ్మనుమా మరుఁడు చెడుగరమ్మనుమా దూ
ర మ్మనుమానింపక పా
రమ్మనుమా విరహ మాదరమ్మున శౌరిన్.163
క. మ్రొక్కితి ననుమా చక్రికిఁ
దక్కితి ననుమా తలంచి తన గుణములకున్
సొక్కితి ననుమా వలపుల
జిక్కితి ననుమా యటంచుఁజెప్పె న్వినుమా.164
క. నీ పదములె వినఁదలఁచున్
నీ పదమున నుండఁదలఁచు నెలఁతగల తమిన్
నీ పదములె కనఁదలచున్
నీ పదపద్మముల యాన నీరజనయనా!165
వ. కావున 166
క. శ్రీకల్యాణోత్సవమున
మాకుఁ బ్రమోదం బిగుర్ప మాధవ ప్రీతిం
గైకొనుమా లతకూనన్
నీకా ప్రాయంపుటామనిం గ్రీడ దగున్.167
క. ఆ హరిణాక్షికి విద్యల్
సాహిత్యము గలుగఁ దెలుపఁ జాలనయితి నే
నోహరి నేటికి సద్య
స్సాహిత్యము గలుగ నీదు సంగతివలనన్.168
గీ. నేను సాంగశాస్త్ర నిపుణగాఁ జేసియు
బాలమౌగ్ధ్య ముడుపఁజాలనై తి
నీ వనంగశాస్త్రనియతిని రతినైన
జేరి శౌౌరి ప్రౌఢఁ జేయగలవు.169
చ. లలితముఖేందువుం గుచవిలాసనగం బధరామృతంబునుం
గళశుభశంఖమున్ విహితకైశ్యపయోదము నాభిసంభ్రమం
బలరుఁ బిఱుందుదీవియుఁ గరాంఘ్రిమహాంబుజమైన కామినీ
కలితవయస్పుధాంబునిధిఁ గల్గు విహార మొనర్పఁగా హరీ!170
క. తరుణీలావణ్యంబుధి
వఱలు వళీవీచిరోమవల్లీఫణిపై
మఱి నీవు పవ్వళించిన
హరి తొల్లిటి భోగిశాయి మౌదువు సుమ్మీ!171
సీ. ఆ గుణవతినిఁ జేనందఁగూర్చితివేని
నీ రమ్యగుణమణుల్ బేరుగాంచు
నా రామ మదిఁ బ్రేమ నలవరించితివేని
నీ యశోలతికలు నెఱయఁగలుగు
నా హంసగమనఁ గ్రీడార్హఁ జేసితివేని
నీ మానసము రసోన్నిద్రమగును
నా రమాంశజ నొంది యతిశయించితివేని
నీ మహాభాగ్యంబు నింపు నింపు
గాన సంపూర్ణసౌందర్యమానితార్థ
మదన సామ్రాజ్యసర్వస్వమహిమ యనఁగ
నందమగు నిందుముఖిఁ బెడ్లియాడితేని
నీవు భద్రాన్వితుఁడ నౌదు శ్రీవరేణ్య !172
క. రమ్మా మా నగరికిఁ గై
కొమ్మా మా చిన్ని ముద్దుగుమ్మను రతియే
సుమ్మా రూపమ్మున లే
లెమ్మా వేగమ్మ యువతిలీలామదనా !173
సీ. పలుమాఱు చలముచేఁ బడఁతి నేలకయున్న
బలుమాఱు చలముచే బడలు సుమ్ము
సతి నిందుకళలంటి రతులఁ దేల్పక యున్న
జత నిందుకళలంటి జడియు సుమ్ము
కొమ్మపై నఱలేని కూర్మి నిల్పకయున్న
గమ్మ పయ్యరనాని కందు సుమ్ము
మధురాధర మొసంగి మగువఁ బ్రోవక యున్న
మధురాధర చితాప్తి మసలు సుమ్ము
చెలువ బహుళపుఁదమి శాంతిఁజేయకున్న
విరహబహుళపుఁదమిఁ జిక్కి వెఱచు సుమ్ము
మీరు రాకున్నఁ దాపంబు మీఱు సుమ్ము
రమ్ము సకి కూరిమి దిరమ్ము సుమ్ము శౌరి.174
వ. అదియునుంగాక యింక నొక్క విశేషంబు వివరించెద.175
క. నీ విందఱిఁ బెండ్లాడితి
ఠీవిం దగ నవియుఁ బెండ్లిఠేవలె వినుమో
గోవింద యందునందున్
నేవిందున్ ముందుఁ దగునె నీ పేరునకున్.176
ఉ. బంధువులొప్పి చైద్యునకు బాలిక నీయగఁబిల్వకేగియున్
బంధువులఁ దోలి రుక్మిణిని బైటనె తెచ్చితి మ్రుచ్చిలించి యో
బంధురశీల నీ మొదలిభార్య గదా యది యవ్వివాహ మ
బ్బాంధవసమ్మతంబె తగుపాడియె దేవర! వారెఱుంగరే!177
క. ముందా శమంతకమణీ
నిందాహృతికొఱకు నరుగ నీ వొకగుహలో
నందా భల్లుక మొసఁగదె
వందారుని గతినింజాంబవతి నది సమమే.178
ఉ. ఆ జనవార్తమానమణి నంపిన మీపయి లేనిమాట దా
నోజ ఘటించితంచు నొకయూరనె మిమ్ము భజించియుండ స
త్రాజితుఁ డిచ్చె సత్య నుదరస్థితి వేఱొక రా జొసంగెనో
రాజులఁ గెల్చి తెచ్చితివొ రాజనుతా యిది యెంతఁ సెప్పుమా.179
క. కాళింది త్రోవఁ జను నొక
బాలిక నాప్రొద్దు బట్టి భవనోచితఁగా
నేలితి వెఱుఁగుదు నాగతిఁ
గాళిందిని మీఁరు పెండ్లి గావించుటలున్.180
కం. సోదరసమ్మతగా కని
వేదితయగునట్టి మిత్రవిందను మును రా
జాదేవి మీ పితృష్వస
గాదిలిసుత నియ్యకొనుట గౌరవమేమీ !181
చ. వృషములఁ గాచు గోపతతి వీనినిఁ గట్టుట యెంతనాక తా
వృషములఁ గట్టు మంచనియె వెఱ్ఱి నృపాగ్రణి నగ్నజిత్తు నా
వృషములఁ గూడఁగట్టినను విశ్రుతి నీకును నెంత యయ్యెఁ ద
న్మిషత సుదంతఁ గైకొనితి మెచ్చులు దెచ్చెనె రాజకోటిలోన్. 182
ఉ. వారక నేనొకొక్కతఱి వచ్చివనాళిధరం జరింపుచున్,
వారల రూపశీలగుణవైఖరులెల్ల నెఱుంగుదున్ గదా
వారలు సామికిన్ వలచువారలు వారల నెన్ననేల న
వ్వారిజలోచనాచయ వివాహములున్ విదితంబులే కదా!183
ఉ. బంధువిరోధమీదు వనపాళిమృగాళితొఁ గొల్చువారితో
బంధుత గాదు త్రోవఁ జను భామినిఁ దెచ్చుట లేదు దేహసం
బంధులప్రీతి వోదు పనిమాలినయుంకువ రాదు మంచిదౌ
బాంధవ మో యదూత్తమ! కృపామతి మా సతిఁ బెండ్లియాడినన్.184
గీ. అయ్య! నీ వెంత దేవుఁడవైనగాని
చెలువ నిలువెడు ధనముఁ బోసిననుఁగాని
వనిత మీ యూరి కంపించువారు గారు
వారి యూరనె పెండ్లాడవలయు మీరు.185
క. భూవరవైరములాదిగ
నా వరవర్ణినులఁ బరిణయంబుల నయ్యెన్
దేవరవారికిఁ దెలియఁగ
శ్రీవర! మావారివిధముఁ జెప్పెద వినుమీ!186
సీ. వెలలేని మీ గుణంబులు ననంతావృత్తి
వేనోళ్ళఁ గొనియాడు వెలఁదితండ్రి
దలఁచు మిమ్మన్న నిర్మలహర్షపాకాప్తి
మీ మేనయత్త యా మెలఁతతల్లి
శివయుక్తి మీ సూక్తి శిరసావహించుఁ దా
నతిభక్తిఁ బద్మాస్యయగ్రజన్ముఁ
డెపుడు దేవునిఁగాఁ నెంతు రాత్మల మిమ్ముఁ
బ్రమదంబుతో దేవి బంధుజనులు
సేరి మీ సేమమేమైనఁ జెప్పఁ బ్రేమ
వారి కన్నులు గప్పు నవ్వారిజాక్షి
గాన మీకు మా వనితపైఁ గరుణ యున్న
సులభమగు వెంటనే వివాహకలన దేవ !187
గీ. ఇంతయును విన్నవించితే నింతమీఁద
వారి భాగ్యంబు దేవరవారి చిత్త
మెక్కువలు దెల్ప మీకు నేనెంత సుమ్ము
సర్వలోకైక భావజ్ఞ! సార్వభౌమ!188
క. అనుచు సుధామధురోక్తుల
వినిచినఁ జపలాంగి రూపవిభవం బెల్లన్
విని వివశు డగుచు యదుపతి
తనలోపల వలపుసొలపుఁ దలకొని కూర్మిన్.189
సీ. అంత దచ్చిరసూక్తికాంతాభిరుచిగురు
శ్రవణంబుననుఁ జాల సంభ్రమించి
యా యర్థమెల్ల నాద్యంతంబు నేకాగ్ర
మననంబు గాఁగ నెమ్మది ఘటించి
యా భావనావృత్తి నంతయు నిశ్చయ
ధ్యానంబునకుఁగూడ నధిగమించి
యా స్వరూపస్ఫూర్తి నటమీఁద భావైక
దర్శనంబునకు నందఁగఁదలంచి
యావిధంబున శుకబోధితానురూప
వస్తువాంఛాప్తిచే నన్యవాంఛ లెడలి
యటఁ దదీయసాక్షాత్కృతి నలవరింప
నతనుబోధైకరతి నుండె నచ్యుతుండు.190
క. హరి మానసమున నీగతి
పరమాణువలగ్నఁ దలఁచి భావభవకళా
పరమానందము నందుచుఁ
గరమాసురసికము శుకముఁ గని యిట్లనియెన్.191
క. శుకమా వదనసదృశ కిం
శుకమా హితబోధతులితశుకమా గరుదం
శుకమా తనురుచిరత్నాం
శుకమా మామకమనోజ్ఞ సూర్యాంశుకమా!192
చ. సరసతమక్రమారచనఁ జాటితి విట్లు లతాంగిరీతి నీ
విరచితసూక్తి వీనులకు విందు లొనర్చెనుఁ జిత్తమందునం
బరవశమయ్యె నన్నెటుల బాలికఁ గూర్చెదవో విచారసుం
దరగుణసారమా! మృదుసుధాసమగీరమ! ముద్దుకీరమా!193
సీ. మాధవైకాశ్రయమహిమఁ గైకొని వన
ప్రియసహవాసాప్తిఁ బెంపుఁగనుటఁ
గమలాంబకాధీనకలనఁ దత్సన్నిధి
వెలయు నెక్కుడులీల వేడ్కఁ గనుట
హరిపేరు వహియించి యారీతి నవనిలో
విఖ్యాతిఁ గాంచినవిధముఁ గనుట
విష్ణుపదావృత్తి విహరింపుచును సాధు
సుముఖరక్తి నెసంగు శుభముఁ గనుట
సతత మారామధామసంగతినిఁ గనుట
సతత మా రామ నామసంస్మృతినిఁ గనుట
నెలమి మా కాప్తతరులలో నెన్ననైతి .
వీవు మిక్కిలి శుకసంతతీంద్ర! వింటె!194
క. నీ సత్పథసంచారత
నీ సకలాగమశిఖార్థనీయఫలవిలా
సాసక్తి నీకె తగునౌ
భూసురలోకాభిముఖ్యముగ శుకముఖ్యా !195
చిలుకలు లేవె! యీవిధి విచిత్రరుచిం దగియున్నె యుండె(బో
చెలువుగ మర్త్యభాషలు వచించున కొన్ని వచించేఁబో మితో
క్తుల ననుఁగాక యుక్తు లనఁదోచునె తోచెనుఁబో నినుంబలెం
దెలివి నపూర్వవస్తువులఁ దెల్పునె యో శుకలోకశేఖరా!196
మును నినుఁ గని వెఱగందెడు
మనసున కత్యద్భుతముగ మగువ చెలువముం
గనుఁగొనినయట్ల యనఁగా
నొనఁగూర్చితి ప్రియ మొనర్చితో శుకతిలకా !197
అని మఱియు మురియుచుం దమిఁ
బెనిచిన వచనముల శౌరి ప్రియ మంగనపై
గనఁ బల్కిన విని చిల్కయుఁ
గనికర మింతిపయి నిలిచెఁగా హరి కనుచున్.198
క. ఱెక్కల సందున నిమిడిచి
తక్కువగాకుండ నెలఁత తనువిభవంబ
మ్మక్క యన వ్రాసి తెచ్చిన
యక్కాంచన చిత్రపటము హరికిం జూపెన్ .199
ఉ. చూచిటుచూపినం బటము సుందరిరూపము మున్ను కీరవా
క్సూచితమౌటకన్నఁ గడుసోద్య మొనర్ప మదిన్ గదాగ్రజుం
డాచని కూర్మి నిట్టులను నా చెలియందము గాంచి వెల్లిగా
లోచనసమ్మదాశ్రువులు లోలహృదంతరుఁడై తనంతటన్.200
క. ఔరా! యీ రాజానన
సౌరా సౌరాంగనలకు సౌరుచ్యంబుం
గూరుచుఁ దనుఁ గొల్చుటకై
చేరిన తనుకాంతి నొసఁగి చేరువనుంటన్.201
కం. నెలకున్ వెన్నెలకున్ గి
న్నెలకున్ దిన్నెలకు సొగసునెలవులు దిద్దున్
నెలత నగుమొగము నగవుం
గులుకునురోజములుఁ గటియుఁ గుటిలతలేకన్.202
క. ఈసతి కౌనునకే సరి
కేసరి నెమ్మోము కల్మికిం గల్వల సా
మే సరి మేసరిగెకు మిం
చే సరి చేససిజమురుచే సరి సిరులన్.203
ఉ. భంబు గదే నఖవ్రజ మిభంబు గదే గమనోన్నతుల్ ద్విరే
భంబు గదే కచాళి కరభంబు గదే తొడ బాగు హేమకుం
భంబు గదే కుచద్వయి నభంబు గదే యల కౌను దర్పణా
భంబు గదే ముఖం బతిశుభంబు గదే తగురీతి నాతికిన్.204
క. మృగమదము మదముఁ గదుమున్
నిగనిగమను కురుల సిరులు నెలఁత కయారే
తొగలగమిమగని జిగిబిగి
నగనగు నగుమొగము సొగసు నగకుచకె తగున్.205
క. తమ్ముల యుదరమ్ముల రుచి
రమ్ముల నగు మగువమేని రమ నిమిషములోఁ
గ్రొమ్మించుఁ జూపుబంగరు
నన్ మించున్ వీధిఁ బెట్టి యట్టిట్టనినన్.206
క. తామరసంబులు గాఁగల
తామరసము లింతి నయనతౌల్యము గనునే
తామసపుదరినఁ దిరిగెటి
సోముని మోమునకుఁబోల్చుచోఁ జేరువయే.207
క. జవరాలి నెఱుల సిరివా
సవురాలో నిగ్గుదేఱు సౌరాలోకా
సువయోమణి చనుగవజ
క్కవయో బంగారుకుండకవయో తెలియన్.208
క. ఆనన మిల రాజే లే
వేనలి మనవిభవలీల వీనులు శ్రీలే
మేను పసిఁడిలో మేలే
మానిని భాగ్యంబు శక్యమా నుతికౌలే.209
క. ఆ మధ్వాకృతి యధరము
నా మాయావాదిరీతి యట మద్యిముగా
భామామణి మో మాశ్రీ
రామానుజమండలస్ఫురణఁ దనరారెన్.210
సీ. కమలంబు చెలిమోముసమము గాఁ జని వ్రీళ
వారిమధ్యమరీతి వాడఁదొడఁగె
భ్రమరముల్ దొయ్యలి భ్రమరకంబుల లీలఁ
గనఁ బోయి కాంతతఁ గనక తిరిగె
వెలఁది వాక్యామృతవృష్టి నోడియు వచ్చి
యల కోకిల కుచద్వయాప్తి జడిసె
సతి నితంబమునకు సరిగాక విపుల దాఁ
బ్రకృతి నాదివికార పటిమ నిలిచె
కొమ్మ కెమ్మోవి దీటుఁ గైకొను నియుక్తి
రక్తికై ద్రాక్ష మును రూపయుక్తిఁ గనియుఁ
గఱకు నలుపెక్కు నీరసకలన నందెఁ
గాన నిబ్బోటికిని సాటి గలరె జగతి.211
క. ఏ వగలఁ జిక్కెఁ గుముదం
బే విధిఁ బూనెఁ దమిఁ బద్మమిట జడగతి మీ
నావళి యేటికి లోఁబడె
నీ వనిత విలోచనముల కెన దామగునే.212
క. దీని కుచాలింగనసం
ధానతసుఖమంది దీని తనుశృంగార
శ్రీ నెల్లఁ గొల్ల లాడని
యీ నా దుర్గంబు లేల యీ ధనమేలా.213
క. అని యా వనజేక్షణుఁడా
వనజేక్షణ రూపవిభవవైఖరులెల్లం
దన కనురూపం బనుచుం
దనరుచుఁ దలయూచుఁ జూచుఁ దలఁచున్ వలచున్.214
క. తిలకించి యటుల బాలిక
నల కాంచనవసనలసితుఁ డప్పుడు చంచ
త్పులకాంచితుఁడై తమి ని
మ్ములఁ గాంచి శుకంబుతోడ ముదమున ననియెన్.215
క. ఒకటిగ మాకు లతాంగిన్
సకళాదృతి గూర్చి ప్రోవఁ జాలితివేనిన్
సుకృతఫల మబ్బు నీకును
శుకవిప్రవరా రసోక్తి సుకవిప్రవరా!216
క. భావపుఁజిత్తరు బొమ్మకు
జీవకళల్ గూర్చి దీని చెల్వము గనఁగా
భావింతు నిపుడయైనా
నా వనజాననకుఁ దుల్య మౌనో కాదో! 217
క. ఈ వనితామణిఁ గూఱిచి
జీవము సుఖగతి నొనర్పు చెప్పెడిదేమీ
నీవే హరివై యుండెద
వావల నా రాజ్యవిభవ మంతయు నిత్తున్.218
గీ. అనిన శుకవతంస మా యదూత్తంసున
కిట్టు లనియె వినయ మినుమడింప
నింతఁ జెప్పవలెనె యింతిపైఁ బలుమాఱు
మారుజనక మిగుల మమత జనక.219
క. మా కన్నియకుం గూరిమి
నీకన్నన్ మున్న కలదు నీవార్తల మే
లూకొన్నదాఁక సమ్మతి
గైకొన్నదొ లేదొ సుదతిఁ గనఁ జనవలయున్.220
క. చెలి నాతోఁ గూరుచుమని
లలి నాతోఁ జెప్పి చెప్పి లంచం బియ్య
న్వలె నాదేవకి సూతీ!
లలనాసుమహేతి నాతి లాఁతియె చెపుమా!221
క. చంచత్కువలయముఖ భో
గాంచదసమసాధనంబులన్నియు మిమ్ముం
గాంచినపుడున్నవే కద
పంచాయుధజనక మీ కృపయె చాలునికన్.222
వ. అదియునుంగాక 223
గీ. అకలుషపువస్తు విచ్చెద వంటివేని
నీకుఁ గామార్ధదౌత్యంబు నెఱపినాఁడ
సరికి సరిజేయుటే చాలు శౌరి! నాకు
నీవు మోక్షార్థదౌత్యంబు నెఱపవయ్య.224
క. ఏ పరమేశుకరాదృతి
నా పరమేష్టియును గోరు నది గని ముక్తి
వ్యాపారమె కోరెద మది
మా పక్షుల ధర్మ మిది సుమా పరమాత్మా!225
గీ. అనుచు నయము నయము వినయంబు నెనరు
దోపఁ బల్కి భక్తితోడ మ్రొక్కి
చేరియున్నఁ జూచి శౌరిహాసరుఁజూచి
తాననమున శుకము నాదరించి.226
గీ. అంత నారామసందర్శనాభిలాష
దిరుగు శౌరి మనంబునం దిరవు పారి
తనరు ఘనతాపభరమునఁ దన పురమున
కరిగె నా రామ సందర్శనాభిలాష.227
గీ. అటులఁ జనుచు రమ్మటంచుఁ దన్నుఁ బ్రియంబు
నానతీయ మాట నానతీయ
హర్షలహరితోడ హరితోడ ద్వారక
కేఁగునపుడు చిలుక హితవుఁ జిలుక.228
క. యాదవులన్ హరికెదురై
యా దవులన్ వచ్చువారి నారయుచు విలా
సాదరణమ్ముల వారి ప్ర
సాదరమం జనుచు శౌరిసౌరుం గనుచున్.229
క. ఈ యాదరణం బీ గుణ
మీ యాదృతమందహసన మీ విలసనమున్
మాయాదవహృతి కరుఁడగు
మా యాదవపతికిఁ దగు సుమా యని మఱియున్.230
సీ. ఎల్లలోకనికాయ మేలువాఁ డజుఁ గన్న
మేలువాఁ డడభవు సామేలువాఁడు
మేని దువ్వలువ క్రొమ్మించువాఁ డమరుల
మించువాఁ డసుర బొమ్మించువాఁడు
నల తమ్మిసూడుదోడాలువాఁ డహినొంపు
డాలువా డసితంపు డాలువాఁడు
నిజభక్తకోటి మన్నింపువాఁ డల ప్రేమ
నింపువాఁ డట్టిలోనింపువాఁడు
నామదారివి దారిగదారిధారి
యదుకులోద్ధారిదారిదయావిహారి
సీరిసహచారి యయ్యె నీసిరిమురారిఁ
జేరి యీ శౌరి నెన్న నెవ్వారి వశము.231
మ. పదముల్ జంఘలు జాను లూరులు కటీభాగంబు మధ్యంబు నా
భి దరల్ కుక్షి యురంబు హస్తభుజముల్ వీపున్ గళం బోష్ఠముల్
వదనం బక్షులు నాస చెంపలు శ్రుతుల్ ఫాలంబును న్మౌళి సొం
పొదవన్ సుక్రమలీలఁ జెన్నగుఁ గదే యూహింప నీ శౌరికిన్. 232
మ. అసమానశ్రుతికల్పశాఖికిఁ జిగుళ్లౌగా పదాబ్దంబు ల
య్యసదౌ కౌనుబెడంగు సింగములు నుడ్డాడించు మించున్ భుజో
ల్లసనం బబ్ధితరంగరేఖ శశి నుల్లంఘించు మోముం గటా
క్షసుధాసేచనముల్ విలోచనము లాకర్ణాంతముల్ సామికిన్.233
ఉ. చేరలఁ గొల్వవచ్చు దయ చిప్పిలు గొప్పకు గొప్పకన్నులున్
మూరలఁ గొల్వవచ్చుఁ గడు ముచ్చట లిచ్చు వెడందవక్షమున్
బారలఁ గొల్వవచ్చుఁ గచపాళి భళీ హరికిన్ సమీపపున్
మేరలఁ గొల్వవచ్చు నిఁక మేలితఁ డీగతిఁ బ్రీతిఁజేసినన్.234
క. రసికాగ్రేసరుఁడౌరా
రస నీ వసుదేవసుతుఁడు రమణీయగుణో
ల్లసితుఁ డితని రూపము దా
న సదృశ మాయబ్జసదృశ కనురూప మగున్.235
క. అని యీగతి నుతియింపుచుఁ
జని యా కీరంబు శౌరి సాంగత్యంబుం
గని యా వనరాశితటాం
తనియామకుశస్థలాఖ్య ధరణీసరణిన్.236
ఉ. ద్వారక ద్వారకాంతయదుదారక శౌరికటాక్షనీతబృం
దారక ఘోరకల్మషవిదారక భూరికళాంక భూమిబృం
దారక సారకీర్తిమహిదారక వైరి కుటన్నటోరుభూ
దారకఁ జేరి కాంచె సముదారకకీరకులేంద్ర మంతటన్. 237
ఉ. హీరసుధానులేపములు నింద్రమణీరుచిధూపముల్ ప్రవా
ళారుణధాతువల్లికలు నంచితమౌక్తికరంగవల్లిక
ల్గారుడరత్న తోరణ కలాపము లంబుజరాగదీపముల్
దారిచి భూరిచిత్రమగు ద్వారవతీపురిఁ గీర మేగుచున్.238
సీ. ఇది వసుదేవునిల్లెదుట ముక్తాబద్ధ
మిది యుద్ధవుం డుండు హేమధామ
మిది బలు నిలయేంద్ర మింద్రనీలవిశాల
మిది సాత్యకివిహారహీరగేహ
మిదియ ప్రద్యుమ్నుఁడున్నది విడూరాగార
మిది గదు మరకతాదృతనివేశ
మిదియు నక్రూరుని యిందుకాంతనిశాంత
మిది యాదవుల చిత్రసదనవీథి
గిరుల నడుమనుఁ దగు మేరుగిరియ పోలి
మహితమణి హేమదీప్తుల మహి వెలుంగు
నది మురాంతకు దివ్యశుద్ధాంత మనుచుఁ
బౌరులు వచింపఁ గనుచు నక్కీర మచట.239
క. పలువింతలు గల చెంతలు
బలుకాంతులు మణినిశాంతఫలకాంతలస
త్కళ లెంతయుఁ దొలకం బురి
చెలువంతయుఁ జూచెఁ జిలుక చిత్రత చిలుకన్.240
క. ఈ రీతిం ద్వారవతిం
గీరవతంసంబు దిరిగి కీలితకద్రూ
జారిధ్వజారమగు దను
జారిహజారంబుఁ జేరి యచ్చటనచటన్.241
చ. హరపరమేష్ఠి వాసవముఖామరలోకములందునుంచి
హరిఁ గొలువంగ వచ్చి మును పచ్చటనచ్చటఁ దన్నెఱుంగు వా
రెఱిఁగి సఖా! శుకాగ్రణి యటెన్నడు రా వెటు వచ్చితన్న నీ
హరినిఁ గనంగ వచ్చితి నటంచుఁ బ్రియోక్తి నెఱుంగఁ జెప్పుచున్.242
వ. అప్పుడా సుపర్ణవర్ణనీయంబగు దివ్యవిహంగరాజంబు విష్వక్సేనాభి
పాలితంబును, విరాజితానంతభోగవిభవంబును, విజయ ముఖ్యవిశిష్ట
జనాధిష్ఠిత ద్వారనివహంబును, సనందనాది సుకృతి సందోహ విహా
రంబును, నతిలోకప్రకాశంబునునై వైకుంఠప్రదేశంబు ననుకరింపనగు
నగధరు నగరుఁ జొచ్చి హెచ్చిన నిజామోదంబున నా దేవు సదయ
ప్రసాదంబున ననిరోధగతిం దదీయావరోధనివేశంబుఁ బ్రవేశించి
యంత.243
ఉ. అచ్చట భోజకన్య మొదలౌ హరిపట్టపురాండ్ర నార్వురం
బొచ్చెము లేని కూర్మి నొక పొందికగా మఱుమాట బెట్టిరా
వచ్చినవార్తఁ జెప్పి కనవచ్చితి మిమ్మని చేరి వారు లో
నచ్చెరువంది తన్నుఁ గన నందఱ నన్నిట మెచ్చఁజేయుచున్. 244
క. ఆ హరిణాక్షులకును మఱి
యా హరికినిఁ దనకుఁ గల్గు నతిశయవిద్యా
సాహిత్యము గానకళా
సాహిత్యము దెలుపఁదలచి చని శుక మనియెన్.245
మ. సరసస్ఫూర్తి సరస్వతీయువతికిన్ సంగీతసాహిత్యముల్
వరవక్షోజయుగంబ నాఁబఱగు విద్వద్బాలవృద్ధిక్రియా
కరసంపజ్జనకంబు లందొకటి ద్రాక్షాగుచ్ఛమాధుర్యవై
ఖరి వేఱొక్కటి నారికేళఫలపాకవ్యాప్తిసౌఖ్యం బిడున్.246
క. శిశువులకుం బశువులకున్
వశమై సొక్కించు గానవైఖరి మధురా
తిశయము సాహిత్యరుచిన్
భృశగతి సర్వజ్ఞుఁడైన నెఱుఁగంగలఁడే!247
మ. సరసాలంకృతిబోధ సేకుఱుఁ గళాచాతుర్యముల్ దోచు వా
క్యరసజ్ఞత్వము గల్గు భావగతి నాహ్లాదం బిడుం జిత్రవై
ఖరి కావ్యంబు లొనర్పు నేర్పు గలుగుం గల్పించు రాజప్రియం
బిరవై దుర్వ్యసనం బడంచు భువి సాహిత్యంబు సామాన్యమే.248
క. ఆ సాహిత్యశ్రీకన్
భాసురకవితావిలాసపాండిత్యము ను
ల్లాసింప సువర్ణమునకు
నా సౌరభ మెనసినట్టులగు నని మఱియున్.249
ఉ. తనరన్ వ్యాకరణజ్ఞుఁ దండ్రి యనుచుం దర్కజ్ఞుఁనిం భ్రాతయం
చును మీమాంసకుని న్నపుంసకుఁ డటంచున్వీడి దూరంబునం
గని యస్పృశ్యునిఁబోలె ఛాందసుని వేడ్కం గావ్యలీలారస
జ్ఞు నిజేచ్ఛం గవితావధూమణి వరించున్ భావగర్భంబునన్. 250
వ. కావున 251
చ. పలుకుల రీతి యర్థములభంగి రసంబుల పెంపు భావపుం
జెలువము లాశయంపురుచి శీతలవైఖరి ప్రౌఢమార్గమున్
లలితచమత్కృతుల్ దగు నలంకృతులుంగని సత్కవీంద్రులన్
మెలఁకువఁ గాంచి భూవరులు మెచ్చిన విద్యలు విద్యలౌ గదా! 252
క. అని తన కవితాచాతురి
వనజాక్షుని భార్యలైన వనజాక్షుల పై
వినుతప్రబంధరీతుల
నొనరింపుచు మఱియు గీతయోగ్యస్ఫూర్తిన్.253
సీ. శ్రీరాగరంజన శ్రీరమ్యతరరీతి
యారతానేకముఖారిలీల
సారంగపోషణ స్వారస్య విభవంబు
పున్నాగశయ్యా సమున్నతియును
నమృతసంగతి మోహనారూఢవైఖరి
నిఖిలనాటకసూత్ర నిరతిరచన
నియతిలో కాంభోజినీవరాళిస్థితి
భూపాల సరసానుభూతికలన
లాదిగాఁ దాళ సద్గతిప్రాణపదము
గాఁగ ననురాగగతి మిత్రగరిమ దనర
వరకవిత మీఱ కీర మా పురుషమౌళి
మీఁద బహుపదపాళి నమ్మెయి రచించి.254
క. అంగనలకు హరికినిఁ దన
సంగీతము వినఁగఁజేసి చాన లిడు మణీ
సంగతభూషలు గొని ది
వ్యాంగద మచ్యుతుఁ డొసంగి యంఘ్రి ఘటింపన్.255
గీ. దానిఁ గైకొని యంత సౌందర్యదర్ప
మేర్పడఁగ శౌరి పట్టపుటింతు లొక్క
మాటనెపమున నెవ్వారు దీటు మాకు
సుందరత నన్న వారి కా శుకము వలికె.256
క. కలుగుదు రొకతఱి తమకౌ
తలఁ జక్కనివారు తాడుదన్నెడివారిం
దలఁదన్నువారు లేరే
వలదీ గర్వంబు లెంతవారలకైనన్.257
గీ. అనుచు నర్మోక్తిగాఁ బల్క నా శుకోక్తి
వారు విస్మయపడియుండ వీరికన్న
కన్య లావణ్య మెక్కుడౌగా యటంచు
హరియు సన్నకు సన్నలో నెఱిగె నంత.258
వ. మఱియు నత్తఱి నా కీరసత్తమంబు తమ మత్తకాశినిం దలంచి
పురుషోత్తమపదాయత్తంబగు చిత్తంబు మెత్తమెత్తన మఱలించి,
యందరిచేత ననుజ్ఞాతంబై యా నందనందను నభినందింపుచుంజనియె
నవ్విధంబున.259
ఉ. కీరము శౌరి వీడుకొని కేకయరాట్పురమార్గచారమై
దూరము బోవ దాని వెను దూకొనుచూడ్కులు నెట్టకేలకుం
జేరగఁదీసి యయ్యమరసేవితుఁ డయ్యెడఁ గాంత లెంతయేఁ
జీరఁగ భోజనాదికము సేసి యొకానొకరీతి నంతటన్.260 260
సీ. సతి నితంబము నెంచి చక్రంబు మఱచెఁబో
గళ మెన్నికొనుచు శంఖమును మఱచెఁ
గలికి నూగారెంచి ఖడ్గంబు మఱచెఁబో
బొమ లెన్నికొనుచు శార్ఙ్గమును మఱచెఁ
నతివ వాక్సుధనెంచి యశనంబు మఱచెఁబో
ప్రభ నెన్నికొనుచుఁ బైపటము మఱచె
భామ మధ్యంబెంచి భావంబు మఱచెఁబో
నెఱులెన్నికొనుచు దేహరమ మఱచెఁ
బడఁతి ముఖమెంచి రాజసంపదలు మఱచెఁ
దరుణి సురతాప్తినెంచి భూస్థిరత మఱచె
మఱచె నారామ మదిఁజేఱ మఱియు నన్ని
హరియుఁ గీరార్పితోపదేశాభిరతిని.261 261
క. శుకబోధితార్థమననే
చ్ఛకు హరి సనఁడయ్యె నొక్కసతి గృహమునకున్
శుకబోధితార్థమననే
చ్ఛకుఁడగు నతఁ డిచ్చఁ జనునె సతిగృహములకున్.262 262
సీ. సుందరీద్యుతి రుక్మసోదరమై మించ
భోజకన్యాసక్తిఁ బూనఁడయ్యె
సతి హాసరమ ఋక్షజాతాప్తి నిరసింప
జాంబవతీప్రీతి సలుపఁడయ్యె
నతివ గుణాళి సత్యౌచిత్యగతి హెచ్చఁ
దలచి సాత్రాజితిఁ దలఁచఁడయ్యె
నాతి నడక హంసజాతివృత్తిని మీఱఁ
బ్రేమ కాళిందిపైఁ బెనుచఁడయ్యె
సఖిముఖస్పూర్తి కరవిందసహజరేఖ
కడమగుట మిత్రవింద లెక్కగొనఁడయ్యె
వనిత మాట సుదంత యెంతనుటఁజేసి
నాగ్నజితిఁ జెందడయ్యె నా నందసుతుఁడు.263
వ. మఱియును
సీ. తలఁచిన వస్తువుల్ గలిగియుఁ జెలిమోవి
ఖండచక్కెరలకే కోరుచుండు
నఖిలదుర్గములు చేనందియుఁ గామినీ
స్తనదుర్గములకె యత్నంబు దలఁచుఁ
దఱుచైన నిలువుటద్దములు గాంచియు నింతి
చెక్కుటద్దముల నీక్షింపఁగోరు
బహుమూలధనము సంపద విఱ్ఱవీఁగియు
నతివ నీవీప్రాప్తి కాసఁజేయు
నప్సరలకన్నఁ గడు సుందరాంగులెంద
రేనిఁ గల్గియు నువిదతో నెనయఁ దివురు
చెలియ శృంగార మెంతయో తెలియరాదు
కంతుజనకుఁడు మదినిరా భ్రాంతిజెందు.264
క. ఈ లీలన్ బాలికపై
బాళికలిమి నంది నందబాలకుఁ డంతన్
వాలాయము వలరాయని
వాలాయము సోకి ధైర్యవప్రం బగలన్.265
సీ. పాలవారాశిలోఁ దేలియుండిన మేటి
ప్రేమాంబురాశిలోఁ బేర్చి లేచు
చెరలాడి వచ్చు కార్చిచ్చు మ్రింగిన దంట
విరహాగ్ని వెచ్చన వెచ్చనూర్చు
మాయాంధకారంబు మాయఁజేసిన భర్త
కామాంధకారమగ్నత వహించుఁ
దఱుచైన భవపరితాప మార్చిన ప్రోడ
మదనతాపంబున మది గదించుఁ
బకృతిబోధంబు నెల్లవారల కొసంగుఁ
దాపసగురుఁడు బోధంబు దక్కనుండు
నచ్యుతుఁడు కైకయీ వియోగాప్తిఁ గనుట
నకట సతిఁబాయు టభవునకైనఁ దరమె.267
క. ఒక హరి నిలిచెన్ మోమున
నొక హరి మధ్యమున నొదిగె నొక హరి వాచా
నికరగతి నరిగె ననఁగా
నిఁక నీ హరి చిక్కుటరిదె యీ చెలిచూడ్కిన్.268
క. మనుజుల సంవత్సరమొక
దినముగ లీలలు ఘటించు దేవాగ్రణికిన్
వనితాదరసుధ నానమి
దిన మొక యేఁడయ్యె మఱచె దేవత్వంబున్.269
క. హరిణాక్షి నెంచు మధ్యము
హరియంచుఁ దలంచు మఱియు నానన మెంచున్
హరియంచుఁ గాని తన్నున్
హరియంచుఁ దలంచ డయ్యె హరి యించుకయున్.270
క. జనని నొక సవతిఁ గూఱుచు
పనిగా నితఁ డనుచు మరుఁడు పగచేఁబోలెన్
జనకుఁడనక నిగుడించెన్
వనజోదరు మదిని గాడ వాడిశరంబుల్.271
క. హరిపైఁ బంచాయుధములు
మరుఁ డురువడిఁ బఱప సమయమహిమముగొలఁదీ
హరిపంచాయుధములలో
గుఱిగా నొకటైన మాఱుకొనలేవయ్యెన్.272
వ. అయ్యెడ.273
క. చెలిఁ దలఁచుఁ దలఁచి యేవిధిఁ
గలుగునొ తల్లభ మనుచుఁ గడుఁ దర్కించుం
జిలుకదె భారంబని ని
శ్చలపడు హరి మఱియు భోగసంగతులెంచున్.274
గీ. ఇటులఁ బటులక్ష్యమెద దాని నెన్న డేని
తమ గృహములన్న మదినైనఁ దలఁచకున్న
వెన్నుని విహారములు గాంచి వెలఁదు లెంచి
తలఁచి రిట్లని మదిలోనఁ దమకమూన.275
ఉ. ఎక్కడనుండి వచ్చెనొ కదే యల కీరము మేటిదాయ మా
కక్కడ కన్నుసన్నలు రహస్యములున్ హరితోడఁజేసెఁ దా
నిక్కువ మెన్నిపోకడలు నేర్చినదా పలువన్నెలాడి మా
చక్కని సామి కెయ్యదియొ జాలిఘటించెఁ గదే మనంబునన్.276
క. నే మున్నీసడిఁ దెలిసితిఁ
జామరొ! మనతోడ నెక్కసక్కెములాడెం
గా మాయలశుక మప్పుడు
దామోదరుఁడల్ల నవ్వి దానింజూచెన్.277
క. ఔనౌనని యొకరికొకరు
మానిను లిటు దలఁచి తమదు మనసులఁ దార్కా
ణైనం గని నిచ్చలు న
చ్చో నాథుని శుభము లరయుచుం దగి రెలమిన్.278
చక్రబంధ చిత్రశార్దూలవృత్తము
సత్యోపేతసుకేళి సోత్కరశమీ సంవిద్విచార్య ప్రధీ
నిత్యోదంచిత శర్మమందిర సుపాణీనుత్యభా కష్టమా
సత్యానాథ నవస్వభూతిరసలక్ష్యాతీర్థ రీతీఖనీ
నీత్యుల్లాస విధానితల్ప సమకంధీపశ్య మాభామినీ.279
ఛత్రబంధ చిత్రకందము
దారవతనువథ జయజయ
సారశమ సమగ్రమహిమ శరహాసరసా
సారసహారసుకరభా
భారకసురసాయ జయజ భవనుతవరదా!280
గోమూత్రికాబంధచిత్రసుగంధివృత్తము
శ్రీరమారసాత్యగత్య సేవ్యభావ్యలక్షణా
సారదీప్త సారసాప్త సారసారి వీక్షణా
ధీరవారనుత్య సత్య దివ్యభవ్యరక్షణా
వైరదృప్త నీరగుప్త వారణారిశిక్షణా.281
ఇది శ్రీమదుభయకవితా నిస్సహాయసాహితీవిహార
కాణాదాన్వయ తిమ్మనార్య కుమార వినయ
గుణధుర్య పెద్దనార్యప్రణీతంబైన
భద్రాపరిణయోల్లాసంబగు
ముకుందవిలాసంబను
మహాప్రబంధంబునందు
ద్వితీయాశ్వాసము
సమాప్తము.