మీనాక్షీ పంచరత్నం

(మీనాక్షీ పంచరత్న స్తోత్రం నుండి మళ్ళించబడింది)

మీనాక్షీ పంచరత్నం


ఉద్యద్భానుసహస్రకోటిసదృశాం కేయూరహారోజ్జ్వలాం

బిమ్బోష్ఠీం స్మితదన్తపంక్తిరుచిరాం పీతామ్బరాలఙ్కృతామ్|

విష్ణుబ్రహ్మసురేన్ద్రసేవితపదాం తత్త్వస్వరూపాం శివాం

మీనాక్షీం ప్రణతొఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిమ్||౧||


ఉదయించుచున్న వేలకోట్ల సూర్యులతో సమానమైనది, కంకణములతో, హారములతో ప్రకాశించుచున్నది, దొండపండ్లు వంటి పెదవులు కలది, చిరునవ్వు లొలుకుదంతముల కాంతి కలది, పీతాంబరములను ధరించినది, విష్ణు- బ్రహ్మ- దేవేంద్రులచే సేవించబడునది. తత్త్వస్వరూపిణియైనది, శుభము కల్గించునది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.


ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేన్దువక్త్రప్రభాం

శిఞ్జన్నూపురకిఙ్కిణీమణిధరాం పద్మప్రభాభాసురామ్|

సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం

మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిమ్||౨||


ముత్యాలహారాలు అలంకరించిన కిరీటముతో శోభించుచున్నది, నిండు చంద్రుని వంటి ముఖకాంతి కలది, ఘల్లుమంటున్న అందెలు ధరించినది, పద్మములవంటి సౌందర్యము కలది, కోరికలనన్నిటినీ తీర్చునది, హిమవంతుని కుమార్తెయైనది, సరస్వతి- లక్ష్మీదేవులచే సేవించబడుచున్నది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.


శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీకారమన్త్రోజ్జ్వలాం

శ్రీచక్రాఙ్కిత బిన్దుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీమ్|

శ్రీమత్షణ్ముఖవిష్ణురాజజననీం శ్రీమజ్జగన్మోహినీం

మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిమ్||౩||


శ్రీ విద్యాస్వరూపిణి, శివుని ఎడమభాగమునందు నివసించునది, హ్రీంకార మంత్రముతో ఉజ్జ్వలమైన్నది, శ్రీచక్రములోని బిందువు మధ్య నివసించునది, ఈశ్వర్యవంతమైన సభకు అధిదేవతయైనది, కుమారస్వామి- వినాయకులకు కన్నతల్లియైనది, జగన్మోహినియైనది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.


శ్రీమత్సున్దరనాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం

శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్యానుజామ్|

వీణావేణుమృదఙ్గవాద్యరసికాం నానావిధాడమ్బికాం

మీనాక్షీం ప్రణతొఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిమ్||౪||


సుందరేశ్వరుని భార్యయైనది, భయము తొలగింపచేయునది, జ్ఞానము నిచ్చునది, నిర్మలమైనది, నల్లని కాంతి కలది, బ్రహ్మదేవునిచే ఆరాధించబడునది, నారాయణుని సోదరియైనది, వీణ- వేణు- మృదంగవాద్యములను ఆస్వాదించునది, నానావిదములైన ఆడంబరములు కలది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.


నానాయోగిమునీన్ద్రహృన్నివసతిం నానార్థసిద్ధప్రదాం

నానాపుష్పవిరాజితాఙ్ఘ్రియుగళాం నారాయణేనార్చితామ్|

నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్త్వాత్మికాం

మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిమ్||౫||


అనేక యోగుల- మునీశ్వరుల హృయములందు నివశించునది, అనేకకార్యములను సిద్దింపచేయునది, బహువిధ పుష్పములతో అలంకరింపబడిన రెండుపాదములు కలది, నారాయణునిచే పూజింపబడునది, నాదబ్రహ్మస్వరూపిణియైనది, శ్రేష్ఠమైనదాని కంటే శ్రేష్ఠమైనది, అనేక పదార్థముల తత్త్వమైనది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.

జయ జయ శఙ్కర హర హర శఙ్కర

మూలాలు

మార్చు