మీఁగడ తఱకలు/కృష్ణరాయల విద్యాగోష్ఠులు

8

కృష్ణరాయల విద్యాగోష్ఠులు

- 1 -

కృష్ణరాయలయాస్థానమున నెనమండ్రు తెలుఁగుకవీశ్వరు లష్టదిగ్గజము లనుపేర వెలసియుండి రనులోకప్రతీతిని వీరేశలింగము పంతులుగారు విశ్వసింపకపోయిరి. కృష్ణరాయఁడు కవితాప్రియుఁడు గాన యాయనయాస్థానమందు లేకున్నను బలువురుకవీశ్వరుల నప్పటి వారినిగా భావించి పామరలోకము కట్టుకథలు కల్పించె నని వారు తలంచిరి. వీరేశలింగముపంతులుగారితలఁపు యుక్తమయినది కా దని యిప్పుడు స్పష్టముగాఁ దెలియవచ్చుచున్నది.

చాటుపద్యమణిమంజరి ద్వితీయభాగమునఁ గందుకూరి రుద్రకవిచరిత్రమును నేను రుద్రకవివంశ్యులకడనుండియే కైకొని ప్రకటించితిని. రాయలయాస్థానమునం దష్టదిగ్గజము లనఁబడునెనమండ్రు కవులలో రుద్రకవి యొకఁ డనియు, నాతఁ డీశాన్యసింహాసనాసీనుఁడై యుండువాఁ డనియు నందుఁ గలదు. అనఁగా రాయలసభాస్థాన మగుభువనవిజయమున నెనిమిదిదిక్కుల నెనిమిదిసింహాసనము లుండెడి వనియు, వానిపై దిగ్గజము లనఁబడు నెనమండ్రుకవులు నాసీనులై యుండెడివా రనియు నర్థమగుచున్నది. రుద్రకవిచరిత్రమే కాక యీక్రింది శాసనశ్లోకముగూడ రాయలయాస్థానమం దష్టదిగ్గజము లనుకవు లుండెడివా రని తెల్పుచున్నది.

శ్లో|| యత్కీర్తి ర్భువనైకభూషణ మభూ ద్యస్య ప్రసాదా న్నరా
      స్సర్వే రాజసమానతా ముపగతా స్సంప్రాప్య విత్తం బహు
      య స్యాష్టౌ కవిదిగ్గజాః పృథుయశోభారా జగచ్చోభనా
      యద్దానోదక సామ్య మేవ సరితా మాసేతుశీతాచలమ్.

ఈశ్లోకము రాయలు నందిదుర్గమున సోమశంకరస్వామికి నాలయము కట్టించినప్పుడు చెక్కించినశాసనమం దున్నది. ఆశాసనము వ్రాఁతప్రతి ప్రాచ్యలిఖితపుస్తకశాలలో నున్నది. కృష్ణదేవరాయఁడు రచించినదిగా జాంబవతీకల్యాణ మని సంస్కృతనాటక మొకటి కలదు. తంజావూరులైబ్రరినుండి దాని ప్రతిని గొనివచ్చి శ్రీమానవల్లి రామకృష్ణకవి గారు చెన్నపురిలైబ్రరికొసంగిరి. దానిలోఁ బ్రస్తావన కొంత గ్రంథపాతములు గలిగి యున్నది. గ్రంథకర్త కృష్ణరాయఁ డనియే యం దున్నది. కాని గ్రంధాంతమం దీశ్లోక మున్నది

శ్లో|| శేషక్ష్మాధరనాయకస్య కృపయా సప్తార్ణవీమధ్యగాం
      రక్షన్ గామిహ కృష్ణరాయనృపతి ర్జీయా త్సహస్రం సమాః

ఈ నాటకము ప్రాకృతబహుళమై సంస్కృతచ్చాయు లేక గ్రంథపాతములతో నున్నది. కాన ససిగా ముద్రించుట దుష్కరము. దీని నేను జదివితిని. కృష్ణుఁడు జాంబవతిని బెండ్లాడుట యిందలికథావస్తువు. కథానాయకుc డగుకృషఁడు కృష్ణదేవరాయఁడుగాను, నాయిక యగుజాంబవతి ప్రతాపరుద్రగజపతి కుమార్త యగుభద్రాదేవిగాను నాకు స్ఫురించినది. ఈదృష్టితోఁ జాడఁగా నాటక మెల్ల శ్రీకృష్ణదేవరాయలకథను జెప్పునదిగా సమన్వయింపఁదగినట్లు నాకు గోచరించినది. అయినను నీవిషయ మింకను బరిశోధింపఁదగినది.

- 2 -

కృష్ణదేవరాయలు సాహిత్యమందే కాక సంగీతమందును మిక్కిలి యభిరుచి గలవాఁడు. ఈయన యాస్థానమున బండారు లక్ష్మీనారాయణుఁ డని యొక సంగీతవిద్వాంసుఁ డుండెను. రాయల యంతఃపురస్థానమున నాయన నాట్యరసాధిపత్యము వహించి యుండెడువాఁడు. ఆతఁడు రచించినది సంగీతసూర్యోదయ మని యొకసంస్కృతగ్రంథ మిప్పుడు దొరకినది. దానిపీఠికలో విద్యానగరము, కృష్ణరాయల దిగ్విజయములు వర్ణితము లయినవి. రాయల దిగ్విజయవర్ణనములలో నపూర్వవిషయము లొండు రెండు గానవచ్చుచున్నవి. సంగీతసూర్యోదయకారునకు నభినవభరతాచార్య, రాయబయకార, తోడరమల్ల, సూక్ష్మభరతాచార్య బిరుదములు గలవు. కృష్ణరాయ లీయనకు బంగారుపల్లకీ, ముత్తెసరుల జల్లులు గలవి రెండు ముక్తాతపత్రములు, మదపుటేనుఁగులు, మలహరీవాద్యము నొసంగెను. ఈయన విష్ణుభట్టారకులయొద్ద దత్తిల కోహలాది భరతమతగ్రంథములను సవ్యాఖ్యముగా నధ్యయనము చేసినాఁడు. తాళాధ్యాయము, నృత్తాధ్యాయము, స్వరగీతాధ్యాయము, జాత్యధ్యాయము, ప్రబంధాధ్యాయము నని యయిదధ్యాయములతో నీతఁడు సంగీతసూర్యోదయము రచించినాఁడు. ఈయన గ్రంధావతరణిక నుండి కొన్ని శ్లోకములు.

శ్లో|| కర్ణాటాహ్వయదేశసౌఖ్యజననీ శ్రీతుంగభద్రావృతా
      మాతంగోన్నతమాల్యవత్ క్షితిధర శ్రీహేమకూటాన్వితా
      పంపాధీశ్వరవిట్ఠలేశ్వరకృపాదృష్టి ప్రభామండితా
      శ్రీవిద్యానగరీ విభాతి ధరణీధమ్మిల్ల మాణిక్యవత్
             * * * * *
శ్లో|| బాల్యే ౽ సౌ సకలకలాకలాపయుక్త
      స్సప్రా(త్రా?)ణం సపది విజిత్య గంగరాజం
      భఙ్త్య్వౌ తచ్చివనసముద్ర ముత్కటం ద్రా
      గావాసం వ్యతనుత నిర్భరం శివానామ్.

శ్లో|| దుర్గం జిత్వా థ సో౽ సా వుదయగిరివరం తత్ర రాహుత్తరాజం
      బందీకృ త్వాశుహృత్వా యుధి నగరవరే కొండవీడ్కొండపల్ల్యౌ
      జీవగ్రాహం గృహీత్వా గజపతితనయం పొట్టునూర్పట్టణాగ్రే
      విశ్వశ్లాఘ్యప్రతాపో బిరుదయుతజయ స్తంభ ముచ్చై ర్ద్యఖానీత్,

శ్లో|| సో౽ యం కృష్ణనరేశ్వరో గజపతిం జిత్వా తదీయశ్రియా
      సాకం తస్య సుతా ముదూహ్య యవనక్ష్మాపం సపాదం తతః
      గొబ్బూరుస్థలవాసినం సరభసం జిత్వా ను విద్రావ్య తం
      హ స్త్యశ్వాన్ స తదీయదుర్గ మతులం.... మారు మాదత్తవాన్.

శ్లో|| కృష్ణాముత్తీర్య సో౽ యం యవనజనపదం వహ్నిసాత్కృత్య సర్వం
      పేరోజాంబాదసించాద్వరు (?) నగరసమాఖ్యాని దుర్గాణి జిత్వా
      భజ్‌క్త్వోచ్చైః పారసీకం కలుబరగపురీం ద్రాక్సపాదార్ధమానః?
      కాంతా(క్రాంత్వా?) వ్యాకృష్టవాన్ దోర్బలఘనత్రీన్ సురత్రాణపుత్రాన్

గ్రంథకర్త



శ్లో|| తస్య శ్రీకృష్ణరాయస్య కృపాక్షీరాబ్దిచంద్రమాః
      లక్ష్మీనారాయణో నామ వర్తతే సరసాగ్రణీః
      సదా౽ భినవశబ్దాదిభరతాచార్యనామకమ్
      బిరుదం ధరణీచక్రే ధత్తే చక్ర మి వాచ్యుతః||

శ్లో|| శ్రీమత్కృష్ణనరేశ్వరస్య దయయా స్వర్ణాంచితాం పాలకీం
      ముక్తాగుచ్చకృతానుబద్ధవలయం ముక్తాతపత్రద్వయమ్
      శశ్వన్మత్తమతంగజా నలహరీవాద్యం నిజాంతఃపుర
      స్థానే నాట్యరసాధిపత్య మసకృ ల్లక్ష్మీపతిః ప్రాప్తవాన్

శ్లో|| సంగీతాగమలక్ష్యలక్ష్మనిపుణై శ్శ్రీవిష్ణుభట్టారకైః
      జ్ఞాత్వా దత్తిలకోహలాదిభరతగ్రంథాన్ సుటీకాన్వితాన్
      భూమౌ కీర్తిశరీరరక్షణధియా గ్రంథః కృతో౽ యం యయా
      ............యోగ్యతాధికతర స్సంగీతసూర్యోదయః

గద్యము

ఇతి శ్రీమద్విప్రకులవర్య భండారువిట్ఠలేశ్వరనందన సూక్ష్మభరతా (లిఖితా?) చార్య రాయబయకార తోడరమ ల్లాభినవభరతాచార్య శ్రీలక్ష్మీనారాయణవిరచితే సంగీతసూర్యోదయే. 

ఇంకొక విశేషము

ఈ భండారులక్ష్మీనారాయణుఁ డిట్లు కృతికర్త యగుటే కాక మఱి కృతిభర్తయునయిన ట్లెఱుగఁబడుచున్నాఁడు. భానుకవి యని యొక తెనుఁగుకవి యితని కంకితముగాఁ బంచతంత్రిని దెనిఁగించినాఁడు. చిట్టయమంత్రి (చిట్టమరసు?) ప్రేరణచే నరసింహభట్టు, నరసమంత్రి, అవధానము కృష్ణఘనుఁడు, భరతము విష్ణుభట్టు (ఈతఁడే లక్ష్మీ నారాయుణునకు సంగీతాగమము నుపదేశించినవాఁడు) అనువారు సమ్మతించి ప్రోత్సాహపఱుపఁగా లక్ష్మీనారాయణుఁ డీభానుకవిని దనపేరఁ బంచతంత్రిని దెలిఁగింపఁ గోరినాఁ డఁట! భానుకవి తనకృతిపతి సంగీతసూర్యోదయము రచించె నని చెప్పలేదు గాని యాతనిబిరుదములను, నభినవభరతాచార్యాదులను దఱచుగా గ్రంథమునఁ బేర్కొన్నాఁడు.

క|| పతికంటె మంత్రి బలిసిన క్షితి యాతనిదై తనర్చు సిద్ధము సతి దాఁ
     బతికంటె ఠవర యైనను బతి కార్యము చెడును నూత్నభరతాచార్యా!

     విద్యానగరము నీతఁ డిట్లు ప్రశంసించినాఁడు.

సీ|| పంపావిరూపాక్షభైరవవిట్ఠలేశ్వరముఖ్య దేవతావ్రజముచేత
      పరిపంథిగర్వవిభాళనశ్రీకృష్ణ రాయభూధవభుజారక్షచేత
      భటనటజ్యౌతిషపౌరాణికభిషగ్విచక్షణసత్కవీశ్వరులచేత
      సంతతమదవాహిచారుశుండాలస్బుటాజవప్రకటఫలోటములచేత

గీ|| రమ్యమై యుండువిద్యాపురంబునందు
     నిమ్మహాకృతి భానుకవీశ్వరుండు
     తెనుఁగుబాస నొనర్చెను వినుతి కెక్క
     నవని నాచంద్రతారార్క మగుచుఁ దనర

ఈ పంచతంత్రిలోని కథలోఁగూడ నీతిపద్యములు కృతిపతి సంబోధనముతో నున్నవి. "కరణికలక్ష్మి, సూక్ష్మలిఖితాచార్య, విట్ఠయలక్ష్మధీమణీ" ఇత్యాదులు. ఇట్టి సంబోధనములవలన నీతఁడు సంగీతాచార్యుఁ డే కాక మంత్రియు నని యెఱుఁగ నగుచున్నది. మాదిరి కొకపద్యము-

సీ|| విద్య కవులయందు విశ్రాణ నందును
              బ్రత్యర్థివిభులందు బాహుబలము
     శరణాగతులయందుఁ గరుణాకటాక్షంబు
              నృపకార్యములయందు నీతిగరిమ
     బంధుసంతతియందుఁ బరమసంతోషంబు
              నాశ్రితులందుఁ బాయనితలంపు
     ధర్మమార్గమునందుఁ దగిలినచిత్తంబు
              సత్యవాక్యములందుఁ జతురతయును

గీ|| గలిగి యెవ్వాఁడు మెలఁగు జగత్రయమున
     నతనికీర్తులు లుబ్ధమోహాంధతమస
     పటల మణఁగించుఁ జంద్రికాప్రభలయట్లు
     లలితగుణధుర్య ! విట్ఠయలక్ష్మణార్య!

- 3 -

కృష్ణరాయలు రాజ్య మేలుచుండఁగా నీశ్వరదీక్షితుండనుసంస్కృత విద్వాంసుఁ డొకఁడు వాల్మీకిరామాయణమునకు బృహద్వివరణ మని లఘువివరణ మని రెండువ్యాఖ్యలు రచించినాఁడు. శ్రీకృష్ణరాయల కఱువదిగడియలలో రామాయణమేడుకాండలు వినిపించి యాయనప్రోపునఁ జిత్రకూటమున (హంపి) నుండి రామాయణవ్యాఖ్యలు తాను రచించినట్లాతఁడు చెప్పుకొన్నాఁడు.

శ్లో|| బృహద్వివరణం చైవ తథా వివరణం లఘు
      వ్యధా ద్రామాయణే వ్యాఖ్యాద్వయ మీశ్వరదీక్షితః||

శ్లో|| కర్ణాటాధీశ్వరే రాజ్యం కృష్ణరాయే ప్రశాసతి
      రామాయణం చిత్రకూటే వ్యాఖ్యా దీశ్వరదీక్షితః||



-4-

నగరు, తగరు, తొగరు, పగరు అని చరణాద్యక్షరము లుండునట్లు రామాయణ, భారత, భాగవతపరములుగా మూఁడు పద్యములు చెప్పు మని పెద్దన సమస్య యడుగఁగా నట్లే చెప్పి సత్కృతుఁ డయినచింతలపూడి యెల్లయకవికి శ్రీకృష్ణరాయలు రాధామాధవుఁ డని బిరుదనామ మిడెను.

శా|| రాధామాధవ మచ్యుతాంకితముగాఁ బ్రౌఢక్రియం జెప్పి త
      న్మాధుర్యంబునఁ గృష్ణరాయవిభుఁ గర్ణాటేశు మెప్పించి నా
      నాధాతృప్రతిమానసత్కవులలోనన్ భూషణశ్రేణితో
      రాధామాధవనామ మందినజగత్ప్రఖ్యాతచారిత్రుఁడన్

ఈరాధామాధవకవికృతులు రాధామాధవము, విష్ణుమాయావిలాస నాటక ప్రబంధము, తారకబ్రహ్మరాజీయము ననునవి దొరకియున్నవి.

- 5 -

ఆముక్తమాల్యద కృష్ణదేవరాయవిరచిత మని గ్రంథమం దున్నను బెద్దన రచించిన దని లోకమునఁ బ్రతీతి కలదు. వ్యాఖ్యాతలు లాక్షణికులు కొంద ఱట్లే గ్రంథములందును జెప్పినారు. ఆముక్తమాల్యదావ్యాఖ్యాత శ్రీనివాసకవి-

ఉ|| ఉరు వగువిష్ణుచిత్తతనయోద్వహనంబును సంస్కృతాంధ్రవా
     గ్గరిమ నలంక్రియారససఖం బగునట్లుగఁ బెద్దనార్యుఁ డు
     ద్దురభణితిన్ రచించె నది దుర్ఘటబోధము గావునన్ ధరన్
     స్థిర మగుచుండునట్లుగను జేసెదఁ డీక సవిస్తరంబుగాన్

గుడిపాటి వెంకటకవి -

గీ|| ప్రేమ నల్లసాని పెద్దన యాముక్త
     మాల్యదాఖ్యకృతి సమంచితముగఁ
     జేసె నీవు టీక చేయుము చెఱకునఁ
     బండు పండినట్టు లుండుఁ గాన.

సీ|| కర మర్థిఁ గవిరాయగండపెండేరంబు చెల్లించుకొన్నట్టిబల్లిదుండు
      కవులలోపల నాంధ్రకవితాపితామహబిరుదాంకుఁ డైనగంభీరమూర్తి
      మనుచరిత్రాదిసమ్యక్కావ్యరచనలఁ జల్పినవైష్ణవచక్రవర్తి
      కృష్ణరాయలు తన కేల్దిమ్మిచే నెత్తఁ బల్లకి యెక్కిన భాగ్యశాలి

గీ|| యలఘుఁ డలసాని పెద్దన యాఘనుండు
     మహిమఁ జేసినయాము క్తమాల్యదాప్ర
     బంధ మెచటఁ దదీయధీపటిమ యెచట?
     నాకు శక్యంబె దానికిఁ డీక సేయ?

రంగరాట్ఛందస్సులోఁ గూడఁ బెద్దన చెప్పినయాముక్త మాల్యద యని యున్నది.

- 6 -

విశాఖపట్టణమండలమున 'ప్రపంచదర్పణ' మని యొక సంస్కృతగ్రంథము ప్రాచ్యలిఖితపుస్తకశాలవారికి దొరకినది. అది సంధానగ్రంథము. ప్రాచీనగ్రంథములనుండి యనేకవిషయము లందు సంకలనము చేయబడినవి. అం దీక్రిందిశ్లోకము లున్నవి. అల్లసాని పెద్దనార్యేణ సత్యావధూపరిణయే-

శ్లో|| అంగుళీషు కురంగాక్ష్యా శోభతే ముద్రికావళీ
      ప్రోతేవ బాణై పుష్పేషో సూక్ష్మలక్ష్యపరంపరా.

అల్లసానిపెద్దనాఖ్యే నాప్యేవ ముక్తం రసమంజర్యామ్-

శ్లో|| ఉడురాజముఖీ మృగరాజకటి ర్గజరాజగతిః కుచభారనతా
      యది సా రమణీ హృదయే రమతే క్వ జపః క్వ సమాధిమతి:

మొదటి శ్లోకము గలగ్రంథముపేరు సత్యావధూప్రీణన మయి యుండునేమో! ఆముక్తమాల్యదలోఁ గృష్ణరాయల కృతులుగా నీగ్రంథములు గలవు గదా!

"సీ|| పలికి తుత్ప్రేక్షోపమల"- - - - - -

ఇత్యాది పద్యమున-

"భావధ్వనివ్యంగ్యసేవధి గాఁగఁ జెప్పితివి సత్యావధూప్రీణనంబు"

మఱియు

“రసమంజరీముఖ్యమధురకావ్య, రచన మెప్పించుకొంటి గీర్వాణభాష"

ఈ సంధానగ్రంథమున నీపేళ్లతోఁ బెద్దనార్యకృతులను బేర్కొనుట వింత గదా! కృష్ణరాయకృతులలోనివిగాఁగూడ నందు శ్లోకము లున్నవి. కృష్ణరాయ స్యాలంకారసారసంగ్రహే-

సిందూరం రవి మిందు మానవ మసౌ ధమ్మిల్ల రాహో ర్ర్గహా
ద్యర్గాడం గ్రసతీతి తచ్చ విబుధై ర్నిర్ణీత మౌత్పాతికమ్
జోళే చంచలతా భవిష్యతి హఠా త్స్యా త్కుంతలే కర్షణమ్
కాం. . . . . . . . . . . హే............ అంగే మహా న్సంగరః

ఇందుఁ జూపఁబడినశ్లోకములు సుభాషితరత్నభాండాగారమునఁ గూడ నున్నవి. "అంగుళీషు" ఇత్యాదిశ్లోకము బిల్హణునిదిగా నందుఁ జెప్పఁబడినది. తక్కినవి యెవ్వరు రచించినవో యందు లేదు.

ఆగ్రంథసంధాత యోడ్రుఁడు. ప్రసిద్ధగ్రంథములపేళ్లతో నెక్కడివో తెలియరానిమంచి శ్లోకములఁగూడ నాతఁడు గూర్చియుండు నని సందేహించుట కందుఁ గొన్నిచోట్ల నెడము గలుగు చున్నది. ఈశ్లోకము లట్టి వయి యుండవచ్చు నేమో !


  • * *