మీఁగడతరకలు/బంగారుపండ్లు

బంగారుపండ్లు


అడవిదాపల నొక పూరిగుడిసెయందు
కాఁపురం బుండె ముదుసలి కాఁపువాఁడు;
ఆతఁ డొకనాడు భూమిలో పాతుచుండె
చిన్న మామిడిటెంకల కొన్ని తెచ్చి.

వేఁటలాడఁగ నాదారి వెంటఁ జనుచు,
తనదు పరివారజనులలో ననియె రాజు :
"కాంచితిరె మీరలీ మూడు కాళ్ళ ముసలి
చేయుచున్నట్టి చిత్రంపుచేఁత లౌర ?

“వృద్ధుఁ డక్కట ! ఎంతటి వెఱ్ఱివాడు ?
విత్తుచున్నాఁడు మామిడివిత్తనముల,
చెట్లఫలముల తాను భక్షింపఁ దలఁచి;
ఎంతకాలము జీవింప నెంచినాడొ ?




“కాటి కొక కాలు సాఁచియు కాపువాఁడు
ఉట్టికట్టుక కలకాల మూఁగులాడ
నెంచెఁ గాఁబోలు, లేకున్న నిట్టిపనికిఁ
బూని కాలంబు రిత్తఁగాఁ బుచ్చ నేల ! "

నృపునిమాటల నాలించి వృద్ధుఁడనియె:
"చెట్లఫలముల తిన నపేక్షించి కాదు,
మున్ను మనపెద్ద లందఱు చన్నరీతి
ఆచరించితి నంతియె అవనినాధ !

"వారు నాఁటిన వృక్షముల్ ఫలము లీన,
అనుభవించుట లేదొకో మనము నేడు !
అట్లె, మన మిప్డు నాఁటిన చెట్ల ఫలము
లనుభవింతురు గద ! మనతనయు లవల. "

అంత నా రాజు ముసలివాఁ డాడినట్టి
పలుకులకు నాత్మ నెంతయు ప్రమద మంది ,
గౌరవము మీఱ నాతని గారవించె
ఏడుబంగారుకాసుల నెలమి నొసఁగి.


అంత నవ్వుచు నా వృద్ధుఁ డనియె “ ఱేడ !
రిత్త కాలేదు నేఁడు నావిత్తనములు;
అహహ! నాఁటిన తొలినాడె అక్కజముగ
ఏడుబంగారు ఫలముల నీనెఁ గాన,