మీఁగడతరకలు/పిసినివాఁడు—పసిఁడిమూట

పిసినివాఁడు - పసిఁడిమూట


ఊరి వెలుపల, పాడుకోనేరు చెంత,
మనుజు లెవ్వరు మసలని మాఱుమూల,
గుట్టచాటున లోతైన గోయి త్రవ్వి
పసిఁడి దాఁచెను పిసినారిముసలి యొకఁడు.

ప్రతిదినంబును వృద్ధుండు పాతు త్రవ్వి
మురిసిపడుచుండు బంగారు ముద్ద జూచి;
పొదలమాటున నది యెల్ల పొంచి చూచి
దొంగ యొక్కఁడు సర్వంబు దోచి కొనియె.

మఱుదినంబున ముసలివాఁ డరుగుదెంచి
గోయి త్రవ్వంగ బంగారు మాయ మయ్యె;
నెత్తి నోరును లబలబ మొత్తికొనుచు
గొల్లు మని యేడ్చి యతఁడు గగ్గోలు వెట్టె,


అంత నాతనియఱపుల నాలకించి ,
పరుగుపరుగున పొరుగువారరుగు దెంచి
" ఏల యేడ్చెద వీలీల నేలఁ బొరలి ? "
అనుచు ప్రశ్నింప, నీరీతిఁ బనవె నతఁడు.

“ ఏమి చెప్పుదు ? ముప్పదియేండ్ల నుండి
కూడఁ బెట్టిన ధన మెల్ల గోతిలోన
దాఁచియుంచితి, నెవ్వఁడో తస్కరుండు
పచ్చ పైకంబు మునుముట్ట మృచ్చిలించె.

" అనుదినంబును నిచ్చటి కరుగుదెంచి
కాంచనంబును కాంక్షమై కాంచుచుందు;
ఏమి చేయుదు నక్కటా ! యింక మీఁద ?"
అంచు ముదుసలి కన్నీరు నించి చెప్పె.

అనుడు, నామాటలకు వార లనిరి యిట్లు
“పరుల కీయవు, కుడువవు, పైఁడి నీకు
ఏమిలాభంబు చేకూర్చె నింతదనుక ?
అకట ! ఉండిన నూడిన నొకటి కాదె,

20




ఇప్పు డెనను మించిన దేమి కలదు ?
పైఁడి గలచోట నొక పెద్దబండ పాతి
కాంచుచుండుము నిత్యంబు కాంక్ష. దీఱ ”
అనుచు ముదుసలివగ్గుతో ననికి వారు.