మీఁగడతరకలు/గురువు—శిష్యులు
గురువు - శిష్యులు
తెలివి మాలిన గురునొద్ద తెలివి లేని
శిష్యు లిరువురు పరిచర్య చేయుచుండి;
రొకదినంబున వారి నాయొజ్జ పిలిచి
పుచ్చె నడవికీ సమిధలఁ దెచ్చి పెట్ట.
అడవిఁ జొచ్చినతోడనే హరిణ మొకటి
వారి కెదురుగఁ గనఁబడె; వారు దాని
చూచి యెన్నడు నెఱుఁగని శుంఠ లగుట
చర్చ గావించి రది యేమీ జంతువొ యని.
'శంక యేటికి దీనికి చర్చ యేల ?
తెల్లముగ నది యేనుంగుపిల్ల గదర'
'వ్యర్థముగ దీని కింకను వాద మేల ?
కుంజరము కాదు, సింగంపుగొదమ కాని, '
'చాలు చాలును- నీ తెల్వి కాలిపోను-
కొమ్ము లేవిర సింగంపుగొదమ యైన ?'
'ఱంతు లేలర ? నీబుద్ధి సంత కేగ-
దాని మెడమీఁద జూ లేది యేనుఁ గైన?'
వార లీరీతి తమలోన వాదమాడి
గురువు నడిగి యథార్థంబు నెఱుఁగఁ గోరి
ఇరువురును రెండు వైపుల తఱిమి తఱిమి
ఎట్ట కేలకు దానిని పట్టుకొనిరి.
అంత నాలేడి నుత్తరీయమునఁ గట్టి
గురువు చెంతకుఁ గొనితెచ్చి కూలవైచి
సింగమో యిది యేనుంగొ చెప్పు' డంచు
నడుగ, వారికి గురు విట్టు లానతిచ్చె.
“పనికిమాలిన పరమనిర్భాగ్యులార !
సింగమును గాదు, మఱియు నేనుంగు గాదు;
శీఘ్రముగ పాఱ వేయుఁ డాచెఱువులోన
ఎగిరితే కప్ప, మునిఁగినయెడల కాకి. "