శ్రీరస్తు

మార్కండేయపురాణము

పీఠిక

విష్ణుస్తుతి




తరుణీముఖోజ్జ్వలశశిద్యుతియు న్బృథుకౌస్తుభార్కబా
లాతపదీప్తియు న్నిజభుజాంతరరమ్యనభస్థలి న్బరి
స్ఫీతవిచిత్రభాతి విలసిల్లఁగ నొప్పురమావరుండు సం
ప్రీతిఁ గృతార్థుఁ జేయుతను శ్రీనిధి నాగయగన్నధీనిధిన్.

1

శివస్తుతి

మ.

కరుణాసాంద్రపయఃప్రపూర్ణమును రంగద్దోస్తరంగంబుఁ బ్ర
స్ఫురదాకల్పభుజంగమాంబుచరమున్ శుంభజ్జటావిద్రుమో
త్కరము న్గాంతిసుధోదయంబు నగు నుద్యచ్ఛంకరాకారవా
ర్థి రమావర్ధనుఁ జేయుఁ గాత సుగుణున్ శ్రీగన్నసైన్యాధిపున్.

2

బ్రహ్మస్తుతి

మ.

హరినాభీకమలంబు జన్మసదనం బై వేదము ల్పల్కు లై
తరుణీరత్నము వాణి పత్ని యయి విద్య ల్భూషణశ్రేణి యై
చరభూతాచరభూతజాలము లొగి న్సంతాన మై యెంతయు
న్బరగ న్బొల్చువిరించి గన్నరథినీపాలు న్సుఖి న్జేయుతన్.

3

విష్వక్సేనస్తుతి

శా.

రంగద్గండతటీసమగ్రమదధారాగంధలోభభ్రమ
ద్భృంగీమంజులగీతి వీనుల కతిప్రీతిం గడల్కొల్ప స
ర్వాంగంబు ల్పులకాంకితంబుగఁ గడు న్హర్షాత్ముఁడై యొప్పు ను
త్తుంగాంగు న్గజవక్త్రు మాకు నభివక్త్రుం గాఁ బ్రశంసించెదన్.

4

సరస్వతీస్తుతి

ఉ.

ఆరయ నొక్కభంగిగ రహస్యపుఁజోటను రాజసన్నిధిన్
సూరిసభాంతరంబులను జొప్పడి తప్పక గద్యపద్యముల్
దోరలు పేర్చినట్లు మదిఁ దోఁపఁగఁ జేయుట సంతతంబు నా
భారమ కాదె వీని కనుభారతి మాకుఁ బ్రసన్న యయ్యెడున్.

5


వ.

అని సకలభువనప్రధానదేవతాప్రార్థనంబుఁ జేసి.

6

వ్యాసస్తుతి

మ.

వివిధామ్నాయలతాలవాలధిషణావిఖ్యాతవిజ్ఞానదీ
పవిభాలోకితలోకవర్తనుఁ గృపాపారంగతు న్సాంఖ్యయో
గవిదు న్భారతసంహితావిరచనాకల్పు న్దపోనిత్యు సా
త్యవతేయుం గృతకృత్యుఁ గొల్చెద మునీంద్రస్తుత్యు నత్యుత్తమున్.

7

వాల్మీకిస్తుతి

మ.

కవిలోకాఢ్యుని హృద్యపద్యకవితాకల్పుం ద్రిలోకీజన
శ్రవణానందనరామకీర్తనకథాసందర్భదక్షు న్ముని
ప్రవరు న్భవ్యతపఃప్రభావవిభవప్రఖ్యాతు వాల్మీకిఁ ద
త్త్వవిదు న్నిర్మలసత్త్వు సంతతము సద్భక్తిం బ్రశంసించెదన్.

8

నన్నయభట్టస్తుతి

ఉ.

సారకథాసుధారస మజస్రము నాగళపూరితంబుగా
నారఁగఁ గ్రోలుచు న్జనులు హర్షరసాంబుధిఁ దేలునట్లుగా
భారతసంహిత న్మును ద్రిపర్వము లెవ్వఁ డొనర్చు నట్టివి
ద్యారమణీయు నాంధ్రకవితాగురు నన్నయభట్టుఁ గొల్చెదన్.

9

తిక్కనకవిస్తుతి

చ.

ఉభయకవిత్వతత్త్వవిభవోజ్జ్వలు సంవిహితాధ్వరక్రియా
ప్రభు బుధబంధు భూరిగుణబంధురు భారతసంహితాకథా
విభుఁ బరతత్త్వబోధను నవీనపరాశరసూను సంతత
త్రిభువనకీర్తనీయయశుఁ దిక్కకవీంద్రుని గొల్తు నర్థితోన్.

10


వ.

అని సకలభువనప్రసిద్ధులైన పురాతనాద్యతనకవివరులం బ్రశంసించి తత్ప్రసాద
ప్రవర్ధమానసరససాహిత్యసౌరభసంవాసితం బగుమదీయహృదయపయోరుహం
బునం దపూర్వకావ్యరచనాకుతూహలమధులిహంబు విహరించుచున్న సమ
యంబున.

11

కావ్యకరణబీజము

సీ.

తనసముజ్జ్వలమూర్తి జనలోచనాంభోజములకు మార్తాండునిమూర్తి గాఁగఁ
దననయోపార్జితధనమున కర్థిహస్తములు నిక్షేపణస్థలులు గాఁగఁ

దనభూరితరతేజ మనుపమనిజవంశభవనంబునకుఁ బ్రదీపంబు గాఁగఁ
దనవినిర్మలయశంబునకు దిశాతటంబులు దృఢశాసనశిలలు గాఁగఁ


తే.

బ్రకటగుణగణసంపదఁ బరగుచున్న, ధన్యుఁ డధికపుణ్యుండు ప్రతాపరుద్ర
దేవసామ్రాజ్యవర్ధనస్థిరవినీతి, కరణకుశలుండు నాగయగన్నవిభుఁడు.

12


వ.

ఒక్కనాఁడు వేదవేదాంగపారుగులైన ధారుణీసురులును సమస్తశాస్త్రవిదులైన
విద్వాంసులును వివిధపురాణప్రవీణులైన పౌరాణికులును సరససాహిత్యవిద్యావిశా
రదులైన కవివరులును బరివేష్టింప రమ్యహర్మ్యతలంబున సుఖోపవిష్టుండై యిష్ట
కథావినోదంబులనుండి నన్ను రావించి యుచితప్రియసత్కారంబు లొనర్చి
సంభావించి యి ట్లనియె.

13


శా.

పాండిత్యం బమరం బురాణముల ము న్బౌరాణికు ల్సెప్పఁగా
విండు న్వింతలు గావు నూతనకథావిస్తారమై యోగ్యమై
చండాఘోత్కరహారి యై పరమవిజ్ఞానాశ్రయం బైనమా
ర్కండేయాఖ్యమహాపురాణము వినం గౌతూహలం బయ్యెడిన్.

14


వ.

అని మఱియును.

15


శా.

తర్కింపంగ నశక్య మైనవితతోద్యద్దీప్తిజాలంబుచే
నర్కుం డెట్లు వెలుంగు నట్ల బహుపుణ్యశ్రేణికావ్యాప్తి సం
పర్కస్ఫూర్తి నఘాంధకారము లడంపం జాలి లోకంబున
న్మార్కండేయపురాణరత్న మమరు న్మాంగళ్యసంపాది యై.

16


ఉ.

కావునఁ దత్పురాణము ప్రకాశితసారకథామృతం బొగిం
ద్రావి జగజ్జనంబు లలర న్వచియింపు తెనుంగున న్వచః
శ్రీవిభవంబు పెంపు విలసిల్లఁగఁ గోవిదు లిచ్చ మెచ్చి సం
భావన సేయఁ జారుగుణభాస్వర! మారయసత్కవీశ్వరా!

17


మ.

ఇతఁ డిమ్మేదిని నింత ధన్యుఁడగునే యి ట్లొప్పునే? యీతలం
పతిసూక్ష్మం బతినిర్మలం బతిహితం బత్యంతధర్మార్థసం
గత మీదివ్యపురాణరత్నమును మార్కండేయ మేఁ జెప్పఁ గాం
చితిఁ బుణ్యాతుఁడ నైతి జన్మము ఫలించె న్లోకసంభావ్యమై.

18


వ.

అని అత్యంతప్రమోదంబునం గొనియాడి.

19


క.

నానాగమార్థజలముల, నానాఖ్యానకతరంగనాదంబుల నా
నానయధర్మోక్తిమణులఁ, దా నొప్పి సుధాబ్ధిమాడ్కిఁ దనరెడుదానిన్.

20


తే.

సర్గమన్వంతరప్రతిసర్గములును, సకలనృపవంశవంశానుచరితములును
ననఁగ నెంతయు నొప్పునీయైదులక్షణములఁ బొలుపొంది సభలయం దమరుదాని.

21


సీ.

నిఖిలకల్మషపంకనిర్మోచనస్ఫూర్తి నమరసరిద్వారి ననుకరించి
బహుళతరాజ్ఞానతుహిననిర్వాపణప్రౌఢి నర్కప్రభాభాతిఁ దాల్చి

వితతచతుర్వర్గవిపులఫలాలంకృతస్థితి మందారతరువుఁ బోలి
సారకథాసాంద్రచంద్రికాసంపదఁ బూర్ణేందుమండలస్ఫురణ నొంది


తే.

యఖిలవిబుధసభాపర్వ మై జగజ్జ, నావళికిఁ గర్ణపర్వమై యధికపుణ్య
యోగిహృచ్ఛాంతిపర్వ మై యొప్పుదాని, హరిగుణోజ్జ్వలమణినిధి యైనదాని.

22


క.

ఇమ్మార్కండేయపురా, ణ మ్మఖిలహితమ్ము గాఁగ నానేర్చుగతిన్
నెమ్మి విరచించెదం బ, ద్యమ్ముల గద్యముల భవదుదాత్తానుమతిన్.

23


వ.

అని విద్వజ్జనానుగ్రహంబు వడసి సుగుణసుందరుండును ధృతిమందరుండును సిత
యశోవిలసితసురగిరికందరుండును బతికార్యధురంధరుండును నీతియుగంధరుం
డును నిర్వికారుండును బ్రతాపరుద్రకటాక్షవీక్షాపేక్షపరాక్రమప్రకారుండును
నిరహంకారుండును నైన యాగన్నరథినీశ్వరం గృతీశ్వరుం గావించి తదీయ
వంశావళి వర్ణనంబొనరించెద నది యె ట్లనిన.

24

కృతిపతివంశావళి

క.

శ్రీమంగళమందిరవ, క్షోమణికిరణచ్ఛటాభిశోభితుఁడు ఘన
శ్యామలకోమలవపురభి, రాముఁడు నగువిష్ణునాభిరాజీవమునన్.

25


తే.

ఆగమంబులు నాలుగు నాననములఁ, బ్రణవ మాత్మసనాతనబ్రహ్మతేజ
మున మొదలుగ విరించి సముద్భవించి, భువననిర్మాణకర్మనైపుణి వహించె.

26


క.

ఆరాజీవజముఖబా, హూరుపదంబుల జనించి రొగి బ్రాహ్మణధా
త్రీరమణవైశ్యశూద్రులు, భూరిగుణోన్నతు లగణ్యపుణ్యచరిత్రుల్.

27


వ.

ఇ ట్లావిర్భవించిన చతుర్వర్ణంబులయందు.

28


మ.

అమలంబు న్ద్విజరాజవర్ధనము మర్యాదాన్వితంబున్ గుణో
త్తమరత్నంబు ననంతభోగమహిమోదారంబు గాంభీర్యధు
ర్యము శ్రీజన్మగృహంబు నై శుభయుతం బై యాచతుర్థాన్వయం
బమృతాంభోనిధిమాడ్కి నుర్విఁ గడుఁ బొల్పారు న్జనస్తుత్య మై.

29


ఆ.

ఆచతుర్థకులసుధాంబుధి నుదయించె, నమితకాంతిచంద్రుఁ డవనిభరణ
దిగ్గజేంద్రమును వితీర్ణిమందారంబు, మల్లసైన్యవిభుఁడు మహితకీర్తి.

30


క.

ఆమల్లచమూవల్లభు, భామకు సౌభాగ్యనీతిభాసురకాంతి
శ్రీమహితకుఁ బోలాంబకు, నేమనుజాంగనలు సాటియే గుణమహిమన్?

31


ఉ.

ఆరమణీయదంపతుల కన్వయరత్నము బంధులోకమం
చారము ధైర్యమందర ముదాత్తదయానిధి దానధర్మవి
ద్యారసికుండు నాగవిభుఁ డంచితభాగ్యపరుండు పుట్టెఁ బెం
పార శచీపురందరుల కర్థి జయంతుఁడు పుట్టినట్టుగన్.

32

తే.

అట్లు జన్మించి లావణ్య మగ్గలించి, యంగములు తొంగలింప బాల్యమున మెఱసి
నాగరథినీశ్వరుఁడు మదనాభిరేఖ, నొప్పి నసమాననవయౌవనోదయమున.

33


క.

కులరత్నాకరచంద్రుం, డలఘుఁడు నాగాంకుఁ డన్వయస్థితికొఱకుం
గులశీలరూపగుణములు, గలకన్నియఁ బరిణయంబుగాఁ దలఁచి మదిన్.

34


సీ.

ఏరాజు రాజుల నెల్ల జయించి మున్వెట్టికిఁ బట్టే దోర్విక్రమముల
నేరాజు సేతునీహారాద్రిమధ్యోర్వి నేకపట్టణలీల నేలి వ్రాలె
నేరాజు నిజకీర్తి నెనిమిదిదిశల నుల్లాసంబు నొంద నలంకరించె
నేరాజు తనతేజ మీజగంబునకు నఖండైకవిభవంబుగా నొనర్చె


తే.

నట్టి కాకతిగణపతిక్ష్మానాథు, ననుఁగుఁదలవరి ధర్మాత్ముఁ డధికపుణ్యుఁ
డయిన మేచయనాయకు ప్రియతనూజ, నతులశుభలక్షణస్ఫురితామలాంగి.

35


చ.

శివుఁ డగజాత రాఘవుఁడు సీతఁ గిరీటి సుభద్రఁ బెంపు సొం
పు వెలయఁ బ్రీతిఁ బెండ్లి యగుపోల్కిని నాగచమూవిభుండు భూ
రివిభవ ముల్లసిల్లఁగ వరించె సమంచితరూపకాంతిభా
గ్యవిభవగౌరవాదిసుగుణానుకృతాంబిక మల్లమాంబికన్.

36


శా.

ఆమల్లాంబకు నాగశౌరికి విశిష్టాచారు లుద్యద్గుణ
స్తోమాకల్పు లనల్పకీర్తిపరు లస్తోకస్థిరశ్రీయుతుల్
ధీమంతు ల్సుతు లుద్భవించి రొగిఁ గౌంతేయప్రభావోన్నతుల్
రామప్రఖ్యులు వహ్నితేజులు జగత్ప్రఖ్యాతశౌర్యోదయుల్.

37


వ.

అం దగ్రజుండు.

38


సీ.

తనసుందరాకృతిఁ గని వెఱఁ గందిన వనిత లంగజునొప్పుఁ దనువుఁ జేయఁ
దనకళాచతురత్వమున కద్భుతంబందు బుధులు భోజునినేర్పు పొల్లు సేయఁ
దననయాభిజ్ఞత వినిన ప్రాజ్ఞులు దివిజేశుని తద్జ్ఞతయేపు దింపఁ
దనయాశ్రయంబున మనుబంధుమిత్రవర్గము కల్పతరువు నాశ్రయముఁ దెగడ


తే.

నెగడి జగమున నెంతయుఁ బొగడు వడసెఁ, గాకతిక్ష్మాతలాధీశకటకపాలుఁ
డమలసితకీర్తిధనలోలుఁ డన్వయాబ్జ, షండదినవల్లభుఁడు గన్నసైన్యవిభుఁడు.

39


చ.

ఎలమిఁ బ్రతాపరుద్రమనుజేంద్రునిచేఁ బడసెం బ్రవీణుఁ డై
కొలిచియు శౌర్యలీల రిపుకోటి రణావనిఁ గీటడంచియు
న్బలరిపుతుల్యవిక్రముఁడు నాగయగన్నవిభుండు తేజమున్
విలసితరాజ్యచిహ్నములు విశ్రుతలక్ష్మియు నాయకత్వమున్.

40


చ.

తదనుజుఁ డన్వయాంబుధిసుధాకరుఁ డెల్లయసైన్యనాథుఁడున్
మదపరిపంథిసింధురసమాజవిదారణసింహ మంగనా

హృదయసరోజషట్పద మహీనగుణోజ్జ్వలరత్నభూషణా
స్పదశుభమూర్తి సద్వినయసంపదసొంపున నొప్పు నెంతయున్.

41


చ.

నయవినయాభిరాముఁ డగునాగయగన్ననికూర్మితమ్ముఁ డ
న్వయనవరత్నదీపము దివాకరతేజుఁడు రాజనీతిని
శ్చయనిపుణుండు నిర్మలవిచారవివేకపరాయణుండు మే
చయరథినీశుఁ డుజ్జ్వలయశస్ఫురణం బొగడొందె నిద్ధరన్.

42


సీ.

ఆశాగజేంద్రకర్ణానిలంబునఁ దన ప్రకటప్రతాపాగ్ని ప్రజ్వరిల్ల
దిగ్వధూదరహాపదీప్తులతోఁ దనసితకీర్తిచంద్రిక ల్చెలిమి సేయ
సకలమహీపాలసరసిజాకరములఁ దనజయశ్రీవినోదంబు సలుపఁ
దతరిపుమకుటరత్నప్రభాబాలాతపంబునఁ దనపదాబ్జంబు లలరఁ


తే.

దనరుఁ జలమర్తిగండప్రతాపరుద్ర, మనుజవిభునకు సేనానియును మహాధి
కారియును నాప్తుఁడును నై పొగడ్త కెక్క, మేరుధీరుఁడు నాగయమేచశౌరి.

43

షష్ఠ్యంతములు

క.

అనుపమవిజయశ్రీఁ గడుఁ, దనరారెడునట్టియనుఁగుఁదమ్ము లిరువురున్
దనయుభయభుజంబులు గా, ఘనవిభవస్ఫూర్తి నొప్పు గన్నవిభునకున్.

44


క.

ధన్యునకు ధనదసదృశవ, దాన్యున కతిమాన్యునకు బుధవ్రజనుతసౌ
జన్యునకు ఘనవిభవప, ర్జన్యునకు న్సకలజగదసామాన్యునకున్.

45


క.

పతిహితనీతివివేకాం, చితమతికి ననేకకార్యశిల్పనవబృహ
స్పతికి నిజభుజకృపాణ, ప్రతిహతరిపుతతికి గన్నరథినీపతికిన్.

46