మార్కండేయపురాణము/పంచమాశ్వాసము

శ్రీరస్తు

మార్కండేయపురాణము

పంచమాశ్వాసము




రుద్రదేవనృపతి
స్ఫారదయాలబ్ధవిభవ! శౌర్యేంద్రభవా!
మారాస్త్రదళితచేతో
నారీజనసుప్రసన్న! నాగయగన్నా!

1


వ.

పరమజ్ఞానచక్షు లైనపక్షు లాజైమిని కిట్లనిరి వరూధిని యటమీఁద నెట్లు వర్తించె
నని క్రోష్టుకి యడిగిన మార్కండేయుండు.

2

ప్రవరవిరహము సహింపఁజాలక వరూధిని విలపించుట

ఉ.

ఆకమలక్షిచిత్తమున నాద్విజరాజకుమారుచారుది
వ్యాకృతి నిల్చి ప్రీతివగ లంతకు నంతకు నగ్గలించి చీ
కాకు పడంగఁజేయఁ గుసుమాయుధునేటుల కంత యోర్వఁగా
లేక నితాంతవేదనఁ జలించుచు నెంతయు వెచ్చ నూర్చుచున్.

3


క.

గిరికందరములు గలయం, దిరుగుచు దుఃఖాంబురాశిఁ దేలుచు విప్రుం
డరిగినవలనికిఁ జూడ్కులు, పొరి నిగిడించుచును బువ్వుఁబోఁడి యలంతన్.

4


తే.

అకట! మందభాగ్య నైతి నా కెమ్మెయిఁ, గలుగు నక్కుమారుఁ గలయుపుణ్య?
మేమి సేయుదాన? నీకామతాప మే, నెట్లు నిస్తరింతు? నెందుఁ జొత్తు?

5


వ.

అనుచు మదనవేదనాభరంబున దురపిల్లుచు నమ్మదిరాక్షి యద్దినశేషంబును
రాత్రియుం గడపి మఱునాఁ డక్కుమారుం డెప్పటియట్ల యరుగుదెంచునో
యనుకుతూహలంబునం దుహినగిరికందరోద్యానంబునందు.

6


సీ.

విరులగుత్తులమీఁద గురువులు వాఱుచు ముద్దిచ్చుతేఁటుల మొరపములకుఁ
జిగురుజొంపములలోఁ జిఱ్ఱుముఱ్ఱాడుచుఁ గెరలుకోయిలలసుస్వరములకును
నెలమావిలతలపైఁ గలఁ గొనఁ దారుచుఁ జెలఁగుచిల్కలకల్కిపలుకులకును
నలరులనెత్తావి నెలమిగాఁ జిలుకుచు సుడియుమందానిలుసొంపునకును

తే.

గళవళించుచుఁ గెందమ్మికొలఁకులందుఁ, గేలి యొనరించుజక్కవ మేలిలీలఁ
గోర్కు లంతంతకును నెడఁ గొనలు నిగుడ, మదనమార్గణవిదళితహృదయ యగుచు.

7


తే.

అడవిఁ గాసిన వెన్నల యయ్యె నాదు, జవ్వనం బక్కుమారుతో సరసలీల
భావజోపభోగంబులఁ బడయ నైతి, నీనితాంతతాపంబు నన్నేల సైఁచు!

8


ఉ.

ఎక్కడినుండి వచ్చె నతఁ డీతుహినాద్రికి వేడ్క నూని? యే
నక్కట! యక్కుమారురుచిరాకృతి యాదట నేల చూచితిన్?
మక్కువ యేల నాటె మది? మన్మథుఁ డేల సహించు నన్ను? వాఁ
డెక్కడ వచ్చు నింక? నది యేల పొసంగు? దురాశ యేటికిన్.

9

కలి యనుగంధర్వుఁడు ప్రవరవేషుఁడై వరూథిని మోసగించుట

వ.

అని వితర్కించుచుం జేడియ విరహాతురయై తిరుగుచుండం దొల్లి యక్కామినిం
గామించి దానిచేత నిరాకృతుం డైనవాఁడు కలి యనునొక్కగంధర్వుం డయ్య
వస్థనున్న యాయంగనం గనుంగొని దివ్యజ్ఞానంబునఁ దద్వృత్తాంతం బంతయు
నెఱింగి పొంగి.

10


క.

తను నేఁ గోరిన నొల్లక, మనసిజశరనికరదళితమానసుఁ జేసె
న్నను విప్రుఁ గూర్చి కమలా, నన యక్కట! యిట్లు నేఁడు నావలె నుండెన్.

11


తే.

అమ్మహీసురురూప మొప్పారఁ దాల్చి, యిమ్మృగాక్షితో భోగింతు నిం పెలర్ప
నని మనంబున గంధర్వుఁ డలరి విప్ర, మూర్తి గైకొని యబ్బాలమ్రోల లీల.

12


చ.

మెలఁగుచునున్న వానిఁ గని మెల్తుక యెప్పటిభూసురుండ కాఁ
దలఁచి విలోచనద్యుతివితానవిరాజితవక్త్రపద్మ యై
లలిఁ గడు డాసి యేమిటి కలంచెద విమ్మెయి? నంగజాగ్ని నే
నలిగిన నిన్నుఁ గష్టుఁ డనరే నరు? లక్కట! పాప మొందదే?

13


క.

నిను నిత్యకర్మలోపం, బునకంటెఁ గుమార! యఘము పొందుం జుమ్మీ
మనసిజుబారికి ననుఁ ద్రో, సిన మత్త్రాణైకధర్మశీలివి గమ్మీ.

14


వ.

అనిన నవ్విప్రరూపగంధర్వుండు.

15


తే.

ఏమి చేయుదు తరళాక్షి! యేను? జెపుమ, నీవు నిట్లని పలికెదు నిత్యకర్మ
హాని నాకుఁ బాటిల్లదే? యైన నొకటి, నీకుఁ జెప్పెద నేర్పడ నెమ్మి వినుము.

16


వ.

సంభోగసమయంబున నిమీలితాక్షి వై నన్నుం జూడక యుండవలయు నట్లైన
నీకు నాకును సంగమం బగు నట్లు గా కున్నఁ గాదనిన వరూథిని దాని కొడం
బడియె నంత.

17

స్వరోచిర్జననము

శా.

ఆగంధర్వుఁడు నప్సరోంగనయు నత్యాసక్తిమైఁ గూడి హై
మాగస్ఫారదరీగృహాంతరలతాంతాగారభాస్వత్తటీ

భాగీరథ్యురుసైకతస్థలజలప్రాంతప్రదేశంబుల
న్భోగింపంగఁ దొడంగి రంగజసుఖాంభోరాశి నిర్మగ్ను లై.

18


వ.

ఇ ట్లయ్యిరువురు మనోహరంబు లగుమనోభవసుఖంబు లనుభవించుచుండ.

19


క.

సురతసమయమున నాసుం, దరి నయనాబ్జములు మోడ్చి దహనశిఖావి
స్ఫురితశరీరుం డగునా, ధరణిసురకుమారు నాత్మఁ దలఁచెను నెమ్మిన్.

20


వ.

కాలక్రమంబున నబ్బాలికారత్నంబు గర్భిణి యైన దానిం బ్రియవచనంబులు నూఱ
డించి యాపె యనుప విప్రరూపగంధర్వుండు నిజేచ్ఛ నరిగె నంత.

21


చ.

స్వరుచిసముద్గమస్ఫురణ సర్వదిగంతరము ల్వెలుంగ భా
సురతరమూర్తియై వెలయుసూర్యునిమాడ్కి సుతుండు ప్రీతి న
త్తరుణికి నుద్భవించి సముదాత్తత నుద్యుతిజాలసంపద
న్సురుచిరుఁ డై స్వరోచి యనుసుందరనామము దాల్చి యెంతయున్.

22


చ.

కళ లభివృద్ధి బొందుశశికైవడిఁ దద్దయు సద్గుణంబుల
న్వెలుఁగుచు నాఁడునాఁటి కభివృద్ధి వహించి మనోజ్ఞయౌవనో
జ్ఞ్వలుఁడును నస్త్రవిద్యను విశారదుఁడు న్బలభాసితుండు నై
పొలుపుగ మందరాద్రితటభూముల నాతఁడు కేలి సల్పుచున్.

23

ఇందీవరాక్షమనోరమాశాపమోచనము

క.

ఒకనాఁడు గనియె నొకక, న్యక నధికభయార్తచిత్తయై కావు నను
న్బ్రకటదయ ననుచుఁ దనయొ, ద్దకు వడిఁ బఱతెంచుదానిఁ దరళతరాక్షిన్.

24


క.

కని యోడకుమీ యభ్జానన! యిట కీ వేల వచ్చి? తనవుడు నది యి
ట్లను నుర్పులు గ్రందుకొన, న్దనులత వడఁకంగ గద్గదస్వర మెసఁగన్.

25


వ.

మహాత్మా! యేను మరుదశ్వపుత్రికి నిందీవరాక్షుండనుగంధర్వునకుం బ్రభవించిన
దాన నాపేరు మనోరమ మందారవిద్యాధరపుత్రి విభావరియును బారుం డను
మునికూఁతురు కళావతియును నాసఖులు వారును నేనునుం గూడి యొక్క
నాడు కై లాసంబునకు వినోదార్థం బరిఁగి తదీయతటంబునందు.

26


తే.

ఉగ్రతపమున నెంతయు నొడలు డస్సి, యడరునాఁకట మలయుచు మెడ మలంచి
చాలఁ గన్నులఁ గ్రుస్సి తేజం బడంగి, యున్న మునిఁ గని నవ్విన నన్నుఁ జూచి.

27


ఆ.

అలుక వొడమి కంపితాధరపల్లవుఁ, డగుచుఁ బెలుచ నిట్టు లనియె నతఁడు
నన్నుఁ జూచి నీవు నవ్వితి గావున, నసురకరగృహీత వగుము తరుణి!

28


చ.

అని నను నమ్మునీంద్రుఁ డదయ న్శపియించిన రేఁగి మత్సలు
ల్చనునె శపింప నక్కట! విచారవిహీనుఁడ వైతి వో తపం
బును బొలియించి తించుకయు బుద్ధిశ్రమంబు భజింప లేవ క్రో
ధను లగువారు బ్రాహ్మణులె? దాంతులు శాంతులు వారి మెత్తురే?

29


క.

అని తన్ను ధిక్కరించిన, విని ముని యొక్కర్తు కుష్టవిద్ధాంగి యొక

ర్తు నితాంతక్షయబాధిత, యును గా నిద్దఱ శపించె నుగ్రపుటలుకన్.

30


తే.

ఆలతాంగుల నారుజ లపుడ పొందె, ననఘ! మూఁడుప్రొద్దులఁగోలె నసుర యొకఁడు
ఘోరమూర్తియై ననుఁ బట్టికొనఁగ వెనుకఁ, దగులుచున్నాఁడు దారుణధ్వని సెలంగ.

31


వ.

అస్త్రహృదయం బనువిద్య యే నెఱుంగుదు దాని నీ కిచ్చెదఁ దత్ప్రభావంబున
నీరాక్షసు జయించి నన్ను రక్షింపు మీవిద్య తొల్లి పినాకపాణి యగురుద్రుండు
స్వాయంభువమనువున కిచ్చె నతండు వసిష్ఠున కిచ్చె నమ్మునివరుండు మన్మాతా
మహుం డైన చిత్రాయుధున కిచ్పె నమ్మహితాత్ముండు వివాహసమయంబున మదీ
యజనకున కరణంబుగా నిచ్చె మాతండ్రి నన్ను నావిద్యయందు విశారదం గావించె
సకలరిపునాశకరం బైనయస్త్రహృదయంబును వేగ పరిగ్రహింపు మనిన నట్ల కాక
యని యవ్వరూధినీనందనుండు జలోపస్పర్శనం బాచరించి శుచి యైన నతనికి
నక్కన్య కారత్నంబు సరహస్యంబుగ సకలాస్త్రసంప్రయోగనివర్తనవిధంబు లుప
దేశించిన యనంతరంబ.

32


చ.

అనుపమనీలనీరదనిభాకృతియు న్బటుగర్జనారవం
బును మెఱయంగ వే కదిసి పొల్తుక! యెవ్వఁడు గావ నోపు? నే
నిను నిదె మ్రింగెదం దొలఁగి నీ వెటఁ బోయెద? వంచు నింతిఁ బ
ట్టిన సురవైరిఁ జూచి తనడెందమునం గడు నల్క పుట్టినన్.

33


వ.

వరూథినీనందనుం డంతర్గతంబున.

34


క.

కరుణము పుట్టఁగ నమ్మెయి, శరణుం జొచ్చిన లతాంగి సాధ్వస మెల్ల
న్హరియింతును బొలియింతును, సురవిద్విషు సురల కెలమి సొంపొనరింతున్.

35


చ.

అని భ్రుకుటీభయంకరతరాస్యుఁడు రోషవిఘూర్ణితాత్మకుం
డును నయి చండబాణము గడు న్వెసఁ జూడ్కులఁ దాల్చి చొన్పెన
ద్దనుజునిమేన దానఁ బటుతాపము పుట్టినఁ దల్లడిల్లి య
వ్వనరుహలోచన న్విడిచి వాఁడు కరంబులు మోడ్చి యి ట్లనున్.

36


ఆ.

బ్రహ్మమిత్రుఁ డనఁగ బరగినమునివరు, శాప మిపుడు తద్ద శాంతిఁ బొందె
నాకు హితులు లేరు నీకంటె నెవ్వరు, ననిన నిట్టు లనియె నతఁడు ప్రీతి.

37


వ.

అమ్మునీశ్వరుం డేమినిమిత్తంబున నీ కిట్టిశాప మిచ్చెనని యడిగిన రాక్షసుం డి ట్లనియె.

38

ఇందీవరాక్షుఁడు శాపవిముక్తుఁడై స్వరోచితో నిజశాపకారణము సెప్పుట

క.

ఘనుఁ డైన బ్రహ్మమిత్రుం డనఘా! యష్టాంగ మైన యాయుర్వేదం
బున నిపుణుండై యుండును, విను మే నిందీవరాక్షవిదితాహ్వయుఁడన్.

39


వ.

ఈయిందీవరాక్షికి జనకుండ గంధర్వుండ.

40


క.

నలనాభాఖ్యతనూజుఁడ, నలఘుమతీ! బ్రహ్మమిత్రు నాయుర్వేదం

బలవఱుప వలయు నా కని, పలుమఱు నే నడిగి త్రోపువడి చలము మెయిన్.

41


వ.

అంతర్ధానగతుండనై యుండి యతండు శిష్యుల కుపదేశించుసమయంబున నయ్యా
యుర్వేదవిద్య నెనిమిదినెల లభ్యసించి హర్షించి యతనిముందటి కరిగి యందంద
నగుచున్న నన్ను భావించి దివ్యబోధంబున నంతయుం గాంచి మునివరుండు
కోపించి.

42


ఆ.

కటము లదర మేను కంపింప నతిపరు, షాక్షరముల నిట్టు లనియె నోరి!
దితిజమాయ ని ట్లదృశ్యుండ వై విద్య, యవహరించి తగునె యవహసింప?

43


వ.

సప్తరాత్రంబుల రాక్షసుండవై యుండు మని శపించిన.

44


క.

వడవడ వడఁకుచు నమ్ముని, యడుగులకుం జక్కఁ జాఁగి యర్థించిన న
ప్పుడ శాంతిఁ బొంది యెదఁ గృప, గడలుకొనఁగ నిట్టు లనియెఁ గమనీయయశా!

45


సీ.

వినవయ్య గంధర్వవీర! నాపలు కవశ్యము తప్ప దిపుడు నీ వసుర వయ్యుఁ
గ్రమ్మఱ నిజమూర్తిఁ గైకొనియెదు దైత్యభావంబుచే స్మృతిఁ బాసి యెపుడు
కుపితుండవై నీదుకూఁతు నంగద మ్రింగ నడరి యొక్కరునిదివ్యాస్త్ర వహ్ని
నెరియు దప్పుడు మది నెఱుక వొడమ నిర్మలాకృతి వగు దని యానతిచ్చె


తే.

నమ్మునీంద్రుండు గావున నధికపుణ్య,
మూర్తి! నీచేత నే నిట్లు మోక్షితుండ
నైతి శాపంబువలన మహాత్మ! నీకు, వలయుఁ జేయంగఁ బ్రీతి నాపలుకు వినుము.

46

స్వరోచి యిందీవరాక్షునికూఁతు రగుమనోరమను బెండ్లియాడుట

క.

ఆయుర్వేదముతోడన, యీ యిందీవర దళాక్షి నిచ్చెద నీకున్
ధీయుత! పరిగ్రహింపుము, నీయుపకృతి కొండు సేయ నేర్తునె చెపుమా?

47


క.

అని గంధర్వుఁడు తొల్లిటి, తనదివ్యాకృతి ధరించి ధవళాంబరచం
దనకుసుమరత్నహీరా, ద్యనుపమశృంగారభాసి యై కడు నెలమిన్.

48


వ.

స్వరోచికి నాయుర్వేదవిద్య నిచ్చి యక్కన్యక నీయ నుపక్రమించిన నది తండ్రి
కి ట్లనియె.

49


చ.

మన కుపకారి యైనసుకుమారుని నీతనిఁ జూచినప్డ నా
మనమున రాగ మైనయది మానుగ నైనను దండ్రి నాకతం
బునఁ బటురోగదుఃఖములఁ బొందుచు నెచ్చెలు లిట్టు లుండఁగా
మనసీజభోగలీలలకు మానస మెమ్మెయి నాకు నూల్కొనున్?

50


వ.

అనిన వరూధినీతనయుం డయ్యింతి కి ట్లనియె.

51


క.

ఆయుర్వేదము పెంపున, నీయిద్దఱుసఖుల రోగనిర్ముక్తలఁ
జేయుదు నమ్ముము విడువుము, తోయజదళ నయన! వగపుతో సంశయమున్.

52


తే.

అనుడు రాగంబు నొందినయత్తనూజ, నక్కుమారుని కిడి వివాహంబు సేసి
దివ్యగతి నేఁగె నంత నిందీవరాక్షుఁ, డనఘ! గంధర్వపురమున కతిముదమున.

53


ఆ.

ఎలమిమై స్వరోచి యిట్లు మనోరమఁ, బెండ్లి యై కరంబు ప్రీతితోడ
సతియుఁ దాను దానిసఖు లున్న యుద్యాన, వనమునకును నేఁగి వారిఁ గాంచి.

54

మనోరమసఖులకు శాపవిముక్తి

వ.

రోగఘ్నంబు లైనదివ్యౌషధంబు లుపయోగింప నిచ్చి యక్కన్యకలరోగంబుల
నపనయించిన నయ్యిందుముఖులు నిజకాంతివిలసనంబున నమ్మహీధరంబు దిగంతరం
బులు వెలిఁగించుచు నొప్పి రం దొక్కకన్యక యతని కి ట్లనియె.

55

విభావరీకలావతులు స్వరోచికిఁ దమవృత్తాంతము చెప్పుట

తే.

అనఘ! మందారవిద్యాధరాత్మజన్మ, నే విభావరి యనుదాన నెలమి నీకు
నెల్లభూతభాషలు మది నెఱుఁగునట్టి, విద్యయును నన్ను నిచ్చెద వేగ గొనుము.

56


ఆ.

అనిన నాస్వరోచి యట్ల కాకనవుడు, నాద్వితీయకన్య యతని కనియెఁ
బారుఁ డనఁగఁ బరగు బ్రహ్మర్షి మజ్జన, కుండు సకలవేదకోవిదుండు.

57


చ.

అలికులకీరకోకిలకలారవరమ్యమహీజరాజిచేఁ
బొలు పగునమ్మునీశ్వరుతపోవనభూమికి వచ్చెఁ బుంజిక
స్థల యనునప్సరోంగన ముదంబున దానివిలాసలీలఁ జూ
డ్కులు పురికొన్నఁ బైఁ బడి కడు న్దమకంబునఁ దాను నింతియున్.

58


ఆ.

ఎలమిఁ గామభోగములు సల్పి ననుఁ గాంచి, బహుమృగప్రచారభయద మైన
యడవి డిగ్గ విడిచి యరిగి రయ్యిరువురు, నరుగుటయును నేను నంత ననఘ!

59


ఆ.

అమృతకరునికళల నాప్యాయమానాత్మ, నగుచు రాత్రు లెల్ల నతిశయిల్లి
యనుదినంబు చాల నభివృద్ధి నొందితి, నెఱిఁగి తండ్రి ప్రీతి నేఁగుదెంచి.

60


వ.

నన్నుం దోడ్కొని చని చంద్రకళావర్ధిత నగుటం గళావతి యనునామంబు నా
కొనరించె నంత నొక్కనాఁడు దేవాది యనుగంధర్వుండు.

61


క.

తనకు నను నీనియలుకం, గనలుచుఁ జనుదెంచి మత్తకరివిధమున మ
జ్జనకుని వధియించిన నే,మనమున నిర్వేద మొంది మరణోద్యమమున్.

62


ఉ.

పూనిన శంభుపత్ని యతిభూరిదయామతి సుప్రసన్న యై
మానిని! యేల యీతెగువ? మానుము నెవ్వగఁ దక్కు భర్త తే
జోనిధి యాస్వరోచి యగుఁ జుమ్ము ధ్రువంబుగ నీకుఁ బెన్నిధు
ల్మానుగఁ బెం పొనర్చుచు సమస్తధనంబులు నిచ్చునట్లుగన్.

63


తే.

పద్మినీనామవిఖ్యాతపరమవిద్య, నీకు నిచ్చెదఁ గొ మ్మని నెమ్మి నిచ్చి
యరిగె నద్దేవి గావున నాస్వరోచి, వగుదు నీవు కుమార! తేజోభిరామ!

64


క.

ఈయొడలును నావిద్దెయు, నీయదిగా నిశ్చయించి నెమ్మి ప్రసాద
శ్రీ యుల్లసిల్లఁ గైకొన, వే యిచ్చితి నేను నీకు నెంతయుఁ బ్రీతిన్.

65

స్వరోచి కళావతీవిభావరులఁ బెండ్లియాడుట

ఆ.

అనిన నట్ల కాక యని యాస్వరోచివి, భుండు దేవదుందుభులు చెలంగఁ
దివుట నాకళావతీవిభావరుల వి, వాహ మయ్యె నధికవైభవమున.

66

వ.

ఇవ్విధంబున నవ్వరూథినీనందనుం డక్కన్నియల మువ్వురం బరిణయం బై పర
మానురాగంబున.

67


క.

మందరభూభృత్సుందర, కందరమందారకల్పకచ్ఛాయల నా
సుందరులతో నమందా, నందమున ననేకవిహరణములు సలుపుచున్.

68


సీ.

పద్మినీవిద్యాప్రభావంబుపెంపున వశవర్తులై నిధు ల్వలసినపుడు
మధురసంబులు నతిమధురాన్నములు మృదులాంబరసురభిమూల్యానులేప
నములు సువర్ణమయము లైనశయ్యాసనములు నానాభోజనములు నొసఁగ
నింతులుఁ దానును నింపు సొంపార భోగించుచు మందరగిరిమనోజ్ఞ


తే.

సానుతలమునఁ బొలుచు నుద్యానవనవి, హారములు సల్పునవ్విభు నర్థిఁ జూచి
యొక్కకమలాకరంబులో నున్న హంసి, యెలమి జక్కవలేమతో నిట్టులనియె.

69

స్వరోచింగుఱించి కలహంసీచక్రవాకీసంవాదము

క.

ఇతఁ డింత ధన్యుఁ డగునే, యతులితయౌవనుఁడు సుందరాంగుఁడు నై యీ
యతివలుఁ దాను సుఖస్థితిఁ, జతురవిహారములు వేడ్క సలుపం గనుటన్.

70


వ.

అని మఱియును.

71


ఆ.

మగఁడు గలసెనేని మగువ దాఁ గలయదు, మగువ గలసెనేని మగఁడు గలయఁ
డెలమి నొండొరువుల నిరువురమనములఁ, గలుపుఁ బూర్వసుకృతఫలము సుమ్ము.

72


క.

ఇతనికిఁ గడుఁబ్రియ లీసతు, లితఁడును నీసుందరులకు నెంతయును బ్రియుం
డితరేతరానురాగం, బతిశయ మగుచుండుఁ జూవె యతిధన్యులకున్.

73


వ.

అనిన నాయంచలేమవచనంబు లాదరింపక రథాంగవనిత యి ట్లనియె.

74


ఉ.

నాన యొకింత లేక తననాతులయొద్దన యొక్కనాతియుం
దాను రమించు నీతఁ డొకధన్యుఁడె? యొక్కని కర్థిఁ గూర్తురే
మానుగఁ బల్వు రంగనలు మానిని! కావున నీలతాంగులు
న్వీనికిఁ గారు ప్రేయసులు వీఁడును గాఁడు ప్రియుండు వారికిన్.

75


క.

పరిజనులయందు విభునకు, నరయంగ వినోదమాత్ర మనురాగ మెద
న్బొరసినయట్టులఁ బలువురు, తరుణులయెడ రాగ మొకడు దాల్చుట తరుణీ!

76


ఉ.

ఈవిభుఁ డీలతాంగులకు నెంతయునుం బ్రియుఁడే యటేనిఁ దా
జీవము లేమృగాక్షి విడిచె న్బ్రియుఁ డొండు వధూటిఁ జెందిన
న్గావున విన్ము విద్య వెలగా విలువంబడి వీర లిప్పు డా
జీవని కాప్రకారమునఁ జేరినవారలు చూవె వీనికిన్.

77


క.

విను కలహంసీ! యొక్కని, మన మొక్కతెయందు నొకతె మన మొక్కనియం
దు నిలుచుఁ దిరమయి యది వల, పనఁగాఁ దగుఁ బ్రియము పలువురందుఁ గలుగునే?

78


తే.

ఏను గడుధన్యురాల నియ్యిల మదీయ,విభుఁడు కడుధన్యుఁడని పల్కు విహగిపల్కు
లఖిలభూతభాషావిదుం డైనయట్టి, యాస్వరోచివిభుఁడు విని యాత్మలోన.

79

క.

దానం గడు వగ సిగ్గున, నూనుచుఁ జని యన్నగమున నొకనూఱేఁడు
ల్నానావిధసుఖలీల, న్మానుగఁ గ్రీడించు చొక్కనాఁ డొక్కయెడన్.

80

స్వరోచింగుఱించి మృగదంపతుల సంవాదము

చ.

కనకమయాంగదీప్తు లెసఁగంగ సమున్నతశృంగరంగదా
ననరుచు లుల్లసిల్ల నయనద్యుతిజాలము పర్వఁ జాల నిం
పొనర మృగీతతు ల్బలసి యుండఁగ నున్న కురంగవల్లభు
న్గనియె వనాంతరంబున సుఖస్థితి నింతులతోఁ జరించుచున్.

81


తే.

మనము లలరఁ జూడ్కులుఁ గడు మ్రాలఁ జెవులు, వాల హరిణాంగనలు రాగలోల లగుచు
జేరి హరిణేంద్రునెమ్మోము మూరుకొనుచుఁ, నఱ్ఱు నాకుచు నున్న నాహరిణవిభుఁడు.

82


ఆ.

ఏ స్వరోచిఁ గా నొకింతయు నే లజ్జ, విడవ నట్టిత్రోవ విడుతు వినుఁడు
లజ్జ మాకుఁ గడుఁ దొలంగుఁడు తొలఁగుఁడు, విగతలజ్జమతులవెనుకఁ జనుఁడు.

83


క.

పలువురు లలనలు దనకుం, గలుగుట భోగేచ్ఛ ధర్మకర్మము లెల్ల
న్బొలిసెను వీనికి ధనములు, లలనావర్గంబు కామలంపటుఁ డగుటన్.

84


ఆ.

ఇట్టి యితనిమాడ్కి నెవ్వఁడు వర్తించు, నతఁడు పుణ్యలోకగతుఁడు గాఁడు
గాన నిట్టివానిఁ గామింపుఁ డేను స్వ, రోచి నడుచునట్టిత్రోవ నడువ.

85

స్వరోచికి మువ్వురుపుత్త్రులు పుట్టుట

వ.

అని పలుకుహరిణంబుచేత నాహరిణాంగనలు త్రోపు వడి చని రవ్వచనంబులు
వరూథినీతనయుండు విని తనమనంబున నే నింత కుత్సితుండ నగుదునే! చక్రవా
కియు నీమృగంబు నాచరితం బిట్లు గర్హింతురే యింక నవశ్యంబును సర్వసంగపరి
త్యాగంబు సేయుదు నని యప్పటికిం దలంచి యెప్పటియట్ల మనోభవాధీనమాన
సుండై యయ్యంగనలతోడ నాఱునూఱుసంవత్సరంబులు విషయసుఖంబు లను
భవించి మనోరమయందు విజయుండును విభావరియందు మేరునందుఁడునుఁ గలా
వతియందుఁ బ్రభాసుండు ననుపుత్త్రులం బడసి పద్మినీవిద్యాప్రభావంబునం
దూర్పున విజయునికి విజయం బనునగరంబును నుత్తరంబున మేరునందునికి నంద
వతి యనుపురంబును దక్షిణంబునం బ్రభాసునికిఁ దాళం బనుపట్టణంబును నిర్మించి
యందు వారల నునిచి యాస్వరోచి యొక్కనాఁడు మృగయావినోదార్థంబు ధను
ర్ధరుండై యొక్కరుండును వనంబున కరిగి యనతిదూరంబున నొక్క వరాహంబుఁ
గని దాని నేయం దలంచి గుణంబు సారించి శరంబు సంధించినతఱి నొక్క
మృగాంగన రయంబున నతని డాయం జనుదెంచి యి ట్లనియె.

86

స్వారోచిషమనుజనము

క.

నను నేయు మీశరంబున, ననఘ! ప్రసన్నుఁడవు నాకు నగుము వరాహం

బు నకారణంబు చంపకు, మనిన వరూథినితనూజుఁ డామృగి కనియెన్.

87


సీ.

ఒడల రోగంబు లే దొల్లఁబా టెట్లు నీ కయ్యెఁ బ్రాణము? లన్న హరిణి యనియె
నన్యాంగనాసక్తుఁ డగువాని మనమున వలచిన మరణంబు వెలిగ నాకు
నొండౌషధంబున నుడుగునే యెదతాప మనిన ని ట్లనియెఁ దా నమ్మహాత్ముఁ
డెవ్వనియందు నీహృదయంబు దగిలిన దతఁ డెట్టివాఁడు లోలాక్షి! చెపుమ


ఆ.

యనిన నిన్నె వలచి తనఘ! నీచేతన, మనముఁ గోలుపడితి మనసిజాగ్ని
నెరియఁ జాలఁ జంపవే వేగ నన్ను నీ, పటునిశాతశరముపాలు పఱిచి.

88


వ.

అనిన హరిణికి నతం డి ట్లనియె.

89


క.

మనుజుఁడ నే నీవు మృగివి, విను నీకును నాకు నెట్లు విషయైకసుఖం
బొనరు ననిన మృగి యిట్లను, నను నాలింగన మొనర్పు నా కదె చాలున్.

90


ఆ.

అనిన నాస్వరోచి యాలింగనము చేసె, నాకురంగవనిత నదియు దివ్య
వనిత యయ్యెఁ జోద్యపడి యతఁ డెవ్వతె, వింతి! చెప్పు మనిన నిందువదన.

91


వ.

ప్రేమలజ్జాభరానతవదన యగుచు నల్లన నిట్లనియె.

92


క.

క్షితిరక్షాదక్షుం డగు,సుతు మనువుం బడయ నన్ను సురవరులు జగ
ద్ధితముగఁ బ్రార్థించిన వ, చ్చితి నే వనదేవతను విశిష్టచరిత్రా!

93


వ.

దేవవచనంబున నాయం దపత్యంబు వడయు మనిన నతం డయ్యంగన నంగీకరించె
నంత నయ్యిరువురకును.

94


చ.

అతులితసర్వలక్షణసమంచితమూర్తియు
నుజ్జ్వలప్రభా
న్వితుఁడును నైనపుత్త్రుఁడు జనించెను మ్రోసె నిలింపవాద్యము
ల్వితతసుగంధమారుతము వీచె దిశ ల్విమలంబు లయ్యె నం
చితముగఁ బుష్పవృష్టి గురిసె స్వెస నృత్యము చేసి రచ్చరల్.

95


క.

అతనితనుద్యుతి కత్య, ద్భుత మంది మది న్స్వరోచి ద్యుతిమన్నా మం
బతనికి నొనరిం చెను దగ, నతఁడును భుజబలపరాక్రమాభీలుం డై.

96


వ.

స్వరోచిరపత్యంబగుటంబేసి స్వారోచిషుం డనం బరగె నంత నొకనాఁడు గిరినిర్ఝర
మనోహరప్రదేశంబుల విహరించుచు నాస్వరోచిర్విభుండు హంసమిథునంబు
గనియె నంత నాహంస హంసి కిట్లనియె.

97


క.

బహుకాలము నీతోడను, విహరించితి నిలువఁబడియె విషయసుఖైక
స్పృహ యిప్పుడు గడు ముదిసితి, నిహభోగము లింక నుడుగు టెంతయు నొప్పున్.

98


వ.

అనిన హంసి యి ట్లనియె.

99


క.

భోగము లెప్పుడు వలయును, భోగాత్మక మిజ్జగంబు భూదేవవరు
ల్భోగార్థముగాఁ దపములు, యాగంబులు సేయుచునికి యాత్మ నెఱుఁగవే.

100


సీ.

అనిన రాయంచ యి ట్లను విను భోగైకసక్తులు సంతతసంగపరులు
నగువారిమతి పరమార్థదర్శిని యెన్నఁ డగుఁః జెప్పుమా వార లర్థబంధు

పుత్త్రమిత్రకళత్రములయందు సక్తులై విపులభవాంబుధి వెడల లేక
బహులపంకపతితవనగజములు వోలెఁ గదల నేరక పొలియుదురుగాక


ఆ.

సంగకలితచిత్తు నంగనారాగాంధు, నీస్వరోచిఁ జూచితే శుభాంగి!
పుత్త్రపౌత్త్రవృద్ధిఁ బొంది నేఁడును విష, యోపభోగనిరతి నున్నవాఁడు.

101

స్వరోచి పరలోకగతుఁడగుట

వ.

కామినీపరతంత్రుఁ డైనయీస్వరోచి నాకు సదృశుండు గాఁడు నేను వివేకంబునం
జేసి భోగంబులు పరిహరించితి ననిన హంసవచనంబులు విని యాస్వరోచి జాతో
ద్వేగుండై భార్యాసహితంబు వనంబునకుం జని ఘోరతపం బొనరించి నిష్కల్మష
త్వంబునొంది యమరలోకంబున కరిగె నంత.

102

స్వారోచిషమన్వంతరంబున దేవేంద్రాద్యధికారిపురుషులవివరణము

క.

మనువుం గా స్వారోచిషు, వనరుహగర్భుం డొనర్చె వరగుణ! విను మ
మ్మనుకాలంబునఁ బరగిన, యనిమిషులను మునులు నింద్రు నవనీశ్వరులన్.

103


వ.

పారావతులు తుషితు లనునామంబుల దేవతలు పరగిరి విపశ్చితుం డింద్రుఁడై
నెగడె నూర్జుఁడు స్తంభుఁడు ప్రాణుండు దత్తోళి ఋషభుండు నీవారుండు
నరివంతుండు ననువారలు సప్తఋషులై యవతరిల్లిరి చైత్రుండు కింపురుషుండు
నాదిగాఁగల మనుపుత్త్రు లేడ్వురును రాజు లై రమ్మన్వంతరంబు గలయంత
కాలంబును దత్సంతానజాతు లైననృపతులు ధరణింబాలించి రని చెప్పి మార్కం
డేయుండు.

104


ఉపజాతి.

స్వరోచిజన్మంబును వర్తనంబున్, స్వారోచిషాద్యప్రభవంబు విన్నన్
నరుండు నిత్యోన్నతి నవ్యకీర్తి, శ్రీరమ్యుఁ డై ధాత్రిఁ బ్రసిద్ధి కెక్కున్.

105

పద్మాదినిధిమహిమానువర్ణనము

తే.

అనఘ! పద్మిని యనువిద్య నాశ్రయించి, యుండు నెనిమిదినిధు లని విందుఁ దత్స్వ
రూపములచంద మెట్టు లేరూపునను ధ, నావలులు మానవులకు లభ్యత వహించు.

106


వ.

అనిన మార్కండేయుండు.

107


సీ.

విను పద్మినీనామవిద్యకు శ్రీ యధిదేవత నిధుల కద్దేవి యూఁత
యనఘ! పద్మము మహాపద్మసంజ్ఞము మకరకచ్ఛపములు మఱి ముకుంద
మును గుందమును నీలమును శంఖమును ననునభిధానములచేత నతిశయిల్లు
దానిచే వీక్షితుం డైనమానవుఁ డిల విత్తసంపన్నత వెలయుఁ జుమ్ము


తే.

పద్మనిధిచేతఁ జూడంగఁబడినవరుని, మూఁడుతరములవిభవంబు మూరిఁబోవు
నది ప్రశస్తసాత్వికనిధి యగుట నతఁడు, సాత్త్వికుండును దాక్షిణ్యసంభరితుఁడు.

108


తే.

అగుచుఁ గాంచనరజతతామ్రాదిధాతు, వులు పరిగ్రహించుఁ దివిరి విలుచు నమ్ము

యజ్ఞములు సేయుఁ జేయించు నర్థ మిచ్చి, గుళ్లు చెఱువులు కట్టించుఁ గొమరు మిగుల.

109


వ.

మఱియు సత్త్వాధారం బైనమహాపద్మనిధిచేత నీక్షితుం డైనవాఁడు సత్త్వాధికుండై
పద్మరాగాదిరత్నంబులు దంతంబులును బరిగ్రహించు మౌక్తికప్రవాళాదిక్రమ
విక్రయంబులు నొనరించు యోగీశ్వరులకు ధనం బిచ్చి వారి నారాధించు నవ్వి
భవం బతనికి నేడుతరంబు లెడతెగ కుండు.

110


క.

తామసము మకరనిధి యది, యేమనుజునిఁ జూచె నాతఁ డెంతయును భువి
న్దామసుఁడును దుశ్శీలుఁడు, నై మైమఱువులును విండ్లు నమ్ములు గదలున్.

111


చ.

ఎలమిఁ బరిగ్రహించుఁ బృథివీశులతోఁ దగఁ జెల్మి నేయు శూ
రులకు ధనంబు లిచ్చుఁ గడురూఢిగఁ గైదువు లమ్ము విల్చు న
గ్గల మగువిత్తవాంఛ జని కయ్యమునం దెగటాఱు నుండ దా
కలిమియు వానితోన తెగుఁ గాని తనూజులకు న్మునీశ్వరా!

112


తే.

తామసంబు గచ్ఛపనిధి తదభివీక్షి, తుండు తామసుఁడై కడుదుష్టజనుల
తోడ బేహార మెప్పుడు నాడు నొకని, నమ్మఁ డొకపఱిఁ గూర్చును సొమ్ము దివిరి.

113


క.

కుడిచిన నొరులకుఁ బెట్టినఁ, జెడు సొమ్మని మనమునందుఁ జింతించుఁ గడున్
జెడకుండఁ బాఁతు నిల నీ, జడునిధనము లతనితోనె చనుచుండుఁ దగన్.

114


చ.

వినుము రజోగుణాత్మకము విశ్రుత మైనలసన్ముకుందనా
మనిధి తదీక్ష్యమాణుఁ డగుమర్త్యుఁడు రాజసుఁ డై పరిగ్రహిం
చు ననఘ! గీతవాద్యముఖసుస్థిరవిద్యలు వందిగాయకా
ర్థినటవిటోత్కరంబుల కతిప్రమదంబున నిచ్చు నర్థముల్.

115


క.

బహుసుఖము లనుభవించును, బహుకులటలఁ గలయు మఱియు బహువిధవనితా
స్పృహియై చరించు విను మ, మ్మహితవిభవ మొక్కపురుషమాత్రమునఁ జనున్.

116


సీ.

మహితరజస్తమోమయము కుందం బను నిధి యది చూచిన నిఖిలధాతు
రత్నధాన్యాదిసంగ్రహమును దత్క్రయవిక్రయంబులు గల్గి వెలయు మనుజుఁ
డవమాన మించుక యైన సహింపఁడు పొగడిన హర్షించి తగఁగ నిచ్చు
బంధుల రక్షించు బహుభార్యుఁడును బహుపుత్త్రవంతుండు నై పొలుచు నతని


తే.

యేడుతరములు వర్తించు రూఢిగాఁగ, నమ్మహానిధి యష్టభోగాన్వితులును
నధికదీర్ఘాయువులు సుహృదవనపరులు, నగుదు రావంశజులు సుగుణాభిరామ!

117


సీ.

సత్త్వతమోగుణాస్పదనీలనిధిసంగతుం డగునరుఁడు సద్గుణయుతుండు
ధాన్యకార్పాసవస్త్రఫలప్రసవపరిగ్రహయుక్తుఁడును దరుకాష్ఠశుక్తి
శంఖమౌక్తికజలసంభవాదిక్రయవిక్రయవ్యాపారవిశ్రుతుండు
బహుతటాకారామపద్మినీనిర్మాణఘననదీబంధనక్షముఁడు నగుచుఁ


తే.

జందనాంబరమాల్యభూషణవిశిష్ట, భోగలీలలఁ బొంపిరివోవుచుండు

నతఁడు మూఁడుతరము లుండు నవ్విభవ మ, ఖండితంబయి విమలవిఖ్యాతచరిత!

118


చ.

అనఘ! తమోరజోగుణసమన్వితశంఖనిధీక్షితుండు త
ద్ఘనగుణబద్ధుఁడై కుడుచుఁ గట్టుఁ దొడుం దనయిచ్చ నొక్కఁడు
న్దనయ సతీస్నుషాదులకుఁ దా నిడఁ డెన్నఁడుఁ గూడు చీర యే
జనులకుఁ బెట్టఁ డన్నరునిసంపద యాతనితోన వ మ్మగున్.

119


వ.

అని యిట్లు నరులధనంబున కధిదేవత లైననిధులవిధం బెఱింగించి మఱియును.

120


క.

ఒక్కనిధి నరునిఁ జూచిన, నొక్కనిధిగుణంబు లొందు నొగి మిశ్రములై
పెక్కునిధులు చూచినఁ గడు, నక్కజమునఁ బొందు నతని నయ్యైగుణముల్.

121


క.

అని నిధిలక్షణములు చెప్పినవిని కోష్టుకి మునీంద్ర! ప్రియ మెసఁగంగా
మనువుల నిరువురఁ జెప్పితి, వినిపింపు తృతీయమనువువిధ మేర్పడఁగన్.

122

ఉత్తమమన్వంతరమహిమాభివర్ణనము

క.

ఉత్తానపాదునకు న, త్యుత్తమ యగుసురుచికిం బ్రియుం డగుపుత్రుం
డుత్తమనామాఖ్యాతుఁ డు, దాత్తభుజావీర్యశౌర్యధౌరేయుండున్.

123


చ.

అమితతనుప్రభామహిమ నర్కుఁ డనంగ నితాంతకాంతి న
య్యమృతకరుండు నాఁగ భువనావనధర్మకళాప్రవీణతన్
యముఁ డన శత్త్రుమిత్రసముఁడై పొగడొందినయన్నరేంద్రుఁ డు
త్తమచరితుండు భూరిగుణధాముఁడు వంశవివర్ధనార్థమై.

124


క.

సురపతి శచి ననురక్తిం, బరిణయ మైనట్లు వేడ్క బహుళ యనుతలో
దరిఁ బెండ్లియై మనం బా, తరుణివిలాసంబునంద తద్ద తగిలినన్.

125


సీ.

ఇందుండు రోహిణియందు సంతతనిర్భరానురాగారూఢుఁ డైనమాడ్కి
నాకృశోదరియంద యాసక్తుఁ డై యెఫ్డు మనమున నతఁ డొండుపనులు మఱచి
తనివోక చూడ్కు లాతన్విసౌందర్యరసామృతం బాదట నాని సొగయుఁ
దరలాక్షితనులతఁ దనసుందరాంగంబు సోఁకించి సంస్పర్శసుఖముఁ బొందుఁ


ఆ.

బొలఁతిచెవుల కింపు దళుకొత్త సరసోక్తు, లాడుఁ దివిరి ప్రియము లాచరించుఁ
గళలయందుఁ బ్రీతి గడలుకొనంగ న, మ్మగువవిభ్రమమునఁ దగిలి యిట్లు.

126


మ.

అనుకూలుం డయి సంచరింప మది నయ్యబ్జాక్షి యొక్కింత గై
కొని తద్భూపతి నాదరింపదు గడుం గోపించుఁ దా నాతఁ డి
చ్చినమాల్యాభరణంబు లొల్లదు దనుం జేపట్టి బల్మి న్భుజిం
పనియోగించిన మున్కుచున్ గుడుచు నల్పం బైనయాహారమున్.

127


క.

క్షితిపతి ప్రభూతరాగా, న్వితుఁ డై తన ననుసరించి విపరీతమతి
న్బ్రతికూల యగుచు నవమా, నితుఁగాఁ బతిఁ జేయు నతివ నీచచరితయై.

128


వ.

అంత నొక్కనాఁ డమ్మహీకాంతుండు.

129


క.

వారవనితలును రాజకు, మారులునుం దాను నెలమి మధుపానరతిం

గూరి మధురగీతము లిం, పారఁగ గాయకులు పాడ నారామమునన్.

130


క.

ప్రీతి వినోదించుచు నా, భూతలపతి మధురశీధుపూర్ణచషక మ
న్నాతికి నిచ్చిన నందక, యాతనిదెసఁ జూడకుండె నందఱు చూడన్.

131

ఉత్తముఁడు ప్రతికూల యగుతనభార్య నడవి కంపుట

వ.

ఇ ట్లమ్మానిని త న్నవమానించిన సిగ్గుపడి కోపించి కుంభనిక్షిప్తం బైనయురగం
బునుబోలె నిట్టూర్పు నిగిడించి దౌవారికు రావించి యత్యంతదుష్టస్వాంత యైన
యిక్కాంతం గొనిపోయి విజనం బైనవిపినంబున విడిచి ర మ్మిదియ నిశ్చయం బిట్ల
సేయు మని పంచిన వాఁడును గాంచనరథం బెక్కించుకొని చని యక్కమలాక్షి
నొక్కవనాంతరంబున విడిచి వచ్చిన నచ్చెలువ యబ్భూపతి యిట్లు పరిత్యజించుట
తనకుఁ బరమానుగ్రహంబు సేయుట గాఁ దలంచి సంతసిల్లె నంత.

132


తే.

ఆలతాతన్వియందు దృఢానురాగుఁ, డగుట నన్యదారపరిగ్రహంబు సేయ
నొల్ల కారాజవర్యుఁ డయ్యువిదఁ దలంచి, వగలఁ బొగులంగ నొకవిప్రవరుఁడు వచ్చి.

133

ఉత్తముఁడు రాక్షసాపహృత యగుబ్రాహ్మణునిభార్యను దెచ్చి యిచ్చుట

ఉ.

ఆవిభుఁ గాంచి శోకమున నార్తుడనై చనుదెంచితిన్ ధరి
త్రీవర! యేమి చెప్పుదు విధివ్యవసాయము? రాత్రి నిద్ర
బోవఁగ నాదుభార్యఁ గొనిపోయినవాఁ డొకఁ డెవ్వఁడో యతం
డేవిధమో యెఱుంగఁ దలు పిమ్ముగఁ బెట్టినయట్ల యుండగాన్.

134


ఆ.

ఎడరు వుట్టకుండఁ బుడమిజనంబులఁ, గావఁ బ్రోవ దిక్కు నీవె కాన
యరసి నాకుఁ దెచ్చి యయ్యింతి నీఁదగు, ననిన నిట్టులనియె మనుజవిభుఁడు.

135


క.

ఎవ్వండు పట్టికొనియెనోొ యవ్వెలఁదుక యెచట నున్నయదియొ యెఱుఁగ కే
నెవ్వని దండింతును సతి, నెవ్విధమున దెత్తుఁ జెప్పు మీడ్యచరిత్రా.

136


వ.

అనిన నవ్విప్రుం డి ట్లనియె.

137


తే.

నీవు మాధర్మములలోన నృపవరేణ్య!, కూలి యాఱవభాగంబు గొనుచు మమ్ముఁ
గావఁ బూనినకతమునఁ గాదె యొండు, చింత యెఱుఁగక రేలు నిద్రింతు మేము.

138


వ.

అనిన నన్నరేంద్రుండు.

139


క.

ఎట్టిది నీసతిరూపం?, బెట్టిది ప్రాయంబు? భూసురేశ్వర! శీలం
బెట్టిది? నిక్కము చెపుమా, యెట్టయినను వెదకి తెచ్చి యిచ్చెద ననినన్.

140


తే.

నిడుదపొడవును మిడిగ్రుడ్లు బడువుటొడలు, గుంతమోమును గుఱుకేలుఁ గుండకడుపు
మిట్టపండ్లును నెంతయుఁ బెట్టిదంపుఁ, బలుకులును దురాచారంబు బరికెతలయు.

141


తే.

కలికి జవ్వన ముడివోయి కడుఁగురూప, యై మదీయభామిని యుండు నధిప! యట్టి
దైన నెయ్యింతి నొక్కయె గ్గాడ దాని, కింపు మిగులంగ వర్తింతు నిది నిజంబు.

142

వ.

అని చెప్పిన విని యమ్మహీపతి గర్హించుచు.

143


క.

చాలుం జెప్పకు నీ కాయా లేటికి మేదినీసురాధిప! యే నొం
డాలిం జేసెదఁ జేకొను, మాలు సుఖార్థంబొ వేదనార్థమొ చెపుమా.

144


తే.

సతికి రూ పెంత కలిగినఁ జాలు విప్ర, వర్య! శీలంబ యెక్కుడు వలయుఁ గలుగఁ
గాన రూపును శీలంబు లేనియట్టి, వెలఁది వేయువిధంబుల విడువవలయు.

145


వ.

అనిన నాభూదేవుండు భూపతితో భర్తకు భార్య రక్షణీయ యందు భర్త
ప్రజారూపంబునం బ్రభవించుఁ బ్రజారక్షణం బతనికిఁ దన్నుఁ దా రక్షించు
కొనుట యని వేదంబులు చెప్పు భార్య యన్యలభ్యయైన వర్ణసంకరంబగు సంకర
దోషంబున స్వర్గంబువలనం బాసి పితృవర్గం బధోగతిం బడు సభార్యుఁడ నగు
నాకు నిత్యకర్మహాని వాటిల్లుఁ దాన నరకప్రాప్తి యగు మఱి యయ్యింతియందు
సంతతి యుద్భవించిన నది నిజధర్మంబున నాఱవభాగంబున నీ కొసంగు నింతయు
నీ కెఱింగించితి నెత్తెఱంగున నైన నత్తెఱవ నరసి యీవలయు సనిన నవ్విప్రు
వచనంబులు విని యన్నరేంద్రుండు సర్వసాధనసనాథంబైన మహారథం చెక్కి
చని పృథివీవలయం బెల్లం బరిభ్రమించుచు మహారణ్యంబున నొక్కతపోవనంబు
గని యరదంబు డిగ్గి దానిం బ్రవేశించి యందు.

146


తే.

కుశకృతాసనాసీనుని విశదతేజు, నొక్కమునిఁ గాంచె నమ్మునియును నరేంద్రుఁ
గని సముస్థితుఁడై కడువినయ మెసఁగఁ, గుశల మడిగి శిష్యునిఁ గనుఁగొని ముదమున.

147


క.

ఇతనికిఁ దె మ్మర్ఘ్య మన, నతఁ డల్లన ' మహాత్మా! యర్ఘ్యం
బితనికి దాతవ్యంబే?, మతిఁ బరికించి ననుఁ బనుపు మహితవిచారా!

148


క.

అనిన ముని చిత్తమున న, జ్జనపతివృత్తాంత మెఱిఁగి సమ్మద ముచితా
సనసంభాషణముల నా, తనికిని గావించి యనియెఁ దద్దయుఁ బ్రీతిన్.

149


ఆ.

ఏల వచ్చి తిచటి? కెవ్వరి వెదకె దు, త్తానపాదతనయ! మాననీయ!
యేను నిన్ను నాత్మ నెఱుఁగుదుఁ జెప్పుమా, యనిన నతని కిట్టు లనియె నృపతి.

150


క.

ఒకవిప్రునిసతి నెవ్వఁడొ, యొకరుఁడు గొని చనిన దాని నొగి నన్వేషిం
చుకుతూహలమున మునినా, యక! వచ్చితి నివ్వనమున కది య ట్లుండెన్.

151


క.

ఏ నొక్కటి ని న్నడిగెద, మానుగ నా కెఱుఁగఁ జెప్పు మహితదయాధీ
నా! నావుడుఁ జెప్పం దగు, నేనిం జెప్పెద నరేంద్ర! యేమి యడుగుమీ.

152


ఆ.

నన్నుఁ గాంచి మున్ను మన్ననమై నర్ఘ్య, మీఁ గడంగి యేల యీవు పిదప?
ననిన మునివరేణ్యుఁ డప్పుడ శిష్యు ని, మ్మంటి నీకు నర్ఘ్య మనుఁడు నతఁడు.

153


వ.

మత్ప్రసాదంబున నతీతానాగతవర్తమానదర్శి యగుటం జేసి విచారించి పనుపుమనిన
నేనునుం బ్రబోధితుండనై మనంబున నీవు స్వాయంభువకులజుండ వర్ఘ్యార్హుండ
వగుదైనను నీకు నిప్పు డర్ఘ్యయోగ్యత లేకుండుట యెఱింగి యర్ధ్యం బీనైతి
ననిన నమ్మహీశ్వరుండు.

154

తే.

అర్ఘ్యమునకు నర్హుఁడఁ గానియంత పాప, మేమి చేసితి చెప్పుమా యెఱుకమాలి?
యనిన మునియును మఱచితే మనుజనాథ, విడువవే నీవు పత్ని నట్టడవిలోన.

155


తే.

దాని విడిచినయప్పుడ ధర్మకర్మ, వితతి యెల్లను నీచేత విడువఁబడియె
నొక్కపక్షము గర్మవియుక్తుఁ డైన, యతని ముట్టఁ గాదండ్రు, మహాత్ము లనఘ!

156


క.

ప్రతికూలయు దుశ్శీలయు, సతతంబును నైనఁ బత్నిఁ జనదు విడువఁగాఁ
బతికిఁ దగు దానిఁ బ్రోవ ను, చిత మగుచందమునఁ గూడుఁ జీవియు నిడుచున్.

157


వ.

ఇట్టినిజధర్మంబు నీవు తప్పితేని నిన్ను నెవ్వరు శిక్షింతు రనిన నౌత్తానపాది సిగ్గునం
దలవంచి మునీంద్రా! యింక నీ చెప్పినట్లు చేసెద నివ్విప్రునివెలంది నెవ్వండు గొని
పోయె? నది యెక్కడ నున్నది? యెఱింగింపవే యనిన నతండు.

158


తే.

అద్రిసుతుఁడు బలాకనామాసురేంద్రుఁ, డవ్వనిత నుత్పలావతకాఖ్యవనము
నందుఁ గొనివచ్చియిడినవాఁ డచటి కరుగు, మనిన నతఁ డమ్మునికి మ్రొక్కి యరద మెక్కి.

159


సీ.

ఆవిపినంబున కతిరయంబునఁ జని యావిప్రు చెప్పిన యట్టివికృత
రూపంబుతో నున్న యాపొల్తిఁ గని చెల్వ యీవనంబునకు నీ వెట్లు వచ్చి
తెఱిఁగింపు వైశాలియింతివే నావుడు నగుదు నే నతిరాత్రుఁ డనుమునీంద్రు
సుత నింటిలో సుఖసుప్త నై యుండంగఁ బతిపితృభ్రాతలఁ బాసి నన్ను


ఆ.

నధిప! విను బలాకుఁ డనురాక్షసుఁడు రాత్రి, యవహరించి యీవనాంతమునకుఁ
జేర్చె శోకవహ్ని పేర్చుచు నిందున్న, దాన బంధుజనులఁ దలఁచి తలఁచి.

160


క.

ననుఁ దెచ్చినకారణ మో, జనవల్లభ! యెఱుఁగ నన్నిశాచరుఁడు రయం
బున మ్రింగఁడు నాతో నిం, పొనరఁగ భోగింపఁ డనిన నుర్వీశుఁ డనున్.

161


క.

నిను వెదకఁగ నీవిభుపం, పున వచ్చినవాఁడ నెందుఁ బోయె నిశాటుం
డనిన నది యిట్టు లను ని, వ్వనాంతమున నున్నవాఁడు వాఁడు నరేంద్రా!

162


మాలిని.

దనుజభటపరీతు న్దైత్యు న రాజు గాంచె
న్వినయనిభృతు లొప్ప న్వేగ వాఁడు న్శిరంబున్
జనపతిచరణాంభోజాతము ల్పేర్చి చిత్రం
బునఁ బ్రమదరసం బుప్పొంగ నత్యంతభక్తిన్.

163


స్రగ్విణి.

నీవు నాయింటికి న్నెమ్మి నేతెంచుటన్
దేవ! ధన్యుండ నైతి న్నను న్భృత్యునిం
గా విచారింపు కార్య మైనం దగన్
భూవరా! పంపు, మేఁ బొల్పుగాఁ జేసెదన్.

164


వ.

అర్ఘ్యంబు పరిగ్రహింపుమీ రుచిరాసనంబున నాసీనుండవగుమనిన నన్నరపతి
యి ట్లనియె.

165


చ.

చెలువుగ నాకు సర్వమును జేసినవాఁడవు నీవు చెప్పుమా
విలసితరూపశాంతిగుణవిశ్రుత గాదు పరిగ్రహింప నా

కలి యడఁగంగఁ దత్పిశితఖాదన మేల యొనర్ప? వేల పే
రలుక మహీసురోత్తమునియంగనఁ దెచ్చితి రాక్షసేశ్వరా!

166


వ.

అనిన నతండు.

167


తే.

జనుల భక్షించుకష్టరాక్షసుల మేము, గాము పురుషులు పడఁతులు గడఁగి సేయు
కర్మములయందు వికలత గలిగినప్పు, డాఫలంబులఁ దృప్తుల మగుదు మధిప.

168


తే.

పరులు గోపించినప్పుడు నరవరేణ్య! తత్స్వభావంబు లగుశాంతిదాంతిగుణము
లేము హరియించెదము గాని హీనవృత్తిఁ, దినము నరమాంస మన్యదైతేయులట్ల.

169


తే.

అచ్చరలకంటె నొప్పెడునసురసుదతు, లధిప! పెక్కండ్రు గలరు నా కకట! మనుజ
వనితయం దేల రతి పుట్టు? ననిన వెండి, యేల తెచ్చితి ద్విజకాంత? నెఱుఁగఁ జెపుమ.

170


చ.

అనుటయు రాక్షసుండు మనుజాధిప! యాద్విజుఁ డధ్వరంబులం
దనిశము ఋత్విజుం డయి మహాసురనాశకరోగ్రమంత్రము
ల్తనహృదయంబున న్జపము తత్పరుఁడై యొనరించు చున్కి మా
కు నచటఁ జేర రాక యలఘుక్షుధ నార్తులమై మనంబునన్.

171


వ.

ఉచ్చాటనమంత్రకర్మపరుం డైనయావిప్రునితోడం బగ గొని.

172


ఆ.

ఆలు లేనిపురుషుఁ డధ్వరాదిక్రియా, బాహ్యుఁ డౌట యెఱిఁగి బ్రాహ్మణునివ
ధూటిఁ దెచ్చి యతనిఁ ద్రోచితిఁ గర్మవై, కల్యదురితమున నకల్మషాత్మ.

173


వ.

అనిన నతివిషణ్ణుండై యంతర్గతంబున విప్రునికర్మవైకల్యం బుగ్గడించి వీఁడు నన్ను
నిందించుచున్న వా డమ్మునిపతియు నర్ఘ్యంబునకు నర్హుండవు గా వని గర్హించె
నపత్నీకత్వంబున నింత నికృష్టుండ నగుదునే యని వగచుచున్న జగతీపతికి నద్దను
జుండు మ్రొక్కి కృతాంజిలియై దేవా! భవదేశనివాసి యైననాయట్టిభృత్యుఁడు
గలుగ నీకింత చింతింపనేల? యేమిపని చేయుదు? పసుపు మనిన నన్నరేంద్రుఁ
డసురేంద్రున కిట్లనియె.

174


క.

నరులనిజభావగుణములు, హరింతు నని పల్కె దీవు ప్రార్థింపుదు ని
న్గరమర్థిని హరియింపుము, ధరణీసురధర్మపత్ని దౌశ్శీల్యంబున్.

175


ఆ.

అట్లు సేసితేని యభ్యాగతుఁడ నైన, నాకు సర్వమును మనఃప్రియంబు
చేసినట్ల యిదియు శీలసమన్విత, యై నిజేశుకడకు నరుగు ననిన.

176


మ.

తనమాయ న్దనుజుండు విప్రవనితాంతస్సంప్రదేశంబు చే
సి నృపాజ్ఞ న్నిజశక్తి నాసుదతిదౌశ్శీల్యం బొగి న్మ్రింగె మ్రిం
గిన నక్కాంత సుశీలయై వినయలక్ష్మీస్ఫూర్తి శోభిల్ల ని
ట్లనియె న్భూపతితోడ నిర్భరగరీయఃప్రౌఢవాక్యంబులన్.

177


సీ.

పరికింప నాకర్మపరిపాక మెట్టిదో పతిఁ బాసి యడవులపాలు వడితి
దనుజుండు దయ మాలి ననుఁ బట్టికొని యిట్టు దెచ్చెఁ బాపపువిధి దెచ్చెఁ గాక

యేతెరు వైతినో యేనని పురపురఁ బొక్కుచుండరె బంధు లక్కటకట!
యొరులకుఁ దొలుమేన నుడుకులఁ బెట్టినదాని కిప్పా టేల మాను రాక?


ఆ.

యేమి సేయుదాన నేగతిఁ బోదు నిం, కేవిధమున భర్త కెలమి మిగులఁ
బరిచరింపఁ గాంతు భక్తిమై? మజ్జన్మ, మిటుల పోవునో కదే నరేంద్ర!

178


చ.

అన విని రాక్షసుండు వసుధాధిప! యీయెలనాఁగ నీదుపం
పునఁ బతియింటి కిఫ్డు గొనిపోయెద నేఁ గరణీయ మెద్దియై
నను నొనరించెదం బనుపు నావుడు నిప్పనిచేఁత సర్వము
న్దనుజవరేణ్య! నీవు ప్రమదంబునఁ జేయుట నాకుఁ జెచ్చెరన్!

179


వ.

ఇమ్మానిని ననిచి రమ్ము పని గలయప్పుడు నిన్నుం దలంచెద వచ్చునది యనిన నద్ద
నుజవరుం డట్ల కాక యని సుశీలయు శుద్ధాంతరంగయు నైనయాద్విజాంగన
నెత్తికొని తదీయగృహంబునకుం జనియె నిట్లు మహీపతి యయ్యింతి నటఁ బుచ్చి.

180

ఉత్తముఁడు త్రికాలజ్ఞమునివలన బహులావృత్తాంతము నెఱుంగుట

సీ.

అర్ఘ్యయోగ్యుఁడవు గావని నన్నుఁ గడుఁ గష్టముగఁ దూఱఁబలికె నమ్మునివరుండు
బ్రాహ్మణుగుఱిచి యీరాక్షసుండును బత్ని లేనివాఁ డెంతయు హీనుఁ డనియె
నేమి నేయుదు? భార్య నే నేల విడిచితి నెక్కడఁ గాంతు? నిం కేది తెఱఁగు?
పరమప్రబోధసంపన్ను నమ్మునిఁ బోయి యడిగేదఁ గాక యయ్యతివవృత్త


ఆ.

మని మునీంద్రుకడకుఁ జని మ్రొక్కి యవ్విప్రు, కాంతఁ గనుట దనుజుకడకుఁ జనుట
దాను బనుప దాని దౌశ్శీల్య మడఁచి వాఁ, డపుడు భర్తయొద్ద కనుపఁబోక.

181


వ.

చెప్పి యాభూభుజుండు నిజాగమనకార్యం బెఱింగించిన నత్తపోధనుండు.

182


క.

జననాథ! నన్ను నడుగఁగఁ, జనుదెంచిన కార్య మేను సర్వంబు మనం
బున దివ్యదృష్టి నెఱుఁగుదు, విను సెప్పెద నీకుఁ దగునె విడువఁగ భార్యన్.

183


ఉ.

ఆరయ సర్వకర్మముల కర్హులు గారు తలంచి చూడఁగా
దారవిహీను లైనవసుధాసురభూవరవైశ్యశూద్రు ల
న్వారలు పత్నికి న్బతి నవశ్యముఁ బాయఁగ రానియట్లు వి
స్ఫారయశోవరేణ్య! సతిఁ బాయఁగ రాదు తదీయభర్తకున్.

184


తే.

కారణము పత్ని ధర్మార్థకామములకుఁ, గానఁ దత్తజనంబున మానవేంద్ర!
వినుము నిఖిలధర్మంబులు విడిచి తకటl, యింత యొప్పమి సేయుదే యెఱుకమాలి.

185


చ.

అని ముని పల్కిన న్విని జనాధిపుఁ డూర్పులు సందడింప నె
మ్మనము చలింపఁగా నకట! మత్సుకృతం బిటు లుండ నేమి సే
య నగు! ననుందొఱంగునొకొ యంగనయ న్వెఱ నెట్టు సేసిన
న్మన మెఱియంగ సైఁతు సుజనస్తుత! యిచ్ఛకు రాః జరించుచున్.

186


క.

అనుకూలుఁడ నై సతతము, గనుసన్నన యేను మెలఁగఁగా దౌశ్శీల్యం

బునఁ దాఁ బ్రతికూల యయిన, విను మెంతయు విసిగి దాని విడిచితి నడవిన్.

187


ఉ.

ఎక్కడఁ బోయెనో యడవి నింతి మహోగ్రమృగాసురాళిచేఁ
జిక్కి నశించెనో యనినఁ జిక్కి నశింపదు సచ్చరిత్ర
యక్కమలాక్షి యున్నది ధరాధిపవర్య! రసాతలంబునం
దక్కడ కెట్టు లేఁగెనొకొ యంగన యన్న మునీంద్రుఁ డిట్లనున్.

188


వ.

వినోదార్థంబు భూతలంబునకు వచ్చి.

189


తే.

అడవిఁ గ్రుమ్మరుచున్న యయ్యబలఁ గాంచి, సాలపోతకుఁ డనియెడుసర్పరాజు
సానురాగుఁడై తనదుమాయాబలమునఁ, బట్టుకొని పోయెఁ బన్నగభవనమునకు.

190


వ.

కొనిపోయిన నాదందశూకేంద్రనందన యగునంద యాసుందరీరత్నంబు నాలో
కించి యిది మాతల్లికి సవతి గాకుండవలయునని తలంచి యంతఃపురంబున నొక్క
యేకాంతమందిరంబున నునిచి దాఁచిన నాపాపఱేఁడు కూతుం బిలిచి యచ్చెలువ
యేది చెప్పుమనిన నుత్తరం బీమికిం గోపించి మూకత్వంబు నొందు మని దాని
శపియించె నిత్తెఱంగున భవదీయపత్ని సర్పపతిచేత నీతయై తత్తనయచేత రక్షి
తయై యున్నయది యనిన నమ్మహీశ్వరుండు హర్షించి యిట్లనియె.

191


తే.

ప్రాణములకంటె నెక్కు డప్పడఁతిమీఁదఁ, బ్రీతి నాకు డెందమున నన్నాతి నన్ను
నొల్ల కెపుడు దుశ్శీలయై యుండు దీని, కేమి కారణ? మెఱిఁగింపవే మునీంద్ర!

192


వ.

అని యడిగిన నతం డి ట్లనియె.

193


చ.

పరిణయవేళ నిన్ను రవిభౌమశనైశ్చరులు న్భవత్సతిన్
సురగురుదైత్యమంత్రులును జూచుటఁ జేసి నరేంద్ర! నీకు న
త్తరుణిమనోహరాకృతి ముదం బొనరించుచు నుండెఁ జూడ్కి క
తరుణికి నీదుమూర్తి ప్రమదం బొనరింపమి నట్టి దయ్యెడిన్.

194


క,

అని చెప్పి మేదినీశ్వర, చనుము సతియు నీవుఁ గూడి సద్ధర్మమున
న్జనపాలనము సేయుము, ఘనముగ నొనరింపు విహితకర్మము లెల్లన్.

195


ఆ.

అనిన మునికి మ్రొక్కి యరదంబు వెస నెక్కి, నిజపురమున కేఁగె నృపతి యంతఁ
గడుసుశీల యైన కాంతతోఁ గూడి నె, య్యమున నున్న విప్రుఁ డధిపుఁ గాంచి.

196


వ.

ఇ ట్లనియె.

197


చ.

నిరుపమధర్మవేది వయి నీ విటు నాసతిఁ దెచ్చి యిచ్చుట
న్పురుషవరేణ్య! యేను గడుఁబుణ్యచరిత్రుఁడ నైతి నావుడు
న్నరపతి భార్య నాకు సదనంబున నిప్పుడు లేమిఁజేసి భూ
సురవర! నిత్యకర్మ బహుశోభనహీనత నేను బొందితిన్.

198


సీ.

అనుడు భూసురవరుఁ డధిప! నీకాంత గాంతారాంతరశ్వాపదములు మ్రింగ
కున్నె నీ కిది సాలు నొండుకన్యకఁ బెండ్లి గా వేల? యన్న నాభూవరుండు

మృగబాధఁ బొరయ దామృగనేత్ర సుచరిత్ర యై యున్న దదియును నైనఁ దెచ్చి
కొనఁ బోల దది ప్రతికూలత్వమునఁ బోరుచుండు నాతో నెప్డు నోర్వఁ జాల


తే.

నాలు వోరిన మనవచ్చునయ్య? దుఃఖమునకొ సుఖమునకొ నరులమనువు చెపుమ
యనిస బ్రాహ్మణుఁ డుపకారి యైననీకు, హితము సేయంగఁ గంటి నరేంద్ర! వినుము.

199


తే.

మైత్రియును నానుకూల్యంబు మచ్చికయును, గలిగి యక్కాంత నిన్నెప్డు గలసియుండ
మిత్రకాముకు లొనరించుమిత్రవింద, యెట్టి దట్టిది గావింతు నే నరేంద్ర!

200


వ.

అయ్యింతి యెక్కడ నున్నది వేగ రావింపు మనిన హర్షించి యన్నరవరుం డప్పుడ
మిత్రకామేష్టికిం దగినసంభారంబులు సమకట్టి తెప్పించిన నవ్విప్రవర్యుండు నియ
తుండై యాభూపతిభార్య యనుకూలయు సుశీలయుఁ గావలయు నని సంక
ల్పించి యాశతపత్రనేత్రయందు మైత్రి నారోపించి యపుడు మిత్రకామేష్టి
యొనరించి రాజు నాలోకించి.

201


క.

రావింపుము సతి రయమున, భూవర! యిష్టోపభోగములు హర్షరస
శ్రీ వెలయ ననుభవింపుము, కావింపుము క్రతువు లధికగౌరవ మెసఁగన్.

202


తే.

అనిన విస్మయస్మేరాక్షుఁ డై విభుండు, తలఁచె సత్యవాగ్ధుర్యు నాదనుజవర్యు
నతఁడు రయమున వచ్చి భూపతికి మ్రొక్కి, యేమి పని యొనరింతు నరేంద్ర! చెపుమ,

203


చ.

అనుడు విభుండు దైత్యునకు నంతయు నేర్పడఁ జెప్పెఁ జెప్పినం
జని యతలంబుఁ జొచ్చి నృపసత్తముదేవి నతండు దెచ్చెఁ దె
చ్చినఁ బతిఁ జూచి కంపమును సిగ్గును నెయ్యము నగ్గలింప నం
గన గరుణం బ్రసన్నుఁడవు గమ్ము నరేశ్వర! నాకు నావుడున్.

204


క.

ఏ నీ కెపుడుఁ బ్రసన్నుఁడఁ, గానే తరళాక్షి! క్రొత్తగా నిటు పలుకం
గా నేల? యనుచు విభుఁ డ, మ్మానిని వెసఁ గౌఁగిలించె మదనాతురుఁ డై.

205


వ.

ఇట్లు దన్నుఁ గౌఁగిలించుకొని ప్రసన్నుం డయి యున్న యతని కయ్యింతి
యిట్లనియె.

206


క.

చిత్తము నీకుఁ బ్రసాదా, యత్తం బై యున్న దేని యడిగెద విను రా
జోత్తమ! యొక్కటి నినుఁ దలఁ, కొత్తక యది సేయు మనుడు నుర్వీశుండున్.

207


క.

ఏ నీకు దక్కి యుండం, గా నిట్లన నేల? యెంత కడిఁది యయిన న
బ్జానన! చేసెద నీప్సిత, మైనది నిశ్శంక మడుగు మనుటయు నదియున్.

208

సుశర్మ చేసినసారస్వతేష్టిచే నంద యను నాగకన్య మూఁగతనము మానుట

చ.

జనవర! నానిమిత్తమున సర్పవరాత్మజ తండ్రి త న్శపిం
చిన విను మూకభావమును చెందిన దాలలితాంగి నాకు న

చ్చిన చెలి వాగ్విభూతి విలసిల్లఁగ దానికిఁ జేఁత నాదునె
మ్మనమున కిం పెలర్పఁగ సమస్తము నీ వొనరించిన ట్లగున్.

209


తే.

అనుఁడు విప్రునిఁ జూచి యమ్మనుజవిభుఁడు, వాగ్విభవ మెట్లు గల్గు నవ్వనిత కనిన
నేను సారస్వతేష్టివిధానమున భ, వద్వధూటీసఖికి నిత్తు వాగ్విభూతి.

210


వ.

అని యప్పుడు సారస్వతేష్టి యొనరించి యమ్మహీసురుండు సారస్వతసూక్తంబులు
జపియించె నంత గర్గుం డనుముని రసాతలంబున కరిగి యురగపతినందన కంత
వృత్తాంతంబును జెప్పిన విని.

211


క.

ఆనంద దనమనమ్మున, నానందముఁ బొంది నావయస్యావిభుఁడే
మానుగ నా కుపకారము, దా నొనరించె నని మెచ్చి తద్దయుఁ బ్రీతిన్.

212


తే.

అపుడ కదలి యప్పురమున కరుగుదెంచి, యాత్మసఖిఁ గాంచి కౌఁగిట నర్థిఁ జేర్చి
యధిపు నందంద దీవించి యాభుజంగి, యాసనాసీన యై యిట్టు లనియె ననఘ!

213


క.

కర ముపకారము నాకుం, దిరముగ నొనరించి తీ వతిప్రియమున భూ
వర! యేను మెచ్చి వచ్చితి, వర మిచ్చెద నీకు విను దివాకరమూర్తీ!

214


ఉ.

నీతనయుండు సర్వధరణీపరిపాలనకేళిదక్షుఁ డై
యాతతధర్మకర్మరతుఁ డై మహనీయతరాస్త్రశస్త్రవి
ద్యాతివిదగ్ధుఁ డై భుజబలాధికుఁ డై పెనుపొందు దీధితి
ద్యోతితచక్రవిక్రమమహోధ్ధతి నప్రతిమానుఁ డై మహిన్.

215


వ.

అతఁడు మహనీయుఁ డైనమను వై నెగడు నని వరం బిచ్చి యచ్చెలువ నెచ్చె
లిం గౌఁగిలించుకొని నిజభవనంబున కరిగె నంత నమ్మహీకాంతుం డక్కాంతా
రత్నంబుతో నితాం ప్రమోదంబున మనోభవసుఖంబు లనుభవించుచుఁ బ్రజా
పాలనంబు సేయుచుండఁ బెద్దకాలంబు సనుటయు.

216

ఉత్తమమనుజననము

క.

పూర్ణిమ నుదయం బగుసం, పూర్ణసుధాంశుఁడును బోలెఁ బుత్రుండు దిశా
పూర్ణద్యుతి యై యావర, వర్ణినికిం బుట్టె సురలు వర్ణన సేయన్.

217


వ.

అప్పుడు.

218


ఆ.

మొరసె దివ్యతూర్యములు పుష్పవర్షంబు, గురిసె జనులు ప్రమదభరితు లైరి
సకలమునులు నెలమిఁ జనుదెంచి యుజ్జ్వలా, కారుఁ డైనయక్కుమారుఁ జూచి.

219


క.

ఉత్తమ మగువంశంబున, నుత్తమకాలమున నీతఁ డుత్తమతనుఁ డై
యుత్తమనృపతికిఁ బుట్టుట, నుత్తము: డనుపేరఁ బరఁగు నుర్వి నని మునుల్.

220


క.

చని రంతఁ బెరిఁగి యుత్తముఁ, డనఘుఁడు మనువయ్యె నుత్తమాఖ్యానంబు
న్వినినను జదివిన వనితా, తనయోపేతు లయి మండ్రు ధరణీజనముల్.

221


వ.

ఆయుత్తమమన్వంతరంబున దేవతలు స్వధాములు సత్యులు శివులు ప్రతర్దనులు
వశవర్తులు నన నేనుగణంబు లై వర్తిల్లిరి సుశాంతి యనువాఁడు శతక్రతువు

లొనరించి యింద్రుం డై పరగె నిప్పుడు నిలాతలంబున నుపసర్గదోషంబులు చెడ
శాంతుండును దేవకాంతుండును నైనసుశాంతి మాకు శాంతి యీవలయు నని
నిగమసూక్తంబులు పఠింతురు సుతేజసుఁడును సుతపుఁడును నాదిగాఁ గలవసిష్ఠ
పుత్రు లేడ్వురును సప్తఋషు లై చరించిరి మనువునకు బలపరాక్రమవంతు లైన
యజాదులు పెక్కండ్రు కొడుకులు పుట్టిరి తత్సంతానజాతు లగుభూపతు లనేకు
లమనువుకాలంబు డెబ్బదియొక్కమహాయుగంబులును మహీవలయంబు పరి
పాలించి రిది తృతీయమన్వంతరప్రకారం బింక వియోనిజాతుం డైనచతుర్థమను
వగుతామసుజన్మంబు ప్రభావంబును జెప్పెద నాకర్ణింపుము.

222

తామసమన్వంతరమహిమానువర్ణనము

చ.

అతులితభూరిబాహుబలుఁ డాహవ కేళిజితారి సంతత
క్రతువిభవాభిరాముఁడు సురాష్ట్రుఁడు నాఁ గలఁ డొక్కమేదినీ
పతి యతఁ డాయు వెక్కుడుగ బ్రాహ్మణవర్గముచేతఁ గాంచి యం
చితగతి నూర్వు రంగనలఁ జెల్వుగఁ బెండిలి యయ్యె వారలున్.

223


ఆ.

వంధ్య లైరి కాలవశమున నంత న, వ్వనితలును నమాత్యులును సమస్త
బంధుజనులు దెగిరి బలహీనుఁ డయ్యె న, వ్విభుఁడు భృత్యతతియు విడిచె నతని.

224


క.

అతిదుఃఖతుఁ డగునాభూ, పతిఁ ద్రోచి విమర్దుఁ డనునృపతి రాజ్యం బు
ద్ధతిఁ గొనియె నతఁడు రాజ్య, చ్యుతుఁ డై యొక్కరుఁడు నరిగె నుగ్రాటవికిన్.

225


సీ.

అరిగి వితస్త నాఁ బరగుమహానదితటమున నుండి నిదాఘవేళ
నగ్ని నల్గడ మండ నర్కునిఁ జూచుచు వర్ష కాలమున దుర్వారవృష్టి
పైఁ బెల్లు గురియంగ బయలు నిలిచి హిమసమయంబులం దుదకములు సొచ్చి
యతినిష్ఠతో నిరాహారుఁ డై తపము నిరంతరమును జేయ నంత వర్ష


తే.

కాలమున నీలనీరదజాల మడరి, నింగియును దిక్కులును గడు నిండఁ బర్వి
నిమిష మైనను నిలువక నిగ్రహముగఁ, గుండ గూల్చినక్రియ వాన గురియఁజొచ్చె.

226


వ.

అట్టిసమయంబున.

227


క.

ఇది పూర్వం బిది దక్షిణ, మిది పశ్చిమ మిద యుదీచి యిది దివి యనితోఁ
చద యించుకయును సాంద్రాం, బుదపటలము కరము భువనపూర్ణం బైనన్.

228


వ.

అంత.

229


ఆ.

రెండుదరులు ముంచి యొండొండ వెల్లువ, యగ్గలింప నురువు లడలుదేర
నతిరయమునఁ బఱచునయ్యేటివ ఱ్ఱొడ్డి, పోయె దవ్వు గాఁగ భూవిభుండు.

230


వ.

అట్లు బోవుచు నప్పుడమిఱేఁ డయ్యేటినీటిలో నీఁదుచు నొక్కపిడిదుప్పి చేరిన
దానితోఁక పట్టికొనియె నది యీడ్చుకొని పోవ నప్పెనుఁజీకటి దిక్కు దెస
యెఱుంగక యిట్టట్టునుం దిగిచి యెట్టకేలకు దరి యెక్కిన నతండు మఱియును
దానితోఁక విడువక చని మనోహరం బగువనంబు గని యన్నిబిడాంధకార

నీరంధ్రం బగుదానిలోనికి నమ్మృగి తపఃకృశుండును మహాభాగుండును నగునతనిఁ
దిగిచికొని చనునప్పుడు.

231


చ.

కరమనురాగ ముల్లమునఁ గ్రమ్మఁగ నమ్మృగిపుచ్ఛమూలము
న్గరమున నంటుచు న్నృపతి కామవికారము నొందే వీఁకఁ ద
త్పరమతి యై తనుం దివుచుపార్థివుచిత్త మెఱింగి యేల నీ
కరమునఁ బుచ్ఛమూల మిటు కాయ్వునఁ బట్టెదు మేదినీశ్వరా!

232


వ.

అనుచుం దదీయసంస్పర్శనసుఖంబు నొంది

233


క.

ఏ నీకగమ్య నే య, స్థానంబున మనసు పుట్టఁ దగునే యోథా
త్రీనాయక! యీ కార్యము, గా నేరదు నీదుకోరికలు తప్పెఁ జుమీ.

234

సురాష్ట్రునికి మృగి చెప్పిన తనపూర్వజన్మవృత్తాంతము

తే.

ఎట్టు లంటేని మనుజేంద్ర! యిట్టి మనకు, లోలుఁ డ నెడిమహాత్ముండు లోభమునను
విఘ్న మొనరించె మదిఁ గిన్క వెలయ ననిన, నమ్మృగికి నవ్విభుం డిట్టు లనియె ననఘ!

235


తే.

ఇట్టు లున్ననీ వెవ్వతె వెట్టుపలికె, దవు మనుష్యభాషలు? లోలుఁ డెవఁ? డతండు
నీకు నాకును సంగతి లేక యుండ, విఘ్న మిప్పు డొనర్చినవిధముఁ జెపుమ.

236


తే.

అనిన మృగి యిట్టు లను విను మనుజునాథ!, యగుదు నేనూర్వురాండ్రలో నగ్రమహిషి
నుత్పలావతి యనియెడునువిద నార్యుఁ, డై నదృఢధన్వుకూఁతుర ననిన నతఁడు.

237


క.

అక్కట! సాధ్వివి సువ్రత, వెక్కుడు ధర్మములు సేయు దెపుడు నియతితో
నిక్కీడుభవముఁ బొందఁగ, దక్కఁగ నీ వేమి దుష్కృతముఁ జేసితివో?

238


వ.

అనిన నమ్మృగి యిట్లనియె.

239


సీ.

మాతండ్రి యింట నేఁ బ్రీతిఁ గొండికనాఁడు చెలులతో నాడుచు నెలమి నొక్క
యారామమునకుఁ క్రీడార్థంబు చని మృగి మృగమును గని యందు మృగవధూటి
నెలదీఁగఁ గొని వెస నెత్తి వేసిన నది బెదరి పాఱుటయుఁ దత్ప్రియుఁడు గనలి
గర్వించి మే యెఱుంగక వ్రేసి దుశ్శీల వై నామనోరథ మఫలితముగఁ


ఆ.

దగునె సేయ? ననినఁ దన్మానుషోక్తులు, విని భయంబుఁ బొంది యనఘ! యిట్టి
భవము నీకు నెట్టు పాటిల్లె? నెవ్వఁడ, వీవు? నెప్పు మనిన నిట్టు లనియె.

240


వ.

ఏను నివృత్తచక్షుం డనుసంయమిపుత్రుండ సుతపుం డనువాఁడ నీమృగియందు
బద్ధానురాగుండ నై మృగరూపంబు ధరియించి దీని వెనుక వచ్చితి నావలన నిదియు
నెఱుకువ గలిగి యున్నతఱి నీ విట్లు చేసితి దుష్టచిత్తవైన నీకు శాపం బిచ్చెద ననిన
వడవడ వడంకుచు నజ్ఞానంబున నా చేసినయపరాధంబు సైఁపు శపియింపకు మనిన
మునివరుండు నన్ను వరియింపు మట్లైన నిన్ను శపింప ననవుడు నేను నవ్వుచు
నిట్లంటి.

241


క.

మృగి గానేను మునీశ్వర!, మృగరూపము దాల్చి యడవి మెలఁగెడునీకు
న్మృగవనితలు బ్రాఁతే యని, తెగడిన నతఁ డుగ్రకోపదీప్తాననుఁ డై.

242

క.

మృగిఁ గా నే నని నన్నుం, దెగిడితి గావేని యింకఁ దెల్లముగా నీ
వగము మృగి వని నిజాకృతి, దగఁ దాల్చి శపించె నన్ను ధరణీనాథా!

243


సీ.

అట్లు శపించిన నమ్మునీశ్వరునకుఁ బ్రణమిల్లి సైరింపు బాలఁ గానె
జనకుఁడు వెలిగాఁగఁ దనయంతఁ గన్నెకుఁ బతి వరియించుట పాడియగునె?
యెఱుఁగవే స్త్రీధర్మ మిట్లేల కోపింప నని పెక్కుమార్లు ప్రార్థనముఁ జేయ
ననుఁ జూచి యోచెల్వ! నాపలు కెట్టిదో యట్టిది నీవు జన్మాంతరమున


తే.

నగుదు మృగివి జాతిస్మర వై త్వదీయ, గర్భమున లోలుఁడనువాఁడు ఘనుఁడు సిద్ధ
వర్యసంయమిపుత్రుండు వచ్చి పొందు, నపుడు నీకు మనుష్యవాక్యములు గల్గు.

244


క.

అమ్ముని పుట్టుటయు మృగీ, త్వము విడిచి నీవు సనుము వనితా! శుభలో
కముల కాలోలుండును, బమ్మినతేజంబు దెసలఁ బరగఁగ నంతన్.

245


క.

అనుపమభుజబలవిక్రమ, ఘనుఁ డగుమను వై ధరిత్రిఁ గడుఁ బేర్చి రణం
బునఁ బితృశత్త్రులఁ బొరిగొని, జనులం బాలించు ధర్మసంపద వెలయన్.

246


వ.

అని యమ్మునీంద్రుం డనుగ్రహించి చనియె నది కారణంబుగా నేను దిర్యక్త్వం
బునం బొంది భవత్కరస్పర్శనంబున నిపుడ గర్భంబు ధరియించితి ని ట్లగుటం జేసి
నీతో నిప్పుడు.

247


క.

ఏ నీ కగమ్య నేయ, స్థానంబున మనసు పుట్టఁ దగునే యంటి
న్దాను రతివిఘ్న ముదరము, లో నుండుట మనకు నిట్లు లోలుఁడు సేసెన్.

248

తామసమనుమహిమాభివర్ణనము

వ.

అని యిట్లు మృగాంగన చెప్పిన విని యన్నరేంద్రుండు పరమానందంబునం
బొందె నంత.

249


ఉ.

ఆమృగికి న్సుతుండు సముదంచితతేజుఁడు సర్వలక్షణ
శ్రీమహితుండు పుట్టుటయుఁ బ్రీతి వహించె సురాష్ట్రభూవిభుం
డామృగి దేహము న్విడిచె నప్పుడు శాపవిముక్త యై ముని
స్తోమము వచ్చె నాసుతునిఁ జూడఁ బ్రమోదముఁ బొందె భూతముల్.

250


వ.

అప్పుడు.

251


తే.

ఘనతమంబు జగంబులఁ గప్పియున్న, వేళఁ దామసయోని నావిర్భవించెఁ
గాన నితఁడు తామసుఁ డనఁగాఁ బ్రసిద్ధుఁ, డై మహావృద్ధిఁ బెనుపొందు ననిరి మునులు.

252


చ.

జనకుఁడు పెంపఁగాఁ బెరిఁగి సౌమ్యుఁడు తామసుఁ డిద్ధబుద్ధి యై
జనకునితోడ నీవు మునిసత్తమ! యెవ్వఁడ? వెట్టు లేను నీ
తనయుఁడ నైతి? మజ్జనని దా నది యెవ్వరు? నీకు నేల యీ
వనమున కేఁగుదే? ననుడు వానికి సర్వము తండ్రి చెప్పినన్.

253


చ.

విని చని యఫ్డు భానునిఁ ద్రివేదమయుం దగఁ గొల్చి తత్కృప
న్వినుతమహాస్త్రశస్త్రముల విశ్రుతుఁ డై తనతండ్రిఁ దొల్లి యో

ర్చినరిపులం బరాజితులఁ జేసి మదం బఱఁ బట్టి తెచ్చి పెం
పు నెరయ వారల న్విడిచి పుచ్చెఁ గృప న్జనకుండు పంపఁగాన్.

254


ఆ.

అట్లు తామసుండు నమితపరాక్రమ, విదితుఁ డై స్వధర్మవృత్తి నుండఁ
దనువు విడిచి యతనితండ్రి నిజార్జిత, పుణ్యలోకమునకుఁ బోయె నంత.

255


క.

తనభుజవీర్యము శౌర్యము, తనరఁగ జగ మెల్ల గెలిచి తామసుఁడు మహి
న్మను వయ్యె విను తదంతర, మునఁ గలయనిమిషులు నింద్రు మునుల నృపతులన్.

256


వ.

సత్యసుధీస్వరూపహృదయు లనునామంబుల సుర లిరువదియేడుగణంబు లైరి శత
యజ్ఞోపలక్షణుం డైనశిబి యింద్రుఁడయ్యె జ్యోతిర్ధాముండును బృథుండును
గావ్యుండును జైత్రుండును నాదిగా సప్తమును లైరి నరుండును ఖ్యాతియు
శాంతియుభయుండును జాలసంఘుండు నాదిగాఁ దామసమనువునకుం బెక్కండ్రు
కొడుకులు పుట్టి రాజులై రిది చతుర్థమన్వంతరం బింకఁ బంచమమను వైనరైవతుని
జన్మప్రకారంబు చెప్పెద వినుమని మార్కండేయుండు క్రోష్టుకి కిట్లనియె.

257

రైవతమన్వంతరమహిమానువర్ణనము

క.

ఋతవంతుం డనుసంయమి, సుతహీనత్వమున నుండ సుతుఁ డొక్కఁడు రే
వతి యను నక్షత్రముతుది, నతనికి జన్మించుటయును నతఁడు ముదమునన్.

258


తే.

జాతకర్మకృత్యంబులు సలిపి సుతునిఁ, బెనిచి యుపనీతుఁ గావించి పెండ్లి చేసె
నాసుతుండును దుశ్శీలుఁ డయ్యె బాల్య, మాది గాఁగ సమస్తగుణాభిరామ!

259


వ.

ఆకుపుత్త్రజన్మదోషంబునం జేసి.

260


తే.

ఆమునీంద్రుఁడు దీర్ఘరోగాభిభూతుఁ, డయ్యెఁ దత్సతి కుష్ఠరోగార్త యయ్యె
నాదురాచారుఁడును దనయాలి విడిచి, యొక్కమునియాలిఁ గొనిపోయె నోటలేక.

261


వ.

దానికి ఋతవంతుఁడు విషణ్ణస్వాంతుఁ డై యి ట్లనియె.

262


క.

పుత్త్రుఁడు పుట్టమి మేలు కు, పుత్త్రుఁడు జన్మించుకంటెఁ బురుషునకును దు
ష్పుత్త్రుఁడు దహించు నిజచా, రిత్రాగ్నిని దండ్రిమనము రేయును బగలున్.

263


తే.

స్వర్గమున నున్న పితృమాతృవంశపాత్ర, గణము నెల్లను బహునరకములఁ ద్రోచు
నఖిలబంధుల కపకార మాచరించు, దుస్సుతుఁడు వానిజన్మంబు దుస్సహంబు.

264


క.

అనఘులు పరహితచరితులు, జనసంభావ్యులును బుణ్యచరితులు నగునం
దనులను బడయుదు రెవ్వరు, దనరఁగ వా రిందు నందు ధన్యులు గారే!

265


వ.

అని యి ట్లమ్మునివర్యుం డతినికృష్టుం డైనపుత్త్రుని దౌశ్శీల్యంబు తనహృదయంబు
దహింప వృద్ధగర్గుం డనుతపోధనుతోడ మహాత్మా! యేను సువ్రతుండనై వేదంబు
లధిగమించి నిఖిలవిద్య లభ్యసించి దారపరిగ్రహం బొనరించి శ్రోతస్మార్తకర్మకలా
పంబు లనుష్ఠించుచుఁ బున్నామనరకభయంబునం జేసి గర్భాధానవిధానంబున
నీకొడుకుం బడసితి వీఁడును దుశ్శీలత్వంబున నాకును దుఃఖావహుం డగుట మదీయ
దోషంబుననో మాతృదోషంబుననో యెఱింగింపవే యనిన గర్గుం డిట్లనియె.

266

ఋతవద్గర్గులసంవాదము

సీ.

ఇది మునివల్లభ! యెవ్వరిదోషంబుగాదు మీలో విను కారణంబు
రేవతికడపట నావిర్భవించె నీపుత్త్రకుం డాకీడుప్రొద్దుకతన
దౌశ్శీల్య మొందె నాతని నని చెప్పిన ఋతువంతుఁ డతిరోష మెద జనింప
నాయొక్కకొడుకున కీయశుభముఁ జేసి వెలయఁగా రేవతి వెఱపు లేక


తే.

యట్టు లైన నారేవతి యతిరయమున, నిపుడు పడుఁగాత యని శాప మిచ్చుటయును
జోద్యముగ లోక మెల్లను జూచుచుండఁ, బడియె రేవతి కుముదాఖ్యపర్వతమున.

267


క.

రేవతి యిమ్మెయిఁ బడుటయు, నావిపినము వెలుఁగుచుండె నాదీప్తులచే
రేవతి పడుటఁ గుముదగిరి, రైవత మనఁ బరఁగె నిద్ధరావలయమునన్.

268


సీ.

ఆరేవతీదేవిచారుతనుప్రభ రమణీయకమలాకరమునఁ బొంది
కడుఁబొలుపారెడుకన్యక యగుటయుఁ బ్రముచుఁ డన్సంయమి ప్రమద మెసఁగ
రేవతినామంబు నావెలఁదికి నిడి యాత్మాశ్రమోద్భుత యగుటఁ జేసి
తనయగాఁ గైకొని పెనిచి మనోహరయౌవనోద్భాసిని యైనఁ జూచి


తే.

నాతి కెవ్వఁ డొకో తగునాథుఁ డనుచుఁ, దత్సదృశుఁ డైనవరు నెందుఁ దడవికాన
కగ్నిశాలకు నరిగి యయ్యగ్ని నడిగె, దీని కెవ్వఁడు విభుఁ డగుఁ దెలియఁజెపుమ.

269


వ.

అని యడిగిన నయ్యగ్నిదేవుండు.

270


క.

దుర్దమశత్రక్షత్రియ, మర్దనకేళీకథాసమగ్రబలోద్య
ద్దోర్దర్పగరిష్ఠుం డగు, దుర్దముఁ డనునృపతి భర్త తోయజముఖకిన్.

271


వ.

అని యమ్మునీంద్రునికిం జెప్పిన యనంతరంబ.

272


మ.

దమితారాతి ప్రియవ్రతోజ్జ్వలకులోత్తంసైకతేజుండు వి
క్రమశీలక్షితిపాలశేఖరునకు న్గాళిందికి న్బుత్త్రుఁ డు
త్తమచారిత్రుఁడు దుర్దముండు మృగయార్థం బేఁగి యత్యుగ్రదు
ర్గమునం గ్రుమ్మరుచుం దదాశ్రమముఁ జేరం బోయి సంప్రీతితోన్.

273


వ.

దానిం బ్రవేశించి యం దమ్మునీంద్రునిం గానక.

274


క.

రేవతిఁ గని యానృపతి ప్రియా! వచ్చితి మ్రొక్కి పోవ నమ్మునిపతికి
న్నీవు నిజంబుగఁ జెప్పుమ, యావిమలాత్ముఁ డెటఁ బోయెనని యడుగుటయున్.

275


తే.

అగ్నిశాలలోపల నున్నయమ్మునీంద్రుఁ, డతఁడు రేవతిఁ బిలిచిన నాప్రియోక్తి
విని ముదంబున వెలువడి యనుపమాన, రాజ్యచిహ్నాభిరాము దుర్దమునిఁ గనియె.

276

ప్రముచదుర్దమసంవాదము

చ.

కనిన నరేంద్రుఁ డమ్మునికి గౌరవ మొప్పఁగ మ్రొక్కి గౌతముం
డను ప్రియశిష్యు నర్ఘ్యము రయంబున నమ్ముని తేరఁ బంచి నీ
వనఘ! సమంచితార్ఘ్యమున కర్హుఁడ వెన్నఁడు రానివింద వ
ల్లునికి విశేషపూజఁ దగు లోకముచొప్పున మాకుఁ జేయఁగన్.

277

తే.

అనిన నల్లుండ నే నెట్టు లైతినొక్కొ!, యనుచుఁ బలుకక యతఁ డర్ఘ్య మందికొనియె
నుచిత మగుపీఠమునఁ బ్రీతి నునిచి యన్న, రేశ్వరునకు మునీశ్వరుం డిట్టులనియె.

278


క.

నరనాథ! నీకుఁ గుశలమె, పరిజనులకు భూజనులకు బంధుజనులకు
న్బురజనులకు భద్రమే భూ, సురవరులకు మంత్రులకును శుభమే యెపుడున్.

279


తే.

ఇచటనున్న నీభార్యకు నెంతయును శుభంబు భూనాథ! తక్కినభార్య లెల్లఁ
గుశలీనులె యన్న మీకృపఁ గుశల మెపుడు, బ్రాఁతి గాదు జగత్త్రయారాధ్యచరణ!

280


క.

కడువెఱఁ గయ్యెడు నా కిక్కడ నెయ్యది భార్య! యనుడుఁ గాంతిమహిమ నొ
ప్పెడురేవతి నీప్రియ యగు, పడఁతుక గా దెట్లు! ధరణిపాల! యెఱుఁగవే!

281


వ.

అనిన నన్నరేంద్రుండు మునీంద్రా! సుభద్ర శాంతతనయ కావేరితనయ సురా
ష్ట్రజ సుజాత కదంబ వరూధిని నందిని యనుమదీయభార్యల నెఱుంగుదుం గాని
రేవతి నెఱుంగ నది యెక్కడియదియో యనిన నమ్మునివరుం డి ట్లనియె.

282


క.

ఇప్పుడు ప్రియ యని పిలువవె, యిప్పడఁతుక నింత మఱతురే భూపాలా!
తప్పక ప్రియ యని పిలిచిన, యప్పుడ యది నీకు భార్య యనుమానంబే?

283


వ.

అనిన నమ్మనుజేంద్రుండు.

284


ఉ.

ఏ నతిదుష్టభావమున నీలలితాంగిఁ బ్రియాసమాఖ్య నా
హ్వానముఁ జేయఁ బల్కితి యథార్థము యల్గకు మయ్య! యన్న నా
జ్ఞాని నరేంద్ర! నీపలుకు సత్యము దుష్టము గాదు భావ మీ
మానిని కీవ భర్త వని మా కనలుండును జెప్పె నేర్పడన్.

285


ఉ.

నీవును వచ్చి తిఫ్డు ధరణీవర! యిం కనుమాన మేల? నీ
కీవనజాక్షిఁ బ్రీతిమెయి నిచ్చితిఁ జేకొను మన్నఁ బ్రేమల
జ్జావనతాననుండయి ధరాధిపుఁ డూరక యుండె సమ్మద
శ్రీ వెలయ న్వివాహ మొనరింప మునీశ్వరుఁ డుత్సహించినన్.

286

ప్రముచునకు రేవతికిని సంవాదము

వ.

అమ్మునీంద్రుముందట నిలిచి రేవతీకన్య కరంబులు మొగిచి తండ్రీ! నీవు నాకుం
గృపగలవేని రేవతీనక్షత్రంబునందు నన్ను వివాహంబు జేయుము ప్రసన్నుండ
వగు మనిన నిప్పు డారేవతీనక్షత్రంబు చంద్రునితోడఁ గూడి యుండుపథంబున
నుండ దదియేల? వైవాహికంబు లగునక్షత్రంబులు పెక్కు గలవనిన నయ్యింతి
యానక్షత్రంబు లేమిం జేసి కదా యిపుడు కాలంబు వికలం బైనది వికల
కాలంబున నా కెట్లు వివాహం బగు ననిన నమ్మహాత్ముం డి ట్లనియె.

287


మ.

ఋతవత్సంయమితీవ్రశాపమునఁ దా నిమ్మేదినిం గూలి రే
వతి య ట్లున్నది యిన్నరేశ్వరునకు న్వాత్సల్య మొప్పంగ ని
చ్చితి ని న్నే నని పల్కితి న్బరిణయశ్రీ లొందఁగాఁ బ్రీతి నీ
మతి లే దెంతయు సంకటం బొదవె భౌమా ! నిన్ను నే మందునే?

288

వ.

అనిన నక్కన్నియ యి ట్లనియె.

289


క.

ఋతవన్మునివరుఁ డొక్కఁడ, యతులతపముఁ జేసెఁ గాని యక్కట! మాతం
డ్రితపము తక్కువయే య, ప్రతిమగుణా! యేను బ్రహ్మబంధునిసుతనే?

290


తే.

అనిన ముని తపోవిరహితుఁ డైన బ్రహ్మ, బంధుకూఁతురవే నీవు పంకజాస్య!
నాతనూజవు గాక కన్యాలలామ!, యేమి సేయంగ నే నుత్సహింతుఁ జెపుమ.

291

రేవతీదుర్దమవివాహము

వ.

అనిన రేవతి తండ్రీ! నీవు తపస్సత్యసంపన్నుండ వగుదేని రేవతీతారం దారాపథం
బున నారోపించి నన్ను బరిణయంబు సేయుమనిన నతం డట్ల చేసెద సంతసిల్లు మని
నిజతపఃప్రభావంబునం జేసి పూర్వస్థానంబున రేవతిం బ్రతిష్ఠించి విధ్యుక్తప్రకారం
బునం గూఁతునకు వివాహం బొనరించి యల్లుని నాలోకించి నీకు నరణం బిచ్చెద
నెయ్యది దుర్లభం బది యడుగు మనిన దుర్దముం డి ట్లనియె.

292


క.

మన్వంతరాధిపతియును, నన్వయదీపకుఁడు భుజబలాధికుఁడును దే
జోన్వితుఁడును గాంభీర్యో, దన్వంతుఁడు నైనతనయు దయని మ్మనఘా!

293


వ.

అనిన మునివరుండు.

294


క.

నీకోరినయట్టుల ధ, రాకల్పుఁ డనల్పశౌర్యుఁ డాత్మజుఁడు శుభ
శ్లోకుఁ డుదయించు మను వై, లోకప్రతిపాలనైకలోలత వెలయన్.

295

రైవతమనుజననము

చ.

అనిన మునీంద్రు వీడ్కొని బలాంతకుమాడ్కి మృగాక్షి వేడ్కఁ దో
డ్కొని పురి కేఁగె నానృపతికుంజరుఁ డప్పుడ యంత రేవతీ
వనిత తనూజుఁ గాంచె బలవంతుఁ బ్రశాంతు యశోలతాంతభా
జనహరిదంతు దాంతు భుజశౌర్యసమావృతజైత్రకాంతునిన్.

296

రైవతమన్వంతరమున నింద్రాదుల వివరణము

వ.

ఇట్లు రేవతికి రైవతుం డనుమనువు పుట్టె నామన్వంతరంబున దేవత లొక్కొక్క
గణంబు పదునలువురేసిగా సుమేధసులు భూతరజులు వైకుంఠు లమితాభాను లన
నాలుగుగణంబులై రాదేవతలకుఁ బ్రభువు శతయజ్ఞుండు నైనవిభుం డనువాఁ
డింద్రుండయ్యె హిరణ్యరోముండును వేదశ్రీయును నూర్ధ్వబాహుండును వేద
బాహుండును సుధాముండును బర్జన్యుండు వసిష్ఠుండు ననువారు సప్తఋషు
లైరి బలుండు బంధుండు స్వయంభావ్యుండును సత్యకుండును నాదిగా రైవతు
నికిఁ బెక్కండ్రు కొడుకులు పుట్టి రాజు లై రిది రైవతమన్వంతరప్రకారం బని చెప్పి
మార్కండేయుండు కోష్టుకికి షష్ఠమను వైనచాక్షుసునిజన్మంబు విను బ్రహ్మ
చక్షుస్సువలన మున్ను జన్మించి చాక్షుషుం డనం బరగి యాశరీరంబు విడిచి
మర్త్యభువనంబునందు.

297

చాక్షుషమనుజన్మవృత్తాంతము

సీ.

ఒకపుణ్యకాంతకు నుదయించి వాఁడు జాతిస్మరుం డయి వానిఁ దివుటతోడ
నక్కున మోమునఁ జిక్కఁగఁ జేర్చుచు నుత్సంగతలమున నునిచి జనని
ముద్దాడుచుండఁగాఁ బెద్దయెలుంగున నవ్విన వెఱచి యన్నలినవదన
కన్నులు దెఱవనికడుబాలుఁడవు నవ్వు టిది యేమి యద్భుత మిపుడు గుఱ్ఱ!

298


తే.

యనుడు నోతల్లి! యిదె పిల్లి ననుఁ దినంగ, వేచినది దీనిఁ బొడఁ గాననే యదృశ్య
మూర్తియై జాతహారిణి మున్న యున్న, దేల ముద్దాడె దింతయు? నెఱుఁగ వీవు.

చాక్షుషమన్వంతరమహిమానువర్ణనము

వ.

ఇది కారణంబుగా నపహసించితి నని మఱియును.

299


క.

తనకొఱకు నీ బిడాలియు, ననవరతాసక్తి జాతహరిణియును గా
చినయది నీవును నీకై, నను ముద్దాడెదవు ఫలము నాదెసఁ బడయన్.

300


వ.

ఇంతియ కాని నే నెవ్వండ నగుటయు నెఱుంగవు నీకు నుపకృతి నాచేత నేమి
యుం జేయంబడ దేను బుట్టి యాఱేడు దినంబు లింతలోన నీవు హర్షరసాతిరేకంబు
నం బొంగి పులకించుచుఁ గన్నులఁ బ్రమదజలకణంబు లురల నన్నుం గౌఁగిలించు
కొనుచు నాతండ్రి నాకుఱ్ఱ యని ముద్దాడుచు ని ట్లేమిటికి వెడ్డు వెట్టెద వనినం
గొడుకునకుఁ దల్లి యిట్లనియె.

301


క.

ఉపకారము కోరకయే, నపరిమితప్రీతితోడ ననుదినమును ని
న్నుపలాలించుచుఁ బెంచుట, విపరీతపుఁగొడుక వైతి వేయును నేలా?

302


తే.

ఏను ముద్దాడ నీయెద కిం పొనర్ప, దేని ముద్దాడ నేల? నీ వేల నాకు?
నెట్లు పడితేమి? విడిచితి నేను నిన్ను, ననుచు దిగ్గన లేచి పేరలుకఁ జూచి.

303


క.

కడవం గఱచినవాఁ డీ, పడు చనుచుం బురిటియిల్లు పడఁతుక వెడలె
న్వెడలిన జితేంద్రియుండును, గడునిర్మలమతియు బోధకలితాత్మకుఁడున్.

304


తే.

అయినయబ్బాలు గ్రక్కున నదిమి పొదివి, యెత్తికొని జాతహారిణి యేఁగె సత్వ
రమున విక్రాంతుఁ డనురాజు రమణి యపుడు, కొడుకుఁ గని యుండఁ దచ్ఛయ్య నిడి ముదమున.

305


వ.

అప్పు డప్పుడమిఱేనికొడుకుం గొని చని యొండొక్కగృహంబునం బెట్టి తృతీ
యుండగు నాగృహపతిశిశువు నపహరించుకొని చని జాతహారిణి భక్షించె జాత
హారిణికి నివ్విధంబు జీవిక యై యుండునంత విశ్రాంతమహీకాంతుండు నందనునికి
రాజార్హసంస్కారంబులు సేయించి యానందుం డనునామం బొనరించె నక్కు
మారుండును గ్రమంబునం బితృసంవర్ధితుం డై పెరిఁగిన.

306

గురువునకు నానందునకును సంవాదము

తే.

నృపతనూజుని గురుఁ డుపనీతుఁ జేసి, జనని కభివాదనము సేయుమనిన నవ్వి

కన్నతల్లియొ చెప్పుమా గారవమున, నన్నుఁ బెంచినతల్లియో నాకు వంద్య?

302


వ.

అనిన గురుండు చారుషపుత్రియు విక్రాంతునిదేవియు నైనయీహైమిని నీకుం
దల్లిగాదె? యనుడు నానందుండు గురున కిట్లనియె.

308


క.

వినుము విశాలగ్రామం, బున బోధుం డనఁగఁ బరగుభూసురునకు నం
దనుఁ డగుచైత్రుని కియ్యమ, జనయిత్రి మునీంద్ర! యితరజననిసుతుఁడ నేన్.

309


ఆ.

అనిన గురుఁ డిట్టు లనుఁ జైత్రుఁడనఁగ నెవ్వఁ, డతని కెట్టులు హైమిని యంబ యయ్యె?
నెచట నీవు పుట్టితి? మాకు నేర్పడంగఁ, జెప్పు మానంద! యిది కడుఁ జిత్ర మనిన.

310


క.

అనమిత్రుం డనుమనుజేం, ద్రునకును గిరిభద్రకును సుతుఁడ నై జన్మిం
చిననన్ను జాతహారిణి, యనఘా! యెత్తుకొని వచ్చి హైమినియొద్దన్.

311


తే.

పెట్టి యా హైమినికి మున్ను పుట్టినట్టి, పట్టిఁ గొనిపోయి బోధుఁ డన్ బ్రాహ్మణునిగృ
హంబునం దిడి యది యాగృహస్థుశిశువు, నపహరించి భక్షించె విప్రాగ్రగణ్య.

312


వ.

అని చెప్పి.

313


తే.

హైమినీతనూజుఁ డవ్విప్రు సేయుసం, స్కారములఁ బవిత్రగాత్రుఁ డయ్యె
సంస్కృతుండనైతి సత్కర్మజాతంబు, నాకు నీవు సేఁత లోకవంద్య!

314


వ.

నీవచనంబుఁ జేయవలయు నాకుం దల్లి యెవ్వ? రనిన గురుండు.

315


ఆ.

విను కుమార! మోహమునఁ జేసి బుద్ధి భ్రమించినట్ల యున్న దించుకయును
నెఱుఁగకున్నవాఁడ నీ ప్రశ్న మెంతయు, గహన మేర్పరింప గడిఁది యనిన.

316


వ.

అబ్బాలుండు.

317


సీ.

ఎవ్వఁ డెవ్వనిపుత్రుఁ? డెవ్వఁ డెవ్వనిబంధుఁ?, డేల యీభ్రమ? సన్మునీంద్ర! చెపుమ
జన్మంబు జనులకు సంబంధ మింతియ, మరియు మృత్యువుచేత నడఁగి పోవు
జన్మించునతనికి సకలబాంధవులతోఁ, బాయంగరానిసంబంధ మొకటి
సతతంబు గలుగు నాసంబంధ మాదిగా, సర్వంబు దేహావసాన మైనఁ


తే.

బొలియుఁ గావున సంసారమున జనించు, వారి కెవ్వరు బంధులు లేరు బుద్ధి
బ్రమయ నీ కేల? నాకు నీభవమునందుఁ,దండ్రు, లిరువురై రిరువురు తల్లులైరి.

318


తే.

అన్యదేహసంబంధమునందు వేఱ, జనకజనయిత్రు లగుట కాశ్చర్య మేమి
యిట్టియే నింక నిం దుండ నేఁగి తపము, విపినమున నాచరించెద విప్రవర్య!

319


వ.

విశాలగ్రామంబున నున్న చైత్రునిం దెచ్చికొనుం డని చెప్పిన నతనిపలుకులు విని
యారాజు భార్యాసహితంబు బంధులుం దానును విస్మయంబు నొంది యక్కు
మారునివలన మమత్వంబు దక్కి యతండు వనంబునకుం జనుట కొడంబడి నిజ
పుత్త్రుం బుత్త్రబుద్ధిం బెనిచిన ధాత్రీదేవుని సమ్మానించి యాపుత్త్రునిం దెచ్చుకొని
రాజ్యయోగ్యునిం గావించె నంత.

320

చాక్షుషుండు మను వగుటయు; ఆమన్వంతరమున దేవేంద్రాదుల వివరణము

తే.

బాలుఁ డానందుఁ డొక్కఁడు లీల నడవి, కర్థి నరిగి ముక్తివిరోధులైనకర్మ

ములు నశింపఁగఁ దపము నిశ్చలతఁ జేయు, చుండ వచ్చి యిట్లనియెఁ బయోజభవుఁడు.

321


ఆ.

ఏమి కోరి చేసె దీతపం? బెఱిఁగింపు, మనిన బ్రహ్మ కిట్టు లనియె బాలుఁ
డాత్మశుద్ధి గోరి యాచరించెదఁ గర్మ, పాశగాఢబంధనాశముగను.

322


ఆ.

అనినఁ బద్మగర్భుఁ డతనితో హీనాధి, కారుఁ డగును గర్మి కాఁడు ముక్తి
కర్హుఁ డెట్లు ముక్తి యభిలషించెదు? మను, త్వంబు నీవు దాల్పవలసియుండు.

323


వ.

షష్ఠమను వై వర్తింపుము తపం బుజ్జగింపుము మఱి ముక్తిసుఖం బనుభవింపు
మని కమలభవుండు నియోగించిన నమ్మహీపతి యట్లకాక యని దపోనివృత్తుం డగు
సమయంబునం బ్రజాపతి యతనిం జాక్షుషుం డని పూర్వజన్మనామధేయుం
గావించి చనియె నిట్లు ప్రఖ్యాతుం డై చాక్షుషుండు.

324


క.

ఉగ్రుఁ డను రాజుకూఁతు స, మగ్రవిలాసాభిరామ నంబుజముఖఁ గం
బుగ్రీవ విదర్భం బా, ణిగ్రహణముఁ జేసె నతఁడు నెయ్య మెలర్పన్.

325


క.

చాక్షుషమనుకాలంబున, నక్షీణగుణాభిరాము లగుసురల సహ
స్రాక్షుని ఋషులను బాలన, దక్షుల భూపతులఁ జెప్పెదను విను మనఘా!

326


వ.

అప్యులును బ్రభూతులును భవ్యులును భృగులును లేఖులు ననునొక్కొక్కగణ
మెనమండ్రేసి కా దేవత లేనుగణంబు లైరి నూఱుక్రతువులు చేసినమనోజవుం డను
వాఁ డింద్రుఁ డయ్యె సుమేధుండును విరజుండును హవిష్మంతుండు నున్నతుఁడును
మధువు సహిష్ణుండును విమలుండును సప్తర్షు లైరి చాక్షుషునికి శతద్యుమ్న
ప్రముఖులైనపుత్త్రులు పెక్కండ్రు ప్రభవించి మహీపతు లైరి చాక్షుషుం డను
మనువుజన్మంబును జరిత్రంబును జెప్పితిఁ గ్రోష్టుకీ! యిప్పుడు వైవస్వతుం డను
సప్తమమనువుకాలము వర్తించుచున్నది యతనిజననంబు నామన్వంతరంబునఁ గల
దేవతాదులనుం జెప్పెద నాకర్ణింపు మని మార్కండేయుం డిట్లనియె.

327

వైవస్వతమనుమహిమానువర్ణనము

సీ.

విశ్వనుతుం డగు విశ్వకర్మతనూజ యైనసంజ్ఞాదేవియందుఁ బడసెఁ
దనయు వివస్వంతుఁ డనుపమవిజ్ఞానవంతు నిర్మలయశోవంతు మనువు
నతఁడు వైవస్వతుం డనుపేరఁ బరగె నద్దేవి దివాకరుదీప్తిఁ జూచి
కనుఁగవ మోడ్చిన నినుఁ డల్గి యిప్పుడు నను గని దృఙ్నిమీలనముఁ జేసి


ఆ.

తట్లు గాన నీకు నఖిలజనైకసం, యమనుఁ డైనసుతుఁడు యముఁడు పుట్టు
ననుడు వెఱచి చూడ్కి యతిచంచలంబుగఁ, జేయుటయును ధరణి చెలువతోడ.

328


క.

ననుఁ జూచి యిపుడు నీదృష్టి నితాంతవిలోల యయ్యెఁ జేడియ! యటు గా
వున నీకు విలోల యయిన, తనయ మహానది జనించుఁ దథ్యం బరయన్.

329


తే.

అంతఁ బతిశాపమునఁ జేసి యాలతాంగి, కవతరించిరి యముఁడును యమున యనఁగఁ
బరగునదియును మఱియు నాభామ భాను, వేఁడిమికి నోర్వ కెంతయు విహ్వలించి.

330

ఉ.

ఏమి యొనర్తు? నింకఁ దెఱఁ గెయ్యది దీనికి? నెందుఁ జొత్తు? ను
ద్దామము లైనయీరుచులదాప మొకింతయు సైఁపఁ జాల నే
భూమికిఁ బోదుఁ? బోయిన విభుం డెద నల్గఁడె? యంచు నింతి చిం
తామథితాంతరంగ యయి తాఁ దలఁచె న్జనఁ దండ్రియింటికిన్.

331


తే.

తలఁచి నిజతనుచ్ఛాయ నా వెలయు నొక్క, లలన నిర్మించి యిట్లను లలన! నీవు
బిడ్డలందును రవియందుఁ బ్రియము గల్గి, నడువు సతతంబు నే నెట్లు నడతు నట్ల.

332


క.

నను నెఱిఁగి చనిన నా తెఱఁ, గినుఁ డడిగిన విస్తరించి యెఱిఁగింపకుమీ
వనితా! నీ వాతనితో, ననుమానము వలదు సంజ్ఞ యగుదున యనుమీ.

333


వ.

అనిన ఛాయాదేవి యి ట్లనియె.

334


తే.

బెట్టు గోపించి ననుఁ దల పట్టి తిగిచి, కమలమిత్రుండు శాప మీఁ గడఁగునపుడు
గాని యీవిధ మెఱిఁగించుదానఁ గాను, నావుడును సంజ్ఞ పితృసదనమున కరిగి.

335


వ.

నిర్మలధర్మకర్మఠుం డగువిశ్వశర్మం గని మ్రొక్కిన నతండును బహుమానపూర్వ
కంబుగాఁ గూతుం జూచె నంత.

336


సీ.

అనవద్యచరిత యై యచట నుండఁగఁ దండ్రి కొంతకాలమునకుఁ గూఁతుఁ జూచి
వనజా ననుఁ జూచుచునికి దినంబులు విను మొక్కనిమిష మై చనియె నాకు
నైనను బంధుగృహంబున సతులకుఁ బెద్దగాలం బున్కి పెంపు గాదు
మగువలు మానుగా మగనియొద్దనె యున్కి బంధుల కెల్లను ప్రమదకరము


తే.

తరుణి ననుఁ జూచి తేనును దగినతగవు, లెల్ల నడపితిఁ దడయక యేఁగు మింకఁ
ద్రిభువనాధిపుఁ డైననీవిభునికడకు, వలసినప్పుడు మముఁ జూడ వత్తు గాని.

337


తే.

అనుడు నౌఁగాక యని తండ్రి కధికభక్తి, తోడఁ బ్రణమిల్లి వీడ్కొని తోయజాక్షి
యుష్ణభానునివేఁడిమి కోర్వ లేక, తలరి యుత్తరకురుదేశములకు నరిగె.

338


క.

చని బడబారూపము గై, కొని యచ్చో విశ్వకర్మకూఁతురు తప మ
ర్థి నొనర్చుచుండె నట రవి, తనపూర్వాంగనయ దలఁచి మునీంద్రా!

339


వ.

ఛాయాదేవియందు నిరువురు కొడుకుల నొక్కకూఁతునుం బడసె నంత నద్దేవియు.

340


క.

తనబిడ్డల సంభావిం, చినక్రియ సంభావనంబు సేయక యుపలా
లనలీలాదుల సంజ్ఞాం, గనబిడ్డలవలన నెరవ కాఁ జరియించున్.

341

యమునికి ఛాయాసంజ్ఞ శాప మిచ్చుట

క.

మను వది యెఱిఁగియు నేమియు, ననక ప్రశాంతి మెయి నుండ యముఁ డుత్కటకో
పనుఁ డై యాసతిఁ దన్నఁగఁ, దనపాదం బెత్తి మానెఁ దద్దయు శాంతిన్.

342


వ.

ఇట్లు యముండు తన్నుం దన్న నడు గెత్తిన నలిగి కన్నుల నిప్పు లురలఁ గటంబు
లదర నతని నవలోకించి.

343

క.

గురుపత్ని నైననన్నుం, గర మవినీతి మెయిఁ దన్నఁగా నెత్తిననీ
చరణంబు రయంబునఁ దెగి, ధరఁ బడుఁ గా కని శపించెఁ దద్దయు పలుకన్.

344


క.

ఛాయాసంజ్ఞ శపించిన, నాయముఁడు భయంబుఁ బొంది యర్యముకడకుం
బోయి వినయావనమ్రుం, డై యి ట్లని విన్నవించె నాతనితోడన్.

345


తే.

తండ్రి! యిది యొకయత్యద్భుతంబు వినుము, దయ యొకింతయు లేక యుదగ్రవృత్తి
శాపమిచ్చి నెక్కడ నైన జనని ప్రజల, కింత కీ డొనరింపఁగ నెత్తికొనునె?

346


తే.

నాకు నిది తల్లి గాదని నాకు మనువు, చెప్పుచున్నాఁడు నావుడు నప్పయోజ
బాంధవుం డాత్మనందనుపలుకు దాను, దెలియ విని యపు డద్దేవిఁ బిలువఁ బనిచి.

347


క.

ఆవనితతోడ సంజ్ఞా, దేవి యెచటి కరిగె నాకుఁ దెలియం జెపుమా
నావుడు నదియు నకంపిత, భావంబున ననియెఁ గమలబంధునితోడన్.

348


క.

ఏ విశ్వకర్మకూఁతుర, నీవనితను సంజ్ఞ యనఁగ నెగడినదాన
న్నావలన నీ వపత్య, శ్రీ వడయవే సంశయంబుఁ జెందఁగ నేలా.

349


ఆ.

అనిన మఱియుఁ దఱిమి యడిగిన నక్కాంత, నిజముఁ జెప్పకున్న నీరజాప్తుఁ
డలిగి శాప మిత్తుననిన నాకృత్రిమ, సంజ్ఞ చెప్పే సంజ్ఞ చనిన తెఱఁగు.

350


ఉ.

చెప్పిన నద్దివాకరుఁడు చిత్తమునం బ్రియతోడివేడ్కఁ దా
నప్పుడు విశ్వకర్మ నిలయంబున కేఁగిన నాప్రజావిభుం
డప్పరమేశ్వరుం ద్రిభువనార్చితు దేవమయాత్ము భక్తి పెం
పొప్ప నభీష్టపూజలఁ బ్రియోక్తులఁ దుష్టుని చేసిఁ జేసినన్.

351


చ.

ఇనుఁడు మహాత్మ! నీతనయ యెయ్యది? యన్న నతండు దేవ! నీ
యనుమతితోడ వచ్చితిఁ బ్రియంబునఁ దా నని చెప్పి మద్గృహం
బున వసియింప నే వలదు పొ మ్మని యంపఁగ నేఁగుదెంచె న
వ్వనజదళాక్షి నావుడు దివాకరుఁ డఫ్డు ప్రబుద్ధచిత్తుఁ డై.

352


వ.

ఉత్తరకురుభూములందు బడబారూపధారిణి యై సంజ్ఞాదేవి తనమనంబున నాభర్త
సౌమ్యమూర్తియై వచ్చి నన్నుఁ బొందవలయు నని తపంబు సేయుచుండుట
యెఱింగి వెలుంగుఱేఁడు విశ్వకర్మ నాలోకించి మదీయతేజశ్శాతనం బొనరింపు
మనిన నతండు గీర్వాణస్తూయమానుం డగుమార్తాండుని తేజంబు గరసానంబట్టి
తెచ్చిన నచ్చెరువంది దేవదేవర్షిగణంబులు తపను నిట్లు స్తుతింపం దొడంగిరి.

353


సీ.

ఋగ్యజుస్సామాద్యనేకవేదైకవిస్ఫూర్తివి నిర్మలబోధమూర్తి
వత్యంతనిత్యసత్యానందరూపుఁడ వఘతమోహరణచండాంశుదీప్తుఁ
డవు గరిష్ఠుండవు దివిజవరిష్ఠుండ వాశ్రితజనభర్త వాదికర్త
వమృతమయాత్ముఁడ వఖిలభూతాత్ముఁడ వపగతత్రిగుణుండ వధికగుణుఁడ

తే.

వైననీకు మ్రొక్కెదము బ్రహ్మాండభరిత, బహుళతిమిరనివారణప్రౌఢతేజ
సతతవికసితజనవిలోచనపయోజ, ధిక్కృతేందుతారాయూథ! దివసనాథ!

354


ఉ.

నా కివి యేల నాక విని నవ్వక నిచ్చలు నీవె యర్ఘ్యముల్
గైకొనుమాడ్కి మానుతులు గైకొను నీకరుణావిలోకన
శ్రీకి నివాసమై వెలయఁజేయుము మమ్ము సమస్తలోకశో
భాకర! యోదివాకర! ప్రభాకర! భక్తజనప్రభాకరా!

355


చ.

సలిలము లాదిగాఁ గలుగుసర్వపదార్థములు న్భవత్కరం
బులు వెడసోఁకినం గరము పూతతఁ బొందుఁ ద్రిలోకవర్తనం
బులును సమస్తకర్మములు పొల్పుగ నీ వుదయింపకుండిన
న్నిలుచుఁ జరాచరాత్ముఁడవు నీవు దివాకర! భక్తశంకరా!

356


తే.

దినములకు సంధ్యలకును రాత్రికిని దేవ! చంద్రికకుఁ గారణము నీవ సర్వమును మ
హాత్మ! నీచేత సంవ్యాప్తమై వెలుంగు, బ్రహ్మరుద్రాచ్యుతాకార! ప్రణవసార!

357


వ.

అని మఱియును సురమునిగణంబులు బహుప్రకారంబులం బ్రస్తుతించి దేవా!
మాకుఁ బ్రసన్నుండవు గమ్ము నీరూపంబు తేజోమయంబు గావింపుము జగంబులు
వెలిఁగింపు మని విన్నవించినం గరుణించి తేజోరాశియగు దేవుఁడు నిజతేజంబు
నభంబునం బరగించె నివ్విశ్వకర్మ తనతర్చిన భానుతేజోరజంబు పంచదళభాగంబులు
గావించి వానివలన శర్వునకు శూలంబును విష్ణువునకుఁ జక్రంబును వసువులకు
శంకునామాయుధంబులును వహ్నికి శక్తియుఁ కుబేరునికి శిబికయు మఱి దేవ
యక్షగంధర్వసిద్ధవిద్యాధరులకు మహోగ్రంబు లైనశస్త్రంబులును రచియించె
నంత వివస్వంతుండు పదియాఱవభాగం బగునిజతేజంబు తీరి యుత్తరకురుదేశ
ములకుం జని బడబారూపధారిణియైన హృదయేశ్వరిం గని.

358


సీ.

తురగరూపము దాల్చి తోఁక యల్లార్చుచుఁ గర్ణము ల్గిఱుపుచుఁ గడుఁ జెలంగి
హేషించుచును రవి యేఁగిన నత్తురంగాంగన మది నీతఁ డన్యపురుషుఁ
డనుశంకఁ బూనుచు నభిముఖత్వముఁ బొంద మోములు రెండును మూర్కొనుటయు
నాసికాసంగతి నాసత్యు లశ్వవక్త్రులు పుట్టి రిరువురు కొడుకు లపుడు


తే.

శుక్లపాతాంతమున నొక్కసుతుఁడు పటుతు, రంగమారూఢుఁడును దనుత్రాణధరుఁడు
బాణపూర్ణతూణీరకృపాణకార్ము, కోజ్జ్వలుఁడు నైనరేవంతుఁ డుదయమయ్యె.

359


క.

అంత నిజదేహము వివ, స్వంతుఁడు దాల్చుటయుఁ జూచి సంజ్ఞ మనమున
స్సంతుష్టయై నిజాకృతి, యెంతయు వెసఁ దాల్చెఁ బ్రియున కింపెసలారన్.

360


సీ.

తనదేవిఁ దోడ్కొని చనియె భానుఁడు నిజస్థానమునకుఁ బ్రమోదమున నంత
నద్దేవితొలుపట్టి యైనవైవస్వతుఁ డమలతేజుఁడు మను వయ్యె వినుము

రెండవుకొడుకు యముండు శాపంబున నర్ధపదోవేతుఁ డగుడుఁ దరణి
క్రిములు తత్పాదమాంసము గొన భూస్థలిఁ బడినను శాపంబు వాయు ననియె


ఆ.

నదియుఁ జెల్లె నాతఁ డరిమిత్రులందు స, ధర్మదృష్టి యైన దక్షిణమున
కధిపుఁగా నొనర్చె నతనిఁ గళిందాంత, రమున వేఱు గాఁగ యమునఁ జేసె.

361


క.

అశ్వినులు వెజ్జులుగ హరి, దశ్వుం డమరుల కొనర్చె నారేవంతు
న్విశ్వనుతుని గుహ్యకనిక, రేశ్వరుఁ గావించె నోమునీశ్వరవర్యా!

362


క.

ఛాయాప్రథమతనూజుఁడు, ధీయుత! సావర్ణినామధేయుఁడు మనువై
యీయుర్విఁ బరగు విదిత, న్యాయుఁడు బలి యింద్రుఁ డైననాఁడు మునీంద్రా!

363


తే.

అతని తమ్ము శనైశ్చరు నర్కుఁ డునిచె, గ్రహము గావించి గ్రహములకడను మఱియుఁ
దపతి యనుకన్యం దదనుజఁ దపనుఁ డిచ్చి, సంవరణనృపోత్తమునకు సన్మునీంద్ర!

364


వ.

ఇది వైవస్వతమనూత్పత్తిప్రకారం బీమన్వంతరంబున దేవత లాదిత్యులు వసువులు
రుద్రులు సాధ్యులు విశ్వులు మరుత్తులు భృగువులు నంగిరసులు నన నెనిమిది
గణంబు లై వర్ధిల్లుచున్నవారు వీరిలో నాదిత్యవసురుద్రులు కశ్యపపుత్రులు సాధ్య
విశ్వమరుత్తులు ధర్మాత్మజులు భృగువులు భృగుతనయు లంగిరసు లంగిరస్సంభవు
లింతయు మరీచిప్రజాపతిసంతతి యగుటం జేసి మారీచసర్గం బనం బరగు నిప్పు
డోజస్వియనువాఁ డింద్రుఁడు విను మతీతానాగతవర్తమాను లగునింద్రు లందఱు
తుల్యలక్షణులు సహప్రాణులు వజ్రధరులు గజారూఢులు శతక్రతువులు సమగ్ర
తేజులు సమస్తలోకాధిపత్యగుణాన్వితులు యని మఱియు మార్కండేయుండు
భూమి భూర్లోకం బంతరిక్షంబు భువర్లోకంబు స్వర్లోకంబు దివ్యలోకం బవి త్రిలో
కంబులు ననంబడు నత్రి వసిష్ఠుండు కాశ్యపుఁడు గౌతముఁడు భరద్వాజుండు విశ్వా
మిత్రుండు జమదగ్ని యనువారు సప్తమును లిక్ష్వాకుఁడు నాభాగుఁడు దృష్టుండు
సంయాతి కరుషుఁడు వృషద్రుఁడు వసుమంతుండు నరిష్యంతుండు వృషపదుండు
ననుతొమ్మండ్రు వైవస్వతమనుతనూభవు లని చెప్పి.

365


క.

అతులిత మగునీవైవ, స్వతమన్వంతరము వినినఁ జదివినఁ బాప
చ్యుతు లై మనుజులు గాంతురు, ప్రతిదినము ననంతపుణ్యఫలభోగంబుల్.

366


వ.

అనినం గ్రోష్టుకి యిట్లనియె.

367

సావర్ణి మన్వంతరమహిమాభివర్ణనము

సీ.

స్వాయంభువాదికసప్తమనువులయం దంతరంబునఁ గలయనిమిషులను
మునులను రాజుల మునినాథ! చెప్పితి కల్పంబునం దింకఁ గలుగుమనువు

లేడ్వురు దివిజమునీంద్రాదులును నెవ్వ? రనిన మార్కండేయుఁ డనఘ! వినుము
ఛాయాగ్రతనయుండు సావర్ణిమనుతుల్యుఁ డని చెప్పనే నీకు నప్పు డతఁడ


తే.

యష్టముఁ డయినమను వగు నమ్మహాత్ము, కాలమున దీప్తిమంతుండు గాలవుండు
రాముఁడును ఋశ్యశృంగుఁడు ద్రౌణి కృపుఁడు, సత్యవతీతనయుండును సప్తమునులు.

368


వ.

మఱియు సుతపు లమితాభులు ముఖ్యులు నన దేవతలు మూఁడు గణంబు లై
యుండుదు రందు ధవుండు శుక్రుండు ద్యుతి జ్యోతి ప్రభాకరుండు ప్రసాదుండు
ధర్ముండు తేజోరాశి శతక్రతుండు నాదిగా సుతపోగణం బిరువండ్రును బ్రభువిభు
విభాసప్రభృతు లమితాభగణం బిరువండ్రును దముఁడు దాంతుఁడు సోముఁడును
జిత్రుండును మొదలైనముఖ్య గణం చిరువండ్రును నై యామన్వంతరంబున కధిప
తులై యతిశయిల్లుదురు వీర లందరు మరీచి తనయుం డగుకశ్యపప్రజాపతిపుత్రు
ని చెప్పి.

369


క.

మురరిపుచే నియమితుఁడై, యురగనివాసమున నిప్పు డున్న నిశాటే
శ్వరుఁడు బలి యింద్రుఁడగుఁ ద, త్సురగణమున కథిపుఁ డై విశుద్ధచరిత్రా!

370


తే.

విశ్వనిర్మోహసత్యవాగ్విరజు లనఁగ, జిష్ణుఁ డంబరీషుండు నజితులు శౌర్య
యుతులు సావర్ణి కుదయించి యుర్వి కెల్ల, రాజు లగుదురు సుగుణవిరాజమాన!

371


వ.

ఇది సావర్ణిమన్వంతరంబువిధం బని మార్కండేయుండు క్రోష్టుకి కెఱింగించిన
తెఱం గెఱింగించి

372

ఆశ్వాసాంతము

ఉ.

శ్రీశ్రితవక్ష! ఫుల్లసరసీజనిభాక్ష! సమస్తబంధుమి
త్రాశ్రితకల్పవృక్ష! మహితాంధ్రనరేంద్రదయాకటాక్ష! కాం
తాశ్రితసర్వవాగ్విభవదక్ష! నివారితవైరిపక్ష! భూ
విశ్రుతకీర్తివర్ధన! వివేకవిచక్షణ! పుణ్యవీక్షణా!

373


క.

శ్రీమేచయదండాధిప!, సౌమిత్రిసమగ్రవినయజనితానంద
శ్రీమహితరామచంద్రా!, రామాజనరాగజలధిరాకాచంద్రా!

374


మాలిని.

అతులితభుజవీర్యా! హారిహేమాద్రిధైర్యా
కృతబుధజనకార్యా! కీర్తిశృంగారవర్యా!
వితతవినయధుర్యా! విద్విషద్భూరిశౌర్యా!
మతిజితదివిజార్యా! మానవాకారసూర్యా!

375

గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్ర తిక్కనసోమయాజిప్రసాదలబ్ధసరస్వతీపాత్ర
తిక్కనామాత్యపుత్ర మారయనామధేయప్రణీతం బైనమార్కండేయమహా
పురాణంబునందు విరహాతురయైనవరూధినిం గలి యనుగంధర్వుండు వరించుటయు
స్వరోచిసంభవంబును దత్కథావృత్తాంతంబును స్వారోచిషజన్మంబును బ్రజా
పతి యతని మనువుఁ గావించుటయు నిధిప్రకారంబులు సెప్పుటయు నుత్తాన
పాదపుత్రుం డగునుత్తమునిచరిత్రంబును నాతనికి నాగకన్యాప్రసాదంబున
నుత్తమమనువు నుత్పత్తియు సురాష్ట్రోపాఖ్యానంబు నతండు మృగియందుఁ
దామసుఁ డనుమనువుఁ గాంచుటయు ఋతువంతుశాపంబున రేవతి కుముదపర్వ
తంబుమీఁదఁ బడుటయుఁ దదీయకాంతి నుద్భవించిన రేవతికన్యకకు దుర్దముం
డను రాజునకు రైవతుం డనుమను వావిర్భవించుటయుఁ జాక్షుషమనువుజన్మంబును
సూర్యునికి సంజ్ఞాదేవియందు వైవస్వతమనువును యముండును యమున యను
కూఁతురును ఛాయాదేవివలన సావర్ణిమనువును శనైశ్చరుండును దపతి యను
కన్యకయుఁ బ్రభవించుటయు భానుతేజంబు విశ్వకర్మ త్రచ్చుటయుఁ దురంగరూప
ధరులైన సంజ్ఞార్కులకు నశ్వినులును రేవంతుండునుం బుట్టుటయు సావర్ణిమన్వం
తరకథయు నన్నది పంచమాశ్వాసము.