మార్కండేయపురాణము
చతుర్థాశ్వాసము
|
కంఠరుచిరచరణా
బ్జాకరసంతతవిహారహారిమరాళా
లోకస్తుత్యసుశీలా!
నాకాధిపవిభవపూర్ణ నాగయగన్నా.
| 1
|
వ. |
పరమజ్ఞానపక్షు లాజైమినిముని కి ట్లనిరి నీయడిగిన విధంబంతయుఁ గొఱంత వడ
కుండఁ జెప్పితి మింక నేమివలయు నడుగు మనిన నాద్వైపాయనశిష్యుం డి ట్లనియె.
| 2
|
సీ. |
అక్కట! యిట్లు తిర్యక్త్వంబు నొందియు జనకప్రసాదసంజనితమహిమ
నిర్మలవిజ్ఞాననిర్ధూతమోహుల రగుట ధన్యులరు మీ రనఘులార!
సకలధర్మాధర్మసంశయార్థములు నిర్ణీతము లయ్యె మీచేత నాకు
వితతప్రవృత్తినివృత్తికర్మద్వయఫణితు లేర్పడఁ జెప్పఁబడియె లోక
|
|
తే. |
గణ్యుఁ డైనమార్కండేయుకతనఁ బుణ్య, తముఁడ నైతి మీయట్టియుత్తములఁ జేర
నరయ సంసృతిభ్రాంతులు నల్పభాగ్య, పరులు మిముబోంట్లసంగతి పడయఁగలరె!
| 3
|
తే. |
ప్రవిమలజ్ఞానసంపన్నులైన, మీవలన నేఁ గృతార్థుఁడఁ గావవలదె
యెఱుఁగ వేడ్కయై యడిగెద నేను మిమ్ము, నర్థి నెఱిఁగింప మీ రర్హు లగుటచేత.
| 4
|
సీ. |
స్థావరజంగమాత్మక మైనయీజగం బింతయు మున్ను దా నెట్లు పుట్టె?
కాలాంతమున నిది క్రమ్మఱ నెట్టులయం బందు సురలు సంయములు పితరు
లును రాజులును నెట్లు జననంబు నొందిరి మన్వంతరములమాడ్కి యెట్టు
వంశంబులును నొగి వంశానుచారిత్రమును నెట్టివవి సృష్టివిలయసంఖ్య
|
|
తే. |
యెంత కల్పవిభాగంబు లేక్రమముల, క్షోణియునికి యెట్టిది తత్ప్రమాణ మెంత
వారినిధులును నేఱులు ధారుణీధ, రములు నడవులు నేప్రకారమున నుండు.
| 5
|
క్రోష్టుకిమార్కండేయసంవాదము
వ. |
భూర్లోకాదిసమస్తలోకంబులు నేక్రమంబున నున్నవి రవిచంద్రాదిగ్రహనక్షత్ర
జ్యోతిర్గణంబులగతిప్రకారంబు లెట్టివి యింతయు నుపసంహృతంబైనం దుది
|
|
|
శేషించియుండునది యెయ్యది నాకు విన వేడ్క యయ్యెడు నెఱింగింపవలయు
నన్న నప్పక్షివరులు ప్రహృష్టహృదయు లగుచు జైమినీ! నీచేసిన ప్రశ్నం బతిగహ
నంబు దానికిం జెప్పెదము వినుము తొల్లి క్రోష్టుకి యనుమునివరుండు నీవు మ
మ్మడిగినయట్లు మార్కండేయు నడిగిన నమ్మహాముని యతని కిట్లనియె నవ్యక్తంబు
వలన నావిర్భవించిన మాత్రన చతుర్ముఖునిముఖంబుల నిప్పురాణజాతంబును వేదం
బులు నుద్భవిల్లె వానిం దదీయమానసపుత్త్రు లగుసప్తమును లన్నలువవలనఁ బడసి
రట్టిపురాణజాతంబు భృగువువలనం జ్యవనుం డెఱింగి కొందఱు మునులకుం జెప్పె
నమ్మునులు దక్షునికి నుపదేశించి రాదక్షునిచేత నేమును వింటిమి తత్పురాణకథితం
బై కలికల్మషంబు నడంపంజాలునట్టిభూతసర్గంబు నెఱింగించెద మాకర్ణింపుము.
| 6
|
క్రోష్టుకికి మార్కండేయుఁడు చెప్పిన మహదాదిభూతసర్గము
తే. |
అనఘ! యింతకుఁ గారణ మై ప్రధాన, మనఁగ నవ్య క్త మనఁగ నిత్యయును సదస
దాత్మికయు నతిసూక్ష్మయు నై వెలుంగు, నండ్రు మూలప్రకృతి విమలాత్మవిదులు.
| 7
|
వ. |
ప్రకృతివలన మహత్తు పుట్టె మహత్తువలన నహంకారంబు పుట్టి సాత్వికంబు రాజ
సంబు తామసంబు ననం ద్రివిధం బై వైకారికతైజసభూతాదు లనుపేళ్ళఁ బరగె
నందు భూతాది యగుతామసాహంకారంబువలన శబ్దతన్మాత్రంబు దానివలన నాకా
శంబు నాకాశంబువలన స్పర్శతన్మాత్రంబు దాన వాయువు వాయువువలన రూప
తన్మాత్రంబు దాన నగ్ని యగ్నివలన రసతన్మాత్రంబు దాన జలంబు జలంబువలన గంధ
తన్మాత్రంబు దానం బృథివి యావిర్భవించె నిది భూతతన్మాత్రసర్గప్రకారంబు తైజసం
బగురాజసాహంకారంబువలన శ్రోత్రత్వక్చతుర్జిహ్వాఘ్రాణంబు లనుబుద్ధీంద్రియం
బులేనును వాక్పాణిపాదపాయూపస్థ లనుకర్మేంద్రియంబు లేనునుం బుట్టె వైకారి
కం బగుసాత్వికాహంకారమువలన నింద్రియాధిదేవతలతోఁ గూడ మనస్సు పుట్టె
శాంతంబు ఘోరంబులు మూఢంబులు విశేషంబు లనునామంబులం బరగునిమ్మహ్యాది
భూతంబు లేడును నానావిధవీర్యంబులు పృథగ్భూతంబులు నగుటం జేసి యేకత్వంబు
వెలిగాఁ బ్రజల సృజియింపంజాల విట్టిభూతసప్తకసంయోగంబున జలంబున నెసఁగు
బుద్బుదంబును బోలె నొకయండం బుద్భవిల్లి క్రమంబునం బ్రవర్ధిలి యుదకంబు
నందుండ నమ్మహాండంబునందు క్షేత్రజ్ఞుండు బ్రహ్మ యనుపేర శరీరియుం బ్రథమ
పురుషుండును నిఖిలభూతాదికర్తయు నై యుదయించె నతనిం బొదివినయుల్బంబు
మేరునగంబును జరాయువు పర్వతంబులును నయ్యుమ్మనీరు సముద్రంబులు
నయ్యె నొండొంటికిం బదేసిమడుంగు లెక్కు డైనపయస్తేజోవాయువియద్భూ
తాదిమహదవ్యక్తంబు లనుసప్తావరణంబుల చేత నయ్యండంబు పొదువంబడి
యుండు నిట్లబుద్ధిపూర్వంబును క్షేత్రజ్ఞాధిష్ఠితంబును నై తొలుతఁ బ్రాకృతసర్గం
బావహిల్లె ననిన మార్కండేయునకుం గ్రోష్టుకి యి ట్లనియె.
| 8
|
బ్రహ్మజన్మము
క. |
ఇల మొదలుగఁ గలభూత, మ్ములు గ్రమ్మఱఁ బ్రకృతినడఁగి పోయినతుది ని
మ్ముల నుండునట్టి దొక్కటి, గలదో లేదో యెఱుంగఁ గాఁ జెప్పు తగన్.
| 9
|
క. |
అనిన భృగుకులవరేణ్యుం, డనఘా! విను మెపుడు ప్రకృతియం దడఁగుఁ గ్రమ
మ్మున భూతంబులు ప్రాకృత, మనువిలయం బండ్రు, దాని ననఘ! మునీంద్రుల్.
| 10
|
వ. |
అపుడు సకలవికారంబులు నడంగినం బ్రకృతియుఁ బురుషుండును సాధర్మ్యంబునం
బొందుదురు తమస్సత్త్వంబు లొండొంటింజొచ్చి యెక్కువతక్కువలు లేక యుండుఁ
దైలంబు తిలలయందును ఘృతంబు దుగ్ధంబులయందు నుండునట్లు రజంబు తమస్స
త్వాంతర్గతం బై యుండునట్లుండ నయ్యాదిపురుషునికి నాయువు రెండు పరార్ధం
బులు పగలు నంతియ రాత్రియుం జనునంత నహర్ముఖంబునం బ్రబుద్ధుండై సర్వ
హితుండును జగదాదియు నచింత్యుండు నైనపరమాత్ముండు ప్రకృతిపురుషులం
బ్రవేశించి.
| 11
|
ఆ. |
మధుమదంబు మలయమారుతంబును వధూ, జనుల గలఁచుపగిది శాశ్వతుండు
పరమయోగమూర్తి పరమాత్ముఁ డయ్యిద్ద, ఱను గలంచుటయును నొనర నంత.
| 12
|
వ. |
క్షోభ్యమాణం బైనప్రధానంబువలన మున్ను నీ నేను జెప్పినవిధంబున బ్రహ్మ
యండకోశస్థుం డై యావిర్భవించె నాకర్ణింపుము.
| 13
|
క. |
కలఁచినపరమాత్ముండును, గలపంగాఁబడినప్రకృతికర్త పురుషుఁడు
న్దలఁపఁగ నొక్కఁడ కా మదిఁ, దెలియుము సద్విమలతత్త్వదృష్టి మునీంద్రా!
| 14
|
సీ. |
అనఘ జగద్యోని యగుపురుషుండు నిర్గుణుఁ డయ్యుఁ దా రజోగుణము నొంది
బ్రహ్మయై పుట్టి సర్గంబులం దెప్పుడు నఖిలప్రజాసృష్టి యాచరించు
విమలసత్త్వోన్నతి విష్ణుఁ డై పుట్టి ధర్మంబున లోకసంరక్ష సేయు
వితతతమోగుణావృతి రుద్రుఁ డై పుట్టి జగము లన్నియు నుపసంహరించు
|
|
తే. |
బీజములు చేన వెదవెట్టి ప్రీతిఁ గాచి, పండుటయుఁ గోయుహలికునిభంగి నొకఁడ
కాలములు మూటికిని దానె కర్త యగుచు, బ్రహ్మవిష్ణురుద్రాఖ్యలఁ బరగు నాత్మ.
| 15
|
క. |
అనఘా! రజంబు సత్త్వం, బును దమమును ననఁగఁ గలవు మూఁడుగుణంబు
ల్విను బ్రహ్మవిష్ణుశంకరు, లనఁగా దేవతలు మువ్వు రఖిలజగములన్.
| 16
|
క. |
ఇతరేతరమిథునత్వము, నితరేతరసంశ్రయంబు నితరేతరసం
గతియు మెఱయ నాదేవ, త్రితయము విహరించు లీలఁ ద్రివిధావస్థన్.
| 17
|
చతుర్యుగమన్వంతరకాలసంఖ్యలు
వ. |
ఇట్లు జగంబులకు నాద్యుం డై యావిర్భవించినహిరణ్యగర్భుండు భూపద్మకర్ణికా
సీనుం డై యుండు నాచతుర్ముఖునకుం బరమాయువు నూఱేండ్లు తత్ప్రమాణంబు
వినుము నిమిషంబులు పదియేను కాష్ఠ కాష్ఠలు ముప్పది కళ కళలు ముప్పది
ముహూర్తంబు ముహూర్తంబులు ముప్పది యహోరాత్రం బహోరాత్రంబులు
|
|
|
పదియేను పక్షంబు పక్షంబులు రెండు మాసంబులు మాసషట్కం బయనం బయన
ద్వయంబు సంవత్సరం బయనంబు రెండు దేవతలకు నొక్కయహోరాత్రం బట్టి
యహోరాత్రంబు లైన దివ్యాబ్దంబులు పండ్రెండువేలు చతుర్యుగం బనఁ బరగు
నందుఁ గృతయుగంబునకు సంఖ్య నాలుగువేలు దానిసంధ్యయు సంధ్యాంశంబును
నన్నూఱేసి త్రేతాయుగంబునకు సంఖ్య మూఁడువేలు దానిసంధ్యయు సంధ్యాం
శంబును మున్నూఱేసి ద్వాపరయుగంబునకు సంఖ్య రెండువేలు దానిసంధ్యయు
సంధ్యాంశంబును నిన్నూఱేసి కలియుగంబునకు సంఖ్య వేయి దానిసంధ్యయు
సంధ్యాంశంబు నూఱేసి యిట్టిదివ్యాబ్దద్వాదశసహస్రంబును గలయట్టిమహాయు
గంబులు వేయి బ్రహ్మకు దినంబనం జను.
| 18
|
చ. |
మను వుదయింపఁగా మునులు మానుగ నిర్జరవల్లభుండు న
య్యనిమిషులు న్మనుప్రభృతు లైననృపాలురు గల్గి పెంపున
న్ఘనముగ మందు రమ్మనువుకాలము వోయినఁ బోదు రందఱు
న్మనువులు పుట్టి యిట్లు పదునల్వురు సెల్లుదు రద్దినంబునన్.
| 19
|
క. |
పదునలువురు మనువులు భూ విదితముగ మహాయుగములు వేయిటిలోన
న్ముదమున నొక్కొకరుఁడు డె, బ్బదియొక్కయుగమున కనఘ! పతి యగు వరుసన్.
| 20
|
వ. |
ఆడెబ్బదియొక్కమహాయుగంబులకు ముప్పదికోట్లు నఱువదియేడులక్షలు నిరువది
వేలు మానుషాబ్దంబు లగు నిది మన్వంతరంబులవిధంబు మఱియు నొక్కమన్వంత
రంబున దివ్యాబ్దంబులసంఖ్య యెనిమిదిలక్షలు నేఁబదిరెండువే లగువానిం జతు
ర్దశగుణితంబుఁ జేసిన బ్రహ్మకు దినం బద్దినాంతంబునఁ గలుగులయంబు బుధులు
నైమిత్తికం బని చెప్పుదు రప్పు డేకార్ణవం బైయుండు నజ్జలంబులయందు నారా
యణాభిధానుండై బ్రహ్మ తేలుచు నహఃప్రమాణరాత్రి యెల్లను నిద్రించి వేగు
టయు నెప్పటి యట్ల ప్రజల సృజియించు నట్టియహోరాత్రంబులం గలవర్ష
శతంబునందు.
| 21
|
తే. |
అనఘ యేఁబదియేండ్లు పరార్ధ మనఁగ, నొనరు నింతకు మును బ్రహ్మ కొకపరార్థ
మరిగె దానియంతమునఁ బాద్మాభిధాన, కల్ప మయ్యె నుత్తమగుణాకల్పవిభవ!
| 22
|
వ. |
ద్వితీయపరార్ధంబునం దిప్పుడు వరాహకల్పంబు వర్తించుచున్నది యనిన మార్కం
డేయునకుఁ గ్రోష్టుకి మహాత్మా! ప్రజాపతి ప్రజల నెట్లు సృజియించుం జెప్పవే
యనిన నమ్మునీంద్రుండు పాద్మాభిధానకల్పాంతప్రళయనిశావసానసమయంబున
మేలు కాంచి శూన్యం బైనలోకంబు నాలోకించి.
| 23
|
సీ. |
నారాయణుం డగునలువ సముద్యద్వరాహరూపముఁ దాల్చి రభసలీల
నామహర్లోకపర్యంతంబు దొట్టిన యంబుపూరముఁ జొచ్చి యతలమునకు
నరిగి ధరిత్రి దంష్ట్రాంకురాగ్రంబున మెల్లన జలములమీఁది కెత్తె
నందుఁ బేరోడయందట్లు దేలుచు నున్నదాని సమస్థలిఁగా నొనర్చి
|
|
తే. |
ప్రళయపవనానలాహతిఁ బడినయట్టి, కులనగములు నిజస్థానములను నిలిపి
యేడుదీవులు వార్ధులు నేర్పరించి, యఖిలజగములు తొల్లిటియట్ల యునిచి.
| 24
|
సురనరతిర్యగాదినవవిధసర్గములు
వ. |
సృష్టిచింతాపరుం డైనయన్నలువముందట నవిద్య తమంబు మోహంబు మహా
మోహంబు తామిస్రసంబంధంబు ననుసంజ్ఞల నేనుదెఱంగులై తోఁచిన వానిం
బ్రజాపతి బహిరంతఃప్రకాశరహితంబులు ముఖ్యంబులు నగువృక్షంబులుగాఁ
బ్రథమసర్గంబును దిర్యక్స్రోతస్సు తోఁచిన దానం దమోమయంబులు నంతః
ప్రకాశంబులు నగుపశుప్రముఖతిర్యగ్జంతువులుగా ద్వితీయసర్గంబును నూర్ధ్వ
స్రోతస్సు దోఁచిన దాన సాత్వికులు బహిరంతఃప్రకాశులు సుఖులు నగుదేవత
దృతీయసర్గంబును నర్వాక్స్రోతస్సు దోచిన దానం దమోరజస్సముద్రిక్తు
లును బహుదుఃఖపరులును బహిరంతఃప్రకాశులు నగుమనుష్యులుగా జతుర్థ
సర్గంబును గా నిర్మించి యాతరుతిర్యగ్దేవమనుష్యులకు వృత్తులుగా విపర్య
యంబును శక్తియు సిద్ధియుఁ దుష్టియు నను నాలుగు దెఱంగులుగఁ గల్పించి
పంచమం బగుననుగ్రహసర్గంబు నిర్మించె మానససర్వతృప్తు లగుసఫ్తమునుల
నుత్పాదించి కౌమారం బనుషష్ఠసర్గంబు నిర్మించె నిట్లు బ్రహ్మవలన బుద్ధిపూర్వ
కంబు లగువైకృతసర్గంబు లాఱును బ్రహ్మకంటె మున్ను ప్రకృతివలనం బుట్టిన
మహత్సర్గంబును భూతతన్మాత్రసర్గంబును నింద్రియసర్గంబుననం బ్రాకృతసర్గంబులు
మూఁడునుగా నివ్విధంబునం గల్పాదియందు నవవిధసర్గంబులయ్యె ననిన విని
క్రోష్టుకి యి ట్లనియె.
| 25
|
బ్రహ్మయవయవములనుండి ప్రజలయుత్పత్తిప్రకారము
.
క. |
మునివల్లభ! సంక్షేపం, బునఁ జెప్పితి నీవు సర్గములవిధములు నా
కొనరంగఁ బ్రజలపుట్టువు, వినిపింపుము విస్తరించి విమలచరిత్రా!
| 26
|
వ. |
అనిన మార్కండేయుం డి ట్లనియె.
| 27
|
సీ. |
ప్రజల సృజింపఁగ నజుఁడు దామసశరీరముఁ దాల్చుటయు జఘనమున నసుర
లావిర్భవించి రయ్యంగంబు నిశ యయ్యె దీపితసత్వాన్యదేహుఁ డగుడు
నాననంబునఁ బుట్టి రమరు లాగాత్ర మహ స్సయ్యె వెండియు నట్టియెడలఁ
గైకొని పితృభావకలితుఁడై యుండ ను ద్భవమైరి పితరు లాతనువు సంధ్య
|
|
తే. |
యయ్యె నతులరజోమయం బై నయట్టి, మేను పూనుటయును దాన మానవులు జ
నించిరది జ్యోత్స్న యయ్యె నక్తంచరాదు, లోలి బలవంతు లయ్యయి కాలములను.
| 28
|
వ. |
మఱియుం బ్రజాపతి రజస్తమోమయం బగురూపంబు గైకొని నిబిడాంధకారం
బగు నిశాసమయంబున క్షుత్పిపాసాపీడితులును విరూపశ్మశ్రుముఖులు నగువా
రలం బుట్టించిన వారిలోనం గొంద ఱాశరీరంబు రక్షించెద మని పలికి రాక్షసు
లైరి కొందఱు భక్షించెద మని పలికి యక్షులై రయ్యిరుదెఱంగులవారిం జూచి
|
|
|
వివరించి కోపించినం దదీయకేశంబులు విశీర్ణంబులై రాలిన సర్పణంబు నొంది
సర్పంబు లయ్యె వానింగని క్రుద్ధుండై కపిలవర్ణంబు లుగ్రంబులు పిశితాశనంబు
లగుభూతంబుల నిర్మించె మఱియు మృదువాగ్ధ్యానపరుం డగునలువకుఁ గొందఱు
పుట్టి వాగ్ధయనపరు లగుట గంధర్వులనం బరగి రిట్లష్టవిధదేవయోనులను
మానవులను సృజియించి.
| 29
|
క. |
తనమహితవయశ్శక్తిని, వినుము వయస్సంతతులను విమలతరాస్యం
బున నజనివహము వక్షం, బున నవికులములను నజుఁడు పుట్టించెఁ దగన్.
| 30
|
తే. |
ఉభయపార్శ్వంబులను దనయుదరమునను, నజుఁడు పుట్టించె గోనివహంబు ననఘ!
యతనిచరణంబులందు హస్త్యశ్వగవయ, రాసభోష్ట్రంబులను మృగప్రకరములను.
| 31
|
తే. |
ఫలములను మూలములఁ గడుఁ బొలుచునోష, ధులను గల్పాదిఁ దనరోమముల సృజించి
కమలగర్భుండు త్రేతాముఖమున వాని, ననఘ! పశువుల యజ్ఞయోగ్యములఁ జేసె.
| 32
|
వ. |
బ్రహ్మఋగ్వేదంబును గాయత్రీ ఛందంబును రధన్తరసామంబును నగ్నిష్టోమయా
గంబును బూర్వముఖంబున యజుర్వేదంబును గ్రిష్టుప్ఛందంబును బృహత్సామంబు
నుక్థ్యయజ్ఞంబును దక్షిణముఖంబున సామవేదంబును జగతీఛ్ఛందంబును వైరూ
పాతిరాత్రక్రతువులును బశ్చిమముఖంబున నధర్వవేదంబును ననుష్టుప్ఛందంబును
సప్తోర్యామమఖంబును నుత్తరముఖంబున నిర్మించె మేఘంబును మెఱుంగును నశ
నియు రోహితంబును నింద్రధనువునుం బుట్టించె మఱియు ననేకప్రకారంబు లగు
చరాచరభూతంబుల నక్షత్రగ్రహతారకాప్సరోగణంబులను సృజించె నది పూర్వ
సృష్టియం దెయ్యది యెట్లు వర్తించు నట్లు వర్తింప దొడంగె నివ్విధంబున వేదసూ
క్తంబులందు దేవర్షిప్రభృతులకు నామరూపక్రియాదు లేక్రమంబునం జెప్పంబడె
నాక్రమంబునం గావించె ననినం గ్రోష్టుకి యి ట్లనియె.
| 33
|
మనుష్యదంపతివర్ణగుణక్రియాదులు
క. |
జను లర్వాక్స్రోతస్సున, జనియించుటఁ జెప్పి తెట్లు జనులకు నొనరిం
చె నజుం డొగి వర్ణంబులు, మునివర! గుణములును గర్మములుఁ జెప్పు తగన్.
| 34
|
సీ. |
అనిన మార్కండేయుఁ డను వినిపించెద బ్రహ్మ సృష్టిక్రియాపరత నొంది
వక్త్రంబునందును నక్షంబునందును దొడలయందును దనయడుగులందు
నుద్భవింపఁగఁ జేసి నొగి వేయి వేయేసి మిథునము ల్మిగుల నామిథునములును
గ్రమమున బ్రాహ్మణక్షత్రియవిట్ఛూద్రసంజ్ఞలఁ జెలువొంది సంతతంబు
|
|
తే. |
సురతములు సల్పుచుండ నాసుందరులకు, ఋతువు నెలనెల లేమి సంతతులు సాల
నొదవ కాయురంతమున నొకొక్కరుచిర, మిథున ముదయింపఁ జొచ్చె సమిద్ధపుణ్య!
| 35
|
వ. |
ఇట్లు ప్రజాపతివలనం దొలుత మానుషసృష్టి యయ్యె నంత దదన్వయజాతులైన
స్త్రీపురుషులచేత జగంబును వృద్ధిఁ బొందె నవ్విధం బాకర్ణింపుము.
| 36
|
ఉ. |
ఆతతనైజతృప్తిప్రమదాంబుధిఁ దేలుచు లీల శీతవా
తాతపబాధలం బడక యాసతులు న్బతులు న్నిజేచ్ఛ ధా
త్రీతల మెల్లఁ ద్రిమ్మరుచు దివ్యనదీప్రదసింధుతీరసం
జాతవనప్రదేశములు శైలతటంబులు నున్కిపట్టుగాన్.
| 37
|
క. |
విహరణపరులై పశుమృగ, విహగాదులవలన నింత వెఱ పెఱుఁగక ని
స్పృహులై సుఖులై యుండఁగ, బహుకాలము సనియె నంత ప్రజలు మనమునన్.
| 38
|
పట్టణగ్రామఘోషాదిపరిమాణము
వ. |
శీతోష్ణాదిద్వంద్వంబులచేతం బీడితులై తమ కునికిపట్టులు విచారించి సహజంబు
లగుగిరిదుర్గ వనదుర్గ జలదుర్గంబులందు నివాసంబులు గావించి చతుర్థం బగు కృత్రిమ
దుర్గంబునవల శాస్త్రోక్తప్రమాణవృత్తాయతప్రాకారపరిఖావృతంబులుగాఁ బుర
ఖేటఖర్వటద్రోణీముఖంబులు రచియించి పెనుబయల మంత్రిసామంతగుప్తముగా
శాఖానగరంబును గృషీవలశూద్రబహుళంబుగా గ్రామంబును గోగజాకీర్ణగోపాల
జనోపేతంబుగా ఘోషంబును గడిభూమిం బరదేశబాధకదుష్టజనప్రాయంబుగా
దృశియును నన ని ట్లష్టవిధంబులై యుండ నిర్మించి యందు గృహంబులును శాల
లుం గల్పించుకొని శీతాతపాదిబాధల జయించి క్షుత్పిపాసార్తులై జీవనోపాయంబు
చింతించుచుండ.
| 39
|
శా. |
త్రేతాది న్బహువర్షము ల్గురియ ధాత్రిం బుట్టి మున్నోషధీ
వ్రాతంబు ల్దమయంతఁ బుష్పఫలసంప్రాప్తి న్లతాగుల్మభూ
జాతంబు ల్విలసిల్లె నిమ్నగతవాస్సంవృత్తిమై నీమహీ
జాతంబు ల్గడు నుద్భవిల్లెఁ బ్రజకు న్సమ్మోద మేపారఁగాన్.
| 40
|
క. |
దున్నక వెద పెట్టక యు, త్పన్నము లైనట్టివిపులబహుసస్యముల
న్బన్నుగఁ గైకొని జనుల, త్యున్నతితో నెలమి బ్రతుకుచుండఁగ నంతన్.
| 41
|
చ. |
మనమున రాగలోభములు మత్సరము ల్గడు నగ్గలింప న
జ్జనులు గడుసమత్వమున సస్యములు న్నదులు న్నగంబులు
న్వనములు వేఱువేఱ బలవంతులు లుబ్ధులు నై కడంగి కై
కొనిరి తదీయదోషమునఁ గుంభిని యోషధుల న్గ్రసించినన్.
| 42
|
తే. |
పటుబుభుక్షార్తులై జను ల్బ్రహకడకు, నరిగి శరణంబు వేఁడిన నతఁడు మేరు
భూధరముఁ గ్రేపుఁ గావించి భూమి గోవుఁ, జేసి పితికిన నోషధు ల్చెలువు మిగిలె.
| 43
|
గ్రామ్యారణ్యౌషధులు
వ. |
వాని వెదపెట్టినఁ దద్బీజంబులు మొలచి పండునట్లుగా నక్కడ నుంచి యోషధు
లకు వ్యర్థత్వంబు లేకుండఁ బ్రజాపతి గావించె నది మొదలుగా సస్యంబులు కృషి
|
|
|
క్రియాప్రభవంబులగు యవవ్రీహిగోధూమతిలప్రియంగుమాషముద్గంబు లాది
గా గ్రామ్యంబులు పదియేడును నీవారశ్యామాకగవేధుక లాదిగా నాటవికంబు
లేడును నై ఫలించుచుండునని యజ్ఞయోగ్యంబులై యతిశయిల్లు.
| 44
|
ఆ. |
సహజవృత్తి నెద్ది సమకూరుఁ గృతయుగ, మహితవేళ సహజమానవులకు
సత్యధర్మములును సస్యసమృద్ధియుఁ, గల్గుచుండు నంతఁ గ్రమముతోడ.
| 45
|
చ. |
తిరముగ రేయునుం బగలుఁ దృష్ణ జనింపఁగ గోరుకోర్కుల
న్దొరకొనుసిద్ధుల న్జనులు దుష్టి వహించుచు నిత్యయౌవన
స్ఫురణల నుల్లసిల్లుచు నసూయయు వైరము నింత లేక యొం
డొరువులఁ గూడి మందు నధమోత్తము లెవ్వరు గాక తుల్యులై.
| 46
|
ఉ. |
వారు చతుస్సహస్రమితవత్సరజీవులు దంపతిప్రజా
ధారులు నై నిజేచ్ఛల ముదంబున నుండఁగఁ గాలదీర్ఘతన్
వారికిఁ గామ్యసిద్ధు లొగి వ మ్మయి పోయినఁ గల్పభూజముల్
చేరి తదాశ్రమంబుల వసింప సుఖించుచునుండి రుండఁగన్.
| 47
|
సీ. |
త్రేతాయుగంబు వర్తింపఁ దొడంగిన నజ్జను ల్వ్రీడరాగాత్ము లైరి
ఋతువు తత్సతులకుఁ బ్రతిమాసములు గల్గె బహుళంబు లయ్యె నపత్యచయము
లంతఁ గల్పతరువు లడఁగిన నజ్జను లన్యభూరుహముల నాశ్రయించి
యం దుద్భవించుమహావీర్యమధురసంబున సతతము తృప్తిఁ బొందుచుండ
|
|
తే. |
మోహలోభము ల్మనమున మునుఁగుపడిన, నివి మదీయమ్ములని యమ్మహీజములఁ బ
రిగ్రహించి రాదోషపరిగ్రహమున, నవియు మాయంబు లగుటయు నజ్జనములు.
| 49
|
బ్రాహ్మణాదులస్థానములు
ఆ. |
ఒనర దేశములకు నుర్వులకును మేరు, లలవరించి యంత నవ్విరించి
వరుసతోడ సర్వవర్ణాశ్రమాచార, విధము లేర్పడంగ విస్తరించి.
| 49
|
వ. |
బ్రాహ్మణులకుఁ బ్రాజాపత్యలోకంబును క్షత్త్రియులకు నింద్రలోకంబును వైశ్యు
లకు వాయులోకంబును శూద్రులకు గంధర్వలోకంబును బ్రహ్మచారులకు నూర్ధ్వ
రేతస్కులగు నష్టాశీతిసహస్రమునులస్థానంబును గృహస్థులకుఁ బ్రాజాపత్యస్థానం
బును వానప్రస్థులకు సప్తఋషిస్థానంబును సన్న్యాసులకు బ్రహ్మస్థానంబును బరమ
యోగులకు నమృతస్థానంబును నివాసంబులుగాఁ గల్పించె నని చెప్పి మార్కం
డేయుండు క్రోష్టుకి యిన్ని సర్గంబులకు మున్ను నలువ సృజించినకౌమారసర్గంబు
తెఱం గాకర్ణింపుము.
| 50
|
క. |
సనకసనందనముఖముని, జనులం గల్పాది నజుఁడు సంపాదించె
న్విను వారు పరమయోగా, ర్థినిరూఢత్వమున నూర్ధ్వరేతసు లైనన్.
| 51
|
వ. |
బ్రహ్మకు మహారోషం బుద్భవించిన యది.
| 52
|
ఏకాదశరుద్రసర్గము
క. |
తెలిగన్ను కవిలకన్నును, వలిచన్నును దృఢవిశాలవక్షము నెఱివే
నలి కెంజడలును గలిగిన, వెలఁదియు మగవాఁడు నైనవేల్పై నిల్చెన్.
| 53
|
క. |
నిలిచినఁ గనుఁగొని యిమ్మెయిఁ, గలసినయయ్యొడలు రెండుగా విభజింప
న్వలయు నని యజుఁడు పలికినఁ, బొలుపుగ నవ్వేల్పు సతియుఁ బురుషుఁడు నయ్యెన్.
| 54
|
క. |
ఆపురుషుం డేకాదశ, రూపమ్ములు దాల్పె వారు రుద్రు లనంగా
దీపించి రంత నాస్త్రీ,రూపంబును నతఁడు పెక్కురూపులు సేసెన్.
| 55
|
క. |
విను భృగుఁ బులస్త్యుఁ బులహుని, నొనరఁగ నంగిరసు నత్రి నొగిఁ గ్రతువు వసి
ష్ఠుని దశుక్షు మరీచి సృజిం, చె నవబ్రహ్మలుగ నజుఁడు చిత్తస్మరణన్.
| 57
|
వ. |
సంకల్పుఁడును ధరుఁడు ననుపుత్రులఁ బుట్టించి యవ్విరించి మఱియును.
| 58
|
స్వాయంభువమనుసంభవము
క. |
వినుము ప్రజాపాలనపరు, ననుపమసత్త్వాభిరాము నాత్మసమాను
న్ఘను నాస్వాయంభువుఁ డను, మనువు న్శతరూప యనుకుమారి సృజించెన్.
| 59
|
తే. |
వారు దంపతులయి ప్రియవ్రతుఁడు సద్గు, ణాఢ్యుఁ డుత్తానపాదుండు ననఁగఁ బరగు
సుతయుగంబును సూతిప్రసూతు లనఁగఁ, గన్యకల నిద్దఱను నొగి గాంచి రెలమి.
| 60
|
దక్షసర్గము
ఆ. |
ఆప్రసూతి దకుఁ డాసూతి నింపార, రుచియుఁ బెండిలైరి రుచికిఁ బుట్టి
రనఘ! దక్షిణయును యజ్ఞుండు వారికి, యామనామధేయు లైనసుతులు.
| 61
|
వ. |
పన్నిద్దఱు పుట్టిరి మఱి దక్షునకుం బ్రసూతికి నిరువదినలువురు కూఁతులు పుట్టి రందు
ధర్మునికిఁ బదుమువ్వురును భృగునికి ఖ్యాతియు భవునికి సతియు మరీచికి సంభూ
తియు నంగిరసునకు స్మృతియుఁ బులస్త్యునకుఁ బ్రీతియుఁ బులహునకు క్షమయుఁ
గ్రతువునకు సంతతియు నత్రికి ననసూయయు వసిష్ఠునకు నూర్జయు సగ్నీకి
స్వాహయుఁ బితరులకు స్వధయు ననం బదునొక్కండ్రను భార్యలుగా నిచ్చె
నాధర్మునికిం గ్రమంబున శ్రద్ధయందుఁ గాముండును లక్ష్మియందు దర్పకుండును
ధృతియందు నియముండును దుష్టియందు సంతోషుండును బుష్టియందు లోభుం
డును మేధయందు శ్రుతుడు గ్రియయందు నయవినయదండులును బుద్ధియందు
బోధుండును లజ్జయందు వినయుండును వపువందు వ్యవసాయుండును శాంతి
యందు క్షేముండును సిద్ధియందు సుఖుండును గీర్తియందు యశుండును బుట్టిరి.
మఱి శ్రద్ధాపుత్రుం డైనకామునికి మతికి హర్షుండు పుట్టె నధర్మునికి హింసకు ననృ
తుం డనుకొడుకును నిరృతి యనుకూఁతురుం బుట్టి దంపతులైరి పదంపడి వారికి
భయుండును మాయయు నరకుండును వేదనయు ననుమిథునద్వయంబు పుట్టె
నమ్మాయకు నరకునికి మృత్యువు పుట్టె మృత్యువునకు వ్యాధిజరాశోకతృష్ణాక్రోధు
|
|
|
లును భయునికి వేదనకు దుఃఖుండును బుట్టిరి వా రందఱు నూర్ధ్వరేతస్కు
లైరి నిరృతికి నలక్ష్మి యనుకూఁతురు పుట్టె దానికి మృత్యువు భర్త యయ్యె
నామృత్యువునకు నలక్ష్మికిం బదునలువురు నందనులు గ్రమంబున.
| 62
|
చ. |
కలిగి యలక్ష్మిఁ జేయుచును గ్రక్కున మృత్యువు నావహించుచు
న్నెలకొని నాశకాలమున నెట్టన మర్త్యులఁ జొచ్చి యింద్రియ
మ్ములు పదియింటను న్మదినిఁ బొంది యహంకృతిఁ జెంది బుద్ధియం
దొలసి కడు న్విమోహమున నొంది యజస్రము సూక్ష్మమూర్తులై.
| 63
|
క. |
పురుషులు నెలఁతల విషయా, తురులుగఁ గలఁచుచు ననేకదురితకరులు గాఁ
బురిగొలుపుచు రాగాదులఁ, బరిభూతులఁ జేయు చిట్లు ప్రసరింతు రిలన్.
| 64
|
దుస్సహోత్పత్తి
వ. |
అని చెప్పి మార్కండేయుండు విను మధర్మునికి నధోముఖుండును దంష్ట్రాకరాళుం
డును నతిభైరవారావుండును నైనపుత్త్రుండు దుస్సహుం డనువాఁ డుద్భవించి
క్షుత్పిపాసాపీడితుండై భువనంబులు భక్షింపఁ దొడంగిన బ్రహ్మయతని కి ట్లనియె.
| 65
|
క. |
ఓహో! దుస్సహ! యీయు, త్సాహము వల దుడుగు మలుక శమ మొందుము నీ
కాహర మగునే జగములు?, మోహమున రజస్తమముల మునుఁగకు మనినన్.
| 66
|
వ. |
ద్రుహిణునకు దుస్సహుం డి ట్లనియె.
| 67
|
తే. |
నోరు వఱువట్లు పట్టెడు నీరువట్టు, నిలువ రాదు పేరాఁకట నిమిష మైన
నెట్లు తృప్తుండ నగుదు లా వెట్లు గాంతు, నెందు వసియింతు నేఁ జెప్పవే మహాత్మ!
| 68
|
బ్రహ్మ దుస్సహున కాహారాదుల నేర్పఱుచుట
తే. |
జనులయిండులు నీకు నాశ్రయము ధర్మ, నియతి లేనివారలు విను నీకు బలము
నిత్యకృత్యక్రియాహాని నీకుఁ బుష్టి, యంబరము నీకు లూతాచయమ్ము సుమ్ము.
| 70
|
సీ. |
శునకేక్షితాన్నంబు విను కేశకీటదుష్టమ్మును భిన్నభాండస్థమును వ
దనగహ్వరమున నూఁదినయవియును వేఁడి గానివి పక్వంబు గానియవియు
నవని సంస్కృతి లేనియవియు శీర్ణాసనమున నుండియును విదిఙ్ముఖత సంధ్య
లందును గీతవాద్యంబులు వించు రజస్వలఁ జూచుచు జనులు గుడుచు
|
|
ఆ. |
నోదనములు మఱియు నొండుపహతిఁ బొంది, నట్టిభోజ్యసంచయములుఁ బ్రీతి
నధికతృప్తి సేయు నాహారములుగ నా, చేత నిపుడు నీకుఁ జెప్పఁబడియె.
| 72
|
క. |
శ్రుతిశాస్త్రపురాణవినిం, దితకర్మము లాచరించు ధీరహితుని దు
ష్కృతఫలముల నోదుస్సహ!, సతతంబును దృప్తి నీకు సంపాద్య మగున్.
| 73
|
తే. |
పంక్తిభేదవృథాపాకపాక భేద, కరుల నన్యోన్యసంతతకలహపరుల
గోగజాశ్వచయాపోషకులును నైన, నరులయిండుల నెందులఁ దిరుగుచుండు.
| 74
|
శా. |
నక్షత్రగ్రహపీడ లొందిన నొగి న్నానావిధోత్పాతము
ల్ప్రక్షోభించిన శాంతి సేయనినరు ల్గాదంబరీస్త్రీమృగ
వ్యాక్షాసక్తులు గృత్రిమవ్రతులు మిథ్యాచారు లాత్మీయధ
ర్మక్షీణు ల్భవదీయశాసనమున న్బ్రాపింతు రత్యంతమున్.
| 75
|
క. |
విను వైశ్వదేవ మొనరిం, చినతుది నీపేరు సెప్పి చెలువుగ బలి యి
చ్చినవారిసదనములకు, న్జనకుము విహరింపు మితరజనసదనములన్.
| 76
|
క. |
పితృదేవతార్చకులు సం, తతశుచులు నలోలుపులు జితస్త్రీకులు సం
స్కృతరుచిరాన్నభుజులు నగు, నతిపుణ్యులసదనములకు నరుగకు మెపుడున్.
| 77
|
క. |
బాలస్త్రీ వృద్ధస్వజ, నాలికి నేయిండ్ల నెయ్య మగ్గలము కుల
స్త్రీ లెందు బహిర్గమనవి, లోలలు కా రట్టియిండ్లలోను జొరకుమీ.
| 78
|
ఉ. |
బొంకక జీవహింస దెసఁ బోవక యేరికిఁ జిత్తతాప మే
వంకను జేయ కీ సుడిగి వైరము లేక శమంబు దాల్చి ని
శ్శంకత నైజధర్మములు సల్పుచు నెమ్మది నుండునన్నిరా
తంకులపుణ్యమందిరవితానముపొంతకుఁ బోకు దుస్సహా!
| 79
|
క. |
పతిభక్తి గలిగి పోష్యులు, పతి గుడిచిన మఱియుఁ గుడిచి పతిశుశ్రూషా
న్వితయై దుష్టస్త్రీసం, గతి సేయనియతివఁ జేరఁగా వలదు సుమీ!
| 80
|
క. |
అనలం బాఱక సలిలం, బును నెపుడును గల్గి తల్పములు భానుని గ
న్గొనరానిచోట నుండుస, దనములు దుస్సహ! రమాసదనములు సుమ్మీ!
| 81
|
క. |
విను దుస్సహ! విలసచ్చం, దనవీణాముకురమధుఘృతప్రతతియు గో
వును దామ్రపాత్రములు గల, జనమందిరములకు నీకుఁ జన రాదు సుమీ!
| 82
|
తే. |
అర్థి నేర్పడఁగా విను మాఁడువారు, మువురు మగవార లేవురు మూఁడుధేను
వులును రేపులె వెలుఁగును గలమనుష్యు, ని ల్లధర్మతనూజ! నీ కిరవు సుమ్ము.
| 83
|
క. |
విను మేఁక గొఱియలు మొదవు, లెనుములు తురగములు గజము లిం దొకటియు రెం
డును మూఁడును నేనును నా, ఱును నేడును నుండునది గుఱుతు నీ కుండన్.
| 84
|
క. |
కొడవలి గొడ్డలి పీఠము, లెడనెడ నెరయంగ వైచునిండ్లును మఱి యొ
క్కెడ ఱోలును రోఁకళ్లును, నిడినగృహంబులును నీకు నిరవులు నిలువన్.
| 85
|
క. |
ఏయిండ్లను గొలుచు సరకు, సేయరు భోజ్యములు లెక్క సేయరు ధనురా
ద్యాయుధములు గైకొన రీ, వాయిండులఁ గేలి సలుపు మనవరతంబున్.
| 86
|
వ. |
అని బహువిధముల దుస్సహుని శాసించి ద్రుహిణుం డంతర్హితుం డయ్యె నంత.
| 87
|
దుస్సహసంతానదురాచారప్రకారము
తే. |
కలికిభార్యకుఁ బుట్టినకన్యఁ బెండి, లయ్యె నిర్మాష్టి యనుదాని నయ్యధర్ము
కొడుకు దుస్సహుఁ డుజ్జ్వలగుణవరేణ్య, వారి కిరువురకును విను వరుసతోడ.
| 88
|
వ. |
దంతాకృష్టియు నుక్తియుఁ బరివర్తియు నంగయుక్కును శకునియు గండప్రాంత
రతియును గర్భహుండును సస్యహుండు ననుకొడుకు లెనమండ్రును నియోజిక
విరోధిని స్వయంహారిక భౌమణి ఋతుహారిక స్మృతిహారిక బీజహారిక విద్వేషిణి
యనుకూఁతు లెనమండ్రునుం బుట్టిరి వార లొనరించుపనులు చెప్పెద దంతా
కృష్టి యనువాఁడు సుఖసుప్తులైన బాలుర దంతపఙ్క్తియందు వసియించి.
| 89
|
చ. |
పలు గొఱుకంగఁ జేయుచును వార్చుమనంబున దుస్సహాగమం
బలఘువిచార! తత్ప్రశమనార్థముగా వెలియాన లారద
మ్ములపయిఁ బాన్పునందుఁ గడుఁ బొల్పుగఁ జల్లి సువర్చలౌషధీ
కలితజలంబు లార్చునది గ్రక్కున బాలు సమంత్రకంబుగాన్.
| 90
|
ఉ. |
ఉక్తి యనువాఁడు నృశుభాశుభోక్తులందుఁ, బలుకుచుండుఁ దథాస్తుశబ్దంబు గాన
నశుభవాక్యంబు వలవ దెఫ్డైన నాడ, వినియు నొనరించునది విష్ణువినుతి నరుఁడు.
| 91
|
తే. |
ఒక్కవనితగర్భంబు వేఱొక్కవనిత, గర్భమునయందుఁ బెట్టు నొక్కరుఁడు పూచి
పట్టి యాడంగ వచ్చినయట్టిపలుకు, వీడువడఁ జేయుఁ బరివర్తి విను మునీంద్ర!
| 92
|
వ. |
ఇట్లు గర్భపాతవాక్యస్ఖలనంబులు నిరూపించి సితసర్షపధారణంబున రక్షోఘ్న
మంత్రజపంబులను రక్ష యొనరించునది.
| 93
|
క. |
అంగయుజుండు మనుష్యుల, యంగము లదరంగఁ జేసి యశుభము శుభము
న్సంగతముఁ జేయుఁ గుశలఁ ద, దంగము మర్దనము సేయ నశుభం బడఁగున్.
| 94
|
తే. |
శకుని యనువాఁడు మృగపక్షిసమితిఁ బొంది, తద్దతిస్వరచేష్టాప్రదర్శనముల
శుభము నశుభము సూచించు శుభముగాని, శకునమునఁ గార్యమునకును జనును మగుడ.
| 95
|
వ. |
గండప్రాంతరతి యనువాఁడు నరులగండప్రాంతముల ముహూర్తార్థంబు వసి
యించి ప్రారంభంబులు వారించుచుండు వాని నెఱింగి బ్రాహ్మణవచనంబున దేవతా
స్తోత్రంబును గ్రహనక్షత్రపూజనలను గోమూత్రసర్షపస్నానంబునను శాంతి
యొనరించునది.
| 96
|
క. |
లలనాగర్భంబులఁ గల, కలలంబులు మ్రింగుచుండు గర్భహుఁ డనువాఁ
డలయక ప్రశస్తమంత్ర, మ్ములు వ్రాసి ధరింప శాంతిఁ బొందును వాఁడున్.
| 97
|
తే. |
సస్యహుం డనువాఁడు సస్యములయేపుఁ, జెఱుచు వానికి రక్షగాఁ జేనిచుట్టుఁ
జెప్పుటట్టలు గట్టి విశిష్టబలి యొ, సఁగి యొనర్పగ వలెఁ జుమ్ము చంద్రవినుతి.
| 98
|
క. |
విను పరధనపరదారల, నొనర నియోగించునది నియోజిక దానిం
గనుఁగొనుమనుజుం డిదియే, ననుఁ బ్రేరేచునది యని మనమున నచలుఁడై.
| 99
|
ఆ. |
దానిమర్మ మెఱిఁగి తాను గామక్రోధ, లోభమోహములకు లోను గాక
యేను దీనివశతఁ బో నని ధృతి హరి, స్తోత్రజపము సేయఁ దోఁప దదియు.
| 100
|
తే. |
సతికి మగనికిఁ దండ్రికి సుతులకును సు, హృజ్జనులకు విరోధిని యెపుడు వైర
ముల నొనర్చును దానికిఁ బూజ యొసఁగి, వాదహాసాతిరేకము ల్వలయు మాన.
| 101
|
సీ. |
కలన ధాన్యములు గోవులపొదుఁగులఁ బాలు పాలవలన నెయ్యి ప్రత్తి నూలు
ఘనకుసుంభమునఁ దొగరు బానసమున నన్నము తిలలందుఁ దైలము హరించు
నతిసూక్ష్మరూపిణి యై స్వయంహారిక తత్ప్రతీకారంబు తనగృహమునఁ
బైద్వారమున నొక్కభామినిరూపంబు వ్రాసి దానికి బలు ల్వరుస నిచ్చి
|
|
ఆ. |
హోమములును దేవయోగ్యధూపంబులు, వేసి నరుఁడు శాంతిఁ జేసి పాల
కడవ మొదలుగాఁగఁ గలుగునన్నిటికి విభూతిరక్ష యిడఁగఁ బోలు ననఘ!
| 102
|
ఉ. |
భ్రామణి త్రిప్పు మానవులఁ బన్నుగ నొక్కెడ నుండ నీక యు
ద్దామత సూక్ష్మబుద్ధి గని తజ్జ్ఞు లొగిన్ శయనాసనంబులన్
ధామమునందు సర్షపవితానము గాపుగఁ జల్లి మమ్ము నో
భ్రామణి! ప్రోవుమింక నని పల్క పఠింతుగు భూమిసూక్తముల్.
| 103
|
చ. |
అతివఋతూద్గమంబు ఋతుహారిక దా హరియింప దేవతా
యతనసుతీరచైత్యసరిదద్రితటంబులయందు మంత్రసం
యుతసలిలాభిషేకమును నుత్తమభేషజసేవనంబు న
య్యతివ నొనర్పఁ బంపునది యార్యజనంబులు తత్ప్రశాంతికిన్.
| 104
|
ఆ. |
తలఁపు నరున కడఁచుఁ దాస్మృతిహారిక, యది వివిక్త మైనయట్టిచో వ
సింపఁ దొలఁగిపోవు దంపతివ్రజబీజ, హరణనిపుణ బీజహారిక యగు.
| 105
|
వ. |
అదియును మేథ్యాన్నభోజనస్నానంబుల శాంతిఁ బొందు.
| 106
|
క. |
ద్వేషిణి పురుషుల జనవి, ద్వేషులఁ గావించు సఘృతతిలలు మధువు త
ద్ద్వేష మడఁగ వేల్చునది సు, భాషిణి యగుమిత్రవింద భక్తిఁ దలఁచుచున్.
| 107
|
వ. |
అని చెప్పి మార్కండేయుండు వెండియు నిట్లను దుస్సహునికొడుకులకును గూఁతు
లకును ముప్పదితొమ్మండ్రు బిడ్డలు పుట్టిరి వారిం జెప్పెద వినుము దంతాకృష్టికి
విజల్ప కలహ యనుఁకూతులు ను క్తికిఁ గాలజిహ్వుఁడును బరివర్తికి విరూపుండును
వికృతుండును నంగయుక్కునకుఁ బిశునుండును శకునికి శ్యేనకాకకపోతగృద్ధ్రో
లూకంబులును గండప్రాంతరతికిఁ గాలాభిధాను లార్వురు పుత్త్రులును గర్భ
హునకు విఘ్నుండును మేహన యనుకన్యయును సస్యహునికి క్షుద్రకుఁడును
జన్మించిరి మఱియు నియోజికకుఁ బ్రచోదిక లనుకూఁతులు నలువురును విరోధి
నికిఁ జోదకుఁడు గ్రాహకుఁడు తమఃప్రచ్ఛాదకుఁడు స్వయంహారికకు సర్వహారియు
నర్థహారియు వీర్యహారియు భ్రామిణికిఁ గాకజంఘుండును ఋతుహారికకుఁ గుచ
హారిణియు వ్యంజనహారికయు జాతహరిణియు ననుమువ్వురు కూఁతులును స్మృతి
హారికకుఁ బ్రచండుండును బీజహారికకు వాతరూపయు నరూపయు ననుకన్యలిద్ద
ఱును విద్వేషిణికి నపకర్ష ప్రకాశకులును బుట్టిరి పాపస్వభావం బైనయీసంతా
నంబుచేత జగంబంతయు వ్యాప్తంబై యుండు నిది తామససర్గం బనంబడు నింక
రుద్రసర్గంబు చెప్పెద వినుము.
| 108
|
రుద్రసర్గము
సీ. |
అజుఁడు కల్పాదియం దాత్మసన్నిభు నొక, యాత్మజుఁ బడయంగ నాత్మఁ దలఁచు
చుండ నద్దేవునియుత్సంగమున నొక్కనీలలోహితుఁ డగుబాలుఁ డుదయ
మై రోదనము సేయు నతని నేమిటి కేడ్చె దనుఁడు బ్రహ్మకు నిట్టు లనియె నతఁడు
నా కొక్కపే రిమ్ము నావుడు నవ్వేధ రోదనం బుడుగుము రుద్రుఁ డనగ
|
|
తే. |
వెలయు మనిన నారుద్రుఁడు వెగచి వెగచి, యేడుమాఱులు మఱియును నేడ్చుటయును
నెఱిఁగి యతనికిఁ జతురాస్యుఁ డిచ్చెఁ బ్రీతి, నేడునామములు దగ మునీంద్ర! వినుము.
| 109
|
వ. |
భవుండు శర్వుం డీశానుండు పశుపతి భీముం డుగ్రుండు మహాదేవుండు ననఁగ
నిట్లిచ్చిననామంబులఁ బరగి రుద్రుండు సూర్యాంబుమహీవహ్నివాయుగగనదీక్షిత
సోములన నెనిమిది మూర్తు లయ్యె నాసూర్యాదులకు సువర్చలయు నుమయు
వికేశియు స్వధయు స్వాహయు దిశలును దీక్షయు రోహిణియు వరుసను భార్యలై
రాభార్యలవలన శనైశ్చరుండును శుక్రుండును లోహితాంగుండును మనోజ
వుండును స్కందుండును స్వర్గుండును సంతోషుండును బుధుండును ననుపుత్త్రులు
పుట్టి రంత.
| 110
|
ఉ. |
దక్షునినందన న్సతి ముదంబున రుద్రుఁడు పెండ్లి యయ్యె నా
దక్షునిమీఁదికోపమునఁ దత్సతి దేహము నీఱు చేసి తా
నక్షయపుణ్య మేనకకు నాహిమవంతునకు న్జనించె నా
దక్షమఘారి యగ్గిరిసుత న్వరియించెఁ గరంబు నెమ్మితోన్.
| 111
|
క. |
ఆనగజతోడఁ బుట్టిన, మైనాకుఁ డనంతరత్నమహిమాన్వితుఁ డం
బోనిధి కిష్టసఖుం డై, తా నంద వసించి యుండెఁ దద్దయు నెమ్మిన్.
| 112
|
భృగ్వాదిసంతతి
క. |
ఖ్యాతికి భృగునకుఁ బుట్టిరి, ధాతయును విధాతయును నుదాత్తగుణగణో
పేత యగులక్ష్మియును న, న్నాతికి నారాయణుండు నాథుం డయ్యెన్.
| 113
|
క. |
మేరువు కన్యలఁ బెండిలి, యై రాయతినియతులను లతాంగుల నొగిఁ బెం
పారఁగ ధాత విధాత యు, దారుఁడు ప్రాణుండు పుట్టె ధాతకు నంతన్.
| 114
|
వ. |
విధాతకు మృకండుఁడు పుట్టె మృకండునకు మనస్వినికి నేను జన్మించితి నాకు
ధూమ్రావతికి వేదశిరుండు పుట్టె ధాతృపుత్త్రుం డగు ప్రాణునికి ద్యుతిమంతుండు
ప్రభవించె ద్యుతిమంతునకు నజరుం డావిర్భవించె నిట్లు భృగునికి సంతానంబు
బహుళం బయ్యె.
| 115
|
క. |
విను సంభూతిమరీచుల, కొనరంగాఁ బౌర్ణమాసుఁ డుదయించె నతం
డును విరజుండునుఁ బర్వతుఁ, డనుతనయులఁ బడసె మునిజనాగ్రేసరులన్.
| 116
|
వ. |
స్మృతికి నంగిరసునకు బృహస్పతిప్రముఖులైనపుత్త్రులు సినీవాలీకుహూరాకాసు
మతు లనుకూఁతులు పుట్టి రనసూయకు నత్రికి సోముండు దత్తాత్రేయుండు దుర్వా
సుండును నుద్భవించిరి ప్రీతికిం బులస్త్యునకు దంతోని యనువాడు జన్మించఁ బుల
హునికి క్షమకుఁ గర్దముండును వరీయసుండును సహిష్ణుండును బ్రభవించిరి
క్రతువునకు సంతతికి వాలఖిల్యాభిధాను లైనమును లఱువదివేవు రుదయించిరి
వసిష్ఠునకు నూర్జకు రజుండును గాత్రుండును నూర్ధ్వబాహుండును సవనుండును
ననఘుండును సుతపుండును శుక్రుండును ననుమును లావిర్భవించిరి.
| 117
|
తే. |
అజునియగ్రనందనుఁ డగునగ్నిదేవు, వలనఁ దద్భార్య యైనయాస్వాహ గనియె
సుతులఁ బావకపవమానశుచుల ముగుర, నధికతేజుల నఖిలలోకాభినుతుల.
| 118
|
క. |
ఘను లగునమ్మువ్వురకును, విను నలువదియేగు రుద్భవించిరి సుతు లా
తనయులు దండ్రులు దాతయు, నొనరఁగ నేఁబండ్రువహ్ను లొకఁడు కొఱతగాన్.
| 119
|
వ. |
ప్రజాపతిచేత సృజియింపఁబడినయగ్నిష్వాత్తాదిపితరులవలనఁ దత్పత్ని యైనస్వధా
దేవి మేన వైధారిణియు ననుకూఁతులం బడసె వారు బ్రహ్మవాదినులై చని రిది
రుద్రసర్గప్రకారం బని చెప్పిన విని మార్కండేయునకుం గ్రోష్టుకి యిట్లనియె.
| 120
|
మనుద్వీపవర్షాధిపతులవివరణము
క. |
స్వాయంభువమనుజన్మము, ధీయుత యెఱిగించి తీ వతివ్యక్తముగా
నాయనకాలంబున సుర, నాయకుఁడును సురలు మునులు నరపాలకులున్.
| 121
|
తే. |
ఎవ్వ రెవ్వ రెఱింగింపవే మహాత్మ!, చెవులు చిడిముడి పడియెడుఁ దివిరి వినఁగ
ననిన భృగువంశవర్ధనుండైన యమ్ము, నీశ్వరుండును గ్రోష్టుకి నిట్టు లనియె.
| 122
|
వ. |
స్వాయంభువుండును స్వారోచిషుండును నుత్తముండును దామసుండును రైవ
తుండును జాక్షుషుండును నన నింతకుము న్నార్వురు మనువు లరిగి రిప్పు డేడవ
మను వైనవైవస్వతునికాలంబు వర్తించుచున్నది యింక సావర్ణు లనువా రేవురును
రౌచ్యుండు భౌత్యుండు నన నేడ్వురు మనువులు గానున్నవారు వినుము తొల్లి
ప్రథమత్రేతాయుగంబున స్వాయంభువమనువుపుత్త్రుం డైనప్రియవ్రతునకుఁ గర్దమ
ప్రజాపతిపుత్రియైనవీర యనుదానికి సమ్రాట్టును గుక్షియు ననుకూఁతు లిద్దఱును
నాగ్నీధ్రుండు మేధాతిథియు వపుష్మంతుండును జ్యోతిష్మంతుండును ద్యుతి
మంతుండును భవ్యుండును సవనుండు ననుకొడుకులు పుట్టినం బ్రియవ్రతుం
డానందనులయందుఁ గ్రమంబున జంబూద్వీపంబునకు నాగ్నీధ్రుండును బ్లక్ష
ద్వీపంబునకు మేధాతిథియును శాల్మలీద్వీపంబునకు వపుష్మంతుండును గుశ
ద్వీపంబునకు జ్యోతిష్మంతుండును గ్రౌంచద్వీపంబునకు ద్యుతిమంతుండును
శాకద్వీపంబునకు భవ్యుండును బుష్కరద్వీపంబునకు సవనుండును నధిపతులుగఁ
గావించె నంత.
| 123
|
సీ. |
వినుము మహావీర్యుఁడును ధాతకియు నను పుత్త్రులఁ బడసి తాఁ బుష్కరంబు
వారిపేళ్ళను రెండు వర్షము ల్గావించి యిచ్చి నాసవనుఁ డయ్యిరువురకును
నిరుపముఁ డగుభవ్యునికి జలదకుమార సుకుమారులును మణీచకుఁడు మఱియుఁ
దగుకుశోత్తరుఁడు మేధావియును మహాద్రుముండు పుట్టుటయు నతండు వారి
|
|
తే. |
కేడువురకు శాకద్వీప మేడువర్ష, ములుగ నొనరించి యొసఁగిన వెలసె నవియు
వారిపేళ్లను బహువిధవస్తుబహుల, ములును విపులభోగాస్పదములును నగుచు.
| 124
|
వ. |
ద్యుతిమంతుండు శలుఁడు మనోనుగుం డుష్ణుండు ప్రధానుం డర్థకారకుండు ముని
దుందుభి యనుసుతులకుఁ గ్రౌంచద్వీప మేడువర్షములుగ నేర్పరించె నవి తదీయ
నామాంకితంబులై పరఁగె జ్యోతిష్మంతుండును గుశద్వీపంబు సప్తవర్షంబులు చేసి
యుర్భిదుఁడు వైణవుఁడు సురథుఁడు లంబనుఁడు ధృతి ప్రభాకరుఁడు కవలుఁడు
ననుపుత్త్రసప్తకంబున కొసంగిన నవ్వర్షంబులు తదీయనామంబుల నతిశయిల్లె వపు
ష్మంతుఁడు, శాల్మలిద్వీపంబును శ్వేతుండు హరితుఁడు జీమూతుఁడు రోహితుఁడు
వైద్యుతుఁడు మానసుఁడు మహీధుఁడు ననుపుత్రులకు నేడుభాగములుగా విభా
గించి యిచ్చె నవ్వర్షంబులు తదభిధానఖ్యాతంబు లయ్యె మఱియును.
| 125
|
క. |
వినుతప్లక్షద్వీపం, బును మేధాతిథి యొనర్చెఁ బుత్త్రులపేళ్ళం
దనరంగ సప్తవర్షము, లనుపమగుణ! వినుము తెలియ నవ్వర్షంబుల్.
| 126
|
వ. |
శాంతభయంబును శిశిరంబును సుఖోదయంబును నానందంబును శివంబును క్షేమ
కంబును ధ్రువంబును ననం బరగెఁ బ్లక్షద్వీపంబుతుద శాకద్వీపంబు మొదలుగాఁగల
యేను జీవులును సర్వవర్ణాశ్రమాచారధర్మంబులు గలిగి యుండు జంబూద్వీపాధి
పతియైనయాగ్నీధ్రునికి నాభియుఁ గింపురుషుఁడు వారివర్షుం డిలావృతుండు
రమ్యుండు హిరణ్యుండు కురుండు భద్రాశ్వుండు కేతుమాలుండు ననం దొమ్మండ్రు
పుత్త్రు లుదయించి రందుఁ గింపురుషుఁ డాదిగా నెనమండ్ర హిమవదుత్తరభాగ
వర్షంబుల కధిపతులం గావించిన నవి వారిపేళ్ళం బ్రసిద్ధంబు లయ్యె నవ్వర్షంబు
లందు.
| 127
|
తే. |
జరయుఁ దెవులును వగయును బొరయ వనఘ!, సుఖము లెప్పుడుఁ జుబ్బనచూఱ లెల్ల
వారు సములె చతుర్యుగావస్థ చెంద, దందుఁ బుణ్యపాపములు లే వమితపుణ్య!
| 128
|
తే. |
హిమనగేంద్రదక్షిణవర్ష మేలునాభి, యాత్మనందను ఋషభుని నధిపుఁ జేసి
యరిగెఁ గానకు నతఁడు నిజాత్మజన్ముఁ, డైనభరతుఁ బట్టము గట్టి యడవి కరిగె.
| 129
|
వ. |
ఆభరతునిపేర నివ్వర్షంబు భారతవర్షం బనం బొగడొందె భరతుండును నిజనంద
నుం డగుసుమతి నధిపతిం గావించి తపంబునకుఁ జనియె నివ్విధంబున స్వాయంభువ
మన్వంతరంబునం బ్రియవ్రతునిపుత్త్రులుం బౌత్త్రులును సప్తద్వీపంబులును బాలించి
రని చెప్పిన మార్కండేయునకుఁ గ్రోష్టుకి యి ట్లనియె.
| 130
|
జంబూద్వీపవర్ణనము
తే. |
ఎన్ని దీవులు జలనిధు లెన్ని నగము, లెన్ని వర్షంబు లెన్ని యిం దేఱు లెన్ని
యిలకుఁ జక్రవాళాద్రికిఁ గొలఁది యెంత, యినసుధాకరగతు లివి యెట్లు చెల్లు?
| 131
|
ఆ. |
విస్తరింపు నాకు విన వేడ్క యయ్యెడు, ననిన భార్గవుండు విను మునీంద్ర!
మున్ను నీకుఁ జెప్పినన్నియ దీవులు, గాని వేఱ లేవు మాననీయ!
| 132
|
వ. |
పృథివి పంచాశత్కోటియోజనవిస్తార యై యుండు నందు.
| 133
|
తే. |
వినుము లక్షయోజనముల విస్తృతులఁ బ్ర, దీప్త మై యొప్పు నేరేడుదీవిఁ దొట్టి
యొక్కటొకటికి రెట్టియై యుండుఁ బ్లక్ష, మాదిగాఁ గలయద్దీపు లాఱు ననఘ!
| 134
|
క. |
వితతలవణేక్షుమదిరా, ఘృతదధిదుగ్ధాంబుమూర్తికీర్త్యము లై యీ
క్షితి నోలిఁ గలుగు జలనిధు, లతివిమలత నొకటి కొకటి యవి యినుమడి యై.
| 135
|
వ. |
లవణజలనిధివలయవలయితం బగు జంబూద్వీపంబు వినుము.
| 136
|
సీ. |
హిమవంతమును నట హేమకూటంబును నిషధంబు మేరువు నీలగిరియు
శ్వేతాచలంబును శృంగవంతంబును నవి వర్షశైలంబు లయ్యె నడిమి
నిషధనీలంబులనిడుపు లొక్కొకలక్ష యవల రెండును మఱి యివల రెండు
నోలిన పదియేసివేలయోజనములు తక్కువ యై యుండు నొక్క టొకటి
|
|
తే. |
విను మహాత్మ రెండువేలయోజనముల, పొడవు పఱపు గల్గి పూర్వపశ్చి
మాంబునిధులఁ గలసి యయ్యిరుమూడుకొం, డలును రత్నరుచుల వెలుఁగుచుండు.
| 137
|
వ. |
ఇప్పర్వతత్రితయంబులమధ్యంబునం జంద్రార్ధాకారం బై యిలావృతవర్షంబు
శోభిల్లుఁ దానితూర్పున భద్రాశ్వవర్షంబును బశ్చిమంబునం గేతుమాలవర్షంబును
నతిశయిల్లు దానిదక్షిణంబున హరివర్ష కింపురుషవర్ష భారతవర్షంబులు
నుత్తరంబున రమ్యకహిరణ్యకవర్షంబులు పొలుచు నయ్యిలావృతవర్షంబునడుమ
నెనుబదినాలుగువేలుయోజనంబులతనర్పును ముప్పదిరెండువేలయోజనంబులు
విూఁదివిస్తారంబును బదాఱువేలయోజనంబులపాతుఁను నంతియ క్రిందివెడల్పు
నుం గలిగి శరావంబుచందంబున సుందరం బై హేమనగంబు దేజరిల్లుచుండు.
| 138
|
క. |
అక్కనకశిఖరి యెనిమిది, దిక్కుల నింద్రాదినిఖిలదిక్పతిపురము
ల్మిక్కిలి యగువిభవంబుల, నక్కజ మయి వెలుఁగుచుండు ననుపమచరితా!
| 139
|
వ. |
చతుర్దశయోజనోత్సేధం బైనయమ్మేరుమధ్యంబున బ్రహ్మపురము శోభిల్లుచుండు.
| 140
|
క. |
సితపీతాసితరక్త, ద్యుతు లమరఁగఁ గనకశిఖరితూర్పు మొదలుగాఁ
జతురాశల ధరణీదై, నతవిట్ఛూద్రావనీశవర్ణాఖ్యలతోన్.
| 141
|
తే. |
ఆయుతయోజనోత్సధంబులై సురాద్రి, నాల్గుదిక్కుల విష్కంభనగము లొప్పు
మందరంబును నొగి గంధమాదనంబు, విపులమును సుపార్శ్వంబును విమలపుణ్య.
| 142
|
క. |
విను మేకాదశశతయో, జనదీర్ఘము లేతదీయశైలాగ్రములం
దనరుచుఁ బడగలక్రియఁ గడ, పనగము నేరేడు రావి వటమును వెలయున్.
| 143
|
ఉ. |
ఆరమణీయజంబువునయం దనిశంబును భూరిసింధుర
స్ఫారఫలంబు లన్నగము పైఁ బడి వయ్యఁగఁ దద్రసంబు సొం
పార మహాప్రవాహనది యై దివిజాద్రి ప్రదక్షిణించి య
న్నేరెడుమ్రానిమూలమున నెక్కొని యుండు జగత్ప్రశస్తమై.
| 144
|
క. |
జంబూనదీజలస్ప, ర్శంబున సంజనిత మగుట జాంబూనదనా
మంబు ప్రసిద్ధముగ సువ, ర్ణంబునకుం గలిగె మునిజనస్తవనీయా!
| 145
|
వ. |
దక్షిణోత్తరంబులు నిడుపులై నిషధనీలనగంబులఁ గదిసి మేరువుతూర్పున జఠరదేవ
కూటంబులును బశ్చిమంబున నిషధపారియాత్రకంబులుం బొలుచు నిషధనీలాచలంబు
లంతియ నిడుపు గలిగి పూర్వాపరాంబునిధులు చొచ్చి యక్కనకగిరిదక్షిణంబునం
గైలాసహిమవంతంబులు నుత్తరంబున శృంగవంతంబును జారుధియు ననుపర్వతం
బులు నతిశయిల్లు నియ్యెనిమిదియు మర్యాదావనీధరంబు లని బుధులు సెప్పుదురు
మఱియు హిమాలయ హేమకూటంబు లాదిగాఁ గలవర్షశై లంబులనడిమిదక్షిణో
త్తరవిస్తారంబులు తొమ్మిదేసివేలయోజనంబులు నిలావృతవర్షవిస్తారంబు చతుర్దశ
సహస్రయోజనంబులు నై యుండు.
| 146
|
క. |
నారాయణుండు కూర్మము, నారయ మత్స్యంబు కిటియు నశ్వశిరుఁడు నై
ధారుణీచెఱఁగుల నుండును, భారతకురుకేతుమాలభద్రాశ్వములన్.
| 147
|
తే. |
అనఘ! యీనాల్గువర్షములందు నొగిని, వినుము నక్షత్రవిన్యాసమునను సకల
విషయములును నేర్పడియుండు వివిధభంగి, గ్రహము లొనరించుజాడలు గ్రందుకొనగ.
| 148
|
మేరువుచతుర్దిశల నుండుపర్వతాదులు
వ. |
అని చెప్పి మేరువు చతుర్దిశలం జెలువొందుమందరాదిమహీధరంబులయందుం గల
వనంబులు గొలంకులుఁ జెప్పెద నాకర్ణింపుము.
| 149
|
తే. |
ప్రథమదిక్ఛైలమునఁ జైత్రరథము దక్షి, ణాలయంబున నందన మపరభూధ
రమున వైభ్రాజ మొగి నుత్తరంపుఁగొండ, యందు సావిత్ర మనువన మతిశయిల్లు.
| 150
|
క. |
అరుణోదమానసములు, నరయఁగ శీతోదమును మహాభద్రము న
న్సరసీరుహాకరములు మం, దరముఖచతురద్రిసానుతటముల నమరున్.
| 151
|
వ. |
మఱియు మేరుమహీధరంబుతూర్పున శీతాంతము సుకుంజము కంకవంతంబు మణి
శైలంబు సుమేషంబు ననునివి మొదలుగాఁ గలనగంబులు దక్షిణంబునం ద్రికూట
రుచకపతంగప్రభృతిపర్వతంబులు పశ్చిమంబున సువర్షశిశిరవైడూర్యప్రముఖశిలో
చ్చయంబులు నుత్తరంబున శంఖకూటఋషభహంసనాభాదిమహీధరంబులును
శోభిల్లుచుండు.
| 152
|
చ. |
అనుపమరత్నదీప్తినివహస్ఫురితోన్నతశృంగదీప్తుల
న్వనరుహకైరవోత్పలనివాసమనోజ్ఞసరోవరంబుల
|
|
|
న్వనతరువల్లరీకుసుమవైభవసంపదసొంపున న్గడు
న్దనరుచు నుండు సంతతము తద్గిరులందు రమింతు రుత్తముల్.
| 153
|
చ. |
హిమకుధరోత్తరస్థితమహీధరమధ్యమునందుఁ బొల్చు దే
శము లభిరమ్యము ల్దివిజసాధ్యవియచ్చరసిద్ధకిన్నరా
శ్రమములు సర్వకాలబహుసౌఖ్యకరంబులు క్షుత్తృషామయ
శ్రమరహితము లుల్లసితసౌరభసంగిసమీరహృద్యముల్.
| 154
|
క. |
స్వర్ణభువనముకంటె ని, రర్గళసుగుణముల కాశ్రయము లై భౌమ
స్వర్గము నంగ నొప్పు ని, సర్గసుఖములను దదీయశైలాంతరముల్.
| 155
|
తే. |
అందు లేకుండుఁ బుణ్యపాపార్జనములు, పుణ్యఫలభోగులై మండ్రు పురుషు లెల్ల
భారతాదిచతుర్దిశాపత్రమేరు, కర్ణికాస్థితి నిట్లు భూకమల మమరు.
| 156
|
చ. |
హిమగిరిదక్షిణంబున మునీశ్వర! పొల్పగు భారతాఖ్యవ
ర్షము విను కర్మభూమి యది సంతతము న్బహుపుణ్యపాపక
ర్మము లొనరించి యర్ధివిజమానవనారకతిర్యగాదిజ
న్మములను నాకమోక్షములు మానుగఁ బొందుదు రందు నన్నరుల్.
| 157
|
వ. |
అని వెండియు మార్కండేయుండు.
| 158
|
గంగావతరణము
సీ. |
మునిజనవల్లభ! వినుము ధ్రువాధార మైనవిష్ణుపదంబునందుఁ బుట్టి
గంగ నాఁగఁ ద్రిపథగామిని యైనయద్దేవి ము న్నమృతాంశుదివ్యతనువు
నం దొంది కడువృద్ధిఁ బొంది పవిత్రయై వచ్చి మేరుపర్వతముమీఁదఁ
బడి నాల్గుతెఱఁగులై పరగి యగ్గిరితూర్పునందు సుందర మగుమందరమున
|
|
తే. |
కొగి నరిగి సీత యను పేర నెగడి చైత్ర, రథవనము నరుణోదసరస్సుఁ జొచ్చి
యన్యనగములపైఁ బడి యవని కరిగి, జలధిఁ గూడె భద్రాశ్వవర్షంబునందు.
| 159
|
ఆ. |
అలకనంద నాఁగ నాగంగ గంధమా, దనముమీఁది కేఁగి దానిమీఁది
వనము గొలను దఱిసి వడిఁ ద్రిశిఖరిగిరి, మీఁది కేఁగి గిరులమీఁదుగాఁగ.
| 161
|
క. |
హిమగిరిమీఁదం జనునెడ, హిమగిరితనయేశుఁ డైనయీశానుం డిం
దుమణిమయమకుటరుచిరో, త్తమాంగమున గంగఁ దాల్చెఁ దాల్చి ముదమునన్.
| 162
|
వ. |
భగీరథతపస్సమారాధనప్రసన్నుండై భవానీవిభుండు హేమవంతంబుమీఁద
నాగంగ విడిచిన నది యేడుప్రవాహంబు లయ్యె నందు మూఁడుప్రవాహంబులు
పూర్వముఖంబులు మూఁడుప్రవాహంబులు పశ్చిమముఖంబులు నై చని యుదధిం
కలసి నేకప్రవాహరూపంబున భగీరథురథంబు ననుగమించి దక్షిణముఖంబై చని.
| 163
|
క. |
జలచరలోచన ఫేనో, జ్జ్వలహాస మరాళయాన చక్రస్తనమం
డల వీచీభ్రూవిభ్రమ, పులినజఘన గంగ వనధిఁ బొలుపుగఁ గూడెన్.
| 164
|
చ. |
కనకగిరీంద్రపశ్చిమముఖంబున నవ్విపులాద్రిమీఁదికి
న్జని వెస నమ్మహానది సుచక్షువు నా విలసిల్లి తద్వనం
బును గొలను న్వడిం దఱిసి పోయి నగంబు లతిక్రమించి త
ద్వననిధిఁ గేతుమాల మనువర్షమునం దొగిఁ గూడి రూఢిగన్.
| 165
|
చ. |
పరగి సురాచలోత్తరసుపార్శ్వనగంబున కేఁగి తత్సరో
వరము వనంబు సొచ్చి జనవందితయై యట శంఖకూటభూ
ధరముఖభూరిభూధరకదంబపదంబున డిగ్గి గంగ యు
త్తరకురుభూముల న్జలధిఁ దాఁ గలసె న్విను భద్రసోమ నాన్.
| 166
|
తే. |
అనఘ కింపురుషాదివర్షాష్టకమున, నెంతయును నొప్పుఁ గులగిరు లేడు నేసె
నిర్మలోదకబహునదీనివహ మమరు, వ్యాధు లాధులు పాపము లందు లేవు.
| 167
|
వ. |
అనిన విని క్రోష్టుకి యి ట్లనియె.
| 168
|
భారతవర్షవిషయము
క. |
యతివర! జంబూద్వీప, స్థితి యంతయు నేర్పడంగఁ జెప్పతి దగ భా
రతవర్షం బెట్టిది? సన్మతి దాని నెఱుంగఁ జెప్పు మానుగ నాకున్.
| 169
|
తే. |
పరమ మీభారతాహ్వయవర్షమునకుఁ, గలవు సెప్పెద నవభేదములు మునీంద్ర!
సాగరాంతరితంబులై జనుల కరుగ, రాని నెనిమిదిదీవులు వాని వినుము.
| 171
|
వ. |
ఇంద్రద్వీపంబును గేతుమంతంబును దామ్రవర్ణంబును గభస్తిమంతంబును నాగ
ద్వీపంబును సౌమ్యంబును గాంధర్వంబును వారుణంబును నన దక్షిణోత్తరం
బుల వేయేసి యోజనమ్ముల నిడుపై యుండు నందుఁ దూర్పుదీవులు కిరాతబహు
ళమ్ములు పడమటిదీవులు యవనసమన్వితములై యతిశయిల్లుచుండు బ్రాహ్మణ
క్షత్రియవైశ్యశూద్రసమృద్ధంబును సాగరపరివృతంబును బుణ్యపాపార్జనస్థానం
బును నై యనఘంబైన యీభారతవర్షంబునందు.
| 172
|
క. |
వినుము మహేంద్రము మలయ, మ్మును సహ్యము శుక్తిమంతమును ఋక్షనగ
మ్మును వింధ్యపారియాత్రము, లును నన నేడు మిగులం బొలుచును గులగిరుల్.
| 173
|
సీ. |
లలితంబు లైనకోలాహలమందర వైభ్రాజదర్దురవైద్యుతములు
శాంతంబు లైనతుంగప్రస్థమైనాకసురసపాండురపుష్పగిరులుఁ గరము
పొలు పైనరైవతార్బుదఋశ్యమూకగోధనకూటశైలంబులును సమున్న
తము లైనయాజయంతంబు గోమంతంబు భాసురం బైనశ్రీపర్వతంబు
|
|
తే. |
వినుత మైనచకోరంబు నన మహాద్రు, లమరు మఱియు ననేకంబు లల్పనగము
లమ్మహాచలమ్ములచుట్టు నతిశయిల్లు, జనపదంబు లార్యములు మ్లేచ్ఛములు ననఁగ.
| 175
|
వ. |
ఇంక మహానదులవిధంబు వినుము గంగ సరస్వతి చంద్రభాగ యమున శతద్రువు
శరావతి కుహువు గోమతి బాహుద దృషద్వతి విపాశ దేవిక గండకి కౌశికి యను
నేఱులు హిమవత్పాదంబునం బ్రభవించె వేదస్మృతి వేత్రవతి ధాతుఘ్ని మండల
నీరావతి విదిశ చర్మణ్వతి వేదవతి వేణ్య క్షిప్ర యవంతి యనుసింధువులు పారియా
త్రాచలంబున నుదయించె శోణము మహానదము రుక్మద సురథ క్రియ మందాకిని
దశార్ణ చిత్రకూట చిత్రోత్పల తమస కరతోయ పిశాచిక పిప్పల శ్రోణి విపాశ
వంజల సుమేరుజ ముక్తిమతి ముద్గలి యనుతరంగిణులు ఋక్షవంతంబున నావిర్భ
వించె సువాహిని పయోష్ణి నిర్వింధ్య నిషధావతి వైతరణి సినీవాలి కుముద్వతి
మహాగౌరి దుర్గ యంతశ్శిర యనుమహావాహినులు వింధ్యంబునం బుట్టె గోదావరి
భీమరథి కృష్ణవేణి తుంగభద్ర సుప్రయోగ కావేరి యనునదులు సహ్యపర్వ
తంబున నుద్భవించెఁ గృతమాల తామ్రపర్ణి పుష్పజాతి యుత్పలావతి యను
నీనదులు మలయాచలంబున నుదయించెఁ బితృసోమ ఋషికుల్య యిల లాంగూ
ని వంశకర యనుస్రోతస్వినులు మహేంద్రంబున జనించె ఋషితుల్య కుమారి
మందగ మందవాహిని పలాశిని యనుతటినులు శుక్తిమంతంబుస్ నవతరించె నని
చెప్పి.
| 176
|
క. |
విను గంగ లన సరస్వతు, లనఁగాఁ బెంపొంది యిమ్మహానదు లెల్ల
న్వననిధిఁ గూడి సకలజగ, మునకుం దల్లు లయి పాపములఁ బొలియించున్.
| 177
|
వ. |
మఱియును క్షుద్రనదులు పెక్కు గల వవి వర్షకాలతోయంబులును సర్వకాల
తోయంబులును గల్గియుండు నని వెండియు.
| 178
|
క. |
సురుచిర మగుసహ్యనగో, త్తరమున విలసిల్లుచుండుఁ దద్దయు గోదా
వరి తత్ప్రదేశము మనో, హరము పవిత్రము మునీంద్ర! యఖలధరిత్రిన్.
| 179
|
తే. |
మత్స్య మశ్వంబు కూటంబు మఱియుఁ గుల్య, కుంతలంబులు గాశియుఁ గోసలంబు
నాదిగా మధ్యదేశంబునందుఁ బొలుచు, జనపదంబులు సతతంబు మునివరేణ్య!
| 180
|
వ. |
ఆమధ్యదేశంబునకు నుదీచ్యంబులై భార్గవపురంబును బాహ్లిక వాట ధానాభీర
గాంధార సింధు సౌవీర మద్ర కేకయ కాంభోజ దరద బర్బర చీన శాశ్మీర
హుహుకాదులును బ్రాచ్యంబులై యంతర్గిరి మలద మలవర్జిక ప్రాగ్జ్యోతిష
విదేహతామ్రలిప్రకమల్లమాగధాదులును దాక్షిణాత్యంబులై పాండ్య కేరళ
చోళ కుల్య మహారాష్ట్ర మహిష కళింగ విదర్భ కుంత లాంధ్రాదులును బ్రతీ
చ్యంబులై సూర్యారక పుళింద సారస్వత సౌరాష్ట్రావంతాదిజనపదంబు లభి
రమ్యంబు లగు మఱియు వింధ్యాదిపర్వతాశ్రయంబులయందుఁ గురుషమేల
కోత్తమార్ణ దశార్ణ భోజ కిష్కింధక కోసల నూపుర తుంబుర నైషధ వీరహోత్ర
నీహార త్రిగర్తాదిదేశంబులు సమస్తవస్తుసంపద్భరితంబులై యుండు జలనిధివలయ
|
|
|
వలయితపూర్వదక్షిణాపరం బైన యిట్టిభారతవర్షంబునకు నుత్తరంబున హిమ
వంతంబు కార్ముకంబునకు గొనయంబును బోలె శోభిల్లు.
| 181
|
చ. |
పరమమునీంద్ర! యంతకును భారతవర్షము బీజ మిందయి
న్నరులు శుభక్రియాపరత నాకసుఖానుభవంబు బ్రహ్మతా
మరవిభుతామరత్వములు మానుగఁ గాంతురు వేయు నేల తా
నరయఁగఁ గర్మభూమి యిది యన్యము లన్నియు భోగదేశముల్.
| 182
|
శ్రీకూర్మసంస్థానవర్ణనము
మ. |
అనినం గ్రోష్టుకి సంతసిల్లి మునిముఖ్యా! చెప్పి తీ విట్టు లిం
పొనర న్భారతవర్షభంగి వినఁగా నుల్లంబున న్వేడ్క యిం
కను సంధిల్లెడుఁ జెప్పవే కమఠమై కంజాక్షుఁ డింద్రుండుఁ దా
నని ము న్నానతి యిచ్చి తె ట్లచటఁ దా నద్దేవుఁ డుండు న్దగన్.
| 183
|
వ. |
అని యడిగిన భృగుపాత్రుం డి ట్లనియె.
| 184
|
సీ. |
హరి కూర్మరూపంబు ధరియించి భారతవర్షంబునందు సంవ్యాప్తి నొందెఁ
బ్రాగ్వదనుండు నపరపుచ్ఛుఁడును దక్షిణోత్తరపార్శ్వుండు నొగిని హుతవ
హాశాదివిదిగన్వితాంఘ్రిచతుష్కుండు నై యుండుఁ గృత్తిక యాది గాఁగ
నక్కమఠంబుమధ్యంబున నుండి వక్త్రంబును మొదలుగా దక్షిణముగ
|
|
తే. |
ననఘ తన్నవాంగములయందు మూఁడు, సేసి తారలు నడుమ వసించు నెపుడు
తత్తదంగదేశస్థితతారకముల, ఫలమునుం గ్రహఫలములు వలయు నెఱుఁగ.
| 185
|
క. |
విను నక్షత్రగ్రహవశ, మున దేశంబులకు నశుభమును శుభమును బై
కొనుఁ దత్పీడల విబుధులు, కని శాంతి యొనర్పవలయు గ్రక్కున ననఘా!
| 186
|
తే. |
పుణ్యవంతులగ్రహపీడ పొందఁ జాల, దతనిపశుమిత్రబంధుభార్యాత్మజులకు
భయము పుట్టించు మునివర! భాగ్యహీనుఁ, డైనపాపాత్ము నుడుగక యలఁచుచుండు.
| 187
|
వ. |
కావున నక్షత్రగ్రహపీడ లెఱింగి బుద్ధిపరుండగునరుండు వానికి శాంతి సేయవలయు.
| 188
|
తే. |
అనఘ! నక్షత్రముల నెల్ల నాశ్రయించి, యుండుదురు దేవతలు వారి కొగి విశిష్ట
పూజ లొనరింపఁ బీడలు పొంద వధిక, మైనశుభమును వా రిత్రు మానవులకు.
| 189
|
వ. |
కూర్మమధ్యంబు మొదలుగా నున్నకృత్తికాదిసప్తవింశతినక్షత్రంబులయందుఁ
దొమ్మిదేసిపాదంబుల కొక్కరాశిగా వృషభాదిరాసులు పండ్రెండు నక్కమఠంబు
నవయవంబులం బ్రదక్షిణించియుండు నిట్లు నక్షత్రంబులందు రాసులును రాసుల
యందు గ్రహంబులును వసియించుం గావున గ్రహనక్షత్రపీడలం జేసి దేశపీడ
లౌట నిశ్చయించి స్నానదానజపహోమాదుల శాంతి సేయునది యిది జగత్కా
రణుం డైననారాయణుండు కూర్మరూపంబున నున్నవిధం బని చెప్పి మఱియును.
| 190
|
క. |
నన్నూఱును మున్నూఱును, నిన్నూఱును నూఱు నేఁడు లీవర్షమున
న్సన్నుత నాలుగుయుగముల, కిన్నరులకుఁ గలుగునాయు విధ్ధచరిత్రా!
| 191
|
వ. |
అని భారతవర్షప్రకారంబుఁ జెప్పి మార్కండేయుండు.
| 192
|
భద్రాశ్వవర్షవర్ణనము
సీ. |
భద్రాశ్వవర్షప్రభావంబు వినుము శైవాలనీలశ్వేతవర్ణపర్ణ
శాలాగ్రములు కాలజంబును నన నేను కులశిలోచ్చయములు వెలుఁగుచుండు
క్షుద్రాచలంబులు గొలఁదికి వేయేసి పడసినదేశము ల్బహుసహస్ర
సంఖ్యలఁ బొలుపారు శంభావతియు శీతయును భద్ర యనునదు లొప్పుచుండు
|
|
తే. |
జనులు శంఖహేమసదృశతనుద్యుతి, భాస్వరులును బుణ్యపరులు సములు
సకలసుగుణయుతులు శతసమాయుషులు నై, మండ్రు మునివరేణ్య! మనుజు లెల్ల.
| 193
|
వ. |
అందు జనార్దనుం డశ్వశిరుండును జతుర్భుజుండును నై.
| 194
|
క. |
విలసిల్లు నమ్మహాత్ముని, తల హృదయము లింగ మంఘ్రితలములు హస్త
ములు కన్నులు ననునెలవుల, నెలకొను విను కృత్తికాదినిఖిలర్క్షములున్.
| 195
|
కేతుమాలవర్షవర్ణనము
క. |
విమలము కృష్ణమ్ము విశో, కమును జయంతంబు హరినగము ననఘ! విశా
లము వర్ధమానమును నా, నమరు గిరులు కేతుమాల మనువర్షమునన్.
| 196
|
చ. |
మఱియు ననేకభూధరసమాజములందుఁ గడు న్వెలుంగు న
త్తెఱఁగున నుల్లసిల్లు బహుదేశసహస్రములందు సంపద
న్మెఱయుచునుండుఁ గామిని సుమేధయుఁ జక్షువునాఁగ నేళు లే
ర్తెఱ జను లెల్ల నెప్పుడు తదీయజలంబులు ద్రావి తృప్తులై.
| 197
|
తే. |
బ్రతుకుదురు నూఱులేసియబ్దంబులందు, హరి వరాహరూపంబున నమరు నతని
పాదవదనహృదయపుచ్ఛపార్శ్వములఁ గ్ర, మమునఁ గృత్తికాముఖతారకములు వొలుచు.
| 198
|
కురువర్షవర్ణనము
మ. |
కురువర్షంబు మనోహరంబు సుమనోగుచ్ఛమ్ముల న్సత్ఫలో
త్కరగుచ్ఛంబుల నొప్పి కల్పతరుసంతానంబు లిష్టార్థము
ల్గురియ న్వస్త్రవిభూషణాదు లొగిఁ గైకొంచు న్మనుష్యు ల్సుఖిం
తురు దా రందు సుగంధబంధురమరుత్పుష్టప్రమోదాత్ములై.
| 199
|
క. |
మిథునములై పుట్టి జనులు, మిథోనురాగములఁ జాల మెఱసి బహుమనో
రథసుఖము లనుభవించుచు, రథాంగమిథునములమాడ్కి రమియింతు రొగిన్.
| 200
|
తే. |
అమరలోకపరిచ్యుతు లైనవారు, వచ్చి జన్మింతు రాకురువర్షభూమి
వినుము వారికిఁ బదునాల్గువేలమీఁద, నయిదునూఱులు వర్షము లాయు వనఘ!
| 201
|
సీ. |
సురుచిరశశికాంతసూర్యకాంతాచలమ్ములు రెండు వెల్గు నాభూమి వాని
మధ్యంబునందు నిర్మలజలౌఘిని భద్ర సోమతరంగిణి సొంపు మిగులు
|
|
|
నన్న పర్వతములు నమృతకల్పము లైన ఫలముల విలసిల్లు బహువనములు
క్షీరవాహినులకు ఘృతవాహినీదధి కుల్యలకును నందుఁ గొలఁది లేదు
|
|
ఆ. |
మహితమత్స్యరూపమహనీయుఁ డగువిష్ణు, నవవిధంబు లయినయవయవములఁ
దారకములు జనపదంబులు నెప్పటి, యట్ల పొలుచు మునివరాగ్రగణ్య!
| 202
|
కింపురుషవర్షవర్ణనము
వ. |
కింపురుషవర్షంబున బురుషులు
పండితులు దశసహస్రవర్షంబు లాయువు గల్గి
రుజాశోకభయంబులం బొరయక మనోహరప్లక్షరసాహారంబునం దృప్తులగుచుందు
రందు.
| 203
|
క. |
లలనలు శోభిల్లుదు రు, త్పలగంధులు దళితకమలదళనయనలు న
స్ఖలితనవయౌవనులు ను, జ్జ్వలమృదులాంగులును బూర్ణచంద్రముఖులు నై.
| 204
|
హరివర్షవర్ణనము
మ. |
హరివర్షంబు సుఖాస్పదం బయుతవర్షాయుష్కు లామర్త్యు లి
క్షురసాస్వాదనతృప్తు లామయజరాశోకవ్యపేతాత్మకు
ల్వరజంబూనదరుగ్విడంబితతనూవర్ణు ల్మనోజాకృతు
ల్సురలోకచ్యుతు లందుఁ బుట్టుదురు సంశుద్ధస్వభావాత్మకుల్.
| 205
|
ఇలావృతవర్షవర్ణనము
చ. |
అలఘుసుమేరుదీపిత మిలావృతవర్షము చంద్రసూర్యదీ
ప్తులు గ్రహతారకద్యుతులు దోడు వొకప్పుడు నందు సుందరో
జ్జ్వలకమలప్రభాంగులును వారిరుహాయతపత్రనేత్రులు
న్జలరుహగంధులు న్విపులసౌఖ్యసమేతులు సూవె తజ్జనుల్.
| 206
|
క. |
జంబూఫలరస మాహా, రంబుగ నజ్జనము లెలమి బ్రదుకుదు రనురా
గంబు మనంబులఁ గరము భృ, శంబుగఁ బదుమూఁడువేలు సంవత్సరముల్.
| 207
|
రమ్యకవర్షవర్ణనము
ఉ. |
రమ్యకవర్ష మెంతయును రమ్యము తజ్జను లెన్నఁడు న్జరా
గమ్యులు గారు నిర్మలులు గామసుఖప్రియు లుజ్జ్వలాకృతు
ల్సౌమ్యు లనేకపాదఫలసంస్కృతసారరసైకభోజను
ల్గ్రామ్యము లొల్ల కుండుదు రకల్మషులై పదివేలువర్షముల్.
| 208
|
--pig
హిరణ్మయవర్షవర్ణనము
క. |
అనఘ! హిరణ్మయవర్షం, బున హైరణ్వతి యనంగఁ బొలుచు నొకమహా
ధుని మధురవారిపూర్ణయుఁ, గనకకమలకమ్రకాంతకమనీయయు నై.
| 209
|
క. |
అనుపమబలులును తేజో, ధరులును దీర్ఘాయువులును ధనికులుఁ బ్రియద
ర్శనులును సత్త్వాధికులును, ననామయులుఁ బుణ్యపరులు నందలిజనముల్.
| 210
|
స్వారోచిషమనుచరిత్రము
క. |
అని చెప్పిన విని క్రోష్టుకి, మనమునఁ గడు సంతసిల్లి మార్కండేయుం
గనుఁగొని యే నడిగినవిధ, మనఘా! యేర్పడఁగఁ జెప్పి తంతయుఁ బ్రీతిన్.
| 211
|
వ. |
స్వాయంభువమన్వంతరం బేమనువు వర్తించె నతనికాలంబునం గలదేవతలు
ఋషులు రాజులు నెవ్వ రెవ్వ రెఱింగింపవే యనిన మృకండునందనుం డతనితో
స్వారోచిషమన్వంతరప్రకారంబుఁ జెప్పెద నాకర్ణింపుము.
| 212
|
సిద్ధప్రసాదమునఁ బ్రవరుఁ డనువిప్రుఁడు హిమవంతమున కేగుట
క. |
వరుణాతటినీతటమున, నరుణాస్పద మనుపురంబునం దతులగుణో
త్తరుఁడు గలఁ డొక్కధరణీ, సురవరుఁ డశ్వినులకంటె సుందరుఁ డెందున్.
| 213
|
చ. |
అతిసుకుమారమూర్తి ప్రవరాఖ్యుఁ డుదాత్తుఁడు వేదపారగుం
డతిథిజనార్చనాభిరతుఁ డై చరియించుచు శైలకాననాం
చితసకలావనీతలవి శషము లెల్లను బ్రీతిఁ గన్గొన
న్మతిఁ గడుఁ గోరుచుండ నొకనాఁ డొకయౌషధసిద్ధుఁ డింటికిన్.
| 214
|
ఉ. |
వచ్చిన నాద్విజుం డతని వందనపూజల హృష్టచిత్తుఁ గాఁ
జెచ్చెరఁ జేసి యిమ్మహి విశేషపుఁజోద్యము లేవి సూచి తీ
వచ్చుగఁ జెప్పవే యనిన నౌషధసిద్ధుఁ డనేకదేశముల్
గ్రచ్చఱ నేను ద్రిమ్మరితిఁ గాంచితి నం దొగిఁ బెక్కుచోద్యముల్.
| 215
|
వ. |
అని చెప్పిన నవ్విప్రుండు భూసురవరుం దప్పక చూచి నవ్వుచు.
| 216
|
ఉ. |
వాయపురజ్జు లేల మునివల్లభ! వృద్ధుఁడ వొండెఁ గావు లేఁ
బ్రాయపువాఁడ వద్రి వనరమ్యము లైనయనేకదేశము
ల్ధీయుత! యల్పకాలమునఁ ద్రిమ్మర శక్యమె! నీకు నెమ్మెయి
న్వేయును నేల నమ్మ నెద నీపలు కన్న మునీంద్రుఁ డిట్లనున్.
| 217
|
ఉ. |
ఏ నొకసిద్ధుఁడ న్విను మహీసురశేఖర! ధాత్రి యంతయు
న్మానుగఁ బాదలేప మనుమందుప్రభావమునం జరించితి
న్దానిఁ బదంబులందుఁ దగఁ దాల్చిన నెంతయు నిర్జితశ్రముం
డై నరుఁ డేఁగు యోజనసహస్రము నాపగలింటిలోపలన్.
| 218
|
చ. |
అనవుడు నాద్విజుండు ప్రియ మారఁగ సిద్ధునిమాట యూఁది యి
ట్లను ధరఁ జూచువేడ్క హృదయంబునఁ బాయదు నాకుఁ బాదలే
పనపరమౌషధంబు మునిపాలక! యిచ్చి కృతార్థుఁ జేయవే
నను నని వేఁడుకొన్న మునినాయకుఁ డాతని కిచ్చె నిచ్చినన్.
| 219
|
క. |
ఆదివ్యౌషధముం దన, పాదంబులయందుఁ దాల్చి పవనరయమున
న్భూదేవుఁ డుదఙ్ముఖుఁ డై, మోదంబున హిమనగేంద్రమునకుం జనియెన్.
| 220
|
క. |
చని బహులతుహినమహితం, బును నానారత్నరశ్మిపుంజస్ఫురితం
బును సిద్ధసాధ్యదివిజాం, గనాస్పదము నైనయన్నగమువిలసనమున్.
| 221
|
తే. |
ప్రీతిఁ దగిలి చూచుచు సంచరించునతని, చరణతలములమందెల్లఁ గరఁగిపోయెఁ
దుహినజలముల నెంతయుఁ దొప్పఁదోగి, శీఘ్రగమనసత్వంబును జెడియె ననఘ!
| 222
|
వ. |
దానిం దలంపక యగ్గిరీంద్రవిభవవిలసనాలోకనకుతూహలి యై యతండు.
| 223
|
సీ. |
సురసిద్ధసాధ్యకిన్నరమనోహరకేళివిలసితకందరవిభ్రమములు
కలకంఠకులకంఠకలరవరంజితవివిధతరూద్యానవిలసనములు
హంసరథాంగవిహారోల్లసన్నవనీరజాకరరామణీయకములు
త్రిదివనితంబినీక్రీడాభిరమ్యలతాగృహమహితసౌందర్యములును
|
|
ఆ. |
దగిలి చూచి చూచి తలయూఁచి తలయూఁచి, మెచ్చి మెచ్చి విప్రుఁ డిచ్చఁదనివి
చనక యింక నెల్లి చనుదెంచి యేర్పడఁ, జూతు నిన్నగంబుసొంపుఁ బెంపు.
| 224
|
క. |
అని తలంచి నిజగృహమునకుఁ, జనఁ గడఁగుటయుం బదములు జడభావం బొం
దిన నద్ధరణీదేవుఁడు, దనమది వెఱఁ గంది యివ్విధం బేమియొకో.
| 225
|
క. |
హిమవారిఁ గరఁగి మత్పా, దములం బూసినసదౌషధము వోవుటఁ జో
ద్యము గదిరె నిప్పు డక్కట, గమనరయం బుడిగె ననుచుఁ గడుదుఃఖతుఁడై.
| 226
|
ఆ. |
ఇంత దూర మైనయిగ్గిరీంద్రమునకు, నేల నన్ను దైవ మిట్లు తెచ్చె
నెవ్విధమున నింక నే నింటి కేఁగుదు, నేమి సేయువాఁడ నేది తెరువు?
| 227
|
తే. |
నిత్యనైమిత్తికము లైననిఖిలకర్మములకు నాఱడి యిట్టులు పుట్టె వెడఁగ
నైతి నింటికిఁ జనునుపాయంబు వేఁడి, కొనఁగ నిచ్చట నొకతపోధనుఁడు లేఁడె.
| 228
|
ప్రవరవరూథినీసంవాదము
చ. |
అని కడు వంతఁ గూరుచు హిమాద్రితటంబున సంచరించువి
ప్రుని మకరాంకసన్నిభు వరూథిని నాఁ జనునొక్కయప్సరోం
గన లలితాంగకాంతిజితకాంచనవిభ్రమచంచదబ్జలో
చన కలహంసయాన కని సంభ్రమసంచలితాంతరంగ యై.
| 229
|
ఉ. |
ఈసుకుమారుఁ డెవ్వఁడొ యిందుల కెందులనుండి వచ్చెనో
భాసురరూపకాంతిజితభావజచంద్రుఁ డితండు రాగలీ
లాసరసత్వ మొప్పఁ గడులాలసుఁ డై ననుఁ జూచెనేని నేఁ
జేసినపుణ్య మెవ్వరును జేయరు కాముని దక్క నేలుదున్.
| 230
|
ఉ. |
వీనిసురూపవిభ్రమము వీనితనూద్గతచారుకాంతియు
న్వీనిమృదూల్లసద్గతియు వీనివినిర్మలదృగ్విలాసము
న్వీనిముఖాంబుజద్యుతియు వేడ్కఁ గనుంగొన నింత యొప్పునే?
మానవదేవకిన్నరకుమారులఁ జూడనె? వారు నిట్టిరే?
| 232
|
గీ. |
ఈకుమారునిమీఁద నాహృదయ మిప్పు, డధికరాగరసోద్రిక్త మైనమాడ్కి
నితనిమనమును నాయందు నతులరాగ, లలిత మగునేని యది జన్మఫలము కాదె!
| 233
|
క. |
అని మనమునఁ దలపోయుచు, మనసిజశరనికరదళితమానస యగుచు
న్జని యవ్వనితామణి వి, ప్రునిముందట నిల్చె రత్పుత్రికవోలెన్.
| 234
|
వ. |
నిలిచినం జూచి యవ్విప్రుండు దాని డాయం జని నీ వెవ్వతె? విచట నేకతంబ
యేల యున్నదాన? వని యడిగి తనతెఱం గంతయు నెఱింగించిన నత్తలోదరి
యి ట్లనియె.
| 235
|
క. |
మునితనయ! విను వరూధిని, యనునచ్చరలేమ ననఘ! యనుపమబహుర
త్ననితాంతశాంతిసంపద, నొనరినయిగ్గిరిఁ జరించుచుండుదు నెపుడున్.
| 236
|
క. |
నీవిలసనంబు గనుగొని, భావజునలరంప వెల్లి పాల్పడితి ననుం
గావుము సుందరమూర్తీ!, నావుడు నతఁ డిట్టు లనియె నలినాననకున్.
| 237
|
తే. |
నిత్యకృత్యము ల్సలుపంగ నిజగృహమున, కిపుడ యరుగంగవలయు నా కిందువదన!
చనునుపాయ మేయది? సెప్పు నను సముద్ధరింపు నిత్యక్రియాహానిపెంపు నడఁచు.
| 238
|
వ. |
అనిన నయ్యింతి యి ట్లనియె.
| 239
|
మ. |
ధరణీదేవకుమార! యి ట్లనకు ముద్యత్ప్రీతి న న్బాసి నీ
కరుగంగాఁ దగు నెట్లు మేలె యతిరమ్యంబై వసింపంగ ని
గ్గిరికంటె న్భవదీయగేహ మెలమి న్గ్రీడింపు నాతో మనో
హరకేళీగతీ నెందుఁ బోకుము సుహృద్వ్యామోహ ముప్పొంగఁగాన్.
| 240
|
సీ. |
భక్ష్యభోజ్యలేహ్యపానీయములు రత్నమండనములు వస్త్రమాల్యములును
గర్పూరచందనకస్తూరికాదులు నే నర్థి నీఁ గొని యింపు మిగులఁ
గా సుఖంచుచు లీల గంధర్వకిన్నరవేణువీణాగీతవివిధగతులు
వినుచు మందానిలం బనుభవించుచు నిమ్మహాశైలసానుపర్యంకతలము
|
|
తే. |
నందు రమియింపు భవదీయమందిరమునఁ, గలుగునే యిట్టిదివ్యభోగంబు? లనుచు
రాగసాగరమగ్నయై రాజవదన, కదిపి భూసురవరుఁ జక్కఁ గౌగిలించె.
| 241
|
వ. |
ఇట్లు దన్ను నయ్యంగన గాఢాలింగనంబు సేయుటయును.
| 242
|
తే. |
అంట కంటకు నన్ను మృగాక్షి! నీకు, సదృశుఁ డగువాని నన్యుని వెదకికొనుము
నిన్ను నొక్కటి యడుగంగ నీవు వేఱ, యొకటి గోరి నను న్బొంద నుచిత మగునె?
| 243
|
సీ. |
అనలునియందు రేపును మాపు వేల్వంగఁ బడుహవ్యములఁ జేసి పడయవచ్చు
పుణ్యలోకంబులు పొలఁతి! నీ వెఱుఁగ వీత్రిజగంబు హవ్యప్రతిష్ఠితంబ
యనిన నాయింతి నాయందు నిగ్గిరియందు నీకుఁ బ్రియం బేల నెలవుకొనదు?
విద్యాధరాదుల విడిచి మనుష్యులకడ కేల యరుగంగఁ గడఁగె? దనిన
|
|
తే. |
వినుము దర్భలు నరణులు వేదికలును, నగ్నులును నాకుఁ గరము ప్రియంబొనర్చు
గాని యొండందుఁ బ్రియ మెదఁ గలుగ దనిన, నవ్వరూధిని యిట్లను నతనితోడ.
| 244
|
ఆ. |
అఖిలధర్మవేది వైననీసుగుణాష్ట, కంబు ముఖ్యగుణము గాదె కరుణ
దానిఁ బూనవలదె తథ్యము నాయందు, దయకు సరియె యొండుధర్ము వనఘ!
| 245
|
క. |
దయఁ బోల వధ్వరంబులు, దయఁ బోలవు వివిధభూరిదానచయంబు
ల్దయఁ బోలవు జపతపములు, దయ తలపోయఁగ విశిష్టతమధర్మ మిలన్.
| 246
|
క. |
నినుఁ బాసి నిముస మైనను, విను జీవము పట్టఁ జాల విప్రోత్తమ! నే
ననృతంబు వలుక నిజ మిది, ననుఁ బ్రీతి వరింపు కరుణ నాన్పు మనంబున్.
| 247
|
వ. |
నీకు నిజగృహంబునకు నవశ్యంబు నరుగవలయునేని కొండొకకాలంబు
నాతోడ నిష్టోపభోగంబు లనుభవించి మఱి యరుగు మనిన నా బ్రాహ్మణుం డి
ట్లనియె.
| 248
|
తే. |
విప్రవర్యులు భోగము ల్వేడ్క సేయ, రిడుమ లిహమునఁ బడి కాంతు రెలమిఁ బరము
నందు సుఖ మన్న నింతి మత్ప్రాణదాన, మిహపరోపభోగంబు లీడేర్చు నీకు.
| 249
|
వ. |
నీచేత నిరాకృతనైతినేని పంచత్వంబు నొందుదు నీవునుం బాపంబునం బడుదు
వనిన నమ్మహీదేవుండు.
| 250
|
క. |
పరవనితారతి కీ డని, గురు లెఱిఁగింతు రటుగానఁ గోమలి! మది నా
కు రతి జనింపదు నీదెస, నిరతము నాదెస భజింపు నీవును విరతిన్.
| 251
|
ప్రవరుఁ డగ్నిప్రసాదంబున నిజగృహంబున కేఁగుట
సీ. |
అని యమ్మహాభాగుఁ డాచమన మొనర్చి నియతుండు శుచియు నై నిలిచి గార్హ
పత్యాగ్నిఁ దనమది భావించి వందన మొనరించి యిట్లను ననిలమిత్ర!
నీయంద యాహవనీయాగ్నియును దక్షిణాగ్నియుఁ బ్రభవించె నిఖిలదేవ
దృప్తి నీవలన సిద్ధించును సకలలోకముల కాశ్రయము నీవ
|
|
ఆ. |
నిత్యసత్యమూర్తి! నీప్రసాదంబున, నినుఁడు గ్రుంకకుండ నిపుడ యింటి
కరుగువాఁడఁ గాక యాగమోదితకర్మ, జాతనైష్ఠికుండ నైతి నేని.
| 252
|
క. |
పరనారీపరధనరతి, పరత్వ మెన్నఁడును నాకుఁ బాటిల్లనియా
స్థిరసత్యమహిమ నతిస,త్వరితగమనసిద్ధి గలుగవలయు హుతవహా!
| 253
|
వ. |
అని యభ్యర్థించిన నగ్నిదేవుం డవ్విప్రునిశరీరంబునందు సన్నిహితుండయ్యె నతం
డును బ్రభామండలమధ్యగతుండై మూర్తిమంతుం డైనహుతవహుండునుంబోలెఁ
దత్ప్రదేశంబు వెలింగించుచు నద్దివ్యాంగన యంతరంగంబున నంతకంతకు ననురాగం
బతిశయిల్లి శోభిల్ల నగ్నిప్రసాదంబున నెప్పటియట్ల శీఘ్రగమనంబు వడసి నిజ
గృహంబున కరిగి నిత్యక్రియాకలాపంబులు నిర్వర్తించెనని మార్కండేయుండు
క్రోష్టుకికిం జెప్పినవిధంబునం జెప్పి.
| 254
|
చ. |
నిరఘచరిత్ర! వారిరుహనేత్ర! సమంచితసర్వలక్షణ
స్ఫురదురుగాత్ర! సూరిజనభూరుహచైత్ర! సమస్తయాచకో
|
|
|
త్కరనుతిపాత్ర! శాత్రవనికాయభయంకరజైత్రయాత్ర! సం
కరుహభవాంఘ్రిజాన్వయశిఖామణి! భూవిలసన్నభోమణీ!
| 255
|
క. |
మేచచమూపాగ్రజ! స, త్యాచారమహత్త్వపాండవాగ్రజ! విలస
చ్ఛౌచాపగాతనూభవ!, యాచకనికురుంబనూతనార్కప్రభవా!
| 256
|
మాలిని. |
మదవదరివిదారీ! మానినీమానహారీ!
సదయవదనపద్మా! శౌర్యసారైకసద్మా!
విదితవివిధకర్మా! విస్ఫురదానధర్మా!
మదనసదృశమూర్తీ! మంగళాచారవర్తీ!
| 257
|
గద్యము. |
ఇది శ్రీమదుభయకవిమిత్ర తిక్కనసోమయాజిప్రసాదలబ్ధసరస్వతీపాత్ర తిక్క
నామాత్యపుత్ర మారయనామధేయప్రణీతం బైనమార్కండేయమహాపురాణంబు
నందు మహదాదిభూతసంభవంబును నండోత్పత్తియు బ్రహ్మజన్మంబును జతుర్యుగ
మన్వంతరకాలసంఖ్యలును సురాసురయక్షపితృమనుష్యరాక్షససర్వభూతసంభవం
బును జరాచరభూతానుభవంబును మిథునరూపమనుష్యప్రవర్తనంబును నేకాదశ
రుద్రసర్గంబును స్వాయంభువమనుప్రభవంబును దక్షసర్గంబును దుస్సహోత్పత్తి
యుఁ దత్సంతానదురాచారప్రకారంబును రుద్రసర్గంబును వహ్నులజన్మంబును
స్వాయంభువమనుపుత్రు లైనయాగ్నీధ్రాదులు పుట్టుటయు సప్తద్వీపవిభాగంబును
జంబూద్వీపప్రకారంబును ప్రవరుం డనువిప్రునిచరితంబును వరూధిని యతనిం
జూచి కామించుటయు నమ్మహీదేవుండు దానిం బరిగ్రహింపక యగ్నిప్రసాదంబున
శీఘ్రగమనంబు వడసి నిజగృహంబున కరుగుటయు ననునది చతుర్థాశ్వాసము.
|
|