మాటా మన్నన/6. స్త్రీ పురుషుల సంభాషణ
స్త్రీ పురుషుల సంభాషణ:
పురుషులు తరచుగ సంతోషంతో మాట్లాడుకుంటారు. అట్లాగే స్త్రీలు ఇతరస్త్రీలతో సంతోషంగా మాట్లాడుకుంటారు.
పురుషులకు స్త్రీలకు కులాసాగా మాట్లాడుకోవటానికి ప్రత్యేకవిషయాలున్నాయి. వ్యవసాయపనులగురించి, ఆట పాటలగురించి పురుషులు; పిల్లా జెల్ల నుగురించి, ఇల్లువాకిళ్ళ గురించి స్త్రీలు మాట్లాడుకుంటారు.
ప్రపంచమంతటా స్త్రీలను సర్వసాధారణమైన విషయం దుస్తులు. సమయాసమయాలు లేకుండా కనబడగానే మాట్లాడేది. వాటినిగురించే. పురుషులకు ప్రపంచమంతటా ఆకర్షించే విషయాలు శూన్యం. స్త్రీ లెంతటి అదృష్టవంతు రాండ్రు!
స్త్రీ పురుషు లున్నచోట ఎట్లా మాట్లాడాలన్నది క్లిష్ట సమస్య. వారు కలసి మాట్లాడటంలో ఆనందం అనుభవించటం కష్టమని కొందరంటారు. కాని ఆలోచిస్తే అది సబబుగా తోచదు. స్త్రీపురుషులు కలసి మాట్లాడుకోవటంలో మహదానందం ఉన్నది. దానిలో కొంత ఆకర్షణ, వినోదం లేకపోలేదు.
పురుషులు సహజంగా తాము చెప్పేసంగతి తమకు బాగా తెలుసని విశ్వాసం కలవారు. వారు వాద చతురులుకూడా. వారికి ఒక అహంభావంకూడా ఉంటుంది. తాము చెప్పేది రైటని, ఇతరులు చెప్పబోతే వారి కేమీ తెలియదని అనేస్తారు,
స్త్రీలు సహజంగా లజ్జ బిడియంకలవారు. వారు తమ అభిప్రాయాలను వెల్లడించటంలో వెనుకాడతారు. పురుషులతో వాదిస్తానికి సంశయిస్తారు,
ఆడపిల్లలు యువకులను కదలించి వారి వారి కార్య కలాపాలు వినగోరుతారని అంటారు. అది పాత మాట. పురుషులు స్త్రీల నోటిమాట వింటానికే నేడు ఉబలాట పడతారు. స్త్రీ అనే పేరే మధురం అన్నాడు పురుషుడు. అటువంటప్పుడు ఆమె మాటలకు చెవి కోసుకుంటాడంటే ఆతిశయోక్తి ఏమున్నది. పురుషులు స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. స్థనశల్య పరీక్ష, , అజాగళ స్థనం మొదలగు మాటలేగాక, వారు నొచ్చుకొనేటట్లు మాట్లాడరాదు.
అలాగే స్త్రీలు పురుషులపై సవారీ చేయరాదు.
ఉభయులకు అనుకూలమైన విషయాలమీద సంభాషణ చేయటం మంచిది. ఆ సంభాషణవల్ల వినోదం విజ్ఞానం పొందాలి, అవి సంగీత సాహిత్యాలుగాని సాంఘిక ఆర్ధిక రాజకీయనిషయాలుగాని.
స్త్రీ పురుషులు కలసి మాట్లాడటంలోగల చిక్కు ఏమిటంటే సాధారణంగా హృదయం విప్పి మాట్లాడుకోరు. మగవారు గంభీర హృదయులు, స్త్రీలు మాట్లాడుతూంటే చాలామంది మగవారు వింటూఉంటారు. అది సంభాషణ అనిపించుకోదు.
స్త్రీలు అట్లాకాదు. పురుషులు మాట్లాడుతుంటే మందహాసం చేయటమో, సంతోషం వెలిబుచ్చటమో ఏదో చేస్తూ ఉంటారు. స్త్రీలుగాని ఆడపిల్లలుగాని మాట్లాడటం ఆరంభించారంటే గబగబ మాట్లాడుతారు. అదంతా ఆలోచన లేకుండా బిడియంచేత కలిగిందే. క్రమంగా వారు కూడా కొంతకాలానికి ఆలోచించే సంభాషించటానికి ప్రయత్నిస్తారు.
స్త్రీ పురుషులు మాట్లాడుకోవటంలో ఒక చిక్కు ఉంది. పురుషులు సహజంగా తమ కిష్టమైన ఆటపాటలను గురించి ఆరంభిస్తే స్త్రీలు తమ పిల్లామేకనుగురించి చెప్ప సాగుతారు. ఇదంతా అందరకూ ఆమోదంకాదు. కొంచెం వయసు మిగిలినవారు కుటుంబవిషయాలంటే ఇష్టపడతారు.
స్త్రీలలో మరొకసంగతేమిటంటే ఏమన్నా పిల్లలా? అని తప్పకుండా అడుగుతారు. అది పూర్వాచార పరాయణులకు ఇష్టమేకాని నవనాగరికులకు అంత ఇష్టంగాఉండదు. ఒక వేళ పిల్లలు లేకపోతే ఆమె చాలా నొచ్చుకోవచ్చు. ఏమైనా స్త్రీలు విశేషంగా తమపిల్లలసంగతి చెప్పుకోకుండా వుండటం మంచిది. ఎందుకంటే, ప్రతివారూ తమ పిల్లల సంగతి చెప్పతలుస్తారు. అందుచేత సోది వింటానికి ఇష్టం ఉండదు.
స్త్రీ పురుషులు, సంభాషణలో తమ భావాలను వెలిబుచ్చుకోవటానికి అవకాశంగా భావించుకోవాలి. గృహ సంబంధాలు మానాలి స్త్రీలు. ఉభయులు సానుభూతితో ఒకరి అభిప్రాయాలు ఒకరు గ్రహించటానికి ప్రయత్నించాలి.
సంభాషణలో అందరికి ఆమోదప్రదంగా ఉండే విషయాన్ని మాట్లాడాలనేది ప్రధమంగా మనసులో నుంచుకోవాలి. సంభాషణవల్ల ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గ్రహించి, ఒకరినొకరిని అర్థం చేసుకొనేటట్లుండాలి. అన్యధా భావించరాదు.
స్త్రీ పురుషులుకలసి మాట్లాడుతూఉంటే మాధుర్యం ఉట్టిపడేటట్లుండాలి. అది ఒక వింతశోభ, ఉత్సాహము ఆనందానుభవంగా ఉండాలి.
చిన్నారావు (రేమెళ్ళ) కృష్ణాబాయి (తుమ్మల) హేమ (తాతినేని) నేనూ కలసి సంభాషణ చేస్తున్నప్పుడు కాలం సంగతి తెలియనే తెలియలేదు.
కాకినాడలో మధురంగా గడిపాము. అదొక మధుర స్మృతి.
ఒకరి నొకరు అర్థంచేసుకొని పరస్పర మైత్రికలిగి పరస్పరం పెరిగాము.
మాటవల్ల మనస్సు కలియాలి.
నాకు తెలిసిన స్త్రీలల్లో రామతుల భారతీదేవి, ఇల్లిందల సరస్వతీ దేవి. అత్తిలి స్వరాజ్యలక్ష్మి కృష్ణాబాయి గారలు ఉత్తమ సంస్కారులుగ కన్పిస్తారు. వారి ఉనికే ఉత్తమ సంస్కారం కలిగిస్తుంది. వారితో సంభాషించటం సంగతి వేరే చెప్పనక్కరలేదు.