మాటా మన్నన/5. విడువ వలసిన దోషాలు
విడువవలసిన దోషాలు:
సంభాషణలో దురుసుదనం పనికిరాదు. మాట్లాడేటప్పుడు ఎదటివారిని "నీవు వట్టి శుంఠవు, నీ కేమీ తెలియదు. నీవు మాట్లాడేదంతా వట్టి చెత్త” అని నీచపరచరాదు. ఇట్లా మాట్లాడేవారంతా సరసులుగారు, ఇతరుల అభిప్రాయాలను మన్నించనివాడు సంస్కారికాడు. అన్నీ అందరికీ తెలియవు. సర్వమూ తెలిసినవారూ లేరు. ఏమీ తెలియనివారూ లేరు అని గుర్తించటం అవసరం.
సోక్రటీసు చాలా గొప్పవాడు. ఆయన అన్నమాట ఆలకించదగినది. “నాకేమీ తెలియదని నాకు తెలుసు, ఇతరులకు ఆ సంగతి తెలియదు” నిండుకుండ తొణక దంటారు ఇదే,
నేర్పుగా మాట్లాడే మనిషి శ్రోత సరిగా వింటున్నాడో లేదో చూస్తుంటాడు. అతనికి శ్రద్ధ లేకపోతే ఆ సంగతి విడిచి పెడతాడు.
సంభాషణ అనేది ఒక ఆటగా భావించాలి. రెండవవాడు ఆడకపోతే ఒక్కడే ఆడే దేమిటి ? ఇతరులతో మాట్లాడేటప్పుడు నీ ఇంటి విషయాలు గాని, పరుల గృహకల్లోలాలుగాని మాట్లాడరాదు, రాజకీయ నాయకులను గురించి ప్రముఖులను గురించి అమర్యాదగ మాట్లాడరాదు.
ప్రతివారిని గురించి సానుభూతితో మాట్లాడటం మంచిది. మర్యాద ఇచ్చి మర్యాద తెచ్చుకోమన్నారు. ఇది నీకూ ఇతరులకు కూడా మంచేఅని గ్రహించాలి. ఇది అందరికి అందుబాటులోని విషయం. ఈ మాదిరిగా ప్రవర్తి స్తే లోకం ఎంతో సుఖప్రదంగా ఉంటుంది.
సంభాషణ రాణించే మార్గాలు :
మంచి సంభాషణలో ముఖ్యాంశం, ఇద్దరుగాని ముగ్గురుగాని మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని గురించే మాట్లాడరాదు. సంభాషణ సజీవంగా ఉండాలంటే ఒక దానిమీదనుంచి మరొకదానిమీదికి సహజంగా పోవాలి. ఆ విషయాలు అక్కడున్న వారందరికి తెలిసేవిగా వుండాలి. వారి అంతస్థు విద్యాపరిణతి, ఎట్లాఉన్నా ఆ విషయాలు సర్వసామాన్యంగా ఉన్నప్పుడే అవి రాణిస్తవి.
ఆ సంభాషణలో పాల్గొనేవారందరికి ఆమోదప్రదం ఆనందకరంగాను ఉండాలి. ఏవిషయాన్నైనా చక్కగా మాట్లాడగల అదృష్టవంతులు కొందరే ఉంటారు. వారితో మాట్లాడటం ఆనందం, అదృష్టం. కొంద రేదో కాలక్షేపం చేయాలని తలుస్తారు. మాటలవల్ల మంచి కలగదని చూస్తారు. వారు పై పై సంగతులు మాట్లాడ తలుస్తారు.
ఏదైనా అసభ్యకరమైన సంగతిగాని అనిష్టకరమైన మాటలుగాని వస్తే “అది వదిలి పెడుదువు, ఏదైనా మంచి మాట చెప్పు” అని మార్చాలి.
వినేవారిని సంతోష పెట్టాలని హాస్యరస కథలు చెప్పటం సంభాషణ కాదు. ఏవైనా కొత్త సంగతులు చెప్పటం సంభాషణ.
అందరికీ ఆమోదకరమైనదానిని గురించి సంభాషించడం మంచిది.
నూతన వ్యక్తులను కలుసుకున్నప్పుడు సంభాషణ సాధారణంగా ప్రశ్నరూపంగానే ఉంటుంది. మీ దేవూరు ? మీ పేరేమిటి? ఈ మాదిరిగా ఉభయులు మాట్లాడు కున్నప్పుడు అనుకూలత కలిగితే ఆ పరిచయం స్నేహంకింద మారుతుంది.
దేన్నిగురించి సంభాషించాలి :
తెలిసిన మనిషి. కనపడగానే కుశలప్రశ్న వేస్తాము. తర్వాత ఏ విషయాన్ని మాట్లాడాలా అని ఆలోచించ వలసి వస్తుంది. అవతల మనిషి, అభిరుచిస్థాయినిబట్టి పలకరించాలి, అతడు గ్రంధ పఠనాభిలాషి. అయితే ఈ మధ్య ఏదైనా మంచి పుస్తకం చదివారా అనవచ్చు. ని న్నడిగితే చదివిన పుస్తకాల గురించి నీ అభిప్రాయాలు వివరంగా చెప్పరాదు. ఇది మంచి పుస్తకం; ఇది చెడ్డది అని చెప్పరాదు. అభిరుచుల భేదం. ఇది నాకు బాగుంది- అనాలి. అది నాకు నచ్చలేదు-అనాలి. అసలు అట్లా అంటంకూడా మంచిది కాదు. నీ అభిప్రాయం అతనిపై పనిచేస్తుంది.
కొందరు మతవిషయాలు, రాజకీయాలు మాట్లాడ రాదంటారు. మతవిషయాలనుగురించి తీవ్రమైన భిన్నాభిప్రాయ లుండటం సహజం. అవి మారేవి కాదు. ఎవరికి వారు తమ నమ్మకాలే ముంచివనుకుంటారు. అదీకాక మత విషయం వ్యక్తి సంబంధం.
రాజకీయాలను గురించి తప్పకుండా మాట్లాడాలి. ఈ కాలంలో అవే ప్రధానం. రాజకీయాలు దేశానికి సంబంధించినవి. వాటిల్లో భిన్నాభిప్రాయా లుండటం సహజం, అభిప్రాయాలను గురించి వినటం చర్చించటం అవసరం. దేశ పురోభివృద్ధి వాటిమీదనే ఆధారపడివుంది.
భిన్నాభిప్రాయాలుగల వారితో మాట్లాడకపోతే మంచి చెడ్డలు తెలిసేది ఎట్లా ? తీవ్రమైన వివాదాలలో దిగరాదు. తన అభిప్రాయాన్ని నెగ్గించుకోవాలని ప్రయత్నించరాదు.
మానవులు రూపురేఖలలో ఎట్లా భిన్నంగాఉంటారో అట్లాగే అభిప్రాయాలలోను భిన్నంగాఉంటారు. అభిప్రాయభేదం ఉన్నంతమాత్రాన ఒకరినొకరు హేళన చేసుకోవటం, మూతి ముడుచుకోవటం మంచిది కాదు. ఎదుటివారి అభిప్రాయాన్ని విన్నప్పుడే మంచి చెడ్డలు తెలిసేది.