మహర్షుల చరిత్రలు (మొదటి భాగము)/ముందుమాట



ముందుమాట

* * *

సనాతన భారతీయ సంస్కృతిలో "ఋషులు" నిర్వహించిన భూమిక లు జగత్ప్రసిద్ధాలు.

క్రాంతదర్శులై, తపస్స్వాద్యాయ నిరతులై, నిగ్రహానుగ్రహ సమర్థులై త్రికాలజ్ఞులైన మహర్షులను గురించి శ్రుతిస్మృతి మహేతిహాప మహాకావ్యాలలో నవరసరుచిరా లైన విషయాలు ఎన్నోవున్నాయి. మహర్షులు మంత్రద్రష్టలు . అతిలోక మహిమాన్వితులు. వారి జీవిత చరిత్రలు. భారతీయ సంస్కృతిని అధ్యయనం చేసేవారికి అవశ్యపఠనీయాలు.

ఆధ్యాత్మిక ప్రగతిపట్ల అభిరుచి కలవారికి, అభినివేశం ఆర్జించ దలచినవారికి మహర్షుల జీవిత చరిత్రలు మాత్రమే కాకుండా వారు ప్రతిపాదించిన ధర్మతత్వాలూ, అందించిన సందేశాలు అనుశీలించడం ప్రధాన కర్తవ్యం. విశ్వజనీనాలైవ మహర్షుల చరిత్రలు వేదాలనుంచీ, అష్టాదశ పురాణాలనుంచీ, ఇతిహాసాలనుంచీ, మహాకావ్యాలనుంచీ సంగ్రహించి, ఒక చోటకు చేర్చి అందించడంలో విశేష పరిశ్రమ, కూలంకష వైదుష్యం, విశిష్ట ప్రతిభ అవసరం.

విద్వాంసులూ, సత్కవీశ్వరులు అయిన శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారు వ్రాసిన మహర్షుల చరిత్ర అనేక సారులు అచ్చయి సహృదయుల మన్ననల పొందింది. ఆర్షసాంస్కృతిక పునర్వికాసానికి తోడ్పడుతుందనే ఉద్దేశంతో ఈ గ్రంథాన్ని ప్రచురించడానికి తిరుమల తిరుపతి దేవస్థానంవారు సంకల్పించారు. ఆ ఆశయం నెర వేరుతుందని మా విశ్వాసం.

కార్యనిర్వహణాధికారి,

తిరుమల తిరుపతి దేవస్థానములు,

తిరుపతి,

11 - 5 - 1981.