మహర్షుల చరిత్రలు (మొదటి భాగము)/అత్రి మహర్షి

మహర్షుల చరిత్రలు

అత్రి మహర్షి

అత్రిమహర్షి సప్తమహర్షులలో నొకఁడు, అనసూయా మహాసాధ్వికిఁ బ్రాణనాథుఁడు, నిజతపః ప్రభావమున లోకోత్తరుఁడై న మహాపురుషుఁడు.

అత్రి జననము

సృష్టికర్తయగు బ్రహ్మదేవుఁడు తనకు సహాయుఁడుగా నుండి ప్రపంచమునఁ గొంత సృష్టికిఁ గారకుఁ డగు నను సుద్దేశముతో దన మానసమునుండి యత్రిని బుట్టించెను. అత్రి జన్మించి తండ్రికి నమస్కరించి "తండ్రీ! నీవు నన్నేనిమిత్తమై సృజించితివి? నీయాజ్ఞ నాకు శిరోధారణ మగును గాక! " యని పలుకఁగా బ్రహ్మదేవుఁడు సంతసించి "నాయనా! నీవు మహాతపస్సు చేసి లోక సంరక్షణమునకై కొందఱను సృజింపవలయు, సాహాయ్యము నేను చేయుచుందు" నని చెప్పి యత్రిని దపోవనమునకుఁ బంపి బ్రహ్మదేవుఁడు తన నివాసమున కేఁగెను.[1]

అత్రి తపోనియతి

బ్రహ్మదేవుని యాజ్ఞానుసార మత్రి బయలు దేఱి యొక వనమున కేఁగి యందుఁ దపోవృత్తి నుండెను. పంచభూతములచే నేర్పడి. రక్తమాంసాస్థికలచే హేయమై వినశ్వర మగు దేహముపై నిర్మ' మత్వము గలిగి యా దేహము కాని యాత్మను దర్శించి తదంతర్లీనత నానందసుస్థిర చిత్తమున నెగడఁ గనుటకే యమనియమములు, దాన ధర్మములు, తపోవ్రతములు నేర్పడినవి. తాను కాని దేహముపై మమత్వము నశింపఁ జేసికొనుటకుఁ దానైన యాత్మవలని యానందమనుభవించు శక్తిఁ గనుటకు దేహము నుపవాసాది కఠిననియముములచేఁ గృశింపఁ జేయవలయును. అట్టి దేహ కార్శ్యమువలన దుఃఖము నందక యాత్మానందస్థితిని నిలువఁగలిగినవా రే మహర్షులు. ఈ శాశ్వత స్థితికి నిత్యతపోనిరతియే మార్గము. ఈ స్థితినున్న వా రనంత శక్తిమయులు. దీనినే యత్రి సాధింప దొరకొనెను. ఇట్టి మహోగ్రతవస్సంపన్నుఁ డగు నత్రిమహర్షి నేత్రగోళముల నుండి కొంతకాలమున కొకదివ్యతేజ ముదయించెను. ఆ మహాతేజ మంతు లేనిదై భూనభోంతరమంతయు వ్యాపించెను. దశదిశలు నా తేజము భరింపనెంచి యాహ్వానించెను. కాని యా తేజో విశేష మత్యంతమై నిర్భర మగుటచేఁ గొంతకాలమున కా దశదిశలను మోయఁజాలక వెడలఁగ్రక్కెను. అంత నా దీధితి సముద్రగర్భమునఁ బడెను. ఈ సంగతి బ్రహ్మదేవుఁ డెఱింగి యా ప్రదేశమునకు వచ్చి యా తేజమును దాను ధరించెను. దేవత లిది చూచి యావిరించిని సోమమంత్రములతో స్తుతించిరి. అంత బ్రహ్మ యా తేజోంశమునకుఁ బురుష రూప మొసఁగి యత్రిమహాముని వివాహమైన పిమ్మట నాతని కనసూయయందుఁ దన యంశముచేఁ జంద్రుఁడై జన్మించుననియు నా తేజోంశమే యొకటి తరువాత క్షీరసాగర మథన సమయమున జనించి యా శశాంకునిఁ గలియు ననియు దేవతలకుఁ జెప్పి యా చతుర్ముఖుఁ డంతర్హితుఁడయ్యెను. అత్రి యథాపూర్వము తపో విద్యానవద్యుఁడై బ్రహ్మచారియై యుండెను.[2]

అత్రిమహర్షి వివాహము

కొంత కాలమునకు దేవహూతీకర్దములకు విష్ణుమూర్తి కటాక్షముచేఁ దొమ్మండ్రుకూఁతులును నొక కుమారుఁడును జన్మించిరి. కర్దమప్రజాపతి తన కూఁతుండ్రను బ్రహ్మర్షులకే యిచ్చి వివాహము చేయనెంచి వారిలో నొకతె యగు ననసూయకుఁ దగినవరుఁ డత్రి మహర్షి యే యని యాతనిఁ బిలువనంపెను. అత్రిమహర్షి యుఁ గర్దమునియొద్దకు వచ్చి యాతని కోరికపై ననసూయను వివాహమాడి యత్తమామల యాశీర్వచనము అంది తన యాశ్రమమునకు సభార్యుఁడై వెడలిపోయెను.

ఈ ప్రకార మత్రిమహర్షి గృహస్థాశ్రమమును స్వీకరించి యనసూయాసాధ్యితోఁ గాపురము చేయుచుండెను. అనసూయ తన యద్వితీయ భర్తృసేవలో సమస్తమును విస్మరించుచుండెను. భర్తనే దై వముగా నెంచి యాతనికి సకలోపచారములను జేయుచు నాతని హృదయమును జూఱగొని జ్ఞానోపదేశము. ననంతమహత్త్వము నాతనివలన నామె పడయఁ గల్గెను. ఆహా! ఆహారవిహారనిద్రాసంగమ వ్యామోహాదులచే నవవిత్రమై యత్యంత దుఃఖప్రద మగు సామాన్య సంసార జీవనమునకు, నాత్మానవద్యవిద్యానందముచే వినశ్వర దేహసుఖవిదూరము విశ్వమంగళార్థము వినియుక్తము మమకార రహితమగు మహర్షుల సంసారజీవనమునకు నెంతదవ్వు![3]

త్రిమూర్తు లనసూయకు వరము లొసఁగుట

అందుచే నత్రిమహర్షి దయవలన నససూయకు నానాఁటికి గొప్పతనము హెచ్చుచుండెను. ఒకనాఁడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు అనసూయ మాహాత్మ్యమును బరీక్షింప నెంచి యత్రిమహర్షి యాశ్రమమునకు వచ్చి యాతిథ్యము కోరిరి. అత్రి మహాప్రసాద మనెను. కాని, యా త్రిమూర్తులును దమకొక వ్రతము కలదనియు దాని ప్రకార మానాఁడు తమకు వడ్డించు స్త్రీ నగ్నయై వడ్డింపవలె ననియుఁ జెప్పిరి. అత్రిమహర్షి యనసూయతో నీ విషయమును జెప్పెను. అనసూయ యంగీకరించెను. త్రిమూర్తులు స్నానము చేసి వచ్చి కూర్చుండ వారిపై ననసూయ మంత్రాక్షతములు జలమును జల్లఁగా వారు మువ్వురు నామె మాహాత్మ్యమునఁ జంటిబిడ్డలైరి. ఆమె నగ్నయై వడ్డించి పిమ్మట వస్త్రము ధరించి తిరిగి వారిపై జలము చల్లి యధాపుర్వముగాఁ ద్రిమూర్తులఁ జేసి భుజింపుఁడని కోరుకొనెను. వారు భుజింపఁగనే మరల వారిని శిశువులఁ జేసి తన గృహముననే యుయ్యెలలోఁ బరుండఁ బెట్టి యూఁచుచుండెను. సరస్వతీ లక్ష్మీ పార్వతులు భర్తలను వెదకికొనుచు వచ్చి యనసూయను బతిభిక్షము వేఁడిరి. అనసూయ వారి నాదరించి యాముగ్గురు బిడ్డల నిచ్చెను. వారాశ్చర్యపడి తమ భర్తలను బ్రసాదింపు మని యామెను బార్థించిరి. అనసూయ వారికి మ్రొక్కి మంత్రాక్షతములతో నా బిడ్డలఁ దిమూర్తులఁ జేసి యా త్రిమాతలకు నిచ్చెను. అంతఁ ద్రిమూర్తులును భార్యాసహితులై యనసూయామాహాత్మ్యమునకు మెచ్చుకొని తమయంశములచే లోకోద్ధారకులగు మువ్వురు పుత్రు లుదయింతు రని వరమిచ్చి యనసూయాత్రి మహర్షుల నాశీర్వదించి వెడలిపోయిరి.[4]

మఱియొక పర్యాయము కౌశికపత్ని శాసనమున సూర్యుఁ డుదయింపకుండఁగా లోకోపద్రవము కలిగెను. అప్పుడు బ్రహ్మ పంపున దేవత లా యుపద్రవమును బాపుమని యనసూయను గోరిరి. అనసూయ కౌశికపత్ని సంగీకరింపఁ జేసి సూర్వోదయమగునట్లు కావించి మరణించిన యామె భర్తను మెటనే బ్రతికించెను. అప్పుడును ద్రిమూర్తులు ప్రత్యక్షమై యామెకుఁ దమ యంశములఁ బుత్త్రత్రయ ముదయించు నని యాశీర్వదించిరి.[5]

అత్రిమహర్షి సంతానమునకై తపముచేయుట

అటుపిమ్మటఁ గొంతకాలమున కత్రిమహర్షి భార్యాసహితుఁడై ఋక్షపర్వతము పై నిలిచి దేవదేవుని గుఱించి శతవర్షములు ఘోరతప మొనర్చెను. ఆ తపోనలముచేఁ ద్రిజగములును గలఁగుఁడువడఁగా బ్రహ్మవిష్ణుమహేశ్వరులు మువ్వురును బ్రత్యక్షమైరి. . అత్రి వారిని బూజించి "నేను సత్సంతానార్ధమై దేవాదిదేవుని గుఱించి తపమొనర్స మువ్వురేల వచ్చితిరి? మీలో నధికులెవ? రని వారిని బ్రశ్నించెను. ఆ త్రిమూర్తులును దమ కభేదమని చెప్పి తమ యంశములచేఁ ద్వరలోనే యాతనికి సత్పుత్త్రోదయ మగు నని వర మిచ్చి యదృశ్యులైరి.

అత్త్రిమహర్షికి లోకోత్తరపురుషు లుదయించుట

కాలక్రమమునఁ ద్రిమూర్తులవరమున నత్రిమహర్షి నేత్రగోళమునుండి చంద్రుఁడును ననసూయాగర్భమున దత్తాత్రేయ దుర్వాసులును క్రమముగా బ్రహ్మవిష్ణు మహేశ్వరాంశములతో నుద్భవించిరి. ఆ మువ్వు రట్లు జన్మించి దినదిన వర్ధమానులై తల్లిదండ్రుల కధికామోదమును గూర్చుచుండిరి.

ఇట్లు పుత్త్రులు పెరుఁగుచుండఁగా నత్రిమహర్షి తపోధ్యాన నిమగ్నుఁడై యనసూయను బిలిచి “సాధ్వీ! నీవు కోరినట్లు సత్పుత్రు లుదయించినారు. నే నిఁకఁ దపోజీవనము సభిలషించుచున్నాను. నీవు నాతో నుందువా? లేక యీ బిడ్డలకడ నుందువా?" యని యడిగెను. అనసూయ వినయవిధేయతలతో "మహాత్మా! పుత్త్రు లింకను బెరిఁగి పెద్దవారు కాలేదు. అగుట నిపుడే యాశ్రమాంతరమున కరుగుట ధర్మము కాదు. కావునఁ బుత్త్రపోషణార్థమై పృథుచక్రవర్తికడ కరిగి యర్థముఁ గొనితెండు, వారలఁ బెంచిన పిమ్మట మన ముభయులము వానప్రస్థాశ్రమమున కరుగుట లగ్గు. తమకుఁ జెప్పుటకు నేనెంతదానను! ఐనను దమ యభీప్సితమే యొనరింతు" నని వాక్రుచ్చెను, అత్రిమహర్షియు నామె వాక్యములందలి ధర్మము నౌచిత్యము గ్రహించి ధనార్థియై పృథుచక్రవర్తి చేయుచున్న యశ్వమేధయాగమును జూడనేఁగెను.

అత్రిమహర్షి పృథుచక్రవర్తికడ కేఁగుట

అచటఁ బృథుచక్రవర్తి యాగాశ్వమును విడిచి తత్సంరక్షణమునకై పుత్త్రుని బంపుచు నత్రిమహర్షి నాతనికి సాహాయ్యము గమ్మని ప్రార్థించెను. అత్రిమహర్షి యంగీకరించి వెడలెను. పృథుచక్రవర్తి యాగవైభవమును జూడలేక యింద్రుఁడు పాషండవేషమునఁ దిరోహితుఁడై యాగాశ్వము నపహరించి యాకాశమున కేఁగెను. పృథువుత్త్రుఁ డత్రిసాహాయ్యమున వాని ననుసరించి దేవేంద్రునిపై బాణము వేయ సంశయించు చుండఁగా నత్రిమహర్షి యజ్ఞహంత నెంతవానినై నఁ జంపవచ్చునని యాతనికి బోధించెను. అంతఁ బృథుపుత్త్రుఁ డింద్రునిపై బాణము లేసి నొప్పింప నింద్రుఁ డశ్వమును విడిచి పాఱిపోయెను. అత్రీసహితుఁడై రాజకుమారుఁ డశ్వమును ద్రోలి తెచ్చుచుండఁగా నింద్రుఁడు మరల దాని నపహరించెను. ఈసారి పృథుపుత్త్రున కిది గోచరము కాలేదు. అత్రిమహర్షి దివ్యనేత్రములఁ జూచి యాతనికిఁ జెప్పఁగా నాతఁడు మరల నింద్రుని దరిమి యాగాశ్వమును గొని తెచ్చెను. అశ్వమేధయాగ మాపై నిర్విఘ్నముగాఁ బూర్తి కాఁగానే పృథుచక్రవర్తి బ్రాహ్మణుల కనేక దక్షిణ లిచ్చి సంతృప్తి పఱచుచుండెను. ఆసమయమున నత్రిమహర్షి పృథుచక్రవర్తి నింద్రుఁడనియుఁ జంద్రుఁ డనియు విధాత యనియుఁ గీర్తించెను. అటనున్న గౌతమమహర్షి యిది విని "యొక మానవమాత్రు నింతగా నేల నుతింతు" వని యాతని పైఁ గలుషించెను. అత్రియుఁ దన వాక్యముల దోషము లే దనెను. క్రమముగా నిరువురకు వాదము ప్రబలెను. నాఁటి సభాంగణమునఁ గల ఋషిపుంగవు లాధర్మనిర్ణయముఁ జేయఁ జాలకుండిరి. అంతఁ గాశ్యపమహర్షి లేచి సనత్కుమారుఁడు దక్కనన్యు లీసమస్యఁ దేల్ప లేరని వక్కాణించెను. అంత నాసదస్యు రందఱతో నత్రి గౌతములు సనత్కుమారుపాలి కేఁగి యా వాదమును దెలియఁబఱచిరి. సనత్కుమారుఁడు అత్రి వాక్యము లందు దోషము లేదనియు “నావిష్ణుః పృథీవీపతిః" అను భావమున నవి ధర్మయుక్తములే యని తీర్మానించెను. అంత సదస్యు లందఱును బృథుచక్రవర్తితో నీ నిర్ణయమును నివేదింప నాతఁ డత్రిమహర్షిని గీర్తించి యనేక ధనకనకవస్తు వాహనములిచ్చి సత్కరించెను. అత్రి మహర్షియు వానిని దీసికొని వెళ్ళి పుత్త్రులకుఁ బంచి యిచ్చి వారలు వయసు గన్నంతనే భార్యా సహితుఁడై ధర్మసంహిత బుద్ధితో వనమున కేఁగెను.[6]

అత్రిమహర్షి సూర్యచంద్రుల రక్షించి రాక్షసుల భస్మము చేయుట

ఒకప్పుడు దేవతలకు జంభాదిదైత్యులకు గొప్ప యుద్ధము సంభవించెను. అందు రాహునస్త్రసమితిచే సూర్యచంద్రులు సోలిపోఁగా వెలుఁగు నశించి లోకమంతయు నంధకారబంధుర మయ్యెను. అప్పుడు రాక్షసులు విజృంభించి దేవతల నొప్పింపఁదొడగిరి. దేవతలు భయార్తులై యత్రిమహర్షి కడ కరుదెంచి దమదుస్థ్సితిని సూర్యచంద్రుల పాటును జెప్పి తమ్ము రక్షింపవలె నని వేఁడుకొనిరి. అత్రిమహర్షియు వెంటనే వారి కభయమిచ్చి సూర్యచంద్రుల శరీరముల నక్షతము లగు నట్లు చేసివై చెను. పిమ్మట నాతఁడు తీక్ష్ణదృష్టిమాత్రముననే రాక్షసులెల్లరు మడియునట్లు చేసెను. అంత దేవతలెల్ల రత్రిమహర్షి కటాక్షమున బ్రతికితి మని యాతని నెంతయు శ్లాఘించి వెడలిరి. ఆహా ! మహర్షుల మహత్త్వము వర్ణనాతీతము గదా! జగద్ధితార్ధము దేవకార్యనిమి త్తము నత్రిమహర్షి యనంతములగు నిట్టిమాహాత్మ్యము లెన్ని టినో చూ పెను. [7]

అత్రిమహర్షి సీతారాముల కాతిథ్యమిచ్చుట

భరతుఁడు సపరివారుఁడై యరణ్యమున నున్న సీతారామలక్ష్మణులకడకు వచ్చి శ్రీరామునిపాదుకలు గొని నందిగ్రామమున కేఁగిన పిదప శ్రీరాముఁడు భార్యానుజులతో నత్రిమహర్షి యాశ్రమమున కేతెంచెను. అత్రిమహర్షి యు వారిని మిగుల మన్నించి యనసూయాదేవి మాహాత్మ్యము వారల కెఱిఁగించెను. సీతాదేవి యనసూయ వలనఁ ఇతివ్రతాధర్మములు విని యామెకుఁ దన వివాహవృత్తాంతమును దెల్పెను. ఆనసూయయు సీతకు నూతనాంబర ధూషణములతో శశ్వదలంకృతి యగు కుంకుమ నిచ్చి యాశీర్వదించెను. ఆ రాత్రి సీతారామలక్ష్మణు లత్రిమహర్షి యాశ్రమమునఁ గడిపి మఱునాఁ డుదయమున బయలు దేఱి యేఁగిరి.[8]

అత్రిమహర్షి యపరిగ్రహవ్రతపాలవము

అత్రిమహర్షి మొదటఁ గొంతకాలము కశ్యప విశ్వామిత్రాదులతోఁ గలిసి భూమిపైఁ జరించుచుఁ దపశ్చరణతరుఁడై యుండెను. కొంతకాలమున కొకమహాక్షామము సంభవించెను. ప్రతిగ్రహము చేయమని వ్రతము ధరించిన సప్తర్షులు నాఁకలి దీర్చుకొనుటకై యొక శవమును దినఁదొడగిరి. వృషాదర్భి యను రాజు వారికడ కేఁగి భోజనపదార్ధములఁ బంపెద ననెను. కాని వారు గ్రహింపమనిరి. రహస్యముగా నాతఁ డంపగా వా రంగీకరింపకుండిరి. కొంతకాలము వారు తామరతూండ్లు తిని బ్రతుకనెంచి యొకకొలనుఁ జొచ్చి కొన్ని బిషనాళములను బ్రోగుచేసి కట్టఁ గట్టి గట్టుపై బెట్టి సుస్నాతులై వచ్చుసరికి, దేవేంద్రుఁడు ప్రచ్ఛన్న వేషుఁడై యా తామరతూండ్లను దాఁచివేసెను. సప్తర్షులు నెవరు దాచినది తెలియక తామరతూండ్ల నపహరించినవానికిఁ గల్గుదోషముల నిర్వచింపఁ దొడఁగిరి. అంత నింద్రుఁడు వారి యపరిగ్రహమునకు వ్రతపాలసకుఁ దపఃప్రధాన జీవితమునకు మెచ్చి స్వస్వరూపియై మహర్షులతో నత్రిమహర్షిని స్వర్లోకమునకుఁ దీసికొనిపోయి యనేకవిధములఁ బూజించి కృతార్థుఁ డయ్యెను.[9]

"అత్రి సంహిత"

ఒకమాఱు ధర్మసంసక్తు లగుఋషు లత్రిమహర్షిని దర్శించి "మహాత్మా! నీవు విశ్వవిదుఁడవు. ఋషిశ్రేష్ఠుఁడవు. విశ్వహితోదయుఁడవు కావున, మా యందుఁ గటాక్షముంచి దైవములలో నుత్తమదైవ మెవరు? ఏది పరమధర్మము? ఏది పరమవిధి ? పరమేశ్వరు నర్చించువిధాస మేది? అను సంశయములను దీర్పు" మని వేఁడుకొనిరి. అత్రిమహర్షి చాల సంతసించి వారి నెల్లరఁ దగురీతి సమ్మానించి యిట్లు పలికెను. "ఋషులారా! సర్వదేవతలలోను , శ్రీమన్నారాయణుఁడే యుత్తమోత్తమదైవము,. ఈతఁడే పరంధాముఁడు, పరంజ్యోతి, సర్వకారణకారణుఁడును. ఉపవాస వ్రతదాన స్వాధ్యాయాదులచే నాతని నర్చించుటయే పరమధర్మము, పరమవిధి. ఇహాముత్ర సుఖముల కాతని నర్చించుట - అమూర్తార్చనము, సమూర్తార్చనమని - ద్వివిధము, అగ్న్యాహుతి యమూర్తార్చనమనియుఁ బతిమాద్యర్చనము సమూర్తార్చన మనియుఁ దెలియవలెను. వైఖానసమతము ననుసరించిన యర్చనమే యుత్తమము. సాయంప్రాతల యందు గృహమునఁ గాని దేవాలయమునఁ గాని ద్విజులు భక్తిభావముతో నగ్నిహోత్రాది హోమాంతముగాఁ బరమేశ్వరప్రతిమను బూజించుటే సమూర్తార్చనము. భృగుఁడు కాస్యపుఁడు, మరీచి. నేను దీని నభినందింతు" మని యత్రిమహర్షి యామూలాగ్రముగా నుపదేశించెను. ఇదియే 'యత్రిసంహిత' గా విఖ్యాతి గాంచినది.

ఇం దత్రిమహర్షి కర్మ, ప్రతిష్ఠ. పూజన, స్నపనోత్సవ ప్రాయశ్చితము లను విభాగముల క్రిందఁ దన విషయమును విభజించెను. ఇందు మొదటిభాగమున దేవాలయస్థల పరిశీలనము, దేవాయతన రూపము; దైవప్రతిమానిరూపణము మున్నగు విషయములును, రెండవభాగమునఁబ్రధాన పరివార దేవతాప్రతిష్టాదికము, మూఁడవభాగమునఁ బూజావిధానమును, నాల్గవభాగమున మహాభిషేకవివరణము, ఐదవభాగమున నుత్సవవిశేషములుఁ బ్రత్యేకోత్సవములుఁ దన్నిబంధనములును, నాఱవభాగమునఁ బూర్వోక్తవిధానములందలి దోషాదికమునకుఁ బ్రాయశ్చిత్తమును వివరింపఁ బడినవి. ఈ ప్రకార మత్రిమహర్షి దేవతార్చనావిధానమును లోకమునకుఁ జాటి పరమేశ్వరోపాసనమును దన్మూలమునఁ దరణోపాయమును మనకుఁ బ్రసాదించెను.

అత్రి స్మృతి

అత్రిస్మృతి లేక ఆత్రేయధర్మశాస్త్రమను పేర అత్రిమహర్షి ప్రోక్తమగు ధర్మశాస్త్రము కలదు. విప్రుఁడు శూద్ర స్త్రీని వివాహ మాడినచోఁ బతితుఁడే యగునని యత్రిమహర్షి పేర్కొన్నట్టు మనుస్మృతి (iii-16) లోఁ గలదు. ఈ ధర్మశాస్త్రమునఁ దొమ్మి దధ్యాయములు కలవు. దానధర్మములఁ గూర్చియు జపతపముల గూర్చియు రహస్య ప్రాయశ్చిత్తాదులను గుఱించియు, యోగము యోగాంగములు మున్నగు వానిని గుఱించియు నెన్నో విషయము లిందుఁ గలవు.

ఇది కాక అత్రి సంహితలు అత్రిస్మృతులను పేర నెన్ని యో స్మృతి గ్రంథములు కాన నగుచున్నవి. వీనిలో ప్రాయశ్చిత్తములు, దానములు, పితృ మేధము, ఆచారములును, గురుప్రశంస. చాతుర్వర్ణ ధర్మములు, జపమాలాపవిత్రత, బ్రాహ్మణుల కుండవలసిన శౌచాన సూయాది సుగుణములు, ఇష్టా పూ ర్త నిర్వచనము, యమనియమములు, పుత్త్రులు, దత్తపుత్త్రులు, ప్రాయశ్చిత్తములు, అశౌచము. చాంద్రాయణకృచ్ఛ శాంతపనములు, మున్నగు విషయములు కలవు.

దత్తపుత్త్ర స్వీకృతి విషయమున అత్రి యనుశాసనమే మొట్టమొదటి దని దత్తకమీమాంసలోఁ గలదు. అత్రి ననుసరించి యంత్యుజు లేడు జాతుల వారు. రజకులు, పొదరక్షలు తయారుచేయువారు, నటకులు, బురుదులు, కైవర్తకులు (పల్లెవారు), మేదరులు, ఖిల్లులు, కాని, యాత్రా వివాహయజ్ఞదులలోఁ దాఁకఁదగినవారు తాఁక రానివారు ననువిషయమునఁ బట్టింపు లేదు మఱియు, లఘ్వత్రి వ్మృతి, వృద్దాత్రేయస్మృతి యని రెండుస్మృతులు అత్రిమహర్షి పేరఁ గాననగుచున్నవి.


  1. భాగవతము.
  2. మార్కండేయపురాణము.
  3. భాగవతము - తృతీయస్కంధము.
  4. భాగవతము - మార్కండేయపురాణము.
  5. మార్కండేయపురాణము
  6. భారతారణ్యపర్వము.
  7. బ్రహ్మాండపురాణము.
  8. రామాయణము.
  9. భారతము - అనుశాసనిక పర్వము.