మహర్షుల చరిత్రలు (మొదటి భాగము)/అగస్త్య మహర్షి
మహర్షుల చరిత్రలు
అగస్త్య మహర్షి
శ్రీమంత మగు భరతఖండము పుణ్యతపోనిలయము. కావుననే పరమ పవిత్రము. ఇందు జన్మించి తపో మహిమచే సృష్టి స్థితి లయకారులైన వారే మహర్షులు. వీరు విశ్వ సంరక్షణమునకై త్రిమూర్తుల కృత్యములు నిర్వహింప సమర్ధులగుటేకాక త్రిమూర్తులకు నార్తిసమయముల నుద్దారకులు సంరక్షకులు నైన పరాత్పరులు. ఇట్టి మహామహులఁ గని యుండుటచేతనే భారతవర్ష మార్ష భారతమనియు నార్యా వర్తమనియు విఖ్యాతి గడించెను.
ఇట్టి పరమపవిత్రవర్తనులు బ్రహ్మవిద్యానవద్యులు పరమేశ్వర కల్పులు నగు భారత బ్రహ్మర్షులలో నగస్త్యమహర్షి యగ్రేసరుఁడు. ఈతఁడు వసిష్ఠమహర్షికి సహజన్ముఁడు. త్రికాల వేది. భక్తిజ్ఞానయోగవిరాగనిధి, గృహస్థరత్నము. ఈ పరమ పురుషుని జన్మకథ కడుఁ జిత్రమైనది. మహాపురుషులయు, మహానదులయు జన్మగాథలు చిత్రాతిచిత్రములే కదా!
అగస్త్యుని జన్మకథ
తొల్లి మహేంద్రుఁడు దేవతలను బాధించు తారకాదులగు రాక్షసులను జంపవలసినదని అగ్నికి వాయుదేవునకు నాజ్ఞాపించెను. వాయువు సాయమున అగ్ని రాక్షసుల నెల్లరి నిశ్శేషముగా నాశనము చేయుచుండెను. అంత, వారు భయపడి సముద్రముఁ జొచ్చిరి. వారి బాధ తొలఁగినదికదా యని అగ్ని వాయువులు ఉపేక్షభావమున నుండిరి. కాని, కొంతకాలమైన పిదప రాక్షసులు రాత్రి సమయములందు వచ్చి దేవతలను, మునులను, మానవులను నానావిధముల బాధించి పోయి పగటివేళల సముద్రములో దాఁగికొనుచుండిరి. ఇట్లు పండ్రెండువేల సంవత్సరములు రాక్షసులు ప్రవర్తించి పెక్కండ్ర నుక్కడించిరి. దాన లోకోపద్రవ మేర్పడెను.
మహేంద్రుఁడు మండిపడి అగ్నివాయువులఁ బిలిపించి “అగ్నిహోత్రా! వాయుదేవా! తారాకాది రాక్షసులను జంపుఁడని మీకు నేను విధించితిని. మీరు వారిని జంపక విడుచుటవలన లోకమున కింతకీడు మూడినది. గతజల సేతుబంధసము వలదు. ఇప్పుడైన మీరు సముద్రు నింకించి యందు దాఁగియున్న యా రాక్షసులను, భస్మము చేయుఁ” డని యాజ్ఞాపించెను.
అందులకు వారు “దేవేంద్రా! సముద్రము నెండఁబెట్టుటవలన, అందు జీవించు అనంతమైన జీవరాశి నశించును. అది మహాదోషము. కావున రాక్షస నాశనమునకు మఱియొక యుపాయ మూహింపు”మని కోరిరి. ఇంద్రుఁ డందులకు వారిపైఁ గోపించి “ఏమేమి? నాయాజ్ఞ ధిక్కరించి మేర మీరుదురా? కానిండు. దానికి ఫలిత మనుభవింపుఁడు. మీ రిరువురు భూమిపై నొక యచేతన పదార్థమునుండి మునులై పుట్టుఁ” డని శపించెను,
ఆ పిమ్మట విష్ణుమూర్తి ధర్ముని సుతులగు నరనారాయణుల యవతారమెత్తి గంధమాదన పర్వతమున నుగ్రతప మొనరించు చుండెను. ఆ నరనారాయణుల అపూర్వ తపో వైభవమున కసూయపడి యింద్రుఁడు తత్తపోవిఘ్నముఁ గలిగింపుఁ డని మన్మథవసంతుల కాజ్ఞాపించెను. మహేంద్రునాజ్ఞ నౌదలధరించి వారిరువురు ఎక్కు రప్సరసలను దీసికొని వెళ్ళి తమ కళానైపుణ్యముఁ బ్రకటించి నరనారాయణులనుఁ దపోభంగ మొనరించిరి. అంత నారాయణుఁ డెంతయు నచ్చెరువు గొలుపునట్లు తనతొడనుండి యొక జగన్మోహినిని బుట్టించెను. నారాయణుని యూరువునుండి పుట్టుటచే ఆమెకు "ఊర్వశి" అను పేరు కలిగెను.
ఆ యూర్వశిని జూడఁగనే సూర్యున కామె పైఁ గోరికకలిగెను. తనతో సుఖింప నాతఁ డామెను దనలోకమునకు రమ్మనెను. ఆమె వల్లెయనీ యాతని లోకమునకుఁ బోవుచుండ దారిలో వరుణ దేవుఁ డామెను జూచి మోహించి “తరుణీ ! నీ మీఁద నా మానసమునిలిచినది. నీవు నా లోకమునకు వచ్చి నాతో సుఖింపు" మని కోరెను. అందులకామె "దేవా! నన్నిదివఱకే సూర్యదేవుఁడు కామించి తన లోకమునకు రమ్మని కోరెను. అతని కోరిక దీర్చుటకై నే నేగుచుంటి" నని సమాధానము చెప్పెను.
వరుణుఁడది విని "కాంతా ! నీస్వాంతము నాపై నిలిపి పొమ్ము నా కదియే పదివే" లనెను. అందుల కామే యంగీకరించి మనసున వరుణుని స్మరించుచు సూర్యునికడ కేఁగెను. ఆతఁడామె భావమును గ్రహించి “ఓసీ ! ఒక పురుషుని మనమునఁ దలపోయుచు నింకొకపురుషుని గనగూడ వచ్చితివా? ఇంతకన్నా స్త్రీ, చేయఁగల యధికాపరాధము లేదు. ఈ దోషమునకు నీవు భూలోకమున బుధ పుత్రుఁడగు పురూరవునకుఁ బత్నివిగా జనింపుము. పొ"మ్మని శపించెను. ఆ శాపమువాతఁ బడి యామె వెడలిపోయెను.
కాని, మిత్రావరుణులకుఁ గామోపశమనము కాదయ్యెను. అమోఘవీర్యులగు మహనీయులకు వీర్యపతనము కానుండెను. 'ఇదియేమి! ఆశ్చర్య' మని వారాలోచింపఁగా మహేంద్రుఁడు అగ్ని వాయువులు కిచ్చిన శావము, అగ్ని సూర్యుని, వాయువు వరణుని బ్రవేశించి మునిజన్మ మందఁగోరుట, వారికిఁ దేట తెల్లమయ్యెను. అది గ్రహించి వారు స్ఖలనము : గోరు తమ వీర్యములను స్తంభింపఁజేయ నిచ్చగింపక లోక సంరక్షణార్ధ మొకజలపూర్ణ కలశముస విడిచి యథేచ్చముగా వెడలిపోయిరి. కాలక్రమమున ఆ జలకలశమునుండి అద్భుత తేజస్వులై బ్రహ్మవర్చస ముట్టిపడ అగస్త్యుఁడు, వసిష్ఠుఁడు నుద్భవించిరి.
ఈ కారణముచేతనే వీరిరువురకును 'కలశజు' లని, 'కుంభ సంభవు' లని, 'ఔర్వ శేయు' లని, 'మిత్త్రావరుణపుత్రు' లని, 'వహ్ని మారుతసంభవు' లని పేరు వచ్చెను.[1]
అగస్త్యుని బాల్యము
ఈ రీతి జన్మించిన యగస్త్యుఁడు క్రమముగా శుక్లపక్ష చంద్రుని వలె దేదీప్యమానుఁడగుచుండెను. అతఁడు బాల్యము నుండియు మహానిష్ఠాగరిష్ఠుఁడై బ్రహ్మచర్యము చేయుచు నిరుపమాన తపస్సంపదచే విరాజిల్లఁ జొచ్చెను. బాల్యముననే యాతని కుపనయనాది సంస్కారములను, బ్రణవ పంచాక్షరీ మంత్రోపదేశమును దేవతలే యొనరించిరి. ఆతఁడు పిదప నిష్ఠాతిశయమున బ్రహ్మచర్యపాలనము నుగ్రతపస్సు చేయుచుండెను. అందు నిరాహారుఁడు, నిర్జితేంద్రియుఁడు, నిర్దూత కల్మషుఁడునై నానాఁటి కాతఁడు దివ్యతేజస్వి యయ్యెను.
అగస్త్యునికిఁ బితృదేవతల యాదేశము
ఇట్లుండ నొకనాఁ డరణ్యములో సంచరించుచు నొక సల్లకీ వృక్షశాఖ నధోముఖులై వ్రేలుచున్న కొందఱు మునీశ్వరులంజూచి యగస్త్యుఁడు "మహాత్ములారా! ఇపుడు మీరీ దురవస్థలో నుండుటకుఁ గారణమేమి? ఇంతకూ మీ రెవరో యానతిం" డని వేఁడుకొనెను. అంత వారు విస్పష్టముగా “నాయనా! మే మన్యులము గాము పితృగణ దేవతలము. నీవు పుత్త్రులను బౌత్త్రులను గాంచి తప్పక మా కూర్ధ్వ లోకముల నొసంగఁజాలుదువని చిరకాలము నుండి కొండంత యాశతో నున్నాము. కాని, నీవట్లు చేయక బ్రహ్మ చర్యాశ్రమముననే యుండుట మా కీ భరింపరాని వేదనకు. నిట్టి దుస్థితికిని గారణమైనది. కావున నీవు మా కోరికఁ జెల్లించి యూర్ధ్వ లోకములఁ బ్రసాదంపవే"యని వేఁడుకొనిరి. ఈ మాటలు విన్న యగస్త్యుఁడును ధన పితరుల దుస్థ్సితికి జాలిగొని “మహాత్ములారా! పితృదేవతలారా! మీ కోరిక సిద్ధింపఁ జేసెదను. నమ్ముఁడు. కులమున నెప్పటికైన నొక యుత్తముఁడు జనించి యూర్ధ్వలోక గతు లొసంగు నని యెదురుచూచు పితరుల ఋణముఁ దీర్పని యా వంశజుని జన్మమేల? కాల్పనా? కావున, మీపం పొన ర్చెద" నని యగస్త్యుఁడు వారి యాశీస్సులఁ గొని యాశ్రమమున కేఁగెను.
అగస్త్యుని వివాహము
పితృ దేవతల యాదేశము శిరసావహింపఁ దీవ్రముగఁ గోరిన యగస్త్యుఁడు తన తపశ్శక్తిచేఁ బుత్త్రకాముఁ డగు విదర్భ రాజునకు జక్కని చుక్కయగు నొక కూఁతురు కలుగునట్లు వరమిచ్చెను. ఈ వరమున విదర్భరాజునకుఁ గూఁతురు కలిగెను.
ఆమె లోపాముద్ర యను నామముసఁ దలిదండ్రుల గారాపు బిడ్డయై జలమున విలసిల్లు నలినివలె, వినీతునం దొప్పు లక్ష్మినిఁ బోలి, యుద్యుక్తునం దొప్పు విద్యరీతి దినదిన ప్రవర్ధమానయై రూప గుణ సౌజన్యముల నప్రతిమానముగా ననురూప కన్య కాశతమున నొప్పు చుండ నొక నాఁ డగస్త్యమహర్షి విదర్భరాజుకడ కేతెంచెను. ఉచిత మర్యాదల నందిన పిదప లోపాముద్రను దనకిచ్చి వివాహము చేయుమని యగస్త్యుఁడాతని నడిగెను. అందుల కయ్యో!
నారలు గట్టి కూర లశనంబుగ నుగ్రవనంబులోఁ దపో
భారమువం గృశుండయిన బ్రాహ్మణుఁడీ లలితాంగిఁ బెండ్లియై
నారలుగట్టి కూర లశనంబుగ నుగ్రవసంబులోఁ దపో
భారము దాల్చియుండుమవి పంపక మిన్నకయుండ నేర్చునే?
ఎఱిఁగి యెఱిఁగి దీని నెట్లీఁగ నగు భోగ
యోగ్యయైనయది పయోజనేత్ర
యీనినాఁడు శాపమిచ్చుఁగా కీముని
యేల సైఁచు నింక నెట్టు లొక్కొ?"
(భార. ఆర. 2. 726, 727 )
యని విదర్భనరేంద్రుఁడు సంశయ భీతచిత్తుఁడై యుండఁగా లోపాముద్ర వచ్చి యా మునివరుని వివాహమగుటయే తన యభీప్సితమని తెలిపెను. అందులకు విదర్భధారుణీపతి యెంతయు సంతసిల్లి విధ్యుక్తముగా లోపాముద్రాగస్త్య మహర్షుల వివాహ మతి వైభవముతో జరపెను. ఈ వివాహప్రదేశము నాఁటినుండి “ సిద్దతీర్థ " మనుపేర మహాతీర్థ ప్రదేశముగా లోకప్రసిద్ధి గాంచెను. పిమ్మట నగస్త్యుఁడు లోపాముద్రను వల్కలాజిన ధారిణిఁజేసి తోడ్కొనిపోయి గంగా ద్వారమున నొక్క యాశ్రమమును నిర్మించుకొని గార్హస్థ్య ధర్మములు నిర్వర్తించుచుఁ దపోవృత్తి నుండెను.
ఆజన్మసిద్ధులై యావిర్భవించియు మన మహర్షులు లోక సంగ్రహమునకును సాధుసజ్జనుల కనువర్తన సాధనములగు నాదర్శ జీవితమును జూపుటకును యధావిధిగా బ్రహ్మచర్యాద్యాశ్రమములు నిర్వర్తించుచునే నిరంతర దైవచింతనమున నెగడెడివారు. అట్లే యగస్త్యుఁడు విశ్వశ్రేయమునకే వివాహమాడి కాలక్రమమున సహధర్మచారిణి సతీతిలకమునగు లోపాముద్రయందుఁ బుత్రులం బడసి పితరుల ఋణమును దీర్చి దన ధర్మమును నిర్వర్తింపఁ దలఁచెను.
ఈ కారణమున నొకనాఁ డగస్త్యుఁడు లోపాముద్రా సంగమ మపేక్షింప నామె తనకు సమస్తాభరణములు, సున్నిత . వస్త్రములు కావలయునని యాతనిఁ గోరెను. అగస్త్యుఁ డాపనికై తపోధనమును వ్వయింప నొల్లక శ్రుతర్వుఁడను రాజు కడకేఁగి యాతనికి సరిపోఁగా నేమేని ధనమున్నఁ దనకిమ్మని కోరెను. ఆతనికడ నాతనికి సరిపోవు ధనమే యుండుటచే నిరువురును గలిసి బ్రధ్నశ్వుని కడ కేఁగి యర్థించిరి. అతనికడ నాతనికి సరిపడు ధనమే యుండుటచే మువ్వురును గలిసి త్రసదస్యుఁడసు రాజుకడకరుదెంచి యర్థించిరి. అతఁడు నట్టి స్థితియందే యుండ నల్వురుఁగలసి యిల్వలుఁడను రాక్షసునికడ కేతెంచిరి.
వాతాసీల్వల మర్దనము
మణిమతీపురాధిపతి యగు నిల్వలుఁడు విఖ్యాతబలుఁడు ఆతని తమ్ముఁడు నానాపి కామరూపి. ఒకనాఁ డిల్వలుఁ డుత్తమ బ్రాహ్మణు నొకనిఁ దనకు సకలకామ సిద్దికర మగు మంత్ర ముపదేశింపుమని కోరి విఫలుఁడై తన తమ్ముని మేఁకను జేసి వధించి యా మాంస మాబ్రాహ్మణునకు భోజనమునఁ బెట్టి భోజనానంతరము తమ్మునిఁ బిలిచెను. వాతాపి యా బ్రాహ్మణుని కడుపు వ్రచ్చి బయటకు వచ్చెను. ఆ ద్విజుఁడు వెంటనే మరణించెను. ఈ రీతి నదిమొదలు తనకడ కతిథులుగా వచ్చు బ్రాహ్మణులఁ జంపుట యిల్వలునకుఁ బరిపాటి యాయెను,
నాఁ డగస్త్యుఁ డామువ్వురు రాజులతో నిల్వలున కతిథి యాయెను. యథాపూర్వముగా నిల్వలుఁడు వాతాపిని మేఁకను జేసి చంపి వండి యం మాంసము, సగస్త్యునకుఁ బెట్టించెను. ఆ మువ్వురు రాజులు నీవిషయ మగస్త్యునకుఁ జెప్పినను వినక యాతఁడు వాఁడు కంఠముదాఁక భుజించెసు. ఇల్వలుఁడును దానెప్పటియట్లే తమ్ముని బిల్చు టెఱింగి యగస్త్యుఁడును " జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణ " మ్మని కడుపుఁ దడవికొనుచు గఱ్ఱని త్రేన్చిన వాతాపి జీర్ణమైపోయెను. ఇల్వలుఁడు నాశ్చర్యమంది కుక్కివ పేనువలె మాఱాడక వచ్చినపని యడిగి యారాజుల కపరిమిత ధనమును బసిఁడియు నిచ్చి యగస్త్యునకు .............................................................................................................. ఇరువదివేల పాడియావులు, ఇరువదివేల గద్దెల బంగారము నిచ్చెను. అగస్త్యుడు ఆ ధనసంపదలతో రాజులతో నిండిన రథమును గుఱ్ఱములు తాల్చి తనయాశ్రమమునకుఁ దత్క్షణమే బోయి చేరెను. రాజర్షు లగస్త్యుని వీడ్కొని చనిరి.
వాతాపి నట్లును బ్రాహ్మణ హంతయగు నిల్వలుని దరువాతను నగస్త్యుఁడు రూపుమాపి 'వాతాపీల్వలమర్దనుఁ' డను నామమును ధరించెను. అగస్త్యుఁ డా ధనముతో లోపాముద్ర కోరిన సమస్తాభరణములు నొసఁగి యనేక రమ్యవస్త్రములిచ్చి పిమ్మట బదుగురఁ బోలుసుతులు నూర్వురు కావలెనా? సూర్వురఁ బోలు సుతులు పదిమంది కావలెనా? లేక వేవురకు సరిపడు నొక్క కుమారుఁడు కావలెనా? యని యాదరముతో భార్య నడిగెను. ఆమె వేవురఁ బోలెడునాని నొక్కనిఁ గోరికొనెను. ఆమెకోరిక యనుగ్రహించి యగస్త్యుఁడు తపోవ్రతమున నుండెను. పిమ్మట లోపాముద్ర గర్భవతి కాఁగాఁ గాలక్రమమున నామెకు ననవద్యుఁడగు దృఢస్యుఁడను కుమారుఁ డుదయించెను. దృఢస్యుఁడు పెరిగి పెద్దవాఁడైన పిదప నాతనికి దేజస్వి యను కుమారుఁడు పుట్టెను. ఈ ప్రకార మగస్త్యుఁడు పుత్రపౌత్ర వంతుఁడై పితరులకుఁ బుణ్యలోక గతుల నొసగూర్చెను. [2]
అగస్త్యుఁడు కవేరకన్యను వివాహమాడుట
తొల్లియొకనాఁడు బ్రహ్మదేవుఁడగస్త్యాశ్రమమున కేతెంచెను. అగస్త్యుఁడు శ్రద్ధాభక్తులతో విరించి కర్ఘ్యపాద్యాదు లొసంగి సుఖాసీనుఁజేసి “చతురాననా! మహా తపః ప్రభావముననైన నలభ్య దర్శనుఁడ వగునీవు నాయింటి కేతెంచుట నాయదృష్టము. మహాత్ము లూరక రారుగదా ! ఇట్లు నీవు నా పైఁ గటాక్షము చూపి నందులకు సదా కృతజ్ఞుఁడను. ఏమి యానతి! " యని వినయవిధే యతలతో బ్రహ్మనడిగెను. సృష్టికర్త "మహనీయ తపోనిధీ! నీవంటి యుత్తమ మహర్షుల మూలముననే కదా విశ్వస్థితి సాధ్యమైనది! మహర్షి కల్పులనపరతము మాకుఁ బూజ్యులు స్మరణీయులుఁ గదా! ఇఁక నాపచ్చినపని యొకటి కలదు. పూర్వ మొకప్పుడు కవేరుఁడను రాజర్షి పరమశివునిఁగూర్చి మహాతపస్సు చేయఁగా నాతఁడు పత్యక్షమై కవేరునికోరిక యడిగెను. కవేరుఁడు భయభక్తి తాత్పర్యములతోఁ దనకు ముక్తినిమ్మనికోరెను. ఈశ్వరుఁ డాలోచించి యాపని విరించి సిద్దింపఁ జేయును గాన నాతనిఁగూర్చి తపింపుమని చెప్పి వెడలిపోయెను. కవేరుఁ డానందముతో నన్నుగుఱించి ఘోర తపస్సు చేయఁగా నేనుబ్రత్యక్షమై యాతని వాంఛా సంసిద్దికి నా కుమారియగు విష్ణుమాయ యాతనికిఁ గూఁతురై జన్మించునని చెప్పిపోతిని. తరువాతఁ గవేరునకుఁ బుత్త్రిక జన్మించినది. ఆమె యిపుడు తండ్రికి ముక్తినొసఁగుటకై యుగ్రతపస్సు చేయుచున్నది. ఆమె యొక యంశ మే నీ భార్యయగు లోపాముద్రగాఁ దొల్లి నేను సృష్టించితిని. లోపాముద్రను నీవు వివాహమాడితివి, ఈ కవేరకన్యను సైతము నీవు వివాహమాడవలయును. దానివలన నీకు నామెకును శ్రేయమగు" నని వేఁడుకొనెను. అగస్త్యుఁడు "చతుర్ముఖా ! నీవింతగాఁ జెప్ప వలయునా? నీ యాజ్ఞ నా కవశ్యానుష్టేయము కదా!" యని విరించిని బంపివైచి యగస్త్యుఁడు. కవేర కన్యాన్వేషణమునకై బయలుదేఱెను.
తపః కార్శ్యముచే దివ్యసుందరముగ నొప్పు కవేరకన్య నగస్త్యుఁడు సమీపింప నామె యగస్త్యుని పాదారవిందములపైఁ బడి, “మహాత్మా! త్రిలోకపూజ్యులగు తమ దివ్యదర్శనమునఁ బునీతనై తిని. తమ కృపాకటాక్షములఁ బఱిపి నాయాతిథ్య మంగీకరించి ననుఁ గృతార్థను జేయవే ! "యని వేఁడుకొనియెను. అగస్త్యుడు “తరుణీమణి1 నే నేతత్కార్యార్ధమే నిను వలచి వచ్చియున్నాను. కాన నన్నుఁ బరిణయమాడు” మని యడిగెను. కవేరకన్య "తేజోనిధీ! నాకంతటి భాగ్యమే కలిగినఁ గావలసినదేమి? ఇంతకును దాము లోపాముద్రా పరిపూర్ణ పార్శ్వులుగదా? ఇక నా కెటఁ దావున్నది? అదియునుగాక నే ననతికాలముననే నదినై పోవుచున్నాను. నావలన దమకెట్టిసుఖము గల్గు?" నని యడిగెను. ఆగస్త్యుఁడు “ కాంతామణీ ! లోపాముద్ర నీ యంశముచేతనే జనించినది. కావున నందు సంశయింపఁ బనిలేదు. ఇఁక నీవు నదివై నను నీ పత్నీత్వము నాకాంక్షితమే " యని బదులు చెప్పెను. కవేరతనయ యనుమతించి యగస్త్యుని వివాహమైన వెంటనే నది యయ్యెను. అగస్త్యుఁ డామెను దన మండలువుస నుంచుకొనెను. ఈ కవేరతనయయే తరువాతఁ గొంత కాలమునకు వింధ్యగర్వాపహరణార్ధ మగస్త్యుఁడు పోవుచుఁ దన కమండలువును శిష్యులఁ గొని తెమ్మని చెప్పి పోఁగా సహ్యపర్వత సమీపమున నగస్త్యుఁడు లేకుండుటఁ జూచి తనకార్యము జ్ఞప్తికి రాఁగా నామె నదియై నేలపైఁబడి ప్రవహించి పోయెను. ఈ నదియే కావేరీనది. ఈ నదియందు స్నానము చేయుటతోడనే కవేరరాజర్షి సద్యోముక్తి నందెను.[3]
ఆగస్త్యుఁడు సముద్రోదకము నాపోశనించుట
కృతయుగమున నొకప్పుడు వృత్రుఁడను రాక్షసుఁడు కాలకేయాదులతోఁ గలసి యింద్రుని జయించి వేల్పుల బాధించుచుండఁగా వారు బ్రహ్మకడ కేఁగి మొఱవెట్టుకొనిరి. బ్రహ్మవారితో దధీచికడ కేఁగి యాతని యస్థులఁగొని వృత్రు నింద్రుఁడు జయించునని తెల్పఁగా సరస్వతీతీరమున కరిగి వారు దధీచిని బ్రార్దించిరి. దధీచి దేవహితార్ధమై ప్రాణములు విడువఁగా నాతని యస్థులను దేవత లాయుధములుగా గ్రహించిరి. త్వష్ట యిచ్చిన వజ్రాయుధముచే నింద్రుఁడు వృత్రుని జంపెను కాని, కాలకేయగణములు పగలెల్ల సముద్రములో దాఁగి యుక్తులై ధర్మచరితులైన ఋషులఁ జంపినఁగాని జగమున కషాయము వాటిల్ల దని కాలకేయాదులు వశిష్ఠాశ్రమమున నూటతొంబది యేడ్గురను, చ్యవనాశ్రమమున నూర్వురను, భరద్వాజాశ్రమమున నిరువదుండ్రను బ్రహ్మనిధుల భక్షించిరి. ఇట్లుపద్రవముఁ గొని తెచ్చు కాలకేయుల నెట్లు వధించుటో తెలియక యింద్రయమాగ్ని వరుణ కుబేరాదు లెల్లరును విష్ణుమూర్తిని బ్రార్థించిరి, విష్ణుమూర్తి వారి మొఱలాలించి యగస్త్యమహర్షి యాసముద్ర జలములఁ దానము చేయఁగలఁడనియు నపుడు రాక్షసులు బయలుపడఁగా వారిని జంపుఁడనియుఁ జెప్పి పంపివేసెను. వెంటనే యమరు లగస్త్యుపాలికేఁగి స్తుతించి తమ పచ్చినసని నెఱఁగించిరి. అగస్త్యుఁడును దేవ హితార్థమై యమరగణముఁ గూడి మహర్షి యక్షగణములు: తన్ననుసరింప వచ్చి సముద్రము నొక్కసారిగా నాపోళనించెను. త్రిజగజ్జను లచ్చెరువందిరి. దేవయక్షగణము లభినందించెను అంతఁ గాలకేయగణములు బయలుపడఁగానే దేవతలు విజృంభించి యసురుల నిశ్శేషముచేసి "పీత సముద్రుఁ"డని యగస్త్యు నెంతయుఁ గీర్తించిరి పిదప వారాతనిని
"మునివాథ! నీ యనుగ్రహ
మున విగ్రహ ముడిగె నఖిల భువనంబుల కి
వ్వనధిఁ బయ:పూర్ణముగా
నొనరింపుము నీవ కాని యొరు లోప రిలన్"
ఇది యనేక జంతువుల కాశ్రయము. కాన, రిక్తమై యుండరాదు. తిరిగి పూరింపు మని వేడుకొనిరి. కాని, అగస్త్యుడు " "దేవతలారా! ఈ సముద్రజల మంతయు నా కిదివఱకే జీర్ణమయి పోయినది. [4]నే నిపుడు మూత్రద్వారమునుండి పూరంపఁగల"నని యట్లు చేసెను. ఈ కారణముననే నాఁటి నుండి సముద్రజల ముప్పన యయ్యెను ; పర్వదినములఁదక్క స్నానపానాదుల కనర్హమయ్యెను.
అగస్త్యుఁడు శ్రీరాముని కుపకరించుట
అగస్త్యుఁ డాపిమ్మట ఘోరతపో నియమమును బాటింప దండకావన మధ్యమున నొకయాశ్రమము నిర్మించుకొని యందుండెను. ఆ సమయముననే శ్రీరామచంద్రుఁ డరణ్యవాసముచేయుచు శరభంగుఁడు. మందకర్ణి మున్నగు మహర్షులను దర్శించి సీతాలక్ష్మణ సమేతుఁడై వారిచేఁ బూజింపఁబడి సుతీక్ష్ణమునీశ్వరు నాశ్రమమున కేఁగెను. అచటఁ గొంతగాలముండి తరువాత శ్రీరాముఁ డగస్త్యాశ్రమమునకు సతీసహోదరులతో నేతెంచెను. అగస్త్యమహర్షి శ్రీరామ లక్ష్మణులఁ గౌఁగిట జేర్చి మూర్ధాఘ్రాణ మొనరించి యాశీర్వదించి, పురోభాగమున నున్న సీతామహాసాధ్వి నభినందించి మువ్వురకు నతిథి సత్కారములఁ జేసి యానందించెను. అప్పటి కగస్త్యుఁడు వానప్రస్థాశ్రమమున నుండుటచేఁ దదుచితముగా శ్రీరామాదులఁ బూజించి శ్రీరామునకు దివ్యమైన ఖడ్గయుగ్మము, వైష్ణవమైన విల్లు, అమోఘబాణములు, అక్షయమైన అమ్ములపొది, ఇచ్చి గౌతమీతీరమునఁ గల పంచవటి యం దాశ్రమము నిర్మించుకొనియుండుట శ్రేయస్కరమని సూచించెను. సీతాలక్ష్మణ సహితుఁడగు శ్రీరాముఁ డగస్త్యు ననేక వందనములతో స్తుతించి ముందునకుఁ బయనమైపోయెను
తరువాతఁ గొంతకాలమునకు శ్రీరామరావణుల ఘోరయుద్ధకాలమున రాముఁడు రావణ తీవ్రబాణములచే ముంపఁబడి భావికర్తవ్యము మఱచి యున్న తరుణమున నగస్త్యుఁడు శ్రీరాముని సన్నిధికేతెంచి శ్రీరాముఁడు విష్ణుమూర్తియగుట జ్ఞప్తికిఁదెచ్చి యాతని యనంతప్రభావమును గీర్తించెను. పిమ్మట శ్రీరామునకు నిఖిల జయప్రదమును నిఖిలైశ్వర్య మంగళ సౌఖ్యావహమును సకల దురితదూరీకరణచణమునగు నాదిత్యహృదయ మను పుణ్యమహాత్మ్యవమును సాదరముగా నుపదేశించి శ్రీరామున కుత్సాహము విజృంభింప జేసెను.
ఆదిత్యహృదయము
“రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్|
పూజయన్వ నివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ||
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతు గభస్తిభిః !!
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్స్కందః ప్రజాపతి! |
మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః .
పితరో వసవస్సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్ని: ప్రజాప్రాణా ఋతుకర్తా ప్రభాకరః, ||
ఆదిత్య స్సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ |
సువర్ణ సదృశో భామః హిరణ్య రేతా దివాకరః ||
హరిదశ్వ స్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమౌన్ |
తిమిరోన్మథనశ్శంభుః త్వష్టా మార్తాండ అంశుమాన్ ||
హిరణ్యగర్భ శ్శిశిరః తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భోదితేః పుత్త్రః శంఖః శిశిరనాశనః ||
వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్య జుస్సామపారగః|
ఘనవృష్టి రపాం మిత్రో వింధ్యవీథీప్లవంగమః ||
ఆతపీ మండలీ మృత్యు : పింగళస్సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజా రక్తస్పర్వభవోద్భవః ||
నక్షత్ర గ్రహతారణా మధిపో విశ్వభావః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమో౽స్తుతే||
నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ||
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమోనమః |
నమో వమస్సహస్రాంశో ఆదిత్యాయ నమోనమః ||
సమఉగ్రాయ వీరాయ సారంగాయ నమోనమః |
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమోనమః ||
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే|
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః ||
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామి తాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాంపతయే నమః ||
తప్త చామీక లాభాయ వహ్నయే విశ్వకర్మణే |
నమః తమోభి విఘ్నాయ రుచయే లోకసాక్షిణే ||
నాశయత్యేషవై భూతం త దేవ సృజతి ప్రభుః |
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః it
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః |
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ ||
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవచ |
యానికృత్యాని లోకేషు సర్వఏష రవిః ప్రభుః " ||
ఈ ఆదిత్యహృదయ పారాయణముచే శ్రీరాముఁ డచిర కాలముననే శత్రునిర్మూలనమున విజయలక్ష్మి నందఁగల్గెను.
శ్రీరాముఁడు - రావణుని జయించిన పిమ్మట సయోధ్యాపురమునఁ బట్టాభిషిక్తుఁ డైనతఱిఁ గణ్వాది మహర్షులతోనగస్త్య మహర్షియు శ్రీరాముని జూడ నేఁగి యాతని సంస్తుతించిన, శ్రీరాముఁడు రావణాదుల జనన విజయాది వృత్తాంతముల నడుగఁగా నగస్త్యుం డాతని కెల్ల వినిపించెను. మఱియొకప్పుడు సీతాదేవి వాల్మీక్యాశ్రమమునఁ గుశలవులఁ గన్న పిదపఁ బుష్పకవిమానారూఢుఁ డై పోవుచు శ్రీరాముఁడగస్త్యాశ్రమమున కేతెంచెను. ఆగస్త్యమహర్షి తాను జేయు -లు ని చున్న యాగమును బూర్తిజేసి శ్రీరాముని బూజించి యొక విచిత్ర రత్నమయనవ్యవిభూషణము నొసఁగఁగా శ్రీ రాముఁడది యెట్లువచ్చె ననియు దానిని దానుగ్రహింపవచ్చునా యనియు నగస్త్యు నడిగెను. అగస్త్యుఁడు శ్వేతుఁడనురాజర్షి వృత్తాంతముఁ జెప్పి యాతఁడే యా భూషణమును దన కిచ్చెననియు నృపాలున కెవ్వరేమిచ్చినను గై కొనవచ్చు ననియుఁ జెప్పెను. శ్రీరాముఁడానందముతో దానిం గై కొని ధరించి దండకారణ్యవృత్తాంతము నగస్త్యునివల్ల, విని యగస్త్యునిఁ గీర్తించి యయోధ్యకుఁ బోయెను. [5]
అగస్త్యమహర్షి నహుషుని శపించుట
తొల్లి యొకానొకప్పుడు సహుషుఁ డనురాజు బ్రహ్మ విదుఁడై నూఱుయజ్ఞములుచేసి యుత్తములగు కుమారులఁగని దేవత్వము నొంది, యింద్రుఁడు విశ్వరూపునిఁ జంపినపాపమునకు వెఱచి పాఱిపోఁగా దేవతల యభిమానమును జూఱగొని యింద్రపదవి నధిష్టించెను. కాని, కాలక్రమమున నైశ్వర్యమదాంధతయు భోగలాలసతయు వృద్ధికాఁగా సహుషుఁడు శచీదేవితో పొత్తు నాకాంక్షించెను. ఉత్తమ పతివ్రతయగు శచీదేవి యుపాయ మాలోచించి ముని వాహనుఁడై తనకడ కేతెంచినచో నాతని యభీప్సితముఁ దీర్తునని యాతనికి వర్త మూనమంపెను. నహుషుఁడును వివేక విహీనుఁడు నార్య వృత్తిరహితుఁడు నై సహస్రోత్తమ బ్రాహ్మణ ధృతమైన బ్రహ్మరథమున నెక్కి బ్రాహ్మణానమాస మొనర్చి ప్రసంగ వశమున గోసంప్రోక్షణమందుఁ జెప్పఁబడిన బ్రాహ్మణములైన మంత్రములు తనకుఁ బ్రమాణములు కావని ఋషులతో వాదించెను. పూర్వాచార్యుల మంత్రములను నిందించుట యజ్ఞానమని యగస్త్యుఁ డనఁగా నహుషుఁ డాతనిఁ దలపైఁ దన్నెను. అగస్త్యమహర్షి యట్టిఘోరదుష్కృతమును జూచి యూరకుండ లేక వెంటనే యత్యుగ్రాహివి కమ్మని శాపమిచ్చెను. తత్క్షణమే నహుషుఁడు శక్రాసనమునుబాసి క్రూరసర్పమై వచ్చుచు నగస్త్యుని పాదములపైఁబడి "మహాత్మా! క్షమింపుము. నే సెంతయుఁ బశ్చాత్తప్తుఁడ నై తిని. బలవద్విధి వైపరీత్యముఁ దప్పింప నేరితరము? కావలసినదైనది. కావున నాకుఁ బూర్వస్మృతి చెడకుండను. బలవంతములగు జంతువులు నన్ను ముట్టి బలహీనము లగునట్లును, శాపమోక్షమున కుపాయమును బ్రసాదింపు" మని కృతాంజలియై వేఁడుకొనెను. అగస్త్యుఁడు వెంటనే కరుణించి యాతనివరము లనుగ్రహించెను. ఆహా! మన మహర్షులెంత దయార్ద్ర హృదయులో కదా! పరమ బ్రహ్మర్షుల నవమానించిన దుష్కృతమునకు ఘోర శాపమిచ్చి నహుషుని దౌష్ట్యమును బోఁద్రోలిన యగస్త్యమహర్షి పశ్చాత్తప్తుఁ డైన యానహుషునే వరమున ననుగ్రహించుట యాతని యనంత మహత్త్వమును జాటుచున్నది. ఇట్టి పవిత్రాత్ములగు మహాశక్తిసంపన్నులఁ గడుపారఁగన్న భారతవర్ష మెంత పవిత్ర మైనదోకదా!
ఆగస్త్యమహర్షి ద్వాదశ వార్షికయజ్ఞము
ఒకానొకప్పు డగస్త్యమహర్షి ద్వాదశవార్షికయజ్ఞ, మారంభించెను. ఈ మహాయజ్ఞము పండ్రెండు సంవత్సరములు జరిగెను. ఆ యజ్ఞమువ దివ్యానుభావముగల పరమ మునులు ఋత్విజులై నిజప్రౌడి సఖిలతంత్రములు నడుపుచుండిరి. కాని, కొండొక కారణమున నింద్రుఁడు వర్షింపకుండెను. ఓషధులు వికలత్వము నందెను. ఇది చూచి మునీశ్వరు లగస్త్యుని యన్నదానవిధి యెట్లు నెఱవేఱునో యని భయపడఁ దొడఁగిరి. న్యాయసమ్మతమైన ద్రవ్యమును గాని యొండు ద్రవ్యముల నాతఁడు వినియోగింపఁడుకదా! మఱి వానలు లేనిచో మునుల కెట్లీతఁడు భోజనము పెట్టఁగలఁడని వారు సంశయించిరి. అగస్త్యమహర్షి యిది యెఱిఁగి యింద్రుఁడు పదవి వహించి జగమును బోచెద ననియు లేనిచోఁ ద్రిజగముల నెచట బహుళోదారద్రవ్యకోటు లున్నవో వాని నెల్లఁ దెప్పించెద నవియుఁ దనశక్తి సంపన్నతను విశదీకరింప మునివరు లెల్లరు సగస్త్యుఁడు తపోధనము వ్యయింప నక్కఱ లేకయే తామే తెచ్చుకొందు మని వంతలు దక్కి యాగకార్యము నెఱవేర్ప మొదలిడఁగానే దేవేంద్రుఁ డీ సంగతిఁ దెలిసికొనీ భయభ్రాంతుఁడై కుంభవృష్టిఁ గురియ సంభోదములఁ బంపి వెంటనే బృహస్పతిని వెంట నిడుకొని వచ్చి వినయవినమితగాత్రుఁడై యగస్త్యుని శరణుచొచ్చి మన్నింప వేఁడుకొనెను. అంత నగస్త్యుఁ డాతనిని గౌరవించి యర్చనలిచ్చి శాంత ప్రియ వచనముల నెల్లరకుఁ బ్రమోదముఁ గల్పించి యింద్రుని బృహస్పతిని బంపివై చెను. తరువాతఁ ద్రిలోకవినుతముగా జన్నము పూర్తి యయ్యెను. అగస్త్యుఁడు వినయవిధేయతలతోఁ బరమమునులగు ఋత్విజుల కెల్లర కర్చనలిచ్చి యామంత్రించి యపూర్వమాహాత్మ్యము నందెను.[6]
అగస్త్యుఁడు తారక బ్రహ్మోపదేశము నందుటకై అవిముక్త క్షేత్రమున కరిగి యచట విశ్వేశ్వరుని సేవించుచుండెను.
దేవత లగస్త్యునికై వెదకుట
ఇటు లుండ. వింధ్యపర్వతము మేరుపర్వతముపైఁ గల యసూయ, సూర్యుఁడు తనచుట్టుఁ దిరుగక మేరుపర్వతము చుట్టు దిరుగు ననుకోవము కారణములుగా నొకప్పుడు మిక్కిలి పెరిగి సూర్యచంద్రనక్షత్రముల గమనమున కవరోధము కలిగించెను. అందుచే రాత్రిందివము లేర్పఱుపరాక లోకవ్యవహార మాఁగిపోయెను. అపుడు దేవత లెంత ప్రార్థించినను వింధ్యకుఁ గోపముపశమింప దాయెను. వారంత బ్రహ్మపాలి కరిగి యంతయుఁ జెప్పి తమ్ముఁ గాపాడఁ గోరిరి. బ్రహ్మ యాపని తనవలనఁ గాదని, అవిముక్తక్షేత్రమునఁ దపము చేసికొనుచున్న అగస్త్యమహామునియే వారిని రక్షింప సమర్థుఁడని పోయి యాతని సేవింపుఁడని తెలిపెను. అది విని దేవతలు బ్రహ్మ చెప్పినచొప్పున బయలుదేఱి భూలోకమునకు దిగి కాశీ పట్టణముఁ జేరి పిదప :
"పంచాక్షరీ మంత్ర పారాయణమునకు
నెవ్వానిమానసం బేడుగడయు
దర్పోద్దతు లగువాతాపీల్వలులకును
వధశిలాస్థాన మెవ్వావికుక్షి
ఆది నెవ్వానిదివ్యావతారమునకుఁ
బూర్ణాంబుభాండంబు పురిటియిల్లు
మెఱసి లోపాముద్ర మెఱుఁగుఁ బాలిండ్లపైఁ
బవళించు నెవ్వావిభవ్యమూర్తి
కసరి యెవ్వావికంఠహుంకారరవము
కొండచిలువకులమ్ములోఁ గూల్చె వహుషు
నట్టిపరమమహాతేజు నలఘుతేజు
వెదకి రానందవనములో విబుధమునులు."
(కాశీ, 2, 40)
పిమ్మట, నటఁ గాననైన పెద్దలవలనఁ గందువ యెఱఁగి నెమ్మదిగా వారగస్త్యమహార్షి యాశ్రమమును బ్రవేశించిరి.
అగస్త్యాశ్రమ వర్ణనము
అగస్త్యుని పుణ్యాశ్రమములో దివ్యమహిమము లెన్నో విరాజిల్లుచుండెను. అచట నాఁడేనుఁగు తొండమెత్తి సింహపుఁ బిల్లను లాలించును. తన వాఁడిగోళ్ళతోఁబులి లేడిపిల్ల మొగమె త్తి ముద్దాడును. తోడేలు చింబోతుల బిగికౌఁగిటఁజేర్చి ప్రేమచూపును. చెలగాటమాడును. ఎండతాఁకువేళ ముంగికి త్రాచుపాము పడగవిప్పి గొడుగుగాఁ బట్టును. అచటి కొండగొఱ్ఱెలు కోతులతోఁ బొత్తు గలిగి మెలఁగును. ఇట్టి వింతలు గల అగస్త్యాశ్రమముఁ గన్న దేవతలు పొందిన యానందాశ్చర్యము లనంతములు,
దేవత లగస్త్యుని గొల్చుట
ఇట్లు కాశీనగరమునకుఁగ్రోశమాత్రదూరమందు గంగాతీరమున బ్రహ్మ లోకమును దలదన్ను చు వెలయు అగస్త్యుని పర్లశాలఁజేరి లోపాముద్రాసహితుఁ డగుమహర్షిని దేవతలు కాంచిరి. అగస్త్యమహర్షి యపుడు నిమిషనిమిషమునకు భక్తిపారవశ్యమునఁ బార్వతీ వల్లభుని బహుమనోహర కంఠస్వరమునఁ బలుమాఱు స్తుతించుచుండెను, కొంత - సేపామహాత్ముడు యోగనిరూఢి నుండి పిదపఁ బ్రసన్నుఁ డై పశాంతిముద్ర ధరించి యున్న సమయమున జయజయధ్వానములతో సురలాతనిఁ జేరి మ్రొక్క నాతఁ డెదు రేఁగి వారందఱకు సత్కారము లొనర్చి సుఖాసీనులఁ గావించి వచ్చినపని యడిగెను.
బృహస్పతి ఆగస్త్యునితో వచ్చినపనిఁ దెల్పుట
దేవత లెల్లరికోరికపైని బృహస్పతి అగస్త్యునికి నమస్కరించి స్తుతించి ప్రక్కనున్న లోపాముద్రాసాధ్విని బ్రస్తుతించి యిట్లనెను. "మునిచంద్రా ! నీవు ప్రణవమవు, ఈమె వేదవిద్య, నీవు తపస్సువు. ఈ సాధ్వి శాంతి. నీవు ఫలము. ఈమె సత్క్రియ. నీవు సూర్యుఁడవు. ఈమె చైతన్యలక్ష్మి. నీయందు బ్రహ్మతేజము, ఈమెయందుఁ బతివ్రత తేజము ప్రజ్వరిల్లు చున్నది. ఈయుభయ తేజఃపుంజము మారు క్షేమ మొసంగును." అని వింధ్యవృత్తాంతము. సూర్యచంద్రాదుల గమన మాఁగిపోవుట, దానివలన లోకముసకుఁ గలిగిన మహావిపత్తును సమస్తముఁ దెలిపి యావచ్చిన దేవతాధిపులను బేరు పేరఁ జూపి వింధ్యగర్వ ముడిసి యిందఱకు మేలు చేయుమని యర్థించెను. ఆ మాటలు విని అగస్త్యుఁడు ' దేవకార్యసిద్ధికి యత్న మొనరించెదను. కాశీపతి యతనిసతి మనపాలఁ గలరుక దా! భయములేదు పోయి రం' డని వారి నెల్లరను వీడ్కొలిపెను. అగస్త్యుఁని యభయమునకు వా రెల్ల రమితానంద మంది యాతనికిఁ బెక్కు నతులొనర్చి వీడ్కొని నిజనివాసముల కరిగిరి.
వింధ్యగర్వాపహరణము
అగస్త్యుఁడు దేవకార్య నిమిత్తమేయైనను బుణ్యరాశియగు కాశి విడువవలసి వచ్చినందులకుఁ బరిపరివిధములఁ బరితపించి లోపాముద్రాసహితుఁడై యందఱి దేవతలయొద్ద సెలవు గైకొని యెట్ట కేల కెట్లో కాశిని విడిచి కొంత దవ్వడిగి యొక్కచోఁ జతికిలఁ బడి “సాధ్వీ ! సుఖదుఃఖములు కారణములేక మానవులకుఁ గలుగవు గదా! పరమసుఖాకరమైన యా కాశీక్షేత్రమును వీడిపోవలసిన దుఃఖప్రాప్తికి మనమేమి చేసితిమి? కాశ్మీరములందుఁ గుంకుమ మనునది దేశా పేక్ష, పగలు పద్మము రాత్రి కలువపూవు వికసించుట కాలా పేక్ష, పుణ్యాత్మునకు సుఖము, పాపాత్మునకు దుఃఖము అదృష్టాపేక్ష, సర్వము ఈశ్వరాయత్త మనునది ఈశ్వరాపేక్ష, ఈశ్వర ప్రేరణమునఁ గర్మమే సుఖదుఃఖములఁ గూర్చు నని నాయుద్దేశము. ఈశ్వరుఁ డెవనిని రక్షింపఁదలఁచెనో వానిచేఁ బుణ్యకర్మములు చేయించు. ఎవనిని బెఱుపఁదలఁచెనో వానిచేఁ బాపకర్మములే చేయించును. ఈ కర్మలకుఁ గారణ మన్న అవిద్యతోఁ గూడిన రాగద్వేషాదిక్లేశపంచకము. ఈ కర్మఫల మిహపరలోకములఁ బ్రాణు లనుభవించును. కర్మకు హేతువైన క్లేశ పంచక మున్నంతకాలము జన్మము, సుఖదుఃఖభోగము, పునర్జన్మ హేతుకరణము - ఇవి తప్పవు. " అని పలు తెఱఁగుల వాపోయి, కాశిఁ దలఁచి తలఁచి దుఃఖించి మరలఁ బ్రయాణము సాగించి వింధ్యపర్వత ప్రాంతము సమీపించెను. అగస్త్యమహర్షిని దూరమునుండి చూచి వింధ్యపర్వతము వెనుకటివలె నొదిగిపోయెను. వెంటనే లోకోపద్రవము తొలఁగి పోయి గ్రహగమనములన్నియు మునుపటివలె జరిగెను. అపుడు పురుషాకృతిఁ దాల్చి వింధ్యపర్వతము అగస్త్యమహర్షి కి సాష్టాంగము లొనర్చి, అతిథిసత్కారములుచేసి “మహానుభావా! భృత్యునాజ్ఞాపించి కటాక్షింపు" మని వేఁడుకొనెను అగస్త్యుఁడు "పర్వత రాజా! మా దంపతుల మిరువురము దక్షిణాపథమునఁ దీర్థములాడఁ బోవుచున్నారము. పెద్దల మైతిమి కావున, నీ శిరశ్శృంగముల నెక్కి దిగుట మాకుఁ గష్టము. కాన, మేము తిరిగివచ్చు వఱకు నీవు భూమి సమముగ నుండవలయును." అని పలికెను. “మహాత్మా ! చరాచర ప్రపంచమున నీయాజ్ఞ చేయనివారెవరు? అట్లే పడియుండెదను. నన్నుఁ గటాక్షింపు" మని వింధ్యము పలుకఁగా అగస్త్యుఁడు సంతసించి వీడ్కొలిపి ముందునకుఁ బోయెను.
వింధ్యపర్వతము సహజముగఁ గల "పెంపుకూడఁ గోల్పోయి మద ముడిగి సిగ్గుపడి చచ్చినట్లు పడియుండెను. అసూయాగ్రస్తుల గతి యింతేకదా!
అగస్త్యుఁడు దక్షిణకాశికిఁ బోవుట
ఈ విధముగా భువనోపద్రవము నరికట్టి అగస్త్యుఁడు దక్షిణ కాశిఁ గన్నఁగాని తన కాశీవియోగబాధ పోఁజాలదని భార్యాసహితుఁడై తీర్థయాత్రలు చేసికొనుచు మందమంద ప్రయాణముల గోదావరీతీరమును బట్టి ఆంధ్ర దేశముఁ జేరెను. పిదప, నాతఁడు పంపా సరోవరము, దండకారణ్యము దాఁటి పట్టిసము, కోటిపల్లి, పతివల మున్నగుచోట్ల విడిసి దక్షవాటముఁ జేరి యట భీమేశ్వరుని భజించి సుఖించెను. పరోపకార పరాయణుఁడైన వానికి సంపదలు పుంఖాను పుంఖము సంభవించును. తీర్థస్నాన జపహోమ దేవతార్చనాదులు పరోపకారమును బోల నేరవు, పరోపకారముకంటెఁ బరమధర్మము లేదు. లోకోపకార పరాయణుఁడైన అగస్యుఁడు దాక్షారామమునఁ బరమసౌఖ్యము అనుభవించెను.
పిదప నాతఁడు భార్యాసహితుఁడై వీరభద్ర శిఖరమీక్షించి దాని విశేషము లోపాముద్రకుఁ దెలిపి ముందునకు బయనించి కొల్లాపుర మేఁగి యట లక్ష్మిదర్శనముఁ జేసికొనెను.
ఆగస్త్యకృత లక్ష్మీస్తోత్రము
కొల్లాపురమున అగస్త్యమహర్షి భక్తి భరితుఁడై లక్ష్మి నిట్లు స్తుతించెను. "తల్లీ! నీవు చంద్రునియందు వెన్నెలవు. సూర్యుని యందుఁ బ్రకాశమవు. అగ్నియందు దాహశక్తివి. అట్టి కల్యాణ మూర్తివగు నీకు నమస్కారములు. అమ్మా! బ్రహ్మవిష్ణుమహేశ్వరులు నీ కరుణా ప్రభావముననే సృష్టి స్థితిలయములు జరపుచుందురు. ఇందిరా ! పండితుఁడన్నను, శూరుఁడన్నను, వివేకియన్నను, వదాన్యుఁడన్నను. ధన్యుఁడన్నను. మన్మథుఁడన్నను, కళావిదుఁడన్నను, ఏమన్నను నీ కటాక్షకలితుఁడేకదా, నీ యంశ విశేషమే పురుషులయందు భాగ్యముగను, స్త్రీలయందు వికాసరేఖగను, మఱి సమస్తమునందు సొంపుగను గానవచ్చుచుండును. దేవీ! నీవు కలచోటు రసవంతము, నీవు లేనిచోటు రసహీనము. నీవు కలవాఁడే సమస్తము కలవాఁడు. నీవు లేనివాఁడు ఏమియు లేనివాఁడే. అబ్ది కన్యా ! జలపూర్ణములగు బంగారుకుండలు తొండములతో నెత్తిపట్టి యిరువంకల నేనుఁగులు నిన్నుఁ గొలుచుచుండఁగా, శంఖపద్మమహాపద్మ మక రాజనిధులు నియమమున నిన్నర్చించు చుండఁగా, వింజామరలు తాల్చి దేవగంధర్వ గుహ్యకాంగనలు నీకు వీచోపు లిడుచుండఁగా, మఱియొక వంక నింద్రాది దివిజపతులు చేతులు మోడ్చి స్తుతించుచుండఁగా, పద్మమధ్యమున నిండుకొలువుండి యఖిలలోకములను రక్షించు జగజ్జనని వగు నీకుఁగోటి మ్రొక్కులు." అని పెక్కు తెఱఁగుల స్తుతింప లక్ష్మి యాతనికిఁ బ్రత్యక్షమై "ఋషివరా! నీస్తుతికి సంతసించితిని. నీవు రాఁగల యిరువది తొమ్మిదవ ద్వాపరమున వ్యాసుఁడవై వారణాశిలో వేదశాస్త్ర పురాణసంహితా ధర్మ శాస్త్రముల వక్కాణింపఁగలవు. నీవిపుడు తుంగభద్రా తీరమునకరిగి కిష్కింధ ప్రాంతమునఁగల స్వామిమల యను నడవిలో నున్న కుమారస్వామిని దర్శించి యతని వలనఁ గాశీప్రశస్తిఁ దెలిసికొని యేఁగుము." అని పలికి లోపాముద్ర నాదరించి యామెకు బహువిధములగు దివ్యాభరణము లిచ్చి వీడ్కొలిపెను.
ఇట్లు చరితార్థులైన యా దంపతులు పయనించి పయనించి శ్రీశైలమునఁ జేరిరి. అట నొక్కచోఁ గూర్చున్నతఱి అగస్త్యుఁడు లోపాముద్రకు శ్రీశైల మహత్త్వముం దెలిపి యా పర్వతశిఖరమును జూచినంతమాత్రనే ముక్తి కలుగునని చెప్పెను. అంత నామె చనవు బలిమిని “నాథా ! ఈ శిఖరముఁ జూచినంతనే ముక్తి కలుగుచుండఁగా నిఁకఁ జచ్చినఁగాని మోక్షము లేని కాశి కేఁగు టెందులకు?" అని పలికెను.
లోపాముద్రాగస్త్య సంవాదము
మఱియు నామె "దేవా! కొందఱు కేవల విజ్ఞానముచాలు నందురు. కొందఱు విజ్ఞానసహితమైనకర్మ ముఖ్యమందురు. వ్రతదాన క్రతుయోగములు, తపోబ్రహ్మచర్యగార్హస్థ్య వానప్రస్థ సన్న్యాసాశ్రమములు, వేని కవియే ముక్తి ప్రదములందురు. వీనియన్నిటిలో సులభముక్తిమార్గము సెలవీయుఁ" డని కోరెను. అగస్త్యుఁడామె కిట్లు .బదులు చెప్పెను. “సాధ్వీ ! శ్రీశైలాదులన్నియు ముక్తి ప్రదములే ఏలన, నివి కాళీప్రాప్తికరము లగుటవలన. ఇఁకఁగాశియే సాక్షాన్ముక్తి హేతువు, అందుచే నది గొప్పది. ప్రయాగ. నైమిశము, కురుక్షేత్రము, గంగాద్వారము, అవంతిక , అయోధ్య, మధుర, ద్వారక , సరస్వతి, మున్నగున వెల్ల ముక్తి కారకములగు తీర్థములు. నీకొక్క రహస్యము చెప్పెద. ఈశ్వర కటాక్షము లేక పోయినచో దీర్థయాత్ర చేయవలెనను బుద్ధియే పుట్టదు. తీర్థయాత్రా కాంక్ష లేనిచోఁ బ్రతిబంధ పాపము పోవదు. ఆ పాపము నశింపనంత వఱకుఁ గాశీప్రాప్తి లేదు. కాశీవాస యోగము లేనిచో విజ్ఞానము విస్తరింపదు. జ్ఞానమునఁగాని మోక్షము లేదు. వేదాంత వాక్యముల వలనఁ బుట్టిన సుజ్ఞానమే జ్ఞానము. మిగిలిన దెల్ల అజ్ఞానము. -
తరుణీ! మానస తీర్ధములే మోక్షహేతువులు. బాహ్య తీర్థములకంటె నివి మేలు. అవియేవందువా వినుము. సత్యము, ఇంద్రియనిగ్రహము, అనసూయ, దానము, దయ, సంతోషము, బ్రహ్మచర్యము, ధైర్యము, యమము, సమత్వము, విజ్ఞానము ఇవన్నియు మానస తీర్థములు. ఇవియాడనివారికి బాహ్యతీర్థము లాడుట వలన నించుకంతయైనను బ్రయోజనము లేదు. ఏలయందువా తీర్థజలములలో మునిఁగినంతనే మోక్షము కలుగనున్నచో నిత్యమందే యుండు చేపలకు, తాఁబేళ్ళకు, మొసళ్ళకు, ముందు మోక్షము కలుగవలెగదా! సుదతీ ! కల్లుకుండ యెన్నిమాఱులు కడిగిన శుద్ధి యగును? అట్లే మానసిక తీర్ధము లలవఱచుకొన్నఁ గాని బాహ్య తీర్థప్రయోజనము లేదు. దేహమునందలి యంగములకువలెఁ దీర్థముల భేదము కలదు. ఎవ్వరేమిచ్చినను బుచ్చుకొనకపోవుట, అహంకారము లేకుండుట, కోవముఁజంపుకొనుట, ఆలస్యము చేయకుండుట, సత్యనిష్ఠ, సమాధానము, శ్రద్ధ, హేతునిష్ఠ మున్నగునవెల్ల సాంగోపాంగము లై - ఫలములిచ్చును. కాని, ఎన్ని తీర్థము లైనను కాశీప్రాప్తి ఈయఁగలవు కాశికాతీర్థమాడనివాఁడు లక్షతీర్థములాడినను మోక్ష లక్ష్మీ నందలేఁ" డని యుదాహరణమునకుఁ గొన్ని పూర్వగాథ లామెకుఁ దెలి పెను. ఆ పిమ్మట సతీసహితుఁడై అగస్త్యుఁడు శ్రీ శైలమునకుఁ బ్రదక్షిణ నమస్కారము లొనరించి ముందున కేఁగి స్వామిమలఁ జేరి యందుఁ గుమారస్వామిని దర్శించెను.
కుమారాగస్త్య సంవాదము
కుమారస్వామి పత్నీ సహితుఁ డైన అగస్త్యమహర్షిని రమ్మని కుశలమడిగి కూర్చండ నియమించి వచ్చినపని యడిగెను. అగస్త్యుఁడు కాశీమాహాత్మ్యమును దెలుపుమని కోరెను. కుమారస్వామి “అయ్యా ! నన్నడిగితివి కాని కాశీమాహాత్మ్య మెవ్వరును వర్ణింపఁ జాలరు. యధాశక్తిఁ దెలిపెదను. నిన్నుఁ గోల్లాపుర లక్ష్మి యిచటికిఁ బుత్తెంచుట యెఱుఁగుదును. కాన, నీ వేమి వినవలతువో కోరుకొమ్మనెను. అంత , అగస్త్యుఁడు కుమారస్వామికి నమస్కరించి కాశికిఁ గల నామములు, విశేషములు తెలుపమనెను. కుమారస్వామి యవి యెల్లఁ దెలిపెను. పిదప నాతఁడు మణికర్ణికా మాహాత్మ్యము, కాశీతీర్థమాహాత్మ్యము, కాలభైరవచరిత్రము, హరికేశచరిత్రము, జ్ఞానవాపికాతీర్థ మాహాత్మ్యము. కళావతికథ, అగస్త్యునకుఁ దెలిపెను. పిదప, సదాచార నిరూపణముఁ జేయుమనఁ గుమారస్వామి "ఋషీంద్రా! మనువు, అత్రి భృగువు, భరద్వాజుఁడు, యాజ్ఞవల్క్యుఁడు, ఉశనసుఁడు, అంగీరసుఁడు, యముఁడు, ఆప స్తంబుఁడు, సంపర్తుఁడు. కాత్యాయనుఁడు, బృహస్పతి, శాతాతపుఁడు, శంఖుఁడు. లిఖితుఁడు, పరాశరుఁడు మున్నగువారు సదాచారము నిరూపించిరి. అవి యెల్లఁ దెలుప సాధ్యముకా" దని దిజ్మాత్రముగఁ దెలిపెను. పిదప, కాశీనగరమును గుఱించిన సమస్త విషయములు అగస్త్యుసకుఁ గుమారస్వామి తెలిపెను. ఇవన్నియు విని అగస్త్యుఁ డానందించి సభార్యుఁడై స్వామి నారాధించి సెలవు గైకొని ముందునకుఁ బయనమై పోయెను.[7]
అగస్త్యవ్యాసుల వృత్తాంతము
కాశీక్షేత్రమును శపింపఁబూనిన కారణమున వ్యాసుఁడు శిష్యసమేతుఁడై వారాణసీపురమునుండి విశ్వేశ్వరునిచేఁ ద్రోలి వేయఁబడి వచ్చుచుండఁగా లోపాముద్రాసహితుఁడగు నగస్త్యమహర్షి యాతని కెదురయ్యెను. ఆ ఋషిపుంగవు లొకరినొకరు కౌఁగిలించుకొని పరస్పరము కుశలప్రశ్నము లొనరించుకొనిరి. పిదప, సశిష్యులగువారు తుల్యభాగాతీరమునఁ గల బిల్వవనమునందలి చలువ రాతితిన్నెలపైఁ గూర్చుండి కొంతకాల మిష్టకథా వినోదములఁ బ్రొద్దు పుచ్చిరి. అనంతరము వ్యాసుఁడు కాశిఁ బాసి వచ్చుటకుఁ గారణ మేమని యగస్త్యుఁ డడుగఁగా నాతఁ డంతయుఁ బూసగ్రుచ్చినట్లు చెప్పి యన్నపూర్ణ యాజ్ఞ వలన దక్షిణ కాశి యగు దక్షారామమునకు విచ్చేసితి ననియు భీమేశ్వరుఁడు తన్నుఁగాపాడుఁగదా యని పలికెను. అగస్త్యుఁడు వ్యాసు నోదార్చి దక్షారామమహిమఁ 'దెలిపి వ్యాసుని కోరికపైఁ దన తపోమహత్త్వముచే నాకాశమున కెగయించి వ్యాసాదుల కగస్త్యుఁడు భీమమండలమును జూపి ఇంద్రేశము, సిద్దేశ్వరము, యోగీశము, కాలేశ్వరము, శమనేశము, వీరభద్రేశము, బ్రహ్మేశము. కపాలేశ్వరము, కుక్కుటేశము, సోమనాథేశ్వరము, శ్రీమహేశము, రామతీర్థము అను ద్వాదశ క్షేత్రములఁ దెలిపి వానినెల్ల వేర్వేఱ నిరూపించి దక్షాధ్వరానలము, అఖిలేష్ట సంసిద్ధి, సోమేశ్వరము, హైమవతము, సప్తగోదావరము అను పంచతీర్థములఁ బేర్కొని వానియందెల్ల వ్యాసు నోలలాడించెను. ఆ తరువాత నాతఁడు వ్యాసునితో భీమేశ్వరాలయముం బ్రవేశించి దాని మహత్త్వమును వేయినోళ్ళఁ దెలిపెను. వ్యాసుఁడు శివు నర్చించి బ్రహ్మానందమందెను, పిదప, అగస్త్యుఁడు సగౌరవముగా నాతని వీడ్కొని భార్యాసహితుఁడై తన యాశ్రమమునకు వెడలి సుఖముండెను. పరశురాముఁ డొకప్పు డగస్త్యమహర్షిని దర్శించి యాతనిచేఁ గృష్ణామృత స్తోత్రమును విని కృష్ణకవచధరుఁడై యిరువదియొక్క మాఱు రాజులఁ జంపెను.
అగస్త్యుఁడు భూభారము తగ్గించుట
తొల్లి హిమగిరిపైఁ బార్వతీపరమేశ్వరుల వివాహము జరుగుచుండఁగా నా కల్యాణమును జూచుటకు యక్ష కిన్నర సిద్ద కింపురుషులు నెల్లరు వచ్చి బ్రహ్మానంద సముద్రమున నోలలాడుచుండిరి. అప్పుడు భూదేవి దక్షిణదిక్కునఁ బైకి లేచుటయు నుత్తరదిశను లోనికిఁ గ్రుంగిపోవుటయు సంభవించెను. అందఱును భయపడసాగిరి. అంతఁ బరమేశ్వరుఁ డగస్త్యమహర్షి ని బిల్చి "కుంభ సంభవా! ఈ యుపద్రవమునుండి కాపాడుటకు నీవు దక్క నన్యు లెవ్వరును గానవచ్చుట లేదు. కావున నీవు సశిష్యుఁడవై దక్షిణదిక్కునకుఁ బొమ్ము. అంత భూమి సమమగును. అచటనుండియే నీవును నీ శిష్యులును నా కల్యాణ మహోత్సవము చూడఁగలశక్తి. యనుగ్రహించితిని ఆలసింపక పొ"మ్మనెను. అంత నగస్త్యమహర్షి శివు నానతిని లోపాముద్రాపరిపూర్ణ పార్శ్వుడై శిష్యసమేతముగా దక్షిణమునకుఁ బోయెను. అంత భూదేవి భారము తగ్గుటచే యథాపూర్వముగ సమవర్తిని యాయెను. అగస్త్యమహర్షి యట్లు సర్వేశ్వర కటాక్షముఁ బడసి సశిష్యుఁడై లోపాముద్రతో నట నుండియే దివ్య చక్షువులచేఁ బార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవమును గాంచి యానందాంబుధి నోలలాడెను.[8]
ఆగస్త్యుఁ డింద్రద్యుమ్నుని శపించుట
పూర్వ మొకప్పుడు ద్రవిళాధీశుఁ డగు నింద్రద్యుమ్నుఁడు వైష్ణవోత్తముఁడై సర్వాత్ముఁ డగు నారాయణు నారాధించుచు నొక శైలాగ్రమునఁ బూజాపరతంత్రుఁడై యుండెను. ఒకనాఁ డటకుఁ గలశజుఁ డరుదెంచి నిలిచియుండెను. ఇంద్రద్యుమ్నుఁ డాతనిఁ గాంచియు నేమఱిపాటున నిర్లక్ష్యముగా నూరకుండెను. అగస్త్యుఁ డాతని నిర్లక్ష్యబుద్ధికి గినిసి యాతఁడు నీచగజయోనిం బుట్టుఁగా కని శాపోదకమును విడిచెను. ఇంద్రద్యుమ్నుఁ డప్పటి కొడ లెఱఁగిఁ భక్తి తాత్పర్యములతో నగస్త్యుని పాదములపైఁ బడి “మహాత్మా! నేను నిర్లక్ష్యబుద్ధితో లేను. ఈ శైలాగ్రభాగమున నుండి గృహీత మౌననియతితో సర్వాత్ముఁ డైన నారాయణు నూహించుచు దేహస్మృతి వీడి యుండుటచే నిన్నుఁ గనఁజాలకపోయితిని. అంతియకాని మఱియొక భావమున నున్న వాఁడను గాను. నన్నుఁ గరుణింపవే!" యని ప్రార్థించెను. అగస్త్యమహర్షి యు “నృపాగ్రణి ! నీ విషయము నే నెఱుఁగుదును, ఎట్టి పుణ్యాత్ములైనను విప్రులఁ గని యిచ్ఛా మూలమునఁ గాని పరేచ్చా కారణమునఁగాని యేమఱి గాని యవమానించి రేని యది దుష్కృతమే యగును. నీవు పుణ్యాత్ముఁడవు. నేఁటి విప్రావమానదోషము నిలిచియున్నచో ముందుముందు నీ కది ప్రమాద హేతు వగును. ఏతద్దోషపరిహరణార్థమై నీవు గజ జన్మము నెత్తక తప్పదు. ఇదియు విధివిలసితము. కాని, నీవు నారాయణ భక్తి వరిష్టుఁడవు, కనుక గజజన్మ మెత్తియు నీవు నారాయణచరణ సేవ నేమఱనికతముననే ముక్తి నందఁ గలవు పొ ”మ్మని కలశజుఁడు దనదారిఁబోయెను. ఇంద్రద్యుమ్నుఁడేనుఁగై పుట్టి యొక కాసారమున జలమును గ్రోలుతఱి నొక మకరముచేఁ బట్టువడి యితఃపర మెఱుఁగక విష్ణుమూర్తిని బ్రార్థింపగా నాతఁడు ప్రత్యక్షమై. శాపవిమోచనముఁ జేయ నాతఁడజ్ఞానరహితుఁడై విష్ణురూఁపుడై వెలసెను. ఈ గజేంద్రమోక్షమే శ్రీ మద్భాగవతమందలి గజేంద్రమోక్షణము:
అగస్త్యుఁడు మణిమంతుని శపించుట
తొల్లి యొకప్పుడు కుశవతి యను పుణ్యనదీతీరమున నమరులు: సత్రయాగము చేయుచుండిరి. దాని కాహుతుఁ డై కుబేరుఁడు పుష్పక విమానమున శతమహాసంఖ్యగల యక్షరాక్షస బలములతో ప్రియసఖుఁడైన మణిమంతుఁ డనువానితోఁ గూడి యాకాశమార్గమునఁ బోవుచుండెను. దారిలో యమునానది గలచోట నాకసమునఁ బోవు విమానమునుండి మణిమంతుఁ డుమ్మివైచెను. అది యమునానది తీరమున నూర్ధ్వబాహుఁడై యుగ్రతపము చేయుచున్న యగస్త్యుని పైఁ బడెను. అగస్త్యుఁడు వెంటనే విమాన మాఁపుచేయ దిగివచ్చి నమస్కరించిన కుబేరుని జూచి 'మూర్కుఁడగు నీ మిత్రుఁడు నా పై నుమిసెఁ గావున నాతఁడొక్క మానవునిచేతఁ జచ్చు. అతని పరీవారమైన యీ యక్షరాక్షసగణములెల్ల నా నరునిచేతనే చచ్చు'నని శపించి పొండనెను. కుబేర మణిమంతు లగస్త్యుని గటాక్షింపు మని ప్రార్థించి సెలవు గైకొని పోయిరి. ఈ యగస్త్య శాపముకతముననే సౌగంధిక వ్రసవాపహరణ సమయమున మణిమంతుఁడు నాతని పరివారము భీమసేనుని చేతిలోఁ జచ్చిరి.[9]
అగస్త్యుడు భద్రాశ్వు నను గ్రహించుట
కృతయుగమున నవవర్షములలో నొకవర్షమునకుఁ దనపేర భద్రాశ్వనామధేయంబుఁ గల్పించిన భద్రాశ్వుఁ డను రాజు నిజ భార్యయగు కాంతిమతీదేవితో నుండ సగస్త్య మహర్షి యేతెంచి యాతనిచే నేన్నో మన్నన లంది పద్మనాభ వ్రత సంబంధ మగు దీప మాలికలం గాంచిన ఫలమున వా రా జన్మమున నంత యైశ్వర్యము గాంచిరని వారి పూర్వజన్మ వృత్తాంతమును దెలిపి వారి కేతద్ర్వత విధానమును బోధించి యనుగ్రహించెను.
మఱికొంత కాలమున కాతఁడు పుష్కరతీర్థమున కేఁగి కుమారస్వామిని భజించి వచ్చి భద్రాశ్వునకు మఱికొన్ని వృత్తములఁ దెలిపెను. అందిలావృతవర్షమున నున్నతఱిఁ దనకు నారాయణుఁడు వైకుంఠపురమున నిజభవనమును జూపి “వత్సా! ఈ చరాచరము జలరూపమున నావరించి వరుణాభిధేయుఁడ నగు నారాయణుఁడను నేనే. నీవు మద్భక్తుఁడ వగుట దీనిని గంటివి ఏతద్దర్శన ఫలముకతన నీ కేకాలమునను జేటు లేదు. "పొ" మ్మని వీడ్కొలుపుటను దెలిపి వాని నాశ్చర్యమగ్ను నొనర్చెను [10]
"అగస్త్యగీత:" " ఆగస్త్య సంహిత."
అగస్త్యమహర్షి లోకోత్తరపురుషుఁడై యాజీవితాంతము జగద్ధితమునకై పాటుపడినవిశ్వశ్రేయస్కరుఁడు. మహాభారతమందలి శాంతిపర్వమున వెలయు నీతని ప్రసిద్ధ మహా విద్యాబోధనయే యగస్త్య గితానామమునఁ జిరస్థాయియై నిల్చినది. మఱియు, నీ మహర్షి రామచంద్ర విష్ణునామవాద్యవతార పూజావిధానము శాస్త్రోక్తముగాఁ దెలిపియుండెను. ఇదియే "యగస్త్యసంహిత " యనఁ బరగుచున్నది. [11]
అగస్త్యమహర్షి జీవితమంతయుఁ బ్రసిద్ధ బ్రహ్మవిద్యాబోధకమే యైయున్నది. ఈతని తత్త్వసారమంతయు;
"శివుఁడే దాత శివుండె భోక్త శివుఁడే
చేయున్ మఖాదిక్రియల్
శివుఁడే విశ్వము నే శివుండ ....."
నను నద్భుతాద్వైతానుసంథానమునఁ బ్రవ్యక్తమైన దనఁ జెల్లును. సతీసహితుఁడై సమస్తతీర్థములఁ గ్రుంకివచ్చి యగస్త్యమహర్షి దేహశుద్ధికి యమనియమాదులకు నవి యవసరములే యైనను :
"తీర్థములుమాననములు ముక్తిప్రదములు"
"బాహ్యతీర్థావళులు ముక్తిఫలము నీవు"
అని తన సాధ్వీమణికిఁ దీర్థపరమార్ధమును వెల్లడించినాఁడు.
అగస్త్యుఁ డొసంగిన 'ఆదిత్య కవచము'
"జపాకుసుమ సంకాశం ద్విభుజం పద్మహస్తకం|
సిందూరాంబర మాల్యంచ రక్తగంధానులేపనమ్ ||
మాణిక్యరత్న ఖచిత సర్వాభరణభూషితం|
ధ్యాయేత్పఠేత్సువర్ణాభం సూర్యస్య కవచం ముదా ||
ఘృణిః పాతు శిరోదేశ సూర్యః పాతు లలాటకమ్ |
ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతు దివాకరః ||
ఘ్రాణం పాతు సదా భాను! ముఖం పాతు సదా రవిః |
జిహ్వాం పాతు జిగన్నేత్రః కంఠం పాతు విభావసుః ||
స్కంధౌ గ్రహపతిః పాతు భూజౌ పాతు ప్రభాకరః |
కరా వబ్జకరః పాతు హృదయం పాతు భానుమాన్ ||
మధ్యం పాతు సుసప్తాశ్యో నాభిం పాతు నభోమణిః |
ద్వాదశాత్మా కటిం పాతు నవితా పొతు సక్థినీ ||
ఊరూ పాతు సురశ్రేష్ఠో జానునీ పాతు భాస్కరః |
జంఘే మే పాతు మార్తాండో గుల్ఫౌ పాతు త్విషాంపతిః |
పాదౌ దినమణిః పాతుపాతు మిత్రో౽ఖిలం వపుః |
ఆదిత్య కవచం పుణ్యం అభేద్యం వజ్ర సన్నిభమ్ || వ
సర్వరోగ భయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః |
సంవత్సర ముపాసిత్వా సామ్రాజ్య, పదవీం లభేత్ ||
అనేకరత్న సంయుక్తం స్వర్ణమాణిక్య భూషణమ్ |
కల్పవృక్ష సమాకీర్ణం కదంబ కుసుమప్రియమ్ |
అశేషరోగ శాంత్యర్థం ధ్యాయే దాదిత్య మండలమ్ ||
సిందూరవర్ణాయ సుమండలాయ సువర్ణ రత్నా భరణాయ తుభ్యమ్ |
పద్మాది నేత్రేచ సుపంకజాయ బ్రహేంద్ర నారాయణ శంకరాయ ||
సంరక్తచూర్ణం నసువర్ణతోయం సకుంకుమారం సకుశలవపుష్పమ్ |
ప్రదత్తమాదాయచ హేమపాత్రే ప్రశ స్తనాదం భగవన్ ప్రసీద ||
ఆగస్త్యుఁ డొనర్చిన 'ఆదిత్యస్తోత్రము'
"ధ్యాయేత్సూర్యమనంతకోటి కిరణం తేజోమయం భాస్కరం |
భక్తానా మభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ ||
ఆదిత్యం జగదీశమచ్యుత మజం త్రైలోక్య చూడామణిం |
భక్తాభీష్ట వరప్రదం దినమణిం మార్తాండ మాద్యం శుభమ్ ||
కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః |
జన్మమృత్యు జరావ్యాధి సంసార భయనాశనః |
బ్రహ్మ స్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వరః |
ఆస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తి : దివాకరః ||
ఏకచక్రరథోయస్య దివ్య : కనక భూషితః |
సోయం భవతు వప్రీతః పద్మహస్తో దివాకరః ||
పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమోనమః |
అండయోనిర్మహాసాక్షి ఆదిత్యాయ నమోనమః ||
ధర్మమూర్తి ర్దయామూర్తిః సత్యమూర్తిర్న మోనమః |
సకలేశాయ సూర్యాయ క్షాంతేశాయ నమోనమః ||
అగస్త్యార్ఘ్యప్రదానవిధానము
అగస్త్యమహర్షి జగజ్జేగీయమానుఁడై నేఁటికిని భాద్రపద మాసమున భూలోకమునకు నక్షత్రరూపమున దర్శనమొసఁగుచు వండువట్టిన నీటి కాలుష్య ముడిపెడుకతకఫలమై మనస్మృతిపథమునకు వచ్చుచుండును.
అగస్త్య నక్షత్రోదయము కాఁగా నే విప్రులు సుస్నాతులై కాశపుష్పముతో అగస్త్యప్రతిమను జేసి వుష్పధూపాదులతో నర్చించి యర్ఘ్యప్రదాన మొసఁగి పూజావిధానము నెఱవేర్చి రాత్రి జాగరము చేయవలయును. అట్టివారి కిష్ట కామ్య సిద్ధియు మోక్షపదప్రాప్తియు నాతఁ డొసఁగుచుండును.
"కాళపుష్ప ప్రతీకాశ వహ్ని మారుతసంభవ |
మిత్రావరుణయోః పుత్త్ర కుంభయోనే నమోస్తుతే |
వింధ్యవృద్ధిక్షయకర మేఘతోయ విషావహః |
రత్నవల్లభదేవేశ లంకావాస నమోస్తుతే ||
వాతాపిర్భక్షితో యేన సముద్రశ్శోషితః పురా !
లోపాముద్రాపతి శ్శ్రీమాన్ యో2సౌ తస్మై నమో నమః |
యేనోదితేన పాపాని నిలయం యాంతి వ్యాధయః |
తస్మై నమోస్త్యగస్త్యాయ సశిష్యాయ చ పుత్త్రిణే " ||
అని యర్ఘ్యము విడిచి పిమ్మట లోపాముద్రాసాధ్వి నుద్దేశించి
“రాజపుత్త్రి మహాభాగే ఋషిపత్ని వరాననే |
లోపాముద్రే నమస్తుభ్య మర్ఘ్యంమే ప్రతిగృహ్యతామ్ " ||
అని యర్ఘ్యమిచ్చి యగస్త్యప్రతిమను బూజించి విప్రులకు గోదా నాదికము నొసంగి, యాదిన ముపవసించిన వారికి లోపాముద్రాగస్త్యులు భుక్తి ముక్తుల నిత్తురు.
"అగస్త్యాయ నమస్తే౽స్తు అగస్త్యే౽స్మిన్ ఘటేస్థితః
అగస్త్యో ద్విజరూపేణ ప్రతిగృహ్ణాతు సత్కృతః 1
ఆగస్త్యస్సప్తజన్మాఘం నాశయిత్వా2వయోరయం
అపత్యం విమలం సౌఖ్యం ప్రయచ్ఛతు మహాముని; " ||
- ↑ పద్మపురాణము - సృష్టిఖండము. భారతము - ఆరణ్యపర్వము .
- ↑ భారతము - ఆరణ్యపర్వము.
- ↑ స్కాందపురాణము - తులాకావేరీ మాహాత్మ్యము.
- ↑ "ఇదిస్కాందపురాణమున, భారతారణ్యపర్వమునఁ గల గాథ. “నిశ్శేష వీతోజ్ఘి తసింధురాజ? " అని రఘువంశము.
- ↑ రామాయణము.
- ↑ భారతము - అరణ్యపర్వము.
- ↑ స్కాందపురాణము - భీమఖండము.
- ↑ శివపురాణము
- ↑ భారతము - ఆరణ్యపర్వము.
- ↑ వరాహ పురాణము.
- ↑ సంస్కృత వాచస్పత్యము