మహర్షుల చరిత్రలు/ఉదంకమహర్షి

మహర్షుల చరిత్రలు

ఉదంకమహర్షి

భృగువంశమున జనించిన మహర్షులలో ఉదంకమహర్షి యొకడు. ఈతడు బాల్యమునుండి గౌతమమహర్షికడ శిష్యుడై గురుశుశ్రూషా తత్పరుడై యాతని సేవించుచుండెను. గౌతమునికడ శిష్యులుగ జేరిన యనేకులలో నీత డొకడు. అందరికన్న మిన్నగా గురునింటి పనులు శ్రద్ధతోను, భక్తితోను, ఓరిమితోను నీతడు చేయుచుండెను. ఇటు లుండ ననేకసంవత్సరములు గడచుచుండెను. గౌతముడు విద్యా పరిపూర్తి యైనశిష్యులను గ్రమక్రమముగా బిలుచుచు వారు వారు కోరినవరము లిచ్చి యాశీర్వదించి పంపుచుండెను. కాని, యెన్ని సంవత్సరము లైనను, ఉదంకునివలన సేవ కొనుటయే కాని యాతనిం బిలిచి యేమికావలయు నని యడుగుట కాని, విద్యాపరిపూర్తియనది; ఇక బోవచ్చునని కాని, యెన్నడును బలుకకుండెను. బాల్యమున శిష్యుడుగా జేరిన యుదంకునకు గుర్వాశ్రమముననే కౌమార యౌవనములు కడచి గురుశుశ్రూషలోనే వార్ధక్యము పైబడెను. ఐనను, నిత్య మాతడు అడవులలొని కేగి కట్టెలు కొట్టితెచ్చుట, గురుగృహిణి యగు అహల్యాసాధ్వికి దలలోనినాలుకవలె నుండి సమస్తగృహకృత్యములు నిర్వహించుచుండుట మానకుండెను.

ఆ దినములలోని గురుశిష్యసంబంధ మట్టిది. గురు సేవలో నిమగ్నులై శిష్యులు దేహస్మృతి యెరుగకుండెడివారు. ఉదంకు డెన్నడును తనవయస్సునుగురించి లెక్కించుకొనుట కాని, తనముఖ మెట్లున్నదని యద్దమును జూచుకొనుటకాని తా నిన్ని విద్యలు నేర్చినను గురువింకను వీడ్కో లీయడే యని యాతురత కనబరచుట కాని లేకుండెను. ఒకనాడు వనమున కేగి యెండుకట్టెలమోపు నెత్తిని బెట్టుకొని యింటికి వచ్చి క్రిందబడవేసెను. మోపు చాల పెద్ద దగుటచేతను, మిక్కిలి బరువగుటచేతను, అది క్రింద బడునపుడు ఉదంకునిజుట్టు కొంత కర్రలకు బెనగొని మోపుతోపా టదియు నేలబడెను. ఎండు కట్టెలను జిక్కికొని యూడిపడిన తనతలవెండ్రుకలు తెల్లనికాంతుల నీనుచు దన వార్ధక్యదశను జెప్పకచెప్పెను. వెంటనే యాతడు " అయ్యో ! నా శిరోజము లప్పుడే తెల్లపడిపోయినవే ! నా బాల్య కౌమార యౌవన దశలన్నియు గురుశుశ్రూషలో గడచిపోయినవే ? నేను జేరినతరువాత జేరిన శిష్యు లనేకులు విద్యాపరి పూర్తియై గుర్వాజ్ఞ వెడలిపోయిరే ! నా కింక విద్యాపరిపూర్తి కాదా ? గుర్వనుగ్రహమే కలుగదా ! గురుని యాశీర్వచనము, గురువరప్రసాదము, గురు వభయ మిచ్చి వీడ్కొలు పుటయు నా కీజన్మమున గలుగవా? నే నేమియు గురుద్రోహము చేయలేదే ? అహల్యాసాధ్విని గన్నతల్లిగా భావించి యామెసేవ నెన్న డేమరక చేయుచునే యుంటినే? కోటాన గోటులు శిష్యులు వచ్చి చదివి కృతార్థులై పోవుచుండ నేను శాశ్వతముగా నిట్లుండిపోవలసినదేనా ? నా జన్మ మంతయు వ్యర్థ మైనదా ?" అని యెన్నోయూహలు కలుగ నొక్కసారిగ బెల్లుబికివచ్చిన దుఃఖము నాపుకొనలేక వెక్కివెక్కి యేడ్వదొడగెను.

దయాసముద్రు డగు గౌతమ మహర్షి యిది యంతయు దివ్య దృష్టిని గ్రహించి తన కొమార్తెయు జక్కని చుక్కయు నగు తరుణిని ఉదంకుని యశ్రువులు భూమిపై బడనీయక దోసిటబట్టుమని పంపించెను. ఆమె పరుగున వచ్చి ఉదంకుని కన్నీరు దోసిట బట్ట సలసల క్రాగునావేడికన్నీటిచే నామె చేతులు వేడెక్క భరింపలేక యామె నేల విడిచెను. నేలబడిన యామేర యంతయు దుకతుక నుడికి పోయెను.

వెంటనే గౌతమమహర్షి యుదంకుని బిలిచి " వత్సా ! నీ దుఃఖమునకు గలకారణ మేమి ? నిస్సంకోచముగా జెప్పు " మని యడిగెను. ఉదంకుడు " మహాత్మా ! కోటాన గోటులగు మీ శిష్యులపై మీకు గల దయలో నాపై సహస్రాంశమైనను లేకపోవుటకు నే జేసినదోష మే మని దుఃఖించితిని. అంతకన్న నేమియు లేదు. క్షమించి రక్షింపు " డని గురుని వేడుకొనెను.

గౌతము డంత " వత్సా ! నీ గురుభక్తికి నేను మిక్కిలి సంతసించితిని. శిష్యు లెల్లరకు నేను వీడుకో లిచ్చి నీ కీయకుండుటకు గారణము ని న్నందఱికంటె నధికుని జేయుటకే యని గ్రహింపుము, ఆలస్యమైనదే వార్ధక్యము వచ్చినదే యని విచారింపకుము. శరీరము పరిణామపేశలమే కాని, వలసినపుడు యౌవన మీయగల శక్తిగల మాకడ నీ వందులకు దుఃఖింప బనిలేదు. మరి నీ శ్రద్ధకు మెచ్చితిని. నీ బుద్ధికి సంతసించితిని. నీ వృద్ధిని గోరెదను. ఇదిగో నీకు నిత్య యౌవన మొసంగితిని. నవయువతియు, శ్రద్ధావినయవివేకవతియు నగు నా ముద్దుకూతు నిచ్చెదను. పెండ్లాడి యౌవనసుఖము లనుభవించి గృహస్థాశ్రమమును నిర్వహింపుము. చిరకాలగురుసేవాగ్ని సంతప్త మగు నీ శరీరమును భరింప మానవ కాంతలకు సాధ్యము కాదు. గురుసుత తోబుట్టువుతో సమానురాలు, దీని నెట్లు బెండ్లాడుదు నని సందేహింపకుము. ఈమెకు శరీరాంతరము గల్పించెదను. అది జన్మాంతరసమానమే యగుట ధర్మదూష్యము కాదు. ఇది అధర్మము కాకుండునట్లును నీకు యౌవనము లభించునట్లును వరము లొసంగితిని " అని పలికెను.

గౌతమమహర్షి వరప్రసాదమున ఉదంకునికి నూతన యౌవనము, గౌతమునికూతునకు దివ్యసుందర నూత్నశరీరమును లభించెను. ఉదంకుడు గురువాజ్ఞ నౌదల ధరించి యా కన్యారత్నమును బెండ్లాడెను.

పిదప, ఉదంకుడు గౌతముని పాదములకు మ్రొక్కి " గురుదేవా ! న న్నిన్ని విధముల ననుగ్రహించిన నీకు గురుదక్షిణ యొసంగ గుతూహలపడుచున్నాను. నా యందు వాత్సల్య ముంచి యేదేని కోరి నాకా యవకాశము నొసంగ బ్రార్థించెదను. సర్వ శక్తిసంపన్నులగు తమకు నే నీయగలది లేదు. ఐనను, మీ కరుణకు నిదర్శనముగా నా కానతిం " డని ప్రార్థించెను. దానికి గౌతముడు " వత్సా ! నీవు నా కేమియును గురుదక్షిణ నీయవలసిన పని లేదు. లోకమునందలి గురులకు దక్షిణ కావలయును. నీవు సత్ప్రవర్తనమున నుత్తమగృహస్థ ధర్మమును పాలించుటే నా కిచ్చు గురుదక్షిణ " అని బదులుచెప్పెను. ఉదంకు డూరకుండక అహల్యాసాధ్విపాదములకు నమస్కరించి యేదైన వస్తువు గోరుకొమ్మనియు గురుదక్షిణకన్న గురుపత్నీదక్షిణ యధిక మనియు బలికెను. అహల్య " వత్సా! నీవు పై వాడవు గావు. ఏ దక్షిణయు వలదు. నీ గురువులు చెప్పిన చొప్పున నడచుకొను " మని పలికెను. ఉదంకుడు మరిమరి యామెను విడువక ప్రార్థింపగా నామె " వత్సా! మిత్రసహు డను రాజుభార్య ధరించు కుండలములు నాకు గొనితెమ్ము. అవి ధరింప నాకు ముచ్చటగ నున్నది. దాన నా ముచ్చటతీరును. నీకు బెంపు కలుగును " అని పలికెను.

' ఇది యెంతపని ? ' యని యుదంకుడు బయలుదేరి వెడలెను. పిదప నొకనాడు గౌతము డుదంకునిం గానక యాతడే మయ్యె నని యహల్య నడిగెను. అంత నామె జరిగిన సంగతి నెరింగించెను. " అయ్యో ! మిత్త్రసహు డనురాజు శాపకారణమున రాక్షసుడై చరించు చున్నాడు. మనుష్యమాంసమును దినుచున్నాడు. ఉదంకు డీసంగతి యెరుగడు. ఆ రాజుకడ కీత డేగుచో నేమి కీడు వాటిల్లునోకదా ! " యని గౌతము డనెను.

ఈ మాటలు విని యహల్య భీతచిత్తయై " నా కా సంగతి తెలియదు. ఏదైన గోరక తప్ప దని నన్ను మరిమరి బలవంత పెట్టుటచే బంపితిని. కన్నతల్లికన్న మిన్నగా నన్ను బూజించు నుదంకున కేయపాయమును బాటిల్లకుండునట్ల నుగ్రహింపు " మని భర్తను బ్రార్థించెను. అంత గౌతము డాదరాయత్తచిత్తుడై యుదంకున కేప్రమాదమును కలుగకుండునట్లును, ఆతడు పోయిన కార్యము సిద్ధించునట్లును, ఆతని కణిమాదు లగు అష్టసిద్ధులు కలుగునట్లును, మనమున దృఢముగ దలపోసెను.

ఉదంకు డట్లు పోయిపోయి ఒక వనమున నొకగొప్ప వృషభము నెక్కి వచ్చుచున్న యొక మహాపురుషునిం గాంచి యాత డొసంగిన వృషభ గోమయమును దిని యాతని యనుగ్రహ మంది ముందునకు బయనమై పోయి మనుష్యరక్తసిక్తమగు శరీరము, కోరమీసములు, మిడిగ్రుడ్లు, భయంకరాకారము గలిగి యా శూన్యాటవి దిరుగు మిత్త్రసహు డనురాజును గాంచెను. ఆతడు " రా. రా. ఆకలి యగుచున్నది. మనుష్యమాంస మెట్లు దొరకునా యనుకొనుచుండ వచ్చితివి. రా. రా. " యని పలికెను. ఆ మాటల కదలక బెదరక యుదంకుడు " రాజా ! నేను గురుకార్యమున వచ్చితిని. అందుచేత నీవు నన్ను జంప వీలుకాదు. నీకు నా రక్తమాంసములే కావలసినచో నా గురుని కార్యము నెరవేర్చిన పిదప దిరిగి నీ కడకు వచ్చెదను. అపుడు నీవు నా రక్తమాంసములు గైకొనవచ్చు " ననెను. " ఓయీ ! పగలు మూడవ జాము దాటినతరువాత నా భోజనకాల మని దేవతలు నా కాజ్ఞాపించిరి. నీవు సరి యైన యా కాలమున వచ్చితివి కావున, నిన్ను జంపి తినక విడువ " నని రాక్షసరూపమున నున్న రాజు పలికెను. " రాజా ! నా మాట వినుము. నే నసత్య మాడను. నా పనియైన పిదప దిరిగి వచ్చెదను. నీవు కోరికల దీర్చెడి రాజ వని విని నా కోరినకోరిక నీవే తీర్పగల వని నేను వెదకి వెదకి నిన్ను గన గంటిని. నా కోరిక నాకై కాదు; గురువులకొరకు. కావున, ముందు నీవు నా కోరిక దీర్చి తరువాత నీ యిష్టమైనట్లు చేసికొ " మ్మని ప్రార్థించెను. " అగుచో నీ కోరికయే ? " మని రా జడిగెను. " నీ భార్య మదయంతీదేవి ధరించు కుండలములు నా కీయవలయు " నని యుదంకు డర్థించెను. " ఏమిది ? ఒరుల ధనము లిచ్చువా రెటనైన గలరా ? నీకు గావలసిన నింకొక టేదైన గోరుకొమ్ము ఇచ్చెద " నని రాజు పలికెను. ఉదంకు డందుల కంగీకరింపక " నా కింకేమియు వలదు. నా కా కుండలములే కావలయు " నని పట్టుపట్టెను. " సరే నీవు పోయి నే నిమ్మంటి నని చెప్పి యామె నడిగి తెచ్చుకొను " మని రాజు తనభార్య యున్న ప్రదేశముం జూపెను.

ఉదంకు డటు వెడలి యెంత వెదకినను ఆ దేవి కన రాదాయెను. విసివి యాతడు తిరిగి రాజుకడ కేతెంచి దేవి యెందునుగాన రాలే దని చెప్పెను. " అయ్యా ! నా దేవి పతివ్రత, పవిత్ర. ఆమె యశుచులకు గానరాదు. నీవు త్రిభువనపావనుడవు. నీ వశుచి వని యెట్లందును ? " అని రాజు పలుక నుదంకుడు వృషభగోమయభక్షణంబున నశుచిత్వము తనకు కలిగియుండవచ్చు నని భావించి తూర్పుగా దిరిగి పాదములు కడుగుకొని మంత్రజపముచేసి యాచమించి రాజు ననుమతిగొని మరల దేవికడ కాతడేగెను. ఈసారి యా మహాపతివ్రత కాననయ్యెను. ఉదంకు డామెకు నమస్కరించి తనవచ్చినపని రాజానుమతి రెండును దెలిపెను. రాజుకడనుండి యానవాలు తీసికొని వచ్చిన దనకుండలము లిచ్చెద నని యామె పలికెను. ఉదంకుడు మరల రాజుకడకు వచ్చి యామె పలుకులు తెలిపెను. " దీనివలన మేలుకలుగు నన రాదు; అది కాదన్న వేరుమార్గము లేదు " అను పలుకులు పలికి యానవాలుగా దనభార్యకడ బలుకు మని రా జాయుదంకునకు జెప్పెను. ఉదంకుడు తిరిగి దేవి కడ కేగి రాజు పలికిన పలుకులు తు చ తప్పకుండునట్లు పలికెను. ఆ మాటలు విని మదయంతి సంతోషించి " ఋషివర్యా ! దేవతలు, గంధర్వులు, నాగులు ఈ కుండలములకోసమై వివిధొపాయములు పన్ని తస్కరింప దలచుచుందురు. ఎంగిలి సోకినను, ఏమరుపాటున నీవు నిద్రించినను, నేలమీద వీనిని బెట్టినను వారు వీనిని తస్కరింతురు. వీనిని భక్తితో బూజించి ధరించినవారికి ఆకలిదప్పు లుండవు; అగ్ని భయము కలుగదు. విషవికారము సోకదు. భూత భేతాళబాధలంటవు. పిన్నలైన బెద్దలైన వీనిని ధరింప నివి ధరించు వారి వయసును ననుసరించి చిన్నవి పెద్దవి యగుచుండును. వలసి నపుడెల్ల బంగార మివి కురియుచుండును. కావున వీనిని బదిలముగా దీసికొనివెళ్ళి మహాసాధ్వి యగునహల్యకిమ్ము. గురుకార్యమును నిర్వర్తింపుము. నీకును మాకును మేలగు " నని భక్తిప్రీతి వినయంబులు ముప్పిరిగొన ఆ మహాదానము జేసి నమస్కరించెను. ఉదంకుడపరిమానందమంది యాదేవికి హృదయపూర్వకాశీర్వచనముల నొసంగి యా కుండలముల గ్రహించి రాజుకడ కేతెంచి " రాజా ! నీవలన గృతార్థుడ నైతిని. నీకు సకలభద్రము లగుగాక ! నా కానవాలుగా నీవు చెప్పినవాక్య మతినిగూఢముగ నున్నది. దాని తాత్పర్యమును దెలిపిన సంతసించెద " నని పలికెను.

అందుల కా రాజిట్లు తెలిపెను. " ఋషివర్యా ! రాజులు బ్రాహ్మణుల బూజింతురు. నేనును విప్రుల బూజించుచునే యుండెడి వాడను. నా కీ శాపము బ్రాహ్మణునివలననే కలిగెను. ఈ శాపపరిహారమునకై విప్రసేవ తప్ప వేరుగతిలేదు. బ్రాహ్మణసేవదుస్తరము, అసిధారా వ్రతమువంటిది. " దానివలన మేలుకందు మనరాదు, అది కాదన్న వేరుమార్గములేదు " అనుగుర్తు దేవికి నీతో జెప్పి పంపితిని. అనగా నీ కుండలములు మహర్షికి దానము చేసినచో దానివలన మనకు మేలగునని నా తలంపామెకు దెలియ జేసితిని. ఆమె పతివ్రత, ఉత్తమురాలు కావున నా భావ మెరిగి నిరుపమాన మగురత్నకుండల దానమును ఉత్తమోత్తమ బ్రాహ్మణుడ వగు నీకు వెంటనే చేసినది. " ఆ మాటలు పలుకుచుండు రాజునకు ఉదంకమహర్షి పుణ్యసాన్నిధ్యమున నొక మహాపుణ్యము సోకి శాంతవచనములు, కుండలదానశ్రద్ధ, నూతనసత్త్వ సంపద లభించెను. ఉదంకు డతనికడ సెలవుగైకొని గురుపత్ని కా కుండలము లిచ్చి తిరిగి వచ్చెద ననియు నపుడు తన్ను భక్షింపవచ్చు ననియు బలికెను. రా జాతనింజూచి " మహనీయ తపోనిధీ : నీ పెంపు నాకు గానవచ్చినది. చంపెడువానికడకు మగిడి వచ్చెడివారు గలరా ? నీవు దయయుంచి నీ తపశ్శక్తిచే నా యార్తింబాపి కాపాడవే " యని ప్రార్థించెను.

అపారకరుణ మెరయు నుదంకుడు రాజుం జూచి " రాజా ! ఏ కారణముచేత నైనను మహాత్ములకు గోపము వచ్చినను అది వెంటనే యుపశమించును. నీ దోషమువలన నీకీ కీడు వచ్చినది. నేను నీకడకు వచ్చుటయు, నీవు నా కోరిక తీర్చుటయు నివి యన్నియు నా గురువరు లగు గౌతమమునీంద్రుని చల్లనిచూపు వల్లనేయైయుండు ననుకొందును. వారి దయగలిగిన నీకును నాకును సకలలోకములకును మేలు కలుగు " నని పలికి తన కరకమలమున నా రాజు మేను నిమిరెను. వెంటనే రాజు రాక్షసత్వమును విడిచి శుద్ధసత్త్వుడై భక్తివినయ భరితుడై యాతనిం బ్రస్తుతించి నమస్కరించెను.

పిదప, మిత్త్రసహు డాదరమేదురముగా " మహాత్మా ! నీ వతిథివి. నా యింట గుడిచి నన్ను ధన్యునిజేసి మరి పొమ్ము " అని ప్రార్థించెను. ఉదంకు డందుల కంగీకరించెను. భోజనసమయమున అన్నములో తల వెండ్రుకలు వచ్చెను. ఉదంకు " డయ్యో ! నీ కింకను బాపక్షయము పూర్తిగా గాలేదు. ఐనచో నిట్టిదోషము నీకు బట్టియుండెడిది కాదు. అపరీక్షిత మైనయన్నము బెట్టితివి. కావున, నీ వంధుడ వగుదు" వని శపించెను. "అల్పదోషమున నీవు నన్ను శపించితివి. నీ వనపత్యుఁడ వగుదు” వని రాజాతనికిఁ బ్రతిశాపమిచ్చెను. వెంటనే యుదంకుఁడు “రాజా ! నా శాప ముపసంహరించెదను. నే ననపత్యుండనుగా నోపను. నీ శాపము నుపసంహరింపు" మని కోరెను. అందుపై రాజు "ఋషీశ్వరా !

నిండు మనంబు నవ్యనవనీతసమానము పల్కు దారుణా
ఖండలశస్త్రతుల్యము జగన్నుత ! విప్రులయందు నిక్కమీ
రెండును రాజులందు విపరీతము గావున విప్రుఁ డోపు నో
పం డతిశాంతుఁ డయ్యు నరపాలుఁడు శాపము గ్రమ్మఱింపఁగన్.
                                     (భార, ఆది . 1, 10, 1)

కావున శాపముఁ ద్రిప్పఁగలశక్తి లేని నన్ను మన్నించి శక్తి యుతుఁడవు గావున నీ శాపమునుండి నన్ను రక్షింపు" మని ప్రార్థించెను. ఉదంకుఁ డందుల కియ్యకొని రాజునకు శాపమోక్షము ననుగ్రహించి వెడలిపోయెను.

ఉదంకుఁడు కుండలములు కృష్ణాజినమున జాగ్రత్తగా దాఁచి గౌతమాశ్రమ మార్గమున వేగముగాఁ బోవుచుండెను దారిలోఁ బరిపక్వ ఫలములతోఁ గూడిన బిల్వవృక్ష మొకటి కానిపింప నాఁకలిబాధ పోఁగొట్టుకొనఁ దలంచి ఉదంకుఁ డా వృక్షమునెక్కి కృష్ణాజినము నొక కొమ్మకుఁ దగిలించి ఫలములు గోసికొనుచుండెను. ఇంతలో నొక పెద్ద గాలి వీవ, కృష్ణాజినము పట్టుదప్పి నేలపైఁ బడెను. వెంటనే తక్షకుఁడను పాములరాజు కుండలము లపహరించి నాగలోకమునకు భూ వివరమార్గమునఁ బోయెను. ఉదంకుఁ డది చూచి యొక్క పెట్టున భూమి కుఱికి ఆ పామును బట్టఁబోయి యొకపుట్టఁ ద్రవ్వ మొదలిడెను. ఆ మహనీయుఁ డట్లు తన్నుఁ ద్రవ్వుట భరింపఁ జాలక భూదేవి భయపడెను. బ్రాహ్మణరూపమున నింద్రుఁ డచటికివచ్చి " అయ్యా! కొయ్యకోలతోఁ ద్రవ్వినచోఁ బాతాళమునకు మార్గ మేర్పడునా? ఎవ్వరైన నవ్విపోదురు. పాతాళలోక మిక్కడకు వేయియోజనముల లోఁతున నున్నది. నీ కుండలము లపుడే పాతాళమును జేరిన” వని పలికెను. ఉదంకుఁ డాతనితో " అయ్యా ! ఏమైనఁ గానిమ్ము. పాతాళమైన గీతాళమైనను, నే నేఁగి నా కుండలములు తెచ్చుకొని తీరెదను. లేదా ఆ ప్రయత్నమునఁ బ్రాణములైన వీడెదను. అంతేకాని నా ప్రయత్నము విరమింప" నని శపథము చేసెను. ఆ పలుకులు విని యింద్రుఁ డాతని దృఢనిష్ఠ కలరి నిజరూపముం జూపి యాతఁడు త్రవ్వు కొయ్యగోలకే వజ్రాయుధమునకుఁ గలుగు వాఁడిమియు శక్తియునిచ్చి కృతకృత్యుఁడ వగు మని యుదంకు నాశీర్వదించి వెడలిపోయెను.

ద్విగుణితనిష్ఠతో నుదంకుఁడు భూమిని ద్రవ్వుచుండఁగా భూదేవి భయపడిపోయి ఉదంకునకుఁ బాతాళలోకమునకుఁ దెరు విచ్చెను. ఉదంకుఁడు పాతాళలోకమున కేగి యనేక విధములగు ప్రాకారములచే నిండి, అనేకవిధముల రత్నముల కాంతులచే మిఱుమిట్లు గొలుపుచునున్న యా లోక మాలోకించి పది యోజనముల వెడల్పు పంచ యోజనముల విస్తారము నగు పాతాళ ద్వారమును గని యుదంకుఁడు తన కెట్లు కుండలాహరణము సాధ్య మగునో యని తెల్లఁబోయి చేయునదిలేక నాగవతుల నిట్ల ని స్తుతించెను.

“బహువనపాదపాబ్ధికులపర్వతపూర్ణసరస్సరస్వతీ
సహితమహామహీభర మజస్రసహస్రఫణాళిఁ దాల్చి దు
స్సహతరమూర్తికిన్ జలధిశాయికిఁ బాయక శయ్యయైన య
య్యహిపతి దుష్కృతాంతకుఁ డనంతుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడిన్.

అరిది తపోవిభూతి నమరారులబాధలు పొందకుండఁగా
నురగుల నెల్లఁ గాచిన మహోరగనాయకుఁ డానమత్సురా
సురనుకుటాగ్రరత్న రుచిశోభితపాదున కద్రినందనే
శ్వరునకు భూషణం బయినవాసుకి మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.

దేవమనుష్యలోకములఁ ద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సం
భావితశ క్తిశౌర్యులు నపారవిషోత్కటకోపవిస్ఫుర
త్పావకతాపితాఖిలవిపక్షులు నై నమహానుభావు లై
రాపతకోటిఘోరఫణిరాజులు మాకుఁ బ్రసన్ను లయ్యెడున్.

గోత్రమహామహీధరనికుంజములన్ విపినంబులం గురు
క్షేత్రమునం బ్రకామగతిఖేలన నొప్పి సహాశ్వసేనుఁడై
ధాత్రిఁ బరిభ్రమించుబలదర్పపరాక్రమదక్షుఁ డీక్షణ
శ్రోత్రవిభుండు తక్షకుఁడు శూరుఁడు మాకుఁబ్రసనుఁడయ్యెడున్.”
                    భార. ఆది. 1, 105, 106, 107, 108

పిదప, ఉదంకుఁ డందు తెలుపు నలుపు దారములతో వస్త్రమును నేయునిద్దఱు స్త్రీలను, ద్వాదశారచక్రముఁ ద్రిప్పుచున్న కుమారు లార్వు రను, పెద్దగుఱ్ఱము నెక్కి మహాతేజస్వి యైన యొక దివ్య పురుషునిం జూచి యర్థవంతములైన వేదస్తుతులతొ వారి నెల్లరిని సంతోష పెట్టెను. ఆ దివ్యపురుషుఁడు ఉదంకునిజూచి "వత్సా ! నీ కేమి కావలయునో కోరుకొ" మ్మనెను. దాని కాతఁడు "దేవా! ఈ నాగు లందఱు నాకు వశులు గావలయు” నని కోరెను. “అగుచో నీవు వచ్చి నా గుఱ్ఱము చెవిలో నూఁదు" మని ప్రేరేచెను. ఉదంకుఁ డట్లొనరింపఁగనే ఆ గుఱ్ఱము ప్రతిరోమకూపమునుండి యనేకములగుమంటలు బయలుదేఱి పాతాళలోక మంతయు భయంకరముగా వ్యాపించెను. నాగకుల మంతయు మిక్కిలి భయపడెను. ప్రళయకాలవహ్నివలె వ్యాపించిన యగ్ని హోత్రములఁజూడ పాఁపరాజు గడగడలాడిపోయెను. ఇది యంతయు ఉదంకుని భయంకరకోపాగ్ని యని తలపోసి యాతనిని శరణువేఁడుటకన్న గత్యంతరము లేదని కుండలములు తీసికొనివచ్చి యాతని కర్పించి తక్షకుఁడు తన్నుఁ గాపాడు మని శరణుజొచ్చెను.

ఈ విధముగాఁ గుండలములు తిరిగి గ్రహించియు ఉదంకుఁ డిట్లు తలపోసెను. “నేఁటినుండి నాల్గవదినమునకుఁ గుండలములు తీసికొనిరమ్ము. నేను వ్రతముఁ బూ ర్తిచేసికొని సిద్ధముగా నుందు" నని గురుపత్ని పంపినది. అయ్యో! నేఁడే నాల్గవదినము. నే నెట్లీ పాతాళము నుండి బయటపడఁగలను ? ఎట్లు గౌతమాశ్రమము చేరఁ గలను ? అంతయు నగమ్యగోచరముగా నున్నదే ! నేఁడుపోయి కుండలము అహల్యాసాధ్వి కీయనినాఁడు నాశ్రమ మంతయు వ్యర్థమే యగునే? ” అని చింతించు మదంకుని యభిప్రాయ మెఱిఁగి యా దివ్య పురుషుఁడు తన గుఱ్ఱమునిచ్చి దానిపై సెక్కి మఱుక్షణములో గౌతమునింట దిగఁగల వని చెప్పెను. ఉదంకుఁ డమితానంద మంది కృతజ్ఞుఁడై గుఱ్ఱమునెక్కి తలఁచిన యా క్షణముననే గౌతము నింటికి వచ్చి చేరెను.

అట గురుపత్ని యగు నహల్యయు శుచిస్నాతయై నూతన వస్త్రముల ధరించి కుండలములు ధరించు సమఁయ మగుట నెదురుచూచు చుండెను. ఉదంకుఁడువచ్చి కుండలము లామె కర్పింపఁగనే యామె వానిని ధరించి పతికి నమస్కరించి బ్రాహ్మణులఁ బూజించి తాను దలపెట్టిన వ్రతము పూర్తికావించెను.

గౌతముఁ డుదంకునిఁ గౌఁగిలించుకొని “వత్సా!

నీ చరితంబు చిత్రమహనీయము మిత్త్రసహక్షితీశ్వరున్
నీచతఁ బాప నాగ మపనితము సేసినకుండలద్వయం
బా చతురత్వ మా బలిమి యా దృఢనిశ్చయ మట్టులొప్ప ధ
ర్మోచితలీలఁ దేర నొరుఁ డోపునె యేను నిజంబ పల్కితిన్. ”

అని ప్రస్తుతించెను. ఉదంకుఁడు గురుపాదములకు మ్రొక్కి తాను గౌతమాశ్రమమునుండి బయలుదేఱి వెడలినది మొదలు కుండలములు తెచ్చునందాఁక జరగిన యావద్విషయమును బూసగ్రుచ్చినట్లు గురువులకు నివేదించి " దేవా ! ఆ దివ్యపురుషుఁ డెవఁడు? ఎద్దేమిటి ? గోమయ మేమి? తెలుపు నలుపు నూలునేయు స్త్రీలెవ్వరు? ఆ యారుగురు కుమారు లెవ్వరు? నాకు సాయువడిన యా దివ్యుఁ డెవ్వఁడు? ఇవి యన్ని యు దివ్యజ్ఞానసంపన్నుల రగు తామే నాటఁ దేటతెల్లముగాఁ దెలుపుఁ” డని ప్రార్థించెను.

గౌతమమహర్షి యుదంకుని కిట్లు తెలిపెను. "వత్సా! ఆ దివ్య పురుషుఁ డింద్రుఁడు. ఆ యెద్దు ఐరావతము, గోమయ మమృతము. నాగలోకములోఁ గాననైన స్త్రీ లిద్దఱు ధాత, విధాత. వారు నేయు వస్త్రము అహోరాత్రము. ద్వాదశారములు గలచక్రము పండ్రెండు మాసములతోఁ గూడిన సంవత్సరము. ఆఱుగురు కుమారులు ఆఱు ఋతువులు. ఆ గుఱ్ఱము అగ్ని. ఆ పురుషుఁ డింద్రసఖుఁ డగుపర్జన్యుఁ తొలుతనే యింద్రునిఁ గాంచి యమృతముఁ దిన్నవాఁడ వగుట కి పను లన్నియు అవలీలగా జరిగినవి. నీ వలన మా కానందమైన గురుఋణము నిట్లద్భుతముగా నీవు తీర్పఁ గంటివి. నీవు నీ యిష్టము వచ్చినట్లుండుము.

“కర మిష్టము సేసితి మా
కరిసూదన ! దీన నీకు నగు సత్ఫలముల్
గురు కార్యనిరతు లగు స
త్పురుషుల కగు టరుదె ! యధిక పుణ్యఫలంబుల్.”

భార. ఆది. ౧. ౧

ఉదంకుఁడు నమితానందమున గురుని వీడ్కొని గురుపత్ని సె-గైకొని భార్యాసహితుఁడై యేఁగి స్వీయాశ్రమమును నిర్మించు-యటఁ దపోగృహస్థజీవన మారంభించెను.[1]

తక్షకుఁడు తన కకారణముగ నొనర్చిన యవకారము నుదంకుఁడు మఱవక దానికిఁ బ్రతీకారము చేయఁ దలఁచి జనమేజయునిపాలి కేగి- మహారాజా ! తొల్లి నే గురుకార్యముఁ జేయఁ బూని వెళ్లఁగా- | కుటిలస్వభావుఁడు, వివేక విహీనుఁడు నగు తక్షకుఁ డకారణముగా నన్ను బాధించెను. మఱియు, నీ తండ్రి యగు పరీక్షిత్తు చనిపోవుట కాదుర్మార్గుఁడే కారణము. కావున, నీవు సర్పయాగము చేసి యా దుర్మార్గుని కాక యా దుర్మార్గవంశము నంతను నశింపఁజేసి పుణ్యము గట్టుకొన మని హెచ్చరించెను.

జనమేజయుఁడును గోపోద్దీపితుఁడై బ్రాహ్మణులఁ బిలిపించి తాను సర్పయాగము చేసెదనని ఋత్విజులఁ బిలిపించి కావలసిన యేర్పాటులన్నియుఁ గావించెను. యాగ మారంభమై హోమము జరగుచుండఁగా సర్పరాజు లందఱు వచ్చి యందుఁ బడి చచ్చుచుండిరి తక్షకుఁ డతిభీతుఁడై యింద్రునిఁ బ్రార్ధించెను. తుదకు ఆస్తీకుఁడు- మహర్షి జనమేజయుని ప్రార్థించి నివారించుట చే యాగ మాగిపోయెను.

ఉదంకునకు మహాశివుఁడు ప్రత్యక్షమగుట

తరువాత ఉదంకుఁ డొకమరుభూమిని జేరి యందనేక సంవత్సరములు మహాశివుని గుఱించి మహాతప మొనరించెను. చిరకాలమునకు దయకలిగి శివుఁ డుదంకునకుఁ బ్రత్యక్షమయ్యెను. ఉదంకుఁ డా మహా దేవునకుఁ బ్రదక్షిణసాష్టాంగనమస్కారము లొనరించి యిట్లని స్తుతించెను:

"దేవదేవ! శ్రుతి ప్రమాణవిధేయ! మాధవ! జంగమ
స్థావరాత్మక మైనలోకము సర్వమున్ భవదీయ మా
యావిధేయము విశ్వరూపుఁడ వవ్యయుండవు నీవ స
ద్భావసుస్థితి ని న్నెఱింగినఁ బాయుఁ బాపము లచ్యుతా!

అనిమిషసిద్ధసంయమివిహంగభుజంగమముఖ్యు లెల్ల ని
న్ననిశముఁ గొల్పి నీదయఁ గృతార్థతఁ బొందుదు రెందు నీవు నె
మ్మనమున సంతసిల్లుడు సమ స్తజగంబులు శాంతిఁ బొందు నీ
కినుకకు మాఱు లేదు శివకిరన! యీ భువనత్రయంబునన్.

విక్రమత్రయలీల నోలిన విష్టపత్రితయంబుఁ బె
ల్లాక్రరమించితి క్రూరు లై నసురారివీరులఁ బ్రస్ఫుర
చ్చక్రవిక్రమ కేళిఁ ద్రుంచితి సర్వయజ్ఞఫలావహ
ప్రక్రియాత్ముఁడ వీవు నిశ్చలభావభవ్య జనార్దనా! "
                        భార. ఆర. 4. 376, 377, 378.

అని పరిపరివిధములఁ జేసిన యుదంకుని ప్రస్తుతి కలరి మహేశుఁడు “ వత్సా! నీ కేమి కావలయునో కోరుకొను మనుగ్రహించెద" నని దయామయుఁడై వీనులవిందుగాఁ బలికెను. "దేవాదిదేవా! నీ దివ్య రూపము నిట్లు ప్రత్యక్షముగాఁ గనఁగల్గితిని. ఇంతకంటె నాకుఁ గావలసిన వరమే లేదు. ఐనను నా మనస్సు సత్యధర్మశమములయందు.. స్థిరముగా నుండునట్లు నాకు నీపై భక్తి స్థిరముగ నిలుచునట్లు ననుగ్రహింపు" మని యుదంకుఁడు ప్రార్థించెను. శివుఁ డట్లే యని యాతని కోరినవర మనుగ్రహించి లోకహితార్థము సత్కృతు లొనరింపు మని దీవించి యంతర్హితుఁడయ్యెను.

ఉదంకుఁడు కువలాశ్వు ననుగ్రహించుట

తొల్లి యిక్ష్వాకువంశజుఁ డగు బృహదశ్వుఁ డనుమహారాజు కువలాశ్వుఁ డనుసత్పుత్త్రునిం గాంచెను. సంతానవంతుఁడును, సమర్థుఁడును, సర్వధర్మరతుఁడును నగుకుమారునికిఁ బట్టాభిషేకము చేసి రాజ్యమాతని కొప్పగించి బృహదశ్వుండు వనమునకుఁ బోయి తపస్సు చేసికొన నిశ్చయించుకొనెను. ఆ సమయమున ఉదంకమహర్షి యచటికి విచ్చేసి బృహదశ్వునిచే సత్కృతు లంది యాతని కిట్లు బోధించెను. “రాజా! నీవు ప్రజారక్షణము చేయుటే ధర్మము. అది మాని యడవికిఁ బోవలదు. రాజులకుఁ బ్రజాపరిపాలనము చేయుటకంటె నధికవ్రతము లేదు. ప్రాచీనరాజు లందఱును ధర్మపాలనముననే కీర్తి గాంచిరి. నీ వంటి మహారాజు బాహుబలమున నేల యేలుచుండుటచేతనే నా వంటి మునులు తపముచేసికొనుచు ధర్మకర్మము లాచరించుట సాధ్యమైనది.

మఱియు నొక విచిత్రవిషయముఁ జెప్పెదను. మధుకైటభులని పేరువడ్డ రాక్షసులకుఁ గుమారుఁడై పుట్టిన ధుంధుఁడనువాఁడు బ్రహ్మదేవునిఁ దపమున మెప్పించి వరములు పడసి దేవదానవులకు గంధర్వులకు జయింపరానివాఁడై మదించి యున్నాఁడు. ఆతఁడిపుడు మా యాశ్రమసమీప ప్రదేశమున సముద్రమునందలి యిసుక తిప్పలోఁ బెద్దబిలము గావించుకొని యందుసుఖముగా నిద్రించుచున్నాఁడు. వాఁడు విడిచిన నిశ్వాసపు గాలి సంవత్సరమున కొకమాఱు పైకి వచ్చి పెద్దగాలిదుమారముఁ గల్పించును. దానివేగమున నచ్చటి భూమి, శిలలు, వృక్షములు ఏడు దినములదాఁక కంపించుచునే యుండును. వానిమూలమున మాకును మా యాశ్రమవాసులకును జాల భయముగ నున్నది. నీవు వానిని జంపి మాకును లోకమునకును మేలొనగూర్పుము. ఇంకొకరహస్యము. ఈ దుర్మార్గునిఁ జంపఁదలఁచిన వానికిఁ దాను సంపూర్ణసహాయుఁడ నగుదు నని పరమశివుఁడు నాకుఁ జెప్పియున్నాఁడు. నీవు తక్క ఈ పని యింకొకరు చేయలేరు. కావున, నీ వట్లొనర్చి లోకసంరక్షణ మొనర్పు" మని కోరెను. “ఋషీంద్రా ! నేను అస్త్రసన్న్యాసము చేసి వనమున కేఁగ దృఢనిశ్చయుఁడనైతిని. నన్ను మన్నింపుము. నీవు కోరినపని నా తనయుఁ డగు కువలాశ్వుఁ డొనరింపఁ గలఁడు. కాన, దయతో నా కనుజ్ఞ ని” మ్మని కోరి బృహదశ్వుఁ డడవికిఁ బోయెను.

తండ్రియాజ్ఞ ననుసరించి యుదంకమహర్షి కోరికఁదీర్ప నభిలషించి కువలాశ్వుఁ డుదంకునిఁ గూడ నిడుకొని ధుంధుని నెదిరించి ప్రచండయుద్ధమున నాతని నోడించెను. కువలాశ్వుఁడు బ్రహ్మాస్త్రముఁ బ్రయోగింప నది ధుంధుని గాల్చి బూడిదచేసి విడిచెను. ఇంద్రాదులు విచ్చేసి ధుంధుమారుఁ డని కువలాశ్వుఁ బ్రశంసించి యుదంకునికి నమస్కరించి వెడలిరి. ఉదంకుఁడు సంతోషించి కువలాశ్వు నాశీర్వదించి నిజాశ్రమమున కేగెను.*[2]

శ్రీకృష్ణుఁడు ఉదంకాశ్రమమునకు వచ్చుట

శ్రీకృష్ణుఁ డొకప్పుడు హస్తినాపురమునుండి ద్వారకానగరమున కేఁగుచు మార్గమధ్యమునఁ గల ఉదంకమహర్షి యాశ్రమమునకు విచ్చేసెను. ఉదంకుఁడు బ్రహ్మానందమున నాతని నెదుర్కొని షోడశోపచారములతో నతిథిసత్కారము లోనరించి యధికభక్తిఁ జూపెను.

ఆ పిమ్మట అన్నియు నెఱిఁగియు నేమియు నెఱుఁగనట్లు ఉదంకుఁడు " కృష్ణా! కౌరవపాండవులకు బంధుభావము నెలకొల్పి రాజు లందఱును సుఖముగా నుండునట్లు చేసితివికదా? కౌరవులన్నను బాండవు లన్నను నీ కేమాత్రము భేదము లేదు. నీవు నిష్పక్షపాతబుద్ధివి " అని యె త్తిపొడిచెను. శ్రీకృష్ణుఁడు నన్నియు నెఱిఁగియు నేమియు నెఱుఁగనివానివలె " ఋషీంద్రా ! నేను కురురాజుతో నెంతయో యుచితముగా మాటాడితిని, బెదరించితిని. నయమునఁ జెప్పితిని. భయమునఁ జెప్పితిని. భీష్మద్రోణులును జెప్పిరి. బలవంతపెట్టిరి. ఐన నాతఁడు సంధి కంగీకరింపఁడయ్యె. అతిలోభులై వంశధర్మము విడిచి యే విధముగను సంధి కంగీకరింవక కౌరవులు పాండవులతోఁ బోరి సపుత్ర మిత్రపరివారముగా స్వర్గమునకుఁ బోయిరి. పాండవు లైదుగురు మాత్రము మిగిలిరి. కాలనియతిం గడవ నెవ్వరికిని శక్యము కాదు గదా" యని పలికెను.

ఉదంకుఁడు శ్రీకృష్ణుని శపింపఁబూనుట.

ఆ మాటలకుఁ గోపించి యుదంకుఁడు “కృష్ణా! నీవు దొంగవు. నీవు నిజముగఁ దలఁచిన సంధి జరుగకపోయెడిదా! నీవు మిథ్యాచారుఁడవై శక్తి గలిగియు సంధి చేయక కౌరవకులమును సర్వనాశనము చేసితివి. ఈ దోష మంతయు నీదే. ఈ దోషమునకు నిన్ను శపించెదను జూచుకొ"మ్మని హుంకరించెను. "మునీంద్రా ! నీవు నన్ను శపించిన శపింపవచ్చును గాని ముందు నామాటలు వినుము.

సత్త్వరజస్తమోగుణములు నా వశమునఁ బ్రవర్తించును. మరుత్తులు వసువులు మున్నగువా రెల్లరు నా యందే పుట్టిరి. నే నన్నిఁటియందు నుందును. అన్నియు నా యం దుండును. అపర మన్నను . పర మన్నను రెండు తత్త్వములు నేనే. ఓంకారముతోఁ గూడిన వేదములు నేనే. నాలుగు వర్ణములు నేనే. నాలు గాశ్రమములు, వానివాని సర్వకర్మజాలములు, స్వర్గమోక్షములు అన్నియు నా వశము లని యెఱుంగుము. క్రతుపరులు నన్నే సంస్తుతించి ఫలమును పొందుదురు. దోషులు నన్నుఁ గీర్తించి ప్రాయశ్చిత్తములు చేసికొని కృతార్థు లగుదురు. మనోధర్మములకు నేనే కర్తను. బ్రహ్మవిష్ణుమహేశ్వరరూపము ధరించి సృష్టిస్థితిలయములు నేనే యొనరింతును. లోక సంరక్షణార్ధమై అధర్మాత్ములఁ ద్రుంచి ధర్మముల నుద్దరించెదను. ఐనను, అధర్ము లగు కౌరవులను ధర్మాత్ములగు పాండవులతోఁ గలుపుటకు శక్తి వంచనలేక ప్రయత్నించితిని. దివ్యజ్ఞాన సంపన్ను లగువ్యాసాదిమహర్షుల కాసంగతి తెలియును. వారు నన్ను మెచ్చుకొనిరి. దురాత్ము లగుకౌరవులు మహాత్ములగు పాండవుల నెదుర్కొని ధర్మయుద్ధమున నశించిరి. ఇది నేఁ జేసినపని. ఇఁక నన్ను శపించిన శపింపుము. స్తుతించిన స్తుతింపుము అని కృష్ణుఁడుపలికెను.

ఉదంకమహర్షి యాతని పాదములకుఁ బ్రణమిల్లి లేచి " దేవా ! తెచ్చిపెట్టుకొన్న యహంకారమున నీ వేమందువో యని యట్లలుక నటించితిఁ గాని సర్వమును నే నెఱుఁగుదునుగదా! ఆ యీ చనవుబలిమిని చేసిన యపరాధమును క్షమించి దయతో నీ విశ్వరూపము నొక్కసారి చూపుము. దాన నా మనస్సు, చూపు, జన్మము ధన్యములు కాఁగా జన్మరాహిత్య మందెద" నని ప్రార్థించెను .

శ్రీకృష్ణుఁడు దయదలఁచి యర్జునునికిఁ జూపిన విశ్వరూపము ఉదంకునకుఁ జూపెను. వెంటనే ఉదంకుఁ డాశ్చర్యభయభక్తులతోఁ జేతులు మోడ్చి “నమః పురుషో త్తమాయ తే" యని నిలిచి గద్దదస్వరముతో "దేవా! పుండరీకాక్షా! నీ పాదము లీ భూమియంతయు వ్యాపించినవి. నీ చేతు లాకసము నాక్రమించినవి. ఆకాశము నీ కడుపుతో నిండిపోయినది. దిశ లన్నియు నెచ్చటఁ జూచినను నీ చేతులతో నిండి పోయినవి. ఇన్నిచరణములు, ఇన్ని తలలు, ఇన్ని హస్తములతో నన్నియు నీ వైతివి. ఈ నీ విశ్వరూపము నా కన్నులను మనస్సును దన్పినది. విశ్వరూపా ! ఈ రూప ముపసంహరింపుము" అని కోరెను. "నీ కే వరము కావలయునో కోరుకొను” మని యా పరమేశ్వరుఁ డనెను. “నీ దివ్యరూపముఁ జూచితిని. జన్మము ధన్య మయ్యెను. ఇంక నా కేమియు వల" దని యుదంకుఁ డనెను. “ అట్లు కాదు. నన్నుఁ గన్న వారికి శుభ మీయక పోను. ఏది కావలయునో వెంటనే కోరుకొను మిచ్చెద" నని యా దేవాదిదేవుఁ డత్యాదరముతోఁ బలికెను.

“అగుచో దేవా ! లోకహితమే ఆత్మహితము. కానఁ గోరెద. ఇది మరుదేశము. ఇచట జల మెప్పుడును దుర్లభము. కావున, ఈ ప్రదేశమును జలయుక్తము చేయు" మని యుదంకుఁడు రోరెను. శ్రీకృష్ణుఁడు విశ్వరూప ముపసంహరించి “నన్నుఁ దలంచినపుడు నీకు జలములు లభించు” నని వర మిచ్చి యంతర్హి తుఁ డయ్యెను.

ఒకనాఁ డుదంకుఁడు దప్పిగొని శ్రీకృష్ణుని స్మరించెను. వెంటనే యొకమాలవాఁడు బాణబాణాసన పాణియు, దిగంబరుఁడు, మలినాంగుఁడు నయి కుక్కలు తన చుట్టు చేరి రాఁగా, ఒడలెల్ల నీరు చిమ్ముచుండ నుదంకుని జేరి "అయ్యా! నీరు త్రావి దప్పి పోఁగొట్టుకొను” మనెను. వానిని "వలదు. పొ మ్మని” యుదంకుఁ డదల్బెను . ఓయీ "నీ మీఁదిదయతో వచ్చితిని, త్రావు” మని మరల ననెను. ఉదంకుఁ డాతని నలుకతోఁ బో పొమ్మని కసరెను, వాఁడు కుక్కలతో నంతర్ధాన మయ్యెను. ఇది యంతయు శ్రీకృష్ణమాయ యని యుదంకుఁడు తలపోయుచుండఁగాఁ గృష్ణుఁ డచటికి వచ్చెను. "అయ్యా! కృష్ణభగవానుఁడా ! నీ విచ్చిన వరము వ్యర్థమైనది. మాలవాని యొడలి జలము నేను త్రావుదునా ? ఇదియా నీవు నాకుఁ జేసిన మేలు?” అనెను. శ్రీకృష్ణుఁ “డయ్యా! నే నింద్రునిఁ బ్రార్థించి నీ కమృత మిమ్మంటిని. ఆతఁడు దేవా! మానవుల కమృత మేల? మఱియొక టేదైన నిచ్చెద ననెను. అట్లు కా దా మహర్షి కమృతమే యిమ్మని నేనంటిని. “సరే, నేను మాలవాని వేషమున నేఁగి యమృత మీఁ జూచెదను. ఆతఁడు వల దని తిరస్కరించిన నేను బోయెద' నని నాతోఁ జెప్పి నీ కడకు వచ్చెను. నీవు చేతులార నమృతముఁ జెడఁకొట్టుకొంటివి. పోనిమ్ము. నా దయ నీ వమృతుఁడ వై తివి. నీవు జీవించియున్నంతకాల మెప్పుడు తలఁచిన నపు డీమరుభూమిలో మేఘములు చాలినంత వర్షమిచ్చుఁ గాక ! ఆ మేఘములు నీ పేరు 'ఉదంకమేఘము' లనఁ బరఁగును. చిరకాలము నీవు తపోజీవనముఁ గడపి తుదకు మోక్షమందుదు” వని యాశీర్వదించి హరి యదృశ్యుఁ డయ్యెను.

ఉదంకమహర్షి చిరకాల మట్లు జీవించి భక్తి జ్ఞానవైరాగ్య సంపన్నుఁడై మోక్ష మందెను.*[3]


  1. భారతము; ఆదిపర్వము; అశ్వమేధపర్వము.
  2. *భారతము ; ఆరణ్యపర్వము,
  3. *భారతము ఆశ్వమేధపర్వము.