మహర్షుల చరిత్రలు/జైగీషవ్యమహర్షి
మహర్షుల చరిత్రలు
జైగీషవ్య మహర్షి
జై గీషవ్యుఁడు మహాయోగీశ్వరులలో నొకఁడు. ఈతఁడు యోగవిద్యచే సాధింపనివిషయమే లేదు. అణిమాది సిద్ధులేకాక ఆకాశగమనము, అనేక లోక గమనము మున్నగు మహా యోగసిద్ధు లీతనికిఁ గరతలామలకములు. ఈ మహర్షి తల్లి దండ్రుల పవిత్రనామములు కాని చరిత్రలు కాని కానరావు. జిగీషువు అనఁగా జయింపనిచ్చగలవాఁ డని యర్ధము. ఇంద్రియ జయము, యోగవిజయము, నపారముగఁ గన్న వాఁడగుటచే నీతఁడు జై గీషవ్యుఁడను సార్థకనామముఁ గన్న వాఁడయ్యెను. ఈ మహాత్ముఁ డాజన్మ బ్రహ్మచారి. కేవల పరబ్రహ్మ సంభూతులైన మహనీయులకు సంసారపు జంజాటము లేకపోవుటలో నాశ్చర్యములేదు. ఈతఁడు కపిలమహర్షితోడను దేవలమహర్షితోడను గలిసి తఱచు తిరుగుచుండువాఁడు. అంతేకాదు, ఈ యోగీశ్వరుఁడు కైలాసపర్వతమున నున్న పార్వతీ పరమేశ్వరుల సన్నిధానమున మెలఁగుచో వారికిఁ దలలో నాలుకయై తనరారువాఁడు. అవధూత వేషధారుఁడు, మహాయోగి, మహాజ్ఞానియగు నీతఁడు సర్వశక్తిసంపన్నుఁడు.
కపిల జైగీషవ్యులయోగశక్తి
జై గీషవ్యుఁడు కపిలమహర్షికి శిష్యుఁడు, మిత్రుఁడు, సమస్తమును. ఒకనాఁడు వీరిరువురు మహాభక్తుఁడగు అశ్వశిరుఁడను రాజును గటాక్షింప వాని గృహమున కేఁగిరి. యజ్ఞ దీక్షితుఁడై యున్న అశ్వశిరుఁడు వారిని గౌరవించి యతిథి సత్కారము లాచరించి సుఖాసీనులఁ జేసిన పిదప వారికి సాష్టాంగ సమస్కారములొనర్చి "మహానుభావులారా! మీ రాకచే నా గృహము పవిత్రమైనది. నేను ధన్యుఁడనై తిని. నా యజ్ఞము ఫలప్రదమైనది. దయయుంచి విష్ణుమూర్తి సత్వరకటాక్ష సంపాదసకు నే నేమి చేయవలయునో ఆనతిం”డని ప్రార్థించెను. అంత కపిలమహర్షి “రాజా! నే నా విషయము నీకుఁ దెలుపుటకేవచ్చితిని. నన్ను విష్ణుముర్తిగా నెఱిఁగి త్రికరణశుద్ధిగా సేవింపుము. నీకు సర్వ వాంఛలు సిద్ధించు" ననిపలికెను. రా జజ్ఞానియై యీవాక్యములు కపిలుని యహంకార వాక్యము లని తృణీకరించి "అయ్యో! విష్ణుమూర్తిని నే నెఱుఁగుదును. ఆతఁడు శంఖచక్రగదాపాణి, గరుడవాహనుఁడు. అవిలేని నీవు విష్ణుఁడవన్న నేను నమ్ముదునా?" యని పలికెను. వెంటనే యోగశక్తిచే కపిలమహర్షి శంఖచక్రగదాపాణియై విష్ణువై నిలిచెను. జై గీషవ్యుఁడును దనయోగశక్తిచే గరుడుఁడై విష్ణుమూర్తి వాహన మయ్యెను. అశ్వశిరుఁడు నమ్మఁజాలక "అయ్యా! విష్ణుమూర్తి కమలనాభుఁడు. బ్రహ్మ విష్ణు నాభి కమలమందుండి జన్మించెను. నీవు పద్మనాభుఁడవా? నీ నాభి నుండి జన్మించిన బ్రహ్మ యేఁడి?" అని కపిలుని ప్రశ్నించెను. వెంటనే కపిలమహర్షి యోగమహత్త్వమునఁ గమలనాభుఁ డయ్యెను. జై గీషవ్యుఁడును యోగశక్తిచే విష్ణునాభికమలము నుండి జన్మించిన బ్రహ్మయై నిలిచెను. ఐనను నమ్మఁజాలక అశ్వశిరుఁ “డిది యంతయు మోసమే. నీవు విష్ణుమూర్తి వన్న నేను జచ్చినను నమ్మను. పొ"మ్మనెను. వెంటనే కపిలుని యోగశక్తిచే సభాసదు లెల్లరు నంతర్జాను లైరి. యజ్ఞశాల యంతయు భయంకర వన మృగములతో నిండిపోయెను. అశ్వశిరుఁ డెటు చూచినను ఘోరభయానక దృశ్యములే కాననగుచుండెను. మృత్యుదేవి దంష్ట్రలు దీటుచు మీఁదఁ బడుచున్నట్లుండెను. అశ్వశిరుఁడు గజగజవణఁకిపోయి “మహాప్రభూ! రక్షింపుము. రక్షింపుము. నీవే విష్ణుఘూ ర్తివి. నీతోడి జై గీషవ్యుఁడే బ్రహ్మ. మీ యిరువురకు సాష్టాంగ వందనము” లని భూనభోంతరాళము లదరునట్లేడ్చుచుండఁగనే యాదృశ్య మదృశ్య మయ్యెను. సభాసదులు విచ్చేసిరి. యజ్ఞశాల సర్వమంగళసంభారములతో నిండిపోయెను. అశ్వశిరుఁ డా యోగిపుంగవుల పాదములపై వ్రాలెను. వా రాతనికి 'సర్వం విష్ణుమయం జగ' త్తను విషయమును విపులముగ బోధించి యాశీర్వదించి వెడలిరి. నాఁటి నుండి కపిల భగవానునియు, జై గీషవ్యయోగీశ్వరునియు నద్భుత మహిమలు సర్వలోకములందు వ్యాపించెను *[1]
దేవలుఁడు జై గీషవ్యుని శిష్యుఁ డగుట
దేవలుఁడు మహాయోగి. తాను మహాయోగి నను నభిమానము కూడ నాతని కుండెను. ఐన నాతఁడు సత్యవ్రతులలో నుత్తముఁడు. మహాతపస్వి. బ్రహ్మనిష్ఠుఁడు నని మహాఖ్యాతిగాంచెను.
ఒకనాఁడు జై గీషవ్యుఁడు దేవలునింటికి విచ్చేసెను. దేవలుఁ డాతని కతిథిసత్కారము లొనరించి యాదరించెను. జై గీషవ్యుఁడు "అయ్యా ! నీవు మహాతపశ్శాలివి. నీ కడనుండి నేను ప్రశాంతముగాఁ దపము చేసికొనఁ దలఁపు కలిగి వచ్చితిని. నా కాశ్రయ మిచ్చెదవా?" అని యడిగెను. జై గీషవ్యునంతటి మహా యోగీశ్వరుఁడు తనకడ కరుదెంచి యాశ్రయము కోరుట నిజముగాఁ దనయాధిక్యమును గుర్తెఱింగియే యని భావించి దేవలుఁ డానందమున నందుల కంగీకరించెను. పిదప దేవలుఁడు జై గీషవ్యునికి వలయుసౌకర్యములను గల్పించి యాతఁ డందు మౌననిష్ఠ మహాతపస్వియైయుండ భోజనవేళ కాఁగానే పుష్పాదులఁ బూజించి ఫలాదుల నర్పించి యాతని నన్ని విధముల నాదరించుచు నుండెను.
ఇట్లు కొన్ని సంవత్సరములు గడచెను. జై గీషవ్యుఁడు మౌననిష్ఠ విడువక, ఉగ్రతపము సాగించుచు, ఉజ్జ్వలతేజమునఁ బ్రకాశించుచు దేవలుని నిందింపక, నందింపక, ఉలుకక, పలుకక, కలఁగక, అలుగక, కదలక, మెదలక, యుండెను. దేవలుఁడు తనయోగశక్తిని జై గిషవ్యునికిఁ జూపి యాతని మెప్పుపొందఁ దలఁచెను. ఒకనాఁ డాతఁడు జై గీషవ్యుఁడు చూచుచుండఁగనే యంతర్హితుఁడై సముద్రస్నాన కుతూహలుఁడై యొకపవిత్ర ప్రదేశమున దిగెను. అప్పటికప్పుడే యచట సముద్రస్నాన మాచరించి జపము చేసికొనుచు సికతాతలమునఁ గూర్చున్న జై గీషవ్వు నాతఁడు కాంచి తన కన్నులను దాను నమ్మలేక యాశ్చర్యభరితుఁడై తాను స్నానకృత్యమును నిర్వర్తించి యోగశక్తి నింటికి వచ్చి చేరెను. ఇంటియొద్ద యథాస్థానమున జై గీషవ్యుఁడు మౌననిష్ఠం గూర్చుండియే యుండుట దేపలుఁడు కాంచి ఆహా ! నేనే యోగశక్తి సంపన్నుఁడ నన్న యహంకారము పటాపంచలైనది. జై గీషవ్యుని ముందు నేనెంత?” యనుకొని సిగ్గుపడెను. ఐన నహంకారము మరల వచ్చి యాక్రమించెను. అంత నాతఁడు తన గొప్పతనమును నిరూపింపఁ దలఁచి జై గీషవ్యుని కన్నులయెదుట మంత్ర పారగుఁడగునాతఁడు శరవేగమున ఆకాశమున కెగిరిపోయి సిద్ధలోకముఁ జేరెను. అప్పటికే యట నున్న జై గీషవ్యుని శిష్యులై సేవించుచున్న సిద్దులను జూచి దేవలుఁ డాశ్చర్యపోయి యటనుండి పితృలోకమున కెగసి పోయెను. అంతకుముందే యక్కడను జై గీషవ్వుఁ డెల్ల రచేఁ బూజింపఁబడుచుంటఁ గాంచెను. దేవలుఁడు వెంటనే యామ్యలోకమున కేఁగెను. అచట కూడ నదియే జరుగుచుండెను. దేవలుని యాశ్చర్యమునకు మేర లేకుండెను. మఱియు నాతఁడు సోమలోకమున కేఁగెను. అక్కడను జై గీషవ్యునకు పూజలే జరుగుచుండెను. దేవలుఁడు తనయోగశక్తి నంతయు వినియోగించి అగ్నిలోకమున కేఁగెను. అక్కడ నంతే. దేవలుఁడు తపోలోకమున కేఁగెను. అక్కడ నంతే. మిత్రావరుణలోకమున కేగెను. అక్కడ నంతియే. ఆదిత్యలోకమున కేఁగెను. అక్కడ నంతియే. రుద్రలోకమున కేఁగెను. అక్కడ నంతియే. వసులోకమున కేఁగెను. అక్కడ నంతియే. బృహస్పతి లోకమున కేఁగెను. అక్కడనంతియే. గోలోకమున కేఁగెను. అక్కడ నంతియే. బ్రహ్మసత్రి లోకమున కేఁగెను. అక్కడ నంతే. పతివ్రతా లోకమున కేఁగెను. అక్కడ నంతే. ఇట్లెల్ల లోకములందుఁ దనకంటె ముందుగా నేఁగి పూజ లందుచున్న జై గీషవ్యుని దేవలుఁడు కాంచెను. పతివ్రతాలోకమున దేవలుఁడు ఱెప్పవాల్పక జై గీషవ్యునిజూడ మొదలిడ నాతఁడట నదృశ్యుఁడయ్యెను. దేవలుఁడు యోగశక్తిచే నెంత యత్నించినను, ఇఁక పై లోకమున కేగలేక, యటనున్న సిద్దులం బిలిచి “మహాత్ములారా! జై గీషవ్య భగవానుఁ డెట కేఁగెను? ఆతనియోగ శక్తి యెంతటిది? అతఁడిపు డేలోకమున నున్నాఁడు? దయతోఁ దెలుపుఁడని ప్రార్థించెను.
సిద్దులు దేవలు నాదరించి " మునీంద్రా ! జై గీషవ్యుఁడు యోగీశ్వరేశ్వరుఁడు. ఆతఁడు శాశ్వత బ్రహ్మలోకమున కేఁగినాఁడు. నీ వది చేరుట కింకను బెక్కు వేలేండ్ల తపస్సు చేయవలయును. ఆతనికి నీపై నెంతయో యాదరము కలదు. అందుచేత నీ యాశ్రమమునకు వచ్చినాఁడు. అతనివలన నీ కెన్నియో శుభము లగును. పొ”మ్మని పలికిరి. దేవలుఁడు, ఒక వంకనాశ్చర్యము మఱియొక వంక జై గీషవ్యునిపై భయభక్తిశ్రద్ధా గౌరవములు నిను మడించుచుండఁగా యోగశక్తిచే నొక్కొక్కలోకము నుండియు దిగుచుఁ దనయాశ్రమమునకువచ్చి చేరెను. అచట మౌననిష్ఠతోఁ గదలక మెదలక జై గీషవ్యుఁ డాతనికిఁ గాననయ్యెను.
దేవలుఁడు జై గీషవ్యుని పాదములపై వ్రాలి " మహాత్మా ! నీవు సామాన్య మానవునివలె వచ్చి నా యాతిథ్య మర్థించితివి. నేను నా యోగశక్తులు నీకుఁ జూపి నీకు వలసినశక్తు లనుగ్రహింతమనుకొంటిని. నా యహంకార ముడిపి నన్ననుగ్రహింప విచ్చేసిన పరమేశ్వరుఁడవే నీవు. నాయందు దయయుంచి కార్యాకార్యస్వరూపము, సన్న్యాస యోగము, మోక్షధర్మములు, సవిస్తరముగా నెఱిఁగింపు" మని ప్రార్థించెను. జై గీషవ్యుఁడు "దేవలా! నీవు సామాన్యునివలె నన్ను స్తుతించితివి. నీవును దక్కువవాఁడవుకావు. మౌననిష్ఠకు యోగ్యమగు తావు నీ యాశ్రమమే యగుట నిచటికి వచ్చితిని. నీవు న న్న తిథిశుశ్రూషల నలరించినావు. నా మౌనవ్రత మింతటితో సరియైనది. నన్ను శ్రద్ధాభక్తుల నీవు సేవించితివి కావున నీవు కోరినను కోరకున్నను నా శక్తులు నీకు రాఁగలవు. శ్రద్ధా భక్తులతో నెవరు విప్రుల సేవింతురో వారికి సర్వసిద్ధులు లభించును. కావుననే, సాధుసజ్జన సాంగత్యము, విబుధారాధనము, విప్రసేవ వ్యర్థముగఁ బోవు. అవి సేవించువారి యోగ్యతనుబట్టి బహుగుణవర్ధిత ప్రతిఫలము నిచ్చితీరును" అని యాతని నేకాంతమునకుఁ దీసికొని పోయి యాతనికి సమస్త ధర్మములు బోధించి, సందేహ నివారణ కావించి యనుగ్రహించెను. దేవలుఁ డాతనిశిష్యుఁ డయ్యెను.
జై గీషవ్య ప్రబోధితుఁ డగుదేవలుఁడు గృహస్థాశ్రమమొల్లక సన్న్యసింపఁబూని తన నిశ్చయమును జై గీషవ్యుని కెఱింగించెను. అంతలో భూతజాలము, పితృదేవతావర్గము నాక్రోశించుచు వచ్చి గృహస్థాశ్రమమును వీడవలదని యాతని నర్థించెను. దేవలుఁడు జై గీషవ్యు ననుమతి గొని తనతపస్సు ధారపోసి భూతతృప్తి కలిగించి పితృదేవతల కుత్తమ గతు లొనగూర్చి పిదప సన్న్యసించి మోక్షధర్మ మవలంబించెను. బృహస్పతి ప్రముఖు లచటి కరుదెంచి దేవల జై గీషవ్యుల నభినందించిరి. దేవలజై గీషవ్య నివాసస్థానమగు నా ప్రదేశము దివ్యతీర్థ మయ్యెను.
మఱియొకప్పుడు పరమప్రాజ్ఞుఁడు పరమశాంతుఁడు పరమ సుఖియునగు జై గీషవ్యుని దర్శించి దేవలమహర్షి 'మహాత్మా! నీ యీ పరమప్రశాంతస్థితికిఁ గారణ మేమి? ఏ యాచారమున, ఏ శీలమున, ఏ విద్యచే ముక్తికలుగును? తెలుపు" మని ప్రార్థించెను, అందులకు జై గీషవ్యుఁ డిట్ల నెను. “దేవలా! శాంతిమంతు లైనసౌమ్యులు నిష్ఠా గరిష్ఠులై యుండు ద్వంద్వాతీత స్థితి యందు నే నుందును. ఆస్థితియందు
"వినుతించిన నిందించిన
ననఘా ! మనమునఁ బ్రియంబు నప్రియమును లే
కునికియు వ్రేసిననై నను
కనలు పొడమమియుఁ బ్రబుద్ధగణ్యగుణంబుల్ .
ఒకటి కోరి దాని కుల్లంబు కుందంగఁ
జాలఁబడమి, యేమి సంభవించె
నేని దానఁ దృప్తి నూనుట తప్పిన
పనికి వగవకునికి భవ్యగుణము.
హర్షంబును మానంబు న
మర్షము నపరాధమును సమదభావము ను
త్కర్షాపకర్షచింతలు
ఆర్ష సమాచారమున నిరసగుణంబుల్ .
అవమానమునకుఁ దృప్తుం
డవు నమృతముఁ ద్రావినట్ల, యంచితసమ్మా
నవిధికి నుద్వేగముఁ బొం
దు విషంబునఁబోలె, శమరతుఁడు మునినాదా!
చుట్టము పగ యనుభేదం
బెట్టి జనులవలనఁ దగుల దెల్లప్పుడు నె
ప్పట్టున నద్దానను మదిఁ
బుట్టదు సంతోషహాని బుద్ధాత్మునకున్.
ఇంద్రియముల గెల్చి హృదయంబు శాంతిసు
ఖంబుఁ బొంద నిర్వికారవృత్తి
యైనవానిపొందు మానితగతి దేవ
తలకుఁ బొంద నరిది ధర్మనిరత !”
(భార. శాంతి. 5, 22-27.)
అని పలికెను. దేవలుఁ డిది విని ద్వంద్వాతీతస్థితి నంది చెలు వందెను.
జై గీషవ్యుని పార్వతీపరమేశ్వరులు పరీక్షించుట
జై గీషవ్యుఁడు పార్వతీపరమేశ్వరులు మేరుపర్వత ప్రాంతమున విహరించుచున్న సమయమునఁ బోయి యీశ్వరసన్నిధిని గూర్చుండెను.
పరమేశ్వరుని పరివార మంతయు నట విడిసియుండెను. సిద్ధసాధ్యయక్షగంధర్వాప్సరోగణములు వారిని సేవించు నవకాశమున కెదురుచూచుచుండెను. ఆ సమయమున పార్వతీపరమేశ్వరుల ప్రసంగవశమున పార్వతి “దేవా! అర్థ మేది ? అర్థశక్తి యేది? దయ దలఁచి తెలుపు" మని భర్తను ప్రార్థించెను. పరమేశ్వరుఁ డిట్ల నెను. "దేవీ ! అర్థమును నేను. అర్థశ క్తివి నీవు. నేను భో క్తను. నీవు భోజ్యమవు. నేను వరుఁడను. నీవు ప్రకృతివి. విష్ణుఁడను, బ్రహ్మను, యజ్ఞపురుషుఁడను నేనే.” “నాథా ! అర్థము, అర్థశక్తి వీనిలో నేది యధిక" మని పార్వతి పరమేశ్వరు నడిగెను. ఆతఁడేమియు సమాధానము చెప్పక మిన్నకుండెను. అపుడు జై గీషవ్యుఁడు "తల్లీ ! అర్థమే అధికమైనది. అర్థశక్తి యర్థమునందు లయించియున్న" దని బదులుచెప్పెను. తాను తనభర్తను బ్రశ్నింపఁగా సమాధాన మిచ్చుటకు వీఁడెవఁ డనియు, తన్నడుగనిదే పలుకుట కాతని కెంతకండకావర మనియు పార్వతి యాతనిపైఁ గోపించెను. అది గ్రహించి జై గీషవ్యుఁ డటనుండి వెడలిపోయెను. అపుడు శివుఁడు పార్వతిని జూచి "దేవి! అతఁడు జై గీషవ్యుఁడు. మహాయోగి. మహా జ్ఞాని. మనపరమభక్తుఁడు. పరమ ప్రశాంత చిత్తుఁడు. ఆతని నట్లు కోపించితివి. ఆతఁడు నా భక్తుఁడు. సఖుఁడు, శిష్యుఁడును" అని పలికెను. అందులకు పార్వతి “దేవా! నీ నా సంభాషణమున నాతఁ డడ్డువచ్చి సమాధాన మిచ్చుట న న్న వమానించుట కాదా? మనల నాశ్రయించి వరములు గ్రహింప వచ్చిన యాతఁడు మనతో సమానస్థాయిని మాటాడి దోషయుక్తుఁడై నాఁ" డని పలికెను. దానిపై శివుఁడు "దేవీ! కాదు. కాదు. ఆతని కే వరము నక్కఱలేదు. ఆతఁ డట్టి వాశించి మనకడకు రాలేదు. ఆతఁడు ద్వంద్వాతీతుఁడు, సమ లోష్టాశ్మ కాంచనుఁడు, నిరాశి. ఆతని కింద్రత్వము, బ్రహ్మత్వము, రుద్రత్వము తృణప్రాయములు. ఆతఁడు బ్రహ్మజ్ఞాని. ఆతని నీ వట్లు తృణీకరింపరా" దనెను. అందులకుఁ బార్వతి “ఐనచో నాతని ఆశా రాహిత్యమును బరీక్షింప నా కనుజ్ఞ యి” మ్మని పరమేశ్వరునిం గోరెను. ఆతఁడంగీకరించెను. అపుడు పార్వతీపరమేశ్వరులు వృషభారూఢులై కొంతపరివారము వెంట రాఁగా, పరిశుద్దాత్ముఁడు, ముని శ్రేష్ఠుఁడు నగు జై గీషవ్యుని యాశ్రమమునకు వచ్చి చేరిరి.
ఏ కోరికయు లేక గాలిలేనిచోటఁ బ్రకాశించు దీపమువలె వెలుంగుచు, చింపిబొంతఁ దాల్బి చిద్విలాసము ముఖమునఁ దాండవింప నానంద పరవశత్వమునఁ జిందులుద్రొక్కు జై గీషవ్య యోగీంద్రుని దగ్గఱి పార్వతీపరమేశ్వరులు నిలిచి "యోగీంద్రా ! నీకుఁ గావలసినవర మేదైనఁ గోరుకొమ్ము. ఎట్టి యసాధ్యవరమైన ననుగ్రహింతు” మని పలికిరి. జై గీషవ్యుఁడు వారికి నమస్కరించి శంకరుని జూచి "దేవా! నీ దయ ఈయలేని దేమున్నది ? నేను కృతార్థుఁడను. నాకు వలయున దేమియు లేదు” అని బదులు చెప్పెను. పార్వతీపరమేశ్వరు లాతని రెట్టించి రెట్టించి యడిగి యెన్ని విధములనో యాతనిని మభ్యపెట్టఁ జూచిరి. కాని, యాతఁడు తాను సూదియందలి బెజ్జము ననుసరించి పోవుదారమువలె నీశ్వరేచ్చా ప్రపర్తిత జగమున నిరాశి, విజితేంద్రియుఁడునై గమించువాఁడు గావున, నేమియుఁ గోరుకొన నొల్లఁడాయెను. నిజముగ నాత నికిఁ గావలసిన దేమైననున్నఁగదా కోరుట? ఏ కోరిక లేనివాఁ డే కోరిక కోరును? పార్వతీపరమేశ్వరు లెంత యత్నించిన నాతఁడు చలింపఁ డాయెను. పరమేశ్వరుఁడు పార్వతివంకఁ జూచెను. ఆమె జై గీషవ్యుని బలుకరించి కనికరించి తాను బడ్డకోపమునకు బాధపడకు మనెను. ఆతఁ “డమ్మా! కోపతాప ప్రేమశాపము లన్నియు నాకు సమానమే" యని పలికి భక్తితో వారిని వీడ్కొలిపెను. ఈ పరీక్షలో పార్వతీపరమేశ్వరు లోడిపోయిరి. జై గీషవ్యుఁడు గెలిచెను.*[2]