మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/పరధ్యానం
82. పరధ్యానం
అది పొడుగ్గా వెడల్పుగా ఉన్న కాలవ - నదిలోంచి మొదలై నీళ్లులేని ప్రదేశాల్లోకి పోతుంది. కాలవ నదికన్న ఎత్తుమీద ఉంది. అందులోకి పోయే నీటికి ఆనకట్ట ఉంది. సరుకుతో నిండిన పడవలు ఇటూ అటూ పోతున్నాయి. వాటి ముక్కోణపు తెరచాపలు నీలాకాశంముందూ, నల్లటి కొబ్బరిచెట్ల ముందూ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఆ సాయంకాలం రమణీయంగా, ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఉంది. నీరు చాలా నిశ్చలంగా ఉంది. కొబ్బరి చెట్ల నీడలూ, మామిడి చెట్ల నీడలూ దానిలో గీసినట్లుగా ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయంటే నిజమైనదేదో, ప్రతిబింబమేదో వేరుచేయలేనంత అస్పష్టంగా ఉంది. అస్తమిస్తున్న సూర్యబింబం నీటిలో అన్నీ స్పష్టంగా కనిపించేటట్లు చేస్తోంది. సాయంకాలం వెలుగంతా దాని ముఖంమీద ఉంది. అ ప్రతిబింబాలలో సాయంకాలపు నక్షత్రం కూడా కనిపించటం మొదలైంది. నీరు చలనం లేకుండా ఉంది. అటువెళ్లే గ్రామస్తులు కొందరు, సాధారణంగా గట్టిగా సాగదీస్తూ మాట్లాడుకునేవాళ్లు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆకుల గుసగుసలు కూడా ఆగిపోయాయి. మైదానం లోంచి ఒక జంతువు వచ్చింది. నీళ్లు తాగింది. ఎంత నిశ్శబ్దంగా వచ్చిందో అలాగే మాయమైంది. ఆ ప్రదేశాన్ని నిశ్శబ్దం ఆవరించింది. అందులో అన్నీంటినీ ఇముడ్చుకున్నట్లుగా ఉంది.
చప్పుడు ఆఖరవుతుంది. కాని, నిశ్శబ్దం చొచ్చుకుపోయేటట్లుగానూ, అనంతంగానూ ఉంటుంది. చప్పుడు వినిపించకుండా మూసుక్కూర్చోవచ్చు. కాని నిశ్శబ్దాన్ని మూసివేయటానికేమీ ఉండదు. ఏ గోడా దాన్ని మూసివెయ్యలేదు. దాన్ని ప్రతిఘటించటానికి ఉండదు. చప్పుడు అన్నిటినీ కప్పివేస్తుంది. అది ప్రత్యేకంగా విడిగా ఉంటుంది. నిశ్శబ్దం ప్రేమ లాగే అభేద్యమైనది. అందులో చప్పుడు అనీ, నిశ్శబ్దం అనీ విభజన ఉండదు. మనస్సు దాన్ని అనుసరించలేదు. దాన్ని గ్రహించటానికి నిశ్చలంగా చేయబడలేదు. నిశ్చలంగా చెయ్యబడిన మనస్సు తన రూపాలనే ప్రతిబింబింపజేస్తుంది. అవి గీసినట్లుగా స్పష్టంగా ఉండి, ప్రత్యేకంగా ఉండాలని గొడవ చేస్తాయి. నిశ్చలంగా చెయ్యబడిన మనస్సు ప్రతిఘటిస్తుందంతే. ప్రతిఘటన అంతా ఆందోళనే. నిశ్చలంగా చెయ్యబడినది కాక, నిశ్చలంగా ఉన్న మనస్సు నిశ్శబ్దాన్ని ఎప్పుడూ అనుభవిస్తూనే ఉంటుంది. ఆలోచనా, మాటా అప్పుడు నిశ్శబ్దం లోనివే అవుతాయి - అవతలివి కావు. ఎలాటి చిత్రమో, ఈ నిశ్శబ్దంలో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది - కొనితెచ్చుకున్న ప్రశాంతత కాదు. ప్రశాంతత అమ్మకానికి వీలయేది కాదు. దానికి విలువలేదు. దాన్ని ఉపయోగించు కోవటానికి కుదరదు. దానిలో పారిశుధ్యం, ఏకాంతం ఉండే లక్షణం ఉంటుంది. ఉపయోగించటానికి వీలయేది త్వరలోనే అరిగి పోతుంది. ప్రశాంతత ఆరంభం అవదు, అంతం అవదు. ఆవిధంగా ప్రశాంతంగా ఉన్న మనస్సుకి ఆనందం అంటే ఏమిటో తెలుస్తుంది. అది దాని కోరిక యొక్క ప్రతిబింబం కాదు.
ఆవిడ దేన్ని గురించో ఒక దాని గురించి ఆందోళన పడుతూనే ఉంటుందని చెప్పిందావిడ. కుటుంబం గురించి కాకపోతే పక్కింటివాళ్ల గురించి, లేకపోతే ఏదో సాంఘిక కార్యకలాపం. ఆందోళనతో ఆవిడ జీవితం నిండిపోయింది. నిత్యం ఇటువంటి కల్లోలాలు ఏకారణం వల్ల వస్తున్నాయో ఇంతవరకు కనుక్కోలేకపోయిందిట. ఆవిడకి ఏమీ ఆనందం లేదుట. ప్రపంచం అలా ఉంటే ఎవరైనా ఎలా ఆనందంగా ఉండగలరు? ఏదో తాత్కాలికంగా కొంత ఆనందం ఆవిడకి కలగకపోలేదుట. కాని అదంతా గతంలో. ఇప్పుడు ఆవిడ వెతుకుతున్నది జీవితానికి అర్థాన్నిచ్చేదేదైనా ఉన్నదేమోననిట. ఆవిడ ఎన్నిటినో ప్రయత్నించి చూసిందిట. ఆ సమయానికి అవి లాభదాయకంగా కనిపించాయిట. ఎన్నో ముఖ్య సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్నదిట. మత సంబంధమైన విషయాల్లో మనస్ఫూర్తిగా నమ్మిందిట. కుటుంబంలో వారి మరణం కూడా అనుభవమైందిట. ఆవిడకి పెద్ద ఆపరేషను ఒకటి జరిగిందిట. మొత్తం మీద జీవితం సులభంగా గడపలేదని చెప్పింది. తన వంటివాళ్లు ప్రపంచంలో కోటానుకోట్లు ఉండవచ్చునంది. తెలివితక్కువైనా, అవసరమైనదైనా, ఈ గొడవంతటికీ అతీతంగా నిజంగా చేయదగిన మంచిది ఏదైనా ఉన్నదేమో కనుక్కోవాలని కోరుతోంది.
మంచివి వెతికితే దొరకవు. వాటిని కన్నుక్కోవటం కుదరదు. అవి జరగాలి. జరిగేటట్లు గడుసుగా పథకం వెయ్యటానికి కుదరదు. తీవ్ర ప్రాముఖ్యం కలదేదైనా సరే - జరుగుతుంది గాని ఎన్నటికీ సృష్టింపబడదన్న విషయం నిజం కాదా? జరగటం ముఖ్యం. కనుక్కోవటం కాదు. కనుక్కోవటం అంతకన్న సులభమే కాని జరగటం అనేది వేరే విషయం. అది కష్టమైనది కాదు. వెతకాలనీ, కనుక్కోవాలనీ తపించటం పూర్తిగా ఆగిపోవాలి - ఏదైనా జరగాలంటే. దొరకటంలో పోగొట్టుకునే అర్థం కూడా ఉంటుంది. పోయేందుకు మీ దగ్గర ఉండాలి. సొంతం చేసుకోవటం వల్లగాని, సొంతం కావటం వల్లగాని, అవగాహన అవటానికి స్వేచ్ఛ ఉండదు.
కాని, ఈ ఆందోళన, అస్తిమితం ఎప్పుడూ ఎందుకుంటోంది? దాని గురించి తీవ్రంగా పరిశీలించారా ఇంతకు ముందు?
"ఏదో యథాలాపంగా ప్రయత్నించానంతే. ప్రయోజనకరంగా కాదు. ఎప్పుడూ పరధ్యానంలో పడుతూ ఉండేదాన్ని."
పరధ్యానంలో పడటం కాదు నిజం చెప్పాలంటే. అది మీకు ఎప్పుడూ ప్రధానమైన సమస్య అనిపించలేదంతే. ప్రధానమైన సమస్య ఉన్నప్పుడు పరధ్యానం ఉండదు. పరధ్యానం అనేది లేదు. పరధ్యానం అంటే ఒక ముఖ్య ఆసక్తి నుంచి మనస్సు ఇటూ అటూ తిరగటం అని అర్థ వస్తుంది. కాని ముఖ్య ఆసక్తి ఉన్నప్పుడు పరధ్యానమే ఉండదు. మనస్సు ఒకదాని నుంచి మరొక దానికి తిరుగుతూ ఉండటం పరధ్యానం కాదు - ఉన్న స్థితిని తప్పించుకోవటం. సమస్య అతి సమీపంలో ఉన్నప్పుడు మనం దాన్ని వదిలి ఇక్కడికీ అక్కడికీ తిరగాలనుకుంటాం. ఈ తిరగటం వల్ల మనం ఏదో ఒకటి చేసేందుకు దొరకుతుంది - వ్యాకులపడటం, వృథాగా కబుర్లు చెప్పటం వంటివి. తిరుగుతూ ఉండటం తరుచు బాధాకరం అనిపించినా దాన్నే నయమనుకుంటాం ఉన్నస్థితి కన్న.
దీన్ని గురించి మీరు తీవ్రంగా పరిశీలించాలనుకుంటున్నారా, లేక ఊరికే దానిచుట్టూ ఆటలాడుతున్నారా?
"నిజంగా దాన్ని పూర్తిగా చివరంటా తెలుసుకోవాలని ఉంది నాకు. అందుకే వచ్చాను."
మీరెందుకు ఆనందంగా లేరంటే, నూతిని నింపే జల లేదని,అందుకనేనా? గులకరాళ్లమీద నీటి గుసగుసల్ని మీరెప్పుడో ఓసారి విని ఉంటారు. కాని ఇప్పుడు నదిపాయి ఎండిపోయింది. మీరు ఆనందాన్ని ఎరుగుదురు. కాని అది ఎప్పుడూ వెనక్కి వెళ్ళిపోయేదే. అది ఎప్పుడూ గతానికి చెందినదే. ఆ జలనేనా మీరు వెతుకుతున్నది. దాన్ని మీరు వెతకాలా? లేక దానంతట అది అనుకోకుండా ఎదురవాలా? అది ఎక్కడుందో తెలిస్తే మీరు దాన్ని పొందే సాధనాలు కనుక్కుంటారు. కాని, తెలియదు కాబట్టి దానికి మార్గంలేదు. తెలిసి ఉండటం అంటే జరిగే దాన్ని ఆపటమే. ఉన్న సమస్యల్లో అదొకటా?
"నిశ్చయంగా అదే జీవితం ఎంత మందకొడిగా క్రియావిహీనంగా ఉందంటే, అది కనక జరిగితే ఇంకేదీ అడగటం జరగదు."
ఒంటరితనం సమస్యగా ఉందా?
"ఒంటరిగా ఉండటానికి నాకభ్యంతరం లేదు. దాంతో ఎలా వ్యవహరించాలో నాకు తెలుసు. వాహ్యాళికైనా వెడతాను, లేదా, ఒంటరితనం పోయేవరకూ నిశ్శబ్దంగా కూర్చుంటాను, అంతేగాక, నాకు ఏకాంతంగా ఉండటం ఇష్టం."
ఒంటరిగా ఉండటం ఏమిటో మనందరికీ తెలుసు. ఉపశమనం లేని, బాధాకరమైన, భయంకరమైన శూన్యం. దాన్నుంచి అవతలికి పారిపోవటం ఎలాగో మనకి తెలుసును. ఎందుకంటే పారిపోయే మార్గాలెన్నింటినో పరిశోధించాం. కొంతమంది ఒక మార్గంలో చిక్కుకుంటారు. తక్కినవాళ్లు ఇంకా మార్గాలకోసం వెతుకుతూనే ఉంటారు. కాని, వారిలో ఎవ్వరూ ఉన్న స్థితిలో తిన్నగా సంపర్కం పెట్టుకోరు. మీకు ఒంటరితనంలో వ్యవహరించటం ఎలాగో తెలుసునంటున్నారు. నిజం చెప్పాలంటే, ఒంటరితనం గురించి చర్య తీసుకోవటమే దాన్ని తప్పించుకోవటం. మీరు నడవటానికి వెడతారు, లేదా, ఒంటరితనం పోయే వరకూ దాంతో కూర్చుంటారు. మీరు ఎప్పుడూ దాంతో ఏదో చేస్తూనే ఉన్నారు. దాని కథని చెప్పుకోనివ్వటం లేదు మీరు. దానిపైన మీరు ఆధిపత్యం వహించాలనుకుంటారు, దాన్ని అధిగమించాలను కుంటారు, దాన్నుంచి పారిపోవాలనుకుంటారు. అందుచేత దానితో మీకున్న సంబంధం అదంటే మీకు గల భయం.
సాఫల్యం పొందటం కూడా ఒక సమస్యేనా మీకు? ఏదో ఒక దానిలో తాను సఫలం కావాలనుకోవటానికి అర్థం ఉన్నస్థితిని తప్పించుకోవటం అని కాదా. నేను అల్పుణ్ణి, - కాని నేను దేశంతోనో, కుటుంబంతోనీ, ఏదో నమ్మకంతోనో నన్ను నేను ఐక్యం చేసుకుంటే నేను సాఫల్యం పొందినట్లూ, సంపూర్ణత పొందినట్లూ అనుభూతి పొందుతాను. ఈ సంపూర్ణతకోసం ప్రయత్నించటమే ఉన్నస్థితి నుంచి పారిపోవటం.
"అవును, అది నిజమే. అది కూడా నా సమస్యే."
మనం ఉన్నస్థితిని అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఈ సమస్యలన్నీ అంతమవుతాయి. ఏ సమస్యనైనా మనం సమీపించే పద్ధతి ఏమిటంటే దాన్ని తప్పించుకోవటం. దాన్ని గురించి ఏదో చెయ్యాలనుకుంటాం. ఆ చెయ్యటం మనకి సమస్యతో ప్రత్యక్ష సంపర్కం కలగకుండా ఆటంకం కలిగిస్తుంది. ఈ మార్గం సమస్యని అవగాహన చేసుకోవటానికి అడ్డుపడుతుంది. సమస్యతో ఏం చెయ్యాలా అనేదే మనస్సు వ్యాపకం, అంటే నిజానికి దాన్ని ఎలా తప్పించుకోవాలా అనేది. అందువల్ల సమస్యని అర్థం చేసుకోవటం ఎప్పుడూ జరగదు. అది అలాగే ఉంటుంది. ఎందువల్లనంటే, సమస్య, అంటే ఉన్నస్థితి, తేటతెల్లం కావటానికి, దాని కథ పూర్తిగా చెప్పుకోవటానికి మనస్సు సున్నితంగా ఉండి, వెంటనే అర్థం చేసుకోగలిగి ఉండాలి. తప్పించుకునే మార్గాల ద్వారానో, సమస్యతో ఏం చెయ్యాలో తెలుసుకోవటం ద్వారానో, దానికి సహేతుక వివరణో, కారణమో తెలుసుకోవటానికి ప్రయత్నించటం, అంటే మాటల్లో నిర్ణయించటం ద్వారానో, మనస్సుకి మత్తు కలిగేటట్లు చేస్తే అప్పుడు ఆ మనస్సు మందకొడిగా అయి, ఆ సమస్య, అంటే ఉన్నస్థితి విప్పిచెప్పే కథని తక్షణం అర్థం చేసుకోలేదు. దీనిలోని సత్యాన్ని గ్రహించండి. మనస్సు సున్నితంగా ఉన్నప్పుడే అది గ్రహించగలుగుతుంది. ఆ సమస్య గురించి మానసికంగా ఏ విధమైన కార్యకలాపం జరిగినా దానివల్ల మనస్సు మందకొడిగానూ, అర్థం చేసుకోలేనిదిగానూ, అది చెప్పేది వినిపించుకోలేనట్లు గానూ అవుతుంది. మనస్సు సున్నితంగా ఉన్నప్పుడు - సున్నితంగా చేయ బడటం కాదు, అది మరోవిధంగా మందకొడిగా చేయటమే - సున్నితంగా ఉన్నప్పుడు ఉన్నస్థితికి, అంటే శూన్యతకి ఉండే ప్రాధాన్యమే పూర్తిగా వేరు.
మనం మాట్లాడుతున్నంతసేపూ అనుభవం పొందుతూ ఉండండి, మాటల స్థాయిలోనే ఉండిపోకండి.
మనస్సుకీ, ఉన్న స్థితికీ సంబంధం ఏమిటి? ఇంతవరకూ, ఉన్నస్థితికి ఒక పేరుపెట్టి, మాటల్లో పెట్టి, పరిచిత సంకేతంగా చేసింది. ఇలా దానికి పేరు పెట్టటం మూలంగా దానితో ప్రత్యక్ష సంబంధం ఏర్పడకుండా ఆటంకపరిచి మనస్సుని మందకొడిగా, సున్నితత్వం లేకుండా చేసింది. మనస్సూ, ఉన్నస్థితీ - రెండూ వేరువేరు ప్రక్రియలు కాదు. పేరు పెట్టటంతో వేరవుతాయి. ఈ పేరుపెట్టటం ఆగిపోతే ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. మనస్సూ, ఉన్నస్థితీ ఒక్కటే. ఉన్నస్థితి ఇప్పుడు గమనించేవాడే - దానికో మాట లేకుండా - అప్పుడే ఉన్నస్థితి పరివర్తన చెందుతుంది. భయంతోనూ, తదితరమైనవాటితోనూ కూడిన శూన్యం అని పిలవబడేదింక ఉండదు. అప్పుడు మనస్సు - అంటే, అనుభవించే స్థితి మాత్రమే ఉంటుంది. అందులో అనుభవించేదీ, అనుభవింపబడేదీ ఉండవు. అప్పుడు అపరిమితమైన ప్రగాడత ఉంటుంది - కొలిచేది లేదు కనుక. గాఢంగా ఉన్నది నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రశాంతతలో అనంతంగా నీరు పొంగుతుంది. మాటలు వాడటమే మనస్సులోని ఆందోళన. మాట లేకపోతే ఉండేది అపరిమితమైనది.