మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/కాలం
83. కాలం
ఆయన వార్ధక్య లక్షణాలతో ఉన్నాడు. కాని ఆరోగ్యవంతంగా ఉన్నాడు. పొడుగాటి, నెరిసిన జుట్టుతో, తెల్లని గడ్డంతో. ప్రపంచం లోని అనేక భాగాల్లో విశ్వవిద్యాలయాల్లో వేదాంతం గురించి ఉపన్య సించాడుట. పాండిత్యం ఉన్నవాడు. నెమ్మదస్తుడు. తను ధ్యానం చెయ్యనని చెప్పాడాయన. ఆయన పట్టించుకునేది జ్ఞానం ఒక్కటేనట. వేదాంతం గురించీ, ధార్మిక అనుభవాల గురించీ ఉపన్యాసాలిచ్చినా, ఆయనకు స్వయంగా జరిగిన సంఘటనలేమీ లేవుట. వాటికోసం ఆశపడటం కూడా లేదుట. కాలం గురించి వివరంగా చర్చించటానికి వచ్చాడు.
ఆస్తిపాస్తులున్న మనిషికి స్వేచ్ఛగా ఉండాలంటే ఎంత కష్టం! ధనవంతుడు తనకున్న ధన్నాన్ని అవతలికి త్రోసి వెయ్యటం మహాకష్టం. వేరే ఇంకేవైనానో, మరింత గొప్ప లాలసత్వం కలిగించేవో ఉన్నప్పుడే గాని ధనవంతుడు తన సంపదలిచ్చే సౌఖ్యాన్ని వదులుకోడు. తన ఆకాంక్ష ఫలించే మరొక స్థాయి దొరికితే గాని ఉన్నదాన్ని వదులుకోడు. ధనవంతుడికి ధనమే అధికారం. దాన్ని అతడు చలాయిస్తాడు. పెద్ద పెద్ద మొత్తాలు ఇచ్చివెయ్యవచ్చు. కాని ఇచ్చేవాడు అతడే
జ్ఞానం మరో రకమైన ఆస్తి. జ్ఞానం ఉన్నవాడు దానితో తృప్తి పొందుతాడు. అతడికి అంతకన్న కావలసినది లేదు. అతడికి ఉన్న భావన - అధమం ఈయన అనుకునేది జ్ఞానమే కనుక ప్రపంచంలో అన్ని చోట్లా కొద్దో గొప్పో విస్తరింపగలిగితే అది అన్ని సమస్యల్నీ ఎలాగోలాగ పరిష్కరిస్తుందని. ధనం ఉన్న వానికన్న జ్ఞానం సంపాదించినవానికే మరింత ఎక్కువ కష్టం - తనకున్న వాటిని వదులుకుని స్వేచ్ఛగా ఉండటం. అవగాహన, వివేకం ఉండే స్థానాన్ని జ్ఞానం ఎంత సులభంగా ఆక్రమిస్తుందో చిత్రంగా ఉంటుంది. వేటి గురించైనా మన దగ్గర వివరాలుంటే అవి మనకి అర్థమయాయనుకుంటాం. సమస్యకి కారణం తెలుసుకున్నందువల్లనో, దాని వివరాలు తెలిసినందువల్లనో ఇక ఆ సమస్య ఉండదనుకుంటాం మనం. మన సమస్యకి కారణం కోసం వెతుకుతాం. ఈ వెతకటం వల్లనే వెంటనే అవగాహన కాకుండా మనం ముందుకెప్పటికో నెట్టటం జరుగుతుంది. మనలో చాలా మందికి కారణం తెలుసును. ద్వేషానికి కారణం కనిపించనంత మరీ నిగూఢంగా ఉండదు. కారణం వెతుకుతూనే ద్వేషంవల్ల కలిగే ఫలితాలను ఆనందంగా అనుభవిస్తూనే ఉంటాం. ఫలితాలతో సమాధాన పడటమే తప్ప మొత్తం ప్రక్రియని అర్థం చేసుకోవటం కాదు మనక్కావలసింది. మనలో చాలా మంది సమస్యల్నే పట్టుకుని ఉంటారు. అవి లేకపోతే మనకి దారితోచదు. సమస్యలు మనకి పని కల్పిస్తాయి. సమస్యలకి సంబంధించిన కార్యకలాపాలతోనే మన జీవితాలు నిండి ఉంటాయి. మనమే సమస్య, దాన్ని కార్యకలాపాలూను.
కాలం చాలా చిత్రమైన ప్రకృతివిశేషం. స్థలం, కాలం ఒక్కటే. ఒకటి ఉంటే గాని ఇంకోటి ఉండదు. కాలం మనకి అత్యంత ముఖ్యం. ప్రతి ఒక్కరూ దానికి తమ ప్రత్యేక అర్థాన్నిస్తారు. అనాగరికుడికి కాలంతో ప్రమేయం ఉండదు. కాని, నాగరికులకు అది అత్యంత ప్రధానమైనది. అనాగరికుడు ఏరోజు కారోజు మరిచిపోతాడు. కాని, విద్యావంతుడలా చేస్తే పిచ్చాసుపత్రిలో పెడతారు, లేదా, ఉద్యోగం పోతుంది. శాస్త్రజ్ఞుడి ఉద్దేశంలో కాలం ఒకలా ఉంటుంది. మామూలు మనిషికి మరొకలా ఉంటుంది. చరిత్రకారుడికి కాలం అంటే అర్థం గతాన్ని అధ్యయనం చేయడం, స్టాక్ మార్కెట్‌లో టిక్కు టిక్కుమనటం, తల్లికి కొడుకు జ్ఞాపకం, అలిసిపోయిన వాడికి నీడలో విశ్రాంతి. ప్రతి ఒక్కరూ తమ తమ అవసరాన్ని బట్టి, తృప్తి కలగటాన్ని బట్టీ అనువదించుకుని, తమ గడుసు మనస్సుకి సరిపోయేలా మలుచుకుంటూ ఉంటారు. అయితే. మనం కాలం లేకుండా ఉండలేం. మనం జీవించాలంటే ఋతువు అవసరమైనంతగానూ తేదీల ప్రకారం కాలం అవసరం. కాని, మానసిక కాలం అంటూ ఏదైనా ఉందా, లేక అది మనస్సు తనకు వీలయేటట్లుగా చేసిన వంచన మాత్రమేనా? తేదీల వారీగా ఉండేకాలం తప్ప తక్కినదంతా వంచనే, నిశ్చయంగా. పెరగటానికీ, చనిపోవటానికీ, విత్తనం నాటడానికీ, ఫలం అందుకోవటానికీ కాలం పడుతుంది. కాని, మానసిక కాలం అంటే ఏదో అవటం అనే ప్రక్రియ పూర్తిగా అసత్యమైనది కాదా?
"మీకు కాలం ఏమనిపిస్తుంది? మీరు కాలం గురించి ఆలోచిస్తారా? కాలాన్ని తెలుసుకున్నారా మీరు?" తేదీల వారీగా జరిగే కాలం తప్ప ఇంకో కాలం గురించి ఎవరైనా ఆలోచించగలరా? దాని మటుకు దానికి ఏవిధమైన ప్రాధాన్యం లేదు. అస్పష్టకాలం కేవలం ఊహమాత్రమే. ఊహామాత్రమైనదేదైనా వ్యర్థమే. కాలాన్ని మనం సాధించేందుకు మార్గంగా వినియోగించుకుంటాం - వాస్తవంగా గాని, మానసికంగాని, స్టేషనుకి వెళ్లటానికి పట్టేకాలం అవసరం. కాని మనలో చాలామంది కాలాన్ని మానసిక లక్ష్యానికి సాధనంగా ఉపయోగిస్తారు. అటువంటి లక్ష్యాలు అనేకం. మనం సాధించవలసిందానికి ఆటంకం కలిగినప్పుడూ, విజయవంతం అవటానికి కొంత విరామం ఉన్నప్పుడూ, కాలం తెలుసుకుంటాం. ఉన్నస్థితికీ, ఉండబోయిన, ఉండవలసిన, ఉండాలనుకున్న స్థితికీ మధ్యనున్న స్థలమే కాలం. ఆరంభం అంతాన్ని చేరుకునేదే కాలం.
"వేరే ఇంకేవిధమైన కాలమూ లేదా? శాస్త్రరీత్యా కాలం, విరామం వీటికి అంతరార్థాలేమిటి?"
తేదీల వారీగా ఉండేకాలం ఉంది, మానసిక కాలం ఉంది. తేదీల వారీ కాలం అవసరం. అది ఉన్నది. కాని ఇంకోటి వేరే విషయం. కారణం, ఫలితం కాలప్రక్రియ అంటారు. భౌతికంగానే కాదు, మానసికంగా కూడా. కారణానికీ ఫలితానికీ మధ్య ఉన్న విరామమే కాలమనుకోబడుతుంది. కాని విరామం ఉన్నదా? రోగం విషయంలో కారణాన్నీ ఫలితాన్నీ విడదీయవచ్చునేమో అదికూడా తేదీలవారీ కాలమే. కాని మానసిక కారణానికీ, ఫలితానికీ మధ్య విరామం ఉంటుందా? కారణం, ఫలితం ఒకే ప్రక్రియ కాదా? కారణానికీ ఫలితానికీ మధ్య విరామం లేదు. ఈ రోజు నిన్నటి ఫలితం, రేపటికి కారణం. అది ఒకే కదలిక, కొనసాగే ప్రవాహం. కారణానికీ ఫలితానికీ మధ్య ఎడంలేదు, విడదీసే రేఖ లేదు. కాని అంతరంగికంగా వాటిని విడదీస్తాం, ఏదో అవటానికీ, సాధించటానికీ, నేను ఇది, నేను అది అవాలి.అది అవటానికి నాకు సమయం కావాలి - తేదీలవారీ కాలం మానసిక ప్రయోజనాలకోసం ఉపయోగించబడుతుంది. నేను మూర్ఖుణ్ణి, నేను వివేకిని అవాలి. మూర్ఖత్వం వివేకంగా అవటం అంటే మూర్ఖత్వం క్రమంగా ఎక్కువవటమే, ఎందుకంటే మూర్ఖత్వం ఎప్పటికీ వివేకం కాలేదు - ఆశ ఆశకాకపోవటం అవనట్లుగానే. ఏదో అవాలనుకోవటమే మూర్ఖత్వం. ఆలోచన కాలం ఫలితం కాదా? జ్ఞానం అంటే కాలం కొనసాగటం. కాలం అంటే కొనసాగింపు. అనుభవం అంటే జ్ఞానం. అనుభవం జ్ఞాపకంగా కొనసాగడమే కాలం. ఇలా కొనసాగే కాలానికి రూపం లేదు. ఊహాగానాలు చేయడం అజ్ఞానం. అనుభవం అంటే జ్ఞాపకం, మనసు అనేది కాలయంత్రం. మనస్సు అంటే గతం. ఆలోచన ఎప్పుడూ గతానికి చెందేదే. గతం కొనసాగితేనే జ్ఞాపకం. జ్ఞానం ఎప్పుడూ గతానికి చెందినదే. జ్ఞానం కాలానికి చెందకుండా ఎప్పుడూ ఉండదు, ఎప్పుడూ కాలంలోనే, కాలానికి చెందే ఉంటుంది. ఇలా జ్ఞాపకం, జ్ఞానం కొనసాగటమే చైతన్యం. అనుభవం ఎప్పుడూ గతంలోనిదే; అదే గతం. ఆ గతం ప్రస్తుతంతో కలిసి భవిష్యత్తులోకి జరుగుతోంది. భవిష్యత్తు గతమే, కొంత మార్పుచెంది ఉండవచ్చు, అయినప్పటికే గతమే. ఈ ప్రక్రియ అంతా కలిసే ఆలోచన, మనస్సు. ఆలోచన కాలం పరిధిలో తప్ప ఇంకెందులోనూ పనిచెయ్యలేదు. కాలరహితమైన దాన్ని గురించి ఆలోచన ఊహించవచ్చు, కాని అది దాని కల్పన మాత్రమే. ఊహా, కల్పనా అంతా మూర్ఖత్వం.
"అయితే మీరు కాలరహితమైన దాన్ని గురించి మాత్రం ప్రస్తావించటమెందుకు? కాలరహితమైనది ఎప్పటికైనా తెలుస్తుందా? కాలరహితమైనదని దాన్ని గుర్తించటానికి వీలవుతుందా?"
గుర్తించటం అంటే అనుభవించేవాడున్నట్లు అర్థం వస్తుంది. అనుభవించేవాడు ఎప్పుడూ కాలానికి చెందినవాడే. దేన్నైనా గుర్తుపట్టటానికి, దాన్ని అంతకుముందు అనుభవం పొంది ఉండాలి. అనుభవం పొంది ఉంటే అది తెలిసినదే. తెలిసినది కాలరహితమైనది కాదు, నిశ్చయంగా. తెలిసినది ఎప్పుడూ కాలం అనే వలలోనిదే. ఆలోచన కాలరహితమైన దాన్ని తెలుసుకోలేదు. అది మరింత సేకరించటం కాదు, మరికొంత సాధించటం కాదు. దానివైపుకి వెళ్లటం అంటూ ఉండదు. ఆలోచన గాని, కాలంగాని లేకుండా ఉండే స్థితి అది.
"దానికి ఏమిటి విలువ?"
ఏమీలేదు. విలువ కట్టవీలుకానిది. ఒక ప్రయోజనం కోసం దాని విలువ ఎంచలేము. దాని విలువ తెలియనిది.
"కాని జీవితంలో దానివల్ల ప్రయోజనం ఏమిటి?"
జీవితం ఆలోచనే అయితే, ఏమీ లేదు. దానిద్వారా మనం శాంతీ, ఆనందం పొందాలనీ, అన్ని కష్టాలనూ అడ్డుకునే రక్షకసాధనంగా ఉండాలనీ, మనుష్యులలో ఐకమత్యాన్ని నెలకొల్పే సాధనంగా ఉండాలనీ కోరుకుంటాం. దాన్ని ఏవిధమైన ప్రయోజనానికీ ఉపయోగించుకోవటం కుదరదు. ప్రయోజనం అనగానే లక్ష్యసాధన అని అర్థం వస్తుంది. అప్పుడు మళ్లీ వెనక్కి వస్తాం - ఆలోచనా ప్రక్రియతో సహా, మనస్సు కాలరహితమైన దాన్ని రూపొందించలేదు, తన లక్ష్యం కోసం దాన్ని మలుచుకోలేదు. దాన్ని ఉపయోగించుకోలేదు. కాలరహితమైనది ఉన్నప్పుడే జీవితానికి అర్థం ఉంటుంది. లేకపోతే, జీవితం అంటే దుఃఖం, సంఘర్షణా, బాధా. ఆలోచన ఏ మానవసమస్యనీ పరిష్కరించలేదు - ఎందుకంటే ఆలోచనే సమస్య కనుక. జ్ఞానం అంతం కావటమే వివేకానికి ఆరంభం. వివేకం కాలానికి చెందినది కాదు. అనుభవం, జ్ఞానం కొనసాగటం కాదు వివేకం. కాలమయ జీవితం అంటే గందరగోళం, దుఃఖం. కాని, ఉన్నస్థితి కాలరహితంగా ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది.