మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/తాదాత్మ్యభావన
2. తాదాత్మ్య భావన
మీరు ఇంకొక వ్యక్తితోగాని, ఒక వర్గంతోగానీ, ఒక దేశంతో గాని ఎందుకు తాదాత్మ్యం చెందుతారు? మిమ్మల్ని క్రిస్టియన్ అనీ, హిందువు అనీ బౌద్ధుడనీ ఎందుకు చెప్పుకుంటారు? ఏదో ఒక మతశాఖకి ఎందుకు చెందుతారు? మతంలోనైనా, రాజకీయాల్లోనైనా, ఎవరో వ్యక్తితోనో, ఏదో వర్గంతోనో, సంప్రదాయ సిద్దంగా గాని, అలవాటు ప్రకారం గాని, తాత్కాలికోద్రేకం చేతగాని, దురభిమానం చేతగాని, అనుకరణ ద్వారాగాని, బద్ధకం చేతగాని ఎందుకు మమైక్యం అవుతారు. ఇటువంటి తాదాత్మ్యభావన, సృజనాత్మకమైన అవగాహనని అంతం చేస్తుంది. దాంతో, ఒక 'పార్టీ' అధికారి చేతుల్లోనో, మరోనాయకుడి చేతుల్లోనో, కీలుబొమ్మలవుతారు.
ఆ మధ్య ఎవరో ఒకాయన తాను కృష్ణమూర్తిని అనుసరించే వాడిననీ, మరొకాయన ఇంకేదో వర్గానికి చెందిన వాడిననీ అన్నారు. అలా అంటున్నప్పుడు ఆయనకి ఇటువంటి తాదాత్మ్య భావనలో ఉండే చిక్కులను గురించిన స్పృహ ఏమాత్రం లేదు. అలాగని ఆయన తెలివి తక్కువ వాడేమీ కాదు. బాగా చదువుకున్నవాడు. సంస్కారం అవీ ఉన్నవాడు. ఆయన ఏదో అభిమానంతోనూ, భావోద్వేగంతోనూ అన్న విషయం కాదది. స్పష్టంగా, నిశ్చితంగా అన్నాడాయన.
ఆయన కృష్ణమూర్తిని అనుసరించే వాడిగా ఎలా అయ్యాడు? అంతకు ముందు ఎందరినో అనుసరించాడు. ఎన్నో సంఘాల్లోనూ, సంస్థల్లోనూ చేరి ప్రయాసపడ్డాడు. ఆఖరికి ఈ వ్యక్తితో ఐక్యత చెందేవరకూ వచ్చాడు. ఆయన అన్నదాన్ని బట్టి ఆయన ప్రయాణం పూర్తయింది. ఆయన ఒక స్థిరాభిప్రాయానికి వచ్చాడు. దాంతో ఇంక ఆఖరు. ఆయన ఎంచుకున్న దాన్నుంచి ఎవ్వరూ ఆయన్ని కదపలేరు. ఇప్పుడిక స్తిమితపడి, ఇంతవరకు తనకు చెప్పినదాన్నీ, చెప్పబోయేదాన్నీ ఉత్సాహంగా అనుసరిస్తాడు.
మనం ఎవరితోనైనా మనల్ని ఐక్యం చేసుకున్నప్పుడు అది వారంటే మనకుండే ప్రేమను సూచిస్తుందా? లేదా, ఆ తాదాత్మ్యం చెందడం వట్టి ప్రయోగమేనా? అసలు ఐక్యభావన వల్ల ప్రేమ, ప్రయోగం అంతం కావా? ఐక్యం చేసుకోవడం అంటే సొంతం చేసుకోవటం, తనకు చెందినదని ఉద్ఘాటించటం. ఏదైనా సొంతమైనప్పుడు ప్రేమ పోతుంది. పోదా? సొంతం చేసుకోవటం అంటే సురక్షితంగా ఉండటం, సొంతం చేసుకోవటం అంటే రక్షణ చేసుకోవటం, అంటే తన్నుతాను అభేద్యమైన వానిగా చేసుకోవడం. ఐక్యం చేసుకోవటంలో ప్రతిఘటన ఉంటుంది - పైకి కనిపించినా, కనిపించకపోయినా. ప్రేమ అనేది ఆత్మరక్షణ కోసం చేసే ఒకరకమైన ప్రతిఘటనా? రక్షణ చేసుకుంటున్నప్పుడు ప్రేమ ఉంటుందా?
ప్రేమ ఇట్టే ప్రమాదానికి లోనవుతుంది. ఎంతో సున్నితంగా దేన్నైనా స్వీకరించటానికి సిద్దంగా ఉంటుంది; అది అత్యంత సున్నితమైనది. ఐక్యభావన వల్ల సున్నితత్వం లేకుండా పోతుంది. ఐక్యభావనా, ప్రేమా ఒకచోట ఇమడవు. ఒకటి రెండవదాన్ని నాశనం చేస్తుంది. ఐక్యం కావటం అనేది ముఖ్యంగా ఒక మానసిక ప్రక్రియ. దానితో మనస్సు తన్ను తాను సంరక్షించుకుంటూ, తన్ను తాను విస్తరింపచేసుకుంటుంది. ఏదో అవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనస్సు ప్రతిఘటించవలసి ఉంటుంది. రక్షించుకోవలసి ఉంటుంది. సొంతం చేసుకోవలసి ఉంటుంది. వదిలిపెట్టవలసి ఉంటుంది. ఏదో అవటానికి ప్రయత్నించటంలో మనస్సు లేదా అహం మరింత మొండిగానూ, శక్తిమంతంగానూ తయారవుతుంది. కాని, ఇది ప్రేమకాదు. ఐక్యం చేసుకోవటం వల్ల స్వేచ్ఛ నాశనమవుతుంది. స్వేచ్ఛ ఉన్నప్పుడే అత్యున్నతమైన సున్నితత్వం ఉంటుంది.
ఏదైనా పరీక్షించి చూడడానికి ఐక్యభావన అవసరమా? తాదాత్మ్యం చెందడంతోనే విచారణ చేయడం, తెలుసుకోవడం అనేవి అంతమైపోవా? తన్ను తాను తెలుసుకోవడం కోసం అన్వేషణ లేకపోతే సత్యం వల్ల పొందే ఆనందానికి ఆస్కారమే ఉండదు. ఐక్యం కావటం వల్ల సత్యాన్ని తెలుసుకోవటం జరగదు. ఐక్యం కావటం ఇంకో రకమైన సోమరితనం. ఐక్యం కావటం స్వయంగా పొందే అనుభవం కాకుండా తెచ్చి పెట్టుకున్న అనుభవం. అందువల్ల అది శుద్ద అసత్యం.
అనుభవం పొందాలంటే ఐక్యం కావటం అనేది ఆగిపోవాలి. క్రొత్త ప్రయోగం చెయ్యటానికి భయం ఉండకూడదు. భయం అనుభవానికి ఆటంకం. ఈ భయమే ఐక్యం పొందేటట్లు - ఎవరో వ్యక్తితోనో, ఏదో వర్గంతోనో, సిద్ధాంతం మొదలైన వాటితోనో ఐక్యం పొందేటట్లు చేస్తుంది. భయం దేన్నైనా ప్రతిఘటించి తీరుతుంది. అణచివేస్తుంది. స్వీయ రక్షణలో ఉన్నప్పుడు తెలియని సముద్రంలోకి పోవడానికి ఎలా సంసిద్ధపడతారు? తన స్వభావపు తీరుతెన్నులు తెలుసుకోకుండా సత్యంగాని ఆనందంగాని లభించదు. ఒకేచోట లంగరు వేసుకొని ఉంటే దూరప్రయాణం చేయలేరు. ఐక్యం చేసుకోవటంలో ఆశ్రయం లభిస్తుంది. ఆశ్రయానికి కూడా భద్రత కావాలి. దేన్నైతే రక్షిస్తామో అది ఎప్పుడో ఒకప్పుడు విధ్వంసం కాకమానదు. ఐక్యత తన వినాశాన్ని తానే కొనితెచ్చుకుంటుంది. అందువల్లనే వివిధ ఐక్యతల మధ్య నిరంతర సంఘర్షణ ఉంది.
ఐక్యం కావటానికి గాని, దానికి వ్యతిరేకంగా గాని పోరాటం జరుగుతున్న కొద్దీ అవగాహనకి ప్రతిఘటన ఎక్కువవుతుంది. ఈ ఐక్యం కావటం అనేది ఎలా, ఎందుకు జరుగుతుందో, వ్యక్తంగాగాని - అవ్యక్తంగా గాని - లోపల ఉన్న కోరిక పైకి వ్యక్తమవుతుందని - అంతా తెలుసుకున్నట్లయితే ఏదైనా సాక్షాత్కారం కావటానికీ, ఆనందం కలగటానికీ, అవకాశం ఉంటుంది. తన్ను తాను దేనితోనైనా ఐక్యం చేసుకున్నవారు స్వేచ్ఛ అంటే ఏమిటో తెలుసుకోలేరు. స్వేచ్ఛలోనే సత్యం సాక్షాత్కరిస్తుంది.