మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/అహంకారులైన ముగ్గురు ధర్మపరాయణులు
ఈ మధ్య ఒకరోజున అహంకారులైన ముగ్గురు ధర్మపరాయణులు నన్ను చూడటానికి వచ్చారు. మొదటాయన సన్యాసి. ప్రాపంచిక సుఖాల్ని త్యజించిన వాడు. రెండో ఆయన ప్రాచ్య సిద్ధాంతి. సౌభ్రాతృత్వంలో గొప్ప నమ్మకం ఉన్నవాడు. మూడో ఆయన అద్భుతమైన ఆదర్శ భావిసమాజం కోసం పాటుపడుతున్నవాడు. వారు ముగ్గురూ ఎవరికి వారు ఎంతో కష్టపడి తమతమ పనులను నిర్వహిస్తున్నారు. ఎదుటివారి అభిప్రాయాల్నీ, చర్యల్నీ చిన్నచూపు చూస్తూ తమకున్న విశ్వాసంతో ఎవరికి వారు శక్తిమంత మవుతున్నారు. ప్రతిఒక్కరూ తమతమ నమ్మకాల్ని గాఢంగా హత్తుకుంటూ, విచిత్రమైన నిర్దాక్షిణ్యంతో ఉన్నారు.
వాళ్ళునాతో, ముఖ్యంగా ఆదర్శ సమాజం కోసం పాటుపడుతున్నాయన, తాము నమ్మిన దానికోసం తమనీ, తమ స్నేహితుల్నీ కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పైకి మాత్రం బిడియంగా, సౌమ్యంగా కనిపిస్తున్నారు, ముఖ్యంగా సౌభ్రాతృత్వాన్ని కోరే ఆయన కాని, వారి హృదయంలో కాఠిన్యం ఉంది. అది పై అధికారికి ఉండే విచిత్రమైన అసహన లక్షణం. వాళ్ళు కారణజన్ములు, ధర్మాలను వివరించగలవారు. వారికి అన్నీ తెలుసునని వారి నమ్మకం.
ఆ సన్యాసి గంభీరంగా మాట్లడుతూ, తను వచ్చే జన్మకోసం సంసిద్ధుడనవుతున్నానని చెప్పాడు. ఈ జీవితంలో పొందగలినదేమీ లేదట. ఈ ఐహిక సుఖాలన్నీ మిథ్య అని తెలుసుకుని సంసార మార్గాన్ని వదిలి పెట్టేశాడట. అయితే, ఆయనలో కొన్ని బలహీనతలున్నాయిట. ధ్యానం కేంద్రీకృతం కావటం కష్టమవుతోందిట. వచ్చే జన్మలోనైనా తప్పకుండా తన ఆదర్శం ప్రకారం సిద్ది పొందగలడుట.
ఆయన ఆసక్తి, శక్తీ అన్నీకూడా వచ్చేజన్మ కోసమే అంకితమైనట్లున్నాయి. మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆయన ధోరణి ఎంతసేపూ రేపటిగురించీ, భవిష్యత్తు గురించీ. గతం ఉంది గాని, అది భవిష్యత్తుకి సంబంధించినంతవరకే అన్నాడాయన. ప్రస్తుతం అనేది కేవలం భవిష్యత్తుకి సోపానం వంటిది మాత్రమేనట. ఈనాటిలో ఉన్న ఆసక్తి రేపటి వల్లనేట.
రేపు అనేది లేకపోతే ఈ ప్రయాస అంతా దేనికి అని అడిగాడాయన. లేకపోతే పనిపాటల్లేకుండా ఎద్దుమొద్దు స్వరూపంలా ఉండిపోవచ్చునట.
జీవితమంతా గతం నుంచి ప్రస్తుతం ద్వారా భావిలోనికి కొనసాగించే ప్రయాణమేనట. భవిష్యత్తులో ఏదో అవటానికి ప్రస్తుతాన్ని వినియోగించుకోవాలన్నాడాయన. వివేకం కలిగి ఉండటం, శక్తి పొందటం, కారుణ్యం చూపించటం అందుకేనట. ప్రస్తుతం, భావీ కూడా అశాశ్వతాలే, కాని, ఫలితం లభించేది రేపే. ఇవాళ అనేది దాటవలసిన ఒక మెట్టు మాత్రమేననీ, దాన్ని గురించి అంతగా కంగారు పడకూడదనీ అన్నాడాయన. రేపటి ఆదర్శాన్ని స్పష్టంగా పెట్టుకొని దాన్ని విజయవంతంగా చేరుకోవటానికి ప్రయాణం సాగించాలని చెబుతూ, ప్రస్తుతం అంటే అసహనం కనబరిచాడాయన.
సౌభ్రాతృత్వాన్ని కోరే ఆయన మరింత పండితుడు. ఆయన మాట్లాడేభాష కవితా ధోరణిలో ఉంది. శబ్ద ప్రయోగంలో ప్రతిభాశాలి. మొత్తం మీద చమత్కారి. ఒప్పించగల సమర్ధుడు. ఆయన కూడా తన భవిష్యత్తులో ఒక దివ్య హర్మ్యాన్ని నిర్మించుకున్నాడు. ఏదో అవుతానను కుంటున్నాడు. ఈ భావంతో ఆయన హృదయం నిండి ఉంది. ఆ భవిష్యత్తు కోసం కొందరు శిష్యుల్ని పోగుచేశాడు. మరణం ఎంతో సుందరమైన దన్నాడు. ఎందువల్ల నంటే, అది తన దివ్యహర్మ్యం చేరువకి తీసుకుపోతుందట. ఆ ఆశతోనే ఈ దుఃఖమయమైన, అసహ్యకరమైన ప్రపంచంలో జీవించటం సాధ్యమవుతున్నదన్నాడు.
ఈ ప్రపంచాన్ని మార్చటానికి, సౌందర్యమయం చేయటానికీ ఆయన సిద్ధమే. మానవ సౌభ్రాతృత్వం కోసం ఉత్సుకతతో పని చేస్తున్నాడు. ఆయన ఉద్దేశంలో, ఈ ప్రపంచంలో ఏ పని కావాలనుకున్నా వృద్ధిలోకి రావాలనే ఆకాంక్ష తప్పనిసరిగా ఉండాలిట; దానితో బాటు హింసాత్మక చర్యలూ, అక్రమప్రవర్తనా ఉన్నప్పటికీ ఆకాంక్ష ఉండి తీరాలిట. ఏవైనా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే కొంచెం కఠినంగా ఉండవలసి వస్తుందిట. మానవాళికి ఉపయోగకరమైన పని చేయటం చాలాముఖ్యం. అటువంటి పనికి ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే, వాళ్ళని పక్కకి తొలగించి వెయ్యాలి, మర్యాదగానే అనుకోండి; ఆ పనిని నిర్వహించటం అత్యంత ముఖ్యం, దాన్ని ఆపటానికి వీల్లేదుట. "ఇతరులకు వేరే మార్గాలుండవచ్చు, కాని మేము చేసేపని అత్యవసర మైనది. దానికి అడ్డు తగిలే వాళ్ళెవరూ మాతో ఉండడానికి వీలులేదు," అన్నాడాయన.
ఆదర్శ సమాజవాది మొదటి ఆదర్శవాదికీ, రెండవ వ్యవహార పరుడికీ మధ్యరకం. ఆయనకి పాత బైబిల్ అంటే కిట్టదుట. కొత్తదంటేనే ఇష్టంట. ఆయనకి కొత్తదాంట్లోనే అచంచల విశ్వాసం. ముందు ఏమి రానున్నదో ఆయనకు తెలుసుట. కొత్త బైబిల్‌లో ముందు ఏమి జరుగనున్నదో అంతా రాసి ఉందట. ఆయన పథకం ఏమిటంటే, అంతా గందరగోళం చేసేసి, మళ్ళీ అన్నీ సరిగా సమకూర్చి కొత్తగా కొనసాగించటం. ప్రస్తుతం ఉన్నదంతా అవినీతే. దీన్ని సర్వనాశనం చేశాక, ఆ వినాశం నుంచి నూతన నిర్మాణం జరుగుతుందిట. భవిష్యత్తు కోసం ప్రస్తుతాన్ని త్యాగం చెయ్యవలసి ఉందిట. భావి మానవుడు అత్యంత ముఖ్యంగాని ఈనాటి మనిషి కాదుట. ఆ భావి మానవుణ్ణి ఎలా సృష్టించాలో నాకు తెలుసును" అన్నాడాయన. "అతడి మనస్సునీ, హృదయాన్నీ ఎలా మలచాలో మాకు తెలుసును. కాని, ఏదైనా మంచి చేయాలంటే అధికారంలో ఉండాలి. ఆ నూతనస్థితిని తీసుకు రావటానికి మాతో బాటు ఇతరుల్ని కూడా త్యాగం చేస్తాం. ఎవరు అడ్డొచ్చినా చంపేస్తాం. మనం అనుసరించే మార్గం ముఖ్యం కాదు, లక్ష్యమే ప్రధానం".
చివరికి లభించే శాంతి కోసం ఎటువంటి హింసనయినా తలపెట్ట వచ్చునట. చివరికి లభించే వ్యక్తి స్వాతంత్ర్యం కోసం ప్రస్తుతం రాక్షసకృత్యాలు అనివార్యమట. "మా చేతుల్లోకి అధికారం వచ్చినప్పుడు ఈ వర్గవిభేధాలూ, మతబోధకులూ లేని నూతన ప్రపంచాన్ని రూపొందించటానికి అన్ని రకాల ఒత్తిడులూ తెస్తాం. మా ముఖ్య సిద్దాంతాన్ని మేము వదలం. సిద్ధాంతం మీద మేము స్థిరంగా నిలిచి, పరిస్థితులకనుగుణంగా మా వ్యూహాలూ, ఎత్తు గడలూ మారుస్తూ ఉంటాం. భావి మానవుడి కోసమై నేటి మనిషిని నాశనం చేయటానికి మేము పథకం తయారుచేసి, కార్యరంగంలోకి దూకుతా"మని ఉద్ఘాటించాడాయన. ఆ సన్యాసి, సౌభ్రాతృత్వాన్ని కోరే ఆయన, ఆదర్శవాది - అందరూ రేపటి కోసం జీవిస్తున్నవారే. ప్రాపంచికరీత్యా వారు వృద్ధిలోకి రావాలని తాపత్రయ పడటంలేదు. గౌరవాలు జరగాలని గాని, ధనాన్ని గాని కీర్తిని గాని వాంఛించటంలేదు. కాని, వారి లోపల ఉన్నది మరోరకమైన ఆకాంక్ష. ఆదర్శ సమాజవాది ఒకవర్గంతో ఏకమైపోయి, ఆ వర్గానికే ప్రపంచాన్ని మార్చేశక్తి ఉంటుందని అనుకుంటున్నాడు. సౌభ్రాతృత్వాన్ని కోరే ఆయన ఔన్నత్యాన్ని పొందాలని ఆకాంక్షిస్తున్నాడు. సన్యాసి తన లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాడు. వారంతా తామేదో అవాలనీ, ఏదో సాధించాలనీ, ఎలాగో విస్తరించాలనీ తాపత్రయ పడుతున్నారు. ఈ కోరిక శాంతినీ, సౌభ్రాతృత్వాన్నీ, మహోన్నత ఆనందాన్నీ లేకుండా చేస్తుందని గ్రహించలేక పోతున్నారు.
ఆకాంక్ష ఏరకమైనదైనా, సంఘం కోసంగాని, వ్యక్తిగతమోక్షం కోసంగాని, ఆత్మసిద్ధి కోసంగాని, తక్షణం చర్య తీసుకోకుండా తప్పించుకునేటట్లు చేస్తుంది. కోరిక అనేది ఎప్పుడూ భవిష్యత్తుకి సంబంధించినదే. ఏదో అవాలనీ, ఏదో చెయ్యాలనీ కోరటం అంటే, ప్రస్తుతం దాని గురించి ఏవిధమైనా చర్యా తీసుకోవడంలేదనే కానీ రేపటి కన్న ఇప్పటికే విలువ ఎక్కువ. ఇప్పుడు అనే దాంట్లోనే కాలమంతా ఉంది. ఇప్పుడు అనే దాన్ని అర్ధం చేసుకోవడమే కాలం నుంచి విముక్తి పొందడం. పరిణామమంటే దుఃఖం; అంటే కాలం మరొక రూపంలో కొనసాగడం. పరిణామంలో అస్తిత్వానికి తావు లేదు. అస్తిత్వం అనేది ప్రస్తుతంలోనే ఉంది. అస్తిత్వంలో ఉండటమే అత్యున్నతమైన పరివర్తన. పరిణామం అంటే కొద్ది మార్పులు మాత్రమే ఉన్న కొనసాగింపు. వర్తమానంలోనే - ఉన్న స్థితిలోనే సమూల పరివర్తనం ఉంటుంది.