మన్నారుదాసవిలాసము/ద్వితీయాశ్వాసము

శ్రీ రాజగోపాలాయ నమః

మన్నారుదాసవిలాసము

(పద్యకావ్యము)

ద్వితీయాశ్వాసము

శ్రీవిజయరాఘవాధిప
భూవలయప్రాజ్రరాజ్యపోషణదక్షా!
శ్రీవత్సకలితవక్షా!
శ్రీవిజితఘనప్రకాశ! చెంగమలేశా!

1


వ.

అవధరింపుము.

2


విజయరాఘవుఁడు శ్రీ రాజగోపాలస్వామి ఫాల్గుణోత్సవమునకు బయలుదేరుట; వసంతాగమనము

ఉ.

ఎంతయు వేడ్కగాంచ నవనీశుమహోత్సవముం గనుంగొనన్
గాంతలు తాము లోకమునఁ గల్గు బుధోత్తము లేఁగుదేర న
త్యంతమనోహరాకృతిని దానును వచ్చె వసంత మంత నే
కాంతసుగంధవాసితదిశాంతలతాంతము సంతసంబునన్.

3


ఉ.

సంతతకాంతిఁ జెన్నలరు సారసమందిరసీమ నిందిరా
కాంత వసింపఁ దేటు లధికంబుగ నెందును విందు లందఁగాఁ
గంతుఁడు నూత్నచాపశరకాండములన్ ధరియించి యెంతయున్
సంతస మందునట్లుగ వసంతము వచ్చె నితాంతలీలలన్.

4


క.

ఆరాధామాధవులు వి
హారవనం బలరఁ జేయు నల యామనికిన్
బేరొసఁగిరి కాకుండిన
నౌరా! రాధాఖ్య మాధవాభిధ గలదే!

5

మ.

పఱఁగన్ జైత్రుఁడు నవ్యచూతలతికాపాణిగ్రహం బందుచున్
మెఱయన్ వల్లికలున్ దరువ్రజములున్ మెచ్చొందఁగా నచ్చటన్
దెఱఁగొప్ప న్నిజపాణిపల్లవములన్ దీవ్యన్నవామోదముల్
నెఱయం దాల్చిన సేసఁబ్రా లనఁగఁ గన్పించెన్ బ్రసూనావళుల్.

6


క.

బాహుబలశాలి మరుఁ డు
త్సాహంబున జగము గెలువఁ దరలెడుచో స
న్నాహంబుఁ దెల్పు తద్ఘన
కాహళికారవము లనఁ బికధ్వను లెసఁగెన్.

7


తే.

కొమరు మీరిన నవపల్లవముల కాంతి
గాటమౌ సాంధ్యరాగంబుకరణి మించ
నపుడుఁ గనిపించె నందంద యందముగను
దారకంబు లనంగను గోరకములు.

8


క.

తరుణీజనమానమద
ద్విరదంబుల మద మడంపఁ దివురు మరునికిన్
దర మగు రత్నాంకుశముల
మురువున గనుపట్టె నపుడు మోదుగుమొగ్గల్.

9


తే.

మలయనిలయానిలుం డను మంత్రవాది
యచట భ్రమరాక్షసరముఁ ద్రిప్పుచును మఱియుఁ
బొసఁగ గుసుమపరాగంబుభూతిఁ జల్లి
సల్పె యువతిమానగ్రహోచ్చాటనంబు.

10


లయగ్రాహి.

చల్లనిసమీరములు మెల్లనె దిగంతముల నల్లుకొని పాంథతతియుల్ల మగలించెన్
సల్లలితచూతముల నెల్లెడల మెండుకొని మొల్లముగఁ బల్కు పికము ల్లలిఁ జెలంగెన్
గొల్ల లగు కల్వచెలి యల్లుని నిశాతతరభల్లము లనన్ వికచమల్లికలు మీరెన్
బల్లవసుమప్రచురవల్లికలఁ దాపుకొని పెల్లుగను దేఁటిగమి తెల్లమిగ మ్రోసెన్.

11

వ.

ఇవ్విధంబున నివ్వటిలు నవ్వసంతసమయంబున నొకశుభదినంబున విజయ
రాఘవనరేంద్రుండు నిండువేడుకతోడఁ జెండలంకారుని ఫాల్గుణమహో
త్సవంబునకు మోదంబున మీఁదుగావించిన ధనంబులు ప్రకటంబుగా
శకటంబుమీఁద ముందుగా నధికారిసందోహంబులచేతం బంపుచు, భూరి
భేరీరవంబులు బోరుకలంగ సంగ్రామసముద్భటు లగు వీరభటులును,
విజితమారుతరయంబు లగు హయంబులును, విజయలక్ష్మీకారణంబు లగు
వారణంబులు నుల్లసిల్లు కొల్లారుబండ్లును, అతులితవిలాసవతు లైన వార
యువతులును నందంద సందడిగ నడవ, వందిమాగధబృందంబుల కైవారంబు
లును, నసంఖ్యంబు లగు బిరుదసంఘంబులు, హృద్యంబు లగు వాద్యంబులు,
పరిసరవర్తు లగు దొరలును, సామంతమంత్రిసమూహంబులు దండ నిండి
యుండ, మక్కువ గల జక్కవగుబ్బెతలు ధ్వజవ్యజనాతపత్రచామర
శతంబుల నూన, ప్రతిలేని రతనంపుపనిహరువుల నుల్లసిల్లు పల్లకుల
నిరుగడల హరువుమీరఁ బేరుగల నీరజాక్షులు నక్షత్రనాయకుం బరివేష్టించి
వచ్చు తారలతీరునం జనుదేర, పిఱుందఁ గ్రందుకొని రాజకుమారవర్గంబు
నిరర్గళభుజార్గళప్రకాశితకుంతకాంతులు వెలయ బలియు లై వెంటనంటి
నడవ, ధరణీమణినూపురం బన వీక్షణీయం బగు దక్షిణద్వారకాపురంబు చేరి.

12


వ.

అంత.

13


సీ.

విజయరాఘవమహీనిభుఁడు దాఁ గట్టించు
        గోపురంబుల మించు గోపురములు
చక్రవాళాద్రితో సరిసేయఁ దగు కోట
        నారసాతల మంటు నగడితలును
దిరుమాళిగెలచేతఁ దీరైన వీథులు
        మేరుమందరముల మీరు తేర్లు
కృష్ణతీర్థంబు హరిద్రానదియు క్షీర
        సాగరముఖలౌ సకలతీర్థ


తే.

ములును జంపకవనశతంబులును మఱియు
మన్ననారులు వేంచేయు మండపములుఁ
గరితురంగమరథయోధవరగణంబుఁ
బరఁగఁ గన్గొనెఁ గన్నులపండువుగను.

14

విజయరాఘవుఁడు సర్వాలంకారభూషితుఁడై రాజగోపాలస్వామి ఫాల్గుణోత్సవమును దిలకించి వినుతులొనర్చుట, ఫాల్గుణోత్సవవర్ణన

వ.

ఇవ్విధంబున నవ్విజయరాఘవక్షితీంద్రుండు దక్షిణద్వారకాపురవిశేషంబు
లవలోకింపుచు నగరుఁ బ్రవేశించి మగువలుం దానును నిష్టగోష్ఠి నుండు
సమయంబున, స్వామి! హేమాబ్జనాయికాసహితుం డై రాజగోపాలుండు
విహంగరాజవాహనంబున వేంచేయు సమయం బని యవసరంబులవారు
దెలుప నత్తఱి మత్తగజయాన లవ్విభుని చిత్తవృత్తి నెఱింగి.

15


సీ.

నెలఁత యొక్కతె చేరి నిల్వుటద్దముఁ బట్టె
        జెలువ యొక్కతె యోరసిగ యమర్చెఁ
జంద్రాస్య యొక్కతె జాజిసరుల్ జుట్టెఁ
        జాన యొక్కతె రుమాల్ జాఱఁ గట్టెఁ
గలికి యొక్కతె దిద్దె గసూరితిలకంబు
        కనకాంగి యొకతె చౌకట్లు బెట్టె
జాణ యొక్కతె బురుసాహిజారును బూన్చె
        సకియ యొక్కతె యరచట్టఁ దొడిగె


తే.

దరుణి యొక్కతె హరువుగా దట్టి గట్టె
వనిత యొకతె దుప్పటి వలవాటు వైచెఁ
బడఁతి యొక్కతె చెవుల జవ్వాది యుంచెఁ
గొమ్మ యొక్కతె కుంకుమ నెమ్మి నలఁదె.

16


వ.

ఇవ్విధంబున నవ్వనితలు కై సేయ మఱియు నమ్మనుజనాయకుండు.

17


సీ.

వైరుల తల మెట్టు వామపాదంబున
        డంబుగా బిరుదుపెండెంబు వెట్టె
సాధుబృందముఁ బ్రోవఁజాలు హస్తంబుల
        నమర కెంపులకడియముల నూనె
మన్నారుదివ్యనామము నిల్పు నురమున
        మేలైన గోపాలతాళి వైచె
హరినామకీర్తనం బాలించు వీనుల
        మురువైన వజ్రాల మురువు లూనెఁ

తే.

జెలువ మన్నారుశ్రీపాదములఁ జెలంగు
నట్టి శ్రీతుళసీదళం బమరఁ దాల్చు
శిరసునను జాల కాంతులు చెలువుమీర
రతుల హెచ్చిన పచ్చతురాయి దాల్చె.

18


క.

ఇవ్విధమున గై సేసుక
నవ్వుచుఁ గులసతులుఁ దాను నడచుచు వేడ్కన్
దవ్వుల గోపురసీమను
బువ్వులవిలుకానితండ్రిఁ బొడగనె భక్తిన్.

19


వ.

అంత.

20


ఉ.

చల్వలు గల్గ నాసుతుని జాల దయన్ గరుణింతు నంచు బాఁ
గల్వలరేకు లెల్లయెడ గాటముగా వెదచల్లు చూపులన్
నల్వరన్ సుకీర్తిపయి నవ్వుమొగంబున వచ్చు శ్రీసతిన్
జెల్వలమేలుబంతి యగు చెంగమలమ్మను గాంచె ముందుగన్.

21


వ.

తదనంతరంబ యవ్విహగరాజవాహనంబున.

22


సీ.

కరుణారసము జిల్కు కడకంటిచూపుల
        గరిమతో భక్తులఁ గాఁచువానిఁ
జందమామను మించు నందంబు గనుపించు
        మొలకనవ్వుల ముద్దుమోమువానిఁ
బద్మంబుపై వ్రాలు భ్రమరంబనన్ మించు
        మేటికస్తురిబొట్టునీటువాని
విజయసారథి యౌట విజయంబుఁ జేకూర్చు
        కనకవేత్రముఁ గేలఁ గలుగువాని


తే.

నవుదలను వైరముడి దాల్పు నందగాని
గొప్పచౌకట్లు వీనుల నొప్పువాని
రాజితం బైన కనకాంబరంబువానిఁ
గనియె మన్నారుఁ గన్నుల కఱవు దీర.

23


వ.

ఇట్లు కనుంగొని.

24


క.

తనువునఁ బులుకలు నిండఁగ
మనమున హర్షంబు మిగుల మాఁటికిఁ జెలఁగన్

గనుఱెప్ప వేయ కప్పుడు
వినయంబున నిలిచి మొక్కి వినుతు లొనర్చెన్.

25


సీ.

బృందావనంబునఁ బెంపొందు తండ్రికి
        నే దెచ్చు శ్రీతుళసీదళములు
నరుణాబ్జవాసిని యైనట్టి తల్లి కే
        సమకూర్చు నరుణాంబుజాతములును
జంపకవనమునం జరియించు నయ్య కే
        నొనగూర్చు సంపెంగననలదండ
పారిజాతముతోడఁ బ్రభవించు జనని కే
        నమరించు పారిజాతములసరులు


తే.

నమృతకరునకు నమృతోపహార మొసఁగి
నట్లనుచుఁ బూజ గావించి యభినుతించి
గరితలును దాను చలువచప్పరమునందు
వేడ్క లుప్పొంగ గనుఁగొనువేళయందు.

26


వ.

ఆదివ్యప్రభావంబు గల యాదివరాహస్వామియు, ఉల్లసత్తేజోవిరాజమాను
లైన తిల్లగోవిందరాజులును, రమ్యవైభవంబుల రాణించు శార్ఙ్గపాణియు,
నవక్రపరాక్రమంబు గల చక్రపాణియు, వైరిమదాపహారి యైన శౌరిరాజ
స్వామియును, నీలాంబుజశుభాకారంబు గల నీలమేఘస్వామియు, శృంగార
వైఖరిం జెలంగు శింగపెరుమాళ్ళును, [1]దళితాసురజనాహ్వుం డగు తంజ
పురనరసింహుండును, రంగద్విహారు లగు తిరుమంగయాళ్వారులును మొద
లుగా సురపతులచేత పూజలు గొన్న తిరుపతులనుండి వేంచేయు స్ఫూర్తిగల
నిజలీలామూర్తుల నందఱిని నవసరంబులవారు బడిబడిని విన్నవింపఁ బొడ
గనిపించుకొని, ముందుగా భేరీశతంబులు బోరుకలంగ, నమందచతురంగ
బలంబులు సందడిగ నడవఁ బొడగు లగు గొడుగులును, జొక్కంబు లగు
టెక్కెంబులును నరుదు లగు బిరుదులుసు మనుజనయనోత్సవకారణంబు
లగు మకరతోరణంబులును, జాల రాణించు చాలుదీవటీలును, నెడనెడల
తీరుగల దీపంబుల తేరులును, బ్రావీణ్యంబు మీరఁ గావించు రావణకుంభ
కర్ణవాలిసుగ్రీవహనుమదాదిభావంబుల మించు దీపప్రతిమలును, సారువు
లైన మేరువుదీవటీలును, నెంచఁదగి మించు కంచువెండిబంగారుకైదీవటీ

లును, రాణగల బాణవిద్యలును దండిగా నిండియుండ గోవర్ధనోద్ధరణ
గోపీవస్త్రాపహరణభావప్రతిమలును, నింతుల వసంతకేళికవిధంబును, నుల్ల
సిల్లు మల్లయుద్ధప్రకారంబును, మొదలుగా బలువగల బన్ని తెచ్చు జంత్రం
పుప్రతిమలును, విజయ రాఘవభూచక్రవిభుఁడు సమర్పించు భూచక్ర
గొడుగులును, సౌవర్ణరాజతఛత్రచామరధ్వజవ్యజనాదులును, రంగారు
బంగారుపనిహరువులు గల హరిగలును, నిరుగడలఁ జాలుగా నడవఁ బొగ
లేని పగలువత్తులు మిన్నగా వెన్నెలలు గాయ, హెగ్గాళెలు బూరగాళెలు
దిగ్గగనాంతరంబుల నగ్గలంబుగా మ్రోయ, హృద్యంబు చక్రవాద్యంబు
లును, రంగారు సంగీతమేళంబును, బాలికలు వినిపించు కేళికలును,
సన్నిధిన్ జెన్ను మీర, వెనుకదిక్కున గనకప్రతిమాచిత్రితం బై
[2]యుప్పరంబంటు గొప్ప పూజప్పరంబు దనర, నరగజంబులును, గజంబుల
మీఁది డమామీలును, చిక్కులు పిక్కటిల్ల నొక్కటిగ మ్రోయ, నల్ల
చెంగమలవల్లికాంబయు శ్రీరాజగోపాలస్వామియు రాజవీథినిఁ దేజంబు
మీర వేంచేయు నవసరంబున నవ్విజయరాఘవేంద్రుండును జంద్రవదన
లుం దాను నయ్యదుకులచంద్రు నగ్రభాగంబున వచ్చుచున్న సమ
యంబున.

27


ఉ.

కోటలఁ గొత్తళంబులను గోపురసీమల గాట మైన శృం
గాటకచారువేదికలఁ బ్రాంచితసౌధములందు వీథులన్
వాటము లైన తిన్నెలను వన్నెల మీరిన మంటపంబులన్
వీటను దట్టమై ప్రజలు వేడుక మీరఁగఁ జూచి రందఱున్.

28


క.

వన్నెగ నందం దిటువలె
తిన్నగ నెలకొనుచు నఖిలదేశముల ప్రజల్
మన్నాగును జెంగమ్మను
గన్నులపండువుగ నపుడుఁ గనుఁగొన వేడ్కన్.

29


రాజచంద్రునిపుత్రి కాంతిమతి సౌధాగ్రసీమనుండి శ్రీరాజగోపాలుని దర్శించి చక్కనిపతి గావలె నని కోరుట

వ.

అయ్యవసరంబున.

30


సీ.

కురులు నున్నగ దువ్వి గొప్పగా నల్లిన
        జడనిండ సంపెంగసరులు జుట్టి

యరచందురుని మించు నందమౌ నుదిటిపైఁ
        దీరుగా మీరఁ గస్తూరి దిద్ది
చెక్కుటద్దములందు జిగి మించు రతనాల
        మురువైన తాటంకములు ధరించి
ప్రతిలేని వజ్రాలపాపటబొట్టుపై
        సాంద్రప్రభల సూర్యచంద్రు లుంచి


తే.

ఆణిముత్తెపుముక్కఱ నమరఁ బూని
హారముల్ హస్తకడియంబు లందియలును
రాణఁ దనరార ముత్తెలరవికె సరిగె
పనిహరువుచీర ధరియించి బాగుమీర.

31


క.

తావులు వెదచల్లెడు నల
భావజు [3]సమ్మోహనంపుబాణ మనంగా
ఠీవి మిగులఁ జెలికత్తెలు
వేవిధముల వెంటఁ గొలువ వేడుకమీరన్.

32


సీ.

అందమౌ పదముల యందెలరవళి రా
        యంచలు వెనువెంట నంటి నడవ
గలికిచూపులచేతఁ గనుఁగొన్నయెడ లెల్ల
        గలువలు వెదచల్లుఁ జెలువు మీర
ముద్దుగుల్కెడు మోము మొలకనవ్వులకాంతి
        నెలకొని పండువెన్నెలలు గాయఁ
బసిఁడిసలాకతోఁ బ్రతివచ్చు నెమ్మేను
        మెఱుఁగుదీఁగెలచాయ మించసేయ


తే.

దండ నుండెడు చెలుల కైదండఁ గొనుచు
జెలు వలరు హేమసౌధంబుఁ జేరవచ్చి
రాజచంద్రాహ్వయుం డైన రాజుపుత్రి
కాంతిమతి జూచె గోపాలుఁ గాంక్ష దీర.

33


వ.

మఱియును.

34


చ.

శరదరవిందలోచనునిఁ జక్కెరవిల్తునిఁ గన్న భామినిన్
సరసగుణాకరన్ జనులఁ జల్లనిచూవులఁ జూచు శ్రీసతిన్

వరము లొసంగుచున్ గొలుచువారల బ్రోచు దయాపయోధులన్
జిరముగ రాజగోపహరిఁ జెంగమలమ్మను గాంచి వేడుకన్.

35


క.

దిక్కుల నిండిన కీర్తుల
నెక్కువ నీపుడమియెల్ల నేలు ఘనుండౌ
చక్కని పతి గావలె నని
మక్కువతో మ్రొక్కెఁ గాంతిమతి సద్భక్తిన్.

36

కాంతిమతి విజయరాఘవుని జూచి యతని యందచందముల కాశ్చర్యపడి యతని గుణముల గీర్తించుచు మోహించుట

సీ.

నక్షత్రములు చుట్టునను రాగఁ గనుపట్టు
        కలువలచెలికాని చెలువుఁ బూని
నవకల్పలతికల నడుమ నున్నతి గల
        పారిజాతములీలఁ బ్రబలి చాల
నదులు రా నలువంకఁ బొదలు నయ్యకలంక
        శరధినాయకుదారి జగతి మీరి
[4]కరిణీశతము లెందుఁ గని కొల్వ నలువొందు
        మదగజేంద్రము మించు మహిమ గాంచి


తే.

యలరుబోణులు తన వెంట నంటి నడువఁ
బ్రజల కెల్లను గన్నులపండువుగను
మన్ననారుల చెంగట వన్నె కెక్కు
గరిమతో వచ్చు విజయరాఘవునిఁ జూచె.

37


వ.

ఇవ్విధంబున.

38


ఉ.

కాంచి సుపర్ణుపై మునుపు గాంచిన చక్కని మన్ననారులే
యంచితలీల నిఫ్టు జలజాక్షులు సేవ యొనర్పఁ జుట్టున
న్మించినవేడ్క నీగతిని మేదిని వచ్చుచునున్నవా రొకో
యంచుఁ దలంచి యల్ల విహగాధిపుపై హరి గాంచెఁ గ్రమ్మరన్.

39


సీ.

ఇందుబింబద్యుతి కెనవచ్చు ముఖకాంతి
        యిరువురియందును నేక మయ్యెఁ
దెల్లదామర గెల్చు తీరైన కనుచాయ
        జూడ నిద్దఱియందు సొంపుగాంచె

సంపెంగమొగ్గతో సరివోలు నాసిక
        యందమై యిరువురియందుఁ దనరె
బగడంబు డంబున భాసిల్లు నధరంబు
        నొనరె నిద్దఱియందు నొక్కసరిగ


తే.

నందమై మందమై మీరునట్టి యురము
భోగిభోగాభమై మించు భుజయుగంబు
సరసిజంబుల నిరసించు చరణములును
బొగడ నిద్దఱియందును బొలుపు మీరె.

40


సీ.

వక్షస్థలంబున వన్నె కెక్కిన మచ్చ
        లాలితం బగు వనమాలికయును
సరిలేని కరముల శంఖచక్రంబులు
        నవరత్నమయమైన నవ్యవేత్ర
మనుపమంబై మించు కనకాంబరంబును
        రమణమై మీరు వజ్రములవంకి
ముంజేతులను బొల్చు ముత్తెలకడియముల్
        చరణపద్మమునందు బిరుదుపెండె


తే.

మమరె నిద్దఱియందును నందముగనె
యెంత భావించినను భేద మెఱుఁగరాదు
కావునను రాజగోపాలదేవుఁ డిపుడు
దనర రూపద్వయంబును దాల్చెనేమొ!

41


వ.

అని వితర్కింపుచు.

42


తే.

ఎన్నివిధముల భేదంబు నెంచలేక
యమ్మహామహు వక్షంబునందు మిగుల
భాసురం బగు మన్నారుదాసముద్ర
నాసుదతి యెంచి మన్నారుదాసుఁ డనుచు.

43


సీ.

చిన్ననాఁడే రత్నసింహాసనం బెక్కి
        మన్నారుకృపచేత మనిన ఘనుఁడు
కురులు గూడనినాఁడె కుతుకంబు మీరఁగాఁ
        బరుల గెల్చిన పటుబాహుబలుఁడు

ప్రతిదినం బాచార్యపదములు భక్తిచే
        బూజ సేయుచు నుండు పుణ్యశాలి
సరసుఁ డై సంగీతసాహిత్య విద్యల
        రసికతఁ గాంచిన రాజరాజు


తే.

విజయరాఘవుఁ డని చెలుల్ వినుతి సేయ
వేడ్క వినియుందు వీనులవిందు గాఁగ
నల్ల గోపాలు నాత్మఁజుం డౌట నితని
కతనిగుణములు భాసిల్లె నందముగను.

44


సీ.

చందమామను మించు చందంబుగల మోము
        చిందంబు నందంబుఁ జెనకు గళము
నీరజమ్ములఁ గేరు తీరైన కనుదోయి
        పల్లవంబుల నేలు పాణియుగము
కనకకవాటంబుగరిమఁ బొల్చు నురంబు
        మృగరాజు నదలించఁ దగిన కౌను
బంగారుననఁటుల ప్రతివచ్చు నూరువుల్
        జలజరేఖల మీరు చరణములును


తే.

మొదలుగాగల యవయవంబులు చెలంగఁ
నెందుఁ జూచిన నాచూపులందె నిలిచె
బ్రహ్మ యింద్రున కొసఁగినపగిది వేయుఁ
గన్ను లొసఁగిన వీక్షింతుఁ గాంక్షదీర.

45


సీ.

మస్తు మీరుచుఁ జాల మదముతోఁ జను దెంచు
        గజరాజు నదలించ గమనలీల
పద్మమిత్రుని మించు బాగైన నెమ్మేని
        తేజంబు దిక్కులఁ [5]దేజరిల్ల
ముద్దునెమ్మోమున మురువైన చిఱునవ్వు
        చంద్రికల్ వెదచల్లు సరణిఁ దనర
మాటికి గోపాలు మగుడిచూచిన చూపు
        సింహావలోకనశ్రీల గెల్వ

తే.

వచ్చు నీరాజు సాటియే పచ్చవింటి
రాయఁ డైనను గలువలరాయఁ డైన
నల వసంతుఁడు నైన జయంతుఁ డైన
సౌర యీయంద మెందైన నరయఁ గలదె!

46


సీ.

ముద్దుగుల్కెడు వీని మోముఁ జూచినఁ జాలుఁ
        గాంతల కన్నులకఱవు దీరుఁ
దావిమించిన వీని మోవి యానినఁ జాలుఁ
        దరుణుల మదిలోని దప్పి జారు
బాగుమించిన వీనిఁ గౌఁగిలించినఁ జాలుఁ
        గన్నెల తాపంబు కడకుఁ జేరు
వలపుజిల్కెడు వీని పలుకు విన్న ను జాలు
        వెలదుల వీనుల విందు మీరు


తే.

నెలమి నీమోహనాంగుని నెపుడు గూడి
సరససల్లాపములఁ బ్రొద్దు జరుపునట్టి
కలికిభాగ్యంబు భాగ్యంబు గాక జగతి
నితరవనితల భాగ్యంబు నెంచనేల!

47


ఉ.

ఏమి తపం బొనర్చిరొ! మహిన్ మరి పుణ్యము లేమి సేసిరో!
నోముల నేమి నోచిరొ! మనోరథదానము లే మొసంగిరో!
వేమరు మన్ననారులను వేఁడుచు నెట్లు భజించిరొక్కొ! యీ
రామలు వేడ్క నీవిజయరాఘవచంద్రునిఁ బెండ్లియాడఁగన్.

48


విజయరాఘవుఁడు నిజాంగనలతో నంతఃపురంబుం జేరుట

వ.

అని ఇవ్విధంబున నివ్వటిల్లు ప్రేమాతిశయంబునఁ గాంతిమతి సంతసంబునఁ
గనుంగొనుచున్న సమయంబున విహంగపుంగవవాహనారూఢుఁ డైన శ్రీ
రాజగోపాలస్వామి హేమారవిందేందిరయుం దానును జనబృందంబు
లెందెందుఁ జూచిన నందంద సందడిగ నిలిచి వందనంబులు సేయుచుఁ
గరపంకజంబులు మొగిడ్చి విజయరాఘవవరద! విజయసహాయ! శ్రీరాజ
గోపాల! చెంగమలాంబికాలోల! అని సన్నుతింపఁ జల్లఁగా నెల్ల జనులం
గటాక్షింపుచుఁ దిరువీథుల వెంచేసి తిరువందికాపుఁ గొన నవధరించి యగ్ర
భాగంబున సమగ్రవైభవంబులు మెఱయఁ బొడగనవచ్చు నాదివరాహ

స్వామి మొదలగు తిరుపతులనుండిఁ జనుదెంచు సురపతులు నిజని
వాసంబులకుఁ జని యరుణోదయంబున కరుగుదేర సేనాధిపతికి నానతి
యొసంగి ఠీవి మెఱయఁ గోవిలకు వేంచేసి విజయరాఘవమంటపంబున
నిలిచి వాహనంబులు డిగ్గి ప్రీతి దనర సేతియందు వేంచేసి సవరించు
వివిధోపచారంబు లవధరించి యిష్టవినోదంబుల సంతుష్టుఁ డై యుండు
సమయంబున విజయరాఘవవిభుండును నగరుఁ బ్రవేశించి యింతులుం
దాను నంతఃపురంబున సంతసంబున నుండె; నంత.

49


కాంతిమతి స్వప్నమున విజయరాఘవునితోఁ గలసి మోహపరవశ యగుట

క.

కాంతిమతి యిట్లు గనుఁగొని
యింతింతనరాని హర్ష మెసఁగఁగ మదిలో
నంతట నాసౌధము దిగెఁ
జెంతన్ బ్రియసఖులు చేరి చేలా గొసఁగన్.

50


తే.

ఇట్లు సౌధంబు డిగ్గి యాయిగురుఁబోణి
చెలుల బంతిని గూర్చుండి చెలువుమీర
నారగింపుచు వీడియం బమర సేసి
తూఁగుటుయ్యల శయనించె దొరతనమున.

51


సీ.

ఈరీతి నిద్రింప నారేయి వేఁకువ
        జామున నాయింతి స్వప్నమునను
విజయరాఘవమహీవిభుఁడు వేడుక వచ్చి
        శయ్యపై గూర్చుండి సరస మమర
నక్కునఁ దను జేర్చి చెక్కిలి నొక్కుచుఁ
        బుక్కిటి విడె మిచ్చి బుజ్జగించి
కురులు మెల్లనె దువ్వి కులుకుగుబ్బలమీఁద
        నందంబు గనుపించ గంద మలఁది


తే.

తావి గల్గిన తనదు కెమ్మోవి యాని
యే విజయరాఘవుఁడ నంచు నెలమిఁ బల్కి
చిగురువిల్తునికేళికిఁ జేరినపుడె
బాలికామణి యంతట మేలుకనియె.

52

క.

చెలి యిటు కలగని మేల్కొని
నలుదిక్కులు గలయఁ జూచి నవ్వుచుఁ దనలోఁ
దల యూఁచుచుఁ దత్తరపడి
పలుమరుఁ దలపోయు నిట్లు భావములోనన్.

53


తే.

రాజగోపాలుఁ డేఁటికి రాజవీథి
వచ్చె? సేవింప నే నేల వచ్చి తపుడు?
విజయరాఘవవిభుఁ డేల వేడ్క వచ్చె?
వచ్చుగా కేమి! కల నేల వచ్చె నతఁడు?

54


వ.

అని మఱియును.

55


చ.

పలుచని చెక్కు నొక్కుచును భావము మీరఁగఁ బల్కరించుటల్
కులుకు మెఱుంగు గబ్బివలిగుబ్బలు జీరుచుఁ గౌఁగిలించుటల్
పలుమరు మోవి యానుచును భావజుకేళికి నియ్యకొల్పుటల్
తలఁపున నుంచి చాలఁ బరితాపముఁ జెందును వెచ్చ నూర్చుచున్.

56


క.

అసురుసు రనుచున్ ముద్దులు
గొసరుచుఁ బై వ్రాలు చిలుకకూరిమిఁ గనకే
కసరుచు బిసరుహలోచన
యసమాయుధదళితహృదయ యై తనలోనన్.

57


చెలులు కాంతిమతిం గని పలుకరించుట

చ.

తలిరులశయ్యపై బహువిధంబుల మన్ననసేయు మార్గముల్
తలఁచి తలంచి నెమ్మనము తాలిమి దూలి విరాలి హెచ్చ నె
చ్చెలులఁ దొఱంగి యాటయెడ చింత దొలంగి కరంగి వంతచేఁ
బలుకకయున్న కాంతిమతి భావముఁ గన్గొని బోటు లందఱున్.

58


సీ.

పలికిన మనతోడఁ బ్రతిమాట వల్కదు
        పలుమారుఁ దనలోనె బల్కుగాని
చేయి వీణియమీఁదఁ జేర్చంగ నొల్లదు
        చింతచేఁ జెక్కిటఁ జేర్చుగాని
సొలఁపుమై రాయంచఁ జూడగా నొల్లదు
        స్రుక్కుచు నలుగడఁ జూచుఁగాని
రహి మించఁ జిత్రము వ్రాయఁగా నెంచదు
        వసుమతిఁ గొనగోట వ్రాయుఁగాని

తే.

వేయుఁ జెప్పఁగ నేల నీవెలఁది కిపుడు
మదనతాపంబు నెమ్మదిఁ గుదురుకొనియె
నువిదఁ గన్గొని మన మెటు లోర్వవచ్చు
నెలఁత కీచింత యేరీతి నిలుపవచ్చు?

59


వ.

అని విచారింపుచు నచ్చిగురుఁబోణులు నెచ్చెలితో నిట్లనిరి.

60


సీ.

అమర సింగారించితిమి బొమ్మరిల్లిదె
        చెలువ! బొమ్మలపెండ్లి సేయవమ్మ!
తళుకు పన్నారుదొంతులు దెచ్చియున్నవి
        వనిత! గుజ్జనగూళ్ళు వండవమ్మ!
కొమరుగా బోనంబు లమరించియున్నవి
        వెలఁదిరో! విందులు పెట్టవమ్మ!
చిదిమి తెచ్చిన వీరుల్ సేసగా నున్నవి
        కోమలీ! దండలు గూర్చవమ్మ!


తే.

ఉవిద! యే మేమి బల్కిన యూరకున్న
దాన విది యేమి? నేఁడు నీతలఁపు వింత
నీరజేక్షణ! మామీఁద నేర మేమి?
సుదతి! మునుపటి చెలిమిచేఁ జూడ వేమి?

61


కాంతిమతికి విజయరాఘవునిపై మోహ మధికరించుట, కింకర్తవ్యతామూఢయై కాంతిమతి పరితపించుట

క.

అని పల్కు చెలుల పల్కులు
తన చెవులకు ములుకు లైనఁ దాలిమి లేకే
వినివినములు గావింపుచు
మనమునఁ దలపోసెఁ గాంతిమతి యిట్లనుచున్.

62


సీ.

విజయరాఘవమహీవిభునిఁ బెండ్లాడుటే
        చెలఁగి బొమ్మలపెండ్లి సేసినట్లు
మన్నారుదాసు కమ్మని మోవి యానుటే
        యెంచగా విం దారగించినట్లు

తంజపురీంద్రుఁడు తలఁబ్రాలు వోయుటే
        కొప్పున విరిసరుల్ గూర్చినట్లు
రఘునాథతనయుని రతికేళిఁ గూడుటే
        సకలవినోదముల్ సలిపినట్లు


తే.

చెలులు తనమది దెలియక పలికి రిట్టు
లొకరిహృదయంబుఁ దెలియంగ నొకరివశమె
నెనరు మీరఁగ వీరు బల్కినవి యెల్ల
యిపుడు వివరింప వీనుల కింపు గావు.

63


వ.

అని మఱియును.

64


సీ.

చెలులతో నీమాటఁ జెప్పినయప్పుడె
        గేలిసేతురొ వారు కేలి నవ్వి
తలిదండ్రు లీవార్త దెలిసినయంతనె
        యేమని యెంతురో? హృదయమునను
దను బెంచు దాదు లీతలఁపు దా మెఱిగిన
        నేర మెంతురొ! నన్ను నిక్కముగను
జుట్టపక్కంబు లీసుద్ది విన్నప్పుడే
        పలచఁగాఁ జూతుఁరో! భావమందు


తే.

నెవ్వరికిఁ దెల్పుదాన నే నెలమితోడ?
నెవ్వ రీకార్యము ఘటింతు రించుప్రేమ?
నెవ్వరో ప్రాణబంధువు లిచటఁ దనకు?
నెవ్వ రీతాపమును దీర్తు రింపుమీర?

65


సీ.

ఎన్నఁడు గల్గునో హృదయతాపము దీరఁ
        దాని మించిన వానిమోవి యాన
నెన్నటి కబ్బునో యింపు సొంపారంగఁ
        గదిసి వేడుక వానిఁ గౌఁగలింప
నెన్నఁడు దొరకునో హెచ్చుప్రేమను వాని
        తొడలపైఁ గూర్చుండు దొరతనంబు
నెన్నఁడు కూడునో మన్ననతో వాని
        పక్కఁ బాయక యుండు భాగ్యమహిమ

తే.

యెన్నటికి వాని నేఁ గూడి వన్నెమీర
సరససల్లాపములఁ బ్రొద్దు జరపుచుందు
నెన్నటికి నింక వాఁడు నే నేక మగుచు
నలరుఁ దావియువలె నుందు మందముగను.

66


సీ.

కురులు నున్నగ [6]దువ్వి గొప్పకొ ప్పమరించి
        సొగసుగా విరిసరుల్ జుట్టు నెపుడు
చెక్కిలిఁ బలుమారు నొక్కుచు నెంతయుఁ
        దీరుగాఁ దిలకంబు దిద్దు నెపుడు
కులుకుగుబ్బల వాడిగోరను జీరుచు
        నలఁ గుంకుమగంధ మలఁదు నెపుడు
ముదము మీరఁగఁ బోకముడి సడలింపుచుఁ
        గంతుకేళిని నన్నుఁ గలయు నెపుడు


తే.

గళరవంబులుఁ బలుకుచుఁ గాక దీరఁ
గళల సొక్కించి తేలించి వలపుమించ
విజయరాఘవమేదినీవిభుఁడు నన్ను
నించు వేడుక నోలలాడించు నెపుడు.

67


సీ.

కనురెప్ప వ్రేసినఁ గన్నులకును వానిఁ
        బొడగన్న య ట్లుండు పొలుపుమీర
నెవ్వరు బల్కిన నింపు సొంపగు వాని
        పలుకు విన్నట్లుండు భావ మలర
నెవ్వరు వచ్చిన హెచ్చినతమి వాని
        యడుగుచప్పుడె యని యదరు హృదయ
మేదిక్కుఁ జూచిన నాదిక్కునను వాని
        భావంబు నెలకొన్నపగిదిఁ దోఁచు


తే.

నేమి సేయుదు? నెట్లోర్తు? నిపుడు దనకు
మరునికాక దొలంగించు మార్గ మేమి?
యెవ్వరికి దెల్పు దీమాట? నెలమితోను
విజయరాఘవవిభుఁ గూడువిధ మదెట్లు?

68

వ.

అని మఱియును.

69


చ.

తలఁపుచు నిట్లు నెమ్మదినిఁ దాలిమి లేక కరంగి చింతచేఁ
బలుమరు నుస్సురస్సు రని పాన్పుపయిన్ బవళించు లేచు ది
క్కుల భ్రమనొంది చూచుఁ దనకోరిక నెవ్వరితోడఁ దెల్పుదున్
జెలువుగ నంచు సన్ననయి చెక్కిటఁ జేయిడి యుండు నత్తఱిన్.

70


కాంతిమతియున్న తీరెఱింగిన చెలులు శైత్యోపచారము జేయనెంచి కాంతిమతిని వనకేళి కాహ్వానించుట; వనకేళి

క.

కాంతిమతి యున్న భావము
వింతఁగఁ గనుఁగొనుచుఁ జెలులు వెరఁగంది కడున్
జింతించి కంతుతాపమె
యింతికి నిది యనుచు నిశ్చయింపుచు నంతన్.

71


సీ.

రాజచంద్రునకు నీరమణిభావముఁ దెల్పఁ
        జెలు లెంతవా రని పలుకు నొక్కొ!
తల్లితో నీమాటఁ దగ నెఱింగించిన
        సారెకు మనలనే దూరు నొక్కొ!
దాదుల కీవార్తఁ దడయక డెల్పిన
        నిందఱిపై నేర మెంతు రొక్కొ!
అన్నదమ్ములతోడ విన్నవించితిమేని
        లెక్కచేయక యదలింతు రొక్కొ!


తే.

ఎన్నివరుసల నిందఱ మెంచి చూడ
మనమె శైత్యోపచారంబు మగువ కిపుడు
సేయవలయు నటంచును జెలువుమీరఁ
గాంతిమతిఁ జేరి పల్కిరి క్రమముతోడ.

72


సీ.

వనితరో! శృంగారవనము చూతము రమ్ము
        చాల మీరె వసంతసమయ మగుట
నెలఁతరో! పూవులు నిండియున్నని యివె
        సరులు గూర్తము వింత సరవి మెఱయఁ

తామరసాక్షిరో! తామరకొలనిలో
        వేడ్క నాడుదమమ్మ! వెలయ మనము
వాలుగంటిరొ! నేఁడు వనభోజనము సేయ
        వలె మన మిందఱు వన్నె గాఁగ


తే.

ననుచుఁ జెలు లందఱును దెల్ప విని యొకింత
యవును గా దనలేక యయ్యలరుఁబోణి
యున్న చందముఁ జూచి యాయువిద కప్పు
డూడిగంబులు సవరించు నొఱుపుతోడ.

73


సీ.

రంగుమీరినయట్టి రతనంపుపావలుఁ
        బద్దములఁ గీలించెఁ బణతి యొకతె
జారుపైఁటచెఱంగుఁ జక్కగా సవరించి
        కైదండ నొసఁగెను గాంత యొకతె
బంగారుపనిహర్వు బాగుగాఁ గనుపట్టు
        [7]హరిగ వేడుకఁ బట్టె నతివ యొకతె
జతనఁ బరాకు హెచ్చరిక యటంచును
        సారెకుఁ బలికెను సకియ యొకతె


తే.

యడపమును గిండిఁ గాళంజి నలరుసురఁటిఁ
బొంకముగఁ గొంద ఱతివలు బూని రపుడు
లలితగతి మీరెడు వసంతలక్ష్మి యనఁగ
వనజలోచన యుద్యానమునకు వచ్చె.

74


క.

ఈరీతిని జెలు లందఱు
వారిజముఖిఁ దోడితెచ్చి వైఖరిమీరన్
జేరి యటఁ బొద్దువుచ్చుచు
నారమణిం జూచి పల్కి రప్పుడు వేడ్కన్.

75


సీ.

కొమ్మరో! చూచితే గుంపులై [8]యున్నవి
        చంపకంబులును రసాలములును
గన్నెరో! చూచితే గాటమై యున్నవి
        నారికేళములు పున్నాగములును

జెలువరో! చూచితే చెలువమై యున్నవి
        నారంగములును జంబీరములును
దరుణిరో! చూచితే దట్టమై యున్నవి
        ఖర్జూరములు గర్ణికారములును


తే.

మగువ! చూచితే మొల్లలు మల్లియలును
[9]బండిగురివెందపొదలును బొండుమల్లె
లల్లిబిల్లిగ నెల్లెడ నల్లుకొనుచు
నలరుగుత్తుల మిక్కిలి నలరె నిచట.

76


సీ.

మగువ పుక్కిట నించు మధువున నిగుడెను
        బొగడను పూవులు పూవుఁబోణి!
పడఁతి యందియతోడి పదమునఁ దన్నంగ
        ననిచె నశోకంబు నళిననేత్ర!
కన్నియ నవ్వినఁ గనుపట్టె నెల్లెడఁ
        బొన్నమ్రానున విరుల్ పుష్పగంధి!
కల్కిచన్నుల నాని కౌఁగిలింపఁగఁ బూచెఁ
        గురవకతరు విదె కుందరదన!


తే.

ఇంతి మో మెత్త సంపెంగ నెనసె ననలు
వనిత మూర్కొన్న వావిలి మొనసె సుమము
నతివ పలికిన గోఁగున నలరు లలరె
లలన గనుఁగొన్న మొగ్గలఁ దిలక మమరె.

77


చ.

అని చెలి నెచ్చరింపుచు రయంబునఁ గీల్ జడ లల్లి వేడుకన్
ఘనముగ నందియల్ మొరయఁగాఁ జరణమ్ముల మేనితావికిన్
మొనయుచుఁ దేఁటిగుంపులు బ్రమోదమున న్వెనువెంట నంటఁగా
ననుపమలీలచే వెలసి యంబుజలోచన లవ్వనంబునన్.

78


        రగడ (మధురగతి)
కనుఁగొను చెలువము కామిని! వనమున
నినిచెను వేడుక నెరయఁగ మనమునఁ
గొమ్మలు మును నేఁ [10]గోసిన క్రొవ్విరిఁ
దెమ్మని బలిమిని దియ్యఁగఁ గ్రొవ్విరి

భామిని! తగునే పలుమరుఁ జీరఁగఁ
[11]గొమరగు నీలత గోరను జీరఁగ
నెనసిన చెలితో నేలే వాదులు
వనిత! నీకు లేవా విరవాదులు
చెలియరో! లాగించెదు తెకతేరకు
నలరులగుత్తులకై యేతేరకు
చెలిమిమీర నిచ్చితి వీమరువము
నలినేక్షణ! యెన్నటికిని మరువము
నెరసెను మొగ్గలు నిచ్చలు పొగడను
తరుణిరొ! దీనినె తగదా పొగడను
నారీమణి! యీనన నీకంటివె
యారమణి కొసఁగె నదిగో కంటివె
ఆమనిఁ దలఁపఁగ నలరుల చేరువ
రామరొ! యీపొద రమ్మా చేరువ
యెన్నిక మీరఁగ నీచెలిదండను
గ్రొన్నన లన్నియుఁ గూర్పుము దండను
చానరొ! యాడించకు మీనెమ్మిని
మానిని కెరవగు మానుము నెమ్మిని
అరుగకుమీ నీ వయ్యెడఁ బొదలను
దిరిగెడుఁ దఱచై తేఁటులు పొదలను
చిక్కు దీయవే చెలియరొ! సరిపెన
యొక్కటియై యిపు డున్నది సరిపెన
తరలకు దవ్వుగ తగదన నేరమె
హరిణేక్షణ! మే మట చననేరమె
కలవే యామని ఘనముగ జాతులు
నెలఁతరొ! నాతోనేనా జాతులు
[12]మీరిన బంతులు మొచ్చుగ నీవలె
వేరుసేయకే వెలఁదీ! నీవలె
వనితా! పొదలను వలనే దూరఁగ
చనకు మన్న నను చనునే దూరఁగ
కోమలి! యిచ్చెదఁ గొనుమీ సరములు
కామునిపూజకుఁ గడు మీసరములు

వాసనచే మగువా! కంకేళికి
నాస యొనర్చెద వందునె కేళికి
అతివరొ! చేరువ నదె మాకందము
ప్రతి లేనిది యిది పదమా కందము
చక్కని యీవిరిసర మే నమ్మను
చిక్కులమాటలు చెలి! నే నమ్మను
కనకము చెలఁగెడు కను మాచాయను
కనకము మీరఁగ గల విరి చాయను
కొసరఁగ నేటికిఁ గొన గోరంటను
కుసుమముఁ గోయుము కొనగో రంటను
[13]సురపొన్నలగమి చూడవె యిచ్చట
గరితకు దీనిన్ గనుటకె యిచ్చట
అని పల్కుచుఁ దగ నందఱు ముదమున
ననలుఁ జిదిమి రెంతయు సమ్మదమున.

79


చెలులు కాంతిమతితోఁ గలిసి జలకేళి సల్పుట

వ.

అంత.

80


సీ.

పొడమిన నెమ్మేని బడలికల్ దీరంగఁ
        జల్లని పన్నీరుఁ జల్లుకొనుచుఁ
బటువుగుబ్బలమీఁది పయ్యదల్ బొదలంగ
        విరితావిసురఁటుల విసరికొనుచుఁ
దీరైన చెక్కిళ్ళ దిగజారు చెమటల
        నొనరఁ బావడలచే నొత్తుకొనుచు
[14]నందంద చెలు లిచ్చు గందంపుజలములఁ
        గూడి వసంతంబు లాడికొనుచు


తే.

మిగుల లేమావినీడల మెచ్చికొనుచు
నింపుగల తావితెమ్మెర కెదురుకొనుచు
వెలయ జలకేళిమీఁదను వేడ్క బొడమ
నంబుజాక్షులు నడచి రొయ్యార మమర.

81


వ.

ఇట్లు చని చని.

82

క.

మదవద్ద్విరేఫలీలా
స్పదసారసకేళిలోలసారసతతిచే
హృదయాహ్లాద మొనర్పఁగ
సుదతీమణు లొక్కకొలను జూచుచు వేడ్కన్.

83


సీ.

హరువులు మీరంగ నల్లిన జడ లూడ్చి
        పొలుపొంద వాలుగొప్పుల నమర్చి
రంగారు కనకాంబరంబులు సడలించి
        వలిపంబు లైన పావడలుఁ గట్టి
యందెలు తఱచైన హారమ్ము లెడలించి
        మెఱుఁగారు సొమ్ములు మేనఁ బూని
యందమై కనుపట్టు నపరంజియందెలుఁ
        జిమ్మనగ్రోవులుఁ జేతఁ బట్టి


తే.

గబ్బి వలిగుబ్బబరువునఁ గౌను లాడ
[15]నొక రొకరిచెట్టఁ బట్టుక యొఱపుమీరఁ
బొడము నూర్పులతావికై యడరు తేంట్ల
[16]జోపుచును జేరవచ్చిరి సొంపు మెఱయ.

84


వ.

ఇట్లు సరోవరతీరంబుఁ జేరవచ్చి.

85


క.

ఒండొరు మూఁపులు నిజభుజ
దండంబుల నూతగొనుచుఁ దఱుచుగ మదవే
దండగతు లమర సరసిజ
మండిత మగు కొలను సొచ్చి మలయుచు వేడ్కన్.

86


సీ.

తమ్మితేనియలను జిమ్ముచుఁ బుప్పొళ్ళ
        గుమ్ముచుఁ జేరంగ రమ్మటంచు
దొమ్మిగాఁ గూడుక తుమ్మిదల్ హరుని బ
        లమ్మని తోలుచు సమ్మదమున
నొమ్ముగా బంగారుబొమ్మలు నటియించు
        నెమ్మితో మెఱుగులు గ్రమ్మికొనఁగఁ

గొమ్మ! నా వెనువెంట రమ్ము లేదిట యీఁత
        నమ్ము ముమ్మాటికి నెమ్మి ననుచు


తే.

నగుమొగము సోయగమ్ముల జిగి జెలఁగ
బిగి మెఱుఁగు చన్నుఁగవ నిగనిగలు నిగుడఁ
దెగలుతెగలుగ జలముల నెగరఁజల్లు
చిగురుఁబోణులు విహరించి రగణితముగ.

87


వ.

మఱియును.

88


క.

చిమ్మనగ్రోవుల జలములుఁ
జిమ్ముచు నొండొరులమీఁదఁ జెలులను జేరన్
రమ్మని యండెల వ్రేయుచు
నెమ్మిన్ విహరించి రపుడు నీరజనయనల్.

89


వ.

తదనంతరంబ.

90


ఉ.

[17]జాఱుడుపీఁట లెక్కి డిగజాఱెడువారును జల్లులాడుచుం
బోరి మునింగి దూరముగఁ బోయి రయంబున లేచువారలున్
సారసచక్రవాకబకసంఘములన్ వడిఁ జోపువారు నై
వారిజలోచనామణులు వారివిహారము [18]సల్పి రందఱున్.

91


క.

ఎంతయు వేడుక నీక్రియ
నింతులు జలకేళి సల్పి యిచ్ఛాగతులన్
గాంతిమతిఁ దోడుకొని తా
రంతటఁ దీరంబుఁ జేరి యనుపమలీలన్.

92


సీ.

మేలైనబంగారుపూలపావడలపై
        జిలుగుచెంగావిచీరలు ధరించి
కురులు నున్నగ దువ్వి కొప్పు లొప్పుగఁ బెట్టి
        పొలుపు మీరఁగ ముడిఁ బూలు దుఱిమి
తీరుగాఁ గస్తూరితిలకంబులను దీర్చి
        కలపముల్ నెమ్మేనఁ గలయ నలఁది

నవరత్నమయభూషణముల శృంగారముల్
        వింతగాఁ గనుపట్ట వేడ్కఁ బూని


తే.

అపుడు పులుకడిగిన ముత్తియము లనంగ
చికిలి సేసిన మరుని సాయకము లనఁగ
మెఱసి తొలఁగని [19]తొలకరి మెఱుఁగు లనఁగఁ
జూడఁ గనుపట్టి రెంతయు సొగసుమీర.

93


మన్మథారాధనము

వ.

తదనంతరంబ.

94


సీ.

సంతసంబున నింక కంతునిఁ బూజించి
        యింతి మైకాఁక వారింత మనుచు
నంగనామణు లెల్లఁ జెంగల్వడిగ్గియ
        చెంగట నెంతయు రంగుమీరు
సురవొన్నక్రిందట హరువులు గనుపించఁ
        బరపైన విరులచప్పర మొనర్చి
పన్నీటఁ బదనిచ్చి మిన్నగాఁ గనుపట్టఁ
        దిన్నఁగా గందంపుదిన్నె వైచి


తే.

చాతురి జెలంగఁ గస్తురిచేత నలికి
నిగ్గు దేరంగఁ గపురంపుమ్రుగ్గు వెట్టి
తమ్మివిరిరేకుపటమునఁ గమ్మవలపు
గోవజవ్వాదిచే నిజభావ మలర.

95


మ.

రతిదేవి న్మకరాంకునిన్ సుమధనుర్బాణంబులన్ మందమా
రుతమున్ శీతకరున్ వసంతు శుకమున్ రోలంబకాదంబసం
తతులన్ గోకిలశారికాప్రతతులన్ దత్తద్విలాసంబులన్
జతగూడన్ లిఖియించి నిల్పి యచటన్ జాతుర్య మొప్పారఁగన్.

96


క.

విరవాదులు సంపెంగలు
మరువము దవనంబు బొండుమల్లెలుఁ గలువల్

కురువేరుఁ దమ్మివిరులును
సురవొన్నలు సవదరించి సొంపు దలిర్పన్.

97


క.

కుందనపు బళ్ళెరంబుల
గందము కుంకుమము పచ్చికస్తురి మది కిం
పొందు ఫలంబులు నింపుచు
ముందఱ నెరయించి చేరి మ్రొక్కుచు నంతన్.

98


క.

కాంతిమతిచేత నెంతయు
సంతసమున బహువిధోపచారము లమరన్
వింతగ వెలయించిరి రతి
కాంతునకు సపరివారకమ్ముగఁ బూజల్.

99


వ.

అప్పుడు.

100


తే.

విజయరాఘవమేదినీవిభుని నన్ను
మకరకేతన! జతగూర్చి మనుపు మనుచుఁ
గాంతిమతి మ్రొక్కె హస్తపంకజయుగంబు
మోడ్చి నుదుటను గదియించి ముదము వొదల.

101


సూర్యాస్తమయచంద్రోదయవర్ణన

వ.

తదనంతరంబ.

102


క.

ధారుణిఁ దాపము దీఱెన్
గోరి విహంగంబు లెల్ల గూండ్లకుఁ బారెన్
వారిజముల వగ మీరెన్
సారసబాంధవుఁడు నపరశైలముఁ జేరెన్.

103


చ.

వికచసరోరుహేక్షణకు వేమరు నేగతిఁ బ్రొద్దు [20]వచ్చినన్
బ్రకటముగాఁగ నెమ్మదిని బైపయిఁ దాపమె చాల హెచ్చెగా
యకట! యికేమి సేయుదుము హా యనుచుం గడు చిన్నఁబోవు నా
సకులముఖాంబుజంబు లన సారసముల్ ముకుళించె నత్తఱిన్.

104

చ.

మలయుచు ధాత్రి నింద్రుఁ డగు మన్నరుదాసునిఁ జూచి ప్రేమచే
వలచినయట్టి కాంతిమతి వైఖరిఁ జూత మటంచు నెమ్మదిన్
జెలఁగెడు వేడ్కచే యువతిచెల్వము మెచ్చుచుఁ జూచుచుండు నా
బలరిపునేత్రపఙ్క్తు లన భాసిలెఁ దారక లంబరంబునన్.

105


చ.

విరహిజనంబుమీఁద ననవిల్తుఁడు దాడిజనంగ దిక్పతుల్
పరువడిఁ జల్లు పూవు లన భాసిలెఁ జుక్కలు లెక్కమీరఁగా
సరసకళాకలాపమునఁ జంద్రుఁడు తజ్జయశంసిపల్లవ
స్ఫురదురుపూర్ణకుంభ మనఁ బొల్చెను బూర్వమహీధరంబునన్.

106


మ.

పొగడన్ మించిన చుక్కచాలు తొగగుంపుల్ పెంపుగాఁ గాంచు న
[21]గ్గగనానంతసరోవరంబునడుమన్ [22]గన్పట్టుచున్ జంద్రుఁ డం
శుగుణస్తంభసహస్రమంటపఘనస్పూర్తిన్ సుధారమ్యుఁడై
[23]తగఁ దల్లాంఛనమందు నుండు [24]హరిచందం బందె సాంద్రద్యుతిన్.

107


క.

హేమారవిందమందిర
భామాకుచకుంభయుగళపత్రలతాంక
స్తోమకర! సకలభువన
క్షేమంకరసత్ప్రకాశ! చెంగమలేశా!

108


స్రగ్విణి.

సమ్యగర్చాసదాసక్తభక్తావళీ
కామ్యదానక్రియాకల్పభూమీరుహా!
సౌమ్యనానాబుధస్తవ్యదీవ్యద్గుణా!
రమ్యనీలాలకా! రాజగోపాలకా!

109


క.

గోభిలమౌనీంద్రనుత
ప్రాభవ! భవపంకజాతభవహృత్పద్మా!
సౌభద్రేయతనూభవ
శోభనకరపాదపద్మ! సుస్థిరపద్మా!

110

గద్య.

ఇది శ్రీమద్రాజగోపాలకరుణాకటాక్షవీక్షణానుక్షణప్రవర్ధమానసారసార
స్వతధురీణయు, విచిత్రతరపత్రికాశతలిఖితవాచికార్థావగాహనప్రవీణయు,
తత్ప్రతిపత్రికాశతస్వహస్తలేఖనప్రశస్తకీర్తియు, శృంగారరసతరంగితపద
కవిత్వమహనీయమతిస్పూర్తియు, అతులితాష్టభాషాకవితాసర్వంకషమ
నీషావిశేషశారదయు, రాజనీతివిద్యావిశారదయు, విజయరాఘవమహీ
పాలనిత్యసంభావితయు, విద్వత్కవిస్తుతగుణసేవితయు, పసపులేటివెంక
టాద్రి బహుజన్మతపఃఫలంబును, మంగమాంబాగర్భశుక్తిముక్తాఫలంబును,
రంగద్గుణకదంబయు నగు రంగాజమ్మవచనరచనాచమత్కృతిం జెన్నుమీరు
మన్నారుదాసవిలాసం బను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.



[25]శ్రీరాజగోపాలాయ నమః


  1. దళితసుజనాహ్వుం డగు. క. దళితసుజనాహ్వుం డగు.
  2. యుప్పరం బట్టు
  3. సమ్మోహనంబు బాణ
  4. కరణిశతము
  5. తేజురిల్ల, క. తేజురిల్ల.
  6. డువ్వి. క. డువ్వి.
  7. హరిగె. క. హరిగె
  8. యున్నది. క. యున్నది.
  9. బండిగురివింద క. బండి గురివింద
  10. గ్రోసిన
  11. గొనుగు
  12. ఈ రెండు పంక్తులును క గ్రంథమున ముందు వెనుకలుగ నున్నవి.
  13. సురబొన్నల క. సురబొన్నల
  14. నందెంది క. నందెంది.
  15. నొకరుకరిచెట్ట
  16. సోఁపుచును
  17. జారుగు. క. జారుగు
  18. క. సల్పి రందఱన్
  19. తొలుకరి
  20. క. పుచ్చినన్.
  21. గ్గగనాంతసరోవరంబు
  22. గనుపట్టుచుఁన్
  23. తగెలల్లాంఛన
  24. హరిచందంబంది సాంద్రద్యుతిన్
  25. క. శ్రీ రాజగోపాలాయ నమః, శ్రీతాతగురవే నమః