మత్స్యపురాణము/ద్వితీయాశ్వాసము

శ్రీ

మత్స్యపురాణము

ద్వితీయాశ్వాసము


శ్రీరామానుజ మునివచ
నారూఢమతప్రకాశ! యతులితవేదా
చారప్రసిద్ధరక్షా
పారీణకటాక్ష! రంగపట్టణరాజా!

1


వ.

అవధరింపు మిట్లు పుండరీకాక్షుం డానతిచ్చినఁ దదాజ్ఞ యే నంగీకరించి
యప్పుడు తద్వేదపర్వతంబులు చేరం జని నాల్గుహస్తంబుల ముష్టిగ్రాహ్యం
బులగు వేదంబులు గ్రహించిన నవి ఋగ్యజుస్సామాధర్వణంబు లయ్యె
నంత నప్పరమమూర్తి దివ్యశరీరంబువలన లింగశరీరంబులు ధరియించి
న జీవకో ట్లనంతంబులై జనించిన.

2


క.

మునుకొన్న యట్టి జీవులఁ
గనుఁగొని లక్ష్మీశుఁ డంతఁ గౌతుక మొదవన్
ననుఁ జూపి నానితో నీ
ట్లనియెను దరహాసవికసితాననుఁ డగుచున్.

3


గీ.

ఇతఁడు పద్మభవుఁడు చతురాననుం డాత్మ
సముఁడు సర్వలోకశాశ్వతుండు
జీవులార! మీరు చిరకాల మితనిచేఁ
బోష్యు లగుచు మనుఁడు పొలుపుమిగిలి.

4


వ.

అని యి ట్లానతిచ్చి యాపరతత్వరూపంబగు కైటభమర్దనుండును వేద
పర్వతసమేతం బగు వైకుంఠపురంబును నంతర్ధానంబు నొందె నంత నేను
ను దత్ప్రసాదంబున నీబ్రహ్మలోకంబున కరుగుదెంచి రేతోమయం బగు
సృష్టి నిర్మింపం బూని భూబీజమిశ్రణంబున నుద్భిజ్జంబు లై తరుగుల్మాదిరూ

పంబు లైన శరీరంబులను, నత్యుష్ణధరణిసంపర్కంబున స్వేదంబు లై క్రి
మిదంశకాదిరూపంబు లైన దేహంబులను, నండజంబు లైన పక్ష్యాదిశరీ
గంబులను జరాయుజంబు లైన మనుష్యాదిశరీరంబులను, సృజియించిన
యంతన జీవరాసులు చతుర్విధంబు లగు నాకారంబులం బొంది ఖేచరభూ
చరజలచరపాతాళచరాదిరూపంబులఁ బ్రవర్తించె నిట్లు సాంతత్యంబున రే
తోమయసృష్టి సమకూరె నని చెప్పిన విని నారదుం డిట్లనియె.

5


క.

నరమృగపశుగర్భంబులఁ
దరబడి నీ జీవకోట్లు తద్రూపములన్
దిరుగ జనించుట చిత్రము
సరసంబుగ నానతిమ్ము జలజాతభవా!

6


గీ.

శుక్లబిందుపతితశోణితంబువలన
శల్యరక్తమాంసచర్మరూప
సహిత మగుచుఁ దనువు సంభవించుట యెట్లు
తెలుపవలయు దీని జలజనయన!

7


వ.

అని పలికిన మునీంద్రునకుఁ జతురాననుం డిట్లనియె.

8


సీ.

జీవుఁ డవేధ్యుఁ డచ్ఛేద్యుఁ డక్లేద్యుండు
        నిత్యుఁ డత్యధికుండు నిర్వికారి
నిర్మలుం డాద్యుండు నిరతిశయానంద
        సహితుండు నగుచు విశ్వంబులోనఁ
బటికంబుపై వర్తి పాదుగా నిల్చినఁ
        దద్గుణయుక్త మై తనరుమాడ్కి
నతఁడు దేహస్థితుం డగుచు నద్దేహజ
        కామమోహవికారకలితుఁ డగుచు
నింతమాత్రనె తన్నుఁ దా నెఱుఁగలేక
కలుషసంచయములచేతఁ గట్టువడుచుఁ
బుత్త్రదారాది సంభ్రాంతిఁ బొదలి పొదలి
యంత్యకాలమునందు దేహంబు విడిచి.

9

గీ.

యాతనాదేహసంగతుం డగుచు నంత
నట్టి జీవుండు పాపసంప్రాప్తి ఘోర
తీవ్రనరకానుభవములఁ దెమలితెమలి
మించ దుఃఖము తన్ను నిందించుకొనుచు.

10


వ.

మఱియు నజ్జీవుండు పాపఫలానుభవాంతంబునఁ గర్మపాశకర్షితుం డగు
చు వారుణలోకంబున కేతెంచి వర్షధారామార్గంబున భూలోకగతుం డై
తృణగుల్మలతాదులయందు సంక్రమించియున్న రూపంబునఁ బురుషుని దే
హంబు ప్రవేశించి రేతోరూపం బై ఋతుకాలంబున స్త్రీగర్భంబు సొచ్చి
తద్రక్తంబునఁ బొదుగుడువడి, ప్రధమమాసంబున బుద్బుదాకారం బై
రెండవమాసంబునఁ బిండరూపం బై మూడవమాసంబున శిరఃకరపా
దాంకురసంభవంబును, నాలవమాసంబున నవి వ్యక్తంబు లగుటయు నైద
వమాసంబున మాంసశోణితపరిపూర్తియు శిరఃపాణిపాదసంభవంబును, నా
ఱవమాసంబున నస్థిస్నాయుసిరాకేశాంగుళనఖశ్రుతినేత్రనాసాభ్రూపక్ష్మ
జిహ్వారోమోదయంబును, సప్తమమాసంబున నంగసంధిలక్షణరేఖాసమన్వి
తత్వంబును, నెనిమిదవమాసంబున సర్వాంగపరిపూర్తియుఁ గలిగి యో
జోహీనం బగు దేహంబు జననంబు నొంద వృద్ధిఁబొందు నంత నవమాసం
బున సువ్యక్తం బగు దేహంబు వొదలుచు నుండు మఱియు నద్దేహంబున
మాతృజంబులును బితృజంబులును రసజంబులును నాత్మజంబులును నగు
గుణంబులు గలవు. శరీరోపచయంబును దద్వర్ణంబును వృద్ధియుఁ దృప్తి
యు బలంబును దోలు సత్వంబును నుత్సాహంబు మొదలైనవి రసజాతం
బులును, నిచ్ఛయు ద్వేషంబును దుఃఖంబును ధర్మాధర్మలక్షణంబులును
జ్ఞానంబును నింద్రియవ్యాపారంబులును నాత్మసముద్భూతంబు లైన గుణం
బు లింద్రియంబులకు మనంబు వశపడక సత్వరజస్తమోరూపంబు లగు
మార్గంబులఁ బ్రవర్తించు నమ్మ్మార్గంబులయం దాస్తిక్యంబును ధర్మంబును
శమదమాదిగుణంబులును గలుగు నసాత్వికమార్గంబును గామక్రోధని
ద్రాలస్యాదు లైన భావంబులు గలది రాజసమార్గంబును, గ్రోధహింసాన
ప్రమాదాదులు గలది తామసమార్గంబు నై పరగు. మఱియుఁ బ్రాణాపా
వ్యానోదానసమాననాగకూర్మకృకరదేవదత్తధనంజయంబు లను దశవా
యువులును దద్దేహాధిష్ఠితంబు లై ప్రవర్తించు నందుఁ బ్రాణపవనంబు స

ర్వాధారం బై వ్యానంబుతోఁ గూడి పరిభ్రమించు నిట్లు పృథివీజలతేజఃప
వమానాకాశాదిపంచభూతనిర్మితం బగు దేహపంజరంబున వలయంబు ల
న దళవాయువులును, దారణంబులును గలకంబులు నను నస్థిభేదంబులు
పంచవిధంబు లై సహస్రత్రయసమ్మితంబులును మాంసరజ్జువులు నాల్గును
నాడులు పదమూడుసు జీవ సిరా విశేషంబులు మూఁడును, రోమంబులు
సార్ధకోటిత్రయంబును గూర్చ లాఱునుం గలిగి యుండు నిట్లు శుక్లశోణిత
సంయోగంబున సంకలితం బై సంతతాపాయం బై మలద్వారనవకసమే
తం బై మూత్రపురీషాలయం బై దుర్గంధీలం బగు పార్థివదేహంబుఁ బొం
ది డేహి గర్భకోటరంబున మాతృభుక్తంబు లగు రూక్ష లవణకట్వామ్ల
పదార్థంబులచేతఁ దప్తుండగుచు నొక్కక్షణంబు సంవత్సరకాలప్రమా
ణంబుగాఁ దలంచుచు సంకుచితావయవుండై యనుభూతంబు లైన వివిధజ
న్మపాపప్రాప్తనరకంబులయందు స్మృతి గలిగి పశ్చాత్తాపంబు నొందుచు
నిల్చి యంత జననకాలం బరుగుదెంచిన సూతిమారుతంబులచేత యోనిమార్గం
బున బహిర్గమితుం డై బాహ్యమారుతంబున జ్ఞానంబు చెడి యాయాపట్ల
మోహితుం డై నామరూపాదిచిహ్నితుం డై బాలుం డై.

11


సీ.

సమవయస్సంప్రాప్త్యసాధులతోఁ గూడి
        బాల్యఖేలనమునఁ బ్రబలు చుండి
సంపూర్ణయౌవనన్తబకితదేహి యై
        సాత్వికకర్మముల్ సలుప లేక
విద్యాకులాచారవిభవశౌర్యసురూప
        మదముల నజ్ఞానవిదితుఁ డగుచు
సారవిహీనసంసారసౌఖ్యము లంద
        సుస్థిరం బగు బుద్ధి జొనిపిచొనిపి
పుత్త్రదారార్థవాంఛాభిపూర్ణుఁ డగుచు
మిథ్య యగు నట్టి సంసృతి తథ్య మనుచుఁ
గర్మవశమునఁ బాపసంక్రాంతుఁ డగుచుఁ
బ్రాప్తకాలాన దేహి దేహంబు విడిచి.

12

గీ.

యాతనాదేహసంగతుఁ డగుచు నతఁడు
నిబిడసమవర్తికింకరానీతుఁ డగుచు
బహువిధంబుల నరకకూపంబులందు
నాత్మకృతపాపఫలముల ననుభవించి.

13


సీ.

అయ్యెడ సంతాపితాత్ముఁ డై క్రమ్మఱఁ
        బురికొని భూమికి నరుగుదెంచి
యే పాతకంబున నేది జన్మం బగు
        నా జన్మమును బొంది యజ్ఞుఁ డగుచు
సారవిహీనసంసారకూపములందుఁ
        బడి పుత్త్రధనవధూభ్రాంతిఁ బొదలి
యదియె భోగ్యంబు గా నాత్మఁ జింతించుచు
        జాతియు సంతతాచార ముడిగి
కలుషనాశకుఁ డైనట్టి జలజనయనుఁ
దలఁప నొల్లక విపరీతధర్మములకు
గాలుఁ జాపుచుఁ దుద విధిగ్రస్తుఁ డగుచు
నట్లు కడలేని జన్మంబు లందువాఁడు.

14


క.

ఈ రీతి జన్మలయముల
నారూఢిగఁ బొంది జీవు లతిదుఃఖములన్
మీరుచు నొక పఱి యైనను
శ్రీరమణీవిభుని జింత సేయరు తనయా!

15


క.

ఈలోకంబులలోపల
భూలోకము కర్మభూమి బుధు లచ్చట నే
కాలంబుఁ దృప్తిఁ బొందుదు
రాలీల మఖంబుల౯ హుతాశను లగుచున్.

16


గీ.

దేవనాయకాది దివిజులు మదిలోన
నాత్మచే భవంబు లస్థిరంబు
లని తలంచి ముక్తి కరుగుటకై వాంఛఁ
జనుదు రుర్విమీద సంభవింప.

17

సీ.

అఖిలలోకనివాసు లను సురేంద్రుల కైన
        వసుధ జన్మింపక వనజనాభు
పదము నొందఁగ రాదు పరికించి చూచిన
        నచట లక్ష్మీశ్వరు నాత్మలోనఁ
దలఁచి నంతనె ముక్తి గలిగి యుండెడిచోట
        భూజనుల్ మాయాభిపూర్ణు లగుచు
సుజ్ఞానహీను లై యజ్ఞానసహితు లై
        పుత్త్రదారేషణస్ఫూర్తిఁ బొదలి
భుక్తిమైథుననిద్రాదిసక్తు లగుచుఁ
దెలివిఁ జిత్తంబుఁ గుదియంగఁ దివియ లేక
వివిధమార్గములఁ దిరిగి దివికి నడవఁ
గడగు మార్గంబు లరయంగఁ గాన రెచట.

18


వ.

ఇట్లు రేతస్సృష్టిసంభవు లగు ప్రాణికోట్ల కన్నమూలంబునఁ బ్రాణంబులు
నిలచుఁ దత్ప్రాణంబులవలన బలంబును, బలంబువలనఁ దపంబును, దపం
బువలన శ్రద్ధయు, శ్రద్ధవలన మేధయు, మేధవలన శాంతియు, శాంతివల
నఁ దమంబు నొదవు నాదమంబువలనఁ జిత్తస్థైర్యంబును నందువలన సమ్య
జ్ఞానంబును, సమ్యజ్ఞానంబువలనఁ బరమార్థదర్శనంబును గలుగు నట్లగు
టంజేసి తదన్నంబే బ్రహ్మస్వరూపంబుగా నెఱుంగుము. అట్టి యన్నంబు
భగవత్ప్రీతిగా విప్రులకు దానంబు సేయు గృహనివాసుండు విష్ణులోకంబు
న కరుగు నని చెప్పి నారదునకు మరియు నిట్లనియె.

19


క.

సుకుమార! వినుము నైమి
త్తిక మనఁగను మఱియుఁ బాకృతిక మన నాత్యం
తిక మనఁగను ద్రివిధము లై
యొకవీఁకను లయము లొదపు నురవడితోడన్.

20


క.

కాలప్రమాణ మెఱుఁగఁగఁ
గాలాత్మున కైన వశము కాదు లయంబుల్
కాలంబుకతనఁ దలఁకొను
నా లీలనె జగము లుదయ మందును దనయా.

21

క.

మానమునఁ బరిమితము లై
ధీనుత! మాసర్తుపక్షదినరూపము లై
భానూదయాస్తమయములు
గానఁగ న ట్లవియ యగును గాలక్రమముల్.

22


సీ.

ఆక్రియఁ దద్భాస్కరాస్తోదయంబులు
        దిన మనఁ బరగుఁ దద్దినము లైదుఁ
బదియుఁ గూడఁగ నొక్కపక్షంబు పక్షద్వ
        యంబు మాసం బన నలరుచుండు
నది పితృమాసమర్యాదను దివసంబు
        వరుస నద్దివసంబు లరువదియును
మున్నూఱు బుధమానమున కొక్కవర్షంబు
        పరువడి దివ్యవత్సరము లయుత
సంఖ్యఁ బొలుపొందు యుగరూపసహిత సుగుచు
నదియు డెబ్బది యొకటి మన్వంతరంబు
తచ్చతుర్దశ మనుసంఖ్య ధరణిఁ జనిన
నదియ మాకును దినము సత్యంబు తనయ.

23


ఉ.

ఆ దివసావసానమున నంబుధులెల్లఁ గలంగి మ్రోయుచున్
బాదులు మించి దేవనరపన్నగలోకము లాక్రమింపఁ గా
ఛాదిత రూపముల్ గలిగి సర్వమహీముఖపంచభూతముల్
పృదతాగపారనీరధిజలంబులలోఁ గలయంగ నత్తఱిన్.

24


చ.

సురమునికిన్నరాదు లతిశోకముఁ బొందుచు నాకలోకసు
స్థిరభవనంబు బద్ధముగ సేయఁగ శక్యము గాక సద్వ్రతా
కరము నపాయశూన్యము నకామమదంబును నైన సత్యనా
మరుచిరలోకమందుఁ బరమస్థితి నుండుదు రార్యసేవితా.

25


వ.

ఇవ్విధంబున మద్దివసావసానమున లోకంబులు జలనిమగ్నంబు లగుట
యది దైనందిననామకం బై నైమిత్తికప్రళయంబనం బరఁగు వసుమతిపైఁ
జతుర్విధంబులగు తనువులు ధరియించిన జీవంబుల ప్రకృతులు నిత్యలయం

బుఁ బొందు నదియె ప్రాకృతికప్రళయం బనం దనరు నింక నాత్యంతికప్ర
ళయంబు చెప్పెద నాకర్ణింపుము.

26


సీ.

బ్రహ్మాండపేటికాపరిపక్వకాలంబు
        చనుదేర నయ్యెడ జలజనాభుఁ
డఖిలాండసంపూరితాత్మతేజంబుల
        బలువిడి నూర్ణనాభంబు కరణి
గ్రసియించి యోగసంక్రాంతుఁ డై యంత దు
        గ్ధంబులు జలములఁ గలయురీతి
విపులతత్తేజవిప్రవిష్టుఁ డై చనునప్పు
        డాకసంబున వాయు వవతరించి
వీఁకతో నూఱువర్షముల్ వీచు నంత
సకలశైలముల్ తూలకందుకము లట్ల
తన్మహాలయవాతాహతంబు లగుచు
నంబురాశిని మునుఁగు నయ్యవసరమున.

27


శా.

పాతాళంబున నాదికూర్మవదనాంభస్పంభవోద్యత్సమీ
రాత్రిప్రస్ఫుటకల్పవహ్నిఘనకీలాగ్రస్ఫుర ద్విస్ఫులిం
నాతీతధ్వనిభీకరం బగుచు బ్రహ్మాండాంతరోద్భేదకం
బై తత్తద్భువనంబు లాహుతిఁ గొనున్ వ్యాకీర్ణరూపంబునన్.

28


వ.

ఆ సమయంబున.

29


క.

కాటుకకొండల కైవడి
గోటానంగోట్లు మింట ఘూర్ణిల్లుచు సం
స్ఫోటించు మేఘగణములు
గాటంబుగ వృష్టిగురియఁ గరఁగి జగంబుల్.

30


గీ.

నీటిలోనఁ గలయ నిఖిలభూతంబులు
నుదకమయము లైన నుర్వి జలము
లందు సంక్రమించు నాజలంబులు నగ్ని
శిఖలచేత నింకు సుఖితహృదయ.

31

క.

ఆ యనలము లోకంబులఁ
బాయక దహియించి యంతఁ బ్రభ యణఁగి మహా
వాయువునఁ గలయు నదియును
నా యెడ నాకాశలీన మగు మునివర్యా!

32


వ.

బ్రహ్మాండస్వరూపనాశకం బై తమస్సమావృతం బగు నిది యాత్యంతికప్ర
ళయంబు నాఁ బరఁడు. కొందఱు లయంబులు చతుర్విధలక్షణంబు లని వ
చింతురు. కొందఱు ద్వివిధంబు లని చెప్పుదురు. ఇట్లొదవు లయంబులు పర
మమూర్తిమాయాకల్పితంబు లై ప్రవర్తించు నట్టి తేజోమయమూర్తి గుణవ్యా
పారపౌరుషంబులు ప్రత్యహంబును దలంచు పరమభాగవతోత్తములు సం
చితప్రారబ్ధకర్మవిముక్తు లై వైకుంఠపురంబు చేరుదు రని చెప్పిన విని నా
రదుం డి ట్లనియె.

33


క.

భువిని రసాతలజలముల
దివమునఁ దనువుల్ ధరించి తిరిగెడి జీవుల్
భవభయము లుడికి యే క్రియ
ననిరళగతిఁ జనుడు రిందిరాధిపు పురికిన్.

34


క.

బల మగు కర్మము లీ జీ
వులకుం బహుజన్మహేతువులు దత్కర్మం
బులఁ బాసి యిట్టి జీవులు
ప్రళయంబునఁ బొందు టెట్లు పద్మజ! ముక్తిన్.

35


క.

ఆ ముక్తిఁ బొందు జీవులె
యీ మహిఁ దిరుగం జనించు టేవిధమున సు
త్రామాదివంద్యపదయుగ
ప్రేమంబున నానతిమ్ము పృథుగుణనిలయా.

36


వ.

అని పలికిన తనయునకుఁ జతుర్ముఖుం డి ట్లనియె.

37


సీ.

సృష్ట్యుద్భవవ్యయస్థితులను మూడింటి
        కధిపతి పుండరీకాయతాక్షుఁ
డతని మాయను మగ్నులై సురేంద్రాదులు
        బాహ్యభాగంబున భ్రాంతి నొంది

సంచలించుచు నున్న సర్వేశుఁ డాదేవ
        కోట్ల సంరక్షణకొఱకు ధాత్రి
నుద్భవం బంది మాయోపాయముల దైత్య
        పతుల మర్దించును బలిమి మెఱసి
యమ్మహాత్ముఁడు వారిపై నధిక మైన
కారణము లేని కూరిమిఁ గలిగి యుండు
నట్లు గావున స్వర్గాదు లైన లోక
ముల వసించిన సుర లెల్ల ముక్తు లనఘ.

38


క.

ఈ లోకంబులలోపల
భూలోకము కర్మభూమి బుధు లచటను ద
త్కాలోచితాధ్వరంబులఁ
జాలఁగ సంతృప్తిఁ బొంది చనుదురు తనయా!

39


వ.

మఱియు భూలోకంబున జీవులు సంచి ప్రారబ్ధకర్మపాశంబులఁ గట్టువడి
తత్కర్మానురూపంబు లగు దేహంబులు ధరించి భుక్తిమైథుననిద్రాదివ్యాపా
రంబులఁ బొదలుచుఁ బుత్త్రదారధనాదివ్యామోహంబు పడుచు వర్తింతు ర
ట్టి దేహంబులయందు నుద్భిజ్జంబు లగు తరుగుల్మాదివన్యంబు లధమాధమం
బులును స్వేదజంబు లైన క్రిమిదంశాదు లధమంబులు నండజంబు లైన ప
తంగసర్పాదులు మధ్యమంబులు, జరాయుజంబులయందు గోమహిషమృగా
దు లుత్తమంబులును నరాకారంబు లుత్తమోత్తమంబు లనం బరఁగు న
మ్మానవులు స్వేచ్ఛ సమాచరిత దుష్కర్మంబుల ననంతంబులగు కుయోనుల
సంభవించి లయంబును బొందుచుఁ దత్పాతకానురూపనరకంబులను '
భవించి క్రమ్మఱియు గర్భనరకంబులఁ బొందుదు రిట్లు జన్మలయం
బలు దేహికి జ్ఞానోదయపర్యంతంబు సంతతం బై ప్రవర్తించు ని ట్లుండ
సంస్కారవిశేషంబున నుదితం బగు నిశ్చయజ్ఞానం బను వహ్నిచేతఁ గర్మ
మయంబు లగు నరణ్యంబులు దగ్ధంబు లైన యంత నిష్కల్మషుం డై దేహి
దేహంబు విసర్జించి కైవల్యంబు నొందు నని చెప్పి మఱియు ని ట్లనియె.

40


సీ.

భువనంబు లుదకసంపూర్ణంబు లై భూత
        పంచకం బణఁగఁ దత్ప్రళయమందు

వరుస జీవులు కర్మవాసనాసహితు లై
       యెడఁ గని రేణు లై యడఁగి యంత
నా వసుంధర లయం బందు కాలంబునఁ
       దద్భూమితోడ నత్యంతలయముఁ
బొంది క్రమ్మఱను నుద్బుద్ధమై జగములు
       వివిధంబు లై సంభవించు నపుడ
యట్టి జీవులు తద్వాసనావృతాత్ము
లగుచుఁ గర్మానురూపదేహములఁ బొంది
భోగవశులయి సంసారసాగరమున
సంచరింత్రు పూర్వజనిసంస్మరణం దొలఁగ.

41


వ.

మఱియును.

42


సీ.

జలదముల్ బాలభాస్కరతేజ మణఁగించి
       బలిమితోఁ జుట్టి పైఁబర్వి మఱియు
నత్యుష్ణతద్భాస్కరాధికకరజాల
       కాంతు లెచ్చిన విచ్చి కలఁగునట్లు
జ్ఞాన మజ్ఞానసంఛాదితరూప మై
       తద్వికారంబు నధఃకరింప
శక్తంబు గాక సంశయసమాసక్త మై
       యదియె సత్తామాత్ర మై చెలంగు
నంతఁ దనుఁ దానయజ్ఞదానాభిషేక
విష్ణుసంస్మృతిపూజాదివిధులచేత
నట్టి సుజ్ఞానదీపకం బధిక మగుచుఁ
గణక నజ్ఞానతిమిరంబు నణచుఁ దనయ.

43


క.

జ్ఞానం బొదవినయప్పుడె
మానవులు గతాఘు లగుచు మఱి దేహములన్
బూనిక ధరియింపక ని
త్యానందపదప్రవిష్టు లగుదురు పుత్త్రా.

44

క.

జ్ఞాన మనన్ హరిపాద
ధ్యానానున్యూతభక్తి నలరుట తుద న
జ్ఞానమునాఁ దదితరసం
ధానము పరికింపఁ బడియె దత్వం బనఘా!

45


చ.

అతులిత పాపసంకలితుఁ డైనను జాతివిహీనుఁ డైనఁ గ
ర్మతతులబద్ధుఁ డైనఁ బితృమాతృజిఘాంసకుఁ డైన నిందిరా
పతి నతిభక్తితోఁ దలఁచి ప్రస్తుతిసేయఁగ నేర్చు మానవుం
డతిముద మంది చెందును బరాచ్యుతలోకనివాససౌఖ్యముల్.

46


క.

శ్రీనాథుభక్తిఁ బొదలెడు
మానవుఁ డఖిలామరేంద్రమానితుఁ డగుచున్
స్వానుభవావేద్యసుఖం
బానిన హృదయమున ముక్తి కరుగును బుత్త్రా.

47


సీ.

అజ్ఞాన మనెడు గాఢాంధకారసమూహ
       మంతయుఁ దుదిముట్ట నణఁచుకొఱకు
వివిధాన్యకృతమార్గవిధుల దుర్వాక్యముల్
       శ్రవణముల్ సోకక చనెడుకొఱకు
బహుజన్మపుణ్యసంప్రాప్తలక్ష్మీశ్వర
       పాదాబ్జసద్భక్తి ప్రబలుకొఱకు
నిబిడదుష్కృతజాలనిలయ మై వర్తించు
       విదితసంసారేచ్ఛ వదలుకొఱకు
బ్రదుకు మిథ్యగ మదిలోనఁ బరఁగుకొఱకుఁ
సజ్జనులతోడి సంసర్గ జరుగుకొఱకుఁ
బ్రతిదినంబును సంతోషభరితుఁ డగుచు
వినఁగవలయును దద్రమావిభుని కథలు.

48


క.

హరినామస్మరణకథా
పరిచయమునఁ బ్రొద్దుఁ గడపు భాగవతులు సు
స్థిరముగ లక్ష్మీరమణుని
పురమున వసియింతు రమరపూజితు లగుచున్.

49

గీ.

సతులతోడఁ బాపి సుతులను దొలఁగించి
సిరులఁ జెందనీక శ్రీవిభుండు
తివిరి యాత్మభక్తి దృఢముగాఁ బరికించి
భక్తులకు నొసంగుఁ బరమపదము.

50


క.

ఆయువు కొంచెము సిరు లన
పాయంబులు గావు హృదయభయభావంబుల్
వాయవు భోగాసక్తుల
కాయాసమె కాని కలుగ దందు ఫలంబుల్.

51


మ.

భువిఁ గర్మంబులు సర్వదేవతలకుం బొల్పొందగా దృష్టిహే
తువు లై యా చరితంబు లయ్యెడియెడన్ దోరంబు లై విఘ్నముల్
వివిధోపాయబలంబులం దగులు నా విఘ్నంబు లాత్మక్రియా
నవవృత్తంబులఁ బొంది మోక్ష సరణిం దప్పించు నయ్యైయెడన్.

52


గీ.

ఖడ్గధారమీఁద గమనంబు సేయుచుఁ
పదిలుఁ డైన నరుని పగిది నాత్మ
యోగసరణిఁ జనుచు యుక్తుండు నిర్విఘ్న
ముగ వసించు మోక్షమున మునీంద్రా.

53


గీ.

జ్ఞానకర్మయోగసముదయంబు ప్రతిభ
కొలఁది గాని యొరులకును నిషిద్ధ
మగును జర్చ సేయ నఖిలాధికార మై
తనరు భక్తియోగ మనఘచరిత.

54


ఉ.

ధీనుత కర్మమార్గము విధిజ్ఞుల కైనఁ బ్రయాన మెట్టిచో
మానవుఁ డప్రమత్తతనను మాధవు నాత్మఁ దలంచి సంతత
స్వానుభవైకవేద్య మగు సత్వసుఖంబును బొంది రోయుఁ ద
న్మానుషసౌఖ్యసంపదలు నశ్వరహేతువు లంచు నెయ్యెడన్.

55


శా. ఉత్కంఠావృతు లై మహీసురులు తద్యోగక్రియాశూన్యు లై
సత్కార్యప్రియభావినిత్యసుఖవాంఛల్ మాని మోహంబునన్
దత్కాలంబునఁ గోర్కె చేపడుట కై నారాయణప్రీతిగాఁ
దత్కర్మంబులు సేయు టొల్లరు విచిత్రభ్రాంతచేతస్కు లై.

56

సీ.

ఫలకారణోజ్జ్వలప్రసవరూపాదులు
       తత్ఫలం బొదవునందాక వర్ణ
నీయంబు లగు రీతి నిశ్చయసుజ్ఞాన
       మొదవెడుకొఱకుఁ గర్మోదయముల
వేదజాలంబులు విస్తరించుటె కాని
       యవి ముక్తిహేతువు లనఁగఁ బడవు
తత్కర్మములు ఫలార్థము సేయఁబడిన వై
       వాంఛితం బొసఁగును వలయునరుల
కట్లుగావున హరిరూప మైన వేద
సరణి నీక్షించి మోహితస్వాంతు లగుచు
భూసురోత్తముల్ స్వర్గాదిభోగమాత్ర
సాధనము లైన కర్మముల్ జరపువారు.

57


ఉ.

సందియ మింత లేక బుధసంఘము వేడ్క మఖాదికర్మముల్
పొందువడన్ విధానమునఁ బూర్ణముగా నొనరించి దేవతా
స్పందవిహారయాత్రఫలసాధకు లై తుద దేవభూములం
జెంది సుఖంచి క్రమ్మఱను జేరుదు రుర్విని సంభవార్థ మై.

58


క.

ఈ మర్మము దెలిసి యశో
ధాముఁడ వై తనయ సంతతంబును లక్ష్మీ
రామాధిపుని గుణంబులు
ప్రేమన్ వినుతింపవలయుఁ బ్రియ మొప్పంగన్.

59


గీ.

ఆవు ప్రేమతోడ నాత్మీయ మగు క్రేపుఁ
గాచి దాని యొడలి కల్మషంబు
గడిగినట్ల తాన గ్రసియించుమాడ్కిని
హరి యణంచు భక్తుదురితచయము.

60


వ.

అనినఁ బంకజాసనునకు దేవమౌని యి ట్లనియె.

61


చ.

నిమిషములోన లోకముల నెమ్మి సృజింపను సంహరింపఁ గా
ర్యమున మహాత్ముఁ డైన హరి రాక్షసకీటములన్ వధింపఁ బూ

ని మహిమ ననేకరూపముల నిర్జరకోటి నుతింప దేహముల్
ప్రముదితుఁ డై ధరించుటకుఁ పద్మజ కారణ మాన తీయవే.

62


క.

అని పలికిన నారదసుర
మునితో నయ్యబ్జభవుఁడు ముద మలరఁగ ని
ట్లనియెను దరహసితశుభా
ననుఁ డై ధారాళవాక్యనాదం బొదవన్.

63


సీ.

వినుము నారద జగద్విభుఁ డైన విష్ణుఁ డ
       త్యధికదయాపూర్ణుఁ డగుటఁ జేసి
నిజజన్మకర్మవర్ణితకథామృతపాన
       మునఁ బుణ్యఘను లైన మనుజవరుల
జన్మముల్ దొలఁగించి శాశ్వతపదము నొం
       దించుటకై ధాత్రిఁ దెల్వి మీఱ
బహువిధరూపసంప్రాప్తుఁ డై యుద్భవం
       బందుట కాక దుష్టాత్ము లైన
దనుజకీటకముల ఘనదర్ప మణఁపఁ
దద్రమాధీశకరసంగతప్రసిద్ధ
చక్రధారాసముచ్చలత్జ్వలనజనిత
విస్ఫులింగంబు చాలదే విమలచరిత.

64


శా.

ఆ నారాయణుఁ డాదికాలమున దేహప్రాప్తిమై నున్న జీ
వానీకంబులు పాపమూలముల సంప్రాప్తంబు లైనట్టి నా
నానేకాంతకలోకదుర్గతుల నత్యంతంబు దుఃఖింపఁ ద
న్మానవ్యాప్తి హరింపఁ బూని జముతో మధ్యస్థుఁ డై యి ట్లనున్.

65


సీ.

శరణాగతార్తరక్షయ మాకు సహజవ్ర
       తం బ దెయ్యెడ నైన దండహస్త
వారిఁ బ్రోవఁగఁ బూని వసుధలోన జనింతు
       కణఁక రక్షస్సంహరణమిషమున

వీనుల మత్కథల్ వేడ్కతో వినువారు
       విదితమద్గుణములు చదువువారు
మత్ప్రీతిగా దానమహిమ సల్పెడువారు
       బృందావనంబులు పెంచువారు
నాణెముగ నర్థిపూజ యొనర్చువారు
నాదుభక్తులు గాన నా నరుల నెపుడు
గదియఁ బోవక విపరీతగతుల మెలఁగు
పాపకర్ముల దండింపఁ బాడి నీకు.

66


క.

హరి యిట్లానతి యిచ్చిన
వెరవున సమవర్తి యంత వీక్షించి రమా
వరపాదయుగళభక్తుల
తెర వరుగఁడు నాటనుండి దివిజాభినుతా.

67


క.

అనయము కర్మాచరణం
బున నైగుణ్యములు తఱదు ముక్తినివాసం
బునకును హేతువు లక్ష్మీ
వనితాధిపనామజపము వర్ణింపంగన్.

68


క.

నారాయణుండె దైవము
నారాయణనామజపము నరులకు ఘనసం
సారాబ్ధితరణసాధన
మారయఁ దత్పాదపూజ నణఁగు నఘంబుల్.

69


సీ.

స్వరవర్ణమంత్రసంజనితలోపంబులు
       కర్మయోగంబునఁ గలుగుఁ గానఁ
దత్కర్మనిష్ఠు లై తనరువారల కెల్ల
       విఘ్నముల్ సెందును వీక్ష సేయ
జ్ఞానయోగంబులఁ జను మహాత్ములకైనఁ
       దఱచు విఘ్నంబులు దొఱలుచుండు
నట్టి విఘ్నాత్తయోగారూఢు లగువారు
       చనరు లక్ష్మీనాథుసదనమునకు

నట్లు గావునఁ బుత్త్రదారాప్తవిత్త
పశుగృహప్రాప్తమోహంబుఁ బరిహరించి
చిత్త మాత్మాధినాథుపైఁ జేర్చి నరుఁడు
చెడక హరిభక్తి కడకను నడపవలయు.

70


గీ.

హీనకులజుఁ డైన హింసకుం డైనను
బాపసహితుఁ డైనఁ బతితుఁ డైన
విష్ణుభక్తి గలిగి విమలుఁ డై వర్తింపఁ
గలుగు నతని కమృతనిలయ మమర.

71


క.

నాలుగుయుగముల లోపల
నాలాయము కలియుగమున వర్తించు నరుల్
శ్రీలలనావిభునామము
లాలించి భవాబ్ధిఁ గడతు రమరులు పొగడన్.

72


వ.

మఱియు నప్పరమపురుషుని పాదసరోరుహములయందు నిశ్చలభక్తి గల
పసన్నుండు {ప్రియతమంబులగు పుత్త్రదారాదులు సమసిపోయిన నైనను
బహువిధరోగంబు లేతెంచినను బద్మపత్రంబు జలబిందువులచేత లిప్తంబు
గాని చందంబునఁ దత్ప్రాప్తంబు లైన బాహ్యాభ్యంతరదుఃఖంబులఁ జెందక
మాయావాక్యరచనావిశేషంబు లనియెడి విఘ్నంబుల సంభవం బైన సం
శయంబులఁ జిక్కువడక సర్వంబును జన్మాంతరసంస్కారవినోదంబులుగా
వితర్కించి శరీరంబు నిత్యంబు గాకుండుట యెఱింగి సమ్యజ్ఞానసమేతుం
డై పరమతేజోమూర్తిం గలయు నని చెప్పి మఱియు ని ట్లనియె.

73


సీ.

మృద్వికారము లెల్ల మృద్విలిప్తంబు లై
       నిబిడరూపంబుల నిలుచు నట్లు
పార్థివదేహముల్ పార్థివాన్నములచే
       తనుదృఢాంగస్ఫూర్తిఁ దనరుచుండు
నట్టి యన్నంబు బ్రహ్మస్వరూపంబున
       బ్రాణికోట్లకు నెల్లఁ బ్రాకటముగ
నాధార మగుచుండు నవియు నన్నంబుల
       యం దవశ్యంబుగ నాక్రమించు

నన్నవర్జన సబల మై యున్న నైనఁ
బ్రకృతి నిలువదు విశ్వంభరాజనులకు
ధరఁ దదన్నంబు హుతము దత్తంబు నగుచుఁ
దృప్తిగారణ మగుచుండు దివిజులకును.

74


క.

బ్రహ్మార్పణముగ నన్నము
బ్రాహ్మణజఠరానలములఁ బ్రబలినభక్తిన్
బ్రహ్మజ్ఞుఁడు దేల్చినఁ ద
ద్బ్రహ్మస్థానంబు నొందు బ్రహ్మాత్మకుఁ డై.

75


గీ.

అట్టి యన్నభుక్తి కాససేయక యోగి
తెలివిఁ బ్రాణ మాత్మ నిలుచుకొఱకు
గ్రాస మందవలయుఁ గబళంబు లైదింట
రుచులకోర్కె విడిచి రూఢి మెఱయ.

76


వ.

మఱియును.

77


సీ.

అన్నంబులకుఁ బ్రాతు లగుదు రాఁకటఁ జిక్కి
       చనుదెంచి ప్రార్థించు మనుజు లెల్ల
నందుఁ బ్రాణాగ్నిహోత్రాధికారసమేతు
       లగు భూసురేంద్రు లత్యధికు లరయఁ
దద్భూసురేంద్రహృద్గతవహ్నిలోపల
       నెట్టివాఁ డైన నహీనభక్తి
నన్నకబళము ప్రాణాహుతిమాత్ర మై
       నను వేల్చెనేని యన్నరవరుండు
కోటిగతజన్మసంచితఘోరకలుష
విరహితుం డయి సుర లెల్ల వినుతి సేయఁ
బ్రబలసంసారఘనసాగరంబుఁ గడచి
ముదితుఁ డగుచును సాయుజ్యముక్తి నొందు.

78


గీ.

పొదలు సంపదలకు నెల్లఁ బుట్టినిల్లు
నిబిడరోగాగ్నులకు నెల్ల నీరదంబు

వైభవాకరమోక్షనివాసహేతు
వన్నదానసమాన మన్యంబు గలదె?

79


గీ.

భక్తితో నైనఁ గణగి యభక్తి నైనఁ
బ్రీతితో నైనఁ బొదలి యప్రీతి నైన
హరిసమర్పితముగ భూసురావళులకు
నేయమున నన్నదానంబు సేయవలయు.

80


వ.

అట్టి యన్నదానమహత్వంబు చెప్పెద నాకర్ణింపుము.

81


స్రగ్ధర.

ప్రాకారద్వారకేళీభవనవిమలహర్మ్యస్ఫురద్గోపురాళీ
వ్యాకీర్ణం బై మవేభాయతరథతురగవ్యాప్త మై కృత్రిమార
ణ్యాకాలప్రాప్తపుష్పోద్యదభివినుతగంధాభిసంనాసితం బై
శ్రీకాంతాసంశ్రయం బై చెలఁగుచు వెలయున్ సింధురం బుర్విలోన.

82


క.

ఆ సింధురాపురంబున
భూసురవరుఁ డొక్కఁ డతిథిపూజాపరుఁ డై
వాసవుఁ డను నామంబున
వాసరములు గడపు విష్ణువశహృదయుం డై.

83


వ.

అట్టి విప్రపుంగవుండు ధర్మానుకూలభార్యాసమేతుం డై గోధనధాన్య
పుత్త్రబంధుజనపూర్ణసదనుం డై యహంకారంబు పరిత్యజించి తెలివితో
డఁ గాలంబుఁ నడపుచు సముచితాచారయుక్తుం డై యున్నయెడ నొక్క
నాడు లక్ష్మీవల్లభుండు దన్మహీసురుని నిశ్చలభక్తివిశేషపరీక్షఁ జేయం
బూని యతని ధేనువుల నంతర్ధానంబు నొందించినఁ దద్గోపాలకులు జాలిం
బొంది కుయ్యిడుచుఁ బరుగుపరుగున నతని గృహంబునకు నరుగుదెంచినం
జూచి యవ్వాసవుండు వారలతో ని ట్లనియె.

84


శా.

ఏలా గోపకులార! కుయ్యిడుచు మీ రీరీతి దుఃఖాత్ములై
జాలిం బొందఁగఁ గుందఁ గావలవ దీజాడల్ రమానాథు లీ
లాలంకారము లామహాత్ముఁడు జగద్వ్యాపారపారీణుఁ డై
కాలాకారసమేతుఁ డై యణఁచు దత్కాలోద్భవార్థంబులన్.

85


క.

నాశోదయములకును ల
క్ష్మీశుం డే నాయకుండు చింతింపఁగ దు

ష్టాశాపరవశత నరుల్
గాసిలి తిరుగుటయె కాని కలుగవు ఫలముల్.

86


చ.

మతియును విత్త మాయువును మానవనాథుల మెప్పు మిథ్య యౌ
మృతియును జీవితంబు నిట మేదినిలోపల జీవకోట్ల క
ద్భుతముగ వ్రాయుఁ బద్మజుఁడు పొల్పుగ నందుకుఁ దప్పు లేదు సం
పతిలు నిజేచ్ఛఁ గల్గునె రమాపతి యానతి లేక యుండినన్.

87


గీ.

వచ్చునట్టి కీడు వారింప మగుడింపఁ
బోవుచున్న సిరుల బుజ్జగింప
హరియుఁదక్క బంకజాసన గౌరీశ్వ
రాదిసురల కైన నలవి యగునె?

88


వ.

అని యిట్లు వాసవమహీసురుండు మోహంబు నొందక ధేనునాశంబు విను
పింప నేగుదెంచు గోపకుల నూరడించి తొల్లిటి యట్ల విష్ణుపూజాపరుం డై
యతిథిసంతర్పణ సేయుచు వర్తింపఁ గ్రమ్మఱ లక్ష్మీవల్లభుండు తద్విప్రుని
సదనంబునం గల సకలధనధాన్యాదిపదార్థంబు లణంగఁ జేసిన నతండు
దారిద్ర్యంబును బొందియు విష్ణుపాదభక్తి విడనాడక శాకాహారసమేతుం
డై తన్మూలంబున నతిథిపూజఁ జేయుచు దృఢమనస్కుఁ డై సంచరించుచు
నొక్కనాఁడు.

89


సీ.

అవనీసురుండు వన్యపదార్థసంగ్రహం
       బునకు నై కాననంబులకు నేగి
తద్వనంబంతయు దప్పక శోధించి
       కందమూలాదులు గానలేక
తీవ్రాతపంబునఁ దెమలి తృష్ణార్తుఁ డై
       విష్ణునామస్మృతి విడువ కెపుడు
నడుపుచు నొయ్యన నలినమిత్రుఁడు మింట
       నపరాంబునిధి చేర నరుగునపుడు
నిజగృహంబున కేతెంచి నిర్వికారుఁ
డగుచుఁ దనసతి నీక్షించి హర్ష మొదవ

మానితాసనమధ్యమాసీనుఁ డగుచుఁ
బలికె నొకమాటఁ దత్వప్రపన్నచరిత.

90


చ.

తిరిగితిఁ గాననంబు లతితృష్ణఁ జలింపక తద్వనంబులన్
దొరకవు కందమూలములు తోయజనాభుని యాజ్ఞ గాక యి
ప్పురిజన మెల్ల నన్నపరిపూరిత మై విహరించుచుండఁ గాఁ
గఱ వగునే తదన్నము లకాలమునన్ మనమందిరంబునన్.

91


వ.

అని పలుకు నవసరంబున దైవప్రేరితం బై యొక్క ఫలంబు కనుపడ
సతితో మఱియు ని ట్లనియె.

92


క.

లలనా హర్యర్పిత మగు
ఫల మిది భుజియింపు మీవు పద్మాక్షుఁడు భ
క్తులఁ బ్రోవక దిగవిడుచునె
పొలువుగ సకలప్రపంచపూర్ణుం డగుచున్.

93


వ.

అని పలికిన వచనంబులకుఁ జలితహృదయ యై సతి యిట్లనియె.

94


క.

సుతు లుండఁగఁ బ్రాణం బగు
పతి యుండఁగ నెట్టు లిట్టి ఫలము భుజింపన్
మతిలోన హర్ష మొదవును
సతులకు మముబోంట్ల కెన్న జననుతచరితా!

95


వ.

అని యి ట్లొండొరులు వితర్కించు సమయంబున నొక వృద్ధమహీసు
రుండు దృష్ణానలపీడితుం డై శ్రమంబు నొంది వాసవుని సదనంబున కరుగు
దెంచినం జూచి యా మహీసురవరుండు సంతసంబున నుప్పొంగి సమాగ
తుం డగు తద్విప్రవరునకు నర్ఘ్యపాద్యంబులు సమర్పించి యుచితాసనసమా
సీనుం గ్రావించి విష్ణుసమర్పితం బగు తత్ఫలంబు భుజియింపం బెట్టిన
యతం డది భుజియించి సుఖనిద్రాసమావిష్టుం డయ్యె నా సమయంబున.

96


సీ.

ఆ విప్రదంపతు ల ట్లాతిథేయకృ
       త్యంబులు నడిపి హృద్వనరుహములఁ
బదిలంబుగా రమాపతిఁ దలంచుచు నుండి
       యా రాత్రి గడఁచిన యంతమీఁద

సూర్యోదయం బైనఁ జూచి తద్భూసురుం
       డాహారమునకు నై యడవి కరిగి
శాకమూలంబులు సమకూర్చుకొని యొక్క
       వటభూరుహము క్రింద వసతి సేయ
నంతలోపలఁ దద్భూరుహమున నున్న
బ్రహ్మరాక్షసు లెనమండ్రు బ్రహ్మనూక్త
ములు పఠించుచు నేతెంచి ముదముతోడ
నతనిఁ గని యభివందనం బాచరించి.

97


మ.

అని రి ట్లా ధరణీసురోత్తమునితో నా బ్రహ్మరాత్రించరుల్
విను మత్యున్నతపుణ్యగర్వమున దుర్విద్యాభిమానంబునన్
ఘనులన్ వాదములం జయించిన మహాఘశ్రేణిమూలంబుగాఁ
గ నమందక్రియ మాకు నిల్వవలసెం గ్రవ్యాదరూపంబులన్.

98


గీ.

ఇట్టి తనువు లుడిగి యేరీతి ముక్తుల
మగుచుఁ జనుదు మింక నట్ల సేయ
వలయు భూసురేంద్ర వర్ణింప నీకును
సాటి యెన్నఁ గలదె జగములందు.

99


వ.

అనిన వారలకు వాసవమహీసురుం డి ట్లనియె.

100


క.

ఏ రీతి మీరు చెప్పిన
నా రీతిన నడపి మిమ్ము నతిరభసమునన్
జేరికొనఁ జూతు ముక్తి ని
శ్రీరమణీవిభుని యాన ప్రేమ దలిర్పన్.

101


సీ.

భూసురుం డీ చందమునఁ బల్కువాక్యంబు
       లాలించి యి ట్లని రసురవిప్రు
లధికదయాపూరితాక్ష నీ విచటికిఁ
       జనుచేర మా కోర్కె సఫల మయ్యె
నని యొక్కఁడు భవద్గృహాగతుం డైన నాఁ
       డతని కాహార మిచ్చితి తదీయ

పరితృప్తిమాత్రసంభవఫలం బిచ్చిన
        వైకుంఠమున కేగువార మనిన
వాసవుం డప్పు డా ధరిత్రీసురులకు
నక్షతోదకపూర్వమౌ నట్లు గాను
దత్ఫల మొసంగ వారలు తత్క్షణంబ
ముక్తు లై రాత్మసంతోషములు చెలంగ.

102


వ.

ఈ చందంబున బ్రహ్మరాక్షసులు తత్క్షణంబ రక్షోరూపశరీరంబులు
విసర్జించి ముక్తు లైనం జూచి పాణాహుతిమాత్రఫలఫలంబున కచ్చెరువంది
వాసవుండు నిజసదనంబున కేగుదెంచి స్నానాదికృత్యంబులు దీర్చి నిత్య
కర్మానుష్ఠానంబు సమాప్తించి విష్ణుపూజావిధి యొనర్చి యగ్నిహోత్రంబు
సేయు సమయంబున లక్ష్మీవల్లభుండు వృద్ధబాహ్మణరూపంబున వాసవుని
గృహంబున కేతెంచి యన్నం బడుగ నతని నవలోకించి దయాపరిపూరిత
హృదయం డై తన భామిని నవలోకించి యి ట్లనియె.

103


క.

ఈ విప్రుఁడె లక్ష్మీశుం
డీ విధమున నిప్పు డింటి కేతెంచెను సం
భావించి శాక మైనను
నీ వసుధామరున కొసఁగ నీప్సిత మొదవున్.

104


వ.

అంత.

105


క.

పతి పలికినట్ల యెంతయు
నతిముదమునఁ బాద్యమిచ్చి యా విప్రునకున్
గృతభక్తి నొసఁగె శాకము
మతి గందక తద్వధూటి మాన్యచరిత్రా.

106


వ.

ఆ సమయంబున.

107


మ.

ద్విజరూపంబున నాగతుం డగు రమాధీశుండు విఖ్యాతిత
ద్ద్విజగేహంబున శాకమూలఫలముల్ వేడ్కన్ మహాభక్తితో
భుజియింపన్ వసుధాదిభూతములు సంపూర్తిం బ్రవర్తిల్లె నీ
త్రిజగంబుల్ పరితృప్తిఁ బొందె విభవశ్రీలన్ వినోదించుచున్.

108

వ.

ఇట్లు తద్గృహంబున భుజియించి లక్ష్మీకాంతుండు చతుర్భుజధరుం డై శంఖ
చక్రగదాశార్ఙ్గాదిదివ్యాయుధోపేతుం డై శ్రీవత్సకౌస్తుభకుండలకిరీటగ్రైవే
యహారాదిదివ్యభూషణసమేతుం డై గరుడవాహనారూఢుం డై యాద్విజవ
రునకుఁ బత్యక్షుం డై యతని నవలోకించి యిట్లనియె.

109


చ.

మొదవులు వోయినన్ సిరులు ముందుగ నేర్పడ నాశ మొందినన్
సదనములో దరిద్రతవశంబుగ నిల్చిననైన మిక్కిలిన్
హృదయములోనఁ గందక మదీయపదాంబుజనిత్యభక్తిచే
బొదలుచు వేడ్క నొందితివి భూసురవర్య దృఢవ్రతంబునన్.

110


క.

పరితృప్తిఁ బొంది నే నిట
మురువున భుజయించుశాకమునఁ ద్రిభువనముల్
ధరణీసుర నీ వడిగిన
వర మొసఁగెద నడుగవలయు వైభవ మొదవన్.

111


వ.

అని యానతిచ్చిన పుండరీకాక్షునకు సాష్టాంగదండప్రణామం బాచరించి
కృతాంజలి యై య మ్మేదినీసురుం డి ట్లనియె.

112


చ.

అనయము గర్మయోగమున నైనను జ్ఞానముచేత నైనఁ ద
ద్వనరుహసంభవాదులు భవద్విమలాకృతిఁ గానలేనిచో
దినకరకోటితేజ జగతీవర నిన్నును గంటి నింతక
న్నను వర మెయ్య దింక భువనంబునఁ జూడఁగ నిత్యవైభవా!

113


క.

దయసేయుము భవదంఘ్రి
ద్వయభక్తియు ధర్మమందుఁ దాత్పర్యంబున్
నియతమనోనైర్మల్యము
నయ! నిత్యపవిత్రసంతతాయతచరితా!

114


వ.

అని విన్నవించిన విప్రవరునకు నక్షయం బగు సంపదయును నిజపాదాం
బుజములయందు నిశ్చల మగు భక్తియు ననంతం బైన వైకుంఠపురనివా
సంబును గృప సేసి యాలక్ష్మీవల్లభుం దంతర్ధానంబు నొందె నట్లు కావున
వసుధామండలంబున నన్నదానంబె పరమం బగు దానం బదియె సకల
లోకతృప్తికిఁ గారణం బగు నని చెప్పినఁ బద్మజునకు నారదుం డిట్లనియె.

115

క.

ఏ పుణ్యంబునఁ దుద ల
క్ష్మీపతి సంతుష్టుఁ డగుచు మేదిని నరులం
జేపట్టి యొసఁగు నిజపద
మా పుణ్యక్రమము దెలుపు మబ్జజ యనినన్.

116


గీ.

భువనసమితిలోన భూలోక మధికంబు
తెలియ నందు మేలు గలియుగంబు
తద్యుగమునఁ జక్రధరుభక్తి యణుమాత్ర
ముననె కలుగు ముక్తి మనుజులకును.

117


వ.

మఱియును సాధారణధర్మంబులు జాతిధర్మంబులు ననఁగ నాచారంబు
ద్వివిధం బై పర్యవసించు నందు సాధారణధర్మంబు లెవ్వి యనిన.

118


సీ.

దత్తానుతాపసంతప్తుఁ డై కుందక
        దీనార్థులకు నిచ్చు దాన మొకటి
విఘ్న మేతెంచుచో విడువక సూటిగా
        నిత్యంబు నడపెడి సత్య మొకటి
భువన మంతయుఁ జతుర్భుజుని రూపం బని
        పొలుపుగాఁ దలఁపోయు బుద్ది యొకటి
యాత్మలో నతిభక్తి నంబుజోదరు నామ
        ములు సర్వకాలంబునఁ దలఁచు టొకటి
మహిని వివరింప సర్వసామాన్యసరణు
లివియె తెరువులు వైకుంఠభవనమునకుఁ
గలుషసహితుని కైన దుష్కర్ము కైన
జాతిహీనుని కైనఁ బ్రఖ్యాతితోడ.

119


క.

ఇం దొక టైనను దప్పక
కందువతో నడప నేర్చు ఘను లెల్లను సం
క్రందననుతు లై మోక్షముఁ
బొందుదు రఖిలాఘకర్మపూరితు లైనన్.

120


వ.

మఱియు విప్రాదివర్ణధర్మంబు లెవ్వి యనిన.

121

సీ.

నిత్యకర్మాదులు నియమంబు శౌచంబు
        స్వాధ్యాయ మతిథిపూజావిధాన
మల్పసంతుష్టియు నాత్మనిగ్రహమును
        నగ్నిహోత్రంబును నార్జవంబుఁ
బైతృకాచరణంబు భావశుద్ధియుఁ గామ
        మోహలోభాదుల ముణుఁగుపఱచు
టనృతంబు విడుచుట హరిపాదభక్తియు
        దేవతాభజనంబుఁ దీర్థయాత్ర
సజ్జనులతోడి సఖ్యంబు సాధువృత్తి
వర్ణితం బగు ధర్మప్రవర్తనంబు
దాన మాస్తిక్యబుద్ధియు దత్త్వ మెఱుఁగు
యత్నమును విప్రధర్మంబు లమరవినుత.

122


సీ.

మంత్రశుద్ధివిచారతంత్రంబు నీతియు
        సముచితదానంబు సత్యవాక్య
మాచారవిధియు బ్రాహ్మణదేవభక్తియు
        సప్తసంతానసంస్థాపనంబు
ఘనకీర్తిధర్మసంగ్రహమును జతురంగ
        బలపోషణము ప్రజాపాలనంబు
వీరశత్రునృపాలవిజయంబు సాహస
        మర్థులకును వాంఛితార్ధ మిడుట
రాయబారంబు నడిపి కార్యంబుఁ దెలిసి
తదనుకూలప్రయోగముల్ మొదలుకొనుట
పొలుపు మీఱంగ విభవసంపూర్ణుఁ డగుట
రాజులకు నివి ధర్మముల్ తేజ మలర.

123


క.

క్రయవిక్రయములు దానము
నయమున ధనసంగ్రహంబు నలినాక్షపద
ద్వయభక్తియు నన నివియే
నియతము లగు వైశ్యులకును నిజధర్మంబుల్.

124

గీ.

స్వామిహితమును దానంబు శౌర్యమహిమ
భూసురోత్తమపాదాబ్జపూర్ణసేవ
హరిపదాంబుజసద్భక్తి యనఁగ నివియు
శూద్రులకు ముఖ్యధర్మముల్ శుభచరిత్ర.

125


క.

ఇందుఁ బవిత్రము భూసుర
సందోహము తత్పదముల సంతస మొదవన్
వందనము సేయు మనుజులు
పొందుదు రభ్యుదయసమితిఁ బూర్ణాత్మకులై.

126


క.

వేదంబులు భూసురులును
శ్రీదయితుఁడు నొక్కసమము చింతింపఁగఁ ద
ద్వేదాధ్యయనమహీసుర
మోదంబే కారణంబు ముక్తికిఁ దనయా.

127


క.

ధరణీసురు మూలంబున
సురలకు సంతృప్తి యగుట సుస్థిరమతియై
నరవరుఁడు సేయనే తగు
ధరణీసురతృప్తి యన్నదానముచేతన్.

128


వ.

మఱియును.

129


సీ.

అనలంబు కరముల నశ్వినీదేవతల్
        నయనయుగ్మంబున నలరు విధుఁడు
మూర్ధభాగంబున మునుకొని నదు లెల్ల
        పాదంబులందును బవనుఁ డాత్మ
బరమాత్మ హృచ్చక్రపద్మమధ్యమమున
        వరుణుం డురంబున వాసవుండు
కంఠనాళంబునఁ గంజాప్తుఁడును గుక్షి
        నమరవర్యులు భుజాగ్రములయందు
సాధ్యు లాధార జలరుహస్థలమునందు
వనధు లెల్లను మోహనావర్తములను

నుందు రీరీతిఁ దద్భూసురోత్తమాంగ
సంధులను దేవసంఘముల్ సందడిలుచు.

130


క.

ధరణీసురహృదయంబులు
పరితాపము లొందఁ జేయుఁ బాపాత్ములు దు
ష్కరనరకాభ్యంతరముల
బరితప్తశరీరు లగుచుఁ బడుదురు పుత్త్రా.

131


సీ.

అదిగాక విను భూసురాధిపదర్శనం
        బక్షిసంభవస్థానశిక్షకంబు
నుర్వీసురేశ్వరాశీర్వాదములు వాంఛి
        తార్థపదంబులై యలరుచుండుఁ
బెం పైన వసుధానిలింపవందనముచే
        తనుకల్మషము లెల్లఁ దఱిఁగిపోవు
నిట్టు లిట్టి జగంబు లెల్లఁ బావనములు
        గావించుచుందురు ధీవరేణ్య
కోటిజన్మములకు గాని సూటిపడదు
విప్రజన్మంబు వసుధను విప్రుఁ డయ్యు
విష్ణుపాదాంబురుహభక్తి విడిచెనేని
యతనికన్నను శ్వపచుఁ డత్యధికుఁ డరయ.

132


క.

తంతువు పుష్పంబుల న
క్యంతంబును గలిసి మౌళిధార్యం బగున
ట్లంతిమజాతిజుఁ డైనను
సంతతహరిభక్తితోడఁ జను హరిపురికిన్.

133


క.

హరిభక్తిఁ బొదలుచుండెడి
నరుఁ డంత్యజుఁ డైన విప్రునకు సవ తరయన్
హరిభక్తిహీనుఁ డగు భూ
సురుఁ డైనను జరమజాతి సువ్వె మునీంద్రా.

134


చ.

హరీ జగదీశుఁ డార్తశరణాగతవత్సలుఁ డాదిదేవుఁ డం
బరచరమౌళిరత్నరుచిభవ్యపదాంబుజుఁ డిందిరావధూ

వరుఁ డఖిలాండనాయకుఁడు వారిజనేత్రుఁడు భక్తిగమ్యుఁ డై
పరగఁగ దుఃఖసాగరము భారమె దాఁటఁగ మర్త్యకోటికిన్.

135


క.

భువనపరిపూర్ణతేజా
పవమానాకాశభూమిపానీయపయో
భవభానుతారకాధిప
భవజన్మనిదానరంగపట్టణనాథా!

136


స్రగ్ధర.

నందానందస్వరూపా నవగుణనిలయా నందితాహ్యంగతల్సా
కుందేందూదారహాసా కువలయనయనా కోణపాహార్యవజ్రా
సుందాభిఖ్యాతదుష్టాసురయుగమధనా సూర్యకోటిప్రకాశా
కందర్పారాతిమిత్రా కలిమలహరణా కాలకేయాపనోదా.

137

గద్య
ఇది శ్రీహనుమత్కటాక్షలబ్ద వరప్రసాదసహజసారస్వతచంద్ర
నామాంక రామవిద్వన్మణికుమా రాష్టఘంటావధానపరమే
శ్వర హరిభట్టారకవిరచితం బైన మత్స్యపురాణ
ఖండం బగు విష్ణుధర్మోత్తరంబు నందు
ద్వితీయాశ్వాసము.
శ్రీ