భాస్కరరామాయణము/బాలకాండము

శ్రీరస్తు

భాస్కరరామాయణము

బాలకాండము



రఘురాముచరిత్రము
నారదుఁ డెఱిఁగించుటయును నలువయనుజ్ఞన్
శారదకృప వాల్మీకి యు
దారత రామాయణముగఁ దా రచియించెన్.

1


క.

రామునిశుభచరితంబును, రామాయణముగ రచించి [1]ప్రాచేతసుకై
ప్రేమ నెఱిఁగించి తగ నిజ, ధామమునకు నారదుం డుదారతఁ జనియెన్.

2


వ.

తదనంతరంబ.

3


క.

వాల్మీకి భరద్వాజయ, తు ల్మారగ గంగ కనతిదూరమున లతా
గుల్మా౦చితతీరయు ని, ష్కల్మషజలయు నగుతమసకడ కేఁగి తగన్.

4


వ.

వాల్మీకి తనశిష్యుం డగుభరద్వాజునిచేతివల్కలంబులు పుచ్చుకొని ధరియించి
యాపుణ్యవాహిని నవగాహంబు సేసి వెడలి నిలువంబడునెడ.

5


క.

అంచితగతిఁ దత్తటముసఁ, గ్రౌంచంబులు రెండు లీలఁ గ్రాలుచు నుండం
బొంచి యొకశబరుఁ డం దొక, క్రౌంచముఁ బడ నడిచె రక్తకణములు దొరఁగన్.

6


క.

శిరమున రక్తము వెడలఁగఁ, బొరలెడు తన విభునిఁ జూచి పొడమినవగతోఁ
బరుషధ్వని వాపోవుచుఁ, గరము విషాదించుక్రౌంచిఁ గనుఁగొని కరుణన్.

7


వ.

కటకటంబడి వాల్మీకి యధికరోషసంఘటితకుటిలభ్రుకుటి యగుచు నిషాదుం
గనుంగొని.

8


ఉ.

ఓరి మహోగ్రపాతకుఁడ యోరినిషాదుఁడ క్రౌంచయుగ్మ మిం
పారఁగఁ గాముకేలిమెయి నాడఁగ నం దొకపక్షి నీల్గ ని
ష్కారణ మేల చంపి తటు గావున నీవును వేగ చావు పో
రోరి దురాత్మ యంచుఁ గడునుగ్రత నమ్ముని పల్కెఁ బల్కినన్.

9

క.

ఆకరుణానిధి యగువా, ల్మీకులశాపాక్షరములు మితసమవర్ణ
శ్రీకరపాదచతుష్క, శ్లోకం బయి జగతిఁ బరఁగె సుశ్లోకం బై.

10


వ.

అంత నమ్ముని వెఱఁగందుచుఁ దనశిష్యు భరద్వాజుం జూచి యోతపోధన యి ట్లే
నలిగి నిషాదు శపియించినరోషాక్షరంబులు సమవర్ణచతుష్పాదశ్లోకం బయ్యె నని
పలుకుచు నభిషేకంబు సేసి యుచితానుస్థానంబులు నాహ్నికవిధులు నాచరించి.

11


క.

తనవెనుక భరద్వాజుఁడు, దనరఁగ జలపూర్ణకలశధరుఁ డయి యేతే
ర నిజాశ్రమమున కొనరఁగఁ, జని తగఁ గూర్చుండి యోగసమ్మితబుద్ధిన్.

12


క.

ధ్యానంబు సేయునెడఁ జతు, రాననుఁ డేతేర లేచి ప్రాంజలి యయి స
మ్మానముతోడుత మ్రొక్కుచు, నానావిధపూజ లిచ్చి నలినజుచేతన్.

13


క.

అనుమతుఁ డయి యుచితాసన, మున నుండఁ బితామహుండు ముదితాత్ముం డై
కనుఁగవలను గారుణ్యం, బెనయఁగ వాల్మీకిఁ జూచి యి ట్లని పలికెన్.

14


ఉ.

పూని సమాధియోగయుతబుద్ధిఁ దలంపఁగ నీకు నెమ్మెయిన్
మానుగ రామలక్ష్మణులకమానితవిక్రమసచ్చరిత్రముల్
జానకిపుణ్యశీలము నిరశాచరనాయకయాతుధానసం
తానరహస్యబాహ్యచరితంబులు సర్వము గాననయ్యెడున్.

15


ఉ.

జానుగ నీముఖాబ్జమున శారద యున్నది నాయనుజ్ఞ వి
జ్ఞానముతోడ మున్ను సురసంయమి చెప్పిన వాక్యపద్ధతిన్
సూనృతభాషణార్థముల శ్లోకనిబద్ధముగాఁ గవిత్వసు
శ్రీ నొగి విస్తరించి తగఁ జెప్పుము రామకథాప్రపంచమున్.

16


క.

భూమిన్ నీవు రచించిన, రామాయణ మావసుంధరరాదిక్కరిగం
గామకరాకరగిరిరు, గ్ధామసుధాధామతారకం బయి వెలయున్.

17


వ.

అని పలికి బ్రహ్మ యంతర్హితుం డయిన నరు దందుచు నమ్మునియుఁ బూర్వ
శ్లోకంబు మనఃప్రేరితం బయిన

18


శ్లోకము॥

మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమ శ్శాశ్వతీ స్సమాః॥
య త్క్రౌఇ్చమిథునా దేక మవధీః కామమోహితమ్॥


క.

అని యని యాసుశ్లోకం, బనుమోదించుచుఁ బ్రవీణు లయి పలుమాఱుం
దనశిష్యులు చదువంగా, మనమున నెంతయుఁ బ్రమోదకమగ్నుం డగుచున్.

19


క.

ప్రేమ వాల్మీకిముని, గ్రామణి దనశిష్యగణముఁ గనుఁగొని యింకన్
రామాయణకావ్యం బభి, రామముగా శ్లోకములను రచియింతుఁ దగన్.

20


వ.

అని పలికి జలోపస్పర్శంబుఁ జేసి ప్రాచీనాగ్రంబు లయినదర్భలపయిం బద్మాసనా
సీనుండును ముకుళితకరకమలుండును నిమీలితనయనుండును నయి పరమయో
గధ్యానంబు సేయం దాఁ జెప్పం బూనిన రామాయణప్రపంచం బంతయుం గరత
లామలకంబుగాఁ గానంబడిన.

21

సీ.

రామునిజన్మంబు రమణీయశీలంబు, కౌశికాగమనంబు కార్ముకంబు
చేవఁ ద్రుంచుటయును సీతావివాహంబు, భార్గవరఘురామభాషణములు
రామాభిషేకంబు రాజ్యవిఘాతంబు, రాముప్రవాసంబు ప్రజలవగపు
దశరథుశోకంబు ధరణీశుమరణంబుఁ, దనర భరద్వాజుదర్శనంబు


తే.

చిత్రకూటప్రవేశంబు సేయుటయును
భరతుఁ డేతెంచుటయు ధాత్రివరుఁడు దెగుట
విని జలక్రియచేఁతయు ననుజు భరతు
మగుడఁ బుచ్చుటయును నంత మనుజవిభుఁడు.

22


వ.

మఱియు దండకారణ్యగమనంబును విరాధువధమును శరభంగుదర్శనంబును
సుతీక్ష్ణసమాగమంబును ననసూయావలోకనంబును నంగరాగార్పణంబును శూ
ర్పణఖావివాదంబును జుప్పనాక విరూపినిం జేయుటయును ఖరదూషణత్రిశిరుల
మరణంబును రావణురాకయును మారీచువధమును సీతాహరణంబును రామువి
లాపంబును జటాయువధంబును గబంధుదర్శనంబును బంపావలోకనంబును ఋశ్య
మూకగమనంబును సుగ్రీవసమాగమంబును సుగ్రీవసఖ్యంబును వాలిసుగ్రీవవి
గ్రహంబును వాలిప్రమథనంబును సుగ్రీవుపట్టంబును దారావిలాపంబును వర్షా
కాలనివాసంబును రామునికోపంబును గపిబలంబులం గూర్చుటయును సీతా
న్వేషణంబు సేయఁ గపినాయకుల దిక్కులకుం బుచ్చుటయును నంగుళీయకదానం
బును గపులప్రాయోపవేశంబును సంపాతిం గాంచుటయును సముద్రలంఘనం
బును మైనాకదర్శనంబును సింహికం గనుటయు [2]సువేలాచలదర్శనంబును లంకా
ప్రవేశంబును లంకినీదర్శనంబును బానభూమిగమనంబును నవగోధదర్శనంబును
నశోకవనికాయానంబును సీతాదర్శనంబును రావణదర్శనంబును రామాదులవృ
త్తాంతంబు సీత కెఱింగించుటయును సీత యానవా లిచ్చుటయును వనభంగంబును
రాక్షసులం దోలుటయును గింకరనిబర్హణంబు నక్షవధమును వాయుసూనుండు
పట్టువడుటయు రావణుదర్శనంబును లంకాదహనంబును [3]మగుడ మహోదధి
దాఁటి మధువనంబు సొచ్చుటయు రాఘవదర్శనంబును రామునకు మణి యిచ్చుట
యును సముద్రసమాగమంబును సేతుబంధనంబును [4]విభీషణునాగమనంబును
రాక్షసవధోపాయంబుఁ జింతించుటయును గుంభకర్ణమేఘనాదనిధనంబును రా
వణయుద్ధంబును దన్మరణంబును సీతాప్రాప్తియును విభీషణాభిషేకంబును బుష్ప
కాధిరోహణంబును నయోధ్యకు మరలి వచ్చుటయును భరతసమాగమంబును
రామాభిషేకంబును సైన్యంబుల వీడుకొలుపుటయును రామునిరాజ్యంబును
నుత్తరకాండకథయునుం గూడ నేడుకాండంబులు నేనూఱుసర్గలు నిరువది

నాలుగువేలశ్లోకంబులునుగా వాల్మీకిమునీంద్రుండు రామాయణమహాకావ్యంబు
సెప్పెం దత్కథాభ్యుదయం బెట్టు లనిన.

23

అయోధ్యాపురవర్ణనము

క.

సరయువుతీరంబున బహు, తరధనధాన్యములు గలిగి ధరణికిఁ దొడ వై
పరఁగెడుకోసలదేశం, బరుదారఁగ మెఱసి యుండు నద్దేశమునన్.

24


క.

అమరఁ ద్రియోజనవిస్తీ, ర్ణము దగఁ బండ్రెండుయోజనంబులనిడు పై
కొమరారునయోధ్యానగ, రము మును నిర్మించె మనువు ప్రాభవ మొప్పన్.

25


ఉ.

దానులు రాజ్యవర్ధనులు దత్త్వవిచారు లుదారు లింగిత
జ్ఞానులు మంత్రకోవిదులు సత్యవచస్కులు విద్విషత్తమో
భానులు ధీయుతుల్ చతురుపాయసమర్థులు రాజకార్యసం
ధానపరాయణుల్ వినయతత్పరు లాపురి మంత్రు లెంతయున్.

26


క.

స్వామిహితశక్తిమంతులు, ధీమంతులు చండధామదీధితిమంతుల్
భీమాహవభుజవిజయ, శ్రీమత్కృతిమంతు లాపురిని సామంతుల్.

27


చ.

దురితహరుల్ స్వకర్మనిరతుల్ విజితేంద్రియు లంచితవ్రతుల్
సరసులు సత్కళావిదులు శాస్త్రమతజ్ఞులు సద్గుణాకరుల్
సురుచిరపుణ్యు లవ్యయులు సూనృతవాదులు చిత్ప్రదీపని
స్తరితబృహత్తముల్ సుజనసత్తము [5]లప్పురి భూసురోత్తముల్.

28


చ.

తరళితదంతకాంతి సముదంచితబృంహితనీలదేహముల్
పరఁగఁ దటిల్లతాస్తనితభాసురవారిధరంబులో యనం
బొరిఁబొరి నేనుఁగుల్ దిరిగి పుష్కరశీకరదానధార ల
ప్పురమునఁ బెల్లుగాఁ గురియు భూతల మంతయుఁ బంకిలంబుగన్.

29


చ.

జవమున భంజళిన్ మురళిఁ జౌకమునన్ [6]నడనైదుధారలన్
వివిధవిచిత్రవల్గనవివేకములన్ బొలపంబునన్ శుభ
ధ్రువముల దూరభావముల రూపబలంబుల రూఢి కెక్కి యా
హవజయశీలముల్ గలుగు నశ్వము లెన్నఁగఁ బెక్కు లప్పురిన్.

30


చ.

అలఘుతరప్రభావమున నంతకుఁ దేజమునన్ దివాకరున్
బలమున శేషునిం గడిమి భార్గవరాముని వైభవంబునన్
బలరిపు సాటి సేయఁ దగి బాహుబలార్జితశత్రుమండలో
జ్జ్వలధనవంతు లై మహిమ [7]వాలుదు రప్పురి రాజస త్తముల్.

31


చ.

కులగిరు లెత్త నైన వడిఁ గుంభినిఁ గ్రుంగఁగ ద్రొక్క నైన వా
ర్ధులఁ గలఁపంగ నైన జము దుప్పలు దూలఁగఁ దోల నైన ది

గ్వలయమదేభకుంభములు వ్రక్కలు సేయఁగనైనఁ జాలుదో
ర్బలముల గెల్తు రాజిఁ బరిపంథుల నందుల వీరసద్భటుల్.

32


చ.

మణిఘృణివిస్ఫురత్కనకమండితకుండలహస్తమస్తభూ
షణములుఁ దారహారములు సారసుగంధవిలేపనంబులుం
బ్రణుతదుకూలచేలములుఁ బ్రాభవశోభితపుష్పదామముల్
గుణగణదానకీర్తులును [8]గోరిక మీఱినవారె యప్పురిన్.

33


చ.

పదములు చారుపద్మములు భాసురకంఠము లొప్పుశంఖముల్
రదములు కుందముల్ కచభరంబులు నీలము లట్లు గాన స
మ్మదమునఁ గాంత లై నిధులు మానుగ నున్నవి యైన నాపురిన్
సుదతులతుచ్ఛమధ్యములఁ జొచ్చినలేములు వాయ వెన్నఁడున్.

34


క.

అని యెన్న లికుచకుచములు, ఘనకచములు మెడలుఁ దొడలుఁ గౌనులు మేనుల్
పెను పగుకన్నులు వెన్నులుఁ, దనరఁగ నొప్పుదురు లీలఁ దత్పురికాంతల్.

35


వ.

మఱియు నప్పురవరంబు మృగమదమలయజమిళితజలంబులం గలయంపు లిచ్చి
వివిధమౌక్తికతతులుం గుసుమవిసరంబులు, గలయ నెఱపిన రాజమార్గంబు
లును, మణిఖచితకవాటతోరణంబులును, గనకమాణిక్యముఖ్యసకలవస్తుసంపూ
ర్ణాపణంబులును, విచిత్రాతపత్రధ్వజపతాకలును, గరవాలభిండివాలశూలాయ
సదండకోదండబాణతూణప్రముఖనిఖిలాయుధంబులును, నంబరతలంబునం గ్రా
లుఖేచరవిమానంబులో యనం బొలుచు నాభీలాట్టాలకజాలంబులును, రసాతలగత
పరిఖాజాలంబులును, యంత్రవ్రాతంబులును, శుభాకారసహకారవనాభిరామా
రామంబులును, ననల్పశిల్పికల్పితాకల్పభాసురగోపురంబులును, నుత్తాలవిశాల
సాలంబులును, నానారత్నప్రభావిపులవప్రంబులును, నైరావతాంజనకుముద
వామనసార్వభౌమపుష్పదంతపుండరీకవంశజమందమృగభద్రమదమత్తసామ
జంబులును, గాంభోజవనాయుజపారసీకబాహ్లికసముత్పన్నసముత్తుంగతురం
గంబులును, ననేకవర్ణపుణ్యగోగణంబులును, బరరాష్ట్రాయాతసమున్నతోష్ట్రం
బులును, గణికాగణనృత్యసంచారాంచితకాంచనాగారంబులును, బహువిచిత్ర
కర్మనిర్మితధర్మహర్మ్యంబులును, గగనోల్లేఖశిఖరసౌధప్రాసాదంబులును, నానా
దేశవ్యవహారులును, శాలితండులంబులును, నిక్షుకాండంబులును, రసవదుదకం
బును, ఘంటాకాహళశంఖదుందుభిపణవడిండిమాదిబహువాద్యభీషణఘోషం
బులును, సూతవందిమాగధనటచేటకపాఠకవాంశికవైణికవైణవికమౌరజికవై
తాళికాదివిద్యలవారును, సకలగాణిక్యమాణిక్యవిలసితవిమానగృహంబులును గ
లిగి; జారులుఁ జోరులు ననాచారులు నజ్ఞులు నకృతజ్ఞులు నయోగ్యులు నదానులు
ననభిమానులు నభాగ్యులు ననారోగ్యులు వసూయకులు నయోజకులు ననృత

భాషులు నవద్యాభిలాషులు నమంగళులు ననధీతులు ననధ్యాపకులు నల్పజీ
వులు నవగుణులు నవలక్షణులు నవిచక్షుణులు లేక; పగలు వగలు జగడంబులు
తిరిపంబు లీతి బాధలు దురితంబులు లేక; గానవిద్యలయంద మూర్ఛనలు, వల్మీ
కంబులయంద ద్విజిహ్వసంచారంబు, లానందంబులయంద బాష్పోద్గమంబులు,
ఛత్రచామరంబులయంద కనకదండంబులు, తరుణులయంద బంధంబులు, ననంగ
పీడలయంద యధరపానంబులు, నిద్రలయంద యజ్ఞానంబులు, కామినీఘనకుచం
బులయంద కఠినత్వంబులు, నయనంబులయంద చాపలంబులు, చూపులయంద
పక్షపాతంబులు, బొమలయంద వక్రతలు, రదనంబులయంద దంశితంబులు, గతు
లయంద జాడ్యంబులు, ప్రణయంబులయంద విప్రయోగంబులు, ఘననితంబం
బులయంద మేర గడచుటలు, మధ్యంబులయంద యధికక్షామదశలు, గాని
యెగ్గు లొండెడ లేక; సదాశివునిదేహంబునుంబోలె దుర్గావరణభూషితం బయి,
గగనతలంబునుంబోలె నిననుతబుధకవిరాజమిత్రపరివృతం బయి, భానుమండలం
బునుంబోలెఁ బ్రభాభాసురం బయి, యలకాపురంబునుంబోలె నిధానధనేశా
శ్రితం బయి, లంకాపురంబునుంబోలెఁ బుణ్యజనసేవితం బయి, మదనతూణీరం
బునుంబోలె నసమాయుధభరితం బయి, రత్నాకరం బయ్యును భంగరహితం
బయి, విబుధాప్సరస్సంతానహరిచందననిలయం బయ్యును ధరణీతలవిలసితం
బయి, యినకులీనపాలితం బయ్యును భీమవిజయధర్మరాజసుయోధనయువరాజ
విరాజితం బయి, పద్మాకరం బయ్యును విషపంకవర్జితం బయి, సకలగుణాకరం
బయి వెలయు.

36


మ.

జనలోకైకమహారథుండు ద్విజరక్షాదక్షుఁ డాజిం ద్రిలో
చనుఁ డుద్యచ్చతురంగసైన్యుఁడును భాస్వద్రూపపంచాస్రుఁ డ
న్యనృపక్రౌంచషడాననుండు ఘనసప్తాశ్వాన్వయుం డష్టమం
త్రినవద్రవ్యనిధీశుఁ డై దశరథారధీశుండు పెం పొందుచున్.

37


క.

శశిసదృశుం డసదృశతర, దశదిక్కీర్తితయశుండు ధరణీరక్షా
కుశలత జనలోకము దన, వశముగ నానగర మేలె వైభవ మొప్పన్.

38

దశరథుం డశ్వమేధయాగము సేయఁ బూనుట

వ.

ఇ ట్లయోధ్య సకలజనులుం బుత్రమిత్రకళత్రాదులతోడ ధనధాన్యసంపన్ను
లయి సకలసుఖంబుల ననుభవింపఁ బెద్దగాలంబు రాజ్యంబు సేసి దశరథుం డొక్క
నాఁడు.

39


క.

తనకుం గులవర్ధను లగు, తనయులు జనియింప కునికిఁ దలపోసి మనం
బున సంతాపముఁ బొందుచుఁ, దనమది నూహించి మఱియుఁ దఙ్ఞత వొడమన్.

40


క.

సుతులం గాననివారికి, గతి లేదు ముదంబు లేదు గావున నింకన్
సుతులం గనియెడుకొఱకును, గతివడ హయమేధ మేను గావింతుఁ దగన్.

41

వ.

అనుచు దశరథుండు విజయుండును ఘృష్టియు మంత్రపాలుండును సిద్ధార్థుండును
రాష్ట్రసాధకుండు నశోకుండును జయంతుండును సుమంత్రుండును నను నెన
మండ్రు మంత్రులం బిలిపించి యందు సుమంత్రుం గనుంగొని.

42


తే.

మనపురోహితు లగుచున్న మహితమతుల, ఘను వసిష్ఠుని వామదేవుని సుయజ్ఞు
ననఘు జాబాలిఁ గశ్యపు మునుల మఱియుఁ, దగినవారినిఁ గొని సమ్మదమునఁ దెమ్ము.

43


వ.

నా విని సుమంత్రుండు నేఁగి ప్రియ మెసంగం బిలిచి యమ్మునులం దోడ్కొని
[9]వచ్చిన.

44


క.

జనపతి వారల నుచితా, సనములఁ బెం పెనయ నునిచి సమ్మద మొందన్
[10]గొనకొని పూజించి నయం, [11]బెనయంగా మ్రొక్కి వారి కి ట్లని పలికెన్.

45


క.

సుతులు మును నాకు లేమిని, మతి నెంతయు వసటఁ బొంది మత్కులహితులన్
సుతులఁ గన నశ్వమేధము, చతురతఁ జేయంగఁ గోరి సమ్మతి మిమ్మున్.

46


మ.

ఇటు రప్పించితి నాదుయాగము మనం బింపారఁ జేయింపుఁ డా
దట నన్నన్ ముద మంది యామునిపతుల్ ధాత్రీశ పెం పొంద నీ
విటు లూహించినబుద్ధి లెస్స తగ నీయిష్టం[12]బ పుష్టంబు గా
ఘటియింపం గల దధ్వరోద్యమము వే కావింపు మిం కీ వనన్.

47


దశరథుండును మనోరథసంతోషభరితుం డయి మంత్రుల నాలోకించి.

48


సీ.

ఒనరంగ సరయువునుత్తరతీరంబు, నను యజ్ఞవాట మొనర్పుఁ డోలి
[13]సంభారువులు దెండు శాంతులు సేయింపుఁ, డధ్వరవైకల్య మరయుచుండు
బ్రహ్మరాక్షసకోటి క్రతువిఘ్న మైనప్డథ, క్రతుకర్త చెడిపోవుఁ గాన క్రతువు
గురువులయానతిఁ బరిపూర్తి వొందఁగా, విధ్యుక్తగతిఁ జేసి వెలయవలయు


మంత్రకోవిదులార సమర్థు లగుచు, మానితాశ్వము విడువుఁ డేమఱక యుండుఁ
డశ్వమేధము సేసి యన్వయము పరఁగఁ, దగినపుత్రులఁ గాంచెద ధర్మ మెసఁగ.

49


వ.

అని పలికి యమ్మునుల మంత్రుల వీడు కొల్పి యంతఃపురంబున కరిగి యభిమతం
బెసంగ.

50


చ.

తన ప్రియపత్నులం గడుముదంబునఁ గన్గొని కాంతలార యేఁ
దనయులఁ గాంచఁ గోరి యుచితం బగు నేమముతోడ నధ్వరం
బొనరఁగఁ జేయుచుండెద శుభోన్నతి మీరును దీక్షఁ గైకొనుం
డనవుడు సంతసిల్లిరి ముఖాంబుజముల్ వికసిల్ల నత్తఱిన్.

51


సీ.

ఏకాంతమున సూతుఁ డి ట్లను దశరథుఁ, గనుఁగొని భూమీశ కశ్యపునకుఁ
దగ విభండకముని తనయుఁడై పుట్టెడి, నమ్మునీశ్వరునకు ననఘమూర్తి
చిరపుణ్యుఁ డగుఋశ్యశృంగుఁడు పుట్టెడు, రోమపాదుం డనుభూమివిభుఁడు

జనియించి కూఁతు నమ్ముని కిచ్చి నెమ్మదిఁ, దనయింట నిడుకొని తనరఁగలఁడు
నీవు రోమపాదునిపొత్తు నెఱయఁ జేసి, యతనిఁ బ్రార్థించి యారాజునల్లుఁడైన
ఋశ్యశృంగునిఁ దోడ్తెచ్చి ఋషులు మెచ్చఁ, బుత్రకామేష్టి సేయించి పుణ్యమహిమ.

52


క.

కులపాలకు లగుపుత్రుల, నలువురఁ గనియెదవు నీవు నను వొందఁగ నం
చలఘుఁడు సనత్కుమారుఁడు, వెలయఁగ ఋషులసభఁ జెప్పె విజ్ఞానముతోన్.

53


వ.

అని యిట్లు సనత్కుమారుండు సెప్పినయనాగతవృత్తాంతంబు సూతుండు సెప్పిన
విని మనంబున విస్మయానందభరితుం డగుచు దశరథుండు.

54


క.

సూతుఁడ నా కెట్లు తనూ, జాతులు గలిగెదరు పుత్రకసంభవభాగ్యం
బేతపము సేసి పడసెద, నాతతమతి విస్తరించి యంతయుఁ జెపుమా.

55

ఋశ్యశృంగమునిచరిత్రము

క.

నావుడు దశరథుఁ గనుఁగొని, భూవర మును రోమపాదభూమికి నానా
జీవభయావహ మగుఘో, రావగ్రహవిగ్రహం బుదగ్రం బయినన్.

56


క.

పెను పయినయనావృష్టికి, జననాథుఁడు వసటఁ బొంది సచివుల మఱియున్
జనువారిఁ బురోహితులను, దనసభకుం బిలువఁ బంచి త గ ని ట్లనియెన్.

57


క.

మనయంగదేశమునకుం జనఁగ ననావృష్టిదోషశాంతులు సేయం
బొనరినయత్నము లేమిటఁ, దనరారఁగఁ జేయుఁ డీరు దక్షత ననినన్.

58


వ.

వార లయ్యంగదేశాధీశు నుద్దేశించి.

59


క.

అనఘుఁడు కశ్యపుఁ డన్ముని, తనయుండు విభండకుండు దత్పుత్రుఁడు పా
వనమూర్తి ఋశ్యశృంగుం, డనఘాత్ముఁడు బ్రహ్మచారి యతులుం డెందున్.

60


క.

తరుణి యిది యతఁడు పురుషుఁడు, పుర మిది యని యెఱుఁగఁ డెపుడుఁ బూతాత్ముండై
పరమస్వాధ్యాయతపో, నిరతిం జరియించుచుండు నిర్జనవనికన్.

61


ఉ.

భూరమణేశ [14]యాఘనతపోవ్రతసంగుని ఋశ్యశృంగునిం
దేరఁగఁ బంపి యాతనికి ధీనుత నీసుత శాంత నిచ్చినన్
భూరిసువర్షముల్ గలిగి భూమి సమృద్ధి వహించు నన్న నిం
పారఁగ మీరు వేగ సని యామునిపుంగవుఁ దెండు నావుడున్.

62


చ.

స్థిరమతి ఋశ్యశృంగు నిట దేరఁగ భూవర యేము చాల మ
ప్పరమతపోధనోత్తముని పాలికిఁ గాంతలఁ బంపు పంపినన్
సరసతరోక్తి నేఁగి మునిసత్తముఁ జిత్తము వచ్చునట్లుగా
వరఁకులఁ బెట్టి తెచ్చెదరు వారవిలాసిను లెన్నిభంగులన్.

63


క.

అన విని వారస్త్రీలన్, జనపతి రావించి మీరు చతురతతోడం
జని ఋశ్యశృంగుఁ గొని రం, డని పుచ్చిన వార లరిగి యభినవగతులన్.

64


సీ.

తరలహారద్యుతుల్ దంతకాంతులుఁ బర్వి, తరులకు నవపుష్పతతులు గాఁగ

నధరమరీచులు హస్తరోచులుఁ గ్రమ్మి, వరశాఖులకుఁ బల్లవములు గాఁగ
[15]రుచిరదృష్టిప్రభల్ కచరుచులుఁ బొదలి, కాంతారమునఁ దేఁటిగములు గాఁగ
సుకుమారతనువులు సురుచిరబాహులు, [16]బలసి కానకు లతావలులు గాఁగ
వారకామిను లాపుణ్యవనము సొచ్చి, మధురమంజులరవముల మనము లింప
రాగములు సేసి పాడుచు [17]రమణ వచ్చి, ఋశ్యశృంగుఁడు మెలఁగెడువృక్షవాటి.

65


వ.

చెంతల నిలిచి కెలంకులఁ బరికించునెడ.

66


చ.

వరముని ఋశ్యశృంగుఁ డట వచ్చిన వారివిచిత్రమూర్తు ల
చ్చెరువడి చూచుచుం జెవులు సేరిచి గానము వించు నుండె న
త్తరుణులుఁ జేరి యోపరమతాపస యోమునిపట్టి యేల యొ
క్కరుఁడవుఁ జొచ్చి యీవిజనకాననభూమిఁ జరించె దీ వనన్.

67


క.

వినుఁ డేఋగ్యజ్ఞాంగుం డనుపేరను ఋశ్యశృంగుఁ డనియెడునామం
బున మహిలోఁ బరఁగుదు మ, జ్జనకుండు విభండకాఖ్యసంయమి యొప్పున్.

68


వెలయఁగ వచ్చినార లిట వింతతపస్వులు మీరు మాననీ
యులు మిముఁ బూజ సేసి సుకృతోన్నతిఁ బొందెద నంచు నిష్ఠతోఁ
దలకొని యర్ఘ్యపాద్యములు దర్భలు నాదట నిచ్చి యోలిమై
ఫలములు కందమూలములు భక్తి నిడం గొని వారు నవ్వుచున్.

69


క.

అమృతరుచు లారఁ బాకము, లమరించిన మోదకంబు లాదిగ బహుభ
క్ష్యము లొగి నిచ్చిన నానం, దముతో నందుకొని నమలి తనిసినమదితోన్.

70


క.

ఈపగిదిఫలము లెన్నఁడు, నేపొలములఁ దరులఁ గాన మెందులు వివి యీ
తీపులు నిట్టివిచిత్రపు, రూపులు నీఫలము లింతరుచ్యము లగునే.

71


వ.

అని పలుకుచు నమ్మగువలు వీనులు సొగియింపం బాడ నగ్గానంబు విని విని
యెలమిని.

72


క.

ఈమధురస్వరవేదం, బే మెన్నఁడు వినము మీకు నేముని సెప్పెన్
వేమఱు మీతోఁ జదివెద, నోమునివరులార చెప్పుఁ చొప్పున నాకున్.

73


క.

అని పలికి మఱియు నమ్ముని, తనముందట నిలిచి యున్న తరుణులవృత్త
స్తనములు హారంబులుఁ జం, దనచర్చలుఁ బోలఁ జూచి తగ ని ట్లనియెన్.

74


ఆ.

నాకుఁబోలెఁ గావు మీ కురంబున రెండు, వలుఁదగుజ్జుఁగొమ్ము లలరుచున్న
[18]వఱుతి తులసిపూస లతిసితములు మేనఁ, దనర నలఁదినారు తావిభూతి.

75


క.

[19]ఈకట్టినవల్కలములు, మీ కెంతయు లెస్స లింతమృదువులు గలవే
యేకుజములనారలొ యివి, మాకును నివి యొసఁగవలయు మానుగ మీరల్.

76

వ.

అని యి ట్లనేకప్రకారంబుల ముగ్ధాలాపంబు లాడుచుం దమలోఁ గలసి యునికిఁ
బరికించి.

77


క.

ఒడ లెంతయుఁ బులకింపఁగఁ, బుడుకుచు మేలముల మోసపుచ్చుచు నమ్మై
[20]బెడఁగుసిలుగులం బెట్టిరి, పడఁతుక లాఋశ్యశృంగుఁ బార్థివముఖ్యా.

78


వ.

ఇ ట్లమ్ముగ్ధతపోధనుం దమవలలకు లోఁబఱిచి యచటం దడయ వెఱచి పురంబు
నకుం జని రంత ఋశ్యశృంగుండును జింతాకులమానసుం డయి తిరుగుచు
నెప్పుడు వీరు వచ్చెదరో యనుచు వారు వోయినత్రోవన వారిరాక కెదురుచూ
చుచు నుండ నమ్మఱునాఁడు.

79


క.

మణిఘృణిగణయుతరశనా, ఝణఝణితాగణితరణితచరణాంచితభూ
షణఘోషణరణనవిచ, క్షణకంకణకింకిణీకఝంకృతు లారన్.

80


ఉ.

అంగన లేఁగుదెంచి ముద మారఁగఁ గాంచి రధీతవేదవే
దాంగుని సర్వసంయమిముఖాబ్జపతంగుని నిర్జితేంద్రియా
సంగుని లిప్తభూతిలసదంగుని సద్గుణసంగునిన్ వ్రతా
భంగుని [21]సంతతోదితతపఃకృతిచంగుని ఋశ్యశృంగునిన్.

81


క.

కనుఁగొని మునిపుంగవ మా, వనమున కేతెంతు గాక వరదుఁడ వై నీ
వనవుడు ననుమతి సేసిన, వనితలు సంతసముఁ బొంది వాంఛలు సెల్లన్.

82


ఉ.

మచ్చికఁ గౌగిలించి పలుమాఱుఁ గుచంబుల నెత్తి యొత్తుచున్
మెచ్చుగ ముద్దు లిచ్చుచును మేలము లాడుచు బాహుపాశముల్
సెచ్చెరఁ గంఠలగ్నములు సేయుచు మోహితుఁ జేసి నేర్పుతోఁ
దెచ్చిరి దీమముల్ మృగముఁ దెచ్చినకైవడి ముగ్ధసంయమిన్.

83


క.

పురమున కమ్మునిఁ దేరఁగ, నురుతరవర్షములు గురిసె నుర్వీశుఁడు స
త్వరగతి నెదురుగఁ జని యా, దరమునఁ గొని వచ్చి యిచ్చెఁ దనసుత శాంతన్.

84


వ.

తగ నిచ్చి బహుప్రకారంబుల మన్నించి.

85


క.

[22]తనయల్లునిఁ దనకూఁతుం, దనయింటనె యునిచికొని ముదం బందుచు న
మ్మునివరునిప్రసాదమ్మునఁ, దనయులఁ గని యున్నవాఁడు తద్దయు మహిమన్.

86


ఉ.

కావున రోమపాదమహికాంతునిపాలికి వేగ మేఁగి సం
భావన లాచరించి తగ మైత్రి యొనర్చి ప్రియంబుతోడ న
బ్భూవరు నీవు వేఁడికొని పుణ్యచరిత్రు బహుక్రియాకలా
కోవిదు ఋశ్యశృంగు నిటకుం గొనివచ్చి [23]మనోహరంబుగన్.

87


తే.

పుత్రకామేష్టి సేయించి పుణ్యమహిమఁ
దగినపుత్రులఁ బడయుము దశరథేశ

యింతవృత్తాంతమును మున్ను యెఱుఁగఁ గంటి
మును సనత్కుమారుఁడు సెప్ప మునులయెదుర.

88


క.

అమ్ముని యధ్వర్యుఁడు గా, సమ్మతి హయమేధ మీవు సనఁ జేసి ప్రమో
దమ్మున నలువురఁ గొడుకుల, సమ్మానితగుణులఁ గనుము జగతీనాథా.

89

దశరథుండు ఋష్యశృంగు నయోధ్యకుం దోడి తెచ్చుట

వ.

అనవుడు సంతోషభరితమానసుం డయి తనగురుం డగువసిష్ఠునిఁ బూజించి
యమ్మునీంద్రుననుమతిం జతురంగబలసమేతుం డయి ధవళచ్ఛత్రచామరంబులు
మెఱయ సచివులుం దాను నెడనెడ నదులు వనంబులు గిరులుం గడచి యంగ
దేశంబు సొచ్చి రోమపాదునిసమీపంబున దీప్తాగ్నియుంబోలెఁ దేజరిల్లుచున్న
ఋశ్యశృంగుని దర్శించి పదంపడి రోమపాదునిఁ బూజించి యతనిచేతఁ దానును
బూజితుండయి తదనుమతి నాఋశ్యశృంగు నతిభక్తి నారాధించి యప్పురంబునఁ
గొన్నిదినంబు లుండి యొక్కనాడు రోమపాదుం గనుంగొని.

90


క.

జనవర నీసుత శాంతను, మునిపుంగవు ఋశ్యశృంగు ముద మారంగాఁ
బని గలిగి పిలువ వచ్చితిఁ, జనవునఁ బుత్తేరవలయుఁ జన నాపురికిన్.

91


క.

అన విని [24]యల్లునిఁ గూఁతుం, జనుఁ డని తగఁ బనిచి యంగజగతీశుఁడు దా
నును దశరథుఁడుఁ [25]గృతాలిం, గనుఁ డయి చన వీడుకొలిపె గాకుత్స్థవిభున్.

92


వ.

అంత నప్పురంబు వెడలి యొక్కదూతుం జూచి నీవు సని నారాక యెఱింగించి
పట్టణం బలంకరింపుఁ డని పౌరులకుఁ జెప్పఁ బొ మ్మంచుఁ బనిచి రయంబున దశర
థుండు నిజపురంబుఁ జేరవచ్చునెడ.

93


ఉ.

లాజలు నక్షతంబులు దళత్కుసుమంబులు మీఁదఁ జల్లి నా
నాజయవాదు లై జనులు నల్గడ మ్రొక్కుచు వేడ్కఁ జూడఁగా
రాజనిభాననల్ మహితరత్నసమాజవిరాజమాననీ
రాజనరాజితో నెదురు రాఁ గడుసొంపున వచ్చి మోసలన్.

94


క.

భీకరతరభేరీఘం, టాకాహళ తూర్యఘోషణములు సెలఁగ న
స్తోకశ్రీకానేకా, నీకంబులు బలసి కొలువ నిజపురి సొచ్చెన్.

95


క.

చొచ్చి యట ఋశ్యశృంగుని, నచ్చుగఁ బూజించి తత్ప్రియాంగన శాంతం
జెచ్చెర నంతఃపురికిం, బుచ్చిన నారాజుసతులు పూజించి రొగిన్.

96


వ.

ఇట్లు శాంతాసహితుం డగుఋశ్యశృంగునకు నుచితసత్కారంబు లొనరించు
చుండఁ బెక్కుదినంబులకుం దనమనోరథం బార వసంతసమయం బాసన్నం
బయిన దశరథుండు.

97


సీ.

అభివందనము సేసి యతిభక్తిఁ బూజించి, ఘను ఋశ్యశృంగుని ననఘ నీవు
పుత్త్రులు నా కింకఁ బుట్టెడునట్లుగా, హయమేధ మొనరింపు మని వరించి

వినతుఁ డై యాతని వేదపారగు లైన, విప్రుల నర్చించి విహితగతుల
సకలమునీంద్రులు సంభావనలు సేయ, నానందభరితు లై యఖిలజనులుఁ
గ్రతువు సేయ నుద్యోగింపు కడఁకతోడ, నీమనోరథ మార నుద్దామబలులఁ
దగినపుత్రులఁ బడయుము దశరథేశ, యనిన ముదమంది తనమంత్రిజనులఁ జూచి.

98


సీ.

ఒనరంగ సరయువునుత్తరతీరంబు, నను యజ్ఞవాట మొనర్పుఁ డోలి
సంభారములు దెండు శాంతులు సేయింపుఁ, డధ్వరవైకల్య మరయుచుండు
బ్రహ్మరాక్షసకోటి క్రతువిఘ్న మైనప్డ, క్రతుకర్త చెడిపోవుఁ గాన క్రతువు
గురువులయానతిఁ బరిపూర్తిఁ బొందఁగా, విధ్యుక్తగతిఁ జేసి వెలయవలయు
మంత్రకోవిదులార సమర్థు లగుచు, మానితాశ్వంబు విడువుఁ డేమఱకయుండుఁ
డశ్వమేధము సేసి యన్వయము పరఁగఁ, దగినపుత్రులఁ గాంచెద ధర్మ మెసఁగ.

99


వ.

అనిన మంత్రులు నధిపునానతిని సర్వంబు నిర్వహించి విహితక్రమంబున
నశ్వంబు విడిచి యెదురుసూచుచుండ సంవత్సరంబు నిండి క్రమ్మఱ వసంత
సమయం బాసన్నం బయిన నంతయు దశరథున కెఱింగింప నలరుచు వసిష్ఠు
నాలోకించి.

100


చ.

ధరణివిభుండు మ్రొక్కి యుచితక్రమపూజ లొనర్చి నీవు మ
ద్గురుఁడవు మాకు నెంతయు హితుండవుఁ గావున విఘ్న మెద్దియుం
బొరయక యుండ నధ్వరము పూర్ణము సేయు క్రియాంగకౌశలం
బరుదుగ యజ్ఞభారము సమస్తము నీయది సుమ్ము నావుడున్.

101


క.

సకలమఖకార్యములఁ ద, క్కక చేసెద ననుచుఁ బలికి ఖనకులఁ గార్తాం
తికులను శిల్పకరులఁ ద, క్షకులను నర్తకుల నటుల గణికాతతులన్.

102


క.

క్రతుకర్మనిపుణులు బహు, శ్రుతులును మంత్రజపపరులు శుచులును నియత
వ్రతులును నగు ప్రవరుల, నతికర్మకు లయినజనుల నార్యుల మఱియున్.

103


వ.

తగినవారలం గ్రమంబునం జూచి మీరు రాజునాజ్ఞ నిష్టకాసహస్రంబులు దెండు
కుండమండపవేదికాదులు నిర్మింపుఁడు వివిధశిల్పంబులు రచియింపుఁడు మహా
సనంబులు సత్రాగారంబులు పందిళ్లు మఱియునుం దగినగృహంబులు గట్టుఁడు
గీతవాద్యనృత్యంబు లొనరింపుఁడు రాజునకు మేలుగా జపశాంతులు సేయిం
పుఁడు నానాదేశంబులవారికిం బౌరులకు సర్వవర్ణంబులకుఁ గామక్రోధవశంబున
నవజ్ఞలు సేయక భక్ష్యాన్నపానాదులు గడపవలసిన వన్నువలుగాఁ బెట్టుఁడు
పనులయెడ నాయాసపడినవారల మిగుల మన్నింపుఁ డేవెంటం గొఱంత లేక
యుండ నందఱు నన్నిదెఱంగులఁ బనులు సేయుండనిన నాసకలజనులు మీయా
నతి యె ట్లట్ల సర్వంబు నిర్వర్తించితి మన నమ్మునీంద్రుం డలరుచు సుమంత్రుం
బిలిచి యి ట్లనియె.

104


మ.

అతిపుణ్యున్ మిథిలేశుఁ డైనజనకక్ష్మాధీశ్వరుం గేకయ

క్షితిపాలాగ్రణి సింధుదేశవిభుఁ గాశీనాథు సౌవీరు న
ప్రతిమస్నేహుని రోమపాదమహిపుం బ్రాచీనసౌరాష్ట్రభూ
పతులం దక్కినదాక్షిణాత్యనృపులం బాశ్చాత్యభూమీశులన్.

105


క.

ధరణి నతిధార్మికుల భూ, వరులఁ దదీయానుచరుల వలసినబంధూ
త్కరముల దశరథునానతి, సరగునఁ గొనిరమ్ము నీవు నమ్మక మారన్.

106


చ.

అనవుడుఁ బెక్కురత్నము లుపాయనముల్ గొని యమ్మునీంద్రుశా
సనమున వేగ మేఁగి తగ సర్వమహీశుల నాదరించి తో
కొని యధికప్రమోదమునఁ గొన్నిదినంబుల కేఁగుదెంచినం
గనుఁగొని యవ్వసిష్ఠుఁ డధికప్రమదంబున ఱేని కి ట్లనున్.

107


క.

ధరణీశు లెల్ల వచ్చిరి, [26]వెరవున మన్నించి వారి విడియించితి భూ
వర యజ్ఞము సేయంగా, నరుదె మ్మచట సకలంబు నాయిత మయ్యెన్.

108


క.

అనుచు వసిష్ఠుఁడు పలుకను, సునిశితమతి దశరథుండు శుభదినమున శాం
తను ఋశ్యశృంగునిం దో, డ్కొని క్రతువాటంబు సొచ్చెఁ గోరిక లారన్.

109


తే.

ఇట్లు సొచ్చి యద్దశరథుఁ డింద్రుకరణిఁ, బావనస్నానుఁడయి దీక్ష పరఁగఁ బూని
తనకులస్త్రీలు దాను సంతసము లార, నలరుచుండ నానాఁటి కయ్యజ్ఞభూమి.

110


ఉ.

బాలురు వృద్ధు లంధులు విపన్నులు రోగులు యోగు లోలి భూ
పాలురు ఋత్విజుల్ మునులు బ్రాహ్మణు లార్యులు బంధు లుత్తమ
స్త్రీలు సమస్తజాతులును జేరి తగం దమయిండ్లకైవడిన్
మే లగునన్నపానములు మెచ్చొదవంగ భుజించుచుండఁగన్.

111


క.

కలయఁగ నయ్యయిజనములు, వలసినవంకల సువర్ణవస్త్రాభరణా
దులు వెండి లబ్ధసంపద, లొలయఁగఁ జిత్తమునఁ దనివి నొందుచు వెలయన్.

112


క.

మండితమణిమయకాంచన, కుండలమండనవిశిష్టగురుతరరోచుల్
గండస్థలముల నెరయుచు, నుండఁగ నయ్యజ్ఞయాజుకోత్తము లొప్పన్.

113


వ.

సకలమఖకలాకోవిదు లగువసిష్ఠప్రముఖులును భూసురోత్తములును ఋశ్యశృం
గునిం బురస్కరించుకొని యజ్ఞకర్మారంభసంరంభం బెసంగ విహితక్రమంబున
గరుడోభయపక్షంబులుగా నిష్టకాచయనంబు లొనర్చి యందగ్నులు ప్రవృద్ధం
బులు సేసి ప్రవర్గ్యోపసవప్రాతస్సవనమధ్యందినసవనతృతీయసవనంబు లను
ష్ఠించి యేకవింశత్యరత్నిప్రమాణంబు లయిన యాఱేసిబిల్వఖదిరపలాశయూపం
బులును రెండుదేవదారుయూపంబులు నొక్కశ్లేష్మాతకయూపంబునుంగా ని
రువదియొక్కయూపంబు సంస్థాపించి వస్త్రభూషణమాల్యగంధాలంకృతంబుఁ
జేసి శోభనార్థంబుగాఁ గొన్నికాంచనయూపంబులు తిరిగిరా నిడి చతుష్పాదం
బులుం బక్షులుం జలచరంబులుఁ గా మున్నూఱుపశువులు పరివేష్టింపఁ బూర్వ

విసృష్టసమానీతాశ్వరత్నంబు నడుమ నిడి యుక్తక్రమంబున మున్నూఱుపశు
వుల విశసించి యేయేదేవతల కేయేమంత్రంబులు నేయేపశువులపలలంబు లర్హం
బు లాయాదేవతల కాయామంత్రంబులు నాయాపశువులపలలంబు లాహుతులు
సేసి మఱియుం గౌసల్యాదేవి చేతిఖడ్గత్రయంబునం బక్షిసహితంబుగా నశ్వంబు
విశసించి యధ్వర్యద్గాతృహోతలు హయంబు యజనంబుకడకుం జేర్ప యా
జకు లాయశ్వంబువప వెఱికి వేదోక్తక్రమంబున నాహుతులు సేయ నావసాధూ
మగంధంబు లాఘ్రాణంబు సేసి యఖిలభూపాలురుం బాపంబులం బాయ నున్న
యయ్యశ్వంబు సర్వాంగంబులు విహితమంత్రపూతంబులుగా నగ్ని కాహు
తులు సేయుచుం బ్రథమచతుష్టోమద్వితీయోక్తతృతీయాతిరాత్రజ్యోతిష్టోమా
యురభిజిద్విశ్వజిదప్తోర్యామాదిక్రతుసమేతంబుగా నస్ఖలితమంత్రతంత్రంబుల న
య్యశ్వమేధం బలోపక్రియాకలాపంబుగాఁ బరిసమాప్తిఁ బొందింప దశరథుండు
మనోరథలభ్యమానమానసుం డగుచు నధికానందంబుతోడ నధ్వరదక్షిణల
కొఱకు.

114


క.

చన హోతకుఁ బ్రాగ్దేశం, బును బ్రహ్మకు దక్షిణంపుఁబుడమియు నధ్వ
ర్యునకుం బశ్చిమదేశం, బును నుద్గాతకు నుదీచ్యభూమియు నిచ్చెన్.

115


తే.

ఇచ్చి మఱియుఁ దక్కినవారి క ట్లయోధ్య, యొకఁడు దక్కంగఁ దక్కినసకలభూత
లమును నందంద యిచ్చినఁ బ్రమద మంది, వార లాదశరథమహీశ్వరునితోడ.

116


క.

ఏ మెన్నఁ డనుష్ఠానము, నేమంబులు దీర్తు మెపుడు నియమితవేదో
ద్దామాధ్యయనము సేయుదు, మే మెక్కడ భూమి యేలు టెక్కడ మాకున్.

117


క.

భూమికిఁ దగుమూల్యముగా, హేమము లొండె మణు లొండె నీప్సితధేను
స్తోమము లొండెను ని మ్మీ, భూమండల మీవ యేలు పోఁడిగ ననినన్.

118


వ.

అగుఁ గాక యనుచు ముదితాత్ముం డయి దశరథుండు పదిగోట్లు సువర్ణంబులును
నలువదిగోట్లు రజతంబులును వసిష్ఠఋశ్యశృంగాదిఋత్విజులకు నొసంగి మఱి
యుం దక్కినభూసురోత్తములకుఁ గోటిసువర్ణంబులు ననేకదివ్యాంబరాభరణం
బులు నిచ్చి యమ్మునులకు దండప్రణామంబు సేసి సకలభూసురోత్తములు నాశీ
ర్వాదంబులు సేయ సంతోషభరితమానసుం డయి.

119


క.

జనవిభుఁడు ఋశ్యశృంగునిఁ, గనుఁగొని యనఘాత్మ పుత్రకామేష్టి ప్రియం
బునఁ జేయుఁడు మీ రనవుడు, మునివరుఁ డౌఁగాక యనుచు ముదితాత్ముండై.

120


వ.

నానామంత్రపూతంబులుగా నాహుతుల నగ్ని నిడుచుం బుత్రకామేష్టి సేయం
దొడంగిన.

121

బ్రహ్మేంద్రాదిదేవతలు నారాయణుని భూమి నవతరింపం బ్రార్థించుట

క.

అంత హవిర్భాగంబుల, నెంతయు సంతసము నొంద నేతెంచి సభా
భ్యంతరముననుండి సురల్, చింతించిరి రావణుండు సేసిన బాధల్.

122

తే.

అట్లు చింతించి యాసుర లజునితోడ, ధాత నీప్రసాదంబు తద్దయును బడసి
యఖిలజనులకు నవిజయ్యుఁ డగుచు నిపుడు, రావణుం డనువాఁడు గర్వంబు మెఱసి.

123


క.

వాసవసురమునిగంధ, ర్వాసురయక్షావనీసురావలి నెపుడుం
[27]గాసిల నలఁచుచు నుండన్, వేసరితిమి వాఁడు సేయువికృతుల కెదలన్.

124


వ.

వానిం బేర్కొన్న.

125


క.

కడ లెత్తి మ్రోయ వెఱచును, జడనిధు లినుఁ డెండ గాయ శంకిలు వానిం
బొడఁగనునెడ వాయువు లుర, వడి వీవక యడఁగు గిరులు వడవడ వడఁకున్.

126


క.

నీవరకారణమున నా, రావణుచే ముజ్జగములు ప్రలయము వొందుం
గావున వానిన్ వే ని, ర్జీవునిఁ జేయంగ నీవు చింతింపు మజా.

127


వ.

అనవుడుఁ గమలాసనుం డనిమిషులం గనుంగొని.

128


క.

సురయక్షాసురరజనీ, చరకిన్నరసిద్ధసాధ్యచారణవిద్యా
ధరగంధర్వాదులచే, మరణము నొందండు వాఁడు మావరశక్తిన్.

129


క.

నరులవలనఁ జావకుండఁగ, వర మడుగఁగ మఱచె నన్ను వాఁ డవమతిమై
ధరలో నటు గావున సం, గరమున నరుచేతఁ జచ్చు గర్వం బడఁగన్.

130


మ.

నరసింహాకృతిఁ బూని భీకరగతిన్ నారాయణుం దుద్దతో
ద్దుర బాహాబలుఁ డై హిరణ్యకశివుం దున్మాడి సంప్రీతి నా
దర మారన్ సురకోటిఁ బ్రోచెఁ దగ నాదైత్యాధినాథుండ యి
ద్ధర జన్మించెను రావణుం డనఁ బులస్త్యబ్రహ్మకుం బుత్రుఁ డై.

131


క.

దురమున దశకంఠుని వెసఁ, బరిమార్చి సమస్తసురలఁ బాలించు ధరన్
నరుఁడయి విష్ణుఁడు మన మా, హరి శరణము సొత్త మనఁగ నంతటిలోనన్.

132


లయగ్రాహి.

వక్షమున శ్రీసతియు నక్షుల శశాంకజగదక్షులుఁ ద్రిలోకకరణక్షముఁడు నాభిం
గుక్షి భువనంబులును బక్షిపతి కేతువున లక్షితకరంబుల విపక్షకులశిక్షా
దక్ష మగుచక్రమును ఋక్షపసదృక్షసువకళక్ష మగుశంఖమును నీక్షకులకుం బ్ర
త్యక్షములు గాఁగఁ గమలాక్షుఁ డరుదెంచెను సమక్షదివిజావలికి నీక్షణము లారన్.

133


క.

హరి కప్పుడు మ్రొక్కుచు సురు, చిరమతి సన్నుతులు సేసి చెప్పంగఁ దొడం
గిరి గీర్వాణులు దశకం, ధరుచేతం దమకు నయిన దారుణబాధల్.

134


సీ.

అఖిలేశ రావణుం డనురాక్షసేశుండు, బ్రహ్మవరంబునఁ బ్రబలుఁ డగుచు
నందనవనమున నలువొంద విహరించు, నప్సరస్సంఘంబు నడరి త్రుంచె
మునుల విచారించెఁ గనలి గంధర్వులఁ, బరిమార్చి దనుజులఁ బరిభవించె
[28]నమరుల నిర్జించె నసురుల భంజించె, యక్షులఁ దోలె గుహ్యకులఁ బఱపె
వానిదాడి కోడి వచ్చితి మిచటికి, నిను శరణు సొరఁగ నీవు కరుణ

నభయ మిచ్చి మమ్ము నాదరింపుము మాకు, దేవ గతియు నీవ దిక్కు నీవ.

135


క.

నరుచేతఁ దక్క వాఁ డొం, డొరుచే నీల్గండు దశరథోర్వీశసతుల్
[29]సిరికిన్ వాణికి గౌరికి, సరి యయి యున్నారు పుణ్యసదమలమతులన్.

136


క.

చతురంశంబుల మనుజా, కృతు లలవడఁ బూని యధికకృపఁ బంక్తిరథ
క్షితిపతిసతులకు నలువురు, సుతు లయి జనియింపవలయు సురహిత మెసఁగన్.

137


ఉ.

కావున మర్త్యరూప మిలఁ గైకొని పావనుఁ డైన రాఘవ
క్ష్మావరపుత్రుఁ డై పొడమి చండపరాక్రమలీల లోకవి
ద్రావణు రావణుం దునిమి ధర్మ మెలర్ప సమస్తదేవభూ
దేవగణంబులన్ మనుపు దిక్కుల నీనిజకీర్తి వర్ధిలన్.

138


చ.

అన విని విూర లింక భయ మందక నెమ్మది నుండుఁ డే నిలన్
మనుజుఁడ నై జనించి సుతమంత్రిసహోదరవాహినీసుహృ
జ్జనసహితంబు గాఁగ సురశత్రుని రావణుఁ ద్రుంచి కీర్తి గై
కొని తగ వర్షముల్ పదునొకొండుసహస్రము లుర్వి యేలెదన్.

139


వ.

అని పలికి సర్వలోకేశుం డగులక్ష్మీశుండు నిజలోకంబున కరిగెఁ దదనంతరంబ.

140


క.

అతినుత మగునాక్రతువున, వితతోద్ధత హోమధూమకవితతులు నానా
తతఘృతధారాహుతి వ, ర్ధితపావకశిఖలు గలయ దీప్తంబులుగన్.

141

ప్రాజాపత్యపురుషుండు దశరథునకుఁ బాయసాన్నం బిచ్చుట

వ.

అప్పు డప్పావనహోమాగ్నివలనం గృష్ణవర్ణుండును రక్తాంబరధరుండును రక్తా
సనుండును దుందుభిస్వనుండును స్నిగ్ధహర్యక్షసదృక్షరోముండును దివ్యభూషణ
భూషితుండును దివాకరసమాకారుండును దీప్తానలశిఖోపమానుండును నగునొ
క్కదివ్యపురుషుండు గలధౌతమయపాత్రాంతరితపవిత్రహేమపాత్రంబు హస్తం
బున నమర వెడలి దశరథు నీక్షించి నేను బ్రాజాపత్యపురుషుండ దేవనిర్మితం
బును నారోగ్యవర్ధనంబును బుత్రోత్పత్తికరంబును నగునిప్పాయసంబు నీప్రియ
పత్నుల కొసంగు మంచుఁ బలికి.

142


క.

తన కవ్విభుఁడు ప్రదక్షిణ, మొనరించి నమస్కరింప [30]నుజ్జ్వల మగుకాం
చనపాత్ర మిచ్చి వేగం, బున నాపురుషుం డదృశ్యపురుషుం డయ్యెన్.

143


చ.

జనవిభుఁ డంత నెంతయును సంతస మందుచుఁ గాంక్షతోడ ని
ర్ధనుఁడు ధనంబు గన్నగతి దత్పరమాన్నసువర్ణపాత్రముం
గొని చని యాత్మపత్నులకుఁ గోర్కిగ నా వరపాయసాన్నముం
గనుకని రెండుభాగములు గా నొనరించి తగంగ నందులోన్.

144


తే.

సగము కౌసల్య కిచ్చి యాసగములోన, సగము దగ సుమిత్రకు నిచ్చి చనఁగ నున్న
సగము కైకకు నిచ్చియాసగములోన, సగము మఱి సుమిత్రకు నిచ్చె సమ్మదమున.

145

క.

ఆపాయసానుభవమున, భూపాలునిసతులు గర్భములు దాలుప ధా
త్రీపతి పత్నులఁ గనుఁగొని, యేపారుముదంబుతోడ నెసఁగుచు నుండెన్.

146


క.

అమరులుఁ దమమఖభాగము, లమరఁగఁ గొని యమరపురికి నరిగెడిచో న
య్యమరుల నందఱఁ గనుఁగొని, యమరజ్యేష్ఠుండు పలికె నర్మిలితోడన్.

147


క.

ఆదట లోకముఁ బ్రోవఁగ, మేదురతరకరుణతోడ మేదినిపైఁ బ
ద్మోదరుఁ డుదయించుఁ జుఁడీ, యా దేవునకు సహాయమారఁ గడంకన్.

148


క.

ఏ నావులించునెడ నా, యాననమున జాంబవంతు నతివిక్రమస
మ్మానితు మును పుట్టించితి, మానుగ మీరును నిజాంశమహిమలు వెలయన్.

149


క.

కిన్నరవిద్యాధరసుర, పన్నగగంధర్వయక్షభామలయం ద
త్యున్నతబలు లగుకపులం, జెన్నుగ మిముఁ బోలువారి సృజియింపుఁ డిలన్.

150


సీ.

అని పల్క నగుఁగాక యని నాకమున కేఁగి, యనురక్తిఁ బాకశాసనుఁడు వాలి
నర్కుండు సుగ్రీవు ననిలుండు హనుమంతు, ననలుండు బలవంతుఁ డైననీలు
సింధునాథుండు సుషేణు విత్తేశుండు, గంధమాదను విశ్వకర్మ నలునిఁ
బరఁగఁ బర్జన్యుండు శరభుని సురమంత్రి, తారు నశ్వినులు మైందద్వివిదులు
బాఁతిఁ బుట్టించి రతిచండబలులఁ గపుల, మఱియుఁ దక్కినమునిజనాకమర్త్యయక్ష
గరుడకిన్నరభుజగకింపురుషభూత, చారణాప్సరోగణసిద్ధసాధ్యతతులు.

151


చ.

కులగిరు లెత్త దిక్కరులఁ గూలఁగఁ దన్నఁగ వీఁక నంబుధుల్
గలఁపఁగ నింగి మ్రింగఁ ద్రిజగంబులు గ్రుమ్మరఁ గాలమృత్యువున్
గెలువఁగ బాడబానలముఁ గేల నడంపఁగ శేషుఁ బట్టి పెం
దలఁ దలసుట్టు సుట్టికొనఁ దద్దయు శక్తులు గల్గువారలన్.

152


వ.

మఱియుఁ బర్వతాకారులుఁ బర్వతోత్పాటనప్రచండదోర్దండులుఁ బర్వతపాషాణ
పాదపయోధులును నఖదంష్ట్రాయుధులును సుపర్ణానిలబలసంపన్నులుఁ గామ
రూపులు నగువీరవానరుల నాగగంధర్వవిద్యాధరాప్సరస్సంఘగోలాంగూలవాన
రస్త్రీలవలన ననేకలక్షకోటిసంఖ్యలు గలుగువలీముఖోత్తములం బుట్టించి రందుఁ
గొందఱు వాలిసుగ్రీవులఁ గొందఱు నలనీలహనుమంతులం గొలిచిరి గొందఱు
ఋక్షవంతంబున నానాశైలకాననంబుల విహరించుచుండి రయ్యందఱకును
నధిపుం డై వాలి వాలుచుండు.

153


క.

తనయాగము పూర్ణముగా, జననాథుఁడు సకలజనుల సంభావన వీ
డ్కొని ఋశ్యశృంగుఁ దోడ్కొని, తననగరికి సతులతో ముదంబున నరిగెన్.

154


వ.

అరిగి వసిష్ఠాదిమునుల ఋశ్యశృంగు బహుప్రకారంబులఁ బూజించి వీడ్కొలిపి
సుఖంబున రాజ్యంబు సేయుచుం గోర్కు లడరం బుత్రోత్పత్తి కెదురుచూచుచున్న
యెడ.

155

శ్రీరామభరతలక్ష్మణశత్రుఘ్నులజననము

సీ.

వెలయఁ బండ్రెండవనెలయందుఁ జైత్రపు, నర్వసుబుధశుద్ధనవమినాఁడు
పంచగ్రహంబులు పరఁగ నుచ్చస్థాన, గతులుగా గురుసుధాకరులు గూడఁ
గర్కటకాఖ్యలఁగ్నమునందుఁ గౌసల్య, [31]హరి కర్ధ మగురాము నమరఁ గనియె
గురువారమునఁ జారుతరమీనలగ్నంబు, నను బుణ్యదశమిదినమునఁ గయిక
పద్మనాభునంశంబున భరతుఁ గనియెఁ, గర్కటకలగ్న మాశ్లేషకావ్యవార
మమర నేకాదశిని విష్ణు నంశమున సు, మిత్ర లక్ష్మణు శత్రుఘ్ను మెఱయఁ గనియె.

156


క.

సుర లపుడు పుష్పవర్షము, గురిసిరి మొగి నప్సరసలు గొమరారఁగ నా
డిరి గంధర్వులు పాడిరి, సురదుందుభు లోలి మొరసె సురుచిరభంగిన్.

157


మ.

సతతాకీర్ణము లై పురిం జెలఁగె నిస్సాణౌఘనాదంబు[32]లుం
దతరాగాన్వితమంత్రనాదములు నుద్యత్సూతవందిస్తవో
ర్జితనాదంబులు గీతనాదములు యోషిన్నృత్యభూషాసమం
చితవాద్యస్ఫుటనాదముల్ బుధజనాశీర్వాదవాదంబులున్.

158


వ.

ఇ ట్లనేకప్రకారంబుల సకలజనులు నభినందింపఁ బుత్రమహోత్సవంబు నిర్వ
ర్తించి దశరథుండు పరిపూర్ణమనోరథుండై సూతవందిమాగధులకుం బసదనంబు
లొసంగి భూసురోత్తములకు బహుసువర్ణంబులుఁ బెక్కుగోవులు ననేకరత్నం
బులు దానంబులు సేసి సకలజనుల నిష్టాన్నపానాదులం దృప్తులం జేసి పదంపడి
వసిష్ఠునిం బిలిపించి పండ్రెండవదినమునం బుణ్యాహవాచనపూర్వకంబుగా జాత
కర్మంబులు సేయించి నామకరణంబు లొనరింపు మనుచుఁ బలికిన నమ్మునివరుండు.

159


క.

ఘను నగ్రతనయు రాముం డనుచుం గైకసుతు భరతుఁ డనుచు సుమిత్రా
తనయులఁ గ్రమమున లక్ష్మణుఁ, డనుచును శత్రఘ్నుఁ డనుచు నాఖ్యలు సేసెన్.

160


సీ.

అంత బాలక్రీడ లాదిగాఁ దమలోనఁ, గవగూడి రామలక్ష్మణులు భరత
శత్రుఘ్నులును [33]బొ ల్పెసఁగ వేదశాస్త్రముల్, చన ధనుర్వేదంబు సకలకళలు
నభ్యసించుచు నాయుధాభ్యాసములు వాహ, నారోహణాదులు నాస్థతోడ
నలవరించుచు వార లన్యోన్యరాగు లై, యమర నేకగ్రీవు లగుచు గురుల
కెలమి శుశ్రూష సేయుచు నెల్లజనులుఁ, బొగడ ధీరులు శూరులై బుద్ధి నీతిఁ
బుణ్యమునఁ దేజమునఁ బేర్మి భూతి నఖిల, సుగుణముల నొప్పుచుండిరి సొంపు లెసఁగ.

161


వ.

అంత నొక్కనాఁడు.

162


క.

గుణకర్షజనితపరుష, వ్రణకిణపటుబాహుయుతులు వాజిగజారో
హణకఠినాంగుల సతతో, ల్బణశస్త్రాభ్యాసక లితకలఘుతరతనులన్.

163


క.

తనయులఁ గనుఁగొని జనపతి, మునుకొని వేడుక వివాహములు సేయఁగ యౌ
వనకాల మయ్యె ననుచుం, దనమదిఁ దలపోయుచుండఁ దత్సమయమునన్.

164

విశ్వామిత్రుండు దశరథుం కానవచ్చుట

మ.

ధరణీశుం గన గాధిపుత్రుఁడు సముద్యత్పుణ్యగాత్రుండు భా
సురచారిత్రుఁడు సర్వసంయమిజనస్తోత్రైకపాత్రుండు సు
స్థిరసంపూర్ణతపఃపవిత్రుఁ డురుసందీప్తప్రభామిత్రుఁ డ
ధ్వరసంపూజితవీతిహోత్రుఁ డగువిశ్వామిత్రుఁ డేతెంచినన్.

165


క.

కని దౌవారికుఁ డురవడిఁ, జని విశ్వామిత్రుఁ డిటకుఁ జనుదెంచినవాఁ
డనుడుఁ బురోహితయుతుఁ డై, జననాథుఁడు వాసవుండు చతురాస్యునకున్.

166


క.

ఎదు రేఁగినగతి నమ్ముని, కెదురుగఁ జని మ్రొక్కి యర్ఘ్య మిచ్చి ప్రమోదం
బొదవఁగ నుండం గనుఁగొని, హృదయం బలరఁగ మునీంద్రుఁ డి ట్లని పలికెన్.

167


క.

దశరథ నీకుం బ్రజలకుఁ, గుశలమె సుతబంధురాష్ట్రకోశంబులకుం
గుశలమె వసిష్ఠ నీకుం, గుశలమె మునులార మీకుఁ గుశలమె యనినన్.

168


క.

అందఱుఁ గుశలము లన న, య్యందఱఁ దోడుకొని వచ్చి యర్హాసను లై
యందఱు గృహమున నుండఁగ, నందఱఁ బూజించె నృపతి యనురాగమునన్.

169


వ.

అప్పుడు దీప్తాగ్నియుంబోలెఁ దేజరిల్లెడు విశ్వామిత్రు నవలోకించి.

170


సీ.

అమృతంబు సంప్రాప్త మైనచందంబున, మరుభూమి నురువృష్టి గురిసినట్లు
[34]నిఱుపేద కర్థంబు నెఱయఁ గల్గిన భంగి, నంబురాశికిఁ బర్వ మైనకరణి
ననురూపసాధ్వియం దనపత్యునకుఁ బుత్ర, జనన మబ్బినమాడ్కి మునివరేణ్య
నీశుభాగమనంబు నేఁడు నా కిటఁ గల్గెఁ, గాన ధన్యుఁడ నైతిని గంటిఁ గీర్తి
యెల్లపుణ్యభోగములు నా కెదురువచ్చె, శుభచరిత్రుండ వతితపశ్శుద్ధమతివి
పరమపాత్రుఁడ వగునీకు భక్తితోడ, నేమి యడిగిన నిచ్చెద నెలమి వేఁడు.

171


క.

అనవుడు వసిష్ఠశిష్యుఁడ, వనఘుఁడ వతిసత్యధనుఁడ వర్కాన్వయసం
జనితుఁడవుఁ గాన యిటకుం జనుదెంచితి నాదుకోర్కి సమకూర్పు తగన్.

172


చ.

ఇరువురు రక్కసుల్ సవన మెప్పుడు నే దొరఁకొంటి నంతలోఁ
బరిగొని వచ్చి వేదికలపై రుధిరంబులు సల్లి మాంసము
ల్నెరపుచు యజ్ఞవిఘ్న మవలీల నొనర్తురు సారెసారెకుం
గెరలి శపింప వారిఁ బరికించి తపోవ్యయ మోర్వలేమిచేన్.

173


[35]దశరాత్రసవనమునకుం గుశలత సేయంగ వలయుఁ గుటిలనిశాటుల్
భృశగతిఁ జెఱుపక యుండను, దశరథ నీసుతుఁడు వారి దక్షతఁ దునుమన్.

174


క.

కావున నప్పాపాత్ముల, వేవేగ వధించి లోకవినతులు పొందన్
నీవరపుత్రుని రాముని, భూవర ప్రియమార నాకుఁ క బుత్తెమ్ము తగన్.

175


ఉ.

బాలుఁ డశక్తుఁ డీతఁ డనుభావము మాను మితండు సర్వది
క్పాలకపాలనక్షమనృపాలుఁడు [36]నానతవిద్విషత్క్షమా

పాలుఁడు లోకపాలుఁడుఁ గృపాళుఁడు సజ్జనపాలుఁ డన్యభూ
పాలుర యజ్ఞపాలనకుఁ [37]బాడిగ నే నిటు కోరి వత్తునే.

176


చ.

అలఁతిగఁ జూడ కీతనిమహత్త్వ మెఱుంగు వసిష్ఠుఁ డీమహా
బలుఁడు మదీయయాగపరిపాలనదక్షుఁడు దుష్టరాక్షసా
వలియెడ నిర్భయుండు మది వందకు నీసుతు వజ్రవర్మ మై
యలవడఁ గాచి తెచ్చెద సమగ్రతరం బగు మేలు నిచ్చెదన్.

177


వ.

అని యట్లు విశ్వామిత్రుండు పలికిన.

178


క.

కువలయపతి కపుడు తనూ, భవుఁ బుత్తె మ్మనమునీంద్రభాషణము ఘన
శ్రవణవిదారణదారుణ, రవ మై వినిపింప మూర్ఛ [38]గ్రక్కున ముంపన్.

179


వ.

సింహాసనచలితుం డగుచు దశరథుం డల్లన తెలిసి.

180


క.

ఉల్లము జ ల్లన నెంతయుఁ, దల్లడ మందుచు విషాకతప్తుం డగుచుం
బెల్లుగ భయమును బ్రేమయు, మల్లడిగొన మౌనిఁ జూచి మనుజేశుఁ డనున్.

181


క.

బాలుఁ డకృతాస్త్రుఁ డబలుం, డాలంబులతెఱఁగు లెఱుఁగఁ డరులు జయింపం
జాలునె నిశాటవికటా, భీలాకారములు చూచి బెగ్గిల కున్నే.

182


క.

పరనిజశక్తు లెఱుంగఁడు, గురుతరశస్త్రప్రయోగకుశలుఁడు గాఁ డు
ద్ధురరిపుసాధనహతులకుఁ దెరలఁగ సైరింపఁగలఁడె దృఢదేహుం డై.

183


క.

అఱువదివేలబ్దంబులు, నెఱయఁగ మని సుతులఁ గనని నెవ్వగచేతన్
మఱుఁగుచు జర మేనం గ్రి, క్కిఱియఁగఁ దఱి దప్పి సుతుల [39]ని ట్లేఁ గంటిన్.

184


వ.

ఆసుతులలోన.

185


క.

రాముం డగ్రతనూజుఁడు, రాముఁడు కులవర్ధనుండు రాముఁడు ప్రియుఁ డే
రామునిఁ బుత్తేఁ జాలను, రాముని నేఁ బాసి క్షణము బ్రదుకఁగ నోపన్.

186


క.

పదియేనేఁడులబాలుని, సదమలగుణుఁ గాకపక్షసంయుతు ని ట్లే
నదయతఁ బుత్తేఁ జాలను, సదయుఁడ వగు రామువలన సంయమివర్యా.

187


క.

అక్షౌహిణిసామంతుల, నీక్షణమునఁ గొనుచు వేగ మే వచ్చెద నా
రాక్షసుల కెదిరి నీమఖ, రక్ష యొనర్చెదను ధరను బ్రదికినదాఁకన్.

188


వ.

అట్లు గా కున్న.

189


క.

నానందను నొక్కనిఁ జను, నా నామది సొరదు గాని నందనుతోడన్
నానాసేనలతో నట, కే నేతెంచెదఁ గడంక నేఁగు మునీంద్రా.

190


వ.

అని పలికి.

191


శా.

ఆరాత్రించరు లెవ్వ రెవ్వఁడు మఖాపాయంబుఁ బొందింపఁగా
వారిం బంచినవాఁడు వారలబలవ్యాపార మేచంద మా
క్రూరాఘాన్వితవృత్తు లెవ్వనిసుతుల్ ఘోరాజిలో వారి నా

కేరూపంబున నోర్వ శక్యము మనం బింపారఁ జెప్పుం డనన్.

192


క.

వారలు రావణుపంచిన, వారలు మఖహర్త లగుచు వర్తింతు రిలన్
మారీచసుబాహులు వా, రారయ సుందోపసుందు లనువారిసుతుల్.

193


వ.

అని పలుక నతిభీతుం డగుచు దశరథుం డంతర్గతంబున.

194


క.

అక్కట నాశిశు వెక్కడ, రక్కసు లెక్కడ మహోగ్రకరణ మెక్కడ నా
రక్కసుల గెలుచు టెక్కడ, నిక్కార్యము లేల పొసఁగు నిట్టివి గలవే.

195


వ.

అని వితర్కించి.

196


ఉ.

రావణచోదితప్రబలరాక్షసు లీక్షణభీషణాకృతుల్
దేవగణోగ్రయుద్ధములఁ దేఱినవీరు లుదగ్రు లైనమా
యావులు గామరూపులు భయంకరకోపులు లోకభైరవా
రావు లుదగ్రవిగ్రహకరద్విషదాశ్రమవిక్రమక్రముల్.

197


క.

ఆరావణచోదితు లగు, మారీచసుబాహు లుగ్రమనుజాహారుల్
వారల మనుజులు మార్కొను, వారా దేవేంద్రుఁ డాజి వారికి వెఱచున్.

198


క.

ఏ మున్ను వెఱతు నట రా, రాముఁడు శిశు వంతకంటె రామును వెఱచున్
మామీఁదఁ గరుణసేయు సు, ధీమయ మద్గురుఁడ విష్టదేవత వరయన్.

199


చ.

అనవుడు నగ్నిలోన ఘృత మాహుతి వోసిసమాడ్కి మండి నె
క్కొనుపెనుఁగిన్కతోఁ బలికెఁ గోరిక లిచ్చెద నంచు నిచ్చతోఁ
జన మును వల్కి బొంకెదు మృషావచనున్ నినుఁ జూడఁ గాదు పెం
పొనరఁగ నీవు నీహితులు నున్నతి నుండుఁడు పోయి వచ్చెదన్.

200


క.

అని కౌశికుఁ డలుగఁగ మే, దిని గంపించెను సమస్తదేవతలు భయం
బునఁ బొంది రపుడు లోకము, మునుకొని బెగడుట వసిష్ఠముని గని నృపుతోన్.

201


ఉ.

ప్రాకటధర్మమూర్తి వతిబంధురసత్యయశోధనుండి వి
క్ష్వాకుకులప్రసూతుఁడవు సమ్మతి నిచ్చెద నంచుఁ బల్కి నీ
చాకృతి నీకు బొంకు టది యర్హమె బొంకిన సర్వధర్మముల్
వే కడతేఱి పోవె యురువిశ్రుతకీర్తియు మాసిపోవదే.

202


సీ.

ధరణీశ దక్షునికతనయలు జయయు సు, ప్రభయు నాఁగ భృశాశ్వకపత్నులందు
జయ కామరూపులు సత్వసంపన్నులు, నసమాస్త్రరూపులు నైనసుతులఁ
బరఁగ నేఁబండ్ర సుప్రభ శస్త్రరూపు లై, భాసిల్లుసుతుల నేఁబండ్రఁ గనిరి
దైత్యవధార్థమై తనర నాశస్త్రాస్త్ర, వితతి నీతఁడు రాజ్యవేళఁ బడసె
మఱియు నన్యశస్త్రాస్త్రముల్ మది సృజింప, నేర్చు నిర్జరాదులకంటె నిఖిలలోక
సకలశస్త్రాస్త్రజాలముల్ సాల నెఱుఁగు, నితఁ డెఱుంగనియస్త్రంబు లెందు లేవు.

203


చ.

అనలముచేత గుప్త మగు నయ్యమృతంబునుబోలె నీతపో
ధనపరిరక్షితుం డగుచుఁ దద్దయు నొప్పెడునీతనూభవుం

డని నకృతాస్త్రుఁ డైనను నిరాయుధుఁ డైన నిశాటకోటికిం
జెనకఁగ రాదు కౌశికుఁడు చెప్పఁగఁ గేవలసంయమీంద్రుఁడే.

204


చ.

అతులతపంబునందు బలమందు మతిన్ ఘనభూతి లోకవి
శ్రుతుఁ డితఁ డానిశాచరులఁ ద్రుంప సమర్థుఁడ యీమిషంబునన్
హితమతి నీతనూభవున కెంతయు మే లొనఁగూర్పఁగోరి నీ
సుతుఁ గొనిపోవ వచ్చె నిటు సూనృత మొప్పఁగ నింక నెమ్మదిన్.

205


క.

వేవేగ నీతనూజుని, భూవర కౌశికున కిచ్చి పుచ్చుము వేడ్కన్
నావుడు ముదితుం డగుచున్, భూవినుతుల రామలక్ష్మణులఁ జీరి తగన్.

206

రామలక్ష్మణులు విశ్వామిత్రువెంట నరుగుట

క.

పుణ్యాహవాచనంబులు, పుణ్యమునివసిష్ఠమంత్రిభూసురనానా
పుణ్యాశీర్వాదంబులు, పుణ్యోత్సవఘోషణములుఁ బొరిఁబొరిఁ జెలఁగన్.

207


క.

తనకులకాంతలుఁ దానును, గనుఁగొని దీవించి మస్తకఘ్రాణము లిం
పెనయఁగఁ జేయుచుఁ గౌశిక, ముని చేతికి నిచ్చె సుతుల మోదం బెసఁగన్.

208


తే.

అపుడు సుఖవాయువులు వీచె నమరు లోలిఁ, బుష్పవర్షము గురిసిరి భూరిదివ్య
శంఖదుందుభిస్వనములు చదలఁ జెలఁగె, ముదితులై రెల్లసురలు సన్మునులు జనులు.

209


మ.

అతులోత్సాహధురీణు లై పటుతరజ్యాంతర్ధనుఃపాణు లై
తతగోధాంచితభర్మనిర్మితభుజత్రాణాంగులీత్రాణు లై
యుతబాణోన్నతతూణు లై బిరుదకేయూరాఢ్యదోస్స్థూణు లై
ప్రతతస్ఫీతకృపాణు లై త్రిభువనత్రాణైకపారీణు లై.

210


వ.

ఆరాజన్యకుమారులు మణిగణాలంకారశోభితాకారు లై శివునివెనుకం జనువినా
యకకుమారులుంబోలె నవ్విశ్వామిత్రువెనుక సార్ధయోజనం బరిగి సరయువు
దక్షిణతీరంబు సేర నెలమి నచ్చటఁ గౌశికుండు రామచంద్రు నవలోకించి.

211


ఉ.

ఆఁకలి నీరువట్టు శ్రమ మంగవిపాటన మార్తితి జూర్తి నిం
జోఁకక యుండ విద్య లొగి సొంపుగ నీ కుపదేశ మిచ్చెదం
దేఁకువ నారిపూరమున దిగ్గన శుద్ధి యొనర్చి ర మ్మనన్
వీఁక రఘూద్వహుండును బవిత్రజలంబుల వార్చి వచ్చినన్.

212


క.

బలయు నతిబలయు ననువి, ద్యలు సన నుపదేశ మిచ్చి యమ్ముని యీవి
ద్యలు కమలాసనునితనూ, జలు మార్గము లేఁగుచోట జపియింతు రొగిన్.

213


క.

ఇవి జపియించిన రఘుసం, భవ సుప్తుఁడ వైన మఱి ప్రమత్తుఁడ వైనన్
భువి రాక్షసభయములు చెం, దవు దుర్దశ లెల్లఁ బాయుఁ దద్దయు నీకున్.

214


వ.

మఱియు నివ్విద్యలవిశేషంబులు.

215


క.

అమరఁ బఠించిన సౌభా, గ్యమున నెఱుక బుద్ధినిశ్చయంబున దాక్షి
ణ్యమున బలంబున భుజశౌ, ర్యమునఁ ద్రిలోకముల నీకుఁ బ్రతి లేకుండున్.

216

క.

అని పలుక సంతసిలి యా, ఘనవిద్యాకలితుఁ డగుచుఁ గౌసల్యానం
దనుఁడు శరత్కాలోదిత, దినకరుచందమున వెలిఁగెఁ దేజం బెసఁగన్.

217


వ.

అంత నమ్మునికి గురుశుశ్రూష లాచరించి తానును దమ్ముండును గౌశికుండును
దృణశయ్యల నిద్రించి యారాత్రి వేగిన.

218


క.

తనసుతులఁబోలె నుపలా, లనముల మేల్కొలుప రామలక్ష్మణులు రయం
బున మేల్కని యాహ్నికవిధు, లొనరిచి మునిపతికి మ్రొక్కి యుత్సవ మెనఁగన్.

219

అంగదేశవృత్తాంతమును రామలక్ష్మణులకు విశ్వామిత్రుఁడు చెప్పుట

వ.

గమనోద్యుక్తు లై చని ముంగట జాహ్నవిఁ గనుంగొని యచట సరయూసంగ
మంబున ననేకదివ్యసహస్రవర్షంబు లత్యుగ్రతపంబు లాచరించిన పుణ్యతపోవ
నాలయంబు నొక్కటిఁ గనుంగొని కౌశికుం జూచి యిప్పుణ్యాశ్రమం బెవ్వరియా
శ్రమం బి దెవ్వరు తపంబు సేసిరి మా కెఱుంగ నానతిం డనుడు దరహసితము
ఖుండై కౌశికుండు రాఘవులతో నిట్లనియె మున్నిచ్చటఁ గందర్పుండు మూర్తి
మంతుఁడై కాముం డనఁ బరఁగె నిది కామాశ్రమం బీయాశ్రమంబున.

220


క.

హరుఁడు దప మాచరింపఁగ, హరుతప ముడిగించి మించి యద్రితనూజన్
హరునకుఁ బెండిలి చేసెద, వెరవుగ సురహితముఁ జేసి వెలసెద ననుచున్.

221


క.

దర్పకుఁ డెంతయు భుజబల, దర్పంబున హరుఁ గలంపఁ దలకొని చేరన్
దర్పకుని నుగ్రదృష్టిని, దర్ప మడంపంగ హరుఁ డుదగ్రతఁ జూడన్.

222


క.

అంగములు దొలఁగి కాముఁ డ, నంగుఁ డనం బరఁగె నతనియంగంబులు భూ
రంగమున నెరయఁ బడఁ ద, త్సంగతి నాదేశ మంగసంజ్ఞన్ వెలసెన్.

223


వ.

ఇప్పుణ్యాశ్రమంబున మదీయశిష్యు లయినతపోధను లున్నవా రిక్కడ నివాస
యోగ్యం బగు నీయుభయనదీమధ్యంబు పుణ్యదేశం బిచ్చటఁ బూతస్నాతుల మై
జపహోమాదు లైనయాహ్నికకృత్యంబు లాచరించి యీరాత్రి యిచ్చట
వసియించి యెల్లి యిమ్మహావాహిని దాఁటి [40]పోద మన నంత నక్కడి మును లే
తెంచి నమస్కారపూర్వకంబుగా విశ్వామిత్రున కర్ఘ్యపాద్యప్రముఖాతిథిసత్కా
రంబు లాచరించి పదంపడి రామలక్ష్మణుల నుచితక్రమంబుల సన్మానించి [41]నిజమం
దిరములకుం గొనిపోవ విహితసాయంకాలానుష్ఠానంబు లాచరించి యారాత్రి
పుచ్చి మఱునాఁ డమ్మునులు గొలిచివచ్చి నావ పెట్టించి యింక విచ్చేయుం డన
నగుం గాక యని యమ్మునుల వీడ్కొని నావ యెక్కి యమ్మువ్వురు నెలమి.

224


తే.

నావ నానది దాఁటుచో నడుమ రామ
లక్ష్మణులు మునిఁ జూచి యుల్లాస మొదవ
భంగసంఘాతభంగురాంభఃప్రభూత
తుములఘోషంబు లధికాద్భుకతముగఁ బర్వి.

వ.

వీ తెంచుచున్న వివి యెందులఘనధ్వను లన నమ్ముని యక్కుమారులతో నిట్లనియె.

226


చ.

చను రజతాద్రిమీఁద నొకచారుసరోవర మజ్జగర్భుచే
మనమున నిర్మితం బగుట మానసనామము నొంది రూఢిగా
ననువుగఁ దత్సరఃప్రసృతయై సరయూనది యయ్యయోధ్యచు
ట్టును బ్రసరించి జాహ్నవి గడున్ వడిఁ గూడఁగ నేఁగుదెంచినన్.

227


క.

గంగాసరయూసంగమ, భంగము లొండొంటిఁ దాఁకి ప్రభవించినయు
త్తుఁగధ్వను లివి యని ముని, పుంగవుఁ డెఱుఁగంగఁ జెప్పి భూవరసుతులన్.

228


క.

కనుఁగొని మ్రొక్కుఁడు వినయం, బున ననవుడు భక్తితోడ మ్రొక్కుచు నావా
హిని దాఁటి దక్షిణతట,మ్మున నిల్చి రఘూద్వహుండు మునిపతితోడన్.

229


సీ

కకుభాశ్వకర్ణతిందుకబిల్వఖదిరమ, ధూకపాటలసాలదుర్గమంబు
కంకఝిల్లీబకక్రౌంచఘూకానేక, కాకులస్వనకలకలంబు
సూకరహర్యక్షశుండాలశార్దూల, శరభాదిమృగకులసంకులంబు
నాయతబహుతరచ్ఛాయానిరస్తస, మస్తతీవ్రాంశుగభస్తిచయము
నంధకారీకృతాశాంతరాంతరంబు, దుర్నిరీక్ష్యంబు జనలోక[42]దురవగాహ
మఖిలవనమృగగణశరణ్యంబు [43]నీయ, రణ్య మారయ నెవరియరణ్య మనిన.

230


వ.

మునిపతి రఘుపతితో నిట్లనియె.

231


సీ.

అమరనాయకుఁడు వృత్రాసురు వధియించి, యధికపాపబ్రహ్మహత్యఁ బొంద
సురలు మునీంద్రులు సరభసనంబున వచ్చి, సుత్రాముగాత్రంబు శుద్ధిఁ బొందఁ
గమనీయపావనకలశోదకంబులఁ, గడుగుచు నెమ్మేనఁ గలయ నున్న
మలకరూశంబులు లలిఁ బుచ్చి యిలమీఁద, వైవంగ నప్పుడు వాసవుండు
విపులనిర్మలతరదేహవినుతశుద్ధిఁ, బొంది యెంతయు విలసిల్లి భూమి నాదు
మలకరూశంబు లివి రెండు మహిమతోడఁ, బూనెఁ గావున నింక నీభూమియందు.

232


క.

మలకలిత మైన దేశము, మలదంబుఁ గరూశయుక్త మహి గలదేశం
బలవడఁ గరూశనామము, నిలఁ గా ని మ్మనుచు సంజ్ఞ లింద్రుఁడు సేసెన్.

233


వ.

అది యాదిగా మలదకరూశదేశంబులు రెండును ధనధాన్యసంపన్నంబులై చె
న్నొందుచుండఁ గొంతకాలంబునకు.

234


క.

తాటక యనియెడునొక్కని, శాటి సహస్రగజబలసమన్విత యయి యు
గ్రాటవిఁ జరించు సుందుని,జోటి యది తదీయసుతుఁడు శూరుం డెపుడున్.

235


క.

అలఘుఁడు మారీచుం డా, మలదకరూశములు రెండు మానక నాశం
బులు సేయుచుండుఁ దాటక, చలమున మార్గములు గట్టి జనులం జంపున్.

236


వ.

అప్పాపాత్ములనిమిత్తంబున నిప్పురంబులు నిర్జనంబు లై యుండుట మార్గం బిట్లు
దుర్గమారణ్యం బై యుండు నిచటికి నర్థయోజనమాత్రంబునం దాటక యు

న్నది యచ్చటికి మన మరిగి యప్పాపాత్మురాలి నాపంపునఁ దునిమి యద్దేశం
బులు నిష్కంటకంబులు సేయుము నీకుఁ దక్క నన్యులకు నాతాటక యున్నదే
శంబు గమింప నశక్యంబు.

237


క.

అన విని విశ్వామిత్రుం, గనుఁగొని యారాముఁ డనియెఁ గామిను లబలల్
గనుఁగొన నీయక్షికిఁ బెం, పెనయ సహస్రగజసత్త్వ మేక్రియఁ గలిగెన్.

238


చ.

అనుడు సుకేతునాముఁ డగుయక్షుం డొకం డనపత్యుఁ డై చిరం
తనతప మాచరించి తగ ధాతవరంబునఁ గూఁతు నొక్కతం
దనర సహస్రనాగబలఁ దాటకఁ గాంచి వివాహవేళయం
దు నలువు నొందుజంభునిసుతుం డగుసుందున కిచ్చెఁ బత్నిఁగన్.

239


క.

సుందుఁడుఁ దాటకయం దొక, నందన మారీచుఁ గాంచి నాశము నొందన్
నందనుఁడుఁ దాను నాఁకటఁ, గంది యగస్త్యముని మ్రింగఁ గదియఁగ వారిన్.

240


క.

కనుఁగొని కనలి యగస్త్యుఁడు, ఘనరాక్షసమూర్తు లీరు గం డని శపియిం
చిన రక్కసులై యిక్కా, ననమునఁ జరియింతు రెపుడు నరవరముఖ్యా.

241


క.

రణశూరత నీదుశ్చా, రిణిని దునుము పాపమతిని స్త్రీ నైనను ని
ర్ఘృణతం జంపఁగ నగు బ్రా, హ్మణచాతుర్వర్ణ్యరక్షణార్థము గాఁగన్.

242


క.

జగదపకారిణి యగునా, భృగుపత్నిం దునిమె శౌరి పృథ్వి హరింపం
దెగినవిరోచనసుత యగు, మగువఁ బురందరుఁడు దునిమె మఱియు ననేకుల్.

243


క.

జనహంత్రు లయిన కాంతలఁ, దునుమాడిరి భూమిపతులు దుర్జనతాభం
జనమున నగునది దోష, మ్మనక ప్రజారక్షచేత యది ధర్మ మగున్.

244


చ.

అన విని కౌశీకోక్తులకు నారఘురాముఁడు సంతసించి మ
జ్జనకునియట్ల నీవు మునిసత్తమ నా కటు గాన నెమ్మి
జనపతిపన్పు నీపనుపు సమ్మతిఁ జేసెద దుష్టతాటకా
హననముఁ జేసి భూసురగవామరలోకహితంబు సేసెదన్.

245

శ్రీరాముఁడు తాటకను సంహరించుట

వ.

అని పలికి.

246


ఉ.

అంతఁ గడంక రాముఁడు [44]సమగ్రభుజాబలవిక్రమోత్సవం
బెంతయుఁ బర్వ మౌర్వి మొరయించె దిగంతరదంతికర్ణరం
ధ్రాంతరసాగరాంతరధరాభ్రతలాంతరచక్రవాళశై
లాంతరసర్వభూధరగుహాకుహరాంతరపూరితంబుగన్.

247


క.

ఆతతచాపధ్వని విని, యాతంకముతో వనాటు లందఱుఁ బఱవన్
భీతియుఁ గోపముఁ బెనఁగొన, నాతాటక యన్నినాద మగుచక్కటికిన్.

248


చ.

ఉరుతరపాదఘట్టనల నుర్వి చలింపఁగ మేనిగాలి ను

ద్ధురతరరేణువుల్ నెఱయఁ [45]దూల శిలాతరువృష్టు లుద్ధతిం
గురియుచు బాడబజ్వలనఘోరత రక్తనిషిక్తవక్త్రగ
హ్వర మెసఁగన్ దిశల్ వగుల నార్చుచు నుగ్రత నేఁగు దేరఁగన్.

249


క.

పాటితదుష్టసత్త్వ[46]వనవాటక నిద్ధబలావరుద్ధశృం
గాటక గ్రంథిలభ్రుకుటిగాఢలలాటకఁ గ్రూరతారకా
నాటక నాంత్రకాంచిపరిణద్ధశవప్రపతత్క్రిమిచ్ఛటా
కీటక రక్తసిక్తపటుఖేటకఁ దాటకఁ గాంచి రయ్యెడన్.

250


వ.

ఇట్లు గాంచి రఘుపుంగవుం డనుజునితో నిట్లనియె.

251


చ.

కనుఁగొను దీని ఘోరఘనకాయము లక్ష్మణ యీనిశాటిఁ జూ
చిన జను లాత్మలన్ బెగడి చేష్టలు దక్కరె యైన నాయెడం
గనికర మయ్యెడున్ మగువ గావునఁ జంపఁగఁ జాల దీని ము
క్కును ఘనకర్ణముల్ దునిమి క్రొవ్వఱఁ జేసెద నాఁగ నంతలోన్.

252


జవమున నానిశాచరి భుజంబులు సాఁచుచుఁ గిన్క రామభూ
ధవుపయి నేఁగుదేరఁ గడుఁదట్టస హుంకృతితోడ సంయమి
ప్రవరుఁడు భూరివాక్యముల భర్జనసేయుచు నాత్మలోన రా
ఘవులకు సేమమున్ జయము గావుత మంచును గోరుచుండఁగన్.

253


సీ.

ఆరాఘవులమీఁద నానిశాచరి రజో, మేఘంబు గావించి మించి రజము
గురియుచు నూయ గైకొని ముహూర్తము దాఁకఁ, గడుమోహపఱుప రాఘవుఁడు గడఁగి
మాయాస్త్ర మేసి యమ్మాయ నివారింప, నది శిలావృష్టి పై నడరి కురియ
నలిగి సాయకవృష్టి నాశిలావృష్టిరూ, పడిఁగించి యారాముఁ డానిశాటి
కరము లురుశరములఁ ద్రుంప గరము డస్సి, చేరి తన సమీపమున గర్జిల్లుచుండఁ
గనలి సౌమిత్రి యయ్యక్షికర్ణయుగము, నగ్రనాసయుఁ దెగనేసె నంత యక్షి.

254


వ.

మఱియుఁ గామరూపంబులు గైకొని యనేకమాయలు పరఁగించుచు నంతర్ధాన
గత యై యారాఘవుల ననేకాస్త్రవర్షంబుల ముంపఁ గౌశికుండు రామచంద్రుం
జూచి దయ చాలు నింక ముందట సంధ్యాకాలం బగుచున్నది యింక మాయలం
బ్రవర్తింపఁగలదు యజ్ఞవిఘ్నకారిణియు మాయావినియుఁ బాపచారిణియు
నగునీయక్షి వినుము.

255


క.

రఘువర సంధ్యావేళల, లఘులీలల యాతుధానులను గెలువఁగ రా
దఘరహిత దీని వేగమ, మఘవత్ప్రియ మెసఁగఁ దునుము మహిమ యెలర్పన్.


మ.

అని పల్కన్ రఘునాయకుం డధికబాణాసారఘోరంబుగాఁ
గనదుగ్రాశనికైవడిం దనపయిన్ గర్జిల్లుచుం బాఱుదేఁ
గని యత్తాటకపెన్నురం బురవడిం గాడంగఁ గ్రూరాస్త్ర మే

సిన నారక్కసి నేలఁ గూలి పడిఁ జచ్చెన్ భీమగాత్రంబుతోన్.

257


క.

ఘోరతరాకారముతో, ధారుణిఁ బడి యీల్గి యున్న తాటకఁ గని బృం
దారకయుతుఁ డై యింద్రుం డారాముని వినుతి చేసి యర్చించి తగన్.

258


క.

ఘనుఁ డగువిశ్వామిత్రుం, గనుఁ గొని [47]మన కిష్ట మైన కార్యము సేసెన్
జననీ రాముఁడు సంతస, మునఁ బొందితి మేము నీవు మునివర యింకన్.

259

విశ్వామిత్రుండు రామచంద్రునకు నానాస్త్ర్రశస్త్రాదు లిచ్చుట

క.

నీకుఁ గలయస్త్రశస్త్రము, లీకాకుత్స్థునకు నెమ్మి ని మ్మని దివిష
ల్లోకుఁడు నిజలోకమునకు, నాకౌశికుఁ బూజ చేసి యరిగెం బిదపన్.

260


శా.

సంధ్యాకాలము చేరఁగా నపుడు విశ్వామిత్రుఁ డాశ్చర్యసం
బంధ్యారూఢజయాఢ్యుఁ డైనరఘుభూపాలాగ్రణిన్ మానసా
వంధ్యప్రీతి శిరంబు మూరుకొని భాస్వద్వంశ యీరాత్రి నీ
వింధ్యారణ్యమునందు వర్తిలి తగన్ వెల్వెల్లగా వేగినన్.

261


వ.

మదీయాశ్రమంబునకుఁ [48]బోవుద మనిన రామలక్ష్మణులు సంతసించి ముక్తనిశా
టం బగునవ్వనంబున నారాత్రి వసియించి యంతం బ్రభాతం బైన రాజపుత్రుల
మేల్కొలిపి విహితానుష్ఠానంబు లాచరించి సస్మితముఖుం డై విశ్వామిత్రుండు
రామచంద్రుం జూచి నీవలన నెల్లదేవతలును దేవేంద్రుండును ఋషులును సం
తోషించిరి నీపరాక్రమం బొప్పు నీకు సురాసురగంధర్వయక్షరాక్షసగరు
డోరగాదులను మఱియు నానాశత్రురాజులం దృణలీల గెలువంజాలు దివ్యా
స్త్రశస్త్రంబు లిచ్చెద ననుచు దండచక్రంబును ధర్మచక్రంబును గాలచక్రంబు
ను విష్ణుచక్రంబును నైంద్రాస్త్రంబును వజ్రాస్త్రంబును శైవం బగుశూలంబు
ను బ్రహ్మశిరోస్త్రంబును నిషీకంబును బ్రహ్మాస్త్రంబును మోదకియు శిఖరిణియు
నను రెండుగదలును ధర్మపాశంబును గాలపాశంబును వరుణపాశంబును వారు
ణాస్త్రంబును శుష్కార్ద్రం బగునశనిద్వయంబును బినాకాస్త్రంబును నారాయ
ణాస్త్రంబును నాగ్నేయాస్త్రంబును శిఖరాస్త్రంబును వాయవ్యాస్త్రంబును బ్ర
థనాస్త్రంబును హయశిరోస్త్రంబును గ్రౌంచాస్త్రంబును శక్తియుగంబును గం
కాలంబును ముసలంబును గాపాలంబును గింకిణియు విద్యాధరాస్త్రంబును నంద
కాస్త్రంబును నసిరత్నంబును గాంధర్వాస్త్రంబును మోహనాస్త్రంబును బ్ర
స్వాపనప్రశమనంబులును ధర్షణశోషణసంతాపనవిలాపనమదనకాందర్పపైశా
చమోహనతామసంబులును సౌమనస్యంబును సంవర్తనంబును మౌసలంబును
సత్యా స్త్రంబును మాయాధరంబును సర్వమాయాదమనంబును దేజఃప్రభంబు
ను దేజోపకర్షణంబును సౌమ్యాస్త్రంబును ద్వాష్ట్రంబును సుదామనంబును గ
భస్త్యస్త్రంబును శీతేషువును మానవాస్త్రంబును గంకణంబును నను కామరూ

పంబులు నధికబలంబులు నైనయీయస్త్రంబులు శస్త్రంబులు నాదిగాఁ గల
ముఖ్యసాధనంబులు పరిగ్రహింపు మనుచుఁ బ్రాఙ్ముఖుం డై శుచియై మునివరుం
డు సంప్రీతితో దేవదానవులకు దుర్లభంబు లైనదివ్యాస్త్రంబులు రామునకు
నొసంగ నవ్విశ్వామిత్రుం డిచ్చినయస్త్రశస్త్రంబులు రామచంద్రుం గొలిచి
ప్రాంజలు లగుచుఁ బ్రియవాక్యంబుల నేము నీకింకరులము మమ్ముం బరిగ్రహింపుము
నీమనోవృత్తి వర్తించెద మనిన రామచంద్రుండు సంతోషించి యవుంగాక యని
విశ్వామిత్రునకు నభివందనంబు సేసి యయ్యస్త్రశస్త్రంబులు పరిగ్రహించి గమ
నోద్యుక్తులై పోవుచు రాఘవుండు మునీంద్రా మీయనుగ్రహంబున సురలకు
దనుజులకు దుర్ధర్షంబు లైనయస్త్రశస్త్రంబులు గలిగె వీని నుపసంహరించు తె
ఱంగు లెఱుంగవలయు ననిన విశ్వామిత్రుండు శుచిభూతుం డై యుపసంహార
క్రమంబు లెఱింగించి సత్యవంతంబును సత్యకీర్తియు దృష్టియు రభసముం బ్రతి
హారతరంబును బరాఙ్ముఖంబు నవాఙ్ముఖంబును లక్ష్యాక్షివిషమంబును దృఢనా
భంబు ననునాభంబును దశాక్షంబును శతవక్త్రంబును దశశీర్షంబును శతోద
రంబును బద్మనాభంబును మహానాభంబును సునాభంబును దుందునాభంబును
జ్యోతియుఁ గృతంబును నైరాశ్యంబును విమలంబును యాగంధరంబును వినిద్రం
బును మత్తంబును బ్రశమనంబును సార్చిమాలియు ధృతిమాలియు వృత్తిమంతం
బును బితృసౌమనమ్ములును విధుతంబును సుకరంబు నుగరవీరకరటియును ధనధా
న్యంబులును గామరూపంబును గామరుజయు మోహనంబు నావరణంబు జృంభ
కంబు సర్వనాభంబు సంధానంబు వరణంబు నను భృశాశ్వతనయులం గామరూ
పంబులు గలయీయస్త్రంబులం బరిగ్రహింపు మందుఁ గొన్ని దివ్యభాస్వరదేహం
బులు మూ ర్తిమంతంబులు శుభప్రదంబులుఁ గొన్ని యంగారసదృశంబులుఁ గొ
న్ని ధూమసదృశంబులుఁ గొన్ని చంద్రార్కసదృశంబులు నని యమ్ముని యిచ్చుట
యు నవి కృతాంజలు లగుచు మునీంద్రశిష్యుం డైనరాఘవుం గనుంగొని రఘు
వరా నీ కేమి సేయుదు మనిన రాఘవుం డి ట్లనియె.

262


క.

ఎప్పుడు మిము నేఁ దలఁచెద, నప్పుడ యేతెంచి నాకు నభిమతసిద్ధుల్
చొప్పడఁ జేయుఁడు పొం డన, నప్పలుకుల కలరి మ్రొక్కి యరిగెన్ వేడ్కన్.

263


వ.

తదనంతరంబ రాఘవుండు పయనమై పోవుచుండి ముందట నొక్కఘనశైలంబును
దాని కనతిదూరంబున మేఘసంకాశం బగువృక్షమండంబును బొడగని కౌశికుం
జూచి యి ట్లనియె.

264

వామనునిచరిత్రము

క.

వృక్షలతాకుంజంబులఁ, బక్షులబహునిస్వనముల భద్రద్విపహ
ర్యక్షాదిమృగంబులచే, నీక్షింపఁగ నొప్పుచున్న యీవన మరియన్.

265


ఉ.

ఎవ్వరియాశ్రమం బిచటి కెక్కడ నెప్పుడు యజ్ఞవిఘ్నముల్

గ్రొవ్వునఁ జేయ రక్కసులు గ్రుమ్మరుచుండుదు రద్దురాత్ములన్
నివ్వటిలంగ నీక శితకనిష్ఠురబాణములన్ వధించెదన్
నెవ్వగ లెల్లఁ బాసి నను నిర్జరు లెంతయు సంస్తుతింపఁగన్.

266


వ.

అని పలికినం గౌశికుండు రామచంద్రుం గనుంగొని యిది వామనునిపూర్వాశ్ర
మంబు వినుము.

267


క.

ఈయాశ్రమమున విష్ణుఁడు, పాయక యుగశతము లైన బహువర్షము ల
త్యాయతతప మొనరించి త, పోయుక్తిం గామ్యసిద్ధిఁ బొందుచు నుండున్.

268


చ.

బలి యనుదైత్యనాయకుఁడు బాహుబలోద్ధతి సర్వదేవతా
బలముల నింద్రునిన్ గెలిచి ప్రాభవ మొప్పఁగఁ బట్టబద్ధుఁ డై
యలరి తదీయరాజ్యము సమస్తముఁ జేయుచుఁ బేర్మితోడ ది
క్కులఁ దనకీర్తి పెంపెసఁగఁ గోరిక యజ్ఞము సేయుచున్నెడన్.

269


క.

దనుజారిఁ గానఁ బోవుడు, మనయాపద లుడిపి ప్రోచు మసలక మధుసూ
దనుఁ డంచు నలువ మొదలుగ, ననిమిషు లీయాశ్రమమున కరుదెంచి తగన్.

270


చ.

కడుముద మార విష్ణుఁ బొడగాంచి జనార్దన భూరివైభవం
బడర విరోచనాత్మజుఁడు యజ్ఞము సేయుచు నెవ్వ రేమి త
న్నడిగిన వారి కెల్ల నఖిలాభిమతంబుల నిచ్చుచున్నవాఁ
డడఁకువ లేక యాఘనుని యజ్ఞసమాప్తికి మున్న వంచనన్.

271


క.

వామనరూపము గైకొని, మామే లొడఁగూర్చి దేవ మముఁ బ్రోవు కృపా
ధామ యని సురలు వేఁడఁగ, నామెయిఁ గశ్యపుఁడు దాను నదితియుఁ గోర్కిన్.

272


క.

చనుదెంచి యీశుభాశ్రమ, వనమున వ్రతనిష్ఠ దివ్యవర్షసహస్రం
బనుపమతర మైనతపం, బొనరించి తపంబు పూర్తి నొందఁగ భక్తిన్.

273


మ.

కలితశ్రీశుభవక్ష దేవవర నీరగాత్రంబునన్ ముజ్జగం
బులు [49]పెంపొందుచు నుండు శోభనమహామూర్తిం గనుంగొంటి నిం
పలరన్ నీశరణంబు గంటి వరదా యంచుం బ్రశంసించి ని
శ్చలమోదంబునఁ దాను బత్నియును జంచద్భక్తితో మ్రొక్కినన్.

274


క.

కరివరదుఁడు ప్రీతుం డై, కరుణం గశ్యపునిఁ జూచికకశ్యప నను నే
వర మడిగె దడుగు నీ కా, వర మిచ్చెద ననిన మ్రొక్కి వాంఛిత మారన్.

275


క.

అదితికి నాకు సుతుఁడ వై, యుదయించి నిలింపపతికి నున్నతవిభవం
బొదవఁగ ననుజన్ముఁడ వై, ముదమున నేలింపు లోకములు మీయన్నన్.

276


క.

సిద్ధాశ్రమ మిది యభిమత, సిద్ధుఁడ వై తెన్నఁడేని శ్రీవర నిన్నున్
బుద్ధిఁ దలంచినవారికి, సిద్ధముగా సర్వకార్యసిద్ధులు గలుగున్.

277

క.

కావున నదితియు నేనును, దేవహితముఁ గోరుచున్న త్రిజగద్ధితమున్
వేవేగ సిద్ధిఁ బొందఁగఁ గావింపుము దేవదేవ కారుణ్యనిధీ.

278


క.

అని ప్రార్థన సేసిన వా, మనుఁ డై యదితి కుదయించి మఖ వేళ విరో
చనసుతుఁ డగుబలిపాలికిఁ, జని పుడమిఁ బదత్రయంబు సమ్మతి వేఁడెన్.

279


చ.

క్రమమున నిట్లు వేఁడికొని గ్రక్కున భూతల మెల్ల నేకవి
క్రమమున నాక్రమించి బలిఁ గట్టి యుదగ్రత నాజ్ఞ పెట్టి సొం
పమర జగత్త్రయంబు వశ మై చన నింద్రున కేల నిచ్చి లో
కములఁ ద్రివిక్రముం డనఁ బ్రకాశయశంబులఁ బొందె రాఘవా.

280


క.

ఇది సిద్ధాశ్రమ మని ముని, విదితంబుగఁ జెప్పె నాఁడు విశ్రుతపుణ్యా
స్పద మగునీయాశ్రమమున, సదమలమతి నేను దపము సలుపుదు నెపుడున్.

281


క.

పాపాత్ము లైనరక్కసు లేపున వచ్చెదరు వారి హింసింపుము ర
మ్మీపుణ్యాశ్రమమునకును, వే పోవుద మనుచుఁ బలికి వేడుకతోడన్.

282


వ.

చనిచని యమ్మునీశ్వరుండు నీహారంబుఁ బాసి పునర్వసునక్షత్రసమేతుం డైన
చంద్రుండునుం బోలె నాయాశ్రమంబు ప్రవేశించునెడ నచ్చటిమునులు విశ్వామి
త్రుం బొడగని యుబ్బున గంతులు వైచుచు నెదు రేఁగుదెంచి యర్హక్రమంబునం
బూజించి యంత రామలక్ష్మణుల నతిథిసత్కారంబుల నాదరింప నచట ముహూ
ర్తమాత్రంబు విశ్రమించి రప్పుడు రామలక్ష్మణులు ప్రాంజలు లగుచుఁ గౌశికుం
గనుంగొని మునివరేణ్యా మీ రిప్పు డిచట.

283


క.

దీక్షవహింపుఁడు మీమఖ, రక్ష యొనర్చెదము దుష్టరాక్షసభటులన్
శిక్షించెద మన నమ్ముని, దీక్షితుఁ డై నియతి నుండె దృఢతరనిష్ఠన్.

284

రాముఁడు మారీచాదులచేఁ జెడకుండఁ గౌశికునియాగంబుఁ గాచుట

వ.

ఆరాత్రి రాఘవులు సమాహితులై యుండి మఱునాఁడు ప్రభాతంబున సంధ్యా
దికృత్యంబులు సలిపి యగ్నిహోత్రంబు లాచరించుచున్న విశ్వామిత్రునకు నమ
స్కరించి మునీంద్రా యేకాలంబున రాక్షసులు ప్రచరింతు రెందాఁక యజ్ఞ
రక్ష సేయువార మనవుడు నమ్మాటలకు సంతోషించి యాసిద్ధాశ్రమవాసు లై
నమును లారాఘవులం గొనియాడి కౌశికుండు దీక్ష వహించి మౌనంబున నున్న
వాఁడు మీ రిమ్మునీశ్వరుని నిది మొదలుగా నాఱుదినంబులు సావధానుల రై కా
చి యుండుం డనిన నగుం గాక యని.

285


క.

నేత్రము లెప్పుడు మొగువక, ధాత్రీశు లధిజ్యచాపధరు లై విశ్వా
మిత్రునియాగము షడహో, రాత్రము రక్షించి రతిధురంధరలీలన్.

286


వ.

అంత నాఱవదివసంబున రాముండు లక్ష్మణుం గనుంగొని శరశరాసనసన్నద్ధుల
మై యేమఱక యుండుద మని యిరువురును యుద్ధోన్ముఖు లై యుండ నవ్విశ్వా
మిత్రుండు నిఖిలమంత్రతంత్రంబులను విధ్యుక్తక్రమంబున నాచరింపఁ గుశసమి

త్ప్రసవస్రుక్స్రువచరువు లనలార్పితంబులు చేసిన మంట లాకసం బంట యజ్ఞవేది
ఋత్విగ్విశ్వామిత్రసహితంబుగాఁ బ్రజ్వలింప మింట నొక్కమహాఘోషంబు
ఘోషించె నాసమయంబున.

287


క.

మారీచసుబాహులు నా, నారాత్రించరులతోడ నభమున మాయా
నీరదములు పన్ని యసృ, గ్ధారలు వేదిపయిఁ గురిసి గర్జన లెసఁగన్.

288


క.

తనమీఁదఁ బాఱుదేరఁగ, జననాథుం డనుజుఁ జూచి సౌమిత్రి కనుం
గొను మీదుష్టనిశాటుల, ఘనమారుతబాణ మేసి కౌతుక మెసఁగన్.

289


వ.

తదీయవాతూలంబుచేత జీమూతజాతంబులుంబోలె విధూతులం జేసెద నను
చుం బలికి.

290


క.

ఆలోచన మారీచువి, శాలం బగువక్ష మేయ శతయోజనముల్
తూలముగతిఁ దచ్ఛరవా, తూలముచేఁ దూలి వాఁడు తోయధిఁ గూలెన్.

291


శా.

కీలాజాలము మింటఁ బె ల్లెగయ నాగ్నేయాస్త్ర ముగ్రద్విష
త్కాలాభీలముగా సుబాహుఘనవక్షం బేసి యారక్కసున్
నేలం గూలిచి యున్నరక్కసులపై నిస్సీమదోశ్శక్తి వా
తూలాస్త్రం బడరించి త్రుంచె నృపశార్దూలుండు దుర్వారుఁ డై.

292


ఆ.

అలుక నట్లు సకలకయాతుధానులఁ ద్రుంచి, విజయ మొంది దివిజవిభునికరణి
నఖిలమునులుఁ దన్ను నగ్గింప నొప్పారె, రాజవృషభుఁ డైన రామనృపుఁడు.

293


క.

అంత మునీంద్రుఁడు దనమఖ, మంతయు సంపూర్ణ మైన నారామునిఁ దా
సంతసమున ని ట్లను న, త్యంతప్రియ మొందితిం గృృతార్థుఁడ నైతిన్.

294


క.

పితృవాక్యము చెల్లించితి, క్రతురక్ష యొనర్చి తధ్వరప్రతిపక్ష
ప్రతతిఁ దునుమాడి సురముని, హితములు చేసితి సుకీర్తి నెసఁగితి వత్సా.

295


వ.

అనిన.

296


క.

మునివర మీకింకరులము, పను లేమిట మమ్ముఁ బంపు భవదాజ్ఞం జే
కొని కావించెద మనవుడు, మనమున నమ్ముని ప్రమోదకమగ్నుం డగుచున్.

297


క.

అనుపమపుణ్యచరిత్రుఁడు, జనకుఁడు గావించుమఖము సమ్మద మారం
గనుఁగొన నేనును నిమ్ముని, జనములుఁ బోయెదము వినుము జనవర యచటన్.

298


క.

వరగంధమాల్యదీపో, త్కరదూర్వార్చితము దేవదత్తంబును నై
సురరాక్షసగంధర్వా, సురవరదుర్ధరము నగుచు సురుచిరమహిమన్.

299


ఉ.

ఒక్క శరాసనంబు దగ నున్నది యెక్కుడు లావు చూడ్కికిన్
వెక్కస మైనరూపమును వ్రేఁకఁదనంబును గల్గి చేవమై
నెక్కిడ దివ్వ నెవ్వరికి నేగతి మానము గాక లీల నీ
[50]వక్కఠినోగ్రకార్ముకము నక్కడఁ జూడఁగ రమ్ము రాఘవా.

300

భూపతు లనేకు లాఘన, చాపములా వెఱుఁగ వేఁడి చనుదెంచి భుజా
టోపముల నెక్కుపెట్టఁగ, నోపక వే పోదు రరుదు నొందుచు మరలన్.

301


వ.

అని పలికి మునిగణసహితుండై రామలక్ష్మణులు తనవెంట నేతేర వనదేవతలార
యీసిద్ధాశ్రమంబునం దపస్సిద్ధుండ నైతి మీకు భద్రంబు గానిమ్ము పోయి వచ్చె
ద ననుచుం బలికి జాహ్నవియుత్తరతీరంబున హిమగిరిం గని ప్రదక్షిణపూర్వ
కంబుగా నమస్కరించి యుత్తరాభిముఖుం డై చన వెనుక సిద్ధాశ్రమవాసు లైన
మృగపక్షిజనంబులు చనుదేరం గడుదూరపథం బరిగి యస్తమయసమయంబున
శోణనదీకూలంబున సంధ్యాద్యనుష్టానంబులు సలిపి యొక్కనివాసంబు ప్రవేశిం
చి యాసీనులై యుండ విశ్వామిత్రు నచటిమునిజనులు పూజించి రప్పు డారామ
చంద్రుండు గౌశికుముందటఁ గూర్చుండి యోమునివరేణ్యా యీసమృద్ధవనశో
భితం బైనదేశం బెవ్వరిదేశం బెఱింగింపు మనిన విశ్వామిత్రుండు రామచంద్రున
కిట్లనియె.

302

కుశనాభుం డనురాజర్షి వృత్తాంతము

క.

కుశుఁ డన నొకమునిసుతుఁ డస, దృశమతి వైదర్భియందు ధీరులరక్షా
కుశలులు వసువుఁ గుశాంబుఁ, గుశనాభు నసూతరజునిఁ గోర్కిం గనియెన్.

303


క.

కని తనయులఁ గనుఁగొని నం, దనులార సధర్ము లగుచుఁ దనరఁ బ్రజాపా
లనపరు లై యుండుఁడు మీ, రనవుడు నాతండ్రిమాట కనుమతు లగుచున్.

304


వ.

కుశాంబుండు కౌశాంబీనగరంబును గుశనాభుండు మహదయాఖ్యపట్టణం
బు నసూతరజసుండు ధర్మారణ్యంబును వసువు గిరివ్రజం బనుపురంబును రచియిం
చిరి వసువుపేర నిబ్భూమి వసుంధర యనం బరఁగె నీశైలంబు లీభూమిచుట్టు
నుం బ్రకాశించుచుండు నీపంచశైలమధ్యంబున నొప్పెడుమాగధీనది మగధ
దేశంబుపైఁ బాఱుచుండుట నీభూమి మగధ యనంగ సుక్షేత్రయు సస్యమాలి
నియు నై విలసిల్లుచుండు నిది వసుదేశంబు వినుము.

305


క.

నరవర కుశనాభుం డనఁ, బరఁగెడు రాజర్షి గనియెఁ బ్రమదంబున న
చ్చర యగుఘృతాచివలన, న్సురుచిరరూపవతు లైన నూర్వురుసుతలన్.

306


క.

ఆరాజకన్య లభినవ, చారువిలాసంబు లారఁ జతురతరాలం
కారములు దాల్చి ఘనలీ, లారామము గాంచి చొచ్చి యనురాగమునన్.

307


ఉ.

జంగమవల్లులో యమృతరసాగరవీచులొ రత్నమూర్తులో
యంగజుమోహనాస్త్రములొ యంచితహేమశలాకలో మహీ
రంగనటత్తటిల్లతలొ రాజకశాసఖులో యనంగఁ ద
న్వంగులు వాద్యసంగతుల నాడుచుఁ బాడుచు నుండ నత్తఱిన్.

308


చ.

అనిలుఁడు వచ్చి వారిరుచిరాకృతు లచ్చెరువారఁ గాంక్షతోఁ
గనుఁగొని మాన మేది తమకం బొదవన్ నృపకన్యలార నా

కనుమతి నిష్టభార్య లగుఁ డందఱు నిప్పుడు మీ కనూనయౌ
వనము సదామరత్వ మనవద్యచిరాయువుఁ గల్గి యుండెడిన్.

309


చ.

అన విని వారు నవ్వి సకలాత్మలయందుఁ జరించు దేవతా
తనుఁడవు నీ వెఱుంగనియుదంచితధర్మము లెందుఁ గల్గునే
యనుచితభంగి నీకు నిటు లాడఁగఁ గూడునె తండ్రి మీఱి ని
న్నెనయ వరింప మాకుఁ దగునే కులశీలము దాఁటవచ్చునే.

310


క.

బ్రాఁతిగ నొడయఁడు దేవుఁడు, మాతండ్రియ మాకుఁ గాన మము నెవ్వరికిన్
మాతండ్రి యిచ్చుఁ బ్రియమున, నాతఁడు మారమణుఁ డంచు నందఱు పల్కన్.

311


క.

కనలి యనిలుఁ డావనితల, తనువులు భంజించి క్రూరతన్ గుజ్జులు చే
సిన నిండ్ల కేఁగి లజ్జా, వనతముఖాబ్జముల బాష్పవారి దొరంగన్.

312


క.

వనటం బొందెడితనయలఁ, గనుఁగొని కుశనాభుఁ డాత్మఁ గలఁగుచు నానం
దనలార యకట మీ కే, చినకుబ్జత లెట్లు గలిగెఁ జెపుఁడా నాకున్.

313


వ.

అనుచుఁ జింతాక్రాంతుం డై యున్న తండ్రికిఁ బ్రణమిల్లి వాయుదేవునివలనం
దమకు నైనపరిభవ క్రమం బెఱింగించిన నాకుశనాభుం డాకన్యలతో ని ట్లనియె.

314


ఉ.

నాసుతలార మీకతన నాకుల మున్నతిఁ బొందె నేఁడు నా
చేసినపుణ్య మొప్పె మదిఁ జింత తొలంగె ముదంబు నొందితిన్
మీసుగుణంబులున్ ధృతులు మిక్కిలి యొప్పును దేవకార్యమై
యీసునఁ దెంపు సేయక సహించితి రీక్షమ యొప్పు నెంతయున్.

315


తే.

క్రమయ జనుల కాభరణము క్షమయ కీర్తి
క్షమయ ధర్మంబు క్షమయ సజ్జనగుణంబు
క్షమయ యజ్ఞంబు క్షమయ మోక్షంబు క్షమయ
సకలదానంబు క్షమయందె జగము నిలుచు.

316


వ.

కావున క్షమావతు లైనమీకు క్షమయం దన్యకన్యలు సమానలే యనుచు గా
రవించి వీడ్కొలిపి మంత్రులతో మంత్రాలోచనంబు సేసి దేశకాలపాత్రంబు లె
ఱింగి నాతనయలం దగినవరుని కీవలయు ననుచుం బలికి.

317


తే.

వినుతచరితుండు చూళియన్మునివరుండు, పరఁగ నూర్ధ్వరేతస్కుఁ డై బ్రాహ్మ్యమైన
తపము సలుపంగ నటకు గాంధర్వియైన, యూర్మిళాపుత్రి సోమద పేర్మి వచ్చి.

318


క.

వేమఱు పరిచర్యల మది, కామోదము సేసి యాతఁ డట వరదుఁడు గా
సోమద యమునివలనం, దా మానసపుత్రు బ్రహ్మదత్తునిఁ బడసెన్.

319


క.

ఘనుఁ డైన బ్రహ్మదత్తుఁడు, చనఁ గాంపిల్యపురి కరిగి జగతిన్ బుధు తా
నన నేలెం గావున నా, జనపతికి మదీయదుహితృశతకము నిత్తున్.

320


వ.

అని బ్రహ్మదత్తుని రావించి సంభావనతోడ.

321


చ.

అహిమరుచి ప్రతాపుఁ డగునాకుశనాభుఁడు బ్రహ్మదత్తుకై

దుహితృశతంబు నీ నతఁడు దూకొని వారిఁ గ్రమంబునం గర
గ్రహణము సేయ నావిభుకరం బటు మోపినయంతలోన న
మ్మహిళలు కుబ్జరూపములు మానఁగ నొప్పిరి చారుమూర్తులై.

322


వ.

[51]తనయలగుజ్జు మానుటకుఁ దండ్రి గనుంగొని సంతసించి యా
తనయలఁ గూర్మిఁ గౌఁగిట ముదంబునఁ జేరితి సన్నుతించి యా
జనపతి యల్లునిన్ సుతల సంతస మొందఁగ నాదరించి నే
ర్పులఁ బయనంబు సేయ నట పోయిరి వారును వేడ్క నయ్యెడన్.

323


క.

పుత్రప్రీతిం గమలజ, పుత్రుండు గుశుండు దనదుపుత్రునకుఁ దగం
బుత్రులు గలుగక యునికిని, బౌత్రునిఁ గలిగింపఁజేసెఁ బౌత్రక్రతువున్.

324


క.

చన నయ్యఙ్ఞయు వర్తిలఁ, దనయునిఁ గుశనాభుఁ జూచి తనయుఁడ నీకుం
దనయుండు గాధి గలిగెడు, ననుపమపుణ్యైకలోలుఁ డవ్విభుకతనన్.

325


క.

వినుతయశంబును బొందెద, వని పలికి కుశుండు వారిజాసనలోకం
బున కరుగఁ గొంతకాలము, సనఁ గుశనాభునకు గాధిజనపతి పుట్టెన్.

326


క.

ఘనుఁ డైనగాధి నాకున్, జనకుఁడు నా కగ్రభగిని సత్యవతి దపో
ధనుఁ డైనరుచికుసతి పతి, చన వెనుకన్ బొందితోన చనియెను దివికిన్.

327


వ.

అట్లు నాకంబున కేఁగి [52]పుణ్యవశంబున.

328


క.

సత్యమయమూర్తి యగునా, సత్యవతీదేవి తుహినశైలంబున సం
స్తుత్యగతిఁ బుట్టె లోకసు, కృత్యున్నతికొఱకుఁ గౌశికికీనది యనఁగన్.

329


క.

అనిశము భగినీస్నేహం, బున నీనదిపొంతఁ దపముఁ బూని చరింతున్
విను మిది సిద్ధాశ్రమ మిటఁ, దనరఁ దపస్సిద్ధుఁ డైతిఁ దగ నీకతనన్.

330


వ.

రఘువరా కుశికవనంబున నుదయించి యేను గౌశికుం డన నాయగ్రజ కౌశికి
యన విఖ్యాతిం బొందితిమి నీ వడిగిన దేశక్రమంబును మాకులాగతక్రమంబును
వినిపించితి నిపుడు.

331


క.

రక్షోయక్షవిహారస, మక్షంబు నిలీనమృగచయంబు నిమీల
త్పక్షికులాక్షము నిశ్చల, వృక్షమ్ము నిశాటభూతవిహృతిస్థలమున్.

332


వ.

అగుచు నివ్వనం బున్నయది మఱియును.

333


చ.

గగనము తారకాగ్రహవికాసవిభాసిత మై వెలింగెడున్
మొగిసిన చీఁకటిం జెఱిచి ముంగలిదిక్కులు తెల్లఁజేయుచున్
జగముల కుత్సవం బొదవఁ జంద్రిక గాయుచు భాసమానుఁ డై
నెగడెడు నింగిఁ జందురుఁడు నిద్దురవోయెడి నెల్లజీవులున్.

334


క.

విను మర్ధరాత్ర మయ్యెన్, జనవర నిద్రింపు మీవు సౌమిత్రియు నిం
కని పలికి యూరకుండెన్, మునివరుఁ డపు డఖిలమునులు మోదముతోడన్.

వ.

కౌశికుం బూజించి నీవంశం బతిపుణ్యప్రకాశంబు నీవంశసంభవరాజన్యులు నతి
పుణ్యధనులు నీ వందఱకంటె మహాతపోధనుండవు పుణ్యగణ్యుండవు నీయగ్రజయై
నకౌశికి లోకపావని నదీవరేణ్య యనుచుం బ్రశంసింప సంతుష్టహృదయుం డగుచు
విశ్వామిత్రుండు నిద్రించి యస్తమితభానుండునుంబోలె నొప్పె రామచంద్రుండును
లక్ష్మణుండును విస్మితు లగుచు గాధిపుత్రు నగ్గించుచు శయనించి రంత మఱునాఁ
డు విశ్వామిత్రుండు ప్రభాతసమయంబున మేలుకొని కదిసి యుచితోక్తుల మెల్లన.

336


క.

ప్రాతఃకాలము సనియెడు, బాఁతిగ సంధ్యాదివిధులు పరిపాటిగ నీ
వాతతమతిఁ జేయుము యా, త్రాతత్పరబుద్ధి వగుము ధరణీనాథా.

337


క.

అని తనుఁ గౌశికముని మే, ల్కనుపంగా లేచి ప్రథమకాలవిధులు దీ
ర్చి నృపతనూజులు సంయమి, జనములకున్ మ్రొక్కి వేగ సనుచో నడుమన్.

338


క.

రాముఁడు మేచకజలద, శ్యాముఁడు సుగుణప్రభావసంయమివినుతి
స్తోముఁడు గిరిజాధిపనుత, నాముఁడు వాక్రుచ్చెఁ గుశికనందనుతోడన్.

339


చ.

తరళతరంగరంగసముదగ్రము [53]విస్తృతవారిసైకత
స్ఫురితము నత్యగాధజలపూర్ణము దీర్ఘతరప్రవాహస
త్వరమును నైనయీనదిని దాఁటెడిరే వది యెద్ది యంచుఁ బెం
పరుదుగ దాఁటి దూరపథ మర్ధదినంబున కేఁగి ముందఱన్.

340


క.

సురుచిరసరిదురుకమలా, కరనిర్ఝరశిశిరసలిలకణగణయుతభా
సురతరసరసిజకువలయ, పరిమళపరిమిళితమలయపవనము లొలయన్.

341


వ.

అలరుచు మునిజనంబులతోడం జనుచు.

342


మ.స్ర.

ఘను లారాజన్యసూనుల్ గని రెదురఁ గృతాకాశగంగాపరిష్వం
గను రంగత్తుంగభంగం గలితజలవిహంగన్ సదాశంభుసంగన్
మునిగేహోపాంతరంగన్ మురహరపదసంభూతపూతాంబుసంగన్
జనతాంహోభంగచంగన్ సగరనృపసుతస్వర్గసోపానగంగన్.

343


క.

కని రాముఁడు సంతోషం, బున విశ్వామిత్రుఁ జూచి పుణ్యప్రద యై
తనరెడుగంగ జగత్పా, వనజననక్రమము వినఁగవలయున్ మాకున్.

344


క.

లోకజ్ఞ లోకహితముగ, లోకపవిత్ర యగునాకకలోకాపగ ము
ల్లోకములఁ బాఱి జలనిధి, నేకరణిం గలిసె మాకు నెఱిఁగింపు తగన్.

345


వ.

అనవుఁడుఁ గౌశికుం డి ట్లనియె.

346


క.

కనకాద్రితనూభవ యై, తనరుమనోరమకుఁ దుహినధరణీధరనా
థునకును గంగయు నుమయును, ననునిరువురుసుతల వేడ్క నజుఁడు సృజించెన్.

347


క.

హిమవంతుఁడు లోకహితా, ర్థము తనయగ్రసుత గంగఁ దగ నమరుల కీ
నమరపథంబున నాసతి, యమరులతోఁ గూడ జనియె నమరావతికిన్.

348

కుమారస్వామిజననము

క.

పరఁగ నుమాదేవి మహేశ్వరుఁగూర్చి మహోగ్రతపము సలుపఁగ హిమభూ
ధరపతి యయ్యుమ నఖలే, శ్వరుఁ డగునీశ్వరున కిచ్చె సమ్మద మారన్.

349


చ.

ఎనయ వివాహయుక్తుఁ డగు నీశ్వరుఁ డెంతయు వేడ్క నొక్కెడం
వనసతిఁ జూచి కామశరదర్పితుఁ డై తమకంబుఁ గాంక్షయుం
దనరఁగఁ బ్రేమతో నుమయుఁ దానును దివ్యసహస్రవర్షముల్
చన రతి సల్పఁగా సుతుఁడు జన్మము నొందక యుండ నయ్యెడన్.

350


క.

ఉమకు మహాదేవునకుం, బ్రమదంబునఁ గ్రీడ లొదవఁ బ్రభవించినభూ
తము నెవ్వఁడు సైరింపను, క్షముఁ డనుచుం గమలజాదిసర్వామరులున్.

351


సీ.

హరుపాలి కేతెంచి యానమ్రు లై దేవ, దేవ మహాదేవ దేవవంద్య
నీమహాతేజంబు నిఖిలలోకములును, భరియింపఁజాలవు భక్తవరద
నీదుతేజమునందు నీతేజమును దాల్చి, భూలోకజాలంబుఁ బ్రోవు దేవ
పార్వతితోఁగూడ బ్రహ్మచర్యతపంబు, సలుపంగ నేఁగుము చంద్రమౌళి
మమ్ముఁ గరుణ జూడు మామ్రొక్కు గైకొను, సకలలోకహితము సమకొనంగ
విన్నపంబు సేయుచున్నారు సుర లెల్ల, నవధరించి ప్రోవు మంబికేశ.

352


వ.

నావుడు సురలం గనుంగొని హరుం డి ట్లనియె.

353


క.

వినుఁడు స్రవియించుచున్నది, కనుఁగొనుఁ డీయెడల వెడలుఘనతేజము మీ
రనువున నెవ్వరు దాల్చెద, రన విని యిలఁ దాల్చు ననుచు నమరులు వలుకన్.

354


క.

మృడుఁ డప్పుడు తనతేజము, విడువఁగ నిల దాల్చె సురలు వెండియు ననలున్
బుడమికి నీవు సమీరుఁడుఁ, గడుఁ దోడ్పడి తాల్పుఁ డీశుఘనతేజంబున్.

355


వ.

అనవుడు వాయుసమేతుండై యగ్నిదేవుం డమ్మహాతేజంబుఁ దనయందుఁ బ్రవే
శింపజేసిన.

356


క.

అనలప్రాప్తం బై యా, ఘనతేజము సూర్యపావకప్రభతో శీ
తనగంబు గమించి షడా, ననజన్మస్థానశరవణంబున వెలిఁగెన్.

357


వ.

అంత సంతోషించి నిఖిలదేవమునిగణమ్ములు నమ్మహాదేవు నుమాదేవిం బూజిం
చి రయ్యెడ నాసురల నాలోకించి.

358


మ.

అతికోపంబున నద్రినందన యమర్త్యశ్రేణితో నాకు సం
తతి లేకుండఁగఁ జేయ వచ్చి యిట యత్నం బార విఘ్నంబు చే
సితి రి ట్లిం కిది యాది మీసతులకుం జిత్తోద్భవం బైన సం
తతి లేకుండెడుఁ బొం డటంచుఁ గడఁకం దా శాప మిచ్చెన్ వెసన్.

359


క.

అనిమిషుల కట్లు కోపం, బున శాపం బిచ్చి పిదప భూమిన్ నానా
జనులకు బహురూపంబుల, ననుభవపత్ని వగు మంచు నలిగి శపించెన్.

360


క.

క్షితిధరసుతశాపంబున, నతిలజ్జితు లైనసురల నందఱఁ గొంచున్

శతమఖుఁడు పశ్చిమాశా, న్వితగమనుం డయ్యె నంత నీశుఁడు నుమయున్.

361


క.

హిమవంతమునుత్తరశృం, గమునకుఁ దగ నేఁగి తపము గైకొని యట నే
మములు సలుపంగ నయ్యెడ, నమగులు సైన్యపతి తమకు నబ్బెడికొఱకున్.

362


క.

మునిగణయుతు లై కమలా, సనుపాలికి వచ్చి మ్రొక్కి చతురానన మా
కును సేనాధ్యక్షుఁడు లేఁ, డని వేఁడఁగ వచ్చినార మమరుల మెల్లన్.

363


క.

సేనాపతి మా కొసఁగు ము, మానాథుం డుమయుఁ దాను మహితతపంబుం
బూనినవారలు గావున, సేనాపతి మాకు లేఁడు సృజియింపు మజా.

364


వ.

అనిన విని వారిజాసనుండు వారల కి ట్లనియె.

365


క.

ఉమ యిచ్చిన శాప మమో, ఘము గావున సురల కింకఁ గలుగదు సంతా
నము మీకును సేనాపతి, యుమపుత్రుఁడు దక్క నన్యుఁ డొక్కఁడు గలఁడే.

366


క.

సురలార యగ్నిదేవుఁడు, గిరిసుతతేజంబువలనఁ గృతమతి రిపుసం
హరుఁ డగుసేనాపతి నొ, క్కరు నతివిక్రము సృజింపఁ గలఁ డాపుత్రున్.

367


క.

ఈగగనగంగ యత్యను, రాగమునన్ గారవించుఁ బ్రమదము లారన్
వేగమ యనలునిఁ దోడ్కొని, యాగభుజులు చనుఁడు శంకరాద్రికి ననుడున్.

368


వ.

కృతార్ధు లగుచుం బ్రియం బంది నలువకు నమస్కరించి యనిమిషు లయ్యనలుం
బురస్కరించుకొని కైలాసంబున కేఁగి యచట నగ్నిదేవు నాలోకించి నీవు దేవహి
తార్థంబు సుతోత్పత్తికొఱకు నుమాతేజంబుఁ గొనిపోయి గంగాతరంగంబున
విడువు మనవుడు నయ్యనలుండును గంగకడ కరిగి దేవీ దేవప్రియంబుగా నా
పూనినయీతేజంబు ధరియింపు మని వేఁడ నాగంగ దివ్యరూపంబు ధరియిం
ప నామహిమంబు చూచి యంతట నాతేజంబు చిలికించి యద్దేవి నభిషేకంబు
సేసె నాసమయంబున.

369


క.

క్షితివర సకలస్రోత, ప్రతతులఁ బరిపూర్ణ మగుచు భారము చేయన్
ధృతి సెడి గంగానది యా, హుతవహుతో నిట్టు లనియె నురుగర్భిణి యై.

370


క.

గురుతర మగునీగర్భము, భరియింపఁగ నేను జాలఁ బావక యం చా
తురపడ నప్పుడు వైశ్వా, నరుఁ డాగర్భంబుఁ దుహిననగపాదమునన్.

371


క.

బ్రాఁతిగ వెడలింపు మనన్, ప్రోతోమార్గమ్మువలన సురలోకాతి
ప్రీతిగ వెడలించెను గం, గాతటిని నిజాంతరంగగర్భం బమరన్.

372


వ.

అప్పుడు గంగానిర్గతసౌమ్యతేజంబువలన సువర్ణంబు పుట్టె. సువర్ణతైక్ష్ణ్యంబువ
లనఁ దామ్రకృష్ణాయసంబులు పుట్టె నాసువర్ణమలంబునం ద్రవుసీసంబులు
పుట్టె నాగంగావిశేషంబువలనం బొదలు సువర్ణప్రభలం దృణవృక్షలతాగుల్మ
కాననప్రభృతిసర్వవస్తువులు సువర్ణంబు లయ్యెం గావున సువర్ణంబునకు జాత
రూపం బనునామంబు గలిగె నాసమయంబున.

373

క.

తనరఁ గుమారుఁడు పుట్టినఁ, గొనకొని [54]కృత్తికల కిచ్చి కూరిమితో బా
లునిఁ బ్రోవుఁ డనుడు నగుఁగా, కని కుచదుగ్ధములు గుడిపి యమరులతోడన్.

374


క.

మాకుచదుగ్ధముఁ గుడుచుట, నీకొమరుఁడు మాకుఁ బుత్రుఁ డిందఱకు ననన్
నాకౌకసు లగుఁ గా కన, నాకొమరుఁడు గార్తికేయుఁ డనఁ జెన్నొందెన్.

375


క.

మనమునఁ బ్రమదం బొదవఁగఁ, జనవుమెయిం గృత్తికాకుచము లొగిని షడా
ననములఁ గుడిచి తదాఖ్యన్, జనులు షడాననుఁ డనంగ జగతిం బరఁగెన్.

376


క.

ధరఁ గార్తికేయభక్తిం, బరఁగెడుపుణ్యుండు పుత్రపౌత్రులతోడం
జిరజీవి యగుచు నతిభా, స్వరుఁ డై పడయుం గుమారుసాలోక్యగతిన్.

377

సగరునివృత్తాంతము

వ.

అని చెప్పి.

378


క.

చిరపుణ్యుఁ డైనసగరుఁడు, వరపత్నులు గాఁగ మొదల వైదర్భనగే
శ్వరుపుత్రి సుకేశిని మఱి, యరిష్టనేమిసుత సుమతి నమర వరించెన్.

379


వ.

ఇట్లు వరించి.

380


క.

పత్నులు దానును బ్రియసుత, రత్నంబులఁ బడయ హిమధరంబున కుద్య
ద్యత్నముల నేఁగి నియతిన్, నూత్నతపం బచటఁ జలిపె నూఱేండ్లు తగన్.

381


వ.

అట్టియెడ.

382


మ.

భృగుఁ డన్పుణ్యతపోధనోత్తముఁ డతిప్రీతాత్ముఁ డై చేరి యా
సగరుం జూచి నృపాల నీవు వర మిచ్చన్ వేఁడు మే నిచ్చెదం
దగ నీ కన్న ముదంబుతో నృపతి సంతానంబు నా కిండు నా
నగుఁ గా కయ్యెడు నీకు సంతతి సముద్యత్కాంక్ష సిద్ధింపఁగన్.

383


క.

వఱలెడునీపత్నులలో, నుఱవుగఁ గులపాలుఁ డొకతె కొక్కసుతుండున్
మఱియొక్కత కాతతబలు, లఱువదివేవురును దనయు లయ్యెద రనినన్.

384


వ.

సగరుండు మునివరుం జూచి యిం దెవ్వతే కొక్కపుత్రుండు మఱి యెవ్వతెకుఁ బె
క్కండ్రుపుత్రు లనిన నీసతు లడిగినయట్ల యిచ్చెద ననిన.

385


క.

ఎలమి సుకేశిని దనకుం, గులపాలకు నొక్కసుతునిఁ గోరిక నడిగెన్
వెలయ సుమతి పటుబలములు, గలషష్టిసహస్రసుతులఁ గాంక్షన్ వేఁడెన్.

386


వ.

ఇట్లు వేఁడి యమ్మునీంద్రువలన లబ్ధవరు లై ప్రదక్షిణపూర్వకంబుగా నతనికి న
మస్కరించి పతితోడంగూడ నగరి కేతెంచి రటఁ గొంతకాలంబునకు.

387


తే.

మహితగుణ సుకేశిని యసమంజుఁ డనఁగ, సుతునిఁ గాంచెను వెనుక నాసుమతి గర్భ
తుంబ మొక్కటిఁ గాంచె నాతుంబ మవిసి, సొరిది నఱువదివేవురుసుతులఁ గనియె.

388


క.

జతనముగా ఘృతపూర్ణాతతబహుకుంభముల నునిచి [55]దాదులు పెనుపం
బ్రతిదినముఁ బెరిఁగి యౌవన, యుతు లై విలసిల్లుచుండి రురుసత్వములన్.

389

క.

భూనాయక విను సగర, క్ష్మానాథునిపుత్రకుఁ డసమంజుఁడు పాపా
నూనసమాచారుఁడు దు, ర్మానుఁడుఁ గుజనప్రియుండు మత్తుఁడు నగుచున్.

390


క.

బాలుర సరయువులో నా, భీలగతి మునుఁగ వైచి బెగడునఁ దేలన్
లీలఁ గనుంగొని నవ్వుచు, నోలిన్ బుధజనుల కప్రియుం డగుచుండన్.

391


క.

సగరుఁడు దనయగ్రసుతుం, డగునాయసమంజుఁ జూచి యతికోపముతో
నగుణుఁడు వీఁ డేటికి నని, నగరము వెడలంగ నడిచె నాగరు లలరన్.

392


క.

ఘనుఁ డగునసమంజునిసుతుఁ డనఘాత్ముం డంశుమంతుఁ డతిపుణ్యుఁడు స
జ్జనహితుఁడు ప్రియంవదుఁడును, ననుపమసత్యుండు గుణియు నై పురి నుండెన్.

393


వ.

అంతఁ గొంతకాలంబునకు సగరునకు యజ్ఞంబు చేయ బుద్ధి పుట్టిన.

394


క.

హిమశైలవింధ్యగిరిమ, ధ్యము యజ్ఞము సేయఁ బుణ్యతల మగుటయు ము
ఖ్యముగా సగరుం డద్దే, శములను యజ్ఞంబు సేయ సమకొని నియతిన్.

395


వ.

దీక్షితుం డై యజ్ఞయాశ్వంబుఁ గావ నంశుమంతునిం బంచిన.

396


క.

అచ్చుగఁ బటుకార్ముకుఁ డై, మచ్చిగఁ గాచికొని యంశుమంతుం డుండం
జెచ్చెర రాక్షసతనుఁ డై, ముచ్చిలి వాసవుఁడు తురగముం గొనిపోయెన్.

397


వ.

అ ట్లయ్యశ్వంబు పోవుట యెఱింగి యుపాధ్యాయగణంబు సగరునితో నిట్లనిరి.

398


క.

విశ్వంబు వెదకి వేగమ, యశ్వాపహరున్ వధించి యాగం బిచటన్
నశ్వరము గాక యుండఁగ, నశ్వముఁ దేరంగఁ బనుపు మని పలుకుటయున్.

399

సగరసుతులు యజ్ఞాశ్వంబు వెదకుట

క.

అఱువదివేవురుపుత్రుల, నెఱయఁగఁ జూచి సుతులార నియతాశ్వము నే
మఱితిమి రాక్షసకృత్యం, బెఱుఁగఁగ రా దింక మనకు నెయ్యది దెఱఁగో.

400


క.

ఏనున్ మనుమఁడు దీక్షితు, లైనారము యజ్ఞ మిప్పు డభిమంత్రిత మై
మా నొందెడు నే మిచటను, బూనిక నెఱపంగవలయుఁ బుత్రులు మీరల్.

401


క.

అనిమిషలోకములోనికి, ననువుగఁ జని యచట వెదకి యట లేకున్నన్
జనలోకము శోధింపుఁడు, మునుకొని యీరెండుదెసల మొగి లే కున్నన్.

402


క.

ఒక్కొకయోజనమాత్రం, బొక్కొక్కఁడు జలధివేష్టితోర్వీవలయం
బెక్కడ నశ్వముఁ గనియెద, రక్కడియందాఁకఁ ద్రవ్వి యతిసత్వములన్.

403


క.

పాతాళలోక మంతయు, బాఁతిగ శోధించి హయముఁ బరికించి యతి
ప్రీతిగ నాతురగముఁ గొని, యేతెం డని స్వస్తివాద మిచ్చుచుఁ బనుపన్.

404


క.

జనకునిపనుపున కలరుచు, మనమున ముద మొదవ సగరమనుజపతిసుతుల్
కనుకని బరవసముల గొన, కొని సరభసగతుల నరిగి గురుధృతు లెసఁగన్.

405


మ.

శతకోటిస్ఫుటకోటికోటిపరుషస్పర్శోగ్రబాహాసము
ద్ధతులం బర్వతభేదనప్రబలవజ్రాభీలశూలంబులన్
శితసీరంబులఁ ద్రవ్వఁ జొచ్చి రనఘుల్ సేకొంచుఁ జక్రంబుగా

క్షితిచక్రంబు నవక్రవిక్రమబలోత్సేకంబు లేపారఁగన్.

406


వ.

మఱియు.

407


శా.

అధ్వప్రేక్షితరాక్షసాసురభుజంగాత్యుగ్రసత్వావళీ
విధ్వంసంబులు వీఁకఁ జేయుచు మహోర్వీచక్రవిస్ఫారఘో
రధ్వానంబులు దిక్కులం జెలఁగ దుర్వారాసిముఖ్యాభ లి
ద్ధధ్వాంతాద్రులలోనఁ బె ల్లెసఁగ నాధాత్రీశపుత్రుల్ వెసన్.

408


చ.

[56]గుఱుకొని నేల వ్రక్కలుగఁ గ్రొచ్చియు మన్నులు మ్రింగియున్ శిలల్
వెఱికియు నోలి నొక్కొకఁడు వేగమ యొక్కొకయోజనంబుగా
నఱువదివేవురుం బుడమి నాఫణిలోకముదాఁకఁ ద్రవ్వఁగా
నఱువదివేలుయోజనము లక్కజ మారఁగ నయ్యె నయ్యెడన్.

409


వ.

అప్పుడు సురాసురగంధర్వపన్న గాదులు భీతు లగుచు సంభ్రమంబునఁ బితా
మహుపాలికిం జని యమ్మహానుభావుం బ్రసన్నునిం జేసి విషణ్ణవదనంబులతో
నిట్లనిరి దేవా సగరపుత్రులు సకలభూమియు వ్రక్కలించుచు సర్వభూతహింసలు
సేయుచు నున్నవా రశ్వంబుకొఱకు నని పలుకం గమలాసనుండు వారివచనంబు
లాలించి యి ట్లనియె.

410


క.

క్షితి కరయ వాసుదేవుఁడు, పతి గావున నవ్విభుండు పరఁగఁగ లీలా
కృతిఁ గైకొని యీసకల, క్షితియును ధరియించియుండుఁ జెన్నుగ నెపుడున్.

411


క.

భూభేదనకారణమున, నాభూపతిపుత్రు లెల్ల నాకపిలునికో
పాభీలవహ్నికీలల, చే భస్మము గాఁ గలారు శీఘ్రమ యనినన్.

412


క.

అలరి త్రయస్త్రింశత్త్రిద, శులు దమతమధామములకు సొంపార ముదం
బుల నేఁగి రచట నాభూ, తలపతినందనులు నధికదర్పము లొప్పన్.

413


మ.

నిరతిన్ భూమి నగల్చుచోటను మహానిర్ఘాతసం కాశని
ష్ఠురభూరిధ్వని మ్రోయ మించి మఱియున్ క్షోణీతలం బెల్ల ని
ర్భరతం ద్రవ్వి ప్రదక్షిణం బడరఁ బైపైఁ బేర్చి యచ్చోట నా
తురగంబుం బొడగాన కేగి నృపపుత్రుల్ దండ్రితోడం దగన్.

414


మ.

సగరక్ష్మావర దేవదానవపిశాచస్తోమదైతేయప
న్నగరక్షోగణకిన్నరప్రభృతినకనాజీవులం ద్రుంచుచున్
జగతీచక్రముచుట్టుఁ ద్రవ్వితిమి విశ్వంబున్ మఖాశ్వంబుచొ
ప్పు గనం జోరునిఁ గాన నేర మెచటన్ భూమీశ యింకం దగన్.

415


క.

పని యేమి గలదు వలసిన, పనిఁ బంపుము మమ్ము ననుచుఁ బలుకఁగ వారిం

గనుఁగొని మనమునఁ గోపం, బెనయఁగ నాసగరనృపతి యి ట్లని పలికెన్.

416


క.

నాకమున నున్నఁ బన్నగ, లోకంబున నున్న నబ్ధిలోపల నున్నన్
లోకాలోకము కడపటి, లోకంబున నున్న నైన లోకులు మెచ్చన్.

417


క.

తురగాపహరునిఁ బొరిగొని, తురగము వేవేగ గొంచు దోర్బలయుతు లై
యరుదెం డనవుడు వారలు, నరిగి రసాతలము దాఁక నతిరభసమునన్.

418


వ.

తూర్పుదెస నెల్లభూమియుం ద్రవ్వి త్రవ్వి యద్దిక్కున.

419


క.

ఏకరి దనకు నపాయము, గైకొనఁగాఁ దనదుమూర్ధకంపము సేయన్
లోకమున కపుడు సకలమ, హీకంపము పుట్టు నట్టియిభరాజంబున్.

420


మ.

ఘనశైలాకృతి మేను పూని సకలక్ష్మాభాగముం జేవమై
ననిశంబుం దలఁ దాల్చి యొప్పెడు విరూపాక్షద్విపశ్రేష్ఠముం
గని యాదిక్కరికిం బ్రదక్షిణనమస్కారంబు లాసక్తితో
నొనరం జేసి యనంతరంబ ఖననోద్యోగంబు లేపారఁగన్.

421


వ.

వరుసం దక్కినయమ్మూడుదిక్కులం గలయం ద్రవ్వి దక్షిణంబునఁ బర్వతాకా
రం బై సకలభూమి ధరియించి యున్నయమ్మహాపద్మం బనుదిగ్దంతావళంబును
బశ్చిమంబున సౌమనం బనుదిశాగజంబును నుత్తరంబున భద్రం బనునాశాద్విపం
బును నాలోకించి క్రమంబునం బ్రదక్షిణపూర్వకంబుగా నమస్కరించి యట
మీఁద నీశానభాగంబు ద్రవ్వి ముందఱ.

422

కపిలమహాముని సగరసుతుల భస్మీభూతులం జేయుట

క.

ఘనుఁ డగుకపిలునిఁదురగముఁ, గనుఁగొని సగరసుతు లితఁడు క్రతుతురగమ దె
చ్చినమ్రు చ్చని దుర్బుద్దులు, ఘనతరకోపములు మదులఁ గదురఁగఁ గడిమిన్.

423


క.

తరుశిఖరిఘనశిలాయుధ, ధరు లై పఱతెంచి తురగతస్కరుఁడవు నీ
వరయఁగ మాముందట నెం, దరిగెదు నిలునిలువు మనుచు నలుకం బలుకన్.

424


క.

ఆతతహుంకారము ని, ర్ఘాతోగ్రము గాఁగఁ జేసి కపిలుఁడు రోష
స్ఫీతానలమున భస్మీ, భూతులుఁ గావించె సగరపుత్రుల నెల్లన్.

425


క.

అంతన్ సగరక్షితిపతి, యెంతయుఁ దనసుతులు దడసి రేమొకొ యనుచుం
జింతించి విక్రమశ్రీ, మంతుని మనుమఁ డగునంశుమంతునిఁ దనరన్.

426


చ.

కనుఁగొని చాపబాణములు ఖడ్గముఁ గైకొని వత్స నీవు నీ
జనకులు చన్నమార్గమున సాగుచుఁ దత్పథవిఘ్నకారులం
దునుముచు నేఁగి యశ్వహరుఁ ద్రుంచి మఖాశ్వముఁ గొంచు సమ్మదం
బునఁ జనుదెంచి మత్క్రతువు పూర్ణముగా నొనరింపు నావుడున్.

427


మ.

ఘనసత్త్వుం డగునంశుమంతుఁడు ధనుఃఖడ్గాస్త్రముల్ పూని యే
పునఁ దండ్రుల్ మును ద్రవ్వుచుం జనినయాభూపద్ధతిం బోయి తూ
ర్పున దిగ్దంతిని గాంచి యక్కరిపదంబుల్ ముట్టుచున్ మ్రొక్కి మ

జ్జనకుల్ వచ్చిరి వారిఁ గానవె మఖాశ్వంబులున్ నిరీక్షింపవే.

428


చ.

అనవుడు దైత్యదానవవిహంగభుజంగపిశాచదేవపూ
జనముల నొందునాగజము సమ్మద మారఁగ నంశుమంతుతో
నను [57]జననాథనందన కృతార్థుఁడ వై తురగంబుఁ గొంచుఁ జ
య్యనఁ జనుదెంచె దన్న ముద మందుచు నేఁగి క్రమక్రమంబుగన్.

429


వ.

సకలదిగ్గజంబులకుఁ బ్రదక్షిణపూర్వకంబుగా నమస్కరించుచు నాదిగ్గజంబులఁ
బితృమఖాశ్వంబులసుద్దు లడిగిన నక్కుంజరములు గృతార్థుండవై వచ్చెద వన్న
నట్ల కాక యనుచు నరిగి యమ్ముందటఁ బితృభస్మరాసులు పొడగని యత్యంత
దుఃఖంబున శోకించుచు నచ్చేరువం దిరుగుచున్న మఖాశ్వంబుఁ బొడగని వగలం
బొగిలి కొంతదడవునకుఁ బితృవర్గంబున కుదకక్రియ లొనరింపవలయు నని యొ
క్కజలాశయం బరయుచుఁ దనపితృమాతులుం డగుగరుత్మంతుఁ బొడగ
నియె నాసమయంబున.

430


మ.

గరుడుం డాదట నంశుమంతు నతిదుఃఖశ్రాంతు నీక్షించి స
త్కరుణన్ శోకము మాను పుత్ర సకలక్ష్మాభేరులై నీపితల్
పరుషోద్యత్కపిలోగ్రకోపశిఖలన్ భస్మంబు లై ర త్తెఱఁ
గరయన్ దైవికమున్ జగత్ప్రియము ధైర్యం బొందు మింకం దగన్.

431


మ.

సురలోకాపగఁ దెచ్చి యాభసితరాసుల్ ముంచి యీగంగలోఁ
బరఁగం బైతృకకృత్యముం జలుపు నీపైతృవ్యులన్ నాకమం
దిరసంప్రాప్తులు గాఁగఁ జేయు తురగాన్వీతుండ వై నీవు నీ
పురికిన్ వేచను నీపితామహుని సంపూర్ణక్రతుం జేయఁగన్.

432


క.

ఇతరజలక్రియలు సమం, చితగతి నీపితల కెట్లు చేసిన దివి స
ద్గతి లేదు గాన యిప్పుడు, పితరుల కుదక మిడవలదు పితృహితవర్తీ.

433


వ.

అని యిట్లు వైనతేయుండు పలుక శీఘ్రంబ యామఖాశ్వంబుం గొని నగరపా
లి కేతెంచి యంతవృత్తాంతంబు నెఱింగింప నాభూపతి విధ్యుక్తక్రమంబున న
య్యజ్ఞంబు సంపూర్ణంబు సేసి తనపురంబున కేఁగి సతులుం దాను ననురాగంబున.

434


క.

సురుచిరభోగము లందుచుఁ, బొరిఁబొరి జనులెల్లఁ దన్నుఁ బొగడఁగఁ గీర్తుల్
పరఁగఁగ ముప్పదివేల్వ, త్సరములు రాజ్యంబు సేసి చనియెన్ దివికిన్.

435


క.

జను లనుమతింప సగరుని, మనుమఁడు ధీమంతుఁ డంశుమంతుండు మహీ
జనులకు రా జై వెలయుచు, ఘనుఁ డైనదిలీపనృపతిఁ గనియెం బరఁగన్.

436


చ.

స్థిరమతితో దిలీపు విభుఁ జేసి హిమాచలపార్శ్వకాననాం
తరమున నంశుమంతుఁ డతిదక్షత ముప్పదిరెండువేలువ
త్సరములు నిష్ఠతో నధికదారుణ మైనతపంబు సేసి ని

ర్జరపురి కేఁగె నంత సువిచారి దిలీపనృపాలుఁ డాత్మలోన్.

437


మ.

నమితారాతి దిలీపభూవిభుఁడు నానాయజ్ఞముల్ సేసి యిం
పమరన్ ముప్పదివేలవర్షములు రాజ్యప్రాప్తుఁ డై తద్దయుం
బ్రమదం బార సుతున్ భగీరథవిభుం బట్టంబు వే కట్టి రో
గముచేతం దుదిఁ బొంది పుణ్యవశతం గాంచెన్ మరుల్లోకమున్.

438

భగీరథుండు గంగను భూమికిం దెచ్చుట

క.

ప్రథితమతి భగీరథుఁ డతి, రథుఁడు సుతుల్ దనకు లేమి రాజ్యంబు మనో
రథ మారఁ జేయుఁ డనుచుం, బృథుమతు లగుసచివులందుఁ బెట్టె సుబుద్ధిన్.

439


వ.

ఇవ్విధంబునం బ్రధానులందు రాజ్యంబు చేర్చి భగీరథుండు గోకర్ణంబునకుం
జని యందు.

440


శా.

బాహుద్వంద్వము మీఁది కెత్తి కడఁకం బంచాగ్నితప్తుండు మా
సాహారుండు జితేంద్రియుండు నతినిష్ఠాయచిత్తుండు న
వ్యాహారప్రవణుండు నై బహుసహస్రాబ్దంబు లేకచ్ఛల
గ్రాహిత్వం బమరన్ మహాతపము గోకర్ణంబునం జేయఁగన్.

441


క.

జలజాసనుఁ డాతపమున, కలఘుప్రీతాత్ముఁ డగుచు ననిమిషగణముల్
గొలువ భగీరథుపాలికి, నెలమిం జనుదెంచి యతని కి ట్లని పలికెన్.

442


క.

నీతపమున కెంతయు నేఁ, బ్రీతుఁడ నైతి వర మడుగు ప్రియమున నన నా
ధాతకు మ్రొక్కి భగీరథుఁ, డాతతసంతుష్టహృదయుఁ డై యి ట్లనియెన్.

443


క.

అస్మత్ప్రపితామహబహు, భస్మంబులమీఁద గంగఁ బఱపుము నాచి
త్తస్మృతి సఫలతఁ బొందఁగ, నస్మద్వంశజులు నాక మరిగింపు తగన్.

444


క.

లోకైకనాథ విను మి, క్ష్వాకుకులం బంతరించి కడచనకుండన్
నా కీ సంతతి యనవుడు, నాకమలజుఁ డతనితోడ నయ్యెడు మనుచున్.

445


క.

దివిషద్గంగాపాతం, బవని వహింపంగఁ జాల దానదిఁ దాల్పన్
శివు వేఁడు శివుఁడు దక్కఁగ, నవలీలను గంగఁ దాల్ప నన్యులవశమే.

446


వ.

అని పలికి బ్రహ్మ తనలోకంబున కేఁగ భగీరథుం డచ్చట.

447


శా.

అంగుష్ఠాగ్రము నేల మోపి తప మేకాబ్దంబు నిండంగఁ జే
యంగన్ దర్పకవైరి వచ్చి పరితుష్టాత్ముండ నైతిన్ వియ
ద్గంగం దాల్చెద మౌళి నా నపుడు రంగత్తుంగభంగత్వరన్
గంగాసింధువు నింగినుండి పడియెన్ గౌరీశుజూటంబునన్.

448


వ.

అట్లు హరుజూటంబుఁ బ్రవేశించి యంతర్గతంబున.

449


చ.

హరుని నతిక్రమించి గగనాపగ పన్నగలోక మేఁగ వే
గిరపడఁ జూచి శంకరుఁడు గిన్క విరోధము సేసి యాఁప నా
హరునికపర్దకందరమునందు భ్రమించుచు నుండె నెందుఁ దా

నరుగఁగ లే కనేకగణగ్రహాయనముల్ చన నంత వెండియున్.

450


వ.

అతినిష్ఠ నమ్మహాదేవునిగుఱించి భగీరథుం డుగ్రతపం బాచరింప రఘువరా
విను మమ్మహాదేవుండు సంతుష్టహృదయుండై జటాకుహరంబున నున్నగంగను
బిందుసరోవరం బుపలక్షించి విడువ నాగంగ యం దేడుప్రవాహంబు లయి పొ
డమి హ్రాదినియు నలినియుఁ బావనియు నన మూఁడునదు లై తూర్పుదిక్కు
నకుం జనియె మఱియుఁ జక్షువు సితయు సింధువు నన మూఁడుపుణ్యనదు లై
పశ్చిమంబున కరిగె నందు సప్తమపుణ్యనదీవరేణ్య యగుగంగ మహారథుం డగు
భగీరథునిరథంబు వెనుక నేతేరం జొచ్చె నానది శివునిజటామండలకుహరంబు వె
లువడి ఘననక్రగ్రాహమకరమత్స్యకచ్ఛపదర్వీకరశింశుమారప్రభృతిజలచరంబు
లతోడ నాశివునిదేహప్రభ తీఁగె సాగి వెడలుకైవడిఁ బ్రవాహంబు నెఱయ మె
ఱయ గంభీరఘనధ్వని మ్రోయుచుం బుడమిం బడి యే నూర్ధ్వలోకగామిని న
ధోలోకంబున కేల పోవుదు ననుమాడ్కి మింటిమీఁది కెగసిన ట్లెగసి తజ్జలావ
గాహంబు చేసి గగనంబున కెగసి చనునుడుగణంబులో యన రంగదుత్తుంగభంగి
భంగురఘనోదకబిందువు లెగయ భగీరథకీర్తివల్లులుంబోలె ఫేనమాలికలు
రాల నిజావతరణాలోకనప్రియాగతామరలోకభూషణమణిగణకిరణంబుల నాకా
శంబు జలదావకాశం బయి శతసూర్యప్రకాశం బగుచు వెలుంగఁ బాపంబున
భూగతు లైనజనులు కృతస్నాను లయి సకలపాపంబులు బాసి యమకు లై గగన
సరణిం దమపుణ్యలోకంబుల కరుగ నమరయక్షగంధర్వనరకిన్నరసిద్ధమునిగణ
ప్రభృతు లీపుణ్యజలంబులు సదాశివుపావనాంగసంగతంబు లై వచ్చిన వనుచు
నాజలంబుల నోలలాడి కృతార్థులై వెలయం గొందఱు దేవర్షిగంధర్వసిద్ధచార
ణాదులు కరితురగవిమానసమారూఢు లై చూచుచుండ మఱియుఁ గొందఱు సు
రాసురకిన్నరయక్షరాక్షసగరుడోరగాప్సరస్సిద్ధసాధ్యవిద్యాధరాదులు తనవెను
వెంట నేతేర నాశ్రితక్లేశనాశంబులు సేయం దోయంబు లైనతోయంబులును
గృతపాపభంగంబు లయినభంగంబులును సురనరమునిగణసేవానుకూలంబు
లైనకూలంబులును నెఱయ మెఱయ విక్రమశాలి యైనభూపాలుండునుంబోలెఁ
బరభూము లొత్తుచు దుష్టశాసనుండునుంబోలెఁ గుజాతజాతంబుల భంగించు
చు భార్గవరాముండునుంబోలె భూభృత్కూటంబులు వీటతాటనంబులు చేయు
చు నదభ్రగంభీరధ్వని మ్రోయుచు నతిత్వరితగతిం బఱతెంచి ముందట.

451

గంగ జాహ్నవి యైనప్రకారము

మ.

అమరన్ జహ్నుఁడు నిష్ఠతో మఖము సేయన్ రంగదుత్తుంగభం
గము లుద్యద్గతిఁ బెల్లుగా నడరి వీఁకన్ వచ్చి యయ్యజ్ఞవా
టము సర్వంబును ముంప నప్పు డతిచండక్రోధదుర్వారవే
గమునన్ జహ్నుఁడు ద్రావె నద్భుతముగా గంగాజలం బంతయున్.

452

వ.

అప్పుడు.

453


క.

సురమునిగంధర్వులు గడుఁ, బరమాశ్చర్యమున జహ్నుఁ బ్రార్థనతో నీ
సురనది వెడలింపుము త, త్పరబుద్ధిని నీకు దుహితృభావముఁ బొందన్.

454


క.

అన విని జహ్నుఁడు సమ్మద, మునఁ దనఘనకర్ణరంధ్రమున వెడలింపన్
జనె నది మొదలుగ జాహ్నవి, యనునభిధానంబు జగతి నభినుతిఁ బొందెన్.

455


ఉ.

ఆగతి జహ్నుకర్ణకుహరాగ్రవినిస్స్రుత యైనగంగ వే
వేగ భగీరథుండు దనవెంటనె వెండియు నేఁగుదేరఁగా
సాగరవీథిఁ జొచ్చి బలిసద్మము చేరఁగఁ బోయి ముందటన్
సాగిన భస్మరాశిమయసాగరులం బొడగాంచి దీనతన్.

456


వ.

అత్యంతదుఃఖాక్రాంతుఁ డై ప్రపితామహభస్మరాసులు గంగపావనజలంబుల
సంసిక్తంబులు సేయునెడ సర్వలోకపితామహుం డగుపితామహుండు వచ్చి
భగీరథుం జూచి యి ట్లనియె.

457


చ.

సగరతనూజు లందఱును స్వర్గముఁ బొంది రమర్త్యమూర్తు లై
యగణితపుణ్య నీకతన నన్వయ మెల్లఁ బవిత్ర మయ్యె నా
సగరతనూజు లందఱును సాగరతోయము లుర్విలోపలన్
నెగడెడునంతదాఁక దివి నెమ్మది నుండెద రిచ్చ లారఁగన్.

458


ఉ.

గారవ మార నీదివిజగంగ భవత్సుత యై తగంగ భా
గీరథి నాఁగ నొప్పెడు భగీరథభూపతి లోకపావనో
దారసుకీర్తి నొంది త్రిపథంబుల నిట్లు గమించెఁ గాన పెం
పార ధరిత్రిలోఁ ద్రిపథగాహ్వయ యై విలసిల్లెడుం గడున్.

459


క.

సగరాంశుమద్దిలీపులు, దగ ధర్మప్రవణబుద్ధిఁ దమవంశజులన్
సుగతులుగఁ జేయుకొఱకును, గగనాపగఁ దేర లేక కడచిరి వత్సా.

460


మ.

అతిపుణ్యుండవు వంశపావనుఁడ వుద్యద్గోత్రమిత్రుండ వు
న్నతబుద్ధిం బ్రపితామహప్రతతులన్ నాకంబు నొందంగఁ దె
చ్చితి నాకాపగ నింక నీప్రతిన వచ్చెన్ వ్యక్తపూతాంబుస
త్కృతు లోలిన్ విరచించి నీపురికిఁ బ్రీతిం బొమ్ము భూనాయకా.

461


వ.

అని పలికి బ్రహ్మ దనలోకంబున కరిగె నంత భగీరథుండును దనప్రపితామహు
లకు నాగంగలో విహితక్రమంబున ధర్మోదకతంత్రం బాచరించి శుచీభూతుం
డై తనపురంబున కరిగి సకలజనులు దన్ను సేవింప సర్వార్థసమృద్ధుం డగుచుఁ
బరమానందంబున రాజ్యంబు సేయుచుండె గంగావతరణంబు నీకు విస్తరించి విని
పించితి సంధ్యాకాలంబు వర్తిల్లుచున్నది రామచంద్రా నీకు భద్రస్వస్తులు గాని
మ్ము గంగావతరణోపాఖ్యానంబు బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రులందు నెవ్వండు
చదువు నెవ్వండు వ్రాయు నతనిపితృదేవతలు ప్రీతాత్ము లగుదు రతం డఖిలపా

పంబులం బాసి యాయురారోగ్యంబులు నైశ్వర్యంబులుఁ బుత్రసంపత్తియు ధన
ధాన్యంబులు సకలకామ్యార్థసిద్ధులుం గలిగి నాకలోకఫలప్రాప్తుం డగు నని వి
శ్వామిత్రుండు వినిపింప ననుజసమేతుం డైనరామచంద్రుం డచ్చెరు వందుచుఁ
గౌశికున కి ట్లనియె.

462


క.

మునివర గంగాగమనం, బును సాగరపూరణంబు ముదమున నీచే
వినఁగా క్షణమై రాతిరి, చనియెను మది విమల మయ్యె సమ్మద మొదవెన్.

463


క.

అని వెఱఁగందుచు నాకథ, మనమునఁ దలపోయుచుం దమస్విని వే వే
గినఁ బ్రథమాహ్నికకృత్యము, లనుజుండును దా నొనర్చి యనురాగమునన్.

464


క.

ఈగంగను దాఁటుద మని, యాగాధిసుతుండు దశరథాత్మజులు మహా
భాగు లతిపుణ్యభాగిని, భాగీరథి నుత్తరించి ప్రముదితు లగుచున్.

465


క.

లీలాలోలత నుత్తర, కూలంబున నిలిచి కనిరి కోర్కులతో భూ
పాలక గజహయమణిగణ, జాలను లక్ష్మీవిశాలఁ జారువిశాలన్.

466


క.

కనుఁగొని విశ్వామిత్రుఁడు, జననాయకసుతులతో విశాలాపురికిం
జనునెడ రాఘవుఁ డమ్ముని, కను నీపురి కధిపుఁ డెవ్వఁ డనఁ గౌశికుఁడున్.

467


క.

ఘనుఁ డగురామునిఁ గనుఁగొని, యినకులనాథసుత నీకు నీనగరిపురా
తనవృత్తాంతము సర్వం, బును జెప్పెద వినుము రామ పూర్వయుగాదిన్.

468

క్షీరసాగరమథనము

చ.

సుమతుల నాదితేయదితిజుల్ దలపోసి సునిశ్చితాత్ము లై
యమరుల మై నిరామయుల మై యజరాంగుల మై వెలుంగ ను
ద్యమమున వార్ధిఁ ద్రచ్చి తగ నం దమృతం బుదయింపఁ గాంక్ష న
య్యమృతముఁ ద్రావఁగా మనకు నయ్యెడు సర్వమనోరథంబులున్.

469


క.

అని నిర్ణయించి వాసుకి, యనుఫణిపతిఁ జేరు మందరాద్రిని గవ్వం
బునుగా నొనర్చికొని దితి, తనయులు నయ్యదితిసుతులుఁ దగ దుగ్ధాబ్ధిన్.

470


మ.

ఉరుశక్తిం దరువంగఁ జొచ్చిరి సమిద్ధోల్లోలకల్లోలస
త్వరడోలాతతి వేల దాఁటగ సముద్యద్బిందువుల్ తారకా
పరిషేకంబులు సేయ బుద్బుదతతుల్ పై నుప్పతిల్లంగ దు
స్తరనిర్ఘాతఘుమంఘుమధ్వనులఁ బాతాళంబు ఘూర్ణిల్లఁగన్.

471


క.

ఉరుబలమున ని ట్లితరే, తరులు మిగులఁగాఁ బయోధి దరిగొని వేవ
త్సరములు దరువఁగ ధన్వం, తరి దండకమండలువులు చాలిచి పొడమెన్.

472


వ.

తదనంతరంబ.

473


చ.

అఱువదికోటు లప్సరస లంచితమూర్తులు పుట్టి రోలి న
త్తఱి మఱి వారికిం దగినదాసు లసంఖ్యులు సంభవించి ర
త్తెఱవలు దమ్ము నెవ్వరుఁ బ్రతిగ్రహణంబులు సేయకుండుటన్

వఱలుచు వారకాంత లయి వాంఛితవృత్తుల నుండి రిమ్ములన్.

474


వ.

అయ్యప్సరసలు మథితాప్సంభూత లగుట నప్సరస లనం బరఁగిరి మఱియునుం
దరువ వరుణసుత యగు వారుణి యనుసుర వొడమె నాసుర దితిసుతులు పరి
గ్రహింప నొల్లక యసురు లనం బరఁగిరి తత్సురఁ బరిగ్రహించి సంతుష్టహృద
యు లై యదితిసుతులు సురపేర సురలు నా వెలసిరి మఱియు నుచ్చైశ్రవం
బనుహయంబును గౌస్తుభం బనురత్నంబు నమృతంబు నావిర్భవించె నయ్యమృ
తంబునకు సురాసురులకు మహాయుద్ధంబు ప్రవర్తిల్ల నప్పు డదితిసుతులు దై
త్యుల సమయింప నాదైత్యులు రాక్షసులుఁ గూడుకొని సురులతో దారుణర
ణంబుఁ జేయ నుభయకులక్షయంబును బాటిల్లెఁ దవసరంబునఁ బ్రభవిష్ణుం డ
గువిష్ణుం డొక్కమహామోహిని యై మాయఁ గైకొని వేగ యయ్యమృతం బప
హరించికొనిపోవ నసుర లభిముఖు లై తలపడ విష్ణునకు నసురులకు మహాహ
వం బద్భుతరసావహంబుగాఁ జెల్ల దితిపుత్రు లప్పు డదితిపుత్రులతో మహాభీ
మసంగ్రామం బుద్దామంబుగాఁ జేయ నింద్రుండు దైత్యులం దునుమాడి రా
జ్యంబు చేకొని సమ్మదం బొదవ లోకంబు లేలుచు సురల మునులం బ్రోచు
చుండె నంత.

475


క.

సుతు లందఱు మృతు లైనను, దితి మది శోకించి యధికదీనతఁ దనస
త్పతిఁ గశ్యపుఁ గనుఁగొని నా, సుతులం దునుమాడి రదితిసుతు లతిబలు లై.

476


క.

సుతహీన నైతి నేఁ దప, మతిరయమునఁ జేసి శక్రహరుఁ డగునొకస
త్సుతుఁ బడయఁగఁ గోరిన స, మ్మతి గర్భము నిమ్ము నాకు మహితచరిత్రా.

477


క.

అనుచుం గడుదుఃఖత యై, మనమున పగఁ బొగులు చున్నమాన్యచరిత్రం
దనసతి దితిఁ గనుఁగొని యిం, పెనయఁగ గశ్యపమునీంద్రుఁ డి ట్లని పలికెన్.

478


మ.

చన వేయేఁడులదాఁక నీవు శుచి వై సమ్యక్తపోయుక్తి నుం
డిన ముల్లోకములన్ సురేశ్వరునిఁ గడ్మిన్ గిట్టి తున్మాడ నో
పినపుత్రుం దగ నిత్తు నీకు ననుచుం ప్రేమంబుతో సంగమా
ర్జన మొందించి మరీచిపుత్రుఁ డరిగెన్ శాంతిం దపఃప్రాప్తికిన్.

479


తే.

అట్లు కశ్యపుఁ డేఁగఁగ నధికనిష్ఠఁ, దగఁ గుశాసనమున నుండి దారుణ మగు
తపము దితి సల్పుచుండఁగఁ దల్లిపాలి, కరుగుదెంచి యాఖండలుం డధికభక్తి.

480


క.

ఫలజలదళకుసుమసమి, జ్జ్వలనంబులు మొదలు గాఁగ వలసినయవి ని
చ్చలుఁ దెచ్చి యిచ్చుచును మే, నలమట నొందంగనీక యనయముఁ గొలువన్.

481


క.

పూనినతనఘనతరతప, మూన సహస్రాబ్ద మగుచు నొకనాఁ డుండం
గా నపరాహ్ణమున శిర, స్స్థానము కాలుకడ గాఁగఁ దా విరిదలతోన్.

482


క.

నిద్దుర వోవఁగఁ గనుఁగొని, యద్దిర కడునశుచి యైనయది దితి యనుచుం
దద్దయు ముదమున నింద్రుం, డద్దితిజఠరంబుఁ జొచ్చి యతిదర్పమునన్.

483

చ.

కలగొన నేడుఖండములు గా నతిఘోరభుజార్గళస్ఫుర
త్కులిశకఠోరధార వడిఁ గోయ నురుధ్వని బిట్టు గర్భ ము
మ్మలికముతోడ నేడువఁగ మారుద మారుద యంచు వెండియున్
నిలువక కోయఁగా నపుడు నిద్దుర దేఱి సవిత్రి యి ట్లనున్.

484


క.

వడి నిటు నలఁపకు చంపకు, వెడలుము నీ వనుడు వెడలి వినయముతోడం
బొడచూపి తల్లి ననుఁ దుని, మెడిగర్భము ద్రుంచితిన్ క్షమింపుము నన్నున్.

485


క.

నీ వశుచివి నిద్రితవుం, గావున నీగర్భ మేడుఖండంబులుగాఁ
గావించితి ననవుడు దితి, యావిధ మగుగర్భహాని కతిదుఃఖిత యై.

486


క.

వాసవుఁ డసాధ్యుఁ డగుటన్, గాసిల శపియింప రాక కడువగమై నా
వాసవుతో ని ట్లను నా, చేసినయపరాధ మిట్లు సేసెం దనుజా.

487


క.

నీ వేమి చేయు దింకను, నీవలనన్ సొలయ నేను నిను వేఁడెద స
ద్భావమున నాదుకోరిక, గావింపుము సమ్మదమున గారవ మారన్.

488


వ.

పుత్రా భవత్కులిశదళితగర్భసప్తఖండంబులు సప్తమారుతంబు లై గగనవాత
స్కంధంబులం జరియింప నిమ్ము మఱియుం బ్రథమమారుతంబు బ్రహ్మలోకంబున
ద్వితీయమారుతం బింద్రలోకంబునఁ దృతీయమారుతంబు గగనంబునం దక్కిన
చతుర్మారుతంబులు నలుదిక్కుల దేవతామూర్తులై నీయాజ్ఞం జరియింప నిమ్ము
నీవు మారుద మారుద యనుట మారుతాహ్వయంబులం బరఁగ ని మ్మనిస నిం
ద్రుండు దితి కి ట్లనియె.

489


మ.

జననీ నీ విటు నన్నుఁ గోరిన సమస్తంబుం గృతార్థంబుగాఁ
దనరం జేసెద నీతనూజులు నమర్త్యస్ఫూర్తులై యేజవేగం
బుననైనం జరియించుచుండెదరు సమ్మోదింపు నీ వంచు సం
పెనయం బల్కి సవిత్రితో దీవికి నరయ్యింద్రుండు వోయెం దగన్.

490


క.

క్లేశయుతతపము దితి పు, త్రాశం జేయఁ బరిచర్య లాదితికిన్ దే
వేశుం డొనర్చుచుండిన, దేశం బిద్దేశ మఖిలదేశాధీశా.

491


క.

వినుము ఘనుం డగునిక్ష్వా, కునకు నలంబసకుఁ బుట్టెఁ గొడుకు విశాలుం
డన నతఁ డేలుట నిప్పురి, జను లెల్ల విశాల యనఁగ జగతిం బరఁగెన్.

492


వ.

ఆవిశాలునకు హేమచంద్రుండును హేమచంద్రునకు సుచంద్రుండును సుచంద్రు
నకు ధూమ్రాశ్వుండును ధూమ్రాశ్వునకు సృంజయుండును సృంజయునకు సహ
దేవుండును సహదేవునకుఁ గుశాశ్వుండును గుశాశ్వునకు సోమదత్తుండును
సోమదత్తునకుఁ గకుత్స్థుండును నతనికి సుమతియుం బుట్టి రిప్పుడు విశాలను సుమ
తి యేలుచున్నవాఁ డిక్ష్వాకునందను లండఱు విశాల యేలుటం జేసి వైశా
లికులు నతిధార్మికులును దీర్ఘాయుష్మంతులు వీర్యవంతులు నై పరఁగుదురు
రామచంద్రా యీ రాత్రి యీపురిని విశ్రమించి యెల్లి జనకునిం జూడఁ

బోవుద మనుసమయంబున.

493


చ.

సుమతి మునీంద్రురాక విని సుప్రియుఁడై యెదురేఁగుదెంచి యు
త్తమమతిఁ బూజ లిచ్చి కడుధన్యుఁడ నైతిఁ ద్వదీయదర్శనం
బమరపదంబు నాకు నిటు లబ్బె మునీశ్వర యంచుఁ బల్కి సే
మము తగఁ బ్రీతితో నడిగి మానుగఁ గౌశికుతోడ ని ట్లనున్.

494


మ.

కరిసింహాంచితగాము లశ్వినిసమాకారుల్ దళత్పద్మభా
స్వరనేత్రుల్ కమనీయయౌవనులు గీర్వాణప్రతాపుల్ భయం
కరశార్దూలమహోక్షసన్నిభులు లోకత్రాణపారీణు లు
ద్ధురకోడండకృపాణబాణయుతదోస్స్థూణుల్ ప్రవీణుల్ గడున్.

495


క.

ధర విహరింపఁగ వచ్చిన, తరణిసుధాకరులొ దేవతావరులొ పర
స్పరసదృశేంగితచేష్టిత, పరిమాణముల సరి యగుచుఁ బరఁగెద రిచటన్.

496


ఉ.

ఈసుకుమారు లెవ్వ రిట కేటికి వచ్చిరి పాదచారు లై
భాసురపుణ్య నా కెఱుఁగఁ బ్రాజ్ఞతఁ జెప్పుము నాఁగఁ గౌశికుం
డాసుమతిక్షితీశ్వరున కారఘురాముఁడు వచ్చి యాగతిం
జేసినవిక్రమక్రమము చెప్పిన వచ్చెరు వంది వేడ్కతోన్.

497


వ.

రామలక్ష్మణులకు నతిథిసత్కారంబు లత్యాదరంబునం జేయం పైకొని యారాత్రి
యచ్చట వసియించి మఱునాఁడు మిథిలాపురంబున కేఁగి తదుపవనంబుఁ
బొడగని కౌశికునకు రామచంద్రుం డి ట్లనియె.

498


క.

అమరుచు నిచటఁ బురాణా, శ్రమ మున్నది మునులు లేక జనశూన్యం బీ
రమణీయాశ్రమ మేయు, త్తమమునియాశ్రమము మున్ను తజ్ఞతఁ జెపుమా.

499


క.

అనవుడు విశ్వామిత్రుం, డినకులనాయకునిఁ జూచి యి ట్లనుఁ దగ నీ
వినుతాశ్రమంబు గౌతమ, మునిపుంగవునాశ్రమంబు మును విను మనఘా.

500


క.

ఈపుణ్యాశ్రమవనమును, బ్రాపించి యనేకగణసహస్రాబ్దము లు
ద్దీపితతప మంచితవి, ద్యాపరుఁ డై గౌతముఁడు నహల్యయుఁ జలుపన్.

501


క.

ప్రీతిఁ దఱి వేచి యింద్రుఁడు, గౌతమవేషంబు పొసఁగఁ గైకొని వేగం
బేతెంచి రూపలావ, ణ్యాతుల్య నహల్యఁ జూచి యతిమోహితుఁ డై.

502


క.

కోరిక లొప్పారఁగ నా, సారసముఖిఁ జేరి పాకశాసనుఁ డంతం
జారునితంబిని నన్నున్, మారసుఖక్రీడఁ దనుపు మక్కువతోడన్.

503


చ.

అనుడు నహల్య యింద్రుఁడు ప్రియంబున గౌతమవేషి యైనవాఁ
డని మదిలో నెఱింగి ముద మందఁగ నిక్కడ రమ్ము గ్రక్కునన్
మనసిజునమ్ములం దునిసె మానము చిక్కినమన్మథుండ వై
నను రతిచాతురిం గవిసి నన్నును నిన్నును గావు నావుడున్.

504

క.

తరుణి నినుఁ జూచినప్పుడె, పరితుష్టుఁడ నైతి నింకఁ బ్రసవాయుధజి
త్వరుఁడ నయి పోదు నని త, త్పరమతి వాంఛితముఁ దీర్చి తత్తఱపడుచున్.

505


క.

ఉటజము వెలువడి యట ముం, దటఁ దాఁ బొడగాంచె వృత్రదమనుఁడు వికటో
త్కటవిస్ఫుటజటి నతిసం, ఘటితతపఃకృశశరీరకంపనకలితున్.

506


మ.

కరసంయుక్తసమిత్కుశాంచితుని గంగాపూతతోయార్ద్రభా
స్వరమూర్తిన్ గతధూమసంజ్వలితసజ్వాలాగ్నికల్పున్ సురా
సురదుర్దర్షుని నక్షపాదు రచితశ్రుత్యర్థవాదున్ వ్రతా
విరళామోదు సుధీయుతుం బ్రతిహతావిద్యాతమున్ గౌతమున్.

507


క.

అప్పుడు గౌతముఁ డింద్రుని, నిప్పులు రాలంగఁ జూచి నీవు కపటి వై
చొ ప్పగునారూపంబునఁ, ద ప్పొనరించితి దురాత్మ తగ దన కంచున్.

508


క.

చండక్రోధంబున నీ, యండంబులు దునిసి దర్ప మడఁగు దురాచా
రుండ యనఁగ నాఖండలు, నండంబులు దునిసి పుడమి నప్పుడ పడియెన్.

509


వ.

ఇ ట్లయ్యింద్రుని శపియించి యహల్య నమాంగల్యం గదిసి యీవనంబున ననే
కదివ్యసహస్రవర్షంబులు నాయుభక్షణవు నిరాహారవు భస్మశాయినివియు
యెవ్వరికిం గానరాక పాషాణంబ వై యుండు మని యంతటఁ గరుణార్ద్రమన
స్కుం డై యెప్పు డివ్వనంబునకు రామచంద్రుండు వచ్చు నప్పుడు శాపవిముక్త
వై తదాతిథ్యసత్కారంబున నిజరూపంబు గైకొని ముదం బందెద వని పలికి
యీయాశ్రమంబు విడిచి సిద్ధచారణసేవితం బైనహిమగిరిశిఖరంబున కేఁగి తపం
బాచరించుచుండె.

510


సీ.

అనిమిషేశ్వరుఁ డంత ననలాదిదేవతా, గణములు సిద్ధచారణులఁ జూచి
యమలోగ్రతపము గౌతముఁ డర్థిఁ గావింపఁ, దత్తపం బమరహితంబు గాఁగఁ
జెఱుపంగ నే నేఁగి చిత్తంబుఁ గలఁగింప, ఘనకోపమున నన్నుఁ గనలి చూచి
విఫలుఁగా శపియించె వేగ దానం జేసి, తప మెల్లఁ జెడిపోయె దర్ప మడఁగె
విఫలుఁడగునన్ను మీరలు సఫలుఁ జేయుఁ, డనినఁ బితృదేవతలఁ జేరి యమరు లంత
మేషముష్కము ల్గొనివచ్చి మేఘవాహ, నునకుఁ బొందుగ హ త్తింపుఁ డనిన వారు.

511


క.

దండిం బితరులు వెస మే, షాండంబులు ద్రెంచి తెచ్చి హత్తించిన నా
ఖండలుఁ డది యాదిగ మే, షాండుం డయ్యెనని పలికి యమ్ముని మఱియున్.

512


క.

ఇది యాగౌతమునాశ్రమ, పద మిచ్చట నమ్మహానుభావునిసతి యు
న్నది దగ నహల్య యెంతయు, మద మఱి ప్రతిశాపతప్తమానస యగుచున్.

513


క.

రామ యహల్యకు నీవు ద, యామతి శాపంబు నాప నరుగుము నా నా
రాముఁడు విశ్వామిత్రుఁడు, సౌమిత్రియుఁ దోడ రా వెసం జని యెదురన్.

514


సీ.

జలమధ్యసందీప్తశసవితృదీధితిమాడ్కి, నతిదురాధర్ష యై యమరుదాని
భూరిహిమవృతపూర్ణచంద్రికవోలె, నశ్రుధారామగ్న యైనదానిఁ

బ్రథితభూమావృతపావకశిఖభంగి, నురుపాంసుకలిత యై యున్నదాని
శ్యామమేఘచ్ఛన్నచారుతటిల్లత, కైవడి జడ చేతఁ గ్రాలుదాని
బ్రహ్మనిర్మితశుభమూర్తిఁ బరఁగుదాని, విపులశాపభరంబున వేఁగుదాని
నఖిలలోకభూతాదృశ్యమైనదాని, నంతికాత్తమాంగల్య నహల్యఁ గనియె.

515


క.

కన రామునిదర్శనమున, మునిశాపవిముక్త యగుచు ముజ్జగముల కె
ల్ల నహల్య గానఁబడియెను, ఘనవిగమస్ఫురితచంద్రకళచందమునన్.

516


వ.

అప్పుడు రామలక్ష్మణు లతిపుణ్యకల్య యగునహల్యపాదంబుల కెఱఁగిన నాదరం
బున నాయహల్యయు గౌతమువాక్యంబు దలంచి రామలక్ష్మణుల కర్ఘ్యపాద్యంబు
లిచ్చి యతిథిసత్కారంబు లాచరించె నాసమయంబున సురదుందుభులు మ్రోసె
సురలు పుష్పవృష్టి గురియ దేవగంధర్వాప్సరస్సంఘంబు లేతెంచి సాధువాక్యం
బుల నహల్యం బూజించిరి తపోబలశుద్ధాత్మ యైనతనపత్ని సహల్యం జేకొని
యత్యానందంబున రామచంద్రునిఁ బూజించి యారామునిచేత నర్హపూజ
లొంది పత్నీసహితుం డై గౌతముండు దపోవనంబున కరిగె విశ్వామిత్రుండును
రామలక్ష్మణసమేతుం డై మిథిలాపురంబు చేరి యాపురంబున కీశానభాగంబున.

517

విశ్వామిత్రుండు రామలక్ష్మణసహితుండై మిథిలాపురంబున కరుగుట

సీ.

మాళవనేపాళమగధాంధ్రపాంచాల, భోజకాంభోజాదిభూమిపతులఁ
గరిరథాశ్వశ్రేణి ఘనసమిత్కు శముల, జీమూతసమహోమధూమతతుల
దర్భాసనంబులఁ దగినపీఠంబులఁ, బంక్తు లై కూర్చున్న పరమమునుల
సరసస్వరోదారసామఘోషంబుల, సురుచిరయాగోపకరణతతుల
భూరిదధిఘృతక్షీరసంపూర్ణకుంభ, కనకమయవేదికాసముత్కరముల మఱి
పశుసమంచితయూపాళిఁ బరఁగుజనకు, యజ్ఞవాటము సొత్తేర నప్పు డెఱిఁగి.

518


క.

మానొంద శతానందుఁడుఁ, దానును నర్ఘ్యంబు గొనుచుఁ ద్వరతో జనక
క్ష్మానాథుఁడు గౌశికమునిఁ, గానఁగ నేతెంచి వినయగరిమము లమరన్.

519


క.

అర్ఘ్య మొనరించి మ్రొక్కిన, దీర్ఘాయువు నొందు మనుచు దీవించి లస
న్నిర్ఘోషకలితశుభతర, దీర్ఘము మాధుర్య మెసఁగ ధృతి ని ట్లనియెన్.

520


క.

నిరుపద్రవ మై నీయ, ధ్వర మేపారెడినె నీకుఁ దగ భద్రమె నీ
పరిచరుల కెల్ల సేమమె, పరఁగఁగ నన జనకుఁ డపుడు భద్రమ యనుచున్.

521


చ.

మునివర నీవు సంయములు మోదముతోడ మదీయయజ్ఞముం
[58]గనుఁగొన నిందు వచ్చితిరి గావున ధన్యుఁడ నైతి యజ్ఞసం
జనితఫలంబు గంటి నిట సమ్మతి నుండుఁడు ద్వాదశాహముల్

పనుపడ నంతవిఁదఁ గ్రతుకభాగము లొందఁగ వచ్చుదివ్యులన్.

522


వ.

చూడవలయు నని పలికి మఱియు నతికౌతుకంబున రామలక్ష్మణులం గనుంగొని.

523


మ.

కరిసింహాంచితగాము లశ్వినిసమాకారుల్ దళత్పద్మభా
స్వరనేత్రుల్ గమనీయయౌవనులు గీర్వాణ ప్రతాపుల్ భయం
కరశార్దూలమహోక్షసన్నిభులు లోకత్రాణపారీణు లు
దు్ధుకోదండకృపాణబాణయుతదోస్స్థూణుల్ ప్రవీణుల్ గడున్.

524


వ.

ఈరాజన్యకుమారశేఖరులు పాదచారు లై వచ్చుట కేమి కారణం బని యడుగఁ
గౌశికుండు జనకుం గనుంగొని వీరలు రామలక్ష్మణు లనువారలు దశరథనందనులు
నావెనుక సిద్ధాశ్రమంబున కేతెంచి యచట నవక్రపరాక్రమం బడర.

525


ఉ.

తాటకఁ ద్రుంచి వైచి యతిదర్పితుఁ డైనసుబాహు సాయకో
త్పాటితుఁ జేసి గీటడఁచి ధర్మ మెలర్ప నహల్యశాప ము
చ్చాటన మొందఁజేసి కడుసమ్మద మారఁగ నీగృహంబునం
జాటఁగ నున్నశంకరునిరచాపముఁ జూడఁగ వచ్చి రేర్పడన్.

526


వ.

అనవుడు నప్పు డహల్యానందను డైనశతానందుం డపరిమితానందుఁ డై వి
శ్వామిత్రు నవలోకించి మాతల్లిదండ్రులకుఁ గూటమి గలిగె నేము గృతార్థుల
మైతి మనుడు నతని కతం డిట్లనియె.

527


క.

జమదగ్ని రేణుకం బ్రే, మమునం గలసినవిధం బమర గౌతమసం
యమియు నహల్యం దనసతి, సముచితగతిఁ గలిసి వాంఛ సలుపఁగఁ జనియెన్.

528


వ.

అనినం గ్రమ్మఱ రోమాంచకంచుకితగాత్రుం డై శతానందుం డి ట్లనియె.

529


చ.

దినకరవంశదీపకునిఁ దెచ్చి మునీశ్వర మమ్ముఁ బ్రోచి తీ
యనఘునిదర్శనంబున మదంబయు దుస్తరశాపముక్త యై
తనపతిఁ గ్రమ్మఱం గలిసెఁ దద్దయు నున్నతి కెక్కె మాకులం
బనుచుఁ బ్రియంబుతోఁ బలికి యానృపపుత్రులఁ జూచి యి ట్లనున్.

530


వ.

రఘురామచంద్రా మత్కులవార్ధచంద్రా భవద్దర్శనంబున మజ్జననీజనకుల కంచి
తసంయోగంబు గలిగెఁ గౌశికపాలితుండ వగునీకు నెల్లెడల నెందును భద్రంబ
వినుము చెప్పెదఁ గౌశికుపరాక్రమంబును దపఃప్రభావంబును; మున్ను ప్రజాప
తికిం గుశుం డుదయించె నతనికిఁ గుశనాభుం డుదయించె నతనికి గాధి యుద
యించె నాగాధికి విశ్వామిత్రుండు పుట్టి తేజం బెసంగ ననేకసహస్రవర్షంబులు.

531

విశ్వామిత్రునిచరిత్రము

క.

 అశ్వద్విపరథభటబల, శాశ్వతలక్ష్మీసమృద్ధిసంకలితుం డై
విశ్వధరిత్రీచక్రము, విశ్వామిత్రుండు నీతి వెలయఁగ నేలెన్.

532


వ.

అట్లు రాజ్యంబు సేయుచు నొక్కనాఁ డక్షౌహిణీసేనాపరివృతుండై నగరంబుల
నానారాష్ట్రంబుల మహానదుల నానాశ్రమవనంబులఁ గ్రుమ్మరుచు బహుళపరిమళ

మిళితకుసుమమధురఫలకలితవివిధతరువిసరవిలసితంబును నిర్వైరినానామృగసం
కులంబును సిద్ధచారణవిరాజితంబును దేవదానవగంధర్వకిన్నరపరివృతంబును
బహుపక్షీరవకోలాహలంబును దపశ్చరణాగతబ్రహ్మర్షివిభాజితంబును దేవర్షి
సమాశ్రితంబు ననిలాంబుజీర్ణపర్ణఫలమూలాశనమునిజనసమంచితంబును శమ
దమాన్వితజితేంద్రియవాలఖిల్యప్రముఖతపోధనసమాకీర్ణంబు నగుచు బ్రహ్మలో
కంబునుఁ బోలె నుల్లసిల్లుచున్న వసిష్ఠాశ్రమంబుఁ జొచ్చి యమ్మహానుభావునకుఁ
బ్రణమిల్లిన నాశీర్వదించి యప్పుడు.

533


తే.

ఒనర నుచితాసనంబున నుండఁ బనిచి, యర్హపూజలు గాంచి యధికమధుర
సరసఫలమూలములను భోజనము పెట్టి, యెలమి నున్నంతఁ గౌశికుం డిట్టు లనియె.

534


క.

మీరును నిట మీవా రగు, వారును సేమమున నున్నవారే మీవి
స్ఫారాగ్నిహోత్రతపములు, వారక నిచ్చలును మీఱి వర్తిలుచున్నే.

535


వ.

అనిన వసిష్ఠుండు సర్వంబును బ్రవర్తిల్లు ననుచు నతనిం గనుంగొని.

536


మ.

నిరతిన్ భృత్యులఁ బ్రోతె దుష్టరిపులన్ నిర్జింతె రాజ్యాంగముల్
పరిపాటిం బరికింతె ధర్మమున భూభాగంబు పాలింతె నీ
కరయన్ సేమమె నీతనూజులకుఁ గల్యాణంబె భద్రంబె యి
ద్ధర నీవారల కెల్ల నన్న నగు భద్రం బన్న నమ్మౌనియున్.

537


క.

చన నీకు విందు సేసెద, నని విశ్వామిత్రు నునిచి యంచితచిత్తం
బునఁ దలఁచి కామధేనువు, ననువుగ రప్పించి చూచి యాగవితోడన్.

538


వ.

ఈ రాజునకు సమస్తబలంబునకు విందు పెట్టవలయు నిష్టాన్నపానాదులు సృజ
యింపు మనుచుం బనుప నాసురభియు షడ్రసోపేతంబు లైనఖాద్యచోష్యలేహ్య
పేయాదివివిధవస్తువులును మృష్టాన్నరాసులు నాజ్యప్రవాహంబులును మధుర
దధికుల్యలును వివిధసూపశాకంబులును వలసినవస్తువులు సృజియింప సకల
బలంబులుం దానును బరితుష్టిగ భుజియించి యరుదందుచు నవ్వసిష్ఠు నవలో
కించి విశ్వామిత్రుండు నీచేయుసత్కృతుల కెంతయు సంతసించితి నిం కొక్కటి
వినుము.

539


క.

లక్షతురగంబులను మఱి, లక్షమదేభముల వేయిలక్షలమణులన్
లక్షలగోవుల నిచ్చెద, దక్షత నా కిమ్ము నీవు తగ నీగోవున్.

540


వ.

అనవుడు నవ్వసిష్ఠుం డెంతయు మనంబున వగచి యాకౌశికుతోడ.

541


క.

ఈధేనువు నాజీవిత, మీధేనువు నానిధాన మీధేనువు నా
సాధితకర్మముఁ బ్రాణము, నీధేనువ నాధనంబు నెల్లతపంబున్.

542


క.

నీవు జగత్త్రయ మిచ్చిన, నీజపహోమార్థసురభి నే నీఁ జాలన్
నావుడు నతికుపితుం డై యావిశ్వామిత్రనృపతి యామునిసురభిన్.

543


వ.

బలిమిం గొనిపోవ నాధేను వతిదుఃఖంబుం బొంది యాత్మలో ని ట్లుషేక్షించునే

నానాథుం డైనవసిష్ఠముని యనుచుం జింతించి యట పోక తన్నుం బట్టుకొని
పోవునుద్దండభటశతంబులం బడఁదన్ని విడిపించుకొని వాయువేగంబునం బఱ
తెంచి మునివరుమ్రోల నిలిచి.

544


ఉ.

నన్ను ననాథఁబోలె నరనాథునిభృత్యులు చండబాహుద
ర్పోన్నతిఁ బట్టికొంచుఁ జన శ్రీ నూరక చూచెద విట్లు నీకు నే
ము న్నొకయెగ్గు సేసితినె ముందట దుర్దశ నొంద స్వామి వై
యున్నమునీంద్ర నన్ను నిటు లొప్పరికింపఁగ నీకుఁ బాడియే.

545


వ.

నావుడు మునివరుం డాసురభి నాలోకించి.

546


క.

నీ వొకయపకృతి నాకుం, గావింపవు ని న్నుపేక్ష గైకొని విడువన్
భూవరుఁడు బలిమి నినుఁ గొని, పోవఁగ నడ్డపడలేక పొగిలెద బుద్దిన్.

547


క.

అక్షౌహిణిరథసేనా, ధ్యక్షుం డక్షీణవిక్రమాధికదక్షుం
డీక్షోణికి నధిపతి వీ, రక్ష త్రియుఁ డితని గెలువ బ్రహ్మకు వశమే.

548


క.

అనవుడు వసిష్ఠమునివరుఁ, గనుఁగొని యాధేను వనియె ఘనతేజుఁడ వీ
వనిమిషులకు దుర్జయుఁడవు, నిను నెవ్వఁడు మిగుల నోపు నిర్మలపుణ్యా.

549


క.

తలపోయ నెందు క్షత్రియ, బలమునకంటెఁ గడు విప్రబల మెక్కుడు నీ
వలిగిన నతఁ డెంతటివాఁ, డలవున ననుఁ బనుపు మతనియఖిలబలంబున్.

550


క.

పరిమార్చెద నా నమ్ముని, వరుఁ డప్పుడు కెరలి నీ వవారితబలకిం
కరుల సృజియించి చెచ్చెర, హరియింపుము వేగ వీనియఖిలబలంబున్.

551


మ.

అని పల్కన్ విని కామధేనువు సముద్యత్కోపవేగంబునన్
ఘనహుంకారము సేయఁ దత్ప్రథితహుంకారంబునం బుట్టి యే
పున శాతాయుధపాణు లై బహుభటుల్ భూరిప్రతాపంబునం
దునుమం జొచ్చిరి కౌశికోగ్రబలమున్ దుర్వారు లై శూరు లై.

552


శా.

వారిం జూచి యుదగ్రుఁ డై కనలి విశ్వామిత్రుఁ డుగ్రాశని
క్రూరాస్త్రంబుల నొంచి భటుల సంక్షోభంబు నొందించినన్
ఘోరప్రేక్షణుఁ డై వసిష్ఠముని యాగోవుం బ్రబోధింప హుం
కారం బప్పటియట్ల చేయ శబరుల్ కాంభోజులుం బల్విడిన్.

553


వ.

యోనిప్రదేశంబున యవనులును శకృత్ప్రదేశంబున శకులును రోమకూపంబుల
మ్లేచ్ఛులును హారికులుం గిరాతకులు నందంద పదిగో ట్లవతరించి భీమరూపం
బులు భీమాయుధంబులు భీమక్షేత్రంబుల భీమవర్ణంబుల భీమహుంకృతుల భీకరు
లగుచు దర్పాటోపంబుల విశ్వామిత్రుబలంబులకుం గవిసి హరులతోఁ గరులతో
నరదంబులతోడ సర్వబలంబులం బరిమార్చి విజృంభింప నప్పుడు.

554


క.

కౌశికుసుతు లురుకోపా, వేశులు నూర్వురు వసిష్ఠు వెసఁ దాఁకిన న
క్లేశంబున నతఁ డందఱ, నాశము నొందించె ఘననినదహుంకృతులన్.

555

వ.

అట్లు తనబలంబులుం దనయులుం బొలిసిన నతిదుఃఖితుం డగువిశ్వామిత్రుండు.

556


క.

హితదంష్ట్రమహాసర్పము, గతి రాహుగ్రస్తతరణికరణిన్ భగ్నా
తతపక్షపక్షికైవడి, గతవేగపయోధిపగిదిఁ గడునిష్ప్రభుఁ డై.

557


క.

తనసుతు రాజ్యము సేయఁగఁ, బనిచి తగం దుహినశైలపార్శ్వంబునకుం
జని భూరితపము హరునకుఁ, జనఁ జేయఁగ వచ్చి మెచ్చి శంభుఁడు కరుణన్.

558


క.

నరవర నీతపమునకును, వరదుఁడ నైతి మదిలోని వాంఛిత మారన్
వర మెయ్యది యడుగు మనన్, హరునకు నతిభక్తి మ్రొక్కి యతఁ డి ట్లనియెన్.

559


క.

సముచితభంగిన్ మత్కా, మ్యము నీకృపఁ గలుగునేని నఖిలధనుర్వే
దము నాకును సాంగోపాం, గము గా నుపదేశ మిమ్ము కారుణ్యనిధీ.

560


క.

సురమునిగంధర్వనిశా, చరదానవయక్షులందు జైత్రము లగుభా
సురతరశస్త్రాస్త్రంబులు, పరఁగఁగ నిమ్మనిన నిచ్చి భర్గుం డరిగెన్.

561


వ.

అ ట్లమ్మహాదేవునివలన ధనుర్వేదంబును దివ్యశస్త్రాస్త్రంబులుం బడసి మహో
త్సాహంబునం బొంది దర్పాతిరేకంబున వసిష్టాశ్రమంబున కరిగి.

562


అరుదుంగీలలు గ్రమ్మ నాశ్రమముపై నాగ్నేయబాణావళుల్
పరఁగింపన్ వన మెల్లఁ దీపశిఖలన్ భస్మంబుగా సంయమీ
శ్వగులుం బక్షిమృగప్రతానములు సర్వప్రాణులున్ భీతితోఁ
దిరుగంబాఱఁగ నోడకుండుఁ డనుచున్ దీప్తప్రతాపంబునన్.

563


క.

చండభుజాదండోద్ధుర,దండధరోద్దండికాలదండక్రీడో
చ్చండగతి బ్రహ్మదండ మ, ఖండత్వర నెత్తికొనుచుఁ గౌశికుతోడన్.

564


ఉ.

తక్కక యోరికౌశిక మదంబున వచ్చి చిరప్రవృద్ధ మై
యెక్కినసజ్జనాశ్రమము నేల వినాశము చేసె దింక సొం
పెక్కక నాశ మొందఁ గల వీదురితంబున నీవు నీబలం
బెక్కడ నాదుబ్రహ్మబల మెక్కడ క్షత్రియవంశపాంసనా.

565


శా.

నీక్షత్రాఢ్యబలంబు సర్వముఁ జన న్వీక్షింప నీవంశమున్
నిక్షత్రంబుగఁ జేయు నాదుబలము న్వే చూపెదన్ నేఁడు సూ
క్ష్మక్షాంతిం బరికించి చూడుము విపక్షక్షత్త్రపక్షావళీ
శిక్షాదండము బ్రహ్మదండము నరిశ్రేణీభిదోద్దండమున్.

566


వ.

అనుటయు.


శా.

ఘోరక్రోధముతోడఁ గౌశికుఁ డతిక్రూరాగ్నిబాణంబు వి
స్పారాభీలవిశాలకీల లడరం బై నేయ నమ్మౌని హుం
కారం బారఁగఁ గిన్క నాశరము నుగ్రబ్రహ్మదండంబునన్
వారించెన్ ఘనవారి యగ్నిజపమున్ వారించుచందంబునన్.

567


వ.

అలిగి విశ్వామిత్రుండు గ్రమ్మఱ వారుణాస్త్రంబు నుపేంద్రాస్త్రంబును బాశు

పతాస్త్రంబు నైషీకంబును మానవంబును మోహనంబును గాంధర్వంబును
బ్రస్వాపనంబును జృంభణంబును సంతాపనంబును విలాపనంబును శోషణంబును
దారుణంబును జామదగ్న్యంబును బహ్మపాశంబును గాలపాశంబును వరుణపా
శంబును బినాకాస్త్రంబును శుష్కార్ద్రంబులును బైశాచికాస్త్రంబును గ్రౌం
చంబును ధర్మచక్రంబును గాలచక్రంబును విష్ణుచక్రంబును వాయవ్యంబును మథ
నంబును హయశిరంబు నశనిద్వయంబును గంకాలముసలంబులును వైద్యాధరం
బును ద్రిశూలంబును గాపాలంబును నివి మొదలుగా ననేకాస్త్రంబు లేయ వాని
నెల్ల బ్రహ్మదండంబునఁ జక్కాడి వసిష్ఠమునివరుండు బ్రహ్మతేజోమూర్తి వెలుంగ
నప్పుడు కెరలి విశ్వామిత్రుండు బ్రహ్మాస్త్రంబు సంధించిన నమ్మహాస్త్రంబు
గనుంగొని.

568


క.

సకలామరగంధర్వులు, సకలోరగసకలభూతసకలదిశాపా
లకసకలగ్రహతారక, సకలభువనసకలమునులుఁ జలనముఁ బొందన్.

569


క.

బ్రహ్మాదులు మదిఁ బొగడఁగ, బ్రహ్మాండము విస్ఫులింగపంక్తుల నిగుడన్
బ్రహ్మర్షివరునిమీఁదను, బ్రహ్మాస్త్రము మంట లెగయ బలువిడి నేసెన్.

570


మ.

అటు లేయంగఁ జటచ్ఛటప్రకటఘోషాభీలకీలచ్ఛటా
స్ఫుటధూమాకులవిస్ఫులింగచయవిస్ఫూర్తుల్ వెలుంగన్ విశం
కటవేగంబున బ్రహ్మదండమును నొప్పం దాఁటి రాఁ బట్టి యు
ద్భటరోషంబునఁ జేసి మ్రింగె ముని మహాబ్రహ్మాస్త్రమున్ వీరుఁ డై.

571


వ.

ఇ ట్లమ్మహాస్త్రం బుపసంహరించి.

572


మ. స్ర.

అతిచండబ్రహ్మదండం బసమశమనదండాకృతిన్ భీమధూమా
న్వితకల్పాంతాగ్నిభంగిన్ వెలుఁగుచుఁ దనచే విస్తరింపం ద్రిలోకా
ద్భుతరూపబ్రహ్మతేజస్స్ఫురణ మెఱయ విస్ఫూర్తిబాణాగ్నికీలా
ప్రతతుల్ దద్రోమకూపప్రభవము లగుచుం బాఱి యగ్గాధిపుత్రున్.

573


వ.

చుఱపుచ్చం జొచ్చె నప్పు డఖిలమునులు వసిష్ఠుం బ్రశంసించి నీతేజం బమోఘం
బు నీచే విశ్వామిత్రుండు నిరస్తప్రభావుం డయ్యె నింక నుపశాంతిం బొందు మని
పలుక వసిష్ఠుండును బ్రశాంతిగరిష్ఠుం డయ్యె నప్పుడు విశ్వామిత్రుండు దర్పం
బడంగి యతిలజ్జితుం డై యంతర్గతంబున.

574


క.

అరుదార నమ్మునీశ్వరు, నురుతర మగు బ్రహ్మదండ మొక్కఁడ యతిభీ
కరతమసామర్థ్యంబున, వరదివ్యాస్త్రముల నెల్ల వడిఁ జక్కాడెన్.

575


క.

అనివారిత మప్రతిహత, మనుపమ మధికం బజయ్య మభయప్రద మీ
ఘనుబ్రహ్మబలమ బల మిలఁ, గనుఁగొన నీక్షత్రబలము గాల్పనె యనుచున్.

576


వ.

వనటం బొంది యవ్వసిష్ఠుబ్రహ్మతేజఃప్రభావంబు నుద్దేశించి.

577


క.

ఘన మగు బ్రహ్మర్షిత్వము, తనకుం గా నాత్మఁ గోరి దక్షిణదిశకుం

జని ఫలమూలాశనుఁ డై, చనఁ బత్నియుఁ దానుఁ దపము సలుపుచు నుండెన్.

578


క.

అనఘుఁడు విశ్వామిత్రుఁడు, ఘనవిక్రము లైన సుతులఁ గనియె హవిష్యం
దుని విభుఁ డైనమధుస్యం, దుని ధృతినేత్రుని మహారథుం డనువానిన్.

579


మ.

అట వేయేడులు నిండ నుగ్రతప ముద్యద్దాంతితోఁ జేయఁగా
నట కేతెంచి పితామహుం డనియెఁ బెంపారంగ నీచేయువి
స్ఫుటవిస్ఫారతపంబు సర్వభువనంబుల్ నిండె నీ వింక నా
దట రాజర్షివి గమ్ము పొ మ్మనుచు నాతం డేఁగ దుఃఖాత్ముఁ డై.

580


క.

భూరిగఁ జేసిన నాతప, మూరక యెర వయ్యె నకట యొనఁగూడదు నా
కారయ బ్రహ్మర్షిత్వం, బీరాజర్షిత్వ మొల్ల నిం కే ననుచున్.

581


వ.

కౌశికుం డతిఘోరతపంబు సేయుచుండె నాసమయంబున.

582

త్రిశంకుమహారాజుచరిత్రము

తే.

అనఘుఁ డిక్ష్వాకుకులవిభుఁ డగుత్రిశంకుఁ, డనుమహారాజు తనకు దేహంబుతోన
దివికిఁ జనునట్టియజ్ఞంబు తివిరి సేయు, చిత్తమునఁ బిలిపించి వసిష్ఠుతోడ.

583


క.

నా కీదేహముతోడన, నాకము నన నగుమఖం బొనర్పుం డనఁగా
నీ కీదేహముతోడన్, నాకమునకు నేఁగరాదు నరవర యనుడున్.

584


చ.

తనర వసిష్ఠనందను లుదగ్రతపం బురునిష్ఠ దక్షిణం
బునఁ జలుపం ద్రిశంకునృపుపుంగవుఁ డక్కడ కేఁగి సమ్మదం
బునఁ గని యమ్మునీంద్రులకు మొక్కి వసిష్ఠమునీంద్రుఁ డట్లు గా
దనిన తెఱంగు తెల్పి వినయంబున వారలతోడ ని ట్లనున్.

585


క.

సురపురికి నొడలితోడన, యరుగఁగఁ జేయింపుఁ డుచితయజ్ఞము నను మీ
గురుకరుణ ధర్మసాధకు, లరయఁ బురోహితుల కారె యవనీశులకున్.

586


క.

అన విని ఘనుఁడు వసిష్ఠుం డనుమతి సేయంగలేనియాపని మాచే
నొనరింప నగునె దుర్మతి, గనుఁగొనఁగా లేవు గాని కార్యం బగునే.

587


వ.

అనవుడు.

588


క.

పాయక యీవల నావల, మాయాశ్రితు లగుచు బ్రదికి మద్వాంఛితముం
జేయనిమీ రేటికి మఱి, మీయాగురుఁ డేల మాకు మే లొనఁగూడన్.

589


వ.

అన్యుచేతం జేయించికొనియెదం గాక యని పలుక నవ్వాసిష్ఠు లలుక.

590


క.

చండాలుండవు గ మ్మని, చండక్రోధమునఁ బలుకఁ జండాలత యు
ద్దండగతి నపుడు వచ్చినఁ, జండాలుం డై త్రిశంకుజనపతి యంతన్.

591


సీ.

ఘనరాజతేజంబు గాలినగతి సమం, గళకాకసన్నిభగాత్ర మమరఁ
బెనుమైల యగు నీలిప్రేలిక మొలఁ గట్టి, పై నొకయెఱ్ఱనిప్రాఁత దాల్చి
మును దాను బూనిన కనకభూషణము ల, యోమయభూషలై యొప్పుచుండఁ
జెదరినకేశముల్ చెనుపరిమాటలు, వికృతస్వరంబును వెలయఁ గలిగి

యినుపయుంగరములుఁ గేల నిడినకోల, నేల నందంద మొరయంగ నెరయ నచట
నచట శంబళి శంబళి యనుజనములఁ, గదియ కావలఁ దొలఁగుచు నొదుఁగుచుండె.

592


క.

ఆరాజుఁ జూచి యప్పుడు, పౌరులు భృత్యులు నమాత్యబంధుజనంబుల్
చేరక విడిచి రతండును, గౌరవ మెల్లఁ జెడి పోయెఁ గౌశికుకడకున్.

593


క.

కౌశికుఁ డెఱిఁగి యయోధ్యా, ధీశుఁడ వగునీకు నేల యీచండాల
క్లేశము వచ్చెను నావుడు, నాశాపక్రమముఁ జెప్పి యతిదుఃఖమునన్.

594


వ.

కౌశికునకుఁ బ్రణమిల్లి యతం డి ట్లనియె.

595


సీ.

ఏను జేసెద నన్న యిష్టయజ్ఞము సేయ, నొనర నెన్నఁడు బొంక నొకట మున్ను
నిట్టియాపద నున్న నిటమీఁద నైనను, సత్యంబ పాటింతుఁ జలము మెఱయ
బహుతరాధ్వరములు బహుదానధర్మముల్, ప్రియముతోఁ గావించి పెంపు గంటి
గురుల నారాధింతు గురులు నాపైఁ గృపా, రతిలేమి ధర్మకార్యంబు చిక్కెఁ
దనకు దైవంబు లేకున్నఁ దాను జేయు, పౌరుషం బపకారమై పరిభవించుఁ
గాన నాపాలిదైవమై కావు నన్ను, జనశరణ్య విశ్వామిత్రమునివరేణ్య.

596


మ.

అనుడు నెమ్మది నుండు భూవర ముదం బారంగ నిచ్చోటికి
న్ఘనపుణ్యవ్రతు లైనసర్వమునుల న్రావించి యజ్ఞంబు గ
న్కనిఁ జేయించి తగంగ నీపలుకు నిక్కం బై ప్రకాశింపఁగా
విను నీదేహముతోన నాకమునకున్ వేవేగ యేఁ బుచ్చెదన్.

597


క.

అని తనశిష్యుల నందఱఁ, గనుఁగొని ఋత్విజుల మునులఁ గడువేగమునం
గొని రండు త్రిశంకుఁడు వ, చ్చినవాఁ డటు గాన మఖముఁ జేయఁగవలయున్.

598


చ.

అన విని వార లేఁగి రయ మారఁగ వచ్చి మునీంద్రచంద్ర నీ
యనుమతి మమ్ముఁ దె మ్మనిన యందఱఁ దోడ్కొని వచ్చినార మిం
పెనయ వసిష్ఠునాశ్రమమునీంద్రులు దక్కఁగ నవ్వసిష్ఠునం
దను లొకకొన్ని యాడిరి మదంబులతో విను వారివాక్యముల్.

599


ఉ.

మాలఁడు సోమయాజియటె మాలకు రాజటె యాజకుండు చం
డాలమఖంబునం గుడువ నల్వునఁ బాఱులు వత్తురట్టె ది
క్పాలకు లేఁగుదెంతురటె పైఁబడి తత్య్రతుభాగముల్ గొనన్
వాలి యనామకుండటె దివంబునకుం జనువాఁడు బొందితోన్.

600


క.

విన నివి యెంతయుఁ జిత్రము, లనుచు వసిష్ఠసుతు లాడి రచ్చోటితపో
ధను లంద ఱిచ్చటికి రా, మని యుత్తర మిచ్చి రనిన నతికోపమునన్.

601


మ.

నుతనిష్ఠం దప మగ్రతం జలుపునన్నుం గ్రొవ్వి దూషించును
ద్యతపాపాత్ములు నూఱుభేదములఁ గ్రవ్యాదత్వముం బొంది దు
స్స్థితిఁ గౌలేయకమాంసమున్ దినుచు వర్తింపంగ ని మ్ముర్వి నా
గతి న న్నాడిన యామహాధముఁడు వే కానీ నిషాదుం డిలన్.

602

వ.

అని పలికి తనకడ నున్నఋత్విజుల మునుల నాలోకించి.

603


క.

మతిఁ దలఁప నీత్రిశంకుం, డతిపుణ్యుఁడు సత్యసంధుఁ డనఘుఁ డనేక
క్రతువులు చేసినవాఁ డీ, క్షితిపప్రియమఖము మనము సేయుద మనినన్.

604


క.

మన మిప్పని గా దనినను మనలం, గ్రోధాగ్ని నితఁడు మండి శపించున్
ఘనరోషి యీతఁ డీతని, పనుపునఁ జేయుదము మఖము ప్రాజ్ఞత ననుచున్.

605


వ.

వార లందఱు నానామంత్రపూతంబుగాఁ జేయుచుండ నయ్యజ్ఞంబునకుం దాన
యాజకుం డై విశ్వామిత్రుం డనుష్ఠించుచుండెఁ బ్రసంగం బైన.

606


క.

సురల హవిర్భాగము గొన, వరుసను రం డనుచుఁ బిలువ 6 వారలు భూరి
స్వరముల రామని పేర్కొన, నురుతరరోషమున నలిగి యుగ్రుం డగుచున్.

607


కుశపూత మైనచే నస, దృశగతి నృపు నెత్తి వెస మదీయోగ్రతపో
వశసామర్థ్యము చూడుము, త్రిశంకునృప నిన్ను నిపుడు దివికిం బుత్తున్.

608


వ.

అని పలికి నేను బాల్యం బాదిగా నధికపుణ్యతపంబుఁ జేసితి నేని నాతపస్సా
మర్థ్యంబున నింక.

609


మ.

సురలోకంబున కేఁగు మీతనువుతో క్షోణీశ నా నానరే
శ్వరుఁడున్ నాకము చేర నింద్రుఁ డలుకం జండాల పొ మ్మంచు స
త్వరుఁ డై త్రోచినఁ గావవే కరుణ విశ్వామిత్ర యంచున్ భయం
కరభంగిం దలక్రిందుగాఁ బడునెడన్ గాధేయుఁ డుద్యద్దయన్.

610


క.

శరణార్థి యగుత్రిశంకుని, ధరణీశ్వర వెఱవ కనుచుఁ దారామార్గాం
తరమున నిలువు మటంచున్, సరనాయకు నిలిపి తత్క్షణమ చని యచటన్.

611


క.

సురపురికి సురపురంబును, సురలకు మఱి వేఱుసురులఁ జొప్పడ నింకన్
విరచింతు ననుచుఁ దలఁపఁగ, సురలును సన్మునులు వచ్చి శుభవాక్యములన్.

612


క.

సురనాథుతోడఁ బురుడుగ, నరనాయకునకును వేగ నాకం బమరన్
వెరవున రచించి తారో, త్కరముల సప్తర్షివరులఁ క గల్పింపకుమీ.

613


సీ.

చిరపుణ్య కౌశిక గురుశాపహతుఁ డైన, చండాలుఁ డద్దివి నుండఁ దగునె
యనిన విశ్వామిత్రుఁ డనియె వారలతోడ, మానుగా నీరాజు మేనితోడ
వెలయ నాకమునందు నిలిపెద నన్నాఁడఁ, గాన నాపలుకు నిక్కంబు గాఁగ
నేను గల్పించిన యీనాకమునఁ దార, కంబులనడుమ నక్షత్రవీథి
కంటెఁ బొడువున నమరసంకాశుఁ డగుచు, శిరము క్రిందుగ వ్రేలుచుఁ బరఁగ నింద్ర
భువనములు చెల్లునందాఁక భూరిమహిమ, దనర నుండెడు నన వార లనుమతించి.

614


వ.

అతనియనుగ్రహంబుఁ గొనియాడుచు నతని వీడ్కొని నిజస్థానంబుల కరిగి రంత
విశ్వామిత్రుండు దనయాశ్రమమునిజనంబులం జూచి యింక నీయాశ్రమం బతి
సమ్మర్దంబు గాఁగలదు తొలఁగిపోద మనుచుఁ గదలి విశాలాపురీసమీపంబునఁ
బొలుచు పుష్కరక్షేత్రంబునం దత్యంతతపంబు సలుపుచునుండె.

615

శునశ్శేఫునికథ

క.

అంత నయోధ్యాధిపుఁ డ, త్యంతఘనుం డంబరీషుఁ డధ్వర మధిక
స్వాంతమునఁ జేయఁ దొడర బ, లాంతకుఁ డెత్తుకొనిపోయె నామఖపశువుల్.

616


వ.

అప్పు డాయాజకుం డారాజు నవలోకించి.

617


క.

నీవు మదంబునఁ బశువుం, గావక యేమఱితి పశువు గలుగక యున్నన్
వేవే ప్రాయశ్చిత్తము, గావింపఁగవలయు నెట్టిక్రతువున కైనన్.

618


వ.

నరు నైనఁ బశువుఁ గాఁ జేసి యాగంబు సేయవలయు నని పలికి.

619


క.

క్రతు వంతరాయ మైనను, గ్రతుకర్త వినాశ మొందు ఘనపాపముచేఁ
గ్రతు వెడపకుండఁ జయ్యనఁ, గ్రతుపశువుం దేరవలయుఁ గ్రతుపుణ్యనిధీ.

620


వ.

అనిన రాజు కళత్రపుత్రాదులతోడ.

621


చ.

వనములఁ గొండలన్ గుహల వాఁగుల బావులఁ బల్వలంబులన్
ఘనతృణసీమలం బశునికాయములోపల గోష్ఠభూములం
దనరెడునట్టికందువలఁ దక్కినదేశములం బురంబులం
గనుకనిఁ జూచుచున్ వెదకి కానక చెచ్చెర వచ్చి యొక్కెడన్.

622


క.

అనఘాత్ముం డగురుచికుం, గనుఁగొని మఖపశువు వెదకి కానము నీనం
దను నొకని లక్షగోవులఁ, గొని పశువుం గాఁగ నిమ్ము కోరిక ననినన్.

623


తే.

పెద్దవాఁడు నా కెంతయుఁ బ్రియతినూజుఁ డతని నే నీకు నీఁజాల ననియెఁ దండ్రి
పిన్నవాఁడు నా కెంతయుఁ బ్రియుఁడు గాన, యాకుమారుని నీఁజాల ననియెఁ దల్లి.

624


వ.

అట్లయ్యిరువుకుం దగ నాడువాక్యంబులు విని శునశ్శేఫుం డి ట్లనియె.

625


తే.

పెద్దవాఁడు తండ్రికిఁ జాలఁబ్రియసుతుండు, పిన్నవాఁడు తల్లికి ముద్దుప్రియసుతుండు
వారలిరువురు నొల్లనివాఁడ నయిన, మధ్యముఁడ నేను వచ్చెద మానవేంద్ర.

626


వ.

నీ విచ్చెడు ననినగోవుల వీరి కిమ్ము నీవెనుక నే వచ్చెద ననిన నతం డాలక్షగోవుల
వారి కిచ్చి శునశ్శేఫుని రథంబున నిడికొని సంతోషంబున నేతెంచి పుష్కరక్షేత్రం
బున విడిసి యుండ.

627


సీ.

అచట విశ్వామిత్రుఁ డత్యుగ్రతపము సే, యంగ శునశ్సేఫుఁ డచటి కరిగి
భక్తి నామామకుఁ బ్రణమిల్లి కృతపుణ్య, తమ కతిప్రేమపాత్రంబు లనుచుఁ
గన పెద్దకొడుకు నాతండ్రియు మఱి పిన్న, కొడుకు నాతల్లియుఁ గూర్మి
పాపాత్ము లై యజ్ఞగపశువుగాఁ గృపమాలి, యంబరీషునకు న న్నమ్మికొనిరి
తనకు వార లెక్కడితల్లిదండ్రు లనఘ, నీవ తల్లివి దండ్రివి నీవ గురువు
క్షితిపుయజ్ఞంబు వెలయంగఁ జేసి నన్నుఁ, గావు ప్రాణదానం బిడి కరుణతోడ.

628


వ.

అనుచు దీనుండై యభయంబు వేఁడునల్లుని నాదరించి కౌశికుండు దనతనయుల
నవలోకించి.

629


క.

సుతులార నాకు నల్లుం, డితఁ డారయ మునిసుతుండు హితమతి మీలోఁ

గ్రతునిష్ఠ నొకఁడు పశు వై, యితని రక్షింపవలయు నెంతయుఁ గరుణన్.

630


క.

పురుషులు దనయులఁ బడయుట, పరలోకముకొఱకుఁ గాదె పరఁగన్ మీ రీ
శరణార్థి నితనిఁ గాచుట, పరలోకము నిదియె నాకుఁ బరమపదంబున్.

631


వ.

అదియునుం గాక యితని రక్షించుట బంధుహితంబును శరణాగతరక్షణంబును
యజ్ఞపాలనఫలంబు నగ్నిసంతర్పణంబును దేవతాతుష్టికార్యంబు నగు నావచనం
బు లాచరించుటయ మీ కతిధర్మం బనిన వార లనుమతింపక యాజనకునితోడ.

632


క.

తనసుతులఁ జంపి యన్యుల, తనయుల రక్షింప నాత్మఁ దలఁతురె యెటు నే
రనివార లైనఁ గావున, జనకుఁడ నైన నగు వినుము చన వీమాటల్.

633


వ.

అని పలికి వార లనుమతింప కునికి యెఱింగి.

634


క.

కడు నలిగి శునకమాంసము, నుడుగక వేయేండ్లు దినుచు నురుదుఃఖములం
బడుఁ డని శపించి మఱి కృప, యడర శునశ్శేఫుఁ బిలిచి యాతనితోడన్.

635


చ.

జయముగ రెండుమంత్రములు సమ్మతి నిచ్చెద వాని నెంతయున్
నియతి జపింపు సేమ మగు నీకు నృపాలకుఁడున్ నిజాధ్వరా
వ్యయఫల మొందు నంచు ముని యావరమంత్రము లిచ్చె నంత వే
ప్రియమున నేఁగె రాజు నట రేయి సనన్ మఱునాఁడు వేడుకన్.

636


క.

క్రతువాటమునకుఁ జన నా, యతిసుతు యూపమునఁ గట్టి యాతనిమే నం
చితరక్తగంధమాల్యా, న్వితముగఁ బశుపూజ సేసి విశసించునెడన్.

637


మ.

అరుదారం జలియింప కమ్మునిసుతుం డామంత్రముల్ రెండు సు
స్థిరనిష్ఠ జపియింపఁగా నచటికిన్ దేవేంద్రుఁ డేతెంచి యా
ధరణీపాలు విశిష్టయజ్ఞఫల ముద్యత్ప్రీతితో నిచ్చి యా
దర మార మునిపుత్రుఁ గాచి చనె నాత్మస్థానముం జేరఁగన్.

638


శా.

అంతం గౌశికుఁ డెంతయుం దపము నిండారంగ వేయేం డ్లతి
క్షాంతిం జేయఁగ బ్రహ్మయున్ సురలు నిచ్చన్ వచ్చి నీ విశ్రుత
స్వాంతం బైనతపంబుచేత ఋషి వై తం చాడి నా రేఁగఁగా
సంతోషింపక యాతఁ డుగ్రతప మానన్ వెండియుం జేయఁగన్.

639


మ.

కరికుంభస్తనభార మున్నతతటిత్కల్పప్రియాకారమున్
హరినీలోపలవేణియుం బ్రథితదీవ్యచ్ఛ్రోణియుం బద్మభా
స్వరరూపాస్యవికాసమున్ శరదుదంచచ్చంద్రికాహాసముం
బరఁగన్ మేనక వచ్చి యచ్చటఁ జరింపం జూచి మోహాంధుఁ డై.

640


మ.

సుదతీ యుల్లము దూఱుతూపుల మనోజుం డేయుచున్నాఁడు స
మ్మద మారన్ రతికేళి సల్పు మని యమ్మత్స్యాక్షితో వేడుకం
బదివర్షంబులు క్రీడ సల్పి మదిలో భావించి విజ్ఞాని యై
త్రిదశుల్ నాతప మీనిమిత్తమున వారింపంగ నీయచ్చరన్.

641

క.

పుత్తెంచినవా రని దివి, కత్తెఱవను వీడు కొల్పి యంగజు గెల్వం
జిత్తమునఁ గోరి వేయేం, డ్లుత్తరగిరివెనుకఁ దపము నుగ్రతఁ జలిపెన్.

642


తే.

అట్లు కౌశికుఁ డుత్తరమందు ఘోరతపము సేయంగ దేవతల్ దలఁకి వచ్చి
యజ్ఞభవుఁ గాంచి నీవు మహర్షి వనఁగఁ, గౌశికుం డర్హుఁ డన నగుఁగాక యనుచు.

643


మ.

అజుఁ డే తెంచి మహర్షి వైతి వనఁగా నాబ్రహ్మ నీక్షించి య
బ్జజ నీ వారసి నిక్కువంబుగ ననున్ బ్రహ్మర్షి వన్నంతదాఁ
క జయం బొందఁ దపం బొనర్తు నన నౌఁ గా కంచు లోకేశనా
కజు లేఁగన్ మఱియుం జలంబు నెఱయన్ గాధేయుఁ డత్యుద్ధతిన్.

644

విశ్వామిత్రుండు రంభను శపించుట

అనిలాహారుఁడు నూర్ధ్వబాహుఁడు నిరాహారుండు నై సీతునం
దనరం దోయములందు వేసవిఁ దగం బంచాగ్నిమధ్యంబునన్
ఘనవర్షాగమవేళ బట్టబయలం గా నుండి వేయబ్దముల్
సన నత్యుగ్రతపంబు నోపి సలుపన్ జంభారి రంభం దగన్.

645


చ.

కనుఁగొని రంభ దేవహితకార్యము సేయఁగ నేఁగి గాధినం
దనుతప మంతయుం జెఱుపు నావుడు నన్ను శపించుఁ గిన్క న
మ్ముని తెరు వేను బో వెఱతు మూర్ఖుఁ డతం డని పల్క నోడ కేఁ
బనుపడి నీకుఁ దో డమరఁ బంపెదఁ జయ్యనఁ బుష్పబాణునిన్.

646


వ.

ఏను నీవెనుకన వచ్చెద నని పనిచిన.

647


సీ.

చారుచంద్రికతోడి చంద్రబింబముఁబోలె, మందహాసానన మంద మొంద
నింద్రనీలప్రభ నెడనెడ వెదచల్లు, కుంతలకాంతులు కొమరు మిగులఁ
బద్మరాగప్రభల్ పైపయి నిగిడించు, పాదపల్లవరుచుల్ ప్రజ్వలింప
బాలాతపము గాయు పసిఁడికుండలమాడ్కిఁ, గుంకుమపరిలిప్తకుచము లమరఁ


తే.

గనకరేఖాసమాకృతిఁ దనువు మెఱయ
రాజహంసయానంబున రంభ వచ్చి
చిత్తభవుఁ జేయఁ గోయిల చెలఁగి కూయ
శ్రుతులఁ గూడఁ బాడుచుఁ దనమ్రోలఁ బొలయ.

648


మ.

అపు డీక్షించి ననుం దపోవిముఖుఁ జేయన్ వజ్రి పుత్తెంచినం
గపటేచ్ఛం జనుదెంచి యున్నది కడుగర్వంబుతో నంచు న
చ్చపలాక్షిం బటురోషవేగమున విశ్వామిత్రుఁ డత్యుగ్రుఁ డై
శపియించెం బదివేలవర్షములు పాషాణత్వముం బొందఁగన్.

649


చ.

అటు శపియించి శాపవిహితావధికాలము నిండఁ జన్నమీఁ
దట నొకపుణ్యుఁ డైన వసుధామరవర్యునిచేత నీ వతి
స్ఫుటముగ శాపమోక్షణముఁ బొందెదు నా శిల యయ్యె రంభ య

చ్చట నిలువంగలేక వెఱఁ జయ్యన నేఁగె మరుండు నయ్యెడన్.

650


మ.

తనవిస్ఫారతపంబు గొంత దఱుఁగం దా నాత్మ వేయేఁడు లిం
క నిరాహారుఁడ నిర్జితేంద్రియుఁడ నేకస్వాంతవృత్తుండ నై
చన నుద్యత్తప మూర్పు వుచ్చ కతినిష్ఠం దాల్మితోఁ జేసెదన్
నను బ్రహ్మర్షిని నీ వటం చజుఁడు సన్మానంబుతోఁ బల్కఁగన్.

651


వ.

అనుచు నుత్తరంబు విడిచి తూర్పుదెస కరిగి సిద్ధాశ్రమభూమియందు.

652


ఉ.

ఆరఁ దపంబు వత్సరసహస్రము నిండఁగఁ జేసి యాసతోఁ
బారణ సేయ నున్నతఱి బ్రాహ్మణుఁ డై బలభేది వేఁడ నిం
పారఁగ భోజనం బిడఁగ నన్నము సర్వముఁ దా గ్రహించినన్
నారక వెండియుం దపము వర్షసహస్రము సల్పుచుండఁగన్.

653


క.

ఆకౌశికునౌదల నతి, భీకరగతిఁ బొగలు నెగసి పేర్చి దిశాచ
క్రాకాశంబులు నిండఁగ, నాకము గంపించె రాలె నక్షత్రంబుల్.

654


క.

కడు బెగడు గుడిచె భువనము, లుడుగక జలనిధులు గలఁగె నుడుపథమునఁ బె
న్మిడుఁగుఱు లెడనెడఁ బొడమఁగ, వడిఁ బిడుగులు వడియెఁ బుడమి వడవడ వడఁకెన్.

655


వ.

అట్టియెడ.

656


క.

సురలును గంధర్వులు ముని, వరులుం బరమేష్ఠికడకు వాంఛం జని యా
సరసిజసంభవునకు నా, దరమునఁ బ్రణమిల్లి యాపితామహుతోడన్.

657


శా.

బ్రహ్మం బైనతపంబుఁ గౌశికుఁ డొనర్పం జొచ్చె నమ్మౌనికి
న్బ్రహ్మర్షిత్వము నైన బ్రహ్మపద మైనన్ వేగ యీకుండినన్
బ్రహ్మాండంబులు దత్తపోగ్నిశిఖలన్ భస్మంబు లౌ నావుడున్
బ్రహ్మణ్యుం డగుబ్రహ్మ సంయమినిలింపస్తోమముల్ గొల్వఁగన్.

658


మ.

చన నేతెంచి భవత్తపోమహిమ విశ్వామిత్ర బ్రహ్మర్షి వై
తనిశంబుం దప మింక నేల యన బ్రహ్మం జూచి బ్రహ్మాత్మజుం
డును బ్రహ్మర్షియు నైనపుణ్యుఁడు వసిష్ఠుం డిచ్చ నిక్కంబుగా
నను బ్రహ్మర్షిపదుండ వై తనక నే నమ్మన్ జగద్రక్షకా.

659


మ.

అనుడున్ బ్రహ్మయు సర్వదేవతలుఁ గామ్యం బొంద రప్పింపఁ జ
య్యన నేతెంచి తపోమహత్వమునఁ దథ్యం బొంద బ్రహ్మర్షి వై
తనుమానింపకు మన్నఁ గౌశికుఁడు నెయ్యం బొప్ప భక్తిన్ వసి
ష్ణునిఁ బూజించెఁ బ్రియంబుతోఁ జనిరి తోడ్తో నంత బృందారకుల్.

660


వ.

అని పలికి శతానందుండు రామచంద్రా
కేవలతపోమూర్తి యగు కౌశికుతపస్సా
మర్థ్యంబులు చెప్ప ననేకంబు లనిన రామలక్ష్మణులు నక్కడినభాసదులు నాశ్చ
ర్యసంతోషంబులం దేలి విశ్వామిత్రుం బ్రశంసించి పూజించి రంత.

661


క.

నాకులజుఁడైన రాముఁడు, శ్రీకంఠునివిల్లు విఱిచి సీతం బ్రీతిం

గైకొను రే పని చెప్పఁగ, నాకమునకు నరుగువిధమునన్ రవి గ్రుంకెన్.

662


వ.

ఆరాత్రి వేగిన జనకుండు రామలక్ష్మణసహితుం డగువిశ్వామిత్రు రప్పించి యర్హ
సత్కారంబు లాచరించె నప్పుడు విశ్వామిత్రుండు మిథిలేశుం గనుంగొని.

663


క.

ఘను లీరాజకుమారులు, దనరఁగ నీయింట నున్నధనువు క్రమమునం
గనుఁగొనఁ గోరెద రిటకున్, జనవర తెప్పింపు మనుడు జనకుం డనియెన్.

664


చ.

తనరఁగ యజ్ఞ భాగములు దక్షుమఖంబునఁ గ్రొవ్వి దేవతల్
సనఁ దన కీక యున్న నతిచండత నల్లి మహేశుఁ డీశరా
సనమున నెల్లదేవతల జర్జరితాంగులఁ జేయ భీతు లై
యనిమిషు లోలి నేఁగి యభయంబులు వేడిన నిచ్చి శాంతుఁ డై.

665


క.

జగతి మదీయకులాగ్రణి, యగునిమి కాఱవతరమున యవనీపాలుం
డగుదేవరాతుచేతికిఁ, దగ నిల్లడ యిచ్చె హరుఁడు తత్కార్ముకమున్.

666


క.

చిరకాలం బది మొదలుగఁ, దరతర మక్కార్ముకంబు తగ మాయింటన్
సురుచిరపూజల నొందుచు, నురుతరతేజంబుతోడ నొప్పుచు నుండున్.

667


క.

బాఁతిగ నే నాఁగటఁ గ్రతు, భూతలమును దున్నునపుడు పొలఁతుక వెలయన్
సీతాంతంబునఁ బుట్టిన, సీతానామంబు సేసి చెలువుగఁ బెంపన్.

668


చ.

పరిణయయోగ్య యైనఁ దగుభ ర్తకు నాసుత నీఁ దలంచి య
య్యురుతరచాప మెత్తి బల మొప్పఁగ నెక్కిడ నోపువానికిం
బరఁగఁగ నిమ్మహీతనయఁ బత్నిగ నిచ్చెద నంచు నే స్వయం
వర మని చాటఁ బంచినను వాంఛల వచ్చి యనేకభూపతుల్.

669


క.

తమముందటఁ బెట్టినచా, పము గనుఁగొని యెత్తఁ జేరి పటుతరభుజస
త్త్వములఁ గదలింపలే క, క్షము లై యుండంగ నెఱిఁగి కన్నియఁ దమకున్.

670


శా.

ఏ నీ కుండఁగ నల్గి యెంతయు మదం బేపార నాకోటపై
నానాసేనలతో వడిన్ విడిసిన న్సైరించి యే నుండఁగా
నానాఁటన్ మును సంచితంబు లగు సైన్యవ్రాతముల్ వోయిన
న్మానొందన్ సురలన్ భజించి బహుసేనం గాంచి యాసేనతోన్.

671


క.

వడిఁ బురము వెడలి విడిసిన, దడములపై నడువ విఱిగి తత్తఱమున మా
ర్పడి కొందఱు బలములు రూ, పడఁగం జెడిపోయి రంత నడరినభీతిన్.

672


వ.

అట్టులు గావున.

673


మ.

వడి రామక్షితినాయకుండు భుజసత్త్వం బొప్ప నాచాప మె
క్కిడినం జాలు మదీయపుత్రిఁ బ్రమదం బేపార నే నిచ్చెద
న్మృడుబాణాసన మున్నమందస దగ న్వేతెండు మీ రేగి యి
క్కడ కంచుం బదివేవురం బనిచె వీఁకన్ బాహుసారాఢ్యులన్.

674

శ్రీరామచంద్రుండు శివునివిల్లు విఱుచుట

ఉ.

పంచినవేడ్క లుల్లమునఁ బైకొన వారును నేఁగి యష్టచ
క్రంబు నయోమయంబును ధరాధరమూర్తియుఁ గాలమేఘతు
ల్యంబును నైనమందస బలంబున నందఱు ద్రొబ్బి తెచ్చి చో
ద్యంబునతోడఁ గన్గొనఁగ నాసభ ముందటఁ బెట్టి నిల్చినన్.

675


వ.

జనకుండు కౌశికుం గనుంగొని.

676


క.

సురగరుడోరగయక్షా, సురకిన్నరదనుజరాక్షసుల కైనను దు
ర్బర మగునీధను వెత్తఁగ, నరు లెంతటివారు గాధినందన యయినన్.

677


ఉ.

ఏపునఁ జూపు మీధనువు నీనృపపుత్రుల కంచుఁ బల్క నా
తాపసపుంగవుండు వసుధావరశేఖరు రాముఁ జూచి యీ
చాపము లీల నెత్తి భుజసత్త్వ మెలర్పఁగ నెక్కుపెట్టు నా
నాపటువిక్రమక్రమసమగ్రుఁడు రాముఁడు చేరి వేడుకన్.

678


క.

మందసఁ దెఱచి జనుల్ వెఱఁ, గందఁగ విలు వెడలఁ దిగిచి యాగవుసెన లీ
లం దొలఁగఁ ద్రోచి భూస్థలి, నందముగా నిల్పి మౌర్వి నలవఱిచి వెసన్.

679


మ.

కలభం బాతతచండతుండమున వీఁకన్ శేషనాగేంద్రునిన్
బలిమిం బట్టినభంగి రామధరణీపాలుండు కోదండమున్
బలుముష్టిన్ వడిఁ బట్టి యెత్తి తెగ విస్ఫారంబుగాఁ జేసి ని
శ్చలుఁ డై యల్లన లస్తకంబు వదలెం జాపంబు భగ్నంబుగన్.

680


క.

నారులఁ బట్టినవారికి, నారయ ధర్మములు గలవె యన నారిఁ గరం
బారంగఁ బట్టి రాముఁడు, పౌరులు చూడంగ ధనువు భగ్నము సేసెన్.

681


మ.

ధను వుద్యద్గతి రాముఁ డట్లు విఱువం దద్ఘోరఘోషం బొగిన్
ఘననిర్ఘాతనిపాతజాతనినదోగ్రధ్వాన మై మ్రోసిసన్
విని యాస్థానమువార లెల్ల వడిఁ బృథ్విం చెల్లి మూర్ఛిల్లి రా
జనకాధీశుఁడు రామలక్ష్మణులు విశ్వామిత్రుఁడుం దక్కఁగన్.

682


చ.

కులగిరు లెల్లఁ బెల్లగిలెఁ గుంభిని యల్లల నాడె దిగ్గజం
బులు బెదరెన్ భుజంగపతి బొమ్మరబోయెఁ బయోధు లన్నియుం
గలఁగె దిగంతముల్ వగిలెఁ గన్కనిఁ దారలు రాలె సూర్యచం
ద్రులగతి తప్పె మేఘములు దూలె నజాండము మ్రోసె నయ్యెడన్.

683


మ.

జనకుం డచ్చెరు వంది యెంతయు మదిన్ సంతోష ముప్పొంగ న
మ్మునిచూడామణితోడ ని ట్లనియె రాముం జూపి యీరాజనం
దనుశౌర్యం బతివిస్మయం బసమ మత్యంతంబు నాకూఁతు నీ
తని కే నిచ్చెదఁ బ్రీతి నాపలుకు నిత్యం బై నుతిం బొందఁగన్.

684


వ.

అని పలికి మునియనుమతిం దగినమంత్రులం బిలిపించి మీరు దశరథుకడ కేఁగి

యానృపతికి నీవృత్తాంతం బెఱింగించి వివాహంబునకుం దోడ్కొని రండని పను
ప వా రరిగి పుత్రాగమనంబున కెదురు చూచుచున్న దశరథుమనోరథం బారఁ
గదిసి దశరథేశ్వరా నీతనయుం డగురామచంద్రుండు సౌమిత్రిసహితుం డయి
విశ్వామిత్రువెనుకఁ జనుదెంచి యనేకరాక్షసవీరులం దునిమి కౌశికుయజ్ఞంబు
రక్షించి పదంపడి జనకుయజ్ఞంబు చూడం జనుదెంచి యచట సురాసురులకు
దుర్భరం బైనహరుచాపంబు నవలీల మోపెట్టి విఱిచిన రామచంద్రునిభుజవి
క్రమంబునకు జనకుం డెంతయు నాశ్చర్యసంతోషంబులం బొదలి యాతనికిఁ
దనకూఁతు సీత నిచ్చెద నని కౌశికానుమతి నిన్నుం బెండ్లికిఁ బిలువం బుత్తెంచిన
నేతెంచితి మింకఁ గడయక విచ్చేయు మనిన దశస్యందనుం డత్యానందంబునం
బొంది వారల కనేకదివ్యాంబరాభరణంబులుం గనకమణిగణంబులు నిచ్చి
వివాహమహోత్సవంబు చాటించి యమ్మఱునాఁడు వసిష్ఠవామదేవాత్రికశ్యప
కాత్యాయనమార్కండేయజాబాలిముఖ్యులతోడ బహురత్నభూషణకనకమయ
పీతాంబరంబు లలంకరించి మహోత్సవంబున.

685

దశరథుండు మిథిలాపురంబున కరుదెంచుట

సీ.

రాణ నొప్పారునికస్సాణరావంబులు, కాహళరావముల్ గ్రందుకొనఁగఁ
గమనీయభూషణగణమణిద్యుతులును, శాతాయుధద్యుతుల్ సందడింప
నాతపత్రధ్వజకేతవచ్ఛాయలుఁ, జామరప్రభలును సరసమాడ
ఘనబలోద్ధతరజంబును గడు నొప్పఁ బైఁ, జల్లుసుగంధరజంబు బెరయ
మధురగాననినాదముల్ మయిలక్రోళ్లు
వెలయఁ బూరించునాదముల్ గలయఁబడఁగ
వందిమాగధజనసూతబృందవివిధ
ఘోషణంబులు నిరుగెలంకులఁ జెలంగ.

686


మ.

కరటిస్కంధము లెక్కి నందనులు ముక్తాచ్ఛత్రసుచ్ఛాయలన్
సరి నేతేరఁ బురంధ్రులున్ బుధతతుల్ సామంతులున్ మంత్రులుం
గరులున్' వాజులుఁ దేరులున్ సుభటులున్ గాణిక్యమున్ గాయకో
త్కరమున్ యాచకసూతవందినటులుం గైవారులున్ నాగరుల్.

687


క.

సకలనియోగంబులఁ దనుఁ బ్రకటితవిభవములఁ గొలువఁ బరమప్రేమో
త్సుకత జనకక్షితినా, యకునగరంబునకుఁ జేర నరుగఁగ నచటన్.

688


సీ.

ఎదురుగా మిథిలేశుఁ డేతెంచి ప్రియముతో, దశరథుఁ గొనిపోయి తగినచోట
విడియించి యందఱ వెలయ సన్మానించి, ఘనులు వసిష్ఠాదిమునులు నీవు
నెమ్మి వచ్చితి రెందు నేఁడు నాకుల మొప్పె, నేను ధన్యుఁడ నైతి నృపవరేణ్య
నా చేయుమఖ మొప్పె నలినాప్తకులులతో, సంబంధ మది గల్గె సకలదిశల
యందు నాకీర్తి పెంపొందె నర్హభంగి, యమరఁగాఁ బెండ్లిలగ్నంబు నాఫ్తబుధుల

నడిగి మనము ప్రవర్తింత మనినజనకు, పలుకులకు మెచ్చి దశరథుఁ డలరె నపుడు.

689


క.

రాముని లక్ష్మణుఁ గొని వి, శ్వామిత్రుఁడు ప్రేమ మెసఁగ వచ్చినఁ గని య
త్యామోదముతో దశరథుఁ, డామునినాథునకు మ్రొక్కి యభిమత మొనరన్.

690


చ.

అనఘ మునీంద్ర మీకృపఁ గృతార్థుఁడ నైతిఁ దగంగ సర్వశో
భనములు గంటి నావుడు నృపాలక నీ వతిధార్మికుండ వ
త్యనుపమసత్యశీలుఁడ వుదంచితభాగ్యముకల్మి నీదునం
దనుఁ డగురామునిం బడసి ధన్యుఁడ వైతి సమస్తభంగులన్.

691


చ.

క్రతుపరిరక్షణంబునకుఁ గైకొని పంచిన వచ్చి నామఖం
బతిభుజశక్తిఁ గాచి రయ మారఁగ నెమ్మది నిల్చినారు నీ
సుతులను వీరిఁ జూడు మనఁ జొప్పడఁ బుత్రులు భక్తి మ్రొక్కినన్
హితమతి దీవనల్ పరఁగ నిచ్చుచుఁ గౌఁగిటఁ జేర్చె నర్మిలిన్.

692


క.

మఱునాఁడు దొరలుఁ దానును, మెఱయఁగ సభలోన నుండి మిథిలేశుం డ
క్కఱ ననుజుఁ దలఁచి నెయ్యము, వఱల శతానందుఁ జూచి వాంఛితబుద్ధిన్.

693


క.

ఇమ్ముగ నాయనుజుం డని, శమ్మును ధర్మపరుఁ డగుకుశధ్వజుఁడు ప్రమో
దమ్మున నిక్షుమతీతీ, రమ్మున సాంకాశ్య మనుపురంబున నుండున్.

694


క.

ఆతం డీకల్యాణము, ప్రీతిం జూడఁదగు నంచుఁ బిలిపింప నతం
డేతెంచి శతానందుని, బాఁతిగ జనకవిభుఁ జూచి భక్తిన్ మ్రొక్కెన్.

695


వ.

అనుజుని నుచితాసనంబున నుండఁ బనిచి మంత్రులం గనుఁగొని.

696


ఉ.

తోయజమిత్రవంశపతిఁ దోకొని రం డన మంత్రు లేఁగి భూ
నాయక మావిదేహజననాథుఁడు పిల్వఁగఁ బంచె మీయుపా
ధ్యాయులు మీరుఁ బుత్రులుఁ బ్రధానులు రం డన సంతసంబుతో
నాయవనీశ్వరుండు జనకాధిపు కొల్వున కేఁగి సమ్మతిన్.

697


మాకులగురుఁడు వసిష్ఠుఁడు, గైకొని కావింప నెల్లకార్యంబులకున్
మాకుం గలవాఁ డనవుడుఁ, గాకుత్స్థునిమాట కలరె గౌశికుఁ డెలమిన్.

698


వ.

అప్పుడు జనకుం జూచి దశరథునన్వయక్రమంబు వసిష్ఠుం డి ట్లని చెప్పె
నవ్యక్తప్రభవుం డగునాదిబ్రహ్మకు మరీచి మరీచికిం గశ్యపుండును గశ్యపునకు
వివస్వంతుండును వివస్వంతునకు వైవస్వతుండును వైవస్వతున కిక్ష్వాకుండు
నిక్ష్వాకునకుఁ గుక్షియుఁ గుక్షికి వికుక్షియు వికుక్షికి ననరణ్యుండు ననరణ్యునకు
బృథుండును బృథునకుఁ ద్రిశంకుండును ద్రిశంకునకు దుందుమారుండును
దుందుమారునకు యువనాశ్వుండును యువనాశ్వునకు మాంధాతయు మాంధా
తకు సుసంధియు సుసంధికి ధ్రువసంధియు ధ్రువసంధికిఁ బ్రసేనజిత్తును బ్రసేన
జిత్తునకు భరతుండును భరతున కసితుండు నుదయించి రాజ్యంబు సేయ నారా
జుపై హైహయులును దాళజంఘులును శశిబిందులు నేతెంచి యుద్ధంబు సేసి

యాక్రమింపం బత్నీసహితుం డై హిమవంతంబునకుం జని మృతుం డయ్యె నా
యసితునిపత్నులు గర్భిణు లై యుండ నందొక్కత సవతిగర్భంబు చెఱుప గరళం
బిడిన గరళయుక్త యగునాకాంత కాళింది చ్యవనునిఁ గాంచి పుత్రార్థిని యై
సద్భక్తి మ్రొక్కిన భార్గవకులజుం డగుచ్యవనుండు గాళిందిగర్భంబున నతిశూ
రుండు నధికధార్మికుండును సమస్తగుణసంపన్నుండు నగుకుమారుండు గరము
తోడం గూడఁ బుట్టెడు నని యాశీర్వదించిన నవ్వనిత యమ్మునికి నమస్కరించి
తనగృహంబునకు వచ్చి యతిసుకుమారుం డైనకుమారునిం గనియె నాకుమా
రుండు గరసహితుండై యుదయించెఁ గాన సగరుం డను పేరం బరఁగె నాసగరున
కసమంజుండు పుట్టె నతనికి నంశుమంతుండు నాయంశుమంతునకు దిలీపుండును
దిలీపునకు భగీరథుండును భగీరథునకుఁ గకుత్స్థుండు నతనికి రఘువు రఘువునకుఁ
గల్మాషపాదుండును గల్మాషపాదునకు శంఖణుండును శంఖణునకు సుదర్శనుండును
సుదర్శనునకు నగ్నివర్ణుండు నగ్నివర్ణునకు శీఘ్రగుండును శీఘ్రగునకు మరుండును
మరునకుఁ బ్రశుశ్రుకుండును బ్రశుశ్రుకునకు నంబరీషుండును నంబరీషునకు నహు
షుండును నహుషునకు యయాతియు యయాతికి నాభాగుండును నాభాగునకు
నజుండు నజునకు దశరథుండును దశరథునకు రామలక్ష్మణభరతశత్రుఘ్నులు ను
దయించిరి రామచంద్రునకు నీకూఁతు సీత నీఁగంటివి నీకులం బతిపావనం బయ్యెఁ
గృతకృత్యుండ వైతి వని వసిష్ఠుండు రఘువంశక్రమం బంతయుం జెప్పిన,

699


క.

 అంత శతానందుఁడు సభ, కెంతయు సమయజ్ఞుఁ డగుచు ని ట్లనియెను ధీ
మంతుం డగు జనకక్షితి, కాంతునివంశక్రమంబుఁ గడుఁ దెల్లముగన్.

700


వ.

అతిపుణ్యచరితుండును నీతివిశారదుఁడు నఖిలగుణాభిరాముండు నగునిమిచక్ర
వర్తికి మిథి జనియించె నమ్మిథికి జనకుం డారాజన్యున కుదావసుం డానరేంద్రునకు
నందివర్ధనుం డానృపాలునకు సుకేతుం డాభూపతికి దేవరాతుం డాధరణీశునకు
బృహద్రథుం డాధాత్రీనాథునకు మహావీరుం డావసుధేశునకు సుధృతి సుధృతికి
ధృష్టకేతుం డాపృథివీశునకు హర్యశ్వుం డామండలేశ్వరునకు మరుం డాసార్వ
భౌమునకు బ్రతింధకుం డా మూర్థాభిషిక్తునకుఁ గీర్తిరథుం డాజననాయకునకు
దేవవిధుం డాజగతీశ్వరునకు సువీరుం డానృపతికి మహీధ్రకుం డామహీక్షితు
నకుఁ గీర్తిరాతుం దారాజేంద్రునకు మహారోముం డామానవవిభునకు స్వర్ణరో
ముం డాపురుషసింహునికి హ్రస్వరోముండు నతనికి జనకుండును గుశధ్వజుండును
జన్మించిరి పిదప హ్రస్వరోముండు జనకుం బట్టంబు గట్టి తపోవృత్తిని వనంబున
కరిగె.

701


మ.

జనకక్ష్మావిభుఁ డెంతయున్ మహిమ రాజ్యం బొప్పఁ గావింపఁగా
ఘనగర్వం బొదవన్ సుధన్వుఁ డను సాంకాశ్యప్రభుం డెత్తి యే
పునఁ బై వచ్చి మహేశుచాపముఁ దగన్ భూపుత్రి నొప్పింపు నీ

వని దూతన్ మిథిలేశునొద్దకు రయం బారంగఁ బుత్తెంచినన్.

702


క.

దూతం ద్రోపించి భుజా, స్ఫీతబలం బమర వెడలి పేర్చి సుధన్వున్
వే తాఁకి తునిమి జనకుం డాతనిసాంకాశ్యపురమునం దనుజునకున్.

703


వ.

కుశధ్వజునకుఁ బట్టంబు గట్టె నని జనకునియన్వయక్రమంబు వినిపించి శతానం
దుం డాతనికులశీలపరాక్రమంబులు గొనియాడి సీతగుణంబులు వొగడి నీపుత్రు
నకు సకలగుణాభిరాముం డైన రామునకుఁ జారుగుణశీలసమేత యగుసీతం బెండ్లి
సేసి జగన్నుతకీర్తిఁ బొందు మని పలుక శతానందునిపలుకులకు దశస్యందనుం
డమందానందంబు నొంది వసిష్ఠవిశ్వామిత్రులం గనుంగొని యి ట్లనియె.

704

శ్రీరామలక్ష్మణభరతశత్రుఘ్నుల వివాహమహోత్సవము

లక్ష్మణకుమారునకు జన, కక్ష్మాధీశునిసుతం దగఁగ నూర్మిళ యన్
పక్ష్మలనేత్రను నడుగుఁ డ, సూక్ష్మప్రియమునఁ గుశధ్వజునినందనలన్.

705


క.

అలఘు లగుభరతశత్రు, ఘ్నుల కడుగుఁ డనంగ నడుగఁ గోరికిఁ దనకూఁ
తుల జనకుం డిచ్చితి నని, పలికిన నద్దశరథుండు ప్రమదం బొందెన్.

706


వ.

మఱునాఁ డఖిలజనంబులుఁ బ్రమదం బంద లగ్ననిశ్చయంబు సేయించి.

707


మ.

జనకుం డప్డు వసిష్ఠకౌశికుల వాంఛం జూచి మీ రెంతయున్
ఘనపుణ్యాత్ము లయోధ్యకున్ మిథిలకుం గర్తల్ వివాహంబు లే
పునఁ జేయింపుఁడు యుక్తభంగుల ననం బొల్పొంద నా రేగి నే
ర్పునఁ జేయింప నృపాలుఁ డాభ్యుదయికంబుల్ సేసి ప్రీతాత్ముఁ డై.

708


సీ.

అనురక్తి దశరథుం డభ్యుడయార్థమై, నలువురుసుతులకు నాలుగేసి
లక్షలుగాఁ బదార్లక్షలసంఖ్యల, గోవులఁ గలధౌతకఖురము లలరఁ
గనకశృంగమ్ములఁ గనకపట్టంబులఁ, దామ్రపృష్ఠంబుల దనర నేర్చి
గంధమాల్యాంబరకలితలఁగాఁ జేసి, వత్సలతోఁ గూడ వరుసఁ గూర్చి
కాంస్యలోహలములతోడఁ గరుణ భూసు, రోత్తముల కిచ్చి శోభనాయత్తమతిని
మఱియుఁ బెక్కుసువర్ణముల్ మహిమతోడ, వేఁడువారల కందంద వేడ్క నొసఁగి.

709


వ.

తనయులుం దానును వివిధమణిగణభూషణభూషితులును మాల్యాంబరశోభితు
లును సలలితపరిమళకలితబహుగంధవిలేపనమూర్తులు నగుచుం దనకెలంకుల
బంధుమిత్రామాత్యవర్గంబులు గైసేసి మాతంగతురంగంబులం గొని వీరభటు
లును మునిగణంబులు నేతేరఁ బసిండిపళ్లెరంబుల మణిమయవిభూషణంబులు
నవ్యదుకూలాంబరంబులు మనోహరపుష్పఫలంబులు ననేకసౌభాగ్యద్రవ్యం
బులు నిల్పి క్రంతలు గొని పుణ్యాంగనలు సనుదేర సూతవందిమాగధబృందం
బులు బహువారంబులు కైవారంబులు సేయఁ బంచమహాశబ్దంబులు మ్రోయ
నెలమిని గాయకులు పాడ వారవిలాసిను లాడ నగరద్వారంబు చేర వచ్చి రంత.

710


చ.

నలి నెదు రేఁగుదెంచి యెలనాఁగలు దాఁచినకక్షదీధితుల్

వెలువడఁ బయ్యెదల్ వెడల వీఁకఁ గుచంబులు నిక్క దీపికా
కలికలు నోష్ఠరాగములు కాంతుల నీనఁగ లేఁతకౌనుదీఁ
గలు వడఁకాడ బాహులతికల్ నిగిడించి నివాళు లియ్యఁగన్.

711


క.

చన నగరు సొచ్చి మణిమయ, కనకాసనకలితు లగుచుఁ గడు విలసిల్లన్
జనకుఁడు సపురోహితుఁ డై, మునుకొని వరుస మధుపర్కములు సేసి తగన్.

712


క.

ధాత్రిసుత రామునకు సౌ, మిత్రికి నూర్మిళఁ బ్రియంబుమెయిఁ గైకేయీ
పుత్రునకును మాండవినిన్, శత్రుఘ్నునకు శ్రుతకీర్తి సమ్మతి నిచ్చెన్.

713


వ.

అప్పు డారాఘవు లగ్నిసన్నిధి నిగమోక్తక్రమంబున నాకన్నియలం బాణిగ్ర
హణంబులు సేసి యగ్నిదేవునకు మునులకు దశరథజనకులకు నమస్కరించి బహు
విధభూసురాశీర్వాదంబుల నుల్లసిల్లి రాసమయంబున.

714


క.

ధరఁ బుష్పవృష్టి గురిసెను, సురదుందుభు లోలి మ్రోసె సురకామిను లా
డిరి గంధర్వులు పాడిరి, పరఁగఁగ మోదించి రపుడు పరమమునీంద్రుల్.

715


క.

అన్నిదినంబులశుభములు, కన్నులు దనియంగఁ జూచి కౌశికుఁడు సుధీ
సన్నుతు దశరథు జనకుని, నున్నతి దీవించి చనియె నుత్తరగిరికిన్.

716


చ.

జనకుఁడు గూఁతులం బిలిచి సమ్మతి బుద్ధులు సెప్పి వారికిం
గనకవిభూషణాంబరసుగంధమణిద్రవిణాదిసంపదల్
దనియఁగ నిచ్చి యల్లుర ముదం బెనయం దగఁ గట్ట నిచ్చి య
య్యినకులనాథుతో ననిచె నెంతయు నాప్తులు సంతసింపఁగన్.

717


క.

తనతనయులుఁ గోడండ్రును, జనుదేరఁగ బంధుమిత్రసచివులతోడన్
ఘనసేనతోడ దశరథ, జననాథుఁ డయోధ్య కెలమిఁ జనునెడఁ ద్రోవన్.

718


క.

ఖగములభయదస్వరములు, మృగతతులప్రదక్షణములు మేదురగతులన్
జగతి వినఁ గానఁబడియెను, బెగడొందెడు నాకు నెడఁద పెనుపుగ ననుచున్.

719


వ.

దశరథుండు వసిష్ఠున కెఱింగించిన నమ్మునివరుం డెఱింగి పక్షులఘోరస్వనంబుల
వలన నొకమహాభయం బొదవు మృగంబులశుభప్రదక్షిణంబులవలన నాభయం
బడంగు శీఘ్రంబ యన నంతలోనం బ్రతికూలవాయువులు వీచె నభంబునం
బెంధూళి గప్పె భానుమండలప్రభ దూలె సేనలు చీకాకు పడియె నఖిలదిక్కులం
దిమిరంబు గప్పె సకలజనులు నిశ్చేష్టితు లగుచుండి రంత.

720


మ.

ప్రళయాదిత్యునికైవడిం ద్రిపురభిత్ఫాలాక్షుచందంబునన్
విలయజ్వాలవిశాలకీలికరణిన్ వృత్రఘ్ననిర్ఘాతసం
కులదంభోళిధరాకృతిన్ లయకృతక్రూరాంతకప్రక్రియ
న్బలిబంధక్రమకృత్త్రివిక్రమగతి న్రౌద్రం బుదగ్రంబుగన్.

721


మ.

అరుదేరం బొడగాంచి రాతతపిశంగాంచజ్జటాసోమునిన్
ధరణీదేవకులాబ్ధిసోముని సమద్యద్విక్రమోద్దామునిం

గరచాపాశుగభీమునిన్ మదయుతక్షత్రాద్రిసుత్రామునిన్
హరణోదారకుఠారవారితవిపక్షారామునిన్ రామునిన్.

722


అటు పొడగాంచి యందఱు భయాపహమంత్రము లుచ్చరించుచుం
బటుగతి నర్ఘ్యపాద్యములు భక్తిమెయిం గొనిపోవ వాని నా
దట వరియింప కమ్మునుల దాఁటి మహోగ్రత రాజరాముముం
డట భృగురాముఁ డెంతయును దర్ప మెలర్పఁగ వచ్చి నిల్చినన్.

723

శ్రీరామునిఁ బరశురాముఁ డడ్డగించుట

క.

ఆరామున కతిభక్తిన్, రారాముఁడు మ్రొక్కి యతనిరాజసతేజో
గౌరవముల కరు దందఁగ, నారాముని కనియె నాద్యుఁ డగు రాముఁ డటన్.

724


క.

ఫాలాక్షునిచాపము బా, హాలఘుసత్త్వమున విఱిచి తని జను లెన్నం
బోల మహేంద్రాద్రిని విని, వాలిననీలావు చూడ వచ్చితి నిటకున్.

725


శా.

స్ఫీతాక్షీణబలంబు పెం పెసఁగ నాచే నున్నయీచాపముం
జాతుర్యంబున నెక్కుపెట్టి విపులజ్యావల్లి కర్ణాంచలా
న్వీతాకృష్టిఁ దనర్పఁ జేసి శరమున్ నేర్పార సంధించినన్
నీతో ద్వంద్వరణంబు సేసెదఁ గడు న్వీరక్రియానైపుణిన్.

726


వ.

అనవుడు దశరథుం డతిభీతచేతస్కుండును విషణ్ణవదనుండు నగుచుఁ గరంబులు
మోడ్చి వినయంబున జామదగ్న్యునితో నిట్లనియె.

727


సీ.

మఖవేళఁ గశ్యపముఖమహీసురులకు, ధర యెల్ల నిచ్చిన ధర్మనిధివి
స్వాధ్యాయపరుఁడవు జమదగ్నిసుతుఁడవు, బ్రహ్మవర్చసమూర్తిభాసురుఁడవు
నత్యంతనియతితో నడవిఁ దాపసవృత్తి, విజితేంద్రియుండవై వెలయుసుకృతిల
వింద్రుని ప్రార్థన నెసఁగి క్షత్రియహింస, సనఁ జేయకుండిన శాంతమతివి
బాలుఁ డీరాముమీఁదఁ గోపంబు దగునె, యీకుమారుండు ప్రాణ మిక్ష్వాకుకులుల
కెల్లఁ గావున రక్షింపు మీతనూజు, భద్రకారుణ్యగుణధామ పరశురామ.

728


వ.

అనుదశరథుపలుకు లాదరింపక పరశురాముండు రామునిం జూచి.

729


ఉ.

రా జఁట యంతమీఁద మఱి రాముఁడు దా నఁట భీకరాజులన్
రాజులఁ ద్రుంచి తత్ప్రసృతరక్తములం బితృతర్పణక్రియల్
రాజిలఁ జేసి యున్నభృగుకరాముఁడు తుచ్ఛమదాంధు లైనయీ
రాజులు గీజులన్ వెడఁగురాముల గీములఁ జూచి సైచునే.

730


చ.

అదియును గాక నాకు గురుఁ డైనమహేశ్వరుదివ్యచాపము
న్మదమునఁ బట్టి వే విఱిచినాఁడ వొకింత సహింపు మీవు నా
యెదురను నిల్చి భక్తు లిటు లెన్ని యొనర్చిన నేను నింతతోఁ
దుది సన నిన్ను నుక్కడఁగఁ ద్రుంపక చంపక పోవ నీ ననన్.

731


వ.

రామచంద్రుం డి ట్లనియె.

732

క.

మునిసుతుఁడవు బ్రాహ్మణుఁడవు, ననఘతపోనిధివి వృద్ధుఁ డగువాఁడవుఁ గా
వున మ్రొక్కితిఁ గాని రణం, బునకు మది వెఱచి కాదు మ్రొక్కుట యార్యా.

733


క.

అదె నీచేతికుఠారం, బిదె నామెడ జామదగ్న్య మెయ్యది యుచితం
బది సేయుము గోబ్రాహ్మణు, లెదురను శౌర్యంబు చూప రిల రాఘవులున్.

734


క.

అనవుడు నన్ను బ్రాహ్మణుఁ డని పలికితి నీదుక్షత్రియత్వము పోలం
గనుఁగొని నాబ్రాహ్మణ్యము, సనిఁ జూపఁగ నీవ చూచె దపు డని మఱియున్.

735


మ.

ధర నే నిర్వదియొక్కమా ఱొగి సమస్తక్షత్రజాతంబులం
బరశుస్ఫారకఠోరధారఁ గొని పైపైఁ ద్రుంచి యత్యున్నత .
స్ఫురణం బారఁగఁ దత్కళేబరములన్ సోపానముల్ సేసి ని
ర్జరలోకంబున కోలి మామకపితృవ్రాతంబులం బుచ్చితిన్.

736


క.

కడఁక విలువిద్య శివుతో, వెడపక కావించునప్పు డీసున నాతోఁ
దొడరి కుమారుం కోడిన, మృడుఁడు మదీయబల మిచ్చ మెచ్చఁడె పరఁగన్.

737


చ.

వెరవున విశ్వకర్మ తనవిండులు రెండు సృజించె నందులో
హరునకు నొక్కవిల్లు త్రిపురాసురులం గెలువంగఁ బోవుచోఁ
బరఁగఁగ నిచ్చి యున్నవిలు పంకజనాభున కిచ్చె నొక్క నాఁ
డిరువుర లావులుం దెలియ నిచ్చల వేల్పులు బ్రహ్మపాలికిన్.

738


చ.

అరిగిన వారికోర్కి చతురాస్యుఁ డెఱింగి కడున్ విరోధముల్
హరులకు విష్ణుదేవునకు నాత్మలఁ బుట్టఁగఁ జేయ నల్గి వా
రిరువురు చాపముల్ గొని యనేకవిధంబులఁ బోరఁ జూచి యా
హరిబల మెక్కు డంచు సుర లాతని మానిచి కూర్చి పోయినన్.

739


క.

ప్రియ మెడలి శివుఁడు దనవిలు, రయమునఁ గొను మనుచు దేవరాతున కిచ్చెం
బయిపై నాచాపం బ, న్వయపరిపాటిమెయి జనకునకుఁ దగ వచ్చెన్.

740


క.

హరుఁ డురుబలమున బహుసం, గరముల లావెల్లఁ గొని తగన్ విడిచిన యా
చిరకాలజీర్ణచాపము, వెర వారఁగఁ బట్టి నీవు విఱుచుట యరుదే.

741


క.

రుచిరప్రీతిని విష్ణుం, డచలప్రతిమానసార మగునీధనువున్
రుచికునకు నిచ్చెఁ బదపడి, రుచికుఁడు జమదగ్ని కిచ్చె రూఢప్రీతిన్.

742


క.

జమదగ్ని నాకు నిచ్చెం, గ్రమమున నిది విష్ణుదేవుకార్ముక మీచా
పము నెక్కుపెట్టి పటువే, గముతోఁ దెగఁగొనక పోవఁ గానీ ననుడున్.

743


చ.

ప్రళయతరోగ్రకోపమున రాముఁడు భార్గవరాముచాపమున్
బలువిడిఁ బట్టి రాఁ దిగిచి బాహుబలోద్ధతి నెక్కుపెట్టి య
త్యలఘుశరం బమర్చి తెగ నాశ్రవణాంతము సేసి నీపదం
బులు తెగ నేసి పుచ్చెద నమోఘము నావిశిఖంబు నావుడున్.

744


వ.

అప్పుడు బలదర్పంబు లడంగి యున్నపరశురాముని నవక్రవిక్రమాభిరాముం డగు

శ్రీరాముని నవలోకింపం బితామహపురస్సరంబుగా సురలు గరుడోరగగంధర్వ
యక్షరాక్షసప్రభృతులును జనుదెంచి చూడఁ బరశురాముండు శ్రీరామునిం
గనుంగొని.

745


క.

నావి ల్లెక్కిడినప్పుడ, నీవు చతుర్భుజుఁడ వౌట నిక్కము మదిలో
భావించి కంటి నితరుల, కీవిక్రమబాహుశక్తు లెందును గలవే.

746


ఉ.

కావున నీవు రాఘవ జగత్త్రయకర్తవు సర్వదేవతా
దేవుఁడ వైనవిష్ణుఁడవు తెల్లము నా కిటు లౌట నింద గా
దీవిజయంబు నావిజయ మేనును నీవును వైష్ణవాంశసం
భావితభద్రమూర్తులము పంకజనాభునిలీల లిన్నియున్.

747


క.

సకలధరిత్రిం గశ్యపు, నకు నే మును దాన మిచ్చినాఁడ నిలన్ ని
ల్వకు మనియె నతఁడు గావునఁ బ్రకటంబుగ నిల్వరాదు రాత్రులుఁ బుడమిన్.

748


వ.

నాకు మహేంద్రాద్రికి ననుదినంబు నరుగవలయుం గావున నాచరణంబు లేయక
నాపుణ్యలోకమార్గంబు లేయు మనుడు నాశ్రీరాముం డట్ల చేయం బ్రియంబునఁ
బరశురాముండు రఘురామునకుం బ్రదక్షిణం బాచరించి మహేంద్రాద్రికి నరిగె
నాసమయంబున సుఖవాయువులు వీచె దిశలు ప్రసన్నంబు లయ్యె సేన కుత్సా
హం బొదవె దేవత లభినుతులు సేసిరి రాముండు దనచేత నున్నజామదగ్న్యు
చాపంబు వరుణున కిచ్చి మహోత్సాహంబునం జనుదెంచి వసిష్ఠదశరథులకు
మ్రొక్కి పరశురాముండు వోయె నని తండ్రిభయంబు వాపి యింక సేనాసమే
తుండ వై విచ్చేయు మనవుడుఁ దెలివొంది దశరథుం డక్కుమారు నక్కునం
జేర్చి మూర్ధఘ్రాణంబు సేసి యత్యంతనంతోషంబున నఖిలజనసమేతుం డయి
యయోధ్యాపురంబుఁ జేర నరిగి.

749

దశరథుం డయోధ్యకు వచ్చుట

చ.

సురుచిరతోరణంబులఁ బ్రసూనవిరాజితమందిరాంగణో
త్కరముల నుద్ధతధ్వజనికాయనికేతనకేతనంబులన్
వరమణిచిత్రచిత్రితనివాసవిభాసితసౌధవీథులం
బరఁగుచు నున్నపట్టణము ప్రాభవ మొప్పఁగఁ జొచ్చి ముందటన్.

750


క.

డంబుగఁ బంచమహాశ, బ్దంబులు మ్రోయంగ నర్థితతు లొగిఁ గైవా
రంబులు సేయ సుధాక, ల్పంబులు గానికలుఁ గొనుచుఁ బ్రభువులు డాయన్.

751


క.

లాజలు లలితాక్షతములు, రాజితనూత్నప్రసూనరత్నములు పురం
ధ్రీజనములు సల్లఁగ నీ, రాజనములు సేయఁ బంక్తిరథుఁ డతిమహిమన్.

752


మ.

నగ రింపారఁగఁ జొచ్చె నప్పు డధికానందంబు లుప్పొంగఁగాఁ
దగఁ గౌసల్యయుఁ గైకయున్ మఱి సుమిత్రాదేవియున్ వచ్చి యి
మ్ముగఁ గోడండ్రుఁ దనూజులున్ వరుసతోన్ మ్రొక్కంగ దీవించుచున్

మొగి నాలింగనకేళిఁ దేలిరి మనోమోదంబు లింపారఁగన్.

753


క.

కొడుకులుఁ గోడండ్రును దన, పడఁతులు ముద మంద సేనపతులును సచివుల్
దడములుఁ గొల్వఁగ ధర్మం, బడరఁగ దశరథుఁడు రాజ్య మలవడఁ జేసెన్.

754


క.

నుతదివిజయక్షరాక్షస, శతముఖముఖదివిజమకుటసన్మణిగణరం
జతనఖకిరణపదాంబుజ, శ్రితభక్తక్లేశనాశ శివగిరిజేశా.

755


మా.

సకలసురశరణ్యా సర్వదేవాగ్రగణ్యా
ముకుటనిహితగంగా ముక్తితాత్పర్యచంగా
శకలితవినతాఘా సాధుసస్యౌఘమేఘా
ప్రకటితనమదింద్రా భక్తవారాశిచంద్రా.

756


గద్యము.

ఇది శ్రీమదష్టభాషాకవిమిత్రకులపవిత్ర భాస్కరసత్కవిపుత్ర మల్లికార్జున
భట్టప్రణీతం బైన శ్రీమద్రామాయణమహాకావ్యంబునందు బాలకాండంబు సర్వం
బును నేకాశ్వాసము.

757
  1. ప్రాచేతసుకున్
  2. లంకావలయదర్శనంబును
  3. మగుడ సీతం గాంచుటయు మహోదధి
  4. విభీషణసంగమంబును
  5. లందుల భూసురోత్తముల్
  6. నడభేరిఢాకలన్
  7. వ్రాలుదు రందుల రాజవర్గముల్
  8. గోరికఁ బూనినవారు లే రటన్.
  9. వచ్చి ముందటం దెచ్చిన
  10. గనుకనిఁ బూజించి
  11. బెనయఁగ మధురోక్తి వారి
  12. బదృష్టంబు సంఘటి
  13. సంభారములు
  14. యాఘనతపోవృతభంగుని - వారితతపోవృతభంగుని
  15. రుచిదృష్టులుఁ గచరుచులును బొదివి కాంతారమునకుఁ దేఁటిదాఁట్లు గాఁగ
  16. బెరసి కొనకుఁ దీఁగతురుము గాఁగ
  17. రమణ ఋశ్య, శృంగుమెలఁగెడిచెంతలఁ జెలులు నిలిచి.
    వ. కెలంకులఁ బరికించునెడ.
  18. వలఁతి తులసిపూస లతిశీతలంబులు, దనర
  19. 'మీకట్టిన వల్కలములు, మేకెంతయు' నని యే
  20. బుడికి జిడుంగులఁ గట్టిరి. వ్రా. ప్ర.
  21. సంతతోదితతపఃకృతభంగుని; సంతతోర్జితతపఃకతృచంగుని; సంతతోద్ధితతపఃశ్రుతిచెంగుని
  22. తనయల్లును దనకూఁతుం
  23. మనోరథంబుగన్
  24. యల్లును గూఁతుం
  25. 'గృతాలింగను లయి' వ్రా. ప్ర.
  26. మఱియును మన్నించువారి మన్నించితి; మరియాదుల నెల్లవారి మన్నించితి" అ. ప్ర.
  27. గాసిలి యులంపుచుండన్; గాసిగఁ గలంపుచుండన్.
  28. ‘అహికోటి మర్దించె యాశుధానులు దక్క, నఖిలభూతంబుల నాక్రమించె' అని పా.
  29. సిరికిన్ హ్రీకిని గీర్తికి
  30. నోదన మగుకాం
  31. హరి కంశ మగు
  32. లుద్ధత దాసాన్విత
  33. 'నోలి సరి వేద' వ్రా. ప్ర.
  34. 'నిఱుఁబేద' వ్రా. ప్ర,
  35. దశరాత్రము సవనమునకుఁ
  36. దారితదేవవిద్విషత్పాలుఁడు వ్రా.ప్ర.
  37. బాలుగ; బాలుర
  38. గ్రమ్మఱ
  39. నెట్లో
  40. పొదం డన
  41. నిజశిబిరంబులకుం గొని
  42. దుర్గమంబు నఖిలజనహింసమృగశరణ్యంబు
  43. నీదురాక్రమారణ్య మెవరియరణ్య మనిన
  44. శరాసన మెక్కిడి విక్ర' వ్రా. ప్ర.
  45. ధూళిశిలా... గురియఁగ
  46. తనుపాటక
  47. మాహితమ యైనకార్యము
  48. బొదం డనిన
  49. పెంపొందెడు నీతపోమయుఁ దపోమూర్తిం దపోరాశిని
    శ్చలభక్తిం దప మాచరించి నిఖిలస్వామిం గనుంగొంటి నిం
    పలరన్ నీశరణంబు గంటి వరదా యంచుం బ్రశంసించినన్.
  50. వక్కఠినంపుఁగార్ముకము
  51. తనయ లకుబ్జ లై మనుట తండ్రి గనుంగొని
  52. సుకృతవశంబున
  53. విస్ఫురితాంబుసైకత
  54. కృత్తులకు నిచ్చి
  55. ధాత్రులు పెనుపం
  56. క. ఆఱువదివేవురు నోలి, న్వఱలఁగ నొక్కొక్కయోజనము భూవలయం
        బఱిముఱిఁ ద్రవ్వఁగఁ జుట్టును, నఱువదివేల్ యోజనంబు లై విలసిల్లెన్.
        ఇది ప్రక్షిప్త మని తోఁచెడి.
  57. నృపవర్యనందన
  58. "కనుఁగొన నిందు వచ్చితిరి గావున ధన్యుఁడ నైతి నో మహా
        ఘన విను వీర లెవ్వరు తగ న్వినిపింపుము తచ్చరిత్రముల్
        వినియెద నన్న నమ్మునియు వేగమ చెప్పఁగఁ బూన నయ్యెడన్.
    వ. మఱియును జనకుండు” అని పా.