భాస్కరరామాయణము
అయోధ్యాకాండము
|
రమణీరమణసుధా
ధారాళదయాకటాక్షధామస్మితదృ
క్కైరవవితరణకరణవి
శారద బుద్ధయకుమార సాహిణిమారా.
| 1
|
[1]క. |
ఉల్లమున మనోరథములు, మల్లడిగొన నవ్విభుండు మధురస్ఫుటవా
గ్వల్లిక సఫలతకై సభ, కెల్లం జిత్త మిగురొత్త ని ట్లని పలికెన్.
| 3
|
దశరథుండు శ్రీరామునకుఁ బట్టాభిషేకం బొనర్ప నిశ్చయించుట
. 6
క. |
మిక్కిలి భోగము లందితి, నెక్కుడు సంపదలు గంటి నెల్లగుణములం
జక్కనికొడుకులఁ బడసితి, నిక్కుంభినిఁ బెద్దగాల మేలితి నింకన్.
| 4
|
|
రాజ్యభరం బఖలగుణ, ప్రాజ్యుం డగు రామునందు ప్రాపించెద సా
మ్రాజ్యపదంబున కెంతయుఁ, బూజ్యుం డతిచతురుఁ డతఁడు పుత్రులలోనన్.
| 5
|
శా. |
ధీరోదారుఁడు నిర్వికారుఁడు జగద్వీరుండు సౌజన్యవి
స్తారుం డుత్తమశీలుఁ డర్కకులనిస్తారుండు శూరుండు గం
భీరుం డిద్ధవిచారసారుఁ డగుటం బెంపార విశ్వంభరా
భారం బెల్ల భరింప రాఘవు మహాభాగున్ నియోగించెదన్.
| 6
|
వ. |
అని పలికి వసిష్ఠవామదేవాదిపురోహితులును సుమంత్రాదిమంత్రులును సమస్త
బంధురాజలోకంబును ననుమతి సేయ రామచంద్రుం బిలువం బనిచి యుచి
తాసనంబున నుండ నియోగించి కొండొకసేపునకు నక్కు మారు నవలోకించి.
| 7
|
ఉ. |
ఏను సమస్తదానములు నెల్లవ్రతంబులు సర్వధర్మముల్
|
|
|
మానుగఁ జేసి జన్నములు మానక చేసి వివస్వదన్వయాం
భోనిధిపూర్ణచంద్రుఁ డగు పుత్రనిధానము నిన్నుఁ గంటిఁ బెం
పూనఁగ నింక నిన్ను మహిమోన్నతిఁ బట్టము గట్ట ధన్యతన్.
| 8
|
మ. |
విను మెల్లుండి దినంబు లెస్స నిఖలోర్వీచక్రరక్షాభరం
బున కీ వెల్లి ధరాసుతాసహితుఁ డై పుణ్యోపవాసంబు గై
కొని నేమంబున నుండు పొమ్మనుచు వీడ్కొల్పెన్ గుణాలంకరి
ష్ణుని భూయిష్ఠవరిష్ఠనిష్ఠురరణానుష్ఠాననిష్ఠాపరున్.
| 9
|
వ. |
అంత నక్కుమారుండునుం దననగరి కరిగి యథోచితాచారంబులు నియతుండై
యుండె నప్పు డప్పురంబునం జతురశిల్పంబులు నెరయం గనకసాలభంజికలం
దగినయెడలం దీర్చి వింతరచనలు గూర్చి వివిధమణిరాజితానేకమకరతో
రణాలంకృతం బగుచుం దేజరిల్లు రాజమార్గంబులును నారాజమార్గంబుల రఘు
రాజన్యవిజయశ్రీలాంఛనంబులు లిఖియించిన రమ్యహర్మ్యతలంబుల నమర్చినం
గల్యాణసమయం బగుచు వచ్చె నీరాజు నీరాజనకరణంబులకు రం డనుచు నమ
రకాంతలఁ బిలుచునోజం గ్రాలు నూతనకేతనంబులును గమనీయహేమదం
డంబుల రామణీయకంబులం దొంగలిగొను కాంచనకల్హారంబును నెలకొల్పఁ
గలయ నెత్తిన నభోభాగంబునం బెడం గడరుకలువడంబులును గెలంకులం దరు
ణరంభాస్తంభంబులు నెలకొల్పి విలసదశ్వత్థచూతపత్రదామంబుల నభిరామంబు
లుగాఁ గట్టి పై రుచిరముకురశ్రేణులఁ గీలించినం జెన్నొందు మందిరద్వారంబు
లును జందనకస్తూరికాకుంకుమజలంబులం గలయంపు లిచ్చి ముక్తాఫలంబుల రంగ
వల్లికలు దీర్చి కుసుమవిసరంబులు నెరపినం బొలు పెసంగు నకలంకరత్నాంకి
తాంగణంబులును నానావిధవిచిత్రవిలాసంబు లొనరించి మనోహరప్రకారం
బులం బాటించినం జెలు వొలయు భవనవాటికలును నభినవాభరణంబులఁ గైసేసి
గంభీరసౌభాగ్యరేఖ లొదవిన ముదంబునం బొదలుచుఁ బసిండిపళ్లెరంబుల శుక్తి
జాక్షతంబులును మాణిక్యదీపకళికలు లోనుగాఁ బరమమంగళోపకరణంబులు చే
కొని యున్న పుణ్యాంగనాజనంబులును బ్రసాధికలునై పుణ్యంబులం గావించు శృం
గారభంగులు గలవిభ్రమంబులంకుం గనుఁబాటు దోఁపకుండఁ జేయుతెఱంగునం
బొలుచు నవ్విశేషలావణ్యకలాకలాపంబుల జగన్మోహనంబు లగుచుం బొలయు
విలాసినీగణంబులును సమస్తభూషణభూషితంబు లగుకరితురగాదులును జెలంగు
పంచమహాశబ్దంబులునుం గలిగి యునికిఁ గైకేయీపరిచారిక యగుమంథర
యనునది యొక్కసౌధం బెక్కి చూచి యిది రామచంద్రునిపట్టాభిషేకమహో
త్సవంబు గాఁబోలు దీనికి విఘ్నంబు గావింపవలయు నని విచారించి తొల్లి కౌస
ల్యాతనయుచేతం దనకు నైనచరణతాడనభంగంబు వైరకారణంబుగాఁ గొని
యక్కేకయరాజపుత్రిపాలికిం జని యి ట్లనియె.
| 10
|
మంథర కైకకు దుర్బోధనలు చేయుట
శా. |
కైకా నీకు విభుండు గూర్చు ననుచున్ గర్వింతు ము న్నెప్పుడున్
లోకైకప్రకటంబుగా నిదిగో దా లోలాక్షి కౌసల్య క
స్తోకప్రేమభరంబు చూపుటకు రాజుం జేయుచున్నాఁడు నేఁ
డాకాంతాతిలకంబుపుత్రు భరతుం డ ట్లుండ ని ట్లిమ్ములన్.
| 11
|
తే. |
సవతితల్లికొడుకు సకలభూభాగంబు, ననుభవించుచుండ నకట భరతుఁ
డధికదీనవృత్తి నాతనియడుగులు, కొలిచి యుండవలసెఁ బలుకు లేల.
| 12
|
శా. |
పాటించుం బతి నిన్ను నీ వడిగినం బ్రాణంబు వంచింపఁ డి
వ్వీటం బట్టము గట్ట నీతనయునిన్ వే రాము నుగ్రాటవీ
వాటిం బోయి చతుర్దశాబ్దము లొగిన్ వర్తింప నీరెండు మో
మోటం గొంకక వేఁడు మన్న మదిలో నూహించి యక్కైకయున్.
| 13
|
ఉ. |
బంధులు మంత్రులున్ భరతుఁ బట్టరు రాముఁడు పెద్దవాఁడు స
ద్బంధురదోర్బలుండు గుణభాసియు నౌసుతుఁ నుండ నాసుతున్
సింధుపరీతధాత్రి కభిషిక్తునిఁ జేయునె భూవిభుండు సం
బంధము గాదు చిక్కితి నుపాయ మెఱింగినఁ జెప్పు మంథరా.
| 14
|
వ. |
అనిన నది యి ట్లనుం దొల్లి జయంతపురంబునం బురందరశంబరులకుం గయ్యం
బయిన నయ్యింద్రునకుం దో డరిగి దశరథుండు భండనంబు సేయునవసరంబున
నారాక్షసుం డనేకమాయలు గావింప నీవు ధవళాంగుం డనుమునివలనం బడ
సినమంత్రవిద్యచేత వానికిం బ్రతీకారంబు లొనర్చుటకు మెచ్చి నాఁడు నీకు
రెండువరంబు లిచ్చినవాఁడు నేఁ డవి దలంపించి నా చెప్పినయిరుదెఱంగులు
వేఁడికొను మవ్విభుండు నీయందు నెయ్యుండును సత్యసంధుండును నగుట నీయ
డిగినయట్ల యొసంగు ననుచుం బాపోపదేశంబు చేసినం గైకేయి సంతోషించి
దానికిం బసదనంబు లొసంగి యొక్కగొంది సొచ్చి ముసుంగు పెట్టుకొని నేలం
బరుండి యీలిగిన ట్లుండె నాసమయంబున.
| 15
|
సీ. |
జననాథుఁ డచటికిఁ జనుదెంచి యట్లున్న, కైకేయిఁ బొడగని కడుఁ గలంగి
చిత్తంబు మదనార్తిఁ జిడిముడి పడియుండ, నేమి కారణమున నిట్టు లునికి
యెవ్వరు నీదెస నెగ్గు చేసిరి నీకు, నహితవాక్యము లెవ్వ రాడి రిచట
నడిగినఁ బ్రాణంబు లాదిగా నెవ్వియే, వంచింప కిత్తును వనజవదన
ముసుఁగు పుచ్చ వేల మొగ మేల యలరింప, వకట నెపము లేక యలుగ నేల
పలుక నేల మృదులపర్యంక మటులుండ, నొడలు నొవ్వ నేల నుండ నేల.
| 16
|
క. |
నావుడుఁ బతిమదనాతుర, భావం బవ్వనిత చూచి పార్థివవర నాఁ
డీ విచ్చినవరములు నేఁ, డీవలయును రెండు ననుడు నిచ్చితి ననుచున్.
| 17
|
కైక రాముని వనంబునకుం బంప దశరథు నడుగుట
క. |
పలికిన భరతునిఁ బట్టము, నిలకుం గట్టుటయు రాము నీరేడబ్దం
బులు కానకుఁ బొ మ్మనుటయు, నిలువేల్పులు సాక్షి గాఁగ ని ట్లీ రెండున్.
| 18
|
ఉ. |
వేఁడిన వేఁడిమాట నృపవీరుఁడు సైఁపక కర్ణరంధ్రముల్
సూఁడినభంగిఁ దాఁకుటయు స్రుక్కి మనంబున నొచ్చి నిన్ను నే
నాఁడు నృపాలపుత్రి వని నమ్మి వరించితిఁ గాక యిమ్మెయిన్
నేఁ డొకకాలసర్ప మయి నీ విటు సేయుట నాకుఁ దోఁచెనే.
| 19
|
ఉ. |
కీడున కోడ కించుకయుఁ గేకయభూపతియింటఁ బుట్టి చొ
ప్పాడక పాపజాతి వయి తక్కట యి ట్లని వేఁడ నెట్లు నో
రాడెఁ ద్రిలోకపూజ్యుఁ డగునాకొడు కేమిట నీకు నొప్పఁడే
పాడి దలంప కీపలుకు పల్కితి దోసము నాక నాకడన్.
| 20
|
ఆ. |
భరతుకంటె నీకు భక్తుండు తమ్ముల, ముగురు నొక్కభంగి ముద్దు సేయుఁ
దల్లు లెల్ల సరియ తగునే యాపుత్రని, ధానమునకుఁ గీడు దలఁప నకట.
| 21
|
క. |
విడుతుం బ్రాణము లయినను, విడుతున్ మహిరాజ్య మెల్ల వేఁడిన రామున్
విడుతునె యాగుణరత్నము, విడువను దత్పాపచింత విడువుము తన్వీ.
| 22
|
సీ. |
అనవుడు నక్కైక జననాథుతో నను, నిక్ష్వాకువంశమహీశు లెల్లఁ
బలికి తప్పరు నీవు కులధర్మ మొల్లక, కౌసల్యదిక్కునఁ గరము వెఱచి
సడి కోర్చి సత్యంబు విడువఁగఁ దలఁచెదు, భూపాల యిది యొక్కపురుషగుణమె
బొంకుదురే రాజు లింక నీముందర, విష మాని ప్రాణముల్ విడుచుదాన
|
|
తే. |
నంత భరతుని సమయించి యనుఁగుఁదనయు, రాము నిష్కంటకంబుగా రాజ్యమునకు
నధిపుఁ గావించి నీవు నీయగ్రసతియు, విభవమున నుండుదురుగాక వేయు నేల.
| 23
|
చ. |
తలఁ పొడఁగూడెఁ బొమ్ము వసుధావర నావుడు నొక్కమాటయుం
బలుకక మిన్ను వచ్చి పయిఁ బడ్డతెఱంగునఁ దూలి నెమ్మనం
బలఁగ మొగంబు వంచుకొని యశ్రులు రాలఁగ శోకవహ్నికిం
గొలువగుచుండె భూరమణకుంజరుఁ డంతఁ గ్రమక్రమంబునన్.
| 24
|
చ. |
అళికుల మల్లనల్ల నవహల్లక మొల్లక కేసరోల్లస
ద్దళదరవిందమందిరవితానము చేర నగాధదీర్ఘికా
జలజనవీనగంధములు చల్లుచుఁ జల్లనిగాడ్పు లిమ్ములం
బొలయ గృహప్రదీపములపోఁడిమి దూలఁ బ్రభాత మొప్పినన్.
| 25
|
సీ. |
వివిధమంగళతూర్యరవము లొప్పఁగ వంది, సూతమాగధజనస్తుతులు గలయఁ
జెలఁగఁ బుణ్యోదకంబుల రామచంద్రుండు, జనకపుత్రియుఁ దాను జలకమాడి
మహితాంబరంబుల బహురత్నరాజిత, మండనంబుల రమ్యమాల్యతతుల
సురభికస్తూరికాగురుచందనాదుల, లలితాంగరేఖావిలాసకళలఁ
|
|
|
దగ నలంకరించి జగదమందానంద, కారు లగుచు సహజగౌరవమున
సరసభంగు లమర నిరువురు శచియు నిం, ద్రుండుఁబోలె నలరుచుండి రెలమి.
| 26
|
వ. |
అపుడు వసిష్ఠుండు సకలమునిజనంబులతో నభిషేకమండపంబున కేతెంచి నానా
దేశంబులరాజులను సమస్తమంత్రివరులను నరుంధతి మొదలయిన పురంధ్రీజ
నంబులను రావించి సర్వధాన్యంబులు వివిధరత్నంబులు ననేకదివ్యాంబరంబులు
నశేషభూషణంబులుం గల్యాణపల్లవంబులుం గల్హారాదిమంగళకుసుమంబులుం
జందనకర్పూరకస్తూరీగోరోచనాదిసుగంధద్రవ్యంబులును గంగాయమునాదిమ
హానదీసముద్రోదకపూర్ణంబు లగుసువర్ణకుంభంబులును రాజయోగ్యంబు లగు
కరితురగస్యందనంబులును ధవళచ్ఛత్రచామరంబులును దానార్థంబుగాఁ గన్య
కాధేనువృషభంబు లొక్కొక్కలక్షయుం దెప్పించి మాణిక్యఖచితంబు లగునౌ
దుంబరభద్రపీఠంబులు మణిమండపమధ్యంబునఁ బెట్టించి సింహచర్మంబు పయి
నమర్చి బహుగీతనృత్తవాద్యంబులుం బ్రశస్తహోమంబులుం బుణ్యశాంతులుం
జీయం బంచి శుభలగ్నంబు సాధించి సుమంత్రునిం బిలిచి నీవు దశరథుం
దోడ్కొని ర మ్మని నియోగించిన నతం డంతఃపురంబునకుం బోయి కైకేయీ
గృహద్వారంబున నిలిచి యి ట్లనియె.
| 27
|
తే. |
దేవ యుదయాద్రి కినుఁ డేఁగుదెంచుచున్న
సమయ మభిషేకలగ్న మాసన్న మయ్య
నర్హ మగుభంగి రాము రాజ్యాభిషిక్తుఁ
జేయవలయును నటకు వేంచేయవలయు.
| 28
|
క. |
అని విన్నపంబు సేయుట, యును నిద్దురపోయినట్టు లూరక యుండెన్
మనుజపతి కైక యప్పుడు, జననాయకుపలుకు గాఁగ సాహసబుద్ధిన్.
| 29
|
క. |
అభిషేకోత్సవలీలా, విభవం బలరారఁ గొడుకు వేడుకతోడన్
విభుఁడు గయిసేయఁ గోరెడు, రభసంబున నీవు పోయి రఘురత్నంబున్.
| 30
|
మ. |
ఇటకుం దోకొని రమ్ము నావుడు నతం డేతెంచి విచ్చేయు మ
చ్చొటికి నిన్ను విభుండు రమ్మనియె నంచుం జెప్ప నాశీర్వచ
స్ఫుటనాదంబులతో సుమిత్రకొడుకున్ భూపుత్రియుం దాను నొ
క్కొటఁ దే రెక్కి నృపాలఫాలముల మ్రొక్కుం గేలుదో యొప్పఁగన్.
| 31
|
క. |
పంచమహాశబ్దంబు లు, దంచితగతి మొరయ జయజయధ్వను లులియం
జంచన్నానాసేనా, సంచయములు బలిసి కొలువ సమ్మదలీలన్.
| 32
|
ఉ. |
మంగళపుష్పసంఘములు మౌక్తపుసేసలు నింతనంతఁ బు
ణ్యాంగన లోలిఁ జల్ల నగ రల్లన డాయఁగ నేఁగుదేరఁ ద
న్వంగులు రత్నదీపకళికాళినివాళు లొనర్పఁ జేసె ను
త్తుంగరథావరోహణము తోరణపంక్తుల నొప్పుమోసలన్.
| 33
|
వ. |
ఇట్లు రథారూఢుం డై వచ్చి రాజమందిరద్వారంబున రథంబు డిగ్గి రామచంద్రుం
డుచితప్రకారంబునఁ గేకయరాజనందనగృహంబునకుం జనుదించి బాష్పాకుల
లోచనుండును దీనాననుండు నయి యున్నతండ్రిం జూచి భీతుఁ డగుచు నత
నికిం గైకేయికి నమస్కరించి యద్దేవి నుద్దేశించి.
| 34
|
క. |
జననీ రాజు వివర్ణా, ననుఁ డై యిట్లుండఁ గారణం బేమియొకో
జననాయకునాజ్ఞోల్లం, ఘన మే సనవినీతబుద్ధిఁ గావింపఁ గదా.
| 35
|
చ. |
అనవుడుఁ గైక రామునిభయంబు గనుంగొని నీకు నప్రియం
బని పలుకండు దా మును రణావని నిచ్చినయావరద్వయం
బును దగ వేఁడితిన్ భరతు భూమికిఁ బట్టము గట్ట నొక్కొటన్
నినుఁ బదునాలుగేఁడులు మునిస్థితిఁ గానకుఁ బుచ్చ నొక్కటన్.
| 36
|
క. |
జనకునిసత్యము నెరపెడు, తనయుఁడ వయితేని నీవు తాపసవృత్తిం
జను వనమున కన నగుఁ గా, కని మొగమునఁ దొంటికంటె ననువొప్పారన్.
| 37
|
చ. |
జననివి నీవు వేఁడుదటె సత్యము దండ్రికి నెక్కునట్టె నా
యనుజుఁడు నేల యేలునటె యక్కడ సన్మునిపాపద్మవం
దనమటె కృత్య మిట్లగుట ధన్యుఁడ నేఁగెదఁ గాన కేను మీ
పనిచినయట్లనే భరతుఁ బట్టము గట్టు సవిత్రి ధాత్రికిన్.
| 39
|
శ్రీరాముఁడు సీతను వనంబునకుఁ దోడ్కొని పోవ నియ్యకొనుట
ఉ. |
నావుడు సీత రాముఁడు వనంబున కేఁగుతలం పెఱింగి ల
జ్జావనతాననంబు విరహాతిశయంబున శీతధాముధా
మావలి గప్పునంబుజమునాకృతి వెల్లఁదనంబు వొంద లోఁ
జేవ గొనంగ లేక ధృతి చీలఁగ మానము దూలఁ దూలుచున్.
| 40
|
ఉ. |
గద్గదకంఠి యై పలుకుఁ గానకు నీవు సనంగ నేను శ
శ్వద్గుణధామ నీవెనుక వచ్చెద నిచ్చొట నుండ నొల్ల న
స్మద్గమనంబు మానుచు విచారము మాను మయోధ్యరాజయో
షిద్గణసన్నిధిం గరముఁ జేడ్పడి యొంటిఁ జరింప నేర్తునే.
| 41
|
క. |
నీవు వెలి యైనభోగము, లేవియు నే నొల్ల నిన్ను నెప్పుడుఁ గొలువం
గావలయు నాకు ననుపలు, కావిభుఁ డొకభంగి నోర్చి యాసతితోడన్.
| 42
|
ఉ. |
ఏనును నీవియోగము సహింతునె నా కిది సత్యశాసనం
బైనతెఱంగు మజ్జనకునాజ్ఞయు నక్కట నీకు నేటికిం
గాన లెఱుంగ వీవు బలుగాములుఁ బాములుఁ గ్రించుచెంచులున్
దానవమాయలుం గలపథంబులు దుర్గమభంగు లంగనా.
| 43
|
ఉ. |
నీకుఁ జరింప శక్య మగునే శరభోత్కటచండగండకా
|
|
|
నీకతరక్షురంకురురునిష్ఠురఫేరవదంతిదంతిభి
ద్భీకరఘోటకారిశలభిత్కిటిమర్కటపుండరీకభ
ల్లూకవృకాదిఘోరమృగలోకములోపల లోలలోచనా.
| 44
|
వ. |
అదియునుం గాక వనవాసం బధికాయాసం బభ్యాగతుల కిడి మిగిలినకందమూల
ఫలంబు లాహారంబుగాఁ గొనుచుఁ బర్ల శాలల వసియించుచుఁ గుశతల్పంబుల
శయనించుచు విషమస్థలంబులఁ జరియించుచు శీతాతపవర్షంబుల కోర్చుచు
నివ్విధంబున దినంబులు గడపవలయు నీ వత్యంతసుకుమారాంగివి దురంతక్లేశం
బు లనుభవింపఁ జాల విచ్చట నాయమలకు బ్రియాచరణంబు లొనర్చుచుండు
ము నీవు రా వలవ దన నద్దేవి కోపించి యి ట్లనియె.
| 45
|
ఆ. |
నన్ను నీకు నిచ్చి నరనాథ నాతండ్రి, సంతసించి యుండు నెంతయేనిఁ
జనునె యగ్నిసాక్షి సహధర్మచారిణి. నయిననన్ను నిలువు మనుట నీకు.
| 46
|
క. |
దనుజమృగోరగభయములు, ననుఁ జెందునె నీవు గలుగ నాథా నాకున్
నినుఁ బాసి మనుటకంటెను, మనమునఁ దలపోసి చూడ మరణం బొప్పున్.
| 47
|
తే. |
అనిన సీతరాకకు రాముఁ డనుమతించె, నపుడు సౌమిత్రి కోపరక్తాస్యుఁ డగుచు
బొమలు గీలించి విస్ఫులింగములు చెదర, నతులఖడ్గంబు నంకించి యన్నతోడ.
| 48
|
చ. |
తలఁపఁ నీ వశక్తునివిధంబున నాడెదు రామచంద్ర నీ
కొలఁది యెఱుంగఁ డీతఁ డతికుత్సితుఁ డై మతిఁ దప్పి యాలిమా
టలు విని యింతపెంపున కొడంబడెఁ దా నొకసత్యవాది యై
పలుకఁడె నిన్న నేఁడు నినుఁ బట్టముఁ గట్టెద నంచు బొంకొకో.
| 49
|
క. |
నిను నభిషిక్తునిఁ జేసెద, ననుచు వసిష్ఠాదిమునులు నఖిలమహీశుల్
విన నాడె నీవరంబులు, తనయాలును దానుఁ గా కితరు లెఱుఁగుదురే.
| 50
|
క. |
మదనాతురతం బలికిన, యది సత్యం బఁట మహాసభాంతరమునఁ దా
విదితంబు గాఁగఁ బలికిన, యిది బొం కఁట దీని కింక నే మన వచ్చున్.
| 51
|
క. |
జనకుఁడు నీతిజ్ఞుం డై పనిచినఁ బుత్రులకు నెన్నిభంగులఁ జేయం
జనుఁ గాక తగవు దప్పిన, విన నేటికి ధర్మమార్గ కవిరళవిధంబున్.
| 52
|
క. |
నీకినుకకు నే వెఱతున్, గా కెవ్వరు గలరు దీనిఁ గా దన నాచేఁ
గేకయులును గీకయులును, గైకేయికిఁ బూనిరేనిఁ గనియెదరు బలే.
| 53
|
శా. |
అస్మత్కార్ముకముక్తబాణవిసరం బాభీలదంభోళిసం
మస్మేరాగ్రము గాఁగ యుష్మదభిషేకప్రాతికూల్యంబు దా
నస్మార్యం బటు గాక తక్కిన నయోధ్యాపట్టణం బంతయున్
భస్మీభూతము సేసి పుచ్చెద మహీపాలాన్వయగ్రామణీ.
| 54
|
వ. |
అనిన విని రామచంద్రుండు సౌమిత్రిం గనుంగొని నీవు నాకు భక్తుండ వగు
టయు నెంతకైనం జాలుటయు నే నెఱుంగుదు మనకులాచారగౌరవంబులు నుత్త
|
|
|
మశీలంబులును విచారించి పలుకు మేను గురువచనంబు చెల్లింపఁ గలవాఁడ
నాపూనికి నిర్వహింపం జేయునదియ నీకు నర్హకృత్యంబు నావలనిభక్తియు
నట్లం గాక.
| 55
|
ఆ. |
దశరథేశ్వరుఁడు తండ్రి కేకయమహీ, పాలపుత్రి తల్లి భరతుఁ డనుజుఁ
డిందులోన నితరు లెవ్వరు వీరోక్తు, లేల నొడువ నుడుగు మీతలంపు.
| 56
|
క. |
ఒరులు దలలెత్తి చూడఁగఁ, గరకరి మనలోన వలదు గాని మదాజ్ఞన్
భరతుకడ నుండి యతిసు, స్థిరమతి రాజ్యంబు నీవు సేయింపు మనా.
| 57
|
సీ. |
అనవుడు సౌమిత్రి యన్నమాటలు విని, మాట్లాడ కి ట్లను మనుజనాథ
యిక్కడిభోగంబు లెవ్వియు నే నొల్ల, వనభూములను జటావల్కలములు
నెమ్మితో ధరియించి నీపాదపద్మముల్, గొలిచి వచ్చెదను నే వలవ దనిన
నొల్లఁ బ్రాణము లన్న నుడుప నేరక రాముఁ డనుజునిరాకకు ననుమతించె
నపుడు దశరథేశుఁ డారాఘవేశ్వరుఁ, డడవి కేఁగునిశ్చయం బెఱింగి
భరితశోకజనితపరితాపదందహ్య, నూనహృదయుఁ డై సుమంత్రుఁ జూచి.
| 58
|
మ. |
తురగస్యందనమత్తసామజభటస్తోమంబులన్ మంత్రులన్
వరకాంతాజనులం బురప్రజల సర్వస్వమ్మునుం గొంచు నిం
క రఘూత్తంసముఁ గొల్చి నీవు సనఁగాఁ గైకేయికిం జెల్ల దే
భరతుం బట్టము గట్టి రిత్త యగుభూభాగంబు భోగింపఁగన్.
| 59
|
ఆ. |
రామువెనుక సకలరాజ్యసంపదలతో, నరుగు మీవు శూన్య మైనపురము
భరతుఁ డేల నిమ్ము పాపమ్ము సిద్ధించెఁ, గైక దీన నేమి గట్టుకొనియె.
| 60
|
శ్రీరామసీతాలక్ష్మణులు వల్కలభసితాదులు దాల్చుట
చ. |
అన విని కైక కోపమున నజ్జనవల్లభుఁ జూచి మేదినీ
తనయయు లక్ష్మణుండు సయితంబుగ రాముఁడు నారచీర లేఁ
గనుఁగొనుచుండఁ గట్టుకొని కాననభూమికి సర్వశూన్యుఁ డై
చనక వరంబు లొల్లను మృషావచనుండవు గమ్ము నెమ్మదిన్.
| 61
|
ఆ. |
రఘుకులేశు లైనకరాజు లెవ్వరు నాడి, తప్ప రొకఁడ వీవు దప్ప ననుడు
మగుడ మూర్ఛ మునిఁగె మనుజేశుఁ డప్పుడు, జననిఁ జూచి రామచంద్రుఁ డనియె.
| 62
|
క. |
గురుఁడును దండ్రియు రాజును, బరికింప నితండ యితఁడు పనిచినఁ దల్లీ
గరళంబేఁ గొనియెద సా, గర మైనం జొత్తుఁ జొత్తుఁ గార్చి చ్చైనన్.
| 63
|
ఉ. |
నాకు నసాధ్యముల్ త్రిభువనంబులయందును లేవు గావునన్
వే కొనితేరఁ బంపు మునివేషము గైకొన వల్కలాదు లం
చాకొమరుండు పల్కుటయు నాతనిముందటఁ బెట్టఁ బంచె న
క్కైకయు నప్డు రాముఁడు వికాసవిభాసిముఖారవిందుఁ డై.
| 64
|
సీ. |
కస్తూరికాపుష్పగంధబంధురమణి, బంధ మూడిచి జటాభార మూని
|
|
|
కోమలచారుదుకూలంబు లెడలించి, కర్కశవల్కాంశుకములు గట్టి
పరిలిప్తచందనపంకంబు పోఁజేసి, నిర్మలభసితంబు నిండ నలఁది
మహనీయబహురత్నమండనంబులు వుచ్చి, లీలమై నక్షమాలికలు దాల్చి
రాజజూటునోజ రమణీయతేజోవి, రాజమానమూర్తి రాజకీర్తి
రఘుకులాబ్ధిజనితరత్నంబు రాజన్య, చక్రవర్తి రామచంద్రుఁ డొప్పె.
| 65
|
వ. |
తదనంతరంబ జనకరాజపుత్రియు సౌమిత్రియుం దపోవేషంబులు గైకొని రప్పు
డారాజపరమేశ్వరం డగురాఘవేశ్వరుం డన్నరేశ్వరుం గనుంగొని.
| 66
|
సీ. |
పదునాలుగేఁడులు పదునాల్గు దినములు, గాఁ బుచ్చి వచ్చెదఁ గాననమున
వర్తించు టిది యెంత వసుధేశ దీనికి, మదిలోన నీ కింత మఱుఁగ నేల
భరతుఁడు నాకంటె భక్తుఁడు గాన నీ, యాజ్ఞ దప్పక చేయు ననుచుఁ బలికి
వలగొని తత్పాదవనజంబులకు మ్రొక్కి, కైకకుఁ బ్రణమిల్లి కడిఁది మూర్ఛఁ
దన్ను మఱచి యున్నతండ్రి వీడ్కొని సుమి, త్రాసుతుండు జనకరాజసుతయుఁ
దోడ రాఁగ ముదముతోఁ దల్లిపాలికి, నరుగుదించె రాముఁ డంత నచట.
| 67
|
వ. |
కౌసల్యాదేవియుఁ బట్టాభిషేకంబునకు విఘ్నంబు గాకుండ విహితవ్రతోపవా
సంబులు గైకొని సమస్తదేవతాప్రార్థనంబు సేయుచుఁ బుత్రాగమనంబు విని
సంతోషించి విశేషాక్షతాదిమంగళద్రవ్యంబులు గైకొనుచు నీరాజనకరణంబు
లకుఁ బుణ్యాంగనలు తోడరా నెదురేఁగుదెంచి యారాజర్షిరత్నంబుఁ గనుఁగొని.
| 68
|
క. |
ఉల్లము గలఁగఁగ మొగమున, వెల్లఁదనం బొలయఁ దాల్మి వీడంగఁ గడుం
దల్లడ మందుచు నుండఁగఁ, దల్లికిఁ బ్రణమిల్లి యతఁడు దగ ని ట్లనియెన్.
| 69
|
ఉ. |
రాజు మహాజి నిచ్చినవరద్వితయంబునఁ గైక నేఁడు వి
భ్రాజితలీలమై భరతుపట్టము నే వనభూమిలోన నీ
యోజఁ జతుర్దశాబ్దము లనూనతపస్థితి నున్కి వేఁడె ని
ట్లాజనయిత్రికోర్కియు నృపాగ్రణిసత్యముఁ జల్పు వేడుకన్.
| 70
|
క. |
ఏ నిట్లు తపోవేషముఁ, బూని నరేంద్రుండు వగలఁ బొగులుచు నుండం
గా నేతెంచితి నిటకును, మానసమున దీని కింక మఱుఁగకు మనినన్.
| 71
|
క. |
మూలంబు దెగినతరువును, బోలెం బెనుమూర్ఛ నొంది భూస్థలిమీఁదన్
వ్రాలి యనంతరమున ను, న్మీలితనయనాబ్జ యగుచు నృపరత్నంబున్.
| 72
|
కౌసల్య రామునివనగమనవృత్తాంతం బెఱింగి యడలుట
మత్త. |
లిప్తనిర్మలభూతిభాసురు లేమ చూచి విషాదసం
తప్తచిత్తముతోడ ని ట్లనుఁ దమ్ముఁడా నిను మేదినీ
గుప్తికై కని యెట్టకేనియు గొడ్డు వీఁగితి నంచు నే
సప్తవింశతివత్సరంబులు సంతసంబున నుండితిన్.
| 73
|
శా. |
ఇంకం దొల్లిటినోము లి ట్లగుట కే నే మందు నోపుత్ర ని
|
|
|
శ్శంకం గేకయరాజపుత్రి ధరణీసామ్రాజ్యభోగంబు దా
నంకం బైననిజేశుచేఁ బడయుఁ గా కన్యాయబుద్ధిన్ గుణా
లంకారున్ నినుఁ గాన కేఁగు మన నేలా కోర్కి సిద్ధించినన్.
| 74
|
మ |
పతి నెయ్యుం డని కైక కి ట్టడుగఁ జొప్పా పూన్కిఁ ద న్నేల ని
చ్చితి విన్నేలను నిన్ను నేల వనవాసిం జేసె ని ట్లైనచో
నతఁడుం గా దన కూరకుండె నఁట కామాంధుండు నై నీకు ని
ట్టితెఱం గక్కట కైకొనం దగునె తెండ్రీ తండ్రి మధ్యస్థుఁ డై.
| 75
|
సీ. |
ముదముతో దీవించి నుదుట వసిష్ఠుండు, గట్టినయభిషేకపట్ట మమర
బంధురలీల నకరుంధతీముఖ్యయో, షిజ్జన ముంచినసేస లొప్పఁ
గెలఁకుల మంగళలలితగీతాదుల, రవములసొగయింపు చెవుల నలయఁ
బంకజాక్షులరత్నకంకణక్వణనముల్, రాజిల్లు వీచోపు లోజ మెఱయ
నెలమి ధవళాతపత్రంబు లెసకమెసఁగ, మస్తకన్యస్తరాజన్యశహస్తకమల
ములును దృక్చంద్రికావీథి మొగుడుచుండ, నాకు నిది మ్రొక్క నేతెంచుటే కుమార.
| 76
|
క. |
ఈవార్తకు మును దైవము, చా వొసఁగదె యెట్టి పాపజాతినొ నాకుం
బోవునె యిడుమలఁ గుడువం, గావలసినకర్మ మొకటి గలుగఁగఁ బుత్రా.
| 77
|
మ. |
భరతుం బట్టముగట్టి యెక్కటి మహీభాగంబు భోగించుచుం
బరమానందముతోడఁ గైక తనసౌభాగ్యంబు శోభిల్లఁగా
సిరి పెంపార విభుండుఁ దాను మనఁగాఁ జేడ్పాటుతో నేను బా
హిరమై యుండెద నొంటి నీ వకట న న్నేకాకినిం జేసితే.
| 78
|
క. |
నాసవతి యైనకైకకు, నీసును జల మెక్కఁ దల్లి నిటు వాసి చనన్
దోస మనక వనవాసా, యాసమునకు నియ్యకొనఁగ నగునే నీకున్.
| 79
|
శా. |
నాచేతం దొలుమేన నిష్ఠురగతిన్ నానావిషాదోన్నమ
ద్వీచీదుస్తర మైనపుత్రవిరహాబ్ధిం ద్రోవఁ బడ్డా రొక
ళ్లీచందంబున నిప్పు డాఫలము నా కేభంగులం దప్పునే
వేచెం గీడు విధాత యేల పలుకుల్ వేయుం గుమారోత్తమా.
| 80
|
క. |
ఏ మని దైవము దూఱుదు, నే మని శోకింతు నడవి కీగతిఁ జనఁగా
నే మని ధైర్యము నిలుపుదు, నే మని పలవింతు నింక నెక్కడఁ జొత్తున్.
| 81
|
సీ. |
భరతున కభిషేకపట్టంబు వలసిన, నేఁ డేల పతి మున్నె వేఁడఁ గాదె
మనుజేశుఁ డిచ్చిన మహిమతో ని న్నేల, నాలుగుచెఱఁగుల నేలరాదె
మగఁడు వాటించిన మాకంటె నెక్కుడు, దొడుగఁ గట్టఁగఁ బూయ నడుగరాదె
యన్న నీవనవాస మది దక్క నాథుచేఁ, గడలేనిమన్ననల్ వడయరాదె
యింత తెంపుసేయ ని ట్లెందు నెవ్వతె, నేర్చె దీని కెట్టు లోర్చె రాజు
|
|
|
కనికరం బొకింత గలదె దానికిఁ బాప, మొక్కొ పొడవు చూడ నక్కటకట.
| 82
|
తే. |
అనుచుఁ బెక్కుదెఱంగుల నడలుచున్న
జనని నూరార్చి యోతల్లి సవతితనము
కైకదెసఁ జూపి యాడెదు గాని నీదు
కులము శీలముఁ బరికించి పలుక వేల.
| 83
|
క. |
పతివాక్యాతిక్రమణము, సతులకు నెబ్భంగిఁ జేయఁ జన దని ధైర్య
స్థితి నిలుతురు గా కెందును, సుతులం బాయంగ లేని సుదతులు గలరే.
| 84
|
ఆ. |
భార్గవుండు తండ్రిపనుపున రేణుకా, దేవి తల్లి యనక తెంపు సేసెఁ
గుండినుం డొనర్చె గోహింస జనకాజ్ఞఁ, గాన పితృనియుక్తిఁ గడవఁ జనదు.
| 85
|
క. |
జననీ యి ట్లగుటను మ, జ్జనకుపలుకు మీఱఁ గాదు సమకొల్పు ధృతిన్
మనమున వగవకు మిట్టి, ట్టని సొలవకు రాజువలనఁ గైకేయిదెసన్.
| 86
|
క. |
అని పలికిన నద్దేవియుఁ, దనయునితెం పెఱిఁగి యెట్లుఁ దప్పదు దైవం
బును బగవారిం గూడెను, నను రాముఁడు విడిచె నే మనం గల దింకన్.
| 87
|
వ. |
అనుచు వగలం బొగులుచున్నసమయంబున నక్కుమారుండు.
| 88
|
సీతారామలక్ష్మణులు కౌసల్యాసుమిత్రలచే వనవాసంబున కనుజ్ఞ కొనుట
ఉ. |
మ్రొక్కినఁ గౌఁగిలించి మది ముట్టిన మోహము ద్రెంపలేక లోఁ
బొక్కుచు వేఁడియూర్పుఁ దగఁ బుచ్చి తొడింబడఁ గొంతసేపు వే
ల్పెక్కినభంగి నుండి ధృతి నెట్టకునేనియుఁ బూని కుత్తుకం
జి క్కెడలించి పుత్రుఁ గని చిత్తములోనఁ దలంపు గూడినన్.
| 89
|
సీ. |
వినయంబుతో నెల్లవేల్పులఁ బేర్కొని, దక్షిణకరమున రక్షఁ గట్టి
నీరాజనం బిచ్చి నృపవరదనుజులఁ, బరిమార్చి రక్షింపు సురల మునుల
నఖిలదేవతలు వృత్రాసురు గెలువఁబో, నెసఁగంగ నింద్రున కొసఁగుశుభము
నమృతంబునకు నేఁగునప్పుడు వినత వి, హంగాధిపతి కిచ్చుమంగళంబు
లింపు సొంపారఁ బుత్ర గానిమ్ము నీకు, ననుచు దీవించి సౌమిత్రి వినతుఁ డైన
నన్న లక్ష్మణ నీవు మాయన్నవెనుకఁ, జనియెదే పట్టి సుఖవి గమ్మనుచుఁ బలికి.
| 90
|
ఉ. |
కోడలు మ్రొక్కినన్ మదిని గుందుచు నక్కున నక్కుఁ జేర్చి నిన్
వేడుక నిచ్చునప్డు రఘువీరుఁడు రాముఁడు వార్ధి మేరఁగా
నీడితకీర్తితోఁ బుడమి యేలెడు నంచుఁ దలంచెఁ గైకచే
మూఁడఁగ నున్న దీని మునుముట్ట భవజ్జనకుం డెఱుంగునే.
| 91
|
ఉత్సాహ. |
రాజబింబవదన జనకరాజు నిన్ను నిమ్మహా
రాజపుత్రుఁ డైనసుగుణరత్నమునకు నిచ్చితిం
|
|
|
దేజ మెసఁగు మంచు సమ్మతించి యున్నచోట నొం
డోజ నిచట దైవఘటన మున్న నేమి సేయుదున్.
| 92
|
క. |
అతివలు ధనవిరహతు లగు, పతులను దిగవిడుతు రెన్నిభంగుల ధర్మ
స్థితిఁ దలఁపరు తాదృగ్విధ, సతులను నినుఁ జెప్పి చెప్పఁ జనునే సాధ్వీ.
| 93
|
క. |
నిర్ధనుఁడు గాఁడు రాముఁడు, వర్ధిష్ణుఁడు పడయఁ జాలు వాసవభోగ
స్పర్ధి యగువిభవ మితఁడు ధ, నుర్ధరుఁ డై యమ్ముదెసఁ గనుంగొనుమాత్రన్.
| 94
|
చ. |
దశరథువాక్యశాసనము తప్పుట త ప్పని నిశ్చయించి యీ
దశను ధరించి లోకవిదితంబుగఁ గానలలో శరచ్చతు
ర్దశకముఁ బుచ్చి వచ్చి రఘురాముఁడు నిర్మలకీర్తిచంద్రికల్
దశదిశలన్ వెలుంగు వసుధాపరిపాలనకేళి సల్పెడిన్.
| 96
|
వ. |
అని పలికి నందనువదనారవిందం బవలోకించి ఱెప్పలు వ్రాలవైచి మనంబునం
బొగులుచుండె నప్పు డారాఘవేశ్వరుండు తల్లి నామంత్రణంబు చేసి సీతాలక్ష్మణ
సమేతుం డయి సుమిత్రాదేవిపాలి కేతెంచి యంతవృత్తాంతంబు నెఱింగించి
నమస్కరించి వీడ్కొనుసమయంబున నజ్జననియు శోకదందహ్యమానమానస
యగుచు ని ట్లనియె.
| 97
|
క. |
అక్కట కైకకుఁ దగునే, యిక్కొడుకున కెగ్గు సేయ నిటు గలదే రా
జిక్కీడున కోర్చెఁ గదే, నిక్కము కృప గలదె కామినీమగ్నులకున్.
| 98
|
వ. |
అని పలికె నంత లక్ష్మణుండు సమస్కరించుటయు దీవించి యక్కుమారువదనం
బాలోకించి.
| 99
|
క. |
మనమున రాముని దశరథ, జననాయకుఁగాఁ దలంపు జనకతనూజన్
ననుఁగాఁ దలఁపుము కానన, ము నయోధ్యగఁ దలఁపు మేఁగు ముదమునఁ దండ్రీ.
| 100
|
ఉ. |
భూమితనూజ ముగ్ధ వనభూములఁ బెక్కులు దైత్యమాయ లు
ద్దామబలాఢ్యుఁ డై సుగుణధాముఁడు రాముఁడు నిద్రవోవుచో
నేమఱ కెప్డు నీవు శర మేర్చి యధిజ్యశరాసనుండ వై
సేమ మెఱింగి యుండు మని చెప్పెఁ బదంపడి సీత మ్రొక్కినన్.
| 101
|
ఉ. |
అక్కున నక్కు సేర్చి ముద మారఁగ దీవన లిచ్చి తల్లి నీ
వెక్కుడుపుణ్యశీలమున నిష్టమతిం బతి కానుకూల్యమున్
దక్క కొనర్చుచుండు మని తత్పరతం దగబుద్దు లిమ్ములం
బెక్కులు చెప్పి వీడ్కొలిపెఁ బేర్చినశోకముఁ దాల్మి నాఁగుచున్.
| 102
|
వ. |
అంత రామచంద్రుండును సౌమిత్రియు ధరిత్రీపుత్రియుం దోడరా నాతపత్ర
ధ్వజచామరశూన్యుండును బాదచారియు నై రాజమార్గంబునం గ్రందుకొని
తమవేషంబులకుం బొగులుచున్న పురజనంబులం జూచి నవ్వుచు నిజమందిరంబు
|
|
|
నకుఁ జనుదెంచి వసిష్ఠపుత్రుం డైనసుయజ్ఞునకుఁ బదికోట్లసువర్ణంబులు ననేక
రత్నాంబరంబులును సమర్పించి వసిష్ఠాదిమునులకు నానాదీనజనంబులకు సమ
స్తధనంబు లిచ్చె నంత జనకాత్మజయు నాత్మీయమందిరంబున కేతెంచి భూష
ణంబులు హేమరాసులును వసిష్ఠవాసిష్ఠపత్నుల కొసంగె నాసమయంబున
నరుంధతి వసిష్ఠుం గనుంగొని.
| 103
|
తే. |
నీ కుపేక్షింపఁ దగునె యిక్ష్వాకుకులము, లోన నింతలు నొప్పము లైనచోట
ననిన నమ్ముని యధికసమాధియుక్తి, నయ్యనాగతవృత్తాంత మరసి చూచి.
| 104
|
వ. |
ఇది దైవికం బయినతెఱంగు దీనిం గనుంగొనుచు నూరకుండు మని పలికె
నప్పు డారామచంద్రుండు సమస్తమునులకు గృహదేవతలకు నమస్కరించి శర
శరాసనసన్నద్ధుం డయి నగరు వెడలి చనిన జననులయార్తరావంబు వీతెంచె
నపుడు దశరథుండు శోకవివశుఁ డగుచు సుమంత్రుం గనుంగొని.
| 105
|
సీతారామలక్ష్మణులు వనంబున కరుఁగఁ బౌరులు వెంబడించుట
తరల. |
రథము వే కొనిపొమ్ము రాముఁ డరణ్యభూమికి నేఁగెడున్
శిధిలతం ధనువల్లి దూలఁగ సీత మెల్లన పాదముల్
పృథివి మోపుచు నింత కెంత చలించుచుండునో నావుడుం
బృథులరత్నమరీచు లార గభీరనేమిరవంబుతోన్.
| 106
|
ఉ. |
అతఁడు తేరు దెచ్చి వసుధాధిపునానతి రత్నకాంచన
స్ఫీతరథాధిరోహణము సేయుఁడు నావుడు సీతయున్ సుమి
త్రాతనయుండుఁ దానును రథంబు రఘూద్వహుఁ డెక్కి పోవ నా
నాతురనాదముల్ సెలఁగె నప్పుడు తత్పురిరాజవీథులన్.
| 107
|
ఉ. |
కొందఱు కైక నాడ నృపుఁ గొందఱు పేర్కొని యెగ్గు లెన్నఁగాఁ
గొందఱు రామచంద్రుఁ దనకుం జన నేటికి నాఁగ మంథరం
గొందఱు తిట్టఁగా సొలసి కొండఱు దైవము దూఱ రాఘవ
స్యందన వీథి నిట్లు జన శబ్దపరంపర నిండె వెండియున్.
| 109
|
మ. |
కులనిస్తారకుఁ డీతఁ డిట్లరుగఁ గాకుత్స్థాన్వయం బింతతో
బొలిసెన్ మంథర యింత సేసె నది దుర్బోధంబుగాఁ జూడ కి
మ్ముల నక్కైకయు నావరంబు లడిగెన్ మోహాంధుఁ డై రాజు ను
గ్మలికిం బాపసహాయుఁ డయ్యె నకటా కౌసల్యకుం బండెఁ బో.
| 111
|
సీ. |
సంతానసిద్ధికి సకలమునీంద్రులఁ, బితృదేవగణములఁ బ్రీతిఁ గొలిచి
బహుకాలతపమునఁ బరిపక్వ మగు పుణ్య, ఫలమునఁ గశ్యపబ్రహ్మమనుమఁ
డశ్వమేధంబున నధ్వర్యుఁ డయి పుత్ర, కామేష్టి గావింపఁగాఁ బ్రసక్తి
|
|
|
మై నగ్నిదేవుఁడు మహనీయచరు వటు, దయసేయఁ బుత్రరత్నములఁ బత్ను
లందుఁ బడసియున్న యట్టిసంతోషసం, వర్ధనకము లెల్ల వమ్ము గాఁగఁ
గైకకొఱకు నకట గానకు వీరఘూ, త్తముల పరుగు మనియె దశరథుండు.
| 112
|
శా. |
స్వచ్ఛందస్థితిఁ గీర్తి దిక్తటములన్ వర్తింపు నేకాతప
త్రచ్ఛాయంబుగ భూమి యేల రఘురత్నం బున్నచో ధర్మముం
బ్రచ్ఛాదించి విభుండు గూర్చు నని నిర్బంధించి యిబ్భంగిఁ దు
చ్ఛేచ్ఛం గైక వరంబు వేఁడె విధితో నెవ్వాఁడు నేర్చుం గటా.
| 113
|
సీ. |
మంథర తగ వేది మతకంబు లూహించి, కైకకుఁ జెడుబుద్ధి గఱపె నకట
తగదని కినియక దానిమాటలకు నా, చేడియ గడుఁదెంపు సేసె నకట
పాపంపువరములు పత్ని వేఁడినయట్టు, లొడఁబడి వసుధేశుఁ డొసఁగె నకట
యభిషేకవేళ నట్టడవికిఁ బొ మ్మన్నఁ, గొడుకు దానికి నియ్యకొనియె నకట
యన్నమనసు నొచ్చు నని సుమిత్రాపుత్రుఁ, డొండు మదిఁ దలంపుకుండె నకట
ధర్మపథము విడిచి దైవంబు పగవారు, దలఁచినట్లు కీడు దలఁచె నకట.
| 114
|
వ. |
అని యి ట్లనేకప్రకారంబుల శోకించుచు నెడనెడ నిలువ కప్పురజనంబులు తద్ర
థంబుపిఱుందం జనుదేరం జూచుచు రామచంద్రుం డయోధ్యాపురగోపురంబు
వెడలె నాసమయంబున.
| 115
|
ఉ. |
ఆనగరంబు వెల్వడి ధశరాత్మజ ముందటఁ గానవచ్చును
ద్యానముఁ జూచి కోమలకరాబ్జమున భుజ మప్పళించుచున్
లేనగ వొప్ప నల్లతరులే మనయేఁగెడుకాననంబు నా
నానసపద్మ మెత్తె వసుధాధిపుఁ డశ్రువితానపంక్తితోన్.
| 116
|
వ. |
అంత నక్కడ దశరథుండును గౌసల్యాసుమిత్రలకరంబు లవలంబించి యంతఃపు
రంబుచేడియలు తోడరా నధికవిషాదంబుతో నగరు వెలువడి నేత్రంబులం
దొరఁగు బాష్పంబులకతన రామురథమార్గంబు గానరామికిం బెక్కుదెఱంగుల
విలపించుచుం బోవుసమయంబున.
| 117
|
దశరథుండు రామునరణ్యగమనంబునకు విలపించుట
సీ. |
దినకరప్రభ తప్పె దిశలఁ జీఁకటి గప్పెఁ, బొగయుచు నగ్నులు పొనుఁగుపడియె
గృహశారికాకీరకేకిహంసావళి, విరుతముల్ విపరీతవిధము లయ్యె
నిభములమదధార లింకె నుత్తమతురం, గములకన్నుల నశ్రుకణము లొలికెఁ
బురజను లెలుఁగెత్తి పొరిఁబొరి శోకింప, నిగిడి హాహాధ్వనుల్ నింగి ముట్టె
విబుధతతులయడలు వీతెంచెఁ బౌరుల, కి ట్లమంగళంబు లెసఁగుచుండ
నప్పురంబు వెడలి యరదంబు గని నృపా, లుఁడు సుమంత్రునకు నెలుంగు సూపి.
| 118
|
శా. |
కూడం జాల రథంబు నిల్పు మని యాక్రోశించుచుం గూడ రాఁ
జూడం దండ్రియవస్థఁ జూచి మదిలో శోకం బధైర్యంబుతోఁ
|
|
|
గూడం దోడనె తెంపు గూడుటయు నక్కుంభిన్యధీశాగ్రణీ
చూడారత్నము తేరు వే నడపు మంచుం జెప్పె నయ్యాజ్ఞకున్.
| 119
|
క. |
హరుల సుమంత్రుఁడు వోని, చ్చె రయంబున నప్పు డావసిష్ఠుఁడు నిలు మో
నరనాథ వెనుక నడలుచు, నరుగం జన దనఁగ నిలిచి యధికాతురతన్.
| 120
|
ఉ. |
పంబినపుత్రమోహమునఁ బార్థివుఁ డారథ మేఁగఁగా విషా
దంబునఁ జూచి చూచి యరదం బటఁ గనక తద్ధరాపరా
గం బటు సూచి చూచి యది గానక కొండొకసేపు దా నిరా
లంబనదృష్టి యై కడుఁ గలంగి మనోభ్రమ నిండ వెండియున్.
| 121
|
వ. |
నిజనందనస్యందనంబు ముందటం దోఁచిన ట్లయిన.
| 122
|
చ. |
అదె రఘువీరుఁ జన్నరథ మల్లదె పోయెడి రాముతేరు పొ
మ్మదె యన పోయె నయ్యరద మక్కడఁ దోఁచెఁ దదీయభూరజం
బదియు నడంగెఁ బొ మ్మకట హా గుణరత్నమ హా కుమార హా
సదమలకీర్తిహార నృపసత్తమ హా ననుఁ గూడ నీఁ గదే.
| 123
|
శా. |
ఓపట్టీ నను డించి నీ వరిగెదే యుగ్రాటవీవాటికిన్
నాపుణ్యం బిటు లయ్యెనే వినఁ గదే నా కేది దిక్కుంచు నా
భూపాలుం డతిదుస్తరవ్యధఁ బడుం బొక్కున్ గళద్బాష్పుఁ డై
చూ పాదిక్కున దవ్వు గాఁగ నిగిడించుం దూలు దైన్యంబునన్.
| 124
|
వ. |
ఇ ట్లంతకంతకు మోహావేశం బడరి మూర్ఛాపరవశుం డగుచు నేలంబడి పొరలి
ధూసరితాంగుం డై కొండొకసేపునకుం దెలిసి కైకేయిం గనుంగొని.
| 125
|
ఉ. |
పాతకవర్తి వైననినుఁ బత్నిఁగఁ గైకొని యున్న నేనునుం
బాతకవర్తి నింక నతిపాతకవర్తిని ముట్టఁ గాదు వి
ఖ్యాతిగ నిట్లు నింద కొడిగట్టితి సంతస మందు దీన దు
ర్నీతి దురాత్మురాల వగు నీక చనుం గులనాశకారిణీ.
| 126
|
క. |
అని పతి పలుకఁగఁ గనుఁగొని, వనితలు నిందింపఁగా నవనతానన యై
వినుచుండెం గైకేయియుఁ, దనయంతనె మగిడెఁ బురికి ధరణివిభుండున్.
| 127
|
తే. |
అరుగుదెంచియు నిర్జనం బయినపురము, విన్నఁబోవుటఁ జూచి నిర్విణ్ణుఁ డగుచు
నగరు సొత్తెంచి చిత్తంబు వగలఁ బొగుల, శయ్యపై మేను వైచి కౌసల్యఁ జూచి.
| 128
|
సీ. |
ఇంతకు రఘురత్న మెంతద వ్వరుగునో, యకట యప్పుణ్యుఁ డేయంఘ్రిపముల
నీడల నుండునో నేఁ డెట్లు కందమూ, లము లారగించునో లలితచరిత
భూపుత్రి యేగతిఁ బొందునో రాముఁ డ, మ్ముద్దియవాడినమోముఁ జూచి
హృదయంబు గందంగ నే మని వగచునో, సౌమిత్రి నాదుష్టచరితములకు
నొచ్చి యెన్ని పల్కునో యంచు వగవఁ గౌ, సల్యలోనుగాఁగ సతులు గూడి
పాపజాతిఁ గైకఁ బలుమాఱు దూఱు చం, దంద నడలుచుండి రచట నంత.
| 129
|
ఉ. |
పౌరసమేతుఁ డై రఘునృపాలకుఁడుం దమసాతరంగిణీ
తీరము సేరఁగా నరిగి తే రట డిగ్గి పితృప్రసూచితా
చారవిధంబు లత్తటినిఁ జల్పి జలంబులు ద్రావి ధైర్యవి
స్తారత విశ్రమించె మృదుతల్పసమస్థితిఁ బర్ణశయ్యపై.
| 130
|
క. |
పురజనులు దిరిగి వచ్చియుఁ, దరతరములు రాముఁ గొల్చి తద్గుణగణనా
పరవశతం దమతమమం, దిరములదెసఁ దలఁపు మఱచి నిద్రించుటయున్.
| 131
|
క. |
ఎప్పుడు విడువక తిరిగెద, రిప్పౌరుల డించి చనఁగ నిది తఱి నా కం
చప్పుడు విభుఁడు సుమంత్రుం, జప్పుడు గాకుండ గూఢసంజ్ఞం దెలిపెన్.
| 132
|
ఆ. |
తెలిపి రథ మయోధ్యదెసకుఁ బోవఁగ నిచ్చి, తప్పు తెరువునందుఁ ద్రిప్పి తెచ్చి
తమసనదియు వేగ దాఁటింపు మనవుడు, నర్ధరాత్ర మతఁడు నట్లు చేసె.
| 133
|
వ. |
రామచంద్రుండును నన్నది నుత్తరించి తత్తీరవనభూములు భూమిజకుం జూపుచు
నయ్యయిజనపదంబులవిలాసంబులను వినుచు వేగవతియు సరయువునుం దాఁటి
దివసావసానసమయంబునకు గంగాతీరంబుఁ జేరి యొక్కయింగుదీతరుప్రాంతం
బున విడిసె నిక్కడఁ దమసానదీతీరంబున.
| 134
|
ఉ. |
పౌరులు మేలు కాంచి నరుపాలకుఁ గానక విన్నఁబాటుతో
నారథమార్గ మారసి నృపాగ్రణి క్రమ్మఱఁ బోవఁబోలు నిం
పార నయోధ్య కంచుఁ జని యప్పురలక్ష్మి యమంగళంబులం
గోరుట చూచి గేహములఁ గొందల మందుచు నుండి రిక్కడన్.
| 135
|
గుహుండు సీతారామలక్ష్మణులను గంగ దాఁటించుట
క. |
గుహుఁ డనునిషాదనాథుఁడు, మహితాంబరరత్నఖచితమండనసుమన
స్సహితోపాయనములతో, విహితంబుగ రామవిభుని వేడుకఁ గనియెన్.
| 136
|
సీ. |
కని మ్రొక్కి య ట్లున్నికి గనుఁగొని వెఱఁగంది, యేమి యోదేవ నీ వీతపస్వి
వేషంబు ధరియించి విగతసైన్యుండ వై, కానకు విచ్చేయుకారణంబు
మీబంట నే నుండ మి మ్మింత సేసిన, ద్రోహి వాఁ డెవ్వఁడు తులువ నాదు
బాణాసనార్చులపాలు కావించెద, ననిన నవ్వుచు రాముఁ డంతతెఱఁగు
నోలిఁ దెలియంగఁ జెప్పి వీరోక్తు లుడుప, శబరపతి యఫ్టు గైకదోషంబునకును
రాజునవివేకమునకు నారాఘవులకు, నయినదురవస్థకును దుఃఖితాత్ముఁ డయ్యె.
| 137
|
వ. |
అంత నమ్మహీపతియుం గిరాతపతిని బోధించి సంధ్యానియమంబులు దీర్చి నిద్రించె
నాసమయంబున.
| 138
|
ఉ. |
ఆపదునాలుగేఁడులు నరహర్నిశముం దననిద్ర దప్పి యా
రోపితచాపుఁ డై రఘువరుం గొలువం బరమాద్భుతప్రతి
జ్ఞాపరుఁ డైన లక్ష్మణుఁడు జానకివిన్నఁదనంబు చిత్తసం
తాపము సేయ నాశబరనాథుని కద్దెసఁ జూపి వెండియున్.
| 139
|
వ. |
కౌసల్యాసుమిత్రలశోకంబుఁ జెప్పి రామధైర్యంబు గర్హించుచు నర్హం బగు
నెడ గుహుండును దానును గూర్చుండి వగలం బొగులుచుండె నంతఁ బ్రభాతం
బేఁగుదెంచిన.
| 140
|
ఆ. |
సమయవిధులు దీర్చి సౌమిత్రిసహిత మీ, రేడువత్సరములు ధృతి గరిష్ఠ
నిష్ఠఁ దపము సేయ నేమంబు కైకొని, మనుజనాయకుఁడు సుమంత్రుఁ జూచి.
| 141
|
చ. |
అనుచిత మింక మాకు రథరయానము గావునఁ దే రయోధ్యకుం
గొని చని మాతెఱంగునకు గుండెలు గ్రుళ్లుచు నున్నయన్నరేం
ద్రునకును మువ్వురమ్మలకు మ్రొక్కితి మే మని విన్నవింపు నీ
వనునయభంగి వారిహృదయంబులశోకము లార్పు నేర్పునన్.
| 142
|
ఉ. |
నావుడు గద్గదస్వరమునం బతితో నను రామచంద్ర ని
న్నీవనభూమి డించి చని యే మని పౌరుల కింకఁ జెప్పుదున్
భూవిభునొద్ద కెట్లు గొనిపోవుదు శూన్యరథం బవశ్యముం
దావకసేవకుండ భవుదంఘ్రుల నే నిటఁ గొల్చి వచ్చెదన్.
| 143
|
ఉ. |
ఆనతి యిమ్ము నావుడు రయంబున నీ వటు వోయి వారు గం
గానది దాఁటిపోయి రని కైకకు నమ్మిక పుట్టఁ జెప్పినం
గాని నిజంబు సేయ దటు గాన యయోధ్యకు నేగు మన్న దీ
నాననుఁ డై యతం డరిగె నారథ మెక్కి విషాద మందుచున్.
| 144
|
వ. |
తదనంతరంబ గుహుడు కర్ణధారుండుగా నావ యెక్కి సీతాసమేతంబుగా నక్కు
మారనిధానంబులు.
| 145
|
మ. |
ఘనబాహాపరిఘాభిరాములు కనకత్కాండప్రచండాశుగా
సను లుత్తుంగవిశాలవక్షులు విరాజత్పంకజాక్షున్ సుధాం
శునిభాస్యున్ గమనీయమూర్తులు రఘుక్తక్షోణీశు లప్పుణ్యభా
గిని భాగీరథ నుత్తరించి రకలంకీభూతచేతస్కు లై.
| 146
|
తే. |
ఇత్తెఱంగున నాగంగను తరించి, గుహునిచేఁ ద్రోవఁ జూపించుకొని ప్రియమ్ము
తోడ నక్కిరాతాగ్రణి వీడుకొలిపి, యమ్మహారణ్యపథమున నరుగునపుడు.
| 147
|
క. |
హతవిధి కృతి ని ట్లతికఠి, నతరస్థలి నడుగు లిడుచు నడు మసియాడం
గతిపయమృదుపదగతి నా, క్షితిసుత డయ్యుటయుఁ జూచి చిత్తం బవియన్.
| 148
|
చ. |
నడు మిసుమంత మీఁదఁ గఠినస్తనభారము తోర మంతకుం
దడఁబడు లేఁతనెన్నడపదమ్ములు నూతనపల్లవంబులం
గడచినకోమలంబు లని కాదె తనున్ నిలు మంటి నింట నేఁ
బడియెడు నెన్నిపాటులనొ పక్ష్మలలోచన చూడు లక్ష్మణా.
| 149
|
క. |
నడవం జాలక యడుగులు, తడఁబడఁ బొగులుచును నోరు దడుపుచు నకటా
కడుఁ దూలె ననుచు విభుఁ డెడ, నెడ నీడల నిలిచి నిలిచి యిభనిభగమనన్.
| 150
|
వ. |
అలయకుండఁ దోకొని నాఁడు మూఁడుయోజనంబులు సని సుదర్శనం బనుస
రోవరంబు గాంచి తత్తీరవటమూలంబున విడిసి మృణాళఖండంబు లాహారంబుగా
గొని యా రాత్రి యచ్చటనుండి మఱునాఁడు యోజనత్రయం బరిగి.
| 151
|
క. |
అమితాఘభంగరంగ, త్క్రమచంగము మృదులతుంగతరతరళతరం
గము గంగాయమునాసం, గము చేరి ప్రయాగవటము గని దాశరథుల్.
| 152
|
ఆ. |
అందు మునివరేణ్యుఁ డగు భరద్వాజుఁ ద్రి, కాలవేది శిష్యగణసమేతు
మహితమూర్తిఁ గని నమస్కరించుటయు దీ, వించి వారిఁ గాంచి వెఱఁగు నొంది.
| 153
|
క. |
యోగసమాధి నతీతా, నాగతవృత్తాంత మరసి యాఘనులకు నా
నాగుణధనులకుఁ గరుణా, సాగరులకుఁ జేసె నతఁడు సత్కారంబుల్.
| 154
|
క. |
ఇత్తెఱఁగున నాసంయమి, సత్తముచే నుచితకృతుల సత్కృతు లై భూ
పోత్తములు రాత్రి మహిమో, దాత్తస్థితి నచట నిలిచి రట దివసమునన్.
| 155
|
మ. |
ఘనదుర్గం బగుచిత్రకూటనగమార్గం బాభరద్వాజుచే
విని తత్పాదసరోరుహంబులకు నావీరోత్తమున్ మ్రొక్కి వీ
డ్కొని వేడ్కం జని రఫ్డు రాముఁడు కనకత్కోదండశుంభద్గుణ
ధ్వని మోయించి మృగావళుల్ బెదర సీతం బ్రీతిఁ బొందించుచున్.
| 156
|
శా. |
ఆలోలాక్షికిఁ దద్విలోకనవినోదాసక్తి రెట్టింప ను
త్తాలాభీలవిశాలసాలవిచలద్వాతూలదూరాగ్రశా
ఖాలీలాభ్రము లోలిఁ జూపుచు మహాకల్లోలినీరత్నముం
గాళిందీనది దాఁటి సిద్ధవటముం గన్గొంచు నమ్ముందటన్.
| 157
|
వ. |
మఱియు నానావిధంబు లైనవినోదంబుల నమ్మేదినీసుతకు దుర్గగమనపరిశ్రాంతి
దోఁపకుండం జేయుచుండె నాసమయంబున.
| 158
|
శ్రీరామమూర్తి చిత్రకూటంబు చేరుట
చ. |
అటఁ జని కాంచి రంత వసుధాధిపు లారతిలోలకిన్నరీ
ఘటితగుహాకుటీకనకకమ్రకవాటము సన్మణిప్రభా
హటదురుశృంగజూటము సమావృతమాల్యవతీతరంగిణీ
తటతరువాటమున్ బహుళతాపసకూటముఁ జిత్రకూటమున్.
| 159
|
సీ. |
మహనీయతరహోమమంత్రస్వరంబులు, గంధర్వమంజులగానతతులు
విలసితకిన్నరీవీణారవంబులు, శారికోపన్యాసచతురతలును
రాజకీరాలాపరచనాకలాపముల్, కలహంసనిస్వనకలకలములు
కమనీయకోకిలకలనినాదములు రో, లంబఝంకారకోలాహలములు
గలుగుదాని వేదగంభీరఘోషముల్, గలయఁ జెలఁగుదాని గాలి నోలి
మొరయు వేణురంధ్రములదానిఁ జేరఁగ, నేఁగుదెంచి యన్నగేంద్ర మెక్కి.
| 160
|
మ. |
దళదంభోజపరాగరాగవిలసకత్కల్లోలకేళీనట
త్కలహంసవ్రజచక్రసారసబకక్రౌంచభ్రమద్భృంగసం
కులనానారవశిక్షణద్భహుసరఃకూలానుకూలక్రియా
లలితాలోలసమీరకంపితలతాలాస్యంబు లీక్షించుచున్.
| 161
|
తే. |
వచ్చి సంయమీంద్రుల కభివందనంబు, చేసి సత్కారములు వారిచేతఁ గాంచి
యమ్మహాత్ములయనుమతి నచటఁ బర్ణ, శాలఁ గట్టించుకొని తపశ్చరణనియతి.
| 162
|
క. |
నెఱసిన రాజ్యసుఖంబులు, మఱచి మహామునులగోష్ఠి మచ్చిక లలరం
గిఱికొనుచిత్తంబులతో, నుఱుతెఱఁగుల నుండి రంత నొకనాఁ డెలమిన్.
| 163
|
సీ. |
అవనిజ దేవోపహారఫలంబులు, చెలువార వలవాటు సేయుచోట
నుపహతి గావింప నొకకాక మేతెంచి, సుడియంగఁ బలుమాఱుఁ జోఁపి చోఁపి
కడు డయ్యుటయు దానిఁ గని నృపాలుం డిషి, కాస్త్రంబు మంత్రించి యలుక వైవ
నదియు వెన్నడి నస్త్రమై తోల నక్కాకి, త్రిజగంబు గ్రుమ్మఱి దిక్కు లేక
మగుడ నేఁగుదెంచి మనుజేంద్ర యపరాధిఁ, గావుమనుడు విభుడు గరుణచూడ్కి
నొలయ నల్ల నగుచు నోపక్షి నావిశి, ఖంబు రిత్తపోదు గాన వినుము.
| 164
|
క. |
నీయం దొకనయనము నా, సాయకమున కిచ్చి బ్రతికి చను మనవుడు నా
వాయసమును నొకయంబక, మాయంబకమునకు నిచ్చి యరిగెం బెలుచన్.
| 165
|
ఆ. |
అంత వారు నపహృతావశిష్టము లగు, నాఫలంబు లెలమి నారగించి
మునులఁగొలిచి మిగులముదముతోఁ జిత్రకూ, టాచలమున నుండి రతులగతుల.
| 166
|
వ. |
అంత నిక్కడ సుమంత్రుం డయోధ్యానగరంబు సొచ్చి దీనాననుం డయి రాజ
మార్గంబునం జనుదేరఁ దేరిచప్పు డాలించి రామచంద్రుండు రాఁబోలు ననుచుఁ
బురజనంబులు సంభ్రమంబునం బఱతెంచి రామలక్ష్మణవిరహితస్యందనుం డగు
నాసుమంత్రునిం బెక్కుదెఱుంగులం దిట్టుచు నధికశోకంబునం బొగులుచుండి
రంత నప్పలుకు లాలించుచు నతండు నగరివాకిట రథావతరణంబు సేసి యంతః
పురంబులోనికిం బోయి దశరథేశ్వరునడుగులం బడి గద్గదికతోడం దొడరు
నెలుంగున.
| 167
|
తే. |
దేవ రాముఁడు గంగానదీతటమున, జడలు గైకొని నీకును జననులకును
నలఘుమతి మ్రొక్కి నన్ను వీడ్కొలిపి చనియె, నత్తటిని దాఁటి చిత్రకూటాద్రి కనిన.
| 168
|
ఉ. |
రామయుఁ దమ్ముడుం గొలువ రాజశిఖామణి చిత్రకూటచూ
డామణి యైనవార్త చెవి డాసిన నొచ్చితి నింక నారఘు
గ్రామణి యున్నచోటి కనుఘా ననుఁ దోకొని వేగ పోఁ గదే
రామవియోగవేదనను బ్రాణము లుండక తల్లడిల్లెడిన్.
| 169
|
క. |
అనిన సుమంత్రుం డి ట్లను, జనవర వనమునకు నీవు చనఁగాఁ బౌరుల్
వెనుకనె వత్తురు వచ్చినఁ, గనుఁగొని యది కైక యొండుగా భావించున్.
| 170
|
క. |
అది గావున సిద్ధింపదు, హృదయంబున నిచటిసుఖములెల్ల మఱచి నె
మ్మది రాముఁడు మునిసన్నిధి, సదమలమతి నున్నవాఁడు చరితార్థుం డై.
| 171
|
వ. |
అని పలికిన దశరథుండును సుమంత్రుని వీడ్కొలిపి రామచంద్రునిం బేర్కొని
బహుప్రకారంబుల శోకింపఁ గౌసల్యాదేవి యన్నరేంద్రుం గనుంగొని.
| 172
|
సీ. |
మది లేని శోకంబు మనుజేశ నీవు నా, యెదుర నటించెద వెఱుఁగనట్లు
బహుకాలతపమునఁ బడసినసుతు రామ, చంద్రుని లోకంబుసడికి నోర్చి
కడుఁ బూన్కి పట్టంబు గట్టెద నని యెల్ల, నృపతులు విన నాడి నిజమపోలె
నొకమహాసంభ్రమ మొనరించి యటఁ బోయి, కైకేయితోఁ గూడి కపటవృత్తి
నక్కుమారుఁ బిలిచి యడవుల కనుపఁగఁ, జాలినట్టి పరమసాహసునకు
నేటి కరుణ నీకు నెక్కడిపరలోక, మేటిసూనృతంబు నేటితగవు.
| 173
|
క. |
నావుడు నిన్నియుఁ గలవే, నావలనం బరుషభాషణము లిం కేలా
జీవం బేగతి నిలువదు, పోవదు తనకర్మఫలము పొందక తన్వీ.
| 174
|
వ. |
అది యె ట్లంటేనియుం జెప్పెద నాకర్ణింపుము.
| 175
|
దశరథుఁడు కౌసల్యతోఁ దనకుఁ గలిగినమునిశాపంబు చెప్పుట
సీ. |
పిన్ననాఁ డొకనాఁ డేను నడురేయి, సరయూతటంబునఁ జండచాప
ధారినై కాపుండి దంతావళక్రోడ, భల్లూకమహిషాదిబహుమృగంబు
............లయ్యేట నొగిఁ ద్రావఁగా నాని, చప్పుడు లక్షించి శబ్దవేధు
లగుబాణము లేసి యందంద హింసించు, నెడ నొక్కమహితాత్ముఁ డేఁగుదెంచి
.............ప ఘుమఘుమధ్వని విని, కుంభినినదబుద్ధిఁ గోలఁ దొడిగి
............త మడలింప వీతెంచె, హా నమశ్శివాయ యను నెలుంగు.
| 176
|
|
.....................ంది వెఱఁగందుచు వెండియు వింటి నొంటి నీ
.................... నంచి కఠినప్రదరాహతి నొచ్చితిం గదే
.....................బాతకం బనక యెవ్వఁడొకో యిటు లేసె నేగతిన్
..,............. ంక నన్ను నతివృద్ధులు నంధులు నైనమద్గురుల్.
| 177
|
|
........లఫలమూలము, లుపవాసము లుండి తినుచు నొగిఁ బితృసేవా
........ణత నుండెడినే నే, యపరాధముఁ జేసినాఁడ నాయుధమృతికిన్.
| 178
|
|
మునికుమారుఁ డైన ముగ్ధు న న్నిటు సేసి, కాంచులాభ మేమి గలుగవలసి
బాణ మేసినాఁడు ప్రాణంబులకు నేను, వగవఁ దల్లిదండ్రు లగతు లగుట.
| 179
|
క. |
కన్నులు లే వను నెవ్వగ, యెన్నఁడు మదిఁ దోఁపకుండ నిమ్ముల నేనే
కన్నులమాఱై యుండితి, నెన్నివిధములందు నింక నెయ్యది గతియో.
| 180
|
సీ. |
జలములు దెమ్మన్నఁ జనుదెంచి యిచ్చోటఁ, బడితి నే నిష్ఠురబాణనిహతి
నెఱుఁగరు మద్గురు లీఘోరదురవస్థ, దడసె వీఁ డనుభీతి దగిలి నన్ను
నెంత కోపింతురో యేమని వగతురో, ధృతి నెట్లు దూలిరో దిక్కుమాలి
|
|
|
రిం కెవ్వ రుదకంబు లిచ్చెద రెవ్వ రె, ట్లరసెద రే నిట్టు లైనవార్త
వినినయప్పుడ ప్రాణముల్ విడువఁగలరు, మువ్వురముగూడ నీశిలీముఖమునందుఁ
దెగితి మేమని దైవంబు తెంపుఁ జెప్ప, నకట హా తల్లి హా తండ్రి యనుచు నడలె.
| 181
|
చ. |
అడలఁగ నీతఁ డొక్కముని యక్కట పాపముఁ జేసితిం గదే
తొడిఁబడ బాణ మేయుటయుఁ దూఱఁగ నాటెనె యెప్పు డీతమం
'బెడలునొ చూడ నయ్యెడకు నెప్పుడు వోదునొ నాఁగఁ జంద్రుఁ డ
ప్పుడ పొడతెంచె నామనసుపోల్కిఁ బయోజము లు బ్బడంగఁగన్.
| 182
|
వ. |
ఏ నత్తరంగిణి దాఁటి తత్తీరంబున.
| 183
|
చ. |
విరిసినయజ్జటాభరము విన్ననిమోము దురంతవేదనం
బొరల ధరాపరాగమున బ్రుంగినయంగము గల్గి యమ్మహా
శర మటు దూఱ దుస్సహదశం గలశంబున నొత్తగిల్లి నె
త్తురు దొరఁగంగ నాతురతఁ దూలుచు నున్నమునీంద్రనందనున్.
| 184
|
క. |
కనుఁగొని యుల్లము జల్లన, ధనువును బాణములు వైచి తడయక జలముల్
గొనివచ్చి మోము దుడుపఁగఁ, గనుఁగవ దెఱచుటయుఁ జూచి కడుభీతుఁడ నై.
| 185
|
చ. |
అనఘ యెఱుంగ నేను మృగయాపరతంత్రుఁడ నై విధాతృశా
సనమున నింతఁ గంటి నిది సాహసకర్మము సంభవించె నా
ఘనతిమిరంబునప్పు డుదుకంబుల నీ విటు కుండ ముంప నా
నినదము హస్తినాద మని నెట్టన నేసితిఁ దప్పు సేసితిన్.
| 186
|
వ. |
అనిన నమ్మునికుమారుం డల్లన యి ట్లనియె.
| 187
|
మ. |
అడవిం దాపసవృత్తి నున్ననను నేయం గారణం బేమి నీ
యెడ నేయె గ్గొనరించినాఁడ నది దా నెట్లుండె నావార్తకుం
గొడు కొక్కండును బోయెనే యనుచు నాక్రోశించుచుం జత్తు ర
క్కడ నయ్యంధులు మూఁడుపాతకము లింకం జెందు నిన్నుం బలే.
| 188
|
వ. |
అయినను నెఱుంగమిం జేసి యేసి తింతియ కాదు పశ్చాత్తాపంబునుం గలదు
గావున నిమ్మహాపాతకంబు నీకుం గాక యుండు ననుచుఁ బలికి పదంపడి.
| 189
|
క |
బాణవ్యధచే మేనం, బ్రాణంబులు నిలువ లేవు బాణముతోడం
బ్రాణములు విడువఁ జన దో, క్షోణీశ్వర దీనిఁ బెఱుకు కొంకకు మింకన్.
| 190
|
చ. |
మహితసమాధియోగమున మద్గురు లిత్తెఱఁ గెల్లఁ గాంచి దు
స్సహ మగుచున్న శోకమునఁ జాలఁ దపించి శపించి రేని యా
గ్రహపటురోషవహ్నిఁ గొని కాల్చు భవత్కుల మన్మహాటవిన్
దహనము పేర్చునర్చుల నుదగ్రతఁ గానన మేర్చు చాడ్పునన్.
| 191
|
సీ. |
అదిగాన మునుముట్ట నచటికి నీకుండ, నుదకంబు కొనిపోయి మొదలు వారి
తృష్ణఁ దీర్చి యిబ్భంగిఁ దెగియు మీకొడు కట్టి, తప్పు సేసితి నని చెప్పు మింక
|
|
|
నీగతోదకబంధ మేటికిఁ బో నిమ్ము, కడచన్నదానికి నడల వలవ
దనుమాటలకు నేను నాఘోరసాయక, మతిభీతిఁ బెఱుక నయ్యతిసుతుండు
మేను దొఱఁగె నతనిమృతి కేను శోకించి, కుండతోడ నీరు గొనుచుఁ దపసు
లున్నవనము చేర నొగిఁ బోయి సుతురాక, గోరుచున్నయట్టివారిఁ గంటి.
| 192
|
క. |
అక్షివిహీనుల వృద్ధుల, నక్షములఁ దృషాతురుల వనన్యగతికులం
బక్షములు విఱిగి యొరగిన, పక్షులగతి నున్నవారిఁ బరమవ్రతులన్.
| 193
|
క. |
కని యల్లన కదియఁగ న, య్యనఘులు నాకాలిచప్పు డాలించుచు నో
తనయుఁడ నీ విటు తడయం, జనునే యీయున్నయేటిసలిలంబులకున్.
| 194
|
ఆ. |
ఏల రాఁడొ యనుచు నేను మీతల్లియుఁ, గలఁగఁబడితి మెచట నిలిచి తకట
మధ్యరాత్ర మిట్లు మసలుదురే మాకుఁ, గన్ను లన్న నీవ గతియు నీవ.
| 195
|
క. |
జలతృష్ణ నీదురాకయ, తలపోయుచు నుండె నింకఁ దల్లికి నుదకం
బులు వోయు బుద్ధి చెప్పిన, నలిగినయ ట్లేల పలుక వని పల్కుటయున్.
| 196
|
ఉ. |
దేహము దాహముం బొరయఁ దెంపునఁ జెప్పఁ దలంచి పుత్రుపై
స్నేహముఁ జూచి చెప్ప నని చెప్పకపో దని నిశ్చయంబుతో
సాహసబుద్ధిఁ జేసి మునిసత్తమ మీతనయుండఁ గా మహా
ద్రోహగరిష్ఠుఁడన్ దశరథుం డను పేరిటిపాపకర్ముఁడన్.
| 197
|
ఉ. |
ఎక్కడఁ జూడఁ జెప్ప నిటు లెవ్వరుఁ జేయనియట్టిపాప మే
నొక్కడఁ జేసి మీకడకు నోడక వచ్చితి నేమి సెప్ప నీ
యెక్కుడుచీఁకటిం జలము లిమ్ముగఁ ద్రావురవంబునిక్కకుం
దెక్కలితూపు లేయుచు మదించుమృగంబులఁ జంపు చున్నెడన్.
| 198
|
వ. |
మీతనయుండును సరయువునం గుండ ముంప నాచప్పు డాలించి విధివశంబున.
| 199
|
క. |
అంజక తత్తటమున నొక, కుంజంబునఁ బొంచి యుండి కుంభద్వనికిం
గుంజర మని యేసితి ముని, కుంజర నీకొడుకు నేలఁ గూలం గోలన్.
| 200
|
క. |
బాణహతి నెలుఁగు సేసినఁ, బ్రాణంబులు గలఁగఁబాఱి { బాణము పెఱుకం
బ్రాణములు విడిచె ననవుడుఁ, బ్రాణంబులు జ ల్లనంగఁ బడి మూర్ఛిల్లెన్.
| 202
|
క. |
ఏమని చెప్పుదు ని ట్లను, నామాటయుఁ దెగకమున్న హా పుత్రా యం
చామునిపత్నియు నప్పుడు, భూమిం బడియుండె రిత్తబొందియపోలెన్.
| 203
|
వ. |
ఇత్తెఱంగున మూర్ఛాపరవశు లయి యున్నయత్తపస్వులం జూచి చిత్తంబు
గలంగి యే నల్లన బోధింప నెట్టకేనియుం దెప్పిఱి వారు నాదెసకు దీనవదనంబు
లెత్తి నోళ్లు దెఱచుచుం బెదవులు దడుపుచు డగ్గుత్తికలు పెట్టుచు నెలుంగులు
రాల్పడ ని ట్లనిరి.
| 204
|
సీ. |
ఏమయ్య మాపట్టి నింతపాపము సేసి, తేమి చేసినఁ జావ నేసి తయ్య
|
|
|
తగునయ్య వనమునఁ దపసులమై యుండ, దయమాలి యాతెంపు దలఁతురయ్య
చీకులు వట్టిన చేకోల యది పోయెఁ, జీకుల మెచ్చోటఁ జేరువార
మప్పుణ్యు నేసినయమ్మున మమ్మును, బడనేసి దీవన బడయవయ్య
నీదునిష్ఠురబాణంబు నెఱఁకు దూఱఁ, గాఁడి పరవశుఁడై వ్రాలు కడఁక నపుడు
తండ్రి నేమని యెలుఁగిచ్చెఁ దల్లడంబుఁ, జెంది తల్లి నేమని పిల్చెఁ జెప్పుమయ్య.
| 205
|
ఉ. |
ఆగురుభక్తితత్పరత నాపరమవ్రతనిష్ఠ నాతపో
యోగవిభూతి నొప్పెడుగుకణోన్నతుఁ డుత్తమచర్యుఁ డమ్మహా
భాగుఁడు పుణ్యగర్హితవిపద్దడశ కర్హుఁడె యట్టివాని కి
ట్టీగతి సంభవించె నఁట యేమని పొక్కుదు మింక నక్కటా.
| 206
|
క. |
మతిఁ దలఁప నొడ లనిత్యము, మృతుఁ డవుఁ గా కేమి మఱి నిమిత్తము లేదే
యతిసుతుఁ డఁట నిర్ఘాతా, యతభీకరబాణపాత మఁట బాపు విధీ.
| 207
|
వ. |
అనుచుం బెక్కుదెఱంగుల శోకించుచు నప్పు డత్తపోధనుండు నన్ను నుద్దేశించి.
| 208
|
శా. |
వానప్రస్థునిఁ జంపి యొక్కవడితో స్వర్ణాథుఁడుం ద్రుంగు ధా
త్రీనాథుం డన నెంతవాఁ డట విచారింపంగ నీ కెంత నే
ర్పేనిం బోవు శిరంబు వ్రక్క లయి తప్పెన్ దప్పె నీకృత్య మ
జ్ఞానంబుం గడు నోడి చెప్పితివి పశ్చాత్తాపతప్తుండ వై.
| 209
|
క. |
కావున ని న్నే మన నిది, దైవాధీనంబ యింక ధరణీశ మమున్
వేవేగ యచటికిం గొని, పోవుట పురుషార్థ మనుడుఁ బొగులుచు వారిన్.
| 210
|
వ. |
ఏ నక్కుమారుం డున్నయెడకుం గొనిపోయి వీఁడె మీతనూజుం డనుటయుం
దడఁబాటుచేతులతోడ ధరఁ దడవి కొడుకుమీఁదం బడి మూర్ఛిల్లి కొంతదడ
వునకుం దెలిసి విలపింపం దొడంగి రంత నత్తల్లి యుల్లం బెఱియ నెలుంగెత్తి
హా యజ్ఞదత్తా యనుచుం దనుజుం బేర్కొని.
| 211
|
సీ. |
అక్కట నాతోడ నలిగినట్లున్నాఁడ, వెన్నిచీరినఁ బల్క వేల పుత్ర
ప్రాణ మై యుండియుఁ బాసిపోయితి వీవు, ప్రాణంబు న న్నేల పాయ దనఘ
యంధుల మగుమాకు నాధార మగుచున్న, ని న్నేల నేసె నీనృపుడు వత్స
కడలేనిదైవంబు కన్నుల కిదియును, ఘన మయ్యె నే మనం గలదు తండ్రి
కూన యెట్లు నీదుగుణములు మఱతు నిం, కేమి సేయుదాన నెందుఁ జొత్తు
నిషువు నాటునప్పు డెంతభీతాత్ముండ, వైతొ పాపజాతి నయితిఁ దనయ.
| 212
|
చ. |
కొడుక శిలీముఖం బెచటఁ గూర్కొనె నిన్ను నటంచు నెత్తుటం
దడసినయక్కు చేఁ దడవి తత్ప్రదరక్షత మంటి కాలితిం
బొడవఱి పొక్కితిం బొలిసి పోయితిఁ బొ మ్మని కూర్మిపుత్రుపైఁ
బడి కనుమూసి కొంతవడి పల్కులుఁ జేష్టయుఁ దక్కి వెండియున్.
| 213
|
వ. |
విధివశంబునం దెలిసి పెక్కువిధంబుల విలపించుచుండె నంత నత్తపోధనుండు.
| 214
|
సీ. |
ననుఁ జూచి యాలింగనము సేయు మలుగంగ, నిన్ను నే నేమని యన్నవాఁడఁ
జీఁకటి నేటికి శిశువు నిన్నొక్కనిఁ, బట్టి పొ మ్మన్నట్టిఫలము గంటి
నే తనూజున కింక నేవేదశాస్త్రంబు, లనఘ చెప్పుదుఁ బ్రజ్ఞ కలరి యలరి
ఫలమూలజలములు భ క్తితోఁ గొనివచ్చి, తనయ మ మ్మెవ్వరు దనుపువారు
కుశసముచ్చయంబు కొడుక యెవ్వరు దెత్తు, రగ్నిహోత్రకలన మట్టు లుండె
నధికవార్ధకమున నాత్మజశోకంబు, ననుభవింపవలసె నక్కటకట.
| 215
|
క. |
నిర్ఘృణతఁ గడంగి మదా, శీర్ఘటితఫలంబు నేఁడు నేసెనో విధి యే
దీర్ఘాయు వనుట కర్ధము, నిర్ఘాతపటిష్ఠబాణనిహతియె పుత్రా.
| 216
|
ఉ. |
హా యను నోకుమార యను నక్కట పల్క వ దేమి పుత్ర పు
త్రా యనుఁ దల్లిఁ జూడు మనుఁ దమ్ముఁడ తూరఁగ నాటెనే యమో
ఘాయతసాయకం బను నృపాధముఁ డేటికి నేసెఁ బట్టి ప
ట్టీ యను నీకు నీగతి ఘటించెఁ గదే యను దైవమా యనున్.
| 218
|
వ. |
ఇ ట్లనేకప్రకారంబుల శోకించి కొడుకుం బేర్కొని వేదవేదాంగపారగులు నశ్వ
మేధాదిసమస్తాధ్వరకర్తలును నానాధర్మకర్మనిరతులు నగునట్టియుత్తముల కేలో
కంబులు గలుగు నట్టియుత్తమలోకంబులు నీకుం గలుగుంగాక యని పలికి విహి
తాగ్నిసంస్కారంబులు సేసి తిలోదకదానం బాచరించుటయు నయ్యజ్ఞదత్తుం
డును నొక్కదివ్యవిమానం బెక్కి దివ్యదేహప్రభలు వెలుంగ నింగిం బొలిచి
తలిదండ్రులం గనుంగొని యోగురులార మీకుం బరిచర్య చేయుటం జేసి నాకుం
బుణ్యలోకంబులు గలిగె మీ రింక వగలం బొగులకుండుం డవశ్యం బయ్యెడు
నది యగుంగాని యొండు గానేరదు గావున నీరాజువలన నెగ్గు లేదు వీనిం గరు
ణింవుం డని పలికి దివంబునకుం జనియె నప్పు డత్తపోధనుండు నన్ను నుద్దేశించి
యేము నిదె మాపుత్రుం గూడం బోవుచున్నారము నీవును బుత్రవియోగం
బున మృతిఁ బొందఁగలవాఁడ వని నాకు శాపం బిచ్చి పత్నీసమేతుండయి ప్రాణం
బులు విడిచె నే నత్తపస్వుల సంస్కరించి చింతాక్రాంతుండ నయి యయోధ్య
కేతెంచితి దత్ఫలంబు నేఁ డాసన్నం బయ్యె నెట్లంటేని.
| 219
|
దశరథుండు పరలోకగతుం డగుట
క. |
కన్నులఁ జీఁకటి గప్పుచు, నున్నది వినరావు పలుకు లుల్ల మదరఁ జొ
చ్చె నిలువదు మే నెలుఁగును, సన్నం బై వచ్చె నెఱుక సాలదు నాకున్.
| 220
|
క. |
దురవస్థం బ్రాణంబులు, తిరుగుడువడఁజొచ్చె రామదేవునిలీలా
దరహాసవికాసశ్రీ, కరముఖకమలంబుఁ జూడఁగా నను గంటే.
| 221
|
క. |
హా కులవర్ధన హా కరుణాకర హా ధర్మలోల హా గుణనిధి హా
|
|
|
శ్రీకర హా జయవరల, క్ష్మీకర హా రామ యనుచు మేను దొఱంగెన్.
| 223
|
వ. |
ఇత్తెఱంగునం బ్రాణంబులు విడుచుటయు నతం డలసి నిద్రించుటగాఁ దలంచి
కౌసల్యాదేవియుం గను మొగిచి యుండెఁ బదంపడి సూతవందిమాగధస్తోత్రం
బులును మంగళతూర్యంబులునుం జెలంగ దాసదాసీపరిచారకులు తమతమప
నులు నిర్వర్తింపం బ్రభాతవేళకుం జేరి సూర్యోదయావసరం బతీతం బగుటయు
నిది యేల మేల్కొనరో యీరాచవా రనుచుఁ జింతించుచున్నంత నర్హకాంత
లంతఃపురంబునకుం జనుదెంచి యన్నరేంద్రుపడియున్నచందంబు గని భయా
తురతం గదిసి కరతలంబు లీక్షించి వక్షస్థలం బంటి యూర్పు లరసి విగతా
సుం డగుట నిశ్చయించి మొగంబు లడుచుకొనుచు మహారోదనంబు సేయన్
బెదరి నిద్ర దేఱి కౌసల్యాసుమిత్రలు పతి నేర్పడం జూచి హా రాజకుంజర హా
నాథ హా భర్త యనుచు నార్తరవంబు లొలయ నాక్రందనంబు సేయుచున్న
నావిధంబు విని శోకసంభ్రమంబులతోడం గైకేయియు రా నక్కడ నున్న
యువిదలుం దారు నయ్యింతిమీఁదం బడి మోఁదికొనుచుఁ గైకా నీకోర్కి
సఫలం బయ్యె రామచంద్రు నడవికిం బో నడిచి మగనిం జంపి తింక నీవలసి
నట్లు భోగింపు మనుచుం బలుక నప్పరుషభాషణంబులకుఁ దల వాంచికొను
చు వచ్చి యచ్చెలువయుం బ్రియునిపయిం బడి విలపింపం దొడంగె నాసమ
యంబున.
| 224
|
సీ. |
పతిఁ జూచి కౌసల్య పనవుచు దశరథ, క్షోణీశ నీయట్టిసుకృతి కిట్టి
మరణంబు సిద్ధించె మది దీని కేమందు, నకట నాసుతుఁ బాసి యైన నీకుఁ
బరిచర్య సేయుచుఁ బదునాలుగేఁడులు, జీవంబు నొకభంగిఁ జిక్కఁబట్టి
యొకనాఁడు కడగాంతు నొకొయంచు నుండితి, నది తప్పెఁ బుత్రమోహమునఁ గీడు
పలుకు లప్పు డన్ని పలికితి ని న్నెట్లు, వెడఁగ నయితిఁ గోలుపడితిఁ జుమ్ము
రాజమౌళి వీరరత్నంబు లోకాభి, రాము గుణసముద్రు రామభద్రు.
| 225
|
చ. |
వనమున కేఁగి నీపలు కవంధ్యముగాఁ బితృభక్తుఁ డై చిరం
తన మగుకీర్తి గాంచె గుణధాముఁడు రాముఁడు సత్యసంధుఁ డీ
జనపతి నాఁగ నీవును బ్రశంసకు నెక్కితి నాథ నాకు ని
న్ననుచితభంగి నిష్ఠురము లాడినపాపము దక్కెఁ జూచితే.
| 226
|
వ. |
అని యనేకప్రకారంబులం గౌసల్య శోకింప సుమిత్రలోనుగా నంతఃపురకాంత
లెల్ల నడలుచుండి రంత నుదయసమయంబున వసిష్ఠవామదేవాదిపురోహితు
లును సుమంత్రపురోగము లయినమంత్రులును నధికసంభ్రమంబుతోఁ జను
దెంచి నానాప్రకారంబుల దుఃఖించిరి పదంపడి రఘువంశగురుం డైనవసి
ష్ఠుండు సర్వజనసమ్మతిం గాలోచితంబు నిశ్చయించి దశరథేశ్వరుదేహంబు
తైలపక్వంబు సేయించి సింహాసనంబునం గూర్చుండఁ బెట్టి జయంతుండు మొద
|
|
|
లుగా నలువురుమంత్రులం బిలిచి మీరు వస్త్రాభరణంబులు గైకొని గిరివ్రజపు
రంబున కరిగి భరతుం దోడ్కొని రండని నియోగించిన వారును నయోధ్య వె
డలి యేడవరాత్రి నక్కేకయరాజునగరంబు సొచ్చి రంతకు మున్న సముద్రం
బింకిపోవను జంద్రమండలంబు నేలం బడియుండనుం గలగని యాదుస్స్వప్నం
బును సుహృజ్జనంబులతోడం జెప్పుచున్నభరతుం గాంచి మ్రొక్కి తమ తెచ్చిన
యుపాయనంబు లిచ్చి దేవా వసిష్ఠుండు మహాకార్యంబు గలిగి మమ్ముం బుత్తెంచె
నీ వయోధ్యకు విచ్చేయవలయు నని విన్నవించుటయు నాదూతలచేష్టలకు భీతి
ల్లుచుఁ గేకయనాథుకడకుం జని యత్తెఱం గెఱింగించి యన్నరేంద్రు వీడ్కొని
శత్రుఘ్నసహితుం డయి కదలి సప్తరాత్రంబులకుఁ బురంబున కేతెంచి యంతి
పురంబు సొత్తేరం దల్లి యెదురుగాఁ బఱతెంచి యాలింగనంబు సేయుటయు
నద్దేవికి నమస్కరించి కేకయపతి పుత్తెంచినయాభరణంబు లిచ్చి వారిసేమం
బెఱింగించి పదంపడి యిది యేమి రాజమార్గంబు లమంగళావృతంబు లై యు
న్నయవి నగ రేల శూన్యం బై యున్నది సంతోషనాదంబు లేల వీతేవు నామ
నంబు గలంగెడు నెల్లవిధంబుల భద్రంబులు కదా యి ట్లునికికిం గారణం బేమి
యనుటయు నక్కైక యి ట్లనియె.
| 227
|
భరతశత్రుఘ్నులు రామునివనగమనాదులు విని యడలుట
సీ. |
వసుమతీపతి రెండువరములు మును నాకు, నిచ్చినయవి గల వేను వాని
నొకట నీపట్టంబు నొక్కట రాముని, విపినవాసముఁ బోల వేఁడికొంటి
సంతసంబునఁ దండ్రి సత్యంబు పాలింప, జానకీలక్ష్మణసహితుఁ డగుచు
నారాఘవుం డేఁగె నడవికి మృతుఁ డయ్యెఁ, బుత్రశోకంబున భూవిభుండు
నిష్ఠురంబు లెల్ల నీ కొఱ కి ట్లేను, గట్టికొంటి నింక గారవమునఁ
బట్టి పూను రాజ్యంపట్టంబు నా మూర్ఛ, వచ్చి వ్రాలి కొంతవడికిఁ దెలిసి.
| 228
|
క. |
కనుఁగవ నిప్పులు రాలఁగఁ, గనలుచు భరతుండు గైకఁ గనుఁగొని యారా
మునిఁ గాంతారంబునకుం, జను మన నెట్లాడె నోరు చయ్యన నీకున్.
| 229
|
చ. |
అడవుల రామచంద్రుఁడు జటాజినముల్ ధరియించి యుండ నేఁ
బుడమి భరించి భోగములు పొందఁ గలానటె యిట్టిచొప్పు లే
యెడఁ గల వింక నన్నమొగ మేమి తెఱంగునఁ జూతుఁ బాపపుం
గడుపునఁ బుట్టి యీభువనగర్హకుఁ బాత్రుఁడ నైతి రాక్షసీ.
| 230
|
క. |
నాచిత్తవృత్తి యెఱిఁగియు, నాచరితము గనియు రామునకు ద్రోహింగా
నీచమతి యెగ్గు సేసితి, వోచెల్ల మనంబు నొచ్చెనో రఘుపతికిన్.
| 231
|
వ. |
దీనికి సుమిత్రాపుత్రుండు నామీఁద నెంత కోపించెనో నీనిమిత్తంబున నిన్ని
చేటులు పుట్టె నీ వొక్కరక్కసునకుఁ బుట్టఁబోలుఁ గేకయరాజబీజం బింత కేల
తొడంగు నీవు పాపజాతివి పతిహంత్రివి నీతో సంభాషింపం దగ దని పలుక
|
|
|
నప్పలుకులు నాకిటం బొంచి వినుచున్న మంథర నంతఃపురకాంతలు శత్రుఘ్ను
నకుం జూపి దీని దుర్మంత్రంబున నీయనర్థంబు లిన్నియుం బాటిల్లె ననవుడు
నతండు రోషావిష్టుం డగుచుఁ బెలుచ దానిం బడఁదాఁచి కేలం గడకాలు వట్టి
మీఁది కెత్తి జిఱజిఱం ద్రిప్పి నేలతో వేసి ఖడ్గంబు దిగిచి యంకించుచుం దొలం
గుం డిద్దురాత్మురాలితల ద్రుంచెద ననుచుఁ గైకకుం గవిసినం దత్పరిచారికలు
వాఱి కౌసల్యాదేవిమఱువు సొచ్చి రప్పు డాభరతుం డోహో శత్రుఘ్న
మన మీపాపజాతిం జంపిన మాతృహంత లని రామచంద్రుండు మనమొగంబులు
సూడండు గావున నీపుణ్యహీన తనదురితంబునఁ దాన పోవుంగాక దాసీవధం
బును నర్హంబు గాదు దీన నేమి గలుగుఁ బోవ ని మ్మనుచు నలుక వారించి య
తం డనుజసహితంబుగాఁ బోయి కౌసల్యాసుమిత్రలయడుగులం బడి రోదనంబు
సేయుటయు నయ్యగ్రసవిత్రియుఁ బుత్రులం గనుంగొని.
| 232
|
తే. |
భరత మీతల్లి పతి బందెవట్టి నీకు, రాజ్యపట్టంబునకు వేఁడి రాము నడవి
కనిచెఁ దద్వియోగమున గతాసుఁ డయ్యె, నృపుఁడు నీ వింక నెమ్మది నేల యేలు.
| 233
|
సీ. |
అనవుడుఁ గడు నొచ్చి యతఁడు గౌసల్యతో, నారామునకు ద్రోహి నైతినేని
నభిషేకలక్ష్మికి నాస సేసితినేనిఁ, గైక గావించిన కపటకర్మ
విధ మెఱింగితినేని విప్రుఁ జంపినవాని, గతికి గుర్వంగనాగామిగతికిఁ
గల్లు ద్రావినవానిగతికి సువర్ణాపహరణంబు సేసిన యతనిగతికి
భండనమున నోడి పాఱిన యాపంద, గతికిఁ బోదు నాదుకడిఁది శపథ
ములకు సాక్షు లఖిలమునులు దివ్యులు భూజ, లానిలాంబరానలార్కశశులు.
| 234
|
వ. |
అని పలికినం బృథివ్యాదిమహాభూతంబు లితనిపలుకులు సత్యంబు లనునెలుం
గులం జెలంగెఁ గౌసల్యాసుమిత్ర లప్పు డప్పుత్రులం బట్టుకొని సంకులాక్రంద
నంబులు సేయ నప్పుడు వసిష్ఠుండు వారి వారించి యంతఃపురంబునకుం దోడ్కొ
నిపోవుటయు నప్పు డక్కుమారులుం దండ్రికళేబరంబు సూచి మూర్ఛ వొంది
వసుంధరం బడి రంతఁ గొంతసేపునకుఁ దెలివొంది భరతుం డెలుఁగెత్తి యోరా
జకుంజర యోదివాకరాన్వయరత్నాకరసుధాకర యోదశరథేశ్వర కేకయరాజు
మీకుఁ బుత్తెంచినభూషణంబులు దెచ్చినాఁడ వీని నేల కైకొనవు నాతోడం
బలుక వేను గైకకొడుకఁ గాన సంభాషణార్హుండఁ గానో యిదె చూడు శత్రు
ఘ్నుండు ధరిత్రిం బడి పొరలుచు ధూళిధూసరితాంగుం డయి యున్నవాఁ డితని
నాలింగనంబు సేసి లీలం గేల సమ్మార్జనంబు సేయ వేల నేము రామునకు ద్రోహు
లము గా మేల యనాదరణీయుల మయితి మనుచుం బనవి పనవి హాహాకారంబు
లెసఁగ రోదనంబు సేయ ననేకభంగుల బోధించి యాసమయంబున.
| 236
|
తే |
భరతుఁ జూచి యారఘువంశగురుఁడు నీవు, తండ్రి కగ్నిసంస్కారాదితంత్ర మింక
ననఘ నడపంగవలయు శాస్త్రార్థసరణి, ననుడు నగుఁ గాక యని లక్ష్మణాగ్రజుండు.
| 237
|
వ. |
మఱునాఁడు సకలమునులను రాజులను రప్పించి వసిష్ఠుం బురస్కరించుకొని దశ
రథేశ్వరునికళేబరంబు దివ్యాంబరాభరణగంధమాల్యంబుల నలంకరించి కోటి
సంఖ్యాకంబు లగుమహిషగోగజాశ్వాదిదానంబు లొనర్చి సువర్ణవిమానంబునం
బెట్టుకొని యారాజశవంబుపిఱుందం గౌసల్యాదికాంత లాక్రందనంబు సేయుచుం
జనుదేర ముందట నగ్నిహోత్రాగ్నిఁ గొని భరతుండు వసిష్ఠాదిపురోహితులు
తోడం గూడిరా శత్రుఘ్నసమేతుం డయి నడచి యయోధ్యానగరంబు వెడలి
సరయూతటంబున సొద పేర్చి యం దారాజశవ మిడి త్రేతాగ్నుల నయ్యయి
ముత్రంబుల విహితావయవంబులఁ బెట్టి స్రుక్స్రువాదియజ్ఞాంగంబుల నర్హాంగ
కంబులఁ జేర్చి వేదోక్తమార్గంబున దహించి తిలోదకదానం బాచరించి నగరి
కేతెంచి విహితద్వాదశాహకృత్యంబులు నిర్వర్తించి కృతకత్యుం డయ్యె నంత
ననంతరదివసంబున.
| 237
|
తే. |
సకలనృపమంత్రిమునిలోకసమ్మతమున
భరతుఁ గనుఁగొని రఘువంశగురుఁడు రాష్ట్ర
మి ట్లరాజక మై యున్న నెగ్గు దొడరుఁ
గాన నీ వింకఁ బట్టంబు గట్టికొనుము.
| 238
|
చ. |
అనవుడు సైఁప కి ట్లనియె నక్కట ప్రాకృతుఁ డాడునట్టు లో
మునివర నీవు మత్కులసముజ్జ్వలధర్మముఁ జూడ కాడె దే
మనీ విననేర్తు వీఁ డల దురాత్మకురా లగుకైకనందనుం
డనునది దక్క నాదుమన మారసి యొండొకతప్పు చెప్పుమా.
| 239
|
శా. |
రాముం బుణ్యగుణాభిరాము నెలమిం బ్రార్థించి తో డ్తెచ్చి ది
క్సీమాతిక్రమణక్షమాన్వయలసత్కీర్తుల్ వెలుంగొంద ను
ద్దామశ్రీ కభిషిక్తుఁ జేయుదు రఘూత్తంసంబు రాకున్న నా
భూమిశాగ్రణిఁ గొల్చి నిల్తు నటవీభూమిం దపోవేషి నై.
| 240
|
వ. |
అని పలుక సభాసదులు శిరఃకంపంబు సేయ నక్కుమారుండు.
| 241
|
ఉ. |
మాతలు మూవురున్ సకలమంత్రులుఁ బార్థివులుం బురోహిత
వ్రాతము నవ్వసిష్ఠమునివర్యుఁడు దమ్ముఁడుఁ దోడ రా గజా
శ్వాతతసర్వసైన్యయుతుఁడై పురి వెల్వడి యేఁగుదెంచి గం
గాతటి నీతటిన్ విడియఁగా భరతుం డనువార్త మోసినన్.
| 242
|
వ. |
విని గుహుండు సంభ్రమంబున శృంగిబేరపురంబు వెల్వడి తత్సైన్యంబు గనుంగొని.
| 243
|
సీ. |
క్రూరతఁ గైకేయికొడు కట్లు తమతల్లి, చేసినయది మున్ను చెల్లెఁ గాన
యంతనె యుండ కి ట్లారాజపరమేశు, పై నెత్తిపోయెడిఁ బాపచింత
ననుబుద్ధిఁ దనసైన్య మాయితమై యుండఁ, గావించి రేవులు గట్టఁ బనిచి
యేతెంచి భరతుతో నిట్లని పలికె న, క్కట మహారాజ్యభోగములు విడిచి
|
|
|
తండ్రిపనువు నెఱపఁ దపసి యై యడవికి, నేఁగి యున్న రాఘవేంద్రువెనుక
సకలసేనతోడఁ జనుదెంచుచున్నాఁడ, వింత సేయ నాతఁ డేమి సేసె.
| 244
|
ఉ. |
తమ్ముఁడుఁ దాను నొంటిఁ బడి తాపసు లై వనభూమి నుండఁగా
నిమ్ములఁ గిట్టి పట్టి వధియింపఁగఁ బోవుచునున్నవాఁడ వా
యమ్మకుఁ బుట్టినాఁడ వఁట యక్కట నీతలఁ పేమి సెప్ప ని
న్నిమ్మొనతోడఁ బో విడుచునే గుహుఁ డిప్పుడు సూడు మంతయున్.
| 245
|
క. |
నీసేన విఱిగి పోవఁగ, నాసురగతి నెత్రువఱద లడరఁగఁ బటుబా
ణాసారము చూపెద బా, ణాసన మనుఘోష భీషణాభ్రమువలనన్.
| 246
|
తే. |
ఏను సమసినవెనుక నీ వేఱు దాఁటు, మనినరోషోక్తులకు నస్మితాస్యుఁ డగుచు
రాముఁ బట్టముఁ గట్టఁ గిరాతనాథ, తోడితేఁబోయెదను గాని ద్రోహిఁ గాను.
| 247
|
వ. |
అనిన విని సంతోషించి గుహుండు మ్రొక్కి రామచంద్రుండు విడిసినయింగుదీ
తరువును బర్ణతల్పంబును జడలు ధరించినచోటునుం జూప భరతుండు సూచి
విలపించుచుఁ బదంపడి శత్రుఘ్నసమేతుం డయి తానును జటాభారంబు గై
కొని గంగాతరంగణి దాఁటి యక్కిరాతపతిచేతఁ ద్రోవఁ జూపించుకొనుచు
నతని వీడ్కొని భరద్వాజాశ్రమంబునకుం జని యమ్మునీంద్రునకు నమస్కరిం
చుటయుం గోపంబున నత్తాపసోత్తముం డిట్లనియె.
| 248
|
శా. |
క్షోణీరాజ్యము నీకు నిచ్చి ముని యై ఘోరాటవీవాటి న
క్షీణక్షాంతి వహించి యుండఁగ మహాసేనాసమేతుండ వై
ప్రాణ ద్రోహము సేయ నేఁగెదవొకో పాపాత్మ యి ట్లాజగ
త్రాణుం డల్పుఁడె కైక తల్లియఁట నిందం బొంద నీ వోడుదే.
| 249
|
చ. |
అనవుడు నప్పు డాభరతుఁ డమ్మునిపుంగవుకోపచిహ్నముల్
గనుఁగొని భీతుఁ డై నృపశిఖామణి రామునిఁ దోడి తెచ్చి భూ
వనితకు నాథుఁ జేయుటకు వచ్చుట గా కిటు ద్రోహచింత నా
మనమున లేదు నాకు నిట మార్గము సూపు తపోధనోత్తమా.
| 250
|
తే. |
అనిన ముద మంది మునినాథుఁ డతనిఁ గాంచి
తగినవిందులు నేయ నద్దాశరథియుఁ
జిక్కి యారాత్రి మఱునాఁడు చిత్రకూట
శిఖరితెరువు భరద్వాజుచేత నెఱిఁగి.
| 251
|
వ. |
అమ్మునీంద్రు వీడ్కొని చనియె నంత నక్కడ సీతాసమేతుం డై రామచంద్రుండు
చిత్రకూటాద్రియందు విహరించుచుండి తత్సేనాకలకలంబునకు బెదరి కనుకనిం
బాఱుగజమహిషవరాహశార్దూలాదిమృగంబులం జూచి యవ్వల నాలోకించి
ధరాపరాగపటలంబునుం గాంచి లక్ష్మణా యిది యేమొకో మృగంబు లాకులార్త
రవంబులతోడం బఱవం దొడంగె నద్దిక్కునం బెంధూళి యెగసెం జూడు మన
|
|
|
నతండును నధికసంభ్రమంబున నొక్కయుత్తాలపాదపశిఖారోహణంబు సేసి
యుత్తరపథంబునం జతురంగబలాకీర్ణం బగుమహాసైన్యంబు గనుంగొని మఱియు
నేర్పడం బరికించి.
| 252
|
భరతుఁడు చిత్రకూటంబున కరుగుదెంచుట
చ. |
తరణికులప్రధానబిరుదధ్వజపంక్తులఁ జూచి సేనతో
భరతుఁడు దాడి పెట్టి తముఁ బట్టఁగ వచ్చుటఁ గాఁ దలంచి ని
ష్ఠురగతి లక్ష్మణుండు ఘనచుంబిమహీరుహశాఖనుండి య
గ్గిరి యగలంగ డిగ్గ నుఱికెం గులిశాతతపాతమో యనన్.
| 253
|
వ. |
ఇ ట్లుఱికి యోరామచంద్రా భరతుండు సేనాసమేతుం డయి మనమీఁద వచ్చు
చున్నాఁడు నీవుం గవచంబు ధరియించి బాణాసనసన్నద్ధుండవు గమ్ము కాదేని
వైదేహిం దోడ్కొని గిరిగహ్వరాంతరంబున కరుగుము నీశాంతియ ని న్నింత
చేసె నింక సైరింప నతని ప్రాణంబులు గొందు ననిన విని రాఘవేశ్వరుండు
కోపించి నాకుఁ దమ్ముండ వై యుండియు నింతవినయశూన్యుండ వై నీచోక్తు
లేల యాడెదవు నీకంటె వాఁడు నాకు భ క్తుండు మనల నయోధ్యకుఁ గొనిపోవు
తలంపున వచ్చువాఁ డయ్యుత్తమునిచిత్తవృత్తి యెఱుంగవు సంభ్రమం బుడుగు
మనిన నమ్మాటలకు వెఱచి సుమిత్రాపుత్రుండు లజ్జావనతవదనుం డయి యుండె
నాసమయంబున.
| 254
|
తే. |
దూరమున సేన నిల్పి శత్రుఘ్నుతోడఁ
బాదచారి యై చనుదెంచి పర్ణశాలఁ
గాంచి భరతుండు విపులశోకమునఁ దనదు
హృదయ మెరియుచు నుండంగ నిట్టు లనియె.
| 255
|
సీ. |
మహనీయమణిమయమందిరంబుల నుండు, ప్రభుఁడు నేఁ డున్నాఁడు పర్ణశాల
మెత్తనిపాన్పున మే నొత్తుసుఖి నేఁడు, తనువు సేర్చినవాఁడు దర్భశయ్య
లలితమాల్యంబులు లలిఁ బూనుపతి నేఁడు వలనొప్పఁ గయికొన్నవాఁడు జడలు
మృదులాంబరంబుల మెఱయుపుణ్యుఁడు నేఁడు, వలనొప్పఁ గట్టెను వల్కలములు
కోరి రాజన్యలోకంబుఁ గొల్చు రాజ, మౌళిమణి నేఁడు మునిసేవ మరగినాఁడు
వలసె నా కిప్పు డీదురవస్థ చూడఁ, గైకకడుపునఁ బుట్టిన కారణమున.
| 256
|
వ. |
అనుచుఁ బర్ణశాల సేరం జనుదెంచి రామునిం గని తదంఘ్రిపురోభాగంబున
ననుజసమేతుం డయి దండప్రణామంబులు సేసిన నారఘుపుంగవుండు నక్కుమా
రయుగళంబునుం గ్రుచ్చి యెత్తి యక్కునఁ జేర్చి యాలింగనంబు సేసి గారవించెఁ
బదంపడి.
| 257
|
క. |
జనకజకు సుమిత్రానం, దనునకుఁ బ్రణమిల్లి సముచితస్థితి దర్భా
సనముల నుండఁగ రఘుపతి, యనుజన్ములఁ జూచి సేమ మారాజునకున్.
| 258
|
రామచంద్రుండు దశరథునకుఁ దిలోదకాదు లిచ్చుట
వ. |
అనిన విని డగ్గుత్తిక పెట్టుచు దేవా మీరు విచ్చేసిన యేడవదివసంబున భవద్వి
యోగశోకాతురుం డయి భూలోకపతి లోకాంతరంబు నొందె నని పల్కుటయు
నప్పలుకు లశనిపాతఘోషంబునం బోలెఁ గర్ణపథంబునం బడిన రామచంద్రుం
డు మూర్ఛాపరవశుం డయ్యె జనకరాజపుత్రియు సౌమిత్రియు మృతిఁ బొందిన
య ట్లుండి రంతఁ గొంతదడవునకుం దెలిసి లక్ష్మణాగ్రజుం డనేకప్రకారంబుల
విలపింపం గనుంగొని.
| 259
|
క. |
భరతుం డి ట్లనియె నరే, శ్వర ప్రాకృతునట్ల తాల్మి వ్రయ్యఁగ శోకా
తురతం బొందక ధర్మ, స్థిరతం బితృఋణము నీవు దీర్పఁగవలయున్.
| 260
|
వ. |
అనినం దెలివొంది మందాకినియందు సీతాలక్ష్మణసమేతంబుగా స్నానంబు లాచ
రించి తిలోదకంబు లిడి విహితద్వాదశాహకృత్యంబులు నడపి బదరీఫలమిశ్రి
తంబు లగునింగుదీయవపిణ్యాకంబులం బిండంబులు పెట్టి కృతకృత్యతం బొంది పర్ణ
శాల కేతెంచి తమ్ములం బట్టికొని రోదనంబు సేయఁ జిత్రకూటాశ్రయు లైనము
నులును యక్షగంధర్వకిన్నరకింపురుషులు నేఁగుదెంచి వారిశోకంబులు వారించి
రాసమయంబున వసిష్ఠుండు కౌసల్యాదిమాతలం దోడ్కొని వచ్చిన వసుధాపు
త్రీసమేతుం డయి రఘువరేణ్యుండు సవిత్రులయడుగులం బడి దెస లద్రువ రో
దనంబు సేయుటయు నచ్చటియతులధృతులు గలంగెఁ గౌసల్య కొడుకులం గోడలి
నెత్తి కౌఁగిలించుకొని యత్తలోదరితో రోదనంబు సేయ నచ్చట నున్న గరుడ
గంధర్వకిన్నరకంపురుషాదికాంతలు దురంతదుఃఖంబులం బొగులుచున్న సీతం
గనుంగొని.
| 261
|
క |
జనకుండు తండ్రి దశరథ, జననాథుఁడు మామ రామచంద్రుఁడు విభుఁ డ
య్యును నీయబల విపద్భా, జన మైనది దైవగతి కసాధ్యము గలదే.
| 262
|
క. |
అని శోకించుచుఁ గైకం, గనుఁగొని యిప్పాపజాతికారణమున ని
వ్వనితారత్నమునకు ని, వ్వనవాసాయాస మొందవలసె నటంచున్.
| 263
|
వ. |
పలుకుచుండి రనంతరంబ వసిష్ఠువచనంబుల వారు శోకం బుడిగి చిత్రకూటా
చలవాసు లగుమునీంద్రకిన్నరకింపురుషగరుడగంధర్వవిద్యాధరులతోడ యథో
చితాసనంబులం గొలువుండి రప్పుడు సభామధ్యంబున నున్నయన్న నవలోకించి
కేలు మొగిచి భరతుం డి ట్లనియె.
| 264
|
సీ. |
ఒకపాము మోపంగ నోపునా భూమిని, బార్థివుముంజేతిబలిమి గాక
యిల కెల్ల దలదండ చెలియలికట్టయే, రాజాజ్ఞ నబ్ధిపై రాదు గాక
వేదంబులా వర్ణవృత్తి కాధారంబు, జనపతిపాలనశక్తి గాక
యినరశ్ములా వెలుం గీలోకమున కీశు, దీప్రతేజోదీపదీప్తి గాక
గొడుగు విఱిగిన ధారుణి గూలు నబ్ధి, మేర దప్పు వర్ణాశ్రమాచార మడఁగుఁ
|
|
|
గలయ దిఙ్మూఢ మగు నట్లు గాక యుండ, భూరిధారుణిభారంబు పూను మధిప.
| 265
|
తే. |
దేవ కైకేయి కీడు చింతించి పాప
నింద కింతయు రోయక నిన్ను నడవి
కరుగు మని యన్మాటకు నరుగ ధర్మ
మగునె విచ్చేయు మీతెంపు కదగునె సేయ.
| 266
|
ఉ. |
నీ దగురాజ్యలక్ష్మి ధరణీవర యేను ధరింపఁజాల ని
త్యోదయసంపదల్ వొదలుచుండఁ బ్రజాపరిపాలనక్రియా
పాదనలీలతో భువనభారము పూనఁగ నేఁగుదె మ్మయో
భ్యాదయితత్వ మన్యులకు నర్హము గా దటు గాక తక్కినన్.
| 267
|
భరతుఁడు రాముపావలు గొని నందిగ్రామంబున వసియించుట
వ. |
ఇదె మీముందటఁ బ్రాయోపవేశంబు సేయుదు నని దర్భాస్తరణశాయి గా
నున్న నన్నరేంద్రుం డెత్తి యాతమ్మునిం గౌఁగిటం జేర్చి యిది యేమి భరతా
మనకులాచారధర్మంబులు విచారింపక యాడుచున్నావు నాయట్టికొడుకు దశ
రథునట్టితండ్రిసత్యంబు పాలింపఁడేని లోకం బెట్లు నడచు నేను వ్రతంబు సం
పూర్ణం బైనమీఁద నయోధ్యకు వచ్చెద నీచలం బుడుగు మనవుడు రావణవధం
బు గోరుచున్న కిన్నరకింపురుషగరుడగంధర్వమునీంద్రాదు లనాగతవృత్తాంతం
బెఱింగి యవ్వాక్యంబులకు సంతోషించి రక్కుమారుండును జింతాక్రాంతుం డ
గుచు మొగంబు వాంచిన వసిష్ఠుండు రామచంద్రునితో ని ట్లనియె.
| 268
|
చ. |
భరతుఁడు భక్తియుక్తి నినుఁ బ్రార్థన సేయుచు నున్నవాఁడు నీ
వరయఁగ భక్తవత్సలుఁడ వట్లగుటం గృపతోడ మేదినీ
భరము భరింప నీతొడుగుపాదుక లానతియిమ్ము నావుడున్
గురువచనంబు మీఱక రఘుప్రవరుం డటు సేసి తమ్మునిన్.
| 269
|
చ. |
ప్రియ మడరంగ వీడు కొలిపెన్ మది నప్పుడు రామచంద్రుని
శ్చయముతెఱం గెఱింగి రఘుసత్తముచిత్తము నొచ్చునంచుఁ దా
భయమున నొత్తి యెండొకటి పల్కక సానుజుఁ డై దివాకరా
న్వయపతికిం బ్రదక్షిణము వచ్చి నమస్కృతి సేసి భక్తితోన్.
| 270
|
వ. |
భరతుం డుచితప్రకారంబున వీడుకొని మస్తకంబున నప్పాదుకలు ధరియించి చని
శత్రుంజయం బనుపట్టపేనుంగుకుంభస్థలంబునం బెట్టి తానును శత్రుఘ్నుండును
నిరుగెలంకుల ఛత్రచామరంబులు ధరియించి సమస్తపరిజనంబులుం దానును
జిత్రకూటంబు వెడలి భరద్వాజుని కంతవృత్తాంతంబునుం జెప్పుచు గుహున
కెఱింగించుచు నేతెంచి యయోధ్యానగరంబు సొచ్చి తల్లుల నంతఃపురంబునకుం
బుచ్చి మూలబలంబు నగరికాపు పెట్టించి రామశూన్యం బగునప్పురంబున నుండ
రోసి సమస్తమంత్రిజనానుమతంబున నందిగ్రామంబున.
| 271
|
చ. |
అఖిలనృపాలలోక మరుదంద నిజాన్వయకీర్తిచంద్రికల్
నిఖిలము గప్పి యొప్ప నయనిర్భరతన్ భరతుండు పాదుకా
ముఖమున రాజ్యభారము సముజ్జ్వలభంగి వెలుంగ భూప్రజా
సుఖము లొనర్చుచుండె గుణసుందరుఁ డగ్రజుశాసనంబునన్.
| 272
|
వ. |
అక్కడ రామచంద్రుండును జిత్రకూటాశ్రమవాసు లయిన మునులం దగ నా
శ్రయించి సమాధానంబున నుండి భరతుండు మగిడిపోయినవెనుక నచ్చటిము
నులు నయనభ్రుకుటిసంజ్ఞలం దనవల నుపలక్షించుచు నొండొరులం గదిసి మంత
నంబు లాడం గడంగినం దలంకి యీసంభ్రమచేష్టితంబుల కేమి కారణం బొకో
యని విచారించి వితర్కించి కృతాంజలి యగుచుం గులపతి యగుమునివరుం
గనుంగొని.
| 273
|
చ. |
అనఘ మదీయవ ర్తనమునం దొకదోషము గన్న వారొ నా
యనుజుఁడు లక్ష్మణుండు తన కర్హము గానిగతిం జరించెనో
జనకతనూజ నాకుఁ బరిచర్యలు సేయుతఱిం దపస్వినీ
జనపరిచర్య లేమఱెనొ సంభ్రమకారణ మేమి సంయముల్.
| 274
|
క. |
అనుడుఁ దపోవృద్ధుం డ, మ్మునివర్యుఁడు రాముతోడ ముదిసినచందం
బునకుం దగ వడఁకుచు ని, ట్లను నోహో నీచరిత్ర మట్టిదె తలఁపన్.
| 275
|
శా. |
నీయం దింతయుఁ గీడు లేదు ముని వై నీ విమ్మునిశ్రేణితో
ధీయుక్తిం జరియింతు నీయనుజుఁడున్ ధీరుండు సౌమిత్రి దా
నాయుష్మంతుఁడు సర్వసాధుజనసమ్యక్చారుచారిత్రుఁ డా
ర్యాయత్తం బగువర్తనంబు గలకల్యాణాకరుం డారయన్.
| 276
|
చ. |
రఘువర యివ్వనాంతమున రాక్షను లుండుదు రిమ్మునీంద్రు ల
మ్మఘవదరాతిబాధ లిట మాన్చువిచారము సేయుచున్న వా
రఘచరితుండు గర్వితసహాయుఁడు రావణుతమ్ముఁ డెంతయున్
లఘుమతి భీకరాకృతి గలండు ఖరుం డన నొక్కఁ డిక్కడన్.
| 277
|
వ |
అద్దురాత్ముండు జనస్థానంబున నుండుఁ దదీయనియోగంబున నిశాచరు లాశ్ర
మాంతగహనాంతరతరుమూలంబుల నొదిఁగి హోమకాలంబుల హుంకార
భయంకరాట్టహాసంబు లెసంగ ఘోరాకారంబులు సూపి యనేకప్రాణిహింస
లు సేయుచుఁ గర్ణమూలంబుల బిట్టార్చుచు స్రుక్స్రువమృద్భాండంబులు పాఱపై
చుచు హవిర్భాగంబుల శోణితంబు గలుపుచుఁ గుశకుసుమసమిత్కలశాదు లె
త్తికొనిపోవుచు నిట్లు తపోధనబాధ లొనర్చుచుండుదు రిది కారణంబుగా ని
చ్చోటు బాసి యొండెడకుం బోవుతలంపున నాతో నాలోచనంబు సేయుచున్న
వారు నానావిధకందమూలఫలంబులం బొలిచి యనతిదూరంబున నొక్కపురా
తనతపోవనం బున్నది యవ్వనం బాశ్రయించెద మిది రాక్షససమీపంబు నీ
|
|
|
వునుం జనుదెంచు టొప్పుఁ గళత్రంబుతోడ నిట నొంటి నిలుచుట యుచితం
బు గా దని పలికి తమ్ముఁ దగువాక్యంబులం బెక్కుదెఱంగుల నిలువఁ దలంపు
గొన్న రఘునందనుల నొడంబఱిచి కులపతి మునిగణసమేతుం డయి చనియెం
దదనంతరంబ.
| 278
|
క. |
మరగిన బాలమృగంబులు, దిరుగుడువడుతెఱఁగుఁ జూచి ధృతి గలఁగఁగ న
న్నరపతి బహువిధముల నచ, టెరవయి మునిశూన్య మగుట నింపక యున్నన్.
| 279
|
క. |
భరతుఁడుఁ దల్లుల బంధులఁ, బురజనులం గూడి వచ్చి భూపతి లోకాం
తరగతుఁ డగు టెఱిఁగించిన, నెరి సెడినది దలఁప ధైర్య మెడలెడి నిచటన్.
| 280
|
రాముఁ డత్రిమహామునియాశ్రమంబు చేరుట
క. |
నాకంటెను సౌమిత్రికి, నీకంజాక్షికి రుచింప దిక్కడ భరతా
నీకనివేశనమున న, స్తోశాశ్వద్విపకరీషదూషిత మగుటన్.
| 281
|
వ. |
అని విచారించి రామభద్రుండును జిత్రకూటంబు విడిచి యత్రిమహామునియా
శ్రమంబునకుం జనుదెంచి సీతాలక్ష్మణసమేతుం డగుచు నమ్మునీంద్రునకు నమ
స్కరించిన.
| 282
|
క. |
అత్రియుఁ బ్రేమ నటించుచుఁ, బుత్రునిగతిఁ జూచి యధికపూజలఁ దగ న
మ్మిత్రకులాగ్రణి కొసఁగి సు, మిత్రాసుతు సీతఁ గరుణమెయి మన్నించెన్.
| 283
|
తే. |
విహితకృతు లి ట్లొనర్చి సన్మహితచరిత, సిద్ధ సహవృద్ధఁ బత్ని నీక్షించి రాజ
పత్ని యగునీయశస్వినిఁ బరమసాధ్వి, సీత మన్నింపు కోర్కులు సెలఁగ నెలమి.
| 284
|
వ. |
అని పలికి రామచంద్రుం గనుంగొని.
| 285
|
సీ. |
ఏకమౌనమున నీరేడువేలబ్దంబు, లత్యుగ్ర మగుతప మాచరించి
యనసూయ మనువ్రత మతినిష్ఠఁ జరియించి, తదభిధానంబుచేఁ దగు వెలింగె
బదియేఁడు లిలఁ జిన్కు పడకున్న ఫలమూల, కందముల్ గల్పించి గంగఁ బఱపె
వేల్పులు దగ వచ్చి వేఁడిన వర మిచ్చి, రాత్రులు పది యొక్కరాత్రి చేసె
నీమహాతపస్విని భూతహితచరిత్ర, బ్రహ్మచారిణి యీపుణ్యభాగ నింక
రామ కౌసల్యఁబోలె నీరాజతనయ, కొలుచుఁ గా కన్న రాఘవకుంజరుండు.
| 286
|
మ. |
మునివాక్యంబులు వింటె జానకి మనోమోదంబు సంధిల్ల నీ
వనసూయన్ భజియింతుగాక భవదిష్టావాప్తికై నావుడుం
జని వాతూలవిధూయమానకదళీస్తంభంబుచందంబునం
దనుకంపంబున నొప్పు దుస్తరతపస్తప్తాంగి నత్తాపసిన్.
| 287
|
క. |
కని యేను జనకనందన, ననుచుం బ్రణమిల్లి తల్లి యడిగెదఁ గుశలం
బనిన నగుఁ దల్లి సేమం, బున జనకుం డున్నవాఁడె ముదమే నీకున్.
| 288
|
ఆ. |
బంధుజనుల విడిచి సింధురగామిని, రాము వెనుక ని ట్లరణ్యమునకు
వచ్చి తిచట సుఖమె నిచ్చలు ధర్మని, రీక్షణంబు సేయుదే మృగాక్షి.
| 289
|
తే. |
ఒక్కమన్ననతో నున్న నొల్లకున్నఁ, గరము నెయ్యుఁడై యున్నను గాక యున్న
మగఁడు ప్రియతముఁ డనిలయుండు మానవతికి, నెల్లలోక సుఖంబులు నెదురు వచ్చు.
| 291
|
క. |
నడవడి యొప్పక యుండినఁ, గడునిర్ధనుఁ డయినఁ బతియె గతియును విను మె
క్కుడుబంధుండును బ్రియుఁడుం, బడఁతులకుం బరమగురుఁడుఁ బరదేవతయున్.
| 292
|
తే. |
ఇంతి శీలదోషంబుల నిట్టిపతికి, నతివ లెవ్వరు ప్రతికూల లయి చరింతు
రమ్మహాపాపవతులు దుర్యశము నొంది, కూలి కాంతు రధోలోకఘోరగతుల.
| 293
|
క. |
పతిపరిచర్యాపరిణత, గతి లోకము మేలు కీడు గనియుండు పతి
వ్రతలు నినుఁ బోని గుణవతు, లతులితసుఖకీర్తు లెందు నందుదు రబలా.
| 294
|
ఉ. |
నావుడుఁ బత్నికిం బతియ నమ్మినబంధుఁడు నిష్టదైవముం
గా వివరించి మజ్జనని గారవ మారఁగ మున్ను సెప్పె నా
కీవిధ మత్తగారుఁ గృప యేర్పడ నానతి యిచ్చి రిఫ్డు మీ
చే విని ధన్య నైతి విలసిల్లె మనంబు మహాతపస్వినీ.
| 295
|
ఉ. |
ముత్యము లైనజన్నములునూఱును వేమఱు సేసినం దప
స్సత్యశమక్షమాదిగుణసంపదతోడ వనైకవాసు లై
నిత్యసమాధియోగమున నిల్చిన నేరికిఁ బొందవచ్చునే
పత్యనుకూల లైనకులపాలిక లందెడు పుణ్యలోకముల్.
| 296
|
చ. |
పతియెడ రెండు లేక కులభామలు తా రతఁ డెట్టిఁ డైన న
న్మతిఁ జరియించు టొప్పు ననినం గమనీయచరిత్రుఁడుం గృపా
న్వితుఁడు జితేంద్రియుండు నతినిర్మలధర్మయుతుండు సూనృతో
ర్జితుఁడును రాముఁ డీరఘువరేణ్యుని నేగతిఁ గొల్చు టొప్పదే.
| 297
|
క. |
విను కౌసల్యకుఁ దక్కిన, జననుల కతిభక్తి నొక్కసరి యై నడచున్
జనపతి యొకపరి ముట్టిన, వనజాక్షులఁ దల్లి నొక్కకవడువునఁ జూచున్.
| 298
|
క. |
గుణవతి సావిత్రియు స, త్ప్రణుత యరుంధతియు ధర్మపరిణత యారో
హిణియుఁ గనుట పతిశుశ్రూ, షణమునన కదా సదాయశస్సౌఖ్యంబుల్.
| 300
|
వ. |
మఱియుం గొంద ఱిట్టిపతివ్రతలు పతుల నచలమతుల నారాధించి తమతమధర్మం
బుల నుత్తమలోకంబు లందుచుండుదు రిదియును మాయత్త యెఱింగించినట్టిది
యనిన ననసూయ సీతతోఁ బతిభక్తిమాహాత్మ్యవిషయం బై నీ చెప్పినవాక్యంబు
లొప్పు నీధర్మనిర్మలచరితంబునకు సంతోషించితి నీకుం బ్రియం బయ్యెడివరం
బిచ్చెద ననుటయుఁ గరంబులు మోడ్చి యచ్చెలువ నిల్చుటయుం బదంపడి.
| 301
|
చ. |
ఇదె యొకకుంకుమంబు కమలేక్షణ యిచ్చెద సర్వమంగళా
స్పద మగు నివ్విలేపనము శశ్వదలంకృతి మేని కంచుఁ జెం
|
|
|
పొదవ వినూతనాంబరసముజ్జ్వలభూషణపూర్వకంబుగా
ముదమున నిచ్చి యిం పలర ముద్దియతో మునిపత్ని యి ట్లనున్.
| 302
|
సీతాదేవి యననూయతోఁ దనవివాహవృత్తాంతము చెప్పుట
క. |
నిను రాముఁడు వరియించుట, విని యుండుదుఁ గొంత యంతవృత్తాంతంబున్
జనకజ నీచే నిప్పుడు, వినఁ గోరెదఁ జెప్పు మనుడు వేడుకతోడన్.
| 303
|
తే. |
రాజధర్మంబు మెఱయ భూరక్షణంబు, సలుపుచుండి మజ్జనకుఁడు జనకుఁ డెలవి
సకలసహధర్మచారిణీసహితుఁ డగుచు, నుచితకర్మంబునకు నేఁగి యొక్కనాఁడు.
| 304
|
క. |
ఝణఝణితకనత్కంకణ, మణిమయమంజీరజనితమంజులశింజా
రణితనభోభాగనిరీ, క్షణ మల్లన సేసి మేనకం బొడగాంచెన్.
| 305
|
క. |
కని యయ్యచ్చరరూపం, బున కచ్చెరు వంది యధికపుణ్యుఁడఁ గానే
యనపత్యుఁడ నగునే ని, వ్వనజాననయం దపత్యవంతుఁడ నైనన్.
| 306
|
తే. |
అనుచుఁ దలపోయ నీకు నిత్తనులతాంగి, వలన సమరామణీయకవైభవంబు
వెలయ మానసాపత్యంబు గలుగు నిప్పు, డనుచు వీతెంచె నొకవాక్య మాకసమున.
| 307
|
క |
జనపతియును నవ్వాక్యము, విని యలరుచు బీజముష్టివిక్షేప మొన
ర్చునెడం బృథ్వీగర్భం, బునఁ బుట్టితిఁ దదనురాగభూషిత నగుచున్.
| 308
|
వ. |
ఇవ్విధంబున మేదిని భేదించుకొని జనియించిననన్నుం గనుంగొని మజ్జనకుండు
విస్మితుఁ డగుచు నెత్తికొని యపత్యస్నేహానందంబు నంద మఱియు నాకాశ
వాణి యి ట్లనియె.
| 309
|
క. |
సీతాపద్ధతి నీసుత, భూతలమునఁ బొడమెఁ గాన భూతి దలిర్పన్
సీత యనుపేరు భువి వి, ఖ్యాతంబుగ నుల్లసిల్లు నని పల్కుటయున్.
| 310
|
ఆ. |
కురిసెఁ బుష్పవృష్టి సురదుందుభులు మ్రోసె, జనకుఁ డప్పు డధికసంభ్రమమున
మహితచరిత యగ్రమహిషిచేఁ గూఁతుఁగా, బెంప నిచ్చె నన్ను బ్రియముతోడ.
| 311
|
క. |
ఏనును బరిణయయోగ్యం, బైన వయోంతరముఁ బొందునప్పుడు నాకున్
మానవనాథుఁడు తగువరుఁ, గానక చింతించి బుద్ధిఁ గని మంత్రులతోన్.
| 313
|
క. |
సీతాస్వయంవర మ్మని, భూతలమునఁ గలుగు సకలభూపాలురకుం
బ్రీతి నెఱిఁగింపఁ బుచ్చుట, నీతి యనుచుఁ జేసెఁ కార్యనిశ్చయము మదిన్.
| 314
|
వ. |
ఇట్లు కార్యంబు నిశ్చయించి సమస్తరాజన్యుల రప్పించి తానును మున్ను జన్నం
బొనరించుసమయంబున నధికనత్వసంపన్ను లగువారు పదివేవురు మోచి తె
చ్చిన యొక్కమహనీయకోదండంబును నక్షీణబాణతూణీరంబులును వరుణనిక్షి
ప్తంబు లయి నిజమందిరంబునం దేజరిల్లువాని నమ్మనుజపతులకుం జూపి యిక్కా
ర్ముకం బొక్కచేత నెత్తి యెక్కిడి తెగఁ దిగువం జాలుభూపాలున కిత్తు నాకూఁ
తు నని పలుకుడు నచ్చాపం బపలక్షించి యిది ధరాధరదుర్ధరం బని మ్రొక్కు
|
|
|
చుందు రంతఁ గతిపయదినంబులకు విశ్వామిత్రసహితుం డయి యిమ్మహాభా
గుం డేఁగుదెంచి దశరథసఖుం డైనమజ్జనకునకు నమస్కరించినం గుశలం బడిగిన
యనంతరంబ యుచితకథాప్రసంగంబు లాడి మంత్రులం గనుంగొని.
| 315
|
ఉ. |
ఒక్కశరాసనంబు వినియుండుదు మిచ్చట నెట్టిచాపమో
యె క్కిడఁ దివ్వ లోకమున నేరికి రాదఁట చూచువేడ్క మా
కెక్కుడు నావుడున్ విని నరేంద్రుఁడు సంతస మంది మంత్రులుం
దక్కినబంధులోకము ముదంబునఁ బొందఁగ నీరఘూత్తమున్.
| 316
|
ఉ. |
తోడ్కొని వచ్చి శక్రగజతుండమహాపరిఘాభిరామ మై
చూడ్కికి వింత యైనవిలు చూపుడు నయ్యురుశింజినీకమున్
వేడ్కయుఁబోలె లీల రఘువీరుఁడు దాపలికేల నెత్తె న
మ్మాడ్కి ధరింప నెవ్వరికి మానము గానిధనుర్లలామమున్.
| 317
|
తే. |
ఎత్తి చూపఱు వెఱఁగంద నెక్కు ద్రోచి, వేడ్కఁ దెగ దివ్వ నవ్విల్లు విఱుగుచప్పు
డశనిగతి యైన మూర్ఛిల్లి రచటిజనులు, జనకకౌశికరామలకక్ష్మణులు దక్క.
| 318
|
వ. |
తదనంతరంబ మాతండ్రి సంతోషంబునం బొదలి రఘుపతిభుజబలంబు ప్రశంసిం
చి నీ వింక నిక్కన్యం బరిగ్రహింపు మని పలికిన దశరథానుమతంబు వలయు
ననుటయు నమ్మహీపతి రావించి న న్నీరాజన్యునకు ధర్మపత్నిం జేసి నాచెలియలి
నూర్మిళ నీసుమిత్రాపుత్రునకు నిచ్చె నని యిట్లు స్వయంవరప్రకారంబు సెప్పిన
నమ్మునిపత్ని సీతపలుకు లాలించి పదంపడి భానుమండలం బపరశిఖరిశిఖరతిరో
హితం బగుటయుఁ గనుంగొని.
| 319
|
చ. |
చెలఁగఁ దొడంగె నీడములఁ జేరి విహంగము లాశ్రమాంఘ్రిపం
బుల కుదకంబు వోసి మునిపుత్రులు వచ్చెద రోలి వేదికా
తలములఁ బొందెడున్ మృగవితానము లబ్దిని నిద్ర వొందెడిం
దెలువుల మ్రింగుచుం దమము దిక్కులఁ గప్పెడి నంత కంతకున్.
| 320
|
క. |
కలయ నిశాచరసత్త్వం, బులు దిరిగెడు హోమధూమపుణ్యామోదా
మిళితానిలములు మెలఁగెడు, వెలిఁగెడుఁ జుక్కలును దోఁచె విధుమండలమున్.
| 321
|
ఉ. |
ఇంక లతాంగి రాముకడ కేను గనుంగొనుచుండఁ గుంకుమా
లంకృత వై వినూతనవిలాసముతోఁ జను మన్న నంగరా
గాంకితకాంతి నొ ప్పెసఁగి యమ్మునిపత్నియుఁ జూచుచుండ న
ప్పంకరుహాక్షి వచ్చి జనపాలున కంతతెఱంగు చెప్పినన్.
| 322
|
క. |
విని సతి నవసౌందర్యముఁ, గనుఁగొని మది నలరి నృపశిఖామణి యయ్యా
మిని నచటఁ బుచ్చి వేగినఁ, జనుదెంచి కృతాగ్నిహోత్రసమయం బయినన్.
| 323
|
చ. |
మునిచరణాంబుజంబులకు మ్రొక్కిన దీవన లిచ్చి తండ్రి యి
వ్వనభువి ఘోరరాక్షసు లవారితు లై చరియింతు రిత్తపో
|
|
|
ధనులు పలార్థ మై చనుపథంబున నేమఱ కేఁగు మన్యకా
ననమున కన్న నత్తపసినాయకు వీడ్కొనె సమ్మదంబునన్.
| 324
|
ఉ. |
రాజకిరీటకీలితవిరాజితనూతనరత్నరాజినీ
రాజనమంగళాచరణరంజితపాదసరోజ ఖడ్గధా
రాజయలభ్యమానరుచికరద్యుతిమన్మణిశాతకుంభ వి
భ్రాజితసద్వితీర్ణ రిపుపార్థివఖండన కీర్తిమండనా.
| 325
|
క. |
భూరిభుజార్గళలసదసి, ధారచలితప్రతాప దహనమహాదు
ర్వారశిఖాంతరనిపత, ద్వీరారికుమారశలభ విక్రమసులభా.
| 326
|
మా. |
వినయగుణవిశాలా విశ్రుతాచారలోలా
వినుతశుభచరిత్రా విద్వదంభోజమిత్రా
ఘనవిజయధురీణా కామినీపంచబాణా
కనకకుధరధీరా కాచమాంబాకుమారా.
| 327
|
గద్యము. |
ఇది సకలకలావిశారద శారదాముఖముకురాయమాణసారస్వత భట్ట
బాణనిశ్శంక వీరమారయకుమార కుమారరుద్రదేవప్రణీతం బయిన శ్రీరామా
యణంబునం దయోధ్యాకాండంబు సర్వంబు నేశాశ్వాసము.
| 328
|