భాస్కరరామాయణము/కిష్కింధాకాండము

శ్రీరస్తు

భాస్కరరామాయణము

కిష్కింధాకాండము



రమణీప్రియరమణీ
శ్రీరమ్యోరుకుచకుంభసేవాలోల
స్ఫారదృగాశయనేత్రాం
భోరుహపూజాప్రహృష్ట పురుషవిశిష్టా.

1


చ.

ఘను లగురామలక్ష్మణులఁ గార్ముకబాణకృపాణపాణులన్
సునిశితవిక్రమక్రముల సూర్యతనూజుఁడు చూచి భీతుఁ డై
మనము గలంగఁబాఱి ధృతి మాయఁగ నచ్చట నుండ నోడి యే
చినపెనువంతతోడఁ దనుఁ జేరిన మంత్రులఁ జూచి యి ట్లనున్.

2


తే.

ఘోరశస్త్రాస్త్రపాణు లై వీర లున్న, వారు కపటంపుఋషివేషధారు లగుచు
వాలిపంపున వచ్చి యీవనమునందు, వలసినట్లు క్రుమ్మరుచున్నవార లనిన.

3


వ.

ఆసుగ్రీవుమంత్రులగు వానరవీరులు నారామలక్ష్మణులం జూచి యధికభయంబున
జిత్తంబులు గలంగి.

4


క.

తరువులు నఱుముగఁ బుష్పో, త్కరములు రాలంగ ధరణిధరశిశిరంబుల్
చరణప్రహతుల విఱుగఁగఁ, గరిశార్దూలాదిమృగనికాయము బెదరన్.

5


క.

గిరిగిరిశిఖరంబులకును, దరుతరుశాఖలకు దావదావంబులకుం
బొరిఁబొరి దాఁటులు వైచుచుఁ, ద్వరితగతిం బాఱి రన్యవననగములకున్.

6


వ.

ఇట్లు కలంగి తొలంగినసుగ్రీవసచివులు హనుమంతుం బురస్కరించికొని యొ
క్కెడ నోసరించి యున్నసుగ్రీవుపాలి కేతెంచి ప్రాంజలులై యుండ నప్పుడు హను
మంతుం డినతనయు నుపలక్షించి నీ వెవ్వరిం జూచి వాలి పంపినవా రనుభయం
బునఁ దొలఁగ నేతెంచి యున్నవాఁడ విచ్చట.

7


ఉ.

వాలి యధీశుఁ డై పనుప వచ్చినవారలు గారు వార లా
వాలియుఁ గిల్బిషం బిపుడు వావిరిఁ జేయఁడు మర్కటత్వముం
బోలఁగ నీవు దాల్చుటకుఁ బూర్ణవివేకము లేక బేల వై
యేల మనంబునన్ బెగడె దింగితబుద్ధిఁ దలంచి చూడుమా.

8

క.

బుద్ధిం గార్యము దలఁపని, బుద్ధివిహీనులను భూతములె శాసించున్
సిద్ధింప దారయ నస,ద్బుద్ధులకును రాచకార్యభూతులు గలుగన్.

9


అని పల్కన్ హనుమంతుతో ననునయం బారంగ సుగ్రీవుఁ డి
ట్లను బాణాసనబాణతూణయుతబాహాత్యుగ్రులున్ దీర్ఘలో
చనులు దేవసుతోపమానులును నై చండప్రభన్ వాలునా
ఘనులం జూచిన నేరికిన్ భయము సక్రాంతంబు గా కుండునే.

10


ఉ.

వారలు వాలిపంపునన వచ్చినవా రనుశంక నామదిన్
వారక నాటి యున్నయది వాలియు నాయెడఁ గ్రించురాజు లే
పార ననేకమార్గముల నప్రియులం దెగఁజూతు రేర్పడన్
వారి నెఱుంగఁగా వలయు వచ్చునె నమ్మఁగ నెందు రాజులన్.

11


వ.

మఱియుఁ బ్రచ్ఛన్నవేషధారు లగువారలం జారులవలన నెఱుంగవలయు.

12


క.

నమ్మఁ జన దెదిరిఁ దమ్మును, నమ్మినవారి మదిలోన నమ్మక పరుపైఁ
గ్రమ్మఱఁ ద ప్పిడి చెఱుతురు, నమ్మ న్నేవారి నిపుడు నాహిత మారన్.

13


చ.

అనిలతనూజ నీవు ప్రియ మారఁగ వారలఁ జేరి వార లీ
వనమున కేమికారణము వచ్చిరొ యేటికి నస్త్రశస్త్రముల్
తనరఁగఁ బూనినారొ రణదర్పమునం జనుదెంచినారొ నే
ర్పునఁ బరికింపు రూపములఁ బోలఁగ మాటల సత్త్వదృష్టులన్.

14


క.

వారలు సన్మును లైనం, గోరిక విశ్వాసపఱిచి కూడి ప్రశంసల్
సారెకుఁ జేయుచు సామం, బారఁగఁ గావింపు మనకు నభిమత మొందన్.

15


క.

అని పలుకఁగ నగుఁ గా కని, హనుమంతుఁడు భిక్షుకత్వ మలవడఁగాఁ గై
కొని రామలక్ష్మణులకడ, కనుపమతరబుద్ధి నేఁగి యారాఘవులన్.

16


వ.

ప్రియోక్తుల నగ్గించుచు హనుమంతుండు వారల కిట్లనియె.

17


మ.

ఉరుమత్తద్విపవీర్యు లార్యగుణు లింద్రోపేంద్రతుల్యుల్ ప్రభా
కరతేజస్కు లుదారధీరులు శుభాకారుల్ బహుశ్రీయుతుల్
హరిసంచారులు భూరివర్షులు విశాలాక్షుల్ నిలింపేంద్రభా
స్వరచాపాంచితచాపసంయుతభుజుల్ శస్త్రాస్త్రవిద్యావిదుల్.

18


శా.

మీ రీకాన మృగంబులం గపులఁ బేర్మిన్ భీతిఁ బొందించుచుం
దీరోపాంతతరుప్రతానముల నర్థిం జూచుచున్ వేడ్కతో
నీరమ్యాపగచెంత నొప్పెదరు మీ రేపారు తేజంబునన్
గారా మారఁగ నిన్నగేంద్రము వెలుంగంజేయుచున్నా రొగిన్.

19


క.

సింహప్రేక్షణు లాతత, సింహపరాక్రములు భూరిసింహస్కంధుల్
సింహసమానబలాఢ్యులు, సింహకృశోదరులు పురుషుసింహులు మీరల్.

20


క.

కీలితకనకజ్వాలలఁ, గ్రాలెడి మీ కేల ముక్తకంచుకకీలా

జాలకరాళజనాంతక, కాలవ్యాళములువోలెఁ గరవాలంబుల్.

21


క.

నరమునివేషము లొందిన, నరనారాయణులపగిది నాకాగతని
ర్జరవరవహ్నులసరణిని, ధరణిం జరియించు చంద్రతరణులకరణిన్.

22


వ.

నెరయ మెఱయుచుం బరస్పరసమానరూపయౌవనగుణలక్షణవిక్రమక్రమవి
శేషంబులఁ బరఁగుచున్నా రని పలికి మఱియును.

23


మ.

పరిఘాత్యాయతబాహు లశ్వినిసరూపప్రాప్తు లుగ్రప్రభా
భరితుల్ పార్థివలక్షణాకలితు లై భాసిల్లుచున్నారు మీ
రరయన్ వార్ధిపరీతభూభువనరాజ్యం బొంద నర్హుల్ జటా
భరకృష్ణాజినవల్కలంబులు ధరింపం గారణం బేమొకో.

24


శా.

సుగ్రీవుం డనువానరేంద్రుఁడు రణకక్షోణీస్థలిం దన్ను న
త్యుగ్రప్రక్రియ వాలి దోలినఁ గడున్ దూరస్థుఁ డై ఋశ్యమూ
కగ్రావంబున నుండి మీకడకు సఖ్యం బొప్పఁ గావింప బ
ద్ధిగ్రాహిత్వముతోడఁ జెల్మికిని బుత్తేరంగ నే వచ్చితిన్.

25


క.

తపనతనూజుని సచివుఁడఁ, గపిమూర్తిని గామరూపిఁ గామగముఁడఁ గా
డుపుతనయుఁడ హనుమంతుఁడఁ, గపటపుభిక్షుకుఁడ దూతకార్యమ్మునకున్.

26


వ.

మీపాలికి నేతెంచి మీ రేరాజసుతులరో యేమహానుభావులరో యీపంపాతీర
దుర్గమారణ్యంబున కరుగుదెంచిన కారణం బేమియో యని హనుమంతుండు
పలికిన రామచంద్రుండు మందస్మితవదనారవిందుం డై సుమిత్రానందనుతోడ
మనవచ్చినవృత్తాంతం బెఱింగింపు మనిన సౌమిత్రి యావాయుపుత్రుం గనుంగొని.

27


సీ.

దశరథుం డనుపేరి ధరణిపాలాగ్రణి, కగ్రపుత్రుండు నా కగ్రజుండు
సర్వభూతహితుండు జనతాశరణ్యుండు, విక్రమక్రమశాలి విజయశీలి
రాముఁ డీసుగుణాభిరాముండు జనకుని, సత్యంబు నెఱప రాజ్యంబు విడిచి
తనపత్నియును దాను వనమున కేతేర, రక్కసుం డొక్కఁ డీరాజుదేవి
విపులపుణ్య సీతఁ గపటి యై కొనిపోయె, నేము లేనిచోట నేము వానిఁ
గాన కెల్లదిశలుఁ గలయంగ వెడకుచుఁ, దిరిగితిరిగి యొక్కవరణి రాగ.

28


క.

మునిశాపంబున రాక్షస, తను వొందినదనుసుతుండు దనువు మహీనం
దనసుద్ది మీకుఁ జెప్పెడి, నినజుం డని మాకుఁ జెప్పి యేఁగెన్ దివికిన్.

29


క.

కావున సుగ్రీవునిచే, నీవసుధేశుపతివార్త యెఱుఁగంగ సుహృ
ద్భావంబును భానుజుతోఁ, గావింపఁగ నిటకు రాక కపికులవర్యా.

30


వ.

అని మఱియు ని ట్లనియె.

31


సీ.

ప్రజలు ప్రసాదంబుఁ బడయఁగోరెడుభర్త, తరుచరేంద్రుని ప్రసాదంఁబు నొంద
సకలలోకులకును శరణదుం డగురాజు, కర మర్థి సుగ్రీవు శరణు సొరగ
నరనాథుఁ డగులోకనాథుండు ప్లవగనా, థుం డిచ్చఁ దనకు నాథుండు గాఁగ

నఖిలలోకసహాయుఁ డై యుండుపుణ్యుండు, కపివర్యుసాహాయ్యకంబు వేఁడ
రాజు లెల్లను సేవించు రాజగురుఁడు, వానరేంద్రుని సేవింప వచ్చినాఁడు
రామచంద్రుని కిట్టిదుర్దశలు వచ్చెఁ, జారుచారిత్ర యగుసీతకారణమున

32


క.

ఏ లక్ష్మణుఁడను రామమ, హీలలనుం డన్న గాన యీవిభువెనుకం
బోలఁ దపోవేషము నేఁ, దాలిచి వచ్చితి నభీష్టతను గానలకున్.

33


తే.

ధైర్యనిధి యయ్యుఁ దనపత్నిఁ దలఁచి తలఁచి, రామచంద్రుఁడు శోకవారాశిచంద్రుఁ
డగుచు నధికదైన్యంబుతో నాననంబు, విన్న నై యుండ నిచ్చట నున్నవాఁడు.

34

శ్రీరామసుగ్రీవులకు హనునుంతుండు సఖ్యంబు చేయుట

వ.

అనుచు బాష్పాకులలోచనుం డగుచున్న లక్ష్మణుం గనుంగొని హనుమంతుం డూ
రార్చుచు నతని కి ట్లనియె.

35


శా.

ఆలం బుద్ధతిఁ జేసి చేవ చెడి ధైర్యం బేది యవ్వాలిచే
నాలిం గోల్పడి వీడు వోవిడిచి రాజ్యభ్రష్టుఁ డై సంచిత
శ్రీ లెల్లం జెడి కానలో మఱుఁగుచుం జేడ్పాటుతో నుండుటం
జాలం బోలఁగ మీకు నర్కజునకున్ సఖ్యంబు వే కల్గెడున్.

36


క.

మీరును సుగ్రీవుఁడును, గారవమునఁ బొత్తు సేసి కపిసేనలతో
నారవిజుఁడు దోడ్పడఁగ ను, దారత సాధింపఁ గలరు ధారుణి యెల్లన్.

37


వ.

అనవుడు సౌమిత్రి ముదం బంది రామచంద్రుం గనుంగొని.

38


క.

చన నామాటల కలరుచు, ననురక్తిం జిత్తగించి యభిముఖుఁ డై యీ
హనుమంతుఁడు వినుచుండుట, నినజునకు మనకు మైత్రి యిప్పుడ కల్గున్.

39


వ.

అనిన రఘువరుండు హనుమంతుని సంభావించి యతని కి ట్లనియె.

40


క.

ఉగ్రాంశుకులీనుల మే, ముగ్రాంశుసుతుండు దాను నుచితం బరయన్
సుగ్రీవునకును మాకును, నగ్రియసఖ్యంబు సేయ నర్హము గాదే.

41


వ.

అని పలుకుచుండ హనుమంతుండు ముదం బంది కృతకార్యసిద్ధు లయిరి రాఘ
వు లనుచు నారామలక్ష్మణుల సముచితసంభాషణంబులం దేల్చి వారలం దో
డ్కొని ఋశ్యమూకంబు గడచి మలయాద్రి కరిగి యచ్చట రాఘవుల నునిచి
సుగ్రీవునిసన్నిధి కేఁగి సుగ్రీవా నీతోడిసఖ్యంబునకు రామలక్ష్మణులం దోడ్కొని
వచ్చితిఁ గృతార్థుండ వయితి వారామచంద్రుండు ధర్మజ్ఞుండును గృతజ్ఞుండును
సత్యసంధుండును బితృవాక్యపరిపాలకుండు నధికబలపరాక్రముండు నాశ్రితవత్స
లుండును గావున నీమనోరథంబు సఫలంబు సేయ సమర్థుండు జనకాజ్ఞ నడవి కేతెం
చి తనపత్ని రాక్షసాపహృత యైననిమిత్తంబున నిన్నుం గాన నేతెంచె నీవు నమ్మ
హానుభావుని నభివందనపూర్వకంబుగా సంభావింప నర్హుండ వనిన హనుమం
తువాక్యంబులకు సంతోషించి సుగ్రీవుండు వాలివలనిభీతి వాడినపుష్పదామం
బునుంబోలె విడిచి హనుమంతునితోఁ గూడ నధికసమ్మదంబున నేతెంచి.

42

క.

మర్కటకులవల్లభుఁ డగు, నర్కతనూభవుఁడు వచ్చి యనురక్తి సమి
త్కర్కశభుజవిక్రమసం, పర్కుని రాముఁ గని మ్రొక్కి ప్రాంజలి యగుచున్.

43


చ.

జనవర నీదుధర్మజయసత్యపరాక్రమశక్తు లొప్పఁగా
ననిలసుతుండు సెప్పె నవి యట్టివ నీశుభదర్శనంబు నా
కనుపమరాజ్యభూతికర మయ్యెడు వానరకోటితోడ నా
మనమున నీకు నాకుఁ దగమైత్రి యొనర్పఁగ బుద్ధి పుట్టెడున్.

44


క.

మనమున నమ్మిక పుట్టఁగ, జనవర చే సాఁపు మనుడు జనపతి యగుఁ గా
కని యితరేతరమస్తక, మనుకూలతఁ బట్టి చేసి రాలింగనముల్.

45


చ.

అనిలసుతుండు కాష్ఠయుగ మప్పుడు గూర్చి మథించి యగ్నిసం
జనితము గాఁగ నర్చు లిడి చాలఁ బ్రవృద్ధము చేసి ముందటం
దనరఁగ దెచ్చి పెట్టినఁ బ్రదక్షిణముల్ పని వచ్చి నమ్మ న
య్యనలము సాక్షి గాఁగ మన మారఁగ సఖ్యము సేసి రిద్దఱున్.

46


వ.

ఇ ట్లగ్నిసాక్షికంబుగా సఖ్యంబు సేసి యధికానందంబులం దనియ నన్యోన్య
ముఖావలోకనంబులు సేయుచుండి రప్పు డర్కజుం డర్కవంశజు నాలోకించి.

47


క.

కాకుత్స్థ యింక వగవకు, నీకడకున్ వేగ దత్తు నీసతి దివిష
ల్లోకమున నున్నఁ బన్నగ, లోకంబున నున్న నబ్ధిలోపల నున్నన్.

48


వ.

అని పలికి మఱియు రామచంద్ర నవలోకించి.

49


ఉ.

రావణుసంకమధ్యమున రౌద్రభుజంగిగతిన్ వెలుంగుచున్
వావిరి బాష్పముల్ దొరఁగ వారక లేడ్చుచు రామరామ యేఁ
బోవుచు నున్నదాన గుణభూషణ లక్ష్మణ నీవు వేగ న
న్గావఁ గదయ్య యంచు నధికవ్యధఁ జీరుచు భీతి నేఁగుచున్.

50


వ.

ఆసమయంబున.

51


మ.

ఘనశైలస్థలి నేను నల్వురు కపుల్ గాంక్షన్ వినోదింపఁగా
జనకాధీశతనూజ మమ్ముఁ గని లజ్జన్ నమ్రవక్త్రాబ్జ యై
తనయాకల్పము లుత్తరీయమునఁ బొందం గట్టి మాముందటం
గనుపట్టన్ దిగవైచుచుం జనియె శోకకధ్వానముల్ సేయుచున్.

52

సుగ్రీవుండు దెచ్చి యిచ్చిన భూషణోత్తరీయంబులం గని రాముండు వగచుట

క.

జనవర యాసతితొడవులు, తనరఁగ నే డాఁచినాఁడఁ దద్భూషలు దె
మ్మని యానతిచ్చిన వెసఁ, గొనివచ్చెద ననిన వేగ గొని ర మ్మనుడున్.

53


క.

దినకరతనయుఁడు రయమునఁ జని గిరిగుహఁ జొచ్చి యందు జతనంబునఁ డాఁ
చినభూషణములు ప్రమదం, బునఁ గొనివచ్చి రఘువిభునిముందటఁ బెట్టన్.

54


క.

ఉల్లము జ ల్లన ముఖమునఁ, బెల్లుగ బాష్పములు దొరఁగఁ బ్రేమంబున హా
వల్లభరో యనుచును మది, పల్లటిలన్ రాముఁ డుర్విఁ బడి మూర్ఛిల్లెన్.

55

వ.

ఇట్లు మూర్ఛిల్లి యల్లన దెప్పిఱిలి యాభూషణంబుల నుత్తరీయంబును బోలం
గనుంగొని.

56


సీ.

మాసియున్నవి యిట్లు మండనంబులు నేఁడు, కాంతమైచాయతోఁ గలయలేక
మణిహార మంగనమధురోష్ఠరుచిఁ బాసి, యురురాగహీనమై యున్న దిపుడు
భాసురహారముల్ ప్రభ దప్పి యున్నవి, ముదితముఖజ్యోత్స్న యొదవకునికిఁ
బ్రియ నెమ్మిఁ బదములఁ బెట్టక యున్న నో, ళ్లడఁగియున్నవి నేలహంసకమ్ము
లనుచు రాముఁడు ప్రేమతో నావిభూష, ణములు పలుమాఱు వీక్షించు నానఁ దూలి
కేల నకున నిడుకొని సోలు సొగయు, బాష్పములు నించు శోకించుఁ బలవరించు.

57


వ.

మఱియు నాయుత్తరీయంబుం గనుంగొని.

58


సీ

ఘనరతిశ్రమజాతకఘర్మాంబు లారంగ, నతివకు వీవన వగుదు గాదె
ప్రణయకోపాన నన్ బాసి తా నున్నచో, నంబుజాస్యకుఁ దల్ప మగుదు గాదె
కనుఁబాటు గాకుండ వనిత చన్దోయికి, నంచితప్రతి సీర యగుదు గాదె
తరుణికిఁ బేరెండ తాఁకకుండంగ సి, తాతపవారణ మగుదు గాదె
యట్టియవనిజఁ బాసి నీ వకట దూర, మెట్లు వచ్చితి నాకడ కెలమి మిగుల
ననుచు నయ్యుత్తరీయంబు నల్లఁ దిగిచి, కప్పుకొని బాష్పధారలు గ్రమ్మ వగచి.

59


వ.

తనపార్శ్వంబున నిరంతరధారాళబాష్పధారామగ్నుం డగుచు శోకించుచున్నల
క్ష్మణుం గనుంగొని.

60


చ.

జనకజమేన నేమమున జానుగ నుండెడునుత్తరీయము
న్వినుతవిభూషణంబులును నిర్మలకాంతులుఁ జాల లేక నేఁ
డనుజుఁడ నేల నున్నయవి యక్కట సూచితె సీత యాత్మలో
నెనసిన లజ్జ నింక నివి యేటికి నా కని పాఱవైచినన్.

61


క.

అని పలికి యాత్మ నుర్వీ, తనయం దలపోయుచున్నఁ దద్దయుఁ జిత్తం
బున భ్రమ గప్పిన నానతి, తనముందట నున్నయట్లు తనకుం దోఁపన్.

62


క.

అంగన యీతొడవులు నీ, యంగములకుఁ జాల వదలు లై యుండిన నే
మంగళముగఁ దాల్పఁగ భూ, రంగమునను వైచి చనితె రయమున నకటా.

63


క.

మక్కువ నేఁ దొడఁ గోరిన, నక్కట యీభూషణములు హరిణేక్షణ మున్
తక్కువ లై పట్టక యిపు, డెక్కువ లై యున్నకత మ దేటికిఁ జెపుమా.

64


వ.

అని పలికి యధికరోషావేశంబున.

65


క.

హాలాహలభీకరబల, కాలవ్యాళంబువోలె ఘననిశ్వాసా
భీలుం డగుచును రఘుభూ, పాలుం డి ట్లనియె నపుడు భానుజుతోడన్.

66


ఉ.

ఎక్కడఁ గంటి సీతఁ బ్రియ, నెక్కడికిం గొనిపోయె రక్కసుం

డెక్కడ నుండు వాఁడు ప్లవగేశ్వర చెప్పుము నాకు నాఖలున్
వ్రక్కలు సేసెదం దనువు వ్రచ్చెద నమ్ముల గ్రుచ్చెదం దల
ల్చెక్కెద నుక్కడంచి విదళించెద నొంచెద సంహరించెదన్.

67


వ.

అనవుడు సుగ్రీవుండు ప్రాంజలి యై రాముని కిట్లనియె.

68


మ.

జనపాలాగ్రణి శోకము విడువు ముత్సాహంబుతో జానకిం
గొనిరా యత్నము సేసెద సకలరక్షోవీరులం బంక్తివ
క్త్రునిఁ జక్కాడి భవత్పరాక్రమసుకీర్తుల్ వృద్ధిఁ బొందింపు మే
వినయప్రాంజలి నై సఖిత్వగతి నావేశించి ప్రార్థించెదన్.

69


చ.

ఉరుతరదుస్తరవ్యసన మొందినఁ బ్రాణభయంబుఁ బొందినన్
సురుచిరబుద్ధిసంయుతుఁడు శోకముఁ బొందఁడు దుఃఖపుంజముల్
బెరసిన నజ్ఞుఁ డెంతయును భీతి మునుంగును శోకవారిధి
న్భర మధికంబుగాఁ గలుగు నావ పయోధి మునుంగుకైవడిన్.

70


క.

శోకము సుఖముం జెఱుచును, శోకము తేజంబు నడచు శోకము బుద్ధిం
బోకార్చుఁ గాన దాలిమిఁ, గైకొని శోకంబు విడువఁగావలయు నృపా.

71


క.

జనవర వయస్యభావం, బున నీ కింతయును హితముఁ బొందిం చెద మ
న్నన నిన్నుఁ జూచి నాప్రా, ర్థన గైకొని శోక ముడుగు తగ నీ వనినన్.

72


క.

ఉరుబాష్పపూరముల నం, బరమున మార్జనము సేసి ప్రమదస్థితిభా
సురుఁ డగుచును సుగ్రీవునిఁ, బరిరంభణకేళిఁ దేల్చి పరమప్రీతిన్.

73


చ.

అనుమతి నెయ్యుఁడున్ హితుఁడు నైనవయస్యుఁడు సేయుకృత్యముల్
పొనరఁగఁ జేసి తీవు నినుఁ బోలెడు బంధుఁడు మాకు నిప్పు డెం
దును బరికింపఁగాఁ గలఁడె దుఃఖముఁ బాసితి నీహితోక్తుల
న్మనము గలంకదేఱె బ్రమ నస్థితి నెమ్మదిలోనఁ బొంగితిన్.

74


క.

మన మేవెరవున ధాత్రీ, తనయన్ వెదకుదము ఖలుని దశకంఠుని నే
యనువునఁ జని నిర్జింతము, మన మారఁగ నాకుఁ దెల్పు మర్కటవీరా.

75


క.

నీకుం గోరిక యెయ్యది, యాకోరిక సేయ నిక్క మగుశపథంబుం
గైకొని చేసెద ననవుడు, నాకపినాథుండుఁ గపులు హర్షించి రొగిన్.

76


క.

అంతట సుగ్రీవుఁడు మది, నెంతయు సంతోష మొంది యిమ్ముగ రఘుభూ
కాంతుఁడు నను రాజ్యశ్రీ, మంతునిఁ జేయు నని తలంచి మఱి రామునితోన్.

77


క.

నీవును నేనును గూడిన, దేవేశ్వరు రాజ్య మైనఁదృణలీలఁ గొనం
గావచ్చు ననిన నిజసం, భావితరాజ్యములు వోలఁ బడయుట యరుదే.

78


క.

వెలయఁగ నీతోఁ జెలిమిం, గలయుట నమరులకు నేను గ్రాహ్యుఁడ నైతిన్
వలసినబంధువ్రాతం, బులకు వయస్యులకుఁ జాలఁ బూజ్యుఁడ నైతిన్.

79


క.

నను నేన చెప్పనేరను, జనవర నీ కేను దగినసఖుఁడ నగుట భూ

జనులవలన నాగుణములు, విని యెఱిఁగెదు గాక నన్ను విశ్రుతఃపుణ్యా.

80


క.

నినుబోఁటిమహాత్ములు పో, ల నొనర్చిన చెలిమి నిశ్చలం బై యుండున్
వినుతాత్మధ్యానంబులఁ, దనరారెడు యోగిజనులధైర్యముఁబోలెన్.

81


క.

అరయఁగ సముఁడు నదోషా, కరుఁడును నగుసఖుఁడు పరమగతి చెలికొఱకై
సిరి విడుతురు దేశము విడు, తురు బంధుల విడుతు రెలమితో నార్యజనుల్.

82

సుగ్రీవుండు రామునితో నిజవృత్తాంతంబు చెప్పుట

వ.

అని పలికి సుగ్రీవుండు రామలక్ష్మణులం గన్నులారం జూచుచు నటఁ జని కుసు
మవిసరభరితయు లోలంబావృతయు నగుచుం జాల విశాల యగునొక్కసాల
శాఖ విఱిచి తెచ్చి రామభద్రునితో నాశాఖపైఁ గూర్చుండె హనుమంతుం
డపుడు వారిం జూచి మఱియొక్కభూరిసాలశాఖ విఱిచికొనివచ్చి యాశాఖపై
లక్ష్మణుం గూర్చుండఁబెట్టె నప్పుడు సుగ్రీవుండు బాష్పాకులలోచనుఁ డగుచు
శ్రీరామచంద్రన కి ట్లనియె.

83


మ.

బలిమిన్ నాప్రియపత్నిఁ దోఁచుకొని కోపక్రూరతన్ వీటిలో
పల నన్నున్ వసియింప నీక వెలికిం బాఱంగ వే తోలినన్
బలవంతుం డగువాలి కోర్వక భయభ్రాంతుండ నై చింత లో
నెలయన్ వందుచు నున్నవాఁడ నగతో నీఋశ్యమూకస్థలిన్.

84


క.

దేవ యనాథుఁడ నన్నుం, గావుము నామాన మనుడుఁ గాకుత్స్థుఁడు సు
గ్రీవ యుపకార మెఱుఁగుదు, నీవాంఛిత మార నీకు నెయ్యం బెసఁగన్.

85


చ.

కనదురురత్నపుంఖములు కాలభుజంగమహోగ్రముల్ మహా
శనిసదృశప్రభావములు షణ్ముఖకాననసంభవంబులున్
ఘనతరకంకపత్రములు గల్గిన యీశితసాయకంబులం
దునిమెద వాలి లీలఁ ద్వరతో నిల శైలముఁబోలెఁ గూలఁగన్.

86


వ.

అనవుడు సుగ్రీవుండు సంతోషితస్వాంతుండై శ్రీరామభూకాంతుఁ గనుంగొని.

87


క.

జనవర మర్మవిదారణ, కనదురుశితసాయకములఁ గాల్పుము వాలిన్
దినకరుఁ డుగ్రమరీచులఁ, గనలుచు లయవేళ జగముఁ గాల్చినభంగిన్.

88


వ.

అని పలికి వాలి పౌరుషధైర్యయశోజవంబులు వినిపించెద నవధరింపుము.

89


చ.

ప్రకటమదోద్ధతిన్ విపులపర్వతశృంగము లెత్తి వాని నిం
గికి నెగయంగ వైచి వెసఁ గేల వడిం బడఁ బట్టుఁ జింత నొం
దక యుదయంబుకంటె మును దక్షిణవారిధినుండి యుత్తరా
బ్ధికి నపరాబ్ధినుండి తొలిదిక్కు పయోధికి నేఁగు నిచ్చలున్.

90


క.

తనబల మెఱిఁగెడుతలఁపున, ననిమిషపతిసుతుఁడు వేగ మరుగఁగ నవ్వీ
రునిజవమున బహుతరఘన, వనతరుజాలములు విఱిగి వసుధం ద్రెళ్లున్.

91


సీ.

దుందుభి యనుపేరి దుష్టోగ్రమహిషంబు, హిమవంతమున కేఁగి హిమనగంబ

యుద్ధంబు నాతోడ నొనరింపు మనవుడు, మదిలోనఁ దలపోసి మత మెఱింగి
తన్నుఁ జంపక యుండఁ దక్కొరుచే వానిఁ, జంపింపఁ దలపోసి శైల మనియె
నీతోడ యుద్ధంబు నెఱిఁ జేయ నేఁ జాలఁ, గయ్యంబు నీతోడఁ గడఁగి చేయ
నాలి చాలుఁ గిష్కింధ నవ్వాలి యుండు, నేఁగి యావాలిమధువన మీవు సొచ్చి
మధువుఁ జెఱుపంగ నేతెంచు మద మడంచు, విజయుఁ డై వాలి నినుఁ గాచి విడుచునొండె.

92


చ.

అనవుడు వాఁడు భీమగతి నార్చుచు వానరనాథుప్రోలికిం
జని రణకేళికిం బిలువఁ జండపరాక్రమశాలి వాలి చ
య్యనఁ జనుదెంచి దుందుభి నుదగ్రతఁ బట్టి వధించె వానియా
ఘనధవళాస్థి యున్నది ప్రకాశముగా రజతాద్రికైవడిన్.

93


క.

భూనాయక దుందుభి యను, వానికళేబరము నెత్త వాలి యొకం డౌ
నే నొకఁడ నగుదుఁ దక్కిన, వానికి నాడొక్క నెత్త వచ్చునె జగతిన్.

94


ఉ.

ఇట్టిబలోగ్రశౌర్యముల నేచినవాలికిఁ గోప మాత్మలోఁ
బుట్టినయప్డు పౌరుషముఁ బూనిన సర్వము సంహరించు ము
న్ముట్ట నతండు విక్రమము నూల్కొన నాజికిఁ జేరకుండ నా
తట్టున నొక్కయమ్మునన దక్షతఁ జంపుము నీవు నావుడున్.

95


క.

లీల నగి లక్ష్మణుఁడు నయ, శీలత నేకార్య మిపుడు సేసిన నే మ
వ్వాలిని జంపఁగ నోపుట, నీలో నమ్మెదవు నీవు నిక్కము గాఁగన్.

96


వ.

నావుడు సుగ్రీవుం డి ట్లనియె.

97


ఉ.

పంబినశక్తి వాలి కడుబాతిగ ముందట నున్నయేడుతా
ళంకుల నోలి నొక్కటిగ లావున నల్లనఁ బట్టి వానిప
ర్ణంబులు దూసివైచు వడి రాముఁడు చిత్రము గాఁగ నొక్కయ
స్త్రంబునఁ దత్పలాశములు సర్వము నుర్విఁ బడంగ నేసినన్.

98


క.

ఆలమున వాలిఁ జంపఁగఁ, జాలు పరాక్రమము రామచంద్రునకు నతి
స్థూలంబు గాఁగఁ గల దని, నాలో నిశ్చయము గాఁగ నమ్మెద నెలమిన్.

99


వ.

అని పలికి శోకార్తుం డగుచు మఱియు ని ట్లనియె.

100


శా.

కాంతం గోల్పడి తద్వియోగశిఖ నంగం బంతయున్ వేఁగ న
త్యంతార్తిన్ విలపించెద నిలువ లే కస్తోకశోకుండ నై
యంతర్దుఃఖము గాల్చుచున్నది మదీయస్వాంతమున్ దుఃఖసం
క్రాంతిం బొందిననాకు నీవ గతి యింకన్ రామభూనాయకా.

101


ఆ.

కరము సాఁచి యగ్ని కరిగాఁగ సఖ్యంబు, చేసినార మగుటఁ జెలిమి దలఁచి
నాదుదుఃఖ మార్పు నాదుఃఖవశమునఁ, బలుకుచున్నవాఁడ వలసినట్లు.

102

క.

అనుచుం బాష్పాకులలో, చనుఁ డై దుఃఖమున మనము చలనం బొందన్
వనజాప్తసుతుఁడు మనుజేం, ద్రునిసన్నిధి మాట వలుకఁ దోఁపక యుండెన్.

103


వ.

అ ట్లుండి.

104


క.

జనపతి దను నూరార్చినఁ, గనుఁగొనలం దొరఁగు బాష్పకణములు ధైర్యం
బున నాఁచి యున్నయశ్రులు, గొనకొని పోఁదుడిచి యతఁడు కువలయపతితోన్.

105


క.

తనరాజ్యం బేఁ జేయఁగ, ఘనబలుఁ డగువాలి వచ్చి కడుఁగోపముతో
ననుఁ గని భర్జించుచుఁ జ, య్యనఁ బురి వెడలంగ నడిచె నతిదుర్మతి యై.

106


క.

ప్రాణముల కెక్కు డగునా, ప్రాణేశ్వరి దోఁచికొనియెఁ బట్టి మదాప్త
ప్రాణుల బంధించెను మ, త్బ్రాణంబులు గొనఁగ నెపుడుఁ బయికొనియుండున్.

107


శా.

నన్నుం జంప ననేకవానరుల యుత్నం బారఁ బుత్తెంచినం
గన్నారం గని వారిఁ జంపితిఁ గడంకం గాన నాశంక యా
త్మ న్నిండారఁగఁ జేసి మీ రిచటికానన్ వచ్చి యుండంగ మీ
మ్ము న్నెయ్యంబునఁ గానరా వెఱచితి ము న్నేను భీతుండ నై.

108


క.

ఈకపు లనిలజముఖ్యులు, నాకు సహాయులుగ బ్రతికినాఁడన్ వీరల్
సేకొని రక్షింతురు విను, పైకొని నే నెచట నున్నఁ బాయరు నన్నున్.

109


వ.

ఈమాటలు వేయు నేల వినుము.

110


శా.

కాలాభీలపటుప్రతాపుఁడు నుదగ్రక్రూరదోస్సారుఁడుం
జాలన్ శత్రుఁడు నాకు నెప్పుడు మనశ్శల్యంబు నై యుండు న
వ్వాలిం గూల్పక నాదుదుఃఖ మొకటన్ వార్యంబు గా దెవ్వఁ డ
వ్వాలిం జంపు నతండు నాసఖుఁడు జీవత్రాయకుండుం జుమీ.

111


క.

సుఖదుఃఖము లొందినయెడ, సఖునకు సంతతము సఖుఁడ సద్గతి గాఁడే
సఖుఁడవు నా కీ వగుటను, నిఖిలముఁ జెప్పితిని దెలియ నీకు నృపాలా.

112


వ.

నావుడు రాముండు సుగ్రీవుం గనుంగొని.

113

మాయావి యనుదనుజుని వృత్తాంతము

ఉ.

వాలికి నీకు నేమిటికి వైరము పుట్టె వినంగఁ గోరెదం
బోలఁగఁ జెప్పు మేను విని భూరిబలాబలచింత సేసి య
వ్వాలి వధించి నీమనము వంత నడంచెద వేగ నావుడుం
జాలఁగ సంతసించి రెద సర్వవనాటులు భానుసూనుఁడున్.

114


మ.

అటు సంతోషము నొంది భానుతనయుఁ డారాముతో ని ట్లనుం
బటుబుద్ధిన్ విను చెప్పెద సకలముం బాలించి మాతండ్రి యా
దట రాజ్యం బొనరించి చన్న పిదపం దన్మంత్రు లేపారుమ
ర్కటరాజ్యంబున కెల్ల వాలి నధిపుం గావించి రర్హంబుగన్.

115


క.

వాలియు వానరరాజ్యముఁ, బాలించుచు నుండెఁ గరము ప్రమదంబున న

వ్వాలియు ననుఁ బంచినపని, యోలిం బ్రియ మందఁ జేయుంచుండుదు నంతన్.

116


మ.

తనకున్ వాలికిఁ గామినీకరవిరోధం బాత్మ నత్యంత మై
యునికిన్ దుందుభియగ్రపుత్రుఁడు బలాత్యుగ్రుండు మాయావి యన్
దనుజుం డుద్ధతి రాత్రిమై జనులు నిద్రం బొందఁ గిష్కింధకున్
ఘనగర్వంబున వచ్చి వాకిట మహాగంభీరుఁ డై యార్చుచున్.

117


క.

ఆలం బుద్ధతిఁ జేయఁగ, వాలిని ర మ్మనుచుఁ బిలువ వాలియుఁ గోపా
భీలముఖుండును సత్త్వవి, శాలుఁడు నై వానిమీఁదఁ జనుసమయమునన్.

118


మునుకొని యేను గాంతలును మ్రొక్కుచు నడ్డపడంగ నందఱం
గనుఁగొని పాయఁ ద్రోచి యధికకత్వరఁ బోవఁగ నన్న గాన యే
పున వెనువెంట నేను నటఁ బోవఁగ నిద్దఱఁ జూచి భీతుఁ డై
దనుజుఁడు పాఱఁ జొచ్చె వడి దట్టపువెన్నెల గాయ నయ్యెడన్.

119


క.

తెరువునఁ బొడగనవచ్చినఁ, ద్వరితగతిం బాఱి వాఁడు తల్లడమున మే
దురతరతృణవృతభూకం, దరము వడిం జొచ్చె నేముఁ దడయక వెంటన్.

120


వ.

ఆబిలద్వారంబుఁ జేరితి మప్పుడు తనముందట నున్న నన్ను నవ్వాలి యి ట్లని
నియోగించె.

121


శా.

ఈమాయావి వధించి గెల్పుసిరితో నే వచ్చునందాక నీ
వీమై నేమఱ కీగుహాముఖమునం దేపారఁగా నుండు మం
చామోదంబున నన్నుఁ బెట్టి బిల ముద్యచ్ఛక్తిమైఁ జొచ్చె సు
త్రామాత్మోద్భవుఁ డంత నేఁడు గడవం దా రాక యున్నన్ మదిన్.

122


వ.

ఇది యేలొకొ రాఁ డని భీతిం గలంగుచున్నంత.

123


ఉ.

ఫేనిలరక్తపూరములు పెల్లుగఁ గ్రమ్మె గుహాముఖంబునన్
దానికి దుఃఖ మందుచును దారుణగర్జితభూరినాదము
ల్దానవుఁ డార్వ వింటి మఱి లావఱి కూలినవాలియాతుర
ధ్వానముఁ బోల వింటి విని తద్దయు దుఃఖము నన్ను ముంచినన్.

124


క.

తాలిమి సెడి మతి లేమిని, వాలి హతుం డయ్యె ననుచు వైరులు నాపై
నోలిఁ జనుదేరకుండఁగ, శైలము గుహవాతఁ బెట్టి సముచితభంగిన్.

125


క.

వాలికిఁ దిలోదకము లిడి, వాలినవగతోడఁ బురికి వచ్చిన నంతన్
వాలి మృతుఁ డయ్యె నన విని, పోలఁగ రాజ్యమునకుఁ బ్రభుఁడు లే కునికిన్.

126


క.

పౌరులు మంత్రులు నన్నున్, గారవమునఁ బట్టభద్రుఁ గావించిరి పెం
పారఁగ నేనును ధర్మా, చారంబున రాజ్య మఖిలసమ్మతిఁ జేయన్.

127


మ.

ఘనసత్త్వంబున వాలి వాలి కుహరాగారంబునం దున్నయా
దనుజుం బట్టి వధించి తద్బిలమువాతన్ రాయి త్రోపాడి యే
పునఁ గిష్కింధకు వచ్చి రాజ్యమహిమం బొల్పొందునన్నుం గనుం

గొని రక్తాయతనేత్రుఁ డై పలుమఱుం శోధించి భర్జించుచున్.

128


ఉ.

తప్పులు పెట్టి నాకడఁ బ్రధానులు బద్ధులఁ జేయ ధర్మపుం
జొప్పు దలంచి యగ్రజుఁడు సూడఁగఁ దండ్రిసమానుఁ డంచు నే
మప్పుడు వాలిఁ జంపఁగ సమర్థుల మయ్యును సైఁచి గౌరవం
బొప్ప నమస్కరించి యుచితోక్తులు పల్కుచు సంభ్రమంబునన్.

129


మ.

కర మొప్పారఁగఁ బట్టినాఁడ నిదె ముక్తాకీలితచ్ఛత్రచా
మరముల్ గైకొని నీవె రాజవు మమున్ మన్నింప నాథుండవుం
బరిపాటిం దగ నీవు లేనియెడ నీపట్టంబు నీమంత్రు లి
చ్చిరి నా కింతయు నీదురాజ్య మిది వే చేపట్టు నేఁ బోయెదన్.

130


ఉ.

మండితబుద్ధి నన్నుఁ గృప మానుగఁ జూడుము రిత్త నాపయి
న్మండకు మాగ్రహం బుడుగు నాథ యనాథుఁడ నైననాకు నా
థుండవు నీవ నీకు జయదుందుభిపుత్రునిఁ గూరశత్రు ను
ద్దండతఁ ద్రుంచి తెంతయు ముదంబునఁ బొందితి నీకు ద్రోహిగాన్.

131


క.

ననుఁ గనుఁగొని కోపంబునఁ, గనలెడునిన్నుం బ్రసన్నుఁ గావించెద మ
జ్జనకుండవు నగ్రజుఁడవు, నను మన్నింపు మని పెక్కునయమార్గములన్.

132


వ.

ఏ నెంత వేఁడిన లెక్కగొనక.

133


క.

సచివులఁ బ్రజలను బంధుల, నుచితగతిం జేరఁ బిలిచి యుక్తముగా నా
వచనములు మీరు వినుఁ డని, యచలచరాధీశుఁ డనియె నందఱు వినఁగన్.

134


సీ.

మాయావి యనువాఁడు మత్పురి కేతెంచి, కయ్యంబు నాతోడఁ గడఁగి చేయఁ
గడిమి ర మ్మని పిల్వఁ గడు నల్గి వానిపై, నేఁగంగ నావెన్క నిససుతుండు
తానును జనుదేర దనుజుఁ డిద్దఱఁ జూచి, భీతుఁడై వడిఁ బాఱి బిలము సొచ్చె
బిలమువాకిటి కేము పృథువేగమునఁ బోయి, యే వచ్చునందాఁక నిచట నుండు
శత్రుఁ బరిమార్చి వచ్చెద శౌర్య మెసఁగ, ననుజ నీ వని పల్కి త న్నచట నునిచి
బిలము వెసఁ జొచ్చి మాయావిఁ గలయ వెదకి, కాన కేఁడుకాలమునకుఁ గంటి నతని.

135


చ.

కని దనుజున్ సహాయులను గ్రన్ననఁ జంపి తదీయశోణితం
బున గుహ నిండుటం బురికిఁ బోవఁగ వాకిలి గానరాక నా
మనమున దుఃఖ మంది తను మాటికిఁ బేర్కొని చీరి చీరి యో
యనుతగుమాట లేక భయ మారఁగ నల్గడఁ జూచి యాత్మలోన్.

136


క.

నారాజ్యము గొన నెప్పుడుఁ, గోరుచు మది నుండు వీఁడు కుటిలుఁడు భ్రాతృ
స్ఫారస్నేహము దలఁపం, డారయ ననుఁ జిక్కఁదలఁచి యరిగెం బురికిన్.

137


మ.

అని యూహించితి నట్ల న న్నిటకుఁ బాయం జూచి వేగం బురం
బునకున్ వచ్చి మదీయరాజ్య మెలమిన్ భోగించుచున్నాఁడు దు
ర్జనశీలుండు ఖలుండు వీఁ డనుచుఁ దుచ్ఛస్వేచ్ఛ భర్జించుచున్

నను నేకాంబరుఁ జేసి పాఱ నడిచె న్శంకింప కుద్దండుఁ డై.

138


వ.

అట్లు వెడల నడిచిన.

139


మ.

అమరేంద్రాత్మజుచేత నాదుప్రియభార్యన్ రాజ్యముం గోలుపో
యి మదీయాగ్రజుచెంత నిల్వక భయాన్వీతుండ నై చాల దుః
ఖముతో భూస్థలి నెల్లఁ గ్రుమ్మరుచు శంకం బొంది యీఋశ్యమూ
కమునం దుండుదు వాలి కీనగము వీఁకం జేర రాకుండుటన్.

140


వ.

రఘువరా నీ వడిగినవృత్తాంతం బంతయుఁ జెప్పితి ననపరాధి నైననాకు వచ్చిన
దుఃఖంబు చూడు మఖిలలోకభయనివారకుండ వైననీవు నాదుఃఖంబు వాపి నన్ను
రక్షింపం దగు దనిన సుగ్రీవుం జూచి యల్లన నగుచు రామచంద్రమహీవల్లభుం
డి ట్లనియె.

141


క.

మదిలో వగవకు దినకర, సదృశము లగునియ్యమోఘ్మశాతాస్త్రములం
ద్రిదశేంద్రతనూజునిఁ ద్రుం, చెద నీకడ నిలిచినపుడ చేవఁ గపీంద్రా.

142


క.

అనవుడు నతఁ డావిభుతో నను నింద్రసమేతు లైన యమరుల నైనం
దునుమఁగఁ జాలుదు వాసవ, తనయుఁడు నీ కెంతవాఁడు దలఁప నరేంద్రా.

143


క.

మృగములలో సింహంబును, దగఁ బురుషులలోన నీవుఁ దగుశౌర్యమునన్
నెగడుదు జగముల సూర్యుం, డగణితతేజమున వెలుఁగునట్లు మహీశా.

144


వ.

అని మఱియు సుగ్రీవుం డి ట్లనియె.

145

దుందుభి యనుదనుజునిచరిత్రము

క.

నరవర దుందుభి యనువాఁ, దురునాగసహస్రపాదుఁ డుగ్రాసురుఁ డు
ద్ధురవీర్యోత్సేకంబున, వరగర్వమున భయ మేది వాలుచు నుండున్.

146


ఉ.

ఆదనుజుండు దర్పమున నంబుధిపాలికి నేఁగి నీవు నా
తో దొరయంగ సంగరము దోర్బల మారఁగఁ జేయు మన్న క్షీ
రోదధి వానితో ననియె యుద్ధము సేయఁగ నేను జాల నీ
కాదట ద్వంద్వయుద్ధము రయంబున నిచ్చు బలాఢ్యుఁ జెప్పెదన్.

147


క.

గిరివరుఁడు హరునిమామయు, నురునిర్ఝరకలితగుహుఁడు నున్నతవనభా
సురుఁడును నగుహిమవంతుఁడు, దుర మొప్పఁగఁ జేయు ననిన దుందుభి కడఁకన్.

148


చ.

హిమగిరికాననంబునకు నేఁగి తదీయగజప్రమాణవి
భ్రమధవళాశ్మముల్ దిశలఁ బాఱఁగఁ గొమ్ముల వీఁకఁ జిమ్ముచున్
సమధికఘోరనాదములు సారెకుఁ జేయుచు నుండ నాత్మశృం
గమున హిమాద్రి నిల్చి ననుఁ గట్టలుకం బగిలింప నేటికిన్.

149


క.

దానవ ని న్నెదురఁగ లే, నేను దపస్స్థితుఁడ వెఱతు నేపారఁగ నీ
తో నని సేయఁగఁ జాలెడు, వానిం జెప్పెద బలాఢ్యు వానరవీరున్.

150


క.

కిష్కింధ కేఁగు మాహవ, పుష్కలబలశాలి వాలి పృథుతరబాహా

నిష్కర్ష యమర నీతో, దుష్కరయుద్ధంబు సేయు దుర్జయలీలన్.

151


వ.

అని పల్కిన.

152


చ.

ఘనతరనీలమేఘనిభగాత్రము నాతతశాతశృంగముల్
దనరఁగ సైరిభాకృతి యుదగ్రతఁ దాలిచి భూరి దుందుభి
స్వన మెసఁగించుచుం బ్రథితసత్త్వుఁడు దుందుభి వాలిప్రోలికిం
జని యట వాకిటన్ మలసి సర్వవనాటులుఁ తల్లడిల్లఁగన్.

153


వ.

క్రొక్కారుమొగులునుంబోలె గర్జిల్లిన.

154


క.

కింకఁ దదీయధ్వని విని, పంకజలోచనలుఁ దానుఁ బ్లవగేంద్రుఁడు ని
శ్శంకఁ జనుదెంచెఁ దారా, సంకలితుం డైనపూర్ణచంద్రునిభంగిన్.

155


వ.

అట్లు చనుదెంచి గనుంగొని.

156


క.

దుందుభి ని న్నెఱుఁగుదు నేఁ, గ్రందుగ వాకిట ని దేల గర్జించెదు వీఁ
కం దొలఁగుము ప్రాణంబులు, పొందుగ రక్షించుకొనుచుఁ బొ మ్మెటకైనన్.

157


వ.

అనిన వాఁడు కోపసంరక్తలోచనుం డై వాలిం గనుంగొని.

158


ఉ.

కాంతలముందటన్ మిగుల గర్వము లాడుట పాడి గాదు నీ
పంత మెలర్ప నా కిపుడు భండన మిమ్ము మదీయభూరివి
క్రాంతి యెఱింగె దాజి నటు గాక సహించితిఁ గోప మేను నీ
కాంతలు నీవుఁ గామితసుఖంబులఁ బొందుము రాత్రి నిండఁగన్.

159


ఆ.

సైఁపరాని యధికశత్రువీరుని నైన, మత్తుఁ డై ననుఁ బ్రమత్తుఁ డైన
సుప్తుఁ డైన రాత్రిఁ జొచ్చిన యామీఁదఁ, జేరి చంప రలిగి శూరవరులు.

160


మ.

అని పల్కం బ్రహసించి భీకరబలుం డవ్వాలి యాదైత్యుతో
నను యుద్ధంబున మత్తుఁ డై యతఁడు ప్రత్యర్థి ప్రభుప్రాణముల్
గొనఁగా నప్పుడు మత్తుఁ డీతఁ డని నీకున్ భీతి వ ర్తింపఁగా
నను వీక్షించి యెఱింగె దీ వనుచుఁ జండక్రోధసంరంభుఁ డై.

161


క.

తార మొదలయినతనప్రియ, నారులఁ దొలఁగంగ ననిపి నాకేశుఁడు చె
న్నారఁగ నిచ్చిన కాంచన, హారం బటు వుచ్చి పెట్టి యతివేగమునన్.

162


చ.

బలువిడి తోడ వచ్చి ఘనపర్వతసన్నిభుఁ డైనదుందుభిన్
బల మఱఁ గిట్టి శృంగములు పట్టి కుదించి సముల్లసద్భుజా
దళపటుశక్తితో సకలకరంధ్రములన్ రుధిరప్రవాహముల్
వెలువడఁ దచ్ఛరీరము భువి జలదధ్వని మ్రోయుచుం బడన్.

163


ఉ.

వాలి యుదగ్రసత్త్వమున వానిశరీరము నెత్తి పట్టి వే
తూలముఁబోలె యోజనము దూరము పాఱఁగఁ గాలఁ జిమ్మినం
గ్రాలుతదీయవక్త్రమునఁ గాఱెడు నెత్తుటఁ దొప్పదోఁగె ను
త్తాలతపస్సమాశ్రితమతంగమహౌకము ఋశ్యమూకమున్.

164

ఉ.

దానికి నాత్మలోపల మతంగమునీశ్వరుఁ డాగ్రహంబునన్
వానరనాథుఁ డై పరఁగు వాలి మదంబున వచ్చి యోట లే
కీనగ మెప్పు డెక్కు నపు డీలుగుఁ బొ మ్మని శాప మిచ్చె న
మ్మౌని ననుగ్రహింపు మని మానుగఁ బ్రార్థన చేసె వాలియున్.

165


వ.

అది మొదలుగ మునిశాపభయంబున వాలి యీదిక్కు చేర వెఱచుం గావున
నిశ్శంక నిగ్గిరిచెంత నేనును నామంత్రులుఁ జరియించుచుండుదు మదె వాలి
కాల నెత్తి పాఱం జిమ్మినదుందుభికళేబరం బాడొక్క నీవును బాదంబున నెత్తి
పాఱం జమ్ము పిమ్మట.

166


క.

ఆలమున వాలిఁ జంపఁగఁ, జాలు పరాక్రమము రామచంద్రునకు నతి
స్థూలమ్ము గాఁగఁ గల దని, నాలో నిశ్చయము గాఁగ నమ్మెద ననినన్.

167


క.

అమ్మెయి రాఘవుఁ డంగు, ష్ఠమ్మున లఘులీల నెత్తి శైలప్రతిమా
న మ్మగుదుందుభిఘనకా, యమ్ముం బదియోజనమ్ము లరుగం జిమ్మెన్.

168


వ.

దానికి నరుదందక సుగ్రీవుండు లక్ష్మణుం గనుంగొని.

169


తే.

వాలి యెత్తెడునాఁడు సర్వప్రతీక
ములును మాంసశోణితపూర్ణములుగు నునికి
దనుజుకాయ మెంతయువ్రేఁగు దలఁప నిప్పు
డస్థిమాత్రమ యగుట గల్పతరము.

170

శ్రీరాముఁడు సప్తతాళంబులం గూల్చుట

వ.

కాన రామచంద్రుం డీడొక్క యెత్తినయంత నీతనిశక్తి వాలిశక్తి కెక్కు డని నిశ్చ
యింపరా దిఁయ్యేడుతాళంబులు నొక్కశరంబునం దెగ నేసిన నప్పు డీతనిశక్తి
వాలిశక్తికి నగ్గలం బని నమ్మవచ్చు.

171


క.

అని కపినాథుఁడు పలికిన, జననాథుం డపుడు శైలచరనాథునకుం
దనసత్త్వము ప్రత్యయముగ, ఘనతరకార్ముకము లీలఁ గైకొని కడిమిన్.

172


చ.

ఘనధను వెక్కువెట్టి పటుకాండము నారి నమర్చి భూరిగ
ర్జనఁ దెగ నిండఁగాఁ దిగిచి సాయక మేసిన సప్తతాళముల్
తునిమి నగంబు గాఁడి యిలఁ దూఱి రసాతల మంటి చేతికిం
దనరఁగ వచ్చె హంసగతిఁ దచ్ఛర మెంతయు నాతతత్వరన్.

173


సీ.

అప్పుడు దెగిపడ్డకయాతాళములు సూచి, యచ్చెరు వందుచు నర్కసుతుఁడు
శిరమున నంజలిఁ జెన్నారఁ జేరిచి, మణికుండలాంచితమస్తకంబు
ధర మోవ భక్తితో దండప్రణామంబు, తగఁ జేసి సంగరోద్దండబలుని
సర్వాస్త్రకోవిదుఁ జండోరువిక్రమ, శౌర్యుని వరుణేంద్రసదృశు రాముఁ
జూచి సుగ్రీవుఁ డి ట్లను శూరవర్య, రామ యిట్టిది గలదె నీప్రదరశక్తి
బాణమొక్కటి తాళసప్తకము నురుల, సొరిదిఁ ద్రుంచి పాతాళంబు సొచ్చివచ్చె.

174

క.

జనవర నీఘనసత్త్వము, గనుఁగొంటిన్ వగలఁ బాయఁ గంటిని బ్రీతిన్
మనఁ గంటిని నీముందట, నని నెవ్వఁడు నిలువఁజాలు నతిశౌర్యనిధీ.

175


వ.

అనిన విని సంతోషించి రఘువరుండు సుగ్రీవుం గౌఁగిలించుకొని గారవించి
సుగ్రీవా నీ వీవనచరులతోడఁ గిష్కింధాద్వారంబునకు నడువు మిదె నేనును
వెనుక వచ్చెద ననుచుం గదలి సౌమిత్రియుఁ దానును సుగ్రీవుండును సకలవానర
సహితు లై కిష్కింధ చేర నరిగి యొక్కెడ నిలిచి ఘనవృక్షషండంబులు దమకు
నావరణంబులు చేసికొని సుగ్రీవుం జూచి నీ వింకఁ గిష్కింధాద్వారంబు చేరి వాలిం
గయ్యంబునకు నాహ్వానం చేసి నాదృష్టిపథంబునకు వచ్చునట్లుగాఁ జేయు మ
వ్వాలిం దునిమి నీమనోరథంబు గావించెద ననిన ముదం బంది యరవిందమిత్ర
న౦దనుండు కిష్కింధాద్వారంబున నిలిచి ప్రళయకుపితభైరవారావంబున నంబ
రంబు భేదిల్ల నార్చె నాసమయంబున.

176

వాలిసుగ్రీవుల ప్రథమయుద్ధము

ఉ.

ఆనినదంబు తత్కుహరమంతయు నిండ మహాభ్రగర్జిత
ధ్వానమొ నాఁగ వాలి విని దారుణరోషవశంబునం గనుం
గోనల నిప్పుకల్ నెఱయఁ గ్రూరత నాగుహ దాఁటి వచ్చి యా
భానుజుఁ దాఁకె బల్పిడుగుభంగి దిశల్ పగులంగ నార్చుచున్.

177


వ.

అప్పు డయ్యిరువురకును బుధాంగారకులకుంబోలె సంగరం బయ్యె నట్లయ్యిరు
పురుఁ గోపాటోపం బెసంగ.

178


ఉ.

నింగియు నేలయుం బగుల నిష్టురభంగిఁ జెలంగి యార్చుచుం
బొంగి పదోగ్రఘట్టనల భూమి చలింపఁగఁ బాఱుతెంచుచున్
జంగమభూరిశైలములచాడ్పునఁ జేరుచు ఘోరమత్తమా
తంగయుగక్రమంబుల మృదంబున నొండొరు వీఁకఁ దాఁకుచున్.

179


వ.

మఱియు.

180


మ.

కడిమిఁ గడంగి ఘోరపవికల్పతలంబుల రక్తపూరముల్
వెడల శరీరముల్ వగుల వ్రేయుచు వజ్రనిపాతముష్టులం
బడ వడి గ్రుద్దుచున్ నఖరకపంక్తులు వ్రచ్చుచుఁ బట్టఁ జేరుచుం
బొడుచుచుఁ దన్నుచుం బొడిచి పోవుచుఁ దాఁకుచుఁ బోరుచున్నెడన్.

181


క.

ఘనతరకోదండంబున, సునిశితసాయకముఁ బూని శూరత్వమునన్
జననాథాగ్రణి వాసవ, తనయుని రవితనయుఁ బోలఁ క దాఁ గనుఁగొనుచున్.

182


చ.

ఇతఁడు సురేంద్రపుత్రుఁ డని యేయఁగ బాణము నారిఁ బోసి కాఁ
డితఁడు దినేంద్రపుత్రుఁ డని యేయక క్రమ్మఱఁ జూచి రాఘవుం
డితఁ డగు వాలి యంచుఁ దెగ యేవునఁ దీసి కడంకఁ జూచి కాఁ
డితఁ డతఁ డాతఁ డీతఁ డని యిద్దఱుఁ బోరఁగ సంశయంబునన్.

183

వ.

ఇట్లు సంశయంబున నరేంద్రుం డేయ కున్నెడ వాలి సుగ్రీవునిఁ బాణితలముష్టి
ప్రహారంబులఁ జదియ నడిచిన.

184


చ.

అనిమొన వాలిచేత బలమంతయుఁ దూలి భయాకులుండు భం
జనయుతుఁడుం బ్రహారచయజర్జరితాంగుఁడుఁ గ్లాంతచిత్తుఁడున్
ఘనతరరక్తసిక్తపటుకాయుఁడు నై సుమహాజవంబుతో
నినజుఁడు ఋశ్యమూకమున కేఁగె నరేంద్రునిదిక్కు సూచుచున్.

185


వ.

అట్టియెడ.

186


క.

అనిలతనూజుఁడుఁ దానును, ననుజుఁడుఁ గూడంగఁ రాముఁ డర్కజుకడకుం
జని సేమంబున వచ్చితె, యనవుడుఁ దల వాంచి యనియె నవ్విభుతోడన్.

187


క.

జనవర నీపలికినవిధ, మునఁ బోరిన్ వాలి చావ మోఁది కృపం జే
కొని విడిచిన సేమంబునఁ, జనుదెంచితి నీదుపలు కసత్యము గాదే.

188


వ.

అని వెండియు.

189


ఉ.

చెచ్చెర వాలి నాహవము సేయఁగఁ జీరుము వాలి నీపయి
న్వచ్చినఁ జంపువాఁడ నని నాకడ నాడితి నన్ను లావు మైఁ
జొచ్చి యతండు నొంపఁ గని చొప్పడ వచ్చితి వాలిచేత నేఁ
జచ్చినమీఁద వాలి ననిఁ జంపఁగ నేటికి నీవు నావుడున్.

190


వ.

శ్రీరాముం డతిదీనుం డగుచు రవిసూనుం గనుంగొని కోపం బుడిగి వినుము చెప్పెద.

191


క.

స్వరములు నురములు శిరములుఁ, గరములుఁ బెందొడలు మెడలుఁ గన్నులు వెన్నుల్
సురుచిరపదములు రదములు, నిరువురకుం జూడ నొక్కయీ డై యునికిన్.

192


క.

తొడిగిననాపటుబాణము, కడుఘోర మమోఘ మంతకర మగుటను నే
విడువను దొడిఁబడ నెవ్వనిఁ, గెడపునొ యని సంశయమున గిరిచరవర్యా.

193


వ.

అని పలికి రామచంద్రుండు లక్ష్మణుం గనుంగొని.

194


ఉ.

ఈనలినాప్తపుత్రునకు నే ననిఁ జూచి యెఱుంగునట్లుగా
జానుగ నానవా లిడుము చయ్యన లక్ష్మణ యంచుఁ బల్కినం
బూనిక గాఁగ నొక్కగజపుష్పపుమాలిక దెచ్చి చిన్నెగా
భానుతనూజుకంఠమున బాఁతిగఁ బెట్టె నృపానుజన్ముఁడున్.

195

సుగ్రీవుఁడు రెండవమాఱు వాలితో యుద్ధము సేయఁ బోవుట

వ.

అప్పు డాగజపుష్పమాలిక ధరియించి బలాకాంచితమాలాపరివృతజీమూతంబు
నుంబోలెఁ గంజాతాప్తతనూజాతుండు తేజరిల్లె రామచంద్రుండును గాంచన
భూషణభూషితం బగుచాపం బెత్తి యాదిత్యసంకాశంబును మహోరగేశ్వర
ప్రతిమానంబును మహేశ్వరశరసదృశంబును నగునసమశరంబు కేలం గ్రాలఁ ద
నముందట సుగ్రీవుండును వెనుక లక్ష్మణుండును హనుమంతుండును నలనీలతా
రప్రముఖహరియూథవులును బలసి యెతేరఁ గుసుమవిసరభరానతతరులుం బ్ర

సన్నాంబుప్రవాహసాగరగామినీమహానదులును గుహాప్రస్రవణనిర్ఝరంబులును
బలుశైలశిఖరంబులును వైదూర్యసదృశవర్ణపద్మకువలయప్రభృతిజలకుసుమం
బులును హంసకారండవచక్రవాకబకజలకుక్కుటాదిసలిలపక్షులుం గలతటాకం
బులును నానాపక్షికులకోలాహలకలితస్థలంబులును గలిగి గిరిసన్నిభంబు లయి
మదధారలు గండస్థలంబులం దొరఁగ శైలంబుల శీతదంతంబులం బగులఁ బొ
డుచు మత్తదంతావళప్రభృతిఘనసత్వంబులను వనచరఖేచరశైలచరశకుంతకు
లంబులను జూచుచుఁ ద్వరితగతి నేతెంచి ముందట నొక్కతరుషండంబుఁ బొడ
గని రామచంద్రుండు సుగ్రీవుం గనుంగొని నింగి వెలుంగు మేఘంబునుంబోలెఁ
బరివృతఘనసంకాశకదళీవనశోభితం బయనయీతరుషండం బెయ్యది యెఱుం
గఁ జెప్పు మనిన నినజుండు రఘువరున కి ట్లనుఁ గదళీతరువనపరివృతంబును సర్వ
మూలఫలోపభోగంబును జనశ్రమనిరాసకంబును గృతమునిజనవిశ్రమంబును
నగునియ్యాశ్రమంబునందు జననాథ మునులు సప్తరాత్రంబుల కొక్కవారం
బాహారంబు గొనుచు సమీరాహారులు నిర్జితేంద్రియులును నై సప్తశతవర్షం
బులు తపంబులు నేసి శరీరంబులతోన దివంబునకుం జనిరి వారితపఃప్రభావం
బునం దరువులు దుర్గమప్రకారంబునఁ బ్రాకారంబునుంబోలెఁ బరివృతంబులయి
యుండుట నియ్యాశ్రమంబు దేవేంద్రాదిసురలకు దురాధర్షం బయి యుండుఁ
బక్షులు నన్యవనచరంబులుం బ్రవేశింపకుండు దైవవశంబునం బ్రవేశించినఁ బు
నరావృత్తి లేకుండు నిచటఁ దూర్యగీతస్వనంబులు సకలకథలు మధురాక్షరంబు
లయి వినంబడు పరిమళమందపవనంబు లొలయుచుండు నిమ్ములఁ ద్రేతాగ్నులు
ను గానంబడు నేతదాశ్రమపరివృతవృక్షాగ్రంబుల గరుడప్రభంబు లైనకపోతం
బులు గానంబడు నమ్మునుల నుద్దేశించి కృతాంజలి వగుచుఁ బ్రణామంబు సేయు
మని పలికిన నమ్మహాతేజు లయినమునులగుఱించి రాముండు సలక్ష్మణుండై దండ
ప్రణామంబు లాచరించి సంతుష్టహృదయుం డై యాసప్తజనాశ్రమంబులు
దాఁటి యట దూరంబున బహుపాదపగుల్మమధ్యంబును బహువానరపరివృ
తంబును గాంచనతోరణమండితంబును దురాధర్షంబును నాతతధ్వజయంత్ర
ప్రాకారంబును వాలిపాలితంబును నగు కిష్కింధానగరంబు సేరి యచ్చట వృక్ష
పండావృతుం డై వన మెల్ల వీక్షించుచుండె నప్పుడు సుగ్రీవుండు బ్రహ్మాండం
బంతయు నిండ మహానాదంబు సేసి నీలజీమూతసంకాశుం డగు రామభద్రు
నాలోకించి యి ట్లనియె.

196


క.

నరనాయక కిష్కింధా, పుర మిదె చేరితిమి వాలిఁ బొలియించెద న
న్పరమప్రతిజ్ఞ సఫలముఁ, గర మొనరింపంగ వలయుఁ గాలములోనన్.

197


చ.

అనవుడు ని న్నెఱింగెద రయంబున నీగజపుష్పమాల లాం
ఛనముగ నీవు వాలిపురిఁ జయ్యనఁ జేరి గుహాముఖంబునన్

ఘననినదంబు భీకరముగా నొనరింపుము వాలి యామహా
ధ్వని విని సంగరంబున కుదగ్రసముద్ధతి వచ్చునట్లుగన్.

198


క.

శూరుఁడు శత్రునిగర్జన, మారఁగ విని సైఁప కలుక నడరును రిపుపై
నారులకడ బీరము మగ, వారికిఁ గడుఁబెద్ద యగుచు వాలుచు నుండున్.

199


వ.

కావున వాలి యధికశూరుండును దారాదిచారాన్వితుండును నీకు నజయ్యుండు
నగుట నీగర్జనంబు విని సైరింపక కోపాటోపంబున నిన్నుఁ బ్రహరింప సంగరం
బునకు వచ్చు వచ్చి నాదృష్టిపథంబునం బడిన వాలి నవలీల సమయించి నాప్రతి
న సఫలంబుగాఁ జేయుదు నని పలికిన నుత్సహించి రామునానతిఁ గిష్కింధా
ద్వారంబు చేరి ప్రళయామోఘమేఘాఘంబు లుఱిమినగతి భూనభోంతరాళం
బు పగుల నార్చె నప్పు డమ్మహానాదంబు విని బెగడి గోవృషంబులు పఱచె
సకలవనచరులు నాకులమానసు లయిరి మృగంబులు రణంబున జర్జరితాంగం
బు లయి విడివడినహయంబులకరణిం బఱచె ఖగంబులు క్షీణపుణ్యగ్రహంబు
లంబోలెఁ బుడమిం బడియె బిలంబుల మహానాదంబులు సెలంగె నాసమయంబున.

200


ఉ.

ఆనినదంబు వాలి విని యాగ్రహనిగ్రహచండభూరికో
పానల మాత్మలో నెరయ నగ్నికణంబుల నక్షు లీనఁగా
భానుజుమీఁద వేగమునఁ బాదహతిన్ ధర గ్రుంగ శారద
స్థానము దాఁటి పోవునెడఁ జయ్యన నడ్డము వచ్చి భీత యై.

201

వాలికిఁ దార హితోపదేశంబు సేయుట

శా.

వాలిం దార గవుంగిలించుకొని జీవస్వామి నీకుం గడున్
మే లేఁ జెప్పెదఁ గోపమున్ విడువు నెమ్మిన్ నాహితాలాపముల్
పోలంగన్ విను మర్కనందనుపయిం బోఁ జూచునుద్యోగ మీ
వ్వేళం బథ్యము గాదు నిల్వుము మదిన్ వీక్షింపుమా కర్జమున్.

202


మ.

అని నీచే నటు మోఁదులం బడి కడుం బ్రాణార్తుఁడై పాఱిపో
యినసుగ్రీవుఁడు క్రమ్మఱన్ భయము లే కేతెంచి ని న్నాహవం
బునకుం జీరఁగ రాక సూడ బలవిస్ఫూర్తిన్ నినున్ గెల్చి వే
తనుఁ గావం గలబల్లిదుం డొకఁడు మీఁదన్ లేక రాఁ డింతలోన్.

203


ఉ.

అంగదుచేత వింటి విను మత్తెఱఁ గర్కజుఁ డాత్మవాంఛ దీ
ర్పం గలవీరుఁగా నెఱిఁగి శ్రీరామునితోఁ దగ మైత్రి సేసె నా
రంగ దినేంద్రపుత్రునకు రామవిభుండు మహాసహాయుఁ డై
సంగడి వచ్చినాఁ డతఁడు సంగరకర్కశుఁడున్ బలాఢ్యుఁడున్.

204


చ.

అరబలసూదనుండు శరణాగతవత్సలుఁడున్ లసద్గుణా
కరుఁడు నజయ్యుఁడున్ విజయకర్మఠుఁడున్ రఘురాముఁ డాసహో
దరుఁడును నట్టివాఁడ రణదర్పమునం బటుచాపహస్తు లై

యిరువురు నిల్చినన్ హరిహరేంద్రులు నడ్డము గారు వారికిన్.

205


క.

సుగ్రీవుఁడు రామునకు న, తగ్రీవుం డగుట నీకుఁ దలఁకం డింకన్
విగ్రహ మాగ్రహమునఁ గొన, కుగ్రాంశుతనూజుతోడ నురుతరబుద్ధిన్.

206


మ.

పరఁగన్ భానుజు యౌవరాజ్యమునకుం బట్టంబు వే కట్టు మా
దరణీయుం డగునీసహోదరుని నందం బొంద మన్నింపు సు
స్థిరవైరం బనుజన్ముతోఁ దగదు శాంతిం బొందు రామక్షితీ
శ్వరుప్రా పొందిన భానునందను ననిన్ సాధింప రా దేరికిన్.

207


సీ.

మనయింటఁ గలసర్వమణిధనంబులు గొంచుఁ, గాకుత్స్థుఁ గాన నంగదునిఁ బుచ్చి
యారాముతో సంధి యతిభక్తిఁ గావించి, కొని నిర్భయంబున మనుట మేలు
కాదేనిఁ గిష్కింధ క కడువేగమున డించి, ఘనదూరదేశంబు చనుట లెస్స
యొండేని రఘురాముక్తినొద్దకుఁ బ్రాణముల్, పోషించికొన నీవు పొమ్ము బుద్ధి
నీవు దనపాలి కేఁగిన నృపతి నిన్ను, నాదరంబున మన్నించు మోద మెసఁగఁ
జేయు నీ కపకారంబు సేయఁ డాఘ, నుండు శరణార్థిజనరక్షకుండు గాన.

208


అని యిట్లు పెక్కుభంగులఁ, దనరఁగఁ బ్రియ మారఁ దార తజ్జ్ఞతఁ బలుకన్
విని వాలి నిరుత్తరుఁ డై, తనలోఁ దలపోసి కొంతతడవున కనియెన్.

209


క.

ఈకిష్కింధానగర, మ్మీకపిరాజ్యంబుఁ బాసి యే మనఁ జాలన్
నాకుం బ్రియ మిటు చెప్పితి, చేకొని హిత మగుట సంతసించితిఁ దరుణీ.

210


శా.

ఘోరాజిం బడ మోఁది పొ మ్మనిన నాకుం గాక భీతాత్ముఁ డై
దూరాద్రిస్థలి దిక్కు లేక రవిపుత్రుం డుండి దైన్యంబుతో
నారాముఁ బ్రణతాంగుఁ డై కొలిచెఁ గా కబ్జాస్యకై వ్రాలుచున్
వీరత్వంబు దొఱంగి తక్కొరుని సేవింపంగ నా కేటికిన్.

211


మ.

ఉరువింధ్యాద్రి కరంబులం బెఱుకని మ్ముర్వీశుఁ డేపారఁగా
ధరణీచక్రము ద్రిప్పనిమ్ము కనదుద్యత్పావకస్పర్ధి భీ
కరబాణంబులఁ జంద్రతారకయుతాకాశస్థలంబున్ ససా
గరభూలోకముఁ గాల్పనిమ్ము తుది శంకం బొంద నే నింతయున్.

212


క.

రామున కే నపరాధం, బేమియుఁ గావింప నాకు నింతయు నలుగం
డామహితాత్ముఁడు సుగుణో, ద్దాముఁడు సద్ధర్మవిదుఁడు తలఁకకు మబలా.

213


క.

ఉరుతరబలదర్పంబును, బరిపంథిరణంబు సేయఁ బైకొని పిలువన్
బిరు దఱి తొలఁగుటకంటెను, మరణం బెంతయును మేలు మగవారలకున్.

214


చ.

అనిమొనఁ బాఱిపోయి భయ మందక క్రమ్మఱ వచ్చి లజ్జ లే
కినజుఁడు నన్ను మార్కొనఁగ నేపునఁ దా మగవాఁడపోలె గ
ర్జన మొనరించుచున్ మదవశంబునఁ ద్రుళ్లెడు వానిప్రాణముల్

గొని విజయంబుతోఁ బురికిఁ గోరిక లారఁగ వేగ వచ్చెదన్.

215


చ.

మనమునఁ జింత నొందకయ మానముతోఁ జను తార నీవు నీ
వనితలు నన్న వందురుచు వాలినిఁ గౌగిటఁ జేర్చి కూర్మి నిం
చినమదితోఁ బ్రదక్షిణము చేసి నిజేశ్వరు గెల్వు మంచు దీ
వన లిడుచున్ గృహంబునకు భామలుఁ దానును నేఁగె నయ్యెడన్.

216


వ.

అతికుపితమానసుం డగుచుఁ గిష్కింధానగరంబు వెడలి యధికసంరంభంబున.

217


శా.

క్రూరవ్యాళముఁబోలె దీర్ఘభయదక్రోధోగ్రనిశ్శ్వాసముల్
ధీరోదగ్రతఁ బుచ్చుచున్ రిపుఁ గనక దిక్కుల్ పరీక్షించుచున్
దూరాగ్రస్థలిఁ గాంచె వాలి కనదత్యుగ్రాగ్నితేజున్ మహో
దారున్ సంగరవిక్రమోన్నమితరుంద్రగ్రీవు సుగ్రీవునిన్.

218


చ.

అటు పొడగాంచి గాఢముగ నర్కజుఁ జూచుచు భూరిముష్టి యు
ద్భటగతి నెత్తికొం చరిగి పైఁ బఱతేరఁగ భానుసూనుఁడుం
బటుబలశాలి వాలిఁ గని బంధురముష్టి ప్రచండభంగి ముం
దటఁ గనుపట్ట నెత్తికొని తద్దయు బల్విడి జేరె నేపునన్.

219

వాలిసుగ్రీవుల ద్వితీయయుద్ధము

క.

తనపయి నినజుం డురవడిఁ, జనుదేరఁగఁ జూచి వాలి చండక్రోధం
బున నోరి దురాత్ముఁడ యీ, ఘనతరముష్టి నినుఁ జంపుఁ గడువడి ననుడున్.

220


క.

అలుకన్ వాలిఁ గనుంగొని, జలజాప్రతసుతుండు వృక్షచర నీప్రాణం
బులు గొను వడి నీపిడికిలి, బలువడి నీనెత్తిమీఁదఁ బడియెడు ననినన్.

221


మ.

పిడు గత్యుద్ధతిఁ దాఁకు నిర్భరముగాఁ బెన్ముష్టి నవ్వాలి బల్
విడి సుగ్రీవునిపెన్నురంబు వొడిచెన్ వేదూలి భగ్నాంగుఁ డై
యొడ లెల్లన్ రుధిరంబునం గడియ రక్తద్గారముల్ సేయుచుం
గడుఘోరంబుగ నుండె ధాతుజలసిక్తస్థూలశైలాకృతిన్.

222


వ.

అ ట్లుండి తదనంతరంబ.

223


క.

అసమునఁ భానుజుఁ డాగ్రహ, మెసఁగఁగ నొకసాలవృక్ష మేపునఁ గొని య
య్యసమబలశాలి వాలిని, వస మఱి వసుధఁ బడ వీఁక వక్షము వ్రేసెన్.

224


వ.

ఇట్లు సాలతాడనంబున వివశుం డై యొక్కముహూర్తంబునకుం దేఱి యధిక
కోపంబున యుగాంతాగ్నియుంబోలె మండుచు నెగసి వచ్చి సుగ్రీవుతోఁ దలఁ
పడియె నప్పు డయ్యిరువురును.

225


క.

సరి బాహాబాహిని ని, ర్భరముష్టీముష్టి మఱియుఁ బాణీపాణిం
జరణాచరణి నఖానఖి, నురుదంతాదంతిఁ బోరి రుగ్రాకృతులై.

226


వ.

మఱియు నవ్వాలీసుగ్రీవులు సుపర్ణానిలబలవేగులు నితరేతరవిక్రమాక్రాంతు ల
ఘోరాకారులు నై బుధశుక్రులుంబోలెఁ బోరుచుండ నప్పు డవ్వాలిచేత బల

దర్పంబు లడఁగి సుగ్రీవుండు చిక్కుటయు వాలిసామర్థ్యంబును బరికించి రామ
చంద్రుం డధికవిక్రమాటోపంబున.

227

శ్రీరాముఁడు వాలిం గూల వేయుట

శా.

చండాశీవిషఘోరసాయకము చంచజ్జ్యాసమేతంబు గా
నిండారం దెగ దీసి లోకములు ఘూర్ణిల్లంగ రామక్షితీ
శుండాస్ఫోటన నేసె దుందుభిఘనక్షోణీధ్రదంభోళి ను
ద్దండారీంధనకీలి నిద్ధరణవిద్యాశాలి వాలిం బడన్.

228


తే.

అట్లు ఘోరాస్త్రపతితుఁడై యారణోర్విఁ, బంకమగ్నద్విపేంద్రంబుపగిది నున్న
వాలి బాష్పము దొరఁగ భూపాలుఁ గాంచి, యా ర్తరవమున నిట్లని యల్లఁ బలికె.

229


క.

తామసమునఁ బరుతో సం, గ్రామము గావింపఁగాఁ బరరాఙ్ముఖు నన్నున్
భీమామోఘశరంబున, నేమే లొందంగఁ బొంచి యే సితి వకటా.

230


క.

అని నీచేఁ జిక్కిననా, కును మదిలో వగవఁ దారకును వగవ సుహృ
జ్జనులకు వగవను నానం, దనుఁ డంగదునకును వగచెదం గాని నృపా.

231


ఉ.

అంగదుఁ జారురత్నకనకాంగదు నంగము చల్లగాఁ బరి
ష్వంగము చేసి వక్త్రజలజం బలరారఁగ ముద్దు లాడి యు
త్సంగమునందుఁ బెట్టుకొని శైశవ మాదిగ నెత్తి పెంచితిన్
మంగళమూర్తి నాప్రియకుమారునిఁ బాసెద నింక దైవమా.

232


వ.

అనుచు శోకించుచున్న సమయంబున.

233


సీ.

ఘనరక్తసిక్త మై తన శరీరము పుష్పి, తాశోకముంబోలె నమరువానిఁ
బుణ్యాంతమై దివంబుననుండి ధరకు వ, చ్చినయయాతియుఁబోలెఁ దనరువానిఁ
బ్రళయకాలమున భూతలపతితుం డైన, భానునికైవడిఁ బరఁగువాని
విలయానిలాహతి నిలఁ దూలి కూలిన, యింద్రధ్వజాకృతి నెసఁగువాని
నింద్రుపగిది దుర్ధర్షుఁ డుపేంద్రుకరణి, నఖిలశత్రుదుస్సహుఁడును నైనవాని
నింద్రపవిఘోరశరహతు నింద్రమూర్తి, నింద్రసుతు హేమమాలిఁ గపీంద్రు వాలి.

234


క.

కని రాముఁడు వేగంబున, ననుజుండుం దాను జేర నరిగినఁ గోపం
బున వాలి వారలం గని, యినకులనాయకునితోడ ని ట్లని పలికెన్.

235

వాలిరాఘవులసంవాదము

చ.

కనుకని నన్నదమ్ములకుఁ గయ్యము లౌ మఱి యప్డ చక్క నౌ
నని నపరాధిగాని నను నన్యరణాన్వితుఁ జంపఁ బాతకం
బనక ననున్ వధించినదురాత్ముఁ దృణావృతకూపనన్నిభున్
నిను నతిధార్మికుం డనుట నేరమి గాదె సుధీజనాళికిన్.

236

చ.

అనఘుఁడు పుణ్యశీలుఁడు గృపాన్వితుఁ డుత్తమవంశజుండు స
జ్జనహితశీలుఁ డార్యుఁ డని సర్వజనంబులు నిన్ను నెన్నఁగాఁ
జన విని నమ్మి తార నను సమ్మతిఁ బోవకు నాఁగ వచ్చి నీ
ఘనవిశిఖంబుపా లయితి కార్య మెఱుంగక మోసపోయితిన్.

237


క.

విను రాజఘ్నుఁడు నన్నకు, మును పెండిలియైనవాఁడు ముచ్చును గోహిం
సనకరుఁడు విప్రహరుఁడు, న్జనహంతయు నాస్తికుండు నరకప్రాప్తుల్.

238


క.

తరుచరరాజును నన్నుం, బరిమార్చితి నీవు సత్సభాస్థలమున ని
ద్దురితము వాయఁగ నీకుం, బురుషార్థముఁ గాఁగ నెట్లు బొంకెదు పోలన్.

239


క.

ఇల బ్రహ్మక్షత్రియులకు, నలువుగ భక్ష్యములు పంచనఖములు గలజీ
వు లయిదు శ్వావిత్కూర్మం, బులు మఱి గోధియును శశకమును శల్యకమున్.

240


క.

నినుబోఁటిధర్మపరు లగు, ఘనులకుఁ గపితోలు దాల్పఁగా దస్థి కరం
బున ముట్టరాదు మాంసం, బు నమలఁ గా దేల నన్నుఁ బొలియింపంగన్.

241


క.

నీ వొకభూనాథుఁడ వే, నీ వేలెడుభూమి యెల్ల నిష్ఫల గాదే
కేవలషండునకును శీ, లావృత యైనసతి పత్ని యైనవిభాతిన్.

242


క.

జననుతపుణ్యుఁడు దశరథ, జననాథుం డిట్టిపాపజాతిఁ గృపాదూ
రుని సాధుబాధకాటో, పుని నిను నేమికొఱ గాఁగఁ బుట్టించె నొకో.

243


క.

అతిగూఢచరితుఁ గపట, వ్రతు నినుఁ గాన కనిఁ బాపవశమున ఘనద
ర్పితుఁ డగునీచేతం జ, చ్చితి నిద్రితనరుఁడు పాముచేతంబోలెన్.

244


క.

ననుఁ గానకుండఁ గపటం, బునఁ జంపితి గాక నీవు భుజబలమున నేఁ
గనుఁగొన ననిమొన నిలిచిన, నిను నంతకుఁ గూర్చి పుచ్చనే యవలీలన్.

245


క.

ధరణిజఁ జెఱ పట్టినని, ర్జరరిపుఁ డగు రావణుఁడనె రాజ్యము గొని నిన్
బురి వెడలఁగఁ ద్రోయించిన, భరతుండనె నీవు నన్నుఁ బగగొని చంపన్.

246


క.

విను నృప యేఁ జావకమున్, నినజునకు నాదురాజ్య మేలఁగఁ దగునే
యని వానికినై తగ వఱి, ననుఁ జంపితి గాక నీ వనయమార్గమునన్.

247


చ.

జనవర నన్నుఁ బంచినఁ బ్రచండబలంబునఁ బట్టి పంక్తివ
క్త్రుని మెడగట్టి నీకడకుఁ దోడ్కొని ముందటఁ దెచ్చి పెట్టనే
జనకజ నబ్ధిఁ బెట్టిన భుజంగమలోకమునందుఁ బెట్టినం
బొనరఁగఁ దెచ్చి యశ్వతరిఁబోలె సమర్పణ నీకుఁ జేయనే.

248


వ.

అని పలికి బాష్పంబులు దుడిచికొని యల్పచేతనుం డై రామునిం దూఱనాడక
యూరకుండె నప్పుడు.

249


క.

క్షపితమహాతేజుం డగు, తపనునిపగిది నుపశమితదహనునికరణిన్
వ్యపగతజలమేఘముగతి, విపులబలం బేది యున్న విబుధేంద్రసుతున్.

250


క.

వాలిం గనుఁగొని రఘుభూ, పాలాగ్రణి యపుడు వేగపాటునఁ జాలన్

బోలఁగ ధర్మార్థసమే, తాలాపముల నిటు లనియె నాతనితోడన్.

251


క.

వనచరధర్మముఁ గామం, బున వర్తన లోకసమయమును నెఱుఁగక న
న్నును నిందింపఁగ నగునే, యనుజునిభార్య రుమఁ జెఱుప నగునే నీకున్.

252


క.

జాత్యంధులతోఁ గూడిన, జాత్యంధుఁడుఁబోలె నీవు చపలకపులతో
నిత్యముఁ జపలుఁడ వై సాం, గత్యము గావింపఁ దగవు గానక నన్నున్.

253


క.

పలుమఱుఁ గాపేయంబునఁ, దలరక పలికెదవు నీవు ధర్మాధర్మం
బుల నెఱుఁగవు పోలఁగఁ బె, ద్దలధర్మము లాత్మఁ దలఁపు తలఁచిన నీకున్.

254


క.

రభసంబున నీ చేసిన, యభిమతదుష్కృతము గాన నయ్యెడుఁ గార్య
ప్రభవము లగుజనులశుభా, శుభములు హృదయాంతరాత్మ సూచుచునుండున్.

255


సీ.

మృగయుండు మృగముల నొగిఁ బొంచి వెసఁ జంపుఁ, గానకుండఁగఁ జంపుఁ గడఁకఁ జంపు
విముఖంబు లై యుండ వే చంపు మఱి సమ్ము, ఖంబున నుండఁగఁ గడఁగి చంపు
వలబోను లాదిగా బలుయంత్రములఁ జంపు, వడి మీఱుశునకాలి విడిచి చంపు
మఱియొక్కమృగముతో మలసి పోరఁగఁ జంపు, దీమంబునకుఁ జేర్చి తెగువఁ జంపు
నెన్నిభంగులనయిన మాంసేచ్ఛ మృగము, నరులు చంపుదు రిల దాన దురిత మొంద
రఖిలధర్మార్థకోవిదు లైన రాజ, వరులు మృగయాభిరతు లైనవారు కారె.

256


క.

నీవును శాఖామృగమవు, కావున నే రాజ నయిన కాకుత్స్థుఁడ నా
పావకనిభశరమున నీ, జీవంబులు గొనుట నాకు శీలమ కాదే.

257


వ.

అదియునుం గాక.

258


క.

జను లొనరించిన పాపము, పనుపడ జననాథుఁ బొందుఁ బ్రాయశ్చిత్తం
బున నాదురితము వాయును, జనులకు నృపశిక్ష డాయు సకలార్థంబుల్.

259


మ.

అనుజన్మప్రియపత్ని యైనరుమఁ గామాంధుండ వై కాంక్షతో
ననిశంబున్ రమియించె దీదురిత మింపారన్ వినం గూడునే
యనుజస్త్రీరతుఁ బాపకర్ము నిను దుష్టాచారు రా జైనయే
ననిలోఁ జంపినయీయఘంబునకుఁ బ్రాశయశ్చిత్త మేపారునే.

260


క.

ధరలో దివిజులు ధాత్రీ, వరరూపంబులు ధరించి వర్తింతురు వా
రురుధర్మజీవితసుఖో, త్కరదాయకు లఖిలభూమితలవర్తులకున్.

261


తే.

కానఁ బ్రత్యక్షదేవత లైనయట్టి, ఘనుల రాజుల శపియింపఁ గాదు ధిక్క
రింపఁగాఁ గాదు క్రొవ్వునఁ జంపఁ గాదు, వారి కప్రియములు పల్కవలనుగాదు.

262


క.

ఘనతరపాపంబులు సే, సినవారలు రాజుచేత శిక్షితు లయి తా

రనిమిషలోకము గాంతురు, సునిశితధర్మంబుచేత సుజనులు వోలెన్.

263


క.

కావున నాశరమునఁ దెగి, నీ వఘముల నెల్లఁ బాసి నిర్మలతరపు
ణ్యావాసం బగుదివిజేం, ద్రావాసంబునకుఁ బోయె దంచితమహిమన్.

264


చ.

అన విని వాలి రామునకుఁ బ్రాంజలి యై జననాథ బాణవే
దన సహియింపలేక నినుఁ దాఁకఁగ నాడితి నీవు వారిజా
సనదివిజేంద్రతుల్యుఁడవు సమ్మతి నన్ క్షమియింపు మాదరం
బెనయఁగ జూడు మంచును సమీక్షణతత్పరుఁ డయ్యె నయ్యెడన్.

265

రామబాణహతుం డగువాలిం జూచి తార లోనగువారు దుఃఖించుట

చ.

అలఘుఁడు వాలి రామవసుధాధిపుఘోరశిలీముఖంబుచే
నిలిగినవేఁడిమాట విని యెంతయు నుల్లము జ ల్లనంగఁ గొం
దలపడి తార యంగదుఁడుఁ దాను మహీస్థలి వ్రాలి బిట్టు మూ
ర్ఛిలి మఱి యెట్టకేలకు సుచేతన యై కనువిచ్చి చూచుచున్.

266


క.

అప్పుడు చాపధరుం డగు, నప్పురుషవరేణ్యు రాము నస్త్రహతుం డై
దెప్పర మొందినవాలినిఁ, దప్పక వీక్షించి రచటికి తరుచరు లెల్లన్.

267


ఉ.

ఎంతయు భీతి యూధపవిహీనమృగంబులుఁబోలె నార్తు లై
వంతలఁ బాఱు దేరఁ గని వాలి పరాక్రమశాలి రామభూ
కాంతునిచేతఁ జిక్కెఁ బ్లవగప్రభు మీపతిఁ బాసి దూరదే
శాంతర మేఁగుఁ డింకను వనౌకసులార యనూనదుఃఖు లై.

268


వ.

అని తార పలికిన విని యంగదసహచరు లగునవ్వాలిహితయూథపవీరు లేము
లుబ్ధకులు దమలో నాలోచనంబు సేయ వింటిమి వాలి రామబాణహతుం డై
చిక్కినయెడఁ గొందఱు సమీపకాననంబులం గళత్రవంతులు నిష్కళత్రులు
నయి మన కహితు లయిన మేటివనచరు లున్నవారు వారలు మనకుం గలగిరిదుర్గ
వనంబులను గిష్కింధానగరంబును నాక్రమింపకుండవలయు మామాటలు విను
మనుచుఁ దారతో నిట్లనిరి.

269


ఉ.

అంగన నీవు సేమమున నంగదుతో మరలంగ నేఁగు మీ
యంగదు వాలిరాజ్యమున కారఁగఁ బట్టము గట్టు శూరుఁ డై
యంగదుఁ డాప్తవానరసహాయత నీపురి యేలనిమ్ము వా
లిం గడతేర్చె నంతకుఁడు లీల భయంకరరామమూర్తి యై.

270


వ.

అనినఁ దార వారల కి ట్లనియె.

271


చ.

అకట సురేంద్రపుత్రుఁడు మహాత్ముఁడు రామశరాభిఘాతుఁ డై
యొకరుఁడ యున్నవాఁడు సమరోర్వి శయించి మదీశుఁ డొక్కకు
త్తుక యగుచున్నయట్టిపతితోడిద లోకము నాకుఁ గాన హే
యక మగురాజ్య మేమిటికి నంగదుఁ డేటికి జీవ మేటికిన్.

272

క.

అని పలికి తలయు మొగమును, ఘనకుచకుంభములు నురముఁ గడునొవ్వఁగ లా
వున నడిచికొనుచు నొఱలుచుఁ, గనుఁగవ బాష్పములు దొరఁగఁ గడువేగమునన్.

273


వ.

రాఘవామోఘశరపాతితుం డైనవాలిపాలి కేతెంచి యచట నున్నరామలక్ష్మణ
సుగ్రీవులం గనుంగొనుచు ముందట బహుప్రహారజర్జరితాంగుండును రక్తసిక్త
ధూళిధూసరితాంగుండు నగుచు నేలంగూలి మహావాతపతితభూజాతంబుచందం
బునఁ గంఠీరవంబు కబళించిన శుండాలంబు పోలిక వజ్రవజ్రాయుధంబునం గూలిన
కులశైలంబునుంబోలె రణభూమిం బడి యున్నవాలిం గదిసి పోల నాలో
కించి తార తనయుండునుం దానును బిట్టు నేలం బడి మూర్ఛిల్లి కొంతదడవు
నకుం దెలిసి యత్యంతదుఃఖాక్రాంత యై యక్కాంత ఱొమ్ము ధూళిగా మోఁది
కొనుచు హానాథ హావల్లభ హావానరేశ్వరా హాదేవా హారణవీరా కాలితిం
జెడితి ధూళిం గలసితి ననుచు బహు ప్రకారంబులఁ గురరియుంబోలె విలపించుచు
నేలం బడి దీనవదనుం డై యున్న యుంగదుని నధికదైన్యంబున శోకించువాలిమం
త్రుల నాలోకించి కడుదుఃఖిత యై యున్నసమయంబున.

274


క.

ఘననాదంబుల నేడ్చుచు, వనచరపతిపత్ను లెల్ల వచ్చి మహారో
దనములు దుఃఖమ్ముల గొన, కొనఁ జేసిరి తారఁ బట్టికొని దెస లద్రువన్.

275


వ.

అట్లు శోకించి యుపశమించి యాసవతులు తారం గనుంగొని.

276


చ.

అధిపతి యైనవాలి సమరావనిఁ గూలుటఁ జేసి శోకతో
యధి మునుగంగఁ బా లయితి మద్భుతరాఘవసాయకంబున
న్విధవల మైతి మందఱము నిక్కముగా వగ మాకు లేదె యి
వ్విధమున నేల యేడ్చెదవు వేమఱు వారక తార నీ వనన్.

277


వ.

శోకంబు సైరింపం జాలక యతార యధికదుఃఖావేశంబున.

278

తారావిలాపము

ఉ.

వాలినిఁ గౌఁగిలించుకొని వల్లభ యంగదు నీకుమారు ని
ట్లేల ప్రియంబుతోఁ బిలువ వేటికి శోకము మానిపింప వి
ట్లేల సుతుండు నేలఁ బడి యేడ్వఁగ నక్కున గ్రుచ్చి యెత్త వి
బ్బాలకుఁ డింక నెవ్వరికి బం టయి కొల్వఁగ నేర్చు నక్కటా.

279


చ.

కదనమునందు జర్జరితరకాయుఁడ వై యురురక్తపూరముల్
ప్రదరముఖంబునన్ వెడల బాహుబలం బఱి బాణవేదనం
బొదవఁగ నేలఁ గూలి యిటు లుండఁగఁ జూచుచు నున్నదాన నా
హృదయము వేయివ్రక్క లయి యీల్గను దైవము యేమి సేయుదున్.

280


క.

తగ దనక యనుజుభార్యం, దెగువమెయిం జెఱిచి తీవు ధృతి సెడి తోఁబు
ట్టుగుఁ బురము వెడల నడిచితి, పగగొని యాఫలము నిన్నుఁ బడవైచె నిటన్.

281


వ.

అని విలపించి సుగ్రీవుం గనుంగొని.

282

మ.

అని నీయగ్రజు వాలి నర్కసుత నే ర్పారంగ శాసించి తిం
క నశంకంబుగ సాధ్య మయ్యె రుమతోఁ గామోపభోగంబు ల
త్యనురాగంబునఁ బొందుచుం బ్లవగరాజ్యం బేలు దుఃఖించుచు
న్న ననుం దోడిసపత్నులం గని మదిన్ నందింప కాసక్తితోన్.

283


వ.

అని పలికి దుఃఖావేశంబున.

284


చ.

తనపతిపాదమూలమున దైన్యముతోఁ బడి తార యేడ్చుచున్
వనచరనాథ నీవెనుక వచ్చెదఁ బాయఁగఁ జాల నిన్ను నా
ఘనతరమాంసఖండములు కాకులు గ్రద్దలు జంబుకాదులుం
దనియ భుజింపఁ బ్రాణములు దద్దయు సమ్మతి నీకు నిచ్చెదన్.

285


చ.

తన ప్రియపుత్రుఁ డంగదుఁడు దైన్యము నొందఁగ డించి నాథుతో
ననుగమనంబు సేయు టిది యర్హము గా దని ప్రాకృతాంగనల్
కనుకని నాడ నిమ్ము చనఁగాఁ బతితోడిద నాకు లోక మ
త్యనుమతుఁ డైనఁ గాక ఖలుఁ డైనను నాథుఁడ లోక మింతికిన్.

286


క.

జనకునితో సోదరుతోఁ, దనయునితోఁ దాతతోడ దగుమైత్రిం జ
చ్చినసతికిం బతితోఁ జ, చ్చినగతిఁ గైవల్యపదము చెందం గలదే.

287


క.

జనని యొకయెగ్గు సేసినఁ, దనయుఁడు గోపించుఁ గాంత తనతోఁ గోపిం
చినఁ బ్రియపడుఁ బతి యిటు చె, ప్ప నిలన్ సతికిఁ బతిఁ బోలు బంధుఁడు గలఁడే.

288


వ.

అని పలికి తనభూషణంబులు పుచ్చి తొలంగవైచి యప్పుడు భూషణవిహీన యై
చంద్రునిం బాసిన శర్వరియంబోలె బాష్పసంరుద్ధనయన యై యుపరాగయుక్త
రోహిణియుంబోలె విలసిల్లి దివినుండి పడినట్లు నేలం ద్రెళ్లి పాంసుదూషిత
సర్వాంగి యై యొడ లెల్ల ధూళి బ్రుంగఁ బొరలి యేడ్చుచు మఱికొంతదడవు
నకు లేచి సుగ్రీవునిం జూచి యధికరోషావేశంబున.

289


క.

పతివధయ శస్త్రవధ నతి, కతివకుఁ బతి లేనిజీవ మది యేటికి నా
పతిఁ జంపితి నీచేఁ జ, చ్చితి నేనును నీవు బ్రదుకు సేమముతోడన్.

290


క.

అని తార పల్క లజ్జా,వనతాననుఁ డై మనంబు వందఁగ నిలఁ గ
న్గొనుచు మఱుమాట పలుకక, యినతనయుం డూరకుండె నెంతయు భీతిన్.

291


వ.

అప్పు డాతార వనచరస్త్రీలు బహువిధంబుల బోధింపఁ గొంత సహించి క్రమ్మఱ
దుఃఖం బెత్తి వాలి నాలింగనంబు చేసి యంతర్గతంబున.

292


క.

సంగతజాతాంగపరి, ష్వంగాంచితసుఖముకంటె శవ మై యి ట్లు
న్నం గాంతునియంగపరి, ష్వంగము గావించు టధికసౌఖ్యము నాకున్.

293


వ.

అని పలికి.

294


క.

నీమానము నీగుణములు, నీమన్ననతోడిచూపు నీమధురోక్తుల్
నీమందస్మితవదనము, నీమోహముఁ దలఁచి మనము నీఱుగఁ జొచ్చెన్.

295

వ.

అని విలపించి రామచంద్రు నుద్దేశించి తార యి ట్లనియె.

296

తార రాఘవుని శపియించుట

మ.

పరుతోఁ బోరఁగఁ బొంచి నావిభునిఁ జంపం బాడియే నీకు లా
వరి వైనం బొడసూపి కయ్యమున నిల్వం జూచి దోశ్శక్తి మైఁ
బరఁగం జంపఁగ రాదె నీ కహిత మాపాదించెనే యీకపీ
శ్వరు నిష్కారణ మేల చంపి తతిదోషం బిట్లు గావింతురే.

297


క.

వనమున వన్యాశను లయి, యొనరఁగ మనువారి రామ యూరక చంపం
జనునె మహాత్ములు వనితల, వనచరుల నధర్మ మనుచు వధియింప రిలన్.

298


తే.

ఇత్తెఱఁగు దోష మగుట నీ వెఱుఁగకునికి, వాలిపాలియభాగ్యంబు వాలిపత్ని
నయిననానోముఫలము గా కరసిచూడ, నిజము నీ వేమి సేయుదు నృపవరేణ్య.

299


క.

నరవర యాకులకొఱకు, న్వరఫలయుతచూతతరువు నఱకఁగ నగునే
ధరణిజతోడనె నీసురు, చిరపుణ్యగుణమ్ము లెల్లఁ జెడిపోయె నొకో.

300


ఉ.

అక్కట నీవు వానరసహాయము గోరిన వాలి పంపఁడే
దిక్కుల కెల్ల వానరులు దిగ్గునఁ దాఁ జని భూరిశక్తి మై
రక్కసులన్ బలాఢ్యుఁ డగు రావణుని వధియించి సీత నీ
వక్కజ మంది చూచి ముద మందఁగ ముందటఁ దెచ్చి పెట్టఁడే.

301


క.

పోలఁ బతివ్రతఁ గావున, నోలిం బొలియన్ శపింప నోపుదు నీ వి
ట్లాలిం గోల్పడి వగలం, గ్రాలెదు నిను వేఱ యేల కడఁగి శపింపన్.

302


చ.

నరవర యి ట్లకారణమ నాపతిఁ జంపితి గాన యీవు బం
ధురభుజశక్తితో మహిజఁ దోకొని వచ్చిన సీత నీకడం
జిరతరకాల మింపుగ వసింపక నీ వతిదుఃఖపాటుతో
నెరియుచు నుండ భూమిఁ జొరని మ్మనుచున్ శపియించెఁ గిన్కతోన్.

303


వ.

అట్లు శపియించి దుఃఖించుచు నేలంబడి పొరలి యేడ్చుచు బహుప్రకారంబుల.

304


చ.

అడలుచుఁ దార వాలిశిర మంకమునం దిడి చూడ్కి బాష్పముల్
వడియఁగ నేడ్చుచున్న మఱి వాలి ప్రియాంగనరోదనంబు లే
ర్పడ విని నేత్రముల్ దెఱచి పత్నిఁ బ్రియాత్మజు దీనవక్త్రునిం
బొడగని దుఃఖ మంది రఘుభూపతిఁ జూచి యుదగ్రకోపుఁ డై.

305


వ.

అప్పు డధికదుఃఖితుం డై వాలి ప్రాణాంతకరం బైన వేదన సహింప లేక పరుష
వాక్యంబులతో రామచంద్రున కి ట్లనియె.

306


క.

శమమును దానము ధర్మము, క్షమయును బటువిక్రమంబు సత్యంబును శీ
లము దుర్జనశిక్షయు భూ, రమణునకుం గలుఁగవలయు రాజితగుణముల్.

307


వ.

వనమృగంబు లగుమా కీగుణంబులు వలదు గాని మీబోఁటి రాజులకు వలవదె

నీయందు ధర్మగుణంబు లేశంబును లేదు నిజవ్రతభ్రష్టుండ వై పరహింస సేయం
దొడంగినవాఁడ వని పలికి వెండియు.

308


చ.

కనకము వెండియుం బశునికాయము భూమియు వైరమూలముల్
వనములఁ గాయ పండు దినువన్యమృగంబుల మేము మాయెడ
న్ధనఫలలాభ మొంద దిటు నన్ను నకారణ మేల నిర్దయన్
హననము సేసి తీవు ముని యైనమహాత్ముఁడు హింస సేయునే.

309


సీ.

ధర్మక్రమంబున ధరణిఁ బాలించుచు, భరతుండు మృగపక్షినరులఁ గూర్చి
దుష్టనిగ్రహమును శిష్టరక్షణమును, జేకొని సమవృత్తిఁ జేయుచుండు
నెల్ల వానరవీరు లేనును భరతాజ్ఞ, యెడపక నర్తింతు మెల్ల చనఁగఁ
దప్పు గల్గిన మమ్ముఁ దగవుతో భరతుండు, దండింప మా కొడయుండు గాక
నీవు రాజ్యంబు సెడి వచ్చి నిక్క మైన, తపసిగతి జటావల్కలధారి వగుచు
నడవినుండి యర్హపథంబు విడిచి నన్నుఁ, గడఁగి శిక్షింప నీ కేమి కారణంబు.

310


క.

రామావిరహాతురతను, గామాతురచింత నొంది ఘనతరధర్మం
బేమియుఁ గాన కధర్మము, కామించి యొనర్చి తీవు కడుదుర్బుద్ధిన్.

311


వ.

అని పలికిన నవ్వాలితో రామచంద్రుం డి ట్లనియె.

312


క.

జనకుఁడు జ్యేష్ఠభ్రాతయు, ఘనవిద్యాప్రదుఁడు ధర్మకార్యములయెడన్
జనకసమానులు తమ్ముఁడుఁ, దనయుఁడుఁ బ్రియశిష్యుఁడును సుతప్రతిమానుల్.

313


క.

లౌకికమును ధర్మంబును, గైకొన కీ వనుజుభార్యఁ కామాంధుఁడ వై
చేకొంటి వాయఘంబున, నీ కీవిధి వచ్చెఁ గ్రూరనిశితాస్త్రమునన్.

314


శా.

నిన్నుం జంపఁ బ్రతిజ్ఞ వానరసభన్ నిక్కంబుగాఁ జేసితిన్
నిన్నుం దున్మక నాకుఁ బోవ నగునే నెయ్యంబు గావించితిన్
ము న్నే నర్కజుతో వయస్యునిపనినే మోదంబుగాఁ దీర్ప కు
న్న న్నా సౌహృద మేల దుష్టచరితు న్మన్నింపఁగా వచ్చునే.

315


వ.

అది గావున రాజులకు దుష్టనిగ్రహశిష్టప్రతిపాలనంబు లర్హకృత్యంబులు ని న్నీ
విధంబున వధించుట యర్హంబు మనఃఖేదంబు విడువు మదియునుం గాక.

316


క.

భరతుండు దురాచారులఁ, బొరిగొను మని నన్నుఁ బంపఁ బూని తదాజ్ఞం
బరఁగ నిట వచ్చి తగువునఁ, బరిమార్చితి నిన్ను ననుజభార్యాపహరున్.

317


వ.

అని యిట్లు రామచంద్రుండు ధర్మార్థయుక్తంబుగాఁ బలికిన నిరుత్తరుం డై మంద
బుద్ధియు నష్టసర్వేంద్రియవర్తనుండు నవశుండు నై యూర్పులు వుచ్చుచు నం
గదసుగ్రీవులం జూచి యధికరోదనంబు సేయుచు మెల్లనియెలుంగున వాలి
తమ్ములవిందుచూలిం గనుంగొని.

318

వాలి తారాంగదులను గూర్చి సుగ్రీవునితో వొప్పగింతలు పెట్టుట

క.

కంఠగత మయ్యె జీవము, కుంఠిత మయ్యెడును రామఘోరప్రదరో

ల్లుంఠితదోషుఁడనై వై, కుంఠమునకు నరుగువేళ గూడెన్ నాకున్.

319


సీ.

భానుజ రాజ్యంబుఁ బ్రాణము సర్వస్వ, మును డించి సురపురంబునకుఁ బోవు
చున్నాఁడఁ గపిరాజ్యకము న్నాపురశ్రీలఁ, గైకొమ్ము కామాంధకార మడర
దగవును ధర్మంబుఁ దలఁపక తమ్ముఁడ, నీ కెగ్గుఁ జేసితి నీచబుద్ధి
నాతప్పు సైరించి భ్రాతృసౌహార్దంబు, నామీఁదఁ బాటించి నడవు మింకఁ
దొరఁగు బాష్పధారల మోము దొప్పఁదోఁగ, వగలు మిగులంగ నేడ్చుచు వసుధ వ్రాలి
ధూళిధూసరగాత్రుఁ డై చాలఁ దూలి, యున్నవాఁ డంగదునిఁ గంటె యుల్ల మెరియ.

320


శా.

ఈతారాసుతుఁ డైనయంగదు సుఖాన్వీతాత్ముఁగా నీగతిం
బ్రీతిం బెంచితి నింత కాలము కడుం బెంపొందఁ బ్రాణప్రియుం
డీతం డెంతయు నాకు నర్కసుత నీ వీపట్టి నామాఱుగాఁ
జేతోదుఃఖము వాయ గారవమునం జేపట్టి రక్షింపుమీ.

321


క.

ఈతఁడు మత్సదృశబలా, న్వీతుం డీతనికి నీవ యెప్పుడు నింకన్
దాతవు నేతవును బరి, త్రాతివు యువరాజుఁ జేయు తగ నీపుత్రున్.

322


ఉ.

రాముఁడు రావణున్ గెలిచి రాజస మెప్పఁ బరాక్రమంబునన్
భూమిజఁ దోడితే నటకుఁ బోయినయప్పుడు నీవు చూడ సం
గ్రామములోన నీకుఁ గడుఁబ్రా పయి ముందట వీఁడు రాక్షస
స్తోమముఁ ద్రుంచి వైచి యతిదోర్బలసంపద వాలెడుం దగన్.

323


క.

ఈతార సుషేణుని సుత, యాతతజపశీల సువ్రతాన్విత పరఁగన్
నీతిపరురాలు గావున, నీతార సుబుద్ధి నడపు మెడపక యెపుడున్.

324


క.

రాముఁడు పంచినకార్యం, బేమఱ కటు సేయు వేగ మెంతయు వేడ్కం
దామసమునఁ దత్కార్యం, బేమఱినను నన్నుఁబోలె హింసించుఁ జుమీ.

325


వ.

అని యిట్లు పలికి రామచంద్రుం గనుంగొని

326


క.

కరములు మొగిడిచి భక్తిని, శిరమునకుం జేర్చి మ్రొక్కి సీతేశునితో
వరమతి నంగదుకొఱకుం, దరుచరపతి యైనవాలి తగ ని ట్లనియెన్.

327

వాలి యంగదుని రామున కొప్పగించి మృతుం డగుట

క.

ఘనుఁడు నుదారకులుండును, ననుపమభుజబలుఁడు నైన సతిదుఃఖము పొం
దినఁ గృపణుఁ డగుచు నుండును, జనవర యటు గాన నేను సమసినమీఁదన్.

328


క.

ఘనతరశోకముపా ల్పడి, యనిశము నాసుతుఁడు గృపణుఁ డై యుండఁగలం
డని యెంతయు శోకించెద, మనమున నిట నాదుకొఱకు మఱుఁగ నరేంద్రా.

329


క.

నానందనుఁ బ్రియమున మును, గానక మన నింకఁ బాపకర్ముఁడు దివముం
గాననివిధమున నంగదుఁ, గానక పో నకట నాకుఁ గాలం బయ్యెన్.

330

క.

నరవర లోకుల కెల్లను, శరణుఁడ వగునీవ దిక్కు సమ్మతి నాకున్
వరసుతుశోకము వాయఁగఁ, గరుణన్ రక్షింపుమయ్య కారుణ్యనిధీ.

331


వ.

అని తనతనయు నప్పగించి వాలి యన్నరేంద్రుతో మఱియు ని ట్లనియె.

332


క.

కనకశతపత్రమాలిక, యెనయఁగ నా కింద్రుఁ డిచ్చె నీమాలిక నే
ను నీవొండెను నీయను, జున కి మ్మొండెఁ దగ నిమ్ము సుగ్రీవునకున్.

333


వ.

అని పలికిన రామచంద్రుండు ముదం బంది యింద్రనందనుం జూచి నాశరంబు
నం బావనుండ వైతి వింక మహేంద్రలోకంబున కరుగు మని పలుకఁ దత్ప్రసా
దంబునకుఁ బ్రహర్షించె నప్పుడు రాముండు సుగ్రీవ నీ వీకాంచనమాలిక దాల్పు
మన నారామునియానతియు సుత్రామతనూభవుననుజ్ఞయుం బడసి హేమమా
లిక తామరసాప్తసూనుండు ధరియించె ననంతరంబ వాలి యంగదు నూరార్చి
దుఃఖంబు దీర్చి ప్రియంబున నిట్లనియె.

334


చ.

ఇనజుని చిత్తవృత్తిఁ జరియింపుము ని న్నతఁ డేనుబోలె మ
న్ననఁ దగఁ బ్రోచుఁ దద్రిపుజనంబుల సన్నిధి నుండ కర్కనం
దనునకు నర్థసంగ్రహ మొనర్పు మొగిన్ సుఖదుఃఖముల్ క్రమం
బున నిను దేశకాలములఁ బొందినఁ జేకొను మొక్కరూపునన్.

335


వ.

కుమారా నీ వింక నామీఁదిభక్తియు మోహంబును జాలించి దుఃఖం బుడుగు
మని యూరార్చె నంత నవ్వాలికి.

336


క.

కనుఁగవఁ జీఁకటి గవిసెను, మనమున మఱ పొదవె నెలుఁగు మందం బయ్యెన్
విను టుడిగె నవశ మయ్యెం, దను వసువులు సంచలించెఁ దల్లడ మొదవెన్.

337


వ.

అప్పుడు రామునిబాణంబు ప్రాణంబులు వెఱుకఁ గన్నులు తేలగిలవైచి తీక్ష్ణ
రదనంబులు గానంబడ వాలి వివృతాననుం డై జీవంబులు విడిచెఁ దదనంతరం
బ సకలవనచరులును హాహాకారంబులు సేయుచు నధికదుఃఖంబుల విలపించిరి
తార మృతుం డయినపతిం జూచి నేలం బడి పొరలి యాలింగనంబు సేసి ముఖా
స్వాదనంబు సేయుచు నధికశోకంబున హానాథ హవీరవరేణ్యా హాకపిశేఖరా
యీవిషమరణతలంబున నీ వొక్కరుండవు పడియున్నవాఁడవు ఋక్షవానరు లనే
కులు నిన్నుం బరివేష్టించి దుఃఖించుచున్నారు నన్ను నంగదు సుహృజ్జనుల నేల
సంతోషపఱుపవు నీపుత్రుం డయినయంగదుండును భృత్యామాత్యులుఁ జు
ట్టాలు నధికశోకంబున విలపించుచున్నారు మమ్ము నెఱుంగ వేల లెమ్మనుచుం బలికి.

338


సీ.

అంగదుచే వింటి నధిప సుగ్రీవుఁడు, కాకుత్స్థుశరణంబు గనియె నంటి
రాముప్రావున నిన్ను రవిజుఁ డాజికిఁ బిల్వ, వచ్చినవాఁడు పోవలవ దంటి
నారాముతో సంధి యలవడఁ గావించి, భయ మేది నెమ్మది బ్రదుకు మంటి
రాముండు నీచేత రణమునఁ జిక్కఁడు, శక్రముఖ్యులకు నసాధ్యుఁ డంటి
మనఁగ నాబుద్ధి వినక నా మన్నిగొంటి, వింక నీశోకవారాశి నెట్లు గడతు

దిక్కుమాలితి నింక నేదిక్కు సొత్తుఁ, గుటిలదైవంబు నిన్నుఁ ద్రెక్కొనియె నకట.

339


క.

ననిచిన ప్రియుఁడవు భర్తవు, ననుపమబంధుఁడవు నాకు నయ్యును నిటు న
న్ను ననాథఁ జేసి యొక్కతెఁ, జనునే దిగవిడిచి పోవ శక్రతనూజా.

340


తనవిభుఁడు లేని కాంతను, ధనధాన్యసమృద్ధ నైనఁ దగుపుత్రిణి వై
నను విధవ యండ్రు ధాత్రీ, జను లీకష్టంపుమాట సైఁపఁగ వశమే.

341


క.

ఘనశరము నాటి నీయుర, మున నున్నను నాకు నిన్ను మోవఁగఁ జన్నుల్
మొనలెత్తఁగ గాఢాలిం, గన మొనరింపంగ రాదు కామం బొదవన్.

342


సీ.

నాదిక్కుఁ జూడవు నాకంటెఁ బ్రియురాలె, యుర్విఁ గౌఁగిటఁ జేర్చి యున్నవాఁడ
నీల్గి యుండియు మాన విలమీఁది మోహంబు, న న్నేల విడిచితి నాథ నీవు
తనయుఁ డంగదుఁడు మ్రొక్కినవాఁడు దీర్ఘాయు, వగుమని దీవింపు మాదరమునఁ
బరదేశ మేఁగెదు పట్టి నక్కునఁ జేర్చి, యెలమి మూర్ధఘ్రాణ మేల సేయ
వకట పైఁబడి తమక మేపార మున్ను, నన్నుఁ గౌఁగిటఁ జేర్చుచు నలమికొందు
విప్పు డేఁ బయిఁబడి మాన మేదియున్న, నలమి యాలింగనము చేయ నలర వేల.

343


వ.

అని బహుప్రకారంబుల విలపించుచున్న.

344


క.

నీలుం డాలో బలువిడి, వాలియురస్స్థలము నాటి వఱలెడునత్యా
భీలశరంబును బెఱికెను, సాలాన్విత మైనక్రూరసర్పముఁ బోలెన్.

345


క.

వనచరపతిమెయి నాటిన, సునిశితశర మపుడు వెలిఁగె సురుచిరరుచితో
దనరెడు వర్షాగమమున, ఘనగూఢోదితతటిత్ప్రకాశముభంగిన్.

346


క.

ఉరుతరబాణక్షతమునఁ, దరుచరపతిమేన రక్తధారలు వెడలెం
బొరి వర్షము గురియఁగ భూ, ధరమున వడి వెడలుధాతుధారలువోలెన్.

347


చ.

తనపతిమోము బాష్పజలధారలఁ దోఁగఁగఁ దార యేడ్చుచుం
దనయునిఁ జూచి పుత్ర గుణధామ దివంబున కేఁగెడున్ భవ
జ్ఞనకుఁడు నీవు మ్రొక్కు మనఁ జయ్యన లేచి యతండు భక్తి మిం
చినగతి గోత్రనామములఁ జెప్పుచు మ్రొక్కెఁ బదావలంబి యై.

348


వ.

అప్పుడు తార వాలి నాలోకించి.

349


ఆ.

సంగరాధ్వరంబు సమ్మతిఁ గావించి, నాథ ధర్మపత్ని నన్ను డించి
శాతరామబాణజలమున నవబృథ, స్నాన మాచరింపఁ జనునె నీకు.

350


క.

మందన్ బెబ్బులి వ్రేసినఁ, గొందలపడి తెగినయట్టిగోవత్సముపో
లెం దెగిననిన్ను నేనును, నందనుఁడును బలసి నిలిచినారము వగలన్.

351


క.

శూరునకుఁ గన్య నీఁ జన, దారయ మృతిఁ బొందు శూరుఁ డన వేగమ యే
శూరునకుఁ బత్ని నై శుభ, గౌరవ మెడలంగ విధవఁ గానె కపీంద్రా.

352


తే.

సమరమున నీవు మాయావిఁ జంపినపుడు, చాలనీవిక్రమము చూచి సంతసమున
విబుధవిభుఁడు నీ కిచ్చెను విజయశీల, కనకమాలిక నీమెడఁ గాన నిపుడు.

353

క.

ఆజి న్నీ వీల్గిన నిను, రాజశ్రీ వాయ దనఘ రాజిల్లెడు నం
భోజాప్తుఁ డస్తమించిన, రాజితకనకాచలంబుప్రభయుం బోలెన్.

354


ఉ.

ఇక్కడఁ బ్రాణముల్ విడిచి యే దివి కేఁగడునిన్ను వెన్కొనన్
నిక్కము నీవు నన్ విడిచి నీకృతపుణ్యఫలానుభూతి కిం
పెక్కినయన్యలోకముల కేఁగిన నక్కడ నిట్టు లొంటిమైఁ
జిక్కఁ గదయ్య నన్నుఁ గృపఁ జేకొని పాయక యుండుదే యటన్.

355


క.

నీవు నను డించిపోయిన, నీవెంటనె నన్నుఁ బాసి నినుఁ బొందెను నా
లావణ్యశుభశ్రీ లటు, గావున ననుఁ బాయఁ జనదు కపికులవర్యా.

356


ఉ.

ఇన్నివిధంబులం బిలువ నే మన వాదటఁ జూడ
వప్రియం
బెన్నఁడుఁ జేయ నీకు హిత నే నయి యుండుదుఁ దప్పు గల్గినన్
నన్ను క్షమింపు నాథ సురనాథతనూభవ యింక వేగ మ
త్యున్నతపుణ్యు లొందెడుసదుత్తమలోకముఁ బొందు సమ్మతిన్.

357


వ.

అని యి ట్లనేకప్రకారంబులం దార విలపించుచున్న సమయంబున.

358


క.

వాలి మృతుఁ డవుట పోలఁగ, నాలో లక్ష్మణుఁ డెఱింగి యర్కజుతోడన్
బాలుఁడువోలెం దాలిమి, మాలితి విది యేమి యకట మఱిఁగెద వింకన్.

359

సుగ్రీవుఁడు వాలికి దహనాదికృత్యంబు లాచరించుట

క.

తారాంగదులకు శోకము, వారింపుము వారు నీవు వాలి దహింపుం
డారఁగ నీపురి నేయియు, భూరీంధనవస్త్రగంధపుష్పచయాదుల్.

360


వ.

వేవేగ మఱియు వలసినయవి దెప్పింపు మనుచు హనుమంతుం జూచి పావనీ
నీవు వివిధవస్త్రమాల్యఘృతతైలాదిసమస్తవస్తువు లెల్లఁ దెమ్ము తారుండ నీవు
శీఘ్రంబ శుభశిబికం గొనిరమ్ము ఘనుం డయిన వాలిని మోవంజాలులావరు లగు
మేటివానరు లాయత్తపడుం డని పలుకం దన్నియోగంబునఁ దారుండు గుహ
సొచ్చి శిబిక గొని వేగ మేతేర నప్పుడు వాలిని వస్త్రగంధమాల్యభూషణాలం
కృతుం జేసి యధికదుఃఖంబున శోకించుచు సుగ్రీవాంగదు లాకపీంద్రు నెత్తి
కొని తెచ్చి శిబికయందుఁ బెట్టి కొనిపోవుచు నడుమ భూమిని శిబిక యుక్త
క్రమంబున డించి యెత్తికొనుచు నంగదసహిత లై తారాదికాంతలు రోదనం
బులు సేయ సుగ్రీవుండును సకలభృత్యామాత్యులు సడలఁ దదీయరోదనధ్వా
నంబు లాకర్ణించి సకలవానరస్త్రీలు గుహలెల్లఁ జెలంగ నధికాక్రందనంబులు
సేయ విహితక్రమంబున వాలివిమానంబు గొనిపోయి పర్వతావృతం బయిన
గిరినదీపులినంబున శుద్ధకాంతస్థలంబున శిబిక డించి రప్పు డాతార పతిం జూచి
యవ్వాలిమస్తకంబు దనతొడలమీఁద నిడికొని యధికదుఃఖంబున.

361


ఉ.

అక్కట నన్ను నీసుతుని నంగదు నీప్రియ లైనకాంతలం
దక్కినబంధుమిత్రులఁ బ్రధానుల భృత్యులఁ బట్టణంబుఁ బెం

పెక్కిన రాజ్యసంపదల నిక్కడ డించి సురేంద్రపుత్ర నీ
వెక్కడఁ బోయె దొక్కఁడవు నే నెటు పాయుదు నింక వల్లభా.

362


వ.

ఏ నెన్నివిధంబుల నిన్నుం బాయఁజాల నంగదుని మిత్రామాత్యభృత్యవర్గంబును
వీడుకొలుపు మీ యభిరామారామంబుల నీవును నేనును రతిలీలలం దేలుద మ
నుచు బహుప్రకారంబులం బలవించునత్తారను వానరస్త్రీలు దొలంగం గొని
పోవ నప్పుడు సుగ్రీవాంగదులు వాలిం జితిమీఁదఁ బెట్టి యుక్తక్రమంబున
దహించి బంధుమిత్రామాత్యభృత్యవర్గంబులతోడ వాలిపూర్వపరాక్రమంబు
లుగ్గడించుచుఁ బంపాసరోవరంబున కేఁగి కృతస్నాను లయి యార్ద్రవస్త్రంబుల
తోడఁ దిలోదకవిధానంబు లాచరించి రామచంద్రుపాలికిం జనుదెంచిన రాముండు
వారి నూరార్చి పురంబున కరిగి వాలికి దశాహతంత్రంబులుఁ బారలౌకికాదికృత్యం
బులు నడపు మనిన సుగ్రీవుండు రాఘవానుమతి నట్ల చేసి పూతస్నాతుం డయి
యంగదుండును దానును నఖిలవానరపుంగవులును భయభక్తులతో రఘుపుంగవు
పాలి కేతెంచి దండప్రణామంబులు సేసి కరకమలంబులు మొగిచికొని బ్రహ్మ
ముందటిఋషులునుంబోలె నుండి రాసమయంబున.

363


క.

బాలార్కముఖుఁడు గాంచన, శైలసమాంగుండు వాక్యచతురుఁడు నగువా
తూలతనూజుఁడు రఘుభూ, పాలున కిట్లనియెఁ బ్రీతిఁ బ్రాంజలి యగుచున్.

364


శా.

శుష్కారీంధనదావపావక రఘుక్షోణీశ నీప్రాపునం
గిష్కింధాపురరాజ్యముం బడసె సుగ్రీవుండు లక్ష్మీశుభా
విష్కారం బెసఁగన్ సమస్తకపులున్ వే గొల్వ నుగ్రాంశురో
చిష్ణుం డై విలసిల్ల నర్హపదుఁ డై చెన్నారుచున్నాఁ డిలన్.

365


మ.

కృతనిష్ఠం బరలోకసత్క్రియలు భక్తిన్ వాలికిం జేసి స
మ్మతి సుగ్రీవుఁడు మంత్రతంత్రములఁ బూతస్నాతుఁ డైనాఁడు త
త్పితృపైతామహ మైనరాజ్యమునకుం బెంపొంద లక్ష్మీసమ
న్వితుఁగాఁ బట్టముగట్ట నిచ్చఁ బురికిన్ విచ్చేయు భూనాయకా.

366


వ.

అని హనుమంతుండు పల్కిన రామచంద్రుండు సుగ్రీవున కి ట్లనియె.

367


మ.

జనకాజ్ఞం బదునాలుగేండ్లు చన నికష్ఠం గానలం దుండి యొ
ప్పున మీఁదన్ మఱి కాని గ్రామనగరంబుల్ దూఱ నీ వింక శో
భన మందం బురి కేఁగి పౌరు లలరం బట్టాభిషిక్తుండ వై
సునయం బారఁగ నర్కపుత్ర యువరాజుం జేయుమీ యంగదున్.

368


క.

పోలంగ వానకాలము, నాలుగుమాసములు గడచకనక శత్రుని ని
ర్మూలము సేయఁగఁ బయిఁ జనఁ, గాలము గా దింకఁ గార్తిక మ్మగుదాకన్.

369


క.

సరసిజకువలయపరిమళ, భరితామలసలిలయుతయుఁ బరిహృతపవన
త్వరయు నగునీగిరిస్ఫుర, దురుగుహ లక్ష్మణుఁడు నేను నుండెద మెలమిన్.

370

సుగ్రీవునిపట్టాభిషేకము

వ.

నీవు కిష్కింధ కేఁగు మివ్వానకాలంబు సనునందాఁక నెమ్మది నుండి యంతమీఁద
శత్రుని సాధింప సమస్తసేనాసమన్వితుండ వై యేతెమ్ము పొ మ్మనుచుం బలికిన
రామభద్రునకు దండప్రణామంబులు సేసి సకలవానరవీరులు బలసి తన్నుఁ గొ
లువ నుద్దీపితధ్వజపతాకాభిశోభితంబును నానావర్ణతోరణాలంకృతంబును వివిధ
కుసుమవిసర విలసిత రాజమార్గంబును బంచమహాశబ్దభరితంబును బరమమంగళ
ద్రవ్యశోభితంబును నగు కిష్కింధాపురంబు సొచ్చి సకలవానరులు జయజయధ్వ
నులతో దండప్రణామంబులు సేయ వారి నందఱ నాదరించుచు వాలియంతః
పురంబు సొచ్చి వెడలె నప్పుడు సుగ్రీవుని నఖిలవానరవీరులు నింద్రునికి నమరులుం
బోలె నభిషేచనంబు సేసి సింహచర్మంబు నించిన భద్రాసనంబుపయి నునిచి భూ
సురోత్తములను వస్త్రమాల్యాలంకృతులం జేసి మణికనకాదివస్తువులఁ దనిపిన
వారునుం గుశపరిస్తరణంబు సేసి యర్చన లెసంగ నగ్నిప్రతిస్థాపనంబు సేసి విహిత
హోమద్రవ్యంబుల మంత్రతంత్రపూతంబుగా హోమంబు సేసి గంధమా
ల్యవస్త్రలాజసువర్ణాక్షతాలంకృతంబులును బుణ్యనదీనదసముద్రోదకపూర్ణంబు
లు నగుసువర్ణకలశంబులు రెండు ముందట ధాన్యవేదికల నిలిపి వివిధాశీర్వాద
మంత్రపూతంబులు గాఁ బుణ్యాహవాచనంబులు సేయఁ గెలంకుల వారకాంత
లాడుచుం బాడుచుండఁ బంచమహాశబ్దంబులు చెలంగ మణిగణకనత్కంకణనిక్వ
ణనంబులు సేయుచుఁ బుణ్యకాంతలు దమకుచకుంభంబుల బెరయుసువర్ణకుంభం
బులఁ బుణ్యపావనోదకంబు లందియ్య గజగవయగవాక్షగంధమాదనమైందద్వి
విదసుషేణజాంబవంతులు వసువు లింద్రునింబోలె సుగ్రీవు నభిషేకంబు సేసి రప్పు
డు పట్టాభిషిక్తుం డయినసుగ్రీవునకు హేమదండమండితం బైనధవళచ్ఛత్రంబు
పవనసుతుండు పట్టె నలుండును దారుండునుం గనకరత్నమయంబు లైనచామ
రంబులు వీవం దొడంగి రివ్విధంబున రాజ్యాభిషిక్తుం డయిన భానునందనుండు
వాలినందనుం డైనయంగదుని సమ్మదంబున నాలింగనంబు సేసి రఘుపుంగవు
నానతిక్రమంబున యౌవరాజ్యపట్టం బంగదునికిం గట్టె నప్పు డఖిలవానరులు
నాతగవునకు సంతోషించి సుగ్రీవుం బ్రశంసించి రభిమతంబున.

371


క.

భూపాగ్రణి యగురాముని, ప్రాపునఁ గపిరాజ్యపట్టబద్ధుం డై తా
రాపరిణతుఁ డై కిష్కిం, ధాపట్టణ మేలుచుండిఁ దపనజుఁ డెలమిన్.

372


తే.

అంత సౌమిత్రితోఁగూడ సంతసమునఁ, బ్రస్రవణశైలబిలమునఁ బరఁగుచున్న
రామభూవిభుఁ డానగప్రాంతభూమి, యతిమనోహరలీలల నలరుచున్న.

373


క.

సురుచిరసరిదురుపరిమళ, సరసిజకువలయసరోవిసరసుమఘనభా
సురవనహిమకరకరశుభ, కరరజనులు పెల్లు వెలయఁ గామాతురుఁ డై.

374


చ.

ధరణిజ నాత్మలోఁ దలఁచి తద్దయు శోకముఁ బొంది బాష్పముల్

దొరఁగఁగ వెచ్చ నూర్చుచును దుఃఖపరంపర నిద్ర లేక తా
నొరలుచు లేచుచున్ వనట నొందుచుఁ గన్నులు సాము మూయుచుం
బొరిఁబొరిఁ దేఱి చూచుచును భూవిభుఁ డుండెను దుఃఖితాత్ముఁ డై.

375


వ.

ఉన్నయెడ లక్ష్మణుఁ డన్న కి ట్లనియె.

376


క.

శోకము సర్వార్థంబులఁ, బోకార్చును శోక మాత్మఁ బొందక ముదముం
జేకొని కృతకృత్యుఁడ వయి, కైకొను తేజంబు జయముఁ గడుధర్మంబున్.

377


చ.

ఉరుతరవిక్రమక్రమసముద్ధతిఁ గిట్టి సమస్తలోకము
ల్దిరుగఁగ వైవఁజాలు దవలీలను రక్కసుఁ డొక్కఁ డేఁడ నీ
కరయఁగఁ బంక్తికంఠుని సమస్తసుహృజ్జనపుత్రమిత్రసో
దరపరివారవర్గసహితంబుగఁ ద్రుంపుము కీర్తి వర్ధిలన్.

378


క.

నావుడు నతిపథ్యము లగు, నీవాక్యములకు మనంబు నిర్మల మై స
ద్భావముఁ బొందితి శోకముఁ, బో విడిచితి సంతసంబుఁ బొందితి వత్సా.

379


వ.

అనిన సౌమిత్రి తనయన్నను జూచి వర్షాకాలంబు వచ్చె శరత్కాలంబుదాఁక
సైఁచి దండెత్తి పోయి శత్రుని సాధింత మనిన నగుంగాక యని యనుజసమే
డై యగ్గిరి నుండె నంతఁ గతిపయదివసంబులలోన.

380

వర్షకాలవర్ణనము

మ.

ధృతశక్రాయుధ మింద్రగోపయుత మార్ద్రీభూతభూభాగ మూ
ర్జితవాఃపూర్ణసరస్తటాకతటినీశ్రేణీక మానందన
ర్తితకేకిప్రకరం బలక్షితదిశాదిత్యంబు నీలాంబుదా
వృతశైలౌఘము చాతకోత్సవము ప్రావృట్కాల మేపారఁగన్.

381


మ.

యమునద్గంగము కృష్ణభూమదిల మబ్జాక్షన్మనుష్యంబు నీ
లమహీధ్రన్నిఖిలాచలావలి తమాలద్భూజ మిందీవర
త్కుముదశ్రేణిపికద్విహంగము దమస్తోమద్గ్రహార్కప్రభా
సముదాయం బగుచుండె లోక మలఘుశ్యామాభ్రముల్ పర్వినన్.

382


క.

తనసుతుపగ నీఁగెడుకొఱ, కనిమిషనాయకుఁడు నిజశరాసనయుతుఁ డై
ఘనశరవర్షము గురిసెను, జనపతి యగు రాముఁ డాత్మ సంచల మందన్.

383


క.

దొరసినక్రొక్కారున భా, సురశాద్వలతలము లోలిఁ జూడఁగ నొప్పెన్
మరకతమణిగణములు భా, స్వరముగఁ దాఁపించి యున్నజగతియుఁ బోలెన్.

384


క.

అంతన్ రామక్షోణీ, కాంతుఁడు లక్ష్మణునితోఁ దగఁగ ని ట్లనియెన్
సంతసమున దంపతు ల, త్యంతరతుల్ సలుప నీరదాగమ మయ్యెన్.

385


క.

ఇనరుచుల సర్వరసములుఁ, బనుపడఁ దిగిచికొని గగనభామిని ధరియిం
చినయష్టమాసగర్భము, గనుపట్టె రసాయనంబు గనియెడువేళన్.

386


క.

ఘనమేఘంబులు వొదివిన, దినమునఁ దేజంబు దూలి దినకరుఁ డున్నాఁ

డనుజుఁడ యురుతరశోక, మ్మెనయంగా ముంచి యున్న యేనుంబోలెన్.

387


క.

తరణికిరణసంతాపిత, ధరణి పయస్సిక్త యగుచుఁ దనరెడుఁ గంటే
విరహపరితాపయుత యై, పొరిఁబొరి బాష్పములు విడుచు భూసుతవోలెన్.

388


క.

లలితశ్యామలజలధర, కలితచలతటిన్మతల్లికలు కడుఁ జూడన్
వెలిఁగెడు రావణునంక, స్థలమునఁ జరియించు చున్నజానకివోలెన్.

389


తే.

వికసితార్జునకాంచనవిసరభరిత మైనయిగ్గిరి వర్షధారాభిషిక్త
మగుచు నొప్పెడుఁ జాలశాంతారి యగుచుఁ, బ్రీతి నభిషిక్తుఁ డైనసుగ్రీవుభంగి.

390


క.

నీరదము లావరించిన, మారాక్రాంతజనవిసరమానసహిత లౌ
నీరాత్రులు నష్టగ్రహ, తారారజనీశ లగుచుఁ దనరెడుఁ జూడన్.

391


క.

ఈవర్షాగమమున సు, గ్రీవుఁడు ప్రియసఖులుఁ దానుఁ గ్రీడించుచు ల
క్ష్మీవిభవముతో రాజ్యముఁ, గావించుచు నున్నవాఁడు గతవిమతుం డై.

392


క.

ఏ నిపుడు రాజ్యహీనుఁడ, నై నాప్రియపత్ని బాసి యశ్రులు దొరఁగన్
నానుచు నున్నాఁడఁ గడు, న్దీనత లోఁగొన్నవాహినీతీరగతిన్.

393


వ.

అని యిట్లు వగలం బొగిలి పదంపడి రామచంద్రుండు సౌమిత్రిం జూచి సాగ
రం బతివిస్తారంబు గడుదుస్తరంబు మార్గంబులు గడుదుర్గమంబులు రావణుండు
నవార్యశౌర్యుండు వాని సాధింపఁ గడింది వాలిం జంపి సుగ్రీవునితో సఖ్యంబు
సేసితి మాతండు మనకుం బ్రియసఖుండు మనదుఃఖంబునకుం గుందుచుండుఁ
జిర కాలంబు ప్రియపత్నిం బాసి యెట్టకేలకు గూడినవాఁడు గాన పత్నీసహి
తుండై సుఖంపనిమ్ము మనము చేసినయుపకారంబు చెడ నతని నిప్పుడ బలిమి
రప్పింపవలవదు కాలం బెఱింగి తనయంతన తా నుపకారశీలుం డై రాఁగలవాఁ
డనవుడు సౌమిత్రి ప్రీతుండై దేవా మీ రవధరించినట్టిద కార్యంబు భానునంద
నుండు శరత్కాలంబు వొడముటయు నధికసేనాసమన్వితుం డై పగఱ సాధింప
మిమ్ముఁ గొల్వ నేతెంచు శరత్సమయంబుదాఁక సైరింపవలయు ననిన నగుంగాక
యని యవ్వనంబున రామచంద్రుండు జానకిం దలపోయుచుండె నంత వానలు
వెలిసె నని నీరదంబులు శరదాగమనంబు చెప్ప నేతెంచిన గతి నతిశుభ్రంబు లై
పొడసూపె నాసమయంబున హనుమంతుఁడు.

394

హనుమంతుండు సుగ్రీవుని సీతాన్వేషణంబునకుఁ బురికొల్పుట

క.

ధర్మార్థసౌహృదంబు ల, ధర్మమతిం బోవ విడిచి దర్పకలీలా
కర్మఠుఁ డగుచుం గ్రాలెడు, ఘర్మాంశుతనూజుఁ డున్నకడ కేఁగి యటన్.

395


క.

అచ్చరలతోడఁ గ్రీడలు, నిచ్చలు నందనమునందు నెరపుచుఁ బ్రొద్దుల్
వుచ్చు సురేంద్రుఁడుఁబోలెను, మచ్చిక విహరించుచున్న మార్తండసుతున్.

396


ఉ.

రామునిఁ గానఁ బో మఱచి రాజ్యము మంత్రులయందుఁ బెట్టి యు
ద్దామవిలాసకేళిఁ దగఁ దారయుఁ దానును నిచ్చఁ జల్పుచుం

గామసుఖాతిరేకమునఁ గర్జముత్రోవ యెఱుంగకున్నరు
గ్ధామజుఁ జేరి మారుతి హితంబును ధర్మముఁ దోఁప ని ట్లనున్.

397


ఉ.

రాముఁడు నీకు నిత్యచిరరాజ్యము కంటక మాఱ నిచ్చినం
గామితభోగసంపదల గారవ మందుచు నున్నవాఁడ వా
రాముఁ డతిప్రభావుఁడు పరాక్రమశీలుఁడు సద్గుణాన్వితుం
డామహనీయకీర్తికిఁ బ్రికయం బొనరింపు కృతజ్ఞబుద్ధితోన్.

398


క.

మనమున మిత్రుని మఱవక, తనమిత్రహితంబు సేయు తజ్జ్ఞుఁడు రాజ్యం
బును యశముఁ బ్రతాపముఁ గని, జనశేఖరుఁ డై చరించు సర్వశ్రీలన్.

399


ఉ.

కావున నీకు రామమహికాంతుఁడు తద్దయుఁ గూర్చుమిత్రుఁ డా
భూవిభువల్లభన్ వెదకఁబూనినకాల మతీతకాల మై
పోవఁగఁ జొచ్చె నర్కసుత భూమిసుతన్ వెదకంగ వానరేం
ద్రావళిఁ బుచ్చఁగా వలయు నారఘురాముఁడు సంతసింపఁగన్.

400


క.

ఇలఁ బాతాళమున సభ, స్స్థలి నంబుధి నాఁకపడక చరియింపఁగ శ
క్తులు గలవానరవీరులు, గల రెన్న ననేకు లేను గల నీపనికిన్.

401


చ.

అనవుడు మారుతాత్మజునియాప్తహితోక్తుల కాత్మ నర్కనం
దనుఁడు ముదంబు నొంది నయదక్షుని నీలునిఁ జూచి వానితో
వినతులు దండపాశికులు వేగసమగ్రులు వైనవారి వే
పనుపు ప్లవంగయూథపులఁ బైపయి దిక్కులఁ గూర్చి తేరఁగన్.

402


చ.

సరభసవృత్తి నేడుదివసంబులమీఁదటిదాఁక నేవనే
చరుఁ డిట రాక యుండు నతిసాహసుఁ డై మఱి వానిఁ బట్టి ని
ర్భరతరచండదండములపాలుగఁ జేసి వధింతు నంచు నా
తరణితనూజుఁ డేఁగె నిజధామములోనికి నంత నక్కడన్.

403

సుగ్రీవుండు తన్నుఁ గానరామికి రాఘవుండు చింతించుట

శా.

సోమస్ఫూర్తికరంబు నిర్మలనదీస్తోమప్రవాహంబు ని
ర్జీమూతంబు నిరస్తకర్దమధరిత్రీకంబు శుభ్రకృత
వ్యోమాశాంతము ఫుల్లకాశముఁ దుషారోద్గారి యున్మీలితో
ద్దామాంభోజసరోవికాసము శరత్కాలంబు గానంబడెన్.

404


క.

రాముఁడు వర్షారాత్ర, స్తోమము నొకభంగిఁ గడపి తోయదసమయం
బేమియు లేమియు భూమిజ, రామియుఁ దలపోసి శోకరాగము లెసఁగన్.

05


క.

శరదాగమ మై యున్నది, తరణితనూజుండు రాక తడసెను దారా
తరుణీగురుతరకుచభర, పరిరంభణకామకేళిపరతంత్రుం డై.

406


వ.

అని వితర్కించి హేమధాతుభూషితం బైన పర్వతాగ్రంబునం దాసీనుం డై శా
రదశ్రీ నవలోకించి సీతం దలంచి విరహచకితుం డగుచు లక్ష్మణుం గనుంగొని.

407

క.

అలఘుతరవారిధారా, జలముల నిలఁ గలయఁ దడిపి సస్యావళులన్
ఫలియింపఁజేసి యింద్రుం, డలరెడుఁ గృతకృత్యుఁ డగుచు నవనీశసుతా.

408


క.

హరివానరదర్దురని, ర్ఝరశాఖనినదము లుడిగె జలధరసమయ
స్ఫురణములు గలయ నడఁగెను, ధరణీపంకంబు లింకెఁ దటినులు డొంకెన్.

409


తే.

కుసుమితంబు లై యొప్పెడు కోవిదార, పనససప్తపర్ణంబులు కనకరుచుల
శ్వసనతరళితకాశమంజరులు గ్రాలు, చున్న వవె మద్యమదలోలయువతులట్లు.

410


క.

దళదుత్పలములఁ గుముద, మ్ముల వికసితపుండరీకముల సరసులు మం
జులభంగులఁ జెన్నారెడు, లలితశ్రీకలిత లైన లలనలకరణిన్.

411


క.

శరదాపగ లల్లనఁ దమ, సురుచిరపులినములు వరుసఁ జూపెడు నవ్య
స్మరకేళీరంజిత లగు, తరుణులు చూపెడులసన్నితంబములగతిన్.

412


చ.

దళదరవిందగంధ కుముదస్మితతారకహార చంద్రికా
మలయజ బంధుజీవకుసుమస్ఫురితాధర యుల్లసన్నదీ
పులిననితంబబింబ తిలపుష్పసునాసిక యుత్పలాక్షి ని
ర్మలవిధుమండలాస్య యయి రమ్యశరన్నవలక్ష్మి యొప్పెడున్.

413


క.

అరులపయిన్ రాజులు భీ, కరగతి దండెత్తి పోవుకాలము వచ్చెన్
హరిసేనతోడ నినజుఁడు, బరవసమున రాక సమయభంగము సేసెన్.

414


క.

క్షితితనయఁ బాసి శోకా, న్వితమతి నై యునికిఁ జేసి యెసఁగిన వర్షా
గతమాసచతుష్కంబును, శతవత్సరసదృశ మగుచుఁ జనియెన్ నాకున్.

415


మ.

ధరణీరాజ్యముఁ గోలుపోయి ప్రియకాంతం బాసి యత్యంతదు
స్తరశోకాగ్ని మనంబు గ్రాఁగఁగఁ బ్రవాసం బొంది యే నుండఁగా
స్మరకేళీవ్యసనైకచి త్తమున భామామగ్నుఁ డై నాయెడం
బురుషార్థక్రియ దక్కినాఁడు దినకృత్పుత్రుండు కామాంధుఁ డై.

416


మ.

తరుణిం గోల్పడి రాజ్య మెల్లఁ జెడి చింతం బొంది కామార్తుఁ డై
పరదేశంబున దుఃఖముం బొదవ నాపద్యుక్తుఁ డై వచ్చి నా
శరణం బొందినఁ గోర్కి దీర్చి నిజరాజ్యం బిచ్చితిన్ మున్ను నే
శరణం బొందిన నన్నుఁ గైకొనఁడు కీశస్వామి దుష్టాత్ముఁ డై.

417

రాఘవుండు కిష్కింధకు లక్ష్మణు నంపుట

క.

నాలుగునెలలకు సీతం, బోలఁగ నెల్లెడల వెదకఁ బుచ్చెద గోలాం
గూలప్రవరుల నని యి, చ్ఛాలాపము లాడి తప్పి నతిదుర్మదుఁ డై.

418


క.

కావునఁ గిష్కింధకుఁ జని, నీ వచటం గామకేళినిరతుం డగుసు
గ్రీవునితోడను లక్ష్మణ, నావాక్యంబులుగఁ బలుకు నయనిష్ఠురతన్.

419


ఉ.

పాపము సేయ నొండె నతిబంధురధర్మము సేయ నొండె స
ల్లాపము లాడి సత్కృతి తలంపక బొంకెడువాఁడు నర్థికిం


జేపడ సంచితోపకృతి చేసినవానికి వాంఛితంబు సం
క్షేపమనస్కుఁ డై తనరఁ జేయనివాఁడును బూరుషాధముల్.

420


క.

ఉపకృతుఁ డై యుపకారికి నుపకారం బిచ్చఁ జేయకుండు కృతఘ్నుం
డపగతుఁ డైనం దద్గా, త్రపరీతామిషముఁ దినవు క్రవ్యాదములున్.

421


వ.

అని మఱియును.

422


శా.

ఉద్యజ్జ్యాలత ఘోరఘోషయుతవజ్రోగ్రధ్వనిన్ మ్రోయఁగా
విద్యుత్సంఘముభంగి వ్రాలెడుసమిద్వీరాహితత్రాససం
పాద్యస్మత్పటుదోర్వికష్టఘనచాపం బాజిలోఁ జూడఁగా
నుద్యోగింపు యమాలయంబు చొర నీ కుత్సాహ మేపారినన్.

423


మ.

మదవృత్తిం గడు వాలి వాలి తనకున్ మా ఱెందు లే దంచు ను
న్మదుఁ డై యుండఁగ నీకుఁ బూని రఘురామక్ష్మావిభుం డుగ్రుఁ డై
కదనోద్దండత నొక్కయమ్మునన వ్రక్కల్ సేసె నవ్వాలి నా
ప్రదరం బిప్పుడు మొక్కవోదు నినుఁ ద్రుంపం జాలుఁ గ్రొవ్వాఁడిమిన్.

424


మ.

జగతీనాథునితోడ నాడిన ప్రతిజ్ఞావాక్యముం జేసి స
త్యగరిష్ఠుండవు గమ్ము రాఘవునమోఘాస్త్రంబునం ద్రెళ్లి వే
గ గతప్రాణుఁడ వై మహోగ్రయమలోకం బేఁగి యచ్చోటఁ బ్రే
తగతిం బొందినవాలిఁ జూడకు సముద్యద్బుద్ధిహీనుండ వై.

425


మ.

అని సుగ్రీవునితోడ నాడు చను మం చారాముఁ డుద్వృత్తిఁ బం
చిన సౌమిత్రి మహోగ్రచాపశరముల్ చేఁ దాల్చి యత్యుగ్రుఁ డై
జననాథాగ్రణితోడ ని ట్లనియె నాశాతాశుగశ్రేణిచే
నినపుత్రున్ విదళించెదం దునిమెదన్ హింసించెదం ద్రుంచెదన్.

426


క.

అచ్చుగ సీతన్ వెదకం, బుచ్చనియాఖలుని మద్విపులబాణములం
గ్రుచ్చినఁ జచ్చి ప్రియంబునఁ, జెచ్చెర మఱి పుచ్చుఁ గాక సీతన్ వెదకన్.

427


క.

అనుచును రోషావేశం, బున మండుచు నున్నయనుజు భూవిభుఁడు ప్రియం
బునఁ గనుఁ గొని కారుణ్యం, బెనయఁగ శాంతవచనముల ని ట్లని పలికెన్.

428


క.

ఇనజున కె గ్గొనరింపకు, మనుజుఁడ నినుబోఁటిసుజనుఁ డఘముం గావిం
చునె యన్యునిభంగి నఘము, చన నెవ్వఁడు చెఱుచు వాఁడ సత్పురుషుఁ డిలన్.

429


తే.

కావునను నీవు సుగ్రీవు గాన నేఁగు, మతనితోఁ దగ సామంబు లాడు నిష్ఠు
రంబు లాడకు మనకుఁ గార్యంబు గలదు, ననిన నౌ నని యన్న వీడ్కొని యతండు.

430

రామప్రేషితుఁ డై లక్ష్మణుఁడు సుగ్రీవునిఁ గానఁబోవుట

సీ.

దండధరోద్దండదండంబుకరణిఁ గో, దండంబు తనదుహస్తమున నమర
భూరిరోషస్ఫుటభ్రూకుటి భీకర, ప్రళయకాలాంతకుపగిదిఁ గడఁగ
నురుమారుతోద్ధతి నూరువేగంబున, వృక్షషండంబులు విఱిగి కూలఁ

బ్రబలవజ్రముఁబోలెఁ బదఘాతమున నద్రి, శృంగముల్ దునియ లై శిలలు రాల
ధరణి గ్రుంగఁబడఁగఁ ద్వరతోడ దవ్వుగాఁ, దుంగభంగి నిడుదచెంగ లిడుచు
ఘోరరౌద్రరూపకోపుఁ డై సౌమిత్రి, రవిజుపురికి నేఁగె రభస మెసఁగ.

431


ఆ.

అవ్విధమున నరిగి యనతిదూరంబున, గిరిగుహాంతరాళభరితకీశ
భూరిసింహనాదములచేఁ జెలంగు కి, ష్కింధఁ గాంచి కింకఁ జేర నరిగి.

432


మ.

అరుదారన్ ఘనశైలశృంగతరువుల్ హస్తంబులం దాల్చి భూ
ధరధారాధరభూరికుంజరసముద్యద్గాత్రముల్ గ్రాలఁ ద
త్పురకాంతారమునందుఁ గ్రమ్మరుకపిస్తోమంబులం గాంచి భీ
కరకాలాంతకకాలమృత్యుసముదగ్రక్రోధసంరంభుఁ డై.

433


ఉ.

అప్పు డుదగ్రకోపవిలయాంతకుకైవడిఁ గ్రాలు లక్ష్మణుం
దప్పక చూచి వానరులు తద్దయు భీతిలి పాఱి సొంపుతో
నొప్పెడు భానుపుత్రునగ రుద్ధతిఁ జొచ్చి నరేంద్రనందనుం
డిప్పుడు వచ్చినాఁడు పురి కెక్కుడులావున నంచుఁ జెప్పినన్.

434


క.

ఇనజుఁడు తారయుఁ దానును, మనసిజలీలావిలోలమానసుఁ డగుచుం
దనయంతస్సదనంబున, నునికిన్ రాకొమరురాక యొగి వినకుండెన్.

435


వ.

ఆసమయంబున మంత్రినియుక్తులై మేఘగిరికుంజరసన్నిభులు నఖదంష్ట్రాయుధు
లు వికృతదర్శనులు వికృతాకారులు నైనయనేకవానరయూథపనికరంబులు
వృక్షపాషాణపాణులై యప్పురంబు వెడలిన నవ్వానరబలంబులం గనుంగొని సౌ
మిత్రి వారి లెక్క గొనక పురద్వారంబు సొచ్చి పోవుచు ముందటఁ దప్తకాంచనవేది
కంబును గైలాససంకాశంబును నగుసుగ్రీవునినగరు పొడగని తద్ద్వారంబున నిలిచి.

436


క.

రాణించి షడ్జమంజుల, వీణనిక్వణన మలర విలసితవేణు
క్వాణనధురీణ మగువర, గాణిక్యమనోజ్ఞమధురగానము వినియెన్.

437


వ.

తదనంతరంబ.

438


చ.

మణిగణకమ్రకంకణసమంచితనూపురముఖ్యచారుభూ
షణములు దివ్యగంధములు సౌరభశోభితపుష్పమాలికల్
ప్రణుతవిచిత్రవస్త్రములు బాఁతిగఁ దాల్చి సురూపయౌవనో
ల్బణమగు రేఖలం గలుగుభామల ముందటఁ గాంచె నయ్యెడన్.

439


వ.

మఱియును.

440


మ.

ఘనపుణ్యుం డగురామభూవిభుని దుఃఖప్రాప్తియున్ భానునం
దనురాజ్యాధికవైభవోన్నతియు నంతస్తాపముం జేయ నే
పొనరం గోపముతోడ వేఁడు లగునిట్టూర్పుల్ మొగిం బుచ్చుచుం
గనదుగ్రాక్షులఁ దామ్రరోచు లడరం గాలాగ్నిసందీప్తుఁ డై.

441


వ.

మఱియు నతిదర్పితులు నతిమదోద్ధతులు నత్యద్భుతాకారులు నగుసుగ్రీవునిపరి

చరులం జూచి రోషావేశంబున.

442


క.

శరశల్యాతతజిహ్వుం, డురుకార్ముకభోగయుతుఁడు నుద్ధురతేజ
స్స్ఫురితవిషుండును నై భీ, కరపంచాస్యాహికరణిఁ గ్రాలుచు నుండన్.

443


క.

ధీరుఁడు లక్ష్మణుఁడు గృహ, ద్వారంబునయందుఁ గనియెఁ దారాసుతుఁ డౌ
తారాసుతునిన్ లక్ష్మణుఁ, డీరస మెసఁగంగఁ జూచి యి ట్లని పలికెన్.

444


క.

రామునియనుజన్ముఁడ నే, సౌమిత్రిని రామునాజ్ఞఁ జనుదెంచితి సౌ
త్రామిజ వే చెప్పుము రు, గ్ధామజుతో ననిన నతఁడుఁ దరణిజుతోడన్.

445


ఉ.

అచ్చుగ రామభూవిభునిభయానతి లక్ష్మణుఁ డుగ్రతేజుఁ డై
వచ్చినవాఁడు వాకిటి కతవారితరోషముతోడ నావుడుం
జెచ్చెర భానునందనుఁడు చిత్తములోనఁ గలంగి చింతిలం
జొచ్చెఁ దదాజ్ఞ నంగదుఁడు శూరకపిప్రకరంబుఁ బంపినన్.

446


వ.

అప్పు డతిసత్త్వసంపన్ను లైనయాకపియూథపులు బరవసంబునఁ బఱతెంచి
కోటచుట్టును గవంకులం గలయ నలమి వజ్రసంకాశఘోరఘోషంబులు చెలంగ
లక్ష్మణుసమీపంబున సింహనాదంబులు సేయఁ దద్భూరిఘోషంబులం దారవా
క్యంబులం బ్రబోధితుం డైనసుగ్రీవుండు తనమంత్రులు వినతనలనీలసుషేణహను
మదంగదప్రముఖబలీముఖులు తన్నుఁ బరివేష్టింప సురగణపరివృతుం డైనసురేం
ద్రుండునుంబోలెఁ గ్రాలుచుండి మంత్రాలోచనంబు సేయం దొడంగిన మంత్ర
సిద్ధికొఱకు నమ్మంత్రు లుపన్యసించు ప్రభుమంత్రోత్సాహధర్మార్థప్రపంచప్రకా
రంబు లుపలక్షించి మంత్రులయనుమతంబున లక్ష్మణాగ్రహాభివ్యగ్రుం డగు
సుగ్రీవుం గనుంగొని సర్వామాత్యులును ధర్మార్థయుక్తనీతివాక్యంబుల నాతనిఁ
బ్రశాంతుం జేసిరి ధీమంతుం డగుహనుమంతుండు మఱియు ని ట్లనియె.

447


ఉ.

ఆతతరాజ్యదాయకులు నత్యుపకారులు సత్యసంధులున్
భ్రాతలు రామలక్ష్మణులు రామునిపంపున దారితాహిత
వ్రాతుఁడు లక్ష్మణుం డిటకు వచ్చినవాఁడు మహోగ్రకోపుఁ డై
యాతనిఁ జూచి భీతిఁ గపు లార్చెద రెంతయుఁ గంపితాత్ము లై.

448


చ.

ముదమునఁ బుత్రమిత్రభటముఖ్యులు మంత్రులుఁ దోడఁ గూడి రా
నెదురుగ నేఁగి మస్తకసమేతకరాబ్జము లొప్ప మ్రొక్కి స
మ్మర మొనరించి లక్ష్మణుని మానుగఁ దోడ్కొని వచ్చి కామిత
ప్రద మగుచున్న నీసకలరాజ్యము వర్ధిలఁజేయు నేర్పునన్.

449


మ.

తగ నారాసుతుఁ దెచ్చి సంతసము నొందం జేయు రా కుండినన్
మగుడం బుచ్చుము మిన్నకుండు టిది ధర్మం బైన చందంబె నీ
మొగసాలన్ నిలువంగఁ బాత్రమె మహాత్ముం డవ్విభుం డల్గినన్
జగముల్ నీఱుగఁ జేయ నోపు నతిభీష్మక్రోధదుర్వారుఁ డై.

450

క.

అని పావని పల్కిన న, ల్లన నతముఖుఁ డై బలాబలంబులు చిత్తం
బునఁ బోలఁ జూచి మంత్రుల, కినతనయుఁడు కొంతవడికి ని ట్లని పలికెన్.

451


క.

రామున కే నపరాధం, బేమియుఁ జేయను దురుక్తు లేమియు నాడన్
సౌమిత్రి యూర కేలొకొ, నామీఁదం గోపమెత్తినాఁ డుగ్రముగన్.

452


తే.

మిత్రభేదంబు సేయ నమిత్రుఁ డెవ్వఁ
డట్లు సౌమిత్రికిని గోప మడర నన్ను
నహితుఁగాఁ జెప్పినాఁడొ నాయందు దోష
మొండు గావించి యాతఁడు మండువాఁడొ.

453


క.

అతిమిత్రుఁ డగుసుమిత్రా, సుతుఁ డధికక్రోధ మాత్మఁ జోఁకి యునికి నా
కతిశాతహృదయశల్యము, గతి నున్నది మానసమునఁ గడుదుస్సహ మై.

454


క.

మనుజేశుఁడు నాకుం జే, సినయుపకారంబు మఱవఁ జిత్తం బలరన్
మును చెలిమి చేసి విభుతోఁ, దనరం బలికిన ప్రతిజ్ఞ తప్ప కొనర్తున్.

455


వ.

అనిన విని హనుమంతుండు సుగ్రీవునిం గనుంగొని.

456


క.

నీవలన నెగ్గు గానము, నీవు కృతజ్ఞుఁడవు ప్రతిన నెఱపెదు మీఁదన్
భూవిభుతమ్ముం డిటకున్, వే వచ్చిన కారణంబు వినుము కపీంద్రా.

457


క.

జానకి వెదకం బుచ్చెద, వానలు [1]వెలియంగ ననుచు వసుధేశునితోఁ
బూనికఁ బలికితి విప్పుడు, వానలు వెలిసెను శరర్తు వాలఁగఁ జొచ్చెన్.

458


క.

కాలం బెఱుఁగక రతిసుఖ, లోలత నీ వునికి నాత్మలోనన్ వగలం
దూలుచు లక్ష్మణు రామనృ, పాలుఁడు పుత్తెంచెఁ బ్రణయభరరోషమునన్.

459


ఆ.

వాలిఁ జంపి నీకు వనచరరాజ్యంబు, రామచంద్రుఁ డిచ్చెఁ ప్రేమ మెసఁగఁ
గాన కృత మెఱింగి మానవేంద్రునికోర్కి, చెలిమిఁ దడయకుండ జేయవలయు.

460


వ.

అని హనుమంతుండు పలుకుహితోక్తులకు సుగ్రీవుం డెంతయు సంతోషించె
నంత సుగ్రీవమంత్రిసమానీతుం డై లక్ష్మణుండు జాతరూపమయంబును గనక
సాలభంజికాచిత్రితవైడూర్యస్తంభసంభృతంబును దివ్యరత్నసమాకీర్ణప్రవాళో
ద్ధూతతోరణంబును బహులఫలదళకుసుమవిసరభాసురోద్యానభాసమానంబును
భర్మనిర్మితహర్మ్యప్రాసాదరమ్యంబును దేవగంధర్వసంభూతవానరసంఘాతసమ
న్వితంబును జందనాగరుకమలకువలయప్రముఖకుసుమమైరేయాదవరాసవవా
సితరాజమార్గంబును విమలాప్సరోవరమనోహరంబును దేవతాయతనోపరివి
హితశాతకుంభదేదీప్యమానంబును విశ్వకర్మనిర్మితంబును నగుకిష్కింధానగరం
బు సొచ్చి ముందట నంగదమైందద్వివిదగజగవయశరభశతబలికుముదపనసనల
నీలవిద్యున్మాలిసంపాతివీరబాహుసుబాహుహనుమత్సుషేణరంభజాంబవదృప
భాదివీరవానరులగృహంబుల నాలోకించుచుఁ దదగ్రభాగంబునఁ గైలాసశిఖర

సంకాశప్రాసాదశిఖరవిజితంబును సర్వకామప్రదఫలకుసుమవిలసితపాదపాభిశో
భితంబును వివిధాయుధకలితనీలజీమూతసన్నిభవీరవానరపరివేష్టితద్వారంబును
దివ్యపుష్పదామాభిరామకాంచనతోరణసమంచితంబును గనకచిత్రపుత్రికారూ
పానురూపరూపాజీవాసేవితంబును నగుసుగ్రీవునినగరు చేరి తదీయనియోగంబున
ముకుళితహస్తు లగుచు మస్తకన్యస్తహస్తు లైనహనుమత్ప్రముఖామాత్యులు
తన్ను నెదుర్కొన్న వారి నుచితోక్తుల నాదరించుచు దివ్యయానాసనసమావృ
తంబు లైనసప్తకక్ష్యంబులు గ్రమంబునఁ గడిచి హేమరాజతపర్యంకంబులు
మహాస్తరణోపేతసింహాసనంబులు గలయంతఃపురంబుకట్టెదుర.

461


సీ.

మండితమణిమయమండనంబులు దాల్చి, మృదులాంబరంబులు మెఱయఁ గట్టి
సురభిమాల్యంబులు సొంపార ధరియించి, కమనీయగంధముల్ గలయ నలఁది
కంకణక్వణనముల్ గ్రాల నారులు హేమ, చారుచామరములు చేరి పట్టఁ
దారాధిపానన తార దాపలిదెస, రుమ దక్షిణంబున నమరుచుండ
సరసకామినీశతసహస్రములు గొలువ, నప్సరోగణపరివృతుఁ డగుచు మహిమ
నమరునమరేంద్రుగతి నున్న హారరత్న, కిరణసంవృతగ్రీవు సుగ్రీవుఁ గనియె.

462


క.

కని యాసుగ్రీవునిపెం, పును నౌదాసీన్యగతియు భూవిభుదైన్యం
బును దలఁచి లక్ష్మణుఁడు బిల, ఘనసంశుద్ధాహికరణి గాసిలుచుండెన్.

463


మ.

తటిదంచద్గుణచాపబాణధరు సందష్టాధరోష్ఠున్ నట
త్కటనాసాపుటసంకటోగ్రముఖు నుర్యద్భ్రూకుటీభంగసం
ఘటనాఘాటలలాటు నుష్ణకరదీర్ఘశ్వాసవేగున్ విశం
కటకోపోత్కటవిస్ఫులింగయుతరూక్షప్రేక్షణున్ లక్ష్మణున్.

464


చ.

కని రవిజుండు భీతిఁ దనకాంతలు మంత్రులుఁ దాను హస్తముల్
వినయముతోడ మోడ్చుకొని వేగ మెదుర్కొని యానరేంద్రపు
త్రుని సదనంబులోపలికిఁ దోడ్కొని వచ్చి తగంగ నంచితా
సనమున నుండు మీ వనిన సమ్మతి సేయక యాతఁ డి ట్లనున్.

465

లక్ష్మణుండు సుగ్రీవునితోఁ బరుసంబు లాడుట

క.

జనపతి పంచినదూతను, జననాథునిపంపు గాక సత్కారము గై
కొనఁగ భుజింపఁగ నిటఁ గా, ల్కొని నిలువఁగ నుచిత మౌనె కుమతీ నాకున్.

466


వ.

అనవుడు సుగ్రీవుం డతివ్యథితచిత్తుం డై దండప్రణామంబు చేసి మైత్రి నెరయ
సౌమిత్రి కి ట్లనియె.

467


శా.

రామక్ష్మాపతి కేను భృత్యుఁడ నుదగ్రస్నేహ మేపార నా
భూమిశాగ్రణియాజ్ఞ సేసెదఁ దగం బూజ్యాసనస్థుండ వై
ప్రేమం గైకొను మర్ఘ్యపాద్యములు ధాత్రీనాథసత్పుత్ర నా
రామక్ష్మావిభుతమ్ముఁ డి ట్లనియె ధర్మం బొప్ప సుగ్రీవుతోన్.

468

క.

మును రామవిభునియానతి, చనఁ జేసినయంతమీఁద సత్కృతులను జే
కొనియెద విను నీతోడను, జననాథుం డాడు మనిన సముచితభాషల్.

469


క.

కులబలలలితుఁడు సూనృత, కలితుండు జితేంద్రియుండుఁ గరుణాన్వితుఁడు
విలసితధర్ముఁడు నగురా, జిలలో నతిపూజ్యుఁ డగుచు నేపారు సిరిన్.

470


క.

ఉపకారి యైనమిత్రున, కుపకృతి సేయం బ్రతిజ్ఞ యొనరించి మృషా
లపితుండై యుండెడునా, కపటాత్ముం డధికహింసకతముం డరయన్.

471


సీ.

పశువాంఛ బొంకినఁ బంచపశుఘ్నుఁడౌ, గోనృతాత్ముఁడు దశగోప్రహర్త
యశ్వానృతుండు శరతాశ్వహింసకదోషి, [2]పురుషానృతసహస్రపురుషహరుఁడు
వసుధకై బొంకినవాఁడు సర్వధ్వంసి, కనకంబుకొఱకు బొంకినఖలుండు
సకలజాతాజాతజనులఁ ద్రుంచినవాఁడు, తనపల్కు మిథ్య చేసినయతండు
దన్ను నాప్తజనులఁ దా వధించిన పాపి, భువిఁ గృతఘ్నుఁ డఖలభూతఘాతి
యని కృతఘ్నుఁగూర్చి యఖిలలోకేశుండు, పరఁగఁ బల్కినట్టిపలుకు వినుము.

472


క.

మతిఁ దలఁప వచోభగ్న, వ్రతునకును సురాపునకు నిరంతరమును ని
ష్కృతి గలదు గాని తగ ని, ష్కృతి లేదు కృతఘ్నబుద్ధికిని విబుధోక్తిన్.

473


క.

ఉపకృతుఁ డై యుపకారికి నుపకారం బిచ్చఁ జేయకుండుకృతఘ్నుం
డపగతుఁ డైనను దద్దా, త్రపరీతామిషముఁ దినవు క్రవ్యాదములున్.

474


చ.

నృపతికిఁ దోడువత్తు ధరణీసుత నారయఁ బుత్తు నంచు ని
క్కపుగతి [3]ఋశ్యమూకమునఁ గందువ సేయవె యగ్నిసాక్షిగా
శపథము చేసి తిప్పి యిటు సంతతదారరతానుభూతి మో
హపడుచు నున్నవాఁడవు నృపాగ్రణిమేలు దలంప వేమియున్.

475


క.

రామునిచే రాజ్యముఁ గొని, ప్రేమం గామినులతోడఁ గ్రీడించెద వా
రామునితెరువు దలంపవు, కామాంధుడు గనునె యర్హకార్యము చేయన్.

476


క.

మును నీ వాడినమిథ్యా, సునయోక్తుల రాముఁ డలరె శుభతరచిత్తం
బున నారసి మండూక, స్వనఫణి వగు టెఱుఁగఁ డకట జనపతి నిన్నున్.

477


మదవృత్తిం గడు వాలి వాలి దనకున్ మా ఱెందు లే దంచు ను
న్మదుఁ డై యుండఁగ నీకుఁ బూని చని రామక్ష్మావిభుం డుగ్రుఁడై
కదనోద్దండత నొక్కయమ్మునన వ్రక్కల్ సేసె నవ్వాలిఁ ద
త్ప్రదరం బిప్పుడు మొక్కవోదు నినుఁ ద్రుంపం జాలుఁ క్రొవ్వాఁడిమిన్.

478


శా.

ఉద్యజ్జ్యాలత ఘోరఘోషముల వజ్రోగ్రధ్వనిన్ మ్రోయఁగా
విద్యుత్సంఘముభంగి వ్రాలెడుసమిద్వీరాహితత్రాససం
పాద్యన్మత్పటుదోర్వికృష్టఘనచాపం బాజిలోఁ జూడఁగా
నుద్యోగింపు యమాలయంబు చొర నీ కుత్సాహ మేపారినన్.

479

మ.

జగతీనాథునితోడ నాడిన ప్రతిజ్ఞావాక్యముం జేసి స
త్యగరిష్ఠుండవు గమ్ము రాఘవునమోఘాస్త్రంబులం ద్రెళ్లి వే
గ గతప్రాణుఁడ వై మహోగ్రయమలోకం బేఁగి యచ్చోటఁ బ్రే
తగతిం బొందినవాలిఁ జూడకు సముద్యద్బుద్ధిహీనుండ వై.

480


క.

నీచేసినయవమానము, నాచిత్తములోన నసహనం బై పై పై
నేచుచునున్నది పున్నమ, వీచులచేఁ బొంగు జలధివిధమున నీచా.

481


క.

అత్యుపకృతిరహితుండ వ, సత్యుఁడ వకృతజ్ఞమతి వసఖ్యుండ వస
త్ప్రత్యయయుతుఁడవు స్త్రీసాం, గత్యవ్యసనుఁడ వపుణ్యకర్ముఁడవు కపీ.

482


వ.

కావున నాబాణంబులం దునిమి ని న్నిపుడ యమలోకంబున కనిచెద నని రోషా
వేశంబునం బలుకుచున్నసమయంబున.

483

తార లక్ష్మణునకుఁ గోపోపశమనంబు సేయుట

క.

తారానిభతారాంచిత, [4]హారిణి తారాభరదన యకలంకలస
త్తారాధిపసదృశానన, తారాసతి యనియె నపుడు తారాసుతుతోన్.

484


చ.

తరణిసుతుండు లక్ష్మణ కృతఘ్నుఁడు గాఁ డనృతుండు గాఁడు దు
శ్చరితుఁడు గాఁ డవజ్ఞుఁడు నృశంసుఁడుఁ గాఁడు కృతోపకారవి
స్మరణయుతుండు గాఁడు నృపుసత్తమునాజ్ఞకుఁ దప్పఁ డేల యీ
పరుసపుమాట లాడె దిటు బంధురకోపము డింపు లక్ష్మణా.

485


క.

ఈరాజ్యముఁ గిష్కింధము, నీరుమతోఁ గూడ నన్ను నీమణికనకో
దారధనధాన్యలక్ష్ములు, నీరవిజున కిచ్చినారు లెలమిన్ మీరల్.

486


క.

మీ పెట్టిన చె ట్టినజుఁడు, మీపం పొనరింపఁగలఁడు మిత్రత నెరయన్
వే పుచ్చినాఁడు సకలది, శాపథములకుఁ గపిపతుల జయ్యనఁ జేరన్.

487


క.

ఇనజుఁడు మీతోఁబుట్టువు, జనపతి కెంతయుఁ బ్రియుండు సంపూజ్యుఁడు రా
మునకును గపిబలములతో, ఘనతరసాహాయ్యకంబు గావించుఁ దగన్.

488


క.

ఆర్యుఁడవు ధర్మపరుఁడవు, గార్యజ్ఞుఁడ వీవు దప్పు గానక సఖునిన్
సూర్యసుతు మాన్యుఁ జనునె య, వార్యక్రోధమునఁ బరుషవాక్యము లాడన్.

489


క.

యతి యగువిశ్వామిత్రుఁడు, మతి చెడి మేనకకుఁ జిక్కి మన్మథలీలా
రతుఁ డై యుండఁడె పదియేం, డ్లితరుఁడు కార్యంబు నెఱుఁగ నేగతి నేర్చున్.

490


వ.

వినుము లక్ష్మణా దురాత్ముం డైనరావణున కపారసత్త్వసంపన్నులుఁ గామరూపు
లు నైనరాక్షసవీరులు దశకోటిసహస్రంబులు షట్త్రింశదయుతంబులుఁ గల రా
రక్కసుల నసహాయులై గెలువ నశక్యంబు గాన యతిబలు లైనవానరకోట్లతోడ
సుగ్రీవుండు రామునకు సహాయుం డయి లంకపై దండెత్తిపోవుతలంవున సముద్ర
పర్యంతభూమివనచరుల సాగరద్వీపవాసు లైనఋక్షకోటిసహస్రంబులఁ దో

డ్కొని తేర బలిమి గలవానరులం బంచినవాఁడు గావునఁ గోపం బుడిగి ప్రస
న్నుండవు గ మ్మనుచుఁ బలికి.

491


ఉ.

దేవనుతుండు రామజగతీపతి వానరసేనఁ గొంచు సు
గ్రీవుఁడు తోడుగాఁ జని గరిష్ఠవిశిష్టబలాఢ్యుఁ డై దశ
గ్రీవు వధించి సీతఁ గొని ప్రేమ మెలర్పఁగ వచ్చు నంచు సం
భావన నాకు వాలి మును ప్రాజ్ఞత యొప్పఁగఁ జెప్పెఁ గావునన్.

492


క.

రావణునిఁ దునిమి రామ, క్ష్మావిభుఁడు మహీజతోడ జయలక్ష్మీసం
భావితకీర్తులు వెలయఁగ, వేవేగ మయోధ్య నేల వేంచేయుఁ దగన్.

493


చ.

అని నయ మారఁ దార తగ నాడెడుమాటల కిచ్చగించుచున్
ఘనుఁ డగులక్ష్మణుండు వినఁగా నపు డవ్విభ వెంట నాత్మ నే
చినభయ మెల్ల బోవ విడిచెం గమలాప్తసుతుండు ద్రెంచి వా
డినగజపుష్పదామము తొడింబడఁ బాఱఁగ వైచుకైవడిన్.

494


వ.

అట్లు లక్ష్మణునివలనిభయంబుఁ బాసి సుగ్రీవుండు ప్రస్తుతవాక్యంబుల హృద
యం బలర ని ట్లనియె.

495


చ.

జగతీనాయకునాజ్ఞ నే మఱతునే సైన్యంబులం గూర్చి తేఁ
దగువారిన్ మును సర్వదిక్కులకు నాస్థం బంచి నేఁ డెల్లి క్షి
ప్రగతిన్ వచ్చెద రంచు వానరచమూపాంసుచ్ఛటాసమ్మిళ
ద్గగనాభోగనిరీక్షణోన్ముఖుఁడ నై గాసిల్లెదం గాంక్షతోన్.

496


మ.

నను ముబ్బాములఁ బెట్టువాలి ననిలోలన్ లీలఁ దున్మాడి నా
కనుమోదంబుగ సర్వసంపదలఁ బ్రాజ్యం బైనరాజ్యంబు ని
చ్చె నృపాలాగ్రణి తత్ప్రసాదమున నీశ్రీ లొంది యున్నాఁడఁ బెం
పెనయన్ నామది నామహాత్మునిఋణం బే నేమిట న్నీఁగెదన్.

497


క.

అరుదుగ నేకాస్త్రమునన, ధరణీశుఁడు లీల నేడుతాళంబులు భూ
ధరమును భూతలమును దా, నురవడిఁ గాఁడి చన నేసె నుద్ధురభంగిన్.

498


చ.

ధరణి సమస్తమున్ వడఁకెఁ దద్ధను వప్పుడు మ్రోయ రాముఁ డొ
క్కరుఁడ భుజోగ్రశక్తిఁ ద్రిజగంబులు గెల్వఁగ నోపు నాసము
ద్ధురభుజశాలి కెవ్వరును దోడ్పడ నేటికి నైన సేనతో
నరిగెద లంకమీఁదికి నృపాగ్రణి కే ననుయాయిమాత్ర మై.

499


క.

జననాథుఁడు మన్నించుటఁ, జనవు మెఱసి యైన నధికసఖ్యంబున నై
నను నేఁ దడసితి దాసుఁడ, ననుఁ జేకొను మనపరాధి నరనాథసుతా.

500


వ.

అనిన ముద మంది సౌమిత్రి మైత్రి నెరయ నమ్మిత్రసూనం గనుంగొని.

501


క.

దైవము నీకును రామ, క్ష్మావిభునకు నిట్లు మైత్రి గలుగఁగఁ జేసెన్
నీవును నృపతియుఁ గులమున, లావున దొరయఁ దగువారు ప్లవగాధీశా.

502

క.

నీవు సహాయముగా సు, గ్రీవ దశగ్రీవుఁ దునిమి కీర్తి వెలుంగన్
భూవిభుఁడు సీతఁ దోడ్కొని, వావిరి సాకేతపురి కవశ్యం బరుగున్.

503


చ.

ధరణిజఁ బాసి నెవ్వగలఁ దద్దయు వేఁగుచు నున్న రామభూ
వరుకడ కేఁగుదెంచి ప్రియవాక్యములన్ ముద మందఁజేయు వా
నరవర దుఃఖి యైననరనాథునిపంపున నల్లి నిన్ను ని
ష్ఠురములు పెక్కు లాడితిఁ గడున్ మది సైఁపుము నన్ను మైత్రితోన్.

504


క.

అని లక్ష్మణుండు పలికిన, మనమున సంతోష మంది మర్కటనాథుం
డెనయఁగఁ దనపార్శ్వంబునఁ, దనరెడుహనుమంతుఁ జూచి తగ ని ట్లనియెన్.

505


శా.

నీలాస్తోదయసహ్యభూధరముల న్వింధ్యాంజనాగంబులం
గైలాసంబున హేమకూటనిషధగ్రావప్రదేశంబులం
బ్రాలేయాచలమేరుమందరమహేంద్రక్షోణిభృల్లోకలో
కాలోకాద్రుల మాల్యవన్మలయముఖ్యతిక్ష్మాధరేంద్రంబులన్.

506


చ.

ధరఁ గలసర్వపర్వతకదంబనివాసులఁ బూర్వపశ్చిమో
త్తరజలరాశితీరసముదగ్రసరిద్వనభూములం గరం
బిరువుగ నున్న వానరుల నే మును దేరఁగఁ బంచినాఁడ బం
ధురగతి నీవు సత్త్వజవధుర్యగతిజ్ఞులు నైనవారలన్.

507


వ.

శతసహస్రకోటిసంఖ్యలు గలవానరవీరులం బుచ్చి సకలదిక్కులకపుల సామ
దానాదుల మన్నించి వేవేగ యిటకు రప్పింపు మని నియోగింప నాంజనేయుం
డును నట్ల పనుపఁ దదీయనియుక్తులయిన వీర మర్కటకో ట్లాటోపంబున.

508


చ.

ఉరవడి నింగికిన్ నెగసి యుద్ధురవేగము లార నేఁగి తా
రురుగిరులం బయోధుల వనోపవనంబుల సింధుభూములం
బరఁగఁగ నున్న వానరుల భానుజునానతిఁ జెప్పి మీరు స
త్వరగతి వానరేంద్రుఁ గొలుకవం జనుఁ డంచును జీరి యేపునన్.

509


క.

తరణిజుదూతలు వనచర, వరులు మధురకందమూలవాంఛితఫలముల్
వరుసం గొని కిష్కింధా, పురమునకున్ వచ్చి రెలమి భూరిత్వరు లై.

510


ఉ.

వచ్చి సమస్తవానరులు వన్యఫలంబులు కందమూలముల్
తెచ్చి యుపాయనోచితగతిం దగ నిచ్చి కపీంద్ర మమ్ము మున్
పుచ్చిన సర్వదిక్కులకుఁ బోయి వనాటుల నోలిఁ జీరి వే
వచ్చితి మెల్లవానరులు వచ్చెద రిప్పుడ యంచుఁ జెప్పినన్.

511


వ.

సుగ్రీవుండు సంతసంబు నొంది తనమనోరథంబు సఫలంబు నొందె రామ
చంద్రునికోర్కి దీర్పం గలిగె నని తలపోసి వచ్చినవారల వీడ్కొలిపి నంతఁ
గపిరాజుశాసనంబును నస్తాచలవాసులు దప్తహేమప్రభగలవారలు మనోవేగులు
మూఁడుకోట్లప్లవంగయూథవులుఁ గైలాసశిఖరంబున నున్న సింహకేసరభాసుర

వర్ణులు సప్తకోటిశతనహస్రశైలచరవీరులును హిమగిరిసమాశ్రితులు సహస్రో
త్తరసహస్రకోటిహరివీరులు వింధ్యాచలవాసులు నంగారనికరాభులు భీమవిక్ర
ములు భీమాకారులు నగుసహస్రకోట్లు మర్కటోత్తములుఁ గిష్కింధకు వచ్చిరి
మఱియు క్షీరోదధివేలానిలయులు నారికేళాశనులును జండాకారులు నైనబలీ
ముఖు లసంఖ్యానీకంబులఁ గూడి మార్తాండమండలంబు నిరోధించుచు నేతెం
చిరి వెండియు.

512


ఉ.

దిక్కులు నాకసంబు జగతీతలభాగము నెల్లచోటులుం
క్రిక్కిఱియంగఁ గ్రందుకొని కీశబలంబులు వెన్క ముందటం
బెక్కుపథంబులన్ నడువ భీకరభంగులఁ గ్రొవ్వు లారఁగా
నక్కజ మంద వచ్చి ప్లవగాధిపుఁబట్టణ మెల్ల ముంచినన్.

513


వ.

కని మనంబున నుత్సహించి మరుత్పుత్రుతో సుగ్రీవుం డిట్లనియె.

514


శా.

నే నీసేనలతోడఁ గూడఁగఁ బ్రియాన్వీతుండ నై తన్ను వే
కానం బోయిన నాదుయత్న మతికాంక్షం జూచి నామీఁద నా
భూనాథాగ్రణి కింక దక్కి కరుణాపూర్ణాత్ముఁ డౌఁ గా కెడం
దా నె గ్గొండు దలంచినం దలఁపనీ త న్గొల్వ నేఁ బోయెదన్.

515


వ.

అనిన విని హనుమంతుఁ డతని కి ట్లనియె.

516


ఉ.

రాముఁడు నిత్యసత్యుఁడు శరణ్యుఁడు న్యాయపరుండుఁ ద్రాతయున్
స్వామియు ధర్మవత్సలుఁడు సత్యసమేతుఁడుఁ గావ పాపహిం
సామతి గాఁడు లక్ష్మణుఁడు చాల సహాయుఁడు గాఁగఁ జన్న ని
న్నే మియుఁ జేయఁ డర్కసుత యేఁగుము వేగమ రాముపాలికిన్.

517


వ.

నావుడు సంతోషించి మిత్రపుత్రుండు మైత్రి నెరయ సౌమిత్రి కి ట్లనియె.

518


క.

శూరత వాలిన వాలి, న్దారుణగతిఁ దునిమి యిచ్చె నాకున్ రాముం
డీరాజ్యము నీనగరము, నీరుమ నీ తార నీసమృద్ధశ్రీలన్.

519


ఉ.

వచ్చి రుదగ్రవేగబలవంతులు నాప్తులు నైనసర్వభూ
భృచ్చరవీరవానరులు పెంపును సొంపును నొప్పఁగాఁ బ్లవం
గోచ్చయముల్ కెలంకులను గొల్వ సముద్ధతి రామభూవిభుం
డెచ్చట నున్నవాఁ డచటి కేఁగుద మవ్విభుఁ డుత్సహింపఁగన్.

520

సుగ్రీవుఁడు లక్ష్మణసహితుం డై మాల్యవంతంబునకు వచ్చుట

వ.

అని పలికి గమనోత్సాహం బెసంగ.

521


స్రగ్ధర.

భూరిప్రస్థానభేరు ల్పొరిఁబొరి జయము ల్పొంగ వేయించె నుద్య
త్పారావారోగ్రయాదఃప్రకరభయకరస్ఫారఘోరస్ఫురద్భాం
కారారావంబు లారన్ గగన మద్రువ దిగ్భాగము ల్వ్రయ్యఁ గిష్కిం
ధారుంద్రక్షోణిభృత్కందరములు పగులన్ ధాత్రి యాకంప మొందన్.

522

వ.

ఇట్లు ప్రయాణభేరులు వేయించి తారాదికాంతల నంతఃపురంబున కనిచి సౌ
మిత్రి కుచితసత్కృతు లొనరించి వానరులచే నొక్కమణిశిబికం దెప్పించి ముంద
టం బెట్టించి చేతులు మొగిచికొని రామభూవిభుఁ గొలువం బోదము శిబిక
యెక్కు మని ప్రార్థించిన.

523


మ.

మణిరాజచ్ఛిబికాధిరూఢుఁ డయి రమ్యచ్ఛత్రముల్ పట్ట నీ
క్షణభద్రామలచామరంబు లిడ శంఖస్ఫారభేరీసము
ల్బణరావంబులు పెల్లుగా మొరయఁ బైపై వందిసందోహముల్
ప్రణతుల్ సేయఁగ లక్ష్మణుం డరిగె నారామప్రభుం గానఁగాన్.

524


చ.

ఇనతనయుండు దాను నొకహేమలసచ్ఛిబికాధిరూఢుఁ డై
సునిశితశస్త్రపాణు లొగి సూరెలఁ గొల్వఁగ శంఖదుందుభి
స్వనములు దిక్కులం జెలఁగ సైన్యపదాహతులన్ సమస్తమే
దినియుఁ జలింప రామజగతీపతిపాలికి నేఁగె సమ్మతిన్.

525


వ.

ఇ ట్లరిగి మాల్యవంతంబు చేరి యనతిదూరంబున.

526


క.

లక్ష్మణరవిజులు [5]శిబికలు, సూక్ష్మత్వర డిగ్గి వినయశోభితు లై రా
బక్ష్మలితాక్షుం డై రా, మక్ష్మాపతి వారి జూచె మచ్చికతోడన్.

527


చ.

తరణిసుతుండు రామవిభు దవ్వులఁ గన్లొని హ స్తపద్మముల్
శిరమునఁ జేర్చి మ్రొక్కుచును జేరఁగ వచ్చి సమగ్రభక్తితో
ధరపయిఁ జక్కఁ జాఁగిపడి దండము పెట్టినఁ గేల నెత్తి భూ
వరుఁడు కవుంగిలించెఁ గపివల్లభునుల్లము పల్లవింపఁగన్.

528


వ.

అట్లు గారవించి కృతాంజలు లై ముందట నిలిచియున్న సుగ్రీవునిం దక్కినవన
చరవీరులం గూర్చుండ నియోగించి యాసీనుం డైనసుగ్రీవునిం జూచి ప్రణయ
కోపావేశంబున ని ట్లనియె.

529


క.

సతతము ధర్మార్థార్జన, రతుఁ డయ్యును విహితసమయర్తక్తిం గామో
చితములు సల్పెడు జనపతి, యతులితరాజ్యంబు నొంద నర్హుం డెందున్.

530


క.

సురుచిరధర్మం బెప్పుడుఁ, బరికింపక నీవు కామపరతంత్రుఁడ వై
తరుణీసంగతి నుండఁగ, మరగి ననుం జెలిమిఁ జేర మఱచితి మదిలోన్.

531


క.

ఏ నిన్నుఁ బిలువఁ బంచిన, మానుగ నీబ్రదుకుకొఱకు మఱి వచ్చి తిటం
గాని తగుమైత్రి నెఱయన్, జానుగ నీయంత రావు చనునే చెపుమా.

532


క.

లంకన్ రావణుఁడు నిరా, తంకంబుగ సీత దాఁచి తా నున్నాఁ డా
వంకం జానకి వెదక న, శంకితు లగుకపులఁ బనుపు చయ్యన నింకన్.

533


అన విని క్షానుసూనుఁడు కృతాంజలి యై ప్రణమిల్లి యాత్మలో
నెనసినభీతిఁ బో విడిచి యెంతయు సంతస మంది యి ట్లనున్

జనవర నాకుఁ బ్రాణములు శాశ్వతరాజ్యము సర్వసంపదల్
చనఁ బ్రియకాంతలుం జిరయశంబును గ్రమ్మఱఁ గల్గె నీకృపన్.

534


క.

నీ వతిసఖుఁడవు భర్తవు, దేవుండవు నీకు నుపకృతి యొనర్పనివాం
డీవసుధ నధమపురుషుఁడు, నావిన్నప మవధరింపు నరవరవర్యా.

535


వ.

మున్ను నేను సకలదిక్కులకు దూతలం బంచిన వా రేగి భూమిం గలసర్వవా
నరర్క్షగోలాంగూలబలంబులం గొని వేగ వచ్చుచున్నవారు దేవగంధర్వపు
త్రులుఁ గామరూపులు నైనవానరవీరులు తమతమబలంబుతోడ.

536


చ.

శతములు వేలు లక్షలును శంఖశతంబులు నర్బుదార్బుదా
యుతములు గోటిశంఖములు నోఘసముద్రమహాసముద్రసం
హతులును వేయిఖర్వములు సంత్యపరార్థసహస్రబృందముల్
క్షితితతియున్ మహాక్షితియుఁ జెప్ప నసంఖ్యవనాటపైన్యముల్.

537


వ.

రఘువరా మిమ్ముఁ గొలువ వచ్చెదరు వచ్చి లంకకు నిశ్శంకం జని పుత్రమిత్రా
మాత్యులతోడం గూడ రావణుం బరిమార్చి కల్యాణగుణసమేత యగుసీతం
గొనివచ్చెద రని పలికిన సంతోషించి రామచంద్రుండు సుగ్రీవుని నాలింగనంబు
చేసి యతనితో ని ట్లనియె.

538


చ.

పరహితవాంఛఁ జీఁకటులు భానుఁ డడంచుట చందురుండు శ
ర్వరి నలరారఁ జేత సురరా జిల వానల నాన ముంచుటల్
ధరణి సమస్తభూతములఁ దాల్చుట చిత్రమె కావునన్ దివా
కరసుత నాకు నీవు నుపకార మొనర్పఁగ రాక చోద్యమే.

539


క.

తరణితనూభవ సూనృత, పరుఁడవుఁ బుణ్యుఁడవు నాకు బంధుఁడవు సహో
దరుఁడవుఁ బ్రియుఁడవు సఖుఁడవుఁ, బరమాప్తుఁడ వట్లు గాన ప్రమదం బెసఁగన్.

540

వానరబలంబులు సుగ్రీవుం జేర వచ్చుట

వ.

సీత వెదకఁ దగిన వానరవీరులం బుచ్చు నీవలన నాకోర్కి సఫలం బయ్యెడు నను
నంతలోన నదీనదసముద్రతీరపర్వతప్రాంతవాసు లయినసుగ్రీవునిసైనికులు
నూఱులు వేలు లక్షలు కోట్లు గము లై సాలతాలశిలాపాణులును నఖదంష్ట్రా
యుధులును సితాసితకనకకేసరవర్ణులుఁ గామరూపులుఁ గామగమనులు నీలజీ
మూతభీమాకారులు నగుమర్కటవీరులు దెసలు నాకసంబును నిండి రాఁ దొ
డంగి రయ్యెడ.

541


ఉ.

వాలువిశాలవాలములు వావిరిఁ ద్రిప్పుచు సాలతాలహిం
తాలముఖద్రుమంబులు నుదగ్రశిలాచలభూరిశృంగముల్
గేల ధరించి నల్గడలఁ గ్రేళ్లుగ దాఁటుచు నార్పులన్ దెసల్
వ్రీలఁగఁ జేయుచున్ బహుబలీముఖసేనలు వచ్చె నేపునన్.

542


వ.

తదనంతరంబ పదివేలకోట్లవనాటులతోడ శతబలియు ననేకశతసహస్రకోట్లతోడ

సుషేణుండును బహుదశసహస్రంబులతోడ హనుమంతునితండ్రి కేసరియును
మహా వేగులై నకోటిగోలాంగూలురతోడ గవాక్షుండును శతసహస్రకోటిఋక్ష
వీరులతోడ ధూమ్రుండును మహాబలసమాను లైనపదికోట్లబలీముఖులతోడఁ
బనసుండును బదికోట్లకపులతోడ నీలాంబుదనిభుండును యూథపయూథపుండు
నగునలుండును బండ్రెండుకోట్లతోడ సనాథుండు నొక్కొక్కకోటితోడ గజగవ
యవృషభశరభులు నేడెనిమిదికోట్లతోడ మైందద్వివిదులు నాఱుకోట్లతోడ గం
ధమాదనుండును గోటిఋక్షవరులతోడ ఋమణ్వంతుండును సహస్రశతశంఖంబుల
తోడ నంగదుండును సహస్రకోట్లతోడఁ దారాధిపద్యుతి గలతారుండును బెక్కు
సేనలు గొలువ వేయికోట్లతోడ హనుమంతుండును బద్మకోటిశతంబులతోడ
నింద్రజాలుండును శతకోటిశతంబులతోడ నీలద్యుతి గలనీలుండును బండ్రెండు
కోట్లప్లవగవీరులతోడఁ బ్రజంఘుండును సహస్రఖర్వంబులతోడఁ గుముదుండును
నిరువదియొక్కకోటితోడ దధిముఖుండును బొడచూపిరి మఱియును వినతుండును
విజయుండును సంపాతియు జాంబవంతుండును వేగదర్శియు మహాహనుండును
శతార్చియు శతగుల్ముండును సుహోత్రుండు నుల్కాముఖుండును మొదలుగాఁ
గలకామరూపు లైనప్లవంగపుంగవులు తమతమసైన్యంబులతోడ శైలవనసా
గరసహిత యైన సర్వంసహ నావర్తించి గునియుచు నుప్పరం బెగసి దాఁటుచుం
ద్రుళ్లుచు గర్జిల్లుచు వచ్చి సుగ్రీవునిం బరివేష్టించిరి తత్సమయంబున సుగ్రీవుండు
రామచంద్రున కి ట్లనియె.

543


చ.

జనవర వచ్చి రిచ్చటికి సర్వదిగంతరకీశవీరులున్
జనకజఁ జూచి వచ్చెదరు చయ్యన నెచ్చట నున్ననైన
పనుపుము వీరి నావుడు నృపాలుఁడు సంతస మంది యి ట్లనున్
వనచరనాథ నాకుఁ గలవాఁడవు నీవ సమస్తభంగులన్.

544


క.

కావున జానకి వెడకం, బోవఁగ రాఁ గలప్లవంగపుంగవులఁ దగన్
నీవ యెఱుంగుదు వారల, వేవేగం బనుపు మహిజ వెదకఁ గపీంద్రా.

545

సుగ్రీవుఁడు వినతునిఁ దూర్పునకు సీతను వెదకం బుచ్చుట

వ.

అని పలుక సుగ్రీవుం డలరి శైలాకారుం డై భీమనిర్ఘోషంబు సేయుచున్న విన
తుం డనుయూధపుం బిలిచి సోమసూర్యాత్ములు దేశకాలజ్ఞులు గమనాగమన
ప్రవీణులు నైనశతసహస్రవానరులతోడం గూడఁ దూర్పునకు వైదేహి వెదక
నరుగుము తదీయమార్గంబు విను మనుచుం బలికి.

546


శా.

రేవాశోణనదోపకంఠముల నర్థిం జాల శోధించి శి
ప్రావాహిన్యభిరామభూమిఁ దమసాప్రాంతంబునన్ గోమతీ
కావేరీనదిపొంతఁ గౌశికికడం గాళిందితీరంబున
న్దేవద్వీపవతీసవిూపమున నన్వేషింపుఁ డుర్వీసుతన్.

547

వ.

మఱియు నందాసరస్వతీసరయూప్రముఖనదీతటంబుల నంగవంగమగధమాళవ
కోసలపుండ్రవిదేహాదినగరప్రాంతంబుల వెదకి యటమీఁద సముద్రతీరనదీనద
పట్టణవనసమీపంబులఁ జూచి మందరకుధరంబున నున్న మందకర్ణప్రావరణులు
నుష్టకర్ణులు గిరాతులు నేకపాదులు నగుయవనులు గాపున్నగేహంబులం బరికిం
చుచు నానారత్నశోభితద్వీపంబును సువర్ణకుంభంబును సువర్ణమరకతమండితం
బును నగు జంబూద్వీపంబు దాఁటి గగనోల్లేఖశిఖరవిలసితం బగు శిశిరబీజపర్వ
తం బున్నది యీగిరిశృంగమహాగుహానిర్ఝరంబుల శోధించి యటమీఁద బ్రా
హ్మణధనాపహారులు ఛాయాగ్రాహకులు నిత్యకాలబుభుక్షితులు నగురాక్షసులు
కమలాసనుశాసనంబున నిలయంబులు లేక వర్తింతు రచటికిం బోయి కాలో
రగకరాళం బగుకాలోదకనామసముద్రంబును రక్తజలఘోరం బైనలౌహిత్య
సంగమంబు నతిక్రమించి కైలాససంకాశంబును విశ్వకర్మనిర్మితంబును నగుసు
వర్ణావాసదేశంబు వెదకి తదనంతరంబ శతసహస్రశృంగంబుల సముద్రంబు
వెడలి యెగసి గోశృంగపర్వతంబునందు శంఖనిభకర్ణులును ఘోరాకారులును
నానారూపులు నైనమందేహనామరాక్షసులు రవికిరణంబులవేఁడిమికి నోడి
దివాసమయంబుల నెల్ల సముద్రంబులో మునింగి రాత్రులు వెడలి యప్పర్వత
శిఖరంబుల వ్రేలుచుండుదురు వారం గనుంగొని యట దాఁటి ముక్తానిభోదకం
బగుక్షీరసాగరంబుకడ కేఁగి యాసాగరమధ్యంబున నంశుమంతం బనురజతపర్వ
తంబు వెలింగెడు నాపర్వతసమీపంబున దివ్యగంధబంధురకమలకువలయహేమ
కేసరశోభిత యైనసుదర్శననామకనలిని విలసిల్లు నందుఁ గిన్నరచారణయక్షగంధ
ర్వపతంగోరగాదులు సంతతంబును గ్రీడింప నేతెంతు రానలిని వీక్షించి దుగ్ధ
సాగరంబు గడచి యుదధిశ్రేష్ఠం బగుఘృతోరధి కరిగి యందు హయగ్రీవముఖుం
డగుకపిలమహాముని వసించి హవిర్భూతం బగునాఘృతంబు నహర్నిశంబును ద్రా
గుచుండు నచట బడబానలముఖంబున నాక్రోశించుజలచరాక్రందననాదంబు
వినఁబడుచుండు నాఘృతోదధియుత్తరకూలంబునఁ జతుర్దశయోజనప్రమాణం
బున నొప్పారుచు జాతరూపశిలానామకపర్వతంబు గల దాపర్వతశిఖరాగ్రంబున
శ్రీకలితుండును సహస్రశిరుండును నీలాంబరుండు నైనయనంతదేవుం డాసీనుండై
యుండు నమ్మహాత్మునికేతువు త్రిశిరంబై కాంచనతూలంబు గలిగి వేదికామధ్యం
బునం జెలువారుచుండు దానిం గనుంగొనుచు ముందట బ్రహ్మనిర్మితం బగు
నొక్కద్వీపంబు గల దాద్వీపమధ్యంబున హేమమయం బగునుదయపర్వతంబు
దీపించుచున్నయది జాతరూపమయంబులు సూర్యసన్నిభంబులు నగుసాలతాల
తమాలకర్ణికారంబులచేత శోభిల్లుచు గగనోన్నతంబును శతయోజనాయతంబు
నగునాపర్వతంబు వెలుంగుఁ దదీయగుహాదుర్గవనంబుల సీత నన్వేషించుచు యో
జనాయుతవిస్తారంబును శతయోజనోన్నతంబును నగు సౌమనశ్శృంగంబు కనకమ

యం బై విలసిల్లు నందు వైఖానసు లైనవాలఖిల్యులు సూర్యకిరణాహారు లై
ప్రాదేశప్రమాణు లై యుండుదు రట మేరువు సూర్యప్రభలు సంక్రమింప సం
ధ్యారక్తవర్ణం బై యుండు నచ్చోటఁ ద్రివిక్రమదేవుండు ప్రథమపాదంబు పెట్టి
ద్వితీయపాదంబు మేరుశిఖరంబునం బెట్టె నామేరుశిఖరంబు నాక్రమించి సూ
ర్యుండు తేజరిల్లుచు జంబూద్వీపంబువారి కెల్లఁ గానంబడుచు సకలజీవులకుఁ
గన్నులవెలుంగై యుండుఁ దత్పూర్వభాగం బెల్ల నంధకారావృతంబై యుండు
నటమీఁద మీకు గమింప నశక్యం బాశైలవనస్థలనదీప్రదేశంబుల సీతారావ
ణుల శోధింపుఁ డని పలికి.

548


మ.

ఇట నేఁ జెప్పిన చండభానుకిరణాన్వీతాఖిలక్షోణులం
బటుబుద్ధిన్ మఱి మీకుఁ జెప్పనిమహీభాగంబులం బోల మ
ర్కటవీరుల్ చని జానకి వెదకి వే రం డొక్కమాసంబులో
నటమీఁదం దడ వున్నవాని వెసఁ జెండాడించి చంపించెదన్.

549


చ.

వనచరవీరులార రఘువల్లభువల్లభ వేగ చూచి వ
చ్చినకపివీరసింహునకుఁ జెచ్చెర నాసగరాజ్య మిచ్చెదన్
జనపతికోర్కి సేయుట యశంబును బ్రాణపదంబు ధర్మవ
ర్తనము నవశ్యకార్యమును దద్దయు లోకహితంబు వెండియున్.

550


క.

మన కెల్ల బ్రదుకుఁదెరువును, మనమున కెంతయుఁ బ్రియంబు మర్కటవీరుల్
ఘనసత్త్వజవము లారం, జని వైదేహిఁ గని రండు సమ్మద మొదవన్.

551


వ.

అని పలికి వినతప్రముఖులఁ దూర్పుదిక్కునకుం బనిచి దక్షిణదిగ్దేశంబునకుఁ దగు
వారిం బుచ్చుతలంపున.

552

హనుమంతుండు మొదలగువానరుల దక్షిణదిక్కునకుఁ బుచ్చుట

మ.

అనిలతనూజునిన్ గజగఁవాక్షుల మైందసుహోత్రగంధమా
దనుల నుదారునిన్ ద్వివిదు ధాతృసుతుం డగు జాంబవంతునిన్
వినతుని నంగదప్రముఖవీరుల నగ్నితనూజు నీలునిం
గనుఁగొని భానునందనుఁడు కార్యము చొప్పడ వారి కి ట్లనున్.

553


వ.

అతిబలులు సర్వకార్యనిర్వాహకులు నైనకపివీరులారా మీరు దక్షిణదిగ్భాగం
బున కరిగి యచట నచట సీతారావణుల వెదకుచు సహస్రశృంగం బగువింధ్యం
బున కేఁగి నర్మదావేత్రవతీతీరంబుల నావింధ్యపాదవనదుర్గగుహల జానకిని వెదకి
వేగవతీకృష్ణవేణీదేవికామేఖలోత్కలాకంబువతీంద్రవతీసమీపంబుల విదర్భర్షికా
మాహిష్మతీపట్టణంబుల శకపుళిందనిషధదశార్ణకుకురాదిదేశవనగిరికందరంబుల
సీత వెదకుచు దండకారణ్యంబున కరిగి యచట గిరివనదుర్గంబులు గోదావరీతీరం
బుల నంధ్రపుండ్రకేరళకురుదేశంబులఁ బరికించుచుఁ జిత్రపుష్పితపాదపచందన
వనశోభితం బై నమలయపర్వతంబునకుం జని యాపర్వతకందరచందనషండత

మాలవనంబులం జూచుచు నటమీఁద.

554


మ.

మలయగ్రావమునందు భానుసమరమ్యస్ఫారతేజస్సము
జ్జ్వలుఁ డై యున్నయగస్త్యతాపసుని నిచ్చం జూచి యాశైలముం
గలయం జుట్టి ప్రసూనమాలికగతిం గావేరి యొప్పారెడున్
నలి నాపొంతఁ బులస్త్యుఁ డుండు నతని న్మానొంద వీక్షించుచున్.

555


వ.

ఆకావేరి దాఁటి సముద్రమర్యాద యగువేల చేరి యచ్చటఁ గేతకీపున్నాగవనం
బుల నవలోకించుచు నావేల యతిక్రమించి ముక్తామణిభూషితంబును గవాట
గుప్తంబును నగు పాండ్యుల హేమపురంబున కరిగి యప్పురంబుఁ జూచుచుఁ దద
నంతరంబ.

556


సీ.

ఘనుఁ డగస్త్యుండు పెట్టిన యుపహారమ్ము, గడఁగి రంగత్తరంగములచేత
వితథంబు చేసిన మతి నల్గి యమ్ముని, యంతరంగుఁడవు గమ్మని శపింప
నాశాపమున వార్ధి యంతరంగం బెల్ల, నపుడు గానఁగరాఁగ నంతరంగుఁ
డై యుండె నది మొదల దేశ మంతరం, గాఖ్య మా రూఢిచే నచ్చోటు గడచి
జాతరూపశృంగము సిద్ధ[6]సాధ్యచార, ణాప్సరోగణసేవ్యంబు నగుమహేంద్ర
గిరికి నరుగుఁ డయ్యద్రికి సురవిభుండు వరుసఁ బర్వపర్వంబుల వచ్చుచుండు.

557


వ.

ఆపర్వతంబునం దప్రమత్తుల రై సీతను వెదకి యాగిరిపాదంబున శతయోజనా
యతం బగుద్వీపము గల దది మనుష్యుల కగమ్యం బని యచటివనగోచరులు
చెప్పుదు రాద్వీపంబునం సీతం గలయ వెదకి యాద్వీపంబు గడచి సాగరోస్థితం
బును జంద్రసూర్యసంకాశంబును సాగరాంబుపరిఖంబును నంబరోల్లేఖిశిఖరం
బును నగు కనకగిరి గని యాశైలశృంగంబుల నొక్కహేమశిఖరంబున సూర్యుం
డును మఱియొక్కరజతమయం బైనశిఖరంబునఁ జంద్రుండును వెలుంగుచుండు
దురు కృతఘ్నులు నృశంసులుఁ బాపకర్ములు నాశైలంబును గనలే రగ్గిరికి నమ
స్కరించి సీత నందు శోధించి యగ్గిరి గడచి చతుర్దశయోజన పరిమితం బగుసము
ద్రాపరభాగంబున కరిగి యచట ఫలమూలాంబుమధువులు తనియ సేవించి
యాసాగరంబు దాఁటి సర్వకాలఫలదళవృక్షంబులు గలిగి విశ్వకర్మనిర్మితం
బైనవిద్యుద్వంతం బనుపర్వతంబు గల దచటి కరిగి యందు సీతారావణుల వెదకి
మఱియు జాతరూపశృంగనానాధాతుశోభితం బైనయుశీరబీజం బనుపర్వతంబు
పొడ గనుం డప్పర్వతంబు మరణాసన్నకాలు రైనవారికిఁ గానంబడ దన్నగంబు
శృంగంబుల సీత వెదకి యన్నగం బతిక్రమించి దుర్దర్శనం బగుమాల్యవంతంబు
గని యటకుఁ జతుర్దశయోజనమాత్రంబున శక్రధ్వజాకారం బగుకుంజరపర్వ
తంబు గల దగ్గిరియందు విశ్వకర్మనిర్మితం బగునగస్త్యభవనం బున్నది యక్కడ
నగస్త్యాభిషేకంబుకొఱకు నోషధివనశైవలినీశోభిత యైనయంజనానది యున్నది

యచ్చట నున్నయగస్త్యునిం బూజించి యాకుంజరపర్వతంబు గడచి రక్తచందన
సంరక్తయు మణివిద్రుమశర్కరయు దేవర్షిసేవితయుఁ బవిత్రయు నైనసరస్వతీ
నది వెలయుచుండు నచట యోజనవిస్తారంబును శతయోజనోన్నతంబును బన్న
గాభిశోభితంబును నగు కాంచనతోరణంబు దీపించుచున్నది యచ్చట మహావిషో
రగరక్షితం బైనట్టిభోగవతీపురి చెలువారు నాపురి వాసుకి యేలుచుండు నది
సర్పనిలయం బాపురి నతిక్రమించి నానావర్ణదివ్యచందనశోభితం బైనమహావృ
షపర్వతంబు గలదు మోహితు లై శైలూషగ్రామణిభిక్షుస్తనబభ్రు లనుగం
ధర్వు లాపర్వతంబునఁ గ్రీడఁ గాపుండుదురు దేవతలు నప్సరోగణంబులుఁ గ్రీడిం
తురు దానిం గనుచుఁ ద్రిశృంగమహీధరంబుఁ జేరి తచ్ఛిఖరంబునఁ బ్రభవించి
సౌమనసానది విలసిల్లుఁ దత్తీరోత్తరపర్వతంబున నానావర్ణపక్షికులంబులమధుర
స్వరంబులు చెలంగు నటమీఁద నంధకారాక్రాంతం బైనపితృలోకం బదృశ్యం
బు నతిదారుణంబు నై యుండు నందుఁ గాంచనతలంబును వజ్రవైదూర్యవేదికంబు
నగుప్రాసాదం బొప్పు దానిమీఁద ధర్మాసనాసీనుం డగుచు నంతకుండు సర్వ
ప్రాణులసుకృతదుష్కృతంబు లెఱింగి యుచితఫలంబు లొందించుచుండు నా
లోకంబు గడచి.

558


క.

సురుచిరమౌక్తికమణిఫల, భరవిలసితకనకపాదపప్రకరవిభా
సుర మగుతృణాంగిసంయమి, వరునాశ్రమమునకు నరిగి వలసినభంగిన్.

559


జనకజఁ జూచి రండు కపికసత్తములార యభీష్ట మొంద న
మ్మునివరు నాశ్రమంబు కడముట్టి వెలుంగుచునుండు దక్షిణం
బున కటమీఁద మీ కరయ బోవ నశక్యము భానుదీప్తులుం
జనఁ బ్రసరింప వవ్వలను జానుగ నంచును బల్కి యర్థితోన్.

560


క.

హనుమంతునిఁ గనుఁగొని రవి, తనయుం డి ట్లనియె బలము దగవు నెరయ రా
మునికోర్కి దీర్చి జగముల, ఘనసన్నుతిఁ బొంద నిదియె కాలము నీకున్.

561


క.

అతిజవతేజోలాఘవ, గతివీర్యములందు సాటి గా నీకు సదా
గతి దక్కఁగ నన్యుం డీ, క్షితిలో నీసాటివాఁడె గిరిచరవర్యా.

562


క.

సురగంధర్వాసురకి, న్నరఖేచరసిద్ధసాధ్యనరలోకంబుల్
పరఁగంగా నీ వెఱుఁగుదు, ధరణిజ వెదకంగ నీవె దక్షుఁడ వరయన్.

563


క.

దివియందు నభమునందును, భువియందును జలములందుఁ బోయెడు నెడ నీ
కవరోధ మెచటఁ గల్గదు, పవమానతనూజ నీవు ప్రబలుఁడ వెందున్.

564


ఉ.

కావున భూమిజన్ వెదకి కాంచి రయమ్మున రమ్ము రాఘవ
క్ష్మావిభుచింతఁ బాపు తగ మమ్ముఁ గృతార్థులఁ జేయు లోకసం
భావితకీర్తితో వెలయు పావని నావుడు సంతసించి సు
గ్రీవునితోడ భూపతివరేణ్యుఁడు రామనరేంద్రుఁ డి ట్లనున్.

565

రాముఁడు హనుమంతునిచేత ముద్రిక యిచ్చుట

ఉ.

ఈహనుమంతునందుఁ గల వెక్కుడుశక్తియు విక్రమంబు ను
త్సాహము [7]దేశకాలవిహితక్రమయుక్తియు సాహసంబు న
ర్థాహితనీతి యున్నతియు నాతతతేజము వేగ మేఁగి వై
దేహిఁ గనంగ నోపుటయు ధీరతయుం గృత కార్యసిద్ధియున్.

566


క.

ఇనసుత యీతనివలనం, దనర మదీయాభిమతము ధన్యత నొందున్
విను మని పావనిఁ గనుఁగొని, మనుజేశ్వరుఁ డిట్టు లనియె మన్ననతోడన్.

567


క.

జానకి వెదకఁగఁ జని కని, యానందముతోడ వచ్చి యాదట రఘుసం
తానము నాప్రాణంబులు, మానుగఁ గలుగంగఁజేయు మారుతపుత్రా.

568


క.

మానుగ నీముద్రిక గని, మానసమున సంతసించి మారుతసుత నిన్
నే నటఁ బుత్తెంచితి నని, జానకి సత్కృతులు నీకు సమ్మతి జేయున్.

569


క.

అని నిజనామాంకితకాం, చనమణిగణకమ్రకిరణసదమలశోభా
కనదంగుళీయకము న, త్యనురక్తిం జేతి కిచ్చె ననిలజుఁ డంతన్.

570


క.

శిరమున ముద్రికఁ దాలిచి, నరపతిపదములకు మ్రొక్కి నలువుగ గంతుల్
పొరిఁబొరి వైచుచు పావని, తరుచరసైనికులనడుమఁ దద్దయు వెలసెన్

571


క.

[8]ఇనజుఁడు దక్షిణదిశ కి, ట్లనిలజముఖకీశవరుల నవనిజ వెదకం
జనఁ బనిచి వెనుక సమ్మతిఁ, దనమామ సుషేణుఁ జూచి తా ని ట్లనియెన్.

572

సుగ్రీవుఁడు సుషేణునిఁ బశ్చిమదిక్కునకుఁ బుచ్చుట

వ.

కపివర నీవు రెండులక్షలవానరవీరులతోడఁ బశ్చిమదిగ్భాగంబునకు నేఁగు తదీ
యమార్గంబు నెఱుంగఁ జెప్పెద వినుము సౌరాష్ట్రసౌహిత్యబాహ్లికశూద్రాభీర
జనపదంబుల వకుళాధివాసితంబు లయినపున్నాగగహనంబులఁ గేతకీషండంబుల
నారికేళవనంబుల విహరించి యధికప్రవాహనదులఁ దాపసారణ్యంబుల నెమకి కేక
యసౌవీరత్రిగర్తదేశంబుల మహాగ్రాహసంకులం బైనపశ్చిమసముద్రద్వీపంబు
ల వైదేహి వెదకి చైత్రపాదపశోభితం బైనమరీచిపట్టణంబున సరస్సాగర శైలవ
నస్థలంబుల మఱియునుం గలపురాణవనంబుల రత్నశోభితపట్టణంబుల సింధు
సాగరసంగమంబుల వైదేహి వెదకుచు శతశృంగంబులు గలమహాహేమగిరి
చేరి తోయదస్వనమత్తమాతంగంబుల దృప్తసింహంబుల నీడవాసు లైనబలవ
త్పక్షిగణంబులఁ గని యగ్గిరిసానుతటంబుల వెదకుచు నచట నున్నవిస్తీర్ణకమ
లాకరంబులఁ దీర్థంబులఁ దాపసారణ్యంబుల గిరిస్థలంబుల వనోపవనంబుల సీత
వెదకుచు మఱియు గజవనంబులఁ బంచనదశోభితం బైన కాశ్మీరమండలంబున
దక్షిణశిలానగరంబున గౌళకేకయాదిదేశంబులఁ బట్టణంబుల సాగరద్వీపంబుల

వెదకి యట గడచి కాంచనమయంబు లగు గగనోల్లేఖిశిఖరంబులు గలపారియా
త్రశృంగంబును గదిసి యం దున్నగంధర్వకో ట్లావనఫలమూలంబులఁ గాచి
కొని యుందురు వారిచెంతలఁ జేరక యటఁ జని వైదేహి నరయుచుం జని.

573


క.

జలధికి నాలవపా లై, యలరారెడుచక్రవంత మనుశైలం బు
జ్జ్వలమణిమయశృంగంబుల, ఫలవిలసితకల్పపాదపంబుల వెలయున్.

574


క.

అట విష్ణుఁ డయోమయమును, జటులోగ్రసహస్రకోటిసంభృతమును ను
ద్భటదైత్యభంజకము నగు, హటదంచితవజ్రనాభ మనుచక్రంబున్.

575


వ.

చేకొనియె నట మఱియును.

576


క.

ఘనశక్తి హయగ్రీవుం, డనుదనుజునిఁ బంచజనుని హరియించి ఘన
ధ్వనిఁ దనరుపాంచజన్యం, బనుశంఖముఁ బుచ్చుకొనియె నసురారి వెసన్.

577


వ.

అటఁ గడచి యగాధం బగుసముద్రమధ్యంబున సువర్ణశృంగంబును జతుష్షష్టి
యోజనవిస్తృతంబును నగువరాహపర్వతంబు గని తద్ద్వీపపార్శ్వనితంబగుహా
వనస్థలంబుల సీత నాలోకించుచు నగ్గిరి దాఁటి సహస్రధారాపరివృతశిఖరంబును
గాంచనశోభితంబును నభ్రంకషంబును గాంచనతరుపరివృతంబును దేవర్షిసేవి
తంబును శుకకోకిలమయూరసింహవ్యాఘ్రకులసంకులస్వనభరితంబును దేవరా
క్షసపరివేష్టితంబును మహేంద్రపాలితంబును సురరాజ్యాభిషేకయుక్తస్థలంబు
ను నగుమఘవత్పర్వతంబును గని యగ్గిరి నతిక్రమించి తరుణార్కవర్ణంబులును
గాంచనమయంబులు నైనయఱువదివేలపసిండికొండలనడుమ దినకరునివరప్ర
సాదమహిమం జేసి తననిజసువర్ణదీప్తుల సన్నిహితవస్తువులు నెల్ల ననిశంబును సు
వర్ణమయంబులం జేయుచుండు మేరుశైలంబున వసురుద్రాదిత్యమరుద్గణంబు .
లు పశ్చిమసంధ్యావేళ దగ్గిరికి వచ్చి యాదిత్యునిఁ గొల్చి పూజింతురు ద్విసహ
స్రయోజనపర్యంతంబు నిమిషార్ధంబున గమించు నాసూర్యుండు సర్వభూతం
బులకు సదృశ్యుం డై యస్తమించునయ్యస్తాద్రిశృంగంబునందు సూర్యసన్ని
భంబును విశ్వకర్మనిర్మితంబును జిత్రపాదపనానాపక్షిసమాకులంబును శతసౌ
ధసంబాధంబును నగువరుణునిపట్టణం బొప్పారు నచ్చట రెండవసూర్యుండునుం
బోలెఁ దేజరిల్లు మేరుసావర్ణి యనుమునివరేణ్యునకు నమస్కరించి యయ్యస్తాచల
మేరుమధ్యంబున సువర్ణమయంబును జిత్రవేదికావిరాజితంబును దశశిరంబును
నగుతారాద్రి విలసిల్లుఁ దదీయగుహానిర్ఘరవనప్రదేశంబుల సీతను వెదకి మఱి
తప్తకాంచనవర్ణంబును లోకహితార్థప్రభవంబు నుజ్జ్వలజ్వలితతేజంబు నైనయ
య్యస్తాద్రి నాలోకించి ఖగమృగపన్నగదేవాసురయక్షరాక్షసాదులకు నేరికి
గమింప నశక్యం బవ్వల రవికిరణప్రచారంబు లేక యుండు నంధకారాక్రాంతం
బగుచు.

578

క.

అస్తాచలపర్యంతన, [9]మస్తాచలములును నీ కమరఁ జెప్పితి నా
కస్తోకపద్ధతిని సతి, నస్తోకసుమతిని వెదక నరుగుము మామా.

579


క.

నీ వనఘ నాకు మామవు, కావున మజ్జనకు నట్ల కనుఁగొన నురుసం
భావన కర్హుఁడవు తగన్, భూవరుసతి వెదకి వేగ ప్రోవుము మమ్మున్.

580


క.

ఎవ్వఁడు మాసములోపల, నివ్విభుసతిఁ గాన వెదకి యే తేకుండుం
గ్రొవ్వఱ ఘనదండంబులు, నవ్వనచరనీచుఁ జావ నడిపింతు వడిన్.

581

సుగ్రీవుఁడు శతబలి నుత్తరంబునకుఁ బుచ్చుట

క.

[10]అనుచు సుషేణునిఁ బడమటి, కనుమతిఁ బుచ్చి మఱి వీరుఁ డగుశతబలిఁ గ
న్గొని రామహితంబుగ నా, తనితో ని ట్లనియె సునయతరవాక్యములన్.

582


క.

ధనదునిదెసఁ గలగిరిబిల, వనపురదేశముల నెల్ల వసుధాతనయం
జన వెదకి కాంచి యిటకుం, జనుదె మ్మలవునఁ దదీయసరణి విను తగన్.

583


వ.

కపివరా నీవు సహస్రకోటివానరవీరులం గొని మంత్రిసమేతుండ వై యక్షరా
క్షసగంధర్వకిన్నరేశుం డైనకుబేరుండు పాలించునుత్తరదిక్కునకుఁ జని మత్స్య
పుళిందశూరసేనభద్రకకురుగాంధారయవనమాళవబాహ్లికచేదిశకబర్బరకుకురు
కాశకాంభోజదేశంబుల నయ్యైపురగిరివనబిలనదీస్థలంబులను భూమిజ వెదకుచు
నట దాఁటి లోధ్రపెన్మకదేవదారుసాలతాలభూర్జఖర్జూరవనంబులను సిద్ధచారణ
కిన్నరపిశాచయక్షరాక్షసతాపసగుహ్యకగరుడోరగమృగపక్షుల వనశైలంబులు
శతయోజనప్రమాణంబులుగాఁ దిరిగివచ్చి యున్నహిమవంతంబు చేరి యయ్యై
స్థలంబుల జానకి వెదకి చని భృగుశృంగం బనుమహాశ్రమంబు పరికించుచు నీల
శైలంబు చేరి తదీయశృంగబిలంబులుఁ బద్మాకరంబులు నతిక్రమించి హేమ
గర్భంబును సుదర్శనంబునుం గదిసి యాపర్వతశృంగంబు ప్రియంగువనంబుల శో
ధించుచు హేమగర్భంబులును దేవసంభవంబులును నగుగిరులం గడచి శతయో
జనంబును బహుపర్వతవృక్షనదీచయంబు నగునాకాశం బనుశైలంబు గల దా
శైలాధిత్యకాతలంబున శతయోజనం బైనవనంబు గల దది నిర్జలంబును దరణి
కిరణతప్తంబును మృగపక్షిగణరహితంబును నై యుండు నటఁ దడయక కదలి
కైలాసంబున కేఁగుం డం దరిగి యచ్చటఁ బాండురమేఘసన్నిభంబును జాంబూ
నదభూషితంబును విశ్వకర్మనిర్మితంబును నగుకుబేరునగరం బున్నది యచ్చటఁ గ
మలకువలయహంసకారండవచక్రవాకాభిశోభితంబులును ముక్తావైదూర్యవా
లుకంబులును నై కమలాకరంబు లలరుచుండు గుహ్యకకిన్నరసమేతుం డై కుబే
రుం డాకొలఁకులఁ గ్రీడించుచుండు నాకైలాసగుహానిర్ఝరప్రదేశంబులు సీతారావ
ణుల వెదకి యగ్గిరి దాఁటి త్రిశృంగగిరి కరుగుం డందుఁ దప్తకాంచనభూషితం

బును దివ్యంబును నైనయాగిరిశృంగంబువలన నొక్కమహానది పొడమి యొప్పు
చుండు నానదీహ్రదంబున వెడలి సరయూనది పాఱుచుండు నగ్గిరిశృంగంబు లొ
కటి కాంచనమయంబు నొకటి వైదూర్యమయంబు నొకటి రజతమయంబునునై
యుండు నచట ము న్నేభూతంబులు బుట్టకమున్నె సర్వభూతజ్యేష్ఠుం డైనవిశ్వ
కర్మ యొక్కమహారణి నగ్నిహోత్రంబు కల్పించె నందుఁ ద్రేతాగ్నులు విల
సిల్లె నయ్యగ్నిమహాముఖంబున మహాదేవుండు సర్వభూతంబులం బశువులుగా
వేల్చిన మహావేదిక యున్నది యావేది దర్శించి యాత్రిశృంగపర్వతంబునఁ బ్రస
న్నసలిలప్రవాహ యైనకూటమహానది వర్తిల్లు దేవదానవపతంగోరగాదులకు గ
మింపరాక ప్రదీప్తపావకంబునుంబోలెఁ దేజరిల్లు నాపర్వతశృంగమహావనంబుల
సీత వెదకి యాశైలంబు గడచి దేవదానవసేవితం బైనక్రౌంచాద్రి కరిగి యందు
సూర్యప్రభ గలిగి దేవతార్చితులు దేవసన్నిభులు నైనమహామును లున్నవా
రాశైలశిఖరంబున దివ్యం బైనవిహగాలయం బున్నది యక్కడ దేవదానవరా
క్షసాదిసర్వభూతంబులకు గమింప రాకుండు నగ్గిరిగుహానితంబసానువులఁ దదీయ
శృంగంబుల సీత వెనకి యగ్గిరి నతిక్రమించి మైనాకంబున కేఁగి యగ్గిరియం దర్య
మవనం బున్నది యచ్చట జంబూద్వీపజంబూవృక్షం బప్సరోగణంబులచేఁ బూ
జీతంబు సతతంబు ప్రభల వెలుంగుచుండు నందలిచిత్రసుగంధవనంబుల నశ్వ
ముఖకాంత లుండుదురు రమ్యం బైనతదాశ్రమంబు మహర్షియుతంబును ధర్మ
నిలయంబు నూర్ధ్వరేతస్కమునిసమాశ్రితింబును నై దీపించు నాయాశ్రమంబు న
తిక్రమించి వైఖానసులయిన వాలఖిల్యులు మరీచిప్రాయులై యుండుదురు గాన వారి
ని సీతావృత్తాంతం బడుగుచు నటఁ జని తరుణాదిత్యసంకాశంబును హేమరసోదకం
బును హేమహంససమాకులంబు నగు వైఖానససర స్సున్నయది యందుఁ గుబేరు
సార్వభౌమం బనుదిగ్గజం బాఁడేనుంగులతోడఁ గ్రీడించుచుండు నాకొలను గడచి
నష్టచంద్రదివాకరంబును నక్షత్రగ్రహనిర్మేఘపవనాదికవ్యోమంబును నై సూర్య
దీప్తులుంబోలెఁ దేజరిల్లు నతిశాంతతాపససిద్ధసేవితం బయిన మైనాకంబు గడచి సి
ద్దచారణసేవితంబును దమాలతాళీవనశోభితంబును జతుష్షష్టియోజనపరిమితంబు
ను నగుగంధమాదనంబున కరిగి తదీయశృంగంబునఁ బ్రసన్నసలిలాశయంబును
బుష్పితోపవనశోభితంబును శుద్ధాగురుగంధరూపితంబును నగుదివ్యపదంబుచెం
త దర్శనీయజాతరూపవిలసితంబును సవేదికంబును నగుజంబూవృక్షం బున్నది
యాగంధమాదనశృంగగుహావిపినంబుల సీతం బరికించుచు నటఁ గడచి పితామ
హదేవదానవసేవితంబును దుషారచయసంకాశంబును సితాసితపుష్పవిరాజితం
బును రమ్యాగురుధూపితంబును ఘృతపిండంబును నగుమందరపర్వతంబున కరిగి
యందు మందాకినీతీరంబుననుండి లోకాద్భుతఘోషంబులతో గైరికాంజనసం
యుతయై శిలలు నుగ్గుగాఁ బడ మహాప్రవాహంబుతోఁ బాఱుచుండు నమ్మహా

నదిని సకలదేవమునీంద్రులు సన్నుతింతురు పుణ్య మైన కౌశికానదియును నచట
విలసిల్లు మఱియు రక్తజలప్రవాహయుఁ గేశమాంసాస్థినాలుకయు నైనవైతర
ణియుఁ దత్సమీపంబునఁ బాఱుచున్నది యచ్చట యక్షగంధర్వపిశాచోరగపతం
గాదులు కాలవశంబున దేహంబులు విడుచుచుందు రచ్చట వారిదేహంబులు
గానంబడు భువి మనుష్యులదేహంబులుంబోలె నటఁ గడచి కాలమేఘసంకాశం
బును ఘోరగ్రాహసంకులంబు నగునుత్తరసముద్రంబున కేఁగి తదుత్తరతీరంబు
చేరి కొండొకసేపు విశ్రమించి తత్తీరంబున నున్నసహస్రశిఖరాయతంబును గాం
చనమయంబును సూర్యసంకాశంబును నగుబహుకేతుపర్వతంబు గని యాగిరి
మీఁద నున్నదివ్యప్రసన్నోదకహ్రదంబును మహాశరవణంబునుం గని కాంచన
మయం బైనయాశరవణంబు చేరి.

584


తే.

కాలమేఘసంకాశంబు గ్రాహభీక, రంబు బహురత్న రాజవిరాజితంబు
నైనయుత్తరవారాశి కరిగి యుత్త, రంపుఁదీరంబుఁ జేరి విశ్రామ మొంది.

585

,

చ.

అలరి యటన్ సహస్రశిఖరావళి కాంచనదీప్తమండలిన్
గలబహుకేతునామగిరి గ్రాలుచు నుండును దానిమీఁద ని
ర్మలసలిలహ్రదం బమరు మానుగ నచ్చటఁ గార్తికేయజ
[11]న్మలలితదీప్తిమచ్ఛరవణంబు వెలుంగుఁ దదీయసన్నిధిన్.

586


క.

సలిలాశయ మొక టిరవుగఁ, గలదు హయగ్రీవుఁ డయిన కపిలుఁ డనంతుం
డెలమిం దద్దీర్ఘికలో, నలవడ జలకేళిఁ దేలి యాడుచు నుండున్.

587


వ.

అగ్గిరిశృంగగుహానిర్ఝరంబుల సిద్ధచారణసేవితపుష్పితవనాశ్రమంబుల జనకజ
వెదకుచు నద్దేశంబు దాఁటి ముందట నున్నశిలోచ్చయనదిని దత్తీరకీచకవేణు
వులం దెప్పలు గట్టికొని యాపుణ్యనదీజలస్పర్శనంబు చేసి యానది నుత్తరించి
యావల సీతానదిఁ బొడగని యానది నవగాహంబు సేసి శుచీభూతు లై పుణ్యా
త్ము లగుచు నటఁ గడిచి.

588


క.

సురపురసదృశము లగును, త్తరకురుదేశములు గలవు తద్దేశములం
జరియించుజను లుదారులుఁ, దరుణవ యోలలితు లధికధన్యులు మఱియున్.

589


ఉ.

ఆగతహర్షభాగులు నిరంతరనిర్జరరాజభోగులుం
జాగులుఁ బుణ్యభాగులును శాశ్వతరాగులు [12]నిష్టసౌఖ్యసం
యోగులు నిర్గతాగులు సముజ్ఝితశోకభయార్తిరోగులున్
శ్రీగులు నిత్యదానరతిసేవితకందరకాంచనాగులున్.

590


వ.

ఆదేశంబున శీతోష్ణజరామరణంబులు శోకభయామర్షంబులు లేవు సూర్యుండు
ప్రసరింపఁడు భూమి వశీకరయు నిస్తృణకంటకయుఁ బాండువర్ణయు సమతలయు
విగతబాధయు నారోగ్యవతియు శాద్వలవతియు సర్వకాలఫలవృక్షశోభితయుఁ

జారు కాంచనమణిమండితయు సువర్ణపక్షిగణవిరాజితయు నగుచు నీలవైదూర్య
వర్ణోత్పలంబులును మణిమయకనకదండహేమకేసరరక్తోత్పలవనంబులును దప్త
కాంచనపద్మంబులుం గలిగి సుగంధబంధురంబు లగుపద్మాకరంబులు మణికాంచన
విచిత్రకింజల్కనీలోత్పలషండంబులు గలభూములు మణిరత్నసంకీర్ణకాంచనవాలు
కానదులు సువర్ణమణిరత్నగిరులు హేమాభిరామక్రమచ్ఛాయలుం గలమణి
పర్వతంబుల ననర్ఘ్యనిస్తులముక్తాఫలమణిగణరాజితకమలాకరంబుల నదుల నని
శంబును గామితఫలంబు లొసంగుచు మధురమధువులు గురియుతరువులుం గలిగి
యాభూములు విలసిల్లు నచ్చట సప్తర్షిభవనంబులు మందాకినీనదియును ధనదుని
చైత్రరథంబును క్షీరనదులు నాజ్యప్రవాహంబులును బాయసకర్దమంబులును
విలసిల్లు మఱియు బ్రహ్మనిర్మితకల్పతరువులు సతతంబును బుష్పఫలాన్వితంబు లై
నానావర్ణమృదులాంబరంబులు ముక్తావైదూర్యకనకచిత్రభూషణంబులుఁ జిత్రా
స్తరణశయనంబులుఁ గామితగంధపుష్పమధురరసంబులు నతిస్వాదుపానంబులు
వివిధభక్ష్యంబులును మఱియు స్త్రీపురుషుల కనురూపఫలంబులు నొసంగుచుండు
సిద్ధగంధర్వకిన్నరనాగవిద్యాధరులు నచటం దరుణీసహితు లై రమించుచుండు
దురు వార లెన్నండును వియోగంబులు లేక పరస్పరప్రియు లై యుండుదురు
కాంతలు కాంతిమతులు లావణ్యవతులు సర్వాభరణభూషితులు నై విలసిల్లు
దురు పురుషులు శుభాకారులు రూపవంతులు మహాతేజులు వితంద్రాక్షులును
నై యుండుదు రచట నెవ్వరు నసంతుష్టులు నప్రియులు లేక మెఱయుదురు.

591


చ.

తనపురికంటె సద్గుణవితానములుం గమనీయలక్ష్ములుం
గనుఁగొన నొప్పుచున్ శుభసుఖంబుల కెల్లను భోగభూమి యై
యునికిని నాధరిత్రిఁ గలభయోషలు తన్ను గణింప కెంతయు
న్మనసిజతంత్రముల్ దినదినంబును జల్పుచు నున్నదానికిన్.

592


వ.

ఇంద్రం డీసున నక్కాంతల నాగుహాముఖంబునన జరామరణదుఃఖత లై యుం
డుం డని శపియించుటయు వార లాశాపంబున నమ్మహాగుహను దినదినంబును
ముదిసి చచ్చుచుఁ బుట్టుచు నుండుదురు.

593


క.

తిమిరవతి యనఁగ నగ్గుహ, యమరుం దద్బిలములో గుహాగేహసహ
స్రము లుండు వానిలో భూ, రమణునిసతి వెదకి కపులు రభసము లారన్.

594


వ.

దేవసేవితం బగునయ్యుత్తరదేశంబు దాఁటి ముందట నున్న హేమమయం బగు
సోమగిరి కరుగుం డింద్రలోకగతులు బ్రహ్మలోకగతులును నగుదివ్యు లప్పురంబు
రక్షించుచుండుదురు గగనోన్నతం బైనయాసోమగిరిప్రభ సూర్యుండు ప్రవే
శించుచుండునది సూక్ష్మదర్శులకు భానుతేజోమయం బై యెఱుంగంబడు.

595


క.

ఆదట నగ్గిరిపై నే, కాదశరుద్రాత్ముఁ డైనగౌరీశుఁడు స
మ్మోదమున నుండు నట నజు, గాదిలితనయుండు మనువు గైకొనియుండున్.

596

వ.

అదియుం జతుర్విధభూతసృష్టితోడ నచట వర్తిల్లుట దాని మనుస్థానం బండ్రు
దేవదానవుల కది దుర్గమం బాశైలం బన్యులకు గమింప నశక్యంబు కపులార
మీ రాసోమాద్రి వీక్షించి తదీయపార్శ్వకటకగుహావనోద్యానవనగంధర్వభవ
నంబుల రామదేవుదేవిని వెదకి యటమీఁద శమీస్థానంబు నొంది మఱి యమ
కారులు మహోలూఖలమేఖలులు నగురాక్షసులు గల రారాక్షసులఁ గలసి
యేకరాత్రం బక్కడ నుండి యెల్లచోట్ల రామునిసతి వెదకుండు మఱియును.

597


మ.

అటపై నేరికిఁ బోవరా దినరుచుల్ వ్యాపింప వెల్లప్పుడున్
స్ఫుటమర్యాద మమందసాంద్రతిమిరస్తోమప్రకీర్ణంబు మీ
రట నేఁ జెప్పినచోటుల జనకజన్ వ్యక్తంబుగాఁ జూచి మ
ర్కటవీరుల్ నెలలోన రం డతికృతార్థత్వంబు సొంపారఁగన్.

598


క.

నెలలోన రానివాని, న్బలువిడిఁ జంపింతుఁ బూని నాహితమును భూ
లలనునిహితముం జేసిన, యలఘున్ రక్షింతు రాజ్య మంతయు నిత్తున్.

599


క.

నావుడు నవుఁ గా కని సు, గ్రీవునకును రామనృపతికిని మ్రొక్కి లస
ద్భావన శతబలి కపిసే, నావృతుఁ డై యుత్తరమున కరిగెం గడిమిన్.

600


వ.

అప్పు డొక్కవనచరుం డి ట్లనియె.

601


క.

మృత్యుముఖంబునఁ దక్కఁగ, క్షిత్యాత్మజ యెచట నున్న జెచ్చెర లోక
ప్రత్యయము గాఁగఁ దెచ్చెద, నత్యంతబలంబుతోడ నార్యులు మెచ్చన్.

602


వ.

మఱియొక్క వానరుం డి ట్లనియె.

603


క.

వినుఁ డే నిప్పుడ శతయో, జనముల్ చని కార్యసిద్ధిసహితుఁడ నై వే
చనుదేరఁగఁ గల నేటికి, వనచరులను దుఃఖపఱుప వనచరపతికిన్.

604


వ.

మఱియొక్కయగచరుం డి ట్లనియె.

605


క.

భూతలభూధరసాగర, పాతాళనదీవిపిననభంబులు నాయ
త్యాతతగమనత్వరకు వి, ఘాతంబులు సేయ లేవు కావున బలిమిన్.

606


క.

ఏవలన నున్న నైనను, రావణుఁ బరిమార్చి విజయరమ్యశ్రీతో
భూవల్లభుప్రియపత్నిన్, వేవే కొనివత్తు నేన విక్రమ మెసఁగన్.

607


వ.

మఱియొక్కవృక్షచరుం డేపున గంతులు వైచుచు ని ట్లనియె.

608


చ.

గిరు లగలించెదన్ జముని గెల్చెద బాడబవహ్ని మ్రింగెదన్
ధర విదళించెదన్ దెసలు దాఁటెద సాగరముల్ గలంచెదన్
ఖరకరచంద్రతారకనికాయముఁ గూల్చెద లీలఁ బంక్తికం
ధరుఁ బరిమార్చెదం గడిమిఁ దత్పురిఁ జొచ్చెద సీతఁ దెచ్చెదన్.

609


వ.

అని యివ్విధంబున మఱియు ననేకప్రకారంబుల దర్పంబులు పలుకుచు.

610


ఉ.

వాలము లెత్తి త్రిప్పుచును వావిరి గంతులు వైచుచున్ దెసల్
వ్రీలఁగఁ జేయుచున్ నెగసి వి న్నటు ముట్టఁగ మ్రొగ్గుచున్ ఘన

క్ష్వేళలు నుగ్రతర్జనలుఁ జేయుచుఁ బాఱుచుఁ బాఱి వచ్చుచున్
శైలము లెత్తి యాడుచును జండగతిం జరియించి వానరుల్.

611


క.

మిడుతలతఱుచునఁ బొడవుగ, నుడుపథ మద్ర్రువంగ నడరి యొండొరుఁ గడవన్
బడిబడి దిశలకుఁ జన న, ప్పుడు రఘుపతి పలికెఁ దపనపుత్రునితోడన్.

612


క.

నీ వెన్నఁ డిన్నిభూములు, వావిరిఁ గన్నాఁడ వనిన వనచరనాథుం
డావసుధేశునితో సం, భావన ని ట్లనియె నపుడు ప్రమదం బెసఁగన్.

613


క.

బలవంతుఁ డైనవాలికిఁ, దలఁకుచుఁ గిష్కింధ వెడలి త్వరతో నల్ది
క్కులకుం బాఱి మహీమం, డల మంతయుఁ జూచినాఁడ నాఁడు నరేంద్రా.

614


వ.

జనవరా జనకజ వెదకఁ దూర్పుదిక్కునకు వినతప్రముఖవీరవానరుల దక్షిణ
దిగ్దేశంబునకు నాంజనేయాంగదతారముఖ్యకపిపుంగవులఁ బశ్చిమంబునకు సుషే
ణాదిప్లవగోత్తముల నుత్తరదిక్కునకు శతబలిప్రముఖయూథపులను బుచ్చితి
నని చెప్పి.

615


క.

బల్లిదు లగునక్కపివరు, లుల్లాసము లార నరిగి యొగిఁ దెల్లముగా
నెల్లెడల వెదకి తగ నీ, వల్లభఁ బొడగాంచి వేగ వచ్చెద రనఘా.

616


వ.

అని సుగ్రీవుండు పలుక రామచంద్రుం డుల్లసిల్లె నట్టియెడ.

617


చని తూర్పుదెసకు నీచె, ప్పినచోటుల నెల్ల వెదకి పృథివీశుసతిన్
జనకజఁ గానక వచ్చితి, నని వినతుఁడు చెప్పె నప్పు డర్కజుతోడన్.

618


క.

చెచ్చెర నుత్తరభూములు, విచ్చలవిడి నెల్లయెడల వెదకి వెదకి యే
నచ్చట జానకిఁ గానక, వచ్చితి నని చెప్పెను శతవలి యినజునకున్.

619


వ.

మఱియుఁ బశ్చిమదిగ్భాగంబున కరిగి సుషేణుండు బలకలితుం డై మరల నే
తెంచి సుగ్రీవుసన్నిధి మున్ను నీచెప్పినభంగి దేవిం జూచి కానక.

620


చ.

పురములఁ బల్లెపట్టులను [13]భూరినికుంజమహోగ్రశైలకం
దరములఁ గానలం దుపవనంబుల సాగరతీరభూములన్
సరసుల నిర్ఝరస్థలుల సైకతచారునదీనదంబులం
దరువులనీడలం బొదలఁ దాపసవర్యులయాశ్రమంబులన్.

621


క.

మానక యారసి యెచ్చో, మానినిఁ గానంగ లేక మఱి వార్తయు మా
వీనులు సోఁకక మగుడన్, వానరతతితోడ వేగ వచ్చితి నిటకున్.

622


వ.

అని పలికి.

623


చ.

అమితబలాఢ్యుఁ డైనపవనాత్మజురాకయ కోరుచున్నవా
రము సతిఁ జూడ నాదెసన ప్రత్యయ మయ్యెడు బుద్ధివీర్యవి
క్రమకలితుండు సర్వగుణరమ్యుఁడు నైనమరుత్సుతుండు భూ
రమణునిదేవిఁ జూచి యనురాగముతోఁ జనుదెంచు నర్కజా.

624

వ.

అని సుషేణుండు ప్రియంబులాడె నట దక్షిణదిగ్భాగంబునకుంబోయిన వానరులు.

625


క.

తారాంగదాదివానరవీరులు వాయుతనయుండు వింధ్యాద్రికి నే
పారఁ జని యచటిగిరిబిల, భూరుహషండవనకుంజపుంజాపగలన్.

626


క.

కలయ సతి వెదకి కానక, ఫలజలమూలోపభోగరపరు లై కపివీ
రులు చని యొండొకదేశము, నలవడఁ బొడగాంచి యలరి యచ్చటఁ జూడన్.

627


తే.

లీలమైఁ బదియేఁడులబాలుఁ డైన, తనసుతుఁ డరణ్యమునకును జని గతాసుఁ
డైనఁ దండ్రి యౌమునివరుఁ డాగ్రహమున, నావనము శపియించిన నావనంబు.

628


చ.

అలికులపర్ణహీనవికచాంబుజవారిరుహాకరంబు ని
ర్దళఫలపుష్పవృక్షనికరంబును నిర్గతజీవనాపగా
వలికలితంబుఁ బక్షిమృగవర్జితముం జ్యుతమూలమున్ ఘనా
చలగహనంబు నిర్జలముఁ జక్షురసహ్యము నై వెలుంగఁగన్.

629


చ.

అటఁ బరికించి యొక్కకనకాచలముం గని తద్బిలంబు ను
ద్భటగతిఁ జొచ్చి యందు ఘనపర్వతసన్నిభుఁ డైనదైత్యు ముం
గటఁ బొడగాంచి యయ్యసుర దాఁటి సమస్తగుహాంతరంబు వి
స్ఫుటముగ నందఱున్ వెదకి భూమిజఁ గానక దుఃఖితాత్ము లై.

630


సీ.

అటఁ బాసి కపు లొక్కవిటపిమూలముఁ జేరి, యాసీను లై యుండు నపుడు వారి
కనిలజుఁ డిట్లను నినజుండు చెప్పిన, చోటులఁ జెప్పనిచోటులందు
వెదకితి మెచ్చోట విభుదేవి గాన మ, వ్వనజాక్షివార్తయు వినఁగఁబడదు
సమయకాలంబును జనఁజొచ్చెఁ గడముట్ట, నిఁకమీఁదఁ జేయంగ నేమి గలదు
రామచంద్రుని కామితార్థంబు గలుగఁ, జేసి యానందకీర్తులఁ జెందలేదు
గాన ప్రాణంబు విడిచెదఁ గాక యన్న, నంగదుఁడు పావనికి నిట్టు లనియెఁ బొసఁగ.

631


చ.

అమితబలాఢ్యు లిండఱు సమర్థులు నెంతటి కైన రామభూ
రమణునికామితార్ధము పరాభవ మొందదు సర్వవానరుల్
క్రమముస నెల్లచో వెదకఁగాఁ దగుఁ గ్రమ్మఱ యుక్తకార్యయ
త్నము ఫలియించు నొక్కయెడఁ దక్కక చేయఁగ వంత యేటికిన్.

632


చ.

పతిహితకార్యముం జెఱిచి పందల మై భయలజ్జ లేది యే
గతి దివసేంద్రనందనునిఁ గానఁగఁ బోదము పోయినప్పు డు
ద్ధతి నతఁ డాత్మనాథు ప్రియ మాఱడిఁ బుచ్చిన యట్టినీచు లం
చతిభయదక్రియ మనల నందఱ వధ్యులఁ జేయకుండునే.

633


వ.

అనవుడు గంధమాదనుఁ డంగదుండు చెప్పినట్ల మన మెల్లచోటుల వెదకుదము
పదం డనుచు నట లేచి యందఱుం గూడి దక్షిణదిగ్భాగంబున నున్న వింధ్యాద్రి
సమీపంబుఁ జేరి.

634


మ.

విలసల్లోధ్రకసప్తపర్ణగహనన్ వీతప్రభావిస్ఫుర

త్కలధౌతాచల మొక్కఁ డెక్కి యతిదక్షత్వంబు లేపార నం
దుల నానాతరుకుంజపుంజవిపినస్తోమాపగాభూములన్
నలినాక్షిం బరికించి కానక విషణ్ణత్వంబునం బొందుచున్.

635


వ.

అగ్గిరి డిగ్గి యిలఁ గొంతదడవు విశ్రమించి యుల్లాసంబు దెచ్చుకొని యంగ
దాంజనేయమైందద్వివిదనలతారజాంబవంతులు క్రమ్మఱ వింధ్యాద్రిగుహావనం
బుల మఱియుఁ దగుచోట్ల వెదుకుచు నరుగుదెంచి.

636


క.

పుడమిసుత వెదకి యెచ్చటఁ, బొడ గానఁగ లేక యొక్కభూజముక్రిందం
గడు డస్సి నిలిచి తృష లే, ర్పడ నడరం గపులు దెసలు పరికించునెడన్.

637


మ.

కలయం బెల్లునినాదముల్ చెలఁగ ఱెక్కల్ లీల సారించుచుం
గలహంసవ్రజచక్రసారసబకక్రౌంచాదినానారవ
జ్జలపక్షుల్ వెడలం గనుంగొనుచు వృక్షచ్ఛాదితం బైనయా
బిలముం గాంచిరి తోయపానవిపులాపేక్షార్థు లవ్వానరుల్.

638

హనుమజ్జాంబవదాదులు స్వయంప్రభగుహలోఁ బ్రవేశించుట

వ.

హనుమంతుం డప్పుడు దవ్వులం గనుంగొని.

639


క.

కమలార్ద్రపక్షములతోఁ, గమలరజస్సిక్తరక్తగాత్రంబులతో
నమరుచు జలపక్షిసమూ, హము లోలిన్ వెడలుచున్న వవె గుహవాతన్.

640


చ.

అరయఁగ నుండ నోపుఁ గమలాకరమందు జలంబు ద్రావి వే
ధరణితనూభవన్ వెదకు దండు పదండు కపీంద్రులార యం
చరిగి ఘనాంధకారభరితాంతరముం గడుదుష్ప్రవేశమున్
హరిరుచిదుర్గమంబు నగునాబిల మందఱుఁ జొచ్చి యచ్చటన్.

641


ఉ.

చండఘనాంధకారమున సర్వవనాటులుఁ ద్రోవఁ గాన లే
కొండొరుఁ గౌఁగిలించుకొని యోజన మేఁగి తృషాబుభుక్షులన్
నిండుశ్రమంబునన్ ధృతులు నీఱుగ జీవముతోడి వాంఛ లే
కుండిరి మాస మొక్కఁ డటు లుండి జలస్థలిఁ జేరి ముందటన్.

642


వ.

వెలిఁగెడు నొక్కతెలుపుపొడ గని యచటి కరిగి తిమిరం బంతయు నడంగి బిలం
బెల్ల దేదీప్యమానం బై పొడ గానంబడ నచటి కాంచనమయకిసలయవిసరకుసుమ
స్తబకఫలవిలసితవరపర్ణసువర్ణశాఖలం దచ్ఛాఖాకలితంబులై సలలితకలరవకల
కలంబులఁ బొలుచుజాతరూపసురూపపక్షిచయంబులం గనదనలశిఖోపమాన
కనకలతాహింతాలతక్కోలనారికేళసాలరసాలకకుభచంపకపున్నాగనారంగాది
తరునికరంబులు సురుచిరభూషణభూషితహేమాభిరామధామంబులు నీలవైదూ
ర్యరత్ననిర్మితకనకరజతకువలయంబులు నాస్ఫోటితహాటకమత్స్యకచ్ఛపాదిజల
చరంబులఁ బరివేష్టితజాంబూనదవృక్షజలపక్షికులంబులం బెల్లు విలసిల్లు విమలా
ప్సరోవరంబులఁ జామీకరచారువిమానంబుల ముక్తాజాలాంతరగవాక్షలక్షిత

కలధౌతసమవిరాజద్గృహంబుల రుక్మరౌప్యభాజనంబులఁ బూర్ణస్వర్ణరజతక్షౌ
మాదిదివ్యవస్త్రగంధమాల్యాంగరాగంబుల మధురమధురాహారమధురపానం
బుల వివిధధాన్యంబుల మణిచిత్రచిత్రితకంబళాజినసంచయంబులఁ దనరారు
హేమధామంబుల నచట నచటఁ జూచుచు నేతెంచి యరుణకాంచనచిత్రాస
నాస్తీర్ణరత్నపటలంబుల మధుస్రావు లైనభక్ష్యభోజ్యలేహ్యపానీయఫలవృక్షం
బుల రమణీయమణిగణంబుల హరితవర్ణపక్షంబుల సామస్వరనినాదంబుల విద్యు
త్కాంచనప్రభల శోభిల్లుమధుపంబులు గలవృక్షశాఖాగ్రంబుల నాలోకిం
చుచుం జనుదెంచి యాకపు లగ్రభాగంబున.

643


ఉ.

భ్రాజితహేమవిష్టరముపై నచలస్థితి నుండి చారుకృ
ష్ణాజినమున్ ధరించి సముదగ్రసమాధిసమేత యై తప
స్తేజము లుల్లసిల్ల విలసిల్లు స్వయంప్రభఁ గాంచి రాధరి
త్రీజచరుల్ మరుత్సుతుఁడు దిగ్గున నప్పుడు మ్రొక్కి యి ట్లనున్.

644


చ.

నిరుపమపుణ్యవే సతివి నీ విటు లొప్పుచు నున్నయీగుహా
సురుచిరరత్నహేమవనశోభితకాంచనమందిరంబు లె
వ్వరివి సువర్ణకూర్మఝషవారిచరంబులు దేలియాడెడున్
సరసులు విస్మయంబు లివి సర్వము మా కెఱిఁగింపు మేర్పడన్.

645


క.

అనవుడుఁ బావని కాసతి, చన ని ట్లను నేను మేరుసావర్ణితనూ
జను నాపేరు స్వయంప్రభ, యనిశము నుండుదుఁ దపోనియతి నీగుహలోన్.

646


చ.

ఉరవడి వాసవుం డసురయుద్ధమునప్పుడు వజ్ర మెత్తి ని
ర్భరగతి వైవ నీనగము వ్రస్సె బిలంబుగఁ గర్మకౌశల
స్ఫురితుఁడు విశ్వకర్మ మును భూతహితంబుగ నీమనోజ్ఞకం
ధరము రచించె రత్నభరితంబు సురాసురదుర్గమంబుగన్.

647


క.

ఘనమాయామహిమ మయుం డనుదానవవిశ్వకర్మ యమరెడునీకాం
చనవనగృహాదివస్తువు, లెనయఁగ నేర్పున సృజించె నీగుహలోనన్.

648


చ.

అరుదుగఁ గాననాంతమున నామయుఁ డోపికఁ బెక్కువేలవ
త్సరములు నిష్ఠతోఁ దపము సల్పఁ నాతని కబ్జగర్భుఁ డా
దరమున నిచ్చె నీబిలము దానవనాయకుఁ డిందులోన న
చ్చర యగు హేమతో సురతసౌఖ్యము లొందుచు వైభవంబునన్.

649


క.

మృత్యువు వంచించి మయుం, డత్యాయతకాల మీ గుహను హేమాసాం
గత్యమున నుండఁ గని యా, దిత్యేశుఁడు వచ్చి మయునిఁ దెంపునఁ జంపెన్.

650


క.

హేమాగృహ మిది నా కా, హేమ ప్రియవయస్య గాన యేఁ జెడకుండం
బ్రేమంబున నీహేమా, ధామము గాచికొని యున్నదానన్ మహిమన్.

651


వ.

అని పలికి.

652

క.

వలసిన ఫలమూలాదులు, నలువునఁ జిత్తములు దనియ నమలుఁడు మధురా
మలజలములు ద్రావుఁడు సే, దలు వాయఁగ ననుడుఁ బవనతనయుఁడు సతితోన్.

653


క.

లోలమతిఁ జొచ్చి గుహ నా, భీలశ్రమ తృషలు పొడమఁ బేరాఁకటితో
నీలాగువగలఁ జావఁగఁ, బా లై యున్నార మిచటఁ బావనచరితా.

654


క.

మా కాహారము లొసఁగి కృ, పాకరమతి మమ్ముఁ బ్రోవు మనఘాత్మ యనన్
వే కందమూలఫలములు, కోకొం డని యొసఁగ నందికొని నమలి కపుల్.

655


వ.

అతిప్రీతు లై మఱియు జలము లాపోవం ద్రావి తృస్తిం బొంది యాస్వయం
ప్రభఁ బ్రశంసించి రప్పు డాతపస్విని వారలం గనుంగొని.

656


క.

ప్రేమంబుతోడ ని ట్లను, నేమాడ్కిన్ వెదకి కంటి రీబిలమున్ మీ
రేమహిమంబునఁ జొచ్చితి, రేమిటి కిట వచ్చినార లెక్కడి వారల్.

657


వ.

అనిన నక్కపు లాతపస్వినికిఁ దమవచ్చినవిధం బెల్లను జెప్పి భాగ్యవశంబున నిన్నుఁ
బొడగని నీప్రసాదంబున మృష్టాహారంబులం గొని మధూదకంబులు ద్రావి పరి
తుష్టిం బొంది విగతశ్రాంతుల మై యున్నార మింక మావచ్చిన కార్యంబు వినుము.

658


క.

ఇనజుఁడు మాసములోపల, జనకజఁ గానంగ వెదకి చనుదెం డనినం
జనుదెంచి మాస మంతయుఁ, జనఁ జెడి యున్నార మెందుఁ జన లే కిచటన్.

659


క.

రాముఁడు పుణ్యశ్లోకుం, డామహితాత్ముసతి వెదక నరుగఁగ వలయున్
సేమంబున మము నీబిల, ధామము వెడలింపు కరుణఁ దల్లీ యనినన్.

660


క.

ఏరికిఁ బ్రాణంబులతోఁ, బోరా దీబిలము సొచ్చి పోఁడిమితో నా
భూరితపఃప్రాభవ మరు, దారఁగ నీబిలము వెడల ననుపుదు మిమ్మున్.

661


క.

వృక్షచరులార వేగమ, యక్షులు మూసికొనుఁ డీగుహాదుర్గం బ
ధ్యక్షము మీ రీక్షింపఁగ, దక్షత వెడలింప రా దుదగ్రత ననినన్.

662


మ.

బిల మావానరు లందఱున్ వెడలు సంప్రీతిన్ నిజాక్షుల్ గరం
బులఁ గానంబడకుండ మూసికొన నాపుణ్యాత్మ యోగాంచితో
జ్జ్వలశక్తిన్ నిమిషంబులోనన గుహద్వారంబు దాఁటించి వా
రల కీశైలము వింధ్య మంచు మును మారం జెప్పి దీవించుచున్.

663


వ.

ఆతపస్విని యబ్బిలంబు చొచ్చెఁ దదనంతరంబ.

664


ఆరఁ దపోబలంబున స్వయంప్రభ త మ్మటు కేలఁ దాల్చి త
ద్ద్వారబహిఃస్థలిన్ విడువ వానరు లక్షులు విచ్చి చూచి యా
చేరువ నున్నసాగరముఁ జెన్నగుపల్లవపుష్పవల్లికా
చారువసంతమాసతరుషండముఁ గన్గొన నంగదుం డనున్.

665

హనుమదాదులు సీతం గానమికిఁ జింతిల్లుట

క.

ఇనజుఁడు మితిచేసినయా, దినములు పోఁజొచ్చెఁ గాన తిరుగఁగ నెచటన్
జనకజఁ గానమ యటకున్, మన మేఁగిన రవిజుఁ డపుడ మడియంజేయున్.

666

వ.

అని పలుకఁ గపులు తమలోన.

667


తే.

అంగదుఁడు చెప్పినట్ల యయ్యర్కసుతుఁడు
ఘనతరక్రూరుఁ డిక్కడికార్య మెఱుఁగఁ
డామహీజఁ గానక మన మటకు నేఁగఁ
గినిసి రామప్రియంబుగా మనలఁ జంపు.

668


సీ.

అని పల్క వారితో నంగదుఁ డిట్లను, మన మిఫ్టు వెడలిన ఘనబిలంబు
బహుపక్వఫలజలభరితంబు నేరికి, దుస్సాధతరమును దురధిగమము
మాయావినిర్మితమహితదేశముఁ గాన, క్రమ్మఱ నీగుహఁ గడఁక లారఁ
జొచ్చి కా పు౦డుద మిచ్చటఁ గపులార, యాబిలంబున మన మిప్పు డున్న
నింద్రుఁ డాదిగ దేవత లెల్ల వెదకి, మనలఁ గానంగ లే రన్న మనుజు లైన
రామలక్ష్మణులును మఱి రవిజముఖ్య, వానరప్రవరులు వచ్చి కానఁగలరె.

679


వ.

అని పలుకు నంగదువాక్యంబు లాదరింపక హనుమంతుం డి ట్లనియె నీవు వెడఁ
గుబుద్ధి వీకపులం గూర్చుకొని యీబిలంబు చొచ్చి ప్రబలుం డయినసుగ్రీవుతో
మరలంబడఁ జూచెదవు జను లెల్లఁ బ్రబలునిఁ జేపట్టుదురు గాని దుర్బలుని తెరు
వొల్లరు నేనును నీలుండును దాగుండును వాలి గలనాఁడు సుగ్రీవునివారలమై
యుండుదుము సుగ్రీవునిఁ బాసి మాకు నుండ నర్హంబు గాదు దక్కినవారును
జపలమతు లై యిక్కపులు దమతమపుత్రమిత్రకళత్రాదులం బాసి నీయాజ్ఞకు
లోనై నీకడ దుఃఖంబు లనుభవించుచుందురే మేమందఱముఁ దొలఁగిన నీవొక్క
రుండవు నీబిలంబున నెట్లుండెద వట్లుం గాక.

670


మ.

సురరా జుద్ధతి నొక్కవజ్రమున నీక్షోణీధ్రమున్ వ్రచ్చి క
న్దర మొక్కం డొనరించె లక్ష్మణునకు న్వజ్రోగ్రనారాచముల్
పరికింపం గల వెన్నియేని నతఁ డాబాణంబులన్ వీఁక ని
గ్గిరిఁ జూర్ణంబుగఁ జేసి నిన్నుఁ దునుముం గింకన్ మహోదగ్రుఁ డై.

671


వ.

కావున దుర్విచారంబులు మాని మమ్ము ముందట నిడుకొని సుగ్రీవునికడ కేఁగు
మతండు సత్యసంధుండును ధర్మయుక్తుండును మీతల్లి కత్యంతానురక్తుండు నగు
టం జేసి పుత్రుండ వైననిన్ను యుక్తక్రమంబునఁ బట్టంబు గట్టు బోదము రమ్మ
నుచుం బలుక నంగదుండు సుగ్రీవు నుద్దేశించి యిట్లనియె.

672


మ.

చన నీయంగదు యౌవరాజ్యయుతుఁ గా [14]సంప్రీతితోఁ జేయు మీ
తనికిం దప్పుట నాకుఁ దప్పు టని యుద్యత్ప్రీతితోఁ బంచినన్
సునయం బారఁగ రామునాజ్ఞ యువరాజుం జేసెఁ గా కిచ్చమైఁ
దనయంతన్ యువరాజుఁ జేసెనె ననున్ ధర్మంబు చెల్వారఁగన్.

673


చ.

అరుదారన్ గుహఁ జొచ్చి వాలి రిపుతో నా సన్నుఁ డై పోర ని

ర్భరసత్త్వంబున వాలికిన్ వెడలి రా రంధ్రంబు లేకుండఁ దా
నురుతైలంబు బిలంబువాత నిడి రాజ్యోల్లాసి యై వచ్చి వా
నరరాజ్యం బనురక్తిఁ జేకొని కడున్ గర్వాతిరేకంబునన్.

674


క.

జనకసముం డగ్రజుఁ డా, తనిసతి ధర్మమునఁ దల్లి దనయగ్రజుదా
రను దారను వరియించెను, జన దన కినసూనుఁ డతఁడు సద్ధార్మికుఁడే.

675


క.

తనకును రాజ్యం బిచ్చిన, ఘను రామునిఁ గానఁ బోక కడుఁగిన్కను రా
మునితమ్ముఁడు వచ్చిన మఱి, మనమున బెగ డంది కాద మదమఱి వచ్చెన్.

676


వ.

ఆసుగ్రీవుండు కృతఘ్నుండును బాపచిత్తుండును గావున మాతండ్రివలని పూర్వ
వైరంబుఁ దలంచి మట్టుపెట్టుం గాని న న్నేల పట్టంబుఁ గట్టు నని పలికి.

677


చ.

జనకజఁ గాన కే నరుగఁ జండగతి ననుఁ బట్టి [15]గిట్టి త
ర్జన మొనరించి దండముల జర్జరితాంగునిఁ జేయుఁ గాన
నినజునిపొంతఁ బో వెఱతు నిక్కడఁ బ్రాణములం ద్యజించెదన్
వనచరులార మీ రటకు వాంఛలతోఁ జని యానతాంగు లై.

678


క.

ఏ నిట నీల్గుట విన్నన్, మానసమున దుఃఖ మొంది మరణం బొందుం
గాన మును దార మొగపడి, మానుగః గుశలంబు లడిగి మఱి నే ర్పమరన్.

679


వ.

నాతెఱం గెఱింగించి యంతమీఁద.

680


క.

పతియును సుతుఁడును లేమికిఁ, దతదుఃఖముఁ బొంచుజనినిఁ దారను మఱిస
మ్మతి రుమను శోక ముడుగఁగఁ, గృతిమతి బోధించి బుజ్జగింపుఁడు మీరల్.

681

ప్రాయోపవిష్టు లైన హనుమదాదులకడకు సంపాతి వచ్చుట

వ.

అని పలికి యంగదుండు భోజనంబు చేయుచు దర్భశయనుం డయ్యె నప్పుడు
సకలకపులు బాష్పధారలు దొరఁగ నంగదునిం దిరిగివచ్చి జలాచమనంబు చేసి
దక్షిణాగ్రంబు లైనదర్భలమీఁద నుత్తరశిరస్కులై ప్రాఙ్ముఖు లగుచుఁ బర్వత
సన్నిభు లైనయవ్వన చరు లొఱలుచుఁ బ్రాయోపవేశంబు చేసి రపుడు మందర
పర్వతవినిర్గతుం డై వింధ్యపర్వతశిఖరాగ్రంబున నున్నసంపాతి కడంక.

682


క.

తనబిలము వెడలి చేరువ, మునుమిడి ప్రాయోపవేశమును వరుసం గై
కొని వగలఁ బొగులుకపులం, గని యాసంపాతి యుత్సుకత ని ట్లనియెన్.

683


క.

దైవాధీనము లోకము, దైవము సర్వంబు భూతతతి కొడఁగూర్చుం
గావున నా కాహారము, దైవము ముందఱికిఁ దెచ్చి తనరఁగఁ బెట్టెన్.

684


క.

చిరకాలం బాహార, మ్మిరువుగఁ గొని తిరుగ లేని యే నింకను జె
చ్చెర ముందట మరణేచ్ఛా, పరు లై యీల్గువనచరుల భక్షింతు వెసన్.

685


చ.

అని విని యాత్మ దుఃఖపడి యంగదుఁ డిట్లను వాయుపుత్రుతో
మనల గ్రసించెదన్ వెసఁ గ్రమంబున నం చొకఘోరపక్షి యిం

పెనయఁగఁ బల్కె నిట్లు మనకేరికి ము న్నెఱుఁగంగరాని యీ
ఘనవిపదద్భుతక్రమము గల్గెఁ గదే యని పల్కి వెండియున్.

686


తే.

నృపతిసతి సీత వెదకెడునెపము పన్ని, మర్కటప్రాణములు [16]గొన మదిఁ దలంచి
చటులకాలుఁడు మనల నిచ్చటికిఁ దెచ్చె, నినజుఁడును రామచంద్రుండు నేమి సేయు.

687


తే.

రామువనవాసమును దశశరథునిమృతియు, ధరణిజాహరణముఁ బక్షివరునిహతియు
వాలిమరణంబు మనకుఁ జా వలయుటయును, గలిగెఁ బాపపుఁగైకేయికారణమున.

688


ఉ.

కైక వరంబు త న్నడుగఁ గానకు రామునిఁ బుచ్చి యాత్మలోఁ
బైకొనుపుత్రశోకమునఁ బంక్తిరథుండు గతాసుఁ డయ్యె సు
శ్లోకుఁడు రాఘవుం డడవిలోఁ జరియింపఁగ భిక్షువేషముం
జేకొని సీత నెత్తుకొని శీఘ్రమె రావణుఁ డేఁగె నేఁగఁగన్.

689


క.

రామహితంబుగ మార్కొని, రామునిసతికొఱకుఁ బేర్చి రావణుచే సం
గ్రామమున నీల్లి నిర్జర, ధామంబు జటాయు వొందె ధన్యత వెలయన్.

690


క.

జనపతి కెంతయు హితముగ, జను లెన్న జటాయు వీల్గి సద్గతిఁ గనియెన్
మనము జటాయువుకరణిన్, జనపతికిని హితము గాఁగ సమయుద మింకన్.

691


క.

ధరణిజ వెదకెడుపనికై, తరణిజుతోఁ జెలిమి చేసి తగ రాఘవుఁ డౌ
తరణిజుకొఱ కవ్వాలిం, బరిమార్చి దినేంద్రపుత్రుఁ బట్టము గట్టెన్.

692


వ.

పట్టాభిషిక్తుం డై రామునినియోగంబున.

693


మ.

మనలన్ జానకిఁ జూచి రం డనుచు నమ్మార్తండి వే పంచినం
జన నేతెంచి సమస్తదేశములు నిచ్చం బోల వీక్షించి యెం
దును నారామునిదేవిఁ గానక ధృతుల్ దూలంగ బ్రాయోపవే
శనముం గైకొని యెంతయున్ వగల నీశైలాగ్రదుర్గాటవిన్.

694


తే.

ఒదవునాఁకటిచిచ్చుచే నుల్ల మెరియ, నెపుడు నాహారములు లేక యిష్టదార
ధనగృహంబులఁ బాసి యత్యంతభీతిఁ, బ్రాణములు విడుతురు కపుల్ పతికి వెఱచి.

695


క.

ఘనుఁడు జటాయువు సమయను, వనచరపతి వాలి పొలియ వచ్చి విపత్తిన్
మన మిటఁ జావ దురాత్ముఁడు, దనుజుం డెత్తికొనిపోయె ధరణితనూజన్.

696


క.

ఇల భరతుని నేలింపఁగ, ఖలబుద్ధిం బాపజాతి కైకేయి వరం
బులు వేఁడి విభుని రాఘవ, కులముం గపికులముఁ బక్షికులముం జెఱిచెన్.

697


క.

అని యిట్లు పలుక విని తన, యనుజుండు జటాయు వీల్గె నని యతిదుఃఖం
బున శోకించుచుఁ గపులం, గనుఁగొని సంపాతి పల్కెఁ గడుదైన్యమునన్.

698


క.

ఘనబలుఁడు జటాయువు నా యనుజుఁడు సంపాతి నే మహాహవమున నె

వ్వనిచే జటాయు వీల్గెను, ఘనుఁ డాదశరథసఖుండు గడచెనె యకటా.

699


క.

అని పల్కి రామురాకయు, జనకజపోకయును ననుజుసమరము మరణం
బును సర్వము నేర్పడఁగా, వినవలయు నాకు నింక విదితము గాఁగన్.

700


క.

వృక్షచరులార నాకుం, బక్షంబులు లేవు గాన పదముల నడతే
నక్షముఁడను భవదీయస, మక్షమునకుఁ గొంచుఁ బొండు మన్నన నన్నున్.

701


వ.

అని యిట్లు పలుకుసంపాతిపలుకులు విని యఖిలకపులుఁ జింతించి యీపక్షి
మనల భక్షించునో యెట్లునుఁ బ్రాయోపవేశంబు గైకొని మరణేచ్ఛ నున్నా
రము మనల మ్రింగిన మ్రింగనిమ్ము మృతులమై నాకంబున నుండుద మనునిశ్చ
యంబుతో నరిగి సంపాతిం బట్టి తెచ్చి తమసన్నిధి నిడుకొని రప్పుడు సంపాతిం
జూచి యంగదుండు.

702


ఉ.

రామువనప్రవాసమును రావణుఁ డాగతి వచ్చి వంచనన్
భూమితనూజ నెత్తికొని పోకయుఁ దా మినజుండు పంచినన్
రామునివల్లభన్ వెదక రాకయు జానకిఁ గానలేక తా
రామెయి నున్నచందము సమస్తము నేర్పడఁ జెప్పి వెండియున్.

703


ఉ.

రామునిదేవి నెత్తుకొని రావణుఁ డేఁగఁగ వీఁకఁ దాఁకి ని
స్సీమబలంబునన్ విరథుఁ జేసి మదం బడఁగించి యెంతయుం
బ్రేమముతోడ సీత విడిపించి జటాయువు వానిచేత సం
గ్రామములోనఁ జచ్చి పరఁగంగ దివంబున కేఁగె ధన్యుఁ డై.

704


వ.

తదనంతరంబ రాముండు చనుదించి రావణునిచేత నసిధారాధళితపక్షుండై పడి
యున్నజటాయువుం జూచి శోకించి దశరథునింబోలె సంస్కరించి ధర్మతంత్రం
బాచరించి నాకంబునకుం బుచ్చె నని పలుక విని సంపాతి దుఃఖించి యంగదా
దులతోడ ని ట్లనియె.

705


మ.

ఇనచండాంశులఁ బక్షముల్ గమలి యే నెచ్చోటికిం బోవ లే
కునికిన్ వార్ధక మొందుటన్ ఘనబలం బొప్పారఁగా లేమి నా
యనుజుం జంపినరక్కసున్ వినియు నుద్యచ్ఛక్తి నారావణుం
దునుమం జొప్పడకున్నవాఁడ మదిలో దుఃఖంబునం దూలుచున్.

706


చ.

అన విని యంగదుం డనియె నాఖగనాయకుతోడ వేగ నీ
యనుజునిఁ జంపి చన్నదివిజారి వధించెద నంచుఁ బల్కి తీ
వనఘ వయోధికుండవు సమస్త మెఱుంగఁగ నేర్తు మాకు నిం
పెనయఁగఁ జెప్పు పంక్తిముఖుఁ డెక్కడఁ బెట్టినవాఁడు జానకిన్.

707


వ.

అని పలికిన సంపాతి వారి కి ట్లనియె.

708


క.

దూరపథ మేఁగి నా కా, హారముఁ దెచ్చుకొనఁజాల నటు గావున నా
కూరిమిపుత్రుఁడు నా కా, హారముఁ గొని తెచ్చి పెట్టు నాఁకలి వాయన్.

709

వ.

మఱియు నొక్కనాఁడు.

710


క.

తనతల్లిఁ జూచు వేడుకఁ, జని యామఱునాఁటిదాఁక సమ్మతి నాకుం
దిన మాంసము లే కేతెం, చిన నాఁకొని చండకోపచిత్తముతోడన్.

711


ఉ.

వారక నిష్టురోక్తులను వావిరిఁ దూర సుపార్శ్వుఁ బల్కినన్
సైరణ చేసి యాసుతుఁడు సమ్మతి ని ట్లని చెప్పె నీకు నా
హారము దేర వేగ చని యర్థి మహేంద్రనగంబు చేరి త
ద్ద్వారమునందుఁ గాచికొని తద్దయుఁ గోరిక నున్నయంతటన్.

712


క.

రావణుఁడు వచ్చి నన్నుం, ద్రోవ యడిగె నేను జెప్ప దోర్బల మెసఁగన్
వేవేగ న న్నొరసికొని, నావాససమీపపథమునం బోవునెడన్.

713


క.

ఖలుఁ డగు రావణుసన్నిధి, నలఘువిభూషణసమేతయై రామమహీ
తలపతిసతి నీలాంబుద, కలితతటిల్లతికకరణిఁ గానంబడియెన్.

714


చ.

ననుఁ బొడగాంచి లజ్జ వదనంబు నతంబుగఁ జేసి యాత్మమం
డనములు వేగ పుచ్చుచు ఘనధ్వని రాముని రామచంద్రుత
మ్ముని నెలుఁగెత్తి చీరుచును మోమున నశ్రులు రాల నేడ్వఁగా
జనకతనూజ నెత్తికొని చయ్యన రావణుఁ డేఁగె లంకకున్.

715


వ.

అంత.

716


క.

అచ్చట నుండుమునీంద్రులు, వచ్చి ననున్ వత్స పంక్తివదనునిచేతం
జెచ్చెరఁ జావక బ్రదికితి, విచ్చట నుండవల దరుగు మెచటికి నయినన్.

717


వ.

అని పలికిన నిరామిషుండ నై వచ్చితి నని సుపార్శ్వుండు చెప్పె నిప్పుడు యో
గదృష్టిం జూడ నాకును.

718


క.

బలసి భయంకరరాక్షస, లలనలు గాచికొని యుండ లంకాపురిలో
పల నున్నది జానకి బెగ, డలవడఁగా వ్యాఘ్రకలితహరిణియుఁబోలెన్.

719


చ.

తరుచరులార గృధ్రములు తద్దయు దూరము గాంచి దూరసం
చరణముఁ జేయు గృధ్రకులజాతవరేణ్యుఁడ నేను గావునన్
వెరవున లావుమై నెగయువేళ దిశల్ పరికించువేళ న
త్యురుతరదృష్టిఁ గాంతు శతయోజనదూరత నున్నసర్వమున్.

720


క.

అటు గాన యిచట నుండియు, నట నున్నఖలున్ దశాస్యు నాసీతను వి
స్ఫుటముగఁ గనుచున్నాఁడను, బటుతరదూరప్రసారభాసురదృష్టిన్.

721


వ.

కావున మీ రింక.

722


చ.

మరణోద్యోగము లెల్లఁ దక్కి బలసామర్థ్యంబు లేపార సా
గరమున్ దాఁట నుపక్రమింపుఁడు కడంకం బూని యుత్సాహత
త్పరు లై వానరవీరులార యనుచుం బ్రాయోపవేశంబు లా
దరణీయోక్తుల మానిపించి పలికెం దా వారితో వెండియున్.

723

క.

అనుజుఁడు జటాయువునకుం, దనరఁగ ధర్మోదకములు తద్దయు నాప్యా
యనముగ నిడవలె నాకును, వనచరులార కొనిపొండు వారిధికడకున్.

724

సంపాతి కపులతో నిజవృత్తాంతముం జెప్పుట

వ.

అని పలుకఁ గపులు సంపాతిని సముద్రతీరంబునకుం గొనిపోయిన నతండు కృ
తస్నానుం డై జటాయువునకుఁ దిలోదకదానం బాచరించినవెనుకఁ గ్రమ్మఱం
గొనివచ్చి యాసీనుం జేసిన సంపాతి సకలవానరులు హర్షింప నిట్లనియె వినుం
డేకచిత్తంబున నావృత్తాంతం బంతయు దక్షిణసముద్రతీరంబున నున్నవింధ్యప
ర్వతాగ్రంబున నిశాకరుం డనుమునివరేణ్యుం డెనిమిదివేలేం డ్లత్యుగ్రతపం బా
చరింప నేనును జటాయువు నమ్మునీంద్రునాశ్రమంబున వసియించితిమి.

725


క.

పూవనికావనితరువులు, లే వమ్మునియాశ్రమమున లీలన్ నవపు
ష్పావళులఁ బొలసి కమ్మని, తావులు వెదచల్లు మారుతము [17]ప్రసరింపన్.

726


క.

సురలోకమ్మున కమ్ముని, వరుఁ డిచ్ఛం జన్న వెనుక వడి వా దై మ
చ్చరమున నేను జటాయువు, సరభసమున వేగ యాకసంబున కెగయన్.

727


క.

ఇనరశ్ములవేఁడిమి నా, ఘనతరపక్షములు గమరి కడుఁ దూలి రయం
బున వింధ్యశిఖరిపైఁ బడి, దినషట్కముదాఁక మూర్ఛ దేఱక యుంటిన్.

728


వ.

మఱి మెల్లన లబ్ధసంజ్ఞుండ నై దిక్కులు చూడ నదులు గిరులు వనంబులు సము
ద్రంబులు గానక మఱికొంతగడువునకు వింధ్యం బని యెఱింగి ముని చన్న వెను
క నమ్మునియాశ్రమంబున మున్నూఱేం డ్లుండియు మునిం గాననిదుఃఖంబునం బొ
గులుచు నాపర్వతంబు డిగ్గి దర్భకంటకపరీతం బైనపుడమి నతిదుఃఖంబునం జ
రించుచు మునీశ్వరు వెదకంబోయి యొక్కవృక్షమూలంబున నుండి దూరంబున
భానుప్రభాభాసురుండును గృతాభిషేకుండు నుదఙ్ముఖుండును నై వచ్చుచున్న
మునీంద్రుం గని సంతసంబున నటఁ జూడ.

729


మ.

[18]పరఁగన్ లేఁగలు గోవువెంట మరులింపం బోవుభంగిన్ మునీ
శ్వరుఁ డాత్మాశ్రమ మొందఁ బోయెడునెడన్ వారింపఁ బో కెప్పుడుం
గరిసింహాదిమృగంబు [19]లెల్ల నెడఁదాకన్ వెన్నడిం బోయి మం
దిర మమ్మౌని చొరంగ వే మగిడి యర్థిం బోవు మేపుల్ గొనన్.

730


వ.

అట్టియెడ నేనుం బోయి వాకిట నుండ.

731


క.

పక్షములు లేనినన్ను ని, రీక్షించియు నెఱుఁగలేక యేమియు నాతో
దక్షతఁ బలుకక తనగృహ, మక్షీణాసక్తిఁ [20]జొచ్చి యాదర మొదవన్.

732


వ.

క్షణమాత్రం బుండి మగుడ నేతెంచి క్రమ్మఱ నన్నుం జూచి యమ్ముని యి
ట్లనియె.

733

ఉ.

భ్రాతలు కామరూపు లతిబంధురసత్వు లుదారు లైనసం
పాతిజటాయువుల్ జగతిఁ బ్రాజ్ఞులు వారలఁ జూచినావె య
న్వీతమనుష్యరూపధరు లిద్దఱలోపల నగ్రజుండు సం
పాతి జటాయు వాతనికి మక్కువతమ్ముఁడు పక్షిశేఖరుల్.

734


క.

ఎక్కడ వా రున్నా రీ, వెక్కడివాఁడ విట వచ్చి తేమిటికిన్ నీ
వెక్కుడుదుఃఖముఁ బొందెదు, తక్కక నీఱెక్క లేల దగ్ధము లయ్యెన్.

735


వ.

అని పలుకునమ్మునిచంద్రునితోడ.

736


క.

అనఘాత్మ జటాయువు నా, యనుజుఁడు సంపాతి నే నుదగ్రగతి నా
ఘనతరపక్షద్వంద్వము, చెనఁటిగఁ గాలినవిధంబు చెప్పెద మీకున్.

737


క.

ఏను జటాయువు నెంతయు, మానసమున మదము లొదవ మత్సరములతో
భానుని మనలో నెవ్వఁడు, మానుగ మును గదియనోపు మాపటిలోనన్.

738


క.

అతనికి మామారాజ్యము, లతులితగతి నిచ్చువార మనుచుఁ బ్రతిజ్ఞల్
గతివడఁ గైకొని యిరువురు. వితతబలోత్సాహధైర్యవేగము లెసఁగన్.

739


క.

ఖగగతి నిరువురమును న, త్యగణితవేగములతోడ నన్యోన్యగతుల్
నిగుడ నెగసి కడుఁబొడువున, గగనంబుననుండి పుడమి గనుఁగొన మాకున్.

740


క.

పురములు రథచక్రంబుల, కరణిన్ గిరు లూళ్లపగిది ఘననదులు వసుం
ధర హంసగణములగతిన్, ధరఁ గలకులగిరులు సౌధతతిగతిఁ దోఁపన్.

741


వ.

మఱియుం బొడువుగా నెగసి గగనతలంబున సిద్ధమార్గంబుల ఖచరసహస్రంబుల
భూషణభూషితాప్సరోగణంబులఁ జూచుచు నట నెగసి కనుంగొన నానాశాద్వ
లసస్యంబులు భూమికిఁ దిరిగి వచ్చినకులాచలంబు లావరణంబులుగాఁ బెట్టె నిడి
నయాభరణంబులుంబోలె నుండ ధరణికిఁ బరివేష్టితసాగరంబులు ముక్తాహారం
బులుంబోలె నుండ మఱియుం బొడవున కెగసి యాది క్కీది క్కని యెఱుంగలేక
యతిదూరంబునఁ బ్రళయకాలాగ్నిగతిఁ గ్రాలుచున్న యంబరంబున మహాగ్ని
రాశియుంబోలె రక్తవర్ణుం డై భూమండలప్రమాణుం డై దేదీప్యమానుం డైన
భానుండు గానంబడియె నప్పు డాదేవునితీవ్రాంశువుల దాహస్వేదశ్రమమూర్ఛా
తమంబులు గవియ వివశుం డై జటాయువు తలక్రిందుగా నురవడిం బడుచుండఁ
జయ్యన నాయనుజు ఱెక్కలనడుమ దాఁచుకొని దగ్ధుండు గాకుండ దిగంబడు
చుండఁ దరణికిరణంబులవేఁడిమి నాఫక్షంబులు గమలె నేను వింధ్యగిరిమీఁదం
బడి మఱి సముద్రంబులోఁ బడి మునింగితి జటాయువు జనస్థానంబునం బడియె
నని వింటి భాగ్యవశంబున గిరిమీఁద సముద్రంబునఁ జావక వెడలి పక్షంబులు
చెడి కాష్ఠలోష్టంబుపగిది నున్ననాకు నింకేటిజీవనం బనుచు శైలశిఖరంబున
నుండి విఱుగంబడ నుద్యోగించిననన్ను నచ్చటిజనులు నివారింపఁ బడ కు
న్నాఁడ నిట్లు.

742

క.

అని పలికి బాష్పధారలు, కనుఁగవలం గ్రమ్ముదేర ఘనతరదుఃఖం
బున నున్న నన్నుఁ గనుఁగొని, తనమతిఁ దలపోసి మౌని తగ ని ట్లనియెన్.

743


సీ.

దశరథుం డనుపేరిధరణీశునకు రాముఁ డనురాజు పుట్టెడు నామహీశుఁ
డనుజసమేతుఁడై యాత్మపత్నియుఁ దాను, జనకాజ్ఞఁ గానల సంచరింప
రావణుఁ డారాముదేవి మ్రుచ్చిలి కొని, పోవ నాచొప్పున దేవి వెదక
నారాముపంపున నధికవానరవీరు, లేతేరఁగలరు వా రిటకు వచ్చి
యెపుడు నీతోడ భాషింతు రపుడ నీకుఁ, బక్షములు వచ్చి ప్రాయంబు బలము జవముఁ
గన్నులును గల్గి క్రాలెదు మున్నపోలె, నని మునీంద్రుఁడు చెప్పి నెయ్యమున మఱియు.

744


వ.

ఖగవర మరణేచ్ఛ మారామదూతలు వచ్చునందాఁక నిచట నుండుము నీకు
ను రామలక్ష్మణులకును సురమునిబ్రాహ్మణులకు నింద్రునకు హితం బైనజానకి
వృత్తాంతం బెఱింగింపుము రామలక్ష్మణులం జూడ నాకును బ్రియంబు గలదు నీ
విచట నుండు నీకు సర్వంబును మే లయ్యెడు ననుచుం బలికి యమ్మునివరుండు
గ్రమ్మఱ నయ్యాశ్రమంబుఁ జొచ్చె నేను నంత.

745


క.

మునివరునానతి చిత్తం, బున నిడికొని యిచట జీవమును విడువక య
ల్లనఁ బాదమ్మున వెడలం, జని క్రమ్మఱ బిలముఁ జొచ్చి సముదితచింతన్.

746


వ.

రే లెల్ల నిదుర గానక కాలంబున కెదురుచూచుచుండ నూఱేండ్లు చనియె నం
త నిశాకరుం డనుమునివరుండు క్రమ్మఱ నాకమ్మున కరిగె నే నతిదుఃఖంబుఁ బొం
ది జీవంబు చిక్కంబట్టుకొని యుండ నేఁటికి వానరముఖ్య లైనమీర లేతెంచి
తిరి మీతోడ సీతావృత్తాంతంబు చెప్పితి నివె నాకుఁ బక్షంబులు వచ్చె మున్న
పోలెఁ బరాక్రమయౌవనంబులఁ బొందితి నని పలుక వానరులు వానిం జూచి
సంతోషించి సీతాన్వేషణగమనోత్సుకు లై యుండ నవ్వానరులం జూచి క్రమ్మ
ఱ సంపాతి యి ట్లనియె.

747

సంపాతి వానరులకు సీత యుండుచో టెఱింగించుట

సీ.

రూపింప నిచటికిఁ క్రోశమాత్రంబున, దక్షిణాంబుధి చెంతఁ దనరి యొక్క
యచల మున్నది వీఁక నయ్యద్రి పై నుండి, శతయోజనం బగుజలధి దాఁటి
యట లంకఁ గాంచెద రాలంకలోఁ బుణ్య, శీల యున్నది మీరు సీతఁ జూచి
కృతకార్యసిద్ధులై యతిమోదమున మీఱి, వెస వచ్చెదరు రామవిభునికడకుఁ
దప్ప దమ్మునీంద్రునిప్రసాదమున నాత్మ, వెలయఁ జూచిన నంతయుఁ దెలియఁ గాన
వచ్చెఁ గాన చెప్పితి మీకు వలయువాంఛి, తార్థలాభంబు లొందనిం డనుచుఁ బలికి.

748

క.

హిమనగమునందు మలయో, త్తమశృంగముచెంత నాసదన మున్నది నా
రమణియు నానందనుఁడును, నమరఁగ నున్నారు గాన యరిగెద నటకున్.

749


వ.

అని పలుక జాంబవంతుండు సంపాతిం గనుంగొని నీవు రామహితంబును మ
ద్వాంఛితంబు నైనసీతావృత్తాంతంబు చెప్పితి సంతసంబునఁ బొందితి మింక సము
ద్రోల్లంఘనం బెట్లు సేసెదమో యనుచింతం జింతిల్లుచున్నార మివ్వనధి దాఁట
నీవును సహాయంబు గావలయు నన్న సంపాతి జాంబవంతున కి ట్లనియె.

750


క.

వృక్షచరులార బలజవ, దక్షత నీయంబురాశి దాఁటం జాలం
బక్షములు గలిగి యున్నను, రక్షోనాయకున కెదిరి బ్రదుకఁగ నోపన్.

751


తే.

కాన నాసుతుఁ బంచెద ఘనుఁడు వాఁడు, శంక లే కంబునిధి దాఁటి లంకఁ జొచ్చి
సీతఁ బొడగాంచి కృతకార్యసిద్ధుఁ డగుచు, వచ్చు నిట కంచుఁ దనపుత్రు వాంఛఁ దలఁప.

752


క.

ఎఱకలగాలిం దరువులు, నఱుముగ విఱిగి కుసుమములు నలుగడ రాలన్
నెఱి చెడి వడి మేఘంబులు, పఱవఁగఁ దండ్రికడకును సుపార్శ్వుఁడు వచ్చెన్.

753


క.

వచ్చి తను నచటివానరు, లచ్చెరువడి చూడఁ దండ్రి కతఁ డిట్లను నీ
విచ్చఁ దలంచిన నిటకున్, వచ్చితి నేమిపని చేయవలయుం జెవుమా.

754


వ.

అనిన సంపాతి తనయునకు నంతవృత్తాంతంబును జెప్పి సీతం జూచి రమ్మని పనుప
నతం డెంతయు సంతోషించి యంగదుం గనుంగొని.

755


క.

పారావారము దాఁటెద, నారావణులంకఁ గొంక కద్భుతసత్త్వో
దారతఁ జొచ్చెద వచ్చెద, నారామునిదేవిఁ జూచి యతిశీఘ్రముగన్.

756


[21]అని పలుక నతనికడంకకు సంతోషించి యంగదుఁ డతనిం జూచి సుపార్శ్వా నీ
వధికబలుండ వెంతటికైనం జాలుదు మీ తండ్రియు నీవును నెమ్మది సుఖంబున
నుండుండు మీ రాయాసపడవలవదు సీత లంకలో నున్న దని మున్ను మీ
తండ్రి దివ్యదృష్టిం జూచి చెప్పినప్పుడు మా కత్యంతసహాయసంపన్నత్వంబు మీ
రు చేసినట్టి దయ్యె మే మవలీల సముద్రంబు దాఁటి లంకఁ ద్రికూటాచలంబు
తోఁ బెఱికి పేటాడం జాలుదు మిట మహావీరవానరులు విష్ణురుద్రపరాక్ర
ము లైనమహాకపికోటులు నున్నారు మే మింక సముద్రలంఘనగమనోద్యోగం
బు సేసెద మని పలుక విని సంపాతియు నధికజవంబున మింటికి నెగసె నా
సమయంబున.

757

క.

[22]గగనంబున కి ట్లెగయుచు, ఖగపతి యంగదునితోడ గ్రక్కున మీరల్
జగతీసుతవృత్తాంతము, నెగడెద రని పలికి చనియె నిజగృహమునకున్.

758


వ.

అని పలికి సంపాతి పోయిన నంగదుండు కపులం గనుంగొని మన మింక సంపా
తి చెప్పినమార్గంబునఁ గడలి దాఁటి పోవుద మనుచు సకలవానరవీరులతోడ
దక్షిణసముద్రతీరంబున నున్న యగ్గిరి యెక్కి యచట నాసీను లై సింహనం
ఘంబులపగిదిఁ గొంతదడ వుండి యట దక్షిణసముద్రంబునుత్తరభాగంబున
నవ్వానరవీరులు.

759


సీ.

జగములు ముంపంగ సమకొన్నకైవడి, నుద్వేలముగ నుబ్బుచున్నదానిఁ
బాతాళనాగముల్ పైఁ దేలి యాకాశ, గంగలో విహరింపఁ గడఁగుదాని
నింగి మ్రింగెడుభంగి నెగయుసముత్తుంగ, భంగసంఘంబులఁ బరఁగుదానిఁ
గూలంకషాటోపకుటిలతరగ్రాహ, బడబాగ్నిఘోర మై ప్రబలుదాని
నురుఘనధ్వని నుడుగక మొరయుదాని, నాతతావర్తభీకర మైనదాని
నిబిడవర్షధారాపూర్ణనిఖిలసింధు, భూరిజలసముత్సేధి నంభోధిఁ జేరి.

760


క.

కొందఱు శైత్యము నొందిరి, కొందఱు కూర్చుండి రచటఁ గొండఱు భయముం
జెంది విషాదము నొందిరి, కొండఱు నిశ్చేష్టు లైరి కొందఱు ప్లవగుల్.

761


వ.

అప్పు డంగదుండు వారలభయం బెఱింగి వెఱవకుం డనుచుఁ బలికి యెల్లి వారి
రాశి దాఁటుద మీరాత్రి యిచట నిద్రింపుండు నెమ్మది నని బుజ్జగించి యారా
త్రి యచటఁ బుచ్చి మఱునాఁ డరుణోదయంబున సకలవానరవీరులుఁ బరి వేష్టించి
కొలువ నాగిరితటంబునఁ గూర్చుండి విషణ్ణు లైన వానరులం జూచి యంగదుం
డి ట్లనియె.

762


ఉ.

శోకముఁ బొందు నేఘనుఁడు శోకము కాలవిషంబు శోక ము
ద్రేకముఁ బొంద మానస మతివ్యథ పాల్పడు శోకమగ్నునిం
బైకొని చంపుఁ గ్రూరఫణి బాలునిఁబోలెను శోక మాత్మలోఁ
జేకొనువానికిం బరఁగఁ జెల్లునె చేయఁ బరోపకారముల్.

763


వ.

కావున శోకం బుడిగి వినుండు.

764


ఉ.

ఎవ్వఁడు రామమోదకరుఁ డెవ్వఁడు భానుజవాక్యపాలకుం
డెవ్వఁడు వార్ధి దాఁటఁగలఁ డెవ్వఁడు లంకఁ జొరంగ నోపువాఁ
డెవ్వఁడు కీశదుఃఖహరుఁ డెవ్వఁడు జానకిఁ జూచి వచ్చువాఁ
డెవ్వఁడు రామలక్ష్మణకపీంద్రులఁ జేరుచు మమ్ము నెమ్మదిన్.

765


క.

వననిధి నవలీలం గడ, చనువానిప్రసాద మొంది సతులు గృహంబుల్

ధనములు నఖిలసుఖంబులు, మన మారం గాంతు రొలి మర్కటు లెల్లన్.

766


వ.

అని పెక్కుభంగులం బలుక నఖిలవనచరులు నతనిపలుకుల కిచ్చగింపక ఱిచ్చవడి
యున్న మఱియు నావనచరయూథపులం గనుంగొని.

767


చ.

జనపతి సీత కి మ్మనుచు సమ్మతి ముద్రిక యీఁడె లంకలో
జనకజఁ జూచి రం డనుచు సారసబంధుసుతుండు పంపఁడే
పనివడి లంకఁ జొత్తు మని [23]పైబడి తా రిట వచ్చి యిప్పు డీ
వననిధిఁ జూచి భీతిగొని వానరు లూరక యుండఁ బాడియే.

768

అంగదాదులు సముద్రంబు దాఁటఁ దమకొలందు లెఱింగించుట

వ.

ఇంక మీర లీసముద్రంబు దాఁట సమర్థులు గారె వనచరపుంగవులగు దృఢ
పరాక్రములరు నభంగగమనులరు నతిప్రఖ్యాతులరు మీ రెంతంతమేర సముద్రం
బు దాఁట నోపుదురు చెప్పుఁడు.

769


సీ.

అని యంగదుఁడు పల్క నగచరవీరులు, దమతమసత్త్వముల్ దలఁచిచూచి
గజుఁడు యోజనదశకంబు గవాక్షుఁ డ, త్యుద్ధతి నిరువదియోజనములు
శరభుండు గడఁకఁ ద్రింశద్యోజనంబులు, ఋషభుఁ డన్కపివీరుఁ డేపుతోడ
నలువదియోజనములు గంధమాదనుఁ, డోపిక నేఁబదియోజనములు
నురుగతిని మైందుఁ డఱువదియోజనములు, నోజ ద్వివిదుండు డెబ్బదియోజనములు
నురవడిని దారుఁ డెనుబదియోజనములు, జలధి దాఁటఁగఁ గల మని పలికి రపుడు.

770


వ.

అ ట్లందఱు కపులుఁ బలుక వారలం జూచి మారుతసమానవేగుండును ధార్తరా
ష్ట్రసమజవాధికుండును నతిప్రాజ్ఞుండును శతవృద్ధును నైనజాంబవంతుండు నా
పూర్వవృత్తాంతంబు వినుం డని యి ట్లనియె.

771


క.

గరుడుఁడు పుట్టనికాలము, సుర లమృతము ద్రచ్చుటయును సురలును దైత్యుల్
దురములు గావించుటయును, బరువడిఁ గన్నాఁడ మున్ను బహువారంబుల్.

772


వ.

అట్లు గాన బహుకాలంబునాఁటివృద్ధను జవసత్త్వంబు లడంగియున్నవాఁడఁ
బిన్ననాఁటిబలపరాక్రమంబు లిప్పుడు చెప్ప వచ్చిన మహాహాస్యాస్పదం బై యుం
డు నైనం జెప్పెద నాకర్ణింపుఁడు.

773


సీ.

విక్రమం బెసఁగఁ ద్రివిక్రమదేవుండు, విక్రమత్రయమున విశ్వధరయు
మేదురగతి [24]నాక్రమించినప్పుడు భక్తి, యమర నాఱుప్రదక్షిణములు చేసి
వరుస సుషేణుతో నిరువదియొకసారె, లీలఁ బ్రదక్షిణ మోలిఁ జేసి
సురలకు మునులకుఁ జోద్యంబుఁ బ్రీతియు, నమరించితిని బలియజ్ఞవేళ
నిచ్చ నోషధుల్ నాచేతి కిచ్చునప్పు, డమరులను వేఁడి త్రాగితి నమృత మేను

గాన నాఁ డతిసత్త్వంబు గలదు నాకు, నిద్ధశక్తి నా కెవ్వరు నీడు గారు.

774


క.

తరుణవయోవేళను నే, నరుదుగ నుదయాద్రినుండి యస్తాద్రికి స
త్వరగతితోడం జని మఱి, హరుగిరి కేఁగి విబుధాలయమునకుఁ జనుదున్.

775


క.

అతివృద్ధి నిప్పుడు జరా, తతభారము నొంది నాఁడఁ దరుణత్వసమం
చితబలమును జవమును స, న్మతియును దరుణత్వమంద మఱి యవి గలవే.

776


వ.

ఒక్కనాఁడు కైలాసపర్వతసమీపంబున నగ్నితేజు లైనఋషులు యజ్ఞంబు సేయ
నయ్యజ్ఞంబు సూడఁబోయి యమ్మునులతో భాషించి యచటం గూర్చుండితి నంతఁ
గుపితమృత్యువుంబోలెఁ జంప నిశ్చయించుబలిపుత్రుం గంటి నాపర్వతహంత
యగుదైత్యుం డిరుచేత నెత్తి యొక్కపర్వతంబు వైచె నప్పర్వతంబు వడి నేతేర
జానువున నాపర్వతంబు పగిలించితి నది గారణంబుగ జానువు భగ్నం బైనం
గుంటనై శిథిలవిక్రముండ నైతి నిప్పుడు జరాక్రాంతుండను బలహీనుండనుం
గాన మిగుల దాఁటం జాలం దొంబదియోజనంబు లోపుదు నటమీఁద సందే
హం బని జాంబవంతుండు పలుక విని నలుండును దొంబదియోజనంబులు దాఁ
టెద నని పలికె నప్పు డాంజనేయుండు తనపౌరుషం బేమియుం బలుక కూర
కుండె నప్పుడు జాంబవంతుం గనుంగొని.

777


క.

తనలావు దలఁచి తారా, తనయుం డి ట్లనియె నబ్ధి దాఁడెద శతయో
జనమానము వేగమ మఱి, ఘనజవమున మగిడి రాఁగఁగలనో లేనో.

778


వ.

అనిన జాంబవంతుం డంగదున కిట్లనియె.

779


క.

లీలను యోజనశతమును, గాలిగతిన్ వార్ధి దాఁటి క్రమ్మఱ వే రాఁ
జాలుదు బలవేగంబుల, వాలికి సరివత్తు వీవు వాలితనూజా.

780


చ.

అలవున వాలి యోజనసహస్ర మతిత్వర దాఁట నోపు నా
కొలఁదిజలాధికుండు కపికుంజర భానుసుతుండు నీవు న
య్యలఘునియంతవాఁడవు సమర్థుఁడ వెంతకు నైన వానరా
వలి నిను వాలిఁబోలెఁ గొలుకవంగల రేల విచార మియ్యెడన్.

781


మ.

ప్లవగస్వామివి వాలిపోలెఁ గపులం బాలింప శిక్షింపఁ గ
ర్తవు నీయాజ్ఞఁ జరించువార మరియుక్తప్రేష్యభావంబునన్
భవదిచ్ఛాగతి మమ్ము నెల్లపను లొప్పం బంచి చేయింపు రా
ఘవుదేవిన్ వెదకంగ నేము గలుగంగా నీకుఁ బో నర్హమే.

782


వ.

అంగద నీవు వోయిన మా కొడయం డెవ్వఁడు మాకు ది క్కెక్కడిది నీవు మాకు
మూలంబు నీ కేము శాఖాపుష్పఫలంబులవంటివారము మూలంబు లేక శాఖా
పుష్పఫలంబులు గలవె నీవు మాకు గురుండవు గురుపుత్రుండవు రాజవు నీదాసు
లము నెమ్మది నుండి నిన్ను బోనీఁజాలము నిన్నుఁ బురస్కరించికొని సర్వకార్యముల
మేను సాధించెదము మేము లేక నీకు లంకాప్రాపణంబు సేయ నశక్యం బనిన

నంగదుం డి ట్లనియె.

783


సీ.

ధరణిజ వెదకక తనయాజ్ఞఁ దప్పిన, నినజుఁ డప్పుడ పట్టి మనలఁ జంపుఁ
సతికల్మిలేములు నన నిశ్చయింపక, సంశయంబునఁ బోవఁ జాలఁ గినిసి
పొం డని వెదకంగఁ బుత్తెంచుఁ గ్రమ్మఱ, నింతి లేదని నిశ్చయించి పోవఁ
గరుణఁ గాచినఁ గాచుఁ గాన జానకి వార్త, నిజముగా నెఱుఁగక నీరజాప్త
తనయునొద్దకుఁ బోరాదు మనకు నిచట, నొనరఁ బ్రాయోపవేశంబు నొందుటొండె
వనధి దాఁటి జానకిఁ జూచి వచ్చుటొండె, వలయు మఱి యొండుమార్గంబు వలను గాదు.

784


ఉ.

ఏను బయోధి దాఁటి బల మింకక లంకకుఁ బోక రాముతో
జానకివార్త యే మనుచు సమ్మతిఁ జెప్పుదు నూర కేఁగి యా
భానుజుచండదండముల పాల్పడి చావఁగఁ జాల వేగ మె
ట్లైనఁ బయోధి దాఁటి వసుధాధిపువల్లభఁ జూచి వచ్చెదన్.

785


క.

అన విని ముకుళితకరు లై, వనచరవిభు లెల్ల నపుడు వాలితనూజుం
గనుఁగొని వననిధి దాఁటఁగ, మనకును శక్యంబు గాదు మదిఁ దలపోయన్.

786


క.

నిను వాలిఁబోలెఁ జూచుచు, ననిశము నీతోడఁ గూడ నందఱు సుఖ మై
నను దుఃఖ మైనఁ బొంచెద, మినజుం డే మైనఁ జేయనిమ్ము కపీంద్రా.

787


చ.

అనవుడు జాంబవంతునకు నంగదుఁ డిట్లను సారబుద్ధి వీ
వనఘ సమస్తకార్యములు నారసి కానఁగ నేర్తు రామభూ
జనపతి యాత్మలో నలర జానకిఁ గన్గొని కార్యసిద్ధితో
ననువుగ వేగ రాఁ గలయుపాయము మా కెఱుఁగంగఁ జెప్పవే.

788


క.

అని పలుక జాంబవంతుం డను నంగదముఖ్య వానరానీకముతో
మనపూనిక సేయంగల, ఘనుఁ జెప్పెదఁ బలుకు లుడిగి కపు లుండుఁ డొగిన్.

789


వ.

అని పలికి.

790

జాంబవంతుండు హనుమంతుం గొనియాడుట

చ.

రామహితంబు సేయఁ గపిరరా జగుభానుజుపం పొనర్ప ను
ద్దామజవంబునన్ జలధి దాఁటఁగ లంక సొరంగ దక్షతన్
భూమిజఁ జూచి రాఁ గలుగు భూరిపరాక్రమశాలి వానర
గ్రామణి వాయునందనుఁడు గల్గఁగ నేరికిఁ జింత యేటికిన్.

791


వ.

అని పలికి జాంబవంతుండు హనుమంతుం గనుంగొని.

792


ఉ.

మారుతి నీదుకృత్యములు మాపయిఁ బెట్టి తొలంగి లీలతో
నూరక యున్నవాఁడవు పయోనిధి దాఁటఁగ మావశంబె వి

స్ఫారతరప్రతాపమున నత్త్వబలంబుల [25]శౌర్యబుద్ధులన్
భూరితరోగ్రతేజమునఁ బోలుదు రాఘవభానుసూనులన్.

793


క.

గరుడునికంటెను జవమున, శరనిధి దాఁటంగఁ బెక్కుసారులు విను మ
గ్గరుడునిపక్షములకుఁ గల, పరుషత్వము గలదు నీదుబాహుద్వయికిన్.

794


చ.

లలితవిలాసరూపశుభలక్షణశోభిత యైనపుంజిక
స్థల యనునప్సరోవనిత శాపముచేతఁ బ్లవంగకాంత యై
చెలువుగ నంజనాహ్వయము చేకొని కేసరిపత్ని యయ్యెఁ బెం
పలరఁగఁ గామరూపిణి యొకకప్పుడు వొల్చు మనుష్యకాంత యై.

795


క.

కనకఖచితమణిగణఘృణి, కనదాభరణప్రసూనగంధాంబరశో
భిని యై యొకనాఁ డంజన, ఘనశైలాగ్రమున లీలఁ గ్రాలుచు నుండన్.

796


మ.

అనువృత్తోరులు కుంభికుంభనిభరమ్యశ్రోణియున్ సంచల
త్తనుమధ్యంబును నిమ్ననాభియును ముద్యచ్చక్రవాకాంచిత
స్తనభారంబును దర్పణోల్లసితకక్షద్వంద్వముం గాన రా
ననిలుం డంజనమేనిచేలఁ గడుసిగ్గారం దొలంగించినన్.

797


వ.

అప్పుడు సర్వాంగలావణ్యగణ్య యైనయంజనాదేవిం గనుంగొని.

798


క.

మనసిజశరగోచరుఁ డై, యనిలుఁడు దమకంబుతోడ నంగన నాలిం
గన మొనరింపఁగ నయ్యం, జన సంభ్రమ మడరఁ గోపసంభృత యగుచున్.

799


క.

నాపాతివ్రత్యోన్నతి, చాపలమునఁ జేసి చెఱుప సమకట్టినవాఁ
డేపురుషుండో యనవుడు, నాపవనుం డుచితభంగి నాసతితోడన్.

800


క.

సతి నీతో మానససం, గతి చేసితి దీన నీకుఁ గల్యాణమ దు
ష్కృతి సెంద దేకపత్నీ, వ్రతహీనవు గావు వెఱకు రాగం బొప్పన్.

801


క.

అనుపమబలవేగంబులు, ఘనతరవిక్రమముఁ గామగమనము ధైర్యం
బును మఱియుఁ గామరూపం, బును గలిగెడునట్టిపట్టి పుట్టెడు నీకున్.

802


చ.

అని పవనుండు పల్కి చనె నంజనతో భుజశక్తి వాసి కె
క్కినకపిలోకముఖ్యుఁ డగు కేసరి కారయ క్షేత్రజుండ వా
యనిలున కౌరసాత్మజుఁడ వాతతవేగమహాబలంబులం
[26]దనిలునిఁ బోలువాఁడ వనిలాత్మజ వానరవంశదీపకా.

803


సీ.

బాలవయోవేళ బాలార్కబింబంబుఁ, గనుఁగొని ఫల మను కాంక్షఁ బెక్కు
వేలయోజనములు వెస మింటి కెగసి చం, డాంశురోచులవేఁడి నంగ మెరియఁ
గడువిషాదించుచు గగనంబుపై నుండి, హనువు భగ్నము గాఁగ నద్రిమీఁద
నతిరయంబునఁ బడి తది గారణంబుగ, హనుమంతుఁ డనునామ మమరఁగంటి

విద్ధబలుఁడవు ఖగకులాకధీశుకంటె, నధికజవసత్త్వయుక్తుఁడ వరయఁ జిత్ర
మైననీవిక్రమముఁ జూడ నాసతోడ, నెదురుచూచుచు నున్నవా రెల్లకపులు.

804


క.

క్షోణిజఁ గని వచ్చి జగ, త్ప్రాణజ రఘువంశవరులప్రాణంబులు మా
ప్రాణంబులు సుగ్రీవుని, ప్రాణములుం గావు నీవ ప్రాణము మాకున్.

805


ఉ.

కావున నీవు రామహితకార్యము సేయఁగ నబ్ధి దాఁటి యా
రావణులంకఁ జొచ్చి మఱి రాఘవువల్లభఁ జూచి రమ్ము సు
గ్రీవుఁడు సంతసింప మము క్షేమముతోఁ గొనిపొమ్ము లోకసం
భావితకీర్తిఁ బొందు మిఁక బంధురధర్మముఁ బొందు పావనీ.

806


వ.

అని పలుకునప్పుడు.

807


మ.

గిరిరుద్ధాంఘ్రులు మింటితో నొఱయ [27]వాక్షేపించులాంగూలముం
దరుణాదిత్యవిధూమసావకసముద్దామాననంబుం గరం
బరు దారంగఁ ద్రివిక్రమక్రమసముద్యన్మూర్తి యై దృప్తకే
సరివిస్రంభవిజృంభణం బెసఁగఁ గీశశ్రేణి యగ్గింపఁగన్.

808

హనుమంతుఁడు నిజజననవృత్తాంతంబు వానరులతోఁ జెప్పుట

వ.

పున్నమఁ గడలొత్తి యుప్పొంగుసముద్రంబునుంబోలె మేను వొంగ బలోత్సా
హంబు లంతకంత కెసఁగ హనుమంతుండు వనచరులతో నిట్లనియె మజ్జననీజన
కులవృత్తాంతంబును మజ్జన్మక్రమంబును వినుండు పశ్చిమసముద్రంబుచెంత ముని
జనసేవ్యం బైనప్రభాసం బనుపుణ్యతీర్థంబు గల దెప్పుడు మును లాతీర్థంబున
నవగాహనంబు సేయం జొత్తు రప్పుడు [28]శంఖశబలనామంబులు గలదుష్టగజం
బులు రెండు కోపాటోపంబున దుష్టమానసంబు లగుచు నాఋషులం బొడగని
పడం బొడుచుచు నుండు నవి యొక్కనాఁడు మునిపూజితం బైనపుణ్యవనం
బుఁ జొచ్చి యచ్చట నున్న భరద్వాజుపైఁ గవియ నచటఁ బర్వతకూటంబున
నున్న మజ్జనకుం డక్కుంజరంబుల బొడగని రోషావేశంబున.

809

,

చ.

బలువిడి నార్చుచున్ గజముపై గజముం బడవైచి పెన్నఖం
బుల వడి వానినేత్రములు భూరిరయంబున వ్రచ్చి యంతలో
నిలకు రయంబునన్ డిగి యహీనబలంబున నొక్కసాలమున్
లలిఁ బెకలించి పట్టి కడులావున వ్రేసి వధించె నొక్కటన్.

810

వ.

[29]అ ట్లగ్గజంబులం జంపిన భరద్వాజుండు సంతసిల్లి మునులకడ కేతెంచి మజ్జనకుం
జూపి యీకపిరాజు మనధర్మవిరోధు లైనకుంజరంబుల వధియించెఁ గుంజరసూద
నుండు గావునం గేసరి నాఁ బరఁగు నీతఁ డితనికిం బ్రియం బైనవరం బిం డనిన
నమ్మును లతనిం గనుంగొని.

811


క.

దురమున భీకరముగ నా, కరులం జంపితివి గాన గరము ప్రియం బే
వర మిట నడుగుము నావుడుఁ, బరమప్రియ మంది నాకుఁ బ్రమదం బెసఁగన్.

812


క.

అనిలబలసముఁడు నవ్యయ, తనుఁడును గామగముఁ డిద్ధతరజవసత్త్వుం
డును గామరూపియును నగు, తనయుఁడు గలుగ వర మిండు తాపసవర్యుల్.

813


వ.

అనిన నమ్మును లట్ల వరం బిచ్చి రంత నొక్కనాఁడు.

814


క.

కుంజరుఁ డనియెడువానర, కుంజరునితనూజ చారుగుణరూప మనో
రంజన పుణ్య యనం జను, నంజన మాతల్లి లీల యౌవనవేళన్.

815


చ.

జలధిజలాభిషేచనము జానుగఁ జేసి జలార్ద్రకేశి యై
మలయగిరీంద్రశృంగమున మానస మింపఁ జరింప నంజనా
లలితశరీరయౌవనవిలాసము లారఁగఁ [30]గౌఁగిలించి య
త్యలఘుతరానురాగమున నాసతిఁ జూచి సమీరుఁ డిట్లనున్.

816


వ.

అంగన నే నఖిలప్రాణులకుఁ బ్రాణుండ నైనజగత్ప్రాణుండ సంగజశరచ్ఛిన్నమాన
సుండ నై భవదీయాలింగనంబునుం జేసితి మదీయాంగసంగదోషంబు నీకు
లేదు నావలన నీకు వానరరూపుండును మహాజవుండును నధికుండును సౌమ్యుం
డును నగ్నితేజుండును మదీయసమవేగబలశాలియు నగుపుత్రుండు పుట్టెడు నని
పలికె న ట్లయ్యంజనాదేవికి జనియించితిఁ గేసరికి క్షేత్రజుండ ననిలున కౌరసపు
త్రుండను గావునఁ బవనగమనవేగంబున నాకు సమానుం డెందును లేఁ డని
పలికి వీరరసావేశంబున.

817


సీ.

అస్మద్భుజోరువాతాతివేగమున నం, భోనిధిగ్రాహముల్ మూర్ఛఁ బొంద
విఱిగి పాదపశైలవిపులశృంగమ్ములు, నెగసి యాకస మెల్లఁ బగుల నడువ
వడిఁ గులాచలములు వడవడ వడఁకంగ, జగతీతలం బెల్ల సంచలింపఁ
దోయదమాలికల్ దూలి నల్గడఁ బాఱ, సకలదిక్కులు మ్రోయ జగము బెగడ
వీఁక జలరాశి యవలీల వేగ దాఁటి, లంక నిశ్శంకతోఁ జొచ్చి లలితపుణ్య
సీతఁ బొడగాంచి కృతకార్యసిద్ధితోడ, నరుగుదెంచెద ముద మొందుఁ డఖిలకపులు.

818


చ.

వనధిఁ గలంచెదం బుడమి వ్రక్కలు సేసెద నింగి మ్రింగెదన్
ఘనతరశైలముల్ వెఱికి క్రన్నన నూడ్చెదఁ గాలమృత్యువున్

దునిమెద మేరువున్ విఱుగఁ ద్రోచెద శేషునిఁ బట్టి నుల్చెదన్
వనజభవాండముల్ పగులవైచెద దాఁటెద నేడుదీవులన్.

819


క.

సరసిజహితుఁ డురుజవమున, నరుదుగ నొకమాటు దిరుగునంతటిలో ని
ర్జరనగము వేయిమాఱులు, దిరిగెద నత్తరణిఁ గడచి దృఢగతితోడన్.

820


క.

గగనముననుండి యురవడి, ఖగతతి పుడమిఁ బడుచుండఁగా వేమాఱుల్
ఖగపతిఁ గడవఁగఁ బఱచెద, జగములు నాజవముఁ జూచి సంస్తుతి సేయన్.

821


క.

పారావారము నవ్వలి, పారమునకు దాఁటి నిలువఁబడక మగిడి యీ
పారము మగుడన్ దాఁటి య, పారమతిం బాఱుదేరఁ బటుజవశాలిన్.

822


మ.

అరుదారం బదివేలయోజనము లుద్యచ్ఛక్తిమై దాఁటెదన్
ధరణీపుష్కరచక్రముం దిరిగెదన్ దంభోళివీర్యత్వరం
గరయుగ్మంబున ఋశ్యమూకమును లంకాద్వీపముం బట్టి
త్వరభంగిం గొనివచ్చి యిచ్చటనె సీతారాములం గూర్చెదన్.

823


క.

శరనిధి నున్నభుజంగము, నిరవుగఁ బక్షములనడుమ నిడుకొని గరుడుం
డురుగతిఁ దెచ్చువిధంబున, నురవడిఁ దెచ్చెనను లంక నున్నమహీజన్.

824


వ.

అని పలికి.

825


శా.

లాటీచందనచర్చ చోళమహిళాలావణ్యసామగ్రి క
ర్ణాటీగీతకలాసరస్వతి కళింగాంతఃపురీమల్లికా
వాటీమంజరి గౌడవామనయనావక్షోజహారాలి యై
పాటింపం దగునీదుకీర్తి రధినీపాలాగ్రణీ సాహిణీ.

826


మాలి.

సురనుతపదపద్మా శుద్ధవిజ్ఞానిసద్మా
హరిణకలితహస్తా యాపగాసిక్తమస్తా
హరిహయసురరమ్యా యంచితధ్యానగమ్యా
స్ఫురదురుగిరిచాపా పుణ్యవీథిస్వరూపా.

827


గద్యము.

ఇది శ్రీమదష్టభాషాకవిమిత్ర కులపవిత్ర భాస్కరసత్కవిపుత్ర మల్లికా
ర్జునభట్టప్రణీతం బైనశ్రీమద్రామాయణమహాకావ్యంబునఁ గిష్కింధాకాండము
సర్వంబు నేకాశ్వాసము.

828
  1. వెలువంగ ననుచు
  2. పురుషావృతుఁడు సహస్రపురుషహరుఁడు
  3. ఋశ్యమూకమున కందువఁ జేయిడి యగ్ని
  4. తారాభనయనమనోజ్ఞతారావిలస, త్తారా
  5. శిబికల, సూక్ష్మత్వర లుడిగి వినయ.......బక్ష్మావిలాక్షుఁ డై
  6. చారణామ, రాప్సరోగణ
  7. దేశకాలహితసంక్రమవృత్తియు
  8. ఇనజుం డతిబలవేగుల, హనుమంతప్రముఖకపుల నవనీతనయం
    జని వెదకఁ బనిచి సమ్మతిఁ
  9. మస్తస్థానములు నీ కమర
  10. వ. అని మఱియును.
    క. ఇనజుఁడు సుషేణుఁ బడమటి,
  11. న్మలలితహేమతచ్ఛరవణంబు
  12. నిత్యసౌఖ్య
  13. భూవివరంబులలోన శైల
  14. .....జాలింపు సుగ్రీవ యీ
    తనికిం...
  15. కట్టి భ
    ర్జన లొనరించి
  16. గొనుమతము దలఁచి
  17. మధురింపన్
  18. పరఁగం బ్రాణము తల్లివెంట మధురింపం బోవు
  19. లాలయముదాఁకం
  20. జొచ్చె నాసమయమునన్.
     వ. ఇట్లు క్షణమాత్రం బుండి వెడల నేతెంచి
  21. వ. అని పలుక నంగదుండు సుపార్శ్వుం జూచి నీ వధికబలశాలి వవార్యవేగుండవు నగుదు నీవాక్యంబులకు సంతోషించితిమి మాతండ్రియు నీవు నెమ్మది నుండుఁడు మున్నె యేము విన్నారము సీత లంకలో నునికి నవలీల సముద్రంబు దాఁటి లంకఁ ద్రికూటాచలంబుతోడం బెఱికి పేటాడం జాలుదుము...పా.అ.
  22. క. గగనంబున క ట్టెగసిన, ఖగపతి నంగదుఁడు చూచి కవుల మనుప నీ
        ఖగపతి సీతావృత్తము, నెగడఁగ వినిపించి చనియె నిజగృహమునకున్.
    వ. అని పలికి యంగదుండు వనచరులార మన మింక.....నవ్వానరవీరులు, పా. అ.
  23. పైఁజులతో నిట వచ్చి
  24. నాక్రమించిన యామితి, కమర
  25. శౌర్యబుద్ధులున్
    నారయ సర్వభూతములయంతటికంటె ఘనుండ వెంతయున్
    భూరిబలోగ్రతేజమునఁ బోలుదు రాఘవభానుజాదులన్.
  26. దనిలునితోడిసామ వనిలాత్మజ
  27. నుత్క్షేపించు
  28. ఇట హనుమంతుఁ డొక్కగజమునే చంపినట్లు వ్రాఁతప్రతులఁ గానఁబడుచున్నది. కాన
    శంఖశబలనామకం బగుదుష్టగజంబు.......దుష్టమానసం బగుచు నాఋషులం........నది యొక్కనాఁడు మునిపూజితం........డక్కుంజరంబుఁ బొడగని ....
    చ. బలువిడి ..... గజముపైఁ గవియం బటుతీవ్రతన్ నఖం
    బుల వడి దానినేత్రములు భూరి......లావున వ్రేసి వధించె నక్కరిన్.
  29. వ. అ ట్లగ్గజంబుఁ జంపిన.......ధర్మవిరోధి యైనకుంజరంబు వధియించె......
    క. దురమున నక్కరిఁ జంపితి గాన నీకుఁ కరము
    అని పాఠ మున్నది.
  30. జూచి మానసం, బలరఁగఁ గౌఁగిలించికొని యాసతిఁ