భారత అర్థశాస్త్రము/మొదటి భాగము - పదునాల్గవ ప్రకరణము

పదునాల్గవ ప్రకరణము

సమర్థత నతిశయింపజేయు మార్గములు

దేశముయొక్క అర్థార్జనశక్తి యుద్దీపించుటకు గారణము పూర్వోదిత ప్రకృతి శ్రమ మూలధనంబు లధికసమర్థము లగుటయే. ఏకదర్థం బేర్పఱుపబడిన విధానముల విశదీకరింతము.

ప్రకృతి

ప్రకృతిం గూర్చిన విషయములు కొన్ని మున్నే చర్చింప బడియె. స్వభావసిద్ధముల గణ్యతంబట్టిచూడ నిందు భూమి మొదటిది.

భూమి నెక్కువ ఫలవతిగా జేయుమార్గములురెండు. వైశాల్య సారాతిశయములను గల్పించుట.

సారాతిశయముంగూర్చి ముందేవ్రాసితి. ఇంకను విస్తరించుట కిది వ్యవసాయశాస్త్రముగాదు.

వైశాల్యాతిశయము ననుసంధించు పద్ధతులు రెండు:-

1. సముద్రముచే నాచ్ఛాదితములగు భూముల నాక్రమించు కొనుట. హాలెండుదేశస్థులు 'జైడరు' అను సముద్రశాఖను సేతువు గట్టి కొలనుగాజేసి పిమ్మట నానీటిని యంత్రములతో వెడలజల్లి శతసహస్ర సంఖ్యగల యెకరములభూమి సంపాదించిరి.

2. ఇంకను సాగుబడిక్రిందికిరానిభూములు సాగుబడికిదెచ్చుట. నేలలు దుక్కికిరామికి హేతువేమన్నను నీటిపాఱుదలలేమి, మితిమీఱినయూట, చవుడు, పొదలుబలిసికప్పివేయుట, అల్పజనసంఖ్య ఇత్యాదులు. ఈ దేశములో జనసంఖ్య యేనాటికిని కొఱతనొందదు. పంజాబులో గవర్నమెంటువారు అక్కడ బ్రవహించు నదులనీరు వ్యర్థముగ సముద్రమునకుంబోనట్లు కాలువల ద్రవ్వించి, వేలకొలది ఎకరాలు నూతనముగ నుత్పత్తికివచ్చునట్లుచేసి, సేనలలో చక్కగా పనిచేసి రాజసేవజేసినవారికి వారియాశ్రితులకును విభజించి యొసంగి, వారెక్కడ నాచారప్రకార మప్పులపాలై సాహుకారులకు అడమానం పెట్టుదురో యనుశంకచే నటుచేయ స్వాతంత్ర్యమియ్యక వారి యోగ క్షేమముల నరయుటకు విచారణకర్తనొకని నేర్పఱిచి ఇంతింతనరాని మహోపకారము గావించిరి. ఆసాము, మైసూరు, కొడగు, కొచ్చి, తిరువాన్కూరు ఈ ప్రాంతములలో క్రొవ్వుకారునట్లు బలసిన భూములున్నవిగాని యవి వనావృతములౌటయు పర్వతపరిసరమ్ములం దుంట యుంజేసి మనవారు వానిపొంతకుంబోరైరి. ఇప్పుడు తెల్లజాతివా రించుమించుగ నీభుములన్నిటిని స్వాధీనముచేసికొని కాఫీ, తేయాకు, మిరియాలు, జాపత్రి, రబ్బరు ఇట్టి యనర్ఘవస్తువుల నుత్పత్తిజేసి యపారలాభంబువడయుచున్నారు. పంజాబులో జీవనదులు కాలువలు వీనిచే బోషింపబడు నేలలున్నవియని యంటిమిగదా! వానినిగూడ నింగ్లీషువారు సుమా రైదారునూఱ్లలక్షలకు గొనవలెనని చూచిరి. కాని గవర్నమెంటువారు అదికూడదని వాదించిరి. వీనిమీద గన్ను వేయుటకు గారణమేమన, ఇచ్చోట గోధుమలు కొల్లలుగ బండు చున్నవి. మనకు వరియెట్లో గోధుమలు వారికట్లు. ఇప్పటికిని బంజాబు నుండి యాదేశమునకు గోధుమలను విశేషించి ఎగుమతి జేసెదరు. అట్టిప్రదేశము తమయధీనములోనేయున్న నింకను మంచిదిగదాయని కొనజూచిరి. కావున నిదిసహజమును సకారణమునైన ఎన్నికయేయని చెప్పవలయు.

ఈదేశవైశాల్యములో సుమారు దశమభాగమింకను గన్యావస్థలోనే "నాథులెన్నడు వత్తు" రని వేచియున్నది. ఇప్పటిధరల ప్రకారము లాభకరము గాకపోయినను దినక్రమేణ భూమిలోనుండి తీయబడు వస్తువులవెలలు మేలిమిజెందుగాన ఉపేక్షతగదు. ఇవియు బరులపాలవునేమో! శీతలములైన పార్వతసీమలంగాని యూరోపి యను లంతగా బ్రవేశింపరు. సూర్యప్రభావ ముద్ధతముగ నున్నచోట వారు మనతో బ్రతిఘటింపజాలరు. కావుననే యుండబోలు మనదేశమున ననేకులకు సూర్యవంశజులనిప్రసిద్ధి! ఇదియు మనకు గొంత మేలే. ఐరోపావారు ఇట్లు కొన్నినేలలు గైవసము చేసికొన్నందున దేశమునకు మొత్తముమీద మేలా కీడా యను విషయము విచార్యము. మొత్తమున మేలనుటయేసరి. ఎట్లన బీడుపడిన నేలలు సస్యాఢ్యము లైనవి. అందుచే గూలినాలిచేసి బ్రదుకువారికి జీవనంబు దొరకినది. వాణిజ్యవ్యాపారములు వ్యాప్తములాయె. విదేశమునుండి తేబడిన మూలధన మీదేశమున వినియోగింపబడియె.

ఇక నష్టములనబడునవేవియన; మనకీయెడ యజమానత్వము లేకపోవుట యొకటి. అవునుగాని ఆయని నోరుతెఱచికొని కూర్చునియున్న యజమానత్వము తనంతటవచ్చి నోటిలోబడునా? ఈనేలలు పరాక్రమముచే నాక్రాంతములుగావు. సాధారణముగ నందఱితో సమానములయిన దరఖాస్తులచే లబ్ధములుగాన నూరక కుయ్యిడనేల?

వచ్చిన లాభమంతయు నింగ్లాండునకు బంపబడెడు ననుట రెండు. నిజమేకాని కష్టించి గడించినవారు పిళ్ళారులరీతిని కదల మెదల లేకుండువారికి సర్వము నైవేద్యముగా సమర్పించి నోటిలో వ్రేలుబెట్టుకొని పోవుదురా?

మఱియు నిందొక్క విశేషంబు. ఇప్పుడిప్పుడు ఈ నేలల మన వారు వెలకుగొని కొంచెము కొంచెముగ స్వామ్యసిద్ధి బడయు చున్నారు. మంచివెలదొరకిన యూరోపియను లేల అమ్మివేయరు? నిక్కముగ నమ్ముదురు. కావున యూరోపియనులు మనకు ద్రోవ జూపువారేకాని ఆపువారుగారు.

ఇంకను నీదేశములో స్వదేశసంస్థానములుపోగా సాగుబడికి రాని భూముల విస్తీర్ణము (సుమారు సంఖ్యలు)

మద్రాసురాజధానిలో 12 వ భాగము లేక 8868 చతురపుమైళ్ళు
బొంబాయిరాజధానిలో 10 వ భాగము లేక 12485 చతురపుమైళ్ళు
బంగాళారాజధానిలో 9 వ భాగము లేక 19470 చతురపుమైళ్ళు
పంజాబురాజధానిలో 3 1/2 వ భాగము లేక 23180 చతురపుమైళ్ళు
బర్మారాజధానిలో 5 వ భాగము లేక 36484 చతురపుమైళ్ళు
సెంట్రల్ ప్రవిన్‌స్, బీరార్ అను మధ్యపరగణాలు 4 వభాగములేక 23747 చతురపుమైళ్ళు
అసామురాజధానిలో 2 వ భాగము లేక 12258 చతురపుమైళ్ళు
యునైటెడ్‌ప్రావిన్‌స్ రాజధానిలో 6 వ భాగము లేక 16923 చతురపుమైళ్ళు

ఇవి యించుమించు సంఖ్యలనియు, ఈ నేలలలో నిప్పటి ధరల ప్రకారము సాగుబడిజేసిన గిట్టకపోవునవియు జేర్పబడినవనియు దెలియునది.

పంటలు బలముగనున్న సుభిక్షకాలములో ఇంగ్లాండులోనికి దిగుమతియౌ గోధుమలలో 3 వంతులలో నొకవంతు ఈదేశమునుండి పంపబడుచున్నది. అనగా సుమారు నూటడెబ్బదిలక్షల ఇంగ్లీషు బారువులు అన్న (హండ్రడ్‌వైట్) మాట.

ఈదేశములోని (బర్మాతోగూడి) ముఖ్యములగు పంటలు:-

1. ధాన్యములు - వరి, గోధుమ, జొన్న, సజ్జ, మొక్కజొన్న, బార్లి, ఓట్స్, రాగి.

2. పప్పుదినుసులు - ఉలవ, పెసలు, కందులు, ఉద్దులు, అనప, చిక్కుడు, పటాణీ.

3. నూనెగింజలు - సెనగ, నువ్వులు, ఆముదము, ఆవాలు, వేము, ఇప్ప.

4. తోటజాతులు - చెఱకు, అల్లము, పసుపు, కంద, చేమ, గెణసు, ఉరల, వంగ, బెండ, మిరప, ఉల్లి, ముల్లంగి, తెల్లగడ్డ.

5. పీచుజాతులు - ప్రత్తి, జనపనార, కత్తాళి మొదలగునవి.

6. ఇతరములు - పొగాకు, గంజా, గసగసాలు, పోక, తమలపాకు, మిరియాలు, జాజికాయ, తేయాకు, కాఫీ, నీలి. ఇవిగాక పండ్లు కాయలు నానావిధము లుత్పత్తి యగుచున్నవి.

7. అరణ్యములలో దొరకు ముఖ్యవస్తువులు - కొయ్య, ఆకు, తేనె, మైనము, లక్క, గుగ్గిలము, నిమ్మ, కసవు, వూరి ఇత్యాదులు.

గనులు

పంటలకు దరువాత ఖనిజములు ప్రశస్తములు. ఇందును ఉత్పత్తి నానాటికి నెదుగుచున్నది. 1898 వ సంవత్సరములో త్రవ్వబడిన ఖనిజముల రమారమి మదింపు 525 లక్షలరూపాయలు. అదే అయిదేడుల కంతయు అనగా 1903 వ సంవత్సరములో 750 లక్షలకు వచ్చినది. అనగా నూటికి 44 పాళ్ళు వృద్ధియనుట.

(బర్మాతోజేరి) మనదేశములోని ఖనిజముల వివరము:-

1. బంగారు రమారమి వార్షికోత్పత్తి మదింపు 1904719 సవరనులు
2. సీమబొగ్గు రమారమి వార్షికోత్పత్తి మదింపు 1225677 సవరనులు
3. ఉప్పు రమారమి వార్షికోత్పత్తి మదింపు 347897 సవరనులు
4. సురేకారము రమారమి వార్షికోత్పత్తి మదింపు 262603 సవరనులు
5. కిరోసిన్‌నూనె రమారమి వార్షికోత్పత్తి మదింపు 165810 సవరనులు
6. రత్నములు రమారమి వార్షికోత్పత్తి మదింపు 39345 సవరనులు
7. మైకా (అభ్రకము) రమారమి వార్షికోత్పత్తి మదింపు 80120 సవరనులు
8. మెంగసీసు రమారమి వార్షికోత్పత్తి మదింపు 79443 సవరనులు
9. ఇనుము రమారమి వార్షికోత్పత్తి మదింపు 13584 సవరనులు
10. పెన్‌సలుసీసము రమారమి వార్షికోత్పత్తి మదింపు 11931 సవరనులు
11. తగరము రమారమి వార్షికోత్పత్తి మదింపు 6875 సవరనులు
12. తృణమణి (ఆంబర్) రమారమి వార్షికోత్పత్తి మదింపు 362 సవరనులు

ఇత్యాదులు.

ప్రకృతము మనరైల్వేలలో వినియోగింపబడు బొగ్గులలో ముక్కాలు మువ్వీసమునకన్న నెక్కువ స్వదేశోద్భవము. ఈ బొగ్గుయొక్క యుత్తమములైన ఖనులు బంగాళాలోను నిజాము సంస్థానములోనువున్నవి. బంగారునకు ముఖ్యస్థానము మైసూరురాజ్యమునకుం జేరిన 'కోలారు.' పూర్వము హిందువులు థార్వాడప్రాంతములను గోలకొండ సమీపమునను 500 అడుగుల కన్న నింకను లోతైన గనులనుదించిరనుటకు శిథిలములైన వానిజాడల నేటికిని సాక్ష్యమొసగు చున్నవి. అయ్యో! స్వర్ణగ్రహణాదులయందు ప్రాచీనులకు గుశలత లేకపోలేదుగాని అరాజకము, ఉపేక్ష, పూర్వాచారపరాయణత మొదలగు కారణములచే నాకళ ముందునకురాక మొదలంట నశించినది. యూరోపులో నినుమును ఉక్కుగామార్చుటకై ఇటీవలగనిపెట్టబడిన తంత్రములు అగణితశతాబ్దములకుబూర్వమే మనదేశములో బ్రబలి యుండినవి. ఈ జ్ఞాపకములచే నేమిఫలము? వర్తమానమున నించు మించుగ వర్ణనీయ ఖనులన్నియు యూరోపియనుల కధీనములైనవి. వారి వ్యవహారనైపుణియు నుద్యోగాడంబరమునులేకున్న నవి యింకను ముకుళితస్థితిలోనేయుండును.

గనులలో కూలిజేసి బ్రతుకువారిసంఖ్య సుమారు 1,50,000. ఇందులో 90,000 మంది బొగ్గుగనులలోను, 27,000 మంది కోలారు బంగారుగనులలోను పనిజేసెదరు. మైకాలో 9,000 మందియు, మెంగనీసులో 7,000 మంది సరాసరి ప్రతిదినపు గూలివాండ్రు.

మూలధనము

పరిపూర్ణ ప్రయోజనముగా మూలధనంబుం బొనరింపవలయు నన్న అదియెయ్యె. వ్యవహారముల నెంతమట్టునకు గావలయునో యారీతిని కాలవ్రయములేక సమకూర్చు కర్తలుండవలయును. నాగరిక దేశములందు నీవ్యాపారము బ్యాంకీలు, నిధులు ఇత్యాది ఋణవ్యాపార సంఘములచేత నిర్వహింపం బడియెడిని. మిగిలినసొత్తును వితరణతో వాడి వడ్డినందగోరువారు, తమకు గర్మలయొక్క స్థితిగతులు తెలియవుగావున వీనిశోధనయేపనిగాబూని యప్పుసప్పుల వృత్తియే వృత్తిగా నుండు నమ్మకము గలవారియొద్ద తమద్రవ్యము దాపరించి నిర్భయముగ వచ్చినమట్టునకు లాభమనియందురు, కృషి కళాదిక్రియాచతురులు తమకు బుద్ధి యుత్సాహమునుండియు కార్యారంభమునకువలయు మొదలులేకుంట, తదర్థంబు నిధికార్యదర్శుల వద్దకుబోయి, తమ యూహాపోహములదెలిపి, జయమౌననునమ్మిక కలుగ జేసిరేని తగు మాత్రపుసొమ్ము వడ్డికి గొనజాలుదురు. కావున బ్యాంకీలవలని లాభములు రెండు. చేర్చిపెట్టినవాడు అప్పియ్యగోరిన భద్రమైన స్థానముగా నునికియు, అప్పుదీయగోరిన వ్యవహారదక్షులకు విమర్శించు సహాయ కారియౌ తావుగానుంటయు. ఎక్కువనీరుండు స్థలములనుండి వ్యర్థముగ బోవునంబువుల పదిలపఱిచి నీరుచాలక తపించుచోటులకు ద్రిప్పుటచే కృషి యెట్లు పురణించునో అట్లే బ్యాంకీలచేత సమస్తార్థిక తంత్రములును పెంపుజెందును.

నిధు లుప్పొంగి నెలయుటకు వితరణ, ఉత్సాహము, నాణెమునను ముడుకారణములు. వితరణలేనిది మొదలు ప్రోగుగాదు. ఉత్సాహములేనిది నూతనోద్యమములుండవు. అందుచే దానికి గిరాకి రాదు. నాణ్యెము అనగా యోగ్యత. యోగ్యవ్యవహారములేనిది అడుగువారును నమ్మియిచ్చువారును ఉండరు. ఇది వినిమయకాండంబు నకుంజేరిన విషయంబుగాన నిటసంక్షేపముగ సూచించుటకన్న నెక్కువ వ్రాయజాలము.

యాననాకర్యమువలని ప్రయోజనములు

మూలధనం బుపకరణరూపంబుగను వఱలుట మున్నే వివరింపబడియె. ఈయుపకరణములు రెండువిధములు. వానినిమాత్ర మిట జర్చింతము.

1. యానయంత్రములు:- రాకపోకలు బహుత్వరితముగ జరుగకున్న వాణిజ్యము వ్యాప్తంబుగాదు. కాలినడకదప్ప నితరవిధగతు లెఱుంగనికాలమున తమగ్రామమునకుమించి సంబంధములు పెట్టుకొనుట కష్టసాధ్యము. ఎద్దులబండ్లచే వ్యవహారవైశాల్యము కొంత హెచ్చును. గుఱ్ఱముల వశీకృతములం జేసినదాన నింకను విస్తరించె. కొన్నిపల్లెలుమాత్రము దిరుగువారు తాలూకాలును ఒకప్రమాదముగా గణింపరైరి. నేడన్ననో ధూమశకటములును ఆవిరిశక్తిచే నిచ్చవచ్చి నట్టు మారుతములలెక్కగొనక అలలలక్ష్యపెట్టక పటువేగంబునం బోవు మహాగ్రామంబులోయన స్ఫారములును సర్వసామగ్రి సమేతములునునైన నావలును, కిరోసిన్ నూనె విద్యుచ్ఛక్తి వీనితో జనించిన గమనగాంభీర్యముగల మోటారులును, వ్యోమమార్గంబున గంటకు 60 మైళ్ళకన్న నెక్కువ దవ్వుబోవు మరుద్విమానములును ఇట్టి యాశ్చర్యజనక యంత్రశక్తిని దూరపు బ్రయాణములు పెఱటితోటకు బోయి వచ్చునంత సులభములైనవి. టెలిగ్రాఫ్‌లు టెలిఫోనులు, తంతులులేనివార్తలు మొదలగు సాధనములచే సముద్రములకు నావలి దిక్కుననుండువారితోను అనాయాసముగ పెండ్లాము బిడ్డలతో ముట్టడించినట్లు మాటలమార్చుకొనవచ్చును. కాలదేశములు పూర్వం బవిలంఘ్యములౌట పూర్వము జనులకు నెడబాటును పరస్పర సంబంధము లేకునికియు గలిగింప జాలియుండినవి. ఇపుడు వానిదెబ్బ అట్టె సాగదు. హనుమంతునకు సముద్రమెట్లో మనకు గాలదేశంబులట్లు. గోష్పాదతుల్యములు. ఇందుచే బ్రపంచమంతయు నొకటే అంగడి యయినట్లున్నది. ఐరోపాలో యుద్ధమునకు బ్రారంభించిరేని తత్క్షణమే యా వృత్తాంతము లోకమంతయువ్యాపించి ధరలెక్కుట తగ్గుట గావించును. రష్యాలో క్షామమనునప్పటికి మనకు వానలెంతగుఱిసిన నేమి? గోధుమలవెలలు తటాలున మీదికెగయుగదా! ఏలనగా రష్యావారును మనమును గోధుమ లింగ్లాండునకు బంపుదుము. రష్యాలో సున్నయైన ఇక "మనగోధుమలేగదా యింగ్లాండువారికి గతి" యని వెలలు నిలబెట్టితీతుము. అమెరికాలో నల్లకల్లోలములు పుట్టినవనుకొనుడు! అచ్చటి కెగుమతియగు సరకులవెల తగ్గును. అక్కడనుండి దిగుమతిగావచ్చువాని వెలలు హెచ్చును. ఇవి సంచలించిన వీనితో సంబంధించిన యితరవస్తువుల ధరలును తల్లడిల్లును. తొలుత మొత్తముల క్రయములు మాఱును. రాకపోక లెంతవడిగా నడుచునో అంతశీఘ్రముగ చిల్లరధరలును సంచలించును. ఇందుచేత అమెరికాపేరైనవినిన పాపమునంబోని కుగ్రామస్థుడైన పోలిశెట్టి దివాలెత్తిన నెత్తవచ్చును. చూచితిరా! యానసౌకర్యబద్ధమై లోకంబు సంకలిత వ్యవహారమైయుండుట? వ్యాపారచక్రమునకును భూచక్రమునకును పరిమాణభేదము మృగ్యము.

ఇరుగుపొరుగులతోమాత్రము క్రయ విక్రయములు జరుగు పూర్వకాలమ్మున ఎక్కువగా నుత్పత్తిజేయ నవసరము లేకుండెను. సరకులు వాణిజ్యములు నన్యోన్యాశ్రయములు. సరకులులేకున్న వాణిజ్యమారబ్ధముగానేరదు. వాణిజ్యములేనిచో తననై నేద్యమునకన్న నెక్కువ యెవ్వడును సిద్ధపఱచడు. గ్రాహకులులేనిది దాయకు లుండరు. అమ్మువా రుండవలయునన్న గొనువా రుండవలయును. వాణిజ్యవ్యాప్తియు గమనసాధనయంత్రవ్యాప్తియు బరస్పర సంకీర్ణములు. యాత్రలకు వీలులేకున్న బేహారములకు జేటునిజము. ఇక బేహారమునం దపేక్షలేనిది తీర్థ సేవకులు కొందఱుదక్క ప్రయాణీకులు తఱుచుగానుండరుగాన గమనసౌలభ్యముంగూర్చి చింతించి యుత్కృష్ట స్థితికిందెచ్చు నుపాయముల బన్నువారుండరు.

కావున ఉత్పత్తి, వాణిజ్యము, యానసౌకర్యము, ఒండొంటితో గలయిక గలవియనుట ప్రకటము

మనదేశమున ఆంగ్లేయులచే నేర్పఱుపబడిన రైల్వే, టెలిగ్రాఫ్,టెలిఫొన్ ఈలాంటివి యున్నవిగాని జనులయొక్క యాచారాదులు వానిచే గలుగగల మేలిమిని సంపూర్ణముగ ననుభవింప నియ్యవు. ఇవి వర్తకమునకును తద్ద్వారా ఉత్పత్తికిని హానికరములు. దేశదేశముల నిరాటంకముగ దిరిగి వారివారియభిమతముల బరిశీలించి కనుగొని సరకుల దయారుసేసినవానికి అమ్మకము నిక్కువము. మనయట్లు కూపస్థ మండూకములమాడ్కినున్నచో అర్థవృద్ధిపోయి అనర్థవృద్ధి మెండగును. యానతత్త్వము వినిమయ కాండాంతర్గతంబుగావున నింక నొకటిరెండు సందర్భములు సూచించి విరమించెద.

హిందూదేశములో క్షామబాధనివారణక్రియకు ధూమ శకటం లమోఘసాధనములు. చెన్నపురిలో పంటలుపాడైన బంగాళా, పంజాబు, బర్మా ఇత్యాది సీమలనుండి ధాన్యము దండిగ దేబడును. అయిన నొక యుపాధి. పండినదేశములలో గూడ నెండినదేశముల కెగుమతిచేయుటచే వెలలు పైనికి దలయెత్తును. అయినను మొత్తమున రాజ్యమునకు శుభమేయెక్కువ.

ప్రజలు విద్యావివేకహీనులై వాణిజ్యచాతురి లేనివారుగానున్న నిరర్గళ గమనమార్గములు వారికిగీడుదెచ్చినను దేగలవు. అదెట్లనిన, నేర్పుగలవాడు అనాయాసముగ దేశసంచారముజేయుచు ఈమూఢులను మోసపుచ్చి తక్కువవెలలకు వస్తువుల గ్రహించుట, అప్పులిచ్చి ఫలిత మడమానముగానుంచుకొనుట ఇత్యాద్యకృత్యము లొనరింప జాలును. మఱియు వకీళ్ళు, రాజసేవచేబ్రదుకువారు, సాహుకార్లు మొదలగు ధనికులు, సాధారణముగ గొప్పపట్టణములలోనె కుదురుగా నుండి బయటకదలక యుండువారయ్యును, సుఖప్రయాణములు కుదిరిన, బయలువెడలి గ్రామస్థులను బేలుపుచ్చియో డబ్బుజూపి వికలత నొందించియో వారిభూములగొని తమవశము జేసికొనుటకు ప్రారంభింతురు. ఇవి యనుభవవిదితములైన బాధలుగాని యస్మత్కపోల కల్పితములుగావు. ఇతరులతో సమానమైన శక్తికలిగి యాత్మరక్షణ దక్షుడుగానుండిన నెందఱితో గలసిమెలసియున్నను భయములేదు. అట్టిశక్తిలేనినాడు తనపని తానుజూచుకొని, పరంపరగవచ్చు సమీపస్థులబాయక, యొక పెద్దతనమునకుంజొరక, మూలనుండుటయేతగవు. ప్రతాపము జూపుదమను నాశతో విఱ్ఱవీగిన ముప్పుమూడును.

ఇపుడు మనదేశములో ఘటికులు ప్రజలను గొల్లగొట్టుటకు నెల్లవిధముల వసతులుబదిలములై యున్నవి. అవియేవనిన వేగవంతము లైన వాహనములు, జనుల తెలివిలేనితనము, చెప్పినను నేర్చుకొననేరని మొద్దుబుద్ధి, అమితవ్యయ వ్యాజములైన యాచారములు, అప్పుల మీది యాసక్తి. వాణిజ్యవిస్తృతి, చాలిచాలనిదానికి వక్కీళ్ళు, ఇంకేమికావలయు? కావుననే మొత్తముమీద భాగ్యము లుద్గాఢము లగుచున్నను ప్రజలగోడు వీడకుండుట.

ఇందుచేత రైల్వేలుకూడదనిభావముగాదు. వానితోడ చొరవ, తెగువ, చదువు, క్రొత్తసంగతులు తెలిసికొనవలయుననెడు శ్రద్ధ, మొదలగు సమర్థతాగుణమ్ములు నుండవలయుననుట యోచింపవలయు గాని యేదియులేక పూర్వస్థితినేయూది యునికి యర్హంబనుట యనుచితంబు. క్షీణదశకువచ్చినపిదప, నేకష్టమునులేకయే యుత్కృష్టత గాంతుమనుట బొంకు. "తనచేసిన దానంబడకపోవ శివునకు వశమే?" యని భారత ముద్ఘోషించెడిని. కావున నష్టము తొలుత గట్టిఇచ్చినంగాని లాభము వడయనేరము. తెలిసియో తెలియకయో తప్పుజేసి దేహము చెడగొట్టుకొన్నవాడు మందు పథ్యములు నాదరింపక ఆరోగ్యము నొందనట్లు మనమును పూర్వపాపపరిహారార్థము భంగముల కోర్చి పేర్చినంగాని దుర్గతివాయజాలము. మఱియు దలదగిలినగాని యేవిషయమును మనసున జక్కగా బాదుకొనదు. " పరమక్లేశమును జేసి పడసిన విద్యల్ స్ఫురియించు" నన్నట్లు కడగండ్లంగాంచి కనుగొన్నంకాని యనుభూతములు మఱపులేక నిలువవు.

భరతఖండం వివిధవేషభాషాది విన్యాసముందాల్చి లిచ్చిన్నమై యసంసృష్టములైన సీమలు, దేశములు, జిల్లాలు, తాలూకాలు గలిగి యుండుటకు శీఘ్రయానంబులేమియు అరాజకోద్భవములైన భయములును గారకములుగాని, యిందు బ్రహ్మదేవుని ప్రభావమేమియులేదు. దూరపుసంబంధములు లేని బ్రతుకగుటచేత, దేశాభిమానము, దేశీయు లెల్లరు మనవారనుబుద్ధియు నుదయింపదయ్యె. మఱియు జాతులు, ఉపజాతులు, కులములు మొదలగు సామాన్యములైన చిల్లర సముదాయములు ఎక్కడనులేని గౌరవమునొంది మతము, దేశము వీనికన్న మించినవై మనలోమనకు ననేకవైరములు ద్రోహములు గల్పించి సహించుటకుంగాని కట్టుదిట్టములచేబంధించి నికృత ప్రాభవులంజేసియు నింకనుం దృప్తిబొందక నవ్యమతంబుల పొంతంబోనీక యలయించు చున్నవి. మనవారల మతివైభవమునేమందు? విధిలేక చేసినవన్నియు విధిచేత జేయబడినవని భావించు మహాత్ములు గావుననే నేడు ఎన్ని వసతులున్నను దిక్కులేని నాటితెరవే సనాతనమైన దిక్కని నమ్మి యున్నారు.