భారత అర్థశాస్త్రము/మొదటి భాగము - పదమూఁడవ ప్రకరణము

పదమూఁడవ ప్రకరణము

ఆర్ధికయుగములు - మృగయా యుగము

యుగములక్రిందట పురాతనకాలములో జనులు అసంఖ్యులు ననాగరికులును గాన దట్టముగనున్న వనములలో వేటాడియు ఫలమూల శాకాదులగోసికొనియు గాలయాత్ర దీర్చుకొనిరి. వీరిబ్రతుకు మనుష్యులబ్రతుకాయని సంశయింపవలసి యున్నది కట్టుటకు గుడ్డలును వసింప బర్ణశాలలైననులేక కుడువను ద్రావను నేమైన దొరికినజాలునని వానరములట్లు మేతకై కాట్లాడుచు పరిభ్రమించుచుండిన మన పూర్వులందలచిన మనం వారిసంతతివారమాయని యచ్చెరువయ్యెడి.

ఈలాగు స్వచ్ఛందముగనుదయించు కూరాకులతో నెన్నియో శతసంవత్సరంబులుగడుచుడు. "జంతువుల సాధుచేసి పదిలపఱచిన వలసినపుడు వలసినంత యాహారము లభించు" ననెడు బుద్ధిగలవారు కొందఱు ఆరీతిచేసి "ఇది ప్రాచీనాచారముగా" దను మతిచే నట్లు చేయక హీనబలులైన సమానకా లీనుల నుక్కడించి తమకు బానిసలం జేసియు యమలోక ప్రయాణము జేయించియు సర్వము నాక్రమించు కొనిరి. మృగయులుగ నుండుటమాని పశుపతులైరి. ఆ తొల్లిటి బోయల రక్తమింకను మనదేహమ్ముల నంటియుంటగాబోలు మృగయాభిరక్తి ఇంకను మృగ్యంబుగాలేదు. భిల్లులుగనుంటమాని పిదప గొల్లలమైతిమి.

పాశుపాల్యయుగము

ఆకాలమున మానవులకు మందలే సంపదలు. పశువులు, మేకలు, ఎనుములు ఇత్యాది జంతువుల పాలు, పెఱుగు, వెన్న, మాంసము వీనితో జీవనము గడుపుకొని పచ్చిక ఆకులు బలసినచోటులకు మందల నడపించుచు చర్మములతో పరిధానముల గల్పించుకొని బేరసారములజేసి ఇంచించుక గరుపతనమును బడసినవారైరి. మూలధనం బిట మొట్టమొదట నవతరించె. దానితో వసువులును విపులంబులగుడు రక్షణార్థము సంఘముగాకుదిరి ధనాఢ్యు నొకని నధిపతిగా నేర్పఱుచుకొని శాసనంబుల నిర్మించుటంజేసి ధర్మాధర్మములు సంభవించె గోపతి పశుపతి యను నామములు శివునందును రాజునందును బ్రవర్తిల్లుట కిదియేహేతువు. ఆదిని మందలు బహుళముగ గలవాడు రాజౌటయగాక ధర్మకర్తయు నాయెంగావున వానిని కేవల మనుష్యుడని భావింపక భగవంతుడేయని యందఱుం గొలిచిరి. అర్థము, సంఘము. ధర్మము ఇవి పరస్పరాశ్రయములు. చూడుడు! ఏకాకిగ నడవులం గ్రుమ్మరువానికి సత్యాసత్యములు స్వపరప్రయోజన పరతులు మొదలగు ద్వంద్వమ్ముల భాధయుండదు. అట్టిపురషుని సన్మార్గుడని గాని దుర్మార్గుడనిగాని చెప్పవలనుపడదు. నీతి సంఘసంబంధి సంఘత్యాగము ధర్మత్యాగము. న్యాయాన్యాయములకు నతీతుడైన వానప్రస్థుడు పరమాత్ముడో మృగవృక్షజడప్రాయుడోకాని మనుష్యుం డేనాటికింగాడు. అర్థముల ననర్థములనుట ధర్మార్థ సంఘసంయోగము నెఱుగని దోషమేకాని విజ్ఞానచంద్రికగాదు.

మఱియు జిఘత్సయే జిగీషకు హేతువగుటంజేసి శిల్పంబుల చిత్తరువుల, విద్యల నుపకరణా సాదమంబుల నాసక్తి గొనుటకు నవలంబంబైన విరామంబు మిక్కుటముగ రాజిల్ల దొడంగె. మృగంబులు తెఱపిలేక దినమంతయు నుదరనిమిత్తమై క్రుమ్మరును. అట్లు స్త్రీ పురుషులును అనవరత ముదరనిమిత్తోద్యోగులైన విద్యావినోదములకు వలనగు విరామంబు నందజాలనివారై మృగప్రాయు లౌదురు. అయ్యో! మనదేశమున ప్రకృత మెన్నికోట్లజనులీ దురవస్థజిక్కి తమ కిట్టి దశ వచ్చెగదాయని యోచించుటకుం బరితపించుటకుంగూడ మతిలేని వారైయున్నారో తలంపుడు! అట్టివారి కీయోచన లేకుండుటయే తత్కాలమునకు మేలుగావున, అపరిమిత శారీరశ్రమ నొనరించువారికి మన:క్షయంబును నిద్రాతిశయంబును స్వాభావికంబులయ్యె. తత్కాలమునకు దు:ఖహేతువు గానిమాత్రమున వారల నట్లే యజ్ఞానాంధకారంబున గూలంద్రోసి కనులు గానకుండనిచ్చుట పరమపాతకంబు. ఏలయన ఎఱుకగల్గి యందుచే ఖేదము ప్రాపించి యప్పటికి వారిస్థితి నింకను హైన్యగతికి దెచ్చినను ఆ ఖేదబుద్ధియే దానిని నిర్మూలించి సంమోదానుభావము జెందవలయునను నాసగల్పించి యుత్సాహవంతులంజేసి నానాటికి పురోవృద్ధికి బీజమువంటిదౌను ఖేదామోదములులేనివౌట పశుపక్ష్యాదులు హర్షప్రకర్షాభిలాష కృతయత్నంబులుగావు.

కావున పాశుపాల్య మహాయుగంబు సర్వవిధముల నాగరికతకు మూలంబైనది.

అయినను స్థిరనివాసంబు లేర్పఱుచుకొనక వీరు మున్నుపాండవు లాహారకాంక్షచే ద్వైతకామ్యకాది వనములం బరిభ్రమించినరీతి గోగణపోషణార్థము దేశాటన పరులైరి వ్యవసాయ విధానంబులు వేద్యంబులైయున్న భూమినుండి స్వకృషిచే మనుజ మృగాళులకు వలసిన భుక్తి నలవఱచి పల్లెలు పట్టణములుగా నిద్ధస్ఫూర్తి నుండ వచ్చునుగదా! అవి నేరని కతంబున స్వయముగ నెదుగు పచ్చిక జాడలబట్టి యిచ్చోట శూన్యమైన నింకొక శాద్వలమునకును అక్కడనుం గడబడిన వేఱొక పచ్చిక పట్టునకుంగా గ్రుమ్మరువారైరి.

వ్యవసాయ మహాయుగము

తరువాత నెట్లో సేద్యముజేయ నారంభించి స్థలముల ఖాయముగ నాక్రమించి కుదురుపాటైన జీవనమునకుం దొడంగిరి. ఇందుచే మునుపటికన్న కలిమియెక్కుడై తన్మూలమున నాగరికత పెంపెక్కుటయు, పదిలముగ గుటుంబము లేర్పడుటంజేసి గృహస్థధర్మము లుద్భూతములై వాసింగాంచుటయు నివ్వటిల్లె. "ఎల్లిశెట్టి లెక్కయే లెక్క" అనునట్లు దినదిన మొకేతీరున మాంసక్షీరశాకముల బుచ్చు కొనుటమాని ఆరోగ్యరుచులకై భోజనాదులలో వివిధభంగులేర్పఱుప నుద్యుక్తులై నందున అందఱు నొకేవృత్తి నాశ్రయించుటమాని భిన్నవ్యాపారతంత్రులైరి. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మంగలి, చాకలి, బేహారి మొదలగు నానావిధములగు బ్రదుకుదెరువు లేర్పడుటచే నపూర్వసమృద్ధినొంది దేశంబు విలసిల్లె. సిరు లుల్లసిల్లుటచే జనులును సమంచిత విరామకాలంబును విద్యావిభూతియుంజెంది సుఖపరాయణులై ఇంతకు బూర్వమెవ్వరును భావంబుననైన బడయని భోగంబులం దేలిరి. హిందూదేశము అదృష్టవశంబున వేయి రెండువేలేడుల కన్న మునుపే యింత మహర్దశకువచ్చె. కాని దురదృష్టవశంబున మన ప్రాచీను లింతకన్న మిన్నగనుండ నెన్నని కతంబున రానురాను క్షీణించి నేటికి క్షామము మహామారి ఇత్యాద్పుత్పాతముల పుట్టి నిల్లైనది.

పరివర్తన కళాయుగము

యూరోపియనులు ఇంతటితో దృప్తిజెందక పౌరుషోద్ధురులై పరివర్తన కళాయుగంబుం బురస్కరించితెచ్చి భూమండల రాజ్యమున రాజుగ జేసిరి. ఈ వర్తమాన యుగంబుయొక్క ఘనతర లక్షణంబు లెవ్వియన;

1. హస్తబలంబునకన్న యంత్రబలంబు ప్రధానంబు. మనుజులు చేతిపనులచే నలజడిగొనుట చాలమట్టునకు జాలించి ధీశక్తిచే బ్రకృతశక్తుల వశీకృతంజేసి తన్మూలమున సర్వకార్య సంఘటన చాతుర్యధుర్యులైరి. భూజలాగ్ని వాయువ్యోమాంతర్గత ప్రభావంబులను యంత్రంబులను పగ్గంబులంబంధించి యధేచ్ఛ సంచారములకుం బాపి మనుష్యశాసితంబులంజేసి నడుపుచున్నారు.

2. ఇంతదాక భూమిలోనివస్తుజాలముల బైనికిలాగు కృష్యాది పరిగ్రహణకళ లుత్తమములని యెన్నబడినవి. ప్రకృతము వీనికి లాఘవమును రూపస్థల భేదకారణములైన క్రియలగు పరివర్తనకళలకు శ్రేష్ఠతయు బ్రాపించె. 3. పూర్వము స్వదేశమునందో స్వజాతీయు లయినవారితోనో మాత్రము వ్యవహారములు జరుగుచుండెను. ఇపుడు నాగరికాగ్రేసరుల వర్తకములు దిగంత విశ్రాంతములుగాని యలతుల నిచ్చునవిగావు.

4. చిన్నచిన్న రాజ్యముల నాహుతిగొని గొప్పదేశము లిపుడు అఖండతేజంబున బ్రజ్వరిల్లుచున్నయవి. పూర్వము భరతఖండము మహోన్నతస్థితినుండు సమయమునను "ఛప్పన్నని" అనబడు 56 దేశము లుండినవట! ఇపుడొక రాజపుటానాలోమాత్రము 96 సంస్థానములు పుట్టలోని చెదలుంబలె మలమలలాడుచున్నవి. జాతిచ్ఛేదము తోడ దేశచ్ఛేదము నొనర్చుట ఆర్యావర్తంబు తెఱగు. సంభూతిగ నుంచుట పాశ్చాత్యుల యాచారంబు. వారు దేశమును జాతులును నానాటికి వైశాల్యమును సంశ్లేషమునుం గనునట్లు, కెలంకుల సీమల నాక్రమించియు పెఱవారిని కష్టములకు గప్పములకు బాల్పఱిచియు, బాఱదోలియు, తమజనంబులకు దొరతనము భూధనంబులును సేకరించి, యేదిక్కున గాంచిన దామేయై చెలంగెదరు. ఇంగ్లాండు, రష్యా, జర్మనీ, అమెరికా ఈ దేశములవారి యుద్ధామత నెఱిగినవారు ఈ రీతినే వీరు ఇకముందును దిశాంతములనెల్ల దీటుకొనం బ్రసరించిరేని ఒకానొకప్పుడు ఈ భూమండలంబెల్ల నేకచ్ఛత్రాధి పత్యముక్రిందికిదెచ్చి యొకేరాజ్యము జేయగలరని యూహించెదరు. ఇట్లు సార్వభౌమత్వసిద్ధి కెదురుచూడదగినవారితో నింకను వడగల, తెంగల, అయ్యరు, అయ్యంగారు, ఆచారి, శాస్త్రి మున్నగు సనాచారపుబోకల బోవువారును జాతి మత దేశ భాషా విపర్యయంబులచే కండతుండములుగ ఖండింపబడిన మనమెట్లు స్పర్థించి మానప్రాణముల దక్కించుకొందుమో యెఱుగ రాకున్నది.

ఆధునిక నీతులు

1. ఆధ్యాత్మిక తత్త్వంబుల ఘనత నించుమించుగ నప్తమింపజేసి ప్రకృతి జీవమానవ సంఘతత్త్వములు ఉదయించి ప్రపంచ మంతయు బ్రకాశితంబు జేయుచున్నవి. ఈలోకంబున సద్వర్తనమే పరలోకప్రాప్తికిని నాధార భూతంబనియు, అడవిలో చెట్టుక్రింద గూర్చొని, యేకాగ్రముగ ముక్కును బ్రహ్మను గండ్లనీరుగారునట్టు చూచుచుంట, స్వార్థపరాయణత్వముగాన నది యుక్తముగాదనియు, నాధునిక నీతిశాస్త్రజ్ఞులమతంబు. స్వకీయమునకన్న బరకీయ ప్రయోజనబుద్ధిమేలు. కారణమేమన మనయునికికి సంఘంబే ఏడుగడ. కొన్ని మతంబులు అహంకారము త్యాజ్యమనియు, అహంకారమేలేకున్న సంసారచక్రంబుదిరుగుట సాధ్యముగాదుగాన, స్వభావవిరుద్ధమును శుద్ధముగ నసాధ్యమునుఅగు వాంఛారహిత కర్మానుష్ఠానము కర్తవ్య మ్మనియు బరస్పరశత్రువులగు నీతుల బోధించును. ఈ మతంబుల మాటయెత్తిన మండిపడువారు కొందఱు "తనకు మించిన ధర్మమే లే"దని వాదింతురు. స్వాత్మపరత్వము పాపావహంబగుటయేగాదు. మఱి తన యుద్దేశమునకే ఊనమైననడువడి, అదెట్లన, స్వకీయసుఖమునే కామించువారు అనేకులున్న సంఘంబుచెడును. తమకు రక్షకమగు సంఘంబుజెడిన దామును నశింతురుగదా కావున అహంకారానహంకారములకు మధ్యవర్తియైన మార్గమున్నంగాని పురుషార్థ ప్రతిపాదనంబు దుర్ఘటంబు. అట్టిమార్గంబు లేకపోలేదు. దేశసంఘాభి మానులైనవారు కేవల పరోపకారబుద్ధితో కార్యారంభులైనను, తమచే దేశమున్నతికివచ్చిన, తద్వారా తామును క్షేమంబువడయుదురు గాన, నిట్టి కార్యములు సంకల్పమున నిరహంకారములును, ఫలసమయంబున స్వపరప్రయోజన ద్వంద్వ సంయుతములునుంగాన, సకలజన కరణీయంబులని ఆధునిక సిద్ధాంతము. సంఘమ్ములు జనులు పరస్పర ప్రయోజకములై యున్నవి. మహాభారతమున శ్రీకృష్ణుడు పాండవ ధార్తరాష్ట్రులంగూర్చి యుపమించిచెప్పిన -

      మ. "ధృతరాష్ట్రుండును బుత్రులున్ వనము, కుంతీనందనుల్ సింహముల్
           మతినూహింపనసింహమైన వనమున్ మర్ధింతురెందున్ వనా
           వృతవృత్తంబులుగాని సింహములకున్ వేగంబె చేటొందుగా
           నతెగన్‌బొందుట గార్యమీయుభమున్ సంతుష్టిమై నున్కికిన్."

అను పద్యమున సూచింపబడినట్లు ప్రజలును దేశమును ఒండొంటి నంటియేయుండును. ప్రజలులేనిది సంఘముసున్న. సంఘము సున్నయైన బ్రజలంతకుమున్నుసున్న. కావున సంపూర్ణాహంకృతి నిరహంకృతులు గర్హ్యములు. "పదిమందికి ముప్పుమూడిననేమి? నేను చివుక్కున గైలాసమున కెగిరిన జాలు" నని మక్కువగొన్నవారు నీతిపరు లేనాడుంగారు.

ఇంతేకాదు. మోక్షేచ్ఛ, జనులయొక్క సొమ్ములాగి బదులు రొక్కమియ్యక చక్కనిమాటల బేలుపుచ్చుటకై, రాజులును గురువులును పూజారులును బన్నిన కుయుక్తియేగాని వేఱొండుకాదనియు గొందఱి తత్త్వశాస్త్రజ్ఞుల యభిప్రాయమైయున్నది. ఇందునకు దార్కాణము చూడుడు! హిందువులలో ధనేషణము వర్జనీయమైనను బ్రాహ్మణులకు ధనకనక వస్తువాహనాదుల సమర్పించుట స్వర్గహేతువని ధర్మశాస్త్ర ముపదేశించును. దీనింబట్టిచూడగా బ్రాహ్మణేతరులకు ధనము కూడదనుటయు బ్రాహ్మణుల కెంతయున్నం జాలదనుటయు స్పష్టము. అనగా మోక్షమునకై ధనమును మార్చుకొనుట, తెలిసినవారు గావుననే అగ్రగణ్యులు ముఖ్యమైనదాని గ్రహించి మోసమైన దానిని ధారవోసిరి. "ముక్కుమీదనే నిగాయుంచరా నాయనా" అని బోధించి యొకండట్లుచేయ ముల్లెలాగుకొన్నట్లున్నది. ఈ యవివేకము మనదేశముననేగాదు. ఐరోపాలోను మిక్కిలిగ వ్యాపించి యుండినది. కాని నవీనతత్త్వములు బయలుదేరినపిమ్మట మతాచార్యుల యాదాయముబుడముట్ట నశించుటచే వారు మిక్కిలి చీకాకు పడుచున్నారు.

ప్రవృత్తి నివృత్తి మార్గములు

పూర్వులు ఇహపరంబులకు వైరంబారోపించిరి. ఈ లోకమున వన్నెవచ్చిన నాలోకమున సున్నవచ్చుననియు అచ్చట సౌభాగ్యము రాలయునన్న ఇచ్చట వైరాగ్యమున బోవలయుననియు వక్కా ణించిరి. ఇప్పటివారు ఇయ్యది విరుద్ధవాదమని ఖండింతురు. ఎట్లన ఇహపరములు రెంటికిని సృష్టికర్తఒక్కడే. ఒక దానిని దైవము నింకొక దానిని దయ్యమును నిర్మింపలేదుగదా! కరుణాశాలియు నిర్ణిద్ర ప్రభావుండునైన ఈశ్వరుండు మనము ఇక్కట్టులం జిక్కునట్లు ఒండొంటి పొత్తుపొసగిని లోకంబుల సృజించెననుట సర్వసముండగు నప్సర మాత్మునకు క్రూరతయు హీనతయు నారోపించుటగాదే! ఇందును నందును మనము సుఖులమైయుంట యాతని యభిమతంబనిన నాతనికి దక్కువయగునా? ఇది పరస్పరాసంభవ సిద్ధాంతము. ఇహపరములు పరస్పరాసంభవములనుట ఈలోకంబు నాచుకొననెంచిన వంచకులచే బుట్టింపబడిన ప్రమాదమేగాని యపార దయారసవారిధియైన ఈశ్వరుండొనర్చిన యక్రమముగాదు.

తత్త్వశాస్త్ర విషయంబులివ్వి. విస్తరించి చర్చించుట కిట నవసరముచాలదు. ఆధునికుల ఆలోచన ప్రసరించుమార్గము మాత్రము సూచింపబడియె అంతియెచాలు. లౌకికంబు పరమధర్మంబనుట సర్వకోవిదులకును సమ్మతంబ. ఒకానొక అఖండజ్ఞానమాన్యుండు "దైవం పురుషరూపేణ" అన్నట్లు "మానవసంఘమే దేవుడు; దానికై పాటుపడుటయే అర్చ, ధ్యానము, తపస్సు అన్నియును. అంతకు మించిన పూజలులేవు" అని వ్యాఖ్యానము మహోదారముగ జేసి యున్నాడు.

మతములకు నార్థికస్థితు లాద్యములు

తొల్లి మానవులు ప్రకృతికి వెఱచువారు. ఉఱుములు, మెఱుపులు, తుఫానులు విసవిసవిసరు గాలులు, అంధకారమున నాకొన్నట్లు భయంకరముగ తలచేతులాడించి హుంకరించు రాక్షసులంబలె నల్లాడు చెట్లును, ప్రతిధ్వనులుమ్రోయు గుహలును, అగమ్యపర్వతములు, తటాలున వెల్లువగా బాఱిచిక్కినవాని నన్నింటిని నోటవేసికొనిపోవు నదులు, సర్పములు, క్రూరమృగములు ఇత్యాదులంగాంచి ఎఱుక చాలనందున వెఱపుగొని, దేవతలని పూజింపదొడగిరి. గూఢమైన వానినిజూచి భయముగొనుట మనకు సహజము. కావుననే పసిపిల్లలు చీకటిగదిలో నొంటిగానుండరు. అది మన్వంతరములవారునిట్లే. కిరాతులవంటివారు జ్ఞానమాసున్నా! స్వభావాద్భుతములజూచి తమకు విదితములుగానందున అవాఙ్మనస గోచరంబులని సాష్టాంగదండ ప్రణామంబులకు మొదలిడిరి. చూడుడీ ఈవింత! అవాఙ్మనస గోచరత నిజమేని పూజచేసిన మేలుచేయుననుట గోచరమౌటెట్లు? "దేవుని గుఱించి మనకేమియు దెలియదు. అత డింద్రియాతీతుడు" అని చెప్పుట. వెంటనే "అతడు భక్తునికి దాసానుదాసుడు" అని సిద్ధాంతముజేయుట! ఏమియునేరనివా రీవిషయమెట్లునేర్చిరో తెలియరాకున్నది. యధార్థ్యమేమన్న:- మనుష్యుడు తనకు గీడుచేయ శక్తిగలవానివి గోప్యవస్తువులను బహుగౌరవబుద్ధితో జూచుట నైజగుణం. కుఱ్ఱవానిని చేరదీసి యొకచేతిలో నరణానుంచి యింకొకచేతిలో నేమియులేకున్నను గట్టిగా మూసికొని "నీకీచేతిలోనుండునది గావలయునా!" అని యడిగిన నాబాలుడరణాతీసికొనుటకు జంకుచుండును. అనుభవవంతులమైన మనము ఆ యరణాను లాగుకొని "నీరహస్యము నీయొద్దనే భద్రముగనుండనీ" యని నవ్వుచువెళ్ళుదుము. అధ్యాత్మిక విషయములో నేటికిని జనులు బాల్యమునుమానుకొన్నారు. అనేకులు ఎదురునుండు ప్రపంచమునకన్న నెక్కడను గనబడని స్వర్గమే మేలని నమ్మియుంటకీ బాల్యచాపల్యమే కారణము. మఱియు నీలోకము సత్తుగాన నిచ్చవచ్చినట్లున్నదని భావించుటకుగాదు. "నాయిల్లు బంగారముతో గట్టినది. నేనెప్పుడు నిట్లే కౌమారదశలోనే యుందు" నని డంబములు పల్కువానిని పిచ్చియాసుపత్రికి బంపుదుము. కాని ఋషీశ్వరుండనిభావించి పూజింపము. ఇంద్రియములకును బుద్ధికి నతీతమైనదానిని అభిమతానుసారముగా చిత్రించుకొని కృత్రిమ సంతుష్టి వడయవచ్చును. కావుననే సాధ్యాసాధ్య విచారణలేక యనేకులు ఈప్సితంబులెల్ల నీడేర్చులోకమొండు గల్పించికొని "మేఘముల నీళ్ళునమ్మి దొన్నిలోని నీళ్ళు దొర్లించినట్లు" ప్రవృత్తివదలి నివృత్తి నవలబించుచున్నారు. "భూలోకంబున నెన్నియో కష్టములు బడవలసినవారమై యున్నాముగదా? దీనికి నష్టముగట్టియిచ్చు లోకం బొకటిలేకున్న ధర్మమెట్లు స్ఫుటంబౌను?" ఇత్యాది యోచనలచే జనుండు భ్రమమూలమై పరిపూర్ణ సుఖాభిలాషయొక్క ప్రతిబింబమైన అవ్యయ పదవియొకటిగల్పించి బొమ్మలిండ్లాడు బాలికలంబలె కుతుకంబునొందెడు. అది యట్లుండె

ఆదిని ప్రకృతిలోని వస్తువుల దేవతలని పూజించుటకును, విరక్తియందు రక్తిగొనుటకును అరయమి, వెఱపు, నైసర్గికములం జయించి పనులు జేయించుకొనదగు జ్ఞానస్ఫూర్తి లేకపోవుటయు గారణములు. మనము ప్రకృతుల కధీనులమైయుంటిమి కావున బూజించితిమి.

ఇపు డట్లుగాదు. మనుష్యతేజం బజేయంబై యున్నది. ప్రకృతి మనకు బ్రజయయ్యె. మనము పతులమైతిమి. అమెరికాలో 'కాలిఫోర్నియా' యనుసీమలో నొక మహానదిని ఇంకొకప్రక్కగా బ్రవహించునట్లు బంధించిరి. నదులు సముద్రములును పొంగుకాలమును పరిమితినిగణించి యుచితప్రతిక్రియలను మున్నుగనే సిద్ధపఱిచి వానిచే నగు నుపద్రవముల నానాటికి దగ్గునట్లు చేయుచున్నారు. మారుతములు ప్రవాహములు మున్నగువానిని గొప్పచక్రములు ద్రిప్పునట్లు చేసి నూడిగములకు గుదిరించుచున్నారు. ఇట్లనేకరీతుల బురుషుడు విజృంభించి యేపుజూపి ప్రకృతిగర్వము నణంచుట సర్వజనవేద్యంబు. అరయమితోద భయమును భయముతోడ బూజయును గ్రమముగ వదలుచున్నవి. ఈ లోకముననే, మనకుగాకున్న సంఘమువారికిని, నేడుగాకున్న ఇక ముందైనను, సాధ్యసుఖములన్నియు సమకూరునను నుత్సాహ మున్నది. కాన యూరోపియనులు తొల్తనీపని సమాప్తికిదెచ్చి, పిమ్మట దూరపుంబనియైన పరలోక విజయమున కారంభింతమని, లౌకికాచార పరాయణులై రాజిల్లెదరు.

ఇట్లు హిందువులయొక్కయు ఐరోపావారియొక్కయు నాగరికతలలోగల ముఖ్యభేదములు సూచింపబడినవి. ఏలయనగా పురుషోద్యోగస్వభావము, అది యనుసరించి మార్గములు, పద్ధతులు, అర్థముల గౌరవలాఘవములు, వీనికన్నింటికిని సకలకర్మలకును మనుష్యుల హృదయముల దృడముగ నావేశించి యావజ్జీవమునునడిపి నిర్ణయించు నమ్మికలే జన్మస్థానములని తెల్పుటకు.

అజ్ఞానము జీర్ణించుకొలది పూజాపునస్కారములు సన్నగిల్లు ననుటకు మనవారి యాచారములే ప్రబలప్రమాణములు. ఎట్లన, అడవి మనుష్యులు ఱాలుఱప్పలు మొదలుగజూచిన వానినెల్ల గొలుతురు. ఏదైన వృక్షము వాయువశంబున దలయూచెనేని, అందేదో దేవత యావేశించియున్నదని, మాలలు దానిని చింపిఱిబట్టలతో నలంకరించి ప్రదక్షిణములుచేసి యానందతాండవ మాడుదురు. శూద్రు లింత మూఢులు గాకున్నను కాటేరి, మాటేరి, మారెమ్మ, పోతమ్మ ఇత్యాది క్షుద్రదేవతల నాశ్రయింతురు. వీరికన్న జ్ఞానమాన్యులైన బ్రాహ్మణులు వీనిని తుచ్ఛములనియు తమోగుణ ప్రధానములనియు నిరసించి సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇత్యాది శ్రేస్కర ప్రకాశమానములైన ప్రకృతులదేవతలని భజింతురు ఇందుచేగలుగు లాభము సూర్యనమస్కారములకును యజ్ఞములకును వరుణ జపములకును అగుసెలవేగాని వేఱొండులేదు. వేదకోవిదులు వీనిని ఉత్సర్జించి సర్వాంతరామియైన పరమాత్మ నారాధించుటమాత్రము నిహితమని యనుష్ఠింతురు కావున విజ్ఞానము వికసితమగుడు భక్త్యర్హములని భావింపబడువానిలెక్క తక్కువయగుననుట ప్రవ్యక్తంబు.

ఐరోపాలో పూర్వమునుండి సూర్యచంద్రులకు సంభావన పూజ్యము. ప్రకృతము సత్యాసత్య విచక్షణులు లోకభజనమే పరంబు నకు రాజమార్గంబని ప్రకటించెదరు. ఎట్లన భగవంతుడు ధర్మమున కతీతుడైనచో బ్రార్థించినను ప్రసన్నుడౌననుట నిశ్చయములేదు. ధర్మబద్ధుడైనచో సన్మార్గగాములకు సద్గతివొసగవలయుట విధియౌను. అర్చనలచే నారాదితుండౌనను సిద్ధాంతమున కుత్పాదకములు రాజులవల్ల - బ్రజలుపడిన యుత్పాతములే. మహారాజులు, నవాబులు, పాదుషాలు మొదలగు ప్రజాపీడకులు చట్టదిట్టములకు మించినవారమని స్వేచ్ఛావిహారులగుడు. బాధల దొలగించుకొనుటకు, మన్ననలు వడయుటకును, అందఱు చేతులుగట్టుకొని వారిస్తోత్ర పారంబుల వల్లించుటవినా వేఱొండుపాయములేనివారైరి. అదిచూచి "ఒకచిన్నరాజే యిట్లు నిరంకుశ ప్రతాపుడైనపుడు సర్వశక్తిమంతుడగు భగవంతుడింకను ఉద్దండుడై యుండుగదా! ఇక నాతని సమ్ముఖమున న్యాయాన్యాయంబులు గుణదోషములును నివేదించి ఫలమేమి? వందిబృందముల చందంబున స్తుతించి "స్వామీ! నేను పాపిని ద్రోహిని. ఉప్పురాతికైన బనికిరాను. మీకరుణయే వేచియున్నాడ. రక్షింపు మహాప్రభో!" యని అతని చరణారవిందముల పిఱికిపట్టుబట్టి వదల ననిన లబ్ధసాయుజ్యులమౌదుము అని లోకులు యోచించిరికాబోలు! వర్తమానకాలమున రాజులు సర్వస్వతంత్రులనియు, శాసనబద్ధులు గారనియు నెవ్వరు నొప్పుకొనరుగాన, పాదుషాల ప్రతిబింబమో యనునట్టి కృతిమదేవుని గొలుచుటమాని ధర్మోద్ధరణ లీలాలలితంబైన సత్వగుణ బ్రహ్మంబు నుపాసించుట కర్తవ్యంబు ఈ బ్రహ్మోపాసనమునకును లౌకికాచారమునకును విరోధములేదు. మఱియు నిహమే పరసాధనమని యెన్నవలయు.

      ను. "తనకున్ మించగరానిధర్మమున బద్దంబై వియోగంబు గా
           నని ద్వంద్వంబులు పుట్టుగర్భమయి తన్మార్గంబునన్ సృష్టిని
           ల్పునమోఘంబగు తత్త్వముందలచి యాలోచించి యశ్రాంతమున్
           ఘనసమ్మోదమునందు ధీరుల నఖండజ్ఞానులం గొల్చెదన్."

కావున సంఘసంయోగమునకు నౌకాదిగమనములకును బ్రతిరోధకంబులైన యాచారములచే నావరింపబడినవారు, పూర్వము వ్యవసాయకు లచే గోపాలురును గోపాలులచే బోయలును పరాక్రమహీనులై అడవులపాలయినట్లు కళాదక్షులయిన వారిచే నపహృత విభభులై పరితపులగుదురు. కాలనియమంబిట్లు. తాటాకులకట్టచే కాలంబు వార్యంబు గాదు. అనుసరించుటచేతనేగాని నిరసించుటచే గాలము నెన్నటికిని జయింపజాలము. కాలవశతయని మరణమునకు బర్యాయపదం బొండు గలదు. దీనిభావమేమన కాలమునకోడుట. అనగా కాలానుగుణములౌ వర్తనముల నిరసించి యోటమి దెచ్చుకొనుట. దీనికై ప్రతిక్రియ యేదనగా యథోచిత మార్గముల నవలంబించి మనమును మార్పులు వడయుటయే. అట్లుచేసితిమేని స్వకీయప్రాణంబులు గోల్పోయినను జాతీయప్రాణములు నిలుచును. మనకర్మఫలంబులు జాతిలో నావేశించి స్థిరతనొందుగాన నొకవిధమున జాతిలో లయించినవారమగుట మనమును చిరంజీవుల మగుదుము.

యుగక్రమ మనగానేమి?

పై చర్చలలో నొకయుగాంతరమున మఱియొకయుగము ఉపక్రమించునంటిమి. అనంతరమనగా కాలానంతరముగాదు. ప్రాధాన్యానంతరమనుట. వివరమెట్లన; నేటికిని వేటాడి జీవించువారుం గలరు. మందలందోలుకొని యడవుల గొండలంబడి తిరుగువారునునున్నారు. ఐనను వీరికి పూజ్యతలేదు. వీరు గౌరవింపదగినవారని పిచ్చివాడు సైతమాడడు. అదేరీతిని కృషికళాయుగంబులంగూర్చియు. ఒకటి చచ్చి వేఱొకటి మొలచుననికాదు నాయర్థము. మఱేమన మహదరణ్యంబున సింగంబులు చేరినతోడనే మ్రుక్కడి మృగంబులు విపద్దశకు వచ్చి నానాటికి భక్షింపబడి కాలక్రమేణ పర్యవసానము జెందు తెఱంగునను, మహీరుహంబు నిగనిగలాడుచు నెగయుకొలది పరిసర భూజంబులు గాంతిదఱిగి తుదకు నయ్యది ఆశాంతంబుల జుంబించు కొమ్మలతోను వర్షాతపములకుం జొఱరాని వర్ణములతోను సమున్నతి జెందువఱకు నివి శీర్ణతజెంది తుదకుగ్రుంగి రూపఱివోవుమాడ్కిని, కాలానుగుణమైన నాగరికత విజృంభించుతఱికి కాలప్రతికూలంబులగు చందంబులు మందతనొంది సమకాలికంబులయ్యు జీవచ్ఛవంబులపగిది గుళ్ళుచు తుదకు నామమాత్రావశిష్టంబు లగుననుట. కాలమ్మున సంయుక్తతయున్నను దేశమ్మున సంయుక్తతయుండదు. అనగా నూతనోద్యోగులు పైబడివచ్చిన మనము వారికితావిచ్చి వెనుక కొదుగ వలసినవార మగుదుము. వారుప్రవేశించినచోటు నాగరికహీనులు కాలిడుటకుగాదు వీరుండ వారురావచ్చును పోవచ్చును. వీరిని వెడలనైన గొట్టవచ్చును. బలములేదు కాన ప్రతిక్రియ జేయంజూచుట యలవికాని యుద్యమము. కాబట్టి కాలంబొండైనను విధివేఱయ్యెడిని. కాలానుగుణాచారప్రచారమే యిందులకు మందు.

ఒకయుగంబున దత్పూర్వయుగంబుల లాంఛనంబులెవ్వియు లేకపోవుననియి దలంపగూడదు. మనదేశమున కృషీవలులును గొల్లవాండ్రును మందలనుంచుకొనుమాదిరి ఐరోపాలోను వ్యవసాయ గోపాలనములు నిక్కడికంటె సమృద్ధిగ జరుగుచున్నవి. అయినను వానికీదేశముననుండు ముఖ్యత యక్కడలేదు. హిందూదేశములో సుమారు 195,668,362 మంది కృషియేగతియనియున్నారు. పశ్చిమ ఖండనివాసులకు వ్యాపారవాణిజ్యాదులేజీవనదులు. కృషియునదితో సమానము. కరటింబోలె తదనంతరయుగా విర్భావసమయంబున మాతృయుగంబు మృత్యుగోచరమై మటుమాయమౌనని ఎంచరాదు. మఱేమన వర్తమానము భూతంబునంబట్టి భవిష్యత్తులోనికి బ్రవహించును. త్రికాలములును సముచ్చితములు. వర్తమానంబు భూతంబునకు ఫలంబును భవిష్యత్తునకు బీజంబునైయుండు. ఇయ్యది వృద్ధిలక్షణంబు. పెఱుగుటలేకున్న విఱుగుట సిద్ధంబు. అచలత్వము జడ ధర్మంబు. చైతన్యధర్మంబు చలనంబు. కావున నెయ్యది నేడు సిద్ధిగ నెన్నబడునో యది వృద్ధిదినములనాటి కుపకరణమౌను. కారణజాతం బైనకార్యంబు తదితర కార్యంబులకు కారణంబౌటయే పరిణామంబు. తృప్తి సుప్తి అది తగదు నేడు మేడగానుండుదానిని రేపు ఇంకను ఉన్నతివహించిన మేడయొక్క సోపానముగా జేయుటయే మహాత్ముల పద్ధతి.

చూడుడు! ఒకవిధమున గాల మనశ్వరమైనను ఇంకొక విధమునజూచిన నశ్వరం బనవచ్చును. భూతకాలము గతమైనను దాని ఫలములు వర్తమాన భవిష్యత్తులందును బ్రవర్తిల్లును. కావుననే పెద్దలనాటి దురాచారములనుండి మనమవస్థబడుటయు వానిని బాఱద్రోయుట దుస్తరముగనుంటయు. కర్మంబనునది ఈ సిద్ధాంతమేగాని వేఱుగాదని తోచెడిని. పారంపర్య విపరీతములెన్నియున్నను అవి యోధ్యములేగాని అయోధ్యములుగావుగాన మగంటిమిగలవారు వానికి వెఱచి వెన్నియ్యరు.

ఏయుగము నాలోచించిననుసరే, తత్పూర్వయుగంబుల ఫలంబులందిమిడియుంటయేగాక, గమనించి పరీక్షించిన, తన్ను పగిల్చికొని రాబోవుయుగము మొలకెత్తుటయు గోచరించును. ఐరోపాలోని యిప్పటిస్థితి నిరామయంబుగాదు. దానికిని లయంబువిధింపబడివున్నది అట్లుగాకున్న వృద్ధియుండదు. ఈ లయసూచక నిమిత్తంబు లిపుడే గానబడుచున్నవని యనేకులనెదరు. భూతవర్తమానంబులం గూర్చి నట్లు భవిష్యత్తునుగుఱించి ధృఢంబుగ జెప్పుటకు శాస్త్రజ్ఞులు కుటిల జ్యోతిష్కులు కారుగాని, వీరియూహలు ప్రమాణములే యగును. ఈ విషయ మికముందు చర్చింతము. ఒకమాటమాత్ర మిక్కడనే చెప్పవచ్చును. ఏమన పాశ్చాత్యుల ప్రకృతస్థితి లయంబు నొందుననుటచే ముందు పాశ్చాత్యులే పరమపదవికింబోయి మనకు దండిగ దావు దొరకనట్లు చేతురని భ్రమింపబోయెదరుసుడీ! ఆ మాటకు వారి యీ నాగరికత రూపుమాఱునని యర్థము. వారే రూపుమాయుదురని యర్థముగాదు. ఈ పరిణతిచేత వారింకను దేజోవంతు లగుదురెకాని తేజోహీనులుకారు. కావున యుగంబులు కృతాంతంబు లౌననుటకు ప్రళయజంఝూమారుత విహతములౌనని భ్రాంతిగొనుట నిర్హేతుకంబు.