భారతీయ నాగరికతా విస్తరణము/దక్షిణహిందూదేశము–ప్రాగ్భారతదేశములు

భారతీయ నాగరికతా విస్తరణము.

8. దక్షిణహిందూదేశము - ప్రాగ్భారతదేశములు.

ఈవిధమున దేశాంతరములందు భారతీయనాగరికతను విస్తరించు నెడ హిందూదేశమునందలి యుత్తరాపధ దక్షిణాపధములు రెండును సమముగ బాల్గొనినవి. ముఖ్యముగ బౌద్దమతమును, సంస్కృతప్రాకృత వాఙ్మయములను విదేశీయు లుత్తరదేశమునుండి గ్రహించిరి. అందు కాశ్మీరమును, వంగదేశము నగ్రగణ్యములు. మనదేశమునకు బ్రాగ్దిశ నున్న ద్వీపములకును బ్రకృత ఇండోచైనాకును దక్షిణహిందూదేశముతో సన్నిహితమగు సంబంధముండినటుల స్పష్టమగుచున్నది. యీసంబంధ మీదేశములందలి గాథలు, శాసనములు, దేవతలు, మతము, కట్టడములు మున్నగువానిలో గాంచనగుచున్నది.

(1) వర్తకము :- మొదటినుండియు దక్షిణదేశవాసులు సముద్రయానమునకును, విదేశవాణిజ్యమునకును వాసికెక్కి యుండిరి. మలబారుతీర మీసందర్భమున బేర్కొనదగినది. అటనుండి పాశ్చాత్యదేశములతో వర్తకము జరుగుచుండెడిది. అటులే దూర్పుతీరమున పాండ్యరాజ్యములోని కోర్కె (Kor ai) నగరమును, చోళుల రాజధానియగు కావేరీ పట్టణమును, మహాబలిపురమును, ఆంధ్రదేశమునందలి గూడూరు, ఘంటశాల, మోటుపల్లి, కోరంగి మున్నగు రేవుస్థలములును బ్రాగ్దేశములతో వాణిజ్యమును నెరపుచుండెడివి. (2) వలసపోవుట :- సాధారణముగ దేశాంతర సామ్రాజ్యనిర్మాణమునకు వాణిజ్యము మార్గదర్శకము. యీప్రాచీన దాక్షిణాత్యవర్తకుల వెంటనే యితరులనేకు లీదూరదేశములకు వలసపోయిరి. క్రీ. శ. 1 వ శతాబ్దిమధ్యభాగమున శకులు భారతదేశమున గల్లోలమును గల్గించిరి. దానికిఫలితముగ దేవియులు గొందరు విదేశముల కేగి యుందురు. క్రీ. శ. 78 లో అజీశకుడనునతడు పశ్చిమతీరమునుండి కొందరనుచరులతో సముద్రముపై బ్రాగ్దిశకేగెనని తెలియుచున్నది. అటుపై భారతదేశబ్రాగుత్తర దిశనుండు సముద్రతీరమునుండి యనేకులు జావాద్వీపమునకు వలస పోయిరి. వీరిలో చాలమంది మహానదీ గోదావరీతీరవాసులు, మలేద్వీప కల్పవాసులు, భారతదేశమునుండి యటకేతెంచినవారిని "కెలింగ్" లేక క్లింగు" లని పిలచుచున్నారు. యీపదములకు "కళింగదేశీయు" లని యర్థము.

(3) గాదలు :- అగస్త్యమహర్షి భారతదేశముననే యార్యనాగరీకత ననార్యమగు దక్షిణాపథమున విస్తరింపజేసెనను ప్రతీతి గలదు. ఇండోచైనా, జావాద్వీపములలోగూడ నీతడు జ్ఞానప్రదాతగా నారాధింపబడు చుండెను. 'అకిత్తజాతక' మను బౌద్దగ్రంథమున నీయగస్త్యుడు దక్షిణ హిందూదేశమునుండి 'కారద్వీపము' న కేగెనని చెప్పబడియున్నది. యీ దీవి బ్రకృతము (Celebes) అని వ్యవహరింపబడుశ్రీబోజద్వీపరాజ్యము నందుండినది. జావాద్వీపమునందు విచిత్రములగు విగ్రహములు గలవు. అవి పొడుగైన గడ్డమును చక్కనివస్త్రమును ధరించిన యొక వృద్దునివి. "భతారగురు" లేక "మహాగురు" యను నీవిగ్రహములు శివాలయములలో నెలకొల్పబడి బ్రత్యేకముగ నారాధింపబడుచున్నవి. భతారయనగా మళయాళములో శివుడనియర్థము. అగస్త్యమహర్షి శివభక్తుడు. గాన నీయనద్వీపవిగ్రహము లగస్త్యునివని స్పష్టమగుచున్నది. క్రీ. శ. 240 లో కంబోదియాదేశపు రాజొకడు 'మావ్‌లన్‌' (Mao Lun) అను విదేశ రాజునొద్దకు రాయబారి నంపెను. ఈ 'యాప్‌లన్‌' అనుపేరు 'మారన్‌' అను పేరుతో 'సంఘయుగమున' (Sangan Age) దక్షిణహిందూదేశము నేలిన పాండ్యరాజుల పేరును పోలియున్నది. ఇదేదేశపు రాజులు తాము కౌండిన్యుడను భారతీయ బ్రాహ్మణుని సంతతికి జెందినవారని దలచిరి. ఎలియట్ పండితు డీకౌండిన్యుడు మహాబలిపురమునుండి కాంబోడియా కేతెంచెనని వ్రాసియున్నాడు. యవద్వీపమున కళింగమునుండి వచ్చిన త్రిత్రేష్ఠుడను బ్రాహ్మణు డచ్చట హిందూమతమును స్థాపించెనని మఱియొక గాధ గలదు. ఇండోచైనాలో వారసత్వము స్త్రీలమూలముననే మలబారులోని మరుమక్కత్తాయమువలె సంక్రమించును. సుప్రసిద్ద ద్రవిడగ్రంథమగు 'మణిమేఖలై' లో యవద్వీపప్రశంస గలదు. అపుత్రుడను బ్రాహ్మణ యువకుడు యవద్వీపరాజపుత్రుడగ జన్మించి, దక్షిణదేశమున మణిపల్లవమనుచోట నివసించు మణిమేఖలై యనుభిక్షుణివలన ధర్మోపదేశమునంది, యాధర్మమును తనరాజ్యమున వ్యాపింపజేసెనట. మణిమేఖలయను పదమునకు జావాభాషలోను, సంఘయుగపు తమిళభాషలోనుగూడ సముద్రమని యర్దము.

(4) శాసనములు :- జావాద్వీపమునందలి శాసనములు మూలవర్మ, అశ్వవర్మ, జయవర్మమున్నగు దత్రస్థరాజన్యుల నామములను బేర్కొనుచున్నవి. వీనిలోని "వర్మ" శబ్దము దక్షిణహిందూదేశపు పల్లవ రాజుల నామములలో గన్పించుచున్నది మఱియు నీశాసనములలోని భాషయు లిపియుగూడ పల్లవశాసనములందలి భాషను, పల్లవగ్రంథ లిపిని బోలియున్నవి. ఉత్తరాపథమునందువలెగాక దక్షిణాపథమున బ్రాయికముగ శాలివాహనశకమే వాడుకలో నుండినది. ఈప్రాగ్భారతదేశ శాసనములందు నాశకమే వాడబడియున్నది. ఇండోచైనాలోనిభాగమగు లిగోర్ (Ligor) రాష్ట్రము, గోదావరీమండల నివాసియగు సంతకుమారుడను నాతనిచే స్థాపింపబడెనని మఱియొకశాసనము దెల్పుచున్నది. చంపారాజ్య

' ముననుండిన విభాగములలో అమరావతి, పాండురంగ, కౌథారయనునవి ముఖ్యములు. ఈ యమరావతికి బ్రాచీనాంధ్ర సామ్రాజ్యమునకు రాజధానిగనుండి చరిత్ర ప్రసిద్దినందిన యమరావతీనగరమే మాతృక. రెండవవి భాగము బొంబాయి రాష్ట్రమునందలి బ్రఖ్యాతయాత్రాస్థలమగు పండర్‌పూర్‌ను సూచించుచున్నది. కౌథారము కుఠారమను సంస్కృత పథమునకు రూపాంతరము. పరశురామ క్షేత్రమగు మలబారు నీపదము జ్ఞప్తికి దేగలదు. చంపాలోని హిందూరాజ్యము శ్రీమారునిచే నిర్మింపబడినది. దక్షిణహిందూదేశపు పాండ్యరాజుల కీనామ ముండెడిది. జావాలోని తకోపాయనుస్థలము నందలి శాసనమున సేనాముఖం, మణిగ్రామం, చాపత్తార్ అను సంఘములు పేర్కొనబడినవి. ఇందు కడపటి నామమునకును "శపథ" శబ్దమునకును సామ్యమున్నది. మలబారులో "సాపత్తార్" అనువారు రాజుల కంగరక్షకులుగ నుండిరి.

(5) దేవతలు :- ఈప్రాగ్భారతదేశమున నారాధింపబడుచుండిన దేవతలందరును దక్షిణహిందూదేశమునకు జెందినవారలే. ఇచట శైవ, వైష్ణవ, బౌద్దమతములును, వానికి జెందిన దేవతలు నుండిరి. శివునియారాదనము ప్రబలముగ నుండినది. దేవరాజగు నీతడు ద్రిమూర్తులలో నగ్రగణ్యుడుగనుండి, హర, పశుపతి, శంకర నామాభిరుధుడై యుండెను. ప్రత్యేక విష్ణుప్రతిమలును, శంకరనారాయణ హరిహరవిగ్రహములుగూడ నిట నుండినవి. వీరులుగాక లక్ష్మి, ఉమా, స్కంద, గణేశ, నందిమున్నగు దేవతలుగూడ నీదేశములలో నారాధింపబడుచుండిరి. బుద్దవిగ్రహములు సామాన్యములు. శివునితోబాటు శక్తిగూడ యీప్రాంతముల కేతెంచి భగవతియనుపేరిట నారాధింపబడు చుండెను. దక్షిణహిందూదేశములో రాజులు దేవాలయములను నిర్మించి యందలి దైవములకు దమనామముల నొసంగు టాచారమై యున్నది. అట్టి యాచారమే చంపా, కంబోడియా, ఇండోచైనారాజ్యములందును, జావాబలిద్వీపములందును రాజు లవలం బించుచుండిరి. మఱియొక చిత్రమేమన, కాంభోజ అన్నాందేశములందును, బలిద్వీపమునను గొన్ని యాలయములలో విగ్రహముండవలసిన స్థలమునం దొక శూన్యసింహాసనము మాత్రము స్థాపింపబడినది మహోన్నతములును, సుందరములునగు, నీయాలయములను, వానియందలి యీశూన్యాసనములను, గాంచినచో "చిదంబర రహస్య" మను నాంధ్రలోకోక్తికి గారణమగు ద్రవిడదేశములోని చిదంబరమునందలి దేవాలయము జ్ఞప్తికి వచ్చుచున్నది.

(6) మతము :- ఈ దేశములలోని పండితులు మతప్రవర్తకులుగనుండిరి. వీరిలో మూడు తెగలుండెడివి. "చూశూ" యనువారు బౌద్దులు. మహాయాన మతాను యాయులగుటచే బుద్దుని విగ్రహము నారాధించుచుండిరి. 'పసూవెయ్‌' (Pa-ssu Wei) అను నింకొక తెగవారు మెడలో యజ్ఞోప వీతమును ధరించుచుండిరి. బహుశ: వీరు వైష్ణవులైయుందురు. ఈ పాస్‌దూశబ్దమునకును వైష్ణవ గ్రంథమగు పాంచరాత్రాగమమునకును సంబంధమేమైన నుండవచ్చును.

(7) కట్టడములు :- ఈ ప్రాగ్భారతదేశములందలి కట్టడములు గూడ దక్షిణహిందూదేశ సంపర్కమును సూచించుచున్నవి. కాంభోజ దేశములోని 'అన్‌కోర్ వాట్‌' (Ankor Wat) దేవాలయ యీ సందర్భమునందగ్రగణ్యము. ఇయ్యది యంతరువులుగానున్నది. మొదట నొకచతురస్రమును, దానిపై నంతకంటెను చిన్నదగు మఱియొకటియు, నటుపై నింకనుజిన్నదియు, నిర్మింపబడి యీ విధమున పైకి పోనుపోను యీ కట్టడము చిన్నదగుచున్నది. ఎన్నియంతర్వులున్నవో యన్ని వరుసల మెట్లు వెలుపలికి గన్పించు చున్నవి. దక్షిణహిందూదేశములోని తిరుచినాపల్లికొండపై దేవాలయమును, తిరుప్పరన్ కున్రం కొండపై యాలయమునుగూడ నిటులే యున్నవి. ద్రవిడదేశమునందువలె నిచ్చటగూడ శైవ వైష్ణవ శిల్పము లెన్నియోగలవు. కాంబోడియాలోని యాలయములలో గోడలపై నను, ద్వారము లమీదను రామాయణ మహాభారతములలోని భాగములలోని ఘట్టములు చెక్కబడియున్నవి. ద్రవిడదేశములోని కుంభకోణమునందలి చక్రపాణి దేవళమునను, మధురమీనాక్షి గుడిలోనుగూడ నిట్టివి గలవు. బలిద్వీపాలయములకు గోపురములున్నవి. జావాలోని 'డీఇన్గు' పీఠభూమి (Di-ing-plateau) లోనున్న పాండవుల గుడులు మైసూరు రాజ్యములోని పట్టడకల్, హాలేబీడు, ఐహోలు లందలి చాళుక్య దేవాలయములను, కాంచీవరములోని కైలాస నాధాలయమును బోలియున్నవి. 'చండీ జాగో, అను జావాదేవాలయమున విష్ణువర్థనుడను రాజు బుద్దునివలె శిల్పింపబడియున్నాడు. దీనిని మఱికొన్ని శిల్పాములను బరిశీలించి ప్రాచ్యకళాకోవిదుడగు ఫెర్గుసన్ పండితుడు "ఈదేవాలయమునుండి యవద్వీపము నందలి హిందూమతమునకును' దత్సంబంధములగు శిల్పములకును, భారతదేశమునందలి తెలింగాణమును, కృష్ణానదీముఖద్వారమును, మాతృకలని స్పష్టమగుచున్న" దని వ్రాసియున్నాడు. ఇట్టి శిల్పములు ప్రాంబనం, బెనన్ అనుచోట్లగూడ గలవు. ప్రాగ్భారతదేశమునందలి శిల్పములలోనెల్ల జావాలోని బొరొబుదుర్ దేవాలయ మగ్రగణ్యము ఒకకొండను దొలిచి, శిఖరమున నొక స్థూపమును' దానిచుట్టు నేడు - స్థూపవలయములను శిల్పి యిచట నిర్మించెను. విస్మయజనకమును వర్ణనాతీతమునగు నీయాలయమును బ్రశంసించుచు ఫెర్గుసన్ పండితుడు "శిల్పవైఖరినిబట్టి చూచినచో నీబ్ రొబుదుర్‌దేవాలయమును, హిందూదేశమునందలి అజాంతాగుహలనుగూడ నొకేశిల్పి నిర్మించెననియు, నీరెంటికినడుమ కాలవ్యత్యాసము విశేషముగ నుండియుండ"దనియు వ్రాసియున్నాడు. మఱికొన్ని విషయములలో నీయాలయము పల్లవులచే మహాబలిపురమున నిర్మింపబడిన దేవాలయములను బోలియున్నది. ఇచ్చటి యాలయపుటాకృతి కాశ్మీరమునను, మళయాళమునను శాక్తేయులు రచించు శ్రీచక్రమువలెనున్నది.


_______________