భారతీయ నాగరికతా విస్తరణము/చైనాదేశము
భారతీయ నాగరికతా విస్తరణము.
5. చైనా దేశము.
ప్రాచీన సంబంధము
చైనాదేశము సంస్కృతవాఙ్మయమున 'శీనా^ యని పేర్కొన బడియున్నది. ఆదేశమునందలి భూస్వాములయొక్క 'మన్‌డరిన్' అను నామము సంస్కృతమునందలి 'మంత్రిన్' శబ్దభవము. క్రీ. పూ. 218 లో అశోకచక్రవర్తిచే బంపబడిన పదునెన్మండుగురు బౌద్దభిక్షువులు చైనాదేశపు రాజధాని కేగిరి. క్రీ. పూ. 2 వ శతాబ్దిలో చైనాదేశమున 'హ్యాన్' (Han) వంశము ప్రాముఖ్యతనందెను. ఈకాలమున చైనాకు పశ్చిమమున హూణులు, యూఎచీలునుండిరి. వీరివలన తనదేశమున కుపద్రవము గలుగకుండు నటులొనర్చుటకై 'వూ' యను హ్యాన్ చక్రవర్తియొక సేనానాయకుని బశ్చిమమున కంపెను. ఈతడు 12 సంవత్సరముల కాలము తిరిగి ఫేర్‌ఘానా, పార్థియా, బాక్ట్రియామున్నగు నెన్నియో దేశములను జూచి చక్రవర్తికి నివేదించెను. బాక్ట్రియాలోనుండగా నాతడు చైనాలోని దక్షిణభాగమునుండి బాక్ట్రియామీదుగను "సింధు" (హిందూ) దేశముమీదుగా ఆఫ్‌గనిస్థానమునకు వర్తక మార్గములుండుట గాంచెను. ఈవార్తను వినినపిమ్మట చైనాచక్రవర్తి హూణులను దఱిమి వారిదేశమును జయించి, దక్షిణమునుండి హిందూదేశమున కొకమార్గము నేర్పరుప బ్రయత్నించెను. క్రీ. శ. 73 లో చైనాదేశీయులు ఫెర్గానానుజయించి, కుచాయనుచోట నొక రాజప్రతినిధిని నెలకొల్పిరి. ఇందుమూలమున చైనానుండి ఇండియాకు పోవుమార్గము సురక్షితముగ నుండినది. బౌద్దమతము క్రీస్తుశకమునకు బూర్వమే చైనాను ప్రవేశించెను. క్రీ. పూ. 218 లో అశోకుడు భిక్షువుల నంపెను. క్రీ. పూ. 121 లో క్యూపిన్‌గస్ అనుసేనాని హూణులతో యుద్ధముజేయునపు డొక బంగారపు బుద్దవిగ్రహమును సంపాదించెను. క్రీ. శ. 68 లో నెక హ్వాన్ చక్రవర్తి బౌద్దులను గొనితెచ్చుటకై యనుచరులనంపగా వారు హిందూదేశమునుండి కశ్యపమతంగ, ధర్మరత్న యనువారలను రాజధానికి గొనిపోయిరి. ఇదేసమయమున బాక్ట్రియను రాజులవద్దనుండి యొక రాయబారి బౌద్దగ్రంథము నొకదానిని చైనాకు దెచ్చెను.
మార్గములు
పూర్వకాలమున నేటివలె హిందూదేశము చైనాదేశపు దక్షిణపశ్చిమ సరిహద్దువరకును వ్యాపించియుండలేదు. ఈరెండుదేశములకును నడుమ నెన్నియోరాజ్యము లుండెడివి. భారతీయ బౌద్దమతము చైనాదేశమున వ్యాపించుట కీమధ్యనుండిన చిన్నచిన్న రాజ్యములు విశేషముగ దోడ్పడినవి. గాన ఏవిమధ్యనుండి యాకాలమున హిందూచైనాదేశములకుగల మార్గములను గుర్తింపవలసియున్నది. ఇట్టివి నాల్గుమార్గము లుండెడివి.
(1) టర్కీస్థానమార్గము :- చైనాలోని లాబ్‌నార్ సరస్సునకు పశ్చిమమునను, హిందూదేశములోని కాశ్మీరమున కుత్తరమునగల హిమాలయములకు పైనున్న పామీర్ పర్వతములకును దూర్పునను, టిబెట్‌దేశమున కుత్తరమునను, టారిమ్‌మైదానము గలదు. ఈ మైదానమున క్రీ. పూ. 2 వ శతాబ్దమున 36 చిన్న రాజ్యము లుండెడివి. కాన్‌క్పా రాజ్యములోని టుఎన్ హోన్‌గ్ అనుపట్టణమునుండి టారిమ్‌మైదానముమీదుగా పశ్చిమమునకు రెండుమార్గములుండెడివి. పురుషపురము (Peshawar) వలెనే క్రీస్తుశకారంభమునం దీ నగరమనేక జాతులవారి నాకర్షించి వివిధనాగరీకతలను మేళవించినది. 3 వ శతాబ్దమునం దిచ్చట భారతీయులు గొందరు స్థిర పడిరి. చైనాలో 'వెయ్' వంశీయులుపాలించుకాలమునం దీనగరమున భారతదేశబౌద్దమతము ప్రబలినది. చుట్టుపట్లనుండు కొండలలో గుహలను దొల్చి శిల్పులు వేయి బౌద్దాలయములను నిర్మించిరి. ఇటీవల బరిశోధకులు వీనిని దెఱచి యాశిల్పములను, కుచియను, కోటానీ, సిరియను, టిబెటను సంస్కృతభాషలలో లిఖింపబడిన గ్రంథములను, గన్గొనిరి. టుఎన్ హున్‌గ్ నగరమునుండి యొకదారి లాబ్‌నార్ సరస్సునకు దక్షిణమునగల షాన్‌షాన్‌కేగి యటనుండి టారిం నదీతీరముననుసరించి యార్‌ఖండ్‌కును, అటుపై పామిర్ పర్వతములను దాటి బాల్‌ఖ్, పార్దియామొదలగు టర్కీస్థానదేశములకు నేగుచుండెను. మఱియొకదారి టారింనదీతీరము ననుసరించి ఖోటానుకు పోయి, వామిర్ పర్వతములనుదాటి, సమర్‌కండ్ మీదుగాబశ్చిమమునకు బోవుచుండెను. క్రీ. శ. 4 వ శతాబ్దమున హిందూ దేశమునకు వచ్చిన ఫాహియాన్ అను చైనాదేశయాత్రికుడు టుఎన్‌హోన్‌గ్ నుండి టారింమార్గమున కరషస్, ఖోటాన్ కాష్‌ఘర్‌లమీదుగా వచ్చి పర్వతములను దాటి గిల్‌గిట్ నదీతీరము ననుసరించి సింధుప్రాంతమును జేరెను. 7 వ శతాబ్దమున హ్యూన్‌ష్వాంగ్ అనునతడుగూడ చైనాలోని టుఎన్‌హున్‌గ్ నుండి బయలుదేరి కరషర్, కుచమీదుగానేగి బెడల్‌కనుమగుండా ఇస్సికుల్ నదిని చేరెను. ఇంతకుపూర్వము నాలందానుండి ప్రభాకరమిత్రుడనుభిక్షువుయిటకు వచ్చి, కొంతకాలమునకు బిమ్మట చైనా కేగియుండెను. ఈ యాత్రికు డిటనుండి సోగ్డియాకేగి యటనుండి కప కుబోయి, హిందూకుష్ పర్వతమును దాటి హిందూదేశమును బ్రవేశించెను.
(2) అస్సాం మార్గము :- అస్సాం, ఉత్తరబర్మాలమీదుగా హిందూ దేశమునుండి దక్షిణచైనాకు మఱియొకమార్గముండెడిది. కాని యిందు దుర్గమములగు పర్వతములును' క్రూరజంతువులును, క్రూరతములగు నడవిజాతివారు నుండుటచే నీమార్గము బ్రసిద్దికెక్కి యుండలేదు. క్రీ. శ. 7 వ శతాబ్దిలో హ్యూన్‌ష్వాంగ్ కామరూపము (Assam) లో నుండుగా 618 లో చైనాదేశమున గల్పింపబడిన యొకబాట 638 నాటికి అస్సాంకు వ్యాపించెననియు, నాదేశమునుండి దక్షిణచైనాకు రెండునెలలలో గొనిపోవు మార్గమొకటిగలదనియు వినెను. కియటన్ అను 8 వ శతాబ్దపు చైనాగ్రంథమునుండి యీ మార్గమునుగూర్చి కొన్నివివరములు తెలియుచున్నవి. అయ్యది చైనాకు దక్షిణమునందున్న టాన్‌కిన్‌నుండి బయలుదేరి యూనన్ చేరి, యటనుండి పశ్చిమముగనేగి, సలోఎస్ నదిని దాటి చౌకొలీన్‌గ్‌కు పోవుచుండెను. అది యొక ముఖ్యస్థానము. ఇటనుండి యీదారి రెండు శాఖలయ్యెను. ఒకశాఖ యిచ్చటనుండి బర్మాలోని మాండిలేకేగి, పేగన్ ప్రోంలమీదుగా అరకన్ పర్వతములనుదాటి అస్సాము బ్రవేశించుచుండెను. రెండవశాఖ దక్షణముగా ఐరావతీముఖ ద్వారమువరకునేగి పిమ్మట అస్సాముకు బోవుచుండెను.
(3) టిబెట్ మార్గము ;- క్రీ. శ. 7 వ శతాబ్దములో ఇండియానుండి చైనాకు మరియొకమార్గము నిర్మింపబడెను. అప్పటి టిబెట్‌రాజగు స్ట్రాంగ్‌ట్సన్ గంపో యనునతడు చైనారాజపుత్రికను బెండ్లియాడుటచే హిందూ చైనాదేశములకు దరచు రాకపోకలు జరుగుచుండెడివి. క్రీ. శ. 627 లో ప్రభాకరమిత్రుడను నాలందావిధ్యాపీఠ పండితుడు టిబెట్‌మార్గమున చైనా కేగి యచ్చట బౌద్దమతమును వ్యాపింపజేసెను. అదేసంవత్సరమున హ్యూన్‌ఖౌ అను చైనాశ్రమణుడొక డీమార్గముననే భారతదేశమునకు వచ్చెను. చక్రవర్తి శ్రీహర్షుని రాజ్యకాలమునం దీదేశమునకేతెంచిన హ్యూన్‌ష్వాంగ్‌కూడ నీమార్గమునే యనుసరించెను. ఆచక్రవర్తి యనంతర మిదేమార్గమున వచ్చి టిబెట్ నేపాళదేశముల సేనలు హిందూదేశమున విజయములను గాంచినవి. కాని 650 లో 'గంపో, చనిపోయినపిమ్మట టిబెట్ చైనాదేశములకు నిరంతరశాత్రవ మేర్పడుటచే నీమార్గము కట్టువెడెను.
(4) సముద్రమార్గము :- క్రీ. శ. మొదటిశతాబ్దమునుండియు చైనా హిందూదేశములకు రాకపోకలు జరుగుచుండెడివి. చైనాదేశీయుల గ్రంథ ములలో నాకాలమున కౌండిన్యుడను హిందూబ్రాహ్మణుడు ఇండోచైనాలోని 'ఫోనన్' (Faunan) దేశమునకేగి, యచ్చట రాణిని వశపరచుకొని పెండ్లియాడెనని యున్నది. అంతటినుండియునీ ప్రదేశమొక హిందూరాజ్యమయ్యెను. చైనాదేశ చరిత్రకారు లీవిషయము క్రీ. శ. 1 వ శతాబ్దములో జరిగెనని వ్రాసియున్నారు. ఈ కాలమున హిందూదేశమునందలి భరుకచ్చమను రేవుపట్టణమునుండి చైనాలోని 'టాన్‌కిన్' నగరమునకు సముద్రమార్గమున వర్తకము జరుగుచుండెడిది. 2 వ శతాబ్దిలో ఇప్పటి అవ్నాం దేశమున 'చంపా' యను మరియొక హిందూరాజ్యము స్థాపింపబడినది. మరుసటిశదాబ్దిలో భారత దేశమునందలి మురుండ రాజునకును చైనాకును రాయబారములు జరగినవి. 5 వ శతాబ్దిలో ఫాహియన్ హిందూదేశమునకు వచ్చినప్పటికి తామ్రలిప్తీనగరము గొప్ప నౌకావాణిజ్యకేంద్రముగ నుండి చైనాతో వర్తకము జరుపుచుండెను. ఇచటినుండి గుణవర్మ, పరమార్దుడు, మున్నగువారెందరో మతప్రచారమునకై హిందూచైనాదేశములకు తరచు ప్రయాణము జేయుచుండిరి.
నాగరికతా విస్తారకులు
ఇంతవరకును భారతదేశమునకును చైనాకును ప్రాచీనకాలమున సన్నిహిత సంబంధముండెడిదనియు, నీదేశములమధ్య ననేక మార్గములుండెడివనియు నిరూపించియుంటిమి. అనేక సమయములలో ననేక జాతుల వారలు భారతీయ నాగరికతను చైనాదేశమున విస్తరింపజేసిరి. ఇటుపైనీనాగరికతా ప్రచారముయొక్క చరిత్రము వివరింపబడును.
మధ్యఆసియా జాతులు :- (1) ఇండోసిథియనులు - చైనాదేశీయులు హూణుల బాధపడజాలక దమకు బశ్చిమమునుండి యీశత్రువులను ద్రొక్కిపెట్టగల యొక రాజ్యముతో స్నేహము జేసికొనుటకై యత్నించిరి. ఈ సిథియనుల రాజ్య మట్టిది. క్రీ. శ. 1 వ శదాబ్దిలో నీరెండురాజ్యముల కును సంబంధ మేర్పడెను. క్రీ. పూ. 21 వ శతాబ్దములో నీసిథియను రాజు చైనా చక్రవర్తి కొక బౌద్దగ్రంథము నంపెను. ఇదియే యాదేశపు బౌద్దమతపరిచయమునకు ప్రారంభము. క్రీ. శ. 1 వ శతాబ్దిలో సిథియనులు హిందూదేశమును జయించి, పంజాబునుండి బశ్చిమోత్తరమున ఆక్సన్ నదీతీరమువరకునుగల భూభాగమునం దొక సామ్రాజ్యమును నిర్మించిరి. మధ్యఆసియాలో వీరికిని చైనాకును సరిహద్దుల విషయమున సంఘర్షణ మొదవినది. ఈ సన్నిహీతత్వమువలన భారతీయ నాగరికత సథియను సామ్రాజ్యముగుండ చైనాకువిస్తరించుట కవకాశమేర్పడెను. ఇండోసిథియను భిక్షువు లనేకులు చైనాలో బౌద్దమతమును ప్రచారము చేసిరి. క్రీ. శ. 68 లో కశ్యప మతంగ ధర్మ రక్షయను వార లీకార్యమును నిర్వర్తించిరి. క్రీ. శ. 147 లో లోకక్షేముడను నొక విద్వాంసుడు చైనా కేగి మహాయాన గ్రంథముల నెన్నిటినో యాదేశభాషలోనికి బరివర్తించెను. దీచ్చౌకియన్ అను నొక సిథియను భిక్షువు క్రీ. శ. 100 లో చైనాదేశమునకు బోయి యట నూరు బౌద్దగ్రంథములను భాషాంతరీకరించి, దక్షిణచైనాలో బౌద్దమతమును విశేషముగ విస్తరించెను. ఈ మతప్రచారకులలో నెల్ల క్రీ. శ. 3 వ శతాబ్దినాటి ధర్మరక్షుడను భిక్షువగ్రగణ్యుడు. ఈతడు పెక్కుభాషలను నేర్చెను. హిందూ విద్వాంసునివద్ద విద్యనభ్యసించెను. బహుభాషావిదుడగు నీభిక్షువు 284-313 ల నడుమ రెండువందల సంస్కృతగ్రంథములను చైనాభాషలోనికి బరివర్తించెను. (2) పార్థియనులు :- క్రీ. శ. 2 వ శతాబ్దమున పార్థియను రాజగు మొదటి మిత్రడేటిస్ తన రాజ్యమును హిందూదేశమునందలి జీలంనదివరకును వ్యాపింపజేసెను. అంతటినుండియు నీరెండు దేశములకును సంబంధము గలిగినది. అందుమూలమున పార్థియనులు బౌద్దతత్వమును గ్రహింపగలిగిరి. క్రీ. శ. 138 లో నొక పార్థియనురాజు రాజ్యమును ద్యజించి గొన్ని బౌద్దగ్రంథములతో చైనాదేశమున కేగి, యచ్చట విశేషముగ బరిశ్రమచేసి, బౌద్దగ్రంథ భాషాంతరీకరణమునకై యొక సంఘము నేర్పరచెను. ఈతడు లోకోత్తముడని పిలువబడుచుండెను. ఉగ్రపరిపచ్చ, ద్వాదశనిదాన మున్నగు నుద్గ్రందము లీతని నిర్దేశమున బరివర్తింపబడినవి. ఇదేకాలమునం దొక చైనాదేశభిక్షువు మిక్కిలి ప్రఖ్యాతి నందెను. మహామేధావియగు నీతడు సంస్కృతమున బాండిత్యమును సంపాదించి, ప్రతిమోక్షము మున్నగు గ్రంథముల నెన్నిటినో గంఠస్థముల జేశికొని, మహాయానబౌద్దము ననేకవిధముల బ్రచారముజేసెను. ఈతడు ఆచార్యబుద్దదేవుడని పిలువబడుచుండెను. (3) సోగ్డియనులు :- మధ్యఆసియాలో ప్రాముఖ్యతనందిన యొక జాతికిజెందియుండిరి. కృషియువాణిజ్యమును వీరికి ముఖ్యవృత్తులు. పర్షియనుల మతగ్రంథమగు అవెస్టాలో నీసోగ్డియనులు మగధదేశీయులుగ పేర్కొనబడియున్నారు. హిందూదేశమునకు సమీపము నందుండుటచే వారు క్రీస్తుశకారంభమున కీబౌద్దమత బరిచయమును గల్గియుండిరి. ఇటీవల మధ్యఆసియాలో నెన్నియో బౌద్దగ్రంథములకు సోగ్డియనుభాషలో భాషాంతరీకరణములు లభించినవి. క్రీ. శ. 3 వ శతాబ్దిలో సెంగ్‌హుయీ యనునాతడు చైనాకువెడలెను. ఇతనిబూర్వులు హిందూదేశమున స్థిరపడిరి. నాన్‌కింగ్ నగరమునకేగి యీప్రచారకు డొక విహారమును నిర్మించుకొని యటనుండి మతబోధ చేయదొడగెను. (4) కుచియనులు :- వీరు పూర్వముటారింనదీతీరమున నివసించుచుండిరి. మధ్యఆసియానుండి చైనాకుబోవు వర్తకమార్గములన్నియు కుచియనురాజ్యము మీదుగనే బోవుచుండినవి. త్వరలో హిందూదేశమునుండి మతప్రచారకు లీవర్తకమార్గముల ననుసరించి, కుచరాజ్యమును చేరిరి. క్రీ. శ. మూడవశతాబ్దమునం దీనగరమున 1000 బౌద్దస్థూపము లుండెడివనియు, బౌడ మతము బ్రబలముగ నుండినదనియు, దెలియుచున్నది. కుమారయను డను నాతడు హిందూదేశమునందొక రాజ్యమున మంత్రిగనుండెను. కొంత కాలమునకు బిమ్మట విరాగియై యీతడు మతప్రచారముచేయు సంకల్పముతో కుచియనురాజ్యమునకేగెను. రాజీతని నధికముగ గౌరవించి తనకు గురువునుజేసికొనెను. కొలదికాలమునకే రాజుపుత్రిక యీప్రచారకుని పెండ్లి యాడెను. వీరికి కుమారవిజయుడు బుట్టెను. పిమ్మట నా రాజపుత్రిక బౌద్దమతమునవలంబించి, కుమారవిజయుని విద్యాభ్యాసమునకై కాశ్మీర దేశమునకేగి, కొంతకాలమట నివసించెను. విద్యాభ్యాసము ముగిసినపిమ్మట గుమారవిజయుడు చైనాకు మరలివచ్చి క్రీ. శ. 401 నుండి బండ్రెండు సంవత్సరములకాలము మతప్రచారమొనర్చెను. ఈతడీకాలమున సూత్రాలంకారశాస్త్ర దశభూమువిభాసాశాస్త్ర, శతశాస్త్ర, సత్యసిద్దిశాస్త్రాది మహాయాన గ్రంథముల నెన్నిటినో భాషంతరీకరించి, వసుబంధు, నాగార్జు నాశ్వఘోషాది మహనీయులను చైనాదేశీయులకు సుపరిచితుల నొనర్చెను. (5) కోటానీయులు :- కోటాన్ అనుదేశము సాధారణముగ చైనాదేశీయులు భారతదేశమునుండి స్వదేశమునకు మరలునపు డనుసరించు దక్షిణ మార్గమునందున్నది. సంస్కృతవాఙ్మయమునం'దీదేశము 'కుష్టన' యని పేర్కొనబడియున్నది. హిందూదేశమునకు సమీపముగ నుండుటవలనను ఆఫ్‌గనిస్థానము నుండియు, కాశ్మీరమునుండియుగూడ నీదేశమునకు మార్గములుండుట వలనను, భారతీయులెందరో యిట నివసించుటయు, నీదేశపుభాషలో విశేషముగ సంస్కృతిపదములు గలియుటయు దటస్థించినవి. నాణెములనుండి యీదేశమునకు క్రీ. శ. 1 వ శతాబ్దిలోనే భారతీయసంపర్కము గల్గెనని తెలియుచున్నది. ఇచ్చట ఖరోష్ఠీలిపిలో వ్రాయబడిన ప్రాకృతలేఖలు దొరికినవి. క్రీ. శ. 259 లో ట్చౌషిహింగ్ (Tchou-she-hing) అను నొక చైనాదేశభిక్షు చైనాభాషలోనికి బరివర్తింపబడిన బౌద్దగ్రంథముల పట్టికను దయారుచేయుటకును, నూతనగ్రంథములను సమర్థులగు వారివద్ద నేర్చుటకునై కోటానుకువచ్చెను. క్రీ. శ. 291 లో మొక్సలుడను (Moksala) భిక్షు నిటనుండి చైనాకేగి పంచవింశతి సహస్రికప్రజ్ఞాపరిమిత, యను మహాయాన గ్రంథమును భాషాంతరీకరించెను. ఐదవ శతాబ్దిప్రారంభమున న్గన్‌యంగ్ (Ngan yang) అను నొక చైనారాజపుత్రుడు కోటానుకేగి, గోష్ఠుతి మహావిహారములో బుద్దసేనుడను భిక్షువువద్ద మహాయానమును నేర్చెను. ఇదేకాలమున చైనాదేశములో మతప్రచార మొనర్చుచుండిన ధర్మక్షేముడను భారతీయభిక్షువు, మహాయాన గ్రంథమగు మహాపరినిర్వాణ సూత్రమును భాషాంతరీకరించునపుడు కోటానుదేశమున కెన్నియోసారులు యాత్రలనుజేసెను. క్రీ. శ. 493 లో నీదేశమున జరగిన పంచవార్షిక సభకు, చైనాభిక్షువులుగూడ వచ్చి కొన్ని యుద్గ్రంథములను సంపాదించిరి. సర్వవిధముల నీకాలమున కోటాన్‌దేశ మొక సుప్రసిద్ద విద్యాస్థానముగ నుండినది. ఇటనుండియే గొన్నివిజ్ఞానకిరణములు చైనాపైబ్రసరించినవి.