భారతీయ నాగరికతా విస్తరణము/మధ్య ఆసియా

భారతీయ నాగరికతా విస్తరణము.

4. మధ్య ఆసియా.

భారతీయ నాగరీకత ప్రాచీనకాలమునం దనేక దేశములకు విస్తరించినది. అందొకశాఖ సింధునదీతీరమునుండి ప్రకృత ఆఫ్‌గనిస్థానము మీదుగా మధ్యఆసియాకేగి, యటనుండి చైనాదేశమును జేరినది. ఇటీవలి యార్షపరిశోధనలచె మధ్యఆసియాలోని భారతీయనాగరికతా విస్తరణమును గూర్చి విశేషాంశములు దెలియనగుచున్నవి. ఈభాగమునకిపుడు "చైనీస్ టర్కీస్థాన్" అని పేరు. దీనికుత్తరమున చెన్‌షాన్ పర్వతములును, దక్షిణమున కున్‌లున్ పర్వతములును, పశ్చిమమున వామిర్ పర్వతములును, దూర్పున నాన్‌షాన్ పర్వతములును గలవు. అనగా నీభూభాగము టిబెట్ కుత్తరమునను, చైనాకు బశ్చిమముగను, కాశ్మీరమునకు బ్రాగుత్తరముగ నుండును. ఇయ్యది బ్రాక్పశ్చిమముగ 1500 మైళ్ళదూరమును, ఉత్తరదక్షిణముగ 600 మైళ్ళదూరమును వ్యాపించియుండును. ఇందలి విశేషభాగము పర్వతములతోడను, యెడారులతోడను నిండియున్నది. అయిన నీప్రదేశము ప్రాక్పశ్చిమనాగరీకతలకు సంగమస్థానముగ నుండెను. చైనానుండి పశ్చిమమునకేగు మార్గము లీమద్యఆసియామీదుగనే పోవు చుండెడివి. హ్యూన్‌ష్వాంగ్, షాహియన్ మున్నగు విదేశయాత్రికు లీదేశముమీదుగనే భారతదేశమున కేతెంచిరి.

ఈమధ్యఆసియాకును హిందూదేశమునకునుగల చరిత్రాత్మకమగు సంబంధమును వర్ణించుటకు బూర్వమీప్రదేశమును బరిశీలించుటకై బండితులొనర్చిన పరిశ్రమను దానిఫలితమును సంగ్రహముగ బరీక్షింప వలసియున్నది. 1879 సంవత్సరమున రిగెల్ అనునొక జర్మనీదేశపువృక్ష శాస్త్రజ్ఞుడు మధ్యఆసియా కేగెను. అతని నివేదికలనుండి ఈభాగమున ప్రాచీనశిధిలములు లభించుననెడియాస బయల్వెడలినది. 1890 లో కల్నల్ బవర్ అనునత డిచ్చట భూర్జపత్రములపై లిఖింపబడిన యొక వైద్యగ్రంథమును సంపాదించెను. క్రీ. శ. 4 వ శతాబ్దమునాటి యీగ్రంథము దొరకుట తోడనే హైందవ విజ్ఞాన పరిశోధకులలో నూతనోత్సాహ ముదయించెను. క్రీ. శ. 1892 లో నొక ఫ్రెంచిదేశీయుడు గోశృంగవిహార మనుచోట ఖరోష్ఠి లిపిలో వ్రాయబడిన క్రీ. శ. 2 వ శతాబ్దినాటిదగు ప్రాకృతధర్మపదమును సంపాదించెను. క్రీ. శ. 1901 లో ఇండియా ప్రభుత్వమువారు సర్. అరల్ స్టెయిన్ అను నతనిని మధ్యఆసియాకు బంపిరి. ఈతడిచ్చట నమూల్యములగు శిధిలములను, చారిత్రక విషయములను గనిపెట్టి ప్రపంచమునకు క్రొత్తవింతల నెన్నిటినో దెలియజేసెను. క్రీ. శ. 1902 - 1906 ల నడుమ జర్మనులుగొందరు మధ్యఆసియాలో బరిశోధన మొనర్చి బౌద్దశిల్పములను సంస్కృత చైనా సిరియను సోగ్డియను భాషలలో లిఖింపబడిన గ్రంథములను గన్గొనిరి. క్రీ. శ. 1906 లో రెండవతూరి స్టెయిన్ యీప్రదేశమునకు యాత్రచేసి "వేయిమందిబుద్దులగుహ" (Grottos of the Thosand Buddhas) లని పిలువబడు బౌద్దవిహారములను, వానిలో క్రీ. శ. 11 వ శతాబ్దమునుండియు పదిలపరుపబడి యుండిన యొక బౌద్దగ్రంథాలయమును గనుగొనెను. ఇచ్చట గాంధారము నందలి కళనుబోలు శిల్పచిత్రలేఖనా కళలగూడ నుండినవి. పిమ్మట రష్యా, ఫ్రాన్సుదేశీయులుగూడ నీమధ్య ఆసియా బరిశోధనలలో బాల్గొనిరి. ఈపరిశోధనలనుండి యీప్రాంతమున భారతీయములగు బ్రాహ్మీఖరోష్టిలిపులును, ఒకతరగతి ప్రాకృతభాషయు, బౌద్దమతమును, వ్యాప్తిలో నుండెడివని స్పష్టమగుచున్నది. మధ్య ఆసియాయందలి భారతీయనాగరికతా చరిత్రమును రచించుటకు దగిన యాధారము లింకను లభింపవలసియున్నవి. అయినను పరిశోదకుల కీప్రదేశమున దొరకిన వివిధవస్తువులనుండి యీప్రదేశములపై హిందూదేశము దన ప్రభావమును జూపినవిదమునుగూర్చి కొన్ని విశేషాంతములు దెలియుచున్నవి. కాన నీవస్తువులను క్లుప్తముగా వర్ణింపవలసియున్నది.

(1) ప్రాకృతధర్మపదము :- ఇయ్యది బెరడును లేఖ నాయోగ్యముగ నొనర్చి దానిపై వ్రాసిన గ్రంథము. దీనిని క్రీ. శ. 1892 లో నిప్పటి కోటానుకు సమీపమునందున్న గోశృంగవిహారమను గుహలో నొక ఫ్రెంచి దేశీయుడు గనుగొనెను. క్రీ. శ. 3, 4 శతాబ్దములవరకును బశ్చిమోత్తర భారతదేశమున వ్యాప్తిలోనుండిన ఖరోష్ఠిలిపిలో నీగ్రంథము వ్రాయబడియున్నది. అక్షరవిన్యాసమునుబట్టి పండితు లీగ్రంథము క్రీ. శ. 2 వ శతాబ్దినాటిదని నిర్ణయించినారు. ఇందలి ప్రాకృతభాష నూతనము. ఇంతవరకును పరిశోధకులకు పాళిసంస్కృతభాషలలో మాత్రమే ధమ్మ పదము లభించియున్నది.

(2) ఖరోష్ఠీ ఫలకములు :- మధ్యఆసియాలోని శిదిలములలో నెన్నియోదారుఫలకములు దొరికినవి. వీనిలో కొన్ని వలయాకారములు, మఱికొన్ని చతురస్రములు. ఇందుమొదటివానికి 'కీలముద్ర' లనిపేరు. 7 మొదలు 15 అంగుళములవరకును పొడవుగల రెండుపలకములు ఒకధారముచే కట్టబడి, పైఫలకమునం దొక మట్టిముద్ర వేయబడియున్నది. ఇందు "మహానుభావ, మహారాజ" యని పిలువబడు రాజు, కొన్ని వ్యవహారములను బరిష్కరించునెడ స్థానికోద్యోగుల కిచ్చిన యాజ్ఞలు లిఖింపబడినవి. పరిపాలనావత్సరమును, ఆజ్ఞను నిర్వహింపవలసిన యుద్యోగి నామమునుగూడ నిందుగలవు. చతురస్రములగు ఫలకములు సుమా రొక గజమువరకునుగూడ నిడివిగలవై యున్నవి. వీటికిని మృణ్ముద్రగలదు. ఇందొక తరగతి ఫలకము లుద్యోగుల కొసగబడు నాజ్ఞలనుదెల్పునవిగ నున్నవి. మఱిగొన్ని బ్రజలు దమలోదాము జేసికొనిన యొడంబడికలను దెల్పుచున్నవి. వీనిలో సంవత్సరము లీయబడినవి.

(3) చర్మలేఖలు :- మధ్యఆసియాలో నీకాలమున చర్మములుగూడ వ్రాయుటకై యుబయోగింపబడు చుండెడివి. ఈసందర్భమునం దుపయోగింపబడిన కఱ్ఱకలములును సిరాపాత్రములు నెన్నియో గనుగొన బడినవి. ఈచర్మలేఖలలో రెండుతరగతు లున్నవి. కొన్ని యున్నతోద్యోగుల సామాంతులకు వ్రాసినవి. రెండవ తరగతివానికి "వింసదిలేఖ" లని పేరు. అయ్యవి సాధారణముగ రాజుచే వ్రాయబడినవి. వీనిలో సంవత్సరములు గాక మాసములును రోజులును ఉదహరింపబడి యున్నవి.

(4) కాగితపు టుత్తరములు :- ఇవి కొలదిగ మాత్రము లభించినవి. ఇందలిభాష ప్రాకృతము. లిపి ఖరోష్ఠి

(5) పట్టువస్త్రములపై లేఖలు :- క్రీ. శ. 105 నుండియు చైనాలో పట్టుగుడ్డలను వ్రాయుటకై యుపయోగించుచుండిరి. లేఖలు ప్రాకృతభాషలో ఖరోష్ఠిలిపిలోనున్నవి. ఇందు చాలవరకును సాధారణలేఖలు. కొన్నిదేవాలయములపై నుండెడి జండాలు. ఒకలేఖలో నొకడు తనయాప్తుని యారోగ్యమునకై గావించిన ప్రార్థనగలదు. ఇందు "అరుఘ దచిన ఏభవదు" (ఆరోగ్యదక్షిణాయై భవతు) అని వ్రాయబడియున్నది. ఇట్టివాక్యము హిందూదేశములోని కుషాన్‌రాజుల శాసనములలోగూడ గలదు.

ఇటుపై నచ్చటనే దొరకిన బ్రాహ్మీలిఖితవస్తువులను వర్ణింపవలసి యున్నది. బ్రాహ్మీలిపి భారతదేశమునం దెక్కుడు వ్యాప్తినిజెంది యాధునిక లిపుల కెన్నిటికో మాతృకగ నున్నది. భారతీయనాగరికతతోబాటుగ నీ లిపిగూడ విదేశములకేగినది. దీనిలో వ్రాయబడిన గ్రంథములెన్నియో మధ్య ఆసియాలోదొరికినవి. ఈగ్రంథములన్నియు సంస్కృతభాషలోనివే. ఇందు మూడురకముల లిపి గలదు. మొదటిది కుషాన్, గుప్తవంశీయుల కాలమునందుండిన పరిశుద్దమగు భారతీయ లిపి. అశ్వఘోషుని నాటకములును, కుమారలాతుని కల్పనామణ్డితికా యను గ్రంథము నీలిపిలో రచింపబడినవే. రెండవది ఏటవాలుగానుండు గుప్తలిపి, (Slanting Gupta Script) కుచ, టర్‌పన్ మున్నగుచోటుల దొరకిన గ్రంథము లీలిపిలోనివే మూడవది ఋజుగుప్తలిపి. (Upright Gupta Script) కోటాన్ దేశములోని సంస్కృతగ్రంథము లీలిపిలోనివి. ఈవివిధ లిపులలోనివై మధ్యఆసియాలో దొరికిన సంస్కృత లిఖితగ్రంథములలో నారుమాత్రము ముఖ్యములైనవి.

(1) అశ్వఘోషుని నాటకములు :- ఇంతవరకును మహాయాన బౌద్దమతమునకు మూలస్తంభముగనొప్పు నీమహా విద్వాంసుడు బుద్దచరిత్ర సుందరానందాది కావ్యములను, తత్త్వగ్రంథములను రచించెనని మనకు దెలియును. కాని యీమధ్య ఆసియాపరిశోధనల మూలమున నీత డొక గొప్పనాటక రచయిత యనువిషయము బయల్వెడలినది. ఈదొరికిన నాటకములలో "శాలిపుత్ర ప్రకరణ" మనునది మొదటిది. వినయపెటకము నందలి మహావగ్గమునుండి యిందలి కథాభాగము గైకొనబడినది. ఇందు బుద్దుడు, శాలిపుత్రుడు, మౌద్గలాయనుడు, కౌండిన్యుడు ననువారలు ముఖ్యపాత్రులు. రెండవనాటకము నైతికము. ప్రబోధచంద్రోదయము నందువలె దీనిలో బుద్ధి, దృతి, కీర్తి యనుపాత్రలు బౌద్దధర్మమును బోధించుచున్నవి. మూడవదానిలో మొదటినాటకములోని పాత్రలేగాక నొక యోగి, యొకబ్రాహ్మణుడు, నొక విదూషకుడునుగూడ గలరు. ఇందలి రంగములు మగధరాజ్య కేంద్రమగు రాజగృహములో స్థాపింపబడినవి. ఇందు పాత్రోచితముగ సంస్కృత ప్రాకృతభాషలు నుపయోగింప బడియున్నవి. (2) ఉదనవగ్గము :- ఈగ్రంథముయొక్క భాగములు వివిధ స్థలములలో దొరికినవి. చెట్లబెరడుతో తయారుచేసిన పుటలపై మసితో వెడల్పగు కలముతో నీగ్రంథము లిఖింపబడినది. లిపినిబట్టి యియ్యది క్రీ. శ. 2 వ శతాబ్దమునాటిదిగ గన్పట్టుచున్నది. ఇయ్యది బౌద్దులలో సర్వాస్తివాదులకు ముఖ్యగ్రంథము. ముప్పదిమూడు ప్రకరణములుగల యీ గ్రంథములో 1000 శ్లోకములుగలవు. ధర్మత్రాతయను నత డీగ్రంథమును రచించెను, ప్రకరణ పదమను గ్రంథమును రచించి, కనిష్కునిచే గావింపబడిన బౌద్దసంఘ సమావేశమున కధ్యక్షుడుగ నుండిన వసుమిత్రుని కీతడు మేనమామ. ఉదనవగ్గము మిగుల ముఖ్యమగు గ్రంథమగుటచే దానిపై నెన్నియో వ్యాఖ్యానములును భాషాంతరీకరణములును బయల్వెడలినవి.

(3) కల్పనామండితిక :- కుమారలాతుడు దీనిని రచించెను. ఇయ్యది దుబ్బుకలముతో తాళపత్రములపై లిఖింపబడినది. ఇయ్యది క్రీ. శ. 300 ప్రాంతమున పశ్చిమోత్తర భారత దేశ మున నిర్మింపబడి పిమ్మట మధ్యఆసియాకు గొనిపోబడెనని పండితుల యభిప్రాయము.

(4) బవర్‌గ్రంథము :- దీనిలో ఏడు చిన్న చిన్న గ్రంథములున్నవి. ఇందు మూడు వైద్యశాస్త్రమునకు సంబంధించినవి. వీనిలో నుల్లిపాయవలన నెన్నియోరోగములు కుదురుననియు, పూర్ణాయుర్దాయము గల్గుననియు వ్రాయబడియున్నది. జీర్ణపద్దతి, మూలికలు, కషాయములు, అంజనములు మున్నగువాని ప్రశంస యిందు గలదు. మఱియొక ఖండములో 14 వైద్యయోగములు గలవు. ఈగ్రంథభాగములలో ముఖ్యమైనది "నవనీతకము". అగ్నివేష, భేద, హారీత, జాతుకర్ణ, క్షారపాణి, పరాశరాది వైద్యశాస్త్రజ్ఞుల గ్రంథములందలి సారాంశ మీనవనీతకమున గలదు. భస్మ, తైల, కషాయ' లేపన, లేహ్యాదుల బ్రశంస యిందున్నది. ఇయ్యది సంస్కృత భాషలోశ్లోకరూపము లిఖింపబడినది.

(5) భిక్షుణీప్రతిమోక్ష :- ఇయ్యది సర్వాస్తివాద బౌద్దుల ముఖ్య గ్రంథములలో నొకటి.

(6) భిక్షుప్రతిమోక్ష :- ఇదియును సర్వాస్తివాదులకు ముఖ్యమైనదే. క్రీ. శ. 5 వ శతాబ్దములో కుమారవిజయుడు దీనిని చైనాభాషలోనికి బరివర్తించెను.



________________