భక్తిరసశతకసంపుటము/రెండవసంపుటము/సీతాపతిశతకము

పీఠిక

ఈసీతాపతిశతకము రచించినకవి సాహెబు రాణా రామన్న. ఇతఁడు వీరన్నరాజమాంబలకుమారుఁడు. భక్త్యావేశము రామభక్తి పురస్కరించికొని కవి యీశతకమును మృదుమధురశైలిలో వ్రాసియున్నాఁడు. కవికులగోత్రాదికము జీవితకాలము తెలిసికొనఁదగిన యాధారము లీగ్రంథమునఁ గానరావు. ఒకానొక రీశతకకర్త మాధ్వుఁడని యనుమానము కలుగుచున్నదని వ్రాసిరిగాని గ్రంథమునం దటు లనుమానింపఁదగిన భాగములు గోచరింపవు.

కవి యాధునికుఁ డనుటకు సంశయ ముండదు. ఇందుఁ గొన్నిపద్యములు తొలుత నీతిబోధకములై ప్రజలదుర్నయములను గర్జించునవిగ నున్నను మొత్తముమీఁద శతకమంతయు భక్తిరసపూరితమై శ్రీరామస్మరణానుభవముగ నున్నదనుట నిశ్చయము. కవితలో నందందుఁ గ్వాచిత్కముగ వ్యాకరణదోషములు గలవు. శైలి యొకచో నిరర్గళధారాశోభితముగ నొండొకచో గూరుపుబింకము లేనిదిగను గానిపించుచున్నది. కొన్నిపద్యములలో భక్తిరసోద్బోధకములగు సమకాలిక శ్రీరాముని వివిధవిధములఁ గాపాడుమని పలుతెఱంగులం బ్రార్థించుటతో గ్రంథకర్త శతకము సంపూర్తి గావించియున్నాఁడు. యౌవనమునఁ జేసిన పాపము'లకుఁ బశ్చాత్తాపము నొందుచు లోపముల క్షమించి కైవల్యప్రదాయకుఁడవు కమ్మని కవి రాముని మిగుల స్వతంత్రముగా వేఁడికొనెను. ఇందలిపద్యములు భక్తిరసద్యోతకములై భవతారకములై యలరారుచున్నవి.

కవి యంత ప్రౌఢుఁడు కాడు. గ్రంథరచనారంభమున నీశతకము వ్రాయఁబడెనేమో ధారావికలము కల్పనాక్లిష్టత పదాడంబరము చూచినఁ దోఁచును. కవితాగ్రంథముగ విమర్శింపక భక్తిరసగ్రంథముగ విమర్శింతుమేని యీశతకము విలువగలశతకములలో నొకటి యగు ననుటకు సంశయము లేదు.

అందందు వ్యాకరణదోషములు కలవు. పద్యమధ్యమునందును బాదాదియందును ననవసరములగు పదములు సంబోధనములు కొన్ని కనుపట్టుచున్నను శతకము భక్తిపరతంత్రుల కెంత జదివినను విసువు గలిగింపనంత మృదుమధురముగా నున్నది.

నందిగామ

ఇట్లు భాషాసేవకులు,

20-10-25

శేషాద్రిరమణకవులు, శతావధానులు.

శ్రీరస్తు

రాణా రామన్నకవికృత

సీతాపతిశతకము

శా.

శ్రీమద్భూమిసుతామనోహర దశగ్రీవాదినక్తంచర
స్తోమారణ్యకుఠార సర్వవిబుధస్తోత్రైకసత్పాత్ర వి
శ్వామిత్రక్రతువిఘ్నకృద్దనుజతీవ్రస్థేమసంహార దే
వా మాం పాహి యటంచు సంతతము ని న్వర్ణింతు సీతాపతీ.

1


శా.

కళ్యాణప్రదసచ్ఛరిత్ర మునిహృత్కంజాతసంచార కౌ
సల్యాగర్భసుధాబ్ధిశీతకర పాషాణస్వరూపాయితా
హల్యాశాపవిదూర సేవకనికాయాధార రక్షింపవే
కళ్యాణాచలచాపసన్నుత నమస్కారంబు సీతాపతీ.

2


శా.

లీలామానుషదేహ ఘోరరణకేళీసంతతోత్సాహ ది
క్పాలవ్రాతకిరీటసంఘటితశుంభద్దివ్యరత్నప్రభా
జాలాలంకృతపాదవారిరుహ సంసారౌఘ గాఢస్ఫుర
త్కాలాంభోధరగంధవాహజితదైత్యవ్యూహ సీతాపతీ.

3


మ.

పురుహూతోపలనీలగాత్ర వికచాంభోజస్ఫురన్నేత్ర ని

.

ర్జసందోహవిరోధియూధకుల దుర్వారాటవీవీతిహో
త్ర రతీశప్రతిపక్షముఖ్యసురబృందస్తుత్యచారిత్ర వా
సరనాథాత్మజమిత్ర నీ కిదె నమస్కారంబు సీతాపతీ.

4


మ.

ప్రమదం బొప్పఁగ నీశుభాకృతిని హృత్పద్మస్ఫురద్రత్నపీ
ఠమునం దుంచి నిరంతరంబు మదభీప్రప్రాప్తి యౌనట్లు వా
క్సుమజూలంబులఁ బూజ చేసెదను గైకోవే దయాసాంద్ర దై
త్యమదోద్రేకహరోగ్రసాయకసమూహారామ సీతాపతీ.

5


మ.

తమి నానేర్చుతెఱంగు తేటపడ నందంబొప్పఁగా వాక్ప్రసూ
నములన్ బొందికఁ గూర్చి నీ కొసఁగెదన్ మత్తేభశార్దూలవృ
త్తము లింపారెడు పుష్పమాలికలచందం బొప్పఁగాఁ గాన్క నె
య్యమునన్ గైకొని ప్రోవుమీ పలుకుతోడై వేగ సీతాపతీ.

6


మ.

పదసంధుల్ గణవృత్తభేదవిరతిప్రాసాదు లూహించియున్
బదపద్యంబులు చెప్పుచొప్పెఱుఁగ నీపాదాంబుజధ్యాన మా
స్పదమున్ జేసి రచించెదన్ శతక మాచంద్రార్కమై ధాత్రి నిం
పొదవం జేసియుఁ జిత్తగింపు కృప బెంపొందంగ సీతాపతీ.

7

మ.

పరుసం బించుక సోక లోహ మపుడే బంగారమైనట్లు నీ
వరకళ్యాణగుణస్తవం బగుట నే వాక్రుచ్చు కబ్బంబునం
దరయం దప్పులు గల్గియున్న నవి యోగ్యంబౌచు నెల్లప్పుడున్
ధర జెన్నొందును గాక భక్తజనహృద్యం బౌచు సీతాపతీ.

8


శా.

కన్యావిక్రయులై ధనంబున కపేక్షం జెంది లోకంబునం
దన్యాయం బొడిగట్టుకోఁదలఁచి దుర్వ్యాపారు లూహింప సా
మాన్యప్రాభవ మిచ్చయించిరకటా మర్త్యాళి శిక్షింపలే
రన్యుల్ నీవు సహించియుండుటకు చోద్యంబయ్యె సీతాపతీ.

9


మ.

తనయుల్ గల్గినఁ గల్గు సద్గతులు తథ్యంబంచుఁ బుత్రార్థులై
మును ధన్యుల్ మదిఁ గోరియుందు రిపు డీమూర్ఖాళి సత్కన్యకా
జననంబైనను విక్రయించెద మభీష్టప్రాప్తిగా ద్రవ్యమా
ర్జనఁ గావించెదమంచు నెంతు రిది మే రా చూడ సీతాపతీ.

10


మ.

అనఘుల్ తొల్లి జగత్ప్రసిద్ధమగు కన్యాదానసత్పుణ్యమం
దనురక్తిన్ ధర జేయుచుండి రిపు డర్థాపేక్షచే దుష్కృతం
బని డెందమున లేక యాత్మభవకన్యావిక్రయోల్లాసులై
మను దుర్మార్గుల శిక్ష సేయ విది ధర్మం బౌనె సీతాపతీ.

11

శా.

పాపంబుల్ దరుచయ్యె సజ్జనుల ప్రాబల్యంబు లేదయ్యె దు
ర్వ్యాపారాభిరతుల్ ధరన్ బలసి రన్యాయంబు హెచ్చయ్యె నీ
వే పాలింపకయున్న నెవ్వ రిఁక నుర్విం దీనులన్ బ్రోచువా
రాపన్నావన ప్రోవవే తడవు సేయన్ వద్దు సీతాపతీ.

12


మ.

తలిదండ్రుల్ సుతు లన్నదమ్ములు కళత్రం బంచు నేవేళ మ
ర్త్యు లతిభ్రాంతిని జెంది నిన్ మఱచి ప్రొద్దు ల్పుత్తు రయ్యో యముం
డలుకన్ బాములఁ బెట్టఁగా నపుడు డాయన్వచ్చి వారింపఁగాఁ
గలరా వా రెవరైన వట్టిభ్రమయౌఁగా చూడ సీతాపతీ.

13


మ.

బరువై తోఁచ నసాధ్యమైనపని నీపైఁ బెట్టఁగాలేదు నీ
వరకాసైనధనంబులో వ్యయము సేయన్ వద్దు నాకార్య మె
వ్వరితోనైనను దెల్పు సేయమన దేవా వాగ్వరంబౌట కే
జరుపన్ జొచ్చెద వెట్లొసంగెదవు మోక్షం బింక సీతాపతీ.

14


మ.

బరువై తోఁచెనొ లేక నాదురితముల్ పాటించిచూడన్ మదిన్
వెఱపై యుండెనొ వేళగాదొ మఱి నీవే దిక్కుగా నమ్మి నే
దిరుగన్ లేదొకొ యేమి కారణము నాదీనత్వమున్ బాప వీ
వఱకైన న్వనజాసనప్రముఖదేవస్తుత్య సీతాపతీ.

15

మ.

ధర నేఁ జేసిన ఘోరపాపముల నంతంబొందఁగాఁజేయ దే
వర నీకన్నను లేరు వేరొకరు గీర్వాణాళిలో నన్న నా
దరణన్ దండధరోగ్రకింకరులచేతం జిక్కఁగానీక నీ
చరణాబ్జంబులచెంతఁ జేర్పుము నమస్కారంబు సీతాపతీ.

16


మ.

ధరపై బట్టకుఁ బొట్ట కే నొకరిచెంతం జేరి యాచింపుచున్
దిరుగన్ జేయకు రోగవేదనల నార్తిన్ బొంతగానీయ కీ
వరముల్ నా కిహమం దొసంగి పిదపన్ వాత్సల్య మొప్పన్ భవ
చ్చరణాబ్జంబులు చూపు నమ్మితి నమస్కారంబు సీతాపతీ.

17


మ.

వలదన్నన్ వెనువెంటనే దిరుగుచున్ వారేమి వంచించినన్
దలవంపై మది గుంది పొట్టకొఱకై తప్పొప్పులొప్పన్ సిరుల్
గలవారిం బతిమాలుచున్ దిరిగితిం గష్టాత్ము లైనట్టి బీ
దలఁ బుట్టింపఁగ నేల ధాత పని లేదా వేరె సీతాపతీ.

18


మ.

అడవుల్ ద్రిమ్మరవచ్చు కాల్నడను రేలందు, న్మదిందాల్మిచే
నుడుకైనన్ జొరవచ్చు బెబ్బులులు దా మొండొంటితో బోరుచో
నడుమ న్నిల్వగవచ్చు దిట్టముగ నెన్నన్ గట్టిడౌ లేమి చేఁ
గడగండ్లంబడరాదు మర్త్యులకు లోకంబందు సీతాపతీ.

19

మ.

సొగసౌ వేలుపుఱేనిఱానిగనిగల్ జూపట్టు నెమ్మేనితో
నగ వొప్పారెడు ముద్దునెమ్మొగముతో నాడెంపుహొంబట్టుశా
ల్జిగిమేనన్ వలెవాటుతో పుడమిచూలిం గూడి తమ్ముండు గొ
ల్వఁగ నీ వెన్నఁడు వచ్చి నిల్చెదవు మ్రోలం దండ్రి సీతాపతీ.

20


మ.

అడవుల్ ద్రిమ్మరఁబోతివో గడుసులౌ నారక్కసుల్ మాయలన్
బొడకట్టం దెగటార్పనేగితివొ నేర్పుల్ మీఱఁగా భక్తు లె
క్కడ ని న్నాచినవారిచే మెసలలేకే చిక్కితో కాక యె
క్కడ నున్నా వది యేమి పిల్వ బలుకంగారాదె సీతాపతీ.

21


మ.

దరిజేర్చంగలవాఁడ వీ వనికదా దైన్యోక్తులం ద్రౌపదీ
తరుణీరత్నము మత్తసింధురము సంతాపాంబుధిన్ మగ్నులై
మొఱపెట్టం గరుణించినాఁడ వనుటల్ ముఖ్యంబుగా నమ్మి నీ
చరణాబ్జంబులచెంతఁ జేరితి నమస్కారంబు సీతాపతీ.

22


మ.

అడవిం గూరలుగాయలుం దిని యనేకాబ్దంబుల న్నిష్ఠచే
బెడిదంబౌ తప మాచరించి నిను మెప్పింపన్ సమర్థుండఁ గా
నడియాసం బడియుంటిఁ బ్రోతువని కాదన్నన్ సరేకాని చొ
ప్పడదీమీఁద భవత్ప్రతిజ్ఞయని నే భావింతు సీతాపతీ!

23


శా.

గోట న్మీటఁగవచ్చు నట్టిపనికై కొండంతగాఁ జేసె దీ
పాటిం కన్విను నీకు మోసిన నొనర్ప న్లేవె మున్ జౌటము

న్నీటం గొండలు దేల్చుకన్న బళువే నేవేఁడు కార్యంబు నా
మాట న్న న్వినసైప దింత తెలిపె న్మర్మంబు సీతాపతీ.

24


మ.

ధరపై బట్టకుఁ బొట్టకై యొకనిచెంతం జేరి యాచింపుచుం
దిరుగంజేసితి వింక సద్గతిని జెందేమార్గ మేమైన నా
కెఱుఁగం దెల్పకపోతి వీవఱ కయో! యేమందు నాకర్మమో
కరుణే లేదొ మొఱాలకింపవు పరాకా యింత సీతాపతీ.

25


శా.

ని న్నెన్నాళ్లని వేఁడుకొం దెవరితో నే దెల్పఁగాఁబోదు లే
రెన్నన్ దీనశరణ్యు లెవ్ వరిఁక నీయీరేడులోకంబులం
దన్నా! యెన్నటి కింక దుర్దశలు బాయం ద్రోచియు న్నన్ను సం
పన్నుం జేసెద వేమొ తోచ దిఁకఁ దెల్పన్రాదె సీతాపతీ.

26


శా.

కాయల్పండ్లును మెక్కి కాన లిరువు ల్గా భీతిచే మానుసు
ల్డాయంబోయినఁ బాఱుక్రోఁతితుటు మెట్లం గెల్చె రాకాసులం
బాయంజాలనికూర్మి వారలను జేపట్టంగనేకాక ము
న్సేయంజాలిరె వార లింతటిపనుల్ చింతింప సీతాపతీ.

27


మ.

తనయు ల్సోదరు లాత్మబంధులు సమస్తంబైనవా రుండియుం
దనకుం బాల్పడు కర్మ మెవ్వరయినం దప్పింపఁగా లేరు; శౌ

ర్యనిధు ల్పాండవు లుండి యాద్రుపదకన్యారత్న మానిండుకొ
ల్వునఁ బ్రత్యర్థులచేత సి గ్గపుడు గోల్పోలేదె సీతాపతీ.

28


మ.

అడుగంబోవుటకన్న లాఘవము కన్యాదానముం బోలి చొ
ప్పడ దానం బనృతంబుకన్న ఘనపాపం బర్థి యాచించిన
న్వడి దా నిచ్చుటకన్నఁ గీర్తియును నెవ్వల్పొందుకన్న న్వెత
ల్పుడమి న్లేవు తలంప నీకు సరి వేల్పు ల్లేరు సీతాపతీ.

29


మ.

ఎలమిం దుర్జనుఁ డున్నచో టెఱిఁగి తా మేతెంతు రెంతే దురా
త్ములు పొందొల్లరు సజ్జనోత్తమునితో ముఖ్యంబుగా ధాత్రి నీఁ
గలు దుర్గంధయుతప్రదేశమున కేగంజూచునేగాక సొం
పలరం గస్తురిచెంత కేల చను యోగ్యం బెంచి సీతాపతీ.

30


మ.

అవివే కేమి యెఱుంగు సజ్జనునిమర్యాదల్ రసజ్ఞుంబలె
న్భువి సద్యోఘృతశాకసూపమధురాపూపాదిసద్వస్తుయో
గవిచారం బది జిహ్వకే తెలియుఁగాక న్దెడ్డు కె ట్లబ్బు నా
చవిఁ దా నెంతయుఁ గూడియుండినను గాసంతైన సీతాపతీ.

31


మ.

జగముల్ బ్రోచెడు ప్రోడవైన నిను నిచ్చ ల్గొల్పు నే నిట్లు నీ
చగతి న్బట్టకుఁ బొట్టకై యొకరిపంచం జేరఁగానైతి నే

నుఁగుపై నెక్కియు దిడ్డిదూరెడుగతి న్ముమ్మాటి కాగొప్ప కొ
ద్ది గణింప న్బని లేదు నా కిఁకను నీదేకాని సీతాపతీ.

32


మ.

తురగస్యందనగంధసింధురభటస్తోమాతిదివ్యాంబరా
భరణామూల్యసువస్తుసంపదలపై బ్రాంతు ల్దలంప న్భవ
చ్చరణాంభోరుహచింతనామృతరసాస్వాదోల్లసచ్ఛ్రీపరం
పరచే నొప్పెడు పుణ్యశాలికిఁ దృణప్రాయంబు సీతాపతీ.

33


మ.

అరవిందాసనుఁ డాది గాఁగఁ దృణపర్యంతంబు నీవైభవ
త్కరుణాపాంగవిలోకనంబునను లోకంబు ల్తమిం బ్రోచు నే
ర్పరివై యుండియు నన్ను మాత్ర మొకనిన్ రక్షింపలేవా! యనా
దరణం జూచినఁ బ్రోచువా రెవరు భక్తత్రాణ సీతాపతీ.

34


శా.

చోరు ల్దారసమైనచో రిపుజనస్తోమంబు బాధించుచో
ఘోరంబౌ గ్రహచారదోషములు పైకొన్నట్టిచో భీతిచే
శ్రీరామా యని పల్కుమాత్రమున నార్తింబాసి పుణ్యాత్ముఁడై
చేరున్ మోక్షము దండహస్తుని బురి న్జేరండు సీతాపతీ.

35


శా.

లేము ల్బొందినవేళ రోగములు జాలిం బెట్టుచో ఘోరసం
గ్రామంబౌతఱి సర్పవృశ్చికమహోగ్రవ్యాఘ్రభల్లూకము


.

ల్సామీప్యం బగునప్పు డొంటిని బిశాచవ్రాతము ల్గన్న నీ
నామోచ్చారణగాదె మానవుల కెన్నన్ దిక్కు సీతాపతీ.

36


మ.

ఒకమా ఱించుకసేపు నీవిమలనామోచ్చారణాసక్తులౌ
నకలంకాత్ముల ఘోరదుష్కృతసమూహంబెల్ల వేగం బికా
పికలై పోవుఁ దొలంగు దుర్దశతతు ల్పీడ ల్దరిం జేరవౌ
సకలైశ్వర్యములం జెలంగుదురు భాస్వత్కీర్తి సీతాపతీ.

37


మ.

నెన రావంతయు లేనివాఁడవుగదా నీ వాజగన్మాత సీ
తను ద ప్పెంచక యగ్ని దూఱుమన డెందంబొప్పియున్నట్టి నీ
కు నను న్బల్కడగండ్ల పాల్పఱచుట ల్గొప్పౌనె ని న్రవ్వజే
సిన మే లే మిఁక నేటికిం దెలియవచ్చె న్గుట్టు సీతాపతీ.

38


మ.

శ్రితకల్పద్రుమ నీదుచర్యలు మహాచిత్రంబు లాభారతీ
పతికైనన్ ఫణిరాజుకైనను నుతింప న్శక్యమా దీక్ష
జేసితివో వేఁడిన శత్రుమిత్రు లనకన్ జేపట్టి రక్షింప; మా
కతఁడే సాక్షి విభీషణుం డది నిజంబై తోఁచె సీతాపతీ.

39


మ.

శర ణన్న గ్గరుణింతు నన్న పలుకు ల్సత్యంబులం చెంచి నీ
మఱుగు న్సేరితిఁ గల్లలయ్యె నిపు డామాట ల్నిజంబైన బ
ల్మఱు నే వేఁడిన నూఱకుండుదువు యేలా సేయఁగాలేని యీ
పెద్దఱికంపుంబను లిట్లు పూనవలె భక్తత్రాణ సీతాపతీ.

40

శా.

జాలింబొంది యొకప్పుడైన మదినెంచ న్లేదు ని న్నూరకే
హాళిం బిల్వనిపేరఁటం బరిగి చట్టై గాసి చేనున్న ప్రో
యాలిం బ్రోచితి వెంత వేఁడినను మొఱ్ఱాలించ వేమిట్లు న
న్నీలాగున్ విడనాడిన న్గలదె మే లేమైన సీతాపతీ.

41


మ.

తన కైశ్వర్యముగల్గువేళ హితుల న్దారిద్ర్యుల న్బందుల
న్గని కారుణ్యముతోడఁ బ్రోచుచును లోకఖ్యాతిఁ జెన్నొంది స
జ్జనుఁడై చాలఁగ ధర్మకీర్తు లెలమి న్సాంపాద్యము ల్సేయనే
ర్చునరుండే ఘనుఁ డుర్వి నీకృపకుఁ బాత్రుండౌను సీతాపతి.

42


మ.

కపటస్నేహము చేసి నమ్మికలు వక్కాణించి కార్యార్థులై
యుపలాలింపుచుఁ గార్యమైనతఱి మేలూహింప కే కిన్కచే
నపుడే లేనినెపంబు లెంతు రెడసేయన్ బూని దుర్మార్గు లా
చపలస్వాంతుల నమ్మి కొల్చినను మోసంబౌను సీతాపతీ.

43


శా.

నీకళ్యాణగుణస్తవంబు మదిలో నిక్కంబు గావించుసు
శ్లోకు ల్పంకజబాంధవాత్మజభటస్తోమంబుచే బాధపా
ల్గాకం గాంచనగర్భముఖ్యసురవర్గం బందగాలేని నీ
లోకంబందు సుఖించియుందురనుపల్కు ల్వింటి సీతాపతీ.

44


మ.

పరమేష్ఠిప్రముఖామరు ల్మనములో భావింపఁగాలేని నీ

వరయ న్మానవరూపు దాల్చుతఱి భృత్యామాత్యసన్మిత్రవై
ఖరుల న్జేరి నిరంతరంబు గడువేడ్కం గొల్చుచున్నట్టివా
నరు లేనోములు నోఁచినారొ తొలిజన్మంబందు సీతాపతీ.

45


మ.

వ్రతము ల్దానజపాగ్నిహోత్రములు దేవబ్రాహ్మణారాధన
ల్గ్రతువు ల్మంత్రరహస్యము ల్సకలసత్కర్మంబులు న్నీవ నే
నితరం బేమి యెఱుంగ వేఱొకటి ని న్నీరీతిగా నమ్మితిన్
శ్రితకల్పద్రుమ యెట్లు బ్రోచెదవొ నీచిత్తంబు సీతాపతీ.

46


శా.

చెంతం జేరినఁ గూర్మి లేక యిటు గాసిం బెట్టుట ల్సూడ సా
మంతం బేమనవచ్చు ని న్నిక మహాత్మా లోఁకువౌ వారిపై
బంతం బేమిటికయ్య! 'పిచ్చుకపయిన్ బ్రహ్మాస్త్ర' మన్నట్లు నా
వంత ల్దీర్చు మొఱాలకించుమిఁక దేవా! వేగ సీతాపతీ.

47


శా.

నిచ్చ ల్బాయక కొల్చి యూరకయ పోనిచ్చెన్ననే తోఁచెనా?
గచ్చు ల్మానుము నిన్ను నే వదల లోకఖ్యాతిగాఁ జాటి ని
న్రచ్చ న్బెట్టకమాన నమ్ముము యధార్థం బింతయు న్నేర్పుచే
నిచ్చేదా రిఁక లేదు వేఁడిన ఫలం బేమయ్య సీతాపతీ.

48


శా.

కాసీజాలని మానవాధములపైఁ గబ్బంబులం జెప్పినన్
గాసింబొందుట మాత్రమే కలుగు నాకామ్యార్థము న్దోచదా

కాసంతైనను సత్కవీంద్రులకు భక్త త్రాణ ని న్గొల్చి నీ
దాసు ల్గాకయ భోగమోక్షములు సాధ్యంబౌనె సీతాపతీ.

49


మ.

అరయ న్దుర్జనుఁ డొక్కవేళను మహాహంకారుఁడై యూరకే
పరుషోక్తు ల్మది నొవ్వబల్కెనని సంభాషింతురా వానితో
ధరపై సజ్జను లెందునైనను యధార్థం బెట్లనం గుక్క కా
ల్గఱవం గ్రమ్మఱ దానికా ల్గఱవ యోగ్యంబౌనె సీతాపతీ.

50


మ.

ఉపవాసంబులు తీర్థయాత్రలును మంత్రోపాసనల్ ఘోరమౌ
తపము ల్సేయఁగ నేల గాసిబడి మర్త్యశ్రేణు లుర్విన్ వృథా
చపలత్వంబులు మాని నిచ్చలమనీష న్నిన్ను సేవించి మో
క్షపదం బందఁగరాదె సూక్ష్మమున భక్తత్రాణ సీతాపతీ.

51


మ.

ఇనవంశోత్తమ విన్నపంబొకటి నీ వీరీతి నామీఁదికి
న్కను మున్నాడినయట్టినీప్రతిన మానంబూనినావేమొ వ
ల్దనువా రెవ్వరు నిన్ను సంద్ర మొడికంబై మేర తాఁదప్పివ
చ్చిన వారింపఁగ నేరికిం దరము నీచిత్తంబు సీతాపతీ.

52


మ.

ఇది పుణ్యం బిది పాపమంచు మది నూహింపంగనీ దెవ్వరిం
గదియ న్ద్వేష మొనర్చుఁ జేఁబడుపను ల్గానీదు మర్త్యాళి కా

పదకు న్మూలము ఛీ దరిద్రము భరింపంజాలఁ గేల్మోడ్పుఁ జే
సెద నాచెంతకుఁ జేరకుండ నిపుడే శిక్షించు సీతాపతీ.

53


మ.

అరవిందాప్తకులంబు పావనము సేయం బఙ్తికంఠాదిము
త్కరదైత్యాళిని సంహరింప నిజదాసశ్రేణులన్ ధాత్రిపైఁ
గరుణం దీక్ష యొనర్చి ప్రోవగను సంకల్పించి కౌసల్య క
బ్బుర మొప్పన్ గొమరుండవైతివి జగంబు ల్మెచ్చ సీతాపతీ.

54


మ.

ధరపై నల్పున కొక్కవేళ విధివ్రాఁతం జేసి ప్రాప్తించినన్
సిరి దా సంతతభాగ్యశాలిగతి రంజిల్లంగ నె ట్లబ్బు బం
గరుతోగూర్చిన పల్గురాతికిని జొక్కంబైన వజ్రంపుసొం
పరయన్ గల్గునె యించుకంతయిన తథ్యం బెన్న సీతాపతీ.

55


శా.

అక్షీణోగ్రతపోబలంబునను దైత్యశ్రేణు లెంచన్ సహ
స్రాక్షాదిక్రతుభుక్సమూహమతి దైన్యస్వాంతులై మ్రొక్కినన్
రక్షింపంగ ననేకరూపములఁ జిత్రంబొప్పఁగాఁ దాల్చి యా
రక్షోవీరుల సంహరించితివి శౌర్యస్ఫూర్తి సీతాపతీ.

56


మ.

రవివంశంబునఁ బుట్టి శంకరుధనుర్భంగంబు గావించి దా
నవసంహారముఁ జేసి నిర్జరుల నానందంబునం దేల్చి భూ
రివిభూతిం జెలువొంది భక్తులను ధాత్రింబ్రోచు శ్రీరామమూ
ర్తివి నే నెంతటివాఁడ నీమహిమ వర్ణింపంగ సీతాపతీ.

57

మ.

బహుజన్మంబులనుండీ చేసినమహాపాపంబుల న్బాపఁగా
గ్రహదోషంబు లడంప దుస్సహదరిద్రవ్యాధులన్ ద్రుంపఁగా
నిహసౌఖ్యంబు లొసంగి భక్తులమనం బింపొందఁజేయ న్రఘూ
ద్వహ! నీనామజపంబె చాలు నిముషార్ధం బైన సీతాపతీ.

58


శా.

ధీరుండై భవబంధము ల్దునిమి ధాత్రిం బూజ్యుఁడై సంతత
శ్రీ రంజిల్లుచు నీయనుగ్రహమున న్జెన్నొంది యాపిమ్మట
న్జేరున్ మోక్షపదంబు శాశ్వతముగా సిద్ధంబు వైవస్వత
ద్వారం బెన్నఁడుఁ దేరిజూడఁడు భవద్భక్తుండు సీతాపతీ.

59


మ.

ధర నావంటి మహాపరాధుఁ డిఁక మర్త్యశ్రేణిలో లేడు ని
ర్జరు లెన్నంగను నీకుమించ నిఁక నార్తత్రాణదీక్షాధురం
ధరులైనన్ మఱి లేరు సత్య మిఁక నీదాసుండనై "యన్యథా
శరణం నాస్తి” యటన్న న్యాయమున నిచ్చ ల్గొల్తు సీతాపతీ.

60


శా.

ఆర్తత్రాణకళాప్రవీణుఁడవు నీవంచున్ మదిం దోఁచె నా
ధూర్తత్వంబు సహింప నెవ్వరు సమర్థుల్గారు నీకన్న నేఁ
“గర్తవ్యం మహదాశ్రమం” బనెడు వాక్యం బెంచి నిన్ గొల్చెద
న్మార్తాండాన్వయవార్ధిశీతకర న న్మన్నించు సీతాపతీ.

61


శా.

వింటి న్నీసరి వేల్పు లేడని జగద్విఖ్యాతిగా నన్ను నీ
బంటున్ గాఁ గృపఁజూడుమంటి నొరులం బ్రార్థించలేనంటి నా

కంటెన్ లేరు దురాత్ము లంటి నిజభక్తత్రాణ నీదీక్షసు
మ్మం టింకేమని విన్నవింతు సెలవీయన్ రాదె సీతాపతీ.

62


మ.

మురువౌ పచ్చలతాళి కీల్కడియము ల్మొత్తంపుచౌకట్లు నుం
గరము ల్బావిలిరావిరేకయును వేడ్కందాల్చి కౌసల్యముం
దర బల్ముద్దులు గుల్కుపల్కులును జోద్యంబొప్పఁగా నాఁడు నీ
చిరుప్రాయం బొకనాఁడు చూపు మది రంజిల్లంగ సీతాపతీ.

63


శా.

చుం చల్లాడఁగ రావిరేక గదలం జోద్యంబుఁగా గల్లుగ
ల్లంచుం గజ్జెలు పాదపద్మముల మోయ న్మ్రోల న న్నెత్తుకొ
మ్మంచుం జిందులు ద్రొక్కుచుం జనని కాహ్లాదంబు గావించు నా
చంచద్బాలమనోహరాకృతిని నిచ్చ ల్గొల్తు సీతాపతీ.

64


మ.

నిడుపౌచేతులు ముద్దునెమ్మొగము వన్నెల్లుల్కునెమ్మేను సొం
పడరుంగొప్పకనుంగవ న్వెడఁదఱొ మ్మందంబు వీక్షించి మున్
జడదారు ల్మది మోహమందిరఁట యీసారైన నీరూప మె
న్నఁడు నాకన్నులనిండఁ జూచి మది నానందింతు సీతాపతీ.

65


మ.

తొలి ని న్వేఁడినవారలా నిరపరాధు ల్నేను గానైతినా
యల నీవంచన గంటి దూఱఁ బనిలే దౌగాని తప్పొప్పులుం

గలవారెవ్వరు లేరు నే నొకఁడనే గాఁబోలు నీకంతగా
బలుపై యుండిన మానెనేమయిన మాబాగింక సీతాపతీ.

66


మ.

అలదుంగెంజిగిలాగుపైన నడిక ట్టందంబుగా గట్టియు
న్విలుగోలం గయిబూని బత్తళిక ఠీవిం దాల్చి తమ్ముండు నీ
వలనాఁ డామునిజన్నముం గడపి యాహ్లాదంబుతో నేగు నీ
చెలువం బెట్టిదొ చూపు నామనసు రంజిల్లంగ సీతాపతీ.

67


మ.

మొదలంటం దెగ మొత్తెదం గొలల గుంపుల్ లేములంబట్టి పైఁ
జదియంగొట్టెద నల్కదీఱ జమునిం జక్కాడెదం గొల్ల పె
ట్టెద వేల్పుల్ దొరసంపద ల్నలువ నోడింతు న్నిజంబంచు నె
మ్మదిలో నెంచెద నీయనుగ్రహము సంపాదించి సీతాపతీ.

68


మ.

జరుగంజొచ్చె దినంబు లయ్యయొ వృథాసంసారమోహంబు ని
న్మఱువంజేయును మోసపుచ్చుట నిజంబౌ నెప్పుడో పాముతో
సరసంబయ్యెను దీనినేస్త మిఁక నేచందంబునం బాయు నా
తరమా తప్పుకొనంగ నీకరుణచేతంగాక సీతాపతీ.

69


మ.

కదలన్నీయవు మోహపాశములు నీకళ్యాణనామంబుపైఁ
గుదురై నిల్వదు మానసం బడఁగ దీక్షుద్బాధ సంపద్భ్రమ
ల్వదలంజాలవు వీనితోఁ బెనఁగఁజాలన్ వింతసంసారపుం
గుదె నాకుత్తుక కేల కట్టితివి నాకుందోడు సీతాపతీ.

70

మ.

అలుకా పిల్వఁగఁ బల్కవే మిది పరాకై యుంటివా లేక బీ
దలమాట ల్చెవినాటవా నెనరు లేదా కాక కార్పణ్యమా
బలువా ప్రోచుట కెవ్వరున్ మనవి దెల్పంజాలరా తీఱదా
తెలియంజెప్పు బిఱాన నెందు కిఁక సందేహంబు సీతాపతీ.

71


మ.

ధరణీపుత్రి నిజాంకపీఠమున నుద్యద్భక్తి వాతాత్మజుం
డరయ న్రోలను బార్శ్వభాగముల నాహ్లాదంబున న్సోదరు
ల్సొరది న్నల్లడలందు నంద మెసఁగ న్సుగ్రీవనక్తంచరే
శ్వరతారాసుతఋక్షనాయకులు గొల్వన్ రత్నపీఠంబునన్
గర మొప్ప న్జెలువొందు నిన్నుఁ గన నెన్నం డబ్బు సీతాపతి.

72


మ.

కలకాలంబును జీతబత్తెములకై కాంక్షింప కేఁ గొల్వ నీ
పలుకే బంగరుగాఁగఁజేసితివి యేపాటింక చా లెప్పుడో
నిలువం బెట్టక ప్రోతువా యిఁకను కానీ యెట్లు తప్పించుకోఁ
గలవో చూచెద బంటుపంత మిది భక్తత్రాణ సీతాపతీ.

73


శా.

సామంతుండవె శాంతమూర్తివె కృపాస్వాంతుండవే ధాతవే
సామాన్యుండవు గావు నాదుదురదృష్టం బెట్టిదో నీకయో!
నామీఁదం గృప బుట్టనీదు నినుఁ బోనాడంగరా దింక సు
త్రామస్తుత్యపదారవిందయుగ భక్తత్రాణ సీతాపతీ.

74

శా.

చేపట్టందగు నమ్మినందు కిఁక నీచిత్తంబు పోరాడఁగా
నోపన్ మ్రొక్కితి వేఁడుకొంటి గుఱిగా నుంటిం తుదిందూఱిటిన్
నాపై నిప్పటికైన నేనెనరు గానన్ రాదు నీ కింతగాఁ
గోపంబుండిన నిల్వఁజాలుదురె భక్తు ల్మ్రోల సీతాపతీ.

75


శా.

ఎన్నాళ్లయ్యెను గొల్వఁబట్టి యొకనాఁ డేమంచిమాటైన న
న్నన్నావో మొగమైనఁ జూపితివొ డాయన్ వచ్చితో లేక సం
పన్నుం జేసితొ తెల్పు వేమనుట కోపం బైన నన్నింతక
న్న న్నీవే మిఁకఁ జేతు వైన సరె దీనత్రాణ సీతాపతీ.

76


శా.

నామీఁదన్ గృప లేదు నీకు నెనరున్నం బ్రోవవా కారణం
బేమోకాని వృథాపరాధినగున న్నీదుర్దశాంభోధివీ
చీమధ్యంబున ముంచియుంచితివి నాచే నేమగు న్నీతలం
పేమో తోఁచదు నమ్మియుండినఫలం బింతయ్యె సీతాపతీ.

77


శా.

కాయ ల్గాసెను మ్రొక్క చేతు లెపుడుం గైవారము ల్సేయఁగా
నాయెన్ జాలదినంబు లిప్పటికి నెయ్యం బేమియుం లేకయే
పోయెన్ జిత్తము వచ్చు టెన్నటి కిఁక న్బొచ్చంబు నామీఁదనా
న్యాయం బయ్యెనె నమ్మియున్న ననుఁ బోనాడంగ సీతాపతీ.

78


మ.

మును నీడెందము వెన్నవంటి దిపుడేమోగాని నేనెంత వేఁ

డినఁ గాసంతయు నేటికిం గరఁగకుండెన్ సత్కృపాంభోధి వీ
వనుచుం గొల్చితి నింతనిర్దయను బాయం దోఁచుచందం బెఱుం
గను నీ వక్కఱసేయకున్న నెవరింకం బ్రాపు సీతాపతీ.

79


మ.

నీను నే నమ్మికఁ గొల్వనో తలఁపనో నీమాట లేమైన నే
విననో లాఁతులఁ గొల్వఁబోయితినొ నీవే దిక్కుఁగాఁ జూడనొ
ల్లనొ నీయాజ్ఞకు మీఱియుండితినొ జాలం బేమి నా నేర మే
మనుచుం బ్రోవవొ తెల్పు నీ కిది యసాధ్యంబైన సీతాపతీ.

80


మ.

నిను సేవింపుచునుండఁగా సిరులు రానీ లేములే వచ్చి పై
కొననీ మే లొనఁగూడనీ గ్రహగతు ల్గుందింపనీ రోగవే
దనలే జాలి యొనర్పనీ విను మహాత్మా నీప్రసాదం బిదే
యనుచుం భావనఁ జేసి డెందమున నాహ్లాదింతు సీతాపతీ.

81


శా.

కాయం బెన్నఁగ నీటిబుగ్గ యిది నిక్కం బెన్నఁగా చంచల
ప్రాయంబు ల్సిరు లెంచి చూడఁగ యథార్థం బింక సంసారమా
మాయానాటక మేది నిల్కడ వృథా మర్త్యాళి కెందున్ సుఖో
పాయం బేమియుఁ గానరాదదియె మాబాగన్న సీతాపతీ.

82


మ.

సిరు లీజాలుదురో మనోరథముల న్సిద్ధింపగాజేతురో
గుఱిగా నమ్మె నితం డటంచు మదిలో గోరంత చింతింతురో

కరుణం బాముల కడ్డ మయ్యెదరొ మోక్షం బిత్తురో తోఁచదీ
నరుల న్వేఁడెదరేల సత్కవులు దీనత్రాణ సీతాపతీ.

83


శా.

అన్నా విన్నపమైన గైకొనవు డాయన్ రావు నీమూర్తి నా
కన్ను ల్చల్లఁగఁ జూప వెన్నిదినము ల్గైవారము ల్చేసినన్
ని న్నేలాగున నమ్మవచ్చు నకటా! నిష్కారణం బూరకే
న న్నీలాగునఁ బాముల న్బరచు టేనాయంబు సీతాపతీ.

84


శా.

ఓదీనావన! యోపురాణపురుషా! యోచింతితార్థప్రదా
యోదైత్యాంతక! యోదయాజలనిధీ! యోసూర్యవంశాగ్రణీ!
యోదుర్దోషవిదూర! యోరఘుపతీ ! యోలోకసంరక్షకా!
నాదీనోక్తులఁ జిత్తగింపు మిపుడైనంగాని సీతాపతీ.

85


మ.

ఘనులా లొల్లిఁటిసత్కవీంద్రులవలె న్గబ్బంబులం జెప్పి నే
నిను మెప్పింపఁగ లేనిమాట నిజమే నెయ్యంపులేబ్రాయపుం
దనయుం డాడినమాటల న్నెనరురాదా తండ్రి కెందైన న
ట్లనుకంపామతి నాకవిత్వమున కాహ్లాదించు సీతాపతీ.

86


మ.

తడవాయెన్ నినుఁ గొల్వఁబట్టి దయ లేదా పిల్చితే పల్క వె
న్నఁడు నాముచ్చట దీఱఁగా నెదుటఁ గానన్ రావు న న్నింతక

న్నడసేయన్ వల దిప్పుడే దెలుపుమా నా నేర మేమున్నదో
తడయన్ రా దడియాస లేటి కిఁక భక్తత్రాణ సీతాపతీ.

87


మ.

సకలస్థావరజంగమంబులను సూక్ష్మస్థూలరూపంబులై
ప్రకటంబొప్పఁ జరించు కేవలపరబ్రహ్మంబ వైనట్టిసే
వకకల్పద్రుమ! నాతరం బగునె నిన్ వర్ణింపఁగాఁ జందమా
మకు నూల్పోగనురీతిగాక పరికింప న్భక్తి సీతాపతీ.

88


మ.

తనువు ల్సంపద లెల్లకాలమును నిత్యంబంచు మోహాంధులై
జను లేవేళను ని న్నెఱుంగకయ సంసారాంధకూపంబున
న్మునుఁగంజొచ్చెద రింతె ని న్నెఱుఁగరేమోకాని నీమాయయో
మనుజశ్రేణులకర్మమో తెలియదా మర్మంబు సీతాపతీ.

89


మ.

దయ నీ కెన్నఁడు వచ్చునోయని మహాత్మా చాలఁ గన్పెట్టియుం
టి యథార్థం బిఁకనైననుం గరఁగదా డెందంబు నీమాట కే
మయినం దూఱితినా యనాదరణ సేయం గారణం బేమి నా
పయి నీ కేమిటి కింతబెట్టిదఁపుగార్పణ్యంబు సీతాపతీ.

90


శా.

క్రూరస్వాంతు లసత్యవాదులు కృతఘ్ను ల్నీచసేవారతు
ల్దారాపుత్రవిహీను లంధులు పరద్రవ్యాపహారు ల్దురా
చారు ల్నిర్ధనులై జనింతురు ధరన్ జన్మాంతరంబందు ని
న్నారాధించనిదుష్కృతంబునను మర్త్యశ్రేణి సీతాపతీ.

91

శా.

ధీరస్వాంతులు సూనృతవ్రతులు వర్ధిష్ణు ల్లసత్కీర్తివి
స్తారు ల్సాధుజనావను ల్సకలవిద్యాపూర్ణులై సంతత
శ్రీ రంజిల్లుచునుందు రెప్పుడు ధరిత్రి న్దొల్లి సద్భక్తి ని
న్నారాధించిన యట్టిపుణ్యమున మర్త్యశ్రేణి సీతాపతీ.

92


మ.

తలిదండ్రు ల్నెనరైన చుట్టములు దాత ల్మిత్రవర్గంబు వే
ల్పులు నీకన్నను వేఱ లేరనుచు నాలో నెంచి నీబంటనై
కొలువన్ వంచన సేయఁజొచ్చితివి లోకు ల్మెత్తురా మ్రొక్కఁ జే
తులు గోయన్ వలదైనఁ గీర్తియపకీర్తు ల్నీవె సీతాపతీ.

93


మ.

అనయంబు న్భవదీయపాదకమలధ్యానామృతం బానుచుం
దనివిం జెందని డెందము న్గలిగి సమ్యగ్భక్తి సేవించుభ
క్తనికాయంబులరీతి ని న్గనుట కాత్మజ్ఞానసన్మార్గసా
ధన మెట్లబ్బు భవత్కృపామహిమచేతంగాక సీతాపతీ.

94


శా.

దేవా! లోకశరణ్యమూర్తి! వెస నాదీనత్వము న్బాపఁగా
లేవా వంచన చేసి న న్నిటుల జాలిం బెట్టుటేకాని ని
న్నేవేళ న్మది నమ్మియుండినఫలం బింతయ్యె కానిమ్ము రా
జీవాప్తాన్వయవార్ధిశీతకర నీచిత్తంబు సీతాపతీ.

95


మ.

కరిరా జామకరేంద్రుచేతఁ బడి దుఃఖస్వాంతుఁడై పల్మరు
న్మొఱవెట్ట న్విని వచ్చి బ్రోచుట నిజంబో కల్లయో శాస్త్రముల్

ధరపైఁ బల్కుటఁ జేసి నమ్మితి యథార్థంబైన రక్షించు ద
బ్బరయైన న్విడనాడు మేమి కలయింపంబోకు సీతాపతీ.

96


మ.

తొలిపల్కు ల్గొనిపోయి సోమకుఁడు సంతోషంబునన్ వార్ధిలో
పల దూరం గని వానిపెం పడంచి యాప్రాబల్కు లవ్వేళ న
ర్మిలిచే నల్వ కొసంగి లోకములు కీర్తింపంగఁ జెన్నొందునీ
చెలువంబై తగుమత్స్యరూపమునకున్ జేమోడ్తు సీతాపతీ.

97


శా.

దట్టంబౌ తమి పాలవెల్లిఁ దరువన్ దైత్యుల్ సురల్ కవ్వఁపున్
గట్టున్ గ్రుంగ నెలుంగులెత్తి వరదా! కాపాడుమంచున్ మొఱల్
వెట్టన్ గట్టుబిరాన నెత్తితివి తాఁబేల్వేసము న్బూని నీ
మెట్టుందమ్ములఁ గొల్చువారి కరుదే మేలౌట సీతాపతీ.

98


మ.

కలనన్ ద న్నెదిరించలే రనుచుఁ దా గర్వించి ముల్లోకముల్
గలయం ద్రిమ్మరుచుండి నేల యవలీలం జుట్టి గొంపోవ బి
ట్టలుకన్ బట్టి హిరణ్యనేత్రుని వరాహాకారమై త్రుంచి భూ
వలయం బె'ప్పటియట్ల నుంచితివి భాస్వత్కీర్తి సీతాపతీ.

99


మ.

హరి నీస్తంభములోనఁ జూపుమని ప్రహ్లాదుం గరం బాపదన్
బరపన్ ఘోరనృసింహమూర్తివయి స్తంభంబందు జన్మించి ని

ర్జరు లగ్గింపఁగ నాహిరణ్యకశిపున్ సంహారమున్ జేయవే?
ధర నీభక్తు లసాధ్యు లేరికయినన్ దండింప సీతాపతీ.

100


మ.

తలపోయన్ జగదేకదాతవు మహాత్మా! మబ్బువార్వంపురా
కలుముల్ గెంటకయుండఁజేయుటకు లోకఖ్యాతియేనట్లుగా
బలిచే దానము నేలమూడడుగులున్ బ్రార్థించి గైకొన్న నీ
చెలువంబై తగు వామనాకృతికి నే జేమోడ్తు సీతాపతీ.

101


మ.

అవనీనాథులఁ బల్మరు న్వెదకి రోషాయత్తవిస్ఫూర్తి నా
హవలీలం దెగఁగూల్చవే నిజకుఠారామోఘధారాహతిన్
భవదీయాద్భుతకీర్తిచంద్రికలు దిగ్భాగంబులం బర్వ భా
ర్గవరామాకృతిఁ దాల్చి మోదమున భక్తత్రాణ సీతాపతీ.

102


మ.

జలజాతాప్తకులంబునం దుదయమై సత్యస్వరూపంబు చె
న్నలరన్ లోకములెల్లఁ బ్రోచుచు నిశాతామోఘకాండంబులన్
గలనన్ రావణకుంభకర్ణులను లోకఖ్యాతిగాఁ ద్రుంచి ని
ర్మలసత్కీర్తి బ్రసిద్ధి కెక్కితివి శ్రీరామాఖ్య సీతాపతీ.

103


మ.

యదువంశంబునఁ గోర్కి దీర నుదయంబై రామకృష్ణాఖ్యలన్
ముద మొప్పన్ శిశుపాలకంసమురచాణూరాదివిద్వేషులన్
గదనక్షోణిని ద్రుంచి లోకములకున్ గౌతూహలం బిచ్చి నె
మ్మదిఁ జెన్నొందవె భూరికల్మషవిరామా! రామ! సీతాపతీ.

104

మ.

అతిచోద్యంబుగ నప్పురాసురులభార్యల్ వేడ్కఁ గావించుస
ద్వ్రతముల్ మోసముగాఁగఁ జేసియు సముద్యత్కీర్తిచే నిర్జర
ప్రతతు ల్సన్నుతి సేయఁగా నెగడు నీబౌద్ధావతారంబు సం
తతమున్ బ్రోచునుగాక నాదురితచింత ల్బాపి సీతాపతీ.

105


మ.

దురితస్వాంతు లసత్యవాదు లగుమర్త్యుల్ ధాత్రి జన్మించి సం
కరవర్గం బయిపోవ నాఖలుల గిన్కన్ ద్రుంచి ధర్మంబు సు
స్థిరతతన్ నిల్పవె కల్కిమూర్తివయి రాజీవాసనస్తుత్య భా
స్కరవంశాంబుధిపూర్ణశీతకర భక్తత్రాణ సీతాపతీ.

106


శా.

స్వర్ణక్ష్మాధరధీర నీగుణకథాజాలంబు సద్భక్తిచే
వర్ణింపన్ మదిగోర యీశతక మే వాక్రుచ్చితిన్ దీనిసం
పూర్ణానుగ్రహదృష్టిఁ గైకొని ధరన్ బోషించి సాయుజ్యసౌ
ఖ్యార్ణోరాశిని దేల్చు మీఁద రఘువర్యా రామ సీతాపతీ.

107


మ.

పుడమిన్ సాహెబు రాణవంశకలశాంభోరాశిసంపూర్ణచం
ద్రుఁడు వీరన్నకు రాజమాంబకు సుపుత్రుండైన రామన్న సొం
పడరంగా శతకం బొనర్చియున్ సముద్యద్భక్తి నర్పించెఁ బ్రే
ముడిచే గైకొని ప్రోవు డెప్పుడును లేము ల్బాపి సీతాపతీ.

108

సీతాపతిశతకము సంపూర్ణము.