భక్తిరసశతకసంపుటము/రెండవసంపుటము/భక్తచింతామణిశతకము

పీఠిక

భక్తచింతామణిశతకమును వ్రాసినకవి కూచిమంచి సోమసుందరుఁడు. ఈకవి కోనసీమయందలి సప్తగోదావరిమధ్యముననున్న పలివెలగ్రామనివాసి. కవి తననివాసస్థానమును నీశతకమునం దీవిధముగాఁ జెప్పెను.

పల్వలపూర్థామ... ప. 5.
మహాగౌతమీవిలసత్తీరతలస్థపల్వలపురీ
విఖ్యాతవాసుండ...108

ఈకవి వ్రాసిన యితరగ్రంథములలో కొప్పులింగేశ్వరశతకము మాత్రము ప్రకృత ముపలభ్యమైయున్నది. సోమసుందరకవిని గూర్చినవృత్తాంత మింత కెక్కుడు తెలియరాదు. ఈకవి సుప్రసిద్ధులగు కూచిమంచి తిమ్మకవి జగ్గకవి సోదరుల కావలివాఁడై యుండును. ఎంతకాలముక్రింద నీకవి యుండెనో యేయే గ్రంథములు రచించెనో తెలియుట లేదు. పల్వెలపురీవిఖ్యాతవాసుండ ననుటచే నీకవి పల్వెలనివాసి యని స్పష్టముగాఁ దెలియుచున్నది. కవి కూచిమంచి తిమ్మకవివంశీయుఁడు గావున కౌండిన్యసగోత్రుఁ డనియు నాపస్తంబసూత్రుఁ డనియుమాత్రము తెలిసికొనవచ్చును.

పలివెల సుప్రసిద్ధమగు శివక్షేత్రము. ఇట రెడ్డివీరులు నెలకొల్పిన శాసనములు పెక్కులుగలవు.

భక్తచింతామణిశతకమున మొదటి యిరువదిమూఁడుపద్యములలో నంత్యనియమాలంకారముంటచేఁ బద్యములు చదువఁ జవులూరుచున్నవి. కడమపద్యములలో శివలీలలు పురాణకథలు నభివర్ణింపఁబడినవి. శతకమునందలి కవితాధార మనోహరముగ నిరర్గళముగా నున్నది. కవి యీశతకమునందు మత్తేభవృత్తములు శార్దూలవృత్తములు వ్రాసి, యటుల వ్రాయుటకుఁ గారణ మీక్రిందివిధముగా మనోహరముగాఁ జెప్పియున్నాఁడు.

నీవు వెలయన్ మత్తేభశార్దూలచర్మములం బ్రీతి
వహింతు గాన నిపుడే మత్తేభశార్దూలపద్య
ముల న్నీ కుపహార మిచ్చితి....

కవి తాను నియోగియు బీదవాఁడునై యుంటచే గాఁబోలును ఎనుబదియెనిమిదవపద్యమున నియోగియై జనించుటయు నందు దరిద్రుఁడగుటయుఁ బాపహేతువని చెప్పినాఁడు. పద్యములందలి భావములు శైలి మనోజ్ఞముగా నుంటచే నీశతకములసంపుటమునం దీభక్తచింతామణిశతకమును జేర్చి ప్రకటించితిమి.

నందిగామ

ఇట్లు భాషాసేవకులు,

23-10-25

శేషాద్రిరమణకవులు, శతావధానులు.

శ్రీరస్తు

కూచిమంచి సోమసుందరకవికృత

భక్తచింతామణిశతకము

శా.

శ్రీమద్భూమిధరాధిరాజతనయా చిత్తాంబుజద్యోమణీ
వ్యామోహార్ణవతారతైకతరణీ బాలేందుచూడామణీ
ప్రేమాభ్యంచితకంకణీకృతఫణీ బృందారకగ్రామణీ
స్వామీ నామదిఁ బాయకుండు శివసాంబా భక్తచింతామణీ.

1


మ.

నతగీర్వాణ మురారిబాణ కృతనానాలోకనిర్మాణ సం
తతసర్వోపనిషత్ప్రమాణ త్రిజగత్కళ్యాణ సద్భక్తస
తతిస త్రాణధురీణ పుంగవలసత్కంఖాణ భాస్వన్మహా
పతితోద్ధారకళాప్రవీణ శివసాంబా భక్తచింతామణీ.

2


శా.

రాజద్దివ్యధునీతురుంబ మునిహృద్రాజీవరోలంబ నా
నాజీవాత్మభిదావిడంబ పరమామ్నాయస్తవాలంబ నీ
రేజాతాక్షమహాకదంబ దురితాదిప్రచ్ఛిదాశంబ వి
భ్రాజద్భక్తజనావలంబ శివసాంబా భక్తచింతామణీ.

3

మ.

ఘనవైశ్వానరదృగ్లలాట విలసద్గంగాజటాజూట పా
వనరౌప్యాచలకూట వేదచయభాస్వద్ఘోటలోకవ్రజా
వనలీలాధృతకాలకూట హతగర్వగ్రస్తదోషాట శో
భనచంద్రార్ధకళాకిరీట శివసాంబా భ...

4


మ.

నలినీబాంధవకోటిధామ రిపుసేనాభీమనిష్కామ ని
ర్మలధామా హతకామవిద్వదభిరామారామసుత్రామ గీ
తలసన్నామ విపద్విరామ నిజభక్తస్తోమ సుక్షేమ ప
ల్వలసద్గ్రామ లలామధామ శివ...

5


మ.

విలసద్భద్రతురంగ రంగదజహద్విజ్ఞానయోగాతిని
ర్మలయోగిప్రియసంగ సంగరరిపుప్రాణానిలాహారకృ
ద్బలవద్బాణభుజంగ జంగమపురీదాహక్రియాచంగ ప
ల్వలపుర్యంబుజసంగిభృంగ శివ...

6


మ.

స్వవశోద్యజ్జగదండ దండధరగర్వధ్వాంతమార్గాండ తాం
డవలీలాధుతకాండ కాండచయదీర్ణక్రూరవేదండజ్ఞే
యవిధాసంవిదఖండ ఖండశశిచూడాలంక్రియాభోగవై
భవవిఖ్యాతసురప్రకాండ శివ...

7


మ.

అలఘుశ్రీకరసుందరాంగ కరుణోదారాంచితాపాంగని

స్తులకారుణ్యయుతాంతరంగ హిమవత్పుత్రీపరిష్వంగ మ
త్తలతాంతాశుగగర్వభంగ మునిహృత్పంకేజసారంగ ని
ర్మలగంగాకలితోత్తమాంగ శివ...

8


మ.

నిలయీభూతబుధాంతరంగ త్రిజగన్నిర్మాణరక్షాదిని
స్తులకార్యాభినయప్రశస్తవిచలద్భ్రూభంగ భక్తవ్రజో
జ్జ్వలచిత్తాంబుజమత్తభృంగ సముదంచత్కోటికందర్పకో
మలరేఖాయుతమంగళాంగ శివ...

9


మ.

జలజాతప్రభవాచ్యుతాదిసుమనస్సందోహసంస్తూయమా
నలసన్మంగళదివ్యవేష గిరికన్యాచిత్తసంతోష యు
జ్జ్వలబాలేందుకళావిభూష కరుణాసంపోషితాశేషని
ర్మలకారుణ్యసుధీవిశేష శివ...

10


మ.

కలశీసంభవగౌతమాత్రిశుకమార్కండేయభృగ్వాదిమౌ
నిలలామావళిగీయమానమహిమోన్మీలత్సుధామాధురీ
లలితాత్మీయకథాప్రసంగ శ్రితకైలాసాంచలోత్సంగ భూ
వలయాభంగశతాంగ లింగ శివ...

11


మ.

స్వవిభానిర్జితకోటిసూర్య పరతత్త్వజ్ఞానదాచార్యలో
కవితానావనకార్య దీనజనరక్షావిశ్రుతౌదార్య వి

ష్ణువిధీంద్రాద్యనివార్య వీర్యసకలస్తోత్రార్హచాతుర్య భ
వ్యవిమోక్షప్రదకీర్తిధుర్య శివ...

12


మ.

కలిదోషఘ్ననిజప్రసంగ త్రిజగత్కందాయమానాంగ దు
ష్కలుషాదభ్రతమఃపతంగ బుధహృత్కాసారచక్రాంగని
శ్చలసుధ్యానపరాయణార్యభవపాశప్రచ్ఛిదాచంగ కే
వలవిజ్ఞానమయాత్మసంగ శివ...

13


మ.

కృతనానాజగదింద్రజాల త్రిజగద్గీతాభిధాజాల సం
తతభక్తావనలీల ఘోరభవసంతాపార్తినిర్మూల వ
ర్ధితసత్కీర్తివిశాల శైలవరపుత్రీలోల దీనావనా
ప్రతిమోద్యత్కరుణాలవాల శివ...

14


మ.

పరతత్త్వోపనిషద్విహార వినమద్భక్తౌఘమందార దు
స్తరసంసారభయాపహార జగదాధారాగుణోదార భా
సురనామామృతసార నిర్మలపరంజ్యోతిర్మయాకార స
త్త్వరజోముఖ్యవికారదూర శివ...

15


మ.

నిజమాయాకృతసర్వలోక వినమన్నిత్యామృతాలోక వి
శ్వజగత్పాలనజాగరూక దివిషద్యంద్యాంఘ్రినాళీక భ
జనాస్తోకతమోవిమోక పరిధూతస్వాశ్రితానేక జ
న్మజరామృత్యుభవైకశోక శివ...

16

మ.

పరసంత్రాసకరప్రతాప శమితబ్రహ్మాదిసంతాప దు
ర్భరమోహాంధతమఃప్రదీప విలసద్భర్మాద్రిరాట్చాపశ్రీ
కరసత్కీర్తికలాప నిత్యనిజభక్తవ్రాతనిక్షేప చి
త్పరమానందమయస్వరూప శివ...

17


మ.

నతభక్తవ్రతకల్పభూజవిలసన్నానాజగద్బీజ ర
క్షితగీర్వాణసమాజ పావనతరశ్రీమత్పదాంభోజ వ
ర్ణితకోటిగ్రహరాజతేజ కరుణానిర్వ్యాజ దీనావన
వ్రతపారీణ సురారిరాజ శివ...

18


మ.

సవిలాసాగతదక్షయాగ భవమోక్షప్రాభవాభోగ హై
మవతీసంగతవామభాగ సకలామర్యావనోద్యోగ సా
ధువరానందకరాత్మయోగ దృఢచేతోభూవపుర్దాహసం
భవభస్మోల్లసితాంగరాగ శివ...

19


మ.

అవనీభృత్తనయాకళత్ర సమరజ్యాఖండితామిత్ర దు
ర్భవదుఃఖాంబుధియానపాత్ర సితభాస్వచాత్ర పంకేజబాం
ధవచంద్రానలనేత్ర నిర్మలజగత్కళ్యాణచారిత్ర స
త్ప్రవరస్తోత్ర జగత్పవిత్ర శివ...

20


మ.

అమితశ్రీకరసుప్రసాద నిజభక్తాభీష్టదాహ్లాద యా
గమసంచారవినోద దీనజనరక్షానంతతామోద దు

ష్టమహాపాపవిభేద ఘోరభవపాశచ్ఛేద బ్రహ్మాచ్యుత
ప్రముఖాభ్యర్చితపాదశ్రీద శివ...

21


మ.

పదపద్మార్చకకల్పవృక్ష త్రిజగత్పాపచ్ఛిదాదక్ష దు
ర్మదదైతేయవిపక్ష విశ్వలయనిర్మాణావనాధ్యక్ష చం
ద్రదినేంద్రజ్వలనాక్ష భక్తనివహోద్యద్భూరిసన్మంగళ
ప్రదరాజత్కరుణాకటాక్ష శివ...

22


మ.

ధవళాంచద్దరహాస మౌనిహృదయాంతర్వాస నిస్సీమవై
భవకైలాసనివాస భూరినిజసద్భక్తావనోల్లాస స
త్ప్రవరస్వాంతవికాస భాస్వదఖిలబ్రహ్మాండభాండావళీ
భవరక్షాలయకృద్విలాస శివ...

23


శా.

ము న్నాఘోరహలాహలాగ్ని త్రిజగంబు ల్గాల్ప నీ వంతట
న్వెన్నుండాదిగ వేలుపు ల్మొఱలిడ న్వేవచ్చి నీ వావిషం
బన్నాఁడాని జగంబుఁ గాచితట యన్నా యెన్న నీకన్న నా
పన్నత్రాణపరాయణు ల్గలరె సాంబా భ...

24


శా.

సారోధారసుభక్తి బాణుఁడు నమస్కారంబు గావించి యిం
పార న్వేఁడిన వానియింట సకుటుంబారూఢిగా నుంటి వి
ట్లేరీ భక్తమనోరథంబు లిడువా రీవిశ్వమం దెంతయు
న్బారంజూచిన నీవ కాక శివ...

25

మ.

క్షితిలోఁ బల్మఱు బోయకన్నఁ డిడునుచ్ఛిష్ఠోపహారంబు ల
ప్రతిమప్రీతిఁ బరిగ్రహించి యపవర్గప్రాప్తుఁ గావించితౌ
పతితోద్దారకళానిరూఢబిరుదప్రఖ్యాతికిం జూడ నీ
ప్రతి లేఁ డెవ్వఁడు దైవకోటి శివ...

26


శా.

రిక్తాచారుఁ డొకండు పేర్మి శివరాత్రి న్వేశ్యతోఁగూడి సం
సక్తిం దత్కుచసీమ నీకు నొకపుష్పం బుంచి యర్పించినన్
రక్తిం బ్రోచితి వౌర భక్తసులభప్రఖ్యాతి నీయందె సు
వ్యక్తంబైనది గాని లే దెచట సాంబా భ...

27


మ.

అరుదార న్శివరాత్రియం దొకఁడు చౌర్యాసక్తి యుష్మద్గృహాం
తరదివ్యస్థలి జాగరూప్తి గనుమాత్ర న్ముక్తుఁడై యేగె ని
న్నిరతాసక్తి భజించువారి కరుదా నిర్వాణలక్ష్మీవిని
ర్భరసంశేషసుఖాబ్ధిఁ దేలుటకు సాంబా భ...

28


మ.

సురలాస న్సుర గ్రోలువేళ గములౌచు న్వచ్చిరేగాని వా
రరయన్ లోకహితార్థ మాగరళ మింతైనం దినంజాల రె
వ్వరు లోకేశ్వర నీవుదక్క నిఁక విశ్వత్రాణసామర్థ్య మె
వ్వరికైన న్గలదా త్వదన్యులకు సాంబా భ...

29


శా.

భక్తింబాయక ఫల్గునుండు భజియింప న్మెచ్చి దేవీసమా

యుక్తి న్నీవు కిరాతవేషమున రా నుద్వృత్తిఁ బోరాడి య
వ్యక్తుండై ప్రహరించినంత వరలాభం బిచ్చినావయ్య నీ
భక్తానుగ్రహ మేమి చెప్ప శివ...

30


మ.

గరిమ న్నీశరణంబు సొచ్చినను మార్కండేయు రక్షించి దు
ర్భరవైవస్వతభీతి మాన్పితఁట నీవాత్సల్య మెన్నంగ నా
తరమా నీచరణానతార్థిజనసంత్రాణైకదీక్షావిని
ర్భరభాస్వద్బిరుదంబు నీక తగు సాంబా భ...

31


మ.

అలకాధీశున కిచ్చినావు నవసంఖ్యాకాక్షయశ్రీనిధుల్
జలజాతాక్షున కిచ్చినావు నిజభాస్వద్దివ్యచక్రంబుఁ బెం
పలర న్వజ్రి కొసంగినా వతులదివ్యప్రాభవంబౌ భళీ
బళి నీసాటివదాన్యుఁ డేఁడి శివ...

32


శా.

బాఢామర్షతబ్రహ్మమూర్ధముఁ దృణప్రాయంబుగాఁ ద్రుంచియు
న్గాఢంబౌకృప సాలెపుర్వునకు మోక్షం బిచ్చియున్ మించితౌ
రూఢిం జెప్పఁగనేల తక్కినసుపర్వు ల్నిగ్రహానుగ్రహ
ప్రౌఢి న్నీకు సమాన మెవ్వరిఁక సాంబా భ...

33


మ.

గురుపత్నీగమనోగ్రపాతకకళంకుండైన చంద్రుండు నీ
శరణన్నంతనె నెత్తిఁ బెట్టుకొని వాత్సల్యంబు సంధిల్లఁగాఁ

బరిరక్షించితి విట్టియాశ్రితకృపాపారీణు లింకెందునుం
బరికింప న్మఱి లే రిఁకెవ్వరును సాంబా భ...

34


శా.

లేరే వేలుపులెందఱేని మిగుల న్లెక్కింప వారెవ్వరుం
గారుణ్యంబున భక్తవత్సలత మోక్షప్రాభవారూఢినిం
పారం దావకదివ్యసన్మహిమ లక్షాంశంబునం బోలలే
రౌరా మ్రొక్కిన నీకె మ్రొక్కవలె సాంబా భ...

35


మ.

గ్రహరాజుం గని నీవు పండు లురులంగా గొట్టు నవ్వేళ నే
గ్రహచారంబులుఁ జాలకుండె మఱి యాబ్రహ్మోత్తమాంగంబు బల్
రహి నీచేఁ దెగ నేవిధాతనొసటన్ వ్రాసె న్భవద్దివ్యస
న్మహిమప్రాభవ మింతెకాక శివ...

36


శా.

నీచారిత్రము బల్విచిత్రముగదా నీసేవకశ్రేణి కిం
పౌ చిత్రాంబరరత్నభూషణసుధాహారాదికం బిచ్చి నీ
వాచర్మాంబర మస్థిమాలయు విషాహారంబుఁ గైకొంటి వా
హా చాతుర్యము చెప్పఁగాఁ దరమె సాంబా భ...

37


మ.

అణుమాత్రంబుఁ దలంప వాద్విజవధాద్యత్యంతఘోరాఘముల్
కణమైనం బరికింపఁబోవు ఘనరాగద్వేషలోభాదులన్

గణనం జేయవు జాతిధర్మవిధిభంగంబుల్ రవంతేనియుం
బ్రణతాభీష్టవరంబు లిచ్చుతఱి సాంబా భ...

38


మ.

గరిమ న్విప్రుఁ డొకండు చేత శివలింగం బుంచి పూజింప నం
తరుషం దజ్జనకుండు గాంచి పడఁదన్న న్వాఁడు క్రోధాప్తిం ద
చ్చరణంబు ల్దెగఁద్రుంచి తత్క్షణమ యస్వప్నాకృతిం జెందె నీ
పరిచర్యామహిమ ల్విచిత్రములు సాంబా భ...

39


మ.

బలభిన్ముఖ్యమరుత్కిరీటమణిదీపశ్రేణినీరాజితో
జ్జ్వలపాదాబ్జుఁడవైన నీకు సరిపోల్పన్ దైవము ల్లేరు శ్రీ
వెలయం గన్గొన నీకుసాటి మఱి నీవేగాని విశ్వంబులోఁ
బలుకు ల్వేయునిఁకేల చాల శివ...

40


శా.

శ్రీరాముండు కపిస్వరూపదివిషత్సేనాసహాయాదిసం
భారుండై శతయోజనాయతముగా బంధించియున్నట్టి యా
వారాశిం దమి నొక్కగ్రుక్కగను ద్రావం గుంభజుం డోపు టే
పార న్నీపదభక్తిసన్మహిమ సాంబా భ..

41


మ.

తనర స్సర్వసుపర్వులందుఁ బరతత్త్వం బెవ్వరో సత్యభా
వనతోఁ దెల్పుమటన్న వ్యాసుఁడు “నదైవం వాసుదేవాత్పరం”
బని చేయెత్తి వచింప నంత నిజబాహాస్తంభనం బైన స
ర్వనిరూఢిం బరతత్త్వ మీ వనఁడె సాంబా భ...

42

మ.

పురసంహారమఖాపహార నలినోద్ధూతోత్తమాంగచ్ఛిదా
స్మరదాహాంతకనాశ మృత్యుజయభీమక్ష్వేళపానాదిదు
ష్కరకృత్యంబులు నీవొనర్చుకత నన్స ర్వేశ్వరుండంచు నని
న్బరమామ్నాయము లెంతయుం బొగడు సాంబా భ...

43


మ.

తలఁదా వంచుకొనె న్ఫణీంద్రుఁ డతిచింత న్వాగ్వరారోహ వె
ల్వెలఁబాఱెన్ విధి యేమి తోఁపకయె నిర్విణ్ణాత్ముఁడై నల్దెస
ల్గలయం గన్గొనుచుండె గీష్పతియు శంకన్మౌఢ్యముం బూనె ని
న్వలనొప్ప న్వినుతింపఁజాలమిని సాంబా భ...

44


మ.

అలవిత్తేశుఁడు మిత్రుఁడై విమలరౌప్యాహార్య మావాసమై
బలుమేల్బంగరుకొండ మేటిధనువై భాసిల్లు నాసర్వమం
గళ భార్యామణియైన నిన్ గొలుచుభాగ్యం బబ్బునే యీజగ
ద్వలయంబందును నెంతవారికిని సాంబా భ...

45


శా.

కళ్యాణాత్మక మైనచాప మురుభోగశ్రేష్ఠమౌ నారి సా
కల్యానూన రమానివాస మగు సత్కాండంబు భద్రప్రదా
మూల్యంబై తగువాహనంబు గల ని న్బూజించిన న్భాగ్యసా
ఫల్యంబౌ టరుదే ప్రసన్నులకు సాంబా భ...

46


శా.

సత్యజ్ఞానసుఖస్వరూప మగునీశశ్వన్మహత్త్వంబు దా

నత్యంతాద్భుతమై పవిత్రకరమై యజ్ఞానవిధ్వంసియై
నిత్యశ్రీకరమై చెలంగు నిదిగో నిక్కంబు సర్వశ్రుతుల్
ప్రత్యక్షంబుగఁ జాటుచుండు శివ...

47


మ.

వెలయ న్సర్వసుపర్వరూప మగు నీవిశ్వస్వరూపంబు కే
వలరూఢి న్భజియింపలేక బహుదైవభ్రాంతిఁ బెక్కండ్రుమూ
ర్తుల సేవింపఁగ వారికిం దదుచితోద్యోగానురూపంబుగా
ఫలదానం బిడు మేటి వీవకద సాంబా భ...

48


మ.

అరయ న్భూజలవహ్నివాయుఖరవీంద్యాత్మాష్టకం బెన్న నీ
పరమూర్త్యష్టకమై యెసంగ నిఖిలబ్రహ్మాండభాండోత్కరం
బు రహిం దజ్జలబుద్బుదోపమములై పుట్టు న్మనుం గిట్టు నీ
పరమానందమయస్వరూపమున సాంబా భ.

49


శా.

లీలానిర్మితనైకకోటిఘననాళీకోద్భవాండచ్ఛటా
మాలాజాలవిరాట్స్వరూపమగు నీ మాహాత్మ్య మింతైన నా
నాళీకాక్షచతుర్ముఖాద్యమరు లెన్నంజాల రెన్నాళ్లకుం
బ్రాలేయాచలకన్యకారమణ సాంబా భ...

50


మ.

తనియ న్మేటిమనోరథార్థములఁ బొందన్వచ్చు నుద్యద్విప
ద్వనధు ల్దాఁటఁగవచ్చు నశ్రమత విశ్వంబెల్లఁ దెల్లంబుగాఁ

గనఁగావచ్చు సకృజ్జపంబుననె వీఁకన్ శైవపంచాక్షరీ
మనురాజం బఖిలార్థసాధనము సాంబా భ...

51


శా.

చేతోవీథి భవత్పదాంబుజముఁ దాఁ జింతించి యెందేగినన్
భూతప్రేతపిశాచరాక్షసగణంబుల్ పోవు దవ్వై యసం
ఖ్యాతాపన్నిచయం బడంగు నిరపాయాత్యంతసన్మంగళ
వ్రాతంబు ల్సమకూడు నిక్కమిది సాంబా భ...

52


మ.

నుదుట న్భస్మ మలంకరించి యఱుతన్ రుద్రాక్షము ల్దాల్చి లీ
ల దలిర్ప న్భవదీయదివ్యచరితల్ గానంబు గావించుచు
న్ముద మొప్ప న్విహరించువానిఁ గని తా మోహాతిరేకంబుచే
వదలంజాలదు ముక్తికాంత శివ...

53


శా.

నీలీలాచరితావళు ల్వొగడువానిం జూచి భీతాత్ములై
జాలింబొందుచుఁ గాలకింకరులు తత్సామీప్యమం దుండ కే
చాలంగాఁ బరువెత్తిపోదురఁట మించన్ దవ్వుగా నోజగ
త్పాలారాధితపాదపద్మ శివ...

54


శా.

నీదాక్షిణ్యము నీకృపాతిశయము న్నీభక్తవాత్సల్యము
న్నీదీనార్థిజనైకపోషణము నీనిర్వాణసంధాన మిం

కేదైవంబులయందుఁ గాన మిఁక వేయేలా గణింపంగ నీ
పాదాబ్జంబులఁ గొల్చి ముక్తుఁడగు సాంబా భ...

55


శా.

నీకర్పించినపత్రపుష్పఫలపానీయంబు లుద్యన్మదా
స్తోకేభేంద్రమనోజవాశ్వవిలసత్పూర్ణేందుబింబాననా
ద్యాకారంబులఁ బుట్టి పూర్వభవవిద్యాయుక్తి బ్రాక్పూజక
ప్రాకారంబులఁ బాయకుండునఁట సాంబా భ...

56


మ.

పరుసం బౌపులితోలు పైనిడి చితాభస్మంబు మైఁ బూసి య
బ్బురమౌపున్కసరు ల్ధరించి జగము ల్పుట్టించుచుం ద్రుంచుచుం
బరమాయాకలితేంద్రజాల మరుదొప్పం జేయఁగాఁ గాటికా
పరివై యుండితివౌ బళీబళిర సాంబా భ...

57


మ.

ధరణి న్రాజశిఖామణిం గొలిచి వేదండాశ్వరత్నాంగనా
స్థిరభాగ్యంబులఁ గాంచునందు రది యెంతేవింతగాదా దిగం
బరు నాయాదిమభిక్షుని న్గొలిచి శశ్వత్ప్రాభవప్రోల్లస
త్పరమైశ్వర్యముఁ గాంచుచుండ శి...

58


మ.

వివిధామ్నాయపురాణశాస్త్ర మనుసద్విద్యారహస్యంబులన్
హవనాదిక్రియల న్ప్రయాగముఖదివ్యక్షేత్రరాజంబుల
న్వివరింప న్సకలప్రపంచమును నీవేకాని విశ్వంబులో
భవధన్యం బిసుమంత లేదుగద సాంబా భ...

59

మ.

జలజాతాక్షచతుర్ముఖత్రిదశభాషాశేషవాచస్పతుల్
పలుక న్నేరరు నీప్రభావలవమున్ భావింపలే రట్టిచో
నిల నే నెంతటివాఁడ నీదుమహిమం బెన్నంగ నోలింగ భ
వ్యలసద్భూరిదయాంతరంగ శివ...

60


మ.

ఫలపర్ణాంబుసుమంబు లిచ్చిన ననల్పశ్రీత్రిలోకీసము
జ్జ్వలసామ్రాజ్య మొసంగి నీవు తుద మోక్షం బిచ్చుచుండంగ నీ
సులభోపాయ మెఱుంగలేక మనుజుల్ క్షోభింతురేమొక్కొ యు
త్పలినీబంధుకళావతంస శివ...

61


మ.

చెనక న్వచ్చి మనోజుఁ డంతటనె భస్మీభూతుఁడైపోయె నీ
సున దక్షుండు నిరాకరించి చటులాస్తోకార్తిపాలయ్యెఁగా
న నిఁ కెవ్వండు శివాపరాధ మణువైనం జేసి చేటొంద కే
మనఁగా నేర్చు జగంబులోన శివ...

62


మ.

క్షితి నానావిధమర్త్యకోటిఁ దమవాసిం బ్రోవఁగాఁబూని దై
వతముఖ్యు ల్దగుపాళ్లు వెట్టికొని రిబ్భంగిన్; యతు ల్విష్ణుపా
ల్క్రతుకర్త ల్శతమన్యుపాలు శ్రుతిధర్మజ్ఞుల్ చతుర్వక్త్రుపా
ల్పతితానీకము నీదుపాలు శివ....

63


మ.

అలఘూదారతఁ బూను నాయెడను నీ కర్పించితిన్ మేను నీ

చుల యాచింపఁగలేను నీవె గతి యంచు న్నమియున్నాను దీ
నులతోఁ బంతముమాను నీకిపుడు న న్బ్రోవ న్వశంబౌను న
న్వలదన్న న్నిను మానఁబోను శి...

64


శా.

ఏదైవంబులవంకఁ జూడ నిఁక నే నెట్లైన ని న్వీడ నీ
వే దిక్కం చిటు లున్నవాఁడఁ బలుకు ల్వేయేల నీవాఁడ నీ
వాదేలా ననుఁగన్నవాఁడ యెపుడు న్బల్మాఱు నాతోడ నీ
పాదంబు ల్నెరనమ్మినాఁడ శివ...

65


శా.

ప్రారబ్ధం బను బల్నెపంబొకటి నాపై వేసి యాపై మహా
దారాపత్యధనాదిపాశముల చేతంగట్టి దుర్వారసం
సారాబ్ధిం బడఁద్రోసి నీ వటు తటస్థప్రౌఢితో నుండి య
య్యారే చిత్రము చూతువౌర శివ...

66


మ.

చెలిమిన్ గుబ్బలిరాచకూతు రఱమైఁ జెన్నొప్ప లేనవ్వువె
న్నెలనిగ్గు ల్దిశలెల్లఁ గప్పఁ జెలువౌ నీరూపు బాగొప్ప నా
కలలోనైనను జూపుమప్ప యడుగంగారానిదే తప్ప న
న్నలఁతం బెట్టిన నేమిగొప్ప శివ...

67


మ.

శివనామం బొకసారె భ క్తివిభవశ్రీ మీఱఁగా బల్కిన
న్వివిధాపన్నిచయం బడంగుఁ దతదుర్విఘ్నౌఘము ల్గ్రుంగు ను
త్సవము ల్పెక్కు చెలంగు నిత్యపరతత్త్వశ్రేయ ముప్పొంగుఁ ద
ద్భవబంధంబులు ద్రుంగు నిక్క మిది సాంబా భ...

68

మ.

సవనవ్రాత మొనర్పనేల పశుహింస ల్సేయఁగానేల యో
గవిధానంబులు పూననేల తనువింకంజేయఁగానేల తా
వివిధాభీష్టము లొందవచ్చు సుఖియై విశ్వేశసద్భక్తితో
భవదంఘ్రిస్మరణంబుఁ జేసి శివ...

69


మ.

ఖలసాంగత్యము గాదు చేసినను దుఃఖం బీకనే పోదు పె
ద్దలసాంగత్యము మానరాదు మతభేదంబుల్ వృథావాదు ని
శ్చలసారం బగునీదుభక్తి వరమోక్షప్రాప్తికిం బాఁదు మో
హలతల్ ద్రుంపక ముక్తి లేదు శి...

70


మ.

పరుల న్బాధలొనర్చి బల్ధనము సంపాదించి విఖ్యాతికై
ధరలోఁ జేసిన యట్టిధర్మములు వ్యర్థంబై చనుంగాక సు
స్థిరతంబొందునె సర్వభూతపరితృప్తుం జేయుటే నీమహా
పరిచర్యాకరణంబుగాదె శివ...

71


మ.

క్షితిలోఁ గొందఱు వారివారిమతముల్ శ్రేష్ఠంబు లన్యంబులౌ
మతము ల్గావని చెప్పుచుందు రిది నీమాయావృతభ్రాంతి సం
తతనానావిధజంతుసంతతిహృదంతర్యామివౌ నీకు స
మ్మతి గానట్టిమతంబునుం గలదె సాంబా భ...

72


మ.

అరయ న్నీ వపరోక్షత న్నిఖిలభూతాత్మస్వరూపుండవై

పరిపూర్ణస్థితి నుండఁ గన్గొనక ని న్భావింతు రెందోజనుల్
పరమేశా భవదీయమాయఁ దెలియం బద్మోద్భవాదిత్యగో
పరమేశాదులకైనఁ బోలదఁట సాంబా భ...

73


మ.

విపరీతార్థకుతర్కవాదములచే విజ్ఞాన మొప్పారునే
కపటాచారవిడంబనక్రియలచేఁ గైవల్య మేతెంచునే
చపలాశావిషయోపభోగములచేఁ జల్లారునే తృష్ణ నీ
యపరోక్షానుభవంబు లేక శివ...

74


మ.

కలివేళ న్విధిచోదితక్రియ లొగిం గావింపఁగాలేక తా
రలసుల్గొందఱు తత్త్వవేదులము మేమంచు న్సుకర్మంబు లి
మ్ములఁ గావింపరుగాని భోగ్యవిషయంబు ల్మానగా లేరు ని
ష్ఫలదంభోక్తుల ముక్తి చేకుఱునె సాంబా భ...

75


మ.

నరుల న్మోసముపుచ్చి సొమ్ముగొన నానాశాస్త్రవాదంబులు
న్వరవేదాంతవిశిష్టయుక్తులును దంభప్రాప్తవేషంబులుం
గరమొప్పారునుగాని సద్గురుకటాక్షం బింత లేకున్న నీ
పరతత్త్వం బెఱుఁగంగరాదుగద సాంబా భ...

76


శా.

మీనం బెప్పుడు నీటనే మునుఁగుఁ దా మేషంబు పర్ణాశనం
బే నిత్యంబొనరించుఁ బాము పవనంబే గ్రోలు నేప్రొద్దు న

దాన న్వానికి నేమిపుణ్యఫల మందంగల్లె నట్లౌను నీ
ధ్యానం బించుక లేని సత్క్రియలు సాంబా భ...

77


శా.

దేవా తావకభక్తి లేనినరుఁ డేతీర్థంబులం గ్రుంకినన్
గ్రావాగ్రంబులపై వసించినను యోగశ్రేణి సాధించినన్
గైవల్యార్హుఁడు గాఁ డతం డితరకాండ ల్మాని నిన్నాత్మలో
భావింపంగలవాఁడు ముక్తుఁడగు సాంబా భ...

78


మ.

తనవారొక్కరుఁ గూడ రారు యమబాధ ల్మాన్పఁగాలేరు మున్
ధనకాంక్షం దనుగూడినారు తుదఁ జెంత న్నిల్వఁగాఁబోరు గా
వున వైరాగ్యము మీఱు ధీరు లతిభవ్యుల్ వారు నీభక్తిభా
వనచే ముక్తికి జేరువారు శివసాంబా భ...

79


మ.

ధరణిం గోరకయున్నఁ బోవు సుఖముల్ తాఁ గోరిన న్రావు గాఁ
పురము ల్నిత్యము గావు సంతప్రజగుంపుం బోక లేపోవు నీ
శరణన్న న్విడనాడలే విదియె మోక్షప్రాప్తికిం దావు ద
బ్బఱవేసంబులు మెచ్చవీవు శివసాంబా భ...

80


మ.

తిరమై దేహము నిల్చునా శమనుఁ డిందే నిల్వఁగానోర్చునా
సిరి దా నిల్కడ సేయునా యెపుడు వాసి న్వెన్నెల ల్గాయునా

ధర సంసారము నిత్యమా తెలివి నొందన్లేక మున్నెన్నడో
పరమార్థం బొనరింతు నే ననిన సాంబా భ...

81


మ.

చెదరున్ దృష్టి మనీషయుం జెదరు బల్జీర్ణంబులై యంగము
ల్వదలున్ దంతము లెంతయుం గదలు శీలం బంతమున్నే చను
న్ముదిమిం జిక్కినవేళఁ జిత్ర మిదియేమో తృష్ణ దానొక్కఁడే
వదలంజాలదు గాని మానవుని సాంబా భ...

82


శా.

జాతిద్రోహులు బంధుఘాతకులు హింసాసత్యశూన్యుల్ దయా
వీతస్వాంతులు సాధుబాధకులునై వేధించుచున్నాఁడు ని
ర్భీతిం దాఁ గలిపూరుషుం డిపుడు ధాత్రి న్నీవు పేరుంచిన
న్మాతండ్రీ బ్రదుకెట్లు సాధులకు సాంబా భ...

83


మ.

ధనమే సాధన మెల్లకార్యములకుం దర్కింప సత్కీర్తిజీ
వనమే పావన మెల్లలోకములకు న్వర్ణింప నీపాదపూ
జనమే భాజన మెల్లభద్రములకుం జర్చింపఁగా నేరికి
న్మనమే కా ఘనమోక్షకారణము సాంబా భ...

84


మ.

ధర సత్కీర్తికి దానమే మిగుల సద్యస్తృప్తికిం బోనమే
సరసత్వాప్తికి గానమే కలహనాశస్ఫూర్తికి న్మౌనమే
గరిమావాప్తికి మానమే నిరతమోక్షప్రాప్తికిన్ జ్ఞానమే
పరఁగుంగా కిఁకఁ గానమే క్రియల సాంబా భ...

85

మ.

 నిను మెచ్చించుట భక్తినే జనులకు న్మేలౌట సత్యో క్తినే
తనకు న్బంధము రిక్తినే పరమభద్రస్ఫూర్తి సద్యుక్తినే
కన నిశ్చింత విరక్తినే సకలదుఃఖప్రాప్తి సంసక్తినే
మనముం బట్టుట యుక్తినే యగును సాంబా భ...

86


శా.

ఆయుర్దాయము సెల్లి మర్త్యులు సదా యామ్యాలయం బొందుటల్
శ్రేయస్సంపద నొక్కెడ న్నరులు నిశ్రేయస్కులై యొక్కెడం
గాయక్లేశము నొందుట ల్గనియు రాగద్వేషము ల్మాన రీ
మాయాపాటవ మేమి చెప్ప శివ. . .

87


మ.

జగతిం జూడ నియోగియై మొదలఁ దా జన్మింపనేరాదు క
ర్మగతిం జన్మము గాంచెనేని బ్రదుకన్రా దట్లు జీవించిన
న్వగతో నిర్ధనుఁ డౌట గూడ దటు లైన న్వేగ మిల్వాసి గో
వ్యగతిం దాపసియై చరింపఁదగు సాంబా భ...

88


మ.

నిను నేవింపక పొట్టకూటికి జను ల్నిత్యంబు మూఢాత్ములై
ధనికద్వారములందుఁ గొల్చెదరు తత్కర్మంబు నేమందు గా
ననమం దుండెడు కొండచిల్వకు శిలాంతర్వర్తి యాకప్పకు
న్మననాహారముఁ దెచ్చి నీ విడవె సాంబా భ...

89


మ.

పుడమిం బెక్కువనంబుల న్మధుఫలంబుల్ స్వాదుపానీయము

ల్గడునొప్పారు లతావితానములు యోగ్యంబౌ గుహావాసముల్
గడిమిం బ్రోచెడిదాత వీవు గలుగంగాఁ గూటికై దీనతం
బడి యాచింపఁగ నేల దుర్మదుల సాంబా భ...

90


మ.

ఇరవందం జడలందు గంగగల నీ కీభూజలస్థానము
న్నిరతిం జాబిలిపువ్వుఁ దాల్చు దొరవౌ నీ కీధరాపుష్పముల్
గురులోకత్రయదీపకుండవగు నీకుం దీపము ల్మెచ్చుగా
వరయన్ భక్తి యొకండు గాని శివ...

91


మ.

పరగ న్మన్మథదేహదాహవిలసద్భస్మాంగరాగంబు న
బ్బురమౌ బ్రహ్మకపాలమాలికలు సద్భోగీంద్రభూషాచయం
బిరవొందం ధరియించు మేటివగు నీ కీగంధమాల్యాదులం
బరితోషం బొనరించువాఁ డెవఁడు? సాంబా భ...

92


శా.

శంకాతంకము లేక శంకరున కీషత్సామ్య మొందంగలే
రిం కేవేల్పు లటంచు దివ్యకరిపై హేమధ్వజం బెత్తి యీ
పంకేజప్రభవాండమెల్ల వినిపింపన్ భూరిభేరీమహా
భాంకారంబులు నిండ జాటెదను సాంబా భ...

99


మ.

బలువింతౌ బరువింత యౌ ననక యాబంగారపుంగట్టుచి
ల్వలఱేని న్వలఱేనితండ్రి నొకకేల న్వి ల్గొనం బమ్ముగా

బలిమిం బూనిన మేటి వీవు ననుఁ జేపట్టంగ వ్రేఁగౌనె యా
బలిపుత్రాంగణపారిజాత శివ...

94


మ.

సకలస్థావరజంగమాత్మ వని యశ్రాంతంబు ని న్వేఁడ నీ
వకటా నాదు మొఱాలకింప విపు డాహా కేవలస్థాణుమూ
ర్తికి నే మ్రొక్కినచందమయ్యె శివుఁ డెంతే సుప్రసన్నాత్ముం డన్
ప్రకటఖ్యాతికి సంశయంబొదవె సాంబా భ...

95


మ.

వ్రతనిష్ఠల్ సురభూసురార్చనలు దివ్యక్షేత్రయాత్రల్ శ్రుతి
స్మృతిధర్మంబు లొకింత యే నెఱుఁగ మీశ్రీపాదపద్మంబులే
మతిలో నమ్మితి నే ననన్యరతి నో మాతండ్రి శంభూసతీ
పతి నీవే గతి కావవే నిరతి సాంబా భ...

96


శా.

తుంగాబ్దాంబుకణంబు లెన్నఁదగు భూధూళిం గణింపం దగు
న్నింగిం జుక్కలు లెక్కవెట్టఁదగు నింతేగాని నాతప్పు లె
న్నంగారా విఁక నీవుగా కొకరు న న్రక్షించువా రేరిఁ కె
బ్భంగిం బ్రోచెదొ నీవ దిక్కుసుమ సాంబా భ...

97


మ.

పరఁగన్ శంభుఁడు దీనబంధుఁడని చెప్ప న్నమ్మి యాస న్నిరం
తరము న్నే మొఱలిడ్డఁ బల్క విది యెన్న న్మోసమో లేక మున్

ధర నేఁ జేసినదోసమో కరఁగ దన్నా నీ మనం బింత యో
వరకారుణ్యసముద్ర రుద్ర శివ...

98


మ.

పరదైవంబవు నీ వటంచు మది నీపాదాబ్జము ల్నమ్మి నేఁ
బరదైవంబుల వేఁడలే దెపుడు నాపై నీ వుపేక్షించినం
బరఁగంగా ననుఁ బ్రోచువా రెవ రిఁకన్ భక్తావనాంచద్దయా
పరమూర్తీ శరణాగతార్తిహర సాంబా భ...

99


శా.

నీవే తల్లియుఁ దండ్రియు జుట్టంబులు
న్నీవే దాతవు దైవమున్ గురుఁడు నా నిర్వాణనిక్షేపము
న్నీవే నా దగుతోడునీడ మఱియు న్నీవే సమ స్తంబుగా
భావింతు న్భవదన్య మే మెఱుఁగ సాంబా భ...

100


శా.

నీపాలంబడితి న్నిరంతరము నే నీపాదము ల్నమ్మితి
న్నీపద్యావళిఁ బాడుచుంటి నెపుడు న్నీకంటె న న్నెవ్వరుం
గాపాడం దొర లేఁ డటంటి నిది నిక్కం బింక నీచిత్త మో
పాపగ్రావవిభేదశంబ శివ...

101


శా.

నీవిఖ్యాతచరిత్రము ల్విను చెవుల్ నీపూజకౌ హస్తముల్
నీవాసంబుల కేగు పాదయుగము న్ని న్గాంచు మేల్చూపు నిన్

గైవారం బొనరించు జిహ్వయును నీకై మ్రొక్కు మూర్ధంబు ని
న్భావింపంగల బుద్ధి నా కొసఁగు సాంబా భ...

102


శా.

నీకీర్తిశ్రుతి నీకథాశ్రవణము న్నీపాదసంసేవయు
న్నీకళ్యాణగుణానువర్ణనము నీనిత్యానుసంధానము
న్నాకుం బాయకయుండున ట్టొసఁగు మన్నా జన్మజన్మంబుల
న్బాకారిస్తుతపాదపద్మ శివ...

103


మ.

పరుల న్వేఁడకయుండ వేఱొకఁడు న న్బ్రార్థించిన న్వానికిం
బరఁగన్ లేదనకుండ నామనము నీపాదారవిందైకసం
స్మరణం బేమఱకుండ నీవరము లిమ్మా నాకు శశ్వత్కృప
న్వరదా శంకర సుప్రసాద శివ...

104


మ.

నమదార్తైకశరణ్య నీవు వెలయ న్మత్తేభశార్దూలచ
ర్మములం బ్రీతి వహింతు గాన నిపుడే మత్తేభశార్దూలవృ
త్తముల న్నీ కుపహార మిచ్చితిని భక్తవ్రాత మే మిచ్చినం
బ్రమదం బొప్పఁ బరిగ్రహింతుగద సాంబా భ...

105


మ.

తనయు ల్మాటలు సూటి నేరక తమిం దప్పొప్పు లెల్లాడినన్
జనకు ల్మోదముతోడఁ జూతు రటులే సర్వేశ నీ వీజగ
జ్జనకుండౌట మదుక్తిలోపముల నెంచంబోక వాత్సల్యభా
వనిరూఢిం గరుణించి కైకొనుము సాంబా భ...

106

మ.

వితతశ్రీకరసత్పదార్థగరిమ న్విఖ్యాతి శోభిల్లు నీ
శతకం బెవ్వరు వ్రాసినం జదివిన న్సద్భక్తి నాలించిన
న్సతతాభీష్టసమస్తభోగపరమైశ్వర్యంబులం బొంది శా
శ్వతకైలాసపదంబుఁ గాంతు రొగి సాంబా భ...

107


మ.

చెలువౌ నీకృతిఁ గూర్చి నీ కొసఁగితిన్ శ్రీకూచిమంచాఖ్యస
త్కులసంజాతుఁడ సోమసుందరవరాఖ్యుండ న్మహాగౌతమీ
విలసత్తీరతలస్థపల్వలపురీవిఖ్యాతవాసుండ ను
జ్జ్వలలీలం దయ దీనిఁ జేకొనవె సాంబా భక్తచింతామణీ.

108

భక్తచింతామణిశతకము సంపూర్ణము.