భక్తిరసశతకసంపుటము/రెండవసంపుటము/శ్రీరంగేశశతకము

పీఠిక

శ్రీకృష్ణలీలల దెల్పు నీశతకము మాతండ్రిగారి చిరకాలమిత్రులును విజయనగర సంస్థానాస్థానపండితులు నగు శ్రీమాన్ ముడుంబై వేంకటరామనృసింహాచార్యస్వామిగారిచే రచింపఁబడినది. వీరు సజీవులై విజయనగరమునందే యుంటున్నారు. శ్రీకూర్మముదగ్గఱ వంశధారానదీతీరస్థమగు అచ్యుతపురి వీరిజన్మస్థానము. ఈ మనోహరమగు శతకమును శతకసంపుటమునఁ జేర్చుటకు వీరు అనుజ్ఞ దయచేసినందులకు కృతజ్ఞులము.


తండయార్పేట

ఇట్లు

చెన్నపట్నం.

వావిళ్ల . రామస్వామిశాస్త్రులు

16-4-26.

అండ్ సన్స్

శ్రీరస్తు

శ్రీరంగేశశతకము

సీ.

శ్రీరుక్మిణీదేవి చెలులతోఁ గూర్చుండి
                      ముచ్చటింపుచుచుండ వచ్చి నీవు
సడియుడిపి సరవి సన్నఁ జేసి కనులు
                      మూసిన ముదితయు ముసిముసినగి
చేతులఁదడిమి నెచ్చెలులార గోవర్ధ
                      నాచల కషణకిణాంక కఠిన
తరము లివి కఠినస్థలులకే తగునన
                      నీనవ్వుఁ గనుఁగొని నెలఁతలు సన


గీ.

నౌనె నిజమని చను మెట్టలంట నీదు
చాతురి నుతింప మాబోటిజనుల కెటుల
నలవియగునని నీకు జోహా రొనర్తు
వీతభవతృష్ణ రంగేశ వేషకృష్ణ.

1


సీ.

అడుగు హొరంగెల్ల జడజాతముల కిచ్చి
                      జంఘుల సొంపుల శాలిగర్భ

ముల నింపి తొడలసొంపు లనఁటుల కొసంగి
                      కౌను డాల్వెలి జడకాని కిచ్చి
బాహుల నిగ్గు నిబ్బరమెల్ల మన్ను మో
                      సెడు ద్విజిహ్వున కిచ్చి జిగిమొగంబు
సొగసు గురుద్రోహి యగువాని కొసఁగి మై
                      చాయ పయోవాహసమితి కిచ్చి


గీ.

యిది తెలియఁబో దెవరికని మదిఁ దలంతొ
తగదుసుమి నన్నుఁ గావక తక్కితేని
రవ్వసేయుదు నిది గట్టి రచ్చఁ బెట్టి
వీత...

2


సీ.

నెరివిరిసరులు నీకురులు బట్టెనుగద
                      మణికిరీటమున నీమస్తకంబు
తా కట్టిబడియెగద రతనపుంబాహు
                      పురులు నీజిగిబాహువులను గట్ట
గద నీ వెడఁదఱొమ్ము గమలామహాదేవి
                      యాక్రమించెనుగద యవనిధరము
సుధ వేగఁ దెమ్మని సురలు నీవీపున
                      మోపిరిగద యెంత మోసపోతి


గీ.

వకట యిటువంటి నిన్ను వేదాంతములు స్వ
తంత్రుఁడ వటంచుఁ బలికిన దారిఁ జూడ
నర్థభేదంబు గనపడు నయ్య మాకు
వీత...

3

సీ.

చల్లనితావులు చల్లు మేల్మల్లెమొ
                      గ్గలదండ లురమునఁ గ్రమ్మి విరియ
ఘమ్మని వాసనల్ గ్రమ్ము గులాబీవి
                      రులసొంపు నెరుల పెంపు లలరింప
ధగధగమనీవి జిగి గొను నూనూగు
                      మీస మత్తరుపూఁత మెఱుఁగులీన
నున్పుగన్పడ దువ్వు జున్పను ల్వెడలి ము
                      త్యంపుచౌకట్లడా లలవరింప


గీ.

బల్కుసుంబాహొరంగు నిబ్బరపురంగు
లీను సన్నంపుదువ్వల్వఁ బూని నీవు
సఖులతోఁ గూడి క్రీడించు జాడఁ దలఁతు
వీత...

4


సీ.

మాతల్లి వైదర్భి మమత నీగుణగణ
                      ములు బలుమారు బుధులవలన వి
ని దినదినమునకు మదనుని వెతలను
                      గని నీదుభావముల్ గాంచి మదిని
సొగసున కుప్పొంగి సొక్కుచు మాటికి
                      మ్రొక్కుచుఁ దాలిమిఁ దక్కుచు నహ
హా యిట్టి ప్రాణేశుఁ డబ్బునా నావంటి
                      నెలఁత కటంచుఁ గన్నీ రొలుకుచు


గీ.

నెచ్చెలులకైనఁ జెప్పక నిజశరీర
మెల్లఁ జిక్కఁగ నిలువెల్ల వెల్లబారె
నెంత మోహనమూర్తివో యెఱుఁగమయ్య
వీత...

5

సీ.

గందంపుమైపూఁతఁ గవిసి జాల్కొను లేత
                      చెమ్మట లేమొకో చెలియ కిపుడు
కమ్మతెమెర వీవు గ్రమ్మఁ గందినరూపు
                      కనుపట్టు నేమొగో కాంత కిపుడు
అపరంజినెరచాయ లడరెడు వేడిమి
                      వెలిమారు టేమొకో వెలఁది కిపుడు
కాటుక కన్నీటఁ గరగి జారినతేట
                      చూపట్టు నేమొకో సుదతి కిపుడు


గీ.

అన్నిటికి నేడు చెలులార చిన్నవోయె
ననుచు నాసామి నిను మనమందుఁ దలఁచి
కుందు రుక్మిణిఁ గని జాలిగొనిరి చెలులు
వీత...

6


సీ.

వెలిదమ్మిపూరేకు తెలిడాలుగల వాలుఁ
                      గనుదోయి రేనిద్రఁ గాంచమరచె
మృదులకేతకిపత్రసదృశమౌ నెమ్మేను
                      హంసతూలికసెజ్జ లంటమరచె
నిండుచందురునిపై దండెత్తు నెమ్మోము
                      మృగనాభితిలకంబు సొగసు మరచె
తేఁటిమై చకచకల్ దాటు చక్కనికురుల్
                      గడిదేర గుడియోరముడుపు మరచె


గీ.

వినుడు చెలు లిది గోపాలు విడనిజాలు
యకటకట యేమి బోధింతు మనుచుఁ బలుకు
చెలిపలుకు వించు రుక్మిణి సిగ్గుగాంచు
వీత...

7

సీ.

పైదాననా నీదు భావంబు దాచఁగాఁ
                      దగదు నాతల్లి నీదాననమ్మ
నీవెత ల్గని నీరునిల్వుగా నుంటినే
                      తేట తెల్లము గాఁగఁ దెలుపుమమ్మ
నీకు నాకును మనం బేకమే గదవె న
                      న్నెఱుఁగవా యిటు దాచనేలనమ్మ
ముగ్ధ లెందఱు లేరొ మొగమాట మొందరో
                      యీరీతి మే మెందు నెఱుఁగమమ్మ


గీ.

తరుణి నీనోటఁ బలికింపఁ దరముగాదె
తెలిసెఁ గృష్ణునిపైఁ గూర్మి కలదుగదె య
టన్న వినుదాని సిగ్గెన్న నలవిరన్న
వీత...

8


సీ.

మొగమెత్తనీని యీ తొగఱేని నులుకింపఁ
                      దొయ్యలి వేనలి దువ్వవలదొ
నడువనీయక రోసపడు నంచ నెడలింపఁ
                      జెలువ ధారావాటి మెలఁగవలదొ
పలుకనీయకఁ గూయు చిలుకల నులికింప
                      నతివ మై సాంకవం బలఁదవలదొ
చూడనీయక కోల లాడించు మరుఁ డుల్కఁ
                      దెరవ కుంకుమబొట్టు దిద్దవలదొ


గీ.

యేమి తెలియని చెలివిగా కేము నేగి
జేయుదుమటె యటన్న నెచ్చెలుల కువిద
యుత్తరం బీదు నినుఁ బట్టి యుడుకు పుట్టి
వీత...

9

సీ.

పున్నమరేఱేని వెన్నెలల్ తిన్నచో
                      నేల నాడుదమమ్మ బాల రావె
కేళికావాపికాకూలములను జగ్ర
                      ములఁగవ గూర్తము ముదిత రావె
చంద్రునికాంతిచే సగమైన చుక్కల
                      గణియింత మిప్పుడు కాంత రావె
యాకొన్న మనచకోరాళి కాకలి దీర
                      లేవెన్నె లిడుదము లేమ రావె


గీ.

యనుచు లాలించు చలు లిటు లనుడు వినుచు
వత్తు రానను మాను కోపంబు బూను
రమణి నిను మదిఁ గూర్చి విరాళిఁ బేర్చి
వీత...

10


సీ.

పలుమారు పిలిచినఁ బలుకదు బింబోష్టి
                      యగుటచే నేమొకో యతివలార
నెమ్మోము జూపదు నీరేజమృదుపాద
                      యగుటచే నేమొకో యతివలార
పాడదు పంచమఫణితిఁ బల్లవపాణి
                      యగుటచే నేమొకో యతివలార
వగఁగుల్క మనతోడ నగదు కోకస్తని
                      యగుటచే నేమొకో యతివలార


గీ.

యనెడు చెలిపల్కు శుకపికవనజవైరి
చంద్రికావ్యంజకంబయి చెలియ కకట
కఠినతరమయ్యె నినుఁ గూర్చి కాకఁ బేర్చి
వీత...

11

సీ.

చుట్టుజరీమేల్కుసుంబంపురంగుస
                      న్నంపుటోణీపింజె నాగరికము
మీఱ సగము విప్పి మేనఁ గప్పి మిగులు
                      సగమును పింజపాటుగను సవ్య
గళపార్శ్వ మంటి లేఁగదళిపత్రమువంటి
                      వీపున జీలాడ విడచి మడమ
లను దొట్టుపంచకట్టున మణిమయము
                      లగుపాదుకల నంటి యంటనట్లు


గీ.

వెలయు లీలావిహారంబు సలుపు నీవు
మోహమునఁ గన్నులం గట్ట ముదిత దిట్ట
తనము విడనాడు నను గావుమనుచు నేఁడు
వీత...

12


సీ.

అపరంజియుట్ల ముత్యాలబల్కంఠితో
                      నంటి తరతరము నమరుచును జి
లుగుకెంపులరవ జెలువుగిలుకసరులు
                      చంద్రహారంబులు చాయలీన
మేన గంధమలంది జానుగా నోరగా
                      ముడిచిన వెగముడి మొల్ల సరుల
దట్టముగాఁ జుట్టి గానిపై శిఖిపింఛ
                      మలరిచి యమునావనాంతరమున


గీ.

మెలఁగు నీమురళీగానమృదులరీతి
నాతి వినురీతి భ్రమియు నరాతియగుచు
మదనుఁ డెదఁ గ్రాచఁ బువుటూచ కెదిరి వీడ
వీత...

13

సీ.

నెమ్మోము చెలియయ్యు నీరజవైరి వి
                      రోధింప నకట సరోజతతియు
నైనను గనికరమూనదు మరి నేరి
                      తోడ నేస్తముగట్టు తోయదంబె
శిఖిని బ్రేరేచి దాఁ జీదరఁ జేయు స
                      మీరమైనను హంసవారమైన
నయయొ ధైర్యము జెప్పునది లేక మీఁదిమి
                      క్కిలి తాపకారులై గినియసాగె


గీ.

సామి వైదర్భి నిను మానసమునఁ దలఁప
మిత్రులె శత్రు లైరి తచ్ఛత్రు లెటుల
మిత్రు లగుదురు చాలు నీమీఁది ప్రేమ
వీత...

14


సీ.

తలిదండ్రులకుఁ దెల్ప ఫలసిద్ధి యగుఁగాని
                      పరిభవింపుచు లజ్జ పలుకనీదు
ఊరకే పరిహాస మొనరింతు రక్కట
                      చెలులచేఁ జెప్పింప నలవికాదు
యిది చెలుల్ గ్రహియించి రేమొకో రుక్తితోఁ
                      దెలిపిరా విఘ్నంబు గలుగఁజేయు
నూరకుండెదనన్న ఘోరాశుగములచేఁ
                      గ్రాచడే పూవుసింగాణిజోదు


గీ.

అన్న చేదీశ్వరుని కివ్వ నన్నుఁ దలఁచె
నెటులనుండునొ యిక దైవఘటన యనుచు
నకట మదిఁ గుందు నినుఁ గోరి నాయొయారి
వీత...

15

సీ.

కృష్ణా యనుచు ముద్దుకీరంబుఁ బలికింపు
                      మంచుఁ జెల్మిని చెలి ననునయించు
నల్లనివాని నీనాతి మోహించెనే
                      యని నవ్వుచెలియపై నలగి చూచు
గొల్ల లేమౌదురో కోమలి వెన్నదొం
                      గను దెచ్చునని నవ్వఁ గనలియుడుకు
వికటంబులకు నేమి వెలఁదులారా నన్నుఁ
                      జీదరించకుఁ డంచుఁ జెలులఁ బల్కు


గీ.

నౌర నాసామి నిను మానసాబ్జమందు
నిలిపి నీసుగుణంబులె దలఁచుగాని
వేరె యొకమాట వినదు నిండారఁ గనదు
వీత...

16


సీ.

మోము చందురునంటి ముంగురుల్ శ్రమవారి
                      గురిసి కార్మొగు లనఁ గొమరు మిగుల
నూర్పు దెమ్మెరలచే నుడికి కెందలిరాకు
                      వంటి వాతెర వసివాడు జూప
ముఖవాసనాలోభమునఁ గ్రమ్ము భృంగసం
                      తతి నాస గ్రాచఁగాఁ దలఁగిపోవ
మైదట్టముగఁ బూయు మంచిగందము పరి
                      తప్తమై తుకతుకధ్వనుల నుడుక


గీ.

సఖుల మరపించి మదిలోన సంభ్రమించి
విడనితమి సాయమూని ని న్వెతుకఁబూని
విపినములపొంత కలకాంత వెడలె నంత
వీత...

17

సీ.

తుమ్మెదల్ జుమ్మని గ్రమ్మ దెమ్మెరలు
                      దుందుమ్మని గమ్మపూదుమ్ముఁ జిమ్మ
కమ్మవిల్దొర నల్మొగమ్ములఁ గ్రమ్ము న
                      మ్ములజడి యలజడి కలవడి తుద
నెదయదలు చిలుకరొదలు కలవలింపఁ
                      గోయిలమూఁకలు గొండకూక
ల బలుఢాకల యొడల వెడలుకాకల
                      కాకలకంఠి చీకాకు పడుచు


గీ.

ధృతి విడుచు తడబడుచు నేగతి నడచు ను
పాయ మెఱుఁగ కపాయము బాపనేర
దకట చెలి నేలఁదగ దేమి యపుడె సామి
వీత...

18


సీ.

మంజీరశింజాసమాహూతకలహంసి
                      గదలనీ నన్నట్లు కాళ్లఁ బెనఁగ
బహువర్ణసుమరజఃపటలచిత్రితకీర్ణ
                      కేశబంధము కేకిఁ గేళిసేయ
నవననోదిత్వరోష్ణవిసర్పినిశ్వాస
                      మలరుజొంపములసొం పవఘళింప
నక్షికజ్జలమిశ్రితాశ్రునిమ్నగకుచా
                      భోగఘట్టమునుండి పొంగిపార


గీ.

నిను వెతుకగోరి వనిఁ జేరి ననఁ గటారి
దారి నారి నెగయుపూలఁ గోరి దూరి
శౌరియని తల్లడిలు మాయొయారి యోరి
వీత...

19

సీ.

మొగమెత్తనీదాయె వెగటుతమ్ములపిండు
                      పలుకనీదాయె రాచిలుకదండు
గళమెత్తనీదాయె గండుకోయిలఢాక
                      పొలయనీదాయె వే సోకుమూఁక
చేయెత్తనీదాయె చిగురుటాకుబిడారు
                      కాంచనీదాయె వేఁ గల్వచారు
తలయెత్తనీదాయె మలినాళిరింఛోళి
                      కదలనీదాయె దుర్మదమరాళి


గీ.

కలికి గిరివడి గిరిజడి కాకపోక
నిలువలేక యనోకహ నిబిడకేళి
గహనకుసుమపరాగశర్కరల దరల
వీత...

20


సీ.

నిండారఁ గాయు రేయెండవేడిమిఁ గ్రాగి
                      పదము లెట్టగనీని పచ్చికప్పు
రపుదిప్పలను జెప్పరాని నొప్పి ధృతి ద
                      ప్పి విరాళి ద్రోవ దప్పి బలుదప్పి
గొని చివురుల మంటలని దేఁటులను పొగ
                      లని దెమ్మెరలఁ జిమ్ము ననలధూళి
కణముల విస్ఫులింగములని తలఁచి
                      హా వనవహ్ని చుట్టెడు ననుచుఁ దేఁటి


గీ.

రొదలు వినుచు ననలకీల రొదలె యనుచు
జడుపుగొనుచుఁ జెలియపైకి వెడలు తెరవు
గనుచు నకటకటా యెంత గ్రాగెఁ గాంత
వీత...

21

సీ.

గదిసి పైనుండు తుమ్మెదపిం డనెడినల్ల
                      నిదిరీసు దొడిగి బల్మొదలు మొదలు
కొని బ్రాకు దీవియ లనెడి డబ్బాడవా
                      ల్బిగియించి విరహులబీర మడఁచు
మావులపేరి యమ్మరుని బందీకొమ్మ
                      లను కైల చివురాకులను సనీల
గరపుకాల్బెట్టు చిచ్చరకీళ్లు చెవిరంజి
                      కపు బలుగుడకలు గలుగు పికము


గీ.

లను దుపాకుల నెగయింపఁగను వెడలెడు
జోడుగుండ్లన కణకణలాడు కనులు
గనుచు మది నెంత వలవంతఁ గనెర కాంత
వీత...

22


సీ.

తనదుకెంగేలుగవను గని చివురుల
                      ని గవయు గోయిలలగముల తన
నెమ్మోము తమ్మియని దలఁచి గ్రమ్ముతు
                      మ్మెదలను తనకెంపుపెదవి బింబ
మని వచ్చు రాచిల్కలను తనకీల్జెడ
                      ఫణియని బరతెంచు బర్హిణముల
నారామ మేనేల దూరితినను దూరు
                      నన విలువవిభూషణములు చిక్కు


గీ.

బడిన ముత్తెంపుసరులును బారదోలె
గాక లేకున్న నేమౌనొ కలికిమిన్న
మీఁ దెఱుఁగదయ్యె భామ నీమీఁది ప్రేమ
వీత...

23

సీ.

బంగరుమెఱుఁగుదువ్వలువతోఁ బిక్కల
                      దాఁక జీలాడు నిద్దాహొరంగుఁ
జేతులతోఁ గెంపువాతెఱతెలిగప్పు
                      చిఱునవ్వుతో దొవచెలి చెలువము
దిగిచికొన్నట్టి నెమ్మొగముతో నీలంపు
                      దిమ్మల నిరుక్రేవ దిద్దినట్లు
దొడరు వెడఁదరొమ్ముతో నవలామూక
                      బొడువ మరుం డొరవెడలిచిన క


గీ.

టారి జిలుగుమిటారపుటారుతోడఁ
గన్నులను గట్టి యావెన్కఁ గానరాక
నింతి నలయింపనిచిత్త మొట్టులోర్చె
వీత...

24


సీ.

చనదు నను విడచి జనఁగ నిలునిలుము
                      నిను నెనరున సామివనుచు నమ్ము
నొని మదినలజడి గొనివెడవిలుదొర
                      విడచునన జలుకుజడికిజడిసి
కలువరాయనికిఁ గోయిలలకుఁ దెమ్మెర
                      లకుఁ జిలుకలకు......నొదు
గవలసె నిఁక నను గవయగున్నఁ దాళఁ
                      జాల నీయాన వేయేల ననుచు


గీ.

విరిబొదలబారు వేమారు వెతకఁజేరు
వెతకి వేసారు నొకమాటు విధిని దూరు
వెలఁది నీతీరు గనఁగోరు వెతల మీఱు
వీత...

25

సీ.

తళుకుటనంటిబోదెలలోన తననీడ
                      గని యబ్బితివటంచుఁ గౌఁగలించు
కమ్మపూటీరాల నెమ్మిపింఛముఁ గాంచి
                      డాగెదాయని వేగ డాయనేగు
విరిసంపగులసొంపు నెరికగా మదినెంచి
                      నాయాన నిలుమంచు డాయఁబోవు
నగిసె పూనెరివిప్పు జిగినీదుమెయి గాఁగ
                      మది నెంచి భ్రమ మించి గదియఁదొడరు


గీ.

భ్రమ వదలి మరల భ్రమియును భ్రమిసి భ్రమియు
నొక్కగడె భ్రమ వదలక యుండు చెలువ
పొలుపు నలపుగొలుపుతలఁపుడులుభ్రమిఁక
వీత...

26


సీ.

నెచ్చెలియొకతె యన్నెలతగాక యంత
                      వెతకి వేసారి యో వెలఁదులార
వేగ రారమ్మ యేమో గాని మనబాల
                      యిచట లేదమ్మ నే నేమి సేతు
నని పల్క నింతింత యనరాని దిగు లుబ్బ
                      నందఱు జనుదెంచి యచట నచట
రోయుచు నటఁ గల్వరాయనిరాబాట
                      నడుగుఁ జెమ్మటడాగు లగుటఁ గాంచి


గీ.

యివి మిటారియడుగుజిన్నె లిత్తెరవున
నతివ కేళీవనము జేరె నన్న యెంత
మోస మని తల్లడిల్లి రాముదితలెల్
వీత...

27

సీ.

చలువరారాబాట జని పువ్వుఁదోఁట జ
                      వ్వని నచ్చటచట నవ్వనితలెల్ల
కమనీయవాసంతికాకుంజపుంజంబు
                      లను గుంజదళిపుంజలలితచూత
కలితకాంచనడోలికలవలమానమా
                      రుతమందగమనచారుతరసమప
రాగసైకతముల రతిఱేనికత్తళా
                      లిగొలగొలల బొలుపగు నెలవుల


గీ.

వెతకుచు లతాంగిఁ గానక వెఱపు బొడమి
గడమిగులు దల్లడంబుల నొడలు బిడలు
పడగఁబడుపాట్లు మాబోంట్లు బలుకు టెట్లు
వీత...

28


సీ.

కనుఁగొన ల్వెడలు వెచ్చనినీరుపయి జారి
                      తళుకుఁజక్కుల ధగధ్ధగలు మాన్ప
విరిదుమారమున ధూసరమైన నెరి గప్పి
                      మోముమిటారంబు మోటుపరుప
జరుపయ్యెదనంటు చలువకాటుకడాగు
                      గుబ్బచన్గవనీటు గొదువసేయ
తనువంటి చిమచిమ మ్మనుగెందలిరుటాకు
                      వెగరుటావిరి మేనిజిగి యడంప


గీ.

తెమ్మెరలు రేచ పొగలయి దేంట్లు దోఁచ
భగ్గుమను మెట్టుదమ్మిపూటగ్గి డాయు
చెలియని సఖు ల్దటాలున నలమికొనిరి
వీత...

29

సీ.

అమ్మమ్మ యెంత సాహసము జేసితివమ్మ
                      యిఁక నిను నమ్మరా దెంతమాట
దెచ్చితివమ్మ యిత్తెఱఁగు లేనాఁడు మే
                      మెఱుఁగ మే వెతకెద మేమి దెలసు
మముఁ గికురించి యామనియను పులి బొంచి
                      యున్న యీవనికి నిన్నొంటి గెచ్చు
వలవిరిసింగాణి గలజోదునకు నీయు
                      సురు దగలకపోదు సుదతి గదలి


గీ.

వేగరావమ్మ నీమనోవిభుని దెత్తు
మమ్మ యిది నమ్ము మమ్మ మాయమ్మ యనుచు
సఖియ లిటు దూర చెలి బిక్కజరిచె నౌర
వీత...

30


సీ.

మొలకగాడ్పులకాక చెలిమోము ఝుమ్మని
                      పన్నీరు చిలుకరే పడతులార
పూఁదేనితుంపరల్ పొలఁతికన్నుల దూలె
                      ననుబైఁట నొత్తరే వనితలార
యనఁటివేడిమి దాకి వనజాక్షి మైగందె
                      వేగ మంత్రించరే వెలఁదులార
యలరుటీనికలు నెచ్చెలిపాదములఁ జొచ్చె
                      మెల్లన దియ్యరే మెలఁతులార


గీ.

మనము చెలి మిన్న నీవట్ల గనక జన్న
నకట మఱియెంత మోస మౌనోయటన్న
చెలుల కలవిలలట్టె నీవలనఁ బుట్టె
వీత...

31

సీ.

ఔర వాతాంకూరహతక మాసఖియ మైఁ
                      గందించెదా యని గసరువారు
శుకమ మాసకియపై మొక మెఱ్ఱనగఁ జేసి
                      బెదరించెచా యని గదుమువారు
కోయిలా తుదకు నీ కూతఁబట్టుట చెలి
                      నలికింపనా యని యాడువారు
తుమ్మెదా దుశ్శకునమ్మ కోమలి నేచఁ
                      దొడరితివా యని దూరువారు


గీ.

త్రోవఁబడు పుప్పొడుల దవ్వు దుడుచువారు
జళుకుఁ గొనవలదని చెలి బలుకువారు
నైరి సఖు లెల్ల లలన నిన్గోనుకతన
వీత...

32


సీ.

పువుటందలములోనఁ బువుఁబోణినుంచి మో
                      తపడంతు లంత మ్రోతల నడంచి
తత్తరంబుగ నెత్త నత్తఱి బిత్తఱి
                      యొకతె ముందేగి భీతోచితోప
చారోపహారంబుఁ గూరిచి తెచ్చి య
                      త్తోయజాక్షికి దిగదుడిచి పార
వైవ బిరాలున వనితలు చెలి నంద
                      లము డించి యెలమి కల్వదొరచట్ల


గీ.

మెట్లవెంబడి మెల్లన మేడఁ జేర్చి
చలువ లెన్నేనిఁ గూర్చి రచ్చంచలాక్షి
కౌర యిటువంటివింత లెందైనఁ గలవె
వీత...

33

సీ.

హారముల్ బరువాయె నన్నంబు వెగటాయె
                      చెలులపై యలుకాయె చీదరాయె
తలఁపులు మెండాయె వలపు మిక్కుటమాయె
                      చలువలు సెగలాయె నలసటాయె
నిముసమే యుగమాయె నెమ్మేను సగమాయె
                      నిలువు లేదాయె బ ల్సొలపులాయె
కన్నీ రొలుకుటాయె కలవిలపాటాయె
                      వెఱుపు మోపాయె మై వెల్లనాయె


గీ.

మరునిపగలాయె వగలెల్ల మంతమాయె
వలచుచెలి నిటువలె వెత గొలిపి తౌర
సరసుఁడవు లేర నీమేలు చాలుఁజాలు
వీత...

34


సీ.

ఇప్పుడే బంగరుదుప్పటి వలవాటు
                      తోఁ దళ్కుఁగన్నులతో వలంతి
నగవలరేడు ముద్దుమొగముతో నెలమికాఁ
                      డిట వచ్చెనమ్మ దన్నింత జూచి
గడుసిగ్గునను పరుగిడు నన్ను వెన్నంటి
                      పడి కౌఁగిటను బట్టి తొడ నిడికొని
చెక్కు ముద్దాడి చురుక్కున నామోవి
                      నొక్కి చొక్కించి దాఁ జొక్కిచొక్కి


గీ.

యెచటి కేగెనో కానరాఁ డేమి నేతు
నకట కలయని తోఁచుఁ గాదనియుఁ దోఁచు
నంచు వలవలఁ గన్నీరు నించుఁ జెలియ
వీత...

35

సీ.

ఏమరి యేనున్నయెడఁ దటాలున వచ్చి
                      మోహనాంగుఁడు కను ల్మూసినట్లు
మూసిన నెఱిఁగియు ముదిత నొచ్చెనొ విడు
                      విడుమమ్మ యనుచు నే వేడినట్లు
వేడిన మా రెల్లుతోడఁ బ్రాణేశుండు
                      విడక పే రేమని యడిగినట్టు
లడిగినఁ దెలసి యౌనౌ నంచు నగి వీడి
                      తటుకునఁ దల్పోర దాగినట్లు


గీ.

దాగి కడకేగునెగ నన్ను దమ్మివ్రేయ
నొచ్చు వగసేయ దయఁ గౌఁగి లిచ్చినట్లు
నెలఁత కలవచ్చెనంచుఁ గన్నీరునించు
వీత...

36


సీ.

అచ్చుగా నీరూప మంతయుఁ బోడకట్టి
                      ముకురభావము జూచి మోహమొందు
నొంది దిగ్గున లేచి యూరకే చీకాకు
                      పడి నెచ్చెలులపైకి వెడలఁదోలుఁ
దోలి యద్దపుఁదల్పు లోలి బిగించి పై
                      పట్టుతట్టపుతెరల్ బారుసేయుఁ
జేసి యాభావంబు చెక్కులు ముద్దాడి
                      కడుఁబ్రేమ బిగ్గనఁ గౌఁగిలించుఁ


గీ.

గౌఁగిలించి యొకింత లోఁగరగుఁ గరిగి
పల్కవేమను నని పల్కు నుల్కులేమి
కక్కటక్కట చెలి వెక్కి వెక్కి యేడ్చి
వీత...

37

సీ.

కూసెడు కను లెఱ్ఱజేసెదు చాలవో
                      కాకితాపులు నీకు కోకిలంబ
అఱచెదు మొగ మెఱ్ఱపఱచెదు తెలియదో
                      త్రుళ్లు మీవారిసంకెళ్లు శుకమ
యార్చెదు ఱెక్కలల్లార్చెదు దొరుకునో
                      కాంచనం బింతైన చంచరీక
గ్రమ్మెదు విరిదుమ్ము జిమ్మెదు గానవో
                      చిలువవాచిచ్చు దక్షిణసమీర


గీ.

రామ ఘనసాంకవామోద హేమగాత్రి
కాలఫణివేణి మాచెలి గాఁగ నెఱిఁగి
తొలఁగ మేలని రపుడు నీచెలియ చెలులు
వీత...

38


సీ.

సత్వసంపత్పూర్ణజనమైన వెలిదీవి
                      మఱికొంతతేజంబు నెఱపినావు
దివిషదీశానాత్మభవసామ్యసంప్రాప్తి
                      జనులు సోయగ మెన్న నొనరినావు
తతసహస్రకరప్రతాపంబు చల్లార్చి
                      యత్యర్జునాభిఖ్య నలరినావు
కరపుష్టి కైలాసధరమందుఁ జూపి యా
                      ముక్కంటితల కాలఁ ద్రొక్కినావు


గీ.

కనుక నిను రావణున కెక్కు డనఁగవచ్చు
నోనిశాచరరాజ యనూనతేజ
యనుచు శశి దూరుఁ బలుమారు నతివబారు
వీత...

39

సీ.

పలుగాకిమూఁకలోపలఁ బుట్టి పెరిగి బ
                      ల్దండుమీఱినది నీ కాల్బలంబు
పుడమి నాకులపాటుఁ బొడమించిగద మధు
                      నాముండు నీదండనాయకుండు
గాను గాడించినఁ గాని వీడదుర యా
                      తొంటిగుణంబు నీతుంటవిల్లు
మధువెల్లఁ ద్రావి మై మస్తెక్కి తిరుగు మే
                      ల్మేలురా నీదు చండాలినారి


గీ.

సోకునరదంబు రేఁదోఁచు చోదకుండు
గరచును గురాలు విషజాతి గద సిడెంబు
భళిర తగు తగునని మారుఁ బడఁతిదూరు
వీత...

40


సీ.

హరుకంటిమంట నిన్నంట నీమామ యీ
                      వనజారి యెక్కడ వ్రక్కలయ్యె
నీకు సేనానియై నెచ్చెలియై ముందు
                      నడుము వసంతుఁ డేయడవి గలసె
నిలువెల్ల సారమై వెలుగొందు నీచేతి
                      తుంటవి ల్లెచ్చట దునిసిపడియె
మొనసి నగంబులైనను పెల్లగించు నీ
                      చలపాది పవనుఁ డెచ్చటికిఁ బఱచెఁ


గీ.

దొలఁగు మిప్పరికరమున గెలువలేవు
పొలఁతి కోపాగ్నిపా లయిపోకటంచు
మగువ లెంచి వచించి రమ్మరుగుఱించి
వీత...

41

సీ.

ఎలుగెత్తుమాత్ర కోయిలపౌఁజుఁ దొలఁగించి
                      పెన్గొప్పుననె శిఖిపింఛ మడఁచి
మొగమెత్తి హుమ్మని తొగఱేని వెలికొత్తి
                      నవ్వుచు రేయెండ క్రొవ్వడంచి
పల్కులధాటిచేఁ జిల్కగుఱాల్ నిల్పి
                      చూచి పూముల్కుల సొంపడంచి
ముడిబొమ్మలిడి కేలి వెడవిల్లు దునుమాడి
                      వేడియూర్పునఁ దేరు వెన్కజొనిపి


గీ.

భీమగతి మాలతాంగి నిన్ బిలుకుమార్చు
నని యెఱుఁగవొక్కా యెదిరితి వైన నేమి
తొలఁగుమని మరు ననిరి నీచెలియ చెలులు
వీత...

42


సీ.

ఎగసి కో యనుచు కెంజిగురాగుబల్లెంబు
                      లంటి కోయిలబంటు లడరి నడువ
నలుగడ ల్వెడదమ్రోతలనిండ నురువడి
                      వసరుతేజీపౌఁజు ముసురుకొనఁగ
నలరుదుమ్ములు గ్రమ్ము నడుగుమట్టుడులతో
                      తుమ్మెదకాల్దండు దొమ్మి సేయ
రేరాయువలినిగ్గు వీరపాణపుమస్తు
                      మొనసి వెన్నెలపుల్గు మొనలుదరుమ


గీ.

రాజు ఋతురాజు సూరెలరాగ గాడ్పు
టరదమున వచ్చు మరుఁ గాంచి యతివ సొమ్మ
సిలె నకట నీయుపేక్షచేఁ గలిగె నింత
వీత...

43

సీ.

గంబురాపొడి జల్లి కలువరేకులు తెచ్చి
                      యువిదకందోయిపై నుంచె నొకతె
మోటురేకు వదల్చి మొగ్గతమ్ములు తెచ్చి
                      చెలియపాలిండ్లపైఁ జేర్చె నొకతె
కప్పెల్ల దిగనూడ్చి కలువకాడలు తెచ్చి
                      సుదతిదండలనిండఁ జుట్టె నొకతె
కఱకుపుప్పొడి యూది కదళిపత్రము దెచ్చి
                      కనకాంగివీపున గ్రమ్మె నొకతె


గీ.

కొమ్మ లిటు చేయుచలువలఁ దెమ్మదేరి
వెలఁది యొక్కింత కనుదోయి విచ్చి చూచె
నిను వలవనేలొ యీవెత ల్లనఁగనేలొ
వీత...

44


సీ.

తనవారు దను చేది ధరణీశునకు నిత్తు
                      రనియుఁ దన్నిశ్చితమౌ ముహూర్త
మవ్యవహితమయ్యె ననియును దెలిసి లో
                      నుప్పొంగు వెతలు పైఁ గప్పికొనఁగఁ
దలవంచి మదిఁ గొంతతడవు విచారించి
                      చెచ్చెర నపు డొకచెలియచేత
కార్యనిర్వహణవికస్వరచిత్తు న
                      నున్మత్తు హరిభజనోపయుక్తు


గీ.

నెంచి విప్రకుమారుఁ బిల్పించి తెలుపు
నవి యెఱింగించి నీమ్రోల కనిపెనుగద
మౌగ్ధ్య మెందుల కేగెనో మగువ కపుడు
వీత...

45

సీ.

మోహనాకారు నెమ్మోము గన్గొని సొక్కు
                      భాగ్య మీనేత్రముల్ బడయునొక్కొ
సారసాక్షుని పాదసరసిజములఁ బట్టు
                      భాగ్య మీహస్తముల్ బడయునొక్కొ
కమలేశుచేఁ దాళి గట్టించుకొనునట్టి
                      భాగ్య మీకంఠంబు బడయునొక్కొ
యఖిలలోకేశ్వరుఁ డలమి కౌఁగిటఁ జేర్చు
                      భాగ్య మీగాత్రంబు బడయునొక్కొ


గీ.

విభుఁ డనాలోచితవిశేషవివిధవినత
భూతరక్షకుఁ డఁట నన్నుఁ బ్రోవ డొక్కొ
యనుచుఁ జెలి యందు నరసందియంబుఁ జెందు
వీత...

46


సీ.

అరఁయుడీ మనవిప్రుఁ డచటి కేగెనొ లేక
                      యన్నకు జడిసి తా నాగెనేమొ
చనినను బ్రాణేశు సమయమయ్యెనొ లేక
                      నరుగ నసందర్భ మాయెనేమొ
వెతలెల్ల నిటుపైని విడువనౌనో లేక
                      దయమాలి వేరుగాఁ దలఁచునేమొ
మధువైరి నాకోర్కె మన్నించునో లేక
                      వలదని వార్తలఁ బంపునేమొ


గీ.

యేగి జాగాయె విప్రుఁ డదేల రాడు
వేరుగాఁ దోఁచుచున్నది వెలఁదులార
యనుచుఁ జెలి సందియముఁ జెందు మనమునందు
వీ...

47

సీ.

ఇది మనయుపవనం బిది యమునాకుల్య
                      మిది కమలాకరం బిది తటాక
నింది శుద్ధమరుభూమి యిదియ యరణ్యాగ్ర
                      మిది ఖనీపర్వతం బిది హిమాద్రి
యిది మృగయూధ మిల్లిది యుపత్యకసస్య
                      మిది మెట్టతామర యిది దవాగ్ని
యిది కుంజపుంజ మిల్లిది బాలసహకార
                      మిది క్రముకారామ మిదె విదర్భ


గీ.

మనుచుఁ దారకుఁ డెఱిఁగింప నన్ని గనుచు
నేకవీరుండవై ధరిత్రీశనిచయ
ఘోరపురబహిరంగంబుఁ జేరి తౌర
వీత...

48


సీ.

గురియ నల్లమొయిళ్ల మెఱుగొప్పు మెయితళ్కు
                      పెరవారి కన్నుల కిరులుగొల్ప
తొలుకరి బలుమించువలె మించు దువ్వల్వ
                      జిగి పగరకన్నుల జిగ్గురనఁగఁ
గడమొగుల రొదల బెడగారు చిందంపు
                      వెడగుమ్రోఁత దొరల కడలుగొల్ప
వేలుపువిలుబలె వెలయు సింగిణి రాచ
                      గడుసు లకట జిల్కు జడలు దెల్ప


గీ.

వడివెడలు తేరుటుండలఁ బుడమి వడఁక
గడగడల గడవెడల నప్పడచు బడయ
నడచు నినుఁ గని మది దిగుల్ బడరె దొరలు
వీత...

49

సీ.

లేమకు గోళ్లఁడాలే చాలియుండఁగా
                      యామూలరామటెటి లెవతె మెట్టె
నెలనాగ కంఘ్రిచాయే చాలియుండఁగా
                      యీమోటుజిగిలత్తు కెవతె జొత్తె
నింతికి వాల్గన్నులే చాలియుండఁగా
                      యీచెవి కలువరే కెవతె దురిమె
నిగురుఁబోణికి మై జిగె చాలియుండఁగా
                      యీగంబురాగంద మెవతె బూసె


గీ.

ననుచుఁ గనువారలెల్ల మో టనుచు నొగుల
పడఁతి గౌరిలు వెలువడి నడచునంత
నెంతమో మాయెరా నీ కదేమొ కాని
వీత...

50


సీ.

బోఁటికందోయికిఁ గాటుకే మోటేమొ
                      లేకున్న నిటు సంచలించునొక్కొ
కొమ్మ కేల్దమ్మికి తమ్మియే కఱకేమొ
                      గాకున్నఁ గెంజాయ గ్రమ్మునొక్కొ
సుదతిమేనికి వాలుఁజూపులే బరువేమొ
                      మారైనఁ గేలూతఁ గోరునొక్కొ
సఖికంధరకు చిన్నసరులె బల్వ్రేగేమొ
                      వేరైన రేఖలు దేరునొక్కొ


గీ.

యనుచుఁ గనుజనులమనములందుఁ దోఁచఁ
బడఁతి గౌరిలు వెలువడి నడచి దొరలఁ
గనుచు నినుఁగన కట యుస్సు రనియె నకట
వీత...

51

సీ.

నీసోఁగకనుదోయి నీమిటారపుఁజూపు
                      నీతళ్కుచెక్కులు నీదుచెవులు
నీయుంగ్రపుంగురుల్ నీనూఁగుమిసంబు
                      నీసన్నకనుబొమల్ నీదుమోము
నీనెరాచిఱునవ్వు నీకెంపువాతెఱ
                      నీవెడందయురంబు నీదుగళము
నీదీర్ఘబాహువుల్ నీపిడికెడుకౌను
                      నీయొయారపుమేను నీహొరంగుఁ


గీ.

జూచి తమిరేచి యుప్పొంగి సుందరాంగి
మెఱసెఁ దెఱగంటివాల్గంటికరణి నంత
నెంతమోహనమూర్తివో యెఱుఁగమయ్య
వీత...

52


సీ.

గండభాగమునిండ కుండలప్రభవాని
                      చెలువారు బంగారుచేలవాని
శతకోటిభాస్కరద్యుతికిరీటమువాని
                      డంబారు గీరునామంబువాని
వనమాలికారమ్యవక్షస్థలమువాని
                      తళుకుముత్తెపుపేర్లు గలుగువాని
తరళాంగదద్వయీధాగధగ్యమువాని
                      నొసలిపై సరిఫేషుమిసిమివాని


గీ.

నిగనిగను కరిమేని బల్ నిగ్గువాని
సొగసుకాని నినుం గన సుందరాంగి
కపుడు మరుపుత్తళికసొబ గబ్బెగదర
వీత...

53

సీ.

దరహాసచంద్రికాధవళితాధరముతో
                      నధరరక్తాగ్రదంతాళికోడ
తతకటాక్షారుణీకృతకర్ణమణులతో
                      గర్ణిగాపీతాక్షికళలతోడ
మకుటరుక్పించాయమానాలకములతో
                      నలకశారితకిరీటాభతోడ
చారుకౌస్తుభరంజితోరస్థలంబుతో
                      స్ఫురదురఃపిహితకౌస్తుభముతోడ


గీ.

చెలువలరు నినుఁ గని యళిచికుర కపుడు
వెడలు ననవింటిదొరజిల్కు జడియనంగ
నీదు దట్టపుఁజూపులు నిగుడెగదర
వీత...

54


సీ.

ఒగి జరాసంధుని మొగము వెల్వెలఁబాఱ
                      దంతవక్త్రునిగుండె తల్లడిల్లఁ
గాల్సేతులాడక గడు రుక్ష్మి వెగడొంద
                      వెఱుగంది సాల్వుండు కొరడువాఱఁ
గని పౌండ్రకునియొడ ల్గడగడవడకాడ
                      రుక్ష్మనేత్రుఁడు రిత్త రోసమంద
చైద్యుండు రథముపైఁ జదికిలఁబడి యూర్చ
                      గొలగొలేమని భీష్మకుండు బలుక


గీ.

నెల్లెడల భూమిపతు లఱ్ఱు లెత్తిచూడఁ
దేరు దిగివచ్చి రుక్మిణీవారిజాక్షి
నెత్తికొనిపోవు నీసొబ గెన్నదరమె
వీత...

55

సీ.

నిలునిలు కృష్ణ కన్నియఁ గొని చన నీకుఁ
                      శక్యమే యను జరాసంధుమీఁద
ననుఁ జూడు మిదె నాబారిఁ బడి నీకుఁ
                      జనవచ్చునే యను సాళ్వుమీఁద
వచ్చితి వెటఁబోవవచ్చు నీకు నటంచు
                      ప్రదరముల్ నించు పౌండ్రకునిమీఁద
చుట్టుముట్టుడు గొల్లఁ బట్టి చంపుఁ డటంచు
                      రోషించి పలికెడు రుక్మిమీఁద


గీ.

నరశతంబై లేనిధైర్యంబు పూని
మొనయు శిశుపాలుమీఁద నీయనుగుఁదమ్ము
చిలుకుజడి గ్రమి కండలు చెండెగదర
వీత...

56


సీ.

పలువుగ హలమునఁ బట్టి డగ్గర నీడ్చు
                      పక్కుపక్కున తల ల్పగుల నస్థి
వితతులు ఫళఫళ విరుగ బొళ్బొళ్లని
                      గ్రక్కున నెత్తురుల్ గ్రక్క మెదడు
టసలు తప్ తప్పున నవనిపైఁ బడ తుప్పు
                      తుప్పున పై తల తునుక లెగయ
వలవల నెత్తురువఱదలు వాఱి శ
                      వంబులు దిభదిభ వసుధఁ గూలఁ


గీ.

బట్టి రోకంటఁ బడమోదునట్టి నీదు
నగ్రజు నుదగ్రతరరణవ్యగ్రవృత్తి
కగ్గమయి బెగ్గడిలరె సాళ్వారు లహహ
వీత...

57

సీ.

నిబిడనిష్ఠురభాణనిర్ఘాతపాతప
                      తత్ప్రతీపావనీభృత్ప్రతీక
శశ్వత్స్రవద్రక్తఝరకర్దమితసమీ
                      కాంగణాధోవిశదచలచక్ర
రథసమాకృష్టివైపథికసారథికళా
                      హతికృచ్ఛవిశ్రమదార్తవివిధ
కంఖాళనిష్క్రమక్రమనిష్ఫలీకృత
                      రథికలోకపురస్సరత్కరాళ


గీ.

శరవిఖండితసాదినిషాదిపతన
ధావమానాస్వగజ మయ్యెఁ దావకాను
జన్ము కోల్తల కనిలోన శత్రుసేన
వీత...

58


సీ.

విఘటితరథము విభిన్నమాతంగము
                      విద్దపదాతము వికృతహయము
విద్రవద్యూధము విప్లుతయోధము
                      విచ్ఛిన్నచాపము వికలశరము
విధుతపతాకము వితృతదట్టము
                      విదళితహస్తము వితతశవము
వికృతజిహ్వాస్యము విలుధత్ప్రతీకము
                      విగళదస్త్రౌఘము విరతరణము


గీ.

నయ్యెఁ గదయయ్య భవదగ్రజానుజన్మ
రూక్షుకోదండదండనిర్ముక్తనిబిడ
శరపరంపర కనిలోన శత్రుసేన
వీత...

59

సీ.

పటుతీవ్రబాణసంపాతభీతుండయి
                      బరువంగసాగడే పౌండ్రకుండు
బలహస్తసముదగ్రహలము గన్గొని తేరు
                      మఱలంగఁ దోలఁడే మాగధుండు
భ్రామితాయోగ్రసంభ్రమఝాంకృతికి డస్సి
                      సమరంబుఁ దొలఁగడే సాల్వవిభుఁడు
హలముతోఁబాటు ప్రయాసంబున మొరంగి
                      చీకాకు నొందఁడే చేదినాథుఁ


గీ.

డిన్ని కన్నారఁగనియు ని న్నెదిరికొనఁగ
నేల తల గొరుగుడుబడనేల రుక్మి
కరయ నిది రుక్మిణికి మది నెఱియ నకట
వీత...

60


సీ.

దుష్టమృగంబులఁ దోలు పంచాననం
                      బన విజృంభించి నీ వఖిరిపున
రేంద్రబృందంబు నిస్తంద్రవృత్తి నదల్చి
                      కోమలిఁ గొని బలరామ సాత్య
కాత్మజు లిరుక్రేవ నరుదేర దుందుభి
                      ధ్వానంబు భూనభోంతరము నిండ
వివిధపతాకికావితతులు విజయసూ
                      చకములై నలుగడఁ జదలునిండ


గీ.

ననుగతాసంఖ్య సైన్యంబు లనుసరించ
వచ్చు నంబుధులన మహావైభవమునఁ
బురిఁ బ్రవేశించు హెచ్చు నాబుద్ధి మెచ్చు
వీత...

61

సీ.

పార్శ్వభాగముల రంభాస్తంభములు నిల్పి
                      పచ్చతోరణములు పాదుకొల్పి
బలుదట్టముగ మించి పన్నీరు జల్లించి
                      యెడనెడఁ బడగల నెత్తఁబంచి
మురువుగ ముత్తెపుమ్రుగ్గులు బెట్టించి
                      స్వస్తివాక్యంబులు చదువఁబంచి
మంగళధ్వానము లహి మిన్నుఁ బూరించి
                      యెదురుగాఁగ నమాత్యు లేగు దెంచి


గీ.

మ్రొక్కి నినుఁ గూడి రా ప్రోలి ముదిత లెల్ల
సౌధములనుండి సేసలఁ జల్ల నీవు
పురిఁ బ్రవేశించు హెచ్చు నాబుద్ధి మెచ్చు
వీత...

62


సీ.

అగ్రంబునను జనకోగ్రసేనుమహీశు
                      లుచితానసంబుల నుండుటయును
రెండవచతురాననుం డనఁదగిన గర్గ
                      సంయమి శుభవిధి జరుపుటయును
బలసాత్యకులు సేయుపనుల సేయించుచు
                      నుభయభాగములఁ గూర్చుండుటయును
ముదమున దేవకీముఖ్యపుణ్యాంగన
                      లొకక్రేవఁ గనుఁగొనుచుండుటయును


గీ.

తండ్రి యప్పుడు నీవు వైదర్భియఱుత
కళుకుటపరంజినెఱతాళిఁ గట్టుటయును
కన్నులను గట్టు మది సరికట్టు నొట్టు
వీత...

63

సీ.

అలసుదర్శనమున కాశ్రయంబగుచేత
                      గరుణతో గజరాజుఁ గాచుచేత
గురునకు బ్రతికించి కొడుకు నిచ్చినచేత
                      మురళీవినోదియై మొఱయుచేత
నఖిలదేవతలకు నాలంబమగుచేత
                      నస్మదాదులకు దిక్కైనచేత
గోపికాకుచముల గోరు లుంచినచేతఁ
                      జెలఁగి పాల్వెన్న మ్రుచ్చిలినచేత


గీ.

నట్టి గోవర్ధనం బెత్తినట్టిచేతఁ
బట్టి నాతండ్రి భీష్మకు పట్టిపదము
సన్నె ద్రొక్కించు నీరంతు సన్నుతింతు
వీత...

64


సీ.

మందమారుత చాల్యమానాంకణలతాల
                      తాంతహిందోళడోలాయితములు
ప్రేయసీసంగమప్రేమానుగతసౌధ
                      పారావతవిలాసవలయితములు
నిబిడశాఖాదుర్దినితవనీమాధవీ
                      మంటపశిఖినాట్యమండలికలు
నిష్కుటవాపీవినిద్రారవిందమ
                      రందమత్తమరాళమందగతులు


గీ.

కనుఁగొనుచు భీష్మకేంద్రుని తనయతోడఁ
గూడి క్రీడించు మముఁ గన్నతండ్రి నీకు

నిత్యమంగళ మఖిలసంస్తుత్యచరిత
వీతభవతృష్ణ రంగేశవేష కృష్ణ.

65


క.

శ్రీమున్ముడుంబ వేంకట
రామనృసింహార్య రచిత రంగేశగుణ
శ్రీమధురకృతికి నఖిలస
భామహితంబైన ప్రథమభాగము ముగిసెన్.

ద్వితీయభాగము

సీ.

శ్రీధర శ్రీరమా శ్రీసైన్యనాయక
                      వకుళభూషణనాథ వనజనేత్ర
రామ యామునపూర్ణ రామానుజార్యగో
                      వింద భట్టారక వేదవేద్య
కలివైరి కృష్ణ లోకగురు శ్రీశైలేశ
                      వరవరస్వాచార్య నిరుపమాన
దివ్యకల్పకపుష్పదీప్తమాలాబహూ
                      కారంబుఁ జేసెదఁ గాకతీర్చి


గీ.

తీక మదుజ్జీవనానురూపైకరూప
రూపగుణభూతి లీలానురూపరీతి
గొంచ యకించను నను రప్పించవలయు
వీత...

66

సీ.

చేతనాచేతనశేషి యోవేదాంత
                      రమ్య సర్వజ్ఞ శ్రీశాంత యనుచు
నిఖిలహేయప్రత్యనీకకల్యాణైక
                      తాన యోముక్తిప్రదాత యనుచు
వేద్యపరవ్యూహవిభవాంతరర్చాఖ్య
                      పంచప్రకారవైభవ యటంచు
కల్పకక్షయము నొక్కరుఁడవై మరల నీ
                      జగమెల్ల సృజియించు చతుర యనుచు


గీ.

ఫాలమున త్రిణయను నాభి పద్మభవుని
నింద్రు ముఖమునఁ గన్న సర్వేశ యనుచు
పాడియాడెదనయ్య నీవాఁడనయ్య
వీత...

67


సీ.

సఖులు కొందఱు రహస్యమున నీవివిధక
                      ళ్యాణగుణంబుల ననుభవింప
యపుడు నే డగ్గరి యడిగిన నాప్రేమ
                      నెఱిఁగి నీకథలు నా కెఱుఁగఁజెప్ప
నది విని యది మొద లన్యసంగతి మాని
                      యంతరంగంబు నీయందె తగిలి
యేయుపాయముఁ దోఁచ కెంతయు రేబవల్
                      మదిఁ గుందు ననుఁ జూచి మద్గురుండు


గీ.

తేర్చి కరుణించి నీతోడఁ గూర్చెనయ్య
నన్ను విడనాడు టెటువంటి నాయమయ్య
కరుణ నేలఁగదయ్య మంగళతరాంగ
వీత...

68

సీ.

సన్ముహూర్తంబున సమ్మతంబుగ బంధు
                      మధ్యంబునను నీకు మద్గురుండు
నను యథావిధి నొసంగిన నగ్నసాక్షిగ
                      లీలతోఁ గైకొని యేలుకొనియు
విడనాడి మఱచి తీవిధము నే నెఱుఁగక
                      విభుడు నన్నేలకో వేగఁ బ్రోవ
నేతేరఁడని మది నెంచి క్షణంబు యు
                      గంబుగఁ గాలంబుఁ గడిపికొనుచు


గీ.

మోహమున కగ్గమై సిగ్గు మోసపుచ్చి
యిటకుఁ జనుదెంచితి పరాక దేలనయ్య
యేలుకొనుమయ్య నేరంబు లెంచకయ్య
వీత...

69


సీ.

సంతసం బొసఁగు నాశైశవం బెడఁబాసి
                      యిప్పట్టుననె ప్రాయ మేల వచ్చె
వచ్చెఁ గాక నసౌఖ్య మిచ్చు బుద్ధివికాస
                      మింతవేగంబె దా నేల బొడమెఁ
బొడమెఁ గాక త్రయీభూషణంబైన ని
                      న్నెదలోనఁ దలఁపోయ నేలనాయె
నాయెఁగా కకట నీ కఖిలంబుఁ దెలిసియు
                      నిట్టు నాపై మఱ పేల బుట్టెఁ


గీ.

బుట్టెఁ గాక దయాశాలి బ్రోచుననుచు
నమ్ముకొని వచ్చి ననియైన నన్నుఁ గన్ను
లారఁ గనవేల యిదివీల చారుశీల
వీత...

70

సీ.

నిర్గుణుండవటంచు నిర్లేపుఁడవటంచు
                      జను లెంతు రది నేఁడు సత్యమాయె
నగ్రాహ్యుఁడవటంచు నతిమాయికుఁడవంచు
                      జను లెంతు రది నేఁడు సత్యమాయె
నిష్ప్రమాణుఁడవంచు నిఖిలస్థితుఁడవంచు
                      జను లెంతు రది నేఁడు సత్యమాయె
మోహనుండవటంచు మోసపుచ్చెదవంచు
                      జను లెంతు రది నేఁడు సత్యమాయె


గీ.

నిఖిలకళ్యాణగుణరత్ననిధివటంచు
పాడియాడెద రదె యిదె పలుకు వేఱు
ముందు నీగుణ మెఱుఁగక మోసపోతి
వీత...

71


సీ.

మోహనాకార నామోహంబు దీర ని
                      న్మించి బిగ్గన గౌఁగిలించికొందు
సుమసుకుమార నాభ్రమమెల్లఁ దీర నీ
                      చెక్కిళ్లు ముద్దాడి చెనకికొందు
భామినీమార నాభావ మీడేర నీ
                      మోము మోమునఁ జేర్చి ముద్దుగొందుఁ
దతదయాధార నావెతలు చల్లార నీ
                      చేదమ్ము లురముపైఁ జేర్చికొందు


గీ.

నిగమసంచార నామది బెగడుదీర
నీమృదుపదంబు లౌదల నిలిపికొందు
నిముస మిఁక నోర్వ నోపను నిజము నిజము
వీత...

72

సీ.

కెందామరలకన్న నందమై యున్న నీ
                      యడుగు లీచెక్కిళ్ల నదుమకున్న
దర్పణంబులకన్నఁ దళుళారి యున్న నీ
                      యలరుఁ జెక్కిళ్లు ముద్దాఁడకున్న
జొక్కంపువిరికన్న చక్కనై యున్న నీ
                      మేనట్టె కౌఁగిళ్ల బూనకున్న
కలవరాయనికన్న కళలీనుచున్న నీ
                      మోము కన్నులఁగప్పి మురియకున్న


గీ.

నెటువలె దురంతసంతాప మింకునయ్య
యేమి సేయుదునయ్య నిట్లేలనయ్య
కరుణ నేలఁగదయ్య మంగళతరాంగ
వీత...

73


సీ.

వనజాక్ష నీచక్కఁదనముఁ జూచినయంత
                      మనసు నీపయిఁ జాల మరులుగొనియె
మనసు నీపైఁ జాల మరులుగొన్నంతనే
                      కోర్కె లంతంతకుఁ గొనలుసాగెఁ
గోర్కె లంతంతకుఁ గొనసాగునంతనే
                      రేయి జాగరణంబు బాయదయ్యె
రేయి జాగరణంబు బాయకున్నంతనే
                      చెలువంపు మేనెల్లఁ గలయఁజిక్కె


గీ.

చిక్కి మది కెక్కి యేమి రుచించదయ్యె
నయి మిగుల డెంద మీలోకభయము దొలకె
నింక యేమగునొకో సామి యేమి సేతు
వీత...

74

సీ.

నొవ్వకుండఁగఁ గురుల్ దువ్వి క్రొమ్ముడిఁ దీర్చి
                      సొగసుగా విరిసరుల్ జుట్టనేర్చు
నునుపును మెఱుఁగాని నొసటిపై మృగనాభి
                      తిలకంబు చక్కఁగా దిద్దనేర్తు
కమ్మకస్తురి కుంకుమమ్ము కప్రముఁ గూర్చి
                      కలపంబు నెమ్మేన నలఁదనేర్తు
చెలువారు పూనీరుఁ జిలుక మెల్లన కేల
                      విరులవీవనఁ బట్టి విసరనేర్తు


గీ.

నేమఱకఁ జుట్టి మడుపు లందీయనేర్తు
చెంతఁబాయక తగుపనుల్ సేయనేర్తు
కోరివచ్చిన నన్నుఁ జేకొనఁగదయ్య
వీత...

75


సీ.

నీకట్టివదలిన నెఱిక కన్నుల నద్ది
                      యుత్తరీయంబుగా నుంచుకొందు
నీచుట్టివిడచిన నిరుపమమాల్యముల్
                      ముదముంది కొప్పులో ముడిచికొందు
నీమహత్తరపాదనీరేజతీర్థంబు
                      చేఁ ద్రావి శిరమునఁ జిలికికొందుఁ
నీనోటికప్రంబు నెఱివీడె మిచ్చుచో
                      నమృంతబుగాఁ గేల నందికొందు


గీ.

నీదు పాదుక లౌదలఁ బాదుకొల్పి
చెనఁటిజన్మంబు సఫలత జేసికొందు
నయ్య దాస్య మొసంగఁగదయ్య నేడు
వీత...

76

సీ.

వింతగాఁ జూచెద వింతలోనే పరాక
                      యీముద్ర లెవరు నా కిచ్చిరయ్య
యెఱుక లేదా మంచి నెఱజాణ వౌదు నా
                      కీకంఠసరు లెవ్వ రిచ్చిరయ్య
మఱుచితా యిటు జూడు మానాఁటి కొనగోటఁ
                      దిలకఁ మెవ్వరు నాకు దిద్దిరయ్య
తెలియదా భళి మంచిదే నిచ్చ నెదఁ జేరి
                      లీల నెవ్వరు బవ్వళించిరయ్య


గీ.

చాలు దొరికితి నిఁక వగల్ సాగనీను
బట్టి విరిసరిఁజుట్టి నిన్ గట్టివైతు
నపు డెఱుఁగవచ్చు వర్ధితానంగవిభవ
వీత...

77


సీ.

దిగనాడి మొగమైనఁ దేరిచూడనివాఁడ
                      వేల న న్వలపించి యేలితయ్య
యావంతయైన న న్నాదరించనివాఁడ
                      వేల నాతోఁ గేళిఁ దేరితయ్య
మఱచి ముచ్చటకైన మాటలాడనివాఁడ
                      వేల నాఁ డాబాస లిచ్చితయ్య
యింతగాఁ జలపట్టి యెగ్గుచేసినవాఁడ
                      వేల వేమాఱు న న్నెంచితయ్య


గీ.

వదలి మొగమైనఁ జూపనివాఁడ వయయొ
యేల కలలోన వచ్చి న న్నేచెదయ్య
తగదు తగ దిటు కటుమోటుతనముసేత
వీత...

78

సీ.

దయవాఁడవంచు నేఁ దలంచుకొంటినిగాని
                      యింతనిర్దయుఁడ వౌ టెఱుఁగనైతి
మోహనాంగుడవంచు మోహించితినిగాని
                      యింత నిర్మోహి వౌ టెఱుఁగనైతి
నెమ్మెలాడవటంచు నమ్ముకొంటినిగాని
                      యింత మాయకుఁడ వౌ టెఱుఁగనైతి
నెనరుంతునని చాల నిశ్చయించితిఁ గాని
                      యింత నిర్దయుఁడ వౌ టెఱుఁగనైతి


గీ.

మోసపోతిని కటకటా మోసపోతి
నేమి సేయుదు నే మందు నెట్టు లోర్తు
యింక నా కెద్ది తెరవు మరెద్దిడి వెరవు
వీత...

79


సీ.

సోఁగకన్నులవాఁడ సొలపుఁజూపులవాఁడ
                      మొలకనవ్వులవాఁడ ముద్దులాఁడ
జిగిపెన్నురమువాఁడ చిగురువాతెఱవాఁడ
                      తళుకుఁజెక్కులవాఁడ తక్కులాఁడ
బలుపెన్నెరులవాఁడ పసిఁడిచేలమువాఁడ
                      చెలువంపుమెయివాఁడ కులుకులాఁడ
కలికిచెయ్వులువాఁడ కళలు నేర్చినవాఁడ
                      వగుటఁ గుల్కెడివాఁడ వన్నెలాఁడ


గీ.

డంబుగలవాఁడ మణికిరీటంబువాఁడ
హారములవాఁడ నాప్రాణ మైనవాఁడ
నీవు న న్నిపుడైనను బ్రోవఁదగును
వీత...

80

సీ.

వలదు డాయకు రేలు వగలు సేయకు చాలు
                      దుడుక నాకన్నీరుఁ దుడువరాకు
వెఱుపు దెల్పకు కల్లమరులు గొల్పకు మెల్ల
                      నక్కునఁ జేర్చి న న్నదుమరాకు
వలదు కోపము హెచ్చు వగకు లోపము వచ్చు
                      చెక్కులు ముద్దాడి చెనకరాకు
చనదు మెప్పెదనమ్ము సతము జెప్పెద నమ్ము
                      నొచ్చె నాకెమ్మోవి నొక్క రాకు


గీ.

మనసు విరిగెను నీమీఁది మమత తరిగె
పోర మటుమాయలాడ యప్పొలఁతిఁ గూడ
నడువనున్నట్లు విధిపోక నడుచుఁగాక
వీత...

81


సీ.

మొగమాట మొగ్గేమొ మొగమైనఁ గనవేమొ
                      పలుకైన వినవేమొ పలుకవేమొ
ననుఁ జూడవలదేమొ నెనరుంచఁదగదేమొ
                      విడెమైనఁ గొనవేమొ విడిచితేమొ
నాజాబుఁ గనవేమొ నను మంచిదనవేమొ
                      చలము జేసితివేమొ చాలునేమొ
మునుబాస లేదేమొ మ్రొక్కితి వినవేమొ
                      మిగుల నొచ్చితివేమొ తెగడితేమొ


గీ.

తగనిపో రేమి కలనైనఁ దలఁచవేమొ
మరల నాతోడ నేమని మాటలాడ
వచ్చితివి పోర నేనొల్ల వలదు వలదు
వీత...

82

సీ.

నిద్దురన్నది లేక నిముసంబె యుగముగా
                      దిగులు జెందితి కను ల్దెలుప వటవె
నిజ మాపెతోఁ గూడ నీకు నిద్దుర లేదు
                      తార్కాణమేల కాదంటినటర
నవ్వులాటేల నన్నము సైప కింతగాఁ
                      జిక్కి తీమేనైనఁ జెప్పలేదొ
సత్యంబు నగుబాటు జనుని దేనికొ జిక్కి
                      యలసితివని మున్నె తెలిసెఁగదర


గీ.

నీవు చెప్పినరీతిగా నిలుతు నిలిచి
నమ్మికలు సేతు నను నీవు నమ్మఁదగదె
నిన్ను నమ్మను పోపోర నిన్ను నమ్మ
వీత...

83


సీ.

ఏపదంబులు శఠకోపయోగివరేణ్యు
                      లేపదంబులు సంయమీంద్రమౌళి
యేపదంబులు యామునేయులకు ధనం
                      బేపదంబులు గొల్తు రెల్లసురలు
నేపదంబులు సర్వపాపప్రశమనంబు
                      లేపదంబులు త్రయ్యుదీరితములు
నేపదంబులజలం బీశుండు తలఁదాల్చె
                      నేపదంబుల తత్త్వ మెఱుఁగుటరిది


గీ.

యేపదంబులు మాబోంట్ల కెల్ల దిక్కు
పరమపూరుష యట్టి నీపదము లెపుడు
హృదయమున దాతు నా ప్రాణపదము గాఁగ
వీత...

84

సీ.

పుట్టి చచ్చుచు నెంతొ బొగులఁగా దయవచ్చి
                      యిట్టికళేబరం బిచ్చి తీవ
నను మనోవాక్కాయమునఁ గొల్చుటే సుఖం
                      బిది నమ్ముఁడని శాస్త్ర మిచ్చి తీవ
నీవల్ల నించుకేనియు వంచనము లేదు
                      నాపాప మీభంగి నడువ నీదు
విషయలోలత దాస్యవిముఖతయును బోక
                      నంతంత కహహ నా కధికమయ్యె


గీ.

తగనిపని పుట్టె మదిఁ జూల దిగులుపుట్టె
నీవ కరుణించి పాపంబు నిలువరించి
మనుపఁగదవయ్య మనవి చేకొనఁగదయ్య
వీత...

85


సీ.

త్రోవఁ దుప్పలలోన దొండజరాలన్న
                      భయమంది కడునుల్కిపడినయట్లు
కనుల నూదిన నెంత ఘనబుద్ధికైన రె
                      ప్పలు తనంతనె మూఁతబడినయట్లు
తమశుభాశుభసూచనమునకై యొకవేళ
                      యవయవంబులు దామె యదరినట్లు
నిదిరించువేళల నిఖిలేంద్రియంబుల
                      తెలివియెల్లను దానె తొలఁగినట్లు


గీ.

బొడము నవశంబుగా నాకు వెడఁగుబుద్ధి
దీని నడఁగింప నీకృపే దక్కుగాక
తక్క నెద్దియు లేదు సత్యంబు తండ్రి
వీత...

86

సీ.

పరమమవై వ్యూహపతివై విభవరూపి
                      వై.. .. .. .. ..యిదియు చాల
కర్చాస్వరూపివై యతిరమ్యమగు సహ్య
                      జాంతరీపావని నవతరించి
నయనగోచరుఁడవై నమ్రుల నేలుచు
                      నిఁక జను ల్బ్రతుకుత్రో వెఱుఁగరనుచు
వకుళభూషణుఁడవై వరగుణామృత మిచ్చి
                      గ్రోలుమన్నను జడుల్ గ్రోలకున్న


గీ.

నందుకై నీవు రామానుజాఖ్యఁ బొడమి
ప్రోచితివి సర్వజీవుల భూరికరుణ
నిట్టివాఁడ విదేల న న్నేలుకొనవు
వీత...

87


సీ.

నీవాఁడనయ్య నిన్నే గొల్తునయ్య నా .
                      కీవె దిక్కయ్య వే రెఱుఁగనయ్య
యార్తుఁడనయ్య నాయార్తిఁ బాపఁగదయ్య
                      హీనుఁడనయ్య యెగ్గెంచకయ్య
తాళలేనయ్య సత్యంబుఁ జెప్పితినయ్య
                      యిటుఁ జూడుమయ్య యే మెఱుఁగనయ్య
శరణంటినయ్య యీచల మేలనయ్య జా
                      లము సేయకయ్య యేలఁగదవయ్య


గీ.

తావకపదాబ్జదాసతద్దాసదాస
దాసదాసపరంపగాదాసు గాఁగ
ననుఁ గటాక్షింపుమయ్య యే మనకుమయ్య
వీత...

88

సీ.

నీవె నాతండ్రివి నీవే నాతల్లివి
                      నీవె నాతోడువు నీవె నీడ
నీవె నాగురుఁడవు నీవె నాసఖుఁడవు
                      నీవె నాసంపద నీవె ధనము
నీవె నాయేలిక నీవె నాప్రాణంబు
                      నీవె నాసుగతివి నీవె పతివి
నీవె నాపుణ్యంబు నీవె నాభాగ్యంబు
                      నీవె నావిద్యయు నీవె ధనము


గీ.

నీవే నాదైవ మిది యేల నిఖిల మీవె
నినుఁ గొలుచువాఁడ నీవాఁడ నీసుతుండ
నీపరిచరుండ దీనుండ నీదె భరము
వీత...

89


సీ.

కనకాంగదములతో ఘనకిరీటంబుతో
                      జలితాలకములతోఁ జర్చతోడ
మణికుండలములతో మహితచిత్రకముతో
                      సిరినొప్పునురముతోఁ జిహ్నతోడ
కౌస్తుభకళికతోఁ గమలనేత్రములతో
                      జిగురాకుమోవితో నగవుతోడ
శంఖచక్రములతో స్వర్ణచేలంబుతో
                      నెఱిబన్నసరులతో నీటుతోడ


గీ.

రత్నమంజీరములతోడ రశనతోడ
కటితటీకింకిణులతోడఁ గళలతోడ
వెడలు నీదువయాళి సేవించఁగంటి
వీత...

90

సీ.

అమ్మమ్మ యెంతసాహస మీపదంబు లా
                      వికటమౌ శకటంబు విఱుగఁదన్నె
వినువారి మది కెంత వింత యీయడుగు లా
                      చిలువ బల్దల లెక్కి చిందుద్రొక్కె
చూడఁజూడఁగ నెంతచోద్య మీచేతు లా
                      బకునిగాటపుముట్టె బట్టి చీరె
నహహ యెంతబ్బురం బౌర యీహస్త మా
                      గోవర్ధనం బెత్తి గొడుగుఁబట్టె


గీ.

నాఁటి బలుమోటుఁదనమును నేఁటిమెత్తఁ
దనముఁ బరికించి పరికించి మనము గరఁగు
నీదుమాయలు నాసామి నీకె తెలుసు
వీత...

91


సీ.

పెదవిఁ బర్వెడు కెంపు పెంపు పల్వరుసపైఁ
                      గదిసి గాటపుటెఱ్ఱకప్పు నేయు
విడువాలుగనుఁగ్రేవ నిగుడుజాయలు కుండ
                      లములపైఁ గమలరాగముల నించుఁ
దళుకుఁజెక్కుల డిగ్గు దట్టంపువలినిగ్గు
                      లఱుతముత్తెపుపేరు లగుచు వ్రేలు
నొసటిముంగురులు బల్మిసిమిమౌళికిఁ బ్రాకి
                      నెఱినీలిపట్టుజాలరు ఘటించు


గీ.

నెగసి మీసపునెఱతళ్కుటిరులు విరియ
మొలకనగు పూపవెన్నెలల్ మోహరించు
నౌర నీసోయగము జూడ నలవి యగునె
వీత...

92

సీ.

ఏలాగు నినుఁబాసి యిఁక తాళుకొనవచ్చు
                      నేలాగు కాళ్లాడి యేగవచ్చు
నేలాగు మదిఁ జాలిఁ దేలియుండఁగవచ్చు
                      నేలాగు మన్ను మి న్నెఱుఁగవచ్చు
నేలాగు కన్నీటిజా లాపికొనవచ్చు
                      నేలాగు విరిసజ్జ లెనయవచ్చు
నేలాగు నాహార మింపుగాఁ గొనవచ్చు
                      నేలాగు మైకాక లెడపవచ్చు


గీ.

నేల నేలాగు ప్రాణముల్ నిలుపవచ్చు
నేల నినుఁ జూడనాయె ని ట్లేలనాయె
కామహతకునిధాటి కే నేమి సేతు
వీత...

93


సీ.

ఎల్లవిద్యలు నిల్వ కిడిన నీతొలిరూప
                      మే సూక్ష్మతరబుద్ధి కిష్టతమము
భవదీయకైంకర్యపరుడు శ్రీకృష్ణార్యుఁ
                      డేమహాత్మునకుఁ బితామహుండు
నిరుపమానజ్ఞాననిధి రాఘవాచార్యుఁ
                      డేసత్వగుణవార్థి కెలమిఁ దండ్రి
ధీరుండు మాతండ్రి వీర రాఘవగురుం
                      డేపుణ్యఖనికి గారాపుపట్టి


గీ.

కేశవాశ్రమనికట మేకృతికి నిలయ
మట్టి శ్రీవత్సనారసింహార్యవర్యుఁ
గరుణ నిను నమ్మి వినుతింపఁ గంటినయ్య
వీత...

94

సీ.

రంగాంబికావీరరాఘవత్వమున న
                      న్గడుపాఱఁ గని పెంచు నొడయుఁ డెవఁడొ
వాత్స్యనృసింహార్య వైఖరి ననుఁగృత
                      సంస్కారిగాఁ జేయు సదయుఁ డెవఁడొ
రమ్యభారద్వాజ రామానుజార్యాఖ్య
                      భాష్యార్థ మిడు దీనబంధుఁ డెవఁడొ
బంధుకూర్మాచార్యభావంబునను దైశ్య
                      కృతిశక్తి యొసఁగు సుప్రతిభుఁ డెవఁడొ


గీ.

వాని శ్రీరంగవేంకటవారణాద్రి
యాదవాచలములఁ బాద మూదియున్న
నిన్నెగా మది నెఱింగితి నీరజాక్ష
వీత...

95


సీ.

శ్రీకూర్మమున కుదీచిఁ ద్రి యోజనమైన
                      వంశధారాతీర వసుధ నమరు
నచ్చుతపురి మంగళాలంబమైన శ్రీ
                      వత్స ముడుంబ సద్వంశమునను
ననుఁ గృపఁ బొడమించి నరసింహపాదాఖ్యుఁ
                      గావించి నిజవిద్యఁ గఱపి పెంచి
దివ్యదేశము లెల్లఁ ద్రిప్పి దర్శనమిచ్చి
                      తెట్టినేరములున్న నెంచుకొనవు


గీ.

మఱియు నను నిరతాత్మకింకరునిఁ జేయఁ
దలంచి కాఁబోలు నీనాఁటిదాక నచట
నీవు కేశవరూపివై నిలిచినావు
వీత...

96

సీ.

సత్సంగమున వీని సంసారరుచి మాన్పి
                      గురుని ప్రాపున రూప మెఱుకపఱచి
బరువాని బంధంబు విరియించి కడవేళ
                      మంచివాడిని వెల్వరించి యర్చి
రహగాద్య పక్షోదయనవత్సరమరు
                      దిన శశి విద్యుదబ్ధీశశక్ర
వనజజులను నాతివాహికు ల్మన్నింప
                      గాంచనాండంబు భేదించి యవల


గీ.

విరజ దాటించి వాఙ్మనోవిప్రకృష్ట
పరమపరమాద్భుతాద్భుతపదము పదము
జేతువట భళిభళి యెంత దాత వౌర
వీత...

97


సీ.

పాపరాశికి నున్కిపట్టన శాస్త్రీయ
                      చర్యలకెల్ల నుఛ్ఛ్వాసభూమి
నతినికృష్టతకు జీవితము నపస్మార
                      ఫక్కికకెల్ల బల్పట్టుకొమ్మ
నాశాలతకు నిరూఢాలంబనంబు న
                      నాచారమునకు ముఖ్యాస్పదంబు
నతిదుర్నయమునకు నాలవాలంబు నీ
                      ర్ష్యావిషంబునకు మూలాకరంబు


నేవమాధ్యతిహేయాతిహేయతముని
నన్నుఁ దరిజేర్తువని మది నమ్మఁజాల
నేల కరుణింతు వీప్రతికూలజడుని
వీత...

98

సీ.

అపరాధి నపరాధి నఖిలలోకాధ్యక్ష
                      యపరాధి నపరాధి నార్తరక్ష
యపరాధి నపరాధి నవనతావనదక్ష
                      యపరాధి నపరాధి నఘవిపక్ష
యపరాధి నపరాధి నమలతాసంధుక్ష
                      యపరాధి నపరాధి నతిపరోక్ష
యపరాధి నపరాధి నఖిలైకసంరక్ష
                      యపరాధి నపరాధి నంబుజాక్ష


గీ.

తగను దగ నెదుట నిల్వఁగఁ దగను తగను
జడుఁడ హతకుఁడ దుర్బుద్ధి విడువ కకట
చెడితి నడియాస లేల నీచిత్త మిఁకను
వీత...

99


సీ.

మంగళం బెపుడు సోమకదైత్యహరునకు
                      మంగళంబు బలోఢమంధరునకు
మంగళంబు ధృతోత్తుంగభూతలునకు
                      మంగళంబు హిరణ్యమర్దనునకు
మంగళంబు బలీంద్రమదనివారణునకు
                      మంగళంబు కుఠారమండనునకు
మంగళంబు దశాస్యమరణకారణునకు
                      మంగళంబు ప్రలంబమారణునకు


గీ.

మంగళంబు త్ర్రైపురీవ్రతభంగకృతికి
మంగళము దుర్జనమ్లేచ్ఛమదనధృతికి
మంగళము నీకు వాత్సల్యమహితమతికి
వీత...

100

సీ.

ఇది పఠించినవారి కిది ప్రేమ వినువారి
                      కిది లిఖించినవారి కెగ్గు లేదు
ఇది గ్రహించినవారి కిది ధరించినవారి
                      కిది నుతించినవారి కెగ్గు లేదు
ఇది గణించినవారి కిది యొసంగినవారి
                      కిది గుణించినవారి కెగ్గు లేదు
ఇది మతం బనువారి కిది ఋతం బనువారి
                      కిది హితం బనువారి కెగ్గు లేదు


గీ.

లేదు లే దెపు డెపు డెగ్గు లేదు లేదు
కలఁ గనులఁ గట్టి యీకృతిఁ బలిమిఁ గొనిన
పాఠి వీవెకబా యేల సందియంబు
వీత...

101


క.

శ్రీమన్ముడుంబ వేంకట
రామనృసింహార్య రచిత రంగేశ గుణ
శ్రీమహితకృతికి భక్త స
భామహనీయము ద్వితీయభాగము ముగిసిన్.

శ్రీరంగేశశతకము సంపూర్ణము.