భక్తిరసశతకసంపుటము/రెండవసంపుటము/రాజశేఖరశతకము

పీఠిక

ఈ రాజశేఖరశతకము చంపకోత్పలమాలికలతో రచింపబడిన యుత్తమశతకము. ఇది రచించినకవి సత్యవోలు సోమసుందరకవి. ఈయన నియోగిబ్రాహ్మణుఁడు. వేంకటరాయమంత్రి పుత్రుఁడు. “శాంకరీవరపరిలబ్ధసారమృదు వాక్కలితాతతగీతసాహితీపరిచయుఁడన్” అను శతకపద్యభాగమువలన నీకవి సంస్కృతాంధ్రభాషలయందె గాక సంగీతవిద్యయందుఁ గూడ నిపుణుఁడని యెఱుంగనగును.

కొలఁదిగ నీతిపద్యములున్నను మొత్తముమీఁద నీరాజశేఖరశతకము భక్తిరసశతకములలో నొకటి. ఇందు తొలుతగలపద్యములు కొన్ని యంత్యనియమముతోడను గొన్ని ముక్తపదగ్రస్తముగ వ్రాయఁబడియున్నవి. కవిత నిరర్గళధారాశోభితమై మనోహరముగా నున్నది. కులశేఖరాళ్వారులు చెప్పిన ముకుందమాలయందలి యీ క్రిందిశ్లోక మీశతకమున 87-వ పద్యమునఁ గలదు.

శ్లో. కృష్ణ త్వదీయపదపంకజపంజరాంత
     మద్యైవ మే విశతు మానసరాజహంసః,
     ప్రాణప్రయాణసమయే కఫవాతపిత్తైః
     కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే.

ఈశతకకర్త ప్రకృతము సజీవిగా నున్నాడు. ఈయన వచనకాదంబరి లోనగు గ్రంథములు రచించెను. కవిత మృదుమధురము. కవి శతకమున 'సారెకు ముద్దుగుల్కెడు లసత్కవితామృదులత్వమున్ సుధాధారలు చిల్కుపల్కులను దారపుభక్తియు నాకొసంగ రారా' యని చెప్పికొనినటుల నీశతకమునందు మధురశైలియు భక్తిరసభావములు నీశ్వరానుగ్రహమున గడించెనా యని శతకమునందలిపద్యములు చదువునపుడు తోఁపక మానదు. కవినివాసము గోదావరిమండలమునందలి యుప్పాడ కొత్తపల్లియని తెలియుచున్నది.

మేము ప్రచురింపఁబోవు శతకసంపుటమునం దీయుత్తమశతకమును ముద్రించుకొనుట కవకాశము నొసంగి మాయుద్యమమునెడ సానుభూతిఁ జూపిన యీశతకకర్తయెడఁ గృతజ్ఞులము. ఆధునికశతకవాఙ్మయమున నిట్టి విలువగలశతకములు చాలతక్కువగా నున్న వనుట యత్యుక్తి కాఁజాలదుగాన నీశతకము నుత్సాహముతోఁ బ్రచురించినారము.

తండయార్పేట

ఇట్లు

చెన్నపట్నం.

వావిళ్ల . రామస్వామిశాస్త్రులు

16-4-26.

అండ్ సన్స్

శ్రీరస్తు

సత్యవోలు సోమనుందరకవికృత

శ్రీ రాజశేఖరశతకము

ఉ.

శ్రీకర దాసమానసవశీకర హైమవతీముఖాబ్జశో
భాకర సత్ప్రభాకర కృపారసపూరిత మంజువాక్సుధా
శీకర వైరిభీకర విశేషలసద్గుణరత్నపాళిర
త్నాకర సర్వలోకసముదారదయాకర రాజశేఖరా.

1


ఉ.

ఈశ జగత్ప్రకాశ నమదింద్రదిగీశ శరీరకాంతిసం
కాశ నిశేశకాశ ధృతకాశ గిరీశ ధరాదిసర్వభూ
తేశ నిశాటనాశ జగదీశ విలుంఠితకర్మపాశ గౌ
రీశ వియత్సుకేశ పరమేశ కృపాకర రాజశేఖరా.

2


ఉ.

రాజతధారుణీధరవిరాజిత భూరిసువర్ణదుర్గస
ద్రాజ సురారినాగమృగరాజ పదానతభక్తియుక్తగో
రాజ యశోజితాబ్జఫణిరాజ సఖాంచితరాజరాజ రా
రాజులకెల్ల నీవెగద రాజవు శ్రీకర రాజశేఖరా.

3


ఉ.

తారగిరీంద్రధామ ధృతతారకనామ సురాద్రిధీమ సం
పూరితభక్తకామ పరిపోషితదేవలలామ దానవ

ద్దారుణశత్రుభీమ గజదానవదానివిరామ శేఖరా
కారశిరస్థసోమ కృతకామ మహేశ్వర రాజశేఖరా.

4


చ.

భవలతికాలవిత్ర నతపాపవిమోచనసూత్ర సారసో
ద్భవదివిజేశ్వరాదినుతిపాత్ర త్రినేత్ర గుణత్రయోల్లస
ద్భువననిదానచిత్ర ఘనపుంగపపత్రపవిత్ర సత్కథా
శ్రవణవతీకళత్ర ఘనసార యశోభర రాజశేఖరా.

5


ఉ.

అంగజగర్వభంగ శరదభ్రశుభాంగ విలోలసత్కృపా
పాంగ నగాత్మజాహృదయపంకజభృంగ యశోజితేంద్రసా
రంగ దయాంతరంగ జలరాశినిషంగ మహీశతాంగ శ్రీ
పుంగవరాడ్తురంగ ఘనపుణ్యగుణాకర రాజశేఖరా.

6


చ.

సరసిజజామరేంద్రముఖసన్నుత దివ్యలసచ్చరిత్ర భీ
కరదురితౌఘకానననికాయవినాశన వీతిహోత్ర భా
స్వరఘనసారగాత్ర విలసన్మతిహైమవతీకళత్ర కి
న్నరగణరాజమిత్ర వరనాకధునీధర రాజశేఖరా.

7


చ.

హితకవితాభిలాష సుకవీశ్వరపోష మనోజ్ఞవేష సం
తతపరితోష దాసజనతాకృతదోష తమిస్రపూష సం

భృతఫణిరాజభూష సరసేందుకరాంచితమంజుభాష సం
హృతరిపువర్గరోష నతహృద్వరమందిర రాజశేఖరా.

8


చ.

సురగిరిచాప దివ్యతసుశోభితభోగికలాప పార్వతీ
కరమణివల్లకీమృదులగాననినాదపరీతమాధురీ
భరసరిదంతరీ....మునిభావితభాసురచిత్స్వరూప సా
వరసరసానులాప నిజదాసదయాకర రాజశేఖరా.

9


ఉ,

మంజులభక్తలోకకృతమానిత గానరసానుకూల స
ద్రంజితకంజజాదికపరాత్పరతత్వపరార్యజాల ద్వి
డ్భంజనపాటవాంచిత విభాసురకోటిలసత్క్రిశూల స
త్పుంజహృదబ్జఖేల నతభూరికృపాకర రాజశేఖరా.

10


ఉ.

పన్నగరాజకంకణం పసన్నజనావనభక్తియుక్తిసం
పన్ననమత్కవీంద్రభవపాపవిమోచన దేవతాధిరా
ట్సన్నుతప్రోల్లసచ్చరణ సాగరతూణ రమేశబాణ యా
పన్నజనార్తిసంహరణ భవ్యకృపాగుణ రాజశేఖరా.

11


చ.

నిగమసమూహఘోట బలనిర్జిత ఘోరనిశాటపాపహృ
ద్గగనతరంగిణీకుముదకాండముదావహచంద్రికాధగ
ద్ధగితదిశాంతరాళహిమధామకిరీట ప్రసన్నఖేట భ
ద్రగరజతాద్రికూట నగరాజసుతేశ్వర రాజశేఖరా.

12

చ.

తొలుతను విఘ్ననాయకునిఁ దోరఁపుభక్తిం దలంచి భారతీ
లలనకు మ్రొక్కి లక్ష్మికిఁ జెలంగుచు నంజలిఁ జేసి నెమ్మదిన్
గులుకుచు సర్వమంగళను గొల్చి పితామహు నెంచి యారమా
కలితు నుతించి నేఁడు శతకం బొనరించెద రాజశేఖరా.

13


చ.

వలనుగ రాజతాద్రియు నివాసము హేమనగంబు చాపమున్
గలధనివైన నీకు మరి కాన్క లికేమి యొసంగువాఁడఁ జె
న్నలరఁగఁ జంపకోత్పలసుమావళుల న్మధుబిందుబృందముల్
జిలుకఁగఁ గూర్చి నీ కిడెదఁ జేకొను శ్రీకర రాజశేఖరా.

14


ఉ.

సారెకు ముద్దుగుల్కెడు లసత్కవితామృదులత్వము న్సుధా
ధారలు జిల్కు పల్కుల నుదారపుభక్తియు నాకొసంగ రా
రా! రజతాద్రివాస! నగరాజసుతాహృదయేశ సాహితీ
సార మెలర్ప నీమహిమ సన్నుతి చేసెద రాజశేఖరా.

15


ముక్తపదగ్రస్తచంపకము.

సరసకవీంద్రసన్నుతలసత్పదసారస సారసాంబకా
పరిమితబాహువిక్రమనివారణ వారణదైత్యఖండనో
త్కర కరలగ్నమేరుగిరికార్ముక కార్ముకసక్తభార్గవీ
వర వరబాణ బాణహతపాపపురాసుర రాజశేఖరా.

16

చ.

పలుమరు శబ్దగుంభనలు భవ్యసుధారసబిందుబృందముల్
జిలికినరీతి వాగ్రచనచే సుకవిత్వమొనర్ప నేర్చియు
జ్జ్వలభవదీయపాదనుతి సల్పని జన్మము జన్మమే మహీ
స్థలి నటుగాన నిట్టికృతి సల్పెద శ్రీకర రాజశేఖరా.

17


ఉ.

నారదముఖ్యసన్నుత సనాతన తావకసత్కథాసుధా
వారిధినంతయున్ దవిలి పానము సేయఁగ నెవ్వఁ డోపు భా
గీరథినీరముల్ గరు లొగిన్ మశకంబులు గ్రోలుచుండవే
కూరిమి తృప్తియున్ దులగగోత్రసుతావర రాజశేఖరా.

18


చ.

తరికిట తాంధణాంకిణతతజ్ఝెణుతద్ధిమితారితక్కుఝేం
తరి యని తాళలీలల మృదంగ ధిమిద్ధిమినిక్వణార్భటిన్
సరిమపధల్ క్రమాక్రమత సల్పుచుఁ బొల్పగురీతి శుద్దసా
హురి నిదె గీతి సేతు భవదుత్తమనామము రాజశేఖరా.

19


చ.

కురువక మాధవీ వగుళ కుంద శిరీష లవంగ యాలకీ
సరళలతా వితాన ధర సారస పాటల జాల మాలతీ
గురుతర పారిజాత నవకోరక చారులతాంత భూజనుః
పరివృతరాజతాద్రిమణిభాస్వరమందిర రాజశేఖరా.

20


ఉ.

చారు నమేరు నీప హరిచందన నింబ కదంబ జంబు జం

బీర మధూక బిల్వ కరవీర తమాల రసాల సాల మం
దార మహామహీరుహవితానవిరాజితరాజతాద్రిసం
చార శుభప్రచార భవసాగరనౌధర రాజశేఖరా.

21


ఉ.

సారస చక్రవాక విలసత్కలహంస జలాటకుక్కుటీ
వార విహార ధీరసురవారవధూకుచలిప్తచందనో
దార మృగీమదాతీపరిధావనగంధిలవాఃప్రపూరకా
సారపరీతరౌప్యగిరిసన్మణిమందిర రాజశేఖరా.

22


చ.

లలితమృదంగవాదనక లాతతనాదఘుమంఘుమిన్ శ్రుతుల్
గలయుచు రంగురక్తియునుఁ గ్రాలలయాతతగీతసాహితీ
కలనఁ జెలంగఁ బాదముల గజ్జెలు కట్టి ప్రదోషతాండవం
బలర నొనర్చునట్టి త్రిపురాసురసంహర రాజశేఖరా.

23


చ.

నిటలతటాంజలిప్రణతనీరజగర్భశిరఃకిరీటసం
ఘటితమసారనీలరుచికాండమదాళీపరంపరాంచితో
ద్భటభవదీయపాదనవపంకజయుగ్మము సర్వసంపదల్
పటుతరలీలఁ గూర్చు నిజభక్తుల కిద్ధర రాజశేఖరా.

24


ఉ.

సారయశోజితాబ్జఘనసార తుషార పటీర హీర మం
దార శతార తార దర తారక పారద నారదాభ్రకా

సార మరాళ హార శర శారద నారద శారదా సుధా
సార దయాకరా వినతసన్మునిశేఖర రాజశేఖరా.

25


చ.

లలితకటాక్షవీక్షణకలాపముచే జెలువొందు మోమునన్
గులికెడు మందహాస మది కోరి శిరస్థితచంద్రచంద్రికల్
గెలువఁగ నేగులీలఁ దులకింపఁగఁ దావకసమ్మదప్రభా
కలితకలావిలాస మెదఁ గాంచెగ శ్రీకర రాజశేఖరా.

26


ఉ.

సారలవంగ సత్క్రముకశారదసార సమేతకమ్రవీ
టీరసభార గంధవహడింభకవార విరాజితాననాం
భోరుహ వల్లభారచితభూరివిలాససకలాపదీపనో
దారరత ప్రచార నిజదాసదయాకర రాజశేఖరా.

27


ఉ.

సాంకవగంధసార ఘనసార మృగీమదరేణుగంధివా
మాంకకుచోత్తరీయజనితాంచితశీతలవాతధూతమీ
నాంకవిలాసకేళిజనితాయతనిర్మలఘర్మబిందుబృం
దాంకితదేహజశ్రమనిరామయవిక్రమ రాజశేఖరా.

28


ఉ.

నాయక తావకీనగళనైల్యము సన్మదషట్పదభ్రమన్
జేయునటంచు శాంకరి హసింపఁగఁ జంపకనాసవీవు నీ
కీయెడ నట్టి భ్రాంతిగలదే యని నవ్వుచుఁ బ్రాణనాయకిన్

డాయఁగఁ జేర్చి ముద్దిడఁ గడంగెడుశ్రీకర రాజశేఖరా.

29


చ.

కలువలదండలు న్వలె నిగారఁపుమిన్కుల నీను పేరులన్
గళమునఁ బూనినాఁడవని గౌరి రహి న్బరిహాససూక్తులన్
బలుకఁగ గల్వదండ లనవచ్చును నీచిఱునవ్వు వెన్నెలన్
గులుకునటంచుఁ బల్కెదవు కూర్మి దయాకర రాజశేఖరా.

30


చ.

గళమున నొప్పు నబ్బెడఁగుకప్పమరాళిని దెప్పగా మహో
జ్జ్వలదరహాస మెల్లెడలఁ జల్లనివెన్నెలనిగ్గుఁ గుప్పగాఁ
జిలుకలు వల్కురీతి సుధఁ జిల్కగ బల్కెడు గౌరిముద్దుప
ల్కులగమి యొప్పఁగా మిగులగుల్కెడు శ్రీకర రాజశేఖరా.

31


ఉ.

కీర మయూర కోకిల శుకీ కలహంస శకుంత శారికా
వార కలధ్వనుల్ గలిగి భాసిలుచుండెడు పువ్వుఁదోఁట వి
స్తారపురాకృతాతిభవతారకతావకసత్కథాసుధా
ధారలు గ్రోలుపూటయు ముదంబిడు శ్రీకర రాజశేఖరా.

32


చ.

సుర లతిభీతులై శరణుఁజొచ్చిన వారల నాదరించుచున్
మురహరుని న్వసుంధరను భూరిమహీధరము న్మహాంబుధిన్
శర మరదంబు చాపము నిషంగము గాఁగ ధరించి యాజిలో
నురవడిఁ ద్రుంచి తౌర త్రిపురోద్ధతదైత్యుల రాజశేఖరా.

33

ఉ.

తావకసంస్తవార్హలలితంబగు వాక్ఫణితిన్ గవుల్ ధనా
శావశులై కదర్యమదశాలినృపాలురపాలు సేతు రా
హా! వియదాపగాసలిల మబ్బినపట్టున నింబభూజమున్
వావిరి ముంచి పెంచు నలబాలిసులట్లను రాజశేఖరా.

34


చ.

రసమును గుర్తెఱుంగఁ డతిరమ్యకవిత్వముఁ జూచి మెచ్చలే
డసహన మొంది గుందు నహహా! సువికత్వ మొనర్పలే డస
ద్విసరము సేయునట్టి యవివేకికిఁ బాండితి యుండుగాక యి
వ్వసుమతియందు నిందులకుఁ బాలగు నాతఁడు రాజశేఖరా.

35


ఉ.

కొండెము సెప్పఁ బండితుఁడు కొండొకవిద్య నెఱుంగఁ డెంతయు
న్మొండితనంబు మెండు గడుమూర్ఖుఁ డనార్యుఁడు తిండిపోతు నీ
చుం డతిబుద్ధిహీనుఁ డగు సోమరి సత్కవినింద సేయుచో
నుండఁడు క్రిందుమీఁదుల నహో రిపుభీకర రాజశేఖరా.

36


చ.

పరులకు విద్య నేర్పుటకుఁ బాల్పడఁ డొక్కెడఁ జెప్పెనేనిఁ దా
మరుగిడి తెల్పు మత్సరుఁ డమాన్యుఁడు పల్కినపల్కె నిల్పఁగా
దొరకొని కయ్యమాడుటకె తూగును గుచ్చితుఁ డట్టివాని కీ

ధరను బ్రతిష్ఠ లేదుగద దాసవరప్రద రాజశేఖరా.

37


ఉ.

మానితగీతగీతియును మందరమధ్యమతారకంబులున్
దానవితానసంగతులుఁ దాళగతుల్ గడురంగురక్తియున్
గాననివానిఁ గానము సుగంధవిహీనతఁ జెందు నట్టి యా
సూన మపాత్రదానమును సొంపు వహింపదు రాజశేఖరా.

38


చ.

మనమున నొక్కతీరు పలుమాటల పైకొకరీతి చేయఁబూ
నిన దొకదారిగా నిటుల నీతిదొలంగి మెలంగువారితో
జను లతిమైత్రి సల్పుదురు సద్గుణధుర్యుని నిష్ప్రయోజకుం
డనుచును గంటఁజూడ రహహా! సుగుణాకర రాజశేఖరా.

39


చ.

విరివిగ నోటఁ దా ననుభవించక దీనుల కివ్వనట్టివాఁ
డఱిముఱి భూమియందిడినయర్థ మనర్థకమౌఁ జుమీ తుదిన్
మరుగునఁ డాగియుండి మధుమక్షికముల్ దగఁగూర్చు తేనె దా
బరులకుఁ జెందురీతి నగు భవ్యగుణాకర రాజశేఖరా.

40


చ.

 సతతము యాచకావళికి సారధనం బిడుచో వదాన్యుఁడౌ
చతురుఁడు తక్షణం బొసఁగ సయ్యన లేదని తెల్పువాఁడె బల్
చతురతరుండు లేదనఁడు జాలము సేయుచు నిచ్చురీతి సం
తతమును ద్రిప్పు వానియభిధానము గానము రాజశేఖరా.

41

ఉ.

కోరికతో ధనాఢ్యుని కుత్సితు నల్పుని దుష్టచిత్తునిన్
జేరినవార లీప్సితము జెంది సుఖింపరు హానిఁ గాంతు రా
చారుఫణాగ్రభాగవిలసన్మణిరాజము గల్గి వెల్గినన్
గ్రూరభుజంగమున్ గవయఁగూడునె శ్రీకర రాజశేఖరా.

42


చ.

నరులు స్వదేహశోషణ మొనర్చిన దాననె ముక్తి గల్గునం
చరయుదు రెంతవింత యహహా! యవివేకము వారినొంచు ని
ద్ధర నొకపుట్టపై మిగులఁదాడన సేయఁగ నంతమాత్ర న
య్యురగ మణంగునే నతదయోదయ శ్రీకర రాజశేఖరా.

43


ఉ.

భూతి శరీరమంతటనుఁ బూసి జటాజినవల్కలాంగుఁడై
శీతజలాతపాదుల వసించుచు వేషము బూను దాంభికుం
డాతతభక్తియుక్తుఁడగు నప్పరతత్వపరు న్వలెన్ మహా
భూతపతీ! భవత్పదముఁ బొందునె శ్రీకర రాజశేఖరా.

44


చ.

విమలతరప్రబోధముగ వేదము శాస్త్రపురాణపుంజముల్
గ్రమమున నభ్యసించి యటఁ గర్మవిమోహితుఁడై జనాళికిన్
శ్రమఁగొని బోధసేయుచును సత్పరతత్వము గానలేడు దా
నమరియుఁ దర్వి పాకరస మాననికైవడి రాజశేఖరా.

45


ఉ.

ధీరుఁడు భక్తి కల్గి భవదీయకృపావశుఁ డౌట శాస్త్రమున్

గోరి పఠించి సారమును గూరిమి మీఱి గ్రహించి పిమ్మటన్
ధారుణి కర్షకుం డెటుల ధాన్యము నెంచి పలాలసంహతిన్
దూరము సేయునట్టిగతిఁ ద్రోయును శాస్త్రము రాజశేఖరా.

46


చ.

అనిశము లంతరాయము లనంతములై విలసిల్లు శాస్త్రముల్
మనుజుల కాయు వల్పము సమర్థతఁ గల్గు టదెట్లు గావునన్
ఘనమగు శాస్త్రసారమును గైకొను ధన్యుఁడు నీదు సత్కృపన్
వనమున దుగ్ధ మంచవలె భ క్తియుతాదర రాజశేఖరా.

47


చ.

శిరము వహించుఁ బువ్వులను జెల్వుగ నాసిక యాసుగంధమున్
గురుమతితో గ్రహించు నధికుం డొకఁ డెయ్యెడ సర్వశాస్త్రముల్
దొరకొని తాఁ బఠించుఁ గడుఁదోరపులీలఁ దదర్థ మాత్మలో
నరసి సుఖంబు నొందెడుమహాత్ముఁ డొకం డిల రాజశేఖరా.

48


చ.

హరి యనుచును హరుం డనుచు నంబుజగర్భుఁ డటంచుఁ గొంద ఱీ
వరుసను బల్కుచున్ బ్రకృతిబద్దులు గావున జ్ఞానహీనులై
పురికొని వాద మొందెదరు మువ్వురి కవ్వలమూలమౌ పరా
త్పరు నవికారుఁ గాంచునదె తత్వము శ్రీకర రాజశేఖరా.

49

చ.

హరియె హరుండు శ్రీధరపురారుల కైక్య మటంచు వేదముల్
మొర లిడుచుండఁగా వినుచు మూఢత భేదము సేయ నేల దు
ర్భరమగునయ్య విద్య నెడవాపి పరాత్పరతత్వ మూను సు
స్థిరమతిఁ దా సుఖించును సుధీజనతాదర రాజశేఖరా.

50


చ.

తనువు మనంబు ప్రాణములుఁ దద్దయు నింద్రియజాల మైక్యము
న్దనరఁగఁ జేసి భక్తిఁగొని తావకపాదసరోజచింతనం
బునఁ గడుమోద మొందు ఘనపుణ్యుఁ డొనర్చిన సర్వధర్మముల్
బొనరఁగ నీ కొసంగుచును బొందు భవద్గతి రాజశేఖరా.

51


ఉ.

పావనతావకాంఘ్రియుగభావనయ న్వరసూర్యదీప్తి లే
కేవరుసన్ దమఃపటల మేగును గేవలశబ్దబోధచేఁ
బోవు నదెంతయు న్విరతిఁ బొందునె చీఁకటి దీపవార్తచేఁ
గావున నీదుభక్తి గొనఁ గావలె శ్రీకర రాజశేఖరా.

52


చ.

వ్రతములు దేవపూజ లుపవాసములున్ బహుదానధర్మముల్
గ్రతువులు తీర్థయాత్రలును గన్గొన వేదపురాణశాస్త్రముల్
గుతుకముతో భవత్పదముఁ గోరి భజించు మహాత్ముఁ బ్రోవ నీ
యతులితభక్తిఁ బోలవు దయాకర శ్రీకర రాజశేఖరా.

53

ఉ.

ఆటలచోటనైనఁ బరిహాసపుమాటలనైన నీటుగాఁ
బాటలనైన భీతిఁగొని బాటలనైనను మాటిమాటికిన్
నోటను నీదునామము వినోదముగాఁ గొని ముత్తిబోఁటితోఁ
గూటములన్ సుఖింతురట గోత్రసుతావర రాజశేఖరా.

54


చ.

కలి బలిమిన్ రచించు ఘనకల్మషముల్ వహియించి చెంగటన్
నిలిచి భజించుభక్తులను నీదు కృపారసవారిచేత ని
ర్మలినులఁ జేయుచుందువట మానక మానుగ నీనునట్టి గో
వులు దమవత్సల న్వలెను భూరిదయాకర రాజశేఖరా.

55


ఉ.

చారువిలాసవాసముఖసారససారమృదూక్తిమాధురీ
భారవిరాజమానరతిభావజభావజచాతురీపరీ
తారభటీకటాహవనితాజనతావశు లై నితాంతసం
సారముఁ గోరి నిన్నుఁ గనఁజాలరు మూఢులు రాజశేఖరా.

56


ఉ.

కాలగతుల్ దలంచి భవకల్పితకార్యము లొందియు న్సతీ
లోలురు గాక క్రోధమదలోభములెల్ల నణంచి కల్మషో
న్మూలన మాచరించి సమబుద్ధి వహించి భవత్పదాబ్జభ
క్తాళులు నిన్నుఁ జెందుదురు హా పరమేశ్వర రాజశేఖరా.

57


ఉ.

సాంబ కృపావలంబ బుధజాతవినీతపరీతధీలతా
లంబ నితాంతభక్తినుతిలాలసమోదయుతాంకసక్త హే

రంబ త్రిశూలచాలనపరాజితఘోరసురారిభీకరా
డంబ భవత్కథల్ శుభవిడంబన లీశ్వర రాజశేఖరా.

58


చ.

సలలితతావకాంఘ్రిజలజాతయుగాంచిత భక్తుఁ డల్ల ధూ
ర్తుల ధనదుర్మదాంధుల సుతుల్ విననొల్లఁడు తా భజించునే
కొలఁది రసాలసాలమధుకోమలపల్లవఖాదిమత్తకో
కిల చలపత్రపత్రము లొకించుక శ్రీకర రాజశేఖరా.

59


చ.

నరు లేవ రేని నీదుభవనంబున కొక్కప్రదక్షిణంబు సు
స్థిరమతితో నొనర్చి పదసేవకులై శివశంకరా శివా
వర వరదా యటంచు బహుభక్తి బఠింపఁగ దండపాణిమం
దిర మది గాంచ రెన్నడును ధీర మహేశ్వర రాజశేఖరా.

60


చ.

ఆమితభవత్పదాబ్జభజనామృతపానవిశేషమత్తచి
త్తము కలనైనఁ గోరదుగదా ఖలసేవనలన్ వియన్నదీ
విమలతరంగమాలికల వేడుకతోడను దూఁగు రాజహం
సము జలరాశి కేగునె వెస న్పరమేశ్వర రాజశేఖరా.

61


చ.

హర త్రిపురాసురాంతక దయాకర శూలి కపాలమాలికా
ధర గిరిజాపతీ యని సదా నుతి సల్పెడు భక్తకోటిపా
దరజము మచ్ఛిరంబునను దాల్తు నటేగకుఁడంచు జంకి కిం

కరులకుఁ దెల్పుచుండునట కాలుఁడు శ్రీకర రాజశేఖరా.

62


ఉ.

శంకర భక్తమానసవశంకర దుష్టనిశాటఝూటనా
శంకర శంఖపంకరుహచక్రహలాంకుశచాపముఖ్యరే
ఖాంకితతావకాంఘ్రియుగ మాదరలీల భజించునట్టి నీ
కింకరుఁ జేర రల్ల యమకింకరు లీశ్వర రాజశేఖరా.

63


ఉ.

సారెకు ధీరులై సుగుణసారత మీఱు భవత్కథాసుధా
ధారలుఁ గ్రోలుచున్ చరణదాస్యము సల్పెడు వారి వారినిన్
జేరినవారి దారికినిఁ జేరకుఁ డంచు యముండు దూతలన్
దూరుచు బల్కుచుండు భవదూర దయాకర రాజశేఖరా.

64


ఉ.

వారక సత్యదూరుల నివారితదర్శులఁ గర్మబాహ్యులన్
ఘోరుల బ్రహ్మఘాతకుల గోఘ్నుదుష్టుల దుర్మదాంధులన్
వారినిఁ జేరువారిదరి వారిని సారెకు మీఱి చీరఁగాఁ
జారులఁ బంచు కాలుఁ డనిశంబు పరాత్పర రాజశేఖరా.

65


ఉ.

లాలితభర్మనిర్మితవిలాసభవన్మణిమందిరస్థఘం
టాలపితధ్వనుల్ శ్రుతివిడంబనగా వినుచున్నవారల
క్కాల లులాయకంఠపరికల్పితభూరితరోగ్రఘంటికా
జాలనినాదముల్ వినరు సారగుణాకర రాజశేఖరా.

66

చ.

లలిభవదుత్తమాంగపరిలంబితదివ్యజటానటద్ధునీ
కలితతరంగఘుంఘుమితకమ్రనినాదము నాలంచువా
రలును యమాలయాంగణవిరాజితవైతరణీతరంగమా
లలఁ గలనైనఁ గాంచరు కలాకలితాదర రాజశేఖరా.

67


ఉ.

ప్రాకటహేమచౌర్యముఖపాపకఠోరభుజంగపాళికిన్
గేకులు నీదునామఘనకీర్తనముల్ మధుపానపాపకిం
,పాకకుఠారధార లఘభంజన నీదుకథాభివర్ణనల్
చేకొనువారు దుష్కృతము జెందరు శ్రీకర రాజశేఖరా.

68


ఉ.

పట్టితి నీపదాబ్జములు భావుకలీల సమస్తసౌఖ్యముల్
ముట్టితి జన్మకర్మభవమోచన నీదుపదాభిలాషినై
మట్టితి లోభమోహమదమత్సరరోషనికాయ మిత్తఱిన్
గొట్టితి సర్వపాపముల గోత్రసుతావర రాజశేఖరా.

69


చ.

విడిచితి కర్మసంచయము వ్రేల్మిడి నీదుపదార్పణంబుగాఁ
గడచితి పూర్వజన్మకృతకల్మషవారిధి శత్రువర్గమున్
బొడిచితి జ్ఞానచంద్రికను బూని మదిం దమమంత వింతగాఁ
దుడిచితి మేరుచాపధర దుర్జనభీకర రాజశేఖరా.

70


చ.

జగమున జీవకోటి శతజాతుల నొంది నరత్వ మూను మా
నుగ నట విప్రజన్మము గొను న్బహుపుణ్యముచేత శాస్త్రియై

తగియును ని న్గన న్మదిని దల్పక తా విడుచు న్బ్రయత్నహ
స్తగతసుధారసమ్మువలెఁ దత్త్వము శ్రీకర రాజశేఖరా.

71


చ.

సురలు నిశాచరు ల్గలిసి సూటిగఁ బాటిలు దుగ్ధవార్ధి మం
ధరగిరిచే మథింపఁగ నుదారహలాహల ముద్భవించి య
త్తఱి జగముల్ గలంచునెడ దానిని నీగళమంద నిల్పి శం
కరతను ముజ్జగంబులను గాచితి వీశ్వర రాజశేఖరా.

72


ఉ.

కంజజముఖ్యఖేచరనికాయ మట న్భజియించి మించి మృ
త్యుంజయ! తే నమోస్తు భవతోయనౌధర! తేన మోస్తు స
ద్రంజక! తే నమోస్తు నగరాజసుతాధిప! తే నమో స్తటం
చంజలి జేసి పల్కె విజయాకర శ్రీకర రాజశేఖరా.

73


చ.

పరమమునీంద్ర దేవగణపన్నగఖేచరసిద్ధసాధ్యకి
న్నరగరుడోరగాదిగణనాథపరీవృత రాజతాద్రిమం
దిరమణిసింహపీఠయుత ధీరలసన్మృదులాంకసక్తస
ద్గిరివరకన్యకారచితగీతరసాదర రాజశేఖరా.

74


ఉ.

సారెలు మేళవించి విలసన్మణివీణలు పూని తుంబురుం
డారయ నారదుండును లయాంచితసంగతి గీతసాహితీ
సారముగా భవత్కథలు సారెకు గాన మొనర్చి తత్సుధా
ధారలు గ్రోలుచుందురు సదా జగదీశ్వర రాజశేఖరా.

75

చ.

వితతకృపావలోకనసువీచిలసద్దరహాసచంద్రికల్
గుతుక మొనర్చి సేవకచకోరముల న్విలసిల్లఁజేయఁగన్
సతతము నర్మవాక్కలితచాతురి మీఱఁగ సర్వమంగళా
సరసోక్తుల న్ముదము దాల్చెదు శ్రీకర రాజశేఖరా.

76


చ.

కరమణికంకణధ్వనులు గ్రాల సలీలసువర్ణదండచా
మరమున వీచుచో నలరి మంజులవాగ్రచనాచమత్కృతుల్
సరసహితోపదేశములు సల్పఁగఁ బొల్చు నిజాంకసక్తశాం
కరినిఁ గటాక్షవీక్షలను గాంచు దయాకర రాజశేఖరా.

77


చ.

కనికచిరత్నరత్నమయఘంటలు మ్రోయ నుడావు బర్వుషో
కును మఱి బాజియున్ గదను గున్పును చాతరఖామొదల్ రహిం
చు నడకల న్నటించు గడుచోద్యపుఁబుంగవరాడ్తురంగ మొ
క్కి నగజఁ గూడి స్వారుల కొగిం జను శ్రీకర రాజశేఖరా.

78


చ.

అనయఁగ నొక్కబిల్వదళ మర్పణసేయు నితాంతభక్తి సు
స్థిరమతి యింద్రముఖ్యు లగుదేవతలందె చెలంగు సర్వదా
మురియుచుఁ దావకాంఘ్రులను బూజలొనర్చిన సేవకుల్ భవ
ద్గిరి నివసించు టబ్బురమె దివ్యధునీధర రాజశేఖరా.

79


చ.

కరములు నీపదార్చనముఁ గన్నులు తావకదివ్యమూర్తి సు
స్థిరమతి నీకథామృతము దేహము నీదగుసేవ జిహ్వ సా

దరముగ నీదుకీర్తనలు తద్దయు వీనులు నీచరిత్రలన్
నిరతము గోరు నిర్ఝరధునీధర శ్రీకర రాజశేఖరా.

80


ఉ.

చల్లనినీకృపారసము సారెకుఁ గూఱిమి మీఱ నాపయిన్
జల్లినఁ జాలు పూర్వభవసంచితకల్మషతాపసంచయం
బెల్ల నడంచెద న్ధృతి నహీనభవత్పదభక్తిబీజముల్
జల్లుచు నారు బెంచెదను సారదయాకర రాజశేఖరా.

81


చ.

పతితుఁడ నయ్యు నీపతితపావననామ నమశ్శివాయమం
త్రతరణిచేఁ దరింతునుగదా దురితామితవారిరాశి స
న్మతి నిహసౌఖ్య మొందుటకు నామది సందియ మొందనైతి నో
సతతదయానిధీ! సుకవిసన్నిధి శ్రీకర రాజశేఖరా.

82


ఉ.

శంకర సర్వసంపద లొసంగుము సంతస మొంది శాంకరీ
పంకజగంధి దా నిడు నపారకృపామతి నెల్లవిద్యలన్
గొంకక నట్టివేడుకను గోరిక లీరిక లెత్త మిమ్ము ని
శ్శంక భజించుచుందు నిఁక సాధుజనాదర రాజశేఖరా.

83


ఉ.

వేడుకనైన దాడిఁబడి వేదననైన ముముక్షుపాళితోఁ
గూడికనైన భక్తిఁ గొని కొల్చుచునైన తపస్సమాధులన్
వీడకనైన శంకరపవిత్రచరిత్ర యటంచుఁ బేర్కొనన్

దో డిఁక వారి కౌదువు కుతూహలమేదుర రాజశేఖరా.

84


చ.

ఇహపరసౌఖ్యదాయకుఁడ వీవె యటంచు సదా ముదంబునన్
రహిని భవత్పదాబ్జములు రంజన మీఱ భజించి సమ్మదా
వహమగు నీకథామృతము వారక గ్రోలి సుఖంచుచుంటి న
న్వహమును దత్సుఖంబు గొను వాంఛను శ్రీకరా రాజశేఖరా.

85


ఉ.

దీనత లేనిజీవనము దివ్యకళామయమైన నీపద
ధ్యానము పూర్వజన్మభవతారకతావకసత్కథాసుధా
పానము నిచ్చట న్దుది భవద్గతికి న్జనువేళ వేదనల్
గాని నిరామయత్వ మొసఁగన్వలె శంకర రాజశేఖరా.


ఉ.

భాసురతావకాంఘ్రివరపంజకపంజరమధ్యవర్తిగాఁ
జేసెద నిప్డె మామకవశీకృతమానసరాజకీరమున్
శ్వాసకఫాదిరోగములు వారక కుత్తుకనొత్తువేళ నా
యాసముచేత నీస్మరణ యా టెటు లీశ్వర! రాజశేఖరా.

87


చ.

సరసుఁ డెఱుంగు సత్కవనసారము సారెకు సార సోదరో
త్కరమకరంద మానుట కుదారమధువ్రత మొప్పుగాక ద
ర్దురము సమర్థమౌనె భవదూర! ధరాధరకన్యకావరా!
సరసత గాంచు గావ్యరససారసుధాదర రాజశేఖరా.

88

చ.

మదయుతుఁడ న్దురాగ్రహుఁడ మందుఁడ నైనను సర్వవైభవా
స్పదమగు నీపదద్వయము భావన సేయుచునున్నవాఁడ నో
సదయగుణాంబుధీ! దురితసంఘ మడంచి సమస్తసౌఖ్యసం
పదల నొసంగు మీవు పరిశుభ్రగుణాకర రాజశేఖరా.

89


ఉ.

గౌళ బిళాహరీ శహన కాఫి కమాచి ముఖారి నాట భూ
పాల మఠాణ బేగడయు భైరవితోడివరాళులన్ శ్రుతుల్
మేళన చేసి ఱా ల్గరఁగ మెండుగ నీపయి సత్కృతుల్ సదా
బాళిని రంగు రక్తిఁ దగ బాడుదు శ్రీకర రాజశేఖరా

90


చ.

సరసకలాకలాప విలసత్కవివర్ణ్యమహద్విలాస సుం
దరకరుణారసార్ద్రసముదారకటాక్ష భృదీక్షణాతి భా
సురముఖమందహాస పరిశోభితహర్మ్యవిరాజమానస
ద్వరగృహ వాకతిప్పపురవాస! మహేశ్వర రాజశేఖరా.

91


చ.

గురుతరభక్తి భక్తజనకోటి నితాంతము సేవ సల్పఁగాఁ
బరమకృపామతిన్ దగుశుభంబు లొసంగి యభీష్టసంపదల్
గురియుచు బార్వతీపతినిఁ గూడి సుఖించుచు వాకతిప్పమం
దిరమున నిల్చి పొల్చు నగధీర మహేశ్వర రాజశేఖరా.

92


చ.

ఘనుఁ డతినీచుఁ జేరి మెలఁగన్ ఘనమంత దొలంగు నీచుఁ డా
ఘనునెడ బాయకున్కి ననఘా ఘనమొందు నిజంబు నావచే

తను శిల లెన్నియో జలధి దాఁటును సూత్రము సూనరాజితోఁ
బనుపడి యుత్తమాంగమున భాసిలు శ్రీకర రాజశేఖరా.

93


ఉ.

త్రోవఁ దొలంగి దుర్గతులఁ దూగి వధూజనమోహమద్యమున్
ద్రావి ప్రమత్తుఁ డౌట వితతంబగు సంసరణాటవిన్ సదా
తా వసియించు మూఢుఁడు కదర్యజరామృగరాజుచేతఁ గో
ల్పోవు టెఱుంగలేడు నతభూరికృపాకర రాజశేఖరా.

94


చ.

శతధృతివాసవాదుల కసాధ్యము నీదుమహత్వ మెన్న దు
ర్మతులకు మా కశక్య మనుమాట లికేల భవన్నుతిన్ బవి
త్రత సరిగాఁ దలంచెద సుధారస మానుటచే సురల్ గుశ
ప్రతతిఁ బవిత్రమౌట గని భక్తజనాదర రాజశేఖరా.

95


చ.

జనకుఁడ వీవె శంకర నిజంబు ధరాధరరాజపుత్రి మ
జ్జనని పురాణదంపతులు సారకృపామతులైన మీరు పెం
చిన తనయుండనౌట నుతి చేసితి తప్పులు గాచి ప్రోచి భూ
జననుత భక్తిముక్తుల నొసంగుఁడు శ్రీకర రాజశేఖరా.

96


చ.

సురుచిరసత్యవోలుకులజుండను వేంకటరాయపుత్రుఁడన్
ధరణిని సుందరాహ్వయుఁడఁ దద్దయు మంత్రివరుండ శాంకరీ

వరపరిలబ్ధసారమృదువాక్కలితాతతగీతసాహితీ
పరిచయుఁడన్ భవచ్చరణభక్తుఁడ శ్రీకర రాజశేఖరా.

97


ఉ.

సమ్మతి మీఱ నీశతకసారము గోరి పఠించుచున్నవా
రిమ్మహి వస్తువాహనమణీభధరారమణీయభోగభా
గ్యమ్ముల నొంది పొందికల నారవితారకమున్ సుఖించి ని
క్కమ్ముగఁ బుత్రపౌత్రులను గాంత్రు మహేశ్వర రాజశేఖరా.

98


ఉ.

మంగళ మందు మానిజనమానితపాదసరోజ నీ కిదే
మంగళ మందుఁ గావ్యరసమార్దవగీతవిలోల నీ కిదే
మంగళ మందు చారుతరమంజులసత్యసుభాష నీ కిదే
మంగళ మందు సాధుజనమానససంచర రాజశేఖరా.

99


చ.

హర గిరిజామనోహర సురాద్రిశరాస మహేశ సాంబ శం
కర పరమేశ్వరా గరళకంధర భూతపతీ మహానటా
సురగిరిచాప భూతిధర శూలి గిరీశ భవా మహేశ్వరా
పురహర దేవదేవ పరిపూర్ణదయాకర రాజశేఖరా.

100


శ్రీ రాజశేఖరశతకము సంపూర్ణము.