పీఠిక
ఈశతకము రచించినది కొమఱ్ఱాజు వేంకటశివుఁడని గ్రంథాంతమునఁగలపద్యమువలనఁ దెలియుచున్నది. ఈ వేంకటశివునివ్యవహారనామము వెంకటప్పయ్య యనియు కృష్ణామండలములోని పెనుకంచిప్రోలువాస్తవ్యుఁ డనియు ఆంధ్రవాఙ్మయమునకు జీవకళల బ్రసాదించిన - కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావు, ఎం.ఏ, గారి కీకవి జనకుఁడనియుఁ దెలియుచున్నది.
వేంకటశివుఁ డాఱువేలనియోగి బ్రాహ్మణుఁడు. లింగధారిమతములోనివాఁడు. ఉద్భటారాధ్యవంశపరంపరలోని యారాధ్యు లీకవిగురుకుటుంబములోనివారు. ఈకవి మునగాలసంస్థానప్రభుత్వము గావించి యిప్పటి మునగాల ప్రభువులగు శ్రీనాయని వేంకటరంగారావు బహద్దరువారిని దత్తులుగా దీసికొనిన లచ్చమారావుగారివద్ద మంత్రిగా నుండి చిరకాలము రాజకీయవ్యవహారములలోఁ బాలుగొనెను. ఈకవి మఱి కొన్ని శతకములు జ్యోతిషగ్రంథములు రచించినటుల శతకకవులచరిత్రము పేర్కొనుచున్నది గాని
యాపుస్తకములనామములే తెలియవచ్చుట లేదు. అందులకుఁ బ్రయత్నించి కృషి చేయవలసియున్నది.
ఈశతకమునఁ బేర్కొనఁబడిన రాజలింగస్వామి రేపాలలోని యర్చాదైవతము. రేపొల మునగాల సంస్థానములో మునగాలకు ఐదుమైళ్లదూరములో నున్నది. విచారింప నాయూర రామలింగస్వామి దేవళము గలదని తెలిసినది. కవి వీరశైవుఁ డైనకతన రామశబ్దసహితముగ లింగశబ్దము నుచ్చఱింపనొల్లక రాజలింగమని పేర్కొనినటులఁ దోఁచుచున్నది. మతావేశపరవశు లిటులఁ జేయుటలో నించుకేనియు వింత లేదు.
ప్రకృతశతకము నూటయిరువదియేడు సీసపద్యములతో నిండియున్నది. శతకకవిత ధారాశోభితమై సులభసాధ్యమగు భాషలో మృదుమధురముగా నున్నది. అందందు వ్యాకరణదోషములుగూడఁ గలవు. వేంకటశివుఁడు మతావేశము గలవాడగుటచే నీశతకమున శివునికంటె దైవము లేడనియు నితరదైవతములు శివభక్తులనియు నీశ్వరశబ్దవాచ్యుడగు శివుఁడే నిఖిలదేవస్తుత్యుఁడనియు భస్మము రుద్రాక్షలు బ్రాహణుఁడు ధరించితీఱవలెననియుఁ గొన్నిపద్యములలో బోధించెను. మఱికొన్నిపద్యములలో స్కాందాదిపురాణములనుండి విషయసంగ్రహము గావించి శివపరేశ్వరత్వము పలుమాఱు స్థాపింప యత్నించెను. గంగ విష్ణుపదోద్భవియనునంశము, బ్రహ్మతల ఖండించుటచే శివునకు బ్రహ్మహత్య వచ్చినదను విషయము శివుఁడు మోహి నిని జూచి యపభ్రంశముగ వర్తించెననునంశము భస్మాసురకథ సహజమతాభిమానము నాధారపఱచికొని ఖండించినాఁడు. శివునకు నీశ్వరత్వ మారోపించుటయే కర్తవ్యముగాఁ బెట్టుకొని యీకవి పలుతావుల నితరదైవతదూషణము బ్రాహ్మశాఖలలోఁ జేరినయితరులనింద విరివిగాఁ గావించియున్నాఁడు.
పరమతనిందాగర్భితముగ శ్రీగిరిమల్లేశ, వీరభద్రశతకాదులు రచించిన కొమఱ్ఱాజు రామలింగకవి యీవేంకటశివునకుఁ బినతండ్రి యగుటచేఁ గాఁబోలు అన్యదైవదూషణమునఁ దండ్రి నటులుండుమనుచున్నాఁడు. మొత్తముమీఁద నీరాజలింగశతకమును వీరశైవమతసిద్ధాంతబోధకమని చెప్పవచ్చును. ఇందు బసవేశ్వర, సోమనాథ, మల్లికార్జునాది వీరశైవులు నెలకొల్పిన సంప్రదాయములు లక్ష్యమునందుంచి వ్రాయఁబడినపద్యములు పెక్కులు గలవు. శైవమతప్రతికూలురగు కొందఱు పురాణములలో శివునకుఁ గలయీశ్వరత్వము లోపింపఁజేయుటకుఁ గొన్నికల్పితకథలుఁ జేర్చిరనియు భాగవతమునఁ బోతరాజు సైతము విష్ణుమతాభిమానవశమునఁ గొన్ని శివప్రాముఖ్యముఁ దెలుపుకథలు లోపించెనని యీ క్రిందిపద్యములోఁ దనయభిప్రాయము దెలిపియున్నాఁడు.
సీ.
భాగవతంబునఁ బాక్షికుఁ డై కవి
వాస్తవంబులు కొన్ని వదలినాఁడు
.............................................
దక్షాధ్వరమునకు దనుజారి వచ్చిన
లేదని చెప్పెను
.............................................
శ్రుతియుఁ బలుకుట పోతన చూడఁడేమొ.
122
ఇటులె మతావేశములగు నంశములకు నితరమతనిందలకుఁ దార్కాణలు కాంచనగును. కేవలమతధర్మములు దెలుపుశతకకదంబములో నీశతక మొకటియైయున్నది. చిరకాలముక్రింద నీశతకము తప్పులతడికగా ముద్రింపఁబడి యుంటచేఁ గవిభావానుసారముగఁ గొంచెము సవరించి శుద్ధప్రతి సిద్ధపఱచి యీశతకము ప్రచురించితిమి.
ఈశతకకర్త రమారమి 40 సంవత్సరములక్రిందట లింగైక్యము నొందెను. శైవమతోద్బోధకమగు అన్వాదకోలాహల మంతప్రౌఢముగా నీశతకము లేకున్నను ఇందలిపద్యములు సుబోధకములై మతావేశమున కనుగుణముగ నుద్రేకకరములుగా నున్నవి.
ఈకవి యితరగ్రంథములకొఱ కాంధ్రులు యత్నించిన విరశైవమతగ్రంథమండలికిఁ దోడ్పడినటు లగును.
కొమఱ్ఱాజు వేంకటశివకవిప్రణీత
రేపాలరాజలింగశతకము
సీ.
శ్రీగిరీశ్వర నీదుసేవ ముక్తికిఁ ద్రోవ
నీనామ మఘవార్ధి నిల్పునావ
సిరు లిచ్చు చెలిపొందుఁ జేసెఁగా నీబావ
త్రిపురవాసులఁ ద్రుంచు తెలివె ఠేవ
మునిపుత్త్రుమొఱ విని చనితివౌ దయఁ గావ
మామను దలగొట్టు మాటె లావ
చలిమలసుత నేలఁగలవాఁడవే నీవ
వేల్పులు జాలిరే విషము ద్రావ
గీ.
సకలసురలందు బ్రాహ్మణజాతి వీవ
చావుపుట్టుక లేనట్టిసామి గావ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజితశుభాంగ రేపాలరాజలింగ.
1
సీ.
నీవు బట్టినవిల్లు నేటైనబల్ గట్టు
పసమీఱు మీనారి బుసలగొట్టు
నీజటాజూటంబు నిల్వ గంగకుఁ బట్టు
నఱమేను పార్వతికైన దెట్టు
నీరథచక్రముల్ నిలువకరుగు రట్టు
నీముఖంబున కగ్ని నీటిబొట్టు
నీగళచ్ఛాయకు నీగును చలినట్టు
విను వీనివాసంబు వెండిచట్టు
గీ.
మట్టుమీఱిన నీ చర్య లెట్టు కట్టు
పఱచి వాక్రువ్వగను బల్లపడు టదెట్టు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
2
సీ.
చలిమలసుత నీకు వలసిన పెన్ రాణి
ముసలి యెద్దే మీకు మిసిమి ఘోణి
ఆకాశమే మీకుహాశ్చర్యమగువేణి
చాలదు మీకథల్ జదువ వాణి
అంబరంబయ్యె మీ కథలదిశాశ్రేణి
పరమేశ మీకయ్యె శరధితూణి
భక్తసంరక్షణాస్పదమగు మీపాణి
తలఁప మీపిన్నాలు బలుపఠాణె
గీ.
లీల గణియింప వేదము లేనిరాణి
మీకరంబుననున్న దే మేలియైణి
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
3
సీ.
నొసలికన్గాకకు బుసబుసమనునిల్లు
కన్వేడినార్పుపై గంగబల్లు
సగము జేసెఁగదయ్య సత్తి నిన్ బల్ పెల్లు
తల కెక్కె మరుగాలు తగనిగొల్లు
వంచితే వంగక దెంచినఁ దెగువిల్లు
గండిగా వలపటిబండికల్లు
పెద్దకొమరున కెట్లు పెండ్లి గానిదిగుల్లు
దండిపాములపొత్తు గుండెఝల్లు
గీ.
ఇట్టిగృహభార మహహ మీకెట్టు జెల్లు
చున్నదో కద జేరు మాయున్నయిల్లు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
4
సీ.
కల్పవృక్షము గొప్పకలముగాఁదగె నోయి
యంబుధిజలము లేనయ్య [ 1] శాయి
భూమిఖండములె సంపుటముగాఁ బడె హాయి
వనజసంభవురాణి వ్రాయుఠాయి
మీచరిత్రంబులు మించినవామ్నాయి
సంపూర్తి లిఖియింపఁ జాలదోయి
ఇతరులు లేఖన కెత్తుదురే చేయి
శక్త్యనుగుణనుతుల్ జేయమాయి
గీ.
ఇవియు ఘనముగ శుభముల నిమ్ముభాయి
బ్రోవవలె గాక దయబేర్మి భావయాయి
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
5
సీ.
బసవపురాణంబు బండితచారిత్ర
యనుభవసారంబు నఖిలశ్రుతుల
సహితచతుర్వేదసారంబు సోమేశ
భాష్యసద్గ్రంథముల్ సవ్యరీతి
రచనాధికారి యై రయ మొప్ప పరవాద
భీకరుండనఁగను బృథివిలోన
రుద్రుఁడయ్యు బ్రతాపరుద్రునిసభ విష్ణు
వాదుల నోడించి వారికెల్ల
గీ.
శివదీక్షలొసంగిన శంకరుండు
పాల్కురికిసోమునకు నేను బ్రణుతిఁ జేతు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
6
సీ.
బసవా ద్యసంఖాత్యభక్తులఁ గొనియాడి
విఘ్నేశ్వరునిఁ జాల వినుతిఁ జేసి
వరదధీచ్యాదులఁ గర మొగి గణుతించి
నూతనశివభక్తనుతి యొనర్చి
నీమీఁదభ క్తిని నేనేర్చినట్టులఁ
జెప్పఁబూనితినయ్య సీసపద్య
ములు గాన నిర్విఘ్నముగ జేయఁగా మీరె
కర్తలు తప్పులు గలిగియున్నఁ
గీ.
బరసవేది యయస్స్థితిభర్మమైన
పగిది మత్కావ్య మిల శ్రేష్ఠమగునుగాక
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
7
సీ.
శంకర పరమేశ శాశ్వత సర్వేశ
కాలకాలాంతక గరళకంఠ
చంద్ర శేఖర భీమశాంకరీహృదయేశ
శర్వ మహాదేవ శరనిభాంగ
ఫాలనేత్ర గిరీశ పంచాక్షరీరూప
భవహర పురహర భక్తవరద
గంగాధర సురేశ కంజాక్షసన్నుత
భుజగ భూషణ దీనపోష సోమ
గీ.
యనుచుఁ బఠియించువారికి ఘనతమీఱ
మోక్షసత్రంబు లేసిన దీక్ష నీదె
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
8
సీ.
వేల్పులందఱిలోన విప్రుండ వీవని
సకలవేదంబులు జాటుచుండు
కమలాక్షసుతు నీదుకంటను సమయింప
బ్రతికింపఁగలిగెనే బాలు నతఁడు
కమలాసనునితల ఖండించితివిగదా
మొలపించుకొనుశక్తి గలదె తనకు
గరళము భక్షించుతరి పంచియిమ్మని
సరివేల్పు లీకొనఁజాలి రెవరు
గీ.
పశుపతివి నీవు సురలంత పశువు లగుట
కివియె సాక్ష్యంబులగునయ్య భువనములకు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
9
సీ.
సర్వేశ త్రిపురముల్ సాధించుపనికైన
సాధనంబులు వ్యర్థసాధనములు
ఫాలానలకరాళలీలలచే రిపుల్
మ్రగ్గికూలిరి ధర బొగ్గులగుచు
రథము గుఱ్ఱంబు రథసారథియు ముల్కి
నుండియైనది కార్య మొండు లేదు
అధికారము లొసంగుకథఁజూడ వారల
మన్నించువిధముగా నెన్నఁదగును
గీ.
దేవదేవ మహాదేవ దివిజరాజ
నామకుఁడ వీవెఁ యితరుల నేమి చెప్ప
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
10
సీ.
విధి కపాలంబును వింతగాఁ బేరులై
చాల మీయురమున వ్రేలుచుంట
మీనకూర్మవరాహమానవహరివామ
నం జన నైదుజన్మంబులందు
శౌరిని శిక్షించి శరణన్న రక్షించి
కొమ్ముకర్పరయును గొమరుదౌంష్ట్ర
మును చర్మకోలెమ్ము దృష్టమౌ గుర్తులు
గాగ మారుధరింపఁ గలిగియుంటఁ
గీ.
జావు పుట్టుక లేనట్టి స్వామి వగుట
కివియె సాక్ష్యంబులై లేవె భువనములకు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
11
సీ.
గ్రామాధికారిని గని యాశ్రయించిన
దేశవివాదలు దీర్పఁగలఁడె
దేశాధికారిని దిన మాశ్రయించిన
లోకవాదము దీర్చు జోకఁగలఁదె
లోకాధికారిని నీకు మ్రొక్కెదనన్న
సర్వేశుపగి దీయఁజాలఁగలఁడె
తమతమయధికారతారతమ్యంబులఁ
గొలఁదిగా ఫలమీయఁగలరుగాక
గీ.
పశుపతిత్వముగల మీకుబలెను పశువు
లైనసుర లోపఁగలరె నెద్దానికైన
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
12
సీ.
బాదరాయణి తాను వారణాసీస్థుల
శపియింపఁదలఁచిన చంద్రమౌళి
కోపించి పొమ్మన్నఁ గ్రోధియై ప్రతికాశి
కట్టినఁ జెడియె నా కాలమందె
పద్మపురాణంబు బల్కినాఁ డొకకొంత
వ్యాస కాశీఫలవ్యాప్తి నొందె
నని స్కాందమునఁ గన్న దదియుఁ గాదని రేని
వైష్ణవులైనను వ్యాసకాశి
గీ.
లోనఁ జావంగఁగోరరు మానుషంబె
హరియట వ్యాసుఁడనఁగను హర్షపడరొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
13
సీ.
హరవృషమధ్యంబునందుండి వ్యాసులు
భుజము లెత్తి ప్రమాణపూర్వకముగ
నారాయణునకన్న వేఱెదైవము లేఁడు
ముమ్మాటికినియను మూర్ఖమతిని
నెత్తిన బాహువు లెత్తినట్లుగ వాక్కు
స్తంభనంబైనచో ధైర్య మెడలి
ప్రార్థింప హరివచ్చి పరమేశ్వరుఁడు తన
కర్తగాఁ జెప్పినకారణమున
గీ.
విశ్వనాథుని గొనియాడి విగతభయదుఁ
డయ్యె ననిజెప్పె స్కాందంబు నమితముగను
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
14
సీ.
దారుకావనఋషుల్ దైవంబు లేఁ డని
గర్వించినను వారి గర్వమణఁప
హరిభార్యగా మీరు నామునిపల్లెకు
వచ్చి నిర్వస్త్రులై వారిమనము
లుభయలు దొంగిల నోర్వక ఘర్షించి
వ్యర్థ ప్రయత్నులై వారు బ్రహ్మ
కడ కేగి చెప్పినఁ జెడితిరి వారలు
హరిహరులనవిని యంతవచ్చి
గీ.
శౌరిపీఠంబు లింగంబు మీరుగాఁగఁ
దలఁచి లింగార్చనలు జేసి ధన్యులైరి
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
15
సీ.
పద్మనాభుండును బద్మజుండునుగూడ
ఘర్షించుకొన వారికలఁతఁ దీర్ప
దేజోమయం బైన దివ్యరూపంబునఁ
దోఁచితి రది చూచి తోయజాక్షుఁ
డరిగె పదము గన శిరము జూడఁగ బ్రహ్మ
నడచెను గనలేక వెడలివచ్చి
నిజకరియై విష్ణు నిన్ను మెప్పించెను
నిజములాడక విధినిందితుండు
గీ.
నయ్యె భువిఁ బూజ లేకుండ నయ్యె మొగలి
రేకు మీపూజ కర్హంబు గాకపోయె
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
16
సీ.
గతజన్మమున మిమ్ము మతిఁదలంపమి తప్పు
తప్పనియీజన్మ తనకుఁ జెప్పు
నిప్పుడు మిముఁ గొల్వ నెఱిఁగితి నిదిముప్పు
ముందుజన్మంబున మొదలెముప్పు
పుట్టుట లేకున్నఁ బూజలే దదితప్పు
తప్పులుమూఁడు నాతలన నొప్పు
తప్పులొప్పులుగాఁగ దయ సేయుటే మెప్పు
భక్తసంరక్షణాస్పదుఁడ వెప్పు
గీ.
డఖలలోకేశ సర్వేశ యఘవినాశ
నీట నెత్తుము పాల నే నేటనొత్తు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
17
సీ.
లూత యేవేదంబు లూతగాఁ జదివెను
శాస్త్రముల్ భుజగ మేచాయ జూచె
గజరాజు యేవిద్య గష్టత నేర్చెను
ఎఱుక తా నేమంత్ర మెంత జేసె
కాటకోటం డెట్టికవితఁ జెప్పఁగఁజాలె
గొడగూచి యేనీతిఁ బొడమి పెరిగె
నిమ్మవ్వ యేపాటిసొమ్ము నీ కిడెనయ్య
సాంఖ్యతొండఁడు యోగసరణిఁ గనెనె
గీ.
కావు ముఖ్యంబు లివి భక్తకారణముగఁ
దలఁప మీకృప మోక్షంబు గలిగె గాని
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
18
సీ.
ఘనమృకండజుపైనిఁ గల్గినప్రేమయు
గన్నప్పయందలి గౌరవంబు
బసవేశ్వరునియందుఁ బ్రకటమౌ మీదయ
చెన్నబస్వనిమీఁదఁ బన్ను కరుణ
పాల్కురిసోమేశుపైఁ బడ్డదృష్టియుఁ
జేరమరాయుపైఁ జెలగుగృపయు
మలహణకవిపయి మన్న నగరికాల
చోళరాయనిపైని దాళు జాలి
గీ.
గూడ నామీఁద నుంచు మేజాడనైన
నేఁడు మీపాదములు విడనాడఁజాల
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
19
సీ.
ఫక్కియందును రెండు చక్కనిబొల్లివి
శూలచక్రము లొక్కజాలుగలవి
గొల్లవ్రేతల మౌనికుంజరసతులను
జెఱిపినా రిద్దఱు శిక్ష వొకటె
ఆలిపై యాండ్లను నార్జించుపనికిని
నుభయలచిత్తంబు లొక్కరీతె
సురల రక్షింపను నరభోజనులఁ జంపఁ
బూనినా రిరువురిపూన్కి సరియె
గీ.
చావు పుట్టుక గలిగినసామి శౌరి
చావు పుట్టుక లేనట్టిసామి వీవు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
20
సీ.
పంచాక్షరీమంత్రపఠనంబు పఠనంబు
పరమేశునందలి భక్తి భక్తి
శివుని పూజించెడి చేతులు చేతులు
కరకంఠునకు మ్రొక్కు శిరము శిరము
శ్రీగిరీశ్వరు జేర్చుచిత్తంబు చిత్తంబు
శ్రీగిరిజాధీశు సేవ సేవ
భవుభక్తవరులది భజనంబు భజనంబు
వామదేవు నుతించువాక్కు వాక్కు
గీ.
అనుచుఁ దెలియక కొందఱు నధము లితర
మార్గములఁ బోయి పుట్టుచు మడియుచుంద్రు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
21
సీ.
ఇక్షుఖండంబున కెన్ని వంకరలున్న
దానిమాధుర్యంబు దరుగనట్లు
గంగోదకంబులు గలుషంబులై యున్న
జలమహత్త్వం బేమి తలఁగనట్లు
గోవుపొదుగున నెన్ని గోమారులుండిన
క్షీరంబులకు రుచి చెడనియట్లు
బాలుని వవ్యక్తభాషలై యుండిన
జననీజనకుముద్దు స్రగ్గనట్లు
గీ.
మత్కవిత్వంబునను తగ్గుమాటలున్న
భక్తిరసమధురంబు లోపంబుగాదు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
22
సీ.
దీర్ఘాయువులు లేవు స్థిరమతులా లేవు
లేవు శాస్త్రజ్ఞానభాగవతులు
దుశ్చరిత్రలు పోవు దొంగనీతులు పోవు
పోదు కామక్రోధపుంజ మెపుడు
యాగంబులా లేవు త్యాగంబులా లేవు
లేదు సత్సంగతి లేశమైన
పాపంబులా లావు వాపోకలా లావు
లావుకు జనసేవ లక్షవిధుల
గీ.
కలియుగం బిది యీరీతి ఘటనపడియె
యోమహాదేవ యన బ్రోవవా మహేశ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
23
సీ.
అఱువదివేలేండ్లు నాయువు తండ్రికిఁ
బదియు నొక్కటివేలు బ్రతికిఁ బట్టి
ముగురుభార్యలతోడఁ దగ సుఖించెను దండ్రి
కొడుకు పత్నీకుఁడై కుతలమేలె
తండ్రి స్వర్గము కేగి దనుజుల మర్ధించె
భూమిలో దశముఖు బొడిచె గొడుకు
ఆదియుగములయందె యాయాయితరముల
తారతమ్యత యెంతొ తక్కువయ్యె
గీ.
నాయురర్థబలంబులు నంతకంత
కవనిఁ దగ్గుట కాశ్చర్య మరయ లేదు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
24
సీ.
వాలినిఁ జాటుగాఁ గూలనేసిన తాన
నెఱుకవ్రేటున శౌరి యెగురవలసె
బలి నంటఁగట్టినపాపంబునకు రాముఁ
డరిపాశబద్ధుఁడై యడలవలసె
కురురాజకొడుకులఁ గూల్చినయఘమున
హరి కులక్షయుఁ డౌట జరుగవలసె
మునిపత్ని హత్యకై మురవైరి జగతిలోఁ
బుట్టుచు బెరుగుచు గిట్టవలసె
గీ.
నంతవారికి గృతకర్మ మనుభవంబు
గలిగె నింకెవ్వరికి దప్పఁగలదు కర్మ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
25
సీ.
శ్రీకృష్ణుభార్య లంచితగుణ లెనమండ్రు
భర్తపోయినమీఁద బ్రతికి రకట?
గోవిందుపిమ్మట గోపికలందఱు
బోయలకవగూడఁ బోయి రకట?
శ్రీహరిచేఁ గర్మ చేయుప్రాప్తము లేక
వసుదేవుఁ డీల్గఁగావలసె నకట ?
పాండవుల్ శౌరికి బంధులు భక్తులై
కడ యమదుఃఖముల్ గాంచి రకట?
గీ.
అంతవారికి గృతకర్మ మనుభవంబు
గలిగె నింకెవ్వరికిఁ దప్పఁగలదు కర్మ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
26
సీ.
అవిముక్తమం దుండ నర్హుండు గాదని
శర్వుచే వ్యాసులు శప్తుఁడయ్యె
బృందను జెఱచినవృత్తికి రాములు
సీతావియోగతఁ జెందవలసె
ననుజను మోహించు నఘమున బుద్ధుండు
కాళ్లుజేతులు మొండిగాఁగవలసె
గౌతముభార్యను గామించి సురరాజు
తనువెల్ల యోనులై మనఁగవలసె
గీ.
నంతవారికిఁ గృతకర్మ మనుభవంబు
గలిగా నింకెవ్వరికి తప్పఁగలదు కర్మ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
27
సీ.
బ్రాహ్మణ్యముకుఁ దగు భస్మధారణయము
భస్తోపనిషదర్థఫణికి గనరొ
వ్యాసవాల్మీకులు వారిగ్రంథంబులు
భసితమాహాత్మ్యంబుఁ బలుకుటెఱుఁగ
రో యాగమంబులు వాయాడ భస్మము
గొనియాడుచుండుట మనసురాదొ
వేదముల్ స్మృతులును వేవిధంబుల భస్మ
ధారణ ముఖ్యమన్ దారి వినరొ
గీ.
జగతి విప్రులు గొందఱు నిగమ మెఱిఁగి
భస్మ ధరియింప రెట్టి దౌర్భాగ్యగుణమొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
28
సీ.
ముఖబాహుజులకును సుఖము త్రిపుండ్రంబు
వైశ్యుల కగుజుమీ వర్తులంబు
నర్ధచంద్రునిరీతి హర్షంబు నాలవ
జాతి యితరుల కెల్ల భాతి యూర్ధ్వ
పుండ్ర మంచని భస్మ బూయువిధంబులు
బహుగ్రంథములయందుఁ బలుకఁబడియె
నన్యజాతులకైన నాయూర్ధ్వపుండ్రంబు
భస్మచే ననిగదా పథము గలిగె
గీ.
జగతి విప్రులు గొందఱు నిగమ మెఱిఁగి
భస్మ ధరియింప రెట్టి దౌర్భాగ్యగుణమొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
29
సీ.
ఉపనీతుఁడగువేళ విపరీతమేదయా
భువి నాందిముఖ విప్రభోజనంబు
భస్మధారణ గోచి పంచశిఖల్ మౌంజి
దండంబు భిక్షయుఁ దనర భర్గ
మంత్రోపదేశంబు మఱి యగ్నిముఖముస
గద చేయునవి దీనిక్రమము చూడ
రుద్రచిహ్నలఁ జేసి రూఢిగా ద్విజుఁ డయ్యెఁ
గానిచో బ్రాహ్మడు గాఁ డతండు
గీ.
జగతి విప్రులు గొందఱు నిగమ మెఱిఁగి
భస్మ ధరియింప రెట్టి దౌర్భాగ్యగుణమొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
30
సీ.
ఉపనయనాగ్నియం దుండుభస్మముఁ దాల్ప
కుండిన సిద్ధి లేకుండు నగ్ని
వైశ్యదేవాగ్నిలోపల నుండుభస్మంబు
ధరియింపకుండినం జెడును కర్మ
ప్రేతకార్యములందుఁ బెట్టంగవలె భస్మ
బెట్టకుండిన బ్రేత తిట్టగలఁడు
క్రతుకర్త యగువాఁడు క్రమముగా భస్మంబు
దాల్పఁడేనియు సేయఁదగఁ డతండు
గీ.
జగతి విప్రులు గొందఱు నిగమ మెఱిఁగి
భస్మ ధరియింప రెట్టి దౌర్భాగ్యగుణమొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
31
సీ.
వాల్మీకి కుంభజ వాసిష్ఠ గౌతమ
వ్యాస పరాశర వామదేవ
పర్వత దూర్వాస భరత మార్కండేయ
కణ్వ దధీచ్యాది ఘనమునులును
విధి విష్ణు రవి చంద్ర బుధ బృహస్పతి శచీ
పతి ముఖులగునట్టిపరమసురలు
బలి బాణ రావణ బహుళేంద్ర తారక
శూర పద్మాసుర సోమ హరులు
గీ.
భస్మ ధరియించి రని గ్రంథబహుళ మున్న
వినియు దెలియరు కొంద ఱీవెఱ్ఱి యేమొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
32
సీ.
భస్మనిషేవణ భస్మధూళనములు
భస్మధారణ మనఁ బరగు మూఁడు
విధులలో స్నానంబు వెనుక జన్మాఘముల్
మొదలంట జెడుటకు ముఖ్యమగును
తనుగుణంబులదోషతతి నణంగింపఁగాఁ
జాలు నుధ్ధూళనసంజ్ఞక్రియయు
వేధదుర్లేఖలు వెడలింప మోక్షంబు
లొసఁగ ధారణకును బొసఁగుశక్తి
గీ.
భస్మమును గూర్చి దగుగ్రంథబహుళ మున్న
వినియుఁ దెలియరు కొంద ఱీవెఱ్ఱి యేమొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
33
సీ.
భూతభేతాళముల్ పొరిబుచ్చఁగలశక్తి
బ్రహరాక్షసులను బట్టుఢాక
కామినీగ్రహములఁ గనిరన్నఁగలఠీవి
మోహినీగ్రహముల ముంచునూహ
వీరవైష్ణవు లెట్లు జేరరానిమహత్తు
జైనబౌద్ధుల ద్రుంపఁ జాలుగుణము
శాకినుల్ ఢాకినుల్ జడిసెడి రౌద్రంబు
శివభక్తులకు సిరుల్ సేయు గరిమ
గీ.
భస్మముకెకాక యొంటి కీపగిది గలదె
వినియు దెలియరు కొందఱీవెఱ్ఱి యేమొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
34
సీ.
తపసియై వనముకుఁ దర్లిపొయ్యేవేళ
దాశరథియు భస్మధారియయ్యె
మోక్షార్థియై శైవదీక్షఁ గొన్నప్పుడు
దాశరథియు భస్మధారియయ్యె
రామలింగము నిల్పఁ గామించినప్పుడు
దాశరథియు భస్మధారియయ్యె
అశ్వమేధముఁ జేయునవసరంబందున
దాశరథియు భస్మధారియయ్యె
గీ.
వ్యాసవాల్మీకకావ్యముల్ వసుధ లేవె
చూచియుఁ దెలియఁజాల రీచోద్య మేమొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
35
సీ.
భస్మంబు ధరియింపఁ బాపముల్ విడిపోవు
భస్మంబు సిరులీను పరసవేది
భస్మంబు రోగార్తిభంజనకరమగు
భస్మంబు వైరులపట్టుఁ జెఱచు
భస్మంబు త్రైలోక్యపద మబ్బఁగాఁజేయు
భస్మంబు సుగుణముల్ బాదుగొల్పు
భస్మంబు సుజ్ఞానపదముఁ జూపఁగఁజాలు
భస్మంబు మోక్షమన్ ఫల మొసంగు
గీ.
ననుచు మొఱలిడు వేదంబు లధికముగను
వినియుఁ దెలియరు కొంద ఱీవెఱ్ఱి యేమొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
36
సీ.
జలమిశ్రితసుభస్మ మిలను బూయఁగవలెఁ
గాలత్రయంబున ఘనగృహస్థు
తక్కినయాశ్రమతతిసతుల్ బొడి భస్మ
ధరియింపవలె శ్రుతిధర్మ మిదియ
శాస్త్రోక్తమగు విరజాభస్మముఖ్యంబు
హర్ష మౌ వైశ్యదేవాజ్ఞజంబు
గాకున్న శ్రోత్రియాగార యోగాగ్ని దౌ
భూతియు ధరియింప నీతియనుచు
గీ.
శ్రుతులు స్మృతులును జెప్పుటఁ జూచి యెఱిఁగి
భస్మధరియింపఁ నొల్ల రీపాప మేమొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
37
సీ.
భస్మధారణవిధి పరిమితిఁ జెప్పెదఁ
బంచశిఖల్ వక్త్రబాహుమూల
ములను భ్రూమధ్యమంబునఁ దగునాసికా
మూలంబు ద్విశ్రవోమూలములను
యురమున స్తనముల నుదరమందున నాభి
జాను పృష్ఠంబున జంఘలందు
రక్షకోబరికూబరక్షోణిగళముల
భుజయుగ్మమునఁ గరమూలములను
సీ.
బాహువులమధ్య నూరువు పాదములను
ముప్పదాఱగుస్థానముల్ ముఖ్యమగును
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
38
సీ.
నియతి రుద్రాక్షోపనిషదర్థములు విని
రుద్రస్వరూపిగా రూఢిగలిగి
యామ్నాయములయందు నాగమంబులయందు
రుద్రాక్షధారణ భద్రమనుచు
సకలవిధులఁ జెప్పె శార్వాణి మొదలైన
శక్తిసంఘము మౌనిసముదయంబు
దేవదానవకోటి భావశుద్ధిని దాల్చి
నారుగా రుద్రాక్షపేరు లభవ
గీ.
యెలమి రుద్రాక్షధారణ గలుగునరుని
భక్తిగను మ్రొక్కినను మోక్షపదవి గల్గు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
39
సీ.
పదునాల్గుముఖములు పదునాల్గుభేదముల్ :
పదినల్వు రధిపతుల్ పదియు నాల్గు
విని యోగపద్ధతుల్ తనువున ధరియించు
విధులు నెఱింగింతు విశదముగను
ముద మొప్పఁగా నేకముఖముఖ్యమైయుండు
నదరుగా దొరకును నచటనచట
నూర్ధ్వమధోముఖయుక్తిని గనవలె
నూర్ధ్వముఖంబైన నొప్పియుండు
గీ.
ధన్యమైయుండు రుద్రాక్షధారణంబు
నిగమమంత్రోక్తి బూజింపఁ దగినదగును
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
40
సీ.
సకలపాపంబులు సమయింపఁగాఁజాలు
ధరణిలో రుద్రాక్షధారణంబు
సతతంబు కాశివాసము జేయుఫలమిచ్చు
ధరణిలో రుద్రాక్షధారణంబు
నిరతంబు శ్రీశైలనిలయపుణ్యము కొద్ది
ధరణిలో రుద్రాక్షధారణంబు
పరగ శివజ్ఞానపరుని గావించును
ధరణిలో రుద్రాక్షధారణంబు
గీ.
రుద్రరూపంబుగా మది రూఢిగల్గి
తనువునందున రుద్రాక్షఁ దాల్పవలయు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
41
సీ.
శంకర మీయక్షిజాతంబు లగుటను
రుద్రాక్షనామంబు రూఢియయ్యె
సంసారదుఃఖముల్ సంహరింపంగను
రుద్రాక్షనామంబు రూఢియయ్యె
దుష్టుల దుఃఖించి తొలఁగునట్లుగఁ జేయ
రుద్రాక్షనామంబు రూఢియయ్యె
భవులకు మోక్షసంప్రాప్తి గూర్చుటఁ జేసి
రుద్రాక్షనామంబు రూఢియయ్యె
గీ.
జగతి రుద్రాక్షతో సరిజేయఁదగిన
పూసలే లేవు కల వన్న దోసమయ్య
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
42
సీ.
శంకర దేవేశ జ్వలన పద్మాసన
కాలాగ్ని రుద్రుండు కార్తికేయుఁ
డన వాసుకియు వినాయక భైరవుఁడు చౌరి
యీశాన భాస్కరుఁ డెలమి స్కంద
హరుఁడును పదినల్వు రధిపతుల్ రుద్రాక్ష
లకు నేకముఖి మొదల్ బ్రకటముగను
శ్రీగలరుద్రాక్ష లాగమంబులయందుఁ
గొనియాడఁదగియె నీకుతలమందు
గీ.
శాస్త్రసమ్మతి రుద్రాక్షసరులు దాల్ప
వలయుఁ మోక్షంబునే మది వలయువారు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
43
సీ.
శిఖను నొక్కటియును శిరమున ముప్పది
రెండు మూర్ధ్నిని మాల నిండుగాన
ముప్పదాఱును కర్ణముల నాఱు గంఠంబు
నందు ద్వాత్రింశతి నమర వక్ష
మున నైదుశతములు ఘనబాహువులకును
బదియాఱు బదియాఱు బదియు రెండు
బది రెండుగరముల బరగ నష్టోత్తర
శతమౌను జపమాల హితవుమీఱ
గీ.
రెండునూఱుల ముప్పదినుండు మెండు
వరకిరీటంబు నీరీతి వలయుఁ దాల్ప
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
44
సీ.
శిఖ నేకముఖియును శిరమున ద్వాదశ
ముఖియు నేకాదశముఖియు మూర్ధ్న
మునకు శ్రుతులపంచముఖి సప్తముఖి దశ
ముఖి' షష్ఠముఖి యష్టముఖియుఁ గంఠ
మునకు నురోదేశమునకుఁ జతుర్ముఖి
తగు బాహువులఁ ద్రయోదశముఖియును
ద్వాదశముఖి మణిబంధనంబుకుఁ జతు
ర్దశముఖి జపమాల తనువహించు
గీ.
నన్నిముఖముల రుద్రాక్షలగు కిరీట
మునకు నని తెల్పుకొనరయ్య ముదముమీఱ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
45
సీ.
కాయశోషణ జేసి కష్టమందుటకంటె
పంచాక్షరీమంత్రపఠన మేలు
శాశీగయాదులు గలయదిరుగుటకంటె
పంచాక్షరీమంత్రపఠన మేలు
పవనబంధనఁ జేసి బాధ లొందుటకంటె
పంచాక్షరీమంత్రపఠన మేలు
సాంఖ్యయోగాదులజాడఁ బోవుటకంటె
పంచాక్షరీమంత్రపఠన మేలు
గీ.
పాపము హరించు ఘనమోక్షపదవి నిచ్చు
పరమపంచాక్షరీమంత్రపఠన మిచ్చు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
46
సీ.
ధర యజుర్వేదమన్ తారహారములోన
పంచాక్షరం బనుపతక మలరు
ప్రథమథ్వితీయముల్ ప్రకృతియుఁ బిమ్మట
రెండును బురుషుఁడు సుండి కొదువ
సంయోగమగు శివశక్తియుక్తము మంత్ర
ములకెల్ల జననిగాఁ దలంచవలయు
గురుమూర్తిదయపేర్మిఁ గొని న్యాసధ్యానాది
కములతో జపియింపఁ గలదు ముక్తి
గీ.
గాన నీమంత్రరాజంబుఁ గాంక్ష సేయు
వారె మీ రౌదు రిక వేఱుగారు వారు
భాసభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
47
సీ.
పంచాక్షరీమంత్రపరసవేదియు నబ్బె
నిను వేఁడుకొననేల నీలకంఠ
ఘనత పంచాక్షరీకల్పకం బబ్బింది
నిను వేడుకొననేల నీలకంఠ
చిత్రపంచాక్షరీచింతామణియు గూడె
నిను వేఁడుకొననేల నీలకంఠ
భవ్యపంచాక్షరీపారిజాతం బబ్బె
నిను వేఁడుకొననేల నీలకంఠ
గీ.
నిన్ను నన్నుగఁ జేయఁగా నేర్చినట్టి
మంత్రరాజంబు దొరకింది మా కిఁకేమి
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
48
సీ.
మహితపంచాక్షరీమహిమయుఁ దెలుపంగ
వాణిపతికినైన వశముగాదు
మహితపంచాక్షరీమహిమయుఁ దెలుపంగఁ
బలుకుఁజేడియకైనఁ దెలియఁబడదు
మహితపంచాక్షరీమహిమయుఁ దెలుపంగఁ
జిలువఱేఁడైనను బలుకలేఁడు
మహితపంచాక్షరీమహిమయుఁ దెలుపంగ
జంభారికైనను శక్తి లేదు
గీ.
గాన పంచాక్షరీమంత్రఘనతఁ దెలుప
మంత్రరూపుండవగునీవు మాకుఁ గలవు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
49
సీ.
పంచాక్షరీమంత్రపఠనఁ జేసినయంత
బ్రహహత్యాదులు బాయఁగలవు
పంచాక్షరీమంత్రపఠనఁ జేసినయంత
నుపఫాతకము లవి యుండఁబోవు
పంచాక్షరీమంత్రపఠనఁ జేసినయంత
సంసారదుఃఖముల్ సడలఁగలవు
పంచాక్షరీమంత్రపఠనఁ జేసినయంత
మాతృగర్భావస్థ మఱిగిపోవు
గీ.
దల్లి దాతయు నేతయు దండ్రి యగుచు
భుక్తిముక్తులు దయసేయుమూల మిదియు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
50
సీ.
కుంభసంభవువల్లఁ గొనియు పంచాక్షరి
దశరథరాముండు తా జపించె
దూర్వాసుదయ నేర్చి తొల్లి పంచాక్షరి
శౌరియఁ రాముఁడు జపితలైరి
తండ్రియు దయచేయ తపసియై పరశురా
ముఁడును బంచాక్షరి నుడివెగాదె
వరదధీచ్యాదులు గరము పంచాక్షరీ
మంత్రంబు జపియించి మహిమ గనిరి
సీ.
మంత్రసంతతి కిది మూలమంత్రమయ్యె
నిహపరసుఖంబు లిచ్చుట కేమి కొదువ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
51
సీ.
పంచాక్షరీ యనుబలువైననావచే
దరిలేనిదుఃఖాబ్ధి దాఁటవచ్చు
పంచాక్షరీయను ప్రబలమౌస్రురియచే
ఘేయని భవలతల్ గోయవచ్చు
పంచాక్షరీ యనుభానుదీప్తులవల్ల
నిరయమస్తకమును నఱుకవచ్చు
పంచాక్షరీ యనుబహుళమౌనగ్న చే
ఘనజవనాటవిఁ గాల్పవచ్చు
గీ.
మోక్షలక్ష్మీప్రదాయకదీక్షితంబు
మహిని పంచాక్షరియె యన్యమంత్ర మేల
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
52
సీ.
ప్రణవయుక్తంబుగాఁ బంచాక్షరీమంత్ర
పఠనంబు దగునయ్య బ్రాహ్మణులకు
నితరవర్ణంబుల కెల్లసుందరులకుఁ
బ్రణవహీనంబుగాఁ బఠన మేలు
అష్టాదశావర్తి నక్షరలక్షగా
జపియింప సిద్ధినిఁ జెందవలయు
ప్రతిపునశ్చరణకు బ్రాహ్మణభోజనా
ద్యఖిలవిధులు జేయ సుఖము గలుగు
గీ.
మోక్ష మఱచేతిదై యుండు దీక్షలేక
చేసినను మేలె పాపముల్ జెడుట నిజము
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
53
సీ.
గతజన్మసుకృతసత్కారణంబునఁ జేసి
గురుఁడు పంచాక్షరిగరిమ నొసఁగు
గతజన్మసుకృతసత్కారణంబునఁ జేసి
పంచాక్షరీమంత్రపఠన గల్గు
గతజన్మసుకృతసత్కారణంబునఁ జేసి
పంచాక్షరిని సిద్ధిఁ బడయనగును
గతజన్మసుకృతసత్కారణంబునఁ జేసి
పంచాక్షరియె మోక్షపదముఁ జూపు
గీ.
దుష్కృతుల కిది గల్గుట దుర్ఘటంబు
సుకృతమతులకు దొరకుట సులభమగును
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
54
సీ.
పంచాక్షరీమంత్రఫలమెకా క్రీడికిఁ
బాశుపతాస్త్రంబు బడయనగుట
పంచాక్షరీమంత్రఫలమెకా చక్రికి
ద్రోణియస్త్రజ్వాలఁ దప్పనిడుట
పంచాక్షరీమంత్రఫలమెగా రాముండు
దశముఖుఁ దెగటార్చుదశను గనుట
పంచాక్షరీమంత్రఫలమె మార్కండేయుఁ
డవని దీర్ఘాయుష్య మమరనుంట
గీ.
భారతము శివగీతలు భాగవతము
స్కాందమాదిగ గ్రంథముల్ సాక్షిగలవు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
55
సీ.
శైవపంచాక్షరీజపముకు ముఖ్యండు
విమలమంత్రోద్ధారవిధియు వినుఁడు
మొదల నకారంబు ముందు మకారంబు
పిదప శికారంబు గదపిపరత
వాకారదు యకారవైఖరి లిఖయింప
పంచాక్షరంబులై ప్రబలుచుండు
బ్రణవంబుతోఁగూడి భవ్యషడక్షరి
యగునని షణ్ముఖుం డధికప్రేమ
గీ.
మున్నుఁ జెప్పెను గొందఱు మూర్ఖులగుచు
విప్రు లుపదేశమంద రీవింత యేమొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
56
సీ.
గ్రహణజనములు భక్తితోడను లింగ
మును మేనదాల్చుట ముఖ్యమనుచు
వేదాగమంబులు నాదారకను బల్కు
చున్నవి భక్తిచే విన్నఁజాలు
విష్ణ్వాదిసురలును వేత్తలౌ మునులును
మణిదారుమృచ్ఛిలామయములైన
లింగముల్ ధరియించి రంగుగాఁ బూజలు
చేయుట వ్యాసులు చెప్పినారు
గీ.
ధరను గొందఱు దనులింగధారణంబు
గాకపోవుట వారిదుష్కర్మగాక
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
57
సీ.
ధర యిష్టలింగంబుఁ దగు స్థూలమునకును
సూక్ష్మమునకు నౌను శుభము ప్రాణ
లింగంబు మూఁడవయంగమౌ గారణ
మున భావలింగంబు ముదము మీఱ
ధరియింపవలెనని మొఱయును శ్రుతులన్ని
తెలిసిదెలియనివారిఁ దెలుపుటరిది
యాణువాదిమలత్రిహరణంబు గావించి
మాంసపిండంబును మంత్రపిండ
గీ.
ముగను జేసియు గురుమూర్తి నిగమసూక్తి
శిష్యునకు లింగధారణఁ జేసి బ్రోచు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
58
సీ.
లింగధారినిఁ గని లొంగి మ్రొక్కినఁ జాలు
పాపాటవులు గాలిభస్మమగును
లింగధారినిఁ గని లొంగి మ్రొక్కినఁ జాలు
దుఃఖాంబుదములన్ని తూలిపోవు
లింగధారినిఁ గని లొంగి మ్రొక్కనఁ జాలుఁ
జన్మబీజము మొదల్ సమసిపోవు
లింగధారినిఁ గని లొంగి మ్రొక్కినఁ జాలు
బుణ్యపయోనిధుల్ పొంగుచుండు
గీ.
ననినచో లింగధారణ ఘనసభక్తి
యైనవారలు మీరుగా నగుట యరుదె
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రజిత...
59
సీ.
అంగమందున లింగ మమరియుండినవాఁడు
శ్వపచాధముండైన శంకరుండె
అంగమందున లింగ మమరియుండినవాఁడు
శాంతవిప్రుండైన శ్వపదసముఁడె
అంగమందున లింగ మమరుచున్నట్టివాఁ
డనువర్తనుండైన యమునిపరుఁడె
అంగమందున లింగ మమరియుండనివాఁడు
వరసోమయాజైనఁ బరమఖలుఁడె
గీ.
ననెడియర్థంబు స్కాందంబునందు గలదు
వినరు చదువరు కొంద ఱీవింత యేమొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
60
సీ.
తనువులు మూఁటను దగినవస్త్రంబుల
మూఁడులింగంబుల ముడిచికట్టి
ఇష్టంబు బ్రాణమం దింపుగా లగియించి
భారమందునఁ జేర్చి పరిణమించి
తనయందు లింగంబు దాను లింగమునందుఁ
జొచ్చి లోవెలుపల నిచ్చ మఱచి
లింగంబు తానయై లింగవర్తనుఁడైన
లింగైక్యసమరసలీనుఁ డగును
గీ.
నట్టిపురుషుని సాంగత్య మతనిసేవ
గలుగు మీకృప గలిగినఘనులకెల్ల
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
61
సీ.
అద్వైతసిద్ధైననాతని ఘటవర్త
నములు ద్వైతంబులై యమరుచుండు
గాని స్థూలాంగంబు గలయంతమట్టుకు
స్థూలలింగం బందుఁ దొలఁగకుండ
ధరియించి పూజింప ధర్మమైయుండును
స్థూలంబు లింగియై శుద్ధిఁ గనదు
కొదువరెంటను నీశుఁ గూర్చితిమని చెప్పి
బొదలాదిదేవుని బుట్టలందు
గీ.
దాచి పూజింపఁదగదు నద్వైతు లిట్లు
సేయ దేవార్చనలు సిద్ధిఁ జెంద వెపుడు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
62
సీ.
ద్వైతుఁడై యుండె నద్వైతుఁడై యుండెను
దనువర్తనలకును దలఁగనపుడు
తనదైవమెప్పుడు దన కవినాభావ
సంబంధిగా నుంచఁజాలవలయు
నట్లు సేయక సంచులందు బెట్టెలయందు
నుంచి పిల్లలపూజ కుంచి వచ్చి
నామని జెప్పను నగుబాటుగా కిది
శ్రేష్ఠవర్తనమని చెప్పఁదగదు
గీ.
దేవుఁ డెవఁ డైనసరె స్థూలదేహమందుఁ
జేర్చి విడనీక గొల్పుట శ్రేష్ఠమగును
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
63
సీ.
శివుని ప్రసాదంబు శ్రేష్టంబుఁ గాదని
భుజియింపఁ గొందఱు బుచ్చికొనరు
హరుఁడు మా నైవేద్య మర్హంబు గాదని
బలికినాఁ డనిగూడ దలఁతు రవని
జ్ఞానహీనం బిది సత్యవాక్యముగాదు
శివునినైవేద్యంబు శిరముమొదలు
బాదయుగ్మముదాఁక భక్తితోఁ బూసియు
భుజియించెఁ గృష్ణుండు పూర్వమందు
గీ.
ననుచు శ్రీభాగవతమున వినఁగఁ జెప్పె
నింద్య మనువారలే బుద్ధిమాంద్యు లకట
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
64
సీ.
పిత్రార్పితాన్నంబుఁ బ్రియ మొప్ప భోక్తలు
బ్రాణాహుతులు చేయఁ బనికివచ్చు
ధర పితామహుకూడు ధన్యులౌ భోక్తలు
బ్రాణాహుతులు జేయఁ బనికివచ్చు
ప్రపితామహాన్నంబు భవ్యులౌ భోక్తలు
బ్రాణాహుతులు జేయఁ బనికివచ్చు
విష్ణ్వర్పితాన్నంబు వేత్తలౌ భోక్తలు
బ్రాణాహుతులు జేయఁ బనికివచ్చు
సీ.
గాని శర్వుప్రసాదంబుగాదు గొనఁగ
ననెడి దుష్టులమాటలు వినఁగఁదగదు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
65
సీ.
శ్రాద్ధకాలంబున శ్రద్ధతోఁ బెట్టెడు
పిండత్రయంబుచేఁ బ్రేత లంత
సుగతిగందు రటన్న సూత్రంబు లున్నవి
మధ్యపిండము రుద్రమయముదయ్యె
నాపిండ మాకర్త కర్ధాంగి యగుసతి
సేవింపవలె నని చెప్పె శ్రుతియుఁ
దత్ప్రసాదము గొన్న తరుణియు సంతాన
వంతురాలగు నని వార్తగలదు
గీ.
శివుప్రసాదంబు గొనఁగ నిషిద్ధ మెట్లు
భక్తిహీనులవాదముల్ పాటిగావు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
66
సీ.
పంచభూతంబులు బరమేశ్వరప్రసాద
మైయుండె వ్యతిరిక్త మైన దెద్ది
అష్టమూర్తులు భవునంగసంభవులైరి
హరుప్రసాదులెగాక యన్యు లెవరు
చరచరాస్పదమైనజగములో శ్రీకంఠు
వరప్రసాదముగానివస్తు వెద్ది
విష్ణువిధాతాదివేల్పులు శివభక్త
పరులుగాకు న్నట్టివార లెవరు
గీ.
భవుప్రసాదమహత్వంబు భాగవతము
శైవస్కాందాదిగ్రంథముల్ చాటుచుండు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
67
సీ.
హరునకు శివభక్తు లర్పిందుభూములు
ఛత్రచామరములు సకలవాహ
నంబులు హారముల్ నానావిధంబుల
వస్తువుల్ నైవేద్యవాసన లవి
యివి యనర్హంబులౌ నెవ్వరు గొనరాదు
గొనినచో నరకాబ్ధిఁ గూలఁగలరు
శివభక్తులైయుండి శివునిఁ బూజించుచు
శివుప్రసాదము దీనఁ జెల్లకున్నె
గీ.
పత్త్రపుష్పఫలంబులు పక్వములును
హరునివేదనభుక్తి కనర్హ మగునె
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
68
సీ.
ఏమంత్రన్యాసాదు లామంత్రమునకును
దగవని చెప్పినఁ దథ్యమగునె
యజ్ఞపురోడాశమాయాజులకుఁగూడఁ
దగదని చెప్పినఁ దథ్యమగునె
పితృశేషమును గర్త ప్రీతి భుజింపంగఁ
దగదని చెప్పినఁ దథ్యమగునె
శివుని బ్రసాదంబు శివభక్తులకుఁగూడఁ
దగదని చెప్పినఁ దథ్యమగునె
గీ.
యొప్పవచ్చునె యీమాట దప్పుగాక
భస్మరుద్రాక్షధారులౌ పారు లధమ
గతికిఁ బోఁగోరి నిందించుకథకుఁ జొరిరి
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
69
సీ.
బిల్వవృక్షముఁ జూచి ప్రీతితో మ్రొక్కిన
నరునకు దోషముల్ నశ్యమగును
బిల్వవృక్షంబును బ్రేమతోఁ బూజించు
మనుజుండు సురలకు మాన్యుఁడగును
బిల్వవృక్షము వేసి పెంచినపుణ్యుండు
హరగణంబులయందు నధికుఁడగును
బిల్వబిల్వమటందుఁ బ్రేమచే స్మరియించు
వారిపాతకములు వారితములు
గీ.
నని పురాణంబులందున్నఁ గనరు వినరు
కొందఱజ్ఞులు నిది యెట్టిచంద మొక్కొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
70
సీ.
కాశికాపురమందుఁ గాలభైరవుకన్న
మకరమందుఁ బ్రయాగమాధవులను
గాంచిన మాంగల్యగౌరిదర్శనమైన
సేతువు కేగిన శేషగిరియుఁ
బొడగన్నఁ గేదారమున గంగ ద్రావినఁ
గోటయజ్ఞము లొకమాటు సేయఁ
గలిగిన నొకలక్షకన్యల దానంబు
సేయనబ్బినఁ బుణ్యసిద్ధియంత
గీ.
నేకబిల్వార్చనంబున నిత్తుననుచుఁ
బాదరాయణి మొదలైనవార లనిరి
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
71
సీ.
బహుళాష్టమిని బిల్వపత్త్రంబుతో మిమ్ము
నర్చింపఁ బాతకహరణమగును
శివరాత్రిరోజున భవ నీస్మరణతోడ
బిల్వార్చనము సేత ప్రీతికరము
లక్షబిల్వార్చన దక్షులై చేసిన
వారన మీరన వేఱు లేదు
ప్రతిసోమవారంబు భక్తితో బిల్వంబు
చేఁ బూజసేయ విశేషమగును
గీ.
నేకబిల్వమహత్వ మమేకముగను
బాదరాయణి మొదలైనవార లనిరి
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
72
సీ.
బిల్వవృక్షముక్రిందఁ బ్రేమతో వైశాఖ
కార్తికంబుల భక్తిగలిగి యొక్క
విప్రున కెవ్వరు విందుఁ జేసిన కోటి
బ్రాహ్మణభోజనఫలము గల్గు
మారేడుతరుమూలమహిని లింగార్చన
నొకరోజు జేసిన సకలకాల
ములను లింగార్చన సలిపినవాఁడుగా
ఫలమబ్బు సందేహఫణితి వలదు
గీ.
సత్యమిది సత్యమిదియును సత్యమనుచు
బాదరాయణి మొదలైనవార లనిరి
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
73
సీ.
మారేడుదళములు నూరిలో లేకున్న
తత్కాష్టఫలములు దగునుబూజ
కవియు దొరకమియైన నావృక్షమూలమం
దమరిన మృత్తికనైనఁ గ్రమము
నది యసంభవమైన నన్యపత్రంబులు
మారేడుపత్రిగా మానసమున
భావించి పూజింపఁ బాపముల్ విడి పుణ్య
ఫలమిచ్చు సంశయఫణితివలదు
గీ.
సత్యమిది సత్యమిదియును సత్యమనుచు
బాదరాయణి మొదలైనవార లనిరి
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
74
సీ.
భృగుపత్ని నన్యాయముగఁ జంపినందున
శపియించె భృగుముని శౌరి నపుడు
నదికారణము గాఁగ నాహరి తా వచ్చి
పుడమిపై పదిమార్లు బుట్టవలసెఁ
బుట్టుట గిట్టుట పురహరు గొల్చుట
భాగవతము జెప్పఁబడినదయ్యె
మితిమించి పలుమాఱు కుతలమందునఁ జక్రి
జననమందికథల్ చాలఁగలవు
గీ.
ఆదివిష్ణువు శివభక్తుఁ డగుట నిజము
కొంద ఱేలకొ మిముఁ గొల్వకుందుఁ రకట
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
75
సీ.
జలచరంబులలోన శ్రావ్యముగాఁబోలు
మత్స్యమై జన్మించె మావరుండు
వేదంబులు హరించువిద్వేషుఁ బొరివుచ్చి
తెచ్చి శ్రుతులు వేధ కిచ్చినాఁడు
మత్స్యకేశ్వరుఁ డనుమారారి నతిభక్తి
భువిని ప్రతిష్ఠించి పూజ చేసె
మత్స్యపురాణంబు మన్నించి విని మత్స్య
లంకకుఁ జని చూడ శంకదక్కు
గీ.
ఆదివిష్ణువు శివభక్తుఁ డగుట నిజము
కొంద ఱేలకొ మిముఁ గొల్వకుందు రకట
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
76
సీ.
రెండవజన్మకు దండిది కాఁబోలు
తాఁబేలునయ్యె నాదైత్యవైరి
దైత్యులు సురలును దర్చునంభోరాశి
మునుఁగు తిప్పకు వీఁపు మోపినాఁడు
తూర్పుసంద్రముపొంత వోర్పుతోఁ గూర్మేశు
నిల్పి సద్భక్తుఁడై కొలిచినాఁడు
కూర్మపురాణంబుఁ గూర్మిచేఁ జదివినఁ
గూరేశుఁ జూచినఁ గునుకువిడును
గీ.
ఆదివిష్ణువు శివభక్తుఁ డగుట నిజము
కొంద ఱేలకొ మిముఁ గొల్వకుందు రకట
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
77
సీ.
అడవిమృగములలో వడిగలదని హరి
ఘనవరాహంబుగాఁ గలిగినాఁడు
ఇదియు మూఁడవజన్మ మిందు హిరణ్యాక్షుఁ
జంపి జగతి మేలు నింపినాఁడు
శ్రీవరాహేశ్వరు శ్రీగిరిపై నిల్పి
మించినభక్తి సేవించినాఁడు
ధర వరాహపురాణతాత్పర్యమును వరా
హేశుఁ జూచియునైన నెఱుఁగవచ్చు
గీ.
ఆదివిష్ణువు శివభక్తుఁ డగుట నిజము
కొంద ఱేలకొ మిముఁ గొల్వకుందు రకట
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
78
సీ.
ప్రహ్లాదుకొఱకు స్తంభంబున నరసింహ
రూపుగా జన్మించి శ్రీపతియును
ప్రహ్లాదుతండ్రిని బట్టి గోళ్లను జీరి
పరలోకగతునిగాఁ బంపినాఁడు
శేషాచలంబున శ్రీనృసింహేశుని
స్థాపించి పూజలు సలిపినాఁడు
బాదరాయణి పల్కు భవ్యస్కాందము నృసిం
హేశ్వరంబును జూడ నిపుడు గలవు
గీ.
ఆదివిష్ణువు శివభక్తుఁ డగుట నిజము
కొంద ఱేలకొ మిముఁ గొల్వకుందు రకట
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
79
సీ.
లచ్చిపెనిమిటి గొప్పబిచ్చ మెత్తుటకునై
అదితికి సుతుఁడుగా నవతరించి
బలిని యాచించియు బలిని బంధించియు
బలిరాజ్య మింద్రునిపరము జేసి
వామనేశ్వరు హిమవంతంబుపై నిల్పి
యర్చించె భక్తితో నహరహంబు
వామనేశ్వరుఁడును వ్యాసగ్రంథంబులు
నేఁడును సాక్ష్యమై నిలచియుండె
సీ.
ఆదివిష్ణువు శివభక్తుఁ డగుట నిజము
కొంద ఱేలకొ మిముఁ గొల్వకుందు రకట
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
80
సీ.
నూనసాయకుతండ్రి శుభముహూర్తంబునఁ
బరశురాముం డన ప్రభవ మంది
తరిమి రాజుల నెల్ల తరతరంబులవారి
నిరువదియొక్కమా రేరి చంపఁ
బరశురామేశ్వరం బనఁ బెక్కుచోటుల
శివుని బ్రతిష్ఠించి చేసెఁ బూజ
నతఁడు గొల్చిన పురహరునివాసంబులు
జగములోఁ గనుఁగొనఁ జాలఁగలవు
గీ.
ఆదివిష్ణువు శివభక్తుఁ డగుట నిజము
కొంద ఱేలకొ మిముఁ గొల్వకుందు రకట
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
81
సీ.
దశరథరాజుకు తనయుఁడై శ్రీవిష్ణు
రామనామంబున రహిఁ జెలంగె
వానరసేనతో వారధి బంధించి
దశకంఠకంఠబృందములుఁ ద్రెంచె
శివదీక్షితుండునై శివగీతలు గ్రహించి
పరశివజ్ఞానియై ప్రబలె నిలను
సేతువుదగ్గఱ శ్రీరామలింగేశు
నిలిపి యంతశ్శుద్ధి గొలిచినాఁడు
గీ.
ఆదివిష్ణువు శివభక్తుఁ డగుట నిజము
కొంద ఱేలకొ మిముఁ గొల్వకుందు రకట
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
82
సీ.
కమలాక్షునంశనే గలిగెను యదువంశ
వార్ధచంద్రుఁడు హలపాణి యనఁగ
దుష్టదానవులను డులిచివేసి యనేక
శిష్టసంరక్షణఁ జేసినాఁడు
విద్యార్థియై పోయి విశ్వేశు పురిలోన
సాందీపుకడఁ దానుఁ జదివినాఁడు
తనపేర లింగంబుఁ దగ వారణాసిలో
స్థాపించి పూజలు సల్పినాఁడు
గీ.
ఆదివిష్ణువు శివభక్తుఁ డగుట నిజము
కొంద ఱధములు మిముఁ గొల్వకుందు రకట
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
83
సీ.
వసుదేవసుతుఁడునై వాసుదేవుండన
జన్మించే శ్రీవిష్ణు జగతిలోన
శివునిబ్రసాదంబు స్థిరమతి భోగించి
దూర్వాసుకృపఁ గాంచె తోయజాక్షుఁ
డతిప్రయాసము నోర్చి మతినిల్పి హరుఁ గూర్చి
తపమాచరించుట ధన్యుఁడయ్యె
చక్రంబు గలిగె నవక్రపరాక్రమ
శీలియై వైరులఁ దూలఁబుచ్చె
గీ.
ఆదివిష్ణువు శివభక్తుఁ డగుట నిజము
కొంద ఱధములు మిముఁ గొల్వకుందు రకట
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
84
సీ.
కృష్ణుండు కాశిలోఁ గృష్ణేశలింగంబు
నిలిపినాఁ డిప్పుడు గలదు చూడఁ
జంద్రజూటునికృప జాంబవతీదేవి
సాంబుని గనినది సకల మెఱుఁగుఁ
బార్థివలింగంబు బార్థకృష్ణులు బూజఁ
జేయుట వ్యాసులు చెప్పినాఁడు
నరునితోఁ గైలాసనగరంబునకుఁ గృష్ణుఁ
డేఁగి మీకును మ్రొక్కు టాగడంబె
గీ.
ఆదివిష్ణువు శివభక్తుఁ డగుట నిజము
కొంద ఱధములు మిముఁ గొల్వకుందు రకట
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
85
సీ.
పూర్వకాలంబునఁ బురుషోత్తముఁడు వచ్చి
పురహరుఁ గని మ్రొక్కి పరమతత్త్వ
విధిఁ దెల్పుమని కోర విశ్వేశ్వరుఁడు శైవ
దీక్షితుగాఁ జేసి తేజ మెసఁగఁ
బరమగుహ్యం జగుపరతత్త్వమును జెప్ప
నవియు నీశ్వరగీత లనఁగ వెలసెఁ
గూర్మపురాణంబుఁ గోరి చూచిన నందు
నమరు నీశ్వరుగీత లఘహరంబు
గీ.
ఆదివిష్ణువు శివభక్తుఁ డగుట నిజము
కొంద ఱధములు మిముఁ గొల్వకుందు రకట
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
86
సీ.
కరకంఠుఁ బూజింపఁ గమలసహస్రంబు
నిత్యంబు హరికిని నియతమందు
నొక్కనాఁ డొక్కటి లెక్కకుఁ దక్కిన
దననేత్రకమలంబు దానవారి
శివునకు నర్పించి శివుని మెప్పించియుఁ
గమలాక్షుఁ డనుపేరు గాంచినాఁడు
ధర మహిమ్నాదులు దత్కథ నేఁటికిఁ
దెలుపుచున్నవిగదా పలుకు లేల
గీ.
నాదివిష్ణువు శివభక్తుఁ డగుట నిజము
కొంద ఱేలకొ మిముఁ గొల్వకుందు రకట
భావభవభంగ గౌరిహత్పద్మభృంగ
రాజిత...
87
సీ.
శ్రీహరియంశను శ్రీపరాశరసూనుఁ
డుదయించి కాశిలో నుండుటయును
విశ్వేశుఁ బూజించి వేదవిభాగంబు
సేయుచో హరునుతి చేయుటయును
దన గ్రంథములయందు తక్కినసురలంత
శివభక్తులని యొప్పి చెప్పుటయును
గొప్పసాక్ష్యం బది కొదువ యేమున్నది
పలుమాఱు తర్కింపఁ బనియుఁ గలదె
గీ.
ఆదివిష్ణువు శివుభక్తుఁ డగుట నిజము
కొంద ఱధములు మిముఁ గొల్వకుందు రకట
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
88
సీ.
జైనవంశమునందు జన్మించి మాపతి
బుద్ధనాముఁ డనఁ బ్రసిద్ధుఁ డయ్యె
భువనేశ్వరంబున బుద్ధేశ్వరునిఁ గొల్చి
శివభక్తులకు నెల్ల శ్రేష్ఠుడయ్యె
బుద్ధేశ్వరప్రసాదభుక్తి లేక యతండు
నేఁడును భుజియింపఁబోఁడు సుండి
శ్రీజగన్నాథంబు సేవింపఁబోయిన
భువనేశ్వరముఁ జూడఁ బోకపోరు
గీ.
ఆదివిష్ణువు శివుభక్తుఁ డగుట నిజము
కొంద ఱధములు మిముఁ గొల్వకుందు రకట
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
89
సీ.
కల్కిజన్మము ముందుగాఁ గలదందురు
గతకల్యుగంబులఁ గల్కివేష
మమరె శ్రీశునకని యనియె గ్రంథంబులు
నాతండు శివభక్తుఁ డవును జగతి
గల్కేశ్వరంటులు గలవు పెన్నానది
తీరమందున మున్ను సారసాక్షుఁ
డారూపమునఁ గొల్చినట్టివె యైయుండు
లేకున్న నాపేరు రాకయుండు
గీ.
ఆదివిష్ణువు శివభక్తుఁ డగుట నిజము
కొంద ఱధములు మిముఁ గొల్వకుందు రకట
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
90
సీ.
దక్షజమూర్తికి ధర్మునకునుబుట్టి
నరుఁడు నారాయణనామములను
బదరీవనంబునఁ బశుపతికై ఘోర
తప మాచరించిరి దనుజవైరి
యంశలు వీరలు హరుకృపాకలితులై
ధర్మవిరోధులదండనంబు
సేయఁజాలిరి వీరిచరిత భారతమందు
భాగవతమునందుఁ బలికినారు
గీ.
ఆదివిష్ణువు శివభక్తుఁ డగుట నిజము
కొంద ఱధములు మిముఁ గొల్వకుందు రకట
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
91
సీ.
పాండురంగంబనఁ బ్రబల మైనస్థలంబు
పడమటిసీమలోపలను గలదు
విఠ్ఠలన్ బేరుతో విష్ణు వచ్చట నుండు
నాశ్రితరక్షణాయత్తుఁ డగుచు
శివదీక్షితుండైన శ్రేష్ఠత్వమునఁ జేసి
విఠలేశ్వరుఁ డయ్యె విస్ఫుటముగ
శిరమున లింగంబు ధరియించియున్నాఁడు
వలదన నెవ్వరివశముగాదు
గీ.
ఆదివిష్ణువు శివభక్తుఁ డగుట నిజము
కొంద ఱధములు మిముఁ గొల్వకుందు రకట
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
92
సీ.
బ్రహ్మప్రతిష్ఠలు బ్రహ్మేశ్వరంబులు
ఘనముగా భూమిపైఁ గలవు గలవు
ఇంద్రప్రతిష్ఠలు నింద్రేశ్వరంబులు
ఘనముగా భూమిపైఁ గలవు గలవు
వరుణప్రతిష్ఠలు వరుణేశ్వరంబులు
ఘనముగా భూమిపైఁ గలవు గలవు
సూర్యప్రతిష్ఠలు సూర్యేశ్వరంబులు
ఘనముగా భూమిపైఁ గలవు గలవు
గీ.
అట్టివారలు శివభక్తు లగుట నెఱిఁగి
కొంద ఱధములు మిముఁ గొల్వకుందు రకట
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
93
సీ.
తమపేరు శివునితో దంటించి లింగముల్
స్థాపించి రమరులు దనుజవరులు
భోగులు గరుఁడులు భూమీశ్వరులు మునుల్
యక్షగంధర్వులు యతులు శక్తి
సంఘంబు సిద్ధులు స్థావరంబులు భూమి
భేతాళనిచయ మీపృథివిలోన
నాయాస్థలంబుల నాయావిలింగముల్
గనుగొన్నఁ గన్నులకర్వుదీఱ
గీ.
వీరలందఱు శివభక్తిపారమతులు
శివునిఁ గొల్వక గొందఱు జెడు టదేమొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
94
సీ.
అదితినందనుఁ డైనయావామునునిపాద
కమలమందున గంగ గలిగె ననియు
విష్ణుపద్భవయన వెలసినయాగంగ
హరుఁడు జటాజూటమందు భక్తి
దాల్చినాఁ డనియేటిదబ్బఱమాటను
వినరాదు దోషంబు విస్తరించు
గంగపుట్టుక వేఱు గంగాధరుండౌట
కారణం బది వేఱుగలదు మొదలఁ
గీ.
బూర్వపక్షంబు జెప్పెదఁ బొందుగాను
వెనుక వినుపింతు సిద్ధాంతవివరమెల్ల
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
95
సీ.
మునిశాపవృతమైన మురవైరిజన్మముల్
బదివిధంబులు నందు బంచమంబు
వామనంబగు గంగ వామనునదమునం
బుట్టక పూర్వమే పుట్టె జలము
గత కాలమున గంగ గనుపడకుండిన
జగము వర్తన మెట్లు జరుగఁబడును
మత్స్యకూర్మంబులమాట నేమనవలె
నీరు లే కవి యెట్లు నిలువఁగలిగెఁ
గీ.
గాన జలములు బూర్వమే కలవటంచు
నొప్పుకొనవలె లే దింకఁ దప్పుకొనఁగ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
96
సీ.
బలి వామనునిపాదపద్మముల్ గడుగంగ
జలము లెక్కడనుండి సంభవించె
వటునిపాద బ్రహ్మ యెటులఁ బ్రక్షాళించెఁ
దనవద్ద నుదకంబుఁ దాచకున్న
వామనుండే ముందొ వార్ధిమథనమె ముందొ
కూర్మావతార మీగుఱుతుఁ దెల్పు
బలిని జన్మంబులోపలఁగదా యాచించె
జన్మ మెట్టుల సాగె జలము లేక
గీ.
కాన జలములు బూర్వమే కలవటంచు
నొప్పుకొనవలె లేదింకఁ దప్పుకొనఁగ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
97
సీ.
బలికొఱకై పుట్టుపని తనపనిగాని
కలదె గంగోద్భవకారణంబు
బలియింటికినిబోవునని తనపనిగాని
కలదె గంగోద్భవకారణంబు
బలిని భిక్షించెడిపని తనపనిగాని
కలదె గంగోద్భవకారణంబు
బలిని నిగ్రహపెట్టుపని తనపనిగాని
కలదె గంగోద్భవకారణంబు
గీ.
కారణము లేనిచో గంగ కలుగు టెట్టు
లూరు లేకున్న బొలిమేర యుండు టెట్లు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
98
సీ.
హరిపాదమున గంగ యది పుట్టుకుండిన
హరిపదపూత యైనట్టిగంగ
పదాళి దాల్చినవాఁడు శూలియటంచన
నొప్పరా దది గొప్పతప్పుమాట
మ న్నొకయడుగున మి న్నొకయడుగునఁ
గొలిచిన జలవాసములను విడచి
కొలిచెనే గతమందు జలము లెన్నఁడు పాద
ప్రక్షాళనము జేయఁబడఁగలేదె
గీ.
విష్ణు తనపాదమునకని వేరె గంగ
దాటికొనినాఁడొ యిదియేనొ తనకుఁగూడ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
99
సీ.
ఘనత్రివిక్రము మింటికాల్ గడుగకమున్ను
మిన్నేరు లేదొకో మించిపూత
యై లేదొ లేకున్న నాలోకులకు నెట్లు
జరిగెనో పూతయౌ బలము లేల
వారలు ద్రావిరి వామనుపదముకుఁ
బ్రక్షాళనము కెట్లు పనికివచ్చె
హరి వామనుండైన నాకాల మెన్నఁడు
బంచభూతంబులప్రభవ మెపుడు
గీ.
నాలుగవతత్త్వ మిది వటుకాలు సోకి
పావనంబయ్యె నను టిది బాడిగాదు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
100
సీ.
ఆది కనాదియౌ నాకాలమునఁగదా
గంగ నౌదలఁ దాల్చెఁ గాలకంఠుఁ
డదితిగర్భంబున హరి బుట్టి యింద్రుని
తమ్ముఁడైనదినంబు దలఁచి చూడ
ధర భగీరథరాజు తనవారికొఱకునై
భాగీరథిని దెచ్చుపర్వమెన్న
గాలభేదంబులు గనుపించె భాగీర
థీజన్మకాలంబె దేవదేవు
గీ.
నకును గంగాధరత్వంబు ప్రకటమనుట
నేర కనుమాటలేగాని నిజముగావు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
101
సీ.
ఆకాశవీథికి హరిపాదమునకును
విష్ణుపాదంబని వెలయు పేరు
శారికిఁ గప్పకుఁ జెలఁగి సింహంబుకు
హరి యనుబే రొక్కటగును జగతి
హరి కప్పఁగాఁ బోవ డాకాశవీథియు
హరిపాదమని చెప్ప నలవిగాదు
ఆకాశముననుండి నవనికి దిగుగంగ
కును విష్ణుపద్భవ యనఁగఁ జెల్లు
గాక హరికిని గంగ కలుగలే దెన్నఁడు
గలిగిన దనుమాట కల్లకల్ల
గీ.
బ్రహ్మ నడిగిన నీ రిలఁబడియె నదియె
విష్ణుపది యనునదియునై వెలసెనేమొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
102
సీ.
భాగీరథిని జూచి భక్తితో నర్చింప
శుద్ధుఁడౌ ననుట ప్రసిద్ధిగలదు
భాగీరథికిఁ బోయి భక్తి స్నానముఁ జేయ
శుద్ధుఁడౌ ననుట ప్రసిద్ధిగలదు
భాగీరథీజలపానంబుఁ జేసిన
శుద్ధుఁడౌ ననుట ప్రసిద్ధిగలదు
భాగీరథినిఁ గని ప్రస్తుతి జేసిన
శుద్ధుఁడౌ ననుట ప్రసిద్ధిగలదు
గీ.
పరమభాగీరథికి హరిపాదమునను
సిద్ధి గలదను శాస్త్రప్రసిద్ధి లేదు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
103
సీ.
భాగీరథిని జొచ్చి ప్రాణంబు విడిచిన
శుద్ధుడౌ ననుట ప్రసిద్ధి గలదు
భాగీరథిని శల్యపాతంబుఁ గల్పిన
శుద్ధుఁడౌ ననుట ప్రసిద్ధిగలదు
భాగీరథినిఁ బిండపతనంబు గల్గిన
శుద్ధుఁడౌ ననుట ప్రసిద్ధిగలదు
భాగీరథినిఁ దిలల్ బట్టి తర్పణ మేర్చ
శుద్ధుఁడౌ ననుట ప్రసిద్ధిగలదు
గీ.
పరగ భాగీరథికి హరిపాదమునను
సిద్ధి గలదను శాస్త్రప్రసిద్ధి లేదు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
104
సీ.
సరయువులోఁ బడి చనియెఁగా రాముండు
తనపాదపూతయై తగియెనేమొ
వార్ధిలో హరిబడి వరదను వచ్చుట
తనపాదపూతయై తగియెనేమొ
పరశురామునితండ్రి పరభువక్రియలకుఁ
దనపాదపూతయై తగియెనేమొ
దివ్యతిరుపతులందు దేవార్చనములకుఁ
దనపాదపూతయై తగియెనేమొ
గీ.
గంగచే హరి పూతుఁడౌ కతలు గలవు
గంగ శౌరిపదంబునఁ గలుగు టెట్లు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
105
సీ.
ఆదికాలంబున నంబిక హరినేత్ర
కమలముల్ మూసిన కామవైరి
ఫాలనేత్రము విప్ప ప్రళయాగ్ని జగములఁ
బర్విన హిమసుత భయమునంది
కనులమూతయు మాని కరములు దివియఁగా
నానందజలములు నంగుళములఁ
బదియుజారెను నవి పరగ నాపస్తత్వ
సంబంధు లీరీతి సంభవించి
గీ.
గంగ జగములు ముంపఁగ నంగజారి
సురలు వేఁడిన నిజజటాజూటమందు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
106
సీ.
కమలాననుఁడు మది గర్వించి మించినఁ
దల ద్రుంచితివి యొక్కతలయుఁ బోయి
నాల్గుమోములతోడ నాఁటినుండియు స్రష్ట
మేరమీఱక తాను మెలఁగుచుండె
బ్రహ్మను దలఁగొట్టె బ్రహ్మహత్యయు శివు
నంటినదని మూర్ఖు లందు రకట
బ్రహ్మచావని దెట్లు బ్రహ్మహత్య ఘటించు
జచ్చిన మఱిగదా వచ్చుహత్య
గీ.
యనుచుఁ దెలియంగఁజాల రాయంగ హీన
తయును మృతియౌనె పరికింపఁదగదె దీని
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
107
సీ.
గంగలోఁ బడి ద్విజుల్ గాలంబుఁ జేసిన
గంగకు హత్యయు గలుగదయ్యె
నగ్నిలో విప్రులు నాహుతి యైనను
నగ్నికి హత్యయు నంటదయ్యె
పడమటిగాడ్పుకు బ్రాహ్మణుల్ జచ్చిన
గాలికి హత్యయు గలుగదయ్యె
భూమిగ్రుంగిన గొప్పభూసురుల్ మడసిన
భూమికి హత్యయు బొందదయ్యె
గీ.
గాని వాణీశు నొకతల గత్తిరింప
నెట్లు దవిలెనొ హత్య యీనీతి యెట్లొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
108
సీ.
ధరదినప్రళయము జరిగినప్పుడు విప్ర
సంఘమరణము లెన్ని జరుగలేదు
బ్రహప్రళయమునందు బాడబుల్ బహుమంది
ప్రాణహింసను బొందఁబడఁగలేదొ
విష్ణులయంబున వేదవేత్తలు చాల
జీవముల్ విడుచుటఁ జెల్లలేదొ
ప్రళయకర్తృత్వము బరమేశునకుఁదక్క
నొరులకు లేదన్న యుక్తి వినరొ
గీ.
యెప్పుడును హత్య జెందక తప్పు సేయు
విధిని దండింప హత్యను విధులు గలవె
భావభవభంగ గౌరిహృత్పత్మభృంగ
రాజిత...
109
సీ.
కండకావరమున గర్వించి నిందించు
నట్టిదక్షుని తలఁ గొట్టినపుడు
నాజన్నమం దున్న హరితలఁ దెగఁగోసి
తీసి గుండంబులో వేసినపుడు
పూషుఁడన్ నూర్యుని బోనీక పడవేసి
పొడిబొడిగాఁ బండ్లు బొడిచినపుడు
పలుకుఁజేడియ నంటఁబట్టి చేకత్తితో
ఘోరంబుగా ముక్కుఁ గోసినపుడుఁ
గీ.
జెప్పలేరైరి హత్యగాఁ దప్పు సేయు
విధిని దండింప హత్యను విధులు గలవె
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
110
సీ.
దశకంఠుహత్యను దప్పింప రాముండు
నిలమీఁద రామేశుఁ నిలిపినట్లు
పరశురాముఁడు రాజవరులఁ జంపినహత్య
జీర్ణింప శివుని బూజించినట్లు
బ్రహ్మాదిసుర లంతపాపముల్ హరియింపఁ
గుతలమంద మహేశుఁ గొలిచినట్లు
బ్రహ్మహత్యయుఁ బాయఁ బరమేశ్వరుఁడు మున్ను
నేదేవు నర్చించి యీగెననినఁ
గీ.
జెప్పఁజాలరు నోరెత్తి తప్పువాదుఁ
జేయువారల యెన్నికఁ జేయ నేల
భావభవభంగ గౌరిహృత్పద్మభృంద
రాజిత...
111
సీ.
భస్మాసురుం డనుపాఠాంతరముగల
వృకుఁ డనురక్కసుఁ డొకఁడు మున్ను
మీ రిచ్చువరమున మీశిరంబునఁ దన
కరము బెట్టెదనన్న బఱుగుఁ జూపి
వైకుంఠమున కేగ వైకుంఠుఁ డాశత్రుఁ
బరిమార్చినను మీరు బ్రతికినార
లని భాగవతమున ఘనమని జెప్పెను
సత్య మిది యని నమ్మఁజాలినట్టి
గీ.
యితరసాక్ష్యంబులా లేవు నిందుకైనఁ
బూర్వపక్షంబు లిత్తు నపూర్వఫణితి
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
112
సీ.
మృత్యుంజయత్వంబు నిత్యత్వకాలాంత
కత్వంబు మీకును గలదటంచు
వేదాగమంబులు వినుపించుచున్నవి
యనృతంబు లనగను నలవిగాదు
పుట్టుక గలవారు గిట్టక దప్పదు
పుట్టుట లేనిచో గిట్టు టెట్టు
కోరిన నిచ్చిన మారక నిశ్చయు
లగువారి కుపయోగమగునుగాక
గీ.
వృకున కిచ్చినవరమున నకట మీకు
భయము గలదన తగుహేతుపథము లేదు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
113
సీ.
వరము వేఁడు వృకుండు వానిశిరంబును
వానికరస్పర్శవలన వ్రక్క
లగునట్లు కోరండు నడుగక యిచ్చుట
పొసఁగదు యీమాట పొంది లేదు
వానికరస్పర్శవలననె వానికి
మృతిగల్గె ననుమాట సతముగాదు
పొసగింపుకథ గాన పసలేనిరీతులు
గలుగ నుడివెనంచుఁ దలఁపవచ్చు
గీ.
వీరభద్రునికథవలె వేదమందు
వృకునిచరితంబు నిజమైన బ్రకటపడదె
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
114
సీ.
ధరలోన నేదేవుఁ దలఁచి జంపించిన
వచ్చి ప్రత్యక్షమై వాని మనిచి
యంతర్హితము గనుట సహజముకద
యంతర్హితుం డగునట్టిశక్తి
గలవాని కేటికి వలసెఁ బరాజితుం
డగుటకు వృకునకుఁ దగనొసంగు
వరముఁ బరీక్షింప వైకుంఠమునకును
వచ్చిన వైకుంఠవాసుఁ డడలి
గీ.
తలఁప దయఁజేసి వృకుఁ జంపఁగలుగుశక్తి
నతని కిచ్చితి రని చెప్పనగునుగాక
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
115
సీ.
శాత్రవకృతమైన శ్రమ లనుభవించుట
ప్రబలవైరుల గని పారిచనుట
శంకరుగృపచేత జయముల నొందుట
గర్వించి శిక్షల గనుట మనుట
భాగవతమున హరిపాటులు బలుమాఱు
గను జెప్పకయె మాన తనకు వల్ల
లేక బోవుట నుండి యాకవిహృదయంబు
క్షోభించి తన కిదే లాభమనుచుఁ
గీ.
బూని బదులుగ వృకుకథ లేనిదొకటి
జేర్చియుండిన నిజమని చెప్పరాదు
భావభవభంగ గౌరిహత్పద్మభృంగ
రాజిత...
116
సీ.
మింటిపురములమూటి మంటగలిపిన నీదు
కంటిసెగల్ వృకుఁ గాల్పఁదగవె
పలుమాఱు బ్రహాండవిలయాగ్నులౌ నీదు
కంటిసెగల్ వృకుఁ గాల్పఁదగవె
పుష్పబాణుని మేను బూదిఁ జేసిన నీదు
కంటిసెగల్ వృకుఁ గాల్పఁదగవె
వృకునకు వరమీయ వృకుఁడు నిన్ బాధింప
నొరులు నివారింప నుండిరంట
గీ.
నమ్మఁగారాదు నిజమైనకమ్మవిల్తు
దండ్రి మీకును భార్యయౌతఱిని గలుగు
ప్రేమచేఁ దక్కువకు నోర్చి కామి వగుచుఁ
గీర్తిపరుఁ జేయ నారీతిఁ గెరలితేమొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
117
సీ.
శూరపద్మునకంటె శూరుండుగాఁ జెప్పఁ
దగదు వృకాసురు జగతిలోన
సింహవక్త్రునకన్న శ్రేష్ఠుండుగాఁ జెప్పఁ
దగదు వృకాసురు జగతిలోనఁ
దారకాసురుకంటె దండివాఁడని చెప్పఁ
దగదు వృకాసురు జగతిలోన
వృకునకు వర మీయ వృకుఁడు నిన్ బాధింప
నొరులు నివారింపఁ జరిత యగుట
గీ.
నమ్మగా రాదు నిజమైనకమ్మవిల్తు
దండ్రి మీకును భార్యయౌతరిని గలుగు
ప్రేమచేఁ దక్కువకు నోర్చి కామి వగుచు
గీర్తిపరుఁ జేయ నారీతిఁ గెరలితేమొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
118
సీ.
అష్టమూర్తులు భవునంగసంభవమని
వేదముల్ బలుకుట వినియు వినియు
బద్మసంభవునకుఁ బరమేశ్వరుఁడె పుత్రుఁ
డని చెప్పెదరు కొంద ఱధమమతులు
విధిసూనుఁ డను పేరు విశ్వేశ్వరునకును
నమర నిఘంట్లలో నమరవలదె
నగచాపుని సహస్రనామంబులందైన
స్రష్టజుఁడనుపేరు జరుగకుండె
గీ.
శ్రుతుల నీవార్త వినరాదు సతముగాని
వాదములు సేయవలదన్న వారు వినరు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
119
సీ.
స్రష్టముఖంబున సాక్షాత్కరించిన
జనకత్వ మతని కేసరణి గలదు
స్తంభమందు నృసింహుసంభవం బయ్యెఁగా
స్తంభంబు హరికిని దండ్రి యగునె
స్తంభంబునకు శౌరి తనయుఁడం చన బల్క
వచ్చునె యీమాట మెచ్చఁదగునె
యిట్టిలక్ష్యంబులు గట్టిగాఁ బరికింప
కున్న లాభం బేమి యున్న దిందు
గీ.
ధాత యతిభ క్తి మిముఁ గూర్చి తపసియైన
నతనిముఖమందుఁ బ్రత్యక్ష మైతి రింతె
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
120
సీ.
వసుదేవనందను వాసుదేవుండని
పిలచినట్లుగ మిమ్ముఁ బిల్వకుండ్రె
యదితిసూనుని నింద్రు ననుజన్ముఁడా యని
పిలచినట్లుగ మిమ్ముఁ బిల్వకుండ్రె
పద్మమం దుదయింపఁ బద్మజుఁడా యని
పిలిచినట్లుగ మిమ్ముఁ బిల్వకుండ్రె
దశరథపుత్రుని దాశరథీ యని
పిలచినట్లుగ మిమ్ముఁబిల్వకుండ్రి
గీ.
ధాతకును మీరు పుట్టుట తథ్యమేని
నిజ మెఱుంగక యనుట దుర్నీతి గాక
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
121
సీ.
భాగవతంబునఁ బాక్షికుఁడై కవి
వాస్తవంబులు గొన్ని వదలినాఁడు
పెక్కులేటికి లెక్క బెట్ట వ్యర్థపుశ్రమ
నొక్కటి నుడివెదఁ జక్కి గనుఁడు
దక్షాధ్వరంబుకు దనుజారి వచ్చిన
లేదని జెప్పెను గాదు నిజము
వేదమం దీకథ విరళమైయున్నది
వేగియై వీరుండు విష్ణుశిరము
గీ.
వెఱచి యాహవనీయాగ్ని వేసె ననుచు
శ్రుతియు బలుకుటఁ బోతన చూడఁడేమొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
122
సీ.
పద్మాక్షుఁ డొకతరి పద్మాక్షియై సుధా
భాగనిర్ణయముకు భారపడియె
విష్ణుప్రకృతి భగవిధము రూపంబని
వేదాగమంబుల వినఁగవచ్చు
శివుఁడు పురుషుండని చెప్పెను శ్రుతులన్ని
ప్రకృతియుఁ బురుషులు భావశుద్ధి
గన నభేదులు భేదగతులునై తోతురు
మాన్యమోహినికిని మగఁడ వీవె
గీ.
కాన ని న్నభిలషించిన గలిగెఁ గొడుకు
కూఁతు రామోహినికి వారు గుఱుతు గారె
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
123
సీ,
మోహినీదేవికి మొదటిబిడ్డండయ్యె
భైరవుం డతఁ డీశ భవనములకుఁ
ముద్దుకూఁతురుగదా మోహినికిని శాస్త
కువలయేక్షణ లెల్లకోవెలలకు
నధికారులై యుంట యంద రెఱిఁగినపని
కాదన లేదన గలుగ నెవరు
ఆయన్నచెల్లెండ్రు హరిరాణి నే వావి
పిలువంగ వలయునో పలుక రెవరు
గీ.
విష్ణు శివునకు భార్యయై వెలసెననియు
ధర మహిమ్నంబు జెప్పుట నరులు వినరొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
124
సీ.
భృంగాశ్యుఁ డనెడువాఁ డంగనయై సంతుఁ
గనుట భారతమందు గలుగలేదొ
యిళుఁ డింతియై గురు నిందుపుత్త్రుని గూడి
సంతతి గను టది సతము గాదొ
వీర లిట్లగుటకుఁ గోరిరె యాదిమ
దంపతుల్ జేసినదారి గాదొ
తనప్రకృతై యున్నదనుజారి నారీతి
స్త్రీని జేయ సుఖంపఁ జేతగాదె
గీ.
మోహినియు శివునిమాయలో ముంపె ననుచు
విష్ణువాదులు జెప్పుట వెఱ్ఱిగాక
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
125
సీ.
శ్రీయుద్భటారాధ్యశేఖరుం డగువీర
భద్రాఖ్యగురుకరభవ్యశిరుడ
గురులింగజంగమచరణసేవానంద
శైవుఁడ సంప్రాప్తషట్స్థలుండ
దేశికానుగ్రహధన్యలింగాంగైక్య
సంధానసమరససంపదుఁడను
త్రివిధప్రసాదానుభవయోగసుఖకర
విమలహృత్కర్ణికావికసనుఁడను
గీ.
భువి కొమఱ్ఱాజు వేంకటశివుఁ డనంగ
వెలసి రచియించితిని బ్రోవవలయు దయను
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...
126
సీ.
మత్కావ్యకన్యను మనుమీయవలెనని
తలఁచితి మీకన్న ధన్యు లెవరు
సురలంత తక్కువతరము కులములయందు
భుజగభూషా నీవె భూసురుఁడవు
సిరికి నీకన్నను శ్రేష్ఠు లెవ్వరు వెండి
బంగారుకొండలపతివి గావె
శాశ్వతుల్ గారయ్య సకలవేల్పులు శ్రుతి
సిద్ధంబుగాను శాశ్వతుఁడ వీవె
గీ.
కనుక నిచ్చితి మత్కృతికన్య నిపుడు
గనియు సల్లాపసౌఖ్యంబు లనుభవింపు
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజితశుభాంగ రేపాలరాజలింగ.
127
రేపాలరాజలింగశతకము
సంపూర్ణము