పీఠిక
మారుతిశతకము భక్తిరసప్రధానమై ఆంజనేయుని బలపరాక్రమస్థైర్యాదికములను గొనియాడుచున్నది. అప్పకవీయమునం దుదాహరింపఁబడిన మరున్నందనశతకమునకు నీ మారుతిశతకమునకు సంబంధము లేదు. మరున్నందనశతకమునుండి తీసి యుదాహరింపఁబడిన యప్పకవీయములోని పద్య మిది-
శా. "కోపాటోపము కుప్పిగంతులు భవత్కుంఠీభవచ్ఛౌర్యరే
ఖాపాండిత్యమయారె నీకును నమస్కారంబు లంకాపురీ
పాపగ్రంథికులాంగనాకుచతటిపైఠాపతద్గ్రాహ్యబా
హాపాటచ్చరరామదాస తవదాసోహం మరున్నందనా."
ప్రకృతశతకము మారుతిని సంబోధించున దగుటచేతను ఉదాహృతశతకము మరున్నందనుని సంబోధించునదగుట చేతను రెండు నొకటే యను ప్రవాదము విశ్వాసపాత్రముగ లేదు.
ఈమారుతిశతకమును రచించినకవి కొటికలపూడి కోదండరామయ్య. ఇతఁడు జ్యోతిశ్శాస్త్రపారంగతుఁ డు. ఈశతకమునఁ గవి తనగోత్రము తండ్రిపేరు చెప్పుకొనకపోవుటవలనఁ గవినిగూర్చిన విశేషాంశములు గురుతింప వీలుకలుగుట లేదు. కొటికలపూడివారిలో నందవరీకులు వైదికులు గలరు. రెండుకుటుంబములయందును బూర్వకవులు కలరుగాని మారుతిశతకకర్త గోత్రము చెప్పుకొనకపోవుటచే నేశాఖీయుఁడో నిర్ణయింప వీలులేకపోయినది. ఈశతకము వ్రాసిన కోదండరామకవి ఉభయభాషలలో మంచిపండితుఁడును నిరర్గళకవితాధారగలవాఁడనియు శతకమును బఠించినవా రెఱుంగఁగలరు.
మారుతిశతకము మృదుమధురధారతో నుండుటచేఁ బఠనీయముగా నున్నది. ఆంజనేయుని దివ్యలీల లుత్ప్రేక్షించుచు రామాయణమునకు సంబంధించిన చర్యలను వర్ణించుచు వాలాద్యవయవములను గొండాడుచు నొక్కొక్కపద్య మొక్కొక్కనూతనభావముతో నలంకరించి కవి మనోహరముగా శతకము రచించియున్నాడు. క్రొత్తపోకడలతో నిండియున్న యీశతకము పఠనీయమైయున్నది.
కొటికలపూడి కోదండరామకవిప్రణీత
మారుతిశతకము
శా.
శ్రీమద్రామకథాసుధారసము లేసీమం బ్రవర్తించుఁ ద
ద్భూమిన్ హర్షపయఃపరీతనయనంబుల్ కంటకాంచత్తను
శ్రీమీఱన్ దృఢభక్తితోడ శిరమున్ జేదోయి జోడించి నా
నామౌనీంద్రులు మెచ్చ నిల్చి తగు నిన్ వర్ణించెదన్ మారుతీ!
1
శా.
కంజాప్తాన్వయదుగ్ధవారినిధి రాకాచంద్రు సద్వాక్యముల్
కంజాక్షీమణి యైనసీతకును దత్కాంతామతల్లీవచః
పుంజంబుల్ రఘుభర్తకున్ దెలుపుచున్ బుత్త్రాకృతిన్ వారి చెం
తం జెల్వారఁ జరించి మించిననినున్ ధ్యానించెదన్ మారుతీ!
2
శా.
సీతారాముల కగ్రనందనుఁడు కిష్కింధాపురస్వామికిన్
జేతశ్శుద్ధికరుండు లక్ష్మణునకున్ జీవానుసంధాత దు
ర్దైలేయాళికి దండపాణి యపవర్గశ్రీకి నాథుండ నా
భాతిన్ భాసిలుభవ్యభవ్యు నిను సంభావించెదన్ మారుతీ!
3
శా.
రామస్వామి నినున్ స్వకీయపరివారంబందు నగ్రేసరుం
గా మన్నిందుటఁగాదె ముందు భవదాఖ్యం బల్కి సీతాసతిన్
సౌమిత్రిన్ భరతాదులన్ బిదప నెన్నంజొత్తు రుర్వీజను
ల్నీమాహాత్మ్యముఁ దెల్పుపాటినరు లేరీ భూస్థలిన్ మారుతీ!
4
శా.
పారావారము గోష్పదంబు మశకప్రాయు ల్నిశాటుల్ హిమా
నీరూపంబులు వాలవహ్నిశిఖలు న్నిద్రాలి దివ్యాస్త్రముల్
పూరేకుల్ జయలక్ష్మి భార్య సమరంబుల్ కేళు లర్కాన్వయా
ధారున్ గొల్చుట కృత్య మై తగు నినున్ ధ్యానించెదన్ మారుతీ!
5
శా.
శైలోన్మూలనలోహపాశము రణోత్సాహిద్విషత్ప్రాణవా
తూలవ్యాళము భానునందనచమూదుర్గంబు ధూమ్రాక్షకం
ఠాలోలాయస చండవాగురుదశాస్యాంచత్పురీదాహకో
త్తాలాలాత మనంగ భాసిలు భవద్వాలం బహో మారుతీ!
6
శా.
భీమాకారభుజంగరాజవపురాభీలంబు దుర్దాంతసం
గ్రామక్ష్మార్జితశౌర్యమూలము హతాక్షప్రాణవాతూల ము
ద్దామశ్రీయుత పంక్తికంఠపురసద్మప్రేషితాగ్నిచ్ఛటా
దామోద్దీప్తదిగంతరాళము భవద్వాలం బహో మారుతీ!
7
మ.
సరసీజాప్తకులావతంసుని యశస్సమ్యక్సుధాపూర మం
బరభాగంబున దిక్తటంబులను శుంభద్వృత్తితోఁ బూయ ని
ర్భరసంఘంబులు గూర్చుకూర్చకరణిన్ రాజిల్లుయుష్మన్మహా
గరభృత్సన్నిభవాల మెంచి పొగడంగా శక్యమే మారుతీ!
8
మ.
జలజాతాప్తకుమారసైన్యపటలీజాతార్భటీకోటిచేఁ
జలితం బైన సతారకాగ్రహవిరాజద్వ్యోమభాగంబు భూ
స్థలిమీఁదం బడకుండ రాఘవుఁడు సంస్థాపించు మేలైనబం
గరుకంబం బన నీదువాల మమరున్ గాఢవ్రతీ మారుతీ!
9
శా.
గూఢపదోపమానశరకోటుల రావణముఖ్యదైత్యులన్
గాఢగతిన్ వధించి తగఁ గంజహితాన్వయుమ్రోల వాసరుల్
ప్రౌఢిమ నిల్వఁబో గెలుపురాటగతిన్ భవతీయవాల మా
రూఢవియత్పథం బగుచు రూఢి వెలుంగుఁగదయ్య మారుతీ!
10
శా.
లంకావల్లభుతోడ రాముఁడు రణారంభంబుఁ గావించుచోఁ
బొంకంబొప్పఁగ నీవు వాహనమవై పొల్పారి తవ్వేళ ని
శ్శంకన్ నీదగువాల మభ్రపటలీచంచత్పటోపేతతా
ర్క్ష్యాాంకం బౌచు వెలింగె నిన్బొగడ శక్యం బేరికౌ మారుతీ!
11
శా.
శ్రీరామాంఘ్రిసరోజభక్తిభరితున్ సీతాంగనాస్తుత్యసం
చారున్ రావణసైన్యదావదహనున్ సౌవర్ణధాత్రీధరా
కారున్ భానుతనూజమంత్రివరు లంకాపట్టణధ్వంసకున్
వీరున్ నిన్ను భజింతు నన్ను దయతో వీక్షింపుమీ మారుతీ!
12
శా.
వ్యాళాధీశ్వర భోగసన్నిభ లసద్వాలాగ్రబద్ధాసురీ
చేలగ్రాసవివర్ధమాన ఘనరోచిష్కేశ నిర్దగ్థలం
కాలంకారుని జంబుమాలిముఖదైత్యగ్రావవజ్రాయుధున్
ఫాలాక్షస్తుతు నిన్నుఁ గొల్చెద ననున్ బాలింపుమా మారుతీ!
13
శా.
మైనాకాచలతుంగభంగచయ సమ్మర్దోత్థితాంభోనిధి
ధ్వానగ్రాసవివృద్ధకంఠనినదధ్వస్తాఖిలక్రవ్యభు
క్సేనాకర్ణుని హేమవర్లుని దమక్షేమక్షమాకీర్ణు సీ
తానాథాశ్రమపూర్ణు నిన్నుఁ గొలుతున్ ధన్యాకృతీ మారుతీ!
14
శా.
కటిసూత్రంబును జన్నిదంబు జడలున్ గౌశేయకౌపీనముల్
పటుశృంగారపలాశదండములు సారంగాజినంబుల్ శిఖో
ద్భటదర్భాంకురముష్టియున్ భసితలేపం బెంతయున్ భాసిలన్
వటురూపంబున రామునిన్ గనినని న్వర్ణించెదన్ మారుతీ!
15
మ.
అపశబ్దంబు నిరర్థకంబు విపులని బన్యాయమాక్రోశ మ
వ్యపదేశం బనిమిత్త మత్యధిరవం బస్పష్ట మప్రాప్తకా
ర్యపరం బైననికృష్టవాక్కు భవదాలాపంబునన్ లేమి ని
ష్కపటస్ఫూర్తి నుతించె నిన్ జనకజాకాంతుం డహోమారుతీ!
16
మ.
హితమున్ సత్యము సాధువాక్యవినుతం బిష్టంబు విస్పష్ట మం
చితకంఠస్వర మల్పవర్ణ మఖిలశ్రేయస్కరం బర్థవి
స్తృతమున్ బ్రస్తుతకార్యకారి యగుచున్ శోభిల్లు నీ వాక్యసం
తతికిన్ రాముఁడు సంతసించెను భళీ! ధర్మాకృతీ! మారుతీ!
17
మ.
తపనాకారఘనద్యుతీ! నగధృతీ! దైతేయకాలాకృతీ!
జపహోమాధికృతీ! బృహస్పతిమతీ! సంతుష్టసీతాసతీ!
కపిరాజాప్తనుతీ! మహాగుణతతీ! కాకుత్స్థసేవారతీ!
విపులానందయుతీ! ప్రభంజనగతీ! విశ్వోన్నతీ! మారుతీ!
18
మ.
అవితాశేషకపీంద్రసైన్యవితతీ! హర్యక్షుతుల్యాకృతీ!
దివిజవ్రాతకృతస్తుతీ! మహదనాదిబ్రహ్మచర్యవ్రతీ!
జవనిర్ధూతసదాగతీ! దివసకృత్సంప్రాప్తసర్వస్మృతీ!
స్తవనీయాహవహర్షితామరపతీ! క్షాంతిక్షితీ! మారుతీ!
19
ఉ.
సత్యము దానమున్ దపము శౌచము శాంతము రామభక్తి సాం
గత్యము బ్రహ్మచర్యము సుఖస్థితి మార్దవ మార్జవంబుఁ బాం
డిత్యము శ్రద్ధ నీతి దయ ధీరత ధర్మముఁ బుణ్యకర్మముల్
నిత్యము నీకడన్ నిలుచు నిన్ను నుతింపఁ దరంబె మారుతీ!
20
చ.
విరతి వివేకమున్ సమత వేదసమాదరణంబు యోగమున్
కరుణ దమంబు మైత్రి మురఘస్మరుపూజన మార్జవం బుపా
యరుచియకామమోరిమి మితాశన మాదిగ సత్త్వధర్మముల్
నిరతము నిన్నుఁ గొల్చుటను నీకు సమానులు లేరు మారుతీ!
21
మ.
విలసత్స్థైర్యము విక్రమక్రమము ప్రావీణ్యంబు గాంభీర్య ము
జ్జ్వలశౌర్యంబు జవంబు నీతిప్రతిభాసాంగత్యదాక్షిణ్యముల్
బలమున్ ధైర్యము సాహసంబు విజయోపాయంబు నీయందు ని
ర్మలవృత్తిన్ వసియించె నిన్నుఁ బొగడన్ మాశక్యమే మారుతీ!
22
మ.
పరుషత్వంబు మదంబు నాస్తికత దంభం బీర్ష్య మోహంబు మ
త్సర మన్యాయము కామలోభములు దౌర్జన్యంబు రోషంబు ద
ర్పరుజల్ భీతి దురాశ నిర్దయ వివాదం బార్తి జాడ్యంబు ము
ష్కరతన్ నీభటునైనఁ జెందవు నినున్ గాంక్షించునే మారుతీ!
23
చ.
విపులతపోధనుండవు పవిత్రచరిత్రుఁడ వాహవక్రియా
నిపుణుఁడ వబ్జనాభపదనీరజభక్తియుతుండ వాగమాం
తపటురహస్యవేదివి దృఢవ్రతశాలివి బ్రహ్మచర్యవి
ఘ్నపతివి మృత్యుశూన్యుఁడవు గర్వవిహీనుఁడ వీవు మారుతీ!
24
మ.
గణనాతీతము లైనసద్గుణతతుల్ కంజాతమిత్రాన్వయా
గ్రణియందుం బలె నీకడన్ గలుగుటన్ రామున్ బలెన్ ని న్విచ
క్షణు లర్చించి యనిష్టవర్జనము లిష్టప్రాప్తులం బొంది యు
ల్బణసౌఖ్యంబులఁ బండియుండెదరు భూభాగంబునన్ మారుతీ!
25
శా.
శ్రౌతస్మార్తపురాణ పాశుపతదీక్షాపాంచరాత్రాగమ
ద్వైతాద్వైతకథాశ్రుతిస్మృతులు వార్తాదండనీతిత్రయీ
జ్యోతిర్దర్శనసాంఖ్యయోగ[ 1] వచసోయుక్ న్యాయశాస్త్రాదులున్
సీతానాథుదయన్ భవద్రసన రంజిల్లుంగదా! మారుతీ!
26
శా.
క్రూరాకారచమూవృతప్రచురరక్షోరాజధానీమహా
వీరం బందు నిశాటశోణితఝరావిక్షీరముల్ వేల్చు దు
ర్వారాగ్నేయశిఖల్ సృజించి సమరారంభప్రవర్గ్యక్రియన్
శ్రీరామేశ్వరుఁ దృప్తుఁ జేసితివి కర్మిష్ఠాగ్రణీ! మారుతీ!
27
శా.
అక్షాద్యస్రభుగంగరక్తసమిధాజ్యాదుల్ ప్రతాపాగ్నిలోఁ
బ్రక్షేపం బొనరించి రావణపురప్రాగ్వంశశాలాదులన్
దక్షత్వంబునఁ గాల్చి వేల్పులఁ బ్రమోదస్వాంతులం జేసి వి
శ్వక్షేమం బొనరించు నీక్రతువు మెచ్చన్ శక్యమే మారుతీ!
28
చ.
గరుడునికంటె మారుతముకంటెఁ దటిల్లతకంటె నిర్జరే
శ్వరుభిదురంబుకంటె హరిచక్రముకంటె శరంబుకంటె భా
స్కరుహరికంటెఁ గృష్ణమృగికంటె విమానముకంటె జారసుం
దరిచలదృష్టికంటె బలితంబు భవజ్జవ మెన్న మారుతీ!
29
మ.
జలధిధ్వానము భేరికాధ్వనులు గర్జానాదముల్ ఝల్లరీ
విలసద్రాపము వజ్రపాతభవగంభీరస్వనంబుల్ జగ
త్ప్రళయారంభవిజృంభమాణపురజిద్భవ్యాట్టహాసార్భటుల్
బలిమిన్ నీవు రణంబులోఁ గొలుపుబొబ్బం బోలునే మారుతీ!
30
మ.
హిమవంతంబు మహేంద్రమున్ మలయమున్ హేమాద్రియుం జక్రవా
ళముఁ గైలాసము మందరంబును మొదల్ గాఁ గల్గు శైలేంద్రముల్
సమరాభీలవిజృంభమాణవిపులోత్సాహప్రవృద్ధత్రివి
క్రమదేవోపమతావకాంగముల నెంచంబోలునే మారుతీ!
31
మ.
భుజగాధీశ్వర భోగిభోగనిభముల్ భూభాగధౌరేయది
గ్గజతుండప్రతిమానముల్ దనుజదుద్వారబద్ధాదర
ప్రజవృత్తార్గళరూపముల్ దివిజసాలప్రాజ్యశాఖాభముల్
త్రిజగత్స్తుత్యము లైననీభుజము లర్థిన్ గొల్చెదన్ మారుతీ!
32
శా.
మేరూన్మూలనయోగ్యశక్తియుతముల్ మిత్రాత్మజస్తుత్యముల్
వైరాన్వీతనిశాటకోటిదళనావార్యంబు లార్తార్తిసం
హారోదారము లుజ్జ్వలత్కనకభూషాంతస్థరత్నప్రభా
పూరాపూర్ణము లైననీకరములన్ భూషించెదన్ మారుతీ!
33
మ.
ఘనకాఠిన్యసమేతముల్ జలజరాగచ్ఛాయముల్ సాయకా
సనచక్రాంబుజశంఖమత్స్యముఖభాస్వత్సౌమ్యరేఖావళుల్
వనజాప్తాన్వయపాదపద్మయుగసేవాజాతవైదగ్ధ్యముల్
జనసంస్తుత్యము లైననీదుకరముల్ వర్ణించెదన్ మారుతీ!
34
ఉ.
రావణువక్షముం బొడిచి రాక్షసులన్ వధియించుదార్ఢ్యమున్
శ్రీవరుఁ డైనరాముపదసేవ యొనర్చెడిమార్దవంబు భ
క్తావళిదైన్యదుఃఖముల నన్నిటిఁ బాపెడిభూరిశక్తియున్
తావకపాణిపద్మముల దట్టములై వసియించె మారుతీ!
35
మ.
చటులధ్వానము భీషణాననముఁ జంచద్భూరివాలంబు ని
స్ఫుటదంష్ట్రాంకురముల్ మహోగ్రనఖముల్ సూక్ష్మావలగ్నంబు ను
ద్భటశౌర్యంబు మనోజవం బతులసత్త్వం బొప్పుచున్నట్టి మ
ర్కటసింహు న్నిను విన్న భీతిలుఁ జూమీ! రక్షస్తతు ల్మారుతీ!
36
మ.
తనకున్ శక్రుఁ డుపాయనం బొసఁగు ముక్తాహార మారాముఁ డి
చ్చెను సీతాసతి కాసతీతిలక మిచ్చె న్నీకు నీ వప్పు డా
ఘనహారంబు ధరించి దేవతటినీకల్లోలసందీప్తకాం
చనశైలంబువలెన్ వెలింగితివి భాస్వద్భారతీ! మారుతీ!
37
మ.
మణిహారంబులు రత్నకుండలములున్ మాణిక్యకోటీరకం
కణముల్ కాంచనమేఖలల్ జలజరాగస్ఫారమంజీరముల్
ప్రణుతాశేషవిభూషణావళులు దీప్యచ్చేలముల్ రాఘవా
గ్రణిచేఁ గైకొని తాల్చుని న్గనుఁగొనన్ గాంక్షించెదన్ మారుతీ!
38
చ.
కనకముకంటే మానికముకంటె హుతాశనుకంటె బాలసూ
ర్యునిరుచికంటెఁ బల్లవసరోరుహహల్లకపంక్తికంటె భూ
తనయునికంటె సాంధ్యజలదంబులకంటెను శోణకాంతులన్
దనరెడి నీముఖాబ్జము గనన్ మది వేడుక పుట్టె మారుతీ!
39
ఉ.
మండితరత్నకుండలసమంచితగండయుగంబు బాలమా
ర్తాండనిభారుణచ్ఛవియుతంబు విలోలవిశాలనేత్ర మా
ఖండలరత్నరాజదలకంబు సుధాంశునిభంబుఁ జంద్రికా
పాండురమందహాసమయి భాసిలు నీవదనంబు మారుతీ!
40
మ.
కమలాప్తాన్వయమంత్రరాజపదదీక్షాస్పందదూర్ధ్వాధరో
ష్ఠము నాసాగ్రగతావలోకనము సంధ్యాకాలపంకేరుహా
క్రమయుక్తార్థనిమీలితాక్షియుగ మాగమ్యస్మితాంకూర ము
త్తరుతేజం బగునీముఖంబు సరి పద్మం బెట్లగున్ మారుతీ!
41
మ.
భరితక్రోధవిఘూర్ణమాననయనాబ్జాతంబు భీభత్సరౌ
ద్రరసాకీర్ణము వజ్రివజ్రనిభదంష్ట్రాదుర్నిరీక్ష్యంబు దు
ర్ధరనిర్హ్రాదభయంకరం బగుభవద్వక్త్రంబు వీక్షించి సం
గరభూభాగముఁ బాసి పర్వుదు రహో క్రవ్యాశనుల్ మారుతీ!
42
చ.
అనిలునకుం గుమారుఁడ వహర్పతిసూతికి పెద్దమంత్రి వం
జనకుఁ దనూభవుండవు నిశాచరవీరుల కంతకుండ వ
ర్జునునకుఁ గేతనస్థుఁడవు సూర్యకులాగ్రణికిన్ భటుండవై
తనరెడినీకు వందన ముదంచితభక్తి నొనర్తు మారుతీ!
43
చ.
భ్రమణము సేయువేళ మురభంజనుచక్రమురీతి నభ్రభా
గమునకు నెత్తువేళ లయకాలునిదండముమాడ్కి సంసదే
శమున ధరించువేళ విలసజ్జలధీశుని పాశమట్లు నీ
విమలినవాల మొప్పుఁ బ్రతివీరభయంకర మౌచు మారుతీ!
44
మ.
దనుజశ్రేణికిఁ గర్ణ[ 2] శల్యములు సీతాదేవికిన్ జాటువా
క్యనిరూఢుల్ రఘుభర్తకున్ విజయవాద్యధ్వానము ల్కేశవా
హిని కాహ్వానరవంబు లర్కజునకున్ హేలాస్పదంబుల్ భవ
ద్ఘనసాంగ్రామికసింహనాదము లహో ధన్యాకృతీ! మారుతీ!
45
శా.
మైనాకాచలవర్యుశీర్షమునకున్ మాణిక్యకోటీరమై
నానామౌనిహృదంబుజాతములకున్ మార్తాండబాలాతపం
బై నిర్ణిద్రసరోజహల్లకనిభంబై సౌమ్యరేఖావళీ
స్థానంబై తగు నీదుపాదములకున్ దండంబు లోమారుతీ!
46
ఉ.
పాపములం దొలంచు బహుబంధము లూడ్చును రామభక్తికిన్
బ్రాపగు దైన్యదుఃఖములఁ బాపు సమగ్రసమస్తసంపదల్
చేపడునట్లు సేయు రణసీమ జయంబు లొసంగుఁ దావక
శ్రీపదపద్మసేవ యిఁకఁ జెప్పెడి దేమిటి వీర! మారుతీ!
47
మ.
కలనం దావకముష్టిఘాత మఖిలక్రవ్యాశిరాణ్మస్తకా
వళికిం బైఁబడువజ్రపాత మిఁక నీవాలంబు దైత్యాంగక
స్థలులం జుట్టిన కాలపాశము భవత్సందర్శనంబు ల్సురా
రులకున్ యామ్యభటప్రదర్శనములై రూఢిన్ దగున్ మారుతీ!
48
మ.
యమసంబంధిగుణప్రపూర్తి నియమవ్యాపారమున్ బ్రాణసం
యమనం బక్షనిరోధమానసగతుల్ న్యాసాధ్వమున్ ధారణ
క్రమమున్ భూరిసమాధినిష్ఠయును సంగంబుల్ దగం గల్గుయో
గము భాగంబుగఁ గొన్న నిన్నుఁ గని లోకం బెన్నదే మారుతీ!
49
శా.
ద్రోణాద్రీంద్రమహౌషధుల్ పెరటిమందుల్ భూరిలంకాపుర
క్షోణీచక్రము హోమకుండము దినేశుం డొజ్జధాత్రీధ్రముల్
పాణిం బూనినపుష్పగుచ్ఛములు శ్రీరాముండు జంభారిపా
షాణస్యూతకిరీట మైననిను మెచ్చన్ శక్యమే మారుతీ!
50
మ.
సరసీజాప్తవిభావిభాసితనవాబ్జశ్రీలకుం దావులై
యరవిందాంకుశశంఖచక్రముఖరేఖానేకదీప్తంబు లై
దురితవ్రాతమదేభమర్దనచణస్తుత్యర్హసింహంబు లై
తరుణప్రాయము లైననీచరణముల్ ధ్యానించెదన్ మారుతీ!
51
మ.
పటుభూమీరుహ[ 3] కంకపత్రములు శుంభద్బాహుశాఖాగదల్
కుటిలాకుంచితపాదచాపము నఖక్రూరాసిపుత్త్రుల్ సము
ద్భటదంష్ట్రోగ్రకుఠారముల్ పదతలప్రాసంబు లొప్పన్ విశం
కటవృత్తిన్ రణభూమి ద్రుంచితివిగా క్రవ్యాదులన్ మారుతీ!
52
ఉ.
పాణితలోరుతాడనము బ్రాహ్మ్యశరంబుగఁ దన్నుటన్ జగ
త్ప్రాణశిలీముఖంబులుగ దంతనికృంతన మెంచ హవ్యభు
గ్బాణము గాగ ముష్టిహతి పాశుపతాస్త్రము గాఁగ దానవ
శ్రేణుల యుద్ధభూమి జముఁ జేర్చి వెలింగితి వీవు మారుతీ!
53
ఉ.
మౌక్తికతుల్యకల్యనఖమండలముల్ తరుణారుణాంగుళీ
యుక్తము లూర్మికాగతసమున్నతరత్నమరీచిజాలసం
యుక్తము లబ్జరాగమణిసంయుతనూపురనాదవంతముల్
రక్తరుచు ల్ద్వదంఘ్రులు తిరం బగుభక్తి భజింతు మారుతీ.
54
చ.
తరువుల కెల్లఁ బల్లవవితానములౌచు మహేంద్రముఖ్యభూ
ధరముల కెల్ల ధాతుసముదాయములౌచు దశాస్యుప్రోలికిన్
సురుచిరవహ్నికీల లగుచున్ దగుతావకపాదదీధితుల్
మఱువక మన్మనోగతతమం బణఁగించును గాక మారుతీ!
55
ఉ.
బంధుర మైనభీతిఁ గొని పర్వతకందరడాఁగు తజ్జగ
ద్బంధుకుమారవర్యునకు భానుకులాగ్రణిబాంధవంబు వే
సంధిలఁ గూర్చి వాలిని విసంజ్ఞునిగాఁ బొడిపించి మించి కి
ష్కింధకు రాజు జేసితివి కీర్తిఘనుండవు నీవు మారుతీ!
56
చ.
అడవులఁ గొండలం దిరిగి యాకులుఁ గాయలుఁ గోసి తించు నే
ర్పడ నదులం గొలంకుల జలంబులు గ్రోలుచు నున్నక్రోఁతులం
జడులను భానుజుండు గొని చక్కగఁ ద్రిప్పుచుఁ గార్యసిద్ధులం
బడయుట చూడ నీదుప్రతిభామహిమంబునఁ గాదె మారుతీ!
57
శా.
సౌమిత్రిప్రబలప్రతాపశిఖిచేఁ జాకుండ సుగ్రీవునిన్
గామాంధున్ రఘునాథుపాదముల వేడ్కన్ వ్రాలఁగాఁ జేసి త
త్ప్రేమాధిక్యముచేతఁ బ్రాణసహితున్ శ్రీమంతుఁ గావింపవే
నీమంత్రిత్వము వర్ణనీయము గదా నిత్యోన్నతీ! మారుతీ!
58
శా.
నీవొక్కండవు తక్క భానుఁ డయినన్ దేవేడ్యుఁ డైనన్ మహా
దేవుం డైనను బ్రహ్మదేవుఁ డయినన్ దేవేశ్వరుం డైన సం
భావింపంబడు రామముద్రిక భరింపంజాలరా దౌట నీ
ప్రావీణ్యాదులు విశ్వతోధికము లై భాసిల్లు నోమారుతీ!
59
శా.
లంకాపట్టణదుర్గపాలనసముల్లాసాన్వితన్ గీక సా
లంకారాన్వితనీలతుందిలశరీరప్రోజ్జ్వలన్ లంకిణిన్
శంకాతంకము లేక ముష్టిహతిచే శాసించి కార్యార్థి వై
పొంకం బొప్పఁగ లంకఁ జొచ్చిననినున్ భూషించెదన్ మారుతీ!
60
మ.
జలధిప్రేరితుఁ డై హిమాద్రిసుతుఁ డుత్సాహంబుతో వచ్చి నీ
జలజాత ప్రతిమానపాదములు శీర్షంబందుఁ గోటీరముల్
బలె భక్తిన్ ధరియించి తత్క్షణమె జంభద్వేషికిన్ మాన్యుఁ డై
యలరెన్ నీభజనంబు రామభజనం బట్లే కదా మారుతీ!
61
మ.
గగనాధ్వంబున వార్ధిమీఁదఁ జనుజాగ్రద్గండభేరుండదై
త్యగణాదిత్యవిమానసంఘముల ఛాయం బట్టి భక్షించు హే
యగుణగ్రాహిణి యైనసింహికను వజ్రాంచన్నఖశ్రేణిచే
జగమెన్నన్ వధియించు నీబలము మెచ్చన్ శక్యమే మారుతీ!
62
శా.
క్షోణీచక్రము దిద్దిరం దిరుగ నాస్ఫోటించి రామున్ జగ
త్ప్రాణున్ సన్నుతి చేసి భూరితనువర్థాకుంచితం బై తగన్
బాణిద్వంద్వము సాచి భూధరముపై బాదంబులం బూని గీ
ర్వాణాధ్వంబున వార్ధిపై కెగయు నిన్ వర్ణించెదన్ మారుతీ!
63
మ.
స్వతనూత్పాదిత మౌట రావణుపురస్థానంబుఁ జూడన్ వియ
ద్గతితో మేరువు దక్షిణాశకుఁ జనంగాఁబోలు నంచున్ సుర
ప్రతతుల్ చూడ నిజాంగపింగళరుచిభ్రాజద్ఘనాళీకృతో
త్థితఝంపాచయ మొప్ప దాఁటితి వహో! యామ్యాంబుధిన్ మారుతీ!
64
ఉ.
కాంచనపక్షముల్బలె స్వకాయరుచిస్థగితాభ్రకోటి రా
ణించఁగఁ బాదసంగతఫణీప్రభువైఖరిఁ బుచ్ఛ మొప్పఁగాఁ
జంచువు లట్ల సాచినభుజంబులు మీఱఁగ వైనతేయున
ట్లంచితశక్తితోడ లవణాంబుధి దాటితి వౌర మారుతీ!
65
శా.
రంగద్భంగతురంగముల్ ఘనరథగ్రామంబు జీమూతమా
తంగంబు ల్మకరోగ్రవీరతతి రత్నస్వర్ణముల్ గల్గుటన్
నింగిన్ ముట్టి యెదుర్చుసింధువిభునిన్ నీకంటె నన్యుండు దాఁ
టంగా శక్తుఁడు లేఁ డటంచు నిను వేడ్కన్ మెచ్చెదన్ మారుతీ!
66
ఉ.
రావణుపేరు చెప్పిన సురప్రభుఁ డైన వడంకు దుష్టస
త్వావిలగర్భ మైనలవణాంబుధిఁ జూచిన భీతిపుట్టు నీ
వావనరాశి దాఁటి దనుజాధిపు గేహముఁ జొచ్చి జానకీ
దేవిని గాంచి వచ్చుట మదిం దలపోసితి నిట్టిసాహసం
బీవిధమైనధైర్యము మహిం గలదే యొరునందు మారుతీ!
67
శా.
ఫాలాక్షాద్భుతచాపఖండనకలాప్రౌఢిన్ విజృంభించు సీ
తాలోలారుణపాణిపద్మమున నిత్యం బుండి భాస్వస్మయూ
ఖాళిం గేరెడివజ్రకాంతుల నమూల్యం బైనశ్రీముద్రికన్
గేలం బట్టిన రామభక్తుని నినున్ గీర్తించెదన్ మారుతీ!
68
ఉ.
రావణు నిష్కుటంబున ధరాతనయం దగఁ జూచి రామగో
త్రావరుఁ డానవా లొసఁగురత్నమయోర్మిక భక్తి నిచ్చి యా
దేవుని మంజువాక్యములఁ దెల్పి తదంబుజనేత్రచేత మే
ల్దీవన లొందినాఁడ విది దివ్యులకైన దరంబె మారుతీ!
69
చ.
అతులితరామముద్రిక ధరాత్మజ కిచ్చి తదీయమౌళిసం
గతరమణీయరత్నముఁ దిరంబగు భక్తిని గొంచు రాఘవ
క్షితిపతి కింపుతో నొసఁగు కీశవరుం డితఁడంచు దేవతల్
నుతు లొనరింప నొప్పితి వనూనచరిత్రుఁడ వీవు మారుతీ!
70
ఉ.
స్యందనవాజిదంతిభటసంగసమేతు వినీలభూమిభృ
త్తుందిలదేహు సింహనిభదోర్బలు శక్రముఖాఖిలామరా
క్రందనకారి దివ్యశరగర్వితు నక్షకు నొక్కగ్రుద్దుచే
మ్రంచఁగఁ జేసినాఁడ వతిమానము తావకశక్తి మారుతీ!
71
ఉ.
రావణుమంత్రిపుత్త్రుల పరాక్రమసింహుల భూరిగగ్వరో
షావిలచిత్తులన్ సమవయస్కుల ఘోరచమూసమేతులన్
బావకతుల్యశస్త్రయుతపాణుల నేడ్వుర నాహళస్థలిన్
దేవత లెన్న వాలనిహతిన్ వధియించితి వౌర మారుతీ!
72
ఉ.
జంభవిరోధికిన్ హృదయశల్యము రావణువీటికిన్ జయ
స్తంభము దైత్యవాహిని కుదంచితదుర్గము సంగరక్రియా
రంభమునన్ మృగేంద్రమన రాజిలుచున్న నరాంతకున్ సమి
త్కుంభినిఁ గూలఁజేసితివి ఘోరపదాహతి నౌర! మారుతీ!
73
చ.
అశనిసమానసాయకు దవానిలసన్నిభసైన్యసంయుతున్
బ్రశమితదేవతాస్మయుఁ బ్రభంజనవేగు నృసింహవిక్రమున్
దశముఖనందనున్ విపులధైర్యవినిర్జితమందరాచలున్
ద్రిశిరుని నొంటిగ్రుద్దున వధించితి వౌర! మహాత్మ మారుతీ!
74
ఉ.
రావణు నెమ్మనంబునఁ దిరంబుగ నున్న జయాశ బ్రుంగ సు
గ్రీవనలాంగదద్వివిదకేసరిముఖ్యకపు ల్చెలంగ దే
వావళు లెల్లఁ బొంగ దివిజారిబలంబు కలంగ సాంపరా
యావని నయ్యకంపనుఁ బదాహతిఁ గూల్చితి వౌర! మారుతీ!
75
శా.
శంభున్ జంభరింపున్ జయించి శమనున్ శాసించి యక్షేశు సం
రంభం బూడ్చి జలేశపావకమరుత్క్రవ్యాదచంద్రార్కులన్
శుంభద్వృత్తి జయించి మించిన దశాస్యున్ ఘోరయుద్ధక్రియా
రంభం బందుఁ గఠోరముష్టిహతి మూర్ఛంబుచ్చితౌ మారుతీ!
76
శా.
క్షోణీనాథుల గెల్చి యక్షతతులం జూర్ణంబు గావించి గీ
ర్వాణవ్రాతము నొం-చి కింపురుషులన్ వారించి విద్యాధర
శ్రేణిం బాఱఁగఁ దోలి భోగివరులన్ శిక్షించి దైత్యాళికిన్
బ్రాణం బైననికుంభునిన్ రణములో మ్రందించితౌ మారుతీ!
77
మ.
జలధుల్ రొంపి యొనర్ప శీతకరభాస్వద్బింబముల్ మింగ భూ
తల మాకాశముఁ గేలఁ బట్టి కడిమిన్ దాళంబు వాయింపఁ గొం
డలు పాదంబుల గుండసేయఁ గను నుద్యత్తేజు ధూమ్రాక్షునిన్
గలనన్ ద్రుంచిననీకు మ్రొక్కితి ననున్ గావన్ వలెన్ మారుతీ!
78
మ.
మయునిన్ శంబరు నింద్రజిత్తు నముచిన్ మారీచు వైరోచనున్
రయ మొప్పన్ గెలువంగఁజాలు కుహనారాశిన్ మహామౌనివే
షయుతున్ ధీరుని గాలనేమిఁ గని వజ్రక్రూరవాలాహతిన్
లయమున్ జేసిననీకు మ్రొక్కెద ననున్ రక్షింపుమా మారుతీ!
79
మ.
అనలాధానము సోమమున్ జయనబార్హస్పత్యముల్ వైశ్రవం
బును సౌత్రామణి రాజసూయసవనంబున్ బౌండరీకంబు నా
గనివాసంబుఁ దురంగ మేధము మొదల్గాఁ గల్గుయజ్ఞంబు లె
ల్లను నీసేవకు సాటిగా వని బుధుల్ వాక్రుత్తు రోమారుతీ!
80
శా.
గంగన్ గౌతమి నర్మదన్ జలనిధిన్ గావేరిఁ జర్మణ్వతిన్
దుంగన్ భద్రను గండకిన్ సరయువున్ దోషాపహన్ శోణభ
ద్రం గాళిందిని గృష్ణ వేత్రవతి శిప్రన్ మున్గుకంటెన్ భవ
న్మాంగళ్యాన్వితపాదసేవ బుధసంభావ్యం బగున్ మారుతీ!
81
మ.
సుమదానంబు సువర్ణదానమును వాసోదానమున్ రౌప్యదా
నము గోదానము గేహదానమును గన్యాదానమున్ ధాన్యదా
నము భూదానము రత్నదాన మవిదానం బాదిగాఁ గల్గుదా
నములన్ జేరుఫలంబు నిన్ గొలిచినంతన్ వచ్చు నో మారుతీ!
82
మ.
పటువేగంబును వజ్రపారనఖముల్ భర్మప్రభాదేహ ము
ద్భటశౌర్యంబు [ 4] ముకుందపాదయుగసేవాభారమున్ జాలఁ గ
ల్గుటకున్ నీసరి గాన భక్తులకు మే ల్గూర్పంగఁ బక్షీంద్రుఁ డా
దట నిన్ బోలఁ డటంచుఁ జూచెదను మద్భావంబునన్ మారుతీ!
83
మ.
ప్రణవోపేతనమఃపదంబు మొద లాపైపై చతుర్థ్యంతప
డ్గుణవన్నామకవాయునందను లొగిన్ గూర్చన్ ద్రివేదర్తుసం
గణనన్ వర్ణము లొప్పు మంత్రమగుచున్ గన్పట్టు దానిన్ విచ
క్షణు లెల్లన్ జపియించి గోరెదరు నీకారుణ్య మో మారుతీ!
84
మ.
ఘనసేనాచరణోత్థితోరురజ మాకాశంబునన్ నిండఁ దూ
ర్యనినాదంబుల దిక్తటంబు లదరన్ రాజద్రథారూఢుఁడై
ధనురాద్యాయుధపాణియై సమరగోత్రం జేరుతజ్జంబుమా
లిని లీలన్ వధియించు నిన్నుఁ బొగడన్ లే రెవ్వరున్ మారుతీ!
85
మ.
కరిసింహాదులు నీరుఁ ద్రావుటకునై కాసారమున్ జేరుచో
గరిమం బట్టి వధింపుచుండెడి మహోగ్రగ్రాహిణిన్ వజ్రబం
ధురదృప్యన్నఖకోటిచేత మదశార్దూలంబు లేడిం బలెన్
స్థిరశక్తిన్ విదళించి మించు నిను నర్థిం గొల్చెదన్ మారుతీ!
86
మ.
మురజిద్బ్రహ్మముఁ దాఁకి సంగరములో ముక్కాఁకలం దీఱి ని
ర్జరసేనం బలుమాఱు లాలములఁ బాఱందోలి శార్దూలదు
ర్ధరతేజుం డగుమాల్యవంతు ననిలో లాంగూలవిక్షేపవి
స్ఫురణన్ వారిధి వైచి నాగభవనంబున్ జేర్చితౌ మారుతీ!
87
శీా.
ఖర్వాఖర్వచమూసమేతు లయి వేగన్ జిత్రసేనాదిగం
ధర్వు ల్ద్రోణనగంబుసన్నిధి నిను దాఁకంగ వారందఱిన్
గర్వం బొప్పఁగ వాలతాడనములన్ బాహాప్రహారంబులన్
బర్వంజేసి జయంబుఁ గొన్న నిను సంభావించెదన్ మారుతీ!
88
చ.
సమరములో నిశాచరులఁ జంపుతఱిన్ లయరుద్రుపోలికన్
గ్రమమున వేదము ల్చదువుకాలమునన్ బరమేష్ఠికైవడిన్
శమయుతు లైనభక్తులకు సంపద లిచ్చెడివేళ జానకీ
రమణునివైఖరిన్ జగతి రాజిలునిన్ను భజింతు మారుతీ!
89
ఉ.
ధైర్యముచేత మేరుగిరి దానముచేత ఘనాఘనంబు గాం
భీర్యముచేత వారినిధి భీషణతేజముచేత సూర్యుఁడున్
స్థైర్యముచేత భూమిసతి ధర్మముచేత జముండు నుజ్జ్వల
చ్ఛౌర్యముచేత సింహమును సామ్యము వత్తురు నీకు మారుతీ!
90
ఉ.
వాలము గల్గుమేరుగిరి వాక్కులఁ బల్కెడిమత్తదంతి యా
భీలను దాల్చుసింహము విచిత్రగతిక్ రణమాచరించుశా
ర్దూలము క్రోఁతిరూపు గొనురుద్రుఁ డితండని వేల్పు లెన్నఁగా
నాలములో వెలింగి దనుజావళిఁ ద్రుంచితి వీవు మారుతీ!
91
శా.
నీకున్ మామకమంత్ర మిచ్చెదను దీనిన్ నిత్యమున్ బల్కుచోఁ
గాకుత్థ్సాన్వయుమంత్రరాజముగతిన్ గళ్యాణసంధాత యై
శోకంబు ల్దొలఁగించు స్వర్గ మిడునంచుం జెప్పి స్వప్నంబులో
నా కామంత్ర మొసంగునిన్ను మదిలోనం గొల్చెదన్ మారుతీ!
92
మ.
కదళీభూరుహషండమండితవనిం గళ్యాణగేహంబులోఁ
ద్రిదశాధీశ్వరరత్నసంఘటితవేదిన్ నిల్చి సీతాధిపున్
హృదయాబ్జంబున నుంచి సంయమిచయం బెన్నంగఁ బూజించి త
త్పదభక్తిన్ దగునీకు మ్రొక్కెద ననుఁ బాలింపుమీ మారుతీ!
93
శా.
లీలానిర్మితమన్మథుండ వగువర్ణిశ్రేష్ఠు నిన్నెన్ను బో
కాలుంబిడ్డలు గేహముం గలిగి హేమాశన్ సమస్తావనీ
పాలవ్రాతము నాశ్రయించుజనులన్ బల్కింప నేమంచు నే
నాలోచింది వచించినాఁడ నిది నీ వాలింపుమీ మారుతీ!
94
మ.
మును దాక్షాయణి కైకొనెన్ బిదప జీమూతాత్మజన్ బెండ్లియా
డెను గంగాసతి దౌరతిం గలసెఁ గంఠేకాలుఁ డవ్వేల్పు కా
ముని నిర్జించుట దెట్టిదో తెలియ దామూఢాంగజున్ బ్రహ్మచ
ర్యనిరూఢిం దగునీవు గెల్చుట యథార్థంబౌఁ జుమీ మారుతీ!
95
ఉ.
కావు నపుంసకుండవును గావు జడుండవు వృద్ధదేహివిం
గావు గదార్తు లెవ్వియును గల్గవు భామలలోన నుండి స
ర్వావసరంబులుం గనుచు నస్థలితం బగుబ్రహ్మచర్యసం
సేవన మెట్లు సల్పితి విచిత్రము నీచరితంబు మారుతీ!
96
చ.
పలుక వసత్యవాక్యములు పావనమూర్తిని బ్రహ్మచర్యని
ర్దళితమనోభవుండవు నితాంతదయామతి వాశ్రితావనో
జ్వలఘనశక్తిశాలిని ప్రసన్నముఖాంబురుహుండ వైననిన్
దలఁచి నుతించినాఁడఁ బ్రమదంబునఁ గావుము నన్ను మారుతీ!
97
ఉ.
దండము చండముష్టిహతిదండితదానవచక్రవర్తికిన్
దండము వేదచోదితవిధానసమర్చితరామమూర్తికిన్
దండము భానుసూనుసముదంచితసైన్యచయాగ్రవర్తికిన్
దండము భర్జితాశ్రితజనప్రకరార్తికి నీకు మారుతీ!
98
చ.
అరినివహంబుచేతను గదార్తులచేతను లేమిచేతఁ ద
స్కరతతిచేతఁ బన్నగపిశాచగణంబులచేత దుర్జనో
త్కరములచేత నేఁటియధికారులచేతను గల్గుబాధలన్
గురుతుగఁ బాపి బ్రోవు మిదె కోరి భజించితి నిన్ను మారుతీ!
99
చ.
జయజయ హేమకూటనిభసన్నిభదేహ నిశాటవాహినీ
చయఘనగంధవాహజవసత్వజితాంబుజబంధువాహ దు
ర్ణయయుతరావణాసురపురస్థగితోజ్జ్వలహవ్యవాహ ని
ర్భయభరితోహ రామపదభక్తిసమంచితగేహ మారుతీ!
100
శా.
సీతాభర్తకు మన్మనీషితములన్ జిత్తంబులో జాలి సం
జాతం బయ్యెడురీతిఁ దెల్పుచుఁ దదాజ్ఞన్ ముందుగా బొంది కం
జాతస్పీతతదీయపాదయుగళీసద్భక్తియున్ ముక్తియున్
బ్రీతిన్ గూర్పఁగదయ్య నీశరణ మర్థిన్ బొందితిన్ మారుతీ!
101
మ.
హరిపాదాంబుజభక్తిసంయుతుఁడ దీప్యజ్జ్యోతిషామ్నాయవి
ద్గురుఁడన్ గొట్కిలపూడివంశభవుఁడన్ గోదండరామాఖ్యుఁడన్
విరతిజ్ఞానయుతుండ నన్నుఁ గరుణన్ వీక్షించి తాపత్రయ
స్ఫురణంబుల్ తొలఁగించి బ్రోవు మరుణాంభోజద్యుతీ మారుతీ!
102