భక్తిరసశతకసంపుటము/మొదటిసంపుటము/భద్రాద్రిరామశతకము

పీఠిక

ఈశతకము వ్రాసిన పావులూరిమల్లన రాజరాజనరేంద్రునికాలమున నుండి పావులూరిగణితము వ్రాసిన మల్లనయే యని తొల్లి వ్రాసిన వ్రాతలు ప్రమాదములని తోఁచుచున్నది. గణితశాస్త్రములోని

“పావులూరివిభుఁ డను
                    గార్గ్యగోత్రోద్భవుఁడన్”
“శివ్వనపుత్రుఁడ మల్లనాఖ్యుఁడన్"

అనుపద్యభాగములవలన గణితశాస్త్రము వ్రాసిన మల్లనకవి శివన్నపుత్రుం డనియు గార్గ్యగోత్రుఁ డనియుఁ దెలియుచున్నది. భద్రాద్రిరామశతకము వ్రాసినకవియో ఇందలి 102, 103, 104 పద్యములవలన వాసిష్ఠగోత్రుఁ డనియు రామమంత్రి కుమారుఁ డనియుఁ దెలియుటవలన నిరువు రొకటిగా భావించుట నామసామ్యమువలనఁ గలిగినభ్రాంతియేగాని వేఱుగాదు.

భద్రాద్రిరామశతకమునందలి కవితాధార యంతప్రౌఢముగా లేదు. ఇందలి పద్యములన్నియు మకారప్రాసతో రచింపఁబడుట యొకవిశేషము. ఇటుల రచించుటకుఁ గారణము మకుటమంతయు నొకపాదము నాక్రమించుటయే యై యున్నది. ఇందలిపద్య ములలో మనోహరములగు కల్పనములుగానీ రమణీయములగు భావములుగానీ లేవు. పురాణములకు సరిపోలు శ్రీరామునివిశేషణముల కూరుపుమాత్రము ప్రతిపద్యమున నిముడ్పఁబడియున్నది. శ్రీరామనామచింతనాపరుల కీశతకము రామస్మరణము గావించుపట్టున మిగుల నుపయోగకరముగా నుండును.

ఈకవి పావులూరి నివాసినని చెప్పికొనినాఁడు. పావులూరులు పెక్కులుంటవలనం గవినివాసమగు [1]పావులూ రేదియో తెలిసికొనఁదగిన యాధారములు కానరావు. ఇందలిపద్యములయందు రామనామము పెక్కుమాఱు లిముడ్పఁబడియుంటవలన నీశతకకర్త రామనామామృతపానప్రమత్తుఁడుగ నుండి భక్తుల కీశతకరూపమున రామనామామృతమును బ్రసాదించెనేమో యని తోచెడిని.

కవి యీశతకమును మిగుల బాల్యావస్థలో వ్రాసినటులఁ బదప్రయోగలాఘవమునుబట్టి ధారాలోపమునుబట్టి యూహింపవచ్చును. శతకము సులభము సుబోధమునై యున్నది.

నందిగామ.

ఇట్లు భాషాసేవకులు,

1-1-25.

శేషాద్రిరమణకవులు, శతావధానులు.

శ్రీరస్తు

పావులూరి మల్లనకవి ప్రణీత

శ్రీభద్రాద్రిరామశతకము

క.

శ్రీమద్రఘువంశార్ణవ
సోమా శ్రీరామనామ సువ్రతకామా
కోమలదేహశ్యామా
శ్రీమద్భద్రాద్రిధామ శ్రీరఘురామా.

1


క.

వామాంకమందు సీతా
భామయు సౌమిత్రి కుడిని భరతుఁడు గొల్వన్
సామీరితోడ నొప్పిన
శ్రీ...

2


క.

స్వామి నీదే భారము
పామరుడను బాతకుఁడను బతితుఁడ సీతా
రామా నీపదములె గతి
శ్రీ...

3


క.

రామ ద్వయాక్షరమంత్రము
నామనమున నిల్వనిమ్ము నారాయణ యో
శ్రీమంతుఁడ స్మితవక్త్రుఁడ
శ్రీ...

4

క.

ఏమయ రామబ్రహ్మమ
నీమహిమోక్తులను నెన్న నీశునితరమా
తామరసగర్భు తరమా
శ్రీ...

5


క.

రామా నీదయ రాదుగ
నామీఁదను నాదిదేవ నారదవినుతా
మో మైనఁ జూపవైతివి
శ్రీ...

6


క.

రామా దైవశిఖామణి
సామజరాడ్వరద సత్యసంధవ్రతుఁడా
యేమని పొగడుదు నిన్నున్
శ్రీ...

7


క.

రామా నీస్మర ణెప్పుడు
నేమఱకన్ సర్వకాల మేర్పడఁ దలఁచే
నామనవి చిత్తగింపుము
శ్రీ...

8


క.

రామ యభిరామ రాఘవ
తామరసదళాయతాక్ష తాపసరక్షా
కామారిధనుఃఖండన
శ్రీ...

9


క.

రామా రఘుకులతిలకా
కామాదులఁ గడకుఁ జిమ్మి కడతేర్చెడి శ్రీ
స్వామి వని నిన్ను నమ్మితి
శ్రీ...

10


క.

రామ యనువర్ణయుగ్మము
నేమముతోడను జపించునియతాత్ములకున్
గామితమోక్షము లిత్తువు
శ్రీ...

11

క.

భీమప్రస్తుతనామా
హైమవతీజప్యనామ యచ్యుతరామా
కోమలమేఘశ్యామా
శ్రీ...

12


క.

రామా రమణీయగుణ
స్తోమా సమరజితరామ సుందరరామా
భీమపరాక్రమ దివ్య
శ్రీ...

13


క.

శ్రీమంతం బగుతారక
నామజపం బనిలసుతుఁడు నాగాంతకుఁడున్
వేమఱు నెదురుగఁ జేతురు
శ్రీ...

14


క.

రామ యనుమంత్రరాజము
నా మాధుర్యము మృదుత్వ మాయద్భుతమున్
ఏమహనీయుల కబ్బునొ
శ్రీ...

15


క.

రామా యనునీనామము
ప్రేమన్ బఠియించినట్టి ప్రీతాత్ములకున్
శ్రీమత్పదగతి యిత్తువు
శ్రీ...

16


క.

రామా కల్యాణాంచిత
ధామా శ్రీరంగధామ దశరథరామా
భూమిసుతాధిప రామా
శ్రీ...

17


క.

రామ యహల్యాశాపవి
రామా వైకుంఠధామ రవిపుత్రబల
స్తోమ రణరంగభీమా
శ్రీ...

18

క.

శ్రీమజ్జితవిద్యుద్గణ
ధామా దుర్మదవిరామ తాపసరామా
హేమహరిణమును ద్రుంచిన
శ్రీ...

19


క.

రామా కల్యాణప్రద
నామా కోదండరామ నవ్యభుజంగో
ద్దామ దశకంఠలుంఠన
శ్రీ...

20


క.

రామా రక్షక మ్రొక్కద
రామా నన్నేలుకొఱకు రాజకుమారా
శ్రీమహనీయ దయానిధి
శ్రీ...

21


క.

రామా నీదగునామము
సామప్రియ శివునిపత్ని సరవిన్ జపమున్
గామితమతి నొనరించెను
శ్రీ...

22


క.

రామా యెల్లప్పుడు మీ
రామతొ నావెంట నంటి రమ్మా విలస
త్ప్రేమను మోక్షం బిమ్మా
శ్రీ...

23


క.

రామయ్య రామ సీతా
రామా పట్టాభిరామ రాఘవరామా
శ్రీమృత్యుంజయపూజిత
శ్రీ...

24


క.

శ్రీమహిత రామభద్రా
కామితకరుణాసముద్ర కార్ముకహస్తా
హేమశరాసన వందిత
శ్రీ...

25

క.

రామ శ్రీమదయోధ్యా
రామా రాజీవనాభ రవికులసోమా
హేమమణికాంచిదామా
శ్రీ...

26


క.

రామా రాజాధిరాజ
శ్రీమణినూపురపదాబ్జ శ్రీరవితేజా
వామన వరకుశశయనా
శ్రీ...

27


క.

రామ జగదేకవీరా
శ్రీమదయోధ్యావిహార శివజపితగుణా
సామోద సార్వభౌమా
శ్రీ...

28


క.

రామా రాతిరి వేకువ
జామున నినుఁ బ్రస్తుతింతు జన్మఫలముకై
రామా రాక్షసనిగ్రహ
శ్రీ...

29


క.

రామా నను విడనాడకు
రామా ననుఁ గన్నతండ్రి రఘుకులముఖ్యా
రామా నను రక్షింపుము
శ్రీ...

30


క.

రామా రవిసుతపాలక
రామా భక్తాంతరంగ రమ్యశుభాంగా
చామరఛత్రాలంకృత
శ్రీ...

31


క.

రామా రాజకులాగ్రణి
రామా నాచక్కనయ్య రఘునాథయ్యా
రామా నాప్రియదైవమ
శ్రీ...

32

క.

రామా భరతాగ్రజ నీ
నామము నాజిహ్వయందు నటియించుత శ్రీ
రామ రాజ్యాభిరామా
శ్రీ...

33


క.

రామా సకలామరనుత
ధీమణి శ్రీరామదేవ దివిజస్తుత్యా
నా మొఱ మది నాలింపుము
శ్రీ...

34


క.

రామా రాజానన రఘు
రామా నాతోడునీడ రారా రామా
శ్రీమహితసింధుబంధన
శ్రీ...

35


క.

రామా దశరథనందన
రామా రాజీవనేత్ర రాఘవరామా
శ్రీ మించు నీచరిత్రలు
శ్రీ...

36


క.

రామా పరమదయాకర
రామా రాకేందుముఖవిలాసా భాస
చ్ఛ్రీమకరాబ్జశ్రీపద
శ్రీ...

37


క.

రామా సీతావల్లభ .
రామా దాశరథి వాసరాధిపభాసా
శ్రీముఖచంద్రచకోరా
శ్రీ....

38


క.

రామా మీతిరువడిఘలు
చామంతిసుపుష్పములను చంపకములచేఁ
గామించి పూజఁ జేసెద
శ్రీ...

39

క.

రామా దాసజనార్చిత
రామా రంజితపదాబ్జరతి నాకిమ్మా
శ్రీమహిళామానసహర
శ్రీ...

40


క.

రామా పవనజవాహన
రామా లోకాభిరామ రాజవరేణ్యా
శ్రీమాధవ శ్రీరామా
శ్రీ...

41


క.

రామ రాజేంద్ర రాఘవ
రామా నాగారితురగ రాక్షసభంగా
శ్రీమత్ఫణీంద్రశయనా
శ్రీ...

42


క.

రామా త్రిభువనరక్షక
రామా దీనజనబంధు రఘుకులసింధూ
స్వామి దయాపరమూర్తీ
శ్రీ...

43


క.

రామా నాయిలువేలుప
రామా హరి రామ ఘోరరావణహరణా
రామ సాకేతరామా
శ్రీ...

44


క.

రామా శ్రీ జగతీధవ
యేమిర శ్రీరామచంద్ర యిల నీవాఁడన్
నీమీఁదితలఁపు నిమ్మా
శ్రీ...

45


క.

రామా కరుణాంభోనిధి
రామాత్మారామ లోకరక్షణ రామా
రామ కౌసల్యనందన
శ్రీ...

46

క.

రామా రఘునందన శ్రీ
దామోదర తార్క్ష్యవాహ తాటకహరణా
రామ ఖరదూషణాతంక
శ్రీ...

47


క.

రామా శాశ్వతబాంధవ
రామా నను గన్నతండ్రి రామనృపాలా
రామ నా పెన్నిధానమ
శ్రీ...

48


క.

రామా నను మన్నింపఁగ
రామా నీకన్నఁ బ్రోచురా జిఁక నేడీ
రామా రాజలలామా
శ్రీ...

49


క.

రామా యిదిగో సమయము
రామా రక్షించు నన్ను రామ దయాళూ
రామార్తదీపపోషక
శ్రీ...

50


క.

రామా సుందరమందిర
శ్యామాంగా హేమవర్ణచక్రాసిధరా
కోమలగురుపదయుగళా
శ్రీ...

51


క.

రామ గోవింద విష్ణూ
వామన పరవాసుదేవ వసుధారమణా
కామశతకోటిరూపా
శ్రీ...

52


క.

భీమభయంకరబాణ
స్తోమా సాకేతవాస సూనృతవాక్యో
ద్దామా నిను నెంచెద విను
శ్రీ....

53

క.

నీమహిమ లెన్నిపురుషులు
ఈమని విత్తంబు లడుగ నియవేమి హరీ
నే ముఖ్యుఁ డౌట యెట్లను
శ్రీ...

54


క.

రామా నాస్వాంతములో
నేమముగా నిరత మేను ని న్నర్చింతున్
హేమకుసుమములచేతను
శ్రీ...

55


క.

రామా వాలిని గూల్చిన
రామా సుగ్రీవరక్ష రాజేంద్రనుతా
ప్రేమను వందన మిదిగో
శ్రీ...

56


క.

రామ కరుణాంభోనిధి
రామా శ్రీపుండరీక రాజితచరణా
రామాంజలి నేఁ జేసెద
శ్రీ...

57


క.

రామా రావణుతమ్ముని
రామా లంకాధిపతిగ రమ్యతఁ జేయన్
సామర్థ్యము నీకే తగు
శ్రీ...

58


క.

భూమిజవర పురుషోత్తమ
నామది నెడ బాయకుండు నలినదళాక్షా
వేమఱు వినుతించెద నిను
శ్రీ...

59


క.

రామా విశ్వామిత్రుని
కామితయజ్ఞంబు ఘనతఁ గాచిన దేవా
నీమహిమ లెన్న శక్యమ
శ్రీ...

60

క.

కోమలవర్ణము గలిగిన
భూమిజఁ గైకొనినభూరిభుజబలసాంద్రా
శ్యామలకోమలకరపద
శ్రీ...

61


క.

రామ శ్రీరంగనాయక
యీమహిలోపలను గోర్కు లింపున నిచ్చే
రాముఁడని కోరి వేడితి
శ్రీ...

62


క.

కోమలశ్యామలతులసీ
దామము ధరియించినట్టిదశరథసుత శ్రీ
రామ మదాత్తారామా
శ్రీ...

63


క.

శ్రీమన్మంగళవిగ్రహ
నీమంగళవర్ణనీయనిచయము మదిలో
నే ముందుగ సేవించెద
శ్రీ...

64


క.

కామితఫలదుఁడ వంచును
నే మిమ్ముల నాశ్రయించి నిరుపమభక్తిన్
నామోచ్చారణఁ జేసెద
శ్రీ...

65


క.

రామా నీదయచేతను
రామా నీపాదభక్తి రంజిలుచుండున్
రామా ననుఁ బోషించుమ
శ్రీ...

66


క.

స్వామీ నీవే ప్రభుఁడవు
స్వామీ నీనామజపము సర్వసుపర్వుల్
వేమరు సన్నుతిఁ జేతురు
శ్రీ...

67

క.

రామా నాకలుషంబులు
నామోచ్చారణముచేత నాశము నొందున్
నామనమునఁ జింతించెద
శ్రీ...

68


క.

రామా త్రిభువనపూజిత
రామా నీపాదపద్మరజమును మదిలో
రామా యెపుడు స్మరించెద
శ్రీ...

69


క.

రామ విమలాత్మ సీతా
భామానవమదన కదనభంజితదైత్య
స్తోమ ఘనశ్యామా యో
శ్రీ...

70


క.

రామా నినుఁ గొనియాడెద
నీమృదుపదములును మోము నీమస్తకమున్
దామరలఁ గేరు కరములు
శ్రీ...

71


క.

రామ కపురంపుహారతి
నామక్కువ పళ్లెరమున నంచితభక్తిన్
నే మీ కిచ్చెదఁ గైకొను
శ్రీ...

72


క.

రామేంద్ర నీలనీరద
శ్యామా గుణరుచిరరామ చంపకనాసా
ఆమోదకర విహారా
శ్రీ...

73


క.

రాముఁడు తండ్రియు సీతా
రామయు తల్లియని మదిని బ్రస్తుతిఁ జేతున్
నామనవి వినుము రామా
శ్రీ...

74

క.

శ్రీమత్పరమేశ్వరకరు
ణామధురస యురగలోకనాయక కృష్ణా
ప్రేమను నిను నమ్మితిరా
శ్రీ...

75


క.

శ్రీమత్పరమదయానిధి
శ్రీమత్పంకేరుహాక్ష శ్రీయుతవక్షా
శ్రీమానినీమనోహర
శ్రీ...

76


క.

శ్రీమధురాపురి వెలసిన
శ్రీమృదుశ్రీపాదములను జెన్నలరంగా
నామనమున సేవించెద
శ్రీ...

77


క.

భీమనకులధర్మార్జున
స్తోమము పరిపాలనమున సొంపు వహించెన్
సామివనిఁ బ్రస్తుతించెద
శ్రీ...

78


క.

శ్రీమధుసూదన ధర్మ
శ్రీమద్వసుదేవతనయ శ్రీకర కృష్ణా
యేమిర యిఁక ననుఁ బ్రోవర
శ్రీ...

79


క.

శ్రీమురళీధర హేలా
శ్రీమద్గోపాల భక్తసేవితశీలా
శ్రీమునిరా డర్చితపద
శ్రీ...

80


క.

సోమకుఁడు వార్ధిలోపల
ధీమతితో నుండువానిఁ ద్రెంచి శ్రుతుల నా
తామరసగర్భు కొసగవె
శ్రీ...

81

క.

ప్రేమతొ నమృతము దరచఁగ
నీమంబుగ కమఠరూపు నీ వెత్తవె యా
భీమమహీధ్రముకొఱకై
శ్రీ...

82


క.

కామమున హిరణ్యాక్షుం
డామహి గొని వెళ్లునప్పు డాతని ద్రుంపన్
బ్రేమ వరాహమ వైతివి
శ్రీ...

83


క.

భీమబలోధ్ధతి విజయ
స్తోమా నరసింహారూప సురవైరిబలో
ద్దామా జయవిక్రమనయ
శ్రీ...

84


క.

వామనరూపముతోడుత
భూమంతయు నేలుచున్న భూరిబలీంద్రున్
నీమాయచేతఁ ద్రొక్కవె
శ్రీ...

85


క.

ప్రేమ ముయ్యేడు మాఱులు
భూమిం జరియించి రాజపుత్రుల ద్రుం చా
భూమి బుధకోటి కిచ్చిన
శ్రీ...

86


క.

భూమిజను పంక్తికంఠుఁడు
ప్రేమం గొనిపోవ నతనిపృథుతరశిరముల్
భీమముగఁ ద్రుంచి మించిన
శ్రీ...

87


క.

భూమిజనసస్యవృద్ధికి
నేమముతో హలను వట్టి నేతలఁ బ్రోచే
యామహిమ నీకె తగునయ
శ్రీ...

88

క.

నీమహిమ లెన్న శక్యమె
యామహిలోఁ ద్రిపురవిజయులై తగుస్త్రీలన్
గామితులఁ జేసి వెలసిన
శ్రీ...

89


క.

భూమీంద్రు లెన్న జగముం
ధీమతిఁ బాలించి యవనధీరులఁ జంపన్
గ్రామముతోడుత వెలసిన
శ్రీ...

90


క.

శ్రీమందిర వరరమణా
కామితకమనీయ గరుడగమన మురారీ
నే మీకు మ్రొక్కెద నయో
శ్రీ...

91


క.

రామ నవమోహనాంగా
రామా సీతాంతరంగ రమ్యశుభాంగా
రామ భవవర్గభంగా
శ్రీ...

92


క.

రామానుజ న న్నేలిన
స్వామీ శ్రీకృష్ణదేవ సదమలనామా
రామా జనకామ జయ
శ్రీ...

93


క.

రామా కస్తురిరంగా
సోమ శరశ్చంద్ర గాంగ శుభ్రయశశ్శ్రీ
కామా నను గరుణింపుము
శ్రీ...

94


క.

రామ మిము సన్నుతించెద
నామానసవీథియందు నగధర కృష్ణా
దామోదర యని సతతము
శ్రీ...

95

క.

రామ కరుణాలవాలా
శ్యామలరుచిజాల భక్తజనయోగీంద్రా
ద్యామరసన్మునిపాలా
శ్రీ ...

96


క.

రామ సామ్రాజ్యధుర్యా
ధీమహిత సుమేరుధైర్య దితిజావార్యా
స్తోమామరగణవర్యా
శ్రీ...

97


క.

రామునికన్నను రెండవ
సామియు లేఁడనుచు నీవె సర్వం బనుచున్
వేమాఱు విన్నవించెద
శ్రీ...

98


క.

రాముఁడునువినా దైవము
భూమిన్ లేఁడనుచు మదిని బొందుగ నే నీ
నామామృతంబుఁ గ్రోలెద
శ్రీ...

99


క.

శ్రీమదయోధ్యానాయక
కోమలనీలాభ్రదేహ గోధ్వజవినుతా
శ్రీమారుతసుతు నేలిన
శ్రీ...

100


క.

రామ వరపావులూరి
స్వామివి నీ వనుచు నమ్మి శతకము భక్తిన్
ప్రేమ రచియించితిని గొను
శ్రీ...

101


క.

శ్రీమహితపావులూరి సు
థాముఁడు రామన్న మంత్రి తనయుఁడఁ గవిసు
త్రాముఁడ మల్లనసచివుఁడ
శ్రీ...

102

క.

సోమార్కనేత్ర విను నే
నీమహి వాసిష్ఠగోత్రహిమకరుఁడను సు
శ్రీమీఱ నిన్నుఁ గొల్చెద
శ్రీ...

103


క.

స్వామీ ధర బాపమకున్
రామనకుం బుత్రకుఁడను రమణీయగుణో
ద్దాముఁడ నాపస్తంబుఁడ
శ్రీ...

104


క.

ఈమహిలో నీశతకం
బేమనుజుఁడు వ్రాయుఁ జదువు నీప్సితఫలమున్
ప్రేమ నొసంగుము దయచే
శ్రీమద్భద్రాద్రిధామ శ్రీరఘురామా.

105

భద్రాద్రిరామశతకము
సంపూర్ణము.

  1. వంగవోలు తాలుకా పావులూరు కవినివాసమని కొంద ఱందురు.