భక్తిరసశతకసంపుటము/మూఁడవసంపుటము/సదానందయోగిశతకము

పీఠిక

ఈసదానందయోగిశతకము సర్వవిధముల వేమనపద్యముల ననుకరించుచు దురాచారములను, కపటవృత్తులను, వృథాడంబరములను, కులీనులయవివేకమును ఖండించుచున్నది. ఇందలిపద్యములందుఁ బ్రాయికముగా వ్యాకరణదోషము లున్నను శైలి మాత్రము వేమనపద్యములకంటె జటిలముగ నుంటచే కవి యక్షరాస్యుఁడని తోఁచుచున్నది. కవికాలము నివాసాదికములు తెలుపు నాధారము లీశతకమునఁ గానరావు. స్థూలదృష్టిచే నీకవి వేమనయోగి కావలివాఁడని తలంపవచ్చును. ఇందలిపద్యములు రసవంతముగ నున్నవి.

ఇదివఱకు ప్రచురింపఁబడిన సదానందయోగిశతకమునందుఁ గవియభిప్రాయమునకు వ్యతిరిక్తములగు పాఠము లుండుటవలనఁ బ్రత్యంతరసహాయమునఁ బూర్వలోపములు సవరించి ముఖ్యములగు పాఠాంతరము లుదహరించి యీముద్రణమునఁ బుస్తకమును సవరించితిమి. తాళపత్త్రప్రతులతో బోల్చిచూడ క్రొత్తపద్యము లైదు లభించెను. ఇంక ను బ్రత్యంతరసహాయమునుఁ బరిశీలింప నెన్నివిశేషాంశములు లభించునో తెలుపఁజాలము.

ఈకవినామము సదానంద వరదరాజయోగి యని శతకకవిచరిత్రకారులు వ్రాసిరి గాని యీశతకములో రెండుతావులలోఁగూడ సదానందయోగినామమే గలదు. నామాంతరము మృగ్యము. ఫణిభట్టకవి కద్వైతబోధనము సదానందయోగి గావించినటులఁ బరతత్త్వరసాయనమునఁ గలదు. ఫణిభట్టారకునికాలముగాని యతనిగురుఁడే శతకకర్త యనుట కాధారముగాని కానరాదు. ఈశతకలిఖితమాతృకలు నూఱుసంవత్సరములనాఁటివి కానవచ్చుచుంటవలనను వేమనశైలి ననుకరించుటవలనను బదునాఱు పదునేడు శతాబ్దములమధ్య నీకవి యుండెనని యూహసేయవచ్చును. ఈశతకమును బ్రత్యంతరసహాయమునఁ బరిశీలించుటయు నితరశతకములు కవికాలము పరిశోధించుటకు నావశ్యకము.

శ్రీరస్తు


సదానందయోగి శతకము



1. శ్రీమహోన్నత విజ్ఞాన సిద్ధి నొసఁగు
సద్గురుస్వామి పాదాంబుజములు తలఁచి
సకలతత్త్వార్థ సంగతుల్‌ సంగ్రహించి
గీతశతకంబు రచియింతుఁ గీర్తి వెలయ
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

2. ధరణిలోపలఁ దనరారు తత్త్వములకు
నవ్వలై యున్న తత్త్వంబు నెవ్వఁ డెఱుఁగు
శివుఁడు గురురూపమై వచ్చి చెప్పకున్న
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

3. పుట్టుచావులు రెండును బొరయనట్టి
నిర్మలజ్ఞానసంపన్ననిష్ఠ గలుగు
తెరువుఁ గల్పించునాతఁడె గురువరుండు
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

4. బట్టబయలైన యీ పరబ్రహ్మమహిమ
దేశికస్వామికృప లేక తెలియరాదు
యెన్నిచదువులు చదివిన నేమిఫలము?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

5. సకలశాస్త్రంబు లెల్లను చదువువారు
చదువుకోనట్టివారితో సమముగాదె,
గురుముఖంబున ననుభవం బెఱుఁగకున్న?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

6. దేవపూజల గొడవేల? తీర్థమేల?
చెలఁగి యష్టాంగయోగముల్‌ సేయనేల?
గురుముఖంబున క్షణములో గుఱియు గనిన
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

7. తన్నుఁదెలిసిన మఱివేఱె తనకు లేదు;
తన్నుఁదెలిసిన బ్రహ్మమై తాను నిలుచు
తన్నుఁ దెలిసిన సద్గురూత్తముని వలన
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

8. సద్గురువు గల్గునటమీఁదఁ జదువులేల?
నిజమెఱింగినపిమ్మట నిష్ఠలేల?
సర్వమును దానయై యున్నసరణి గాదె?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

9. తత్పదంబును నదియపో 'త్వం'పదంబు,
అసిపదంబును నీరెంటి కైక్యమగును;
దెలియు శివయోగి, మూఢుండు దెలియలేఁడు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

10. సకలనైష్ఠికములు గాదు, శక్తిగాదు,
జీవుఁడును గాదు, పరమునై చెలఁగు బ్రహ్మ
మద్భుతానంద మైనట్టి యనుభవంబు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

11. రూపులకునెల్ల రూఢియౌ రూపు గాక,
వెలుఁగులకునెల్ల వెలుఁగునై వెలుఁగుఁగాక
చెలఁగు ననుభవవేద్యమై చిద్ఘనంబు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

12. లోను జూడంగఁ జూడంగ లోనుగాదు;
బయలు చూడంగఁ జూడంగ బట్టబయలు;
బైటలోపలఁ బూర్ణుఁడై పరఁగుశివుఁడు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

13. శివుఁడు జీవుండు రెండువస్తువు లటంచు
నిచ్చ నెంచిన సాయుజ్య మెట్లు కల్గు?
శివశివా భేద మన్నది సేయరాదు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

14. నీట వెలసినలవణంబు నీటఁ గలియు
నీరు గాకుండ దారీతి నిశ్చయముగ;
శివుని దలఁచిన జీవుండు శివుఁడు గాఁదె,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

15. సత్తు నెఱుఁగ దసత్తు దా జడముగాన,
సత్తసత్తువు నెఱుఁగ బ్రసక్తి లేదు;
అట్టి సదసత్తు లెఱిఁగెడి దాత్మ సువ్వె,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

16. సత్తుఁ గూడినయపుడెల్ల సత్తె యౌను;
సత్తు లోఁగూడ మఱి తానె సత్తు వౌను;
గాన జీవుండు సదసత్తుగాఁడె తలఁప?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

17. సూర్యదివసాదికంబులు చూచుకొన్న
నాస్పదంబును బుద్ధికి నాస్పదంబు,
పెక్కుభ్రమలను నెందుకుఁ జిక్కినారు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

18. కలదు కల దన్నవారికి కలదు జగము;
లేదు లే దనువారికి లేదు జగము;
కలిమిలేములు మాయకుఁ గలగుణములు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

19. మతము లెన్నైనఁ గలవు భూమండలమున;
మతము లన్నియు సామాన్యమాయ సువ్వె;
మతము విడిచిన మదికి సమ్మతము గాదె?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

20. తనకు దేహాభిమానంబు తఱిఁగెనేని
మాయసంసార మప్పుడే మాయ మయ్యె;
మాయరూపంబులే నష్టమాయె మాయ,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

21. అతిరహస్యము మఱిబయ లనఁగ వినియుఁ
దెలియఁజాల రదేమొకో తేటపడఁగ?
మాయ బలమైగదా యిట్లు మఱుఁగుచేసె,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

22. మనసు మాయని తానును మచ్చికాయె;
మనసు మాయగదా యన మాయ మాయె;
అందు నేమాయె? సత్తె యానంద మాయె;
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

23. గాలి నిలిచినఁ గలదండ్రు కాయసిద్ధి;
కాయమును గాలియును రెండు మాయ గాదె?
కాయ సిద్ధౌట తత్త్వంబుఁ గనుట కాదె?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

24. కాయ సిద్ధైనవారినిఁ గన్నవారు
నున్నవారును గలరె యీ యుర్విలోనఁ?
గాయ సిద్ధులు తొల్లింటికథలు సువ్వె,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

25. తనువు గలుగుట ప్రారబ్ధ మనుభవింప
ననుభవము దీఱి నిశ్శేష మైనవెనుక;
కాయసిద్ధికిఁ బడుపాటు గాలిఁబోదె,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

26. గరికివేళ్లును నీళ్లును గాయకసరు
నాకటికిఁ దిన్నఁ గాయసిద్ధౌటయెట్లు?
మనుజు లి ట్లేల వెఱ్ఱులై మరులుకొనిరి?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

27. చెనఁటి మానవు లణిమాదిసిద్ధులందు
మోహమొనరింతు; రదికాదు ముక్తిపథము;
పరమవిజ్ఞానపరు లిట్లు భ్రమలఁబడరు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

28. పుట్టగోఁచులు పెట్టి, విభూతిఁ బూసి
జడలు ముడివెట్టి, కడసము చంకఁ బెట్టి,
గుహల గూర్చుండి, ప్రాణాలు కుదియఁబట్టి
తనువు పీడింపఁ దత్త్వంబుఁ గనుట యెట్లు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

29. కరకమండలమును బట్టి కావికోకఁ
బూనునంతనె ముక్తిని బొందుటెట్లు?
సమయవర్ణాశ్రమాదులు భ్రమలుకావె?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

30. సప్తకోటిమహామంత్రజాలమెల్లఁ
జిత్తవిభ్రమ; మదిగాదు శివపదంబు;
నభ్యసింపఁడు దాని మోక్షాధికారి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

31. హెచ్చరిక గల్గి మానవుఁ డిహపరార్థ
ఫలము లాసింపకను బ్రహ్మపదముఁ గోరి
నిర్గుణాష్టాంగయోగంబె నెఱుఁగవలయుఁ
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

32. సగుణచింతన, మణిమాదిసాధనంబు,
నిర్గుణోపాస్తి, కైవల్యమార్గ మిదియఁ
గాన, నిర్గుణయోగంబె పూనవలయు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

33. మంత్రలయహఠ మనియెడుమాయఁ విడిచి,
రాజయోగంబు సద్గురురాజువలనఁ
దెలియ నేర్చినవాఁడెపో దివ్యయోగి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

34. ముక్కుబిగియించుకొని, గాలి మూటగట్టి
వట్టి పసలేనిపెనుబయల్‌ ప్రాఁక నేర్చి
యద్భుతానందమును బొందునతఁడె యోగి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

35. లోకదృష్టియు మఱియు నాలోకదృష్టి
గానరా దిందు; నీరెండుఁ గాననట్టి
భావదృష్టిని గలవాఁడె భవ్యయోగి
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

36. వెలుఁగుకవ్వల వెలిఁగెడు వెలుఁగుఁజేరి,
బయలుఁ గొనిపోయి యచ్చట బయలుఁగలిపి,
నిశ్చలత నున్నయతఁడెపో నిత్యయోగి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

37. ఒక్కటే లేదు మఱి వేయి లెక్క లేదు;
నొండు రెండును గాక దా నిండియుండు
నట్టితత్త్వంబుఁ దెలిసినయతఁడె యోగి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

38. చూడకే చూచు జగమెల్లఁ జోద్యమంది;
చావకే చచ్చు నత్యంతసరసలీల;
చేయకే చేయుఁ గ్రియలెల్ల సిద్ధయోగి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

39. చూచువాఁడును, మఱి చూపు, చూడఁదగిన
వస్తువులు లేక, సమరసత్త్వమునఁ దలఁపు
నిలుపనేర్చినవాఁడె పో నిత్యయోగి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

40. కర్తయై యుండియును మఱి కర్త గాఁడు
భోక్తయై యుండియును మఱి భోక్త గాఁడు
అట్టితత్త్వంబుఁ దెలిసినయతఁడె యోగి
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

41. తలఁపు మఱపను వస్తుద్వితయము విడిచి,
శుద్ధమైన యవస్థందు సుస్థిరముగ
నిలిచి, యనుభూతిఁ గనువాఁడె నిత్యయోగి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

42. మూఁడు ద్రోవలలోపల ముఖ్యమైన
నడిమిత్రోవను జని, లోన నాగకన్య
నూరడించినవాఁడె పో యుచిత యోగి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

43. ఎచట నేవంకఁ జూచిన నచటనెల్ల
దొడరి చిన్మయలింగమై తోఁచవలదె;
యదిగదా యోగసిద్ధికి నాలయంబు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

44. చదువవచ్చును వేదశాస్త్రంబులెల్ల;
బలుకవచ్చును తానెపో బ్రహ్మ మనుచు;
ననుభవజ్ఞుఁడు గానేర్చు టదియె యరుదు
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

45. పూయవచ్చును బట్టెఁడు బూడిదైన;
వేయవచ్చును రుద్రాక్ష వేలసంఖ్య;
సేయఁగా రాదు మనసు సుస్థిరముగాను,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

46. ఒక్కఁడే పోయి యడవుల నుండవచ్చు;
నీరుద్రావుచు బ్రాణము ల్నిలుపవచ్చు;
రాజయోగంబు సేయంగ రాదుగాక,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

47. వనధి లోఁతని చెప్పఁగా వచ్చుఁగాక;
మునుఁగవచ్చునె మేనెల్ల ముద్దగాను
సోఽహమనవచ్చుఁ; దన్నుఁ దాఁ జూచుటరుదు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

48. ఎవ్వరైనను బరమార్థ మిట్టి దనుచు
తెలియనేర్తురె తమలోన తేటపడఁగ?
నుత్తమజ్ఞాని శివయోగి యుండుఁ గాక,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

49. స్నానమొల్లఁడు, దేవతార్చనము సేయఁ
డమల విజ్ఞానసంపన్నుఁ డైనయోగి;
లోకులకుఁ దెల్సునే వానిలోనిగుట్టు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

50. తమనిజం బేమి యెఱుఁగరు ధాత్రిజనులు;
మృచ్ఛిలాకాష్ఠతామ్రనిర్మితములైన
దేవతలఁ గొల్చువాఁ డెట్లు తెలియనేర్చు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

51. ఱాళ్లఁ జేసిన వొకకొన్ని రాగికొన్ని,
మ్రానఁ జేసిన వొకకొన్ని, మంటిఁ గొన్ని;
యిట్టిదేవుళ్ళు ముక్తీయ నెట్లు నేర్తు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

52. మండలాంతర దేదీప్యమాను శివుని
మూఁడు నాలుగు పాఁతల ముడిచి ముడిచి
యఱుతఁ గట్టుదు రొకకొంద ఱల్పమతులు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

53. కులము రూపును గుణమును గూలఁబెట్టు
నరుఁడు శివయోగివిద్యలు మరగెనేని;
చెడ్డసంసార మైతేను చెప్పనేల?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

54. బ్రహ్మవిద్యకుఁ దనయింటి ప్రజలు చాల
సమ్మతించిన గృహమందె సలుపవలయు;
నట్లు గాకున్న మఱి యింటియాస లేల,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

55. మనుజమాత్రుండె శివయోగి మహితకీర్తి
యఖిలజగములు తానైన యట్టివిధము
దృష్టముగఁ జూచు ననుభవదృష్టిచేత
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

56. పరమసుజ్ఞాననిధిఁ జూచి పాపజనులు
దమకు సరియైనవారుగాఁ దలఁతు రెపుడు
వారు గన నేరరెట్టి నిర్వాణమహిమ
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

57. కట్టఁగావచ్చు మృదువైన కావికోకఁ
బెట్టఁగావచ్చుఁ బాదుక లెట్టివైనఁ
బట్టఁగారాదు మనసింత పాఱనీక
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

58. కూడు దినరాదటంచును గొందఱయ్య
లేలకో వెఱ్ఱిత్రోవల నెఱుఁగలేరు
కూడు విడిచిన విడుచునా కుటిలబుద్ధి
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

59. పాలు నీరును నొక్కటై పరిణమించు
కరణి బ్రహ్మంబులో మాయ గలసియుండు
చారు శివయోగి తెలియు హంసంబు పగిది
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

60. నిత్యనైమిత్తికాదులు నెఱపకున్న
పాతకం బని వెఱచునే పరమయోగి?
పోతురాజుకు నేల నీభూతశంక?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

61. ఊరు మేలైన నుండును యోగివరుఁడు;
తోడు మేలైన బోవును తోడుతోనె;
వాని కెక్కడ లోకంబువారి నడత?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

62. తన్నుఁ దాఁ దెల్సి జగమెల్లఁ దానయైన
మర్మ మెఱుఁగంగఁ జాల రీమందమతులు;
గడవఁజాలరు సంసారఘనపయోధి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

63. ఏమి భుజియింపఁ గోరిన, నెచట నున్న,
నెందుబోయినఁ, దన కెందు నేమికొదువ
పూర్ణభావంబు తనయందు బొడమియున్న?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

64. బుద్ధిజాడ్యులు తమలోనఁ బూర్ణమైన
నిండుబంగారమున వన్నె నిలిచినట్లు
కఠినమై యున్న బ్రహ్మంబు గానలేరు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

65. చదువులేఁటికి? దేవతార్చనము లేల?
నిత్యనైమిత్తికాదుల నియమ మేల?
స్వానుభూతి రసామృతాస్వాదనులకు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

66. పూజలును మంత్రకథలును బుస్తకములు
యంత్రజాలంబు యోగంబు తంత్రములును
కడఁగి బ్రహ్మానుభవవిఘ్నకరము లరయ
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

67. అనుభవము చాల కొకకొంద ఱవనిలోన
సిద్ధయోగుల మనుకొంద్రు సిగ్గులేక;
తేటతెలివిగఁ ద మ్మేమి తెలిసినారు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

68. స్మార్తకర్మంబుఁ గొందఱు సలుపలేక

  • బ్రహ్మవేత్తల మనుకొంద్రు బైసిమాలి;

అట్టిజనులకుఁ గైవల్య మెట్టు గలుగు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

  • పరమయోగుల

    69. అనుభవముఁ దెల్పనేరని యతని చేత

చారు సుజ్ఞానమును విన్నవారిప్రజ్ఞ
అంధకుడు చూపుతెరువున నరుగుకరణి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

70. విశ్వమున నూట వేయింట వెదకి చూడ
నొక్కశివయోగి దొరకుట యెక్కు వరయ
కల్లయోగుల కేమి పెక్కండ్రు గలరు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

71. బ్రాహ్మణు లటంచుఁ గొందఱు పలుకు టెట్లు?
బ్రహ్మ నెఱుఁగంగనేరఁక బాఁపఁడగునె?
బ్రహ్మనెఱిఁగినవాఁడె పో బ్రాహ్మణుండు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

72. వేషధారులఁ జూచి వివేకు లైన
బ్రమయుచుందురు వేషంబుబలిమిఁ జూచి;
తెల్లముగ లోనిగుట్టెల్ల దేవుఁ డెఱుఁగు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

73. వేదశాస్త్రపురాణాది విద్యలెల్లఁ
జదివి పాండిత్యములు సేయుజనుల కెల్ల
ననుభవజ్ఞాన మెక్కడి దరసిచూడ?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

74. అనుభవజ్ఞానియైనట్టి యమలమూర్తి
తన్నుఁ బ్రకటన సేయఁడు ధాత్రిలోన
నివురు నుముకయు నిండిననిప్పురీతి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

75. తాను నిర్మలుఁడై యుండి తనకు లేని
యంటుఁ గల్పించుకొని తీర్థ మాడనేల?
మనము పోయెడిపోకలు మాన్ప వశమె?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

76. మనసు వెగ టౌట యెఱిఁగిన జనము లెల్లఁ
బాఱవిడి చూరకుందురు పట్టులేక
వెఱ్ఱివాఁడైన సంకెళ్లువేయవలదె!
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

77. బ్రహ్మనిష్ఠాంగపరుఁ డైనపావనునకు
తీర్థయాత్రల భూమెల్లఁ దిరుగ నేల?
తాను గలచోట సకలతీర్థములు గలవు!
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

78. *మాంసమును చీము నెత్తురు మలిన మైన
తోలుఁ గొనిపోయి నీళ్ళలోఁ దొలిచినపుడె
శుద్ధిగాదది, మనఃపరిశుద్ధిగాని
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

79. మఱియు సర్వేంద్రియములకు మనసు రాజు;
మనసునకు రాజు తలఁపంగ మారుతంబు;
మనసు మారుతమొకటైన మలయు సుఖము,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

80. మనసు నిల్పంగ నిలుచును మారుతంబు;
చూపు నిలుపంగ నిలుచును స్థిరసుఖంబు;
స్థిరమనోదృష్టి నిల్పినఁ జేరు ముక్తి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

81. పాలు నీరును రుచియును బరఁగునట్టి
జీవుఁ డనుమాయ శివుఁడును జేరియుండు!
మొదలఁగడపట నిత్యుండు మూఁడువగల
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

  • కష్టమాంసంబు నెత్తురు గప్పుకొనిన, తోళ్ళు గొనిపోయి ముంతురు నీళ్ళలోన

    82. సత్త్వ మిది యని తెలిసియె జనులతోడఁ

జెనకి పలుమాఱు వాదము సేయఁబోక
మౌనవృత్తిని జరియింప మంచితనము,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

83. ద్వైత మనుచును గొందఱద్వైత మనుచు
వాద మొనరింతు రెఱుఁగక; వారు భువిని
కలిమియై నట్టితత్త్వంబు గానలేరు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

84. మానవులు వార లెంత నజ్ఞాను లైనఁ
గడఁపజాలరు ప్రారబ్ధకర్మఫలము;
లిందుకై కాదె తనువుల నెత్తవలసె?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

85. *జనుఁడు దా నవివేకియై సాహసమునఁ
బట్టు దుర్దానములు మఱి పాపమనక;
వాని నన నేల! గతజన్మవాసన యది,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

86. ఒడలు సర్వేంద్రియంబుల కునికి గాదె?
యొడలు గలవానికిని గాదె యోగవిద్య?
యొడలు చెడినట్టివానికి యోగ మేల?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

87. బంధ మెచ్చటనుండి సంప్రాప్త మయ్యె?
ముక్తి యేవంకనుండియు మొలచివచ్చె?
బంధముక్తులు రెండును భ్రమలుసూవె,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

88. ఇహపరాపేక్షలును రెండు నెంచిచూడ
నినుము బంగారు సంకెలలే తలంపఁ
గోర రిట్టివి మోక్షాధికారు లెపుడు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

  • శాస్త్రవిదుఁడయ్యు మనుజుండు

    89. గుహలఁ జొచ్చుక కొందఱు కూడు నీళ్ళు

విడిచి త మ్మేమి కన్నారు వెఱ్ఱివారు?
మూల బెట్టిన దేహాల ముక్తి యెట్లు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

90. చే టెఱుంగని నలికూన జీవులెల్ల
విషయములఁ జిక్కుపడినట్టి విధము వినవె
పొంగి ఝషకము గాలము మ్రింగుకరణి,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

91. దేహ మస్థిర మని యెంత తెలిసియుండు
మంచిగతి చూచుకోలేరు మాయఁదగిలి
జీవు లజ్ఞాన మే మని చెప్పవచ్చు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

92. చాలుచాలును సంసారసంగ మనుచు,
వేఁడివెసలంటి గొబ్బున విడిచినట్లు
విడిచి మనుజుండు సద్గురు వెదుకవలయు
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

93. దేవదానవమానవ తిర్యగాఖ్య
జీవు లింతల భ్రమలచేఁ జిక్కినారు;
శక్తి బలవంత మీజగజ్జాలమునకు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

94. సుతుని నాలిని సంపదఁ జూచి చూచి
మోహియై నరుఁ డూరకే మోసపోవుఁ
దనకు నవి మీఁదఁజే టని తలఁచుకొనఁడు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

95. ఆలుబిడ్డలు తన దని యాస సేయు;
నందు నేమియు మేలు లే దరసి చూడ;
వెంట వత్తురె తనువులు విడిచిపోతె
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

96. ఆలుబిడ్డల విడిచిన నందువల్ల
మోక్ష మబ్బునె? తనుఁబట్టి ముంచుకొన్న
కల్మషము తీఱినప్పుడుగానఁ గలదె?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

97. విషయముల రోసి నరుఁడు నిర్విషయుఁడైనఁ
దనకు మోక్షంబు హస్తగతంబు కాదె?
విషయములకన్న మఱిచేటు వేఱ లేదు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

98. వేడుకై యుండు ముందఱ విషయసుఖము;
వెనుక బరువౌను సంసారవిషయసుఖము;
కాదు సుఖ మిది మీసాలమీఁదితేనె,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

99. చుట్టములుఁ దల్లిఁదండ్రులు సుతులు హితులుఁ
దాను పోయెడిగతులకుఁ దగిలి రారు,
వారు త్రోవంప వచ్చెడువారుగాని,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

100. మొదల సంసారబద్ధుఁడై మోసపోయి
వెనుక చింతించు దేహంబు విడుచువేళ;
నిట్టిజీవుండు దుదముట్ట నెట్లునేర్చు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

101. తన్నుఁ గట్టను మఱి త్రాళ్లు తానె తెచ్చి
కట్టుపడురీతి జనుఁడు సంకల్ప మనెడు
పాశజాలంబుతో వాలబద్ధుఁ డగును,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

102. చేయుక్రియ లెల్ల శివుఁడైన సేయవలయు,
తనకుఁ గర్తృత్వ మెన్నఁడుఁ దలఁపరాదు,
మనుజుఁ డపరోక్షమునఁ బొందు మార్గ మిదియ,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

103. ఏమతంబున నుండిన నేమి తప్పు?
ముక్తిగనువారి కొక్కటి ముద్రపదము;
తాను సంకల్పరహితుఁ డైతేను చాలు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

104. సకల యోగీంద్రహృద్యమై సార మమరు
వాక్యఫణితి సదానందవరుఁ డనియెడు
యోగివిరచిత వైరాగ్యయోగ శతక
మలరు నాచంద్రతారార్క మగుచు మహిని.

సదానందయోగిశతకము
సంపూర్ణము