పీఠిక
ఈశతకము రచించినది రావూరి సంజీవకవి. ఈయన పలుగ్రంథములు రచించినటులఁ దెలియుచున్నదిగాన యం దొక్కవసుదేవనందనశతకముమాత్రము లభించినది. రుక్మిణీపరిణయము సంజీవకవి రచించి కర్తృత్వము కొప్పర్తి నరసకవి కారోపించినటు లొకకథ కల్పించిరిగాని యది సంజీవకవికృత మన వీలులేదు. ఈకవి గుంటూరుమండలమునందలి రావూరు నివాసి. సాంఖ్యాయనగోత్రుఁడు. ప్రథమశాఖనియోగిబ్రాహ్మణుఁడు. ఈశతకమునందలి గుణబాణగతిచంద్ర అనుపద్యమువలన వీరనారాయణముకుందశతకము శా. శ. 1653 సరియగు క్రీ. శకము 1731 న రచించినటుల నిశ్చయమగుచున్నది.
ఈకవి సంస్కృతాంధ్రములందుఁ గవితఁ జెప్పగలవాఁడెగాక జ్యోతిశ్శాస్త్రమునందుఁ గూడఁ గుశలుఁడు. సంజీవకవి భువనగిరియందు విద్య నేర్చి కుశలుఁడై కొలనుపాక కేఁగి గోపరాజురాయనామా
త్యుని గలసికొని తనకవిత నాతని నలరించి చెంతనున్న పొదలో వీరనారాయణ విగ్రహ ముంట దెలిసికొని పద్యములఁ జెప్పి ముందునకు రప్పించెనని చెప్పుదురు. మహమ్మదీయవిప్లవసమయమున స్థానికులు వీరనారాయణవిగ్రహమును కంపలలో దాఁచఁగాఁ బిదపఁ దనపలుకుబడి నుపయోగించి రాజసహాయమున సంజీవకవి యుద్ధరించె నని గ్రహింపనగును. వసుదేవనందనశతకము చంపకోత్పలమాలికలతో మనోహరముగా నున్నది. శోకమూరి బుచ్చనమంత్రి ప్రోత్సాహమున దానిని రచించినటులఁ గవి చెప్పికొనియున్నాఁడు. వీరనారాయణముకుందశతకము గునుగుసీసములతో నలరారుచున్నది. తిక్కన సోమయాజిసీసములవలె నిందలిపద్యములు వచనమువలె నుండి భావసమృద్ధిచే నలరారుచు పఠనార్హముగా నున్నవి. ప్రతిపద్యము చివరను మనోహరమగు నంత్యనియమము గలదు.
కొలనుపాక యనునది సుప్రసిద్ధజైనక్షేత్రము. తరువాత పశ్చిమచాళుక్యులలో నొకశాఖవారికి రాజధాని. కాకతీయుల కాలమున శైవులకు నావల వెలమవీరులకాలమున వైష్ణవులకు నీక్షేత్రము వశమయ్యెను. కొలనుపాక హైదరాబాదునకు బెజవాడనుండి పోవు నినుపదారి మజిలియగు ఆలేరునకు నాలుగుమైళ్లుదూరమున నున్నది. ఇటగల వీరనారాయణాలయము దర్శనీయము. చిరకాలముక్రింద నిది జైనాలయమై యుండెను. క్రమముగా నది రూపుమాపఁబడుటచే వీరనారాయణస్వామి నిటీవల ప్రతిష్ఠించిరి. ఇప్పటికి నాలయమున జైనశాసన మొకటి దేవనాగరిలిపిలో వ్రాయఁబడినది గర్భాలయమునందుఁ గలదు. కొలనుపాకక్షేత్రవాసులు వీరనారాయణవిగ్రహము ఆలయమున కెదురుగా నున్న కోనేటిలోఁ బడిపోవ సంజీవకవి త్రోవ నేఁగుచు నీవార్త విని నూటయెనిమిది సీసపద్యములు చెప్పఁగా విగ్రహము ఒక్కొక్క పద్యమున కొక్కమెట్టు నెక్కి పైకి వచ్చినటులఁ జెప్పుదురు. ఇట్టికథలు చరిత్రముల కంతగా నుపయోగింపఁజాలవు.
సంజీవకవిపుస్తకము లింక నెన్నియో లభింపవలసియున్నవి.
ఇతఁడు బహుగ్రంథకర్త యని రుక్మిణీపరిణయమునందుఁ గలదు. ఈకవి వీరనారాయణముకుంద శతకము రచించునాఁటికి ఇరువది సంత్సరముల వయస్సుగలవాఁడై యుండును. రుక్మిణీపరిణయము రచింప (శా. శ. 1709) క్రీ. శ. 1786 లో ప్రోత్సహించెను గావున నీకని యెనుబది సంవత్సరములు జీవించి ప్రతిష్ఠ గడించె నని తెలుపవచ్చును. కవికి యోగాభ్యాసమునందుఁ గూడ నిపుణతయున్నటుల
నితనిశతకపద్యములు చెప్పుచున్నవి.
వీరనారాయణశతకము
సీ.
శ్రీలాలనవిలాసశీలసన్ధాధీర
ధీరమ్యబుధమనోదృఢవిహార
హారగోహిమసమాఖ్యా(సమజ్ఞా)సుషమోదార
దారకనీతరథప్రచార
చారణసురగణస్తవవచనాధార
ధారాళశస్త్రబద్ధశయసార
సారసారాతివంశక్షీర భవసూర
సూరతాసుకరతా సుగుణవార
తే.
వారిధితరంగ దుత్తుంగవారభంగ
భంగవటదళపుటలలదంగభాస
భూరిమయవాస కొలిపాకపురనివాస
వీరనారాయణ! ముకుంద! విశ్వతుంద!
1
సీ.
దండ ముద్దండకోదండ సంభరణవే
దండశుండాభ దోర్దండ నీకు
అంజలికుంజరపుంజరాడ్భంజన
పంజరాయతపాదకంజ నీకు
సాష్టాంగము కుచేలజటిముష్టివిభ్రష్ట
భ్రష్టయవాపహధృష్ట నీకు
కేల్మోడ్పు కింకరకిల్బిషతృణగుల్మ
తే.
శరణు శరణాగతనతైకచరణ నీకు
సురవిరోధి వరూధినీవరకుటభర
కుటిలకటుతర కుట్టాక కొలనుపాక...
2
సీ.
జయవిజయీభవ శతమన్యు మన్యుకృ
ద్దైతేయకాయభిద్దారుణరణ
జయవిజయీభవ సంయమిజనమన
స్సరసిజాతధ్యానభరణచరణ
జయవిజయీభవ సకలకకుప్ప్రాస్త
సంక్రాస్తఘనయశశ్చంద్రకిరణ
జయవిజయీభవ సంతతశ్వేతాంత
రీపకల్పద్రుకలాపశరణ
తే.
జయజయీభవ కాళియచక్రిరమణ
చక్ర చక్రభ్రమణపదాఞ్చద్విహరణ
భూరిమయవాస కొలిపాకపురనివాస...
3
సీ.
దేవకీగర్భవార్ధిక్షపేశ పరాకు
వసుదేవవంశపావన పరాకు
భృశయశోదావ్రతాభీష్టఫల పరాకు
నందమందిరకల్పనగ పరాకు
గోపకన్యామనోవ్యాపిరూప పరాకు
వ్రజబాలజాలవరద పరాకు
కంసనృశంసవిధ్వంసిబల పరాకు
రాధికాచిత్తచోరా పరాకు
తే.
ద్వారకానామపురధామవర పరాకు
భక్తగోపాయనోపాయ బహుపరాకు
భూరిమయవాస కొలిపాకపురనివాస...
4
సీ.
విన్నపము పరాకు వివిధాగమజ్ఞాన
విధివిధి ముఖసురవిసరభాసు
ర సరసవాక్యపనంకుకల్ జాలవు
నిను గొనియాడఁగా నని మనీషి
జనములు బలుకఁగ వినియును బూనితి
నిన్ను వర్ణింపఁగాఁ గన్నతండ్రి
యదియేమొకాని హృదన్తరంబున భవ
త్కళ్యాణతరగుణగణము నిండి
తే.
పొరలి ఘోషించుకతన నొప్పులు గలిగిన
తప్పులు గలిగిన గ్రహింపఁదగు కృపాచ
మత్కృతిని మత్కృతిని గుప్తమాననీయ
కుతలసురవరామృతపాక కొలనుపాక...
5
సీ.
కృష్ణ మాధవ హృషీకేశ కేశవ జనా
ర్దన నరహరి యుపేంద్ర యదునంద
న పరమేశ్వర జగన్నాయక దామోద
ర గరుడవాహ వరద వికుంఠ
పతి విష్ఠరశ్రవ ఫణిరాజశయన గో
వింద రక్షితముచికుంద పుండ
రీకాక్ష శార్ఙ్గి శౌరి యధోక్షజ వనమా
లి గదాగ్రజ సురేశ నగధర ముర
తే.
దమన పీతాంబర యటంచు మిము ప్రతిపద
మునఁ బలుక దయసేయవే ముగ్ధపాక
దళన మణితసురుచిపాక కొలనుపాక...
6
సీ.
కృష్ణాయ విష్ణవే జిష్ణవే హరయే స్వ
యంభువే శంభవే హారిణే త్రి
విక్రమాయ స్వభువే విభవే చక్రి
ణే శంఖినే శార్ఙ్గిణే దివే భు
వే! మాధమాయస్థనిష్ఠాయ భక్తరా
యేగరిషాయ సురేశ్వరాయ
యాతుద్విషే నవనీతముషే శ్రీసు
రాజే భగవతే ధరాధరాయ
తే.
మునివరాయచ తుభ్యం నమో నమో య
టంచు నతిసల్పెదను పరా కతులనంద
కలవితారిశిరశ్శాక కొలనుపాక...
7
సీ.
గజరాజు నేలిన కరుణ ద్రుపదకన్య
కను మనిచిన యనుకంప హరిణ
కాంతను బ్రోచిన కారుణ్యము విభీష
ణుని బ్రతికించిన నెనరు గనక
కశిపుగుమారుని గాచిన ఘృణ గాక
దనుజు బాలించిన దయ కుచేలు
సాకిన గృప దాపసప్రవరులరక్ష
వెలయు ననుక్రోశము లవమైన
తే.
పాదసేవకు నామీఁదఁ బరవఁజేయ
వే దయాసుప్రసాద వినోదలలిత
గురుకటాక్షదృగస్తోక కొలనుపాక...
8
సీ.
కన్నవాఁడా! నీవు కరుణాకలితదృష్టి
చేత ననుగ్రహించిన నొకింత
రోషవేషకటాక్షరూక్షవీషను నిగ్ర
హించిన భళిభళీ దృణము మేరు
వగును మేరువు దృణ మగుగదా యని దేవ
ర యనుగ్రహము గావలయు నని యెద
నే దలంచెద నెవ్వనికి ననుగ్రహ మిచ్చ
యింతు వానిధనము నే హరింతు
తే.
ననెడుమాట దలంచక నక్కు చేలు
గన్నరీతిని గనవె నాకథ విధాతృ
గోపతిరథస్తుతశ్లోక కొలనుపాక...
9
సీ.
గట్టిగా నీపాదకమలమే పట్టితి
సత్యము సత్యము సందియంబు
లేశమైనను లేదు లేదు దీనికి నగ్ని
ముట్టెద బామును బట్టెద నిఁక
నేమి సర్వజ్ఞుఁడ నీ వెఱుంగవె నాయె
డ పరాకు గాకయా యిపుడు పాల
ముంచెదవో నీట ముంచెదవో నీకె
తెలియు ననన్యగతికుఁడ నోరుల
తే.
వేఁడ నీవాఁడ నోమాయలాడ స్వభుజ
మండలితధనురుద్గతకాండభాను
కుండలితదైత్యఘనఘూక! కొలనుపాక...
10
సీ.
దయగలవాఁడవు ధర్మరక్షకుఁడవు
పరచుశాంతుఁడవు సుభగుఁడవు సద
సద్గుణవీక్షావిచక్షణుఁడవు నఘ
టనఘటనాపటుఁడవు నజాండ
ధారివి శ్రీసతీధవుఁడవు నిన్ బోలు
జేజేలు గలరె యాశ్రితుల దీన
జనులను రక్షింతు నని కంకణముగట్టి
యుండువాఁడ వఁట యోహో విచిత్ర
తే.
మగునె నావంటివానికు య్యాలకింప
సాదరాలింగితశ్రీవిశాలమసృణ
కుంకుమాకల్పకుచకోక కొలనుపాక...
11
సీ.
తల్లివి దండ్రివి దాతవు త్రాతవు
భ్రాతవు నేతవు బంధుఁడవు స
ఖుఁడవు నిల్వేల్పవు గురుఁడవు నన్నియు
నీవ యన్య మెఱుంగ గావున భువి
నను బోలువార లెందఱు నీకు నీవంటి
ఘనుఁడు నా కొక్కఁడెగాని యైన
దీనాశ్రితత్రాణ దీక్షాధురంధరుఁ
డవు దయాబంధురుఁడవు నెనరు జి
తే.
లికెడుజూడ్కిని నన్ జూడలేక దేవ
కీసతీవసుదేవసుకృతనితాన్త
ఫల నవారూఢఘనతోక కొలనుపాక...
12
సీ.
వలరా కటారులవంటి మిటారుల
దరదము లసమదద్విరదము లన
గరముల శిబికల గబ్బియరబ్బీకు
రంగములగముల రత్నముల క
జతహేమములజరీజరబాబునగల వ
గఁ గులుకు తొడవులఁ గావలెనని
యడుగలేదుగదా నిరంతర మెదనెడ
పడని దేవరవారి యడుగుఁదమ్మి
తే.
కవనెరయు భక్తి యొక్కటేగాని యిపుడు
గోపగోగోపనార్థదుర్వేపినశిఖి
గిళనచాతుర్య నిర్భీక కొలనుపాక...
13
సీ.
అలరి కుచేలుని యకుచేలుఁ జేయు ని
దానరహిత జాయమానమైన
నీకటాక్షమున రానీకడానీమొలా
మాజిల్గునగలు నంబరసుసరిఫి
ణీలు నూటపదార్వరాల చౌకట్లు కా
వా గుఱాలును జాళువాకడెములు
గ్రాలుము త్తెముల తురాయి మొద ల్గల
వ్యంజనముల రుచిరంజనముల
తే.
వలదఁటన్నను బోనె రావలసియుండె
నేని నిజనయనాంచల నిభృతలుఠిత
దరుణ కరుణాఝరీతురీయాంశఘటిత
కుంజర నిరంజన శ్రీక కొలనుపాక...
14
సీ.
దేహ మనిత్యము తెలియరా దెట్టిదు
ర్మృతిని బొందునొ యేమిగతిని జెందు
నో నిజమాడెద నేను జేసిన పాత
కము లనేకము లటు గావున నను
చేకొని గావ నీచిత్తము నాభాగ్య
ము మరేమి నానియమములుఁ గనఁగ
నక్కట యాపద మ్రొక్కులు సంపద
మఱపులుగాని యుష్మత్పదాబ్జ
తే.
యుగళసద్భక్తి నిగళసంయుక్తతఁ దగు
లఁగ సదా ప్రవర్తించదు లలితసామ
కలితగానకళాచ్ఛేక కొలనుపాక...
15
సీ.
ఇపుడు కాచిన మంచిదే కావకున్నను
మంచిదే నిన్ను నేమించి పట్టి
నట్టి పట్టువదల నహహ మదీయసం
ధాచమత్కృతి నిబంధనము జూడు
మా తహతహ జెందినా రుజావస్థను
బొందినా లేమిని బొరసినా జ
రావికృతులను బెరసిన విషయవాస
నల దెరలినను సిరులను బొరలి
తే.
నను పతివ్రతవితము పంతము లిఁ కేల
చుంబితారుణబింబాభ సూర్యదుహితృ
కుటిలకేజ్యోష్ఠబంధూక కొలనుపాక...
16
సీ.
ఎన్నిజన్మము లెత్తి యేమేమి పుణ్యముల్
జేసుటనో భవద్భాసురాంఘ్రి
దాసుల నెందఱి దాయుటనో మను
ష్యశరీరధారి నై యందు స్నాన
సంధ్యాదికక్రియాచరణభాజనమైన
భూసురత్వంబును బొంది పిదప
దివ్యముక్తిదమైన దేవరసన్నిధి
పెన్నిధిరీతి గల్పించుకొంటి
తే.
నింక విడుతునె విడచిన నీభవంబు
శంక గడుతునె కావుము లెంక నైతి
కృఙసురాసువిలుంటాక కొలనుపాక...
17
సీ.
పాపము ల్బాప నీవంతు సుకృతగతి
బూన నావంతు నజ్ఞానకలన
సడలింప నీవంతు జ్ఞానముద్రము బ్రవ
ర్తింప నావంతు నీదివ్యచరణ
కమలయుగళభక్తి గలిగింప నీవంతు
దినదిన ముబ్బి కీర్తనము జేయ
నావంతు భూతదయావృత్తి మెలఁగింప
నీవంతు సర్వంబు నీవ కా ద
తే.
లఁచఁగ నావంతు నొండెడ లాభమైన
లోభ మొదవదు పిదప నాలోన విధుత
ఖలఖచరవిద్విషల్లోక కొలనుపాక...
18
సీ.
గండుతేటులలీల గ్రాలుముంగురులు భు
గభుగబరిమళించు గస్తురితిల
కపునెన్నుదురు చొక్కటపుచెక్కిళులు మావి
తలిరుబో ల్మోవి మొసళులహొయలు
గులుకుప్రోగులు సిరి బెళుకు వీనులు సింగి
ణులరంగు నగుకన్బొమలు చకచక
దళుకు లొలుకు తెలిదమ్మిరేకులవంటి
కన్నులు సంపఁగి కళికబోలు
తే.
నాసికము మొల్క లెత్తెడు నగవు గలిగి
నట్టి నీమోముఁ జూపవే యసురవిసర
దళనచంచచ్ఛరానీక కొలనుపాక...
19
సీ.
ఆపద వచ్చినయప్పుడు నరులచే
దొరకినయప్పుడు ద్రోవ నొంటి
జరుగునప్పుడు గ్రహచారముఁ జాలని
యప్పుడు విషవృశ్చికాహిపీడ
దొడరినయప్పుడు దుస్స్వప్నమైనయ
ప్పుడు నాభిచారముల్ బొరయునప్పు
డవనిరుజాపీడ లంటుకొనినయప్డు
భూతగ్రహంబులభీతిఁ దోఁచు
తే.
నప్పుడు సముద్ధరించు నిర్యంత్రణస్వ
తంత్రము త్వదీయకృష్ణాఖ్యమంత్రము బల
తరనరకదైత్యజైత్రసాత్రాజితీచ
కోరనేత్రాయుతసమీక కొలనుపాక...
20
సీ.
అన్నవస్త్రాదులకై దురాశాపాశ
ముల గట్టువడి మహీశులను గీర్తి
సాంద్రులు శౌర్యనిసంద్రులు దానరా
ధేయులు సూరివిధేయు లనుచు
సన్నుతుల్ జేయుచుఁ జరమదశాక్రాన్త
జంతువు వింత వహింతుగాని
నిను మహాప్రభుని కుజనశిక్షకు సుజన
రక్షకు నీప్సితప్రదుఁ దలఁపదు
తే.
నెమ్మది ద్రిశుద్ధిగా నెరనమ్మియుండు
ట లవమైనను లేదు షోడశసహస్ర
కువలయదళేక్షణాభీక కొలనుపాక...
21
సీ.
రాకట్టు మేలుంగరముల రంగయి ప్రవా
ళములఁబోలిన యంగుళములు తార
కలరీతిఁ బొల్చి లోపల రక్తిమఁగల న
ఖములుఁ బద్యాదిరేఖలఁ దనర్చి
బాలార్కబింబడంబములైన పాణులు
వలయకీలితమణిబంధములు ఘ
నాఙ్గదఘటితమధ్యము లున్నతాంసము
లు పృథుప్రకోష్ఠములు గలిగియు వి
తే.
జయ రమామంగళప్రశస్తములగు భవ
దీయహస్తముల మది నుతింతు హృతచ
టులజటిపటలభవశోక కొలనుపాక...
22
సీ.
ధగధగ మెఱయు నిద్ధాకిరీటము మిల
మిల మనుమకరకుండలములు ధళ
ధళ మనుకౌస్తుభదామము మిసమిస
కళగుల్కు సందిటికడెములు చక
చకలీను గరుడపచ్చలకంకణములు ని
గనిగరుచుల మించు కాఞ్చిధిగధి
గలయందమైనయందెలు గలదేవర
శ్యామలకోమలధామలలిత
తే.
దేహము మదాత్మమోహము దీర నెంతు
త్రాయమాణవిలాస నేత్రాయమాన
కువలయహితాంబరాలోక కొలనుపాక...
23
సీ.
ఆరుణపల్లవముల బురణించు వ్రేళ్లు హీ
రములఁబోలెడు నఖరములు కమఠ
ములఁబోలు పాదాగ్రములు సొగసగు గుల్భ
ములు వటకుజఫలముల సిరి కడ
కులజేయు మడిమలు హలకులిశాదిరే
ఖలు బొల్చుపార్ష్ణులు గలుగుదేవ
రచరణముల సరఖచరచారణ ముఖ
రశరణముల విహృతశతధృతివి
తే.
పులతరాంతఃకరణములఁ దలఁతు వల్ల
వజనవరపల్లవాధరా పల్లవాభి
కలన విలసిత హేవాక కొలనుపాక...
24
సీ.
సౌరభ దుర్ముఖ జలజభ్రమాగత
భ్రమరమాలికలు విభ్రమణసమయ
నయనాంచలాంచద్ఘృణాసుధాంబుధిలుఠ
ద్వీచికలు వదనవిమలచంద్ర
చంద్రికలమహాభ్రగేంద్రనీలవిశాల
మేచకచకచకద్రోచిరోమ
సంహననాలకజాలక జలదాస్త
లలదచ్ఛచంచలాలతలనీదు
తే.
విపులతారకరక్తాంతవీక్షణగల
దమృతశీతలధారాకటాక్షతతుల
గొలుతు వక్షస్సలక్ష్మీక కొలనుపాక...
25
సీ.
అక్కున ధగధగ లాడుకౌస్తుభము నా
సను నిగనిగ మనుమినుకు జినుకు
రతనము నఱుతను రహిమీఱ ధిగధిగ
లలరు మిన్నాముత్తియములసరము
నుదుటను గమగమ నుదుటువలపు గుల్కు
కస్తురితిలకము కరముల జిగి
యొలికెడు వలయము తొడలను వాసించు
హరిచందనము పాణియందు వరలు
తే.
మురళి గనుపడ వచ్చి నామ్రోల నీవు
నిలుతు వెన్నఁడు నే నిన్ను బిలుతు నెన్నఁ
డలఘుకరుణాంకితాలోక కొలనుపాక...
26
సీ.
కురుల జిగి నుదుటి నెరతనము బొమల
కళ వీనుల చెలువు కన్నుల వగ
ముక్కు చక్కదనము మోవి ఠీవి పలువ
రుస సొంపు చెక్కుల పని చుబుకపు
హరువు కంఠము మేలు సంసముల సొబఁగు
కేల్దోయి సొగసు కెంగేలు జతహొ
యలు నెద పొంకము నాకు సౌరు కటి మి
టారము పొక్కిలి తీరు తొడల
తే.
పొలుపు పిక్కల సిరి యడుగుల మెఱుంగు
గోళ్ల రంగుఁ జెలంగు నీగోపవేష
కలనఁ జూపవె యరలేక కొలనుపాక...
27
సీ.
నీవు లాలించిన నెలఁతుక కడకంటి
దృష్టికి వలసిన తెఱవ నీను
దువులకు దక్కిన యువిద నీగానము
నకు తమిజెందిన నాతి నీహొ
యలునకుఁ జిక్కిన చెలువ నీసరసత
కు విరాలి యొదవిన గోతి నీన
గవుల కెద గరంగిన వెలఁది నీమహా
లీలకు బ్రమసిన లేమ దక్క
తే.
యన్య యొక్కతె లేదయ్యె నట వ్రజంబు
నందు నీమోహనాకృతి యౌర నిజసు
గుణతిలకితలోకాలోక కొలనుపాక...
28
సీ.
ఒకయింటిలో నాడి యొకయింటిలోఁ బాడి
యొకకడ నక్కి యొక్కకడ వెన్న
మెక్కి యొక్కెడ మించి యొక్కెడ నాభీర
భీరువుల గలంచి వేఱొకట పృ
థునవోద్ధృతక్షీరదుగ్ధతక్రాదిశుం
భత్కుంభముల వకావకలుగా న
వియ రువ్వుచును వికావికలుగా నవ్వుచు
ను జెలంగి వల్లవవ్రజమునందు
తే.
జాల కోలాహలముగాఁగ హేలఁదేలు
బాలు నిను గొల్తు సేవకపటలహృదయ
జలరుహాన్తరలసదోక కొలనుపాక...
29
సీ.
ఒకకేల మునికోల నొండుచే పగ్గముల్
బాగుగాఁ దాల్చి జిరాగుఱాల
ధే యని రొప్పుచు దిరుగుడుపడనీక
కౌరవయుద్ధరంగమున దెలిహు
మారావజీరహం వీరుసారథితాప్ర
థితకర్మము వహించితివి సమస్త
లోకాధిపతికి నీ కీకృపణత్వము
జెల్లునె యౌర నీశ్రిత సముద్ధ
తే.
రణనిబద్ధప్రయత్నము గణుతిసేయఁ
గవలెఁగాక నిజాశ్రితభవదురన్త
జలనిధితరణ పటునౌక కొలనుపాక...
30
సీ.
అధ్యాత్మవిద్యారహస్యము తావక
పాదపాధోరుహద్వయవిధేయ
నిస్తరళధ్యాననిరతి గంగాది త
రంగిణీతీర్థాచరణము నోద
నాచ్ఛాదనార్జనహాటక ఘోటక
ప్రభృతి విహాయిత పటిమ యించు
కైన నాయంద లేదయ్యె త్రివిధపాత
కంబులు నేరీతి గడుపువాఁడ
తే.
నీభవమె రోఁతయై యున్న దిఁక పునర్భ
వంబు లేకుండునట్టి యుపాయ మేమి
బాణనాగాహృతి వితతబాణవీర
ఘోరసేనాలపనభేక కొలనుపాక...
31
సీ.
నేఁడు నేఁడా నేను నీవాఁడ నౌట నా
కేడుగడయ యౌట నెంచ నిప్పు
డిప్పుడా కా దెన్నియెన్నిజన్మములనుం
డియొ నాశిరమునకు నీపదముల
కును లంకెయయ్యె నెక్కొని మొక్కి మ్రొక్కి వే
సారితి నిఁక నలచకమనుస
లంచితేని జాగిదేలర కరాంబుజసంభ
వకరశాఖాప్రవాళకళికాము
తే.
హుర్ముహుర్ముక్తమానసముజ్జ్వలదురు
కమలసదృశాస్యగహ్వర ఘటితజనిత
కలకలమురళికారోక కొలనుపాక...
32
సీ.
వర జగత్కుటుంబధురీణుఁడవు నీవు
నీగర్భమునను జన్మించి పిదప
నీమేని కాసించి నిన్నుఁ గృష్ణా యని
పేర్కొంచు మనగల ప్రీతినుండు
మాకుఁ గళ్యాణమే చేకూరుఁగాక కీ
డేల నెదుర్కొను నెదురుకొనిన
కెరలి తజ్జన్యాపకీర్తిజన్యము దేవ
రదిగాక యొరులదే యవయవకృత
తే.
మైన దౌర్జన్య మనయవిదైనయట్లు
ప్రజల సబలమురాసుర ప్రమథన సమ
తులితబాహాబలోత్సేక కొలనుపాక...
33
సీ.
నేఁగి గల్గినపట్టి శిక్షింపఁగాఁ బరీ
క్షింపఁగారాదొ రక్షింపరాదొ
యవమాన మగునొ దురవగాహమో సమ
దర్శివి నీకు భేదము నభేద
మును గలవె పిపీలి మొదలు తామరచూలి
కడగాఁగ సర్వ మొక్కటియగాదె
విశ్వరక్షకుఁడవు వేఱున్నదే నన్ను
గావవుగాక పాకప్రమథన
తే.
విధి ముఖరఖేచరచ్ఛటావిపులమస్త
రత్నకోటీరకోటినీరాజితైక
కోమలతరాంఘ్రినాళీక కొలనుపాక...
34
సీ.
కెందమ్మియడుగులఁ గిలనలనందెలు
మొఱయ మోమున నవ్వు దొరయఁగఁ గను
గొనల దయ బెరయ గోపాలబాలక
వేషమునను కేల వేణునాళ
ము వహించి నీవు నామ్రోల నిలువ పాద
ములపైని బడి కడుమోదమునను
లేవకుండినఁ జూచి లేలెమ్ము భయము నీ
కేలని కైదండ యిచ్చి లేవఁ
తే.
దిగిచి పలుకుదు వెన్నఁడుఁ దెలియఁజెప్ప
రాపరాభూతమాదృగ్ధరాసురావి
కలభవహరాంతరంగౌక కొలనుపాక...
35
సీ.
జాగ్రదుదగ్రజలగ్రహగ్రహణార్తిఁ
బొరలి జగత్పతే పుషిత ఋషిత
తే పాహి పాహి మాం దీనమాపన్నర
క్షక యంచు మొఱ లిడఁగా బిరాన
చనుదెంచి నిర్వక్రచక్రధారను ఖరి
క్కున మకరిని తలఁ దునిమి కరిని
దరిఁ జేరిచిన కన్నతండ్రి న న్గాపాడ
రాజూడరా వీడరా భవత్ప
తే.
దాబ్జము నిజాశుగాశీవిషాశ్రయిత వి
శంకటనిశాటఝాటదుష్కంటకపట
మిళితవిగ్రహవల్మీక కొలనుపాక...
36
సీ.
అకలుషిత భవదీయకథాసుధానిధా
నమున నోలలదేలు నాదు వాక్ఛ
టలు జటుల నటన్నిటలదృగ్జటాకటా
హవిశంకటలు తద్వియచ్చరతటి
నీసముద్భటవీచికాసారఘుమఘుమా
ర్భటవిస్ఫుటలు దీనిపటలగుప్తి
జాగరూకతగను నీగుణములవింత
యెన్నఁగా లేవె యొకింత సంత
తే.
సంబు మదిలోనఁ బుట్టి యశంబు నింగి
ముట్ట భ్రష్టయవాముష్టిముక్కుచేల
గోసురశ్రీప్రదాలోక కొలనుపాక...
37
సీ.
సదయభవత్కథాశ్రవణంబున మదంత
రంబున నొకవికారంబు బొడమి
ఘోషించుచుండును గ్రోధసంబంధమో
యానందమో శరీరాంతరస్థ
మగునుల్బణానుల్బణాదివికారమో
మోహమో భేదమో మోదమో వి
లాసమో యున్మాదమో సివమో దెలి
యదు భక్తియో యక్కటా భవాబ్ధి
తే.
ముంచునో దరిజేర్చునో మొదలు జెప్పఁ
గదవె నిజగర్భసంభృతకమలజాండ
కోటికోట్యాదిసంఖ్యాక కొలనుపాక...
38
సీ.
కృష్ణ నే నెట్టిదుష్కృతినిగానీ భవ
త్కైంకర్య మించుక గంటి నింక
మంటి నీమంటిజన్మము రోఁత వింటి నీ
న్నే కావు మంటి నే నెదఁ ద్రిశుద్ధి
గా నమ్మియుంటి భాస్కరసుతభీకర
కింకరకరగా శివంకరపటు
ఖరకరవాలధగద్ధగితనిశాత
ధారాభిఘాతసంతతుల శంక
తే.
గొంటి నీలెంక నంటి చేకొనవె యంటి
విశ్వమోహన కరకళావిరళమురళి
కుహరకల్పిత మృదుపైక కొలనుపాక...
39
సీ.
సర్వశరణ్య యజ్ఞాన విజ్ఞాన వి
వేకపాకంబున నాకుఁ బంచ
వింశతివర్షముల్ వెడలె నిందున సుఖ
దుఃఖముల్ దఱుచుగాఁ దోఁచె నింక
మనఁగల కాలప్రమాణంబు దెలియ నేఁ
డో నెలయో పక్షమో తదర్ధ
మో విచారించ నేఁడో మఱి రేపో మృ
తిసమయమున నెట్టి తెలివి బరిఢ
తే.
విల్లునో నీపదంబు భావింపుచుండ
వింత యేలౌను మౌనిరాడ్విసరరచిత
కలితజయలాఞ్ఛనశ్లోక కొలనుపాక...
40
సీ.
మేటికమ్మలపౌజు జోటిడాల్ చకచకల్
తఱుచైన పౌజుమొత్తముల నడప
సొంపుకీలుకడెంపు కెంపుల ధగధగల్
పరువు లెత్తుచు దండిబారు నెఱపి
పక్కిరారతనంపుపతకంపుమిసమిసల్
వ్రాలి నల్గడ నెలగోలు గొలుప
గిలుకుటందియలఁ జెక్కినరాల ధళధళల్
కెలఁకుల వెన్నంటి బలుపు దెలుప
తే.
తళుకుమేను తనరు కల్మి చెలువదండ
వరలఁ బొడచూపవే దయాపంజరాన్త
కోవిదవరేణ్య గణశౌక కొలనుపాక...
41
సీ.
కఱుఁగుమెఱుంగుబంగరువంటి యొడలు గొం
డల బిండినేయు వెడందవాల
ము తపనశశిబింబములవంటి వట్రని
కన్నులు మిణుఁగురుల్ గ్రక్కు కోర
లు గరిమీసలుగల మగమీనురూపున
బెళకి సోమకుని గుభేలున జల
నిధినీట ముంచి ఖండించి తదపహృత
శ్రుతు లుద్ధరించి యజునకు నప్ప
తే.
గించి మించిన దొరను నుతించఁదరమె
స్వాభిథానైకమంత్రవర్ణానులోపి
తలఘునతపాతకశలాక కొలనుపాక...
42
సీ.
మలరాచకవ్వము జిలువరాయాకత్రాఁ
టను బట్టి పాలకడలి పనఁటి నొ
కకడను సోఁకుమూఁకులు రెండవయెడను
జేజేలు గొని నీరుజిలుకఁగ గుభ
గుభగుభధ్వనుల నక్కొండ మున్నీటిసు
డిని గ్రుంకుచున్న కఠినకపాల
మునఁ దాల్చి యుద్ధరించిన నీదుకమఠావ
తారము వారము వారము నెద
తే.
నెంతు సంతతదశదిశాక్రాన్తదైత్య
హనన జననప్రతాప మహాప్రదీప్త
జలరుహాప్తారుణాలోక కొలనుపాక...
43
సీ.
కడు వెండికొండను గ్రాలు నిగ్రహము సా
గ్రహత తరుల్ గిరుల్ వ్రక్కలించు
లోమముల్ ఝల్లుఝల్లునను జాడించుచుఁ
కరుకుకోర ఖరికుఖరికున మిణుఁ
గురులు భగ్భగ్గున గిరి కొనగీటుచు
ఘుర్ఘురధ్వనులకుఁ గుతల ములుక
భీకరతరసూకరాకార మంగీక
రించి ధరావహ కాంచనాక్ష
తే.
దనుజు భర్జించి నిర్జించి ధరణి కోర
నిలువరించిన దొరను నిన్ గొలుతు ముషిత
గోపకన్యామనోలోక కొలనుపాక...
44
సీ.
దనుజరాజు సభాభవనఘనస్తంభము
పెటపెటబగులించె వెడలి కహక
హాట్టహాసార్భటి నరిమురి దశదిశల్
గలఁగ జగద్భయంకరనృసింహ
రూపముతో సుతద్రోహియైన కనక
కశిపు రక్కసుఁ బట్టి కఱచి చఱచి
ఖరనిశాతనఖరాఖండశస్త్రముల ఖ
సిక్కు ఖసిక్కునఁ జించి ద్రుంచి
తే.
మించి ప్రహ్లాదుఁ గాచి మన్నించి యలుక
డించిన మహాత్తు నిన్నుఁ బఠింతుఁ గీర్తి
గుంభితాకుంభినీనాక కొలనుపాక...
45
సీ.
అదితికిఁ బుట్టి కశ్యపునిచేత నుపనీ
తుఁడవై పవిత్రము గొడుగు గోచి
ముంజి కృష్ణాజినము కమండలువు జన్ని
దము దండము నమర గొమరు పొట్టి
వడుగువై త్రిభువనవరుఁడగు బలికడ
కరిగి మూఁడడుగుల యవని యతని
వలన గైకొంచు విశ్వమునిండ బెఱిగి యొ
క్కడుగున దివి యొక్కయడుగున భువి
నదిమి శేషించిన యడుగున కద్దాత
నడుగుఁ బట్టించి సురాధిపతిని
తే.
బ్రాజ్యసామ్రాజ్యమునను సంపూజ్యుఁ జేయు
నిను ద్రివిక్రముఁ గొల్చెద ముని మనశ్చ
కోరికాపూర్ణిమాగ్లౌక కొలనుపాక...
46
సీ.
తతబలోద్దండ వేదండ శుండాదండ
చండదోఃకాండప్రకాండమున ఘ
నధగద్ధగాయమాన నిశితధారాక
ఠోరమై పేర్చు కుఠారముఁ గొని
ముయ్యేడుమారులు గయ్యానఁ బుడమిఱేఁ
డులఁ జక్కు చక్కుగాఁ దలలుఁ దరిగి
నెత్తురుటేరులు నిగుడించి యన్నీటఁ
బితృతర్పణంబు గావించినట్టి
తే.
జెట్టి భార్గవరాము నిన్ జిత్తవీథి
నభిలషింతు న న్గాచుటకై నితాంత
గుప్తనిజకింకరసుధీక కొలనుపాక...
47
సీ.
రఘువంశమున దశరథనృపునకు నుద
యించి తాటకను వధించి మఖము
గాచి యహల్యను బ్రోచి పురారికో
దండము ద్రుంచి సీతను గ్రహించి
జనకవాక్యమునకై వనమున కరిగి ఖ
రాదులఁ దరిగి తోయధి దరించి
రావణుఁ జించి తద్రమ విభీషణు కిచ్చి
రమణితోడ నిజపురముఁ జొచ్చి
తే.
రాజవై ధరనేలిన రామునిన్ జ
పింతు పాలితశబరి విభీషణైని (?)
గుహ హనూమన్ముఖ వనౌక కొలనుపాక...
48
సీ.
చందురు నందంబు క్రిందుఁ జెందఁగఁ జేయు
చందాన రోహిణీకుందరదన
యం దుదయించి బ్రహ్మాండకటాహని
ర్దళనధీర మగుసీరమునిరాకృ
తకృతాన్తదన్తురోద్దండకాండప్రద
మగు ముసలాయుధము గయికొని య
చలకోర్కి పండించి ఖలులను ఖండించి
దేవ నల్గడన నిండించి మించి
తే.
నట్టి బలరాము ముష్టికహారు భీము
రేవతీకాము నిను గొల్తు రేపు మాపు
గుప్తకున్తీసుతవధూక కొలనుపాక...
49
సీ.
త్రిభువన పరిభవ త్రిపురరాత్రించర
పరివృఢభామినీవరపతివ్ర
తాత్వప్రభంగకృద్దంతుర మాయాక
లావు పిప్పలకులదీపు బుద్ధ
రూపు నిన్ వాక్కునఁ బ్రాపు దాపనిపల్కి
బాపురె దరిముట్టఁ బరుల వశమె
బహుజనములగోలె భక్తులై విషయవి
రక్తులై కొల్చువారలకుఁగాక
తే.
పృథులమోక్షప్రదాన సంప్రీణితాత్మ
జాంబవత్యాహ్వయాత్మ జోత్సర్జనాతి
కుశల జాంబవద్భల్లూక కొలనుపాక...
50
సీ.
పుడమి వేల్పుకులాన బొడమి కడిమిఁ జూపు
కలికి రూపున కరువలి తెరువలి
దిగదించు మించైన తేజీవజీరుఁడ
వై వాలుడాలు మున్నగు కయిదువ
గమి కయిదొ వగమించి మిటారి బాబా చ
[ 1] వుపటాలు చివ్వుచివ్వున దుముకఁగఁ
గలిదోషమునఁ జేసి కులశీలములఁ బాసి
వర్ణసంకరులుగా వరలు నరుల
తే.
మన్ని గొని ధర్మమేదు నీమహితగుణము
లెన్ని కొనియాడ నేర్తునో యన్న నేను
కోమలశ్యామలగవీక కొలనుపాక...
51
సీ.
పుత్తడికత్తళంబు దొడిగి కాసె గ
ట్టి బిరుదగండపెండెరము కాలఁ
గదియించి రంగుబంగరు చెఱంగులవల్వ
రింగులు వారఁగూర్చి రతనాల
బొమిడికము ఘటించి భుజములఁ గైదువుల్
దాల్చి గరుడునిపైఁ బొల్చి మొదట
నసురచమూసమూహములగుండెలు గుభుల్
గుభులు గుభులున బగుల రమించు
తే.
యుష్మదురుపాఞ్చజన్యసముద్ధత ఘుమ
ఘుమరవము లుగ్గడింతు నకుంఠతరవి
కుంఠపురపాలనాఢౌక కొలనుపాక...
52
సీ.
క్రొవ్వి చివ్వకుఁ గాలు ద్రవ్వు మానిసి బువ్వ
మూఁకలపై నెత్తి పోకు పోకు
మని భగ్గు భగ్గున నదలించి ప్రళయకా
ల కరాళలీలాకలాప భగభ
గాయమాన ధళధళాయమానతనూన
పాత్తిరస్కారివిస్ఫారతరస
హస్రధారాసముద్యద్విభాచక్రమై
పేర్చుచక్రము పంపువెట్టి నుగ్గు
తే.
నుగ్గుగాఁ గన్సుకొట్టి వినోదమహిమ
నింగి ముట్టిన దొర విల నీవె పోషి
తలఘుతర మాదృశవశీక కొలనుపాక...
53
సీ.
తగిలి జగములపై దాడి వెడలు తెర
గంటికంటు దొరలవెంట వెంట
నంటి నిలునిలువు మని యదలించి కై
గదగొని గొదగొని సదమదముగ
మొదవుకదుపులపై దుముకు గబ్బిబె
బ్బులిగతి దాఁటి గుబుకుగుబుకుగు
బుక్కున వీఁపులు మూఁపులు పదములు
ను రదములు నురముల్ కరములు మెడ
తే.
లును దొడల్ బొడిసేయు నీఘనభుజముల
పటుత బొగడెద స్వప్రతాపప్రవాహ
లుళితనిఖిలాసురజలూక కొలనుపాక...
54
సీ.
నింగి గుబ్బటిల మున్నీట సదా రొంపి
గొని రిక్కగమిడుల్ల కులగిరుల్ వ
డంకఁ జిల్వదొర వెడఁగుపడఁ బుడమియుఁ
దడబాటు వార పాతాళ మొకట
ఘూర్ణిలఁ బరజంతుకోటి దల్లడపడ
దృఢపరిపంథి దైతేయయువతి
గర్భస్థితార్భకావిర్భేదముగ ఠాము
ఠాము ఠా మనుచు నెడతెగక యని
తే.
మ్రోయు ఘణఘణద్ఘంటికాభూతకోణ
భవదరీణధనుర్గుణార్భటి నుతింతు
కోవిదస్తోత్రవాచాక కొలనుపాక...
55
సీ.
కరుకైన సోఁకుమూఁకల మూఁకలకు నేడ
దూరి తేరులబారు దుగ్గు దుగ్గు
గా గబ్బిగబ్బుమెకంపు గుంపులు జక్కు
చక్కుగా ఘోటకచ్ఛటలు పిండి
పిండిగా నుద్భట భీషణచ్ఛటపట
లను నుగ్గు నుగ్గుగాఁ జెనకి ఖరికు
ఖరికుకరిక్కున కరకరి నఱుకు చు
ఱుకుభవచ్ఛార్ఙ్గనామకధ నుర్వి
తే.
ముక్తపుంఖానుపుంఖాత్యమోఘవిశిఖ
ములు విచారించుఁ గాక మత్కలుషములను
గోపబాలక మాయైక కొలనుపాక...
56
సీ.
భవదీయ శార్ఙ్గచాపవరవిముక్తవి
షాక్తబాణాహుతి నసురతతిని
దెగినట్టిమొగములు జిగిలిగొన్నట్టిపే
వులు నేరులౌ నెత్తురులు గిజల్గి
జలు దన్నుకొను మొండెములు నీఁదులాడుగం
డలు జక్కుజక్కైన తలలు దుత్తు
నుకలైన చేతులు నుగ్గు నుగ్గయిన యొ
డళ్లు వెల్లువలై మెదళ్ళు గలిగి
తే.
వెఱవు బుట్టించు నట రణోర్వీతలంబు
కల్పితస్వాంశg ఘనవిలోకన సముదిత
గోపికాకేకినీకేక కొలనుపాక...
57
సీ.
ధగధగలాడు నందకవరాసి ఝరాన
యొరదూసి రాకాసిబరినిడాసి
గొడుగులు సిడములు పడగలు కంకట
ములు గుఱ్ఱముల పల్లములు కయిదువు
లు ఫలకములు తేరులు ధనువులు శరము
లు కరులు జోదులు శకటములు ఖ
రిక్కు ఖణిల్లు ఖచిక్కు ఖణింగు ఖం
గు ఖసిక్కునను దెగ గుముల కుఱికి
తే.
తుత్తుమురు గాఁగ నఱికి యుద్వృత్తి గెలుపు
రమ గొను దొరవు నీవే గళమిళిత పరి
మళితఘనవసనూలాక కొలనుపాక...
58
సీ.
మారి జొబ్బినగతి మన్త్రించి పడవైచి
నక్రియ కొఱవిద్రిప్పినకయివడి ప్ర
ళయకాలరుద్రునిలాగు నీరసతృణ
వన మేర్చుకార్చిచ్చువడువున గను
పట్ట బెట్టిదముగఁ గట్టడిరాకాసి
తిట్టెలపై చలపట్టి కొట్టి
మహిమ మిన్ముట్టి సమస్తలోకముల సం
కటములు వే విశంకటముగాక
తే.
బిరుదు చెల్లించుకొనెడు నీబీర మెన్న
నరుదు శేషాహికైన దోయరుహమిత్ర
గోత్రవరపుండరీక శ్రీకొలనుపాక...
59
సీ.
మెఱయు ఫిరంగుల నఱికి బాకుల గ్రుమ్మి
గదల మొత్తి సురియల దునిమి నుర
కత్తుల నుగ్గాడి గండ్రగొడ్డళ్ల వ్రే
సి కటారులను బొడిచి జముదాళు
ల గడపి చక్రముల దెగమోఁది పరిఘ
ముల దంచి యీటెల డులిచి భిండి
వాలముల దునిమి పాశముల నురులు
వోసి నీబలము రాకాసిబలము
తే.
ఫై దుమికి నుఱుమునట నీదు బాసటగొని
యౌర వింత యగారితాక్రూరధీర
కలిత హృత్పుండరీక శ్రీకొలనుపాక...
60
సీ.
ఢాకఁ గడిమి బుండరీకము బుండరీ
కము భల్లుకము భల్లుకము గజము గ
జము శరభము శరభము మృగేంద్రము మృగేం
ద్రము వృషభము వృషభము నగము న
గము బోరుగతిని యుద్ధము శయాశయి కచా
కచి సఖాసఖి కరాకరి రచార
ది భుజాభుజి పదాపదిని జఱచి కఱచి
వ్రేసి డాసి పొడిచి విడిచి దుమికి
తే.
గుమికి రాకాసిమూఁకలఁ గూల్చి వీఁక
గల్గి నీమూఁక సాత్యకి ఘటితమణిల
గుడ లసత్పుండరీక శ్రీకొలనుపాక ...
61
సీ.
బాణ ప్రభాతటిత్పటలము భగ్గుభ
గ్గున మెఱయఁగ ధనుర్గుణకఠోర
డాంకారగర్జ బెడబెడమని యుఱుమఁ
గ కనదదభ్రకార్ముకమహాభ్ర
మున నతిలాఘవమున నిశితశరప
రంపరాసారవర్షంబులు నీగు
డించి యసురవీరచంచదనీకినీ
తేజోదవాగ్నులఁ దెప్పదేల్చి
తే.
యార్చి పేర్చిన నిను నసహాయశూరు
శూరతాస్ఫారు నెద నెంతు శుకహృదయ వి
మలసరోమానసౌక శ్రీకొలనుపాక...
62
సీ.
వేలుపుసూడు హం వీరులఁ జతురంగ
బలముల చలముతో బలసి నఱికి
బాహుమీనములు కబంధమకరములు
శీర్షభేకములు మస్తిష్కిఫేన
ములు పలల కమఠములు గృపాణవ్యాళ
ములు బుండరీకాబ్జములు కరేణు
మస్తకాన్తస్స్రస్తమౌక్తికభూషణా
వయవవాలుకలు నొప్పంగ శోణి
తే.
తప్రవాహములు సమరోదధి ఘటించి
మించు నినుఁ గొల్తు మాదృశాకించనజన
గుప్తతాజాగరూక శ్రీకొలనుపాక...
63
సీ.
ఎక్కడ చూచిన లెక్కకు మిక్కిలి
యగుచు వెక్కసముగా నిగిడి పింజె
పింజె గఱచి వచ్చి బెట్టుగా నీవింట
గుఱియు చుఱుకుటంప కోలకోల్త
లకు విఱిగి విముఖులయి దెసచెడి పుట్ట
లెక్కుచుఁ గేల్గన లెత్తి మ్రొక్కు
చు శవాళిలో నక్కుచుఁ గసవు మెక్కుచుఁ
గావుకావు మటంచు గద్గదోక్తి
తే.
వెక్కు చుఁ గలఁగి పురపుర పొక్కుచు వడిఁ
దక్కుచుఁ దొలంగునట యాతుధానకులము
గోపితనరాది జనలోక కొలనుపాక...
64
సీ.
గౌతమమౌనిరాట్కఠినవాక్కృతమైన
రాయి రామావతారమున కౌశి
కమునీంద్ర వరనియోగమున బాణప్రయో
గమున తాటకను సంగతకృపాణ
ఖేటకను బుడమి గీలించి రాఁ గడు
మోద మొప్పఁగ భవత్పాదరేణు
కణము సోఁకినయంత కంపించి కఠినత
వదలి కదలి కాన్తి బొదలి మొదలి
తే.
పడఁతి యయ్యె నటౌర మీపాదమహిమ
యవిత శీతాపకారి మహాజవాజి
ఘోరభీభాగహీతకాక కొలనుపాక...
65
సీ.
పుత్తడిగుబ్బలి బోలిన మేను నా
ఖండలమండలాగ్రప్రచండ
తేజము నిరసించు దేజితతుండము
విస్ఫులింగము లీను వెడఁదకన్నుఁ
గవ నిశితకఠోరక కరాళములగు క
రజములు నిజమరుద్వ్రజవిధూత
గోత్రంబులైన పతత్రంబులు గల ప్రో
ద్యద్భవత్కీర్తి ప్రతాపరూప
తే.
మనఁగఁ గనుపట్టు యుష్మదీయాశ్వగరుడ
దేవు నుతియింతు గుప్తమాదృఙ్నతనర
ఘోరభవకాందిశీక శ్రీకొలనుపాక...
66
సీ.
వేషము జక్కఁ గావించి తీరరుహ భూ
రుహము నారోహించి రోసగించి
బిట్టు ధట్టించి గుభేల్లన నురికిన
గని నిజానసగుహాఘటితఘోర
ఫూత్కారజాతప్రభూతవిషజ్వల
దుజ్జ్వలనజ్వాల లొక్కట గిరి
కొనవచ్చి కాళీయుఁడను చిల్వఱేఁడు ని
న్గఱచి చుట్టిన పట్టి చఱచి యమున
తే.
నీటపడగలు నుగ్గుగా నిగిడి నాట్య
మొనర తత్సతు ల్వేఁడిన మనిచితివఁట
క్రూరదానవహృచ్ఛూక కొలనుపాక...
67
సీ.
చఱచితో పన్నిదం బురక నిన్నెట్లు చే
కొనువాఁడ నలయించకని తలంచి
వెఱచితో మత్సాపవిసరార్భటులకు
కొనవచ్చినను చుట్టుకొనునటంచు
మఱచితో నీలారమాక్షమాలీలావ
తీలాలితానంగహేల దగిలి
పఱచితో యాత్మీయభవనంబు దొలఁగి వి
పక్షరాక్షసచమూభయము జెంది
తే.
యార్తి విన వొహో! హో! యని యనవు రావు
పలుకరించవు దగునే గోవర్ధనాఖ్య
కుదరభృద్భాహుబాహీక కొలనుపాక...
68
సీ.
త్రుంచలేవో సర్వదుష్కృతంబులచేత
జడమై ప్రవర్తించు జన్మలతల
నుంచలేవో భవదుత్కృష్టసేవక
సంగతి విజ్ఞానసంగు జేసి
నించలేవో సదానిఖిలదుర్విషపాళి
వ్రీల గృపామృతవీక్షణంబు
మంచలేవో జన్మమరణప్రవాహైక
మోహం బెడల నిత్యముక్తుఁ జేసి
తే.
యెంత సేయఁగ లేవు నీ వించుకంత
యెదఁ దలంచిన ఘటితమహేంద్రరుంద్ర
గోపదభాజ్యదభిషేక కొలనుపాక...
69
సీ.
కలికితుమ్మెదలడా ల్గరులు ముంగురులు చొ
క్కపుమీలచెన్నులు కన్నులు నెల
నక్కులు జెక్కులు జక్కనిపువ్వుల
చెండ్లు బాలిండ్లు రాచిలుకరాయ
రౌతు పొందమ్మివాల్ జోతులు చేతులు
ననఁటికంబము లన నగు కురువులు
దొనలయిక్కలు బిక్కలు నిగారమగు తేనె
తేటలు మాటలు నీటుగొన వ
తే.
లవులు వెదఁజల్లు జెలులఁ జూచి పరువారు
చిత్తము భవత్పదాంబుజాయత్త మగునె
కుంఠితమురాసురోద్రేక కొలనుపాక...
70
సీ.
జగములనెల్ల జొక్కఁగఁ జేయఁగాఁ జాలు
హేల నీవేణుగోపాల బాల
కృష్ణవేషము మును పెన్నడో జూచిన
యందాన ముందర నాడి చన్న
కరణి దౌదవ్వుల గానుపించినరీతి
గలలోన గాంచిన గతిని గని ప
రాకైనయెడ దోఁచి రాకున్న కైవడి
కన్నులగట్టిన జెన్నున గని
తే.
పించుచున్నది సాక్షాత్కరించునేమొ
భీషణాసురగర్భనిర్భేదనకర
గురుగరుత్మత్పతితాక కొలనుపాక...
71
సీ.
సారె కృష్ణాయని చీరనో యని యొక
పారియైనను భళీ పల్కిపల్కి
వేసారి లేక వినరాదొ యోగని
ద్రను గునికితివొ పరాకయితివొ
రాణితో నంతఃపురములోపలను రహ
స్యమున నుండితివొ నిరాదరణము
దాల్చితొ నీప్రభుత్వము తెరఁగో కాక
నాయదృష్టమొ తేలదాయె నింక
తే.
నేమి సేయుదు దిక్కు నా కెవ్వరయ్య
యీవు దక్కఁగ లుళితమునీణ్నిరస్త
చలనచేతోమృతతటాక కొలనుపాక...
72
సీ.
జారుఁడ చోరుఁడ జడుఁడ నాచారహీ
నుఁడ జాలదురభిమానుఁడ ఖలుఁడ వి
వేకవిదూరుఁడ వివిధపాపాచర
ణవిశారదుఁడ దుష్టుఁడ విగతకుశ
లుఁడ భవనీరధిలోపల మునిఁగి తీ
రమునకుఁ జేరనేరక దిరుగుడు
బడలినవాఁడ నెబ్భంగి చేపట్టి ర
క్షించెదో వేగ రక్షింపవే ప
తే.
రాకుగాక పరులచేతి కీక బకని
శాటజీవజగత్ప్రాణజాతహరణ
కుశలభుజదందశూక శ్రీకొలనుపాక...
73
సీ.
అఖిలేశ వినుము నాధ్యానంబు నీవ నా
స్నానంబు నీవ నాసంధ్య నీవ
నాసుకృతము నీవ నాసౌఖ్య మీవ నా
జ్ఞానంబు నీవ నాజపము నీవ
కర్తవు నీవ భోక్తవు నీవ సర్వంబు
నీవ యింకేల గణించి పలుక
నీవె నాథుఁడవు నిన్నే కాని యన్యుల
రక్షింపుమనుచుఁ బ్రార్థనము సేయ
తే.
యత్న మించుకయైన జేయదు మదీయ
హృదయ మిది యేమొ గుప్తనారదనిజైక
గురుకథావావదూక శ్రీకొలనుపాక...
74
సీ.
స్నానము సున్న ధ్యానము నాస్తి జగము మృ
ష తపము లేదు విజ్ఞానము నహి
సంధ్య యసత్యము జదువు మిథ్య వివేక
ము హుళుక్కి మేధ యేమో స్థితి యనృ
తము శాన్తి తబ్బిబ్బు దమ మనుమానము
సుగుణ మబద్ధము సూనృతము ము
ధాపవాదము దాన మాగడమ యహింస
యిల్ల యాచారము కల్ల నీప
తే.
దాంబుజంబుల భక్తి శంకాస్పదంబు
నింక నను బ్రోచువా రెవ్వ రీవుగాక
దళితనిజభుజిష్యభయాక కొలనుపాక...
75
సీ.
రక్షింప నీబాలసఖుఁడగు కు
చేలుఁడనా నీదు చెలియలి సవ
తి యగు పాంచాలినా తివిరి నీరాణికై
ప్రాణముల్ రక్కసుపాలు జేసి
నట్టి జటాయువునా విందుఁ జేసిన
శబరినా భవకంబుజాతదృగప
హారిమర్మము దెలియఁగ జెప్పుటకు గ్రహిం
చిన విభీషణుఁడనా వినవె నేను
తే.
నెవ్వఁడను నన్ను రక్షింతు వెటుల నీవు
పృథువిపన్నజనావనా భీతిదాన
కుశలతాస్ఫురదనళీక కొలనుపాక...
76
సీ.
అన్యుఁడఁ గానంటి నాశ్రితకోటిలో
పలివాఁడనంటి చేపట్టి కాచు
టకు విహితుఁడనంటి నఁటకటా మదీ
యేంగితము దెలియ నెంతవిన్న
వించుకొంటిని భళా వేయిభంగులను మొ
ఱలు బెట్టుకొన్న బరాకె జేసి
తివి ని న్నెటువలె నమ్మవలె సార్ధకకుచే
లు కుచేలుచేలతాలోలుచేతఁ
తే.
గొన్నియటుకులు గోని సిరిఁ గూర్చినట్టి
లంచగాఁడవు నన్ను రక్షించఁగలవె
లుళితరాధావధూహ్రీక కొలనుపాక...
77
సీ.
శరణం కిమపి నాస్తి చరణం వినా తవ
పరమాత్మ రామ మాం పాహి పాహి
యంచు నగ్రజుచేత సంఘ్రితాడితుఁడయి
చనుదెంచి భయమున శరణు వేఁడి
నట్టివిభీషణు నతిదయాదృష్టి వీ
క్షించి వెర్వకు వెర్వకంచు చేతఁ
బట్టి యాలంకకుఁ బట్టముగట్టితి
వప్పుడె భళిర మాయన్న నిన్నె
తే.
కొల్చినసు గొల్వవలె నీవు కోర్కు లొసఁగి
తే నొసఁగవలె పాలితానూన విషమ
కలితదశరథనృపవాక కొలనుపాక...
78
సీ.
ఇదె చూడు నీదు నెమ్మదిలోన నేమి సం
కల్పించితివొ నన్నుఁ గావలేక
నీటమునింగిన నేలజొచ్చిన పంది
వైన నో ర్దెఱచిన మేనుడాచి
మసలినఁ గ్రూరకర్మము గైకొనినను ద
పసివైన బసులుగాపరితనంబు
మేకొన్న మాయల మించిన గుఱ్ఱపు
రౌతువైన విడువరా పరులను
తే.
నుడువరా దైన్యవార్ధిని గడువరామి
జడవరా నన్ను గాచిన గొడవరాదు
కలితనిగమ శిరష్ఠీక కొలనుపాక...
79
సీ.
వేదధర్మప్రతిపాదకమో కొండ
నెత్తుటో భూమి వహించుటో సు
రవిరోధి దళనపూర్వక డింభరక్షణ
మో యింద్రపాలనమో యశేష
భూసురస్థాపనమో సప్తతంతుసం
త్రాణమో చిరమృతక్షోణివిబుధ
పుత్రకోద్ధరణమో పురపురంధ్రీవ్రత
హరణ హేతుకజగదవనమో య
తే.
నంతకులధర్మగుప్తియో యహహ నన్ను
నరు నొకనిఁ గావ నీకెంత భరము దళిత
ఘోరరాక్షసశాక్తీక కొలనుపాక...
80
సీ.
దేవ నీజీవన వ్యావృత్తి నీగోత్ర
సంభరణైకకౌశలము నీర
సాదృతి నీదు ప్రహ్లాదైకవృత్తము
నీమహాఖర్వత నీసదావ
నీపకదానోరునిష్ఠ నీధర్మక
దీక్ష నీదుసురాదరణయు
నీప్రబుద్ధతయును నీదుకలికిదన
ము దలంచి నాల్గైదుమోమోములు గల
తే.
వేల్పుఱేఁడులకైన భావింప సన్ను
తింప వీక్షింప వెరఁగు సాధిపవిరోధి
కుంతభృదనీక యాష్టీక కొలనుపాక...
81
సీ.
విషరాశివిహృతి బో విడిచి కాఠిన్యము
మాని సౌకర్యము బూని వికృత
వేషముఁ జూపక పిన్నబాఁపనిఠేవ
బ్రాహ్మణమూర్తితో రాజముద్ర
గన్పడ ముసలివి గాక మాయలబోక
కలికితనాన నాకన్నుఁగవకు
బాలకృష్ణాహ్వయబ్రహ్మము సంజ్ఞను
నిల్చి కన్పించిన నేటికా త్వ
తే.
దీయదర్శన మలయించితివి బహుదిన
ములని దూరుచు భవదంఘ్రు లలమి పలుకఁ
దలఁతు సందియ మెదలేక కొలనుపాక…
82
సీ.
విష మెక్కెనో తల వెఱ్ఱిబట్టెనొ బర్వు
దాల్చితో నెత్తురు ద్రావి పార
వశ్య మొందితివో యపారముగా బెరి
గినగర్వమో తపమునను మౌన
ము వహించితో రాజ్యపుమదమో పానబ
ద్ధత్వమో శుధ్ధబుద్ధస్వరూప
ము ఘటిల్లెనో గుఱ్ఱపురవుతు వౌట బా
స దెలియదయ్యెనో సారె బిలువఁ
తే.
బలుక విది తగునే మహావక్రచక్ర
చక్రవచ్చక్రివగహృతశైశుపాల
గురుశిరస్స్థూలమండూక కొలనుపాక...
83
సీ.
క్షితిదరిదీయ నమృతమీయ నేల వ
డయఁ బుణ్యజనపృథునియతిఁ దెలుప
వరవర్ణితత్వము బ్రబలింపఁ గామద
మనగురువృత్తిలోఁ గొన విభీష
ణ భవార్తి నడప ననంత సత్యాసక్తి
జెలఁగింప నాగమశేఖరప్ర
సిద్ధి ఘటిల్లఁగాఁ జేయఁ గల్క్యాకృతి
సవరింప నీవని సంభ్రమించి
తే.
మదిని నమ్మితి రక్షిత మాదృశభవ
కలుషమగ్నకృత్యాకృత్యకర్మకలన
విలసితవివేకమూక శ్రీకొలనుపాక...
84
సీ.
గణుతిజేసిన జడగతివి కఠోరాత్ముఁ
డవు పెద్దకొమ్ముకాఁడవు నరణ్య
జన్యనరుఁడవు భిక్షారుఁడవు నృప
ద్రోహివి క్రోఁతులదొరవు దుక్కి
మ్రుచ్చువు దెసమొలమూర్తివి శస్త్రధా
రిబ్రాహ్మణుఁడవు సరే భవద్ఘ
నత్వ మెఱిఁగి కొల్చు న న్ననవలెఁగాక
ని న్ననఁ బనియేమి నిజవిభోగ్ర
తే.
ఖరకరాంధీకృత విదర్భకన్యకాస్వ
యంవరోత్సవమిళితచైద్యమగధకురు
కోసలాది నృపాలూక కొలనుపాక...
85
సీ.
పుష్పవద్వంశప్రభూతి దానవవని
తాహృతి యమిసప్తతంతుగుప్తి
కాశ్యప్యపత్యైకకరపీడనము గురు
లపితానుసృతిహరిజ పరిరక్ష
గోపతి గర్వనిర్వాపణవృత్తి య
నేకబాహ్వాసురనిగ్రహంబు
సమితవిభీషణనామకోద్భవముఖ్య
సుప్రసిద్ధాత్మపదప్రదంబు
తే.
నాదిగాఁగల రామకృష్ణావతార
చర్యల నుతింతు రుక్మిణీస్వాంతకాంత
జలజఘనచంచరిక శ్రీకొలనుపాక...
86
సీ.
రాజవంశోదయు రమణీయసితివర్ణ
కాయు సీతాకరగ్రహణనిష్ఠుఁ
బ్రకటప్రలంబకబంధకరణ కృతాం
తు హరిసుతోచ్ఛేదను హనతాళ
పాళిహారిని సముద్భటవృషభాంకోరు
ధర్మభంగక్రియోదారు నిన్ను
బలభద్రరాము నపార కృపారస
పాధోధి మనమున పనివి పనివి
తే.
యెక్క డేవేళ నెప్పు డిం కేమి యగునొ
యనుచు నున్నాఁడ గోఖురోద్దతపరాగ
మిళదళీక శశ్వరీక శ్రీకొలనుపాక...
87
సీ.
మునుఁగుచు ఘనభవమున మితిలేని దు
రితమందరతం జాల వెత సుడియుచుఁ
దనికెడునన్నుఁ గన్గొనవే మును కరుణ
దేవభావుక వాసుదేవ యజుఁడు
భావింపలేకను దేవ నీదాఁటరా
ని యపారమాయను నిపుణగరిమ
జనఁగ వికారత గనే నట యహహ రా
గములఁ బెనఁగి కడుఁ గదలరాక
తే.
సోదరుఁడనయి యేప్రొద్దు జరుపు నాకు
నీచరణముల దృష్టింప నేరుపుదొర
కొనుట యెట్లు మాజాయాక కొలనుపాక...
88
సీ.
నయరాజరాసగోష్ఠియుతాంగనారోప
ణాంగజ సాధారణానులాప
యమిసంతతిపవిత్రహత సుప్రభామిత్ర
సకలవిప్రస్తోత్ర జయచరిత్ర
దుర్ధరణస్థేమ వర్ధితసుత్రామ
యేనఃకరవిరామ మౌనికామ
ఘనయశోవిమలక కమలాప్తకులవత్స
విఫలకనిటలప్రవిచరదలక
తే.
పరిభవించెద నేఁడె నీభక్తి దలఁచి
కలుషము తరతరాన తద్బలిమికలిమి
గలదె భయ మిఁక భిన్నాక కొలనుపాక...
89
సీ.
అస్మదీయశరీర మదరిపాటున బిడు
గునఁ గూలునో యగ్ని కొడులగూలు
నో విషంబున జెడునో జలంబునఁ బడు
నో నురిని దగులునో శిలను బ
గులునో పతనమునఁ దొలఁగునో తెవులున
మలఁగునో యెట్టిదుర్మరణమున మ
ఱి తెలివిదప్పునో కృష్ణకృష్ణేత్యక్ష
రద్వయపరమమన్త్రస్మరణ మ
తే.
కట పురాకృతకర్మసంఘటనమునను
దొరకదో తప్ప నాడితి దొరక దెట్లు
గుప్తమాదృశజల్పాక కొలనుపాక...
90
సీ.
రుక్మిణి సరసఁ గూర్చుండ సత్య విడె మొ
సఁగ భద్ర సురటి విసర సుదన
పావడ వ్రేయ జాంబవతి నాగ్నజితి కై
కడలను నిల్వ లక్షణ కళింద
జ యుచితపుఁ బనులు మెయికొనఁ బదియారు
వేలు చెలుల్ జుట్టు గ్రాల సిరులఁ
జెలఁగఁ జతుర్విధశృంగారము గలుగ
ద్వారకాపట్టణాన్తఃపురమున
తే.
రత్నమయశృంగారరసముము గులుక
గొలువు గైసేయు కృష్ణ ని న్గొలుతు వల్ల
వలలనామల్లవరదాక కొలనుపాక...
91
సీ.
కన్నుల నునుగెంపు గదుర బొమ్మ లదర
డాల్గలజిగిపచ్చడంబు పచ్చ
డంబు కటి ఘటించి డాకేల మునికోల
గదియించి నొగల పగ్గములఁ బూన్చి
రథముపైనుండి ధర కుఱికి కవ్వడి
నిగిడి తెకల్పఁగ నిలక భీష్ముఁ
జంపుదు ననుచుఁ డచ్ఛరపరంపర కెదు
రెక్కి నడచు నీయహీనవీర
తే.
రసము వర్ణింప వెఱఁగవురా భళీ చ
రాచరాత్మక కమలభవాండభాండ
గోళగుళికాప్రథమఢాక కొలనుపాక...
92
సీ.
మలినద్విషద్ద్యూతకలనాపరాజితా
త్మీయ సర్వస్వభర్తృక సమగ్ర
జనజాగ్రదాస్థానసరణి దుశ్శాసన
కరసమాకర్షితకబరితద్దు
రోదర ముక్తవాసోదిష్ట హా కృష్ణ!
సమయోహి! మాం రక్షితు మయమేవ
పాహి పాహీతి సంభాషిణీకృష్ణను
గాచినయట్టి నీకరుణ దలఁచి
తే.
తలఁచి డెందాన ఖేదమోదములు దాల్తు
మాతులమిషద్ద్విషత్కంసమహితకృతవి
పులవిధానాంబుధరధూక కొలనుపాక...
93
సీ.
చిన్నప్పు డొకనాఁడు మన్నారగించితి
వని నిను బల్క జననికి నోట
భూమినదీనదముల జనపదముల
లలనాపురుషుల ఋషులఁ దరువుల
బురములఁ బశుమృగముల నగముల సరో
వరముల మఱి చరాచరములఁ బొరిఁ
బొరిఁ జూసి నివ్వెఱఁ బుట్టించి కన్ను మూ
యఁగఁజేయు నీయద్భుతాఖ్యరసవి
తే.
లాసము నుతింపఁదరమౌనె రాసకేళి
కాకళాపాళికాపరికలితజన్య
కోటినానావిధహృషీక కొలనుపాక...
94
సీ.
భైష్మకపూస్స్వయంవరమిళితాఖిల
ధాత్రీవరౌఘమధ్యమున రుక్మి
ణీకన్యకామణి చేకొని వచ్చున
ప్పుడు తదగ్రజుఁడు విస్ఫూర్తి మెఱసి
గోపాల మాపాపఁ గొనిపోకు పోకు మ
టంచు రణారూఢుఁడై కవిసిన
నవ్వి యవ్వీరునిఁజివ్వ నొవ్వఁగఁ జేసి
తల మూతి గొరిగిన ధౌర్త్యశాలి
తే.
నీదుహాస్యరసంబు వర్ణింపఁ దరమె
వృషభదైతేయ వీరప్రవృద్ధగర్వ
కలనహిమపర్వరీక శ్రీకొలనుపాక...
95
సీ.
ముఖమున కీలి రొమ్మున శూలి నుదుట బ్ర
హ్మ నిరుగడల నింద్రయమవరుణకు
బేరుల వాతార్కవిశ్వాశ్వినుల బాహు
ల బలార్జునుల నూరుల యదువృష్ణి
భోజాంధకతతి వీఁపున హరివరుణ భీ
ముల సశస్త్రులఁ గని భువనభీక
రరసతేజోవతారమున యారాయబా
రమున గురుసభ గరంచినట్టి
తే.
నీవిలాసము వర్ణింప నేర్తు నెట్లు
కురుసభావిశ్వరూపావసరవిరచిత
గోజగద్దృగ్దరీక శ్రీకొలనుపాక...
96
సీ.
అరదాలతోఁ దున్కలైన జోదులు దత్త
డులతోడఁ దెగినరౌతులు మతంగ
జాళితోఁ బడినగజారోహకులు బొంద
ళమ్ములతో శకలమ్ములైన
భటులు దండములతోఁ బడినగొడుగులును
తురుమైనతొడవులు మురియలైన
ధ్వజముఖరనిమిత్తతతి గల్గి మదికి నొ
సంగె భీభత్సరసము జరాసు
తే.
తపృతనాతతిని భవత్ప్రధనము భళిర
సుందరపురందరమణి విస్ఫూర్తితులిత
లలితకచచంచరీక శ్రీకొలనుపాక...
97
సీ.
అగ్గలంబైన జరాత్మజుమొగ్గర
మును జొచ్చి భగ్గుభగ్గున నదల్చి
చలమున నానాస్త్రశస్త్రములఁ బొదివి
పదవి కడ్డపడుచుఁ జెదరనీక
వెదురుటడవి దహించుదవాగ్ని యనఁ బేర్చి
కడఁగి పోనీక నల్గడల దుమికి
దుమికి కేడించెడి గములపైనంటి హ
రించిన నీదు నిర్నిద్రరౌద్ర
తే.
ముద్ర వర్ణింప లయకాలరుద్రుఁ డైన
మాంద్యము వహించు దంతాస్య మర్మరీక
ఘోరతరశర్కరీక శ్రీకొలనుపాక...
98
సీ.
ఒకచాయ భోజనాయకపఙ్క్తి యొకయోర
యదువీరరేఖ యొక్కదరి వృష్ణి
జనన గరిష్ఠరాజన్యాళి యొకవంక
నంధకవంశశశాంకవీథి
యొకకడ ఋషిరాజి యొకయెడ విద్వత్క
విశ్రేణి యొకచక్కి వివిధకులభ
టావళి గొలువఁగ నతిశాన్తి నెనరు చూ
డ్కి చెలువము సిరుల గెరలి వరల
తే.
కడిమిమీఱఁగ నల ద్వారకాపురమునఁ
గ్రీడసల్పిన మాయయ్య కృష్ణ నిన్నుఁ
గొలుతుఁ బాతకఘనలీక కొలనుపాక...
99
సీ.
ఆర్తులఁ గాచుటకయి దీక్ష జేసి కం
కణముగట్టిన జగత్కారణుఁ బర
మేశు రమేశు నమేయగుణస్వరూ
పు ననంతు నిన్ను నన్ బ్రోవు మనుచు
మాటిమాటికి బ్రతిమాలు కుశీలు న
దూరదర్శను గృతదురితు బుద్ది
హీను నజ్ఞాననిధాను నన్నే నేను
దలవోసికొని నవ్వదలఁచియుందు
తే.
గాదె బ్రహ్మాండభాండసర్గస్థితిలయ
కల్పనానల్పసంకల్పకరణజనిత
గురుకటాక్షధుతభ్రూక కొలనుపాక...
100
సీ.
స్వామి పరాకు హెచ్చరిక దేవరవారి
కరుణాకటాక్షవీక్షణమునకు శు
భము గావలెఁ బతితపావనముద్రకు
భద్రము గావలె భక్తరక్ష
ణవిచక్షణత్వమునకు మేలు గావలె
శరణాగతత్రాణబిరుదమునకు
శ్వశ్రేయసంబు గావలె యార్తరక్షాప
రాయణత్వమునకు హాయి గావ
తే.
లె నీక కొదవ యొకింతైన లేదు నీకు
కొదవ లేకుండినను మాకు గోపికాని
గూహనకళాప్రవేక శ్రీకొలనుపాక...
101
సీ.
వీనులలోపల వీణాపరీణాసు
ధాఝరీమాధురీతతి ధురీణ
మగు ననాహతనాద మతిరుచి మ్రోయఁగా
గన్నుల నునుబాష్పకణము లొలుక
నానోట గృష్ణకృష్ణా యను నుడువు ల
డరఁగా నఖండదండాయమాన
మౌతేజ మొకటి బాహ్యంతరంబులఁ గను
పట్టఁగా నొకమేడపైని గూరు
తే.
చుంటి నొంటిగనని కలగంటి నిన్న
రేయి యిది యేమొకాని గరిష్ఠసత్వ
గుణసమగ్రతాచ్ఛవివేక కొలనుపాక...
102
సీ.
కడఁగి బంధత్రయక్రమమున నడుము ని
క్కించి చిక్కులు వాపి కేవలాఖ్య
కుంభకంబున సూక్ష్మకుండలి మేల్కొల్పి
నడిమిమార్గంబున నడిచి యట న
నాహతనాదజన్యానందమున దేలి
మరలి రవీంద్వగ్నిమండలాగ్ర
మున కోటిసూర్యులకును నధికంబైన
ఘనతరాపోజ్యోతి గంటి నిన్ను
తే.
గంటి లోపలిమర్మంబుఁ గంటి దీర్ఘ
మైనస్వప్నంబులోన ననంతనిత్యు'
గుణగణాతీత నిర్లోక కొలనుపాక....
103
సీ.
ఘనముగా హృత్పద్మకర్ణికాంతరమున
కోటిచంద్రులకంటెఁ గొమరుమిగిలి
బహుసూర్యమండలప్రభలకంటెను నెక్కు
డై శుద్ధమై బుద్ధమై యనంత
మై సత్యమై నిత్యమై వెలిలోపల
నంతట నిండి యొండై యఖండ
మై వాగగోచరమై విలసిల్లు నా
జ్యోతిని గంటి లోఁజూడ్కి దీర్ఘ
తే.
మైన కలలోన నిను భవహరణగతికి
హేతు విఁక గల్గె రక్షతాహీనసంసృ
తిలులితనతజనానీక కొలనుపాక...
104
సీ.
నుతతటాకవనప్రభృతిసంతతిని మించి
తిని వీరనారాయణుని మహిమను
కృతిముఖంబునఁగాని కీర్తి జగద్విది
తముగాదు గాన సీసములచేత
సంజీవసుకవీంద్రశతక మొక్కటి నీవు
రచియించు వీరనారాయణునక
టంచు శ్రీగోపరాజాన్వయరాయనా
మాత్యచంద్రుఁడు రత్నహాటకాంబ
తే.
రాజ తాంబూలసత్కృతి నాదరింప
శతకము రచించి యిచ్చితి స్వామి నీకు
కుటిలహృదయపినాక శ్రీకొలనుపాక...
105
సీ.
గణబాణషట్చంద్రగణనతశాలివా
హనశకవర్షంబు లరుగ వర్త
మానవిరోధికృన్మార్గశీర్షాదిమ
పక్షతృతీయేదభానువార
మునకు సంపూర్ణమై తనరిన యీకృతి
యాచంద్రతారార్క మగుచు ధరణి
నలరె నీవీరనారాయణశతకంబు
జదివిన వ్రాసిన జనులు సిరియు
తే.
నాయురారోగ్యపుత్రపౌత్రాభివృద్ధి
బరగుదురు గాన నీకృప భక్తహృదయ
కల్పితపదపర్వరీక శ్రీకొలనుపాక...
106
సీ.
తతభరద్వాజగోత్రపవిత్ర పుణ్యచా
రిత్రాయ్యవార్మంతిపుత్ర గోప
రాజాన్వయమహేంద్రరంగద్యశస్సాంద్ర
రాయనామాత్యచంద్రప్రరుంద్ర
శాశ్వతైశ్వర్యసంజాతదాయక కృపా
రససుధాలహరి విరాజమాన
ఫుల్లారవిందసంపల్లలనావాస
భాసుర శ్రవణాన్తభాగభాగ
తే.
రుణవిభాభాసమాన విలోలలోచ
నాంచలనిరీక్షణ పరంపరాభిషిక్త
గోపదిఙ్ముఖదిగనేక కొలనుపాక...
107
సీ.
శ్రీకృష్ణపదయుగాశ్రితుఁడ సాంఖ్యాయన
గోత్రుఁడ రఘుపతి పౌత్రుఁడ గుర
వకవీంద్రపెద్దమాంబాపుత్రుఁడ రఘునా
థునకుఁ బూర్వజుఁడ మృత్యుంజయున క
నుజుఁడ రావూరువంశజుఁడ ననుమకొండ
సౌంజ్ఞగల్గిన యాదిశాఖను వెల
సినవాఁడ జాతకసిద్ధాన్తముఖకళా
చతురుఁడ నుభయభాషావిశేష
తే.
రసగుణాలంకృతి కవిత్వరసికుఁడ విర
చించితి భవచ్ఛతకము సంజీవకవిని
కుంఠితాశ్రిత భవభూక కొలనుపాక...
108
సీ.
కరుణాతరంగ మంగళము రంగద్యశో
గంగాతరంగ మంగళము విహగ
కాన్తతురంగ మంగళము హృతాసుర
ఘనచతురంగ మంగళము సర్వ
గజ్యోతిరంగ మంగళము నృత్తమునిహృ
త్కమలసారంగ మంగళము పుషిత
కలితసారంగ మంగళము కవేరభూ
గర్భస్థరంగ మంగళము నీకు
తే.
భృతభషకజాలజాలప్రవృద్ధగహన
దహనభయభరభాగ్భ్రూణ ధర్మకర్మ
కలుషిత విపద్దహరిణీక కొలనుపాక
వీరనారాయణ ముకుంద విశ్వకుంద.
109