ఈశతకము రచించినకవి గంగాధరుఁడు. ఆపస్తంబసూత్రుఁడు. నియోగిబ్రాహణుఁడు. కవినిగూర్చిన చరిత్రాంశ మింతవఱకే శతకమందలి 282-వ పద్యము వలనఁ దెలియుచున్నది. శతకకవులచరిత్రములో నింకొకగంగాధరుఁడు కలఁడు. ఆతఁడు వీరశైవుఁడు గాన నీకవికి నాతని కెట్టిసంబంధము లేదు. కీరవాణిశతకము రచించిన గంగాధరకవి యొకఁడు కలఁడు. అతఁడు పట్టాభిరామామాత్యునకు రాజమ్మకుఁ గుమారుఁడు. ఆపస్తంబసూత్రుఁడు. కవితాధోరణిలో నిరువురికిఁ బోలికలు గలవు. ఈ రెండుశతకములును పిఠాపురసంస్థానమునందే లభించినవి. రెంటియందును సమానముగా భాషాలోపములు కలవు గాన కీరవాణిశతకము, శ్రీ రమణీమనోహరశతకము రచించిన గంగాధరు లొకఁడె యని తలంపవచ్చును. కీరవాణిశతకము శృంగారసీసపద్యములు ౧౦౧ కలది. అందు వ్యాకరణలోపములున్నను భావలోపములు లేవ నియే చెప్పవచ్చును. శృంగారశతకసంపుటములో నది ముద్రణము కానున్నది. శ్రీరమణీమనోహరశతకము కవి కాలము తీరినపిమ్మట రచించెను. ఈశతకము రచించునాఁటికిఁ గవిభార్య గతించెను. గృహము ఋణములపాలయ్యెను. జ్ఞాతులు క్షేత్రముల హరించిరి. దరిద్రావస్థ తరింపఁజాలక సంపదల నిమ్మని మోక్ష మిమ్మని విష్ణుమూర్తిని బ్రార్థించుచు నెంతకుఁ దనివి చెందక తనసొదనంతయు మూఁడువందల పద్యములలోఁ జెప్పుకొనెను. కొన్ని పద్యములలో గేవల భగవద్గుణాభివర్ణనముమాత్రమె గావించెను. పద్యములందు భక్తిరసము స్ఫుటముగాఁ గలదుగాని భాషాదోషములు మిక్కుటముగాఁ గలవు. శబ్దలోపములు సంధిలోపములు యతిప్రాసలోపములు గూడఁ గలవు. కాలము తీఱిన ముదుసలితనమునందుఁ గూడ నీకవి కవితావిషయమున నేర్పు సంపాదింపఁజాలకపోయెను.
కవికాలము గ్రహించుటకుఁ దగునాధారము లీశతకమున లేవు. కవిస్తుతిలో దిమ్మకవిని జెప్పెను. పుసులూరి సోమరాజు రచించిన నందనందనశతకము లోని "నీచక్కదనంబుఁ చూప మనసైనది చూవుము” అనుమకుటమును శ్రీరమణీమనోహరశతకమునందుఁ బలుతావులఁ జేర్చికొనెను. దీనిబట్టిచూడ నీశతకము ఒకశతాబ్దమునకంటెఁ బూర్వము రచింపఁబడినది కాదని నిశ్చయింపవచ్చును. కవినివాసము సరియగు జీవితకాలము సహేతుకముగ నెవ్వరేని యెఱింగింతురేని ముందు ముద్రణమునందుఁ జేర్చి కృతజ్ఞుల మగుదుము. శ్రీవావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులుగారికి శ్రీపిఠాపురము సంస్థానాధీశ్వరు లొసంగిన వ్రాఁతప్రతి నాధారముఁ జేసికొని కవిభావానుకూలము లగు స్వల్పలోపములుమాత్రము సవరించి ముద్రణమునకుఁ బ్రత్యంతరము సిద్దపఱిచితిమి. కవి భాషాపరిజ్ఞానము లేనివాఁడగుటచే నుపయోగించినలోపములు సవరింపరానివగుటచే నటులే యుంచితిమి. భక్తిరసోద్బోధకమగు నీశతక మాంధ్రమహాజనుల యాదరణపాత్రము కాఁగలదని విశ్వసింతుము.
శుభమస్తు
శ్రీరమణీమనోహరశతకము
ఉ.
శ్రీరమణీయ హృజ్జలజసేవితము న్నిగమార్థపూరము
స్ఫూరితరంగమంగళసభోధుని కెల్లను నాలవాలమున్
సారమురందవిస్పురితసారసమౌ భవదంఘ్రియుగ్మమున్
గోరి భజింతు నెమ్మదిని గూరిమి శ్రీరమణీమనోహరా.
1
చ.
పరమతపఃప్రపూర్ణుల కపారధనంబగు నిత్యమంగళ
స్పురదరవిందసుందరవిశుద్ధచరిత్రవిలాసపూరమున్
వరకమలామనోజ్ఞశుభవర్ధనము న్భవదంఘ్రియుగ్మమున్
గురుతుగ నెమ్మదిం దలఁతుఁ గూరిమి శ్రీరమణీమనోహరా.
2
ఉ.
ఘోరతరాఘమత్తగజకోటి హరింప హరిద్వయంబు సం
సారమహాంధకారఘనసార మడంప దివాకరప్రభల్
భూరియజాండకోటులను బ్రోవఁగ దిక్కగు నీపదంబు లేఁ
గోరి భజింతు నెమ్మదిని గూరిమి శ్రీరమణీమనోహరా.
3
ఉ.
నీమహనీయమూర్తిరుచి నేఁ గనఁ గోరి మహానురాగి నై
శ్యామలకోమలాంగ మది సన్నుతిఁ జేసిన రావదేమి నా
నోముఫలంబు లెవ్విధము నుండెనొ నేమిఁక సేయువాఁడనో
కామునిగన్నతండ్రి నను గావర శ్రీ...
4
ఉ.
నీకును నర్పితంబుగను నేఁ గృతి సేయఁదలంచి పద్యముల్
జేకొని వ్రాయఁబూని నను జిత్తములో బెగడందుశబ్దముల్
రాకడ లక్షణాదికవి లక్షణముల్ గడు లేమి నింక నే
నేకొలఁదిన్ రచింతు దయ నేలుము శ్రీ...
5
చ.
నీను నుతియింప నాతరమె నీరజనాభ సనందనాదిస
న్మునులకు లేదు నేర్పు నిరుమూటిని గెల్వఁగలేని నేను నే
మని నుతియింతు నీచరితమంతయు నేఁ గనలేదు విద్యచే
నను నెటు బ్రోచె దీవు రఘునాయక శ్రీ...
6
చ.
చదువఁగ లేదు శాస్త్రములు చాలదు విద్య కవిత్వరీతికిన్
బదపడి యొప్పు లే నెఱుఁగఁ బ్రార్థనఁ జేసితి నిన్ను వేడుకన్
సదమలనామతప్పు లపశబ్దము లెంచక గైకొనందగున్
ముదము దలిర్పఁగాఁ గృతి సమున్నతి శ్రీ...
7
చ.
శతకము నూరుపద్యముల సంఖ్యను జెప్పిరి సత్కవీంద్రు లో
వితతగుణాఢ్య నామదికి వేడుక బుట్టె శతత్రయంబు బెం
పతులితభక్తిఁ జేసి ప్రమదాతిశయంబున నీకు నిత్తు నా
వెత లతివేగఁ ద్రుంచుటకు వేడుక శ్రీ...
8
శా.
మత్తేభంబులు చంపకంబులు మహామాధుర్యశార్దూలముల్
బొత్తుల్ గూర్చినవృత్తముల్ వరుస మేల్బొందంగఁ బద్యంబు లే
నిత్తు న్భక్తిని జిత్తజారి చెలికి న్నింపొందఁ బూదండగాఁ
గ్రొత్త ల్జిత్తమునందు వెల్లివిరియ న్గోవర్ధనోద్ధారకా.
9
ఉ.
రక్షణసేయు భక్తజనరక్షక నన్ను దయార్ద్రదృష్టిచేఁ
గుక్షి నజాండకోటులను గోరిక బెంచెడునట్టినీకు నా
రక్షణ యెంత! మున్నుఁ గడురక్ష యొనర్పవె దీనకోటుల
న్నక్షయతారకా రఘుకులాగ్రణి శ్రీ...
10
ఉ.
రామ సమస్తలోకనృపరాజిలలామ సురారిభండనో
ద్దామ ఘనాఘపర్వతవితానవిరామవికుంఠధామ స
న్నామ సుభక్తకామ నిను నామది జేర్చి భజింతుఁ గావు మో
శ్యామలకోమలాంగ రఘుసత్తమ శ్రీ...
11
ఉ.
రాజకులప్రదీప రతిరాజునుగన్న విశుద్ధరూప ఘో
రాజి దశాననప్రముఖులం దునుమాడు మహత్స్వరూప వి
భ్రాజితదివ్యచాప సురపాలితకీర్తికలాప నిన్ను నే
పూజ యొనర్తుఁ బ్రోవు రఘుపుంగవ శ్రీ...
12
చ.
వరగుణభక్తలోల సురవందితపుణ్యలతాలవాల శ్రీ
కరకమలావిలాసపరికల్పితపద్మభవాండజాల భీ
కరకరవాలచక్రగదకార్ముకహస్తసుశీల నామదిన్
గురుతుగ ని న్భజింతు నృపకుంజర శ్రీ...
13
ఉ.
పాలితగోపబాల పరిపంథినృపాలహతానుకూల శ్రీ
లోల దయాలవాల మునిలోకమనోరథసిద్ధిలీల భూ
పాల యశోవిశాల యదుపాలనశీల సుగానలోల న
న్నేలుము కీర్తిజాల కరి నేలితి శ్రీ...
14
ఉ.
ఓరఘువీరధీర సుగుణోజ్జ్వల పర్వతధార శూర ఘో
రారివిభంగ మంగళఖగాధిపవాహ పదాబ్జగంగ భూ
భారవిలాసహాస ఘనపండిత శ్రీరమణీసుహాస నే
నేర నుతింప నిన్నుఁ గృప నేలర శ్రీ...
15
చ.
పరుఁడను గాను భక్తజనపాలక పాలితగోపబాలకా
నరసఖ పద్మనాభ కరుణారసపూరితహృత్సరోజ నీ
కరుణ దలిర్ప నన్ను సముఖంబుగ బ్రోచి వరం బొసంగు నీ
కరమర లేల నయ్య వరదా యిఁక శ్రీ...
16
ఉ.
డాయఁగరార భక్తవరదాయక వేగమె లోకనాయకా
బాయఁగఁజాల నిన్ను భవబంధవిమోచన పద్మలోచనా
నాయెడఁ గిల్బిషంబు దగునా తగనా నిను వేఁడఁ బాడ శ్రీ
నాయక బ్రోవు ప్రోవు కడుసమ్మితి శ్రీ...
17
ఉ.
కాటుక పర్వతంబు లనఁగాఁ బెనుపొందు మదీయపాపముల్
సూటి దొలంగి భస్మమయి చొప్పు గనంబడకుండఁ బ్రోవవే
తేటగు నీదుతారకము తేనియల న్గడుభక్తియుక్తి నా
నోటను గ్రోలునంతకును నొప్పగు శ్రీ...
18
ఉ.
పామరుఁ డంచు నన్నుఁ గడుబాములఁ బెట్టఁ దలంచితేని నే
నేమియుఁ జేయువాఁడ మును నెన్నినపాపులఁ బ్రోవలేదె నీ
నామసుధారసంబు మది నాట దినంబు భజింప నింత నా
నోముఫలంబు లివ్విధము లొప్పుట శ్రీ...
19
ఉ.
అండజవాహ ఘోరదురితాటవిదాహ ఘనాభదేహ మా
ర్తాండకులోద్భవా ధరణిధర్మనిరూపణకృష్ణ కేశవా
దండినిశాచరేంద్రకరతండవిఖండనకీర్తిమండనా
నిండగువేడ్క బ్రోవు దయ నెమ్మిని శ్రీ...
20
చ.
అగునగునయ్య దాసవరు లందఱిలో నను వేఱుసేయ నీ
పగతుఁడ నంచుఁ గర్ణముల భాసిల గంటలుగట్టు దానవున్
విగతవిరోధివై పరము వే యొసఁగం దగె నంత కొంతకుం
దగనటవయ్య నీకృపకు ధన్యుఁడ శ్రీ...
21
చ.
పిలచినఁ బల్క వింతమఱపేల చలం బది యేల నీకె కా
వలచితి మ్రొక్కు లిచ్చితి సువాక్యములం దగఁ బ్రస్తుతించితిన్
దలఁపవు జానకీరమణ ధర్మనిరూపణకార్యకారణా
వలదు పరాకు నాయెడ కృపావర శ్రీ...
22
ఉ.
దారుణకష్టభూతచయదర్పవిదారణము న్వికుంఠముం
ద్వారకవాటసంహరణదాయకము న్భవరోగహారమున్
సారసనేత్ర నీభజన సారసమిత్రుని కాంతిసారమున్
గోరెద హృత్సరోజమునఁ గూరిమి శ్రీ...
23
ఉ.
కాంచనవస్త్రసంకలితకాయము కౌస్తుభరత్నశోభలే
లాంఛనముల్ యురంబునను లక్ష్మి పదంబుల గంగ సర్పమే
యెంచినపాన్పు నాకసమె యెక్కువఛత్రము నిన్ని గల్గు ని
న్నెంచ దరంబె యీభువిని నేరికి శ్రీ...
24
చ.
సుతుఁడు విధాత మన్మథుఁడు సూనుఁడు గంగ కుమారి ధాత్రి స
న్నుతిగల రత్నపీఠము వినోదము సర్వజగంబులు న్మహో
న్నతినిగమార్థజాలము జనార్దన యేమికొఱంత నీకు నా
వెత లడఁగించి బ్రోచుటకు వేడుక శ్రీ...
25
చ.
తలఁతును వ్యాసవాల్మికిసుదండుల మాఘుని గాళిదాసుని
న్వలనుగ భాను భాస్కరుల వాసిగఁ దిక్కన పోతరాజులన్
బిలహణు రామలింగమును బేర్మిని నన్నయ తిమ్మ పెద్దనన్
గొలుతు సమస్తసత్కవుల గొప్పగ శ్రీ...
26
చ.
జలజదళాక్ష నాయెడలఁ జాలు పరాకు; భవత్కటాక్షమే
వలచితి వీడఁబోకు తగవా నగుబాటు దలిర్ప నీకు నీ
సలలితరామనామబలసత్వముఁ బెంపుఁ దొలంగ నీకుఁ గా
వలసినవాఁడ రక్షణ యవశ్యము శ్రీ...
27
ఉ.
రార దయాపయోధి దినరాజకులాగ్రణి రామచంద్ర రా
రార పరాత్పరా జగతి రాజకులంబులు గొల్చుచుండఁగాఁ
గారణజన్మ మెత్తి ఘనకార్ముకదక్షుఁడవై నిశాటులం
జీరి వధించు మౌనిజనజీవిత శ్రీ...
28
శా.
రాకాచంద్రుని ధిక్కరించు రఘువర్యా నీముఖాంభోజమం
దాకాంక్షించి మునీంద్రసంఘము త్వదీయాజ్ఞ న్భవద్ధారలై
యేకాంతంబున నిన్నుఁ గూడిన ముదం బేపారఁ జిత్రక్రియ
న్వేకారుణ్యమతిన్ రమించితివి నీవే కావె శ్రీవల్లభా.
29
ఉ.
ఎక్కడ నుంటివయ్య యిఁక నేగతి నీవిట రాఁగదయ్య నా
దిక్కిటు జూడవయ్య కడుదీనుఁడనై భవబంధనంబు చేఁ
జిక్కితి దీని మాన్పఁగలదేవయుఁ గల్గిన ధన్యు లెవ్వరుం
దక్కినవారు లేకు నిను దక్కను శ్రీ...
30
ఉ.
చక్కనివాఁడ వంచు నెఱజాణ వటంచు జగంబులోనఁ బెం
పెక్కినవాఁడ వంచుఁ గరి నేలితి వంచు దయాబ్ధి వంచుఁ బె
న్మక్కువఁ జిక్కె నామదికి మాధవ శ్రీధర శ్రీనివాస నీ
చక్కదనంబుఁ జూపు మనసాయెను శ్రీ...
31
ఉ.
చిక్కితి మంచు గోపికలు జేరి భజింప ముదంబుతోడ నా
చక్కెరబొమ్మల న్గుసుమసాయకసంగరమందు వేడ్కఁ బెం
పెక్కగఁ క్రీడసల్పి దయ నేలిన గోపకుమార నాకు నీ
చక్కదనంబుఁ జూపు మనసాయెను శ్రీ...
32
ఉ.
అక్కర వచ్చె నాకు వినుమా కుసుమాయుధుఁ గన్నతండ్రి మా
రెక్కడలేనిదేవర రమేశ యదూద్వహ రాధికాపతీ
నిక్కము నీలమేఘరుచి నీనుచు శ్రీకరమై జెలంగునీ
చక్కదనంబుఁ జూపు మనసాయెను శ్రీ...
33
ఉ.
మ్రొక్కిన గోపసుందరుల మోహరసాంబుధి నోలలార్చి పె
న్మక్కువ వారిమానధనమంత హరించి ఘనంబు మించి యిం
కెక్కడ నీడు లేని వెలుఁ గెక్కిన నిక్కపుటొక్కసామి నీ
చక్కదనంబుఁ జూవు మనసాయెను శ్రీ...
34
ఉ.
ముక్కున ముత్యము న్నుదుట మొక్కపుఁగస్తురిచుక్కబొట్టును
న్నెక్కువయైనవక్షమున నేర్పడు కౌస్తుభరత్నముుం గరం
బక్కజమారఁ గంకణము భాసిలః బిల్లనగ్రోవితోడ నా
మక్కువ దీరఁ గన్పడర మాధవ శ్రీ...
35
ఉ.
మక్కువ నిన్నుఁ జూడ మది మాటికి మాటికిఁ గోరుచుండె నే
దిక్కుననుండి వత్తువని త్రిప్పనిచూడ్కుల నిక్కినిక్కి న
ల్దిక్కులుఁ జూచి వేసరితి దీనతచే మది గుందుచున్న నా
కెక్కడిదిక్కు కావఁగదవే తగ శ్రీ...
36
ఉ.
అక్కరదీర్తువో యనుచు నాసను నీపదపంకజాతము
న్మిక్కిలి నమ్మి నెమ్మదిని మేలుఘటింప భజింపుచుండ నా
కెక్కడఁ గానరావె యిది యేమిర యోరఘువీర తెల్పి నీ
చక్కదనంబుఁ జూపు మనసాయెను శ్రీ...
37
శా.
వేదాభ్యాసము చేసి శాస్త్రములు తావెయ్యై నను న్నేర్చిన
న్గోదావర్యును గృష్ణ గంగ యమునా గొప్పైనకావేరియున్
బాదాబ్జంబులు నొవ్వఁబోయినఫలంబా? యూరకే నిన్ను స
మ్మోదాస్వాంతక నిర్మలాత్మ గన కే మోహాంధుఁ డైతే హరీ.
38
ఉ.
రామ యిదేమిరా నిరపరాధిని న న్నిటు వీడితేని నే
నేమియుఁ జేయువాఁడ దయ యెయ్యెడ కేఁగెఁ గరి న్విభీషణు
న్గోమలి యైనద్రౌపదిని గూరిమి బ్రోవఁగ నేఁగి యయ్యెడ
న్బ్రేమను నుండెనో మలప వేమిర శ్రీ...
39
ఉ.
అన్నను బాసి వచ్చి శరణన్నను నాదనుజేశుతమ్ముని
న్మన్ననఁ జేసి రమ్మనుచు మానుగ దానవరాజ్యలక్ష్మికిన్
జెన్ను దలిర్ప రాజుగను జేసియు వైరము లెన్న కెంతయున్
దిన్నగఁ బ్రోచి తీవు దయ దెల్పుచు శ్రీ...
40
మ.
వసుదేవాత్మజ వారిజాక్ష విను నావార్తల్ మహావాంఛతో
వసుధామండలిలో నవారితములై వాక్రుచ్చఁగారాని బ
ల్దొసఁగుల్ చేసితి నంచు వీడకుము జేదోయొగ్గి ని న్వేఁడితిన్
వసుధాపుత్రికళత్ర బ్రోవు నను నిష్పాపున్ రమానాయకా.
41
చ.
ఇనకులనాథ నామనవి యేర్పడ నీకును విన్నవించెదన్
జననము నొందుటే మొదలు సల్పితి నెంచఁగరానిదోసముల్
వనజభవాండమందుఁ గలవారలలో ననుబోలుదీనుఁ డే
మనుజుఁడు లేఁడు బ్రోవు నృపమండన శ్రీ...
42
శా.
రారా! రాజకు ప్రదీప రఘువర్యా వేగ రక్షింపరా
ఘోరం బైనభవాబ్ధిమధ్యమున మున్కుల్ సల్పి భీతి న్మహో
దారంబౌ భవదంఘ్రనానికునిచెంతం జేరితిన్ శ్రీహరీ
నేరం బెన్నక బ్రోవఁగాఁ దగు జగన్నేతా రమానాయకా.
43
ఉ.
ఘోరపరేతరాజభటకోటులశిక్షలు విన్నభీతిచే
సారసనేత్ర నీచరణసారసయుగ్మము చెంతఁజేరితిన్
సారవిహీనసంసృతివిషాదతరంగములందు నన్ను నే
భారము జెంద నీకు కృప భాసిల శ్రీ...
44
ఉ.
అంచితమైన నీసొబఁగు లాదరణాధికమైన క్రీడ లా
పంచశరార్తలైన వ్రజపల్లవపాణు లెఱింగి యౌ భళీ
యంచు నుతించి యెంచిన నుదంచితపంచమగీతి వారల
న్వంచన జేసి తీవు శ్రుతి పారగ శ్రీ...
45
ఉ.
ఆదరహాస మామృదువు లావగ లానగుబాటుమాట లా
హ్లాదముతోడ గోపికలఁ బాయఁగఁజాల నటంచు బల్కు ల
త్యాదరత న్మనోజశరతాపము నోర్వఁగలే నటంచు బ
ల్వాదులు బల్కుటెల్ల మదివాంఛలె శ్రీ...
మ.
కరమొప్ప న్వ్రజకామినీమణులు నిష్కౌటిల్యసంపన్నలై
వరసౌందర్యవిశేషవాంఛితలు నై వర్ణించి యౌ నంచు నా
యరవిందాక్షులు నిన్ను బాయకయె మోహాబ్ధి న్నిమగ్నాంగ ల
య్యు రమేశా భవదంఘ్రినావికుఁ గనుంగోరే రమానాయకా.
47
ఉ.
ఎన్నఁగ నీకు నాశబరి యెక్కడిచుట్టము కుబ్జయు న్గుహుం
డెన్నటిబంధువు ల్దయను నేలితి వారల నన్నుఁ గావ నీ
కెన్నఁడు రాదుగా మనసు యేను దురాత్ముఁడ నంచు నీగతి
న్విన్నప మాలకించకను వీడెదె శ్రీ...
48
ఉ.
మండితరత్నహాటకసమంచితకుండలగండభాగ కో
దండకళాప్రచండ భుజతాండవఖండన దండిదానవా
పండితమౌనిహృత్కమలపంజరరంజన మేలు చిల్క యా
ఖండలసన్నుతా దురితఖండన శ్రీ...
49
ఉ.
శ్రీరమణీయవక్ష యదుశేఖర పాండవపక్ష ఘోరసం
సారవిపక్ష భూరిబల సత్వనిశాచరకోటిశిక్ష భూ
భారసురక్ష నిత్యశుభవర్ధన శ్రీహరి సారసాక్ష నా
నేరము సైఁపుమయ్య రిపునిగ్రహ శ్రీ...
50
ఉ.
సారములేని సంసరణసాగరమందు మునుంగుచు న్మహో
దారదురాఘమత్తగజతండమహాపదలన్ గృశింపుచున్
నేరరు నీదునామసుధ నేర్పుగఁ బానము సేయ లోకులు
న్వార లెఱుంగ రీమహిమ వజ్రము శ్రీ...
51
ఉ.
రంగ సమస్తపక్షికులరాజతురంగ రమామనోబ్జసా
రంగ పురారికార్ముకవిరాజితభంగ ఘనాఘనాంగని
స్సంగ దయాంతరంగ బలసత్వపరాక్రమపాదగంగ నీ
మంగళమూర్తిఁ జూపు నృపుమండన శ్రీ...
52
ఉ.
సారము నీపదాబ్జఘనసారససంజనితామృతంబు ని
స్సారము శర్కరాదిఘృతసర్వఫలంబుల మేలు దాని వే
సారక సంతతంబు మది సన్నుతిఁ జేయుచు జుఱ్ఱజుఱ్ఱకున్
సార మెఱింగి గ్రోలెదను జక్కన శ్రీ...
53
చ.
కమలదళాక్ష నీమహిమ గానరుగా భువి మూఢమానవుల్
అమితభవాదిరోగవిలయాపద లొందెడువేళ శ్రీహరీ
సుమశరుగన్నతండ్రి దయఁ జూడుమటంచు భజించునంత నే
శ్రమలు హరింప లక్ష్మణుని సయ్యనగూడుకవచ్చి బ్రోవవే
సమదయ భక్తకోటులను జక్కన శ్రీ...
54
చ.
అతిమధురంబు పాలును గుడాదులు ఖర్జురపంచదారలున్
హితవులటంచు మూఢజన మెచ్చుగనందురు నంతెకాని వే
చతురత మాధురీమహిమ సంవృతతారకనామస్వాదు కే
జత నిలఁ జెప్ప నేది ఘనసారము శ్రీ...
55
ఉ.
దానము లెన్నియైన వరదాయక నన్నము దాన మియ్యఁగా
దానికిఁ దుల్య మేది విను తద్విధిఁ గాననిమాడ్కి దేవ నీ
మానితనామసంస్మరణమందు శతాంశము బోల వెవ్వియున్
గాన రిఁ కేమనందు ధర కష్టులు శ్రీ...
56
ఉ.
సారము మే ల్సుధామధురసాగరపూరము భక్తలోకమం
దారము ఘోరపాతకవితానవిదూరము సర్వలోకవి
స్తారము పుణ్యసారము విషాదపిశాచమదాపహారము
న్వారక విష్ణునామపదవర్గము శ్రీ...
57
ఉ.
చేరితి నీపదాబ్జములు శ్రీరమణీహృదయాబ్జపంజరా
దూరితి నిన్ను ప్రేమఖరదూషణకాననదానవాంతకా
మీఱితి నీదునామసుధ మేలు భుజించి పరేతరాజును
న్నేరిర నీకు సాటి జగ మేలెడు శ్రీ...
58
ఉ.
పాపము ద్రుంచ వేల నతిపామరుఁ డంచుఁ దలంచ నేల నీ
కోప మడంచ వేల మదిఁ గోరినకోర్కె లొసంగ వేల నీ
రూపము జూపవేల కడురూఢిగ నమ్మితి నిన్ను నింక నా
పాపము లెంచ నేమిపని భవ్యుఁడ శ్రీ...
59
చ.
తగెనటె కాళియాహి రిపుతమ్ముఁడు వారిధి కుబ్జకృష్ణయు
న్మగువ లనేకులుం దనుజమర్దన నే తగనా యనుగ్రహిం
పఁగ ఖగరాజవాహ మును పాపులకంటెను ద్రోహినయ్య నీ
కగు నగు నన్నుఁ బ్రోవ విడనాడక శ్రీ...
60
చ.
శబరి భుజించి పండు లిడ సయ్యన గ్రోలి మహాముదంబుతోఁ
బ్రబలసుఖోన్నతుల్ జెలఁగి ప్రాభవము న్గల నీపురంబులో
నబలలతోడుత న్గలసి యాడగఁజేసితి వంతదాని నీ
సొబఁగుకు నాకు నేమొసఁగఁ జొప్పడు దెల్పు దయాపయోనిధీ
సబ బిది రామనామగుణసత్తమ శ్రీ...
61
చ.
వనచరుఁ డేఁగి లంకఁగలవారలఁ గొట్టి పురంబు గొల్వఁగా
దనరుట వింత నీదయ సుధారసవృష్టి బలంబొ జానకీ
వనిత తపోఘనంబొ యది పాల్పడెఁగా యిఁకఁ గ్రోఁతియెంత యే
మనియెదొ దీనికి న్విధము మాధవ శ్రీ...
62
చ.
నిను నుతియింప నేర్పు గననేరనివిద్య ధరామరాళినిం
దనుపఁగ లేనిసంపదలు తల్లిని దండ్రిని వీడు పుత్రుఁడు
న్నెనయఁగ మాను వారినిధినీరము రోగములంచు నెన్నెదన్
వనజదళాక్ష నామదిని వాసిగ శ్రీ...
63
చ.
కలిగినభాగ్యము న్గుడువఁ గాననివాఁడు సమస్తధర్మముల్
దెలిసి పరోపకారములఁ దెల్పనివాఁడు దినంబు నర్థికిన్
గలిగినకొద్ది నివ్వకయె కారులుపల్కెడువాఁడు నిన్నుఁ దాఁ
బలుకనివాఁడు ధాత్రిఁ బలుపాపుఁడు వ్యాధికరుం డటంచు నేఁ
దలఁచెద నాపయిం దలఁపుఁ దప్పకు శ్రీ...
64
ఉ.
కుండలిరాజుపైనను బరుండెడు భండనభీమ సంతతా
ఖండలసన్నుతాంఘ్రిపదకంజలిశేష వికుంఠధామ బ్ర
హ్మాండకటాహరక్షణధురంధర పండితరాజకంధరా
దండిగ బ్రోవు నన్ను దయ దప్పకు శ్రీ...
65
ఉ.
అంకిలియైన ఘోరదురితాటవినిం జనియించుబాములన్
శృంఖలసంకటంబులును జిందరవందరఁ జేయ భీతిచే
శంకరమిత్ర నాదురితసంకటముల్ దెగద్రుంచుమంచు నీ
కింకఁ గరంబు లొగ్గితిని యేలుము శ్రీ...
66
ఉ.
భూరిగుణాఢ్య రాజకులపుంగవ సంగరరంగభీమ ఘో
రారివిరామ భక్తజనరాజి సుసన్నుతదివ్యనామ నా
భారము నీవె కావఁగదె పాపుఁడనైన ననాథనైన సం
సారమదాంధినైన మునిసన్నుత శ్రీ...
67
ఉ.
పాయెఁగదా మహాత్మతను ప్రాయము నాయెడ నీకు నింక లే
దాయెఁగదా కృపారసము దారుణకష్టజలార్ణవంబుపా
లాయెఁగదా ఘటంబు నిరపాయసుఖంబు లొసంగ వేగ నా
నాయన రార నన్ను విడనాడకు శ్రీ...
68
ఉ.
బాలుఁడవై యశోద పరిపాలన సేయఁగ నాలగాచి నీ
లాలకలన్ రతీపతినిలాసజలార్ణవమందుఁ దేల్చు నీ
లీలలు చాతురీమహిమ లెల్ల నుతింపఁ జతుర్ముఖుండునుం
జాలునె మోక్షదాయి ఫణిశాయివి శ్రీ...
69
ఉ.
ఆఱుగుణంబులం చనెడు నాఘనచోరులు జ్ఞానరత్నమున్
వారక దొంగిలింపఁ గడువాసిగ గాచిరి నాఘటంబులో
వారలఁ బట్టనేర ననివారితమోహలతానుబద్ధసం
సారములోనఁ జిక్కితి నశక్తిని శ్రీ...
70
చ.
చిఱుతుకవాలము న్మిసిమిజెందినమేను సరోరుహాక్షులన్
గరమరుదార మీనమయి గాపురుష న్నిగమాపహారుని
న్నురుముగఁ జేసి ప్రాఁజదువు లొప్పుగఁ దెచ్చి విధాత కియ్యవే
పరమకృపారసంబు కడుభాసిల శ్రీ...
71
చ.
సురలు సురారులు న్మహీమ జొప్పడ క్షీరపయోధిఁ దచ్చుచో
భరమున మందరాద్రి కడువాసి దొలంగి మునుంగఁ గూర్మమై
సరగున నగ్గిరీంద్రమును జక్కఁగనెత్తి సురాసురాదుల
న్గురుతుగఁ బ్రోచి తీవు కడుఁగూరిమి శ్రీ...
72
ఉ.
దారుణబాహుగర్వబలదర్పితుఁ డాకనకాక్షుఁ డంతఁ బో
ధారుణి చాఁపఁజుట్టి నతిదారుణమంచుఁ దలంచి వేడ్క భూ
దారపువేషివై యతనిదర్ప మడంచి ధరిత్రిఁ బ్రోవవే
భారము జెందకుండ నిరపాయత శ్రీ...
73
చ.
బలుఁడగురక్కసుండు తనబాలుని జాలదురంతవేదనల్
అలసటఁ బెట్టి నాకును జనార్దను జూపుమటన్న ముద్దులున్
గులికెడురత్నకంబమున ఘోరభయంకరతీవ్రకోపివై
జలజభవాండము ల్బొగడఁ జక్కఁగును న్నరసింహమూర్తివై
వలనుగఁ జింపవే యతనివక్షము శ్రీ....
74
చ.
బలిని బదత్రయంబు భువి బాగుగ దానము వేఁడి మాయచే
జెలఁగి వటుండవై యతనిఁ జేరి పదత్రయ మర్థిఁగోరి భూ
వలయము నంతరిక్షమును వాసిగ రెండడుగుల్ ఘటించి యా
వల బలి నంటఁగట్టియు శుభావహ త్రొక్కవె భూమిక్రిందకున్
దలకొని యింద్రుఁ బ్రోచుటకుఁ దల్చియు శ్రీ...
75
చ.
ధరణి నృపాలకోటి విదితంబుగఁ ద్రుంచి శిరఃకదంబమున్
సురపురి కేఁగుమార్గమునఁ జొప్పడు మె ట్లొనరించి రక్తమున్
బరువడిఁ బైతృదర్పణము భాసిలఁ జేసిన రామమూర్తి నా
తరమె నుతింప నిన్ను వరదాయక శ్రీ...
76
చ.
కదనములోనఁ గ్రూరదశకంధరుకంఠవిలుంఠనంబుకై
మదవతి గోలుపోయి నిజమారఁగ దానవకోట్ల ద్రుంచి నీ
వదను నెఱింగి రావణుని నాజిని గూల్చి ధరాతనూజనున్
బదపడి తెచ్చినట్టి రఘువల్లభ శ్రీ...
77
ఉ.
మక్కువతోడ గోపికల మానధనంబు హరించినట్టి యా
చక్కనికృష్ణమూర్తి బలసత్వుఁడు నీ కనుజుం డటంచు బెం
పెక్కిన రేవతీరమణుఁ డీతఁ డన న్బలరామమూర్తివై
నిక్కము భక్తుల న్గరుణ నేలితి శ్రీ...
78
ఉ.
నీలగిరీంద్రశృంగము వినిర్మలగేహము గాఁగ సాధులన్
బాలన జేసి మూఢులను భండనవీథి వధింప నంతకు
న్గాలముగాక మీఁదనగు కాలము జూచుచునుండి యిప్పు డీ
కాలమునందు బౌద్ధ మనఁగా విలసిల్లెడు నీవినోదపున్
లీలలు నెంచ నెవ్వ రిల నేర్తురు శ్రీ...
79
ఉ.
ఘోరకలిప్రపూర్ణమగు కుంభినిలో ఖలుల న్వధించి భూ
భార మడంపఁగా హయముపై విలసిల్లుచు మేలుకత్తి నా
ఘోర మడంచి సజ్జనులకుం బ్రియమిచ్చెడు కల్కివేషివై
మీరెడు వేల్పు వీవెకద మేలగు శ్రీ...
80
ఉ.
నీపదభక్తికిం బ్రియము నేర్పుగనందగువాఁడు నింద్రియ
వ్యాపకముల్ జయించు గుణవర్ధనుఁ డార్యుఁడు నింద్రియంబులన్
బాపక నిల్వనూదియు విపద్దశలు న్గనువాఁడు ధాత్రి నీ
ప్రాపుకుఁ బాత్రుఁడౌనె ఘనపాపుఁడు గిల్మిషుఁడు న్దురాత్ముఁడున్
శ్రీపతి నన్ను నీకృపకుఁ జేర్పర శ్రీ...
81
చ.
వరద దయానిధే దివిజవల్లభసన్నుతపాదపద్మ శ్రీ
కర ఖగరాట్తురంగ భవకార్ముకభంగ దయాంతరంగ నీ
సురుచిరనామసంజనితశోభనసారము గ్రోలుదాసులన్
బరగ భజింతు వారిపదపంకజరేణుకదంబధారినై
నిరతము నన్ను నీదయను నేలర శ్రీ...
82
ఉ.
చచ్చెడువారిఁ జూచి మది జాలిని నేడ్చుచుఁ దాము జచ్చుటల్
మచ్చికఁ గానలేక తమమానినులన్ సకలార్థసంపదల్
హెచ్చు నిజం బటంచు నిను నెన్నఁడు వాక్కుల మానసంబులన్
బొచ్చము లేనిభక్తిఁ బెనుపొంద భజింపనివారి కేగతో
చెచ్చెర నన్ను నీకృపకుఁ జేర్పర శ్రీ...
83
ఉ.
ఆలియుఁ గంఠపాశము సుతాదిసుహృజ్జను లంతఁజూడ నా
భీలభవాటవిం దిరుగు బెంపుమృగావళి దీని కింతగాఁ
బాలుపడంగనేల యని పల్కదు నామది యేమి సేయుదున్
కాలము చేరువయ్యె ననుఁ గావవె శ్రీ...
84
ఉ.
పాపుఁడు వీని గాతునని భావములోఁ దలపోసి నన్ను నే
పాపము జెందకుండ దయఁ బాలన జేసి కృతార్థుఁ జేయునీ
ప్రా పెదఁ గోరినాఁడ నిరపాయదయానిధి నీకు మిక్కిలిన్
బ్రా పెవరయ్య రక్షణకు వాసిగ శ్రీ...
85
ఉ.
వేడుక లుప్పతిల్ల నడువీథిని నే గడఁ గట్టి దానిపై
నాడుదు ముజ్జగంబుల జనార్దనుతో సరిరారు దైవముల్
చూడుఁ డటంచు మేల్ఘనులు జోడులు గూడి చెలంగ నంతపూఁ
బోఁడులు నాట్యమాడ గుణపూర్ణుఁడ శ్రీ...
86
ఉ.
పాపపిశాచసంఘములు పాల్పడువేళ దురంతవేదనల్
దాపురమైనవేళ భవదంఘ్రియుగంబు మదిం దలంచినన్
రూ పరియంగఁ బోవె యని రూఢిగ నీమహి మేమ నందు నో
భూపకులప్రదీప రఘుపుంగవ శ్రీ...
87
ఉ.
దానము సేయలేదు పరదారల వారిధనంబులందును
న్మానఁగలేదు వాంఛ ధనమార్జనసేయఁగ నేర్పు లేదు డెం
దాన ముదంబులేదు వరధర్మకథల్ వినలేదు మూఢులం
దే ననుఁ జేర్చెదో కృపను దెల్పవె శ్రీ...
88
శా.
జారుండైన ధరామరావరుఁడు దుశ్చారిన్ శుభాకారి ని
న్నారిన్ బంచమరాలినిం దగులుకొన్న ట్టాయజామీఢుని
న్నేరం బెన్నక బ్రోచి తీవు యముని న్నిందించి పుణ్యాత్మగా
నేరీ నీసరిదాత లెన్న భువిలో నెవ్వారు శ్రీ వల్లభా.
89
శా.
మాయాజాలపుమోహవారినిధిలో మాబోటుల న్ముంచియుం
ద్రోయన్రాని మహాపదల్ గుడువ దోడ్తో కాల మెక్కించి యే
చాయంజూచిన గానరాక భయసంజాతార్తిపా ల్జేసితే
మోయంజాలను గష్టముల్ రఘుపతీ మూఢాత్మునిం బ్రోవవే.
90
ఉ.
రాఁగదవయ్య దీనుఁడను రక్షణసేయఁగదయ్య యింక నా
కేగతి తల్లిదండ్రియును నిష్టుఁడవుం జెలివి న్బ్రియుండవున్
భోగిపయి న్వినోదపరిపూర్ణుఁడవై నిదురించువేళ భూ
నాగవియత్తలంబులు జనార్దన కుక్షిని నుంచి బ్రోవవే
భోగశరీరపుణ్య నను బ్రోవర శ్రీ...
91
ఉ.
పాండవమధ్యము న్గరుణ భాసిలఁ బ్రోచెడువేడ్క చక్రమున్
దండిగ బట్టి యాదివిజతండము జూడ వియన్నదీసుతున్
భండనవీథి ద్రుంపఁ బెనుపారెడు కోపముతోడ నేఁగ నా
ఖండలసూతి నన్నుఁ గృపఁ గావుమటంచును వేఁడఁ బ్రోవవే
దండిగ నీకృపారసము దప్పక శ్రీ...
92
చ.
పరధనదారల న్బ్రియము భాసిలఁ గోరెడునామనంబ నే
తరుచరుఁ డన్నచోరుని సదాభవదంఘ్రుల జ్ఞానరజ్జుల
న్బరువడి గట్టిపెట్టి యిది భావ్యముగాదని కొట్టు తిట్టు నీ
కరమర లేల పుత్రుఁడ నిహంబు పరంబు లొసంగు వేడుకన్
వరగుణ నీలమేఘ రుచివైభవ శ్రీ ...
93
శా.
నీవే సర్వజగంబు లెన్న తృణము న్నీకన్న వేఱున్నదే
రావే కావఁగదే వరం బడిగితిన్ రక్షింపవే బెంపవే
సోమార్కాక్షిసరోజ భక్తవరదా సుత్రామశత్రుక్షయా
భావాతీత నుతింపనేరను మహాపాపి న్ననుం బ్రోవవే.
94
ఉ.
పూనితి నీదుచిత్రములఁ బొల్పు నుతింప మహావినోది వే
గాని నిజస్వరూపమునఁ గానఁగరావు వరంబు లీవు నే
మాన సమస్తమైనఁ గడుమాయలఁ జుట్టిన కష్టపెట్టినం
దానవగర్వనిర్దళనతత్పర శ్రీ...
95
ఉ.
కంటి వికుంఠమందిరునిఁ గంటి ధరాత్మజఁ గంటి లక్ష్మణున్
గంటి దినేశ్వరాత్మజునిఁ గంటి మహాబలశాలి వాయుజున్
గంటి సురేంద్రపౌత్రు వెసఁ గంటి కలన్ హరిసేనవారలన్
మింటికి ముట్టె నాసుకృత మేమని చెప్పుదు శ్రీనివాస నీ
బంటను నేలుకొమ్ము కృప భాసిల శ్రీ...
96
ఉ.
పారము ముట్ట నిన్నెపుడుఁ బల్కఁగ నాఫణిరాజు శక్యమా
నేరిచి పల్క నేననఁగ నీమహనీయవిలాససంపదల్
ఆరయ నెంతవాఁడ ఘనకార్యము గాదు గదయ్య నిన్ను నే
గోరె దభీష్టసిద్ధికిని గూరిమి శ్రీ...
97
చ.
అగణితపూర్వజన్మదురితాంబుధిసంభవవీచులందుఁ ద్
వగపడ నీఁదలేక భవదంఘ్రియుగంబను నోడ జేరితిన్
దగవగునే నను న్విడువ దాతవు భ్రాతపు లోకనేతవున్
నగునగునయ్య భక్తవరులందఱ మున్నెటు బ్రోచితీవొ నీ
తెగువ యెఱుంగనయ్య జగతీధవ శ్రీ...
93
ఉ.
చక్కనిరామనామజపసార మెఱుంగ సదాశివుండనా?
నిక్కపు నీదయారసము నేవళము న్గన నాగరాజునా?
యిక్కడ నుండెనంచుఁ బలుకేర్పడఁబల్క సురారిపట్టినా?
నిక్కపుమానుషాధముఁడ నీచుఁడ నన్నెటుబ్రోచెదో ఘనం
బక్కజమార భాస్కరకులాగ్రణి శ్రీ...
99
చ.
అటుకులు గుప్పె డిచ్చి ధనమార్జన సేయు కుచేలుఁడు న్మహా
ఘటికుఁడు నీమహామహిమ గానరు నీవును లంచగాఁడవు
న్నెటువలె నేను నీకరుణ యీఁగుదు లంచము బెట్టఁజాల న
న్నెటు కరుణింతువో నృపకులేశ్వర శ్రీ...
100
మ.
వసుదేవాత్మజ వారిజాక్ష విను నావార్త ల్మహావాంఛతో
వసుధామండలిలో నవారితములై వాక్రుచ్చఁగా రాని బ
ల్దొసఁగుల్ జేసితినంచు వీడకుము జేదోయొగ్గి నిన్వేఁడితిన్
వసుధాపుత్రికళత్ర బ్రోవు నను నిష్పాపున్ రమానాయకా.
101
ఉ.
రాయనఁ బాపసంఘములు రాలును గుక్షిని నిల్వఁజాలకన్
మాయన మూయునంత సుఖమందుఁ జెలంగెడు వక్త్ర మెల్ల నో
తోయజనాభ మేల్మమహితో విలసిల్లెడు నీదునామమున్
బాయక ని న్భజింప నిరపాయసుఖంబు లొసంగ మోక్షసం
ధాయినిగాదె తారకనిధానము శ్రీ...
102
ఉ.
రక్కసిచన్నుపా ల్గుడువరాదనక న్విషమంచు నెంచక
న్నిక్కము దానిపాపములు నీరుగఁ బాలటు గ్రుక్కగ్రుక్కకున్
జక్కఁగఁ గ్రోలి మాతగతి జాలెడు మోక్ష మొసంగి బ్రోచు నీ
యెక్కువ లెన్న నేర్పుగల దేరికి శ్రీ...
103
చ.
దయ విడనాడ నీకు నిజధర్మమ నాదగుపూర్వకర్మ మా
మయుని సుపుత్రి ప్రాణవిభు మర్మము జించి హరించి వానికి
న్నయముగ మోక్ష మిచ్చి నిను నమ్మినదానవుఁ డావిభీషణున్
భయము దొలంగ నేలినది పాటియు సాటియుఁ గాదె నాకు నీ
దయకును బాత్రుఁడ న్విడువ ధర్మమె శ్రీ...
104
ఉ.
తాతకుఁ దండ్రివయ్యు వినతాసుతు నేలెడురాజు వయ్యు వి
ఖ్యాతిగ యోగిబృందముల కందఱకు న్బరతత్వమయ్యు భూ
జాతకు నేలికయ్యు దివిజారుల నెల్ల హరింపనయ్యు నీ
ఖ్యాతి నుతింతు నయ్య నరకాంతక బ్రోవఁగదయ్య నమ్మితిన్
దాతయు దైవము న్భువిని ధన్యుఁడ శ్రీ...
105
ఉ.
వాసిగ జానకీహృదయవారిజగంధరసంబు గ్రోలు మే
ల్భాసురభృంగమా! పరమభక్తుల ముక్తినిధానమా దయన్
వాసిగ నేలు నన్ను రఘువంశజలార్ణవసోమ రామ నీ
దాసుఁడ రాఁగదే దయను దప్పక శ్రీ...
106
ఉ.
రాతిని నాతిఁ జేసి కరిరాజును నీపురిఁ జేరఁజేసి భూ
జాతకు ఘాతఁ జేసి కపిజాతి మహత్త్వము నొందఁజేసి దు
ర్జాతి హరింపఁజేసి సురసన్నుతి నొందిన రామనామ నా
పాతకముల్ హరించు నిజభక్తుఁడ శ్రీ...
107
ఉ.
రాఁగదె జానకీరమణ రాఁగదె వేగమె రాజరత్నమా
రాఁగదె భోగిరాట్భయన రాఁగదె భాస్కరవంశవర్ధనా
రాఁగదె నన్ను బ్రోవ యతిరాజశిఖామణి పద్మలోచనా
భోగశరీర న న్గరుణ బ్రోవఁగ శ్రీ...
108
ఉ.
పామరసంవృతుండనని బాములఁ బెట్టదలంచితేని నీ
కేమియు రామి లేదు యశ మెక్కువ రాదు ధనంబు బోవ దిం
తేమిషనంచుఁ బూనితివె యెక్కువదాతవు నీకుఁ బుత్రుఁడన్
రామ వికుంఠధామ నృపరాజలలామ పవిత్రనామ నా
కామితమిచ్చి బ్రోవు ఫలకారణ శ్రీ...
109
చ.
గజతురగాదిసంపదలు గామినులున్ సుతబంధుమిత్రులున్
నిజముగఁ గల్గి యిద్ధరణి నిత్యత కెక్కినవారు మున్ను నీ
భజన యొనర్చి పూర్వభవబంధలత ల్దెగద్రుంచి మించియున్
సుజను లనంగ నొప్పెదరు సువ్రత శ్రీ...
110
ఉ.
ఎంతరుచో గణింప ధర నేరికి శక్యము రామనామమున్
సంతతము న్భజించుమునిసత్తముని న్గిరిరాజపుత్రి శ్రీ
కాంత యెఱుంగుఁగాక రుచి గాఢతరంబు మదిందలంప నే
కాంతముగాదె యామహిమ గన్గొని శ్రీ...
111
చ.
పరమరహస్యమై నిజము పాల్పడక న్బహురూపమాన్యమై
యరయఁగ శుద్ధసత్వమహిమాతిశయోజ్జ్వలమై వినోదమై
బరగెడు రామనామసుధ భ్రాతిగ జుఱ్ఱెడువారికెల్ల త
త్పర మరచేతిదై ముదము పాల్పడు శ్రీ...
112
ఉ.
కాకము కావు కావు మనఁగా నెపమెంచక బ్రోచి తీవు నన్
జేకొనవేల పక్షికులశేఖరవాహన దానికన్న నా
లోకువ యేమి నిన్ను మదిలోఁ దలపోయుటదప్ప వేఱె నా
లోకువయెంచ నేది ధరలోపల శ్రీ...
113
చ.
కరిపతి కావు కావు మనఁగా విని తత్తఱపాటుతోడ శ్రీ
తరుణి కుచద్వయంబుపయిఁ దాల్చినపైఁటచెఱంగు వీడక
న్బరువులు వారవే తనువు భారమెఱుంగక యట్టినీవు నా
మొఱ విన వేమి నిర్దయసమున్నతిఁ ద్రుంపవ దేమి చెప్పుమా
ఖరకరవంశజాదురితఖండన శ్రీ...
114
చ.
జలజమరందసారమును జక్కఁగ గ్రోలెడుభృంగరాజమున్
వలచునె కేతకీకుసుమవాసనకై భ్రమజెంది నెమ్మదిన్
జలజదళాక్షు నీచరణసారససారము గ్రోలునామనం
బిలఁ గలవారి వేఁడుటకు నెట్లు సహించు దరిద్ర మబ్బినన్
దలఁపవు నన్ను బ్రోచుటకు ధన్యుఁడ శ్రీ...
115
శా.
నీవే దిక్కని నీవే యెక్కువనుచు న్నీకన్న లేరంచును
న్నేవేళ న్భవదంఘ్రియుగ్మములు నే నెంచన్ దయాశాలివై
రావేమే యినవంశవారినిధిచంద్రా శ్రీధరా మాధవా
బ్రోవంజాలవో మూల్యహీనమొ మహాపుణ్యాత్మ దెల్పందగున్.
116
మ.
కలదా యీవిధ మెక్కఁడైనఁ బలుకంగా రాద నే వేఁడితే
జలజాతాసన వాసవాదిసురలున్ జర్చింపరానట్టి నీ
బలవిభ్రాజితచాతురీమహిమలున్ భాషింప నాశక్యమా
దలఁతు న్నామది నిన్ను నేమరక నోధాత్రీశ శ్రీవల్లభా.
117
ఉ.
దీనుల బ్రోవ భక్తులను దేజముగాఁ గడురక్ష సేయఁ బె
న్గానల నాకలంబులును గాయలు దుంపలు నిర్మలాంబువుల్
బానము సేయు మౌనులను భక్తిని యుక్తిని నేల నీకె కా
మానదు నన్నుఁ బ్రోచు టది మానదు శ్రీ...
118
ఉ.
ఎంతని వేడుకొందు నిఁక నేగతి నీదు చరిత్ర మెంతు శ్రీ
కాంతమనోబ్జపంజరశుకా కమనీయవిలాసచంద్రికా
దంతి దురంతచింతలు విదల్చిన శ్రీకర లోకనాయకా
పంతము కెంతవాఁడఁ దగవా నను బ్రోవకయున్న నీకు వే
దాంతమహాటవిం దిరుగుధన్యుఁడ శ్రీ...
119
చ.
పలుకవె యెంత నే బిలుతు పాపముగాదె మహాదరిద్రుఁడ
న్నలసితిఁ గష్ట మొండితి మహాదయశాలివి నిన్నుఁ జూడఁగా
వలచితి నేర్చినట్లు గడువర్ణన జేసితి మ్రొక్కు లీడితిన్
దలఁప వి కేమి సేతు వరదాయక శ్రీ...
120
ఉ.
భాసురమైన నీదయకుఁ బాత్రుఁడఁగాన భజింప మాన నీ
దాసులకెల్ల దాసుఁడ విధాతపితా శ్రితపారిజాత నీ
కే సరి నీవె నీకు సరినెంచ జగంబుల లేరు వేఱె నా
యాస లొసంగు నెమ్మనము హాయన శ్రీ...
121
ఉ.
కానరు నీమహామహిమ గానరు భక్తులఁ బూజ సేయఁగాఁ
గానరు దుర్విచారమను గాఢపిశాచవిదారణంబు లీ
మానవకోటు లేమనెద మాటలమూఢులు వారినొల్ల స
మ్మానచరిత్ర నన్నుఁ గృప మానకు శ్రీ...
122
ఉ.
చాలదు భూము లిచ్చినను జాలదు కన్యల నెందఱిచ్చినన్
జాలదు యన్నదానమును జాలదు మూల్యము లెన్ని యిచ్చినన్
బోలునె బాలకృష్ణ యదుపుంగవ ధీనిధి రాధికాపతీ
నీలనిభాంగ నీదయకు నీటుగ శ్రీ...
123
ఉ.
జాలమిఁ కేల నాయెడ విశాలదయాపర భక్తవత్సలా
లాలితగానలోల గుణలాలిత సర్వజనానుకూల నా
పాలిటిదైవరాయ యెడబాయను బ్రోవర మౌనిగేయ నీ
కేల చలంబు దాసుఁడను నేలుము శ్రీ...
124
ఉ.
వాసవభోగ మబ్బి సుఖవార్ధిని దేలి జగంబు లేలిన
న్నాసకు మేరలేదు ఘనమా ధన మెప్పుడు వెంటరాదు నీ
దాసుల కివ్వఁబోదు ఫలదాయక వచ్చినఁ బోదు వాదు లే
దోసము లేదు నాకు ఖరదూషణకాననవీతిహోత్ర నీ
దాసుఁడ నన్ను నేలు కృపదప్పకు శ్రీ...
125
ఉ.
ఎంచితి నీచరిత్ర ఘనమెల్ల ఘనంబుగ భక్తకోటిలో
మించితి నాదుపాపముల మేలు హరించి పురాకృతంబు వే
ద్రుంచితి జానకీహృదయతోయజతోయజమిత్ర యింక నా
కెంచ భయంబిఁకేల జగదీశ్వర శ్రీ...
126
ఉ.
అక్కఱదీర్తువో యనుచు నాసను నీపదపంకజాతము
న్మిక్కిలి నమ్మి నెమ్మదిని మేలుఘటింప భజింపుచుండ నా
కెక్కడఁ గానరావొ యిది యేమిర యోరఘువీర దెల్ప నీ
చక్కదనంబుఁ జూపు మనసాయెను శ్రీ...
127
ఉ.
మిక్కిలికానలోఁ బసుల మేపుచుఁ బిల్లనగ్రోవి యూఁదుచు
న్మక్కువ పిక్కటిల్ల వ్రజమానినుల న్గుసుమాస్త్రుబారికిం
జక్కగఁ ద్రో చి నీమహిమ సారెకుఁ జూపుచునుండునట్టి నీ
చక్కదనంబుఁ జూపు మనసాయెను శ్రీ...
128
ఉ.
అక్కడ గోపపల్లెకడ నాడెడువేళ మహావినోదివై
మిక్కిలి పాలువెన్నలును మెక్కుచు గోపికలిండ్లఁ జిక్కుచు
న్నెక్కడఁ జూడ నీవె యయి నిందునిభాస్యలఁ గూడి యాడు నీ
చక్కదనంబుఁ జూడ మనసాయెను శ్రీ...
129
ఉ.
మక్కువ యాయశోద సుకుమారతను న్నిను బేర్మిమీఱఁ దా
నక్కునఁ జేర్చి చన్గవల నప్పుడు పా లటు చేపనిచ్చుచున్
ముక్కున ముత్యముంచి కడు మొక్కపుఁగస్తురిబొట్టు దిద్ది మా
రెక్కడలేని నిన్నుఁ దనయెక్కువప్రేమను ముద్దులాడు నీ
చక్కదనంబుఁ జూపు మనసాయెను శ్రీ...
130
ఉ.
చిక్కులఁ బెట్టనేల గడుఁజిక్కినన న్నలయించనేల నీ
యెక్కువ వీడనేల జగదీశ్వర సర్వజగంబులందుఁ బెం
పెక్కి వ్రజాంగనామణులనెల్ల ముదంబునఁ గ్రీడదేల్చు నీ
చక్కదనంబుఁ జూపు మనసాయెను శ్రీ...
131
ఉ.
రిక్కలఱేడు శాంతి ప్రసరించుముఖంబున రావిరేక మే
లక్కజమై దివాకరనిభాంకురమై వెలుఁగొందఁ గన్నులన్
జక్కఁగదిద్దు కాటుకలసారము నీలఘనాభ లొప్పఁ బెం
పక్కజమై కురు ల్భుజమునందు వినోదముచే నటించు నీ
చక్కదనంబుఁ జూడ మనసాయెను శ్రీ...
132
ఉ.
చిక్కనిపాలు ద్రావి వ్రజచేడియలిండ్ల నటించి వారలన్
జిక్కులఁ బెట్టి భావజుని జెన్నగుఁ గ్రీడల కెల్లఁ దార్చినీ
మక్కువ పిక్కటిల్ల సుకుమారుల జారులఁ జేసినట్టి నీ
చక్కదనంబుఁ జూపు మనసాయెను శ్రీ...
133
ఉ.
ఆలను గాచి గోపకులయాపదలెల్ల హరించి రుక్మిణీ
బాలికఁ బెండ్లియాడి కడుభద్రముగాఁ బదియాఱువేల నీ
లాలకల న్వరించి పటులాలనల న్మరు కేళిఁ దేల్చు నీ
లీలల నెంచఁజాలుటకు లేరుర శ్రీ...
134
ఉ.
పాండవపక్షమై ప్రబలభండనవీథి మహోగ్రకార్ముకో
దండకళాప్రచండభుజతాండవుఁ డాసురరాజపుత్రునిన్
దండిగ నేలి భానుసుతు దర్పమడంచి కురుక్షితీశ్వరున్
దండితుఁ జేసి ధర్మజుని దర్ప మెలర్పఁగ రాజుఁ జేసి పూ
దండ యొసంగినట్టి ఘనదైవమ శ్రీ...
135
శా.
రావా మో మిటు జూపవా నను దయన్ రక్షింపవా బెంపవా
భావాతీత గుణాశ్రయా భవహరా భాగ్యోదయా మాధవా
కావా నాకును దల్లిదండ్రి విలపైఁ గారుణ్యరత్నాకరా
నీవే దిక్కుర నన్నుఁ బ్రోచుటకును న్నీరేజపత్రేక్షణా.
136
శా.
ఏవేళ న్గమనీయసుందరములై యింపొందు నీయంఘ్రులున్
భావంబందున నిల్పి ప్రేమలతల న్బంధించి పూజించి యో
దేవా కావుమటన్న సత్కరుణ వే దీపింపఁగా వచ్చి నా
భావం బుల్లసిలంగఁ బ్రోవఁదగదా భాగ్యోదయా! శ్రీవరా.
137
ఉ.
ఎక్కడి కేఁగి తీవొ సుత యేమిర గోపమదేభగామినుల్
మక్కువ వారిమానధనమంతయు నీకు నొసంగియున్నవా
రక్కట వారిప్రాణవిభు లంత యెఱింగిన మేలుకత్తిపై
నెక్కుడుసాము గాదె యిది యేటికిఁ బోకుమటంచుఁ బల్కు నీ
మక్కువ తల్లియొద్ద నయమాడెడు శ్రీ...
133
ఉ.
రాధ మనోరథంబు గడురంజిలఁ బుష్పశరాసనాస్త్రు పె
న్వేధ లడంచి కూరిమిని వేడుకనించి గుణంబు లెంచి యే
బాధలు జెందకుండ నిజభార్యగ నేలిన నీవిలాసలీ
లాధిక మెన్న నాకు దరమౌనటె శ్రీ...
139
ఉ.
రాజతకీర్తి బెం పెసఁగ రామునితమ్ముఁడవై జెలంగి సా
త్రాజితిఁ బెండ్లియాడి కడుదారుణకర్ముల రాక్షసావళి
న్నాజిని కూల్చి క్రూరనరకాసురుఁ జంపి మహావినోదని
భ్రాజితకీర్తి నొందిన శుభావహ శ్రీ...
140
మ.
కురుసేనార్ణవమధ్యమందు నృపుల న్గూల్పంగ భీభత్సునిన్
శరసంతానమహానుభావము వడిన్ సంధించి సారథ్యపున్
భరముం దాల్చి విరోధవర్గములను న్భంజించి ధర్మాత్మజున్
గరుణం బ్రోచితి వీవె కావె ధరణి న్గంసారి శ్రీవల్లభా.
141
ఉ.
గౌతమపత్ని శాపమునఁ గారడవి న్బెనుఱాయి యైన నా
నాతిని బ్రోచె నీదుచరణాంబుజరేణుకదంబమెల్ల నీ
ఖ్యాతి నుతింపగాదు దయఁ గావు రమాధిప నన్ను వేగ యే
పాతక మెంచక న్బతితపావన శ్రీ...
142
చ.
పతితులఁ బ్రోచు నీబిరుదు పాలనసేయు జగత్కుటుంబివై
చతురత జూపుచున్న గుణశాలివి సాగరజామనోహరా
కొతుకఁగ నేల నాకిడ వికుంఠ కుచేలుని కిచ్చి బ్రోవవే
యతులితమైన సంపదలు నన్నియు శ్రీ...
143
ఉ.
ఖాండవ మేర్చునాఁడు తనకార్ముక మెక్కిడి ఫల్గునుండు నా
ఖండలుఁ డంపు మేఘము లఖండమహానినదంబు లొప్ప వే
దండకళాప్రచండజలధారలు నింపఁగ ద్రుంప బాణముల్
దండిగఁ బంజరం బిడిన దాని ఘనంబుగఁ జేసి బ్రోవవే
కుండలిరాజు పాన్పుగల కోవిద శ్రీ...
144
ఉ.
అండజవాహనా ప్రభులలామ జనార్దన రాజమండనా
పండితరక్షకా దురితపంకిలసంకటసంహరా హరీ
దండిదొరా దశాస్యుభుజతండవిఖండన మేలుభండనా
నిండగువేడ్క బ్రోవు దయ నెమ్మిని శ్రీ...
145
ఉ.
మోదము కెల్ల పాదు ధనమోహమదాంధులఁ జేరబోదు నీ
పాదసరోజయుగ్మములపంకమహత్వము నెంచరా దికే
వాదుకు మేలురాదు యమబాధలకీడు సహింపరాదు నీ
యాదర మొక్కటే ఘనతలౌ మది శ్రీ...
146
శా.
కారే భూపతు లెన్న సంపదలతో గర్వించి భోగించిరే
వారే శాశ్వతులయ్యిరే ధనములే వార్వెంటఁ బోసాగెనే
యేరీ చూతమటన్న ధారుణిపయి న్నింపొందిరే గావునన్
మారాకారుని నిన్నుఁ జేరవలెఁగా మార్తాండవంశ్యాగ్రణీ.
147
ఉ.
తల్లికి లేనియట్టిదయ దాదికిఁ గల్గునె లోకమందు నా
తల్లివి దండ్రివి న్గురువు దాతవు దైవమ వీవె కావె యు
త్ఫుల్లసరోజనేత్ర రఘుపుంగవ నాపయి వేగజల్లు నీ
చల్లనిసత్కృపారససుసారము శ్రీ...
148
ఉ.
ఆఁకొని నిన్ను నేఁ బిలువ హారఘునాయక పల్కవేమి నీ
కే కడు మ్రొక్కి మ్రొక్కి దయకే వలపగ్గల మెక్కి యెక్కి చీ
కాకును జెంది జెంది నను గావుమటంచును వేఁడి వేఁడితే
రాక వరంబు లీక యిటు రాయిడి బెట్టుట నీకు న్యాయమా
ప్రాకటశోభనాంగ సురపాలక శ్రీ...
149
ఉ.
వాకొనఁ గూర్చునాకు నిను వర్ణన జేయుటకై త్రివిక్రమా
రాకొమరా దినేశకులరాజశిఖామణి రంగనాథ నీ
రాకకుఁ గోరినాఁడను నిరాకరణం బొనరింప నింక నే
లోకువయైతినా ధరణిలోపల శ్రీ...
150
ఉ.
నీలఘనాభమూర్తి దయ నేలుమటంచు భజింప నింక నీ
జాలము లేలనయ్య దయశాలివి నీవు గదయ్య శ్రీసతీ
లోలుఁడవయ్యు నాదుమదిలోపల ని న్నెడఁబాయనయ్య యే
మూలనునుంటివయ్య ధనమూలముగాదె జగమ్ము గావునన్
జాలధనంబు లియ్యవలెఁ జక్కని శ్రీ...
151
ఉ.
నాకము జూరఁగొన్న సురనాయకుపీఠము నెక్కియున్న భూ
లోకము నేలుకొన్న ఫణిలోకము పాలన సేయుచున్న నీ
లోకముసాటి యౌనె మునిలోకము దీని నెఱింగికాదె యీ
లోకములెల్ల వీడి నిను లోఁ దలపోయుచు మేటెయైననీ
లోకమె జేరఁగోరెదరు లోలత శ్రీ...
152
ఉ.
ఏమిర మాయ యీజగము లేమిర నీదువిలాస మేమిరా
పామర మెంతరా తనువు బాసియుఁ బ్రాణము బోవు టెంతరా
యేమియు రాదురా యితరు లెవ్వరు నింత ఘటింపనేర్తురా
యోమహనియమూర్తి తగవో నగవో యిది దెల్పు నాకుఁ బె
న్బాముల కోర్వఁజాల కులపావన శ్రీ...
153
ఉ.
కల్లరిమానవాధముల గ్రాసముకై కడువేఁడలేక బె
న్మల్లడినొంది నామదిని మాధవ నీపదపంకజాతముల్
జల్లగఁ జేరి కావుమన సాగరజాహృదయేశ యింక నీ
కల్లలు మాని బ్రోవ నిదె కాలము శ్రీ...
154
మ.
వయసెల్లం దిగనాడి వచ్చె ముదిమి న్వద్దంచు గోపెట్టినన్
దయ లేదాయెఁగదే విధాతృజనకా దారిద్రపుంభూతమే
భయముం జేయుచునుండె నింక నెవరే భారంబు వే బాపవే
జయసంధానకరా ధరాసుతవరా శంభుప్రియా మావరా.
155
ఉ.
ఓపరమాత్మ నీకు శరణో శరదిందునిభాస్య సద్యశో
దీపిత నీరజాప్తకులదీపక దీనజనాళిప్రాపకా
తాపనముఖ్యహృత్కమలధాను జగన్నుతనామ నీకు నీ
ప్రాపె ధనంబు బ్రోవు నిరపాయత శ్రీ...
156
ఉ.
శ్రీకరమై రమామణివశీకరమై నిగమార్థసారమై
ప్రాకటరక్తపద్మనిభభాసురమై మృదుసారపూరమై
లోకములెల్ల నిండి మునిలోకమనోహరమైన నీదుసు
శ్రీకరపాదపద్మములు జేరితి శ్రీ...
157
చ.
అగునని చేసి తీవొ జగమంతయు నీమహనీయమాయచేఁ
బగలును రేయటంచు నొకభానుఁడె యొక్కఁడె చంద్రుఁ డంచు సో
యగమె ఘనం బటంచుఁ బలునంచలు లో వెలుగొందు నంచు నీ
సొగసు నిదే యటంచు బహుచోద్యమె నీకు ధనం బటంచు నీ
పగిదియు నీకె నీకె తగుభవ్యుఁడ శ్రీ...
ఉ.
నాయెడ మాయమాను కడునమ్మితి నీపదపంకజాతమున్
బాయను మాయఁ జేసినను భాగ్య మొసంగిన వేఱు జేసినన్
దోయజసంభవాదిసురతోషితతోయజనాభ ద్రోయవే
త్రోయఁగరాని నాదురితతోయధివీచులతోపులెల్ల నో
నాయన నీకుమారుఁడ జనార్దన శ్రీ...
159
శా.
ఓహో రాఘవ యోమహావిభవ యోహోహో రమానాయకా
యోహో దీనదయాపరా నను గృప న్నొప్పొప్పఁగాఁ బ్రోచి యీ
గ్రాహంబు న్బరిమార్చుమన్న కరినిం గారుణ్య మేపార నా
దాహం బార్పను వేగ నామకరినిం దండింపవే వేడుక
న్నాహా నీమహి మెన్న నెన్నఁ డగు దివ్యా బ్రోవవే న న్గృపన్.
160
చ.
రవికులవార్ధికెల్ల నుడురాజు జగంబులు పావనంబుగా
సవినయ మొప్పఁజేయ వికచాంబుజనేత్రుఁడు దానసత్కళా
ప్రవిమలకీర్తికాంతకును బ్రాణవిభుండు ఘనుండు రాముఁ డీ
భువి నని నమ్మి కొల్చు మది పుణ్యుఁడు శ్రీ...
161
ఉ.
కావు మటంచు నీచరణకంజము కంజలిఁజేసి వేడితే
దేవ మదీయవాంఛితముఁ దీర్చి ముదంబునఁ జేర్చి నిత్యసం
భావితబుద్ధి నిచ్చి ధనభారము లిచ్చి వరంబు లిచ్చి నీ
సేవ యొసంగి బ్రోవు నృపశేఖర శ్రీ...
162
ఉ.
రేపును మాపు నీచరణరేణుకదంబము నాశిరంబుపై
స్థాపనఁజేసి నాదురితతాపదవానలకీల లార్చి నీ
రూపము నాకల న్గని నిరూఢిగ నిన్ను భజింపుచుంటి నో
పాపలతాలవిత్ర ఘనపండిత శ్రీ...
163
ఉ.
ఆసలు గోసి జ్ఞానమణిహారము నేసి భవాబ్ధి నీదున
భ్యాసము బాసి నీదుపదభక్తుల పాదసరోజయుగ్మమున్
డాసి సుబుద్ధిఁ జేసి కడుడస్పిన మేనున భూతి బూసి నీ
కోసము కోర్కెఁ జేసిన వికుంఠపురంబు లభింపకుండునే
భాసురకీర్తిహర రఘువల్లభ శ్రీ...
164
ఉ.
వాసనగల్గుపువ్వు గడుభక్తిమెలంగెడుభార్య నిత్యమ
భ్యాసముతోడివిద్య హరివర్ణనఁ జేయుదినంబు సత్యమున్
భాసిలు పల్కు దానగుణభాసురుఁడైననరుండు కీర్తిచే
భాసిలుగాని తక్కినవిభాసిల నేరవుగాదె చూడ నీ
దాసులలోన నే నొకఁడ ధన్యుఁడ శ్రీ...
165
ఉ.
ఆపద కైనబంధువుఁడు నాజ్ఞకు మీరనియట్టిపుత్రుఁడున్
గోపము లేనితాపసియుఁ గోర్కెలొసంగిన రాజవర్యుఁడున్
రూపముగల్గుకాంత తనలోపలిదైవము కాంచుభక్తుఁడు
న్నేపగుగాని భక్తిగుణహీనున కెట్లు లభించు నన్నియున్
బాపము లబ్బు కష్టములు పాల్పడు శ్రీ...
166
ఉ.
యాతన లేనిజీవనము నార్యులు మెచ్చని యట్టిపల్కులున్
భూతదయాపరత్వమును బోధ లెఱింగినమానసంబు వి
ఖ్యాతినిఁ గొన్న సూనుఁడు ప్రకాశమునొంది వెలుంగు విద్య నీ
చేతను మెచ్చుభక్తి నినుఁ జెందెడిదే మహనీయధ్యానముల్
భూతలనాథ శౌరి సురపూజిత శ్రీ...
167
ఉ.
అంగనలేనియిల్లు కుసుమాయుధు క్రీడలులేనిప్రాయమున్
సంగరరంగమందుఁ గడుసత్వము జాలనియట్టి శౌర్యమున్
రంగులెఱుంగనట్టి సతి రాజ్యవిహీనతనొందురాజు నీ
మంగళమూర్తి గన్గొనని మానవుఁడు వృథఁ జెందు నింతె యా
యంగజుఁ గన్నతండ్రి వినుమా యిది శ్రీ...
168
ఉ.
దానము లేనికంకణము ధర్మ మెఱుంగనియట్టితీర్పు సం
ధానము లేని నేర్పు తనదాయల నర్థుల దల్లిదండ్రులన్
దీనతనేయుకల్మి కడుధీరతలేనిరణంబు లిట్టివే
పూనినవాఁడు కీర్తిసతిభోగము బాగుగఁ గాన నేర్చునే
దీనతనొందుఁగాని జగదీశ్వర శ్రీ...
169
ఉ.
కాననివాఁడు భోగములు గాననిభంగి సమస్తకర్మముల్
బూనినఁ బూనకున్న నినుబుద్ధి నెఱుంగనివాఁడు సంధుఁడే
గాని సుపుణ్యుఁ డౌనె యిది గాదనఁగా నెప మేమి గల్గు డెం
దానను నిశ్చయించు వరదాయక శ్రీ...
170
చ.
నుతి నినుఁ జేయువారలను నొప్పుగ నేలేదొ సేయనేరకన్
బ్రతికినవారి బాములకుఁ బాల్పడఁజేతువొ యిట్టిదానికే
పతితులఁ బ్రోచు నీబిరుదుపాటి నటింపదు రాత్రి గావునన్
జతురము గాదు యివ్విధము సల్పుట శ్రీ...
171
చ.
అడవులఁ గొండలం బడిన నాకలమున్ దిను జంతుజాలమున్
బడిబడి నిన్ను నేనుతులు భాసిలఁజేసెను వాని బ్రోవవా
బుడబుడమాట లేమిటికి భూరిగుణాఢ్య సనాథజీవులన్
దడయక బ్రోచుటే బిరుదుఁ దాల్చుట శ్రీ...
172
చ.
మునులును వృక్షమూలముల ముక్కులు మూసుక సంతతంబు హృ
ద్వనజములందు నీమహిమ వర్ణనఁజేసి జపించువారలన్
ఘనముగ బ్రోచి తీవో జపకర్మ మెఱుంగనివారి బ్రోవవో
మనుజవరేణ్య!నీకును సమంబు సమస్తము నెంచి చూచితే
ఘనమును గొద్దియుం గలదె గానరు శ్రీ...
173
మ.
మునిపత్నుల్ దగ నీకు నన్న మిడిన న్మోదించి మోమాటివై
ఘనవైకుంఠపదం బొసంగితి వనంగా విందు శాస్త్రార్థముల్
ఘనమా లంచము గ్రోలి బ్రోచుటలు నోకంజాక్ష నా కెంతయున్
ధనమున్ లేదు నొసంగ నేమిగతి రాధానాథ శ్రీవల్లభా.
174
శా.
ఏమో కాని మొఱాలకించ విదియు న్నేమోయి రాధాపతీ
భామారత్నము పాండవాంగన మహాభారంబుతో నార్వ నీ
ప్రేమ న్బ్రోచుట కల్లలా! కురుసభన్ బెక్కండ్రు లేరా యశో
ధామా శౌరి గుణాభిరామ దయ రాదా శ్రీమనోవల్లభా.
175
మ.
పులిగోరు న్బతకంబు మధ్యమున మేల్బొల్పొందు హేమోజ్జ్వల
త్కలితంబౌ ఘనమేఖలావలయమున్ గాళ్లందెలు న్మువ్వలున్
ఘలుఘల్ఘల్లని మ్రోయఁ దల్లినెదుటం గారాము శోభిల్లఁగాఁ
జెలువుం జూపెడు నీచరిత్రము మహాచిత్రంబు శ్రీ...
176
ఉ.
ఆలను గాచి కారడవులందు విహారముసల్పువేళ గో
పాలురు నిన్నుఁ గూడి బహుభంగుల నెచ్చెలి వంచునాడ నా
బాలురు నేతపంబులును భాసిలఁ జేసిరొ తొల్లి యెట్లు నీ
పాల వసించు సంపదలు భాసిల శ్రీ...
177
ఉ.
అక్కునఁ జక్కఁజేర్చి ముద మారఁగఁ జన్గవ నొక్కి నొక్కి నీ
ప్రక్కను బవ్వళించి రసపాటికి మేటగు మోవి గ్రోలి బెం
పెక్కిన ప్రేమ సూనశరు నెక్కువ సంగరమందుఁ దేల నే
మెక్కువ నోఁచె రాధ కృప నేలను శ్రీ...
178
ఉ.
అందెలు మువ్వలు న్బటురవంబులఁ బాదముల న్నటింప మా
కందసుకందసూనములఁ గల్పితమాల లురంబుఁ గప్ప రా
కేందుకళాకదంబము ముఖేందుసుబింబమునందు నందమై
విందులుసేయు నందసతి వేడుక గాఢము గాఁగ నాడు నీ
సుందరమందహాసమును జూపర శ్రీ...
179
శా.
మందారంబులు మంచిగంధతరులు న్మాకందము ల్గల్గు కా
ళిందీప్రాంతవనంబులో నపుడు కేళీగానమున్ సేయ నా
చందంబంతయు నాలకించి మరుశస్త్రాగ్ని న్నిమగ్నాంగలై
పొందంజాలిరి నిన్ను గోపికలు నింపొందన్ రమానాయకా.
180
ఉ.
అంబుజనేత్ర నీదుకరుణామృత మార్జనసేయువాఁడు మే
లంబరహేమభూషణగజాశ్వసుకాంతుల వింత లొందియున్
పంబినవేడ్క కీర్తిసతిపానుపుపై వెలుగొందునయ్య నీ
లాంబుజసన్నిభా తెలియ నౌనిది శ్రీ...
181
ఉ.
కాననసీమ గోవులను గాచెడువేళ దవాగ్నికీలలున్
భూనభము న్మహాభయము బొంది వెలుంగుటఁ జూచి గోపకుల్
దీనత నొంద నీ వపుడు దెప్పరమైన మహాగ్ని మ్రింగి యా
దీనులఁ బ్రోవవే కరుణఁ దెల్పుచు శ్రీ...
182
ఉ.
తల్లియు రోటఁ గట్టఁ గడుతల్లడమందినరీతిఁ జూపి నీ
కల్లలు దెల్లమై జెలఁగఁ గాలమెఱింగియు మద్దివృక్షముల్
బెల్లుగఁ గుంకుటు ల్బెకలి పృథ్విని జాలఁగ రోలు నీడ్వవే
నల్లనిబాలకృష్ణ నిను నమ్మితి శ్రీ...
183
ఉ.
ఘోరపుపాము మ్రింగుటకుఁ గోఱలు సాచియు నౌళ్లు గీట నా
భారము కోర్వలేక వ్రజబాలలు శ్రీహరి నందనందనా
సారసనేత్ర శౌరి సురసన్నుత కావుమటంచు వేఁడ నా
భార మడంపవే దనుజభండన దాని విదల్చి గోపకుల్
గోరిన కోర్కె దీర నృపకుంజర శ్రీ...
184
ఉ.
అందము నబ్బురంబు ఫలమందుట కెల్లను నిబ్బరంబు గో
విందునియంఘ్రియుగ్మ మరవింద మరందము డెందమందు నా
నందము సందడింప రుచి నానుచు జిహ్వకుఁ దృప్తి నింప మేల్
జెందఁగఁ గ్రోల గోరికలు చెందవె శ్రీ...
185
ఉ.
లేదని భక్తు లెంతకడులేమిని వేఁడిన వారి కియ్యంగా
రాదను దుర్ణయప్రజలరాయిడి బాపి ధనంబు లిత్తు నీ
దే దయ యింతె కాని మఱి యెందుకు మాయలు యెంత వేఁడిన
న్బోదు పురాకృతంబు ఘనపుణ్యుఁడ శ్రీ...
186
ఉ.
స్నానము సేయలేను కడుసంధ్యజపంబులు బూనలేను నీ
మానితరామనామఘనమంత్రము లన్ని వచింపలేను బ
ల్దీనుఁడ మూఢుఁడన్ జడుఁడ దేవర న న్నెటు గాచెదో మహా
దానఘనా దయారసము దప్పకు శ్రీ...
187
ఉ.
తప్పు లెఱుంగనయ్య దురితంబులు బాపఁగదయ్య నాకు నీ
వప్పవు కావుమయ్య యిఁక నన్యుల వేఁడఁగఁజాలనయ్య నన్
దిప్పలఁ బెట్టకయ్య ఘనదేవర నే శరణంటినయ్య యీ
చొప్పున వేఁడ నాపయిని జొన్పవు నీదయ యేమి సేతునో
యొప్పులకుప్ప యేలఁగదె యొప్పుగ శ్రీ...
189
ఉ.
కప్పురగంధులైన వ్రజకాంతలు మోహలతానిబద్ధలై
తప్పక మాధవీవకుళతాలతమాలవనాంతరంబుల
న్నొప్పుగ నిన్నును న్వెదకి యొక్కెడఁ గాంచిరె నీదుమాయ నేఁ
జెప్పఁగఁజాలువాఁడనె విచిత్రము శ్రీ...
189
శా.
బృందారణ్యమునందు వేణువు మహాప్రీతి న్వినోదింప నా
నందాంభోనిధి నోలలాడి నిను గాన న్గోపకాంతామణు
ల్మందారక్రముకాదిభూరుహముల న్మానాథుఁ డేడంచు వా
రందం దందఱి నడ్గుచుం దిరుగ బ్రోవంజాలితో మావరా.
190
ఉ.
నమ్మఁగరాదు యెంతకఠినంబు హృదంబుజము న్ముదంబు నీ
కమ్మి సమస్తవాంఛలవిలాసములు న్విడజిమ్మి మాధవా
యిమ్ముగ నేలుమన్న వ్రజయింతులఁ గంతునిబారిఁ ద్రోచి నీ
నమ్మకముల్ దొలంగ యదునాయక వారలఁ బాసిపోవె నీ
ముమ్మరమైనమాయలను ముంచియు శ్రీ...
191
ఉ.
రాదుర నీకు సత్కృప విరాజితకీర్తికళాకదంబ బె
న్వాదుర భక్తకోటులను వాసిగఁ బ్రోవకయున్న దోసమున్
బోదుర మేలురాదుర సుబుద్ధినిఁ జూడర దీనియర్ధము
న్నాదరమొప్ప నన్ను విడనాడక శ్రీ...
192
చ.
కఠినపుఱాయి నీహృదయకంజము కంజదళేక్షణా హరే
కుటిలపుమానసంబు దగఁ గూరిచి యెంతయు లేదు నీకు నొ
క్కటియకదా నతుల్ దురితకర్ములు చెప్పెడి దేమి యింక నిం
తటికిని గర్మమూలము ప్రధానము శ్రీ...
193
శా.
ఆలంచున్ సుతులంచుఁ జుట్టములటం చాయాసముం జెందియున్
బోలంగా భవబంధనంబనెడు నంభోరాశిమధ్యంబునన్
గేలి న్సల్పియు వాంఛదీర్చుకొనఁగా గెల్పొంద లేనంచు బ
ల్జాలిం బొందిన నన్నుఁ బ్రోచుటకునుం జాగేల శ్రీవల్లభా.
194
ఉ.
పుట్టఁగ నేల యీపుటుక పుట్టినఁ బొట్టకుఁ బట్టెఁడన్నమున్
నెట్టన గల్గకున్న నిను నెవ్వఁడు దిట్టఁడు యింత నాతలన్
బుట్టెనె ధాత్రిలోన మఱిఁ బుట్టినవారికి నెల్ల నిట్టిదే
బుట్టదె నిన్ను దిట్టితినె భూతికి శ్రీ...
195
ఉ.
వెన్నను బోలు నీమనసు వేమరు ఱాయివలెం జలింపకే
యున్నది మున్ను నీగతిని యున్నను భక్తులకెల్ల సద్గతుల్
జెన్నుగఁ గల్గు టెట్లు నిది చెప్పుము నాజననం బ దెట్టిదో
యిన్నిఁటి కేమి నాసుకృత మిట్టిది శ్రీ...
196
ఉ.
ఖండితపాపసంఘదశకంఠవిలుంఠనచండకాండవే
దండపతిప్రచండరిపుదర్భవిఖండన దైవరాయ మా
ర్తాండకులప్రదీప యతిరాజశిఖామణి సత్యరూప నీ
దండను జేరినాఁడ దయఁదప్పకు శ్రీ...
197
ఉ.
ఖండితమూలమై పడిన కారడివి న్వెసఁగాల్చు వీతిహో
త్రుండన ఘోరపాతకవితూలమహాద్రులు గాల్చు నీమహో
ద్దండసునామసారము విధాతకునైన నుతింపవచ్చునా
పండితరక్షకా దనుజభండన శ్రీ...
198
చ.
త్రిగుణములందు సత్యమయతేజము నీమహనీయరూపమున్
బగలును రేయి యొక్కగతి బ్రహ్మమయోజ్జ్వలమై వెలుంగు నీ
తొగలహితుండు భాస్కరుఁడు తోయధులేడు కులాద్రులేడును
న్నిగమములాది సర్వమును నీవె ఘనంబును లేమి నీవె నీ
సుగుణము లెన్న నాతరమె సువ్రత శ్రీ...
199
ఉ.
పూసల దారమున్బలెను భోగిశయాన సమస్తలోకముల్
వాసిగఁ గర్మసూత్రమున వ్రాలగఁ గట్టియుఁ గర్మసాక్షివై
భాసురమాయచే నటునిభంగి విలాసముఁ జూపునీకు నే
దాసుఁడ నేలుకో దయను దప్పక శ్రీ...
200
ఉ.
వేయననేల నీకుఁ దగవే భవతోయధి నీదలేక యో
నాయన నాయనా కడు వనాథను రక్షణ సేయు మన్న నీ
మాయలెకాని ప్రేమను సమర్మకమానస మొప్పఁబ్రోవవే
మోయి ఘనంబటోయి ధనమూలము నీజగమోయి వేగరా
వోయి వరంబు లియ్యదగవో యిఁక శ్రీ...
201
ఉ.
ఎక్కువఁ జెప్పవోయి ధన మెక్కువొ నీఘన మెక్కువో ధర
న్నిక్కము తానయై ధన మనేకవిధంబుల మాయ లీగుచు
న్నెక్కడఁ జూచినం దనదు నెక్కువ లేర్పడి భూతలంబున
న్గ్రక్కునఁ గ్రీడ సల్పు నివు గానఁగరావు ఫలంబు లీవు నీ
యెక్కువఁ జెప్ప నేది ధన మేలని శ్రీ...
202
చ.
ధనము ఘనం బొసంగు కడుదారుణకర్మలు మాయఁజేయు మా
నినుల భ్రమించు నేలికలనీతులు వే హరియించు మౌనులన్
బనిగొను యాగము ల్ఫలము భాసిలఁజేయును గర్త తానయై
వనజదళాక్ష నీవు గనవత్తువొ కోరిన కోర్కె లిత్తువో
నిను నిటులాడ నాకె తగు నెన్నఁగ శ్రీ...
203
ఉ.
పాపములన్ హరించు నిరపాయసుఖంబు లొసంగు ముక్తికే
ప్రాపగు సర్వజంతువులఁ బ్రాణము గాచు సుభోగసంపదల్
యేపొనగూర్చు సుందరముకే తనుమూలము గానిపించు నీ
వేపగిదిన్ ఘటింతు వవి యెంచఁగ శ్రీ...
204
ఉ.
అర్థము నిన్ను వేఁడుమని యాడెడుభక్తులపల్కులన్నియున్
వ్యర్థముగాఁ గనంబడు నవశ్యము నర్థము లోకమందు వేఁ
డర్థుల కిచ్చిన న్ఘనత నార్యుల కిచ్చిన మేలు నివ్విధిన్
సార్థకమైనదాని ఘనసత్య మెఱుంగక వేఁడుమన్న నే
యర్థ మొసంగి బ్రోచెదవొ యందఱ శ్రీ...
205
ఉ.
కూటికి నేది కర్త సమకూర్పను లోకము రక్ష సేయ నా
మాటకుమాట జెప్పు నిజమా గడుదబ్బర నాదువాక్యముల్
కోటిధనంబు గల్గునరు గొప్పఁగఁ జూతురు సర్వదేవతల్
మాటల కేల నీవె యని మానుగ శ్రీ...
206
ఉ.
కాంచనరూపమై ధరణిఁ గానఁగవత్తువు నన్ని నిత్తువున్
యెంచఁగ నేల నీమహిమ లేక్కువ వేఱొకిబున్నదే ధరన్
వంచనలేల నింకఁ గడువాసిగ నాకు ధనం బొసంగు మే
లంచిత మొప్పఁజేయు పరమార్ధము శ్రీ...
207
ఉ.
ఆడితి నే ననేకములు నంబుజనాభ దయాబ్ధివంచు నే
వేఁడితి బాడబానలము వేఁడిమితో సరిబోలు కాలునిన్
జూడఁగనోడి నిన్ను వడిఁ జూప జగన్నుత యాశ్రయించితి
న్గూడఁగ వచ్చి నాభయము గూల్పర శ్రీ...
208
శా.
నాఁడే నమ్మితి నిన్ను నింతదడవా నన్బ్రోవ సీతాపతీ
కూడా రా వది యేమి భూరిగుణ నీకు న్ధర్మమా వీడ నా
కేడంజూచిన లేఁడు బ్రోవ నొకఁడు న్నిందీవరాక్షా పరుల్
జోడా నీకు సమస్తలోకములలో జూడంగ నీవే హరీ.
209
ఉ.
లోకములోనఁ గొందఱబలుల్ నిను గానఁగనేరక న్మహా
వ్యాకులవీచుల న్గల భవార్ణవమందు మునుంగుచు న్వెసన్
బ్రాకృతకర్మబంధముల పాల్పడి చచ్చుచుఁ బుట్టుచుంటయే
గాక వికుంఠమందిరము గల్గునె నీపదభక్తిలేని చీ
కాకుల కాయమాలయము గల్గక శ్రీ...
210
ఉ.
వందనమయ్య రామ ఖగవాహన దైవలలామ భక్తహృ
న్మందిరపూర్ణకామ సుకుమార దినేశకులాబ్దిసోమ యా
నందవిలాసధామ నృపనందన పండితసార్వభౌమ నా
డెందమునందు గోర్కి వడిఁ దీర్పర శ్రీ...
211
ఉ.
దాకొని రావణాసురుని దారుణపాతకదుర్విలాసునిన్
నాకనివాసులందఱకు నాజి నశక్యుని దుష్టముఖ్యునిన్
దేఁకువమీఱఁ ద్రుంచి రణధీరత మించను నీకే కాక యీ
లోకములోన దేవపతిలోకములోఁ గలరే రఘూత్తమా
నీ కొకసాటి గూర్చుటకు నిత్యుఁడ శ్రీ...
212
చ.
పరువడి తర్కవాదమను పారకొస న్భరతత్వధారుణిన్
సరళిగఁ ద్రవ్వి కన్గొనఁగఁజాలని కామనిధాన మిప్పుడున్
గురుతగు భక్తి నబ్బె భళి గూడెను ముక్తిలలామపొందు నా
కరమర లేల యింక వరదాయక శ్రీ...
213
ఉ.
ఏమితపంబుఁ జేసెనోకొ యెట్టిసుకర్మము లాచరించెనో
కోమలయైనకుబ్జ నవకోమలరూపవిలాస మబ్బ నీ
ప్రేమకుఁ జాలి లోకములఁ బేరుగనన్ రవివంశవర్ధనా
సామజసన్నుతా తెలియఁజాలను శ్రీ...
214
చ.
సురుచిరమైన నీచరణశోభనశంఖహలాదిరేఖలున్
బరువడి చిహ్నలై పరగు భాగ్యము మస్తకరాజి నొప్పి పెం
పరుదు ఘటించు కాళియఫణావళి పుణ్యము లేమి జేసెనో
తరమె గణింప నాఫలము ధాతకు శ్రీ...
215
ఉ.
దారుణకంటకవ్రజము దట్టపుమెట్టలు చిట్టిరాలునున్
గ్రూరము లైనజంతువులు కేళియొనర్చెడుకానలోన నీ
చారుతరాంఘ్రియుగ్మములు జక్కఁగను న్నటియించుభాగ్యమున్
భూరిగుణాఢ్య యెంచగను బోలునె శ్రీ...
216
ఉ.
కేలను బర్వతంబు గొని కేలి యొనర్పుచు జాలవృష్టి బెం
జాలము మారుతప్రభ విశాలము లీలయుఁ దాఁకకుండ గో
పాలుర గోపికామణుల బాలుర గోవుల గోపవృద్ధుల
న్నేలి శచీపతిన్ జగము నిందయొనర్పఁగఁ జేసినట్టి నీ
లీలల నెంచ నాతరమె లేశము శ్రీ...
217
ఉ.
పాలును వెన్నలెల్లఁ గడుపారఁగఁ గ్రోలి వ్రజాంగనామణీ
జాలముతో రతీరమణుసంగరమందు మహావినోదలీ
లాలసదృగ్విలాసఘనలాలితలోలుఁడవై చెలంగుగో
పాల భజింపఁజాల నిను భవ్యుఁడ శ్రీ...
218
ఉ.
నాఁడు యశోదయొద్ద వ్రజనారులు నీసుతుఁ డెల్లదొంగ పూ
బోఁడి మరల్ప వేమి యని బోటులు సూటిగఁ బల్క నప్పు డా
జాడ యెఱింగి తల్లి చెయిఁ జాచి నినున్ దను బట్టికొట్టఁబోఁ
జూడఁగ భీతినొంది క్రియఁ జూచుచుఁ గొట్టకుమంచు నన్న నీ
జాడయుఁ గానరే సతులు జాణలు శ్రీ...
219
చ.
చెలివని పాండవేయులు నిజేశ్యుడవంచును గోపికామణుల్
బలియుఁడవంచుఁ గౌరవులు బాలుఁడవంచును నందభార్యలున్
వలచితిమంచు గోపికలు వల్లభుఁడంచును రాధికాదులున్
దలఁచిరి గాని యిందిరకు దాచినచుట్టమపై జగంబులున్
గలుగఁగఁజేయు దైవమని గాంచిరె శ్రీ...
220
చ.
అతిబలవంతుఁడైన వినతాత్మజు నెక్కి సమస్తలోకముల్
చతురతచే మహామహిమ జాలముచేఁ బెనుమాయబెంపుచే
నితరము లేక యేలునిను నేర్తురె సన్నుతినేయ శ్రీసతీ
పతి పరమాత్మ భవ్య గుణభాసుర శ్రీ...
221
చ.
సిరికిఁ దొలంగి కారడవి సీతను గూడి చరించుటెల్ల నీ
ధరణి విలాస మొప్పనెకదా సరసీరుహనాభ నీమహో
త్కరకమనీయశక్తి బలుకం దరమా ఫణిరాజుకైన మా
వర ననుఁ గావరా ధర కృపావర శ్రీ...
222
చ.
నలినదళాక్షు లంత యమునానదిలో జలకంబులాడనై
వలువల నొడ్డుపై నిడిన వానిని జోరతఁ గొంచునేఁగుట
ల్లలనలయందు సత్కృపవిలాసము వెల్లడిసేయ ధాత్రి నీ
చెలిమి నుతింప నెవ్వరికిఁ జెల్లును శ్రీ...
223
మ.
కలరా దాతలు నీకు సాటి బలుకం గంజాక్షి పాంచాలికి
న్వలువ ల్విప్పఁదొడంగ భీతిపడి రావయ్యా జగన్నాథ యీ
పలుగాకుల్ యిటు చేసిరంచుఁ బలుక న్బాటించి రక్షించవే
వలువల్ జాల యొసంగి ప్రేమఘనమున్ వర్ధిల్ల శ్రీవల్లభా.
224
శా.
రారా నీలఘనాఘనాంగరుచిరా రారా కృపాసాగరా
రారా క్షీరపయోధిశేషశయనా రారా రమావల్లభా
రారా నాకు వరంబు లీయ వదియేరా యంచు నే వేఁడితే
భారంబా యిది నీకు నెంతపని నాభాగ్యంబు శ్రీవల్లభా.
225
చ.
కడువడి సైకతంబున వికాసమెలర్పఁగ దొర్లి దొర్లి తా
నుడుతయు వార్ధికట్టపయి నొప్పుగఁ జల్లినదానివల్ల నే
పడరినవార్ధి కట్టువడె నాపని మెచ్చుట లెల్ల నీకు నీ
పుడమిని భక్తవత్సలతఁ బోల్పు జెలంగనుగాదె గావునన్
దడయక నన్ను బ్రోచుటలు దల్చర శ్రీ...
226
శా.
సీతావల్లభ రామదాశరథి యక్షీణప్రభావోదయా
భూతాత్మా కమలాలయాప్రియ మహాపుణ్యాత్మ విద్వన్నుతా
దాతా రాఁగదవే విధాతృజనకా దామోదరా మాధవా
చేతోమోద మెసంగ నన్ను కరుణం జేపట్ట నోమావరా.
227
ఉ.
మానితమైన నీదుసుకుమారము మాయలతావితానముం
గానఁగఁజాలినట్టి మునిగాని భవాబ్జభవాదు లైననుం
గాని నభంగి నిన్నుఁ బొడఁగానఁగ వేఱొకమార్గ మున్నదే
యీ నను నేలఁ గాదనకు మీశ్వర శ్రీ...
228
ఉ.
అంచను నెక్కి యాడు కమలాననుఁ డాత్మభవద్విలాసమున్
నెంచఁగనేరక న్భ్రమసి యేదిఁక నేదొ యెఱుంగలేక రా
యంచపయి న్నభంబున విహారము జేసెనుగాని మాయచే
మించిన నీమహామహిమ మేలుగనంగను జాలెనయ్య నే
నెంచఁగ నెంతవాఁడ దయ నేలర శ్రీ...
229
చ.
నిరతము షడ్వికారములు నిర్మలమామకమానసంబనే
తరువును నాశ్రయించి నిజధర్మముచేఁ బెనుపొందనీక తా
మురువడి దానిఁ బట్టుకొని యూపుచు నేపుచునుండు నిత్యమున్
గురుతు లెఱుంగనీవు నిను గోరి భజింపఁగనీయ వింక నే
వరవున వాని గెల్తు మునివందిత శ్రీ...
230
చ.
వరద జగత్త్రయంబులును వర్ణనసేయఁగఁ దెచ్చె నీశరం
బరుదగు వీచికానిచయ మభ్రపదంబున నంటి నాదవి
స్ఫురితమహోగ్రతీవ్రము నభోమణిమండల మాక్రమించు భా
సురజలరాశినెల్లఁ గడుచోద్యపురూపునిఁ జేసి దానిభీ
కరము నుతింప నేరికిని గాదుర శ్రీ...
231
ఉ.
వారిధి గట్టుఁ గట్టఁ గపివల్లభుసేనలు లంక ముట్ట దు
ర్వారపరాక్రమస్ఫురణ రంజిల దాని నతిక్రమింపరే
వారి సబాంధవంబుగను బట్టి శిరంబులు గొట్ట కీర్తి బెం
పార ధరిత్రి నించుటకు నారయ నీ కగుఁగాక నెవ్వ రీ
ధారుణి శక్తులై దనరుధన్యులు శ్రీ...
232
చ.
అరయఁగ నీవు విక్రమకళానిధివై ఖరదూషణాదులన్
దురమునఁ దాటకం దునుమ ధూర్జటివి ల్దెగఁద్రుంప జానకిన్
బరిణయమొంద లోకములు పావనమందఁగఁజేయనేకదా
వరద వికుంఠమున్ విడిచి వచ్చుట శ్రీ...
233
ఉ.
వాసిగ నీకు భద్రగిరివాసము భూసుత భార్య తమ్ముఁడే
దాసుఁడు గౌతమీనది నిధానము నిత్యము భక్తవర్యులున్
దాసిన చుట్టముల్ గలిగి దానగుణంబులఁ బెంపునొందు నీ
భాసురనామకీర్తనలు భాగ్యముగాదె వచించువారికిన్
నీసరి నీకు సాటిగను నెన్నఁగ శ్రీ...
234
శా.
నన్నా కన్నడసేయ రాజనముకున్ నానాయనా మేలు నీ
కున్న న్భక్తులలోన నే నొకఁడనా యుర్విన్ దురాత్ముండ నా
పన్నానేకశరణ్య నీకుఁ దగవా ప్రారబ్ధమా వోయి నా
యన్నా దీనత మాన్పి బ్రోవదగవే హా దేవరా మావరా.
235
ఉ.
కాదుర యింతనిర్దయకుఁ గాలము భక్తులకెల్ల నియ్యఁగా
రాదుర నీగృహంబున విరాజితమై పెనుపొందు శ్రీసతీ
లేదుర నిన్ను బాయకనె రేబగలున్ విహరించుఁగాని తాఁ
బోదుర దూరదేశమును బ్రోవర శ్రీ...
236
ఉ.
ఈతఁడు పాపుడంచు జను లెన్నఁగ నారడిగొంచు నీమహా
ఖ్యాతిఁ దలంచి నీచరణకంజము కంజలి యొగ్గి నామహా
పాతకముల్ హరించుమని ప్రార్థనఁజేసితి నీజగంబులో
దాతవు నన్ను నేలఁ దగదాయెనె శ్రీ...
237
చ.
కలవు మహాద్భుతంబు లవి కాంచనచేల భవద్విలాసముల్
జలరుహగర్భుడైన నుతిసల్పఁగఁజాలునె మానవాధముల్
తెలియఁగ నేర్తురే మహిమ దివ్యమునీంద్రులు కొంతకొంతయుం
బలుకుదురయ్య భక్తి బెనుపై మది శ్రీ...
238
ఉ.
కర్మఫలంబు లబ్బు తుదగాచుట లేమి ఘనంబు ధాత్రిలో
నిర్మలుఁడైన భాస్కరుఁడు నిత్యము గ్రుంకెడు మేరదప్పకన్
కర్మము ద్రుంచి మేలిడినఁ గాదె ఘనంబు ధనంబు గీర్తియున్
ధర్మము నీకు నీవిధము దప్పకు శ్రీ...
239
ఉ.
నాతిని రావణాసురుఁ డనాథను జేసియుఁ గొంచుఁబోవ నీ
చేతను గాకపోయెఁగద చేసినకర్మములెల్లఁ ద్రుంచు నా
సీత పతివ్రతామహిమచేఁ గడుభంగములేక వచ్చె నీ
ఖ్యాతికి నేమి కారణము కర్మము మూలము నీకు మిక్కిలా
నేతగ నిన్ను వేఁడ ఘన మేమిర శ్రీ...
240
ఉ.
కర్మము మేలుకీళ్లకును గారణమై జెలువందునీకు నే
కర్మములేదు లోకములఁ గాల్చ నృసింహ హరించు శంభుఁడున్
నిర్మలమైన సంపదలు నీసతి యిచ్చును బల్క వాణి ని
ష్కర్ముఁడ వేమి యిచ్చెదవు గల్గఁగ శ్రీ...
241
ఉ.
హారము లేదు యెన్నఁడు విహారము లేదని చెప్పనేల యా
కారమె లేదు సంజననకారణకర్మ మెఱుంగ వెన్నఁడున్
శూరత లేదు సుస్థిరతచొప్పు గనంబడలేదు యింక నే
భారములేక వెల్గెదవు భాసురతేజ మహాబ్ధిలోపలన్
భూరివిలాససంపదలఁ బొల్పుగ శ్రీ...
242
ఉ.
బంగరుచేల గట్టి వ్రజభామలచెట్టలు వట్టి వేడ్క మీ
ఱంగఁ గురంగభృంగమణిరంగతరంగసరోవరాళిమా
తంగవిహంగసంవృతము దావహపుష్పవనంబులందు నీ
రంగు జెలంగఁ గ్రీడలను రంజిలు యాదవరాజసింహ శ్రీ
రంగపురీశ నన్నుఁ గన రాఁగదె శ్రీ...
243
ఉ.
రాఁగదె భక్తపెన్నిధి నిరాదరణం బిఁక యేల నాకును
న్నీఁగదె భోగిరాట్ఛయన యెక్కువయైన భవత్కటాక్షమున్
సాగి నమస్కరింతు మది సన్నుతులెల్ల ఘటింతు నెంతు నీ
యోగము భోగరాగముల యొప్పును శ్రీ...
244
ఉ.
తప్పకు సత్యవాక్యము విధాతను గన్న ఘనాఘనాంగ నీ
కొప్పునె తప్పు బల్కుటలు నుర్విని పాపులఁ బ్రోతునంచు ము
న్నొప్పిన కీర్తిఁ బోవిడువనొప్పునె యెప్పటికైనఁ జెప్పు నా
తప్పుల నెన్నఁగాఁదగునె దాతవు శ్రీ...
245
ఉ.
కారులు బల్కినాఁడ నని కాదుర కోపము నీకు నెయ్యెడన్
గారులు గావు నీకరుణగన్న కుమారుఁడ యెట్లు బల్కిన
న్నేరము లేదు భక్తజననీరధి దాశరథీ కృపానిధీ
వేఱుగఁ జేయబోకు కడువెఱ్ఱిని శ్రీ...
246
చ.
పలుకవు యేమిపాప మిది పంతము సేయుట కెంతవాఁడ నీ
పలుకు వినంగ భ్రాంతి వలపక్షము భక్తులలోనఁ గూడునా
పలుకవు తొల్లి ద్రౌపదికి వారణరాజముకు న్గుచేలుకు
న్నలుకలిఁ కేల వేగ పలుకాడర శ్రీ...
247
ఉ.
పాపము గాదె నన్ను వలపక్షము సేయుట భక్తకోటిలో
యోపరమాత్మ నీకు శరణో యని వేఁడినఁ జూడవేమి యీ
కోపము కేమి కారణము కూటికెకా నిను నింత వేఁడ నా
లోపము లెన్నఁబోకు మదిలోపల శ్రీ...
248
ఉ.
పుట్టినవారలందఱును బొట్టకెకా నిను వేఁడ ధాత్రిలోఁ
బుట్టఁగనేల పుట్టి మఱి బూడిదెపాలుగఁ గాఁగ నేల యే
పట్టున బుట్టలే ననుచుఁ బట్టితి నీపదపంకజాతమున్
బొట్టకుఁ బెట్టి యీపయిన పుట్టుక మానిపి నన్నుఁ జేర్చు నీ
పట్టిని నన్ను నేమరక పట్టర శ్రీ...
249
ఉ.
చాలుర జాలమింక వికచాబ్జదళాక్ష సుభక్తరక్ష నీ
పాలనుబడ్డనన్ను బరిపాలనసేయు మహావినోద లీ
లాలసదృగ్విలాస ఘనలాలితభాస రమావిలాస గో
పాల సునందబాల ఘనపండిత శ్రీ...
250
శా.
శౌరి న్దల్చెద నామది న్ముదముతో సత్కర్మయుక్తుండనై
గౌరీసన్నుత పాదపద్మయుగళు న్గాళీయదర్పఘ్నునిన్
సారాచారుని నీరదాభుని జగత్సంసేవ్యమానున్ రమా
నారీహారిగుణాకరున్ శుభకరు న్నారాయణున్ శ్రీవరున్.
251
మ.
తలఁతు న్గోపకుమారు పాదజలజాతంబు న్మహాభక్తిస
మ్మిళితానందమనోవిలాసరతిచే మేలందగాఁ గోరుచున్
వలపుల్ రెట్టిగొనంగ వాంఛలు మహావర్గంబులై యొప్ప ము
ద్దొలుకన్ సర్వసుఖంబు లబ్బుననుచు న్నొప్పొప్ప శ్రీవల్లభా.
252
ఉ.
ఓరిరమేశ యోవరద యోరిజనార్దన యోముకుంద యో
హోరి మురారి చక్రధర యోఖగవాహన యోపరాత్పరా
యోరి మహాత్మ యోశుభగ యోరి నను న్గృప జూచి యేలుమీ
కారుణికాత్మ మేల్దయవికాసను శ్రీ...
253
ఉ.
ఆలను గాచి గోపకులయార్తి హరింప ననేకరూపులై
కీలలనొప్పువహ్నియును గీల్గొన గీటెడుపామునున్ దయా
శాలివి గాచి తీ వనుచు శాస్త్రములుం దగఁబల్కుచుండె నీ
పాలుర గోపబాల నను వాసిగ నేలర గానలోల నే
జాలర నిన్ను వేఁడ పస జాలదు శ్రీ...
254
ఉ.
కారణకర్తవై నిజము గానఁగనీక వికారదూరసం
చారవిలాసమాయఘనసారముచే జగమెల్ల గప్పుచున్
పారము ముట్టనీక యతిపామరవల్లులఁ జుట్టనేల నా
కోరిక లియ్యఁగాఁదగు వికుంఠుఁడ శ్రీ...
255
ఉ.
కామిని లేనిసంపదలు కంఠవిహీనసుగానవిద్యలున్
దామర లేనిమేల్కొలను దాతలు లేనిపురంబు నీపయిన్
బ్రేమయు లేనిపూజలును బెం పిల కెక్కవు వాన లేనియా
భూమిని వల్లులన్బలె నభోమణివంశజ శ్రీ...
256
ఉ.
అందములొప్పు నీపదములందు జనించినగంగ యీజగ
ద్వందిత యయ్యె నాభిఘనవారిజసంభవుఁ డీజగంబులన్
బొందుగఁ జేయనేర్చె నినుబోలెడు దైవము లేఁడు చూడ నా
యందుఁ బరాకు నీ కగునె యారయ శ్రీ...
257
చ.
వనితను బొందుయౌవనము వానలు గల్గిన సస్యసంతతుల్
నినుఁ గొనియాడు కావ్యములు నిర్మలభక్తిని నిచ్చుదానముల్
ఘనములు గాని యావిధము గానివి యేలగు మెచ్చుపద్మలో
చన విను నీదయారసముసాటికి నెవ్వియు దూఁగు ధాత్రిలో
ఘనగుణ నీమహాదయను గావర శ్రీ....
258
ఉ.
కాలము చేర నంతట వికారములున్ గడుబాధ సల్పఁ బెన్
జాలిని ఛాటినిం గడుపఁజాలక యేడ్చుచుఁ బ్రాణభీతిచే
లాలిత నిన్నునుం దలఁప లక్ష్యము జాలునొ జాలదో మదిన్
బోలఁగ నాఁటివంతు కిదె బొల్పుగ ని న్భజియింతుఁ గావవే
పాలసుఁడ న్గృపారసము భాసిల శ్రీ...
259
ఉ.
తప్పదు నీప్రతిజ్ఞ కడుదారుణపాపలతావితానముల్
గప్పకు గొప్పగాదు ననుఁ గాచుటకంటె సమస్తధర్మముల్
తప్పక నీపదాంబుజసుధారసధారలు గ్రోలునన్నునున్
దిప్పలఁ బెట్ట నేల జగదీశ్వర శ్రీ...
260
ఉ.
భారమె శ్రీసతీహృదయపంకజపంజరరామచిల్క నే
గోరిన విచ్చి బ్రోచుట వికుంఠపురంబున కేఁగుత్రోవయున్
దూరమె నీపదాబ్జమును దోసిలి యొగ్గి భజించువారి కా
ధారమె యాపురంబు వరదాయక శ్రీ...
261
ఉ.
కాయ మపాయమయ్య నినుఁ గన్గొన నేరుపుజాలదయ్య యో
నాయన రాఁగదయ్య రఘునందన దాసుఁడ గానటయ్య నీ
మాయలు నాయెడం దగదు మానఁగదయ్య ననాథనయ్య నన్
బాయకుమయ్య భక్తజనపాలక శ్రీ...
262
ఉ.
మోహినివై జగంబులను మోహమునొందఁగఁజేయునాడు నీ
దేహవిలాసము న్గనియు ధీరుఁ డుమేశుఁడు మోహియై మహా
సాహస మొప్పఁ గ్రీడలను సల్పఁగఁ గోరిన వాని గూడు నీ
మోహము కేమనందు నతిమూఢుఁడ శ్రీ...
263
ఉ.
మానినివైననాఁడు నిను మానుగఁ గన్గొని మోహబద్ధులై
దానవులందఱు న్నమృతధారలు వీడి వివేకశూన్యులై
దీనత లేర్పడ న్మదిని ధీరతలు న్విడి రింతెకాని నీ
మానితమాయఁ గన్గొన సమర్థులె శ్రీ...
264
ఉ.
పట్టితి నీపదాబ్జములు భానుకులేశ్వర నీదు నామమున్
గట్టితి నోట భానుజుని గాఢపరాక్రమనాగవైరి ని
న్మట్టితి మోక్షకాంత మెడమానుగ గట్టితి తాళిబొట్టు నా
పుట్టువు సార్థకం బొదవె పుణ్యుఁడ శ్రీ...
265
ఉ.
ఎట్టిది నీమహామహిమ లెవ్వరు గానఁగ నేర్చువారు నీ
పుట్టువు మట్టుపట్టు కడుపోకలు రాకలు చిద్విలాసముల్
యిట్టివి యంచును న్బలుక నీశుఁడు కంజభవుండు శేషుఁడు
న్నెట్టనఁ జాలువారె కడునేర్పుగ శ్రీ...
266
చ.
రజతగిరీశుఁడు న్నుతులు రంజిలఁజేసె విరించి చేసె నీ
నిజపతి చేసె భారతియు నింద్రుడు మేనకగూర్మిపుత్రియున్
సుజనులు వేదముల్ నదులు సూర్యుఁడు చంద్రుఁడు లోనుగా ముని
వ్రజములు జేసి రెవ్వరును వాసిగఁ గాంచిరె నీమహత్తు వా
రిజదళనేత్ర నేను గనురీతియె శ్రీ...
267
ఉ.
పాలసుఁడ న్మహాజడుఁడ పామరుఁడ న్నిగమార్థదూరుఁడన్
లాలితమైన నీమహిమ లక్ష్యము నా కెటు లబ్బు నీమదిన్
జాలిని పుత్రుడంచు దయఁజాలఁగ బ్రోచుటకంటె వేఱె నే
జాలఁగ నిన్ను బూజ లిడఁజాలర శ్రీ...
268
చ.
కరిపయి నెక్కువాఁడు పురి క్రంతల జొచ్చినరీతి గాదె నీ
చరణసరోజయుగ్మములు సన్నుతిఁ జేసినవారు కూటికై
నరులను వేఁడఁబోవుట దినాధిపవంశజ నీకు మెచ్చులా
మఱువక బ్రోవు నన్ను గృహమానిక శ్రీ...
269
చ.
తురగము నెక్కి కారడవి దూరఁగవచ్చు గుహాంతరంబులన్
దిరుగఁగవచ్చు వారినిధి దీటుగ దాఁటఁగవచ్చు గాని నీ
పరమరహస్యమే వెలుఁగుప్రాభవము న్గన నెవ్వఁ డోపు శ్రీ
కర కమలామనోహర జగన్నుత శ్రీ...
270
ఉ.
ధాత లిఖించినట్టిలిపి తప్పక గొప్పగ నొప్పుజేయ నీ
చేతనుగాదొ విశ్వమయసేవకుఁ బ్రోవకయుంట నీకు వి
ఖ్యాతియొ మాయొ నేర్పొ యిదిగా నను దెల్పర నాగతల్ప నీ
కాతఁడు గూర్మిపుత్రుఁడెకదా యది ద్రిప్పర శ్రీ...
271
ఉ.
కాశి గయా ప్రయాగములు గానఁగవచ్చు సమస్తవిద్య ల
భ్యాసము జేసి మూల్యము లపారముగా గణియింపవచ్చు నీ
కోసము భక్తి జేసి మదిఁ గోరికదీరఁగ నిన్నుఁ గానఁగా
వాసియు లేదు దీనజనవత్సల శ్రీ...
272
శా.
ఏమోకాని మొఱాలకించ విదియు న్నేమోయి శ్రీనాయకా
కామారిస్తవపాదపద్మయుగళా కంసారి భక్తప్రియా
నామాటల్ చెవిసోఁకవాయెను గదా నా నేరముల్ యేమొకో
సామీ దెల్పియు బ్రోవఁగాఁ దగు జగత్సంసేవ్యమానోదయా.
278
మ.
కలలోఁ దోఁచినయర్థముల్ నిజములే కాయంబ నాపాయమే
తెలియంజాలనిమానవుల్ తమకుఁ బుత్రు ల్గామిను ల్బంధువుల్
కలుముల్ నిత్య మటంచుఁ బొంగెదరు నీకల్యాణచారిత్రముల్
బలుకన్నేరనివారి కేమి గతి సర్వాత్మా! దయం దెల్పరా.
274
ఉ.
పుత్రులు లేనివారలకుఁ బుణ్యగతు ల్పడయంగలేదన
న్బుత్రులు లేని శ్రీశుకులు పుణ్యగతు ల్బడయంగఁజాలఁడా
చిత్రము నీచరిత్రములు చెప్పఁగ నెవ్వఁడు నేర్చు నీదయే
పుత్రులు పౌత్రులున్ ధనము పుణ్యము శ్రీ...
275
చ.
వ్రతములు చేతునంచు నుపవాసము లుండెద రింతెకాని మేల్
వ్రతములలోన సువ్రతము వాసిగ నీపదపంకజాతమున్
జతురతఁ బూజసల్పినను సాటియె దానికి నేవ్రతంబులున్
మతిఁ దలపోయ రీమనుజమండలి శ్రీ...
276
చ.
సనకసనందనాదిమునిసత్తము లెల్ల మహత్తు నొందదుటల్
దనరఁగ నీపదాంబుజసుధారసధారలమేలు గ్రోలెకా
జననము సార్థకం బొదువ జక్కఁగఁజేయుట సాక్షీగాదె యీ
జనులకుఁ దెల్విలేమి నిను సయ్యనఁ జేరను భక్తికంటె వే
ఱనునొక టున్నదే దెలుపవే యిఁక శ్రీ...
277
ఉ.
వేదములందు శాస్త్రముల విప్రులహృత్సరసీరుహంబులన్
నాదముల న్బయోనిధుల నద్రుల స్థావరజంగమంబుల
న్బాదుకయుండి లోకములు పాలనఁ జేసెడునిన్నుఁ గాన దా
మోదర యొక్కచోట కడుమోదముతో వెదుకంగనేల నీ
పాదముల న్భజింతు వడిఁ బల్కర శ్రీ...
278
మ.
కడుఁ బెంపారఁ గురుక్షితీశ్వరుసభ న్గంగాసుతుండాదివా
రెడలేక న్గనుచుండ విశ్వమయమై యింపొందురూపంబుతోఁ
బొడవుం జూపవె కోపవేగమున నీభూరిప్రతాపంబు నే
నుడువంజాలుదునే మహాపురుష దీను న్నన్ను రక్షింపవే.
279
ఉ.
భద్రము నీకటంచు దయ భాసిల మారుతసూతిచేతికిన్
ముద్రిక నిచ్చునంతట సముద్రము దాఁటఁగ నేమి వింత సౌ
భద్రుఁడు ఘోరసంగరవిపద్దశ నొందియు నీల్గ వింతటే
యద్రిజసన్నుతా కరుణ హానియొనర్చినవానిపట్ల నీ
ముద్రికకర్త రెంటికిని ముఖ్యుఁడ శ్రీ...
280
చ.
ఒకఁడు దరిద్రుఁడు న్మఱియు నొక్కఁడు భాగ్యమహోదయుండు న
న్నిక గలఁడే ధరిత్రి పరమేశ్వర నీకరుణాకటాక్షమున్
నొకకొలఁదైన నవ్విధము లొప్పును ద్రిప్పును మాయగప్పునున్
సకలము నీవిలాసములె సల్పును శ్రీ....
281
శా.
ఆపస్తంబుఁడ మంత్రిశేఖరుఁడ గంగానాథునామంబుచే
భూపాలుం డననొప్పి యీశతకము న్బొంపొందగాఁజేసి నా
ప్రాపైనట్టి ధరాసుతాపతికి నింపారంగ నర్పించి నా
పాపంబుల్ హరియించి బ్రోచుటకు గోపాలా రమానాయకా.
282
శా.
నిత్యానంద నిరామయా నిరుపమా నీరేజపత్రేక్షణా
సత్యప్రాభవ దేవకీతనయ సంసారాంధకంజాప్త నీ
ప్రత్యుల్లాసవిలాసభాసురముఖాబ్జం బెప్పుడు న్గాంతునో
యత్యాసక్తి జెలంగఁ జూపు రవివంశాధీశ శ్రీవల్లభా.
283
ఉ.
రాధిక గూనలోన దధిరజ్జున కవ్వ మమర్చి త్రచ్చుచో
మాధవ నీవు గ్రేపునిడి మానినిచన్గవఁ జూచి భ్రాంతిచే
బోధను వీడి గోపపతి బొల్పుగ బంధ మమర్చి క్షీరముల్
సాధన మొప్పఁగాఁ బితుకు జక్కనినీనిజమూర్తిఁ జూచి యా
రాధయు రిత్తభాండమున రాల్పదె కవ్వము చాలమోహియై శ్రీ...
284
ఉ.
నీయధరామృతంబు కడునేర్పున గ్రోలెడు వేణు వెంత తా
నేయెడ జేసెనో తపము లెవ్వరు యెంతురు దానిమేలు నా
కాయము వ్యర్థమాయె దగ కఱ్ఱ ఘనంబునఁ బోలదాయెనో
నాయన యేలవయ్య విడనాడకు శ్రీ...
285
ఉ.
అప్పుడు సత్యభామ విరహానల మోర్వఁగలేక క్రోధయై
నిప్పులురాలుకోపమున నీమహిమల్ గననేరక న్మదిన్
దప్పు లెఱుంగకన్ శిరము దన్నినఁ బట్టవె దానిపాదము
న్నొప్పులకుప్ప నీచరితము ల్విని యెన్న దరంబె యేరికో
యప్ప గుణాలకుప్ప దయ నారయ శ్రీ...
286
మ.
జలజాతప్రభవాదులైన మదిలో జర్చింపఁగా కాని నీ
బలవిభ్రాజితరూపశోభనకళల్ భావింప నే నెంత నా
పలుకుల్ దబ్బరగాఁ దలంపక దయన్ భావించి రక్షించు శ్రీ
లలనానాథ సనాథ మాధవ మహారాజా రమావల్లభా.
287
ఉ.
మారునిఁ గన్నయట్టిసుకుమార మహారణశూర ధీర నీ
పేరు దలంచుమాత్ర భవపీడలు బాఱవె మేఘరాజి బె
న్మారుతవిక్రమంబున సమాగమమై వడి బాఱుకైవడిన్
దూరమునున్న వేఁడి భుజదోర్బల శ్రీ...
288
ఉ.
దండము నీకు భక్తఫలదాయక బాయకు లోకనాయకా
ఖండితపాపసంఘ రిపుఖండనభండన చండకాండకో
దండకళాప్రవీణ భుజతాండవ భాస్కరవంశమండనా
దండిగ బ్రోవు నీకరుణఁ దప్పకు శ్రీ...
289
మ.
కరుణాసింధుఁడ కంసమర్దనుఁడ రంగత్తుంగవీచీపరం
పరసౌభాగ్యనభోధునీజనితసంపత్పాదకంజాతుఁడా
వరకంఠీరవగాత్రుఁడా వరదుఁడా నవ్యాంబుజాతేక్షుఁడా
శరణయ్యా ధరణీసుతాపతి మహీశా రామచంద్రప్రభో.
290
శా.
మాతా రాఘవ మత్పితా రఘుపతీ మద్భ్రాత సీతాపతీ
నాతోఁ బల్క వదేమి యిట్లు దగునా నామీఁదనే కోపమా
ప్రాతఃకాలదివాకరప్రభలచే భాసిల్లునీయంఘ్రికం
జాతంబున్ భజియింపుచుంటి దశవేషా బ్రోవుమా గ్రక్కునన్.
291
ఉ.
కావ విదేమిరా పరమకారుణికోత్తమ దేవదేవ నా
భావము నీపదాంబుజసుపంజరమందునఁ జిక్కి భక్తిసం
భావన మీఱ నీభజనఁ బల్కుచునుండె నిరంతరంబున
న్గావుమటంచు మేలుపనిగాఁ దగ శ్రీ...
292
ఉ.
తావకధ్యానము న్గురుతుదప్పకఁ జేతు నిరంతరంబు దే
వావలిసన్నుతాంఘ్రిఘనవారిజ వారిచరావతార రా
వా వరమియ్య దేవుఁడ నవారితసత్కృప భక్తకోటికిన్
గావున నన్ను నిత్తఱిని గావర శ్రీ...
293
ఉ.
వారక నీదునామములు వర్ణనఁ జేసితి దీని కేమియు
న్నేరమ నీకు భారమ వినిర్మలచుట్టరికంబు కెల్లనున్
దూరమ పుత్రుఁడున్ గరుణతోఁ గనుపించు ముదంబు బెంచి నా
భారము నీకు నుంచి నిరపాయసుఖంబు లొసంగి బ్రోవు మో
తారకనామ యివ్విధము దప్పకు శ్రీ...
294
ఉ.
ఆరడి బెట్టనేల మునుపాడినమాట లబద్ధమేల నా
భారము వీడనేల మును భ క్తుల బ్రోచినయెక్కువేది నా
నోరను నిన్నుఁ బిల్వఁ గడునొప్పుగఁ బల్కకయున్న నీకునుం
జేరునె కీర్తి భూస్థలిని జిన్మయ శ్రీ...
295
ఉ.
ఎంతని వేడుకొందు పరమేశ్వర నీముఖమైనఁ జూపక
న్బంతము గట్టిన ట్లునికి భావ్యమె భానుకులప్రదీప నే
నెంతచలంబు కెంతపగ కెంతఘనంబున కెంతగాని నీ
చెంతను జేర్చి బ్రోవు నృపశేఖర శ్రీ...
296
మ.
తరమా నాకు సురేంద్రవందిత భవత్సంకల్ప మేరీతిదో
యరయ న్నా కననేల బ్రహ్మవశమా యాత్మార్థమా రూపమా
వరదా యెవ్వ రెఱుంగ నేర్పరులు సర్వాత్మా మహామాయచేఁ
బరగు న్నీమహనీయశక్తిమహిమ ల్భావింప శ్రీవల్లభా.
297
ఉ.
పంకజనాభ సర్వసురపాలక శంకరసన్నుతాంఘ్రి మీ
నాంకసహస్రసుందర శుభావహ భక్తజనానుకూల నీ
కింకరులందుఁ గింకరుఁడఁ గీర్తికళాకమనీయమూర్తి నా
వంకకు రాఁగదే శుభము వర్ధిల శ్రీ...
298
ఉ.
కంజదళాక్ష ఘోరనరకాసురదాహ ఖగేంద్రవాహ నీ
మంజులవాక్సుధారసము మామకకర్ణములందుఁ జొన్పు నీ
రంజనబెంపు నాహృదయరాజితపంకజమందు నిల్పు నే
నంజలిఁ జేతు నీపదము లద్భుతవిక్రమశౌర్యశాలి నీ
రాంజన మిత్తు నీకుఁ గడురంజన శ్రీ...
299
ఉ.
దార నశించె వెన్కఁ దగ దాయలు వృత్తి హరించి రంత నా
గారము నొక్కవిప్రు నదిగాఁ దెగనమ్మితి మున్నె నావయ
స్సారము తగ్గెఁ జేరినది సారవిహీనపుచోటు నింక నా
కేరి మహాత్మ నీపయిని నెన్నఁగ శ్రీ...
300
ఉ.
మంగళ మిందిరాహృదయ మంజులకంజమరందపానసా
రంగ ఘనాఘనోజ్జ్వలవిలాసశుభావహపూర్ణిమాంగ యు
త్తుంగదయాంతరంగ సురతోషితపాదసరోజగంగ స
న్మంగళహారతు ల్గొని సమంచితసత్కృపఁ బ్రోవు వేగ శ్రీ
రంగపురీశ భక్తజనరక్షక శ్రీరమణీమనోహరా.
301