భక్తిరసశతకసంపుటము/మూఁడవసంపుటము/కాళహస్తీశ్వరశతకము

పీఠిక

ఈశతకము వ్రాసినది శ్రీకృష్ణదేవరాయల యాస్థానమునందుఁ బేరెన్నికగన్న ధూర్జటి మహాకవి యని పరంపరగాఁ జెప్పుకొనుటేగాని శతకాద్యంతములలో నావిషయము నిరూపించుపద్యములు కానరావు. అంతమున నింకఁ గొన్నిపద్యములు లోపించినటు లుంటచేఁ గవిజీవిత మందుండునేమో యని భ్రాంతి కలుగుచున్నది.

ధూర్జటి యాఱువేలనియోగి బ్రాహణుఁడు భారద్వాజగోత్రుఁడు. ఇతఁడు చిరకాలము కృష్ణరాయల యాస్థానమునందుండి విద్యావినోదములలోఁ బాలుగొనుచున్నను కృతులనుమాత్రము నరాంకితము గావింపలేదు. తాను జెప్పికొన్న “నీకుంగాని కవిత్వ మెవ్వరికి నే నీనంచు మీఁదెత్తితిన్ జేకొంటిన్ బిరుదంబు” అనుప్రతిజ్ఞకు భిన్నముగా నడుచుకొనలేదు. “స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేలగల్గె నీయతులితమాధురీమహిమ" యని రాయలయంతవానిచేఁ గొనియాడఁబడిన యీకవిరాజన్యుని కవితాప్రశస్తిని ప్రత్యేకించి ప్రశంసింపఁబనిలేదు.

“హా తెలిసెన్ భువనైకమోహనోద్దత సుకుమారవారవనితా జనతాఘనతాపహారి సంతతమధురాధరామృతసుధారసధారలు క్రోలుటన్ జుమీ" పద్యభాగమునకుఁ గాళహస్తీశ్వరశతకము తార్కాణయై ధూర్జటికిఁగల భోగలాలసత్వము నిరూపించుచున్నది. ధూర్జటి యొడలు వధూస్తనాస్పోటనములచే గాయలు కాచినవఁట, కామినీసుఖముపై నింక రోఁత పుట్టలేదఁట, దేవకాంతలఁ గవసినను కామతాప మాఱదఁట, రతిద్వారసౌఖ్యములు చాలునఁట. ఈ ప్రసంగములను శతకస్థమగు రాజదూషణము సమన్వయించి పరిశీలించితి మేని విరక్తుఁడై వార్ధక్యమున నీశతకమును గవి రచించెనని తోఁచును. ఐహికములరోసి యీశతకము రచించి కవి కాళహస్తీశ్వరునిసన్నిధిలోఁ జేరెనని కొందఱు చెప్పుచున్నారు. కాళహస్తిమాహాత్మ్యములోఁ జెప్పబడిన తిన్ననికథ యిందు రెండు మూఁడుచోటులఁ బేర్కొనఁబడెను.

ఈశతకము మనోహరధారాశోభితమై మృదుపదగుంఫితమై ధూర్జటికవితామాధురీమహిమకుఁ దార్కాణముగ నున్నది. కవి శతకములో వ్యాకరణనియమములఁ బాటింపనిచోటులు పెక్కులుగలవు. ధూర్జటి పదునాఱవశతాబ్దమున శ్రీకృష్ణరాయల యాస్థానమున నుండెను.

నందిగామశేషాద్రిరమణకవులు
11-1- 25శతావధానులు

శ్రీరస్తు

శ్రీకాళహస్తీశ్వరశతకము

శా. శ్రీవిద్యుత్కలితాజవంజవ మహాజీమూతపాపాంబు ధా
     రావేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్‌
     దేవా! నీ కరుణా శరత్సమయమింతేఁ జాలు సద్భావనా
     సేవం దామరతంపరై మనియెదన్‌ శ్రీకాళహస్తీశ్వరా!1

శా. వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని
     ర్వాణశ్రీఁ జెఱపట్టజూచిన విచారద్రోహమో నిత్యక
     ల్యాణక్రీడలఁబాసి దుర్దశలపాలై రాజలోకాధమ
     శ్రేణీద్వారము దూరఁజేసెదిపుడో శ్రీకాళహస్తీశ్వరా!2

శా. అంతామిథ్య తలంచిచూచిన నరుండట్లౌటెఱింగిన్‌ సదా
     కాంతల్పుత్రులు నర్థమున్‌ తనువు నిక్కంబంచు మోహార్ణవ
     భ్రాంతింజెంది చరించుఁగాని పరమార్థంబైన నీయందుఁ దాఁ
     జింతాకంతయుఁ జింతనిల్పఁడు గదా శ్రీకాళహస్తీశ్వరా!3

శా. నీనా సందొడబాటు మాట వినుమా! నీచేత జీతంబునేఁ
     గానింబట్టక సంతతంబు మదివేడ్కన్గొల్తు నంతస్సప
     త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలుఁదే
     జీనొల్లం గరినొల్ల నొల్లసిరులన్‌ శ్రీకాళహస్తీశ్వరా!4
మ. భవకేళీ మదిరామదంబున మహాపాపాత్ముఁడై వీఁడు న
     న్ను వివేకింపఁడటంచు నేను నరకార్ణోరాశిపాలైనఁ బ
     ట్టవు? బాలుండొకచోట నాటతమితోడన్నూతఁ గూలంగఁ దం
     డ్రి విచారింపకయుండునా కటకటా! శ్రీకాళహస్తీశ్వరా!5
శా. స్వామిద్రోహముఁజేసి యేనొకని గొల్వంబోతినో కాక నే
     నీమాటన్విన నొల్లకుండితినో నిన్నేదిక్కుగాఁ జూడనో
     యేమీ యిట్టి వృథాపరాధినగు నన్నీ దుఃఖవారాశి వీ
     చీమధ్యంబున ముంచియుంపఁదగునా శ్రీకాళహస్తీశ్వరా!6
మ. దివిజక్ష్మారుహధేనురత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్న సా
     నువు నీ విల్లు, నిధీశ్వరుండు సఖుఁ, డర్ణోరాశి కన్యావిభుం
     డు విశేషార్చకుఁ డింక నీకెన ఘనుండుం గల్గునే నీవు చూ
     చి విచారింపవు లేమి నెవ్వఁడుడుపున్‌ శ్రీకాళహస్తీశ్వరా!7
శా. నీతో యుద్ధముఁ జేయనోప, గవితా నిర్మాణశక్తిన్నినుం

     బ్రీతుంజేయఁగలేను, నీకొఱకుఁ దండ్రిం జంపఁగాజాల నా
     చేత న్రోకట నిన్ను మొత్త వెఱతుం జీకాకు నాభక్తియే
     రీతి న్నాకిఁక నిన్నుఁ జూడఁగలుగున్‌ శ్రీకాళహస్తీశ్వరా!8
మ. ఆలుంబిడ్డలు దలిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం
     బేలా నామెడఁగట్టినాఁడవిఁక నిన్నేవేళఁ జింతింతు ని
     ర్మూలంబైన మనంబులోనఁ గడుదుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి యీ
     సీలామాలపుఁజింత నెట్లుడిపెదో శ్రీకాళహస్తీశ్వరా!9
శా. నిప్పై పాతకతూల శైలమడఁచు న్నీనామమున్మానవుల్‌
     తప్పన్‌ దవ్వులవిన్న నంతకభుజాదర్పోద్ధత క్లేశముల్‌
     తప్పుందారును ముక్తులౌదురని శాస్త్రంబుల్మహాపండితుల్‌
     చెప్పంగాఁ దమకింక శంకవలెనా శ్రీకాళహస్తీశ్వరా!10
శా. వీడెంబబ్బినయప్పుడుం దమ నుతుల్విన్నప్పుడుం బొట్టలోఁ
     గూడున్నప్పుడు శ్రీవిలాసములుపైకొన్నప్పుడుం గాయకుల్‌
     పాడంగా వినునప్పుడున్‌ జెలగు దంభప్రాయవిశ్రాణన
     క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీకాళహస్తీశ్వరా!11
మ. నినుసేవింపఁగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవంబబ్బనీ
     జనమాత్రుండననీ, మహాత్ముఁడననీ, సంసార మోహంబు పై

     కొననీ, జ్ఞానముగల్గనీ, గ్రహగతుల్‌ గుందింపనీ, మేలు వ
     చ్చిన రానీ యవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వరా!12
శా. ఏ వేదంబుఁ బఠించె లూత, భుజగంబే శాస్త్రముల్చూచెఁ దా
     నే విద్యాభ్యసనంబొనర్చెఁ గరి, చెంచే మంత్రమూహించె, బో
     ధావిర్భావనిధానముల్‌ చదువులయ్యా! కావు! మీపాద సం
     సేవాసక్తియె కాక జంతుతతికిన్‌ శ్రీకాళహస్తీశ్వరా!13
శా. కాయల్గాచె వధూనఖాగ్రములచేఁ గాయంబు వక్షోజముల్‌
     రాయన్‌ రాపడెఱొమ్ము మన్మథ విహారక్లేశ విభ్రాంతిచే
     బ్రాయంబాయెను బట్టగట్టెఁ దల చెప్పన్‌రోఁత సంసారమేఁ
     జేయంజాల విరక్తుఁ జేయఁగదవే శ్రీకాళహస్తీశ్వరా!14
శా. నిన్నే రూపముగా భజింతుమదిలో, నీరూపుమోఁకాలొ, స్త్రీ
     చన్నో, కుంచమొ, మేఁకపెంట్రికయొ, యీసందేహముల్మాన్పి నా
     కన్నారన్భవదీయమూర్తి సగుణాకారంబుగాఁజూపవే
     చిన్నీరేజవిహారమత్తమధుపా శ్రీకాళహస్తీశ్వరా!15
మ. నిను నావాఁకిలి గావుమంటినొ? మరున్నీలాలకభ్రాంతిఁ గుం
     టెన పొమ్మంటినొ? యెంగిలిచ్చి తిను తింటేఁగాని కాదంటినో

     నిను నెమ్మిందగ విశ్వసించు సుజనానీకంబు రక్షింపఁ జే
     సిన నావిన్నపమేల గైకొనవయా! శ్రీకాళహస్తీశ్వరా!16
శా. ఱాలన్‌ ఱువ్వఁగ జేతులాడవు కుమారా! రమ్మురమ్మంచునేఁ,
     జాలన్‌ జంపఁగ నేత్రముల్దివియఁగా శక్తుండనేఁగాను, నా
     శీలంబేమని చెప్పనున్నదిఁక నీ చిత్తంబు నాభాగ్యమో
     శ్రీలక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా శ్రీకాళహస్తీశ్వరా!17
శా. రాజుల్మత్తులు, వారిసేవ నరకప్రాయంబు, వారిచ్చు నం
     భోజాక్షీ చతురంతయాన తురగీ భూషాదు లాత్మవ్యథా
     బీజంబుల్‌, తదపేక్షచాలుఁ బరితృప్తింబొందితిన్‌ జ్ఞానల
     క్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా!18
శా. నీరూపంబు దలంపగాఁ దుదమొదల్‌ నేఁగాన నీవైననున్‌
     రారా! రమ్మనియంచుఁ జెప్పవు వృథారంభంబు లింకేటికిన్‌
     నీరన్ముంపుము, పాలముంపుమిఁక నిన్నేనమ్మినాఁడంజుమీ
     శ్రీరామార్చిత పాదపద్మయుగళా శ్రీకాళహస్తీశ్వరా!19
శా. నీకున్మాంసము వాంఛయేని కఱవా? నీచేతలేడుండఁగాఁ
     జోకైనట్టి కుఠారముండ ననలజ్యోతుండ, నీరుండఁగా
     బాకం బొప్ప ఘటించి చేతి పునుకన్భక్షింప కా బోయచేఁ
     జేకొంటెంగిలి మాంసమిట్లుదగునా? శ్రీకాళహస్తీశ్వరా!20

శా. రాజై దుష్కృతిజెందెఁ జందురుఁడు రారాజై కుబేరుండు దృ
     గ్రాజీవంబునఁగాంచె దుఃఖము కురుక్ష్మాపాలుఁడామాటనే
     యాజింగూలె సమస్త బంధువులతో నా రాజశబ్దంబు చీ,
     చీ జన్మాంతరమందు నొల్లనుజుమీ శ్రీకాళహస్తీశ్వరా!21
శా. రాజర్థాతురుఁడైనచో నెచట ధర్మంబుండు నేరీతి నా
     నాజాతి క్రియలేర్పడున్‌ సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు రూ
     పాజీవాళికి నేది దిక్కు ధృతి నీభక్తుల్‌ భవత్పాదనీ
     రేజంబుల్‌ భజియింతురే తెఱఁగునన్‌ శ్రీకాళహస్తీశ్వరా!22
మ. తరఁగల్‌ పిప్పల పత్త్రముల్‌ మెఱుఁగుటద్దంబుల్‌ మరుద్దీపముల్‌,
     కరికర్ణాంతము లెండమావులతతుల్‌ ఖద్యోత కీట ప్రభల్‌
     సురవీథీ లిఖితాక్షరంబు లసువుల్‌ జ్యోత్స్నాపయఃపిండముల్‌
     సిరులందేల మదాంధులౌదురు జనుల్‌ శ్రీకాళహస్తీశ్వరా!23
శా. నిన్ను న్నమ్మినరీతినమ్మనొరులన్‌, నీకన్న నాకెన్నలే
     రన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్సహాయుండు నా
     యన్నా! యెన్నడు నన్ను సంస్కృతి విషాదాంభోధి దాఁటించి య
     చ్ఛిన్నానంద సుఖాబ్ధిఁ దేల్చెదొ కదే శ్రీకాళహస్తీశ్వరా!24
శా. నీపంచం బడియుండఁగాఁ గలిగిన న్భిక్షాన్నమే చాలు ని

     క్షేపంబబ్బిన రాజకీటముల నే సేవింపఁగా నోప నా
     శాపాశంబులఁజుట్టి త్రిప్పకుము సంసారార్థమై బంటుగాఁ
     జేపట్టం దయగల్గెనేని మదిలో శ్రీకాళహస్తీశ్వరా!25
శా. నీపేరున్‌ భవదంఘ్రితీర్థము భవన్నిష్ఠ్యూత తాంబూలముల్‌
     నీ పళ్ళెంబు ప్రసాదముంగొనికదా నే బిడ్డఁడైనాఁడ న
     న్నీ పాటిం గరుణింపు మోపనిఁక నేనెవ్వారికిం బిడ్డఁగాన్‌
     జేపట్టందగుఁ బట్టి మానఁదగదో శ్రీకాళహస్తీశ్వరా!26
శా. "అమ్మా! యయ్య!" యటంచునెవ్వరిని నేనన్నన్శివా! నిన్ను నే
     సుమ్మీ నీ మదిఁ తల్లిదండ్రులనటంచు న్జూడఁగాఁబోకు నా
     కిమ్మైఁ దల్లియు దండ్రియున్‌ గురుఁడు నీవేకాన సంసారపుం
     జిమ్మంజీకటిఁగప్పినన్‌ గడుపు నన్‌ శ్రీకాళహస్తీశ్వరా!27
మ. కొడుకుల్‌ పుట్టరటంచు నేడ్తురవివేకు ల్జీవనభ్రాంతులై
     కొడుకుల్‌ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్‌ వారిచే నేగతుల్‌
     వడసెం బుత్త్రులులేని యా శుకునకున్‌ బాటిల్లెనే దుర్గతుల్‌
     చెడునే మోక్షపదం బపుత్త్రకునకున్‌ శ్రీకాళహస్తీశ్వరా!28
మ. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కల్యాణనామంబు ప్ర
     త్యహముంబేర్కొను నుత్తమోత్తముల బాధంబెట్టగానోపునే

     దహనుం గప్పఁగఁజాలునే శలభసంతానంబు నీ సేవఁజే
     సి హతక్లేశులుగారుగాక మనుజుల్‌ శ్రీకాళహస్తీశ్వరా!29
మ. అడుగంబోనిఁక నన్యమార్గరతులం బ్రాణావనోత్సాహినై,
     యడుగంబోయినఁబోదు నీదు పదపద్మారాధకశ్రేణియు
     న్నెడకున్నిన్ను భజింపఁగాఁ గనియు నాకేలా పరాపేక్ష కో
     రెడిదింకేమి? భవత్ప్రసాదమె తగున్‌ శ్రీకాళహస్తీశ్వరా!30
మ. అదమాతంగము లందలంబులు హరుల్మాణిక్యము ల్పల్లకుల్‌,
     ముదితల్‌, చిత్రదుకూలము ల్పరిమళంబు ల్మోక్షమీఁజాలునేఁ
     మదిలో వీని నపేక్ష సేసి నృపధామ ద్వారదేశంబుఁగా
     చి దినంబుల్‌ వృథపుత్తురజ్ఞులకటా! శ్రీకాళహస్తీశ్వరా!31
శా. రోసీరోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్‌
     బాసీపాయదు పుత్త్రమిత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతల్‌
     కోసీకోయదు నా మనంబకట! నీకుం బ్రీతిగా సత్క్రియల్‌
     చేసీచేయదు దీనిత్రుళ్ళణఁపవే శ్రీకాళహస్తీశ్వరా!32
శా. ఎన్నేళ్ళుండితి నేమిగంటినిఁక నే నెవ్వారి రక్షించెదన్‌
     నిన్నే నిష్ఠ భజించెద న్నిరుపమోన్నిద్రప్రమోదంబు నా

     కెన్నండబ్బెడు నెంతకాలమిఁక నేనిట్లున్న నేమయ్యెడిం
     జిన్నంబుచ్చక నన్ను నేలుకొనవే శ్రీకాళహస్తీశ్వరా!33
శా. చావంకాలము చేరువౌటెఱిఁగియుం జాలింపఁగా లేక త
     న్నేవైద్యుండు చికిత్సఁబ్రోవగలఁడో? యేమందు రక్షించునో?
     యే వేల్పుల్‌కృపఁజూతురో?యనుచు నిన్నింతైనఁ జింతింపఁడా
     జీవచ్ఛ్రాద్ధముఁజేసికొన్న యతియున్‌ శ్రీకాళహస్తీశ్వరా!34
మ. దినముంజిత్తములో సువర్ణముఖరీతీరప్రదేశామ్ర కా
     ననమధ్యోపల వేదికాగ్రమున నానందంబునం బంకజా
     సననిష్ఠన్నినుఁ జూడఁగన్న నదివో సౌఖ్యంబు లక్ష్మీవిలా
     సిని మాయానటనల్‌ సుఖంబులగునే శ్రీకాళహస్తీశ్వరా!35
శా. ఆలంచున్మెడఁగట్టి దానికి నపత్యశ్రేణి గల్పించి త
     ద్బాల వ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబుగావించి యా
     మాలర్కంబున బాంధవంబనెడి ప్రేమం గొందఱం ద్రిప్పఁగా
     సీలన్సీల యమర్పినట్లొసంగితో శ్రీకాళహస్తీశ్వరా!36
మ. తనువే నిత్యముగానొనర్చు మది లేదా, చచ్చి జన్మింపకుం
     డ నుపాయంబు ఘటింపు, మీ గతుల రెంటన్నేర్పు లేకున్న లే
     దని నాకిప్పుడెచెప్పు; చేయఁగల కార్యంబున్న సంసేవఁజే
     సి నినుంగాంచెదఁగాక కాలముననో శ్రీకాళహస్తీశ్వరా!37

మ. పదునాల్గేలె మహాయుగంబులొక భూపాలుండు, చెల్లించె న
     య్యుదయాస్తాచలసంధినాజ్ఞ నొకఁడాయుష్మంతుఁడై వీరి య
     భ్యుదయంబెవ్వరు చెప్పఁగా వినరొ? యల్పుల్మత్తులై యేల చ
     చ్చెదరో రాజులమంచు నక్కటకటా! శ్రీకాళహస్తీశ్వరా!38
శా. రాజన్నంతనెపోవునా కృపయు ధర్మంబాభిజాత్యంబు వి
     ద్యాజాత క్షమ సత్యభాషణము విద్వన్మిత్ర సంరక్షయున్‌
     సౌజన్యంబు కృతంబెఱుంగుటయు విశ్వాసంబుగాకున్న దు
     ర్బీజ శ్రేష్ఠులుగా గతంబుగలదే శ్రీకాళహస్తీశ్వరా!39
మ. మును నీచే నపవర్గ రాజ్యపదవీమూర్ధాభిషేకంబు గాం
     చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నె
     ట్లనినం గీటఫణీంద్రపోతమదవేదండోగ్ర హింసావిచా
     రినిఁగాఁగా నినుఁగానఁగాక మదిలో శ్రీకాళహస్తీశ్వరా!40
మ. పవమానాశన భూషణప్రకరము ల్భద్రేభచర్మంబు నా
     టవికత్వంబు ప్రియంబులై భుజగశుండాలాటవీచారులన్‌
     భవదుఃఖంబులఁ బాపుటొప్పుఁ చెలఁదిం బాటించి కైవల్యమి
     చ్చివినోదించుట కేమి కారణమయా శ్రీకాళహస్తీశ్వరా!41
మ. అమరస్త్రీలరమించినంజెడదు మోహంబింతయున్‌, బ్రహ్మప

     ట్టము సిద్ధించిన నాసదీఱదు నిరూఢక్రోధమున్‌ సర్వలో
     కములన్మ్రింగిన మానదిందుఁగల సౌఖ్యంబొల్ల నీ సేవఁజే
     సి మహాపాతకవారిరాశిఁగడతున్‌ శ్రీకాళహస్తీశ్వరా!42
మ. చనువారిం గని యేడ్చువారు జముఁడా సత్యంబుగా వత్తు మే
     మనుమానంబిఁకలేదు నమ్మమని తారావేళ నా రేవునన్‌
     మునుఁగంబోవుచు బాససేయుటసుమీ ముమ్మాటికింజూడఁగాఁ
     జెనఁటుల్గానరు దీని భావమిదివో శ్రీకాళహస్తీశ్వరా!43
మ. భవదుఃఖంబులు రాజకీటముల నేఁ బ్రార్థించినం బాయునే
     భవదంఘ్రిస్తుతి చేతఁగాక, విలసద్బాల క్షుథాక్లేశ దు
     ష్ట విధుల్మానునె? చూడ మేఁకమెడచంటం దల్లి కారుణ్యదృ
     ష్టి విశేషంబుననిచ్చు చంటబలెనో శ్రీకాళహస్తీశ్వరా!44
మ. పవి పుష్పంబగు, నగ్ని మంచగు, నకూపారంబు భూమిస్థలం
     బవు, శత్రుండతిమిత్రుఁడౌ, విషము దివ్యాహారమౌ నెన్నఁగా
     నవనీమండలి లోపలన్‌ శివశివేత్యాభాషణోల్లాసికిన్‌
     శివ! నీనామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా!45
శా. లేవో కానలఁ గందమూలఫలముల్‌ లేవో గుహల్‌ తోయముల్‌
     లేవో యేఱులఁ బల్లవాస్తరణముల్‌ లేవో సదాయాత్మలో

     లేవో నీవు విరక్తులన్మనుప జాలింబొంది భూపాలురన్‌
     సేవల్సేయఁగఁ బోదురేలొకొ జనుల్‌ శ్రీకాళహస్తీశ్వరా!46
మ. మును నేఁ బుట్టిన పుట్టులెన్నిగలవో మోహంబుచే నందుఁ జే
     సిన కర్మంబుల ప్రోవులెన్నిగలవో చింతించినం గాన నీ
     జననంబే యని యున్నవాఁడ నిదియే చాలింపవే నిన్నుఁగొ
     ల్చినపుణ్యంబునకుం గృపారతుఁడవై శ్రీకాళహస్తీశ్వరా!47
మ. తనువెందాఁక ధరిత్రినుండు నను నందాఁక న్మహారోగదీ
     పన దుఃఖాదులఁ బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా
     వెనుక న్నీపదపద్మముల్దలఁచుచు న్విశ్వప్రపంచంబుఁ బా
     సిన చిత్తంబుననుండఁజేయ గదవే శ్రీకాళహస్తీశ్వరా!48
మ. మలభూయిష్ఠ మనోజధామము సుషుమ్నాద్వారమో? యారు కుం
     డలియో? పాదకరాక్షియుగ్మములు షట్కంజంబులో? మోముదా
     జలజంబో? నిటలంబు చంద్రకళయో, సంగంబు యోగంబొ? గా
     సిలిసేవింతురు కాంతలన్‌ భువి జనుల్‌ శ్రీకాళహస్తీశ్వరా!49
మ. జలకంబుల్‌, రసముల్‌, ప్రసూనములు, వాచాబంధముల్‌, వాద్యము
     ల్కలశబ్దధ్వను లంచితాంబరమలంకారంబు దీప్తుల్మెఱుం

     గులు నైవేద్యము మాధురీమహిమగాఁ గొల్తున్నినున్‌ భక్తిరం
     జిల దివ్యార్చన గూర్చినేర్చిన క్రియన్‌ శ్రీకాళహస్తీశ్వరా!50
శా. ఏలీలన్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షా ధ్వనివ్యంగ్యశ
     బ్దాలంకార విశేషభాషల కలభ్యంబైన నీరూపముం
     జాలుంజాలుఁ గవిత్వమున్నిలుచునే సత్యంబు వర్ణించుచో,
     చీ! లజ్జింపరుగాక మాదృశకవుల్‌ శ్రీకాళహస్తీశ్వరా!51
శా. పాలుంబువ్వయుఁ బెట్టెదం గుడువరా పాపన్న రా! యన్న లే
     లే లెమ్మన నరంటిపండ్లుఁగొని తేలేకున్న నే నొల్లనం
     టే లాలింపరె తల్లిదండ్రులపుడట్లే తెచ్చి వాత్సల్య ల
     క్ష్మీ లీలావచనంబులం గుడుపరా శ్రీకాళహస్తీశ్వరా!52
మ. కలలంచు న్శకునంబులంచు గ్రహయోగంబంచు సాముద్రికం
     బులటంచుం దెవులంచు దిష్టియనుచు న్భూతంబులంచున్విషా
     దులటంచు న్నిమిషార్ధజీవనములందుం బ్రీతిఁబుట్టించి యీ
     సిలుగుల్‌ ప్రాణుల కెన్నిచేసితివయా శ్రీకాళహస్తీశ్వరా!53
మ. తలమీఁదం గుసుమప్రసాద మలికస్థానంబుపై భూతియున్‌
     గళసీమంబున దండ నాసికతుదన్గంధప్రసారంబు లో
     పల నైవేద్యముఁజేర్చు నే మనుజుఁడాభక్తుండు నీ కెప్పుడుం
     జెలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీకాళహస్తీశ్వరా!54

శా. ఆలుంబిడ్డలు మిత్రులున్‌ హితులు నిశ్టార్థంబు లీనేర్తు రే
     వేళ న్వారిభజింపఁ జాలిపడ కావిర్భూత మోదంబునం
     గాలంబెల్ల సుఖంబు నీకు నిఁక భక్తశ్రేణి రక్షింపకే
     శ్రీ లెవ్వారికిఁ గూడఁబెట్టెదవయా శ్రీకాళహస్తీశ్వరా!55
మ. సులభుల్మూర్ఖు లనుత్తమోత్తములు రాజుల్గల్గి యేవేళన
     న్నలఁతం బెట్టిన నీ పదాబ్జములఁ బాయంజాల నేమిచ్చినం
     గలధౌతాచల మేలుటంబునిధిలోఁ గాపుండుటబ్జంబుపైఁ
     జెలువొప్పన్సుఖియింపఁ గాంచుటసుమీ శ్రీకాళహస్తీశ్వరా!56
మ. కలధౌతాద్రియు నస్థిమాలికయు గోగంధర్వమున్బున్నయుం,
     బులిలోలున్భసితంబుఁ బాపతొడవుల్పోకుండఁ దోఁబుట్లకై,
     తొలినేవారలతోడఁబుట్టగఁ గళాదుల్గల్గె మేలయ్యె నా
     సిలువుల్దూరము చేసికొంటెఱిగియే శ్రీకాళహస్తీశ్వరా!57
మ. శ్రుతులభ్యాసముచేసి శాస్త్రగరిమల్శోధించి తత్త్వంబులన్‌
     మతినూహించి శరీరమస్థిరము బ్రహ్మంబెన్నసత్యంబు గాం
     చితిమంచున్‌ సభలన్‌ వృథావచనముల్చెప్పంగనేకాని, ని
     ర్జిత చిత్తస్థిరసౌఖ్యముల్‌ దెలియరో శ్రీకాళహస్తీశ్వరా!58
మ. గతినీవంచు భజించువార లపవర్గంబొందఁగానేల సం

     తతముం గూటికినై చరింప వినలేదా "యాయురన్నం ప్రయ
     చ్ఛతి" యంచున్మొఱవెట్టఁగా శ్రుతులు సంసారాంధకారాభిదూ
     శిత దుర్మార్గులు గానఁ గానఁబడవో శ్రీకాళహస్తీశ్వరా!59
మ. రతిరాజుద్ధతి మీఱనొక్క మఱి గోరాజాశ్వునిన్‌ నొక్కఁబో
     నతఁడా దర్పకు వేగ నొత్తఁ గవయం బాఁబోతునుందాఁకి యు
     గ్రతఁ బోరాడఁగ నున్న యన్నడిమి లేఁగల్వోలె శోకానల
     స్థితిపాలై మొఱపెట్టినన్‌ మనుపవే శ్రీకాళహస్తీశ్వరా!60
శా. అంతా సంశయమే శరీర ఘటనంబంతా విచారంబె లో
     నంతా దుఃఖపరంపరాన్వితమె మేనంతా భయభ్రాంతమే
     యంతానాంత శరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్‌
     జింతన్నిన్నుఁ దలంచి పొందరు నరుల్‌ శ్రీకాళహస్తీశ్వరా!61
శా. సంతోషించితిఁ జాలుఁజాలు రతి రాజద్వార సౌఖ్యంబులన్‌
     శాంతిం బొందితిఁ జాలుఁజాలు బహురాజద్వార సౌఖ్యంబులన్‌
     శాంతిం బొందెదఁ జూపు బ్రహ్మపద రాజద్వార సౌఖ్యంబు ని
     శ్చింత న్శాంతుఁడనౌదు నీ కరుణచే శ్రీకాళహస్తీశ్వరా!62
శా. స్తోత్రంబన్యులఁ జేయనొల్లని వ్రతస్థుల్వోలె వేసంబుతోఁ
     బుత్త్రీపుత్త్ర కళత్రరక్షణ కళాబుద్ధిన్‌ నృపాలాధమున్‌

     బాత్రంబంచు భజింపఁబోదు రిదియున్భావ్యంబె యెవ్వారి చా
     రిత్రంబెన్నఁడు మెచ్చనెంత మదిలో శ్రీకాళహస్తీశ్వరా!63
మ. అకలంకస్థితి నిల్పి నాదమను ఘంటారావమున్‌ బిందు దీ
     పకళా శ్రేణి వివేక సాధనములొప్పన్బూని యానందతా
     రక దుర్గాటవిలో మనోమృగము గర్వస్ఫూర్తి వారించు వా
     రికిఁగా వీడు భవోగ్రబంధలతికల్‌ శ్రీకాళహస్తీశ్వరా!64
మ. ఒకయర్థంబును నిన్ను నే నడుగఁగా నూహింప నెట్లైన బొ
     మ్ము కవిత్వంబులు నాకు జెందవని యేమోయంటివా నాదు జి
     హ్వకు నైసర్గిక కృత్యమింతయు సుమీ ప్రార్థించుటే కాదు కో
     రికల న్నిన్నును గాన నాకు వశమా శ్రీకాళహస్తీశ్వరా!65
మ. శుకముల్కింశుకపుష్పము ల్గని ఫలస్తోమంబటంచు న్సము
     త్సుకతం జేరఁగఁబోవ నచ్చట మహాదుఃఖంబు సిద్ధించుఁ గ
     ర్మకళాభాషలకెల్లఁ బ్రాపులగు శాస్త్రంబుల్విలోకించు వా
     రికి నిత్యత్వమనీష దూరమగునో శ్రీకాళహస్తీశ్వరా!66
మ. ఒకరింజంపి పదస్థులై బ్రదుకఁ దామొక్కొక్కరూహింతురే
     లొకొ తామెన్నఁడు జావరో? తమకుఁ బోవో సంపదల్‌? పుత్త్రమి

     త్రకళత్రాదులతోడ నిత్యసుఖమందంగందురో? యున్నవా
     రికి లేదో మృతి యెన్నఁడుం గటకటా! శ్రీకాళహస్తీశ్వరా!67
శా. నీ కారుణ్యముఁ గల్గినట్టి నరుఁడే నీచాలయంబుం జొరం
     డే కార్పణ్యపు మాటలాడనరుగం డెవ్వారితో వేషముల్‌
     గైకోఁ డేమతముల్భజింపఁడిల నే కష్టప్రకారంబులన్‌
     జీకాకై చెడిపోఁడు జీవనదశన్‌ శ్రీకాళహస్తీశ్వరా!68
శా. జ్ఞాతుల్ద్రోహులు! వాండ్రు సేయు కపటేర్ష్యాది క్రియాదోషముల్‌
     మా తండ్రాన సహింపరాదు ప్రతికర్మంబించుకేఁ జేయగాఁ
     బోతే దోషముగాన మాని యతినై పోఁగోరినన్‌ సర్వదా
     చేతఃక్రోధము మానదెట్లు నడుతున్‌ శ్రీకాళహస్తీశ్వరా!69
మ. చదువుల్నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణ క్రీడలన్‌
     వదరన్‌ సంశయ భీకరాటవులఁ ద్రోవల్దప్పి వర్తింపఁగా
     మదనక్రోధకిరాతులందుఁ గని భీమప్రౌఢిచేఁ దాఁకినం
     చెదరుంజిత్తము చిత్తగింపఁగదవే శ్రీకాళహస్తీశ్వరా!70
శా. రోసిందేఁటిది రోఁతలేఁటిది మనోరోగస్థుఁడై దేహి తాఁ
     బూసిందేఁటిది పూఁతలేఁటివి మదాపూతంబులీ దేహంబుల్‌
     మూసిందేఁటిది మూఁతలేఁటివి సదా మూఢత్వమే కాని తాఁ
     జేసిందేఁటిది చేఁతలేఁటివి వృథా శ్రీకాళహస్తీశ్వరా!71

శా. శ్రీశైలేశు భజింతునో యభవుఁ గాంచీనాథు సేవింతునో
     కాశీవల్లభుఁ గొల్వఁబోదునొ మహాకాళేశుఁ బూజింతునో
     నా శీలంబణువైన మేరువనుచున్‌ రక్షింపవే నీ కృపా
     శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వరా!72
మ. అయవారై చరియింపవచ్చుఁ దనపాదాంభోజ తీర్థంబులన్‌
     దయతోఁ గొమ్మనవచ్చు సేవకుని నర్థప్రాణదేహాదుల
     న్నియు నా సొమ్మనవచ్చుఁగాని నరులన్నిందించి నిన్నాత్మ ని
     ష్క్రియతం గానఁగరాదు పండితులకున్‌ శ్రీకాళహస్తీశ్వరా!73
శా. మాయాజాండ కరండకోటిఁ బొడిగా మర్దించిరో విక్రమా
     జేయుం గాయజుఁ జంపిరో కపటలక్ష్మీమోహముం బాసిరో
     యాయుర్దాయ భుజంగమృత్యువు ననాయాసంబునన్‌ గెల్చిరో
     శ్రేయోదాయకులౌదు రెట్టులితరుల్‌ శ్రీకాళహస్తీశ్వరా!74
మ. చవిగాఁజూడ వినంగ మూర్కొనఁ దనూసంఘర్షణాస్వాద మొం
     ద వినిర్మించెదవేల జంతువుల నేతత్క్రీడలే పాతక
     వ్యవహారంబులు సేయనేమిటికి మాయావిద్యచేఁ బ్రొద్దుపు
     చ్చి వినోదింపగఁ దీన నేమిఫలమో శ్రీకాళహస్తీశ్వరా!75
మ. వెనుకంజేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్‌
     వెనుకన్ముందటవచ్చు దుర్మరణముల్వీక్షింప భీతయ్యెడున్‌

     నను నేఁజూచియు నావిధుల్దలఁచియున్నాకే భయంబయ్యెడుం
     జెనకుంజీకటినాయెఁ గాలమునకున్‌ శ్రీకాళహస్తీశ్వరా!76
మ. పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్వింటి సాంఖ్యాది యో
     గరహస్యంబులు వేదశాస్త్రములు వక్కాణించితిన్‌ శంకవో
     దరయం గుమ్మడికాయలోను యవగింజంతైన నమ్మించి సు
     స్థిరవిజ్ఞానము త్రోవఁ జూపగదవే శ్రీకాళహస్తీశ్వరా!77
మ. మొదలంజేసిన వారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి దు
     ర్మదులై యిప్పుడు వారధర్మములొనర్పం దమ్ము దైవంబు న
     వ్వదె? రానున్న దురాత్ములెల్ల దమ త్రోవంబోవరే యేలచే
     సెదరో మీఁదు దలంచి చూడకధముల్‌ శ్రీకాళహస్తీశ్వరా!78
శా. కాసంతైన సుఖంబొనర్చునొ మనఃకామంబు లీడేర్చునో
     వీసంబైనను వెంటవచ్చునొ జగద్విఖ్యాతిఁ గావించునో
     దోసంబుల్పెడఁబాపునో వలసినందోడ్తో మిముంజూపునో
     ఛీ! సంసారదురాశలేలుడుపవో శ్రీకాళహస్తీశ్వరా!79
మ. ఒకపూఁటించుక కూడు తక్కువగునే నోర్వంగలేఁ డెండకో
     పక నీడన్వెదకుం జలికింజడిసి కుంపట్లెత్తుకోఁ జూచు వా

     నకు నిల్లిల్లును దూఱు నీతనువు దీనన్వచ్చు సౌఖ్యంబు రో
     సి కడాసింపరుగాక మర్త్యులకటా! శ్రీకాళహస్తీశ్వరా!80
శా. కేదారాదిసమస్త తీర్థములు కోర్కింజూడఁ బోనేఁటికిం
     గాదా ముంగిలి వారణాసి కడుపే కైలాసశైలంబు మీ
     పాదధ్యానము సంభవించునపుడే భావింప నజ్ఞాన ల
     క్ష్మీదారిద్ర్యులుగారె లోకు లకటా! శ్రీకాళహస్తీశ్వరా!81
మ. తమకంబొప్పఁ బరాంగనాజన పరద్రవ్యంబులన్‌ మ్రుచ్చిలం
     గ మహోద్యోగము సేయు నెమ్మనము దొంగంబట్టి వైరాగ్యపా
     శములంబట్టి బిగించి నీదు చరణస్తంభంబునన్‌ గట్టివై
     చి ముదంబెప్పుడుఁ గల్గజేయఁగదవే శ్రీకాళహస్తీశ్వరా!82
శా. వేధం దిట్టఁగరాదు గాని భువిలో విద్వాంసులం జేయనే
     లా ధీచాతురిఁ జేసిఁ జేసిన గులామాపాటునే పోక క్షు
     ద్బాధాదుల్‌ కలిగింపనేల యదికృత్యంబైన దుర్మార్గులన్‌
     ఛీ! ధాత్రీశులఁ జేయనేఁటి కకటా! శ్రీకాళహస్తీశ్వరా!83
మ. పుడమిన్నిన్నొక బిల్వపత్త్రమున నేఁ బూజించి పుణ్యంబునుం
     బడయన్నేరక పెక్కుదైవములకుం బప్పుల్‌ ప్రసాదంబులుం

     గుడుముల్‌ దోసెలు సారెసత్తులడుకుల్‌ గుగ్గిళ్లునుం బెట్టుచుం
     జెడి యెందుం గొఱగాకపోదురకటా! శ్రీకాళహస్తీశ్వరా!84
శా. విత్తజ్ఞానము పాడుచిత్తము భవావేశంబు రక్షాంబువుల్‌
     మత్తత్త్వంబు తదంకురం బనృతముల్‌ మాఱాకులత్యంత దు
     ర్వృత్తుల్‌ పువ్వులు పండ్లు మన్మథ ముఖావిర్భూత దోషంబులుం
     జిత్తాభ్యున్నత నింబభూజమునకున్‌ శ్రీకాళహస్తీశ్వరా!85
శా. నీపై గావ్యము చెప్పుచున్నయతఁడు న్నీపద్యముల్‌ వ్రాసియి
     మ్మా పాఠంబొనరింతు నన్నయతఁడున్‌ మంజుప్రబంధంబు ని
     ష్టాపూర్తింబఠియించుచున్న యతఁడున్‌ సద్బాంధవుల్‌గాక చీ
     చీ పృశ్ఠాగత బాంధవంబు నిజమా శ్రీకాళహస్తీశ్వరా!86
శా. సంపద్వర్గముఁ బాఱఁదోలి రిపులన్‌ జంకించి యాకాంక్షలన్‌
     దంపుల్వెట్టి కళంకముల్నఱికి బంధక్లేశ దోషంబులం
     జింపుల్చేసి వయోవిలాసములు సంక్షేపించి భూతంబులం
     జెంపల్వేయక నిన్నుఁ గాననగునా? శ్రీకాళహస్తీశ్వరా!87
శా. రాజశ్రేణికి దాసులై సిరులఁ గోరం జేరఁగా సౌఖ్యమో
     యీ జన్మంబు తరింపఁజేయఁగల మిమ్మే ప్రొద్దు సేవించు ని
     ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరో మానవు ల్బాపరా
     జీజాతాది మదాంధ బుద్ధులగుచున్‌ శ్రీకాళహస్తీశ్వరా!88

శా. నిన్నం జూడరొ మొన్నఁజూడరో జనుల్‌ నిత్యంబుఁజావంగ నా
     పన్నుల్గన్న నిధానమయ్యెడి ధనభ్రాంతి న్విసర్జింపలే
     కున్నా రెన్నఁడు నిన్ను గందురిక మర్త్యుల్‌ గొల్వరేమో నిను
     న్చిన్నంబుచ్చక ప్రోవకుండునెడలన్‌ శ్రీకాళహస్తీశ్వరా!89
శా. వన్నేయేనుఁగు తోలుదుప్పటము బువ్వా కాలకూటంబు చే
     గిన్నే కపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మే
     ల్నిన్నీలాగున నుంటయుందెలిసియు న్నీపాదపద్మంబు చే
     ర్చెన్నారాయణుఁడెట్లు మానసముఁ దా శ్రీకాళహస్తీశ్వరా!90
శా. ద్వారద్వారములందుఁ గంచుకిజన వ్రాతంబు దండంబులన్‌
     దోరంతస్స్థలి బగ్గనంబొడుచుచున్‌ దుర్భాషలాడన్మఱిన్‌
     వారింబ్రార్థనచేసి రాజులకు సేవల్సేయగాఁ బోరు ల
     క్ష్మీ రాజ్యంబునుగోరి నీ పరిజనుల్‌ శ్రీకాళహస్తీశ్వరా!91
శా. ఊరూరం జనులెల్ల భిక్షమిడరో యుండం గుహల్గల్గవో
     చీరానీకము వీథులందొరకదో శీతామృత స్వచ్ఛవాః
     పూరంబేఱులఁబాఱదో తపసులంబ్రోవంగ నీవోపవో
     చేరంబోవుదురేల రాజుల జనుల్‌ శ్రీకాళహస్తీశ్వరా!92
మ. దయ సేయుండని గొందఱాడుదురు నిత్యంబున్నినుంగొల్చుచున్‌
     నియమంబెంతొ ఫలంబునంతియగదా నీవీయ పిండెంతొ యం

     తియకా యెప్పటికిం దళం బశనబుద్ధిం జూడనేలబ్బు స
     త్క్రియలన్నిన్ను భజింప కిష్టసుఖముల్‌ శ్రీకాళహస్తీశ్వరా!93
శా. ఆరావంబుదయించెఁ దారకముగా నాత్మాభ్రవీధిన్మహా
     కారోకారమకార యుక్తమగునోంకారాభిధానంబు చె
     న్నారు న్విశ్వమనంగఁ దన్మహిమచే నా నాదబిందుల్సుఖ
     శ్రీ రంజిల్లఁగడంగు నీవదె సుమీ శ్రీకాళహస్తీశ్వరా!94
శా. నీ భక్తుల్పదివేల భంగుల నినున్సేవింపుచున్‌ వేఁడఁగా
     లోభంబేఁటికి వారి కోర్కులు కృపాళుత్వంబుఁనం దీర్పరా
     దా భవ్యంబు దలంచిచూడు పరమార్థంబిచ్చి పొమ్మన్న నీ
     శ్రీ భాండారములోఁ గొఱంతపడునా శ్రీకాళహస్తీశ్వరా!95
మ. మొదలన్భక్తులకిచ్చినాఁడవు గదా మోక్షంబు నేఁడేమయా
     ముదియంగా ముదియంగఁబుట్టె ఘనమౌ మోహంబు లోభంబున
     న్నది సత్యంబు కృపందలంప వొక పుణ్యాత్ముండు నిన్నాత్మ గొ
     ల్చి దినంబున్మొఱవెట్టఁగా గటకటా! శ్రీకాళహస్తీశ్వరా!96
శా. కాలద్వార కవాటబంధనము దుష్కాల ప్రమాణక్రియా
     లీలాజాలక చిత్రగుప్త ముఖవల్మీకోగ్ర జిహ్వాద్భుత
     వ్యాళ వ్యాళవిరోధి మృత్యుముఖదంష్ట్రాహార్య వజ్రంబు ది

     క్చేలాలంకృత! నీదు నామ మరయన్‌ శ్రీకాళహస్తీశ్వరా!97
మ. పదివేలైనను లోకకంటకులచేఁ బ్రాపించు సౌఖ్యంబు నా
     మదికిం బథ్యముగాదు సర్వమునకున్‌ మధ్యస్థుఁడై సత్యదా
     న దయాదుల్గల రాజు నా కొసఁగు మెన్నన్వాని నీయట్ల చూ
     చి దినంబున్ముద మొందుదుం గడపటన్‌ శ్రీకాళహస్తీశ్వరా!98
శా. తాతల్‌ తల్లియుఁ దండ్రియున్‌ మఱియు బెద్దల్చావగాఁ జూడరో
     భీతింబొందఁగనేల చావునకుఁగాఁ బెండ్లాము బిడ్డల్హిత
     వ్రాతంబున్బలవింప జంతువులకు న్వాలాయమై యుండఁగాఁ
     జేతోవీధి నరుండు నిన్గొలువఁడో శ్రీకాళహస్తీశ్వరా!99
శా. జాతుల్సెప్పుట సేవసేయుట మృషల్‌ సంధించు టన్యాయవి
     ఖ్యాతింబొందుట కొండెకాడవుట హింసారంభకుండౌట మి
     థ్యాతాత్పర్యము లాడుటన్నియుఁ బరద్రవ్యంబు నాశించి యీ
     శ్రీ తానెన్నియుగంబు లుండఁగలదో శ్రీకాళహస్తీశ్వరా!100
మ. చెడుగుల్‌ కొందఱు కూడి చేయఁగఁ బనుల్‌ చీకట్లు దూఱంగఁ బా
     ల్పడితింగాని చరింపరాని నిను నొల్లంజాలుఁ బొమ్మంచు ని
     ల్వెడలం ద్రోచినఁజూరువట్టుకొని నే వ్రేలాడుదుం గోర్కిఁగో
     రెడి యర్థంబులు నాకు వే గలుగవో శ్రీకాళహస్తీశ్వరా!101

మ. భసితోద్ధూళన ధూసరాంగులు జటాభారోత్తమాంగుల్‌ తపో
     వ్యసనుల్‌ సాధితపంచవర్ణరసనుల్‌ వైరాగ్యవంతుల్‌ నితాం
     తసుఖస్వాంతులు సత్యభాషణ సముద్యద్రత్నరుద్రాక్షరా
     జిసమేతుల్‌ తుదనెవ్వరైనఁ గొలుతున్‌ శ్రీకాళహస్తీశ్వరా!102
మ. జలజశ్రీగల మంచినీళ్ళు గలవా చట్రాతిలో బాపురే!
     వెలివాడన్మఱి బాఁపనిల్లు గలదా వేసాలు గాకక్కటా!
     నలి నారెండుగుణంబులెంచి మదిలో నన్నేమి రోయంగ నీ
     చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీకాళహస్తీశ్వరా!103
మ. గడియల్‌ రెంటికొ మూఁటికో గడియకో కాదేని నేఁడెల్లియో
     కడనేఁడాదికొ యెన్నడో యెఱుఁగ మీ కాయంబు లీ భూమిపైఁ
     బడఁగా నున్నవి ధర్మమార్గమొకటిం బాటింపరీ మానవుల్‌
     చెడుగుల్‌ నీ పదభక్తిం దెలియరో శ్రీకాళహస్తీశ్వరా!104
మ. క్షితిలో దొడ్డతురంగసామజములే చిత్రమ్ము లాందోళికా
     తతులే లెక్క విలాసినీజన సువస్త్రవ్రాత భూషాకలా
     ప తనూజాదికమేమి దుర్లభము నీ పాదమ్ము లర్చించుచో
     జితపంకేరుహ పాదపద్మయుగళా శ్రీకాళహస్తీశ్వరా!105
మ. సలిలమ్మున్జుళుకప్రమాణ మొక పుష్పమ్మున్భవన్మౌళి ని
     శ్చల భక్తిప్రపత్తిచే నరుఁడు పూజల్సేయఁగా ధన్యుఁడౌ

     నిల గంగానదిఁ జంద్రఖండమును దా నిందుం దుదింగాంచు నీ
     చెలువంబంతయు నీ మహత్త్వమిదిగా శ్రీకాళహస్తీశ్వరా!106
మ. తమ నేత్రద్యుతిఁ దామెచూడ సుఖమై తాదాత్మ్యమున్గూర్పఁగా
     విమలమ్ము ల్కమలాభము ల్జితలసద్విత్యుల్లతాలాస్యముల్‌
     సుమనోబాణజయప్రదమ్ములనుచు న్జూచున్‌ జనంబూని హా
     రిమృగాక్షీనివహమ్ము కన్నుఁగవలన్‌ శ్రీకాళహస్తీశ్వరా!107
మ. పటవద్రజ్జుభుజంగవద్రజత విభ్రాంతి స్ఫురచ్ఛుక్తివ
     ద్ఘటవ చ్చంద్రశిలాజపాకుసుమ రుక్సాంగత్యవత్తంచు వా
     క్పటిమల్నేర్తురు చిత్సుఖంబనుభవింపన్‌ లేక దుర్మేధసుల్‌
     చిటుకన్నం దలపోయఁజూతురధముల్‌ శ్రీకాళహస్తీశ్వరా!108
మ. నిను నిందించిన దక్షుపైఁ దెగవో వాణీనాథు శాసింపవో
     చనునా నీ పదపద్మ సేవకులఁ దుచ్ఛంబాడు దుర్మార్గునింన్‌
     బెనుపన్నీకును నీదు భక్తతతికిన్‌ భేదంబు గానంగ వ
     చ్చెనో లేకుండిన నూఱకుండఁగలవా శ్రీకాళహస్తీశ్వరా!109
మ. కరిదైత్యున్బొరిగొన్న శూలము కరగ్రస్తంబుగాదో రతీ
     శ్వరునిన్‌ గాల్చిన ఫాలలోచన శిఖావర్గంబు చల్లాఱెనో
     పరనిందాపరుల న్వధింపవిదియున్‌ భావ్యంబె వారేమి చే

     సిరి నీకున్బరమోపకార మరయన్‌ శ్రీకాళహస్తీశ్వరా!110
మ. దురము న్దుర్గము రాయబారము మఱిన్‌ దొంగర్కమున్‌ వైద్యమున్‌
     నరనాథాశ్రయమోడ బేరమును బెన్మంత్రంబు సిద్ధించినన్‌
     అరయన్‌ దొడ్డఫలంబుగల్గునదిగాకా కార్యమే తప్పినన్‌
     సిరియుంబోవును బ్రాణహానియు నగున్‌ శ్రీకాళహస్తీశ్వరా!111
మ. తనయుం గాంచి ధనంబు వాడి దివిజస్థానంబు గట్టించి వి
     ప్రున కుద్వాహముఁ జేసి సత్కృతికిఁ బాత్రుండై తటాకంబు నే
     ర్పునఁ ద్రవ్వించి వనంబు బెట్టి మననీ పోలేఁడు నీ సేవజే
     సిన పుణ్యాత్ముఁడు పోవు లోకమునకున్‌ శ్రీకాళహస్తీశ్వరా!112
మ. క్షితినాథోత్తమ! సత్కవీశ్వరుఁడు వచ్చెన్‌ మిమ్ములంజూడఁగా
     నతఁడే మేటి కవిత్వ వైఖరిని? సద్యఃకావ్యనిర్మాత త
     త్ప్రతిభ ల్మంచివి తిట్టుపద్యములు చెప్పండాతఁడైనన్‌ మముం
     గ్రితమే చూచెను బొమ్మటంచురథముల్‌ శ్రీకాళహస్తీశ్వరా!113
శా. నీకుంగాని కవిత్వమెవ్వరికి నేనీనంచు మీఁదెత్తితిన్‌
     జేకొంటిన్‌ బిరుదంబు కంకణము ముంజేగట్టితిం బట్టితిన్‌
     లోకుల్‌ మెచ్చ వ్రతంబు నా తనువుకీలున్‌ నేర్పులుంగావు ఛీ
     ఛీ కాలంబుల రీతి దప్పెడు జుమీ శ్రీకాళహస్తీశ్వరా!114

శా. నిచ్చల్‌ నిన్ను భజింప చిన్మయమహా నిర్వాణ పీఠంబుపై
     రచ్చల్సేయక యార్జవంబు కుజనవ్రాతంబుచేఁగ్రాఁగి భూ
     భృచ్చండాలురఁ గొల్చి వారు దను గోపింపన్‌ బుధుండార్తుఁడై
     చిచ్చాఱం జమురెల్లఁ జల్లుకొనునో శ్రీకాళహస్తీశ్వరా!115
శా. దంతంబుల్పడనప్పుడే తనువునన్‌ దార్ఢ్యంబు నున్నప్పుడే
     కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు గానప్పుడే
     వింతల్మేనఁ జరించనప్పుడె కురుల్వెల్వెల్ల గానప్పుడే
     చింతింపన్‌వలె నీ పదాంబుజములన్‌ శ్రీకాళహస్తీశ్వరా!116

శ్రీకాళహస్తీశ్వరశతకము
సంపూర్ణము