ఈశతకము రచించినకవి భల్లా పేరయ. ఇతఁడు కౌండిన్యసగోత్రుఁడు లింగనకుఁ బౌత్రుఁడు పెద్దనకుఁ గుమారుఁడు. శతకకవులచరిత్ర మీశతకము నెఱుంగదు. కవి వైదికబ్రాహణుఁడై యుండును.
భద్రగిరిశతకము సింహాద్రి నారసింహశతకము వెంకటాచలవిహారశతకము మట్టపల్లి నృసింహశత కము తెగలోఁ జేరినది. యవనులు సైన్యసహితులై వచ్చి హైందవదేవాలయములను భగ్నముగావించు తఱి దేశమునందు బయలువెడలిన క్షోభ కీతెగశతకములు దృష్టాంతప్రాయములుగ నున్నవి. పరస్పరవైషమ్యములతో నిండియున్న ఆంధ్రులను లోబఱచికొని వారిమతమునకు దేశమునకు సంఘమునకు రాజ్యతృష్ణాపరవశులు మతోద్రేకులు నగుయవనులు గావించినదురంతములు తెలుపుచరిత్రకాలమునాటి యీ తెగశతకములు భావిచరిత్రమునకుఁ బరమప్రమాణములు కాఁగలవు.
నైజాము ప్రభువులవద్దనుండి సామాన్యసైనికోద్యోగిగా నియమింపఁబడిన ధంసాయను యవనుఁడు వేల్పుకొండ (ఇది ఒరంగల్లుసకు ౨౪ మైళ్ల దూరమునఁ గలదు) పై దుర్గములుగట్టి దేశము నాక్రమించుకొనుటకు బయలువెడలి యెన్నియో దురంతములు గావించెను. ఈతనిదురంతములు శ్రీనాథుని వేంకటరామకవికృత అశ్వారాయచరిత్ర మునందుఁ గలవు. దేశద్రోహులగు కొందఱను తనలోకి గలిపి కొని గౌరవపాత్రము లగుసంస్థానములను బెక్కింటిని రూపుమాపి కడ కీతఁడు భద్రాచలమును ముట్టడించెను. పురవాసుల నందఱ నానావస్థలపాలు గావించెను. దేవళములోఁ జొరఁబడి విగ్రహముల నెక్కడఁ బాడుచేయునో యని యర్చకులు శ్రీరామాదివిగ్రహములను బోలవరమునకు రహస్యముగాఁ బడవలపై నెట్లో చేర్చిరి. భక్తులంచఱు దిక్కు చెడి ధంసాచే నవస్థలఁబడుచుండ నీవు సుఖముగాఁ బోలవరములోఁ దలదాఁచుకొంటివా రామా! నిన్నింతతో నీతురకలు విడువరని నిష్టురములాడుచు నీ పేరయకవి శతకమును రచించెను. ధంసా పరిపాలనము శ్రీ రామచంద్రుఁడు వలస కేఁగినట్లు భద్రాద్రిలోని శాసనమునందుఁ గలదు. దాని నిట నుదాహరించెదము.
"స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శా॥ శ॥ ౧౫౭౪ ఆగు నేటి వర్తమానవ్యవహారికచాంద్రమాన నందననామసం॥ వైశాఖ శు ౮ లు భానువారము శ్రీభద్రాచలసీతారామచంద్రమహాప్రభువువారిసన్నిధిని శ్రీ రామదాసుగారు తానీషాగారి యనుమతివెంబడిని జరిగించిన దేవబ్రాహణవృత్తులు శ్రీవారిసన్నిధిని జరుగు ఉత్సవప్రకరణములు వ్రాసియున్న శాస నము. ధంసా ప్రపంచములో శ్రీవారు పోలవరము వలస వేంచేసినపుడు వకదుర్మార్గుడు శాసనం చెక్కి వేసినందున సర్వజనులు తెలిసి సంతోషించేటందుకు లేకపోగా ఆదుర్మార్గుడు పుత్రమిత్రకళత్రాదులతో నశించిపోయినాడు” (ఆలయములోని శాసనము).
ఈవిధముగా ధంసాదుర్నయము గ్రంథములందు శాసనములందు శాశ్వత మొనర్పఁబడెను. 105 వ పద్యమువలన ధంసా కధికార మిచ్చినవాడు విభరాహిముఖా నని తెలియును. క్రీ. శ 1687 లో ఔరంగజేబు తనపుత్రుఁ డగుమహమదు ఆజాముతో గోలకొండ ముట్టడింపవచ్చినపుడు తానీషాయెడ ద్రోహముతలఁచి గుట్టుతెలిపినవాఁడును స్వామిద్రోహియు నగు ఇబ్రహీమె యిందుఁ బేర్కొనబడిన యిభరాహిముఖాను. ఇతఁడు ఔరంగజేబు పాలనకాలమునఁ బ్రముఖుఁడై ధంసాచేత నింతలేసి పనులు చేయించెను.
తానీషా రాజ్యాంతమున ఇబ్రహీముకాలము నుండి ధంసా ప్రముఖుఁడయ్యెను. ఔరంగజేబు అంత్యకాలము ధంసా విజృంభణకాలము నొకటియె. శ్రీరాముఁడు పోలవరమునకు వలస యేగినది సర్వధారిసంవత్సరమున. అక్కడ నున్నది ఐదేండ్లు. తరువాత పూసపాటి విజయరామరాజు సీతారామరాజుల కాలమున విజయసంవత్సరమున దిరిగి భద్రగిరికి వేంచేసెను. వీని నన్నింటిని సమన్వయించితిమేని ధంసా భద్రగిరిమీదికి దండెత్తి రెండువందలసంవత్సరములై యుండునని చెప్పవచ్చును. ఇది ఔరంగజేబు అంత్యకాలమునకు పూసపాటి విజయరామరాజు రాజ్యారంభకాలమునకు సర్వధారివిజయసంవత్సరములకు జేరువగా నున్నది. కాలనిర్ణయమును గూర్చి మఱియొకమాటు విపులముగా వ్రాయనున్నారము.
ఇందలి కవిత సరళముగ సుబోధముగ నున్నది. భగవంతునిహృదయము వ్రచ్చి పోవునటుల యీకవి వ్రాసిన నిష్ఠురవాక్యములు కవి పరితాపాతిశయమును వెల్లడించుచున్నవి. శ్రీరాముఁడు పోలవరము వలస యేగుటతో కవి శతక మారంభించి తిరుగ వచ్చిన పిదప నైదేండ్లకుఁ బూర్తిచేసియుండును. పఠనీయశతకరాజములలో నిది యొకటి.
శ్రీ పిఠాపురము మహారాజావారు తాళపత్రప్రత్యనుసారముగా వ్రాయించిన వ్రాతప్రతి నాధారపఱచికొని యీభద్రగిరిశతకమునకు శుద్దప్రతి వ్రాసితిమి. యవనవిప్లవకాలమునాటి పరిస్థితుల దెలుపు శతకము గాన యాదరమునకుఁ బాత్రమగునని తలంచుచున్నారము.
భద్రగిరిశతకము
సీ.
శ్రీజానకీమనోరాజీవషట్పద
పంకజాశ్రితపదపద్మగర్భ
గర్భనిర్భేదసంగరబాణతూణీర
నీరజసన్నిభశుభాంగ
అంగజవైరిశరాసనభేదన
దనుజవిద్వేషి సుందరపదాబ్జ
అబ్జబాంధవకులాధ్యక్షనీరదవర్ణ
వర్ణితామరమౌనివరకలాప
తే.
పవననందనసన్ముఖభక్తపాల
పాలకడలిని విహరించు పద్మనాభ
భద్రగిరివాస శ్రీరామభద్ర దాస
పోషబిరుదాంక రఘుకులాంబుధిశశాంక.
1
సీ.
పద్మభవస్తోత్ర పావనచారిత్ర
పంకజదళనేత్ర బహుపరాకు
దైతేయశిక్షణ ధర్మవిచక్షణ
భక్తసంరక్షణ బహుపరాకు .
వారిధిబంధన వరభక్తచందన
భరతాదినందన బహుపరాకు
తాటకభంజన తాపసరంజన
పరమనిరంజన బహుపరాకు
తే.
భద్రగిరినాఁడె వచ్చు నీపౌరుషంబు
విశ్వవిఖ్యాతి సేయక విడువ నింక
భద్ర...
2
సీ.
పదియు రెండేడుల ప్రాయంపువాఁడవై
మించి తాటక నెట్లు త్రుంచినావొ
రణశూరు లగుదైత్యగణములఁ బరిమార్చి
కౌశికసవ మెట్లు గాచినావొ
తరములఁబట్టి యెత్తఁగరాని హరువిల్లు
చెఱకుకైవడి నెట్లు విఱిచినావొ
సంగరరంగవిశారదుం డైనభా
ర్గవరాము నేరీతి గడపినావొ
తే.
కాని తెలియద యప్పటిక్రమము దెలుప
తురకదొరలన్న భీతిని నురుకుదొరవు
భద్ర...
3
సీ.
కాకంబు గాదు వేగమ బాణ మెక్కించి
కావు కా వనిపించి కాచి విడువ
ఉదధి గా దవనిపై నుప్పొంగఁగాఁ జూచి
బాణాగ్రమున నిల్పి భక్తి బ్రోవ
చిత్రమృగము గాదు సీత మెప్పులకునై
వెంటాడి వనవీథినంటి తఱుమ
పుడమి నెన్నఁగఁ గబంధుఁడుగాఁడు భుజలతల్
నఱకి పాఱఁగ వైవ సరకుఁగొనక
తే.
అవని కెదురుగా దని తలంచి
వలసబోతివి నీసరివారు నవ్వ
భద్ర...
4
సీ.
ఖరదూషణాదుల ఖండించితి నటన్న
యహమిక మదిలోన నణఁచి వైచి
మాయామృగంబును మర్దించితి నటన్న
గర్వంబు మనసులోఁ గట్టిపెట్టి
వాలి నొక్కమ్మునఁ గూలనేసితి నన్న
సాహసోక్తులు మదిఁ జక్క విడిచి
రావణకుంభకర్ణనిశాచరులఁ బట్టి
పరిమార్చితి నటన్న ప్రజ్ఞ మఱచి
తే.
ఓడపై నెక్కి తురకలజాడ గాంచి
యురకఁదగునయ్య నీవంటిదొరల కెందు
భద్ర...
5
సీ.
సున్నతీ లొగిఁజేయఁజూతురో యని వేగ
మేలుకొంటివి యింత మేలుగలదె
గుడిగుడీపొగలు పైకొనఁజూతురో యని
వలసబోతివి సరివారు నవ్వ
మును పులావును దిను మని యందురో యని
పాఱిపోతివి యింతపాటి గలదె
లుడికీయఫీమాదు లిడఁజూతురో యని
యోడ నెక్కితిరి మీ రొగి ధరిత్రి
తే.
కులము గలిగిన నెందైన స్థలము గలుగు
ననుచు భక్తులఁ దిగనాడి చనఁగ నౌనె
భద్ర...
6
సీ.
చెప్పినట్టుల వినఁజేయ నోపిక కొండ
చరియలయందుండు చరియదుంప
దోడులు తినుశక్తి వాఁడికోఱలుగల
తులువమృగాలలో మెలఁగుయుక్తి
జడలదాలుచు నేర్పు జడదారులను గూడి
యిడుమలఁ బడు తాల్మివడుకులందుఁ
బండుకష్టతరంబు పర్ణశాలలయందుఁ
గాపురంబులు సేయుక్రమము తొల్లి
తే.
తల్లికోరిక చెల్లించ ధరణిలోన
నేర్చితినటన్నఁ బలుమాఱు నెఱపనగునె
భద్ర...
7
సీ.
రఘువంశమున కెంత రట్టడి దెచ్చితి
వరుస పోలవరంబు వలసబోయి
సోకుమూకల కెంత చులకన యైతివి
వరుస పోలవరంబు వలసబోయి
భక్తకోటికి నెంత భయము బుట్టించితి
వరుస పోలవరంబు వలసబోయి
…….........................................
వరుస పోలవరంబు వలసబోయి
తే.
దశరథునిగర్భమునఁ బుట్టి దశశిరస్కు
దునిమి నటువంటి దొరకిది దొడ్డతనమె
భద్ర...
8
సీ.
కైకవరము జ్ఞాపకమువచ్చెనో మళ్లి
వనములోఁ జరియింప వసుధలోన
నీలాద్రిపతిఁ జూచి నేరుచుకొంటివో
వలసఁబోవంగ నీవసుధలోన
పట్టిన సతికిఁ జెప్పఁ దలంచి పోతివో
వలస పేరిడికొని వసుధలోన
రామలదేవు కారణజన్ముఁ డని తోఁచి
వర మియ్యఁబోతివో వసుధలోన
తే.
లేక యిది యేమివింత ముల్లోకములను
జడిసి వేంచేసితిరటన్న జడుపుగాదె
భద్ర...
9
సీ.
సౌమిత్రి కైనఁ దోఁచకపోయెనా యిట్లు
పోవరాదని నీకు బుద్ధి దెలుప
సీతయైనను మీకుఁ జెప్పలేదాయెనా
యిలు వెడలుట మహాహీన మనుచు
హనుమంతుఁ డిపుడు మీ యాజ్ఞకు వెఱచెనా
యౌను గాదని మిమ్ము నడ్డగింప
శిష్టరాజగు మీవసిష్ఠు లేఁడాయెనా
యిది బుద్ధిగాదని యెఱుఁగఁజెప్ప
తే.
భద్రగిరి నుండి శ్రీవీరభద్రగిరికి
వలసబోవుట యిదియేమి వాంఛలయ్య
భద్ర...
10
సీ.
హనుమంతు నెచ్చోటి కనిపితిరో మీకు
జడుపుబుట్టిన యట్టి సమయమునను
సుగ్రీవుఁ డేగుహఁ జొచ్చియుండెనొ మీకు
జడుపుబుట్టిన యట్టి సమయమందు
అంగదుఁ డేవంక కల్గిపోయెనొ మీకు
జడుపుబుట్టిన యట్టి సమయమందు
జాంబవదాదు లెచ్చటనుండిరో మీకు
జడుపుబుట్టిన యట్టి సమయమందు
తే.
కపులు మీయొద్దనుండిన రిపుల కేల
యోడి వేంచేతురయ్య మీ రోడమీఁద
భద్ర...
11
సీ.
పట్టాభిషేకసంభవవియోగము జటా
వల్కలంబులు వనవాసములును
యతిపూజ గొనుటలు సతితోడఁ దిరుగుట
లాలి గోల్పోవుట లడవులందు
సంచరించుటలు నిశాచరబాధలు
చెంచుముద్దియ విందు లెంచ మొండె
మునఁ గూల్చుటలు దాని విని ముక్కు గోయుట
క్రోఁతి నేయుట బ్రహ్మకులజుఁ జంపు
తే.
టిల్లు వెళ్లుట లాదిగా నినకులమున
ననయ మీనాఁడె ధరగల్గె ననియె జనము
భద్ర...
12
సీ.
భరతశత్రుఘ్నులు వరశంఖచక్రముల్
సౌమిత్రి శేషుఁడు జనకతనయ
యిందిర కపులెల్ల బృందారకు లటంచు
స్మృతులెల్లఁ గొనియాడ నతివినోద
లీలలు గల్పించి బేలపై కేవల
మానుషచర్యలు బూనె దకట
వలసలు మీ కేల వనవాసము లవేల
వైకుంఠవాసివి వరుసతోడ
తే.
మీబలపరాక్రమములెల్ల మీరె మఱచి
తొలఁగిపోవచ్చునే తురకలకు జడిసి
భద్ర...
13
సీ.
ముసలిమానులతోడ ముచ్చటాడఁగలేక
తురకల కెదురుగా నరుగ లేక
మ్లేచ్ఛుల మన్నించి మెప్పు లీయఁగ లేక
పారసీకుల బాధ పడఁగ లేక
అచ్ఛిద్రకర్ములయాజ్ఞ నుండఁగ లేక
యపసవ్యరిపులతె న్నరయ లేక
చేరి ఖానులకుఁ దాజీము లియ్యఁగలేక
మును నమాజుధ్వనుల్ వినఁగలేక
తే.
పాఱిపోవుట యిది యేమిప్రజ్ఞ గొడుగు
నెఱిఁగి యేయెండ కాయెండ నిడఁగవలయు
భ...
14
సీ.
తెలివిదెచ్చుకయుండఁ దెన్ను వీక్షింపక
వాహనంబులమీఁది వాంఛలిడక
ద్వారపాలకులకు దారి జెప్పక భక్త
గణముల కెల్లను గనులఁబడక
సొమ్ములచందుకల్ చూడనొల్లక కపి
బలములనెల్లను బిలువనీక
సౌమిత్రి కరిగెడి జూడఁ జెప్పఁగ లేక
సీత నెత్తుక యతిశీఘ్రముగను
తే.
కలముపై నెక్కి మీవంటిఘనులు తొలఁగి
పోవఁగా నౌనె వలసగాఁ బోలవరము
భద్ర..
15
సీ.
సొమ్ములు బీబీల సొగసు కర్పణజేసి
వాహనంబుల నశ్వవాహనులకు
పంచపాత్రలు సుసురాపానవర్తనులకుఁ
బళ్లెరంబులు మాంసభక్షకులకు
శఠగోపములు విప్రశఠులకు బంగారు
తబుకులు బలుదునేదారులకును
గిన్నెలు వరుస ముంగీముచ్చులకుఁ బట్టు
పీతాంబరంబులు పింగళాక్షు
తే.
లకు నొసంగి యుభయమున సుకము దక్కి
పాఱిపోతిరి మీరున్న యూరు విడిచి
భద్ర...
16
సీ.
సంచరించిరిగదా సమదాపసవ్యులు
విమలబృందావనవేదికలను
వీటిబుచ్చిరిగదా విరులచేఁ జెన్నొందు
ఘనమల్లికాపుష్పవనచయంబు
గాళుచేసిరిగదా కళ్యాణమందిర
గారవాహనగృహాంగణము లెల్ల
కొల్లలాడిరిగదా కోమలనవవీచి
కల నొప్పు దివ్యగంగాఝరములు
తే.
చూరవట్టిరి పురమెల్లఁ జొచ్చి విప్ర
మందిరములన్ని తురకలు మత్తు లగుచు
భద్ర...
17
సి.
సంస్కృతాంధ్రోక్తులసారంబు లుడివోయి
నపసవ్యభాషల నమరె జగము
పౌండరీకాదులపశుబంధనము దప్పి
కటికి మేఁకలజవా ల్గలఁగె నూళ్లు
కర్పూరచందనాగరుధూపములఁ బాసి
గంజాయి పొగలచేఁ గప్పె గుళ్లు
వేదశాస్త్రంబులు వెలయు బాఁపలపట్ల
మొల్లాఖురానులు మ్రోఁగె నహహ
తే.
యేమి చెప్పుదు మీ మాయ లెవ్వ రెఱుఁగఁ
గలరు బ్రహ్మాదులకు నెల్ల నలవిగాదు
భద్ర...
18
సీ.
ధర్మపేటనివాసి ధైర్యంబు విడనాడె
వేఁటగోపాలుండు మాట లుడిగె
పాలవంచపురీశు బలహీనత వహించెఁ
గృష్ణసాగరపయ్య క్రిందుఁ జూచె
రామానుజవరపురాము లూఱకయుండె
సిరివేడి సామి యబ్బురము గదిరె
పర్ణశాలేశుండు బహుభంగులఁ దపించె
శ్రీరామగిరివాసి చింత నొందె
తే.
భద్రకడనుండి శ్రీవీరభద్రుకడకు
వలస వేంచేయవలసినవార్త వినియు
భద్ర...
19
సీ.
తురకలతో మైత్రి నెఱప లేవైతివి
లోకత్రయం బెట్లు సాకగలవు
గర్నేలుగుండ్లడాకా కోర్వ లేవైతి
వరులబలంబు లె ట్లణఁచఁగలవు
నీస్థలంబున నీవు నిలువ లేవైతివి
భక్తుల నెట్లు గాపాడఁగలవు
మానవాధీశ్వరు మరుగుఁజొచ్చినవాఁడ
వమరారులకు నెట్టు లభయ మొసఁగి
తే.
తకట నిను మనమున నమ్మినట్టిజనులఁ
దొలఁగి వేంచేసితిరి తురకలకు జడిసి
భద్ర...
20
సీ.
శ్రీరామముద్ర లీక్షితిని నీరసమందె
నగ్బర్ బకై రను నచ్చు లమరె
గోవిందశబ్దముల్ గురిమాల యాహసన్
బావుసేననుపల్కు లావహిల్లె
గరుడాశ్వగజరథవరవాహనములచేఁ
బరుగు నిండ్లను పీర్ల ప్రభలు చెందె
సత్రశాలాంగణల్ చలువపందిరులు బ
ర్బరచిఖాసాల చప్పరములయ్యె
తే.
మత్స్యమాంసాదికములు నమరెను గోద
రేవు లెచ్చట గన్న గోరీల నమరె
భద్ర...
21
సీ.
హనుమంతు ముట్టి సర్వాంగవేణిలిచేత
నెమరి పెట్టెలమాయ జమరె నొకఁడు
గరుడాళ్ళువారిఱెక్కలు చెక్కుముక్కులు
నొక్కి మట్టసముగాఁ జెక్కె నొకఁడు
ఎంబెరుమానారు నింటిలోన నమాజు
చదివియుఁ దసిబిసి సలిపె నొకఁడు
వరుసఁ బన్నిద్ద ఱాళ్వారి నొక్కుమ్మడి
డేడిక్కులాడించి వీడె నొకఁడు
తే.
మిగిలినజనంబు చింత లేమిటికిఁ దలఁప
పరగ మీరలు తిరువళ్లెపట్టు నెడల
భద్ర...
22
సీ.
అతిసరంబులు గావు ఆరగించి వయారి
కోఱమీసంబులకొనలు పఱుప
తిరుపణ్ణెరములు గా వురువుగా భుజియించి
పొరలియాడుచుఁ జిన్నిబొజ్జ నిముర
దధ్యోదనము గాదు తగినంత భక్షించి
గుఱ్ఱునఁ ద్రేన్చుచుఁ గూరుచుండ
వడలు గావు యయోధ్యవాసులతోఁ గూడి
ముచ్చట దెలుపుచు మొనసి మెసవ
తే.
చేరి భక్ష్యంబులా గావు చిత్తగింప
కినియు జాల్దంగుమేటిజంగీబలములు
భద్ర...
23
సీ.
పుట్లాదిపొంగలి పులిహోరలను మెక్కు
వారికి రణముపై వాంఛ గలదె
శర్కరపొంగళ్ల చవిగొన్నవారికిఁ
ప్రాణంబుపైఁ దీపి బర్వకున్నె
వైష్ణవసద్గోష్ఠి వర్తించువారలు
తురకలష్కరులపై దుముకఁ గలరె
ఉభయవేదాంతసదూహ నుండెడివారు
మంత్రాంగశక్తులు మలపఁ గలరె
తే.
దేవమానవశక్తుల తెఱఁగు వదలి
తురకదొరలన్న భీతిలి యురుకు దొరవు
భద్ర...
24
సీ.
సొగసుగా శంఖచక్రగదల్ ధరించుట
తడబాటు చతురహస్తమున వెలయు
ఘనతకా......సనములు దాల్చుట
పురజనంబులకు నద్భుతము గాఁగ
అవుడు కామార్యపుత్రా సేన ...
... నేలుటలు సూర్యకులములోన
ప్రజ్ఞకా పతితపావనబిరుదాంకంబు
చూపు టెల్లను బలుచోద్యముగను
తే.
యవనబలములు నల్ గడల్ కవిసి మిమ్ము
దోఁచుకొను వేళ శౌర్యంబు దాఁచి తకట
భద్ర...
25
సీ.
శంఖంబు కడుబీదజంగంబుచే నున్న
వూదియైనను బొట్టవోసికొనును
చక్రంబు కుమ్మరి సరసనుండిన వేడ్క
కుండలైనను జేసికొను రయమున
గద సుకాలీవానికడనున్న వేవేగ
గోనెపైనము నెత్తుకొను ముదమున
తగ నాల్గుచేతులు ధంసాకుఁ గల్గిన
నిఁక నింతరాజ్యంబు నేలుకొనును
తే.
స్వామి నీ కేల యివి వృథా సరసముగను
వారివారికి దయజేయు వరుసతోడ
భద్ర...
26
సీ.
సరసప్రబంధానుసంధానములు గావు
మొల్లాఖురానులమ్రోఁతగాని
మహిమహీసురల నమస్కారములు గావు
మల్కలు సేయు నమాజుగాని
తగ నర్చకులు సేయు తళిహలు గావు లా
వుపొలావుదీకి బల్పొల్పుగాని
చందనాగురుధూపసమితి గాదు గుడాకు
గంజాయి పొగలసంఘంబుగాని
తే.
బలిసి తిరునాళ్ల కేతెంచు ప్రజలు గారు
ఘనతరం బైనతురకలష్కరులు తెలియ
భద్ర...
27
సీ.
పన్నీరు నించిన పసిఁడికొప్పెల మీకు
సారాలు నిండుసీసాలబారు
దాసులు దెచ్చు తీర్థపుబిందెలే మీకు
పారసీకులమధ్య భాండవితతి
భువి భక్తు లొనరించు భోగంబులే మీకు
తురకలు చేయుకందూరిచయము
కల్యాణవేదికాగ్రము నుండుహోమగుం
డంబులే పీర్లగుండములు నీకు
తే.
కాకయుండిన యిల కాకపుట్ట
దవని తురకలు చిందు చెండాడునపుడు
భద్ర...
28
సీ.
గజరథఘీంకారఘంటారవంబులు
తగవిన్నఁ జెవులు చిందరలు గొనెనొ
కంచుఫిరంగీలు ఘననాదములు విన్న
ఫెల్లున గుండియల్ ఝల్లుమనెనొ
యవనాశ్వఖురపుటజవమున దెసలెల్ల
గదిసిన పెంధూళి గప్పుకొనెనొ
అరబు సిద్దీల పెన్ హాడులోపలఁ జొచ్చి
తొలుదొల్త పదములు తొట్రువడెనొ
తే.
కలముపై నెక్కితిరి మీరు ఘనత విడిచి
క్రమముచే నంగరక్షైనఁ గట్టుకొమ్ము
భద్ర...
29
సీ.
భరతాదిసహజన్మవరులకు నీపాటి
ఫారసీ చెప్పించు పంత ముడిగి
వ్యాసాదిమునిగణప్రతతి కెల్లను ఖురా
నులు జదివింపఁగాఁ దలఁపుసేయు
పరగ నింద్రాదిదిక్పాలకశ్రేణికి
నెరి సమాజులునేయ నేర్పు నేర్పు
వారింపఁజాల వాళ్వారాదులకు వేగ
సున్నతీలప్రయత్న మెన్నఁ జేయు
తే.
చేయకుండిన తురకలు చెడుగువాండ్రు
హద్దు విడివచ్చి రింక మీరాగఁ గలరె
భద్ర...
30
సీ.
సర్వాంగి తురకలు సవరించినా రింతె
నీలికూసంబైన నెరి ధరించు
మణీకిరీటము మ్లేచ్ఛఘనుల కిచ్చితి వింతె
టోపియైనను దాల్చు మేపుమీఱ
పావాలు యవనులపాలు జేసితి వింతె
ముచ్చెలైనను గాళ్ల కిచ్చగించు
ఢిల్లీశ్వరునికూఁతు నిల్లాలిగా ముందు
నేలితి వింక నీ కెక్కులేల
తే.
మతము విడుచుట లెల్ల సమ్మతము మీకుఁ
గాముకులకును బ్రజ్ఞలు గలవె తలఁప
భద్ర...
31
సీ.
గరుడధ్వజము లన్న కాంక్షతో నుంటిరో
డాలైన తగటు జండాలు జూచి
తమనిత్యసేవవాద్యము లనుకొంటిరో
యరయ బాజాలనెయ్యంబుఁ జూచి
తిరునాళ్లయంగళ్లతీ రనుకొంటిరో
సరిలేని దండుబాజార్లు జూచి
వరుసతోడుత భ క్తవరు లనుకొంటిరో
దరిలేని బలుసుబేదార్ల జూచి
తే.
కాక భువి విభవాహిముఖానుఁ డెంత
మేటిదానవులను గెల్చు మేటికరయ
భద్ర...
32
సీ.
ఆవు బైటో యని యాదరింతురుగదా
తురకలతో మైత్రి నెరపవైతి
రాము రా మనుచుఁ దాజీము లిత్తురుగదా
యూరకుండిన మిమ్ము నూఱడించి
కదిదిమిల్నా యని కౌఁగిలింతురుగదా
యెదురుగా నేఁగిన బెదరు లేక
కర్పూరవిడెముల ఘనత నిత్తురుగదా
నజరు పట్టినమద్దె నజరుగలిగి
తే.
కానిపని జేసితివి పోటుకానివలెనె
వరుస తురకలపై నల్గి వలసబోయి
భద్ర...
33
సీ.
అరబు సిద్దీల దివ్యాజ్ఞలో వర్తించి
చేరి మేఁకలజబా సేయలేక
వరుసతో ధరియించు వరభూషణము లిచ్చి
యుడుకునూనియలఁ జేయుంచలేక
సెట్టిపల్లియవారు చేయునిర్బంధంబు
సొరిది మీఱఁగఁ గండ్లఁ జూడలేక
తగుగుమాస్తా యనఁదగు నశ్వరాయని
కరుణ నిండారఁగాఁ గాంచలేక
తే.
తొలఁగిపోతిరి మీవంటిదొరల నమ్మి
కొలువఁ దగునయ్య దీసులు కొలఁదిమీఱి
భద్ర...
34
సీ.
విల్లునమ్ములఁ బట్టి వెల్గులో జొన్పనా
వెడలిపోయెడి దొరబిడ్డలకును
చేతిచక్రము కొల్మిఁ జేర్చనా వెన్నిచ్చి
పాఱిపోయెడి దొరబాలురకును
క్షాత్రధర్మములెల్ల సరసిలోఁ ద్రొక్కనా
తొలఁగిపోయెడి యినకులజులకును
బంటుతనం బెల్ల పాధోధి గలుపనా
వరుసదప్పిన రఘువంశజులకు
తే.
అనుచు ఖేచరులెల్ల మి మ్మనఁగఁ దొల్లి
చెలఁగి సింహాసనంబున స్థిరుఁడ వగుము
భద్ర...
35
సీ.
శంఖంబుకోసము చక్కీలు నిల్పితే
నే నీయనని పోవ నీతరంబె
చక్రంబుఁ దెమ్మని స్వారీలఁ బంపితే
యది మల్పుకొనుట నీయబ్బతరమె
గద తెమ్మనుచు వేగఁ గడిదీలఁ బంపితే
తప్పించుకొనఁగ నీతాతతరమె
ఖడ్గంబుకోసమై ఖానుండు మళ్లితే
తిరిగి పోవంగ నీదేవుతరమె
తే.
వరుస తురకలగతి నెంచి వలసబోయి
నిల్పితివి క్షాత్ర మీపాటి నీకె చెల్లు
భద్ర...
36
సీ.
ఈపాటి దొర వౌట యెఱిఁగి యామందర
కైకకు నుపమలు గఱపె వేడ్క
ఈపాటి దొర వౌట యెఱిఁగి మీపినతల్లి
వెఱవక నిను నిల్లు వెళ్లఁగొట్టె
ఈపాటి దొర వౌట యెఱిఁగి వేగ సుమిత్ర
కొడుకుసహాయంబు గూర్చి పంపె
ఈపాటి దొర వౌట యెఱిఁగి శూర్పణఖ రా
వణుతోడ నీస్థితి వరుసఁ జెప్పె
ఎఱుఁగ కవనిజ నీవెంట నేఁగుదెంచె
చెఱను బడియుండవే దైత్యవరునియింట
భద్ర...
37
సీ.
శంఖంబులోఁ గీర్తిచంద్రిక లిమిడెనో
కనుపట్టదాయె సంగరమునందు
చక్రంబులో భూమిచక్రంబు దాఁగెనో
బల మీయదాయె నిబ్బరము గదుర
గదలోపలను క్షాత్ర మొదిగెనో యరులపై
రాణింపదాయె గర్వంబు దక్కి
కత్తిలోఁ గోపంబు నొత్తిలియుండెనో
తురకలపై చుర నుఱుకదాయె
తే.
స్వామి యిది యేమి వింతసాహసంబు
లెందు మేంచేసి యరులపై మందగించె
భద్ర...
38
సీ.
ఈపాటి దొర వౌట యెఱుఁగక మిము నమ్మి
దేశస్థు లెల్లను దిగులుపడిరి
ఈపాటి దొర వౌట యెఱుఁగక మిము నమ్మి
భక్తులెల్లను మ్లేచ్ఛబాధపడిరి
ఈపాటి దొర వౌట యెఱుఁగక మిము నమ్మి
సెట్టిపల్లియవారు మట్టమైరి
ఈపాటి దొర వౌట యెఱుఁగక మిము నమ్మి
యశ్వరాయఁడు భూపలాయనంబు
తే.
నొందె నీపాటి దొర వౌట ముందెఱింగి
కదనమునకుఁ దురుష్కుండు గదిసె నహహ
భద్ర...
39
సీ.
భుక్తాన్నశేషంబు పొసఁగ దాసుల కమ్మి
దినములు గడుపు జగ్గనఘనుండు
తను గానకుండ గంధము మేన నలఁదించు
కొని నిష్ఠ సల్పు నప్పనఘనుండు
బీదసాదల దోఁచి పృథ్విని వంచించి
పన్నిచ్చు వేంకటపతినృపాలుఁ
డొడయఁడై మణిదెచ్చి మడుగులోపలఁ జొచ్చి
దాఁగియుండిన పరధనఘనుండు
తే.
వారలెల్లను నీవంటివారు గారె
యొదిగియుండిరి యుగచర్య లూహ జేసి
భద్ర...
40
సీ.
శబరి విందయ్యెనే సరభసంబున మీకు
భావింప రామలదేవుభక్తి
హనుమంతుఁ డయ్యెనే యతిసాహసుండైన
జోగిపంతులయుక్తి చూడ మీకు
సుగ్రీవుఁ డయ్యెనే సొరిది గోరుం దొర
కపి తానుఘనుఁడు మీకార్యమునకు
ఘనఋష్యమూక మయ్యెనే రాజమాహేంద్ర
వర మెన్న మీమనోవాంఛ దీర్ప
తే.
కాకయుండిన యిచ్చటిరాక కేమి
కారణం బెన్న మీవంటి ఘనుని కరయ
భద్ర...
41
సీ.
జోగిపంతులకు మెచ్చులు గూర్పఁబోతివో
యింగిరీజులప్రాపు నిచ్చగించి
తురకరూపము దాల్చుతఱి వచ్చెనో మ్లేచ్ఛ
సంహార మొనరింప జగ మెఱుంగ
శాఖామృగంబుల జతగూర్ప ఋశ్యమూ
కము జేరఁబోవుటో క్రమముతోడ
నన్ను ధన్యుని జేయ నాచేత పద్యముల్
చెప్పింపఁ బూనుటో యొప్పు మీఱఁ
తే.
గాక యిది యేమివింత ముల్లోకములను
వలస వేంచేసితి రటన్న యలుసుగాదె
భద్ర...
42
సీ.
అరయంగ మీకు భద్రాచలం బయ్యెనే
పొలుపు మీఱఁగ రాజు పోలవరము
కోవెల ప్రాకారగోపురా లయ్యెనే
తలుపులు లేని కన్ దడికయిండ్లు
కల్యాణమంటపాగారంబు లయ్యెనే
సంతమామిళ్లలో జప్పరములు
భువి నెన్నఁగా రథోత్సవమయ్యెనే మీకు
వాహనరహితప్రవర్తనంబు
తే.
మేలు రాజ్యంబు తురకలపాలు జేసి
హరవృషభమధ్యమున నుండు టర్హ మగునె
భద్ర...
43
సీ.
గోవిందరాజులు గురులఘుత్వము మది
దలఁపక మీవెంటఁ దగిలె నెట్లు
రంగనాయకులు శ్రీరంగాధికారంబు
నెఱుఁగక యేరీతి నేఁగుదెంచె
నరసింహుఁ డుగ్రంబు నట్టేటిలోఁ గల్పి
వెడఁగునై యెటుల మీవెంట వచ్చె
క్షేత్రపాలకుఁడై శ్రీరామలింగంబు
ప్రమథులతో నెట్లు పాఱిపోయె
తే.
అహహ సహవాసుగుణము వీరందఱకును
సంభవించెను గాఁబోలు జగ మెఱుంగ
భద్ర...
44
సిీ.
బిబ్బీలసిబ్బెంపుబిగువుగుబ్బల నీదు
వజ్రాలపతకముల్ వరలవలెనొ
పారసీకాంతలపాపట్లయందు నీ
ముత్యాలపేరులు మురియవలెనొ
తురకబిత్తరులపెందురుములలో వేడ్క
మొగలిపూరేకులు ముడువవలెనొ
యవనాబ్జవదననవకంపుమేనులఁ
బీతాంబరముగేషు బెనఁగవలెనొ
తే.
కాక యిది యేమి నీసొమ్ము లోక మెఱుఁగ
మానవులు వేగ హరియించి మనఁగలారె
భద్ర...
45
సీ.
తూర్పునాఁటితెనుంగుదొరతనంబులు గావు
తోమాలలంది సంతోషపడను
దక్షిణదేశంపుద్రవిడసాములు గారు
వినియోగములు గొని వేడ్కఁ జెందఁ
బశ్చిమమహరాష్ట్ర ప్రభువరేణ్యులు గారు
పాదతీర్థంబున మోద మొంద
ఉత్తరదేశంపుటోఢ్రరాజులు గారు
దర్శనమాత్రానఁ దనివినొంద
తే.
యవను లధ్వాతురు లటన్న సవి యెఱింగి
వస్తువాహనవిభవముల్ వదలి తహహ
భద్ర...
46
సీ.
ధీమంతు లెల్లను దెప్పించుకోక రా
రో మీస్థలానికి రూఢి మెఱయఁ
గవులు పంపింపక కదలలో మీమొఖా
సాల కెల్లను గడుశాశ్వతముగ
సనదులు పుట్టక సనుదెంచరో యగ్ర
హారీకులకును మహాదరముల
వరుసతోడుత పరవానాలు లేక వేం
చేయరో భూసురశ్రేణి కెల్ల
తే.
తురక లెల్లను మీత్రోవఁ ద్రొక్కకుండ
ధరణి తాఖీదు లియ్యక తర్లినారొ
భద్ర...
47
సీ.
ద్వాత్రింశదాయుధోద్ధరణంబు గావించి
నెరి తుపాకులఁ బట్టనేరవైతి
సకలదానవులను సంహరించు టెఱింగి
తురకలతోఁ బోర నెఱుఁగవైతి
కుక్షిలో లోకముల్ కుదురుసేయుట నేర్చి
మీఱి సొమ్ములవాంఛ నేరవైతి
పదునాల్గులోకముల్ పాలించుట యెఱింగి
నీదురాజ్యము కావ నేరవైతి
తే.
వవని తెల్లనివెల్లఁ బా లనుచు నమ్మి
మోసపోతిరి గర్వంబు మొదల దొట్టి
భద్ర...
48
సీ.
అగ్నివర్ణాదివీరాగ్రేసరులకంటె
మిక్కిలె సొర్దాదు లక్కజముగ
వృశ్చికరోమాదివీరుల కినుమడే
సిఫిరుషెంషేరులసిద్ధఫలము
ఇంద్రజిత్తాదుల కెక్కుడే తలపోయ
ధరణిలోఁ బలుగుముుందాను లరయ
యవనరాక్షసమాయ కధికమే లెక్కింప
మొగలాయిమర్మంబు మొగి దలంప
తే.
పొసఁగఁ ద్రేతాయుగంబు రక్కసులకంటఁ
గలియుగమునాఁటితుర్కలు ఘనమె మీకు
భద్ర...
49
సీ.
కపులచేఁ గఱపింప చపలదైత్యులు గారు
జెంజెరి హుక్కాల చెడుగుదొరలు
రాళ్ల చే నడపింప రాక్షసావళి గాదు
పడినెన్న బారుజవానుగములు
లగ్గలు పట్టింప లంకాపురము గాదు
మహిని జాఫరగడిమహలుగాని
పిలిచి కొల్వీయ విభీషణుం డిల గాఁడు
బిగిగల్లు నలయారుబేగుగాని
తే.
చేసితివి మ్లేచ్ఛజనముతోఁ జెలిమి వెఱపుఁ
గఱపఁ బూనియు వెఱచినక్రమము దోఁప
భద్ర...
50
సీ.
పితృవాక్యమునకునై పినతల్లి కోరిక
గడుపఁగా నేరీతి గడఁగినావొ
కడఁగినవాఁడవై ఖరదూషణాదిరా
క్షససమూహము నెట్లు చదిమినావొ
చదిపినవాఁడవై శాఖామృగశ్రేష్ఠు
నేగతి బంటుగా నేలినావొ
యేలినవాఁడవై యెటువలెఁ గపులచే
ఘనవార్ధి నేక్రియఁ గట్టినావొ
తే.
కట్టి లంకాధిపుని నెట్లు కొట్టినావొ
యిట్టిధైర్యము గలదొరపట్టి వరయ
భద్ర...
51
సీ.
సోమకాసురునితోఁ జొచ్చి పాథోరాశి
మత్స్యమై సుఖలీల మరగినావొ
కూర్మరూపముచేతఁ గుంభిని జొరఁబాఱి
వ్రేగుచే బయలికి వెళ్లలేదొ
వరహావతారమై వసుధ వర్తించిన
సిగ్గుచే మూలలఁ జేరినావొ
బాలునిపల్కు వెంబడి వేగరా నుక్కు
కంబములో దాఁగఁ గడగినావొ
తే.
కాక నిజరూపముననున్న ఖలులు జేయు
చేతలకు నూరకుందువే చేయ మఱచి
భద్ర...
52
బలిచేత దానంబుఁ బ్రార్థింపఁబోతివో
కుబ్జరూపముచేతఁ గుటిలబుద్ధి
పరశుహస్తుండవై పార్థివావళి ద్రుంచి
ధర యేలఁబోతివో ధర్మనిరతి
మునుపటివనవాసమును జెందునాయాస
ముడుపుకోఁబోతివో యుత్సుకమున
తడయక గొల్లబిత్తరుల నిత్తఱిఁ జేసి
కరుణింపఁబోయితో కాముకేళి
తే.
అహహ బౌద్ధుండవై ఖాను లాగడమునఁ
జేయుపనులన్ని జూచెదు సిగ్గెఱుఁగక
భద్ర...
53
సీ.
అవనిలోపలఁ గాలయవనునినాఁటి నీ
పాఱుబోతుగుణంబు బాయదయ్యె
కొంచెబాఁపఁడవయి కోరినబలినాఁటి
మంకుబిచ్చపుబుద్ధి మానదయ్యె
పరగఁగఁ బితృవాక్యపరిపాలనమునాఁటి
దుడుకుకష్టతరంబు తొలఁగదయ్యె
పండాలచేత దుర్భాషలఁబడునట్టి
పుడమి మొండితనంబు పోవదయ్యె
తే.
నేఁటికైనను నెన్నన్న మాట వినక
తొలఁగి యిట్లుండుటకు నేమి తోఁచ దకట
భద్ర...
54
సీ.
తాటిపండులు దిని తనిసినవారికి
శాల్యన్న మన్న ముచ్చటయుఁ గాదె
దుంపతోడులు దిని దొరకొన్నవారికిఁ
బరమాన్న మన్న సంబరముగాదె
తౌడురొట్టెలతోడఁ దపము జేసినవారి
కతిరసాలన్న నెయ్యంబు గాదె
నారచీరలు గట్టినట్టివారికిఁ బట్టు
పీతాంబరములన్నఁ బ్రియము గాదె
తే.
చెంచుముద్దియవిం దారగించినట్టి
దొరకు రాజులవిందన్న దొడ్డగాదె
భద్ర...
55
సీ.
క్రూరదానవులను జీరినచక్రంబు
మొఱపలు బోయెనో మోటువడెనొ
పగతులశిరములు బద్దలుగాఁ జేయు
గద త్రుప్పుబట్టేనో కలికెనొక్కొ
రావణాదులమీఁద రవణించు పెనువిల్లు
నడిమికి విఱిగెనో నారి తెగెనొ
శత్రువర్గమునెల్ల సమయించు పెనుతూపు
కాకంబు మ్రింగెనో కాడువడెనొ
తే.
కాక యిది యేమి యవనులు కాకుజేసి
మండపాగారములు మట్టుమసలి రహహ
భద్ర...
56
సీ.
తాటకపై కుగ్రతరముగ వెడలిన
బాణంబు లెక్కడఁ బడియె నొక్కొ
ఘనసుబాహుని బట్టి ఖండించి వైచిన
శరము లెచ్చోటికి నరిగె నొక్కొ
చిత్రమృగముమీఁదఁ జిందు చెండాడిన
మార్గణం బెచ్చోట మడిసె నొక్కొ
వాలిపై నవలీల వ్రాలి జీవముగొన్న
యాశుగం బెచ్చట నణఁగె నొక్కొ
తే.
అవని యవనులు మీరాజ్య మాక్రమించి
యేలుకొనుచున్నతఱి ప్రాలుమాలె దకట
భద్ర...
57
సీ.
అంగదసుగ్రీవహనుమదాదులకు లా
ల్కుడతాలు దొడిగించు గుఱుతుమీఱ
జాంబవత్కుముదాదిశాఖామృగంబుల
గారడీ యాడింపఁగాఁ దలంచు
ముసలముద్గరశూలముల మార్చి చెకుముకి
బందూకలు ధరింపఁ బాటిసేయు
వరుస గీర్వాణముల్ వదలించి వేవేగ
తురకమాటలు నేర్పు కఱకుమీఱ
తే.
మీరు దేవత్వము వహించి మేటినంచు
మీఱి వేఱొకరీతిని మెలఁగరాదు
భద్ర...
58
సీ.
సూకరరూపంబు సూచన వినిగదా
విడిచిపెట్టిరి నిన్ను వెర వెఱింగి
బలి బిచ్చమెత్తిన బాఁపఁడ వనిగదా
విడిచిపెట్టిరి నిన్ను వెర వెఱింగి
ఢిల్లీశ్వరున కైనయల్లుఁడ వనిగదా
విడిచిపెట్టిరి నిన్ను వెర వెఱింగి
పాఱిపోయినవానిఁ బట్టరాదనికచా
విడిచిపెట్టిరి నిన్ను వెర వెఱింగి
తే.
కాక యుండిన తురకల గడచిపోవఁ
గలరె మీవంటివారలు క్రమముతోడ
భద్ర...
59
సీ.
శేషావతారవిశేష మెక్కడఁ బోయె
లక్ష్మణార్యునకు సలక్షణముగ
శంఖ క్రాన్వయసంజ్ఞ యెచ్చటఁ జెల్లె
భరతశత్రుఘ్నుల కరయ భువిని
లోకమాత్రాఖ్య యేలోకంబునకుఁ జేరె
భూమిపుత్రికి నెన్న భూమిలోన
ఆదినారాయణాహ్వయ మెందులకు నేఁగె
రామాఖ్యగలమీకు రమణతోడ
తే.
తురక లెల్లను దొరవని సరకుగొనక
మంటపాగారముల మట్టుమసలి రహహ
భద్ర...
60
సీ.
చెక్కులు నిమురక సీతోర్మిళాదులఁ
గని యూరకుందురే మనసు నిల్పి
పాఱిపోవఁగనైనఁ బట్టెలు నాకక
విడుతురే వైష్ణవవితతినెల్ల
బిరుసుగడ్డంబులఁ బెఱుకక రిత్తగా
నాదరింతురె వసిష్ఠాదిమునుల
ముక్కులు గఱువక మునుమొనకట్టి పో
నిత్తురే కపినాయకోత్తములను
తే.
మొగలుబచ్చాల కగుపడ దగదటంచుఁ
తొలఁగిపోతి రిఁకేటికి దొరతనంబు
భద్ర...
61
సీ.
పురలక్ష్మి నురువడి చెఱవట్టి కీడులో
వనలక్ష్మికరవల్లవములు నులిమి
గంగను గదిసి వేగమె ధైర్యలక్ష్మిని
జేకొని ధనలక్ష్మిఁ జెట్టపట్టి
రాజ్యలక్ష్మిని సంగరమునఁ బెండిలియాడి
ధాన్యలక్ష్మిని సరదార్ల కిచ్చి
ఘనగజాంతర్లక్ష్మి గైకొని వేవేగఁ
గీర్తికాంతకుఁ గులగిరు లొసంగి
తే.
నట్టి ధంసాను శిక్షంప నలవిగాక
యడుగుకొంటివి నృపతుల కడుపుకొఱకు
భద్ర...
62
సీ.
హరువిల్లు విఱువక వరపుత్రి నీయంగ
జనకరా జేమి విచారపడెనొ
పరశురాముని భంగపఱుపఁగా నెంచిన
దశరథుం డేరీతి తల్లడిలెనొ
మిముఁ గాపుఁజేసి యాగముఁ బూర్తిచేసిన
కౌశికుం డేమి వ్యగ్రతఁ గొనియెనొ
వనరాశి గట్టి రావణుఁ ద్రుంచఁ గనిన వి
భీషణుం దేరీతిఁ బెగడువడెనొ
తే.
తురకబలకోటివలని యాతురత పోల
వరము వేంచేసినట్టి దుర్వార్త వినిన
భద్ర...
63
సీ.
వరుసఁ గోడలిదురవస్థలు విన సారె
కౌసల్య యేగతిఁ గాంచెనొక్కొ
మీశ్రమమెల్ల సుమిత్ర యాలించి గా
సిలి దుఃఖవారాశి జేరె నొక్కొ
కలకాల మీరీతి గడువంగఁ గాలంబు
విని విందు లేమని వెఱచి రొక్కొ
గతకాలమునఁ బండ్లు కానుక యిచ్చిన
శబరి యేగతిఁ జింతసలిపె నొక్కొ
తే.
అహహ భద్రాద్రినుండి మీ రరిగి పోల
వరము వేంచేసినట్టి దుర్వార్త వినియు
భద్ర...
64
సీ.
ఆదిభీమునిఁ బెండ్లియాడిన పార్వతి
కన్నవస్త్రముల కే మాపదయ్యె
కోరి బాఁపనిఁ జేసికొన్న సరస్వతి
కిడుమలు వచ్చెనే యిల్లు లేక
కాళ్లు లేనిఫణీంద్రుఁ గట్టుకొనినయుర్వి
కూరు లేదాయెనే యుండుటకును
తనువు లేనివయారిఁ దగిలి రతీదేవి
సుఖపడదాయెనే సురలు మెచ్చ
తే.
భళిర మీవంటిప్రభుఁ జెట్టవట్టి సీత
సకలవెతలకు లోనయ్యె సరవితోడ
భద్ర...
65
సీ.
పొరుగూళ్లవెంబడి తిరుగుచునుండు ల
క్ష్మీదేవి కేయపకీర్తి వచ్చె
సభలలో నేప్రొద్దు సంచరించుచునుండు
వాణి కే మపకీర్తి వచ్చె జగతి
వేలారుమనువుల కాలయ మైయున్న
భూదేవి కేమి తప్పులు ఘటిల్లె
శివునిఁ బాసి సముద్రుఁ జెందిన పార్వతి
సవతి కే మాడికల్ సంభవించె
తే.
తోడునీడయి వెంటఁ గూడియున్న
సీతదురవస్థ లేమని చెప్పతరము
భద్ర...
66
సీ.
జనకుఁ డిచ్చెను బన్నసరముంచును సురూప
తెలుపు సీతామహాదేవి యిష్ట
జనులతో నూర్మిళ తనతల్లి యొసఁగిన
పచ్చలకళలని బల్కు ప్రాణ
సఖులతో మాండవి సరవి కెంపులనత్తు
పొలుపును గనుఁగొని మురియు బంధు
వర్గంబులో జాళువావల్వ శ్రుతకీర్తి
మేనమామ యొసంగె మిథిలయందు
తే.
అనుచుఁ గొనియాడు పుట్టింటిఘనత మెఱయ
వారి నేరీతి నోదార్చ వశము నీకు
భద్ర...
67
సీ.
గుజరాతి కెంపులకుంటేళ్లు చెవుల ధ
రించదాయెఁ గదయ్య వాంఛదీర
వరుణదేవుఁ డొసంగు వజ్రాలకమ్మలు
పెట్టదాయెఁ గదయ్య ప్రేమదీర
అలకుబేరుఁ డొసంగు నద్దాలరవిక పైఁ
దొడుగదాయెఁ గదయ్య యొడలునిండ
కట్న మింద్రుఁ డొసంగు గంటలమొలనూలు
గట్టదాయెఁగదయ్య కాంక్షదీర
తే.
వేడ్క దినములు నడవుల వెంటవెంటఁ
ద్రిప్పితిరి సీత నూరక తప్పు లేక
భద్ర...
68
సీ.
తెచ్చితి కీర్తి కీర్తివిశారదు లగుని
క్ష్వాకువంశోద్భవఘనుల కెల్ల
యేలితి వవనిలో నెలమి శంకరగిరి
హసనుబాదాలు మహాద్భుతముగఁ
దోలితి వరుల హద్దులు తప్పి రాకుండ
భక్తకోటికి ముద్దుభావ మలర
...............................................
..............................................
తే.
నేమి వర్ణింతు మీక్షాత్ర మే మ నెంతు
లోకు లెఱుఁగంగ నీమూఁడులోకములను
భద్ర...
69
సీ.
అల పాకశాసనునైనను యాచించి
చేయించు ముత్యాలచేరుచుక్క
రమణతోడుత ధర్మరాజు కుదయబుట్ట
నడిగి చేయించు ముత్యాలనత్తు
వరుణదేవునినైన వరుసతోఁ బ్రార్థించు
కలకొద్ది జేయించు కమ్మజోడు
రాజరాజును గోరి తేజంబుతో ముందు
నిప్పించు సవరంపుఁగొప్పె ముందు
తే.
పేద పోడుము లివియైనఁ బెట్టనున్నఁ
జూపరులకెల్ల మిక్కిలి చులకదనము
భద్ర...
70
సీ.
ఇల్లు నప్పులగంప యిల్లాలు చలచిత్త
పాన్పు నాగులపుట్ట వదినె జ్యేష్ఠ
గొల్ల పెంపుడుతల్లి కోడలు రాఁగ కూఁ
తురు పాఱుఁబోతు ఆతురుఁడు సఖుఁడు
మనుమఁడు తండ్రి కామకుఁడు కుమారుండు
క్షయరోగి మఱఁది వంచకుఁడు తండ్రి
అన్న పానఘనుఁడు నరయ నిష్టుఁడు పేఁడి
వేసదారివి నీవు వేయునేల
తే.
ఇన్నియును నాదునెమ్మది నెఱిఁగియుండి
కొలిచితిని మిమ్ము విశ్వాసగుణము దలఁచి
భద్ర...
71
సీ.
పన్నీరు సీసాల పరగనించినభాతి
నెనయంగఁ బ్రమథు మారెత్తురీతి
వరుస ముత్యాలుకోవలు నించినక్రమంబు
మల్లెపూసరములు మలుపుమాడ్కి
విరిజాజిపై సుధావృష్టి దోఁగినరీతి
కస్తూరివీణియల్ గలుపుపోల్కి
పరగ నౌదాతుగంపలు పంపినక్రమంబు
తేనెబానల తెరల్ దీసినట్లు
తే.
నీదు నామామృతంబు నా నేర్చినంత
కొల్లలాడెద భక్తులు నుల్లసిల్ల
భద్ర...
72
సీ.
సర్వమొఖాసాలు చాలని మీ కేల
కట్టడి నేరీతి గడచెనయ్య
బహ్వవసరములు భక్షించు మీ రెట్లు
నొక్కప్రొద్దున కోర్చి యుంటిరయ్య
సంగీతసాహిత్యసద్గోష్ఠి గలవార
లొంటి మీ రె ట్లొదిగుంటిరయ్య
తిరువీథు లెడపక తిరిగెడి మీ రెట్లు
గడపదాఁటక ప్రొద్దు గడపితి రహ
తే.
వాహనంబులపై నుండువారి కహహ
యోడపై నెక్కఁగా నెట్లు గూడె నయ్య
భద్ర...
73
సీ.
పదియు రెండేఁడులప్రాయంబువాఁడవై
మించి తాటకను శిక్షించు టెఱిఁగి
రణశూరులగు దైత్యగణములఁ బరిమార్చి
కౌశికుజన్నంబుఁ గాచు టెఱిఁగి
తరములఁబట్టి యెత్తఁగరానిహరువిల్లు
చెఱకుకైవడి చేత విఱచు టెఱిఁగి
సంగరరంగవిశారదుండైన భా
ర్గవరాము నవలీల గడపు టెఱిఁగి
తే.
దూరితిని మిమ్ము రోషంబు దొట్టి రిపుల
మద మణంగించునట్టి సమద మెలర్ప
భద్ర...
74
సీ.
ప్రారబ్ధ మనుభవింపని భక్తజనముల
యాతనలను ద్రుంప మీతరంబె
కారణహేతువికారముల్ దప్పింప
నధికులఁ జేయ మీయయ్యతరమె
మిము తొల్లి పూజించి మీవరంబులు గొన్న
ధంసాను గెల్వ మీతాతతరమె
గతజన్మమునఁ బెట్ట గతిలేక పుట్టిన
దీనులఁ బ్రోవ నీదేవుతరమె
తే.
అనుచు జనులెల్లఁ గొనియాడ వినఁగ లేక
దూరితిని నాదుదోషముల్ తొలఁగఁజేయు
భద్ర...
75
సీ.
ఈతఁ డాధంసాను నెదిరి పోరఁగలేక
పాఱిపోయిన రామపార్థివుండు
ఈతఁ డాయరికి వెన్నిచ్చి పోలవరంబు
దరికిఁ జేరిన సుమిత్రాతనూజుఁ
డీపె కాకలసొమ్ము లిచ్చి మ్లేచ్ఛులబాధ
పతికిఁ దప్పించిన భాగ్యమూర్తి
ఈతఁ డాపగదళం బిదె వచ్చెనని చూపి
భయము బుట్టించిన పావని యని
తే.
పల్కుదురు సామి మిముఁ జూచి ప్రజలు కార్య
భార మెఱుఁగక కోపింపవలదు తండ్రి
భద్ర...
76
సీ.
పిఱికివాఁ డంటిఁగా యురుదానవాదుల
గర్వ మడంచినఘనుని నిన్ను
లోభివాఁ డంటిఁగా లోకంబు లెఱుఁగంగ
లంక దానము జేయు రాజు నిన్ను
బలహీనుఁ డంటిఁగా బలిమిఁ సముద్రుని
బాణాగ్రమున నిల్పు జాణ నిన్ను
వెఱ్ఱివాఁ డంటిఁగా వెర వెఱుంగక కోఁతి
గములచే వారధి గట్టినట్టి
తే.
మిము లోకోపకారినై నెమ్మిఁ బూని
దూరితిని గాక మీవంటిదొర గలండె
భద్ర...
77
సీ.
అల కుచేలుని చేరెఁ డటుకుల భక్షించి
సంపద లొసఁగిన సరసగుణుఁడ
గజరాజు మొసలిచే గాసిలి మొఱవెట్ట
కాచి రక్షించిన కమలనాభ
కలఁ డనఁ బెన్నుక్కుకంబంబులో నుండి
వెడలి బాలునిఁ గాచు వీరవర్య
తలఁచిన ద్రౌపది తలఁపు వెంబడి మాన
భంగంబుఁ గాచిన ప్రభువరేణ్య
తే.
లోభి వంటిని పగఱకు లొంగి తంటి
పిఱికి వంటిని నేరక యుఱికితంటి
భద్ర...
78
సీ.
పగతుఁడై బహుఫణార్భటిఁ జేరవచ్చిన
కాళీయఫణివర్యుఁ గావలేదె
సీతను జెఱఁగొన్న పాతకాగ్రేసరు
ననుజుని శరణన్న మనుపలేదె
మీశరణార్థియై మెలఁగి కావు మటన్న
కాకాసురునితప్పు గడుపలేదె
.......................................
......................................
తే.
పృథివి శరణాగతత్రాణబిరుదు గలుగు
దొర వనుచు మిమ్ముఁ బలుమాఱు దూరినాడ
భద్ర...
79
సీ.
పితృకార్యమునకునై పినతల్లికోరిక
వెఱువకతీర్చిన వేల్పు నిన్నుఁ
బాదరేణు వహల్య పాపంబు లెడఁబాపి
ధవుని గూర్చిన పుణ్యధనుని నిన్నుఁ
దగఁ గన్న పగవానితమ్ముని లంకలోఁ
బట్టంబుగట్టిన ప్రభుని నిన్ను
ఘనసుబాహునిఁ బట్టి ఖండించి కౌశికు
సవముఁ గాచిన సర్వసముని నిన్ను
తే.
భక్తలోకోపకారార్థపరుఁడ నగుచు
దూరితిని నాదులోపంబుఁ దొలఁగఁజేయు
భద్ర...
80
సీ.
చిలుకకు మాటలు చెప్పి రామా యను
చేడియ మోక్షంబు చెందలేదె
వరుస దారులు దోఁచి వాల్మీకి రామరా
మా యని మీకృపం బ్రబలలేదె
పతిశాపగతినుండి పాదరేణువు సోఁకి
పాషాణ మింతియై పరగలేదె
…...........................................
......................................
తే.
పృథివి శరణాగతత్రాణబిరుదు నీకుఁ
గాక యితరుల కెందైనఁ గలుగఁ గలదె
భద్ర...
81
సీ.
కంటినేమో నాదుకఠినచిత్తమునందు
నిలిపిన నీపదనీరజములు
అంటేనేమో నాదునఘవంశ మాత్మలో
సంచరించఁగ మేనఁ జెమటలూరి
సోఁకేనేమో నాదు చుఱుకు లోఁజూపులు
చూచుచుండఁగ ముఖసుందరంబు
..................................................
.............................................
తే.
సామి యిఁక నేరములు నీరసంబుఁ జేసి
కాచి రక్షించు సత్కృప గడలుకొనఁగ
భద్ర...
82
సీ.
కొల్లలాడితినని కోపింపఁబోకుఁడీ
యవని మీదివ్యనామామృతంబు
వీటిఁబుచ్చితినని వింతగాఁ గనకుఁడీ
కృతులందు మీగుణకీర్తనములు
కాకుఁ జేసితినని కంటకపడకుఁడీ
ధరణి మీదివ్యకథారసంబు
ఎఱుఁగఁబల్కితినని యెగ్గుగాఁ గనకుఁడీ
మహిని మీమర్మకర్మంబు లెల్ల
తే.
పంచిపెట్టితినని కోపగించవద్దు
సరస మీపద్యముల్ చెప్ప సంతతంబు
భద్ర...
83
సీ.
వేయుకన్నులుగల వేల్పురాయనికైనఁ
గనుఁగొనరాని శృంగారరూప
వేయునోళులుగల వీనులకంటికై
న వచింపరాని యనంతనామ
వేయుచేతులు గల్గు వేఁడివేల్పునకైన
పూజింపఁగారాని పుణ్యమూర్తి
నాలుగుమోముల నలువొందుసుతుకైన
వర్ణింపఁగాఁగాని వరచరిత్ర
తే.
తగదు తగదని మూఢచిత్తమున నిన్ను
నిల్ప శక్యంబె నావంటి యల్పునకును
భద్ర...
84
సీ.
పనుపట్టితే యొక్కపనసుండు చనుదెంచి
యరిబలంబులను జక్కాడలేఁడె
సెలవిచ్చితే యొక్కబలిమిని నీలుండు
నని విరోధులఁ దెగటార్పలేఁడె
ఆనతిచ్చిన యొక్కయంగదుఁ డెదురేఁగి
పగతులయుసురులఁ బాపలేఁడె
...................................................
...........................................
తే.
స్వామి సాత్వికరూపవిచక్షవరుల
యోర్చితిరి తురకలయొదటికెల్ల
భద్ర...
85
సీ.
నలనీలకుముదసేనానాయకోత్తముల్
బలసి ముంగల బరాబరులు సేయ
హనుమయు జాంబవదాంగదాదులు నిల్చి
యంచలంచలను జోహారు లిడఁగ
వరుస సుగ్రీవ గవయ గవాక్షాదులు
నొరసి మిన్నంటి చామరలు వీవ
పరమభాగవత ఖేచరసిద్ధచారణుల్
జయజయ శబ్దసంచయము నుడువ
తే.
సురలు విరులు గురియఁ బోలవరమునుండి
భద్రగిరి జేరు వేడ్కలు బ్రస్తుతింతు
భద్ర...
86
సీ.
అంగ వంగ కళింగ బంగాళ నేపాళ
రాజులకెల్ల శ్రీరాములాజ్ఞ
ఘూర్ఖర టెంకణ కుకుర టెంకణ చోళ
రాజులకెల్ల శ్రీ రాములాజ్ఞ
చోట సింధు మరాట లాట మత్స్య విదర్భ
రాజులకెల్ల శ్రీరాములాజ్ఞ
పాంచాల సౌరాష్ట్ర బర్బర మగధాంధ్ర
రాజులకెల్ల శ్రీరాములాజ్ఞ
తే.
దివ్యతిరునాళ్లకు సమస్తదేవవరులు
రావలయునంచుఁ జాటింపఁగావలయును
భద్ర...
87
సీ.
శ్రీరామచంద్రులు సీతాసమేతులై
వచ్చిరి భద్రాద్రివాసమునకు
జయనామవత్సర చైత్ర శుద్ధాష్టమి
తరువాతదినమందుఁ దగ వివాహ
మరయ మార్గమునందు నొరయ సత్తరులు బల్
చలువపందిరులు వెచ్చనిజలములు
శీతోదకంబులు చిక్కనిమజ్జిగల్
నిమ్మపండ్లరసంపునీరు చల్ల
తే.
లాదిగాఁగల్గు ద్రవ్యంబు లమరఁజేయ
వలయునని వేగఁ బంపుఁడీ వాయుసుతుని
భద్ర...
88
సీ.
తిరిగి రాములు భద్రగిరి కేఁగువార్త లా
లించెనా వజ్రి తాలీ లొసంగు
అవనిజాధిపుఁడు భద్రాద్రిఁ జేరుట వినం
గల్గెనా జముఁడు చౌకట్లొసంగు
దశరథాత్మజుఁడు స్వస్థానంబు కరుగుట
వినియెనా వరుణుండు మణు లొసంగు
భరతాగ్రజుఁడు నిజపురము కేతెంచుట
విన్నచో ధనము కుబేరుఁ డొసఁగు
తే.
ననుచు నల నీల జాంబవ దంగదాదు
లమరియున్నారు శుభవార్త లరసి చెప్ప
భద్ర...
89
సీ.
కలిమిచే బుధులను గాననేరనివారి
వారించెఁ గరుణచే వదినెగారు
నెరిపేదనైనను నిల్చి చేపట్టియు
ధీరునిఁ జేయు పత్నీలలామ
పతితాత్ము నైనను బావనుగాఁ జేయు
గుణవతి ముద్దులకూఁతు రరయ
యవివేకినైన విద్యావంతునిగఁ జేసి
గురురూప మొనరించుఁ గోడ లెన్న
తే.
యిట్టిసంపత్తి నీకుంట యెఱిఁగి యెఱిఁగి
కొలిచితిని వేగ నా కేమి కొదువ యింక
భద్ర...
90
సీ.
దయశాలి తల్లి యుదారసాహసుఁ డప్ప
భూభారకుఁడు శయ్య పుష్పబాణుఁ
డరయ పుత్రుఁడు శీతకరుఁడు మఱంది వా
సవసూను విష్ణుఁ డైశ్వర్యయుతుఁడు
నెచ్చెలి దేవయోని దలంప మనుమఁడు
రత్నాకరం బిల్లు రమణి దెన్న
రణశూరుఁ డన్న సారసనేత్ర వర్ణింప
నవతారమూర్తి వీ వవనిలోన
తే.
ఇట్టిమిముఁ గొల్చు నామది కితరబుద్ధు
లమరనేర్చునె యెన్నిజన్మములకైన
భద్ర...
91
సీ.
వరుస విద్యలు చెప్ప వదినె సరస్వతి
యూయువు దయసేయ నన్న యజుఁడు
ముదమీయ నక్షత్రములు మేనయత్తలు
మాకిష్టపడఁ జందమామ యరసి
పాపముల్ బాప యప్ప దివిజగంగ తా
నైశ్వర్య మొసఁగ శ్రీహరుఁడు బావ
మాతల్లి ముల్లోకమాత కమ్మనిదీవ
పోషకుఁడవు తండ్రి పొసఁగ నీవ
తే.
యిన్నియును నింట గల్గుట యెఱిఁగి యితర
దైవముల వేఁడ నాకేల దైవరాయ
భద్ర...
92
సీ.
బలుసాకు మెక్కి ద్రౌపదిచేత వనములోఁ
బాండవావళిని గాపాడినట్లు
సరవి తెచ్చిన పండ్లసారం బనుభవించు
చెంచుముద్దియను రక్షించినట్లు
అడిగి తెచ్చిన ముక్కయటుకులు భక్షించి
చెలఁగి భాపని ధన్యుఁ జేసినట్లు
పెట్టగానని తౌటిరొట్టెకు బ్రతిమాలి
ముసలియవ్వకుఁ గీర్తి యొసఁగినట్లు
తే.
పూసపాటినృపాలురఁ బ్రోవఁ దలఁచి
తెచ్చుకొంటిరొ మీకర్చు వెచ్చమునకు
భద్ర...
93
సీ.
గోత్రికులని పాలుగొట్టి పోలేక మీ
యంశభూతులటంచు నడిగినావొ
పేరుమోసినకట్న మారసికొంటివో
శూరులనుచు నండఁ జేరినావొ
మీనౌకరులలోన మీఱి మమ్మిట దెచ్చె
ననఁ జూపి వ్యయముల కడిగినావొ
స్థలము వంశజమీరొరునిపోలిక (?)
బలుకష్టసుఖములు దెలిపినావొ
తే.
యెట్టు దయచేసిరయ్య మీపట్టు మీకుఁ
బూసపాటికులోద్భవుబాస యెఱిఁగి
భద్ర...
94
సీ.
రవికులోత్తమ దశరథరాజనందన
తాటకమదవిమర్దన మునీంద్ర
మఘపరిపాలన మారీచహర యహ
ల్యాశాపమోచన హరశరాస
నవిభంగనిపుణ జానకినాథ దుర్వార
భార్గవరామగర్వప్రనాశ
పితృవాక్యపాలన ప్రీతచతుర్దశ
లోకదుష్టనిశాటభేకసర్ప
తే.
దైత్యమర్దన సుకలాప సత్యదీప
మౌనిమానససారసమత్తమధుప
భద్ర...
95
సీ.
రణభీమ దైత్యమారణహోమ పుణ్యకా
రణనామ వినుతచారణలలామ
వనచార పతితపావనసార మౌనిభా
వనపూర వీరరావణకుఠార
జనరక్షకృతపుణ్యజనదూర వరభక్త
జనపక్షసత్ప్ర యోజననిరీక్ష
జితదోష మౌనిపూజిత శేషశయన వా
రధిశోష పార్థసారథ్యవేష
తే.
సరసగుణధామ రవికులసార్వభౌమ
దశరథసుపుత్ర దేవ సీతాకళత్ర
భద్ర...
96
సీ.
వరరూపలావణ్య వైభవార్తిశరణ్య
దేవాగ్రగణ్య పార్థివవరేణ్య
ఘననీరదనిభాంగ ఖగనాయకతురంగ
విజితహేమతురంగ కుజనభంగ
మౌనిమానసభృంగ మథితఘోరభుజంగ
పరిపాలనప్లవంగ ప్రణుతగంగ
భక్తజవనమిత్ర పావనచారిత్ర
శతముఖస్తోత్ర కౌసల్యపుత్ర
తే.
ధన్యగుణసాంద్ర రఘుకులతారకేంద్ర
సవనసంరక్ష యాశ్రితజనకలాప
భద్ర...
97
సీ.
జలజాక్ష ఘనరాక్షసవిపక్ష మునిపక్ష
రణశూర వరచారరఘుకుమార
అరిశోష మునివేష సురపోష మృదుభాష
రఘుపుంగవ భుజంగరాజభంగ
శరచాపధర పాపహర భూపకులదీప
రతిరాజజయతేజ హితసమాజ
మురభీమ సురసోమ వరనామ గిరిధామ
సురపుంగవశుభాంగ సుప్రసంగ
తే.
భక్తపరిపాల గుణలోల భవ్యశీల
దివ్యమంగళవిగ్రహ దీనరక్ష
భద్ర...
98
సీ.
శరణు త్రిలోకరక్షణ మౌనిసన్నుత
శరణు సద్భక్తరంజనచరిత్ర
శరణు విశ్వామిత్రసవనసంరక్షణ
శరణు గౌతమపత్నిశాపహరణ
శరణు మారీచభంజన వార్ధిబంధన
శరణు ప్లవంగపోషణ ముకుంద
శరణు వైకుంఠవాస విశాలలోచన
శరణ మిక్ష్వాకువంశజ మహాత్మ
తే.
శరణు వాసవనుత శేషశయన శరణు
శంఖచక్రగదాఖడ్గశార్ఙ్గహస్త
భద్ర...
99
సీ.
రామదాసాదుల రక్షించినట్టుల
నెలమితోడఁ గుచేలు నేలినట్లు
ప్రహ్లాదనారదప్రభృతిఁ బ్రోచినయట్లు
సరవితో ముచికుందు సాఁకినట్లు
అల ద్రౌపదికి వల్వలాదుకొన్నట్టుల
గజరాజు నవనిలోఁ గాచినట్లు
శబరివిందుకు సంతసంబు నొందినయట్లు
మహిని ఘంటాకర్ణు మనిచినట్లు
తే.
నన్ను దయ నేలు నేరము లెన్న కవని
మూఢచిత్తుఁడ నవివేకములు హరించి
భద్ర...
100
సీ.
సర్వధారనుపేరి సంవత్సరంబున
ధంసాకు వెఱచి యిద్దరికి వచ్చి
పోలవరంబులోఁ బొలుపొంద నైదేండ్లు
వనవాస మొనరించి వరుసతోడ
శాక్తేయమతయుతు సంహార మొనరించి
మంత్రాంగశక్తి యిమ్మహిని వెలయ
తగ పూసపాటి విజయరామరాజసీ
తారామరాజులతో రయమున
తే.
విజయసంవత్సరంబున విజయముగను
భద్రగిరి కేఁగితౌనయ్య భద్రముగను
భద్ర...
101
సీ.
<మొదలఁ గావ్యము లేశమును బఠింపఁగలేదు
శబ్దజాలములవాసన యెఱుంగ
ధర విభక్తిజ్ఞానసరణి యేమియు లేదు
లక్షణశక్తి చాలదు తలంప
గ్రంథశోధకుఁడను గాను వ్యాకరణసూ
త్రము లవలేశమాత్రము నెఱుంగ
అవని మీదివ్యనామామృతాసక్తి చేయ
బూనితి నీ కావ్యబూటకంబు/poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>మున్ను నన్ను మరా మరా యన్న ఘనుని
పగిది దయజూడవలయు నాపదలు దోలి
భద్ర...
102
సీ.
నదులు తీరద్వయం బదలించి పాఱుచో
నెదురేఁగు మీనముల్ గుదులు గూడి
వనవసంతాగమదినములఁ గోయిలల్
మొగమిచ్చి పలుకును వగలు గులుక
సరవి మేఘోత్పత్తిసమయంబునను శిఖి
పరికించి యాడు నంబరము గాంచి
సిరిగల్గువేళలఁ బరమదయాళురై
పురబంధుజనములు పూజసేతు
తే.
రితరకాలంబులను వార లెగ్గుసేతు
రేమి వివరింతు మాయలనామి నేఁడు
భద్ర...
103
సీ.
రమణతోడుత విభరాహిముఖానుని
యేల పుట్టించెనో యిలను బ్రహ్మ
పుట్టించెఁ గాక యీపుడమిలోపల నేల
ఫాజీలు బేగని పలుకుఁ జేసె
పల్కు జేసినవాఁడు పదవి చాల యెసంగి
ధర జాల్దుంగు... పేరయేల
తెచ్చెఁ దెచ్చినవాఁడు దృఢచిత్తుగాఁ జేసి
ధంసాయను కితాబు ధరణి నొసఁగె
తే.
యొసఁగి మిము గెల్చు సాహస మొనర యేల
జేసెనో యని మది చింత చేయవలదు
భద్ర...
104
సీ.
రమణకౌండిన్యగోత్రపవిత్రుఁడను లింగ
నకుఁ బౌత్రఁడను బెద్దకును బుత్ర
వరుఁడఁ బేరయనామధరుఁడ భల్లావంశ
వనధిసోముఁడ బుధవర్గ మలర
వలస వేంచేసిన వరుస యాస్పదము నా
మదిలోన భావించి ముదమెలర్ప
ఘనత వ్యాజస్తుతిగా నొనర్చితి సీస
శతక మష్టోత్తరశతము గాఁగ
తే.
చి తగింపునకు హంసంబు క్షీరములను
గ్రాహ్య మొనరించుచందంబు గడలుకొనఁగ
భద్ర...
105
సీ.
కేశవ మాధవ కృష్ణ హృషీకేశ
నారాయణ ముకుంద నారదనుత
పద్మనాభాచ్యుత ప్రద్యుమ్న శ్రీధర
వామన గోవింద వాసుదేవ
విష్ణ్వనిరుద్ధ త్రివిక్రమాధోక్షజ
నారసింహ జనార్దన మధుసూద
న యుపేంద్ర సంకర్షణ పురుషోత్తమ హరి
దామోదరానంత దానవారి
తే.
అఖిలలోకాధినాథ దివ్యాంఘ్రిపద్మ
ములకుఁ బ్రణమిల్లెదను ముదమలర నేలు
భద్ర...
106
సీ.
జయ రఘుకులదీప జయ దశరథపుత్ర
జయ భరతాగ్రజ జయ ముకుంద
జయ తాటకాంతక జయ దుఃఖపరిపాల
జయ యహల్యాపోష జయ యుపేంద్ర
జయ హరధనుఖండ జయ జానకీనాథ
జయ భృగుసుతభంగ జయ కృపాబ్ధి
జయ వనసంచార జయ వాలిమర్దన
జయ వార్ధిబంధన జయ మురారి
తే.
రావణాంతక సాకేతరమణ నీదు
వలస శతకము వినువారివలస లుడుగు
భద్రగిరివాస శ్రీరామభద్ర దాస
పోషబిరుదాంక రఘుకులాంబుధిశశాంక.
107