భక్తిరసశతకసంపుటము/మూఁడవసంపుటము/నృకేసరిశతకము

పీఠిక


ధర్మపురి రామాయణము నరసింహశతకము రచించిన శేషప్ప యను శేషాచలదాసుఁడే యీశతకమును రచించెను. కవి తనకులము నీమూఁడు పొత్తములలోఁగూఁడఁ జెప్పుకోనలేదు. శైలిని బట్టి వందికులమువాఁడని శతకకవిచరిత్రకారులు అనుమానించిరి. కులమున కొకశైలియుండునా? ప్రమాణశూన్యమగు ననుమాన మెపుడును చరిత్రమునకు శరణ్యము కాజాలదు. కవి నివాసము ధర్మపురి. ఇది నిజామురాష్ట్రమునందు ఓరుగల్లునకుఁ బండ్రెండామడల దూరమునున్న సుప్రసిద్ధమగు నృసింహక్షేత్రము. ఇటఁ గలనృసింహస్వామిని గూర్చియే యీకవి నరసింహశతకము, నృకేసరిశతకము రచించెను. చిత్రభారతము, పద్మపురాణము, నవీనవసిష్టరామాయణము లోనగు గ్రంథములలో ధర్మపురి ప్రశంస గలదు. ఆంధ్రులందఱకుఁ దీర్థరాజముగా నున్న నిజామురాష్ట్రములోని క్షేత్రములు పెక్కులు యవన పరిపాలనమునకు లోఁబడినపిదప నితరరాష్ట్రవాసుల కగమ్యము లయ్యెను. క్రమముగ విస్మృతికి వచ్చెను. అట్టివానిలో సుప్రసిద్ధమగు ధర్మపురి క్షేత్రముగూడ నొకటి. ఈ నృకేసరిశతకము వ్రాఁతప్రతియొకటి నిజామురాష్ట్రమునందలి మెదకు మండలములోఁ బరిశోధనము గావించుతఱి జోగి పేటలో లభించెను. పరిశోధకసంఘమువారి కీయవలసిన యీశతకమాతృకను దగ్గరనుంచికొని శుద్ధప్రతి వ్రాసి యెటులేని ముద్రించి వ్యాప్తిలోనికి దేవలయునని సంకల్పించుకొంటిని. ఇంతలో బ్రహ్మశ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రిగారు శతకములు సంపుటములుగా వేయ నెంచి మమ్మాపనిజూడ నియోగించుటచే మాచెంతను అందుబాటులోను గల యముద్రితశతకములతోఁబా టీశతకమును గూడ ముద్రించి ప్రకటింప నవకాశము లభించినది. నిజాంరాష్ట్రశతకకవులజీవితమునం దీశతకకర్తచరిత్రము చేరఁదగియున్నది.

కవి దాదాపు నూఱుసంవత్సరములకు నావలివాఁడు కాఁడని మేము విచారింపఁ దత్రత్యులు చెప్పిరి. ప్రమాణములగు నాధారములు లభింపకున్నను నీ కాలము విశ్వసనీయమే. నృకేసరిశతకము భక్తిరసోద్బోధకమై సులభశైలిలో సరసముగా నున్నది. అందందుఁ గొలఁదిగ వ్యాకరణలోపములు గలవు. శుద్దప్రతి వ్రాయుతఱి కొన్నిచోటులఁ గవిభావానుసారముగా లేఖకులలోపముల సవరించితిమి.

నందిగామ

ఇట్లు భాషాసేవకులు

1-6-26

శేషాద్రిరమణకవులు

శతావధానులు

శ్రీరస్తు

నృకేసరిశతకము

ఉ.

శ్రీకమలాలయారమణ శీఘ్రముగా దయఁజూచి నామనో
వ్యాకులమెల్లఁ దీర్చు మింక వారిజలోచన నమ్మినాఁడ నే
లోకులఁ గొల్వనేర భువిలో నను వంచనజేయఁబోకుమీ
నీకు నమస్కరించెదను నేర్పుగ ధర్మపురీనృకేసరీ.

1


చ.

అమరము పంచకావ్యములనైనఁ బఠింపఁగలేదు లెస్సగా
శ్రమపడి ప్రాసవిశ్రమవిచారము జేయఁగలేదు నే కవి
త్వము గని నిన్ను వేఁడితిని తప్పులొ యొప్పులొ చిత్తగించుమీ
కలమదళాక్షపండితుఁడఁ గాసుర ధర్మపురీనృకేసరీ.

2


చ.

రవికుల రేఁగుకాయలకు రత్నములే వెలబోసినట్లు దు
ష్కవిజనులంత బుద్ధిచెడి కాసులకోసము తుచ్ఛమైనమా
నవులను బ్రస్తుతించుచు ఘనంబుగఁ బద్యము లమ్ముకొండ్రు మా
ధవ నినుఁ గానఁజాలరు ముదంబున ధర్మపురీనృకేసరీ.

3


చ.

పెదవులు దీర్ఘదంష్ట్రలును భీకరమైన విశాలనేత్రముల్

కుదిరినమీసలున్ నుదురు కుంజరమున్ దునిమేటి కేసరీ
వదనము దీర్ఘబాహులును వజ్రనఖంబులు నీశరీరసం
పద పొడసూపవయ్య మునిప్రస్తుత ధ...

4


ఉ.

తిన్ననిశంఖచక్రములు దివ్యకిరీటము కుండలంబులున్
పన్నగరాజతల్పమును బన్నశరీరము నాల్గుచేతు ల
త్యున్నత మైనవక్షమున నుంచినలక్ష్మిని నీదురూపు నా
కన్నులఁ జూపవయ్య పొడగాంచెన ధ...

5


ఉ.

చూచితి నీకిరీటమును జూచితి కుండలముల్ ముఖంబు నేఁ
జూచితి శంఖచక్రములు చూచితి కౌస్తుభవక్షదేహమున్
జూచితి పీతవస్త్రమును జూచితి లక్ష్మిని నిన్ను లెస్సగాఁ
జూచితిఁ గన్నులార మధుసూదన ధ...

6


ఉ.

తల్లివి దండ్రి వాప్తుఁడవు దాతవు భ్రాతవు నీవె సుమ్మి నే
చిల్లరదేవతార్చనలు చేసెడివాఁడను గాను స్వామి నీ
చల్లనిపాదపద్మములసన్నిధిఁ గోరితి జిహ్వతోడ నే
కల్లలు బల్కనయ్య నను గావుము ధ...

7


ఉ.

అందఱకంటె నేను దురితాత్ముఁడనయ్య జగత్ప్రసిద్ధిగా
ముందఱ నాగ తేమొ యని మూర్ఖుఁడనై భయమొందుచున్న నా

యందుఁ గటాక్షముంచి సకలాపదలన్ దొలఁగింప నీకు నే
వందన మాచరించెదను వాసిగ ధ...

8


ఉ.

నమ్మితి నీవె దిక్కనుచు నారదసన్నుత దేహమైతె నీ
కమ్మితినయ్య నే నొరుల యాశఁ బడుండసుమీ సురేశ నా
నెమ్మదిఁ గోర్కి దీర్చు మిఁక నీవు ప్రసన్నుఁడ వైనఁ జాలు నే
సమ్మద మొంద దనుజసంహర ధ...

9


ఉ.

బొందిని బ్రాణముల్ వెడలిపోయెడినాఁటికి వాసుదేవ గో
వింద ముకుంద యంచు నిను వింతగ నెంతునొ యెంచలేనొ నే
నందుల కెంతొ చింతిలెద నాసమయంబున కీవు వచ్చినా
ముందఱ నిల్చియుండఁగదె మ్రొక్కెద ధ...

10


ఉ.

ఆయువు గల్గినంతపరియంతర మన్నివిధాల నాకు సో
పాయము జేసి సేవకునిప్రాణము లేఁగెడివేళ శంఖచ
క్రాయుధముల్ ధరించి భుజగారివిహంగము నెక్కి వచ్చి నీ
చాయకుఁ దీసికొమ్మి నను జయ్యన ధ...

11


ఉ.

ఇప్పుడు నేను పాతకము లెక్కుడు జేసితి భీతి నొందకే
తప్పులు బెట్టుచున్ యముఁడు దండన నాఁటికిఁ జేయునేమొ నే
నప్పటి కాఁగలేను సుమి యాయమదూతలు పట్టరాఁగ నిన్
దప్పక వేఁడుకొందు నను దాకొను ధ...

12

ఉ.

దుష్టుఁడ సుమ్మీ నన్ను యమదూతలు గైకొనిపోవునాఁటి కే
కష్టము ప్రాప్తమౌనొ నరకంబులవార్తలు వింటి నీకృపా
దృష్టి యనేసముద్రమునఁ దేల్చియు నా కభయం బొసంగు మీ
శిష్టులలోన నన్ను దరిఁ జేర్చుము ధ...

13


చ.

మరణమునాఁటి కాయముని మన్ననదూతలు రాకమున్నె నీ
కరముల శంఖచక్రములఁ గావలిబంపుమి ధీరుఁడైన నీ
గరుడునిఁ బంపు మిక్కడకుఁ గష్టములేక సుఖాన వారియా
సర గొని నిన్ను వేఁడెదను సయ్యన ధ...

14


చ.

సమరసమైన పెద్దపులిచాటున కేఁగిన నెల్కకండ్లకున్
నమిలెడిగండుబిల్లి యొకనల్లి సమానము నిశ్చయంబుగాఁ
గమలదళాక్ష నీకరుణ గల్గిన భక్తుని నేత్రదృష్టికిన్
యముఁ డొకనల్లిపిల్లజతయా సుమి ధ...

15


ఉ.

శ్రీనరసింహ నీభజనఁ జేసెడిభక్తులతోడఁ గూడుచో
నేను పవిత్రమయ్యెదను నీచులసంగతి చాలుచాలు నే
మానవజన్మ మెత్తి పలుమందిని వేఁడితిఁ బొట్టకోసమై
దీనుఁడనయ్య నన్నుఁ గడతేర్చుమి ధ...

16


ఉ.

కాయజకోటిరూప నవకంజదళాక్ష ముకుంద కృష్ణ నా

రాయణ వాసుదేవ గజరక్షక నీలశరీర శంఖచ
క్రాయుధ మేరుధీర భుజగాంతకవాహన మోక్షదాయకా
నాయిలువేల్ప వంచు నిను నమ్మితి ధ...

17


ఉ.

కంటిని నీకృపారసము కష్టము లొందుచు నిన్ను వేఁడఁగా
వెంటనె మేలు జేసితివి వేల్పులు భూమిని నెందరైన నీ
దంటకు సాటిరా రనుచు దండిగ బొబ్బలు పెట్టి చేతఁ జే
గంటను గొట్టి సాటెదను గట్టిగ ధ...

18


ఉ.

పుట్టితి మీపదాబ్దముల భూమిని నాతల వంచి దండముల్
బెట్టితి నీదుపేరిటను బెద్దకుఠారము చేతఁబట్టి నేఁ
గొట్టితి పాతకాటవిని కుంజరరక్షక నీకు బంటనై
పుట్టితి భూమిలోన సురపూజిత ధ...

19


ఉ.

వింటిని నీకథల్ చెవుల వేడుకతో నరసింహ మాధవా
యంటిని నోట లెస్స బలువాసను నీనయమైనరూపు నేఁ
గంటిని కండ్లనిండ నను గాచెడి దాతవు గాఁగ నమ్ముకో
నుంటిని నీపదాబ్జముల నొప్పుగ ధ...

20


ఉ.

ఎంచెద నీగుణంబులను హెచ్చుగ నీకథఁ బాడుకొంచు వా
యించెద వీణతాళముల నెప్పుడు నాహృదయంబులోన ధ్యా

నించెద నీపదాబ్దములు నేర్పున నీదయ చాల్పు గాఁగ ర
ప్పించెదఁ జూడు నా తెలివి వేరుగ ధ...

21


చ.

కువలయకపత్రనేత్ర శతకోటిదివాకరతేజ పద్మసం
భవనుత పక్షిరార్ధ్వజ కృపాజలధీ జగదీశ యిందిరా
ధవ మధుకైటభాంతక సుధాకరకీర్తివిశాల కుండల
శ్రవణసరోజనాభ కరిరక్షక ధ...

22


చ.

సురసుత చక్రహస్త రణశూర నవాబ్జదళాక్ష కంబుకం
ధర గజరాజవాహన గదాధర కౌస్తుభవక్ష పింగళాం
బరధర భోగిరాట్నయన భక్తజనాంబుజమిత్ర మందరో
ద్ధర మునిజాలవందితపదద్వయ ధ...

23


ఉ.

శ్రీహరి వాసుదేవ నరసింహ జనార్దన చారుపక్షిరా
డ్వాహన శంఖచక్రధర వారణరక్షక భూపతీ జగ
న్మోహన దుష్టదానవసమూహవినాశ త్రిలోకవంద్య మాం
పాహి ముకుంద దీనజనబాంధవ ధ...

24


ఉ.

వారిజపత్రనేత్ర సురవందితపాదసరోజ సింధుగం
భీరవిరించిరుద్రనుత భీకరదైత్యవినాశ చక్రమం
దార రమాకళత్ర ఫలదాయక సర్వజగన్నివాస శృం
గారశరీర కేశవ ఖగధ్వజ ధ...

25

ఉ.

శ్రీతరుణీమనోహర శశీధవసన్నుత చారునీలజీ
మూతశరీర పాతకవిమోచన సద్గుణజాల భక్తకం
జాతవిలోల దుర్దనుజసర్పఖగేశ్వర యామినీకర
శ్వేతయశోవిశాల మునిసేవిత ధ...

26


ఉ.

చిత్తములోన నీభజనఁ జేసెడివాఁడు వయోధనాళిచే
మత్తుఁడుగాక నీకథలు మానక వీనుల విన్నవాఁడు నో
రెత్తి మహాముదంబునను నెప్పుడు నిన్ను నుతించుచున్నవాఁ
డుత్తమజాతివాఁడు పురుషోత్తమ ధ...

27


చ.

గజహయదానముల్ గ్రహణకాలపుగోగణభూమిదానముల్
రజతహిరణ్యదానములు రత్నపుదానము లన్నదానముల్
నిజముగఁ గోటి చేసినను నీరజలోచన వాసుదేవ నీ
భజనసమానమౌనె మురభంజన ధ...

28


ఉ.

గోవులఁ బంచిపెట్టినను గోటిధనంబును లూటిబుచ్చినన్
బావులు చాల ద్రవ్వినను బట్టలు కట్నము లెన్ని బెట్టినన్
త్రోవల చెర్లు వేసినను తోఁటలఁ బెంచినగాని దేవ నీ
సేవకు సాటి రావు సుమి శ్రీహరి ధ...

29


ఉ.

వేదము లాదిగా సకలవిద్యల నేర్వఁగలేను ద్రవ్యసం
పాదనఁ జేసి త్యాగమునఁ బైకొని దానము లివ్వఁజాల యే

కాదశు లుండలేను నడిగంగను స్నానము చేయలేను నీ
పాదయుగంబు నమ్మెదను భక్తిని ధ...

30


ఉ.

కూటికి మానవాధములఁ గొల్చినరీతిని నిన్నుఁ గొల్వ నా
కేటికి బుద్ధిపుట్టదుర యెంత దురాత్ముఁడ నైతి నయ్యయో
నాఁటిదినాలనుండి నిను నమ్మిన పద్ధతిగల్గు లెస్సగా
హాటకదైత్యనాశ విభవాచ్యుత ధ...

31


ఉ.

శ్రీరమణీయ నీ కధికసేవలు చేయఁగలేను గాని సం
సారము నుద్వహింప ఘనజారులు నీచులనైనఁ గొల్చితిన్
సారెకుఁ బొట్టకై సకలజాతిమనుష్యుల సంగ్రహించితిన్
బేరుగ నాకు ముక్తి కడువే సుమి ధ...

32


చ.

కుజనులఁ గూడి నేఁ బెరుకుకూఁతలఁ గూయఁగ నేర్తుఁగాని నీ
రజదళనేత్ర నిన్నుఁ జతురత్వముతోఁ గొనియాడఁజాల నే
నిజముగఁ బాపకర్ముఁడను నీకృపచేఁ గడతేర్చు నన్ను మా
రజనక నీకు మ్రొక్కెద సురస్తుత ధ...

33


ఉ.

దానవనాథ నీ కిపుడు దాసుఁడనై నినుఁ గొల్చుచుంటి మే
లైనవరం బొసంగు మిపు డన్యుల బ్రతిమాల పొట్టకై

యేనుఁగు నెక్కి దిడ్డి చొర నీఁగుదు నెట్లు మహానుభావ నీ
వే నను జేతఁబట్టు మని వేఁడితి ధ...

34


ఉ.

రేయుఁబవళ్లు ని న్ననుసరించిన నీదయ బుట్టదెందు క
న్యాయముఁ జేయసాగితివి నాయపరాధము లేమిరా జగ
న్నాయక నీవు నన్నుఁ గఠినత్వము మై గన ధర్మమౌనొకో
తోయజనాభ యెంతకని దూరుదు ధ...

35


ఉ.

ఎవ్వరివద్ద కేఁగుదు నిఁ కెవ్వరితో మొఱబెట్టుకొందు నే
నెవ్వరి నాశ్రయించెద నీఁ కెవ్వరు చింతలుదీర్చువారు న
న్నెవ్వరు చేతఁబట్టెద రిఁ కెయ్యెది తోఁచదు నీవుదప్ప నా
కెవ్వరు గానరారు జగదీశ్వర ధ...

36


ఉ.

ఏమిర నారసింహ యిపు డెందుకు నీదయ రాదు నాయెడన్
బ్రేమను సారెసారెకును బిల్చినఁ బల్కవదేమిరా పరం
ధామ భవత్పదాబ్జములు ధ్యానము జేయుదురా ముకుంద నీ
మోమిటు జూపరా భువనమోహన ధ...

37


ఉ.

నానరసింహ నాధనమ నాయిలువేలుప నామనోహరా
నీనగుమోముఁ జూపర మునిస్తుత నిన్ను గణించుచుంటిరా
దీనతనొంది వేఁడఁగను దిప్పలఁ బెట్టక నన్నుఁ గావరా
నేను పరుండనౌర గణియింపర ధ...

38

ఉ.

దండము నారసింహ నను దగ్గఱదీసి వరంబు లిచ్చి భూ
మండలమందు నాబ్రదుకు మంచిగఁ జేసి సుఖాన నుంచుమీ
దండిమహాత్మకుం డనుచు ధైర్యముతోడుత నమ్ముకొంటి నీ
యండ తొలంగనయ్య కరుణార్ణవ ధ...

39


ఉ.

సారసపత్రనేత్ర నిను సారెకు నే బతిమాలి మాలి వే
సారితినా! యిదే మిపుడు సాగకవచ్చెను నీకు బట్టుకై
వారము లేమనందు నను వంచన జేయఁదలంచినావో నీ
కారడ మేమొ నాకుఁ బొడకట్టదు ధ...

40


ఉ.

ఓనరకేసరీ యనఁగ నో యని పల్క విదేమి మాటమా
త్రానికి నోఁచనా యిపుడు దాసునిమీఁద మఱింతకోపమే
పూనితి వెందుకయ్య దయబుట్టదు నే నపరాధి నంచు హా
మానవదేల మచ్చరము మాధవ ధ...

41


చ.

శరణని గోరియుంటి ననుఁ జయ్యనఁ గావ విదేమి నీకు నా
మొఱ వినఁ జెప్పవచ్చితిని మ్రొక్కఁగఁ గోర్కెను దీర్చకుంటె నీ
బిరుదుకు భంగమయ్యె సుమి పెద్దపకీర్తి గడించుకోకుమా
చెఱుపక నన్నుఁ జేకొనుమి శ్రీధర ధ...

42


చ.

నలినదళాక్ష కృష్ణ శరణాగతవత్సల యంచు నిన్ను నేఁ

బిలువఁగ నీవు నో యనవు బెల్లపుగడ్డలు నోటఁ బెట్టుకో
పలుకఁగ లేకపోయితివొ బాగుగ నేఁడు పరాకువైతివో
పలుకుటిలంబులం దలఁతొ పావన ధ...

43


ఉ.

మంచి ప్రతాపమూర్తి వని మాటికి నేను కరంబు లెత్తి జో
డించి నమస్కరించుచుఁ బదింబది వేఁడఁగ నీవు నామొ ఱా
లించవ దెందుకయ్య లవలేశము నీదయ లేకపోయెఁ బో
షించెడిదాత లెవ్వ రిఁక శీఘ్రము ధ...

44


ఉ.

సుందరరూప నిన్నుఁ బొడచూచెద నంటె బిరాన నీవు నా
కెందుకుఁ గానరావొ యిపు డెచ్చటి కేఁగితివో జనార్దనా
యిందుదివాకరాక్ష ధన మిమ్మని వేసటఁ బెట్టఁగాని నీ
యందము జూపు శీఘ్రముగ నచ్యుత ధ...

45


ఉ.

హేమము భూషణావళియు నేన్గులు నశ్వము లందలంబులున్
గ్రామము లీయలేవు ఘనకార్యములం దగిలించుకోకుమీ
నీముఖమైనఁ జూపు మిఁక నీ కిది కష్టముగాదు చుల్కనే
నా మన సింతకే భ్రమసె నమ్మితి ధ...

46


చ.

కరి మకరంబునోటఁ బడి కష్టము లొందఁగఁ జేతిచక్రమున్
సరగునఁ బంపి నీటను మొసల్ని వధించి గజంబు నేలు నా

తెఱఁగున నేఁడు నన్నుఁ గడతేర్చుమి నీకు సమస్కరించెదన్
బిరబిర వచ్చి నాకుఁ గనుపింపవె ధ...

47


ఉ.

మ్రొక్కినఁ జూడవేమి నీను ముద్దుగఁ బిల్చిన బల్కవేమి నేఁ
జక్కన సేవసేయఁగను చయ్యనఁ గోర్కిని దీర్చవేమి నా
కక్కఱబడ్డవేళ యిపు డాదుకొజాలవదేమి నీకు నా
కెక్కడివైరమో తెలుపవేమిర ధ...

48


చ.

సరసిజనాభ నే సకలజన్మము లెత్తితి ధాత్రిలోపలన్
స్థిర మొకటైన లేదుగద తీవ్రమె పుట్టుచు మర్లఁ జచ్చుచున్
దిరిగితి రాను పోను బహుత్రిప్పల నొందితి వేసటైతి నీ
చరణము లాన జన్మములు చాలిఁక ధ...

49


ఉ.

మామిడిపండ్లపానకము మంచిమధూదకమిశ్రభక్ష్యముల్
జేమలు నారికేళములు చక్కెర ద్రాక్షఫలంపులక్షలున్
తామరసాక్ష మేలిమిసుధామధురాదులు లక్షయైన నీ
నామము సాటిగావుర జనార్దన ధ...

50


ఉ.

మేలిమి భూసురాది బలుమేటికులంబులు నాలు గుండఁగాఁ
జాలుపు విస్తరించె నరజాతిని సజ్జనుఁ డెవ్వఁ డుండినన్

చేలుగ మిమ్ము నిత్యము భజించుచు నమ్మినఁ జాలు ముక్తి చం
డాలునకైనఁ గద్దు గరుడధ్వజ ధ...

51


చ.

ఇలను మనుష్యజాలమున నెక్కువతక్కువ లున్నవన్నచోఁ
గులముల శ్రేష్ఠ మెవ్వరిది కొంచెము గానఁగరాదు వారు ని
ర్మలినశరీరులో గుమగుమా యనుకుక్షిని గందమున్నదా
తెలిసిన నిండుభక్తులె సుధీరులు ధ...

52


ఉ.

కేశవ మీకథల్ మిగులఁ గీర్తనఁజేయుచుఁ గామ్యమైన దు
ష్పాశము గోసివేసి నిజభక్తి విరక్తి సుబుద్ధి జ్ఞానముల్
వాసిగ సంగ్రహించినభవజ్ఞను లేకులమందుఁ గల్గినన్
నే శరణందు వారలకు నిక్కము ధ...

53


ఉ.

శాంతము సత్యవృత్తి ఘనసాధుతయున్ గరుణాసమృద్ధి వి
శ్రాంతిగ భక్తి జ్ఞానము విరక్తి సదావననామకీర్తనల్
భ్రాంతి సుబుద్దు లేజనునిపాలఁ జెలంగునొ వాఁడె దివ్య వే
దాంతులకన్న శ్రేష్ఠుఁడు కృతార్థుఁడు ధ...

54


చ.

భ్రమరము కీటకంబు నొగిఁ బట్టుకవచ్చి నిజస్వరూపమున్
సమముగఁ జేసినట్లు ఘనసజ్జను లైనమహాత్ములున్నఁ బా
పమతులఁ జేరఁబిల్చుకొని భక్తులఁ జేయరె నిశ్చయంబుగన్
విమలసరోజలోచన వివేకులు ధ...

55

ఉ.

చిన్నతనంబునుండి కడుఁ జేసితి పాపము లన్ని నావి నా
కెన్నఁ దరంబు గాదు సుమి హీనుఁడ నీచుఁడఁ బాపకర్ముఁడన్
ఎన్నిటఁ జూడ నానడక లించుక మంచివి లేవు స్వామి నీ
మన్ననచేత దోషములు మాన్పుము ధ...

56


ఉ.

నీరజపత్రనేత్రయుగ నేను గడించిన పాతకంబు వి
స్తారము గద్దు నా కొకఁడు సాటి దురాత్ముఁడు లేదు సుమ్మి నా
నేరము లన్ని గాచి కరుణించెడి తండ్రివి గాఁగ నేఁడు నీ
చేరువఁ జేరినాఁడ దరిఁ జేర్చుము ధ...

57


ఉ.

పుట్టిననాఁటనుండి యొకపుణ్యము జేయఁగలేదు గాని నే
పుట్టితిఁ బాతకంబులను బూని గడించితి కావరంబునన్
బొట్టను లెస్సగా బుగులు పుట్టిన దిప్పుడు నాఁటికోసమే
చుట్టములేక నీశరణుఁ జొచ్చితి ధ...

58


ఉ.

నిర్మలు లైనమానవుల నిందలఁ జేయఁగ నేర్తు నేను దు
ష్కర్తము జేసి మందికి సుకర్మముఁ జెప్పుకొనంగ నేర్తు స
ద్ధర్మము లాచరించునెడఁ దప్పక విఘ్నము జేయనేర్తు నే
దుర్మనుజుండ నయ్య పెనుద్రోహిని ధ...

59


చ.

గడుసుదనంబునం బరులకాంతల వశ్యము జేయనేర్తుఁ గా

రడమున మందిద్రవ్యమును రక్తిని గుంజఁగ నేర్తు లెస్సగా
విడిబడి పెద్దపిన్నలను వేమఱు నిందయొనర్ప నేర్తు నే
పెడసర బాపకర్ముఁడను బెద్దను ధ...

60


ఉ.

ప్రొద్దున లేచి నేను కడుబొంకులు బల్కుచునుందు నోట నా
వద్ద నిజంబు లేదు పెరవారిసుఖంబు సహింపలేను నా
బుద్ధి మహావికారపుది భూమిని దుష్టగుణంబులందు నే
పెద్దదురాత్ముఁడన్ వినుమి పేరుగ ధ...

61


ఉ.

మాటలు వాఁడిబల్లెములు మానసమన్న విషంబు హస్తముల్
నాటెడుతమ్మముండు నయనంబులు నిప్పులు దుర్గుణంబు లే
కూటికి లేదు నా కధికకోపము పాతకు లెందఱైన నా
గోటికి సాటిరారు చెడఁగొట్టకు ధ...

62


ఉ.

చాటుకుఁ బెద్దతప్పులను జాలఁగఁజేసి భయంబు నొంద కే
నేటుకు వచ్చి దుర్గుణము నేరని పెద్దలఁ గూడి వారితో
సాటికి నిల్చి నే నొకరిజాతుల నీతుల నెంచుచుందు నా
పాటిదురాత్ముఁ డేడి రిపుభంజన ధ...

63


ఉ.

నేటుగ మందిమెప్పులకు నే నొకవింతగఁ గంఠమందు వే
సేటివి పెద్దపెద్దతులసీవనమాలలు చాటుచేరి చే

నేటివి నీచకార్యములు శ్రీధర నాపని నీ వెఱుంగవా
నేఁటికి సద్గుణం బొకటి నేరను ధ...

64


ఉ.

లోపలి పాపకర్మములు లోకుల కేర్పడకుండఁ జేయుచున్
నేపదినుంది కందఱకు నీతులు తత్వములెల్లఁ జెప్పెదన్
నాపురుషార్థ మింతె సుమి నల్గురికండ్లకు నేను పెద్దనీ
నాపస మేడిపండు సురనాయక ధ...

65


ఉ.

మంచిగ ధర్మశాస్త్రములు మందికిఁ జెప్పఁగ నేర్తుఁ గాని నే
కించతనాలు మానఁగద కేవలదుర్గుణుఁడన్ సుబుద్ధి లే
దించుక యైనఁగాని మన సెప్పుడు చంచల మందుచుండు నా
సంచితపాపకర్మములఁ జంపుము ధ...

66


ఉ.

ఇంటికి నిత్యభిక్షమున కెందఱు వచ్చినఁగాని తెంపుతో
గంపెడుగింజ లొక్కరికి గ్రక్కున వేయఁగలేదు ధర్మ మే
మంటగలేదు నాకుఁ గరుణార్ణవ నే నతిలోభినయ్య నీ
బంటను నమ్మికొంటి ననుబాయకు ధ...

67


చ.

ధనము గడించి పెద్దలకు దానము చేయఁగలేను గాని నే
పెనఁగొని జారకాంతలకుఁ బెట్టితి సొమ్ములు మంచి కేర్పడన్
ఘనులను గూడలేక పలుగాకులలోపల నుంటినయ్య నా
మనసున సిగ్గులేదు లవమాత్రము ధ...

68

ఉ.

చంచలచిత్తుఁడన్ బరమజారుఁడఁ బాతకుండ నే
కొంచెమువారితోడ జతగూడి చరింపుదు నాగుణాలు వ
ర్ణించఁ దరంబు గాదు సుమి నీ విపు డన్ని క్షమించి నన్ను ర
క్షించుమి నీకు మ్రొక్కెదను గేశవ ధ...

69


ఉ.

అంధున కద్ద మేమిటికి నందము దప్పినముండమోపికిన్
గంధపుఁబూఁత లేమిటికిఁ గాననమందుఁ జరించుకోఁతికిన్
సింధుజరత్న మేమిటికిఁ జెడ్డదురాత్మున కెన్నఁడైన నీ
గ్రంథపువిన్కి యేమిటికి గట్టిగ ధ...

70


చ.

బురదను బొర్లుచున్న యెనుబోతుల కేటికి మంచిగందముల్
గురుతుగ భవ్వు భవ్వు మను కుక్కల కేటికి బూరగొమ్ములున్
గఱకది యేల గాడ్పునకుఁ గారము తమ్మలపాకు కెందుకున్
నిరుపమదుష్టు కెందుకుర నీకథ ధ...

71


ఉ.

ఏనుఁగు బోవఁజూచి ధ్వను లెత్తుచుఁ గుక్కలు గూయసాగుచో
దానిమనస్సు కోపపడి దందడి వానిని వెంబడించునే
మానవులందు సజ్జనుల మత్తులు కొందఱు గేలిచేయుచో
ఆనరుఁ డల్గి వాండ్ర బదులాడునె ధ...

72


చ.

బిరుదుగ గడ్డముల్ జడలు పెంచుక నిక్కఁగ నే మహాత్ముఁ డా
పరమతపస్వి గాఁడు సుమి పందికి వెండ్రుక లెప్పు డుండవా

బెరుకుగుణాలు మానుకొని ప్రేమను ని న్నెవఁడైనఁ గొల్చెనా
ధరణిని వాఁడె పావనుఁడు ధన్యుఁడు ధ...

73


ఉ.

ఎన్నఁడు నీవు నాకభయ మిచ్చెదవో కరుణాసముద్ర నీ
మన్నన కాసనొందితి సుమా నను దూరము చేయఁబోకుమీ
ని న్నిపు డేను నమ్మితిని నిర్దయ యుంచక కావు కావు నా
విన్నప మాలకించి నను వీడక ధ...

74


చ.

దినకరచంద్రనేత్రయుగ దీనత నొందుచు నిన్నుఁ బిల్వఁగా
నెనరున మాఱుబల్కక విని విననట్టుల నుంటి వేమి నీ
తనయునిమీద నీవు దయఁ దక్కువ జేసిన నీకు భూమిలో
ఘన మపకీర్తి సుమ్మి ధృతకౌస్తుభ ధ...

75


ఉ.

చూతఫలంబు నోటఁ జవి చూచెడిచిల్క కుమెత్తకాయయున్
(?)బ్రీతి జనించునే మదిని రేయుఁబవళ్లు ముకుంద నీకుఁ బ్ర
ఖ్యాతిగ సేవ జేసిన మహాత్ముఁడు నీచుల సేవ జేయునే
పాతకనాశ యోగిజనప్రస్తుత ధ...

76


చ.

ఖగపతి నీకు వాహనము కౌస్తుభరత్నము భూషణంబు ప
న్నగపతి శయ్య మన్మథుఁడు నందనుఁ డంబుధిపుత్రి భార్య ము

జ్జగములవారు బంట్లు రవిచంద్రులు లోచనముల్ ముకుంద నీ
కగణితమైనభాగ్య మహహా భళి ధ...

77


చ.

గరుడునితోడ కోడియును గాంతి హిరణ్యముతోడఁ గంచు భా
స్కరు నొగి విస్ఫులింగము గజంబుల దోమ విశాలమైన మం
దరమును చిల్లరాయి నిను దల్చెడిభక్తులతోడ దుర్జనుల్
సరిపడవత్తురే దురితసంహర ధ...

78


ఉ.

ఎంతకు నిన్ను వేఁడుదు నిఁ కెన్నివిధంబుల దూరి పల్కినన్
మంతనమందు నీ నెనరు మచ్చుకు లేదు పరీక్ష బట్టుచో
సంతత మిట్లు నీవు పగచాలుపు దాల్చిన నేవిధాన జీ
వింతును నాకు ది క్కెవరు వేలుపు ధ...

79


ఉ.

తల్లి విషంబుఁ బెట్టినను దండ్రి ధనాఢ్యుల కమ్ముకొన్న భూ
వల్లభుఁ డిల్లు దోఁచినను వద్దని పల్కెడివార లుందురా
ఉల్లములోన నీవు నెనరుంచక వ్యాధులఁ బెట్టి ముంచఁగాఁ
జిల్లరవైద్యులెల్ల దరిజేర్తురె ధ...

80


చ.

జలజదళాక్ష నీకరుణ చాలుపుగాఁ గలిగున్నఁజాలు నే
బలుఁడను ధైర్యవంతుఁడను భాగ్యుఁడ శూరుఁడ నిర్మలుండఁ గే

వలముగ నే కృతార్థుఁడను వాసిగఁ బుణ్యుఁడ నయ్యెదం జుమీ
వెలఁగుచు నీవు నన్ను దరిజేర్చుమి ధ...

81


ఉ.

మోక్షము నిన్ను నే నడుగ ముఖ్యపదార్థము నీకృపారసం
బీక్షణమందు నాకొసఁగు మింతటితోఁ బరితృప్తి నొందెదన్
సాక్షులు నీపదాబ్జములు సత్యముఁ బల్కెదఁ గల్లలాడకే
రాక్షసనాశ దీనజనరక్షక ధ...

82


ఉ.

ఆగజరాజు నీకు ఘనమైనమణుల్ జమచేసి పంపెనా
త్యాగముతో విభీషణుఁడు ద్రవ్యము నీ కెఱుఁగంగఁ దెచ్చెనా
కాఁగులతోఁ గుచేలుఁ డధికంబుగ నీ కటుకుల్ నొసంగెనా
బాగుగ వారి నేలితివి పైకొని ధ...

83


చ.

జగతిని శ్రేష్ఠమైన నరజన్మము లెత్తినవారలు జతు
ర్నిగమము లాఱుశాస్త్రములు నేర్చినవారలు యజ్ఞసంతతుల్
తెగువ నొనర్చి పుణ్యకరతీర్థము లాడినవారు నైన నిన్
బొగడుచు నుండుభక్తులను బోలరు ధ...

84


చ.

వెలయఁగ నే పురాణములు విన్నది లేదు పఠింపలేదు పె
ద్దలసహవాస మే నెఱుఁగఁ దత్త్వము గానను దేహసౌఖ్యమే
చెలఁగుచు నేను గోరెదను చెడ్డది మంచిది పుణ్యపాపముల్
దెలియని వెఱ్ఱమూఢుఁడను దిద్దుకొ ధ...

85

ఉ.

కంజదళాక్ష నిన్ను బహుగాఁ గొనియాడెడివారికెల్ల నే
నంజలి జేసి మ్రొక్కెద దురాత్ముల నన్యులఁ గండ్లఁ జూచినన్
రంజిలఁబోదు నామనసు రాజనిభానన దుష్టదైత్యరా
డ్భంజన నీపదాబ్జములఁ బట్టితి ధ...

86


ఉ.

సుందరమైన కాంతలను జూచి భ్రమించెదఁ గాని నామన
స్పందున లా వసహ్యపడ దాస్తియుఁ గామిను లేఁగుదెంచి నా
ముందఱ నిల్చినన్ విడువ మూర్ఖుఁడ నా కిటువంటిబుద్ధి నీ
వెందుకుఁ బెట్టి పెంచితివొ యేలుకొ ధ...

87


చ.

భువనములెల్లఁ గాచెడి ప్రభుత్వము దండిగ నీకుఁ గల్గె రా
జవు చతురాననాదిసురజాలము నీ కనుకూలసైన్యమై
రవికుల నిన్నుఁ గొల్వఁగను రాక్షసభంజన నీకు సర్వవై
భవ జయమంగళం బగుట భ్రాతియె ధ...

88


ఉ.

మ్రొక్కిన నీకు మ్రొక్కెదను మోదముతోఁ గలనైనఁగాని నే
తక్కినవేల్పులందఱకు దండము బెట్టను శర్కరాళియున్
బొక్కిననోటితోఁ దవుడు బొక్కఁగఁ బోవునె యెవ్వఁడైన నీ
యొక్కనిమీఁద నేను మన సుంచితి ధ...

89


ఉ.

నీనయమైనకీర్తనలు నేర్పునఁ జక్కనివీణె మీటుచున్
గానము బాడ నారదుఁడఁ గాను మహాభయభక్తిప్రేమతో

దానము నీకుఁ జేయ బలిదైత్యుఁడఁ గాను జగత్తులోపలన్
నేను వృథా మనుష్యుఁడను నిల్చితి ధ...

90


ఉ.

నిన్ను భజించుభక్తులను నిందలు బల్కుచు జాతు లెన్నుచున్
బన్నుగ గేలి సేయుచును బండ్లిగిలించుచు నవ్వుచున్ మదిన్
బన్నుదురాత్ములన్ యముఁడు వర్లఁగ వర్లఁగ నోటిమీఁదనే
తన్నకపోఁడు నాఁటి కిది తప్పదు ధ...

92


ఉ.

శ్రీవనితాకళత్ర నిను జిత్తములోన భజించి నిత్య నీ
సేవలు జేయునట్టి నరశేఖరుసంగతి నాకుఁ గల్గెనా
పావనమయ్యెదన్ సకలపాపము లాపద లన్ని దూరమై
పోవును నే కృతార్థతను బొందెద ధ...

92


ఉ.

దేవరవారిభక్తులకుఁ దిన్నగ మ్రొక్కరు భక్తు లందఱున్
గోవధఁ జేయుమ్లేచ్ఛులకు గొబ్బున లేచి సలాము చేతురున్
కేవల పారమార్థికులకే సుమి పెద్దలమీఁదిప్రేమలున్
గావరు లైన దుర్జనులు గానరు ధ...

93


ఉ.

పెద్దలమంచుఁ బ్రశ్నలిడి పెక్కులు జెప్పెడి పాపకర్ములన్
వద్దికిఁ జేరఁబిల్చుకొని వారిమనస్సుల శోధజేయకే

దిద్దక యేసుమంత్ర ముపదేశము లిత్తురు కాసులాసకై
గద్దరివారి కీపనులు కైకిలి ధ...

94


చ.

కలియుగమందు విప్రుఁడను గాను నృపాలుఁడఁ గాను మేటివై
శ్యుల జతవాఁడఁ గాను బలుశూఁరుఁడఁ గాను సమస్తమైన జా
తుల నొకరుండఁ గాను సుమి దుర్దనుజాంతక నీపదాబ్జముల్
దలఁచెడివారిదాసులకు దాసుఁడ ధ...

95


ఉ.

కొండలుగావు దేహములు కుంభినిలోపల శాశ్వతంబుగా
నుండవు ప్రాణముల్ విడువ నొప్పుగ మిత్రులు గాలవేతురో
కండలు మాంస మొల్చుకొని కాకులు గద్దలు మేసిపోవునో
పండితులైననుం బ్రదు కబద్ధము ధ...

96


చ.

నరములగుత్తి ముల్లొకటి నాఁటినఁ దాళనితోలుతిత్తి నె
త్తురు గదె దీనినిండ బలుతొమ్మిదిచిల్లులు గల్గుకుండ భూ
నరున కిదేమి లెస్స యగు నమ్మినవారికి లావు ఫిస్స ఛీ
మురి కిది పాడుమొక్క సుమి ముప్పిది ధ...

97


ఉ.

నాయజమాని వీవు నిను నమ్మినదాసుఁడ నేను నీకు నా
కాయము నమ్ముకోను మధుకైటభమర్దన నన్నుఁ గావు నీ
వే యిఁక దిక్కు నాకుఁ బెరవేలుపు లెవ్వరు లేరు సుమ్మి నే
పాయక నిన్నుఁ గొల్చెదను భక్తుఁడ ధ...

98

చ.

వనజదళాక్ష నన్నుఁ బెరవానిగఁ జూచెద వేల నీవు గ్ర
క్కున దయజూచి నామదిని గోరిక దీర్ప వదేమి నేను జే
సినబలుతప్పు లే మిపుడు చేతులు జాచి నమస్కరించెదన్
గనికర ముంచి నేరములఁ గావుము ధ...

99


చ.

నరహరి నీపదాబ్జములు నాహృదయంబున నిల్పి లెస్సగా
మురియుచు నే స్మరించెదను మోక్షము లిచ్చెడిదాత వంచు సుం
దర నిను మానఁజాలఁ బరదైవములం గొనియాడనేర న
న్నరమరసేయకయ్య దనుజాంతక ధ...

100


ఉ.

ఓకరుణాసముద్ర పురుషోత్తమ నీపదపంకజంబులున్
నాకు మహాధనంబు శరణాగతుఁడన్ ననుఁ జేతఁబట్టుమీ
నే కపటాత్ముఁడన్ బరమనీచుఁడ నేరము లెంచఁబోకుమీ
చేకొని తప్పులన్ని క్షమ జేయుమి ధ...

101


చ.

పరమమృదుత్వమైన పదపంకజముల్ నిరసించు శ్రీరమా
కరముల కబ్బినట్టి త్రిజగంబులవారల కిష్టమైన నీ
చరణసరోజయుగ్మములు చయ్యన నాశిరమందు నిల్పి నా
దురితములన్ని దూరముగఁ దోలుము ధ...

102


చ.

తరణిసరోజనేత్ర వరదాతవు నీ వనుచుం దలంచి నీ
చరణము లాశ్రయించితిని శాశ్వతమైనవరంబు లిమ్ము విూ

కరుణకు నేను బాత్రుఁడను గష్టము లంటఁగనీయఁబోకు
తఱుచుగ మిమ్ము వేఁడెదను దాసుని ధ...

103


చ.

తరణిని గోరు పద్మములు తన్మకరందము గోరు భృంగముల్
శరనిధి గోరు మేఘములు చంద్రుని గోరు చకోరవర్గముల్
పురుషుని గోరు స్త్రీలు ఘనపుంగవుఁ గోరుదు రెల్లభక్తులున్
గరుణను గోరు నాహృదయకంజము ధ...

104


చ.

ఇతరసుఖంబుఁ గోరకయె యెవ్వఁడు నీమృదుపాదపద్మముల్
సతతముగా భజించినను సత్కులవంతుఁడు వాఁడె సుమ్మి దు
ర్గతుఁడయి యెవ్వఁడైన రఘురాముని భక్తుల నిందజేసెనా
పతితుఁడు వాఁడె పంచములబంధుఁడు ధ...

105


చ.

వరుసతో వేదశాస్త్రములు వల్లెన వేసి సమస్తశాస్త్రముల్
దిరుగుచు రాజపూజితప్రతిష్ఠను బొందఁగవచ్చుఁగాని పా
మరములు మాని నీభజనమాత్రము జేసెడిభక్తి గల్గుటే
నరులకు దుర్లభంబు సుగుణాంబుధి ధ...

106


ఉ.

భాగ్యము లిచ్చు నీభజన పాయక నిశ్చలభక్తియోగవై
రాగ్యము లిచ్చు నిత్యసుఖరాజితమూర్తులఁ జేసి సంతతా

రోగ్యసతీసుతాదికనిరూఢి ఘటించుటె గాక ముక్తికిన్
యోగ్యులఁ జేయు నన్నిటికి నొప్పుగ ధ...

107


ఉ.

నే చతురత్వ మే మెఱుఁగ నీకృపవల్లఁ గవీశ్వరుండ నై
తోఁచినపద్యముల్ ముదముతో రచియించితి తప్పులున్న నీ
వే చెలువారఁ జేసి వెతఁబెట్టక కోర్కులనెల్ల దీర్చి శే
షాచలదాసు నేలు మునిసన్నుత ధర్మపురీనృకేసరీ.

108


సంపూర్ణము.