భక్తిరసశతకసంపుటము/మొదటిసంపుటము/మానసబోధశతకము

పీఠిక

ఈ మానసబోధశతకమును తాడేపల్లి పానకాలరాయండను కని రచించెను. కవి కాలము కులము గోత్రాదికము లెఱుంగుటకుఁ దగిన యాధారము లీశతకమునందుఁ గనఁబడవు. చిత్తబోధశతకమునఁ గల విప్రుఁడనను విశేషమువలనఁ గవి బ్రాహ్మణు డని నిశ్చయింప వీలుచిక్కినది. పానకాలు కవి పైరెండుశతకములే గాక పార్థసారథిశతకము రామశతకము లక్ష్మీదేవిశతకము నృసింహస్వామిశతకము రుక్మిణీపతిశతకము నేైత్రదర్పణమను వైద్యశాస్త్రము రచించెను, నేత్రదర్పణములోనిదగు

"సీ. శ్రీవత్సగోత్రుఁ డంచితపటుశాస్త్ర సం
                    ఖ్యావనీదేవకులాగ్రగణ్యుఁ
     డగు తాడేపల్లి...
     పానకాల్రాయుఁ డనువాఁడ...”

అను పద్యమువలన నిక్కవి శ్రీ వత్సగోత్రుడనియు నాఱువేలనియోగియనియుఁ దెలియును. నేత్రదర్పణములోని

"సీ.గీ.. నీటుగానెన్నఁదగుఁ గొండవీటిసీమ. ...

వ. అట్టిసీమాప్రదేశంబునను దగ్భాగంబుస . . . కృష్ణా
     తీరంబున. ..
కం. పదపడి ముదమలరు తాడెపల్లిధరిత్రిన్.”

అను పద్యములవలన తాడేపల్లి పానకాలుకవి బెజవాడకుఁ జెంతగల తాడేపల్లినివాసి. పానకాలుకవి మానసబోధశతకము వ్రాసి హరికి సమర్పించెను. కాసుల పురుషోత్తముఁడు తానొక మానసబోధశతకము రచించెను. అది ప్రకృత మనుపలభ్యమగుటవలన నీకవి దానిని దొంగలించి మార్చికొనియుండునని శతకకవిచరిత్రకారులు వావిడిచియున్నారు. పానకాలకవి చౌర్య మొనరించెననుటకుఁ దగినన్ని దృష్టాంతములు సంపాదింపక పురుషోత్తమకవి శతకము కానరానంతన నిటుల నెంచుట ప్రమాద మనఁదగును. నూటయిరువది సంవత్సరములనాఁటి రామదాసుచరిత్రములో నీమానసబోధశతకములోని పద్యము లుదహరింపబడుటవలన నీపానకాలుకవి నూటయేబదిసంవత్సరములు కించుక బైకాలమువాఁ డని తోచును. ఇతని గ్రంథములు లక్షణగ్రంథములలో నుదాహరింపఁబడక పోవుటవలన నంతకుఁ బైవాఁడని తెలుపవీలు లేదు.

మాసపబోధశతకము కేవలభగవచ్చింతనముతో భక్తిరసప్రతిపాదకముగ నున్నది. ఈ శతకము మానసరాజయోగసంధాయకమని కవి చెప్పిన మాట సత్యము. శ్రీ మహాత్ముని లీలావతారముల నభివర్ణించుచు మనమునందుఁ జొన్పుటయే యైహికములను దరించువిధమని కవి మృదుమధురకవితాస్నిగ్ధమగు సుకుమారవచనములతో నుడివి పామరజనుల భగవచ్చింతనమునకుఁ బురికొల్పుచున్నాఁడు. ఇందలిపద్యము లైహికబంధములు నిస్సారములనియుఁ గళేబరము మలమూత్రస్విన్నము గావున దానిపై మమకారము బెట్టుకొనరాదనియు జన్మబంధదూరమగు పరమాత్ముని సన్నిధి జేరుటకుఁ బ్రయత్నించుమనియు బోధించుచున్నవి. ప్రజాసామాన్యమునం దీశతకము మిగుల వ్యాప్తినొందియుంటయే దీని యుత్కృష్టత కొకదృష్టాంతము.

చిత్తబోధశతక మనునది యొకటి యీకవిపేరుతోఁ గానవచ్చుచున్న ది. దాని శైలియు ధారయు విషయసమీకరణము మానసబోధశతకమునకు మిగుల చేరువలో సున్నది. ఈశతకనిర్మాతయగు పానకాలురాయఁడే బాల్యావస్థలో చిత్తబోధశతకము వ్రాసి తృప్తికరముగ నుండమిచేఁ బ్రౌఢవయస్సులో మానసబోధశతకము వ్రాసెనేమో యని తోఁచుచున్నది. కవి వృత్తము దెలుపుపద్యము ఇంచుకమార్పుతో రెండుపొత్తములలో నొకేవిధముగా నుంటయుఁగూడ శతకద్వయ మేకకర్తృక మన సాహసము కలిగించుచున్నది.


నందిగామఇట్లు భాషాసేవకులు,

1-1-26శేషాద్రిరమణకవులు

శ్రీరస్తు

తాడేపల్లి పానకాలరాయ కవికృత

మానసబోధశతకము

ఉ.

శ్రీరమణీమణీహృదయసేవితముల్ నవఫుల్లహల్లక
శ్రీరమణీయసుందరవిశేషవిలాసము లబ్జసంభవో
దారకిరీటరత్నలలితద్యుతిపూర్ణములట్ల గావగా
సారతరంబు లంచు మనసా హరిపాదము లాశ్రయింపుమా.

1


ఉ.

దండిగఁ జట్టుఱాతిని యథావిధి నంగనగా నొనర్చె ను
ద్దండతఁ గొండచిల్వను ముదంబునఁ జేసెను దివ్యదేహిఁగాఁ
బండితు లైనవారి నెడఁబాయక బ్రహ్మపదంబుఁ జేర్చె నీ
చండితనంబు మాని మనసా హరిపాదము లాశ్రయింపుమా.

2


చ.

సనకసనందనాదిమునిసత్తము లుత్తమభక్తియుక్తిసా
ధనమున నంబుజాక్షునిపదంబుల సేవ యొనర్చి ధన్యులై
మనుట యెఱింగి యింకఁ గొఱమాలినవారల వేఁడ నేల నీ
వనవరతానురక్తి మనసా హరి...

3

ఉ.

సారము లేనిసంసరణసాగర మీఁదఁగ లేకఁజాల వే
సారుచుఁ గర్మబంధములఁ జచ్చుచుఁ బుట్టుచు సారెసారెకున్
దారుణకాలకింకరులదండన కోరువలేవుగాన వి
స్తారసుఖంబు గల్గు మనసా హరి...

4


చ.

పరిపరికర్మబంధములఁ బాయక పుట్టుచు గిట్టుచున్ మహా
దురితకళంకపంకమునఁ దూఁగుచు సంసరణానుబంధ దు
స్తరజలధిన్ మునింగి జడతన్ బరతత్త్వము గానలేక వా
సరములు బుచ్చ కింక మనసా హరి...

5


చ.

తను వతిచంచలంబు ధనధాన్యము లాసట యాధనం బహో
కనుఁగొనుచుండ వేగ చనుఁ గావున భ్రాంతిఁ బొంది దుష్టవ
ర్తనమున సంచరింపకు వృథా కని కానిమఱుంగు జొచ్చె ద
చ్చన విక నెల్ల మాని మనసా హరి...

6


చ.

అతిమలినంబు లైనవిషయంబులఁ జిక్కి సదానిజాత్మసం
గతి పరిపంధిబంధురవికారములం గడుస్రుక్కి సర్వకా
మితములు దక్కి చక్కనగు మేలుపదంబుఁ దలంపలేక నీ
చతఁ బడనేల నీవు మనసా హరి...

7

చ.

మలినపుఁగొంప రోగముల మ్రగ్గెడుసేవపుగంప జంతుసం
చలనముఁ బొందుదుంప భవసాగర మీఁదఁగనీనికంప యె
మ్ములు పలలంబు తోలు నరముల్ మల మొప్పుఁదలంప మేను ని
శ్చలమని నమ్మఁబోకు మనసా హరి...

8


చ.

అనుఁగులు నాలుబిడ్డలును నన్నలుఁ దమ్ములు నాదియైనవా
రనువగువేళ వెంటఁబడి యంతమునం దొకరైనఁ దోడుగా
వెనుకొని రారు వారికయి వెఱ్ఱిగఁ బం డ్లిగిలింప నేల నీ
యనుచితవృత్తి మాని మనసా హరి...

9


చ.

పెనిచినవాని నమ్మి వెనువెంటనె దిర్గుపొటీలు వానిచే
తన మృతిఁబొందునట్లు సుమి తప్పక కాలము నిత్యమంచు నీ
వనిశము నమ్మి యుంటి వకటా యిఁక నేమనుకొందు నింక నీ
వనుపమవృత్తి గల్గి మనసా హరి...

10


చ.

ఋతుమతి నాతి యంటు చెడ నెగ్గగు తద్రుధిరంబు శుక్లసం
గతిఁ గని దేహ మయ్యె నది గన్గొన దుర్మలమూత్రమాంసశో
ణితక్రిమిజాలసంకుల మనిత్య మసౌఖ్యము గానఁ గాయమే
సతమని నమ్మ కీవు మనసా హరి...

11


చ.

తరువులు కొమ్మలున్ విరులుఁ దద్దయుఁ బూచి యడంగునట్లుగా

సిరు లిల వచ్చుచుం జనుచుఁ జిక్కులు బెట్టెడి నట్టిదానికే
పరులను వేడుచుం దిరిగి ప్రాయము రిత్త యొనర్చి వెన్క వా
చఱచిన లేదు ముక్తి మనసా హరి...

12


చ.

పరుసము సోఁకఁగా నినుము భాసురకాంచన మైనభంగి శ్రీ
హరిపదసేవచే భవభయంబు లడంగి వినిష్కలంక మౌ
పరమపదంబు గల్గు నని పాయక కొల్చి తరించి రార్యు లా
సరణిని భక్తి గల్గి మనసా హరి...

13


ఉ.

పెట్టనికోట ఘోరభవభీరులకున్ బరమార్థదేహికిం
గట్టనియిల్లు పూర్వకృతకర్మలతల్ దెగఁగోసివేయఁ జే
పట్టని మేలివాలు నొకపట్టు దలంపగ మోక్షసంపదల్
అట్టె కొనంగవచ్చు మనసా హరి...

14


చ.

అమితజపోపవాసనిగమాగమసంస్తుతికంటె నిత్యసం
యమనీయమాదియోగవిహితాచరణంబులకంటె సాధుసం
గమముఖదానధర్మములకంటె మహెరాత్తమసౌఖ్యభాగధే
యము లనుచుం దలంచి మనసా హరి...

15


చ.

విరివిగ రేవెలుంగుదొరవెన్నెలల న్నెల వచ్చుచుం జనున్
గరులు హరుల్ సిరుల్ విరులు కామినులున్ నిజదేహగేహముల్

స్థిరములుగావు వానిభ్రమఁ జెంది తుదిం జెడిపోవ కిప్పుడే
యఱమర లేక నీవు మనసా హరి...

16


చ.

పుడమిని నీరుబుగ్గ చెడిపోయెడి నంచు జడుండు లోహపుం
గడియము వేయఁబూనుగతిగా నిజదేహము నిల్వఁ గోరి యా
గడమునఁ బ్రాణరోధమునఁ గాంక్ష యొనర్పరు యోగు లెప్పు డా
సడి విడనాడి నీవు మనసా హరి...

17


చ.

తనుఁ బెనుబాము పట్టుకొనఁ దద్వదనంబుననుండి యీఁగలం
గని తిన నేఁగుకప్పగతిఁ గాలభుజంగము తన్ను మ్రింగఁగా
ఘనవిషయాళిఁ గోరెడుజగం బిది నిత్యము కాని దంచు నీ
వనిశముఁ గాంచి నేడు మనసా హరి...

18


చ.

నిరుపమపద్మపత్రమున నీరము లంటకనుండుమాడ్కిఁ గు
మ్మరపురు వొండు నంటనిక్రమంబున బూడిద గచ్చకాయనున్
దొరయనిరీతి నాత్మవిదు దుర్భవబంధము లంట వండ్రు నీ
వరసి నితాంతభక్తి మనసా హరి...

19


ఉ.

ఎక్కడియర్థచింతనము లెక్కడిసంగ్రహణైకసాధనం
బెక్కడిరక్షణక్షమత లెక్కడిహమ్ము మతాభిమానముల్

కక్కస మింత యేల యొకకార్యము దెల్పెద నిత్యసౌఖ్యముం
జక్క గణింపు నీవు మనసా హరి...

20


చ.

మనుజుఁ డపథ్యవస్తువుల మానక కొన్న నజీర్ణబాధ సం
జననమునొందునంచు మది సంశయమొందెడుఁగాని దుర్భవం
బనియెడు పెద్దరోగమున కాత్మ దలంకఁడహో విచిత్ర మా
యనువుఁ దలంచి నీవు మనసా హరి...

21


చ.

విటులవృథాభిలాషలను వేడుక దెల్పుచుఁ జిత్త మర్థసం
ఘటనమునందుఁ జేర్చుగణికానతిరీతిని లౌకికక్రియా
పటిమను సర్వకార్యము లపారముదంబున నిర్వహింపుదున్
జటులతరాత్మబోధ మనసా హరి...

22


చ.

సదమల వేదశాస్త్రము లసంఖ్యలు నేర్చి తదంతరార్థస
త్పద మెఱుఁగంగలేనియెడఁ బ్రాణము వాసి పునశ్శరీరివై
యుదయము నొంది యాచదువు లొప్పఁగ నీకుఁ బఠింపఁ గష్టమౌ
నది యిది యంచు నేఁడు మనసా హరి...

23


చ.

ఇలఁ గలప్రాణికోటులకు నెక్కుడు మానవులందు విప్రుల
త్యలఘులు వారికంటే నిగమార్థవిదుల్ ఘను లట్టివారిలో
జలరుహనాభుపాదజలజార్చకు లుత్తము లండ్రు గాన ని
శ్చలమున భక్తి గల్గి మనసా హరి...

24

చ.

తోలుతను మాతృగర్భమునఁ దోఁచినతత్త్వవిచారబుద్దినే
యలయక చేసి యెల్లవిషయంబుల రోసి నిజాత్మశత్రులం
దొలఁగఁగఁ ద్రోసి దుర్భవము తూలఁగ మోక్షపదంబు జేరి యిం
పలర సుఖించె దీవు మనసా హరి...

25


చ.

నిలయము కాలఁగా జడుఁడు నీటికి నై యిలు ద్రవ్వినట్లు నీ
విల నవసానవేళఁ బరమేశ్వరుఁ గొల్చితరింతు నంచు నా
సలఁబడ నేల నేఁడె హరి సర్వశరణ్య రమేశ పాహి మాం
జలజదళాక్ష యంచు మనసా హరి...

26


ఉ.

అద్దమున న్మనుష్యుఁడు నిజాస్యముఁ దాఁ గనుఁగొన్నమాడ్కి లో
నిద్దపుదృష్టిఁ జూడఁగ వినిర్మలబ్రహ్మము గానవచ్చు దా
సిద్ధియు బొందకుండు జగమెల్లను తా నయి వెల్గుచుండు నీ
వద్దరి గాంచఁ గల్గు మనసా హరి...

27


చ.

ఇటు నటు పాలు ద్రావి పరువెత్తుటకంటెను నిల్చి నీరు గ్రో
లుట కడు మేలు మే లనెడులోకహితోక్తి గణించి చాల మి
క్కుట మగుకర్మబంధముల గాసిల కచ్యుతుఁ జేరు మంటి వే
సట బడ కింకనైన మనసా హరి...

28


ఉ.

ఏనుఁగు నెక్కి దొడ్డి జొర నేల తలంచితివే జగత్రయా

నూనపదక్రమోద్యత మహెూజ్జ్వలవిక్రమకేళి కామసం
ధాను జగద్విధాను ఫణితల్పశయానునిఁ గొల్చి యన్యవాం
ఛానుభవం బిఁకేల మనసా హరి...

29


చ.

సకలచరాచరావనవిచారుని దివ్యపదాబ్జసేవచేఁ
బ్రకటితమోక్షసంపదలు బాటిలు టాత్మ నెఱింగి నీదుబూ
టకములు బుగ్గిగాను అకటా వికటంపుశిఖండివృత్తిరో
యక నెలకొంటి వేల మనసా హరి...

30


చ.

గుఱుతుగ నేటియొడ్డు తెగి కూలెడువృక్షముభంగి దేహ మీ
ధరణినిఁ గూలునేడనొ యథావిధి నేఁ డొనరించఁజూచె దీ
వరయక చన్నవారిని ధ్రువంబుగఁ జూడఁగలేదొ కాలని
స్సరణము సేయ నేల మనసా హరి...

31


ఉ.

ఇచ్చె ధ్రువంబుగా ధ్రువున కెన్న మహోన్నతలోకపాలనం
బిచ్చె విభీషణాదుల కహీనసుఖాస్పదరాజ్యభోగ మం
దిచ్చె పరార్థమున్ శబరి కిచ్చెఁ గుచేలున కిష్టసంపదల్
సచ్చరితుం డతండు మనసా హరి...

32


చ.

పరసతిఁ గోరి కీచకుఁడు ప్రాణముఁ బాసె పరాన్న ఖాదీయై
దురమున గార్తవీర్యుఁ డతిదుర్బలుఁడై పడె నన్యవస్తు వా

దరమునఁ గోరి మున్ను శతధన్వుఁడు కూలెనటందు రార్యు లా
సరణిని గోరఁబోక మనసా హరి....

33


చ.

వలువ లొసంగి వాయకుఁడు వాసిగ లేప మొసంగి కుబ్జ దా
నలరు లొసంగి మాలికుఁడు నన్న మొసంగి ధరాసురాంగనల్
ఫలము లొసంగి యాశబరి పాయనిసద్గతిఁ గాంచి రట్లు సొం
పలరఁగ సేవఁ జేసి మనసా హరి...

34


ఉ.

కన్నులు లేనివాఁ డడవిఁ గాడ్పడి పంగునిఁ ద్రోపఁ జూపఁ గై
కొన్నతెఱంగునన్ జడతఁ గోరి పరేతరు లైనవారి నీ
వెన్నిక జేసి కొల్వ ఫల మే మిఁక మాటలు వేయు నేల త
త్సన్నిధిఁ జేరవచ్చు మనసా హరి...

35


చ.

పతిని నహల్య పాసి సురపాలునిఁ బొంది దురంతపాపసం
గతి నొకఱాయి యయ్యె వ్రజకాంతలు కాంతులఁ బాసి భ్రాంతలై
సతతము శౌరితో రతులు సల్పి మనోరథసిద్ధిఁ గాంచి రా
చతురతఁ గాంచి నీవు మనసా హరి...

36


ఉ.

కన్పుదొంగ వాక్కు మది కాయము లేకము జేసి యర్థసం
పన్నతఁ గాంచు నవ్విధము బల్విడి నారసి పొంచిమంచిసౌ

ఖ్యోన్నత మౌపదార్థమును నొప్పుగ జేకొనవచ్చు మృత్యు వా
సన్నము గాకమున్నె మనసా హరి...

37


చ.

వృకదనుజుండు శంకరుని వేదనఁ బెట్టగ వేగ వచ్చియా
వికలత మాన్ని ప్రోచె సురవిద్విషు లౌమధుకైటభాదు లో
ర్వక యలయింప బ్రహ్మను సురక్షితుఁ జేసిన దేవు గొల్వఁ దోఁ
చక చెడ నేల నీవు మనసా హరి...

38


చ.

తననిజనాథుని న్వదలి తప్పక దర్పకుబారి గొఱ్ఱెయై
కనుఁగొని జారులం గలసి కామిని దుష్కళయైన భంగినిన్
వనరుహనాభుని న్వదలి వారక యన్యులఁ గోరుచున్ దురా
శను బడ నేల నీవు మనసా హరి...

39


చ.

కనికని నూతిలోఁ బడెడికష్టునికైవడి ఘోరదుర్భవం
బునఁ బడి చచ్చుచున్ మఱలఁ బుట్టుచు నాత్మసుఖోపభోగతన్
మనుకు వపేక్ష చేసి పలుమాఱును వేదనఁ బొంద నేల యొ
య్యన దరిజేరవచ్చు మనసా హరి...

40


చ.

అమరనదిన్ సరస్వతీ మహాంబుధి నర్మదఁ గృష్ణవేణి గౌ
తమి యమునన్ సువర్ణముఖి ద్వారవతిం బదరిన్ గయా ప్రయా
గములను గ్రుంకఁ గల్గుగతిఁ గాంచును శ్రీహరినామ మొక్కమా
టమరఁగఁ బల్కెనేని మనసా హరి...

41

ఉ.

వెన్న కరంబునం గలుగ వెఱ్ఱిగ నేతికి నేగినట్లు లో
న న్నెలకొన్న వెన్నుని గనంగ నపేక్ష యొకింతలేక యా
పన్నత నన్యులం గొలిచి పందలఁగూడక జ్ఞానదృష్టి భా
స్వన్నలినాక్షుఁ గోరి మనసా హరి...

42


ఉ.

బూరుగుమ్రాను గాంచి భ్రమనొంది నశించుశుకంబుమాడ్కి సం
సార మపార మంచుఁ గనఁజాలక నీచులఁ గోరి కొల్చి నే
నూఱక మోసపోయి తయయో యని వంతల నొంద నేల వే
సారకముం దెఱింగి మనసా హరి...

43


చ.

మొదలను గర్భవేదనల మూర్ఛిలుదుఃఖము పుట్టి భూమిపై
మెదలఁగ బాల్యదుఃఖ మటమీఁద వయస్సున కామదుఃఖ మ
య్యదనునిసంసృతిం బొరలు నంతట మృత్యువుచేత దుఃఖమౌ
నది దలపోసి చూచి మనసా హరి...

44


ఉ.

ఎందఱు దేవతల్ చనిరొ యెందలు తాపసు లట్టె భ్రష్టులై
రెందఱు రాజు లేగిరొ మఱెందఱు యోగులు జోగులైరొ గో
విందునిపాదపద్మములు వీడనిభక్తి భజింప నేర కా
చందము నొంద కీవు మనసా హరి...

45


ఉ.

గోవు లనేకవర్ణములఁ గ్రుమ్మఱఁ బా లొకటైనభంగి నా

నావిధభూషణంబుల ఘనస్థితి గాంచుకడానిమాడ్కి లో
కావళిలోనఁ దానును దదాకృతి లోకము లయ్యు నంతరా
త్మావహుఁ డచ్యుతుండు మనసా హరి...

46


చ.

కరుఁడవు నక్షరుండవు నసంగివి శ్రీమహిళాసుషంగి వీ
శ్వరుఁడవు సత్తపోనిధివి శాంతుఁడవున్ భయదోగ్రకృష్ణకే
సరివి భవన్మహత్త్వము నిజముగ నెవ్వరికేనిఁ గాంచగా
నరుదుగఁ దోఁచు నంచు మనసా హరి...

47


చ.

శ్రుతముగ బుద్ధ్యహంకరణచిత్తములార వినుండు మీకు నే
హితముగఁ జెప్పెదన్ మన కధీశుఁడు నల్వుర కాదిమూల మ
చ్యుతుఁ డతిమాయనుం డతని సొంపుగఁ బట్టెదఁ దోడుగండు మీ
కతిసుఖ మబ్బు నంచు మనసా హరి...

48


చ.

శరమున నొంఛినన్ బరవశమ్మునఁ గొట్టిన ఱోలఁ గట్టినన్
దఱపులం గావ బంపినను దప్పక వాఁకిటఁ గాపు పెట్టినన్
మఱువక ప్రోచువాని నిను మంచిగ వేఁడిన నన్ను బ్రోతువే
సరిసరి యంచుఁ గూర్మి మనసా హరి...

49


ఉ.

 భక్తినిఁ గొల్వలేఁడు సదుపాయ మెఱుంగనివాడు సంతతా
సక్తిని నేఁడు వీఁడు నను సారెకు దూఱుచు వేడినాఁ డభి

వ్యక్తుఁ డటంచు నెంచక యవారిత మౌదయ నన్నుఁ బ్రోవ సు
వ్యక్తుఁడ వీవ యంచు మనసా హరి...

50


ఉ.

నేరము లెన్న నేల కరుణింపుము నే నీను వెంబండించి వే
సారుచు వేఁడినన్ వినవు సామి యొకానొకవేళనైన నా
కోరిక దీఱఁ గన్పడవు కూరిమిజేయ విఁ కేమి సేతు న
య్యా రఘువర్య యంచు మనసా హరి...

51


చ.

సరసిజసంభవాద్యమరసంఘము లాత్మల నీమహత్త్వమున్
దరి గననేర రట్టినినుఁ దప్పక గొల్చి తరించువాఁడ మం
చరయ సుధాబ్ధిరేణుగణ మచ్చటఁ గ్రోలవె యేనుఁగీఁగ లా
సరణి నటంచు నెంచి మనసా హరి...

52


ఉ.

చక్కనివాఁడు సర్వగుణసంపదలుం గలవాఁడు భక్తిచేఁ
జిక్కెడువాఁడు లోకములచి క్కెడలించెడువాఁడు దీనులన్
మిక్కిలిఁ బ్రోచువాఁడు కననేర్చినఁ గన్పడువాఁడు గాన నీ
వక్కఱపాటుతోడ మనసా హరి...

53


ఉ.

వేఁడెద నిన్ను వీడకయె వేదనలన్ గృశియించినాఁడ నీ
వాఁడ నెపమ్ము లెన్ని నను వంచనఁ జేసితివేని నింక ది

క్కేడ దయాపయోధి నని యెన్నితి నాదుమొ ఱాలకించు మె
గ్గాడకు మంచు మ్రొక్కి మనసా హరి...

54


చ.

అతులితవర్ణిచర్యల గృహస్థమనీషలఁ గానకాంతర
స్థితమితవృత్తులం దతివిశేష విధంబుల ముక్తి గల్గునే
వితతదయాపయోధి యగువిష్ణునిఁ గోరి భజించువారి కా
యతముగఁ గల్గినట్లు మనసా హరి...

55


ఉ.

తమ్ముల మీరు సౌరుకనుదమ్ములు సోమునిఁ గేరుమోము కుం
దమ్ములచాలుఁబోలురదనమ్ములు నద్దపుమేను పద్మరా
గమ్ములడాలు నేలుపదకంజములుం గలతమ్మికంటి సౌ
ఖ్యమ్ము లొసంగు నీకు మనసా హరి...

56


చ.

గరళముఁ బ్రామి చన్గుడుపుకామిని కిచ్చెను మోక్ష మాసభాం
తరమున నెగ్గులాడినఁ బదంపడి వానికి నైక్య మిచ్చె భీ
కరగతిఁ బట్టి మ్రింగుభుజగంబున కిచ్చెను మర్త్యరూప మా
చరితము లెన్నఁగల్గు మనసా హరి...

57


ఉ.

హెచ్చగుగట్టు మోసి యలయింపక ప్రాణులఁ బ్రోచినాఁడు తా
నిచ్చను గొల్చుపాండవుల కేర్పడ రాజ్య మొసంగినాఁడు కా
ర్చిచ్చును బట్టి మ్రింగి నిజసేవకులన్ బ్రతికించినాఁడు నీ
వచ్చపుభక్తి గల్లి మనసా హరి...

58

ఉ.

ఎన్నిక సంపద ల్గలిగి యెగ్గని చూడక గొల్లయిండ్లలో
వెన్నయు జున్ను పా ల్పెరుఁగు వేమఱు దొంగిలితిన్న చిన్నినీ
చిన్నెల నెన్న జోద్యమగుఁ జెల్వుగ నీ విట రాగదన్న మా
యన్న యిదేమి యంచు మనసా హరి...

59


ఉ.

నందునిమందయందు వ్రజనందనులందఱుఁ గొల్వ గోపికా
బృందవిపంచికారవము లింపొనరింపఁగ సుందరాకృతిం
జెంది కళింగజాతటము చెంతను తాండవకేళి సల్పునీ
చందము లెంతు నంచు మనసా హరి...

60


చ.

ఎఱుఁగవు ముక్తిమార్గ మిది యెక్కడికర్మము దాఁపురించెఁ జే
దెఱుఁగనిబొట్టె తా మగని కింపుగ బెండ్లి యొనర్చినట్లు దు
ష్కర మగుకామ్యకర్మములఁ గాలము బుచ్చెదవేల బాపురే
సరసముగాదు నీకు మనసా హరి...

61


చ.

పరుసము లాడఁబోకు పరభామలఁ గోరకు దుష్టకృత్తిచేఁ
దిరుగకు యాచకావళినిఁ దిట్టకు రచ్చలపక్షపాతముల్
నెఱపకు సాధుసంఘముల నింద లొనర్పకు కామమోహమ
త్సరముల జెంద కీవు మనసా హరి...

62


చ.

పొలుపుగఁ గోటివిద్యలును బొట్టకుఁ బట్టెడుకూటికే కదా

యిలను జయించి పెంపుగను నెన్ఁనటికైనను గాటికే గదా
కలిమి నిజం బటంచుఁ గడఁగానక నిక్కెద వాయు రర్థముల్
జలములమీఁదివ్రాఁత మనసా హరి...

63


ఉ.

కూరిమిోతడ నైనఁ దగుకోరిక నైనను ప్రాణభీతిచే
దూఱుదునైన వైరమునఁ దూఁగుచు నైన సుభక్తి నైన వే
మాఱు హరిం దలంప నసమాససుఖంబు ఘటిల్లు గాన వే
సారక నీవు నేఁడు మనసా హరి...

64


ఉ.

కోఁతుల నేలినాఁడ వని కోవిదు లెన్నఁగ వింటి నే నయో
కోఁతిగ నుంటి నన్నటుల గొబ్బున సేవకుఁగా నొనర్చి సం
ప్రీతిగఁ బ్రోవుమంటి నిరుపేదలఁ బ్రోదిగ సాఁకుటెల్లఁ బ్ర
ఖ్యాతియ కాదె యందు మనసా హరి...

65


చ.

ఉడుతకుఁ గల్గె ముక్తిపద మూసరవెల్లికి సౌఖ్య మబ్బె నె
క్కుడుగతి పక్షి కబ్బె ధరఁ గోమలిరూపముఁ జెందె ఱాయి మేల్
పడసెను పాయకుండు భవబాధలఁ బాసె నిషాదుఁ డామహా
జడధిశయాను నాజ్ఞ మనసా హరి...

66


ఉ.

ఇల్లని నూతిలోఁ బడితి యేదరిఁ గానక తల్లడిల్లినా
తల్లివి తండ్రి వీవ యని తప్పక నన్ దరిజేర్చుమంటి నీ

వెల్లజగంబు లేలుకొను నేలికవై నను బ్రోవకున్న నే
నల్లరిఁ జేతు నంచు మనసా హరి...

67


ఉ.

నీసతి యిచ్చు భాగ్యములు నీసుతుఁ డిచ్చుఁ జిరాయుసంపదల్
నీసుత జేయు పావనము నీవు జగంబులఁ బ్రోతువౌ భళీ
నీసరిదైవము ల్గలరె నిన్ను భజించినవాని కేటి దా
యాస మటంచు నీవు మససా హరి...

68


చ.

గరుడునిమూఁపున న్నిలిచి ఖడ్గశరాసనశంఖచక్రముల్
కరముల నుల్లసిల్ల మృదుకాంచనచేలము కాంతులీన సుం
దరమణిభూషణావళు లుదారకిరీటముఁ దాల్చి వచ్చి నీ
సరసను నిల్చి ప్రోచు మనసా హరి...

69


ఉ.

దాఁకొని జన్మకర్మపరితాపములం గృశియించి దిక్కు నీ
వే కరుణింపవే మనుపవే యని వేఁడితి నన్ను బ్రోవవే
యాఁకటిబాధచేఁ దనయుఁ డన్నముఁ దెమ్మనిపోరుచేసినన్
సాఁకదె తల్లియంచు మనసా హరి...

70


చ.

భవదుదరప్రభూతమగుపద్మభవాండమునం దనేకజం
తువు లుదయింపఁ జేసి కృపతోడను బ్రోవ ననేకభంగులన్
భువిజనియించు విశ్వపరిపూర్ణుని నిత్యుని నిన్నుఁ గూర్చి సం
స్తవ మొనరింతు నంచు మనసా హరి...

71

ఉ.

ఆఁకొని సత్త్వముం దొఱఁగి యట్టిటుఁ గ్రుమ్మరలేనికాలమం
దాకొని కుంభికుంభపిశితస్పృహ వీడని గంధసింధురా
నేకపవై రిమాడ్కి గను నేహ్యపుసంసరణానుబద్ధుఁడై
యాకమలాక్షుఁ గోరు మనసా హరి...

72


ఉ.

పొక్కిటఁ దమ్మిలో నలువ పుట్టువుగూర్చినవాఁడు ఫాలమం
దెక్కుడుకంటివేల్పు జనియింపఁగఁజేసి యతండు దాల్పఁ బెం
పెక్కిన మెట్టుదమ్మి జెదలేటివధూటినిఁ గన్నమేటి నీ
యక్కఱ లెల్ల దీర్చు మనసా హరి...

73


చ.

వలను మృగంబు నోదమున వారణ ముచ్చున నంబుజంబు భూ
తలమునఁ జిక్కిన ట్లనితరస్థితి నిర్మలభక్తిసూత్రధా
రుల కనువొంద లభ్యుఁడగు రూఢిగ నీశ్వరుఁ డంచు నెప్పు డొ
జ్జలు పరికింతు రట్లు మనసా హరి...

74


చ.

సలలితశంఖచక్రజలజాభయహస్తము లొప్పువాని ను
జ్జ్వలదురురత్నకీలితసువర్ణకిరీటశిరంబువానిఁ గో
మలతులసీవిభాసురరమాయుతవక్షమువానిఁ గొల్చినం
జలనము లేనిముక్తి మనసా హరి...

75


చ.

హరచతురాస్యషణ్ముఖసహస్రముఖేభముఖాదిదేవతా

వరులు సమస్తవేదములు వర్ణన సేయఁగ లేరు ని న్నయో
నరుఁడను జ్ఞానహీనుఁడను నాథుఁడ వెన్నఁగ నాకు శక్యమే
శరధిశయాన యంచు మనసా హరి...

76


ఉ.

పాపము లెల్లఁ దీఱు భవబాధలు గొందులఁ దూఱు ఘోరసం
తాపదవాగ్ను లాఱు విపదంబుధు లింకఁగఁబాఱు మోక్ష ము
ద్దీపితవృత్తిఁ దేఱు మనదీనత మాన్చెడివారు లేరు నీ
యాపద లెల్లఁ దీఱు మనసా హరి...

77


చ.

తిరుమలలోఁ బ్రభాతవిధిఁ దీఱిచి నీలగిరిన్ భుజించి కే
సరిగిరిఁ జందనం బలఁది చల్లనిదాహము మంగళాద్రి లో
గురురుచిఁ ద్రావి రంగపురిఁ గోమలితోఁ బవళించినట్టియా
సరసుని జేరె దీవు మనసా హరి...

78


ఉ.

శ్రీకరముల్ సుధీజనవశీకరముల్ రిపులోకభేదద
స్వీకరముల్ శ్రుతిప్రకరవేద్యలసత్పరతత్త్వనిత్యల
క్ష్మీకరముల్ సతీపతి శచీపతి వాక్పతి యోగ్యభోగ్యభా
గ్యాకరముల్ దలంప మనసా హరి...

79


చ.

తొలిచదువు ల్వడింగొనుచుఁ దోయధిఁ జొచ్చినసోమకాసురున్
బలిమిగ మీనరూపమునఁ బట్టి వధించి రయంబునన్ శ్రుతుల్

నలువ కోసంగి లోకముల నర్మిలి బ్రోచిన మత్స్యమూర్తి సొం
పలరఁగ నిన్నుఁ బ్రోచు మనసా హరి...

80


చ.

కులగిరి కవ్వ మంబునిధి కుంభము పాములఱేఁడు త్రాడుగాఁ
దలపడి దేవదానవులు తత్పరతన్ మథియింప భార మ
గ్గలమయి క్రుంగుశైలము సుఖస్థితిఁ దాల్చిన కూర్మమూర్తి ని
శ్చలముగ నిన్నుఁ బ్రోచు మనసా హరి...

81


ఉ.

పుత్తడికంటిరక్కసుఁడు బొత్తిగ నీధరఁ జాఁపజుట్టిన
ట్లెత్తుక తా రసాతలికి నేఁగఁగ వాని వరాహరూపమై
కుత్తుకఁ ద్రుంచి భూతలము గొమ్మునఁ దాల్చినదంష్ట్రి సత్కృపా
యత్తత నిన్నుఁ బ్రోచు మనసా హరి...

82


ఉ.

సర్వమయుండు విష్ణుఁ డని చాటిన యాపసిబాలఁ గావఁగా
శర్వముఖామరు ల్వొగడ స్తంభమునన్ బ్రభవించి నిష్ఠురా
ఖర్వనఖాళి దానవుని గర్భము జీరిన శ్రీనృసింహుఁడే
సర్వఫలంబు లిచ్చు మనసా హరి...

83


చ.

బలి బలిమిన్ దివాకరులఁ బాఱఁగఁదోల జగంబు లెల్ల రం
జిలువటువేష మూని బలిఁ జేరి పదత్రయభూమి దానమున్

వలనుగ వేఁడి తత్పదవి వజ్రి కొసంగినయాత్రివిక్రముం
డలయక నిన్నుఁ బ్రోచు మనసా హరి...

84


చ.

ఇరువదియొక్కకయ్యముల నిట్టులఁ గంటకులైన రాజులన్
దఱలఁగఁ గూల్చి తద్రుధిరధారల నేఱు లొనర్చి పైతృకా
చరణము సల్పి శాశ్వతయశస్కరుఁడౌ భృగురామమూర్తి ని
న్నరసి కృతార్థుఁ జేయు మనసా హరి...

85


చ.

రవికులమందుఁ బుట్టి బలురక్కసి తాటకఁ గొట్టి మౌనిరా
ట్సవనము చక్కఁబెట్టి గురుసమ్మతిఁ గానను ముట్టి వార్థి దో
ర్జవమునఁ గట్టి రావణు ధరం బడఁగొట్టినరామమూర్తి ని
న్నవిరళలీల నేలు మనసా హరి...

86


చ.

అలవసుదేవరోహిణుల కద్భుతలీల జనించి మించి చే
హలముసలాస్త్రశస్త్రముఖరాయుధముల్ ధరియించి ముష్టికా
దుల వధియించి భూభరముఁ దీర్చిన శ్రీబలరామమూర్తి తా
సలలితలీల నేలు మనసా హరి...

87


చ.

ఘనతరబోధలం ద్రిపురకాంతలనిష్ఠలు మాన్పి పార్వతీ
శునకు శతాంగశస్త్రశరశూలధనుఃప్రముఖోగ్రదివ్యసా

ధనము లొసంగియున్ ద్రిపురదైత్యులఁ ద్రుంచినబౌద్ధమూర్తి ని
న్ననవరతంబుఁ బ్రోచు మనసా హరి...

88


ఉ.

మిత్రుల మంచు దేవత లమేయసుఖస్థితి నిల్చియుండఁగా
శత్రుల మంచు రాక్షసులు సంగరభూములయందుఁ జావఁగా
శత్రులు మిత్రులుం గలరె సర్వసముం డురగేంద్రశాయి త
చ్ఛాత్త్రునిఁ జేయు మంచు మనసా హరి...

89


చ.

తెలియక పాపకర్మములఁ దెంపునఁ జేసితి మందబుద్ధినై
మెలఁగితి కాలుఁ డేమిమిడిమేల మొనర్చునొ యంచు భీతిచే
నిలిచితి నాకు ది క్కనుచు నీవె మఱెవ్వరు లేరు బ్రోవవే
జలనిధిశాయి యంచు మనసా హరి...

90


చ.

చిలుకకు రామరామ యని చెప్పిన వేశ్య తరించె ముద్దుచేఁ
దలపడి పుత్త్రుపే రిడుట ధన్యతఁ గాంచె నజామిళుండు పే
రెలుఁగున బోయ చక్రి స్మరియింప భవాంబుధి దాఁటె నట్లు ని
ష్కలుషతఁ గాంచె దీవు మనసా హరి...

91


ఉ.

గాలము మ్రింగినట్టిఝషకంబు తుదిం జెడిపోయినట్లు నీ
వేల భ్రమించి సంసరణహేయసుఖంబులఁ గోరె దక్కటా

కాలుఁడు పోరఁజొచ్చె గడకాలము దాఁకొనవచ్చెఁ గాన దో
షాళి నడంచి వేగ మనసా హరి...

92


చ.

హరి భజియింతు నే నహరహంబు హరి న్నుతియింతు భక్తిచే
హరికి సపర్య సేతు హరి కంజలు లిత్తు మనోహరంబుగా
హరి సరియైనదైవత మజాండమున న్నహి యంచు నెంచ శ్రీ
హరిపురిఁ జేరవచ్చు మనసా హరి...

93


చ.

బలిమిగ నూహలున్ిమీగుల ప్రౌఢి గలంగి చెలంగి జీవితా
శలు దకపోయుదున్ వదలఁజాలక నంబుధిమధ్య మీనముం
బలె నిగళాంతరాస్థిగతి బాధల నొంది కృశింప నేల ను
జ్జ్వలతరభక్తి గల్లి మనసా హరి...

94


చ.

కరివరు నేలినాఁడు మునికాంతవిపద్దశ మాన్పినాఁడు దు
ర్భరశరవహ్నిఁ గ్రాఁగ నుదరస్థుని బాలునిఁ బ్రోచినాఁడు త
త్తరపడి వేఁడ తత్క్షణమె ద్రౌపది మానము గాచినాఁడు ని
న్నఱమఱ చేయఁబోడు మనసా హరి...

95


ఉ.

తల్లికిఁ గల్గినట్టిదయ దాదికి గల్గునె యెన్ని చూడ నీ
చిల్లరవేల్పులు న్నెవరు జిల్కఁగ బ్రోచుట కల్లగాదె నేఁ

జెల్ల జగత్కుటుంబి వెడచేయక తొల్లిటివారియట్ల నే
యల్లనఁ బ్రోవు మంచు మనసా హరి...

96


ఉ.

ఊడుగవిత్తు లత్తరువు నొయ్యనఁ జేరినరీతి వాహినుల్
వీడక వార్ధిఁ జొచ్చిన ప్రవీణత నుత్తమసాధ్వి వల్లభున్
గూడఁగ నేఁగుమాడ్కి లతకూన మహీజముఁ బ్రాఁకినట్లు మా
రాడకఁ గోర్కు లూర మనసా హరి...

97


ఉ.

శ్రీదము లాశ్రితావనవిశేషవినోదము లాగమాంతస
మ్మోదము లబ్జజాద్యమరముఖ్యమనఃకమలార్చనాంతరా
హ్లాదము లార్తరక్షణమహత్త్వపటుత్త్వసమస్తశిష్టక
ష్టాదములౌఁ దలంప మనసా హరి...

98


ఉ.

ఏదయ నీదయాభిమత మెందుకు నాపయి యాదిరాదయా
నాదయ నీపదాశ్రయము నమ్మితి దబ్బరమాట గాదయా
నీదయ నే నకించనుఁడ నీవు ప్రపూర్ణుఁడ వంచు భక్తర
క్షా దయ బ్రోవు మంచు మనసా హరి...

99


ఉ.

పూర్వభవంబునం దనరు పుణ్యగతి లభియించి నీమహా
ఖర్వచరిత్రము ల్నుడువఁగల్గెను పెన్నిధిఁ గన్న పేదవాఁ

డుర్వి సుఖించినట్లు ముదమొప్పఁ గృతార్థుఁడ నైతి నోవిహం
గార్వ రమేశ యంచు మనసా హరి...

100


ఉ.

పాయక తాడెపల్లికులపావనుఁడై విలసిల్లు పానకాల్
రాయనిచేఁ బ్రణీత మయి రంజిలు మానసరాజయోగసం
ధాయకవంద్యసంస్తవశతం బనిశంబుఁ బఠించి మోక్షసం
ధాయతఁ బొందె దీవు మనసా హరి...

101


ఉ.

మంగళ మబ్బజాసహితమన్మథకోటిస్వరూపసుందరా
మంగళ మార్యలోకహిత మంగళ మగ్నిరవీందులోచనా
మంగళ మభ్రకేశనుత మంగళ మాహవరంగభీమ దై
త్యాంగవిభంగయంచు మనసా హరిపాదము లాశ్రయింపుమా!

102

మాససబోధశతకము
సంపూర్ణము.