భక్తిరసశతకసంపుటము/మొదటిసంపుటము/రాజగోపాలశతకము

పీఠిక

ఈశతకము రచించిన కవినామము ఇందుఁ గానరాదు. ఇంకను నీశతకమునఁ గొన్ని పద్యము లున్నగాని యష్టోత్తరశతపద్యసంఖ్య పూర్తిగాదుగాన ననుపలభ్యములగు పద్యములలోఁ గవిచరిత్ర పద్య మిమిడియుండు నేమో!! ఎవరేని మాతృకగలవా రీప్రతిలో లేనిపద్యములఁ బంపుదురేని వందనీయులు.

శతకకర్తయగు కవినివాసము ఉన్నవ కొండవీటిలోని యొకపూర్వగ్రామము. ఇది గుంటూరునకుఁ దూర్పున రెండామడల దూరములోనున్నది. ఈశతకము రచించినకవి పద్మావతీపరిణయమను పద్యకావ్యమునుగూడ రచించెను. అందుఁ బద్మావతిని వేంకటేశ్వరుఁడు పెండ్లాడినకథ చెప్పఁబడినది. పద్మావతీపరిణయకృత్యాదికమువలన నీశతకకర్త ఉన్నవ యోగానందకవి యని తెలియును. ఇక్కవి ఆపస్తంబసూత్రుఁడు గార్గ్యగోత్రుఁడు. ఆఱువేలనియోగి బ్రాహ్మణుఁడు. యోగానందకవి జీవితచరిత్రము సంగ్రహముగాఁ బద్మావతీపరిణయపీఠికలోఁ గలదు. దానివలన నీకవి రమారమి నూటయేఁబది సంవత్సరములక్రింద నున్నటుల నెఱుంగనగును. కవిజీవితమందలి విశేషములు కొండవీటిసీమలోఁ గృషి చేసి విచారింపవలసి యున్నది.

ఇందలి పద్యములు ధారాశోభితములై భక్తిరసమున కాటపట్టుగా నున్నవి, ఇందలి కవిత మృదుమధురము గాని వ్యాకరణము దోషములు ఛందోలోపములు నందందు గానవచ్చుటచే నిది ప్రథమప్రయత్న మేమో యని తోఁచుచున్నది.

ఈ రాజగోపాలశతకములోని కొన్నిపద్యములు శ్రీకృష్ణకర్ణామృతములోని శ్లోకముల కాంధ్రీకరణములుగ నున్నవి. కొలఁదిగా సామాన్యనీతులుగ వ్యవహారాదర్శములుగా నున్నవి. ఇందలి కృష్ణుని శృంగారలీలావిహారములను వివరించు పద్యము లిప్పటి నాగరికులకుఁ గొంచెము వెగటు గలిగించినను భగవద్వర్ణనము లగుటచేఁ బఠనీయములే యని మాతలంపు.

నందిగామఇట్లు భాషాసేవకులు,
1-1-25శేషాద్రిరమణకవులు.

శ్రీరస్తు

ఉన్నవ యోగానందకవివిరచిత

రాజగోపాలశతకము

సీ. శ్రీకరనిలయమై చెన్నొంది యుష్మత్కృ
               పామృతదృష్టిచే నంకురించి
     సత్పదసందర్భసరసవాఙ్మహనీయ
               శాఖోపశాఖలచాయఁ బరగి
     పరమగంధకృద్బహుమానమంజరీ
               పరిఫుల్లసుమములఁ బరిమళించి
     యలరుచు నుండెడు నస్మన్మహాభాగ
               ధేయసారస్వతదివిజతరువు
గీ. గనందు సత్ఫల ముదయంబు నొందుకొఱకు
     సముచితంబుగ సీసశతము రచింతు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.1
సీ. బృందావనంబులో బిబ్బోకవతులపైఁ
               గూర్మిచే మరుకేళిఁ గూడికూడి

     కరుణతోఁ గుబ్జను గైకొని రతిలీల
               నలవరించినభంగి జలవుమెఱసి
     నవరసాలంకారకవివరప్రోక్తప్ర
               వంధాభినుతి చేతఁ బరిఢవిల్లి
     కృపఁ జూచి నావంటికించిద్జ్జుఁ డొనరించు
               శతకముఁ గొమ్ము శాశ్వతము గాను
గీ. నిన్ను వర్ణింప శేషాహినీరజాత
     సంభవభవాదులకు నైన శక్యమగునే
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.2
సీ. దండము పద్మగర్భాండభాండోదర
               పుండరీకాక్ష వేదండవరద
     దండము కాళీయకుండలిరాట్ఫణా
               మండలకృతచిత్ర తాండవపద
     దండము మదగజశుండాభదోర్ధండ
               చండపరాక్ర మాఖండలనుత
     దండము రక్షితపాండవ వాహీకృ
               తాండజరాజ విఖండితాఘ
గీ. దండ మంభోధిభయదప్రచండకాండ
     దండ మతులితశార్జ్గకోదండభరణ
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.3

సీ. వందన మిందిరాసుందరీహృదయార
               విందానుషంగమిళింద నీకు
     వందన మమృతాశిసందోహసన్నుత
               మందరధరణ గోవింద నీకు
     వందన ముజ్జ్వల నందకహతదైత్య
               బృంద త్రయీమూలకంద నీకు
     వందన మాత్మజకందర్ప దేవకీ
               వందన స్తుతముచుకుంద నీకు
గీ. ననుచు సద్భక్తిపూర్వకమున వచించు
     మనుజులకు ముక్తి కరతలామలక మగును
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.4
సీ. యదుకులవార్ధి రాకామృతకిరణాయ
               భవహరణాయ తుభ్యం నమో౽స్తు
     గగనధునీజన్మకారణచరణాయ
               యగధరణాయ తుభ్యం నమో౽స్తు
     కమనీయమౌరళీగానప్రవీణాయ
               భద్రగుణాయ తుభ్యం నమో౽స్తు
     కస్తూరితిలకాయ కౌస్తుభాభరణాయ
               భర్మచేలాయ తుభ్యం నమో౽స్తు
గీ. పంకరుహలోచనాయ తుభ్యం నమో౽స్తు
     భక్తసంరక్షణాయ తుభ్యం నమో౽స్తు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.5

సీ. అక్షీణరణరంగరక్షోనివహభంగ
               పక్షిరాజతురంగ బహుపరాకు
     ఘోరారిధర చక్రధారాదళితనక్ర
               భారావనీచక్ర బహుపరాకు
     తాండవస్ఫుటలీల ఖండితార్జునపాల
               పాండవపరిపాల బహుపరాకు
     వరభుజంగమతల్ప గురువిక్రమానల్ప
               పరమార్థి జనకల్ప బహుపరాకు
గీ. భక్తయోగీశహృద్వాస బహుపరాకు
     భానుకోటిప్రభాభాస బహుపరాకు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.6
సీ. రుక్మిణీహృదయసరోరుహభృంగాయ
               భామామనఃపద్మభాస్కరాయ
     జాంబవతీచిత్తపద్మసంచరణాయ
               తారుణ్యమిత్రవిందాధవాయ
     భద్రాహృదాంతరఫలదాయకాయ సు
               దంతామనోహరస్వాంతజాయ
     వరకళిందాత్మజాసరసప్రియాయ ని
               రంతరలక్షణారంజనాయ
గీ. రాధికాదృక్చకోరతారావరాయ
     దివ్యకల్యాణవిభవాయతే నమోస్తు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.7

సీ. భవదీయసత్కథాఫణితపద్యంబులో
               నొరగులు మిక్కిలి యుండెనేని
     ఇక్షుదండంబు పేడెత్తిన గుజ్జైనఁ
               గుంటువోయినఁ గడుఁ గుఱుచయైన
     మధురంబుగాక నెమ్మది విచారించినఁ
               దిక్తమౌనా యని ధీరులైన
     సుకవు లాదరణతోఁ జూతురు గావునఁ
               దప్పు లుండిన నైన నొప్పుచేసి
గీ. కైకొనుము నీకటాక్షవీక్షణము గలిగి
     భవ్యకరుణావిధేయ సద్భక్తగేయ
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.8
సీ. నీనామపఠనంబు నెమ్మిఁజేసికదా
               యాకిరాతుఁడు దా మహర్షి యయ్యె
     నీపాదరేణువు నెఱయ సోఁకినఁ గదా
               పాషాణ మప్పుడె పడఁతి యయ్యె
     నీతరుణాంఘ్రిసంజాత యౌటనె కదా
               జాహ్నవి లోకప్రశస్త యయ్యె
     నీమంత్ర మెడలోన నిల్పుటనే గౌరి
               సర్వమంగళయన జగతిఁ బరగె
గీ. నౌరా భదీయదివ్యనామామృతంబుఁ
     గ్రోలునరుఁ డేల యితరంబుఁ గోర నేర్చు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.9

సీ. మకరిచేఁ గడుడస్సి మది నిల్పి వేఁడిన
               గజరాజుఁ గాచినఘనుఁడ వీవు
     హాకృష్ణ! యన్నంత నక్షయపటములు
               ద్రౌపది కొసఁగినదాత వీవు
     అడుకులు దెచ్చిన యాకుచేలునకు సౌ
               భాగ్యమిచ్చిన జగత్ప్రభుఁడ వీవు
     గంధ మర్చించువక్రాంగిఁ గుబ్జను జూచి
               రమ్యాంగిఁగాఁ జేయురాజు వీవు
గీ. అహహ నీమహనీయదయార్ద్రచిత్త
     వృత్తి వర్ణింప నలవియే విధికినైన
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.10
సీ. శరధిఁ జొచ్చి బిరానఁ దిరిగి యిట్టట్టుపొ
               రలి నోరుదెఱచి కెరలి జలములు
     గళగళఁ ద్రాగి వెక్కసమైన నుమియుచుఁ
               గషఠఝషములఁ గర్కటకములను
     జుట్టి మట్టాడుచుఁ జటులకోపాటోప
               మున సోమకాసురుఁ గినిసి పట్టి
     కులిశసన్నిభ దంష్ట్రములఁ జక్కుచక్కుగా
               నఱికి విక్రమమున మెఱసి వేద
గీ. ములను గొనివచ్చి ప్రియమున నలువ కిచ్చి
     నట్టి మత్స్యావతార మేమని నుతింతు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.11

సీ. పాలమున్నీటిలోపల సురాసురులు గుం
               పులుగూడి మందరభూధరంబుఁ
     గవ్వముఁ గావించి కాకోదరాధీశు
               నాఁకత్రాడుగఁ జేసి యబ్ధిలోనఁ
     జేకొనితరువంగ శైలంబు గలఁగిన
               సురలమొఱవిని యాదరణతోడ
     సంబుధిలోఁ జొచ్చినప్పుడు జలజంతు
               జాలంబు భయమున సంచలింపఁ
గీ. గూర్మరూపంబుఁ దాల్చి యాకొండ నెత్తి
     నట్టి నీవేష మెన్న బ్రహ్మకు వశంబె
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.12
సీ. సన్నపుఁబదములు నున్ననిగొరిజలు
               చిన్నికన్నులు విలసిల్లు చెవులు
     వెడఁదఱొమ్మును గొప్పవెన్నును గుఱుచవా
               లము కఱవయినరోమములు కొద్ది
     నడుమును బటువైనయొడలు నున్నతఘోణ
               మును గడునిశితదశనయుగమును
     గిటగిట గీటించు ఘుటఘుటార్భటముల
               నడరి మహార్ణవమందుఁ జొచ్చి
గీ. హేమనయనాసురుని జంపి భూమి సవ్య
     రదమునను నానినట్టివరాహరూప
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.13

సీ. చిడిముడి హేమకశిపుఁడేడిరాచక్రి
               స్తంభంబులో నని చఱచినపుడు
     పటపట స్తంభంబు పగిలి భీకరకారా
               ళముఖము నిశితనఖములుఁ గ్రకచ
     కఠినదంష్ట్రలుచిఱు కన్నులు కొద్దినె
               న్నడుమును జొక్కపునిడుదవాల
     మలర నృసింహమై వెలసి కీలార్చి వి
               పక్షుని పెనుకళేబరముఁ జించి
గీ. రక్తధారలు గురియ నాగ్రహము మెఱసి
     నట్టినీ శౌర్య మెన్నఁగా నజుని వశమె?
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.14
సీ. చిఱుతపాదములును జిన్నారిబొజ్జయుఁ
               గుఱచకర్మములు గులుకుమోము
     నిద్దంపుఁజెక్కులు కొద్దియంగుళములు
               కరకమండలము వ్యాఘ్రాజినంబు
     నారముంజియు గోఁచి యాతపత్రంబును
               యజ్ఞోపవీతంబు నక్షమాల
     యునుధరియించి వామనుఁడవై బలిని బ
               దత్రయభూమిని దాన మడిగి
గీ. యవని దివి రెండుపదముల నాక్రమించి
     యొక్కపాదంబుఁ దలమీఁదఁ ద్రొక్కితౌరా
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.15

సీ. భార్గవరామరూపము ధరించి కరము
               న ధనువుఁ బట్టి దొనలు వహించి
     గండ్రగొడ్డలిఁబూని కదిసి రాజులమీఁద
               శరవృష్టి గురియుచు నఱకునపుడు
     కూలు తేరులు ధరవ్రాలు ఘోటకములు
               పడియున్న కరులు కబంధములును
     తెగిపడ్డతలలు విఱిగిపడ్డరాజులు
               నైనయాహవభూమియందు నిలిచి
గీ. కార్తవీర్యుని భుజములగర్వ మణఁచి
     విజయ మొనరించితౌ జగద్విదితముగను
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.16
సీ. దశరథసుతుఁడవై తాటకఁ దునిమి సు
               బాహుని ద్రుంచి తపసునిజన్న
     మునుగాచి యాశంకరునివిల్లు విఱిచి సీ
               తను బెండ్లియాడి మోదమునఁ జెలఁగి
     తండ్రివాక్యమునిల్పి దండకాటవిఁ జొచ్చి
               మాయామృగముఁ జంపి జాయఁ బాసి
     వాలినిగూల్చి భాస్వత్తనూజునిగూడి
               సామీరిచే సీతసేమ మరసి
గీ. వనధి బంధించి రావణవధ మొనర్చి
     యవనిజను గూడుకొన్న రామావతార
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.17

సీ. కలువపూవన్నియచెలువుచల్లడము జొ
               క్కపునీలిధట్టి నిగన్నిగప్ర
     భలు గుల్కునల్లనిపట్టుదుప్పటి నీల
               మణికిరీటము మృగమదతిలకము
     ధరియించి రాజసత్వము మీఱి కంసుని
               సభఁ జొచ్చి భుజములు చఱచి మల్ల
     రంగంబులో నిల్చి పొంగుచు ముష్టికా
               సురుని జయించి కంసుని వధించి
గీ. నట్టి నీబలభద్రరామావతార
     మహిమ వర్ణింపఁగా నౌనె మర్త్యులకును
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.18
సీ. వెలయఁ బురత్రయములరాక్షసులు నిజ
               భార్యాపతివ్రతాప్రాభవమున
     విజయులై వెలిఁగి దివిజుల బాధింప నా
               యమరులు మొఱవెట్ట నాదరమున
     విని వారి కభయంబు మునుకొని యొసఁగుచు
               బుద్ధరూపముఁ దాల్చి పొందు మీఱ
     వరదితిజాంగనా వ్రతభంగ మొనరించి
               శివునినిల్కానిఁగాఁ జేసి నీవు
గీ. శరముఖంబున నిలిచి తత్పురనివాస
     పుణ్యజనులను ద్రుంచితౌ ముదముతోడ
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.19

సీ. కడునొప్పు గొరిజలు వెడఁదఱొమ్మును జిరు
               కొద్దివాలము వెన్ను కుఱుచఁదనము
     కళలు గుల్కెడుమోము గలపంచకల్యాణి
               హయముకుఁ జికిలికళ్లియము పసిఁడి
     పల్లము ముత్యపుజిల్లుల యంకవ
               న్నియలును గైసేసి హొయలుమీఱఁ
     బెనువిల్లు తరకసంబును వజ్రంపుబాకుఁ
               గట్టి యుత్తమతురంగంబు నెక్కి
గీ. యవనిఁ దిరిగెడునీదుకల్క్యావతార
     విభవ మెన్నంగ నగునె యావిధికినైన
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.20
సీ. [1]చోఱవై జలనిధి చొచ్చిన కూర్మమై
               కొండవీఁపున నానుకొనిన ఘోణి
     వై నేలత్రవ్విన వరనృసింహంబ వై
               భయపెట్టినను పొట్టిబ్రహ్మచారి
     వై దానమడిగిన మేదినీసురుఁడ వై
               రాజులఁ గొట్టినరాజువయ్యు
     నడవులదిరిగిన హలముమోచిన బుద్ధ
               కలికి రూపములచే వెలసియుండి
గీ. నన్ను రక్షింపకున్న వెన్నంటివచ్చి
     పట్టి సాధింతు నీబంటుపంత మిటుల
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.21

సీ. పాలకడలి వటపత్రశయనుఁడ వై
               యోగనిద్రాముద్ర నొందియుండి
     నను శేషఫణిరాజఘనఫణామండల
               సింహాసనంబునఁ జెలఁగియున్న
     గరుడవాహనమెక్కి మురియుచు లోకముల్
               దిరుగంగఁ బోయిన వరమునింద్ర
     హృదయాంతరంబుల నొదిగి తారుండిన
               సూర్యమండలమునఁ జొచ్చియున్న
గీ. నన్ను రక్షింపకున్న వెన్నంటివచ్చి
     పట్టి సాధింతు నీబంటుపంత మిటుల
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.22
సీ. తల్లిదయాహీనతను జన్నియనివార్త
               యెఱిఁగి పొర్గింటను బెరుగుటయును
     దానవిచనుబాలు త్రావి జీవించుట
               దొంఇగ్లి వెన్నలు మ్రింగుటయును
     జాలరోసి యశోద ఱోలఁ గట్టినసుద్ది
               ముద్దులు గూల్చినపెద్దఱికము
     గొల్లభామలకట్టుకోఁక లెత్తుకపోయి
               పొన్నమ్రానెక్కినపిన్నతనము
గీ. పసులకాపరి వైనట్టిపలుచఁదనము
     చెలఁగి చాటుదు నను రక్షింపకున్న
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.23

సీ. సలలితంబుగ మూఁడునెలలబాలుండవై
               బండిఁ దన్నినయట్టిదుండగంబు
     వలనొప్ప నేఁడాదివాఁడవై యాతృణా
               వర్తునిఁ జంపినధూర్తతనము
     క్రేపులఁ గాచుచోఁ గినిసి బకాసురుఁ
               బట్టిద్రుంచినయట్టిదిట్టతనము
     ఆటలాడుచును వత్సాసురు నదరంట
               సెలగోలఁ గొట్టినబలిమి కలిమి
గీ. ఖరదనుజుఁ గూల్చినట్టియాచుఱుకుఁదనము
     చెలఁగి చాటుదు నన్ను రక్షింపకున్న
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.24
సీ. గోవుల మనుజుల బ్రోవ గోవర్ధన
               గిరిఁ గేల నెత్తినబరవసంబు
     సొంపు మీఱఁగ నాయశోదకు ముఖమున
               లోకముల్ చూపినభీకరంబు
     బలియుఁడవై గోపభామినీమణులను
               దుడుకుపనుల్ సేయుపడుచుఁదనము
     పరమేష్ఠి దాఁచిన బాలవత్సములను
               బ్రతికల్పనము చేయు చతురతయును
గీ. దగిలి కార్చిచ్చు మ్రింగిన తెగువతనము
     చెలఁగి చాటుదు నన్ను రక్షింపకున్న
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.25

సీ. ధట్టించి మల్లయుద్ధమునఁ జాణూరునిఁ
               బట్టిత్రుంచిన యట్టిదిట్టతనము
     అపకీర్తికోడక యవలీలగా మేన
               మామను జంపిన తామసంబు
     అవినీతుఁడగు కాలయవనుని ధాటికి
               వెఱచి పోయినయట్టి పిఱికితనము
     రూఢిగా బావయౌ రుక్మకు ననయుని
               మూతి గొరిగినట్టి ములుచదనము
గీ. అత్త యగురాధ నంటినయపశయంబు
     చెలఁగి చాటుదు నన్ను రక్షింపకున్న
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.26
సీ. పాందవు ల్పంపినపని కియ్యకొనిపోయి
               దూతకృత్యము చేయుకౌతుకంబు
     విహితబాంధవులను విడిచి విదురినింట
               విందారగించిన పొందికయును
     గర్ణదుర్యోధనుల్ దుర్నీతులై పట్ట
               విశ్వరూపముఁ జూపు విభ్రమంబుఁ
     జుల్కదనం బని చేడక విజయుని
               సారథి వైనట్టి పౌరుషంబు
గీ. ఘోటకాసురుఁ దునిమిన పాటవంబు
     చెలఁగి చాటుదు నన్ను రక్షింపకున్న
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.27

సీ. ఎలమి సత్రాజిత్తునిల్లుఁ జూడఁగఁబోయి
               యలశమంతకమణి కాసపడుట
     మణి ప్రసేనుండు ప్రేమను గొనిపోవఁగా
               నీవు మానవులచే నిందపడుట
     జాడపట్టుకపోయి జాంబవతుం డున్న
               గుహఁ జొచ్చి యాతనిమార్కొని నిలుచుట
     ఆభల్లుకేశ్వరుం డాత్మజాతను మణిఁ
               దెచ్చియిచ్చిన బ్రీతిఁ బుచ్చుకొనుట
గీ. తెలిసి యపవాద మెల్లను దీర్చుకొనుట
     చెలఁగి చాటుదు నన్ను రక్షింపకున్న
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.28
సీ. కేళికిఁగలియక చాలఁ గోపించిన
               యాలికి మ్రొక్కినబేలుఁదనము
     వెలఁదిమాతలువిని యలకల్పవృక్షంబు
               నిలకుఁ దెచ్చినయట్టిబలిమికలిమి
     నరకాసురుని జూచి వె!రచి యాసత్యకుఁ
               జేసాచి విల్లిచ్చుకోఁచదనము
     కారియఁ బడియున్నకన్యకాషోడశ
               సాహస్రములమీఁద మోహపడుట
గీ. గొల్లయిల్లాండ్రమానముల్ కొల్లగొనుట
     చెలఁగి చాటుదు నన్ను రక్షింపకున్న
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.29

సీ. ముద్దులుగుల్కునెమ్మోము నిద్దపుఁదళ్కుఁ
               జెక్కులసొబగు నాసికము వెడఁద
     కన్నులు జిగినొప్పుకర్ణము లాజాను
               దీర్ఘబాహువులు విస్తీర్ణవక్ష
     మును సోయగపుమేను తనుమధ్యమమును చిన్న
               బొజ్జయు నునుగాంతిపొడముతొడలు
     చెలువంపుజంఘలు చిఱుతపాదములును
               గలిగి యొప్పులకుప్పకరణిఁ దేజ
గీ. రిల్లు నినుఁ గన్నతల్లి నారీమతల్లి
     దేవకీదేవి భాగ్యంబు దెలియ వశమె
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.30
సీ. లలితముక్తామణిలాలాటికద్యుతుల్
               నిటలంబుమీఁదను నృత్యమాడఁ
     గాంచనరత్నసంగతరశనాఘంటి
               కానినాదము ఘల్లుఘల్లు మనఁగఁ
     గరయుగమంజుల కంకణరోచులు
               గగనభూభాగముల్ గప్పుకొనఁగ
     వెలయంగఁ గరమున వెన్నముద్ద ధరించి
               కొత్తకంబళమున నొక్కింత దాఁచి
గీ. కొనుచు దోఁగాడునిన్నుఁ గన్గొను యశోద
     పుణ్యఫల మింతయని చెప్పఁబోల దౌర
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.31

సీ. ధగధగద్యుతులతొఁ దనరుముత్తియముల
               రావిరేక నుదుట ఠీవిఁ జూప
     రత్నసంఘటిత మై రంజిల్లుమద్దికా
               యలజోడు చెక్కులలరింపఁ
     బులిగోరు నేవళమునఁగల్గునునుకాంతి
               గరిమ యురంబునఁ గప్పుకొనఁగ
     మణిమయమంజులమంజీరనినదంబు
               కడఁగి యొక్కొకసారి ఘల్లుమనఁగ
గీ. తప్పటడుగు లిడుచు నాదనొప్పు నిన్నుఁ
     గన్నతల్లియు భాగ్యము నెన్నవశమె?
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.32
సీ. ఆణిముత్తియముల నమరినకుళ్ళాయి
               శిరమున నొకవింతచెలువు మెఱయఁ
     దళతళ మనుపైఁడితళ్కులకుబుసంబు
               కమనీయతనునీలకాంతు లీనఁ
     బదయుగంబున నున్నపసిఁడిగజ్జలు సారె
               కును ఝుణంఝుణ ఝుణంఝుణ యనంగ
     ముంగిటఁ దిరుగంగ ముద్దులమాతలు
               విని నందుఁ డానందమునఁ జెలంగి
గీ. యయ్య రావోయి యటుపోకు మనుచునిన్నుఁ
     గౌగిలించినతండ్రిది గాక ఫలము
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.33

సీ. బెడఁగైనయట్టిచల్లడము ధరించి పైఁ
               దలుకుబంగరువన్నెదట్టి గట్టి
     చెలువార సందిట నెలవంకజాళువా
               తాయెతుల్ గట్టి కౌశేయశాటి
     వల్లెవాటుగ వేసి వాసిందుకస్తూరి
               తిలకంబు నుదుటనుదీర్చి శిరము
     మూర్కొని చెక్కిళ్ళు ముద్దాడుచును దండ్రి
               రావోయి యనుచు గారాబమునను
గీ. నిన్నుఁ జం కిటు లిడుకొని యున్నమాయ
     శోదసౌభాగ్య మెంతని స్తుతి యొనర్తు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.34
సీ. అమ్మ! ఏమిర యాదవాగ్రణి? గిన్నెదే;
               ఏలరా చషకంబు? పాలు ద్రావ;
     నిపుడు దుగ్ధములులే; వెప్పుడుగల్గును?
               రాత్రికాలమునందు; రాత్ర మెపుడు?
     నంధకారపువేళ; ననినఁ గన్నులు మూసి
               యిదె నిశివచ్చెనే యిమ్ము పాన
     పాత్రంబుఁ దెమ్మని బలిమి యశోదమ్మ
               పైఁటకొం గీడ్చినబాల్యచేష్ట
గీ. లన్నియును జూపరులకుఁ జోద్యంబు లగుచు
     నేత్రపర్వంబులౌ నీ విచిత్రమహిమ
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.35

సీ. వెఱువకదినమును బొరుగిండ్లఁ జొరబడి
               మీఁగడల్ వెన్నలు మెసవి మెసవి
     యుట్లమీఁదటిపాలచట్లు చేయందక
               తగురంధ్రమొనరించి త్రావి త్రావి
     పెరుగుకుందలలోన నురువడి చేవెట్టి
               సొంపుగా నొకకొంత జుఱ్ఱిజుఱ్ఱి
     యొరులు చూడకయుండ నరిగి యెప్పటియట్ల
               తోటిబాలురతోడ నాటలాడి
గీ. కేరి నవ్వుచుఁ దల్లికౌఁగిట వసించి
     తౌర నీచౌర్యమహిమ యేమని నుతింతు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.36
సీ. ఏమిరా కృష్ణ! మ న్నేఁటికిఁ దిన్నావు?
               అమ్మ! నేఁ దినలేదు అయ్యతోడు
     చిన్నవాండ్రందఱు చెప్పిరి గదవోయి
               నీవు వారలమాట నిజము జేసి
     విందువా నేనంతవెఱ్ఱినా శిశువునా!
               ఆఁకొంటినా! చూడవమ్మ నోటి
     వాసన యనుచును వక్త్రంబుఁ దెఱచి లో
               నా యశోదకును బ్రహ్మాండభాండ
గీ. పంక్తులెల్లను దొంతులపగిదిగాను
     బెంపుచేసిననిన్ను వర్ణింప దరమె?
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.37

సీ. తనరంగ నాయశోదాదేవి యొకనాడు
               దధికుంభమున నించి తరుచుచుండఁ
     జని నీవు పెరుఁగుతె మ్మనుచుఁ గవ్వముఁ బట్టు
               కొన్న యాకుండలో గుమ్మఁడనెడు
     బూచి యున్నాఁడురా పొమ్మని బెదిరింప
               గుమ్మణ్ణిచూపవే యమ్మ యనుచుఁ
     గరమునఁ జేలంబుఁ గట్టిగఁ బట్ట నా
               ఘుమ్మనునాదమే గుమ్మడనిన
గీ. నవ్వు మోమునఁ జిల్కఁ జిన్నారిబొజ్జ
     గదల గంతులు వేసినఘనుఁడ వహహ
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.38
సీ. అమ్మ! మీఁగడపాలు తెమ్ము లే లెమ్మని
               పాణిపంకజమునఁ బైఁటఁబట్టి
     తిగిచినమోము [2]నొద్దికచూచి ముద్దాడి
               గిలిగింతలిడుచుఁ గౌఁగిటను జేర్చి
     ఔనుర కృష్ణ! నీ వాఁకలి గొన్నావు
               బువ్వపెట్టెద నని యవ్వధూటి
     మీఁగడపాలతో మేళగించినయోగి
               రముఁ దవనీయపాత్రముననునిచి
గీ. చేతి కందీయ మెసఁగినకౌతుకంబుఁ
     దలఁచి వర్ణింప నెవ్వరి కలవియగునె
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.39

సీ. గోపబాలురతోడఁ గూడి నిత్యంబును
               వత్సంబులను గాయ నుత్సహించి
     నునుబట్టుపచ్చడమును మేనఁగీలించి
               కనకచేలము బిగికాసెఁగట్టి
     పదముల రంజిల్లఁ బాదుకల్ ధరియించి
               కరమున సెలగోల నెఱయఁ బట్టి
     క్రేపుల నదలించి కేరుచుఁ జెలికాండ్రఁ
               జేరుచుఁ జిరునవ్వు చిల్కుమోము
గీ. పూర్ణచంద్రునిరీతి బొలుపుమిగిలి
     వెలయునీగోపవేషము చెలువుఁదలఁతు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.40
సీ. మౌళిపైఁ జుట్టినమాయూరబర్హంబు
               బలభేదికార్బుకప్రభలు గాఁగ
     భువనమోహన మనమురళీనినాదంబు
               పటుతరస్తనితశబ్ధంబు గాఁగ
     ఘనతరోరఃకనత్కౌస్తుభమణికాంతి
               లాలితచంచలాలతిక గాఁగఁ
     గమనీయదృక్కోణకరుణారసంబులు
               రాజితవర్షనీరములు గాఁగఁ
గీ. బ్రావృడంబుదతుల్యవిగ్రహము సొంపు
     లలర బృందావనంబున వెలసి తౌర
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.41

సీ. ఏకాంతి గని గోవు లిది కలిందాత్మజా
               జల మనుశంకచేఁ జనును ద్రావ
     నేదీప్తినీక్షించి యిది వలాహక మని
               మత్తమయూరముల్ నృత్తమాడు
     నేరుచిఁ జూచి యాభీరకాంతలు తమా
               లదళంబు లివియని చిదుమఁదలఁతు
     రేశోభఁ గనుఁగొని యిలలోన శిశువులు
               సరసజంబూఫలేచ్చను జెలంగి
గీ. రట్టి భదీయమూర్తిమహఃప్రభావ
     మితరులను భ్రాంతి నొందించుటెంతయరుదు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.42
సీ. ఆపీతదుగ్ధమై యభినవనవనీత
               సంస్నిగ్ధమై ఘనసదృశమగుచుఁ
     గోమలతాపించగుచ్చసమాన మై
               ముగ్ధమై దధికణదిగ్ధ మగుచు
     నమలకేకీంద్రబర్హాలాంచితము నయి
               వాసవోపలసువిలాస మగుచు
     నలరుయుష్మద్విగ్రహము భక్తజనమనో
               వాంచితంబును దీర్చు నంచితముగ
గీ. భువనమోహనరూప విస్ఫూరితశార్ఙ్గ
     చాప యదుకులభూషణ చక్రహస్త
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.43

సీ. తతగోఖురోద్ధూతధరణీపరాగంబు
               గప్పినకుంతలాగ్రంబుతోడ
     సంచరణాయానజనితఘర్మాకంబుకం
               దళిశోభితామలాననముతోడ
     నధ్రబింబాసక్తపృథులవేణూద్భవ
               సవ్యమాధుర్యగానంబుతోడ
     భద్రదంతావళప్రతిమానయానంబు
               తోడ గోపాలురతోదఁ గూడి
గీ. సంజకడ నీవు రాఁజూచి సంభ్రమమున
     ఘోషకాంతలు నీపొందుఁ గోరి రౌర
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.44
సీ. ఒకనాడు గోపికాయూధంబుతోఁ గూడి
               కడిమిమైఁ జని కుప్పిగంతులిడుచు
     నొకసారి గుమిగూడి యుల్లాసమునఁ బూని
               జోడుదాఁగిలిమూఁత లాడుకొనుచు
     నొకవేళ ముదమున నుప్పొంగి కొలఁకుల
               సారెకు జలకేళి సలుపుకొనుచు
     నొకమాటు నవకుసుమోదయవనములఁ
               బువ్వుల నొండొరుల్ రువ్వుకొనుచు
గీ. జెలఁగి యిచ్చావిహారంబుఁ జేయునీదు
     శైశవక్రీడ లేమని చెప్పువాఁడ
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.45

సీ. ఏరుచి వదనపంకేరుహాసంగిభృం
               గనివహవ్యామోహకరముఁ దాల్చు
     నేబెడం గమలముఖేందుమండలమున
               సలలితలాంఛనశంకఁ జూపు
     నేకాంతి కుంతలానీకసూర్యాత్మజా
               రమణీయకుల్యాభ్రమము వహించు
     వేఛవి దృష్యమాణేందీవరేక్షణా
               చిత్తజబాణమై చెలువు నెఱపు
గీ. నట్టికస్తూరితిలకముఁ బెట్టి నుదుట
     సతుల వలపించుటకు నెఱజాణ వీవె
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.46
సీ. ఏరవం బభినవాభీరకామినులను
               వశలఁగ మోహప్రవశలఁ జేయు
     నేనినాదము సూరిమౌనిసంఘములకు
               శ్రావ్యమై చిరకాలభవ్య మొసఁగు
     నేధ్వని [3]మృగగోపతండములకు మనో
               హరముగాఁ దాపాపహరము చేయు
     నేశబ్ధ మసురకులేశవినాశన
               కరముగాఁ హృదయభీకరముఁ జూపు
గీ. నౌర! నీకేలఁ బట్టినచారువంశ
     నాలనినదంబు లంతవిన్నాణ మయ్యె
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.47

సీ. శుండంబు నవనీతసుందరగంధవా
               హాలంకృతంబుగా నలరుచుండ
     మాటలు తస్కరకోటియుక్తివ్యాజ
               పాటనంబున మీటి తేటపడఁగఁ
     గన్నులు కుహనాప్రకారభాసురములై
               జారవిలాససంచరతఁ దెలుపఁ
     దరుణాంఘ్రిపంకజద్వంద్వంబు సారెకుఁ
               బటుతరతాండవభ్రమము నెఱప
గీ. సొబగు మీఱిననినుఁ జూచుసుదతు లెల్లఁ
     బంచశరసాయకంబులపాలు గారె
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.48
సీ. ఎవ్వనిమృదుభాష లిందుబింబాననా
               శ్రవణరంధ్రములకుఁ జవులు గఱపు
     నెవ్వనిక్రేఁగంట నెసఁగినచూడ్కులు
               కామినీహృదయముల్ గఱఁగఁజేయు
     నెవ్వనిమోవి పైనవ్వు భామాజన
               వరలోచనోత్సవకరము నెఱపు
     నెవ్వనిసుందర మిక్షుకోదండుని
               భంగి నింతులనెల్ల భ్రమయఁ జేయు
గీ. నట్టినీమోహనాకార మవనిలోన
     వలపుఁ బుట్టింపదే పతివ్రతలకైన
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.49

సీ. పంతగింపుచు గోపబాలురతోఁగూడి
               కందుకక్రీడలఁ జెందుచున్న
     తఱి నొక్కఘోషసుందరి పొడచూపినఁ
               గడువేగ నాకాంతఁ గదియఁబోయి
     యిదె బంతివచ్చె నోయెలనాఁగ నీపైఁత
               కొంగుఁ జాపు మటంచుఁ గుదియఁబట్టి
     కుచములపై నఖకోరకంబులు నిల్పి
               యరసిన బంతి లేదంచు మరలి
గీ. మొలకనవ్వులు మోముపైఁ జిలుకవచ్చు
     నట్టినీచతురత్వ మేమని వచింతు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.50
సీ. మందకుఁ జనుచున్నమందయానను జూచి
               వెనుకొనిపోయి వేవేగఁ గదిసి
     పెండ్లికూఁతుర నీదుపెనిమిటిపేరేమి
               చెప్పుమా యని కేళు చేతఁ బట్టి
     నలుదిక్కు లీక్షించి బలిమిఁ గౌఁగిటఁ జేర్చి
               ఘనమాలతీకుడుంగమున నునిచి
     కరములఁ బాలిండ్లు గదియించి బిరబిర
               పలుచనికెమ్మోవిఁ బంట నొక్కి
గీ. మారుకేళిని గూడినబేరజంపు
     చర్యఁ దలపోయ జనుల కాశ్చర్యమయ్యె
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.51

సీ. పొరుగూరఁ జల్లమ్మఁబోయినగొల్లయి
               ల్లాండ్రను ద్రోవలో నడ్డగించి
     వనితలారా మీకు వల్లభు లెవ్వార
               లెందుండుదురు మీర లేకతమునఁ
     జిక్కితిరిఁక నేమిచేతురు నాతోడ
               మదనకేళికి రండు ముదముతోడ
     ననుచు జంకించి యవ్వనరుహనయనలఁ
               బొదరిండ్లలోఁ దార్చి భూరిసత్వ
గీ. శాలివై యందఱికి నన్ని చందములను
     నల్లపని చేసి విడిచినబల్లిదుఁడవు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.52
సీ. కౌతుకంబున ఘోషకాంతలు యమునాన
               దీజలకేలిని దేలుచున్న
     సమయంబుఁ జూచి వేచని వారివస్త్రంబు
               లన్నియు గొనిపోయి పొన్న యెక్క
     నతివ లంశుకవిహీనాంగనలై లజ్జించి
               యతనుమందిరముల హస్త మిడుచు
     వలువలిమ్మని వేఁడ వనితలారా చేతు
               లెత్తి మ్రొక్కినఁ జీరలిత్తు ననుచు
గీ. కీరవాణులచేత మ్రొక్కించుకొనుట
     యెంత వింతని నే విన్నవింతు నౌర
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.53

సీ. కుసుమాపచయకాంక్ష గోపిక్క ల్వనవాటి
               కేగినజాడల నెఱిఁగి వెంటఁ
     బడిపోయి వనములోఁ బడఁతులఁ గనుఁగొని
               యింతులార! సుమము లిచట లేవు
     ముందట మల్లెలు మొల్లలు గలవని
               తప్పుమాటలు కొన్ని చెప్పి పొదలు
     చొరఁదీసి బలిమిచేఁ బరిరంభణము చేసి
               యధరబింబామృతం బాని యూని
గీ. సురతకేళిని వేర్వేఱఁ జొక్కఁ జేసి
     తౌర నీవెంతనేర్పరి వని వచింతు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.54
సీ. పా లమ్మఁజనుగొల్లపడఁతులవెనువెంట
               బరిగి కాననభూమి నడ్డగించి
     బలిమిచే నొకయింతి పాలిండ్లు చెనకుచు
               మురియుచు నొకకాంతమోవి నొక్కి
     సుందరి నొక్కర్తుఁ జూచి చెక్కిలి మీటి
               కామిని నొక్కర్తుఁ గౌఁగిలించి
     ముదముతో వారిని మోహవశలనుఁ గా
               వించి కంతునికేళి వేడ్కలలర
గీ. నందఱికి నన్నిరూపులై పొందినట్టి
     నీదుచాతుర్యమహిమ వర్ణింప వశమె
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.55

సీ. బృందావనమున నాభీరకాంతలనెల్ల
               దినదినంబును బల్మి నొనరఁగూడి
     మాపటివేళల నేపార నిండ్లకుఁ
               జని పురుషులు లేని సదనములను
     జొచ్చి కన్యలఁ జూచి మచ్చిక నచ్చిక
               బుచ్చిక ల్గావించి పొందుగాను
     సరసంబు లాడుచుఁ జక్కిలిగింతలు
               పెట్టుచు వారలగుట్టు లరసి
గీ. పాన్పుమీఁదటఁ గ్రుంగిలఁబడఁగఁ దిగిచి
     ప్రథమసురతంబుఁ గావించుప్రౌఢ వౌర
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.56
సీ. నందునిసోదరి సుందరీమణి రాధ
               యొకనాఁడు నీసొబ గొనరఁ జూచి
     రారకృష్ణా యని గారవంబునఁ బిల్వఁ
               జని నీవు ప్రేమ నవ్వనరుహాక్షి
     మిసమిసమను మేనిపసఁ జూచి సిబ్బెపు
               గబ్బిగుబ్బలసోయగంబుఁ గాంచి
     తత్తరంబునను మేనత్తని తలంచక
               చేరి కౌఁగిటిలోనఁ జేర్చి కూర్మి
గీ. నతనుకేళిని దేల్చినవితతచరిత
     మెంత వింతని సారె వర్ణింతు నహహ
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.57

సీ. రాధావధూటి నిరంతరప్రేమాతి
               శయభవదర్పితస్వాంత యగుచు
     దధిరిక్తమైనట్టిపృథులకుంభమున
               మంథదండంబుఁ బల్మారు పూని
     తఱచఁగ నీవును దత్కుచస్తంభచం
               చలలోలదృష్టిచే నలరి ధేను
     దుగ్ధదోహనమునకై తొడరి యాఁబోతును
               బిదుకంగఁ బోవుట విదితమయ్యె
గీ. నౌర విహ్వలచిత్తులై యలరినట్టి
     యుభయమోహంబు లెంతనియభినుతింతు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.58
సీ. యమునాతటంబున నమరంగ నొకరాత్రి
               నవ్యమాధుర్యగానంబు సేయ
     వినిగోపకాంతలు విహ్వలస్వాంతలై
               పతులను సుతులను బరగ విడిచి
     వచ్చి భవన్ముఖవనజంబు బొడగాంచి
               విరహాగ్నితప్తలై వేఁడుకొనినఁ
     గరుణించి యాఘోషకామినీజనముల
               కన్ని రూపములఁ బ్రియం బొనర్చి
గీ. రాచకేళిని దేల్చినప్రాభవంబుఁ
     జూచి వర్ణింపఁగాఁ దమ్మిచూలివశమె
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.59

సీ. ముదముతో రుక్మిణి గదిసి వీడె మొసంగఁ
               దగ సత్యభామ గంధంబుఁ బూయ
     జాంబవతీకన్య చామరంబులు వీవ
               మిత్రవింద విపంచి మేళవింప
     భద్ర దా శ్రీపాదపద్మంబు లొత్తంగఁ
               బరగ సుదంత దర్పణముఁ జూపఁ
     గాళింది నవపుష్పమాలిక లొసఁగంగ
               లక్షణ శయ్య నలంకరింప
గీ. స్త్రీలు కొలువున్న వేళలఁ చిత్తభవుని
     బలెను శృంగారరసము నీకలరె నౌర
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.60
సీ. బాణునివీటిలోపల ననిరుద్ధుండు
               రుద్ధుఁడై పడియున్న రోష మొదవి
     చని వానివాఁకిట నొనరంగఁ గాపున్న
               హరుని బాణాహతి నురువడించి
     యారక్కసునితోడ నడరి కయ్యముచేసి
               చతురంగబలములఁ జదియఁగొట్టి
     సాహసంబున ఘనచక్రధారను బాణ
               దనుజునిబాహువుల్ దునిమి వైచి
గీ. విజయశంఖంబుఁ బూరించువేళఁ జూడ
     వీరరస మెల్ల నీయందె వెలసె నౌర
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.61

సీ. ధరణిలో నొకవిప్రవరుఁడు కుచేలుండు
               నిరుపేఁద యైయుండి నెమ్మినొక్క
     నాఁడు భవద్దర్శనముఁ గోరి తనజీర్ణ
               పటముకొంగునఁ గొణిదెఁ డటుకు లునిచి
     కొనివచ్చి నినుఁ గాంచి యొనర దీవించిన
               నేమితెచ్చితి వని ప్రేమతోడ
     నరసి యాపృథుకముల్ కరమున నిడుకొని
               భక్షణం బొనరింప దత్క్షణమున
గీ. వితతసామ్రాజ్యవిభవసంగతునిఁ జెసి
     నట్టికరుణారసంబు నీకమరె నౌర
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.62
సీ. బలభేది యలుకతొఁ బటుతరమేఘజా
               లములను విడిచి శిలాప్రయుక్త
     వర్షంబుఁ గురియింప వల్లవజనమును
               గోవులు భీతి నాకులత నొంద
     వీక్షించి మీరేల వెఱచెద రని వారి
               నందఱ నావులమందఁ దోలు
     కొనుచు రమ్మని పోయి గోవర్ధనాచలం
               బిరవుగా నొకకేల నెత్తిపట్టి
గీ. సర్వజీవుల నెల్ల రక్షనముచేసి
     నట్టియద్భుతరసము నీ కలరె నౌర
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.63

సీ. రుక్మిణికొఱకునై రూఢిగా భీష్మక
               నగరంబుఁ జొచ్చి యాఖగకులేంద్రుఁ
     డమరనాథుని గెల్చి యమృతంబుఁ గైకొన్న
               కరణి చైద్యాదుల నురువడించి
     పుష్పగంధిని గొనిపోవఁగ రుక్మకుం
               డదె పోకుమని వెంటనంటి వాఁడి
     నారసంబులనేయ నవ్వి యాతనిఁబట్టి
               బావ రమ్మని శితభల్లములను
గీ. దలయు మూతియు రేవులై తనర గొరిగి
     నట్టి హాస్యరసంబు నీకలరె నౌర
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.64
సీ. మధురాపురంబు నెమ్మది నేలుచుండంగఁ
               జతురంగబలసముచ్చయము తోడ
     నడరి జరాసంధుఁ డతికోపఘూర్ణిత
               హృదయుఁడై దాడిగాఁ బొదివి నిన్నుఁ
     గదనంబునకుఁ బిల్వ మదిలోన నూహించి
               నగరంబు వెడలి కాననముఁ జొచ్చి
     కొండఁ బ్రాఁకినఁ జూచి ఘోరదావానలం
               బిడిన నందుండక కడురయమున
గీ. ద్వారకాపుర మిరవుగాఁ జేరి యుండి
     నట్టి భయరస మవ్వేళ కలరె నౌర
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.65

సీ. ధరనిఁ బౌండ్రకుఁడనునరపాలకుడు భవ
               చ్చిహ్నము ల్దాల్చి ప్రసిద్ధము
     వాసుదేవుఁడ నేను వసుధలో నాకంటె
               విక్రమశాలి యేవీరుఁడనుచు
     దూతనంపిన విని తొడఁబడ వానిపైఁ
               జని రోషమున ఘోరసంగరమునఁ
     బటుశరవహ్నిచే బలముల సమయించి
               కరితురంగములఁ జీకాకుచేసి
గీ. యతనితలఁద్రుంచి వైచినయట్టితఱిని
     జెలఁగి బీభత్సరసము నీకలరె నౌర
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.66
సీ. కౌరవపాండవుల్ ఘోరయుద్ధముఁ జేయు
               తఱి నరసారథిత్వము వహించి
     యరదంబుఁ గడపంగ నురవడి భీష్ముండు
               విజయునిపై బాణవిసరములను
     జొనిపి గర్వము మీఱి సునిశితశరమును నీ
               యురము నాటించినఁ గెరలి నీవు
     ధరణిపైఁ గుప్పించి యురికి చక్రము చేతఁ
               బట్టి యామిన్నేటిపట్టిమీఁద
గీ. నరుగఁ బార్థుండు మన్నింపు మని మరల్చు
     నపుడు రౌద్రరసంబు నీకలరె నౌర
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.67

సీ. ధర్మపుత్రుఁడు మహాధ్వరముఁ జేసెడువేడ్కఁ
               బూని నానాదేశభూపతులను
     బిలిపించి హితబంధువులను రావించి పే
               రోలగం బుండెడువేళయందుఁ
     బటుమదాంధుఁడు శిశుపాలుండు నినుఁ జూచి
               పూర్వవైరముఁ దలపోసి కొన్ని
     ప్రల్లదంబులు వల్కఁ బ్రతిభాషలాడక
               యూరకుండితి వేమికారణంబొ
గీ. కాని తెలియదు లోకప్రకాశమైన
     శాంతిరస ముప్పతిల్లె నీసమ్ముఖమున
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.68
సీ. సతులు శృంగారంబు దితిజులు వీరంబు
               భూసురు ల్కరుణ యద్భుతము జనులు
     హాస్యంబు రుక్మకుం డలజరాసంధుండు
               భయము పౌండ్రకుఁడు బీభత్సరసము
     రౌద్రంబు భీష్ముండు రమణీయశాంతంబు
               శిశుపాలుఁ డెఱుఁగంగఁ జేయునట్టి
     నవరసాలంకారభవదీయనామంబు
               పగనైన వగనైన బాంధవమున
గీ. నైన భీతిని నైన యిం పొనరఁ దలఁచు
     నరుల కంటనిదందురు దురితచయము
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.69

సీ. న్యాయమార్గముఁ దప్పి నరులను వేధింప
               రాజు గాఁదతఁడు తరాజు కాని
     పతిభక్తి విడిచి సంపద నొందు జవరాలు
               ఆలుగాదది నీచురాలు గాని
     తల్లిదండ్రులమాట దాఁటిన సుతుఁడు దా
               సుతుఁడు గాఁడతఁడు కుత్సితుఁడు గాని
     అతిథిభాగవతుల నర్చింపలేనిల్లు
               యిల్లుగాదది వట్టిపొల్లు గాని
గీ. పరమధర్మజ్ఞుఁడే రాజు భక్తిగలది
     యాలు సుగుణుండె కొడుకు పూజార్హ మిల్లు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.70
సీ. కరణంబు కాఁపులు గలహించుచుండిరా
               యూరుగా దది లత్తుకోరు గాని
     అర్థులు వేఁడిన నడియాస వెట్టెనా
               దాతగాఁ డాతడు ప్రేత గాని
     ధనమిచ్చుదాతపద్యము చదువఁడ యేని
               వందిగాఁ డాతడు పంది గాని
     సురుచిరసచ్ఛబ్దశుద్ధి లేకుండెనా
               సుకవికాఁ డాతఁడు కుకవి గాని
గీ. వైర ముడిగిన దూరిడువాఁడె దాత
     చదువు గలవాఁడె భట్టు, వాగ్ఝరుయె సుకవి
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.71

సీ. వినయంబు గలకాంత విడిచి వర్తించెనా
               విభుఁడు గాఁడతడు రాసభుఁడు గాని
     గురుమంత్ర మెదలోన గుప్తంబు సేయఁడే
               నరుఁడు కాఁడతఁడు వానరుఁడు గాని
     ప్రేమతోఁ జన్నిచ్చి పెంచకయుండెనా
               తల్లిగాదది మాఱుతల్లి గాని
     ప్రభువు చెప్పినయట్టి పనికి మాఱాడెనా
               భటుడు గాఁడతఁడు దుర్భటుఁడు గాని
గీ. గుణము గలవాఁడె పతి మంత్రగోప్త జనుఁడు
     పెంచినది మాత పనులు గావింప బంటు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.72
సీ. అమయఘ్నం బైనయౌషధజ్ఞుడు గాని
               వెజ్జు గాఁడాతఁడు జజ్జు గాని
     చతురుపాయంబులసరణిఁ దెలియనిమంత్రి
               మంత్రి గాఁడతఁడు దుర్మంత్రి గాని
     విదితనానాశాస్త్రవేది గానిబుధుండు
               బుధుఁడు గాఁడతఁడు బుద్బుధుఁడు గాని
     శమద్మానుష్ఠానసమితిఁ దాల్పక యున్న
               దపసి గాఁడతఁడు కుతపసి గాని
గీ. [4]ప్రాజ్ఞుఁడే వెజ్జు సదుపాయపరుఁడె సచీవుఁ
     డర్థవేదియె సురి బ్రహ్మజ్ఞుఁడె ముని
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.73

సీ. ప్రియముతో రమ్మని పిలిచిపెట్టనికూడు
               కూడు గాదది పుట్టగూడు గాని
     భోగదానములనుఁ బొందరానిధనంబు
               ధను గాదది వన్నెదనము గాని
     సత్యవాక్యము నిల్పఁ జాలనినరుజిహ్వ
               జిహ్వ గాదది గోధిజిహ్వ గాని
     పరుల కుపకారంబు పట్టిసేయని బ్రతుకు
               బ్రతుకు గాదది రోఁతబ్రతుకు గాని
గీ. దయగలది భోజ్య మక్కరధనము ధనము
     నిలుకడది నాల్క యుపకృతినియతి బ్రతుకు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.74
సీ. సరసాన్నములఁ దృప్తిసలుపఁజాలని పెండ్లి
               పెండ్లి గాదది దూబపెండ్లి గాని
     అరసి తారతమ్యము లెఱుంగని పెద్ద
               పెద్ద కాఁడాతఁడు గ్రద్ద గాని
     వినయమ్ము లేక వేవే లొసంగిన యీవి
               యీవి గాదది మంటిదీవి గాని
     బంధువుల్ సమ్మతపడనట్టిశుభము దా
               శుభము గాదది విపన్నిభము గాని
గీ. తృప్తిఁ బొందినదే పెండ్లి, తీర్పే పెద్ద
     తనదువినయమె యీవి బాంధవమె శుభము
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.75

సీ. వల పెంతగల్గిన వారకాంతలమాట
               మాట గా దది నీళ్ళమూట గాని
     కుల మెంతగల్గినఁ గులహీనుతోఁ జెల్మి
               చెల్మి గా దది పాముచెల్మి గాని
     నెల వెంతకల్గిన నీచులతోఁ బొందు
               పొందు గా దది పెట్టుమందు గాని
     ధన మెంత గల్గినఁ దా విజాతులసేవ
               సేవ గా దది చెడుత్రోవ గాని
గీ. మాననిది మాట సుగుణిది మంచితనము
     ఘనునితొఁ బొత్తు సత్కులజునిది సేవ
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.76
సీ. పరగ శ్రీవైష్ణవార్పణము సేయనికల్మి
               కల్మి గా దది పెద్దకొల్మి గాని
     పరమభాగవతసంస్పర్శఁ జెందని నోము
               నోము గా దది పెనుగోము గాని
     హరిదాసచరణానుసరము గానిజలంబు
               జలము గా దదియె కజ్జలము గాని
     కమలాక్షభక్తసంగతిఁ గోరనిత్రిదండి
               దండి గాఁ డతఁడు త్రిదండి గాని
గీ. వైష్ణవార్పణసిరి భాగవతమె నోము
     ముక్తసంగుఁడె యతి తీర్థములె పదములు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.77

సీ. స్థిరబుద్ధితో నినుఁ జింతసేయనిదినము
               దినము గా దదియె దుర్దినము గాని
     వితతమౌ నీకథ ల్వినకయుండిన చెవుల్
               చెవులు గా వవి కొండగవులు గాని
     భవదీయనామము ల్పలుకకుండిననోరు
               నోరు గా దది డక్కతీరు గాని
     సొంపుగా నీమూర్తి సొబగుఁ గాననికనుల్
               కనులు గా వవి నీటిదొనలు గాని
గీ. చింతగలదియె తిధి విన్కిఁజెలఁగు శ్రుతులు
     పఠనగలదియె నోరు చూపరయ కనులు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.78
సీ. సతతంబు నీప్రదక్షిణము సేయనికాళ్ళు
               కాళ్ళు గా వవి మరగాళ్ళు గాని
     అనయము నీపదార్చనము సేయనికరము
               కరము గా దది దర్వికరము గాని
     భవదలంకృతసుమభ్రమితఁ జెందనిముక్కు
               ముక్కు గా దది పందిముక్కు గాని
     చేరి యుష్మత్కథల్ చింతసేయనిబుద్ధి
               బుద్ధి గా దది పాపవృద్ధి గాని
గీ. వలగొనిన వంఘ్రులును పూజగలవి చేతు
     లలరువాసనఁగొన నాస మతిశమవతి
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.79

సీ. మంత్రప్రభూత్సాహ మహితశక్తిత్రయం
               బును రజస్సత్వతమోగుణంబు
     లును దానధర్మపరోపకారంబులు
               వరభవిష్యద్భూత వర్తమాన
     ములు లయస్థితి జన్మములు శైత్యమాంద్యసౌ
               రభ్యాది లక్షణత్రయము లెఱిఁగి
     సరసవేదపురాణ శాస్త్రేతిహాసాది
               విద్యాచతుష్టయ విభవ మరసి
గీ. నడచుకొను మానవేశుండు పుడమిలోనఁ
     బ్రణుతిఁ గాంచును దా సభాపతి యనంగ
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.80
సీ. ఘనమనోవాక్కాయకర్మంబులను ధర్మ
               కామార్థమోక్షము ల్ప్రేమ నెఱిఁగి
     రథగజాశ్వపదాతిరమణీయచతురంగ
               బలసమేతుఁ డగుచు బ్రహ్మచారి
     భిక్షువాసప్రస్థపితృమాతృబంధుగృ
               హస్థులఁ గరుణచే నరసికొనుచుఁ
     దగ సామఋగ్యజురధర్వణవేత్తలౌ
               భూసురోత్తములను బూజచేసి
గీ. వెలయు నరపాలచంద్రుఁ డీయిలను ముగులఁ
     బ్రణుతి కెక్కును దా సభాపతి యనంగ
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.81

సీ. అరయఁ బ్రభాతమధ్యాహ్నసాయంకాల
               ములను సంధ్యాదికములను దీర్చి
     ఘనతరాహవనీయగార్హపత్యసుదక్షి
               ణాగ్నిహోత్రులకు హవ్యము లొసంగి
     యంశుకాభరణగంధాదిచతుర్విధ
               శృంగారములఁ గడు రంగు మీఱి
     ధరణిఁ గృతత్రేతద్వాపరకలియుగ
               ధర్మప్రవర్తనఁ దనరఁ బ్రజలఁ
గీ. గరుణ నేలినరాజశేఖరుఁడె జగతిఁ
     బరిఢవిల్లును దా సభాపతి యనంగ
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.82
సీ. భూజలతేజోనభోవాయుపంచక
               భూతాత్మకుఁడ వని బుద్ధి నెఱిఁగి
     యలరుప్రాణాపానవ్యానాదిప్రాణవా
               యువు లున్నఠావుల యుక్తిఁ దెలిసి
     రూఢ శబ్ధస్పర్శరూపరసగంధంబు
               లేనింటియందలి యెఱుక గలిగి
     త్వక్చక్షుశ్రోత్రజిహ్వాఘ్రూణనిర్మల
               పంచేంద్రియంబులఁ బదిలుఁ డగుచు
గీ. వెలయు భూపాలముఖ్యుఁ డీవిశ్వమునను
     బ్రస్తుతికి నెక్కు దా సభాపతి యనంగ
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.83

సీ. మాఘరఘువంశకుమారసంభవమేఘ
               సందేశ భారవిసముదయార్థ
     మెఱిఁగి భాట్టప్రభాకరతర్కమీమాంస
               వేదాంతవైశేషికాదికములు
     దెలిసి వ్యాకరణజౌతిషకల్పశిక్షాని
               రుక్తఛందస్సుల యుక్తికలిగి
     యాజనాథ్యాపకాధ్యయనదానప్రతి
               గ్రహయజనాఖ్యషట్కర్మనిరతు
గీ. లైనవిప్రుల నరసినమానవేశుఁ
     డతులగతి నొప్పుఁ దా సభాపతి యనంగ
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.84
సీ. ఘనహరిశ్చంద్రసగరపురూరవనల
               పురుకుత్సకార్తవీర్యులచరిత్ర
     మెఱిఁగి పౌరాణికపరిహాసవిద్వాంస
               భటకవిసప్తాంగభరితుఁ డగుచు
     ధనధాన్యవస్తువాహనమిత్రసంతాన
               బాంధవాద్యష్టసంపదలు గలిగి
     నిధితటాకారామనిర్జరాలకృతి
               భూసురస్థాపనపుత్రు లనెడు
గీ. సప్తసంతానములను బ్రశస్తుఁడైన
     ప్రభువునకుఁ జెల్లుఁ దా సభాపతి యనంగ
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.85

సీ. భోజనవస్త్రతాంబూలగంధప్రియ
               కామినీసంగీతకనకభూష
     ణాదుల మేదుశయ్య లనఁ దగు నష్టభో
               గము లనుభవింపుచుఁ గటుకాషాయ
     తిక్తాంలమధురవార్ధిజముఖ్యషడ్రస
               ముల నెఱుఁగుచుఁ భక్ష్యభోజ్యలేహ్య
     పానీయచోష్యసుపంచవిధాహార
               ముల నతిథులఁ దృప్తి బొందఁజేసి
గీ. చెలఁగి విహరించుమనుజుఁడే క్షితితలమునఁ
     బ్రతిభఁ గాంచును దా సభాపతి యనంగ
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.86
సీ. వీర బీభత్ససృంగారకరుణాద్భుత
               శాంతాదినవరసస్వాంతుఁ డగుచుఁ
     గులరూపయౌవనస్థలధనవిద్యాప్ర
               భృత్యష్టమదములఁ బెనఁగుగొనక
     నిధిజలపాషాణనిక్షేపకక్షోణి
               కాగామిసిద్ధస్వాస్థ్యంబు లనెడి
     యష్టభోగములతో నైనగృహారామ
               క్షేత్రముల్ భూసురశ్రేణి కొసఁగు
గీ. పురుషసింహుండు వెలయు నీపుడమిలోన
     వితతయశుఁ డనఁ దా సభాపతి యనంగ
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.87

సీ. శాల్మిలిప్లక్షకుశక్రౌంచపుష్కర
               శాంకజంబూద్వీపసరణి విజయ
     శాసనంబులు నిల్పి చంద్రసూర్యాంగార
               కాదిగ్రహబలవిహారుఁ డగుచు
     సంస్కృతమగధపైశాచికప్రాకృతా
               పభ్రంశకాద్యష్టభాష లెఱిఁగి
     శబ్ధవిరోధదుస్సంధిపునరుక్తి ఛం
               దోభంగముఖదశదోషరహితు
గీ. లైనకవిరాజులను బ్రీతి నరసికొనినఁ
     బ్రాజ్ఞుఁడై యొప్పుఁ దా సభాపతి యనంగ
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.88
సీ. అంగలాటదశార్ణ కాంగకాంభోజకే
               కయఘూర్జరకిరాతగౌళసాల్వ
     బాహ్లికశాల్మలబార్బరనేపాళ
               పాంచాలమలయాళపాండ్యమత్స్య
     సౌరాష్ట్రకోసలసౌవీరటెంకణ
               కొంకణగాంధారకురుయుగంధ
     రాంధ్రకళింగమహారాష్ట్రమాళవ
               ప్రముఖఛప్పన్నదేశములభాష
గీ. లెఱిఁగి ధర్మప్రవర్తనఁ దిరుగురాజు
     భాసిలుచు నుండుఁ దా సభాపతి యనంగ
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.89

సీ. కేశవ మాధవ కృష్ణ హృషీకేశ
               వామ నాచ్యుత హరి వాసుదేవ
     దామోద రానిరుద్ధ జనార్ధన నృసింహ
               ప్రద్యుమ్న గోవింద పద్మనాభ
     నారాయణోపేంద్రధీర మధుసూధన
               శ్రీధ రాధోక్షజ శ్రీశ విష్ణు
     సత్పుండరీకాక్ష సంకర్షణ త్రివి
               క్రమ యనునామముల్ క్రమముతోడ
గీ. నేనరుండైనఁ బఠియింప నిహపరముల
     సౌఖ్య మొసఁగుదువఁట యెంతసదయమతివి
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.90
సీ. ధరలోన నేజాతినరుఁడైన శంఖచ
               క్రాంకితుఁ డై భక్తి నలరెనేని
     ఛిద్రోర్ధ్వపుండ్రంబుఁ జన్నుమీఱ ధరించి
               దాసనామంబునఁ దనరెనేని
     మదిని అష్టాక్షరీమంతజపం బొన
               రించి వనమాల వహించునేని
     సద్గురుకృపచేతఁ జరమార్థవిభవంబుఁ
               దెలిసి పరతంత్రుఁ డై నిలిచెనేని
గీ. యతని కలుషము లెల్లను హతముచేసి
     పరమపద మిత్తువఁట యెంతసరసమతివి
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.91

సీ. ప్రహ్లాద నారద బలి భీష్మ రుక్మాంగ
               దార్జున పుండరీ కాంబరీష
     సనకసనందన శౌనక వ్యాస ప
               రాశర ధ్రువ బాదరాయణ గుహ
     విదుర విభీషణ వినతాతనూభవ
               గజరాజ వాల్మీకి భుజగనాథ
     పవనతనూజ యుద్ధవ వసిష్ఠాదిభా
               గవతోత్తములు నీదుకరుణఁ బడసి
గీ. తావకీయాంఘ్రి సేవలఁ దగిలి జన్మ
     రహితులై కాంచి రట భన్మహితపదవి
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.92
సీ. హలకులిశాంకుశ జలజశంఖరథాంగ
               కల్పకరేఖాప్రకాశితములు
     అభినవవికసనహల్లకదళనిభ
               పరిపూర్ణశోణభాభాసురములు
     హరజటాజూటనృత్త్యత్తరంగోజ్జ్వల
               గంగానదీజన్మకారణములు
     అఖిలమౌనీంద్రహృదంతర రంగస్థ
               లస్ఫురన్నాట్యవిలాసములును
గీ. భద్రకరములు భవదీయపదయుగములు
     నామనోవీధి నిలుపవే నలిననాభ
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.93

సీ. సకలయోనులయందు జన్మించి జన్మించి
               దినమును బొట్టకై తిరిగి తిరిగి
     యున్మత్తవృత్తిచే నుప్పొంగి యుప్పొంగి
               పంచేంద్రియవ్యాప్తిఁ బరగి పరగి
     కలుషజాలంబులు గావించి కావించి
               మొగిని సంసారాబ్ధి మునిఁగి మునిఁగి
     తనుజరాభారంబుఁ దాలిచి తాలిచి
               నరవిఁ గొన్నాళ్ళకుఁ జచ్చి చచ్చి
గీ. మరలఁ బుట్టంగలేక నీచరణయుగళ
     సేవఁ గోరితి నను దయఁ గావవలయు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.94
సీ. మర్యాదరహితుఁడ మదనపరవశుండ
               వంచనాపరుఁడను గొంచెగాఁడఁ
     గఠినహృదయుఁడ దుష్కర్ముఁడ నీచుండ
               గురుపాతకుఁడ గృతఘ్నుఁడను ధురభి
     మానిని లోభిని మత్సరయుతుఁడను
               దుర్గుణుండను గురుద్రోహి నైన
     నావంటియజ్ఞాను నేవిధంబున నీదు
               దయకుఁ బాత్రునిగాఁగఁ దలఁచకున్నఁ
గీ. బతితపావనబిరుదు యేపట్ల నీకు
     నిలుపఁబోవదు సుమ్ము భూతలమునందు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.95

సీ. పుత్త్రమిత్రకళత్రపూరితసంసార
               జలధికి నావ మీచరణసేవ
     బహుజన్మసంచితపటుఘోరపాతక
               సముదాయాభావ మీచరణసేవ
     బధిరాంధశాబకపశుపక్షిసుజ్ఞాన
               జననప్రభావ మీచరణసేవ
     శాశ్వతమహనీయసాయుజ్యపదవికిఁ
               జక్కనిత్రోవ మీచరణసేవ
గీ. యనుచు వేదాంతసిద్ధమై యలరుచుండుఁ యలరుచుండుఁ
     గాన భవదంఘ్రి సేవయు కలుగఁజేయు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.96
సీ. కఠినతరాజ్ఞానఘనతిమిరార్యమ
               కిరణముల్ మీనామకీర్తనములు
     చటులదురింద్రియసర్పసముచ్చయ
               కేకులు మీనామకీర్తనములు
     కలుషౌఘదుర్గమకాననదావాగ్ని
               కీలలు మీనామకీర్తనములు
     మహితారిషడ్వర్గమదగజసంచయ
               కేసరుల్ మీనామకీర్తనములు
గీ. గాన మామకహృదయరంగస్థలమున
     నర్తనక్రీడ సల్పు మనాథనాథ
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.97

సీ. జపహోమసంధ్యాదిసత్క్రియల్ జేసిన
               నుపవాసములఁ గార్శ్య మొందియున్న
     బుణ్యస్థలంబులు పోయి సేవించిన
               మానక దానముల్ పోయి సేయఁ
     గాశీప్రయాగగంగానదీస్థలముల
               సకలధర్మంబులు సలుపు చున్న
     సారె ధనుఃకోటి స్నానంబు చేసిన
               భక్తినీయెడ లేక ముక్తి లేదు
గీ. కన నీపదపంకజధ్యానపరుని
     గా నొనర్పుము కరుణించి కమలనాభ
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.98
సీ. అల యజామీళునికలుషంబు లెడలించి
               యెలమితో సాయుజ్య మీయ లేదె?
     అపకార మొనరించినట్టికాకాసురుఁ
               గృపతోడఁ జూచి రక్షింపలేదె?
     పగవానితమ్ముని మృగధరార్కస్థాయి
               గా లంకఁ బట్టంబు గట్టలేదె?
     సభలోన నపరాధశతము పల్కినయట్టి
               శిశుపాలు నాత్మలోఁ జొనుపలేదె?
గీ. నీదయారస మొరులు వర్ణింపఁ గలరె
     నన్ను గరుణింపు మిదె నీకు విన్నపంబు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.99

సీ. జపహోమసత్క్రియల్ సలుపంగ నోప నే
               నుపవాసములఁ గ్రుస్సి యుండ నోప
     పుణ్యస్థలంబులు పోయి చూడఁగ నోప
               స్నానసంధ్యావిధుల్ పూన నోప
     కాశి గంగాప్రయాగములకుఁ బో నోప
               సకలధర్మంబులు జరుప నోప
     అఖిలవ్రతంబుల నాచరింపఁగ నోప
               నిరతాన్నదానంబు నెఱప నోపఁ
గీ. గనుక నీదాససఖ్యంబుఁ గలుగఁజేసి
     నీదునామంబు జిహ్వను బాదుకొలుపు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.100
సీ. నాలుక కేశవనామము నొడువుము
               చిత్తమా హరిమీదఁ జింత నిలుపు
     పాణియుగంబ శ్రీపతిపూజ సేయుము
               కర్ణద్వయమ విష్ణుకథలు వినుము
     పదయుగ శ్రీధరభవనంబు వలగొను
               నయనయుగ్మమ యదునాథుఁ జూడు
     నాసాపుటమ జగన్నాయకశ్రీపాద
               తులసి నాఘ్రాణించు మలర ననుచు
గీ. నవయువంబుల మనవిగా నడుగుకొంటి
     విన్నపము లెంతచేసియు వేఁడుకొంటి
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.101

సీ. శ్రీరాజగోపాలశేఖరవరమహో
               న్నతగోపురంబు ఉన్నవపురంబు
     సర్వంసహాచక్రసంచారద్భారతీ
               నాత్యరంగంబు ఉన్నవపురంబు
     కామితాఖిలవస్తుకల్పనారుచిరాభి
               నవగోపురంబు ఉన్నవపురంబు
     సలలితనిర్మలసలిలధారాపూర
               నలినాకరంబు ఉన్నవపురంబు
గీ. నవనిధిశ్రీకరంబు ఉన్నవపురంబు
     వరసఖస్థావరంబు ఉన్నవపురంబు
     సురుచిరాకార ఉన్నవపురవిహార
     రాజగోపాల రాధామనోజఖేల.102
క. శ్రీరమణీకుచకుంభిత
     టీరమ్యకురంగమదపటీరసుగంధ
     వ్యారోపితవక్షస్థల
     గోపతిపరిపాలరాజగోపాల హరీ.

రాజగోపాలశతకము
సంపూర్ణము

  1. మత్స్యవిశేషము
  2. లోదిగి
  3. గోగోపమృగసంతతికి
  4. శాస్త్రివైద్యుండు