బొబ్బిలియుద్ధనాటకము/నవమాంకము

నవమాంకము.

స్థలకము - స్కంధావారములో విజయరామరాజు డేరాకడ.

[తాండ్రపాపారాయఁడు మిరియాలసీతన్నయు ప్రవేశింతురు.]

సీతన్న. - వచ్చితి మయ్యా పాపయ్యా విజయరాముని డేరాకు. అందఱు బాగుగా నిద్రపోవుచున్నారు. పూర్వము, అశ్వత్థామ సౌప్తికము చేయలేదా ? అయినను మనము నిద్ర మేలుకొలిపియే చేయుదము. నేను బయట కాపుండెద, డేరాకడకు వచ్చినవారి నెల్ల క్రుక్కు మిక్కు అననీయక పరిమార్చుచుండెద. బుస్సీని రప్పించుటకు వీరిఫిరంగులు వారి డేరాలమీదికి అగాదు చేసెదను. నీవు సావకాశముగా రాజునకు జమునిబేటి చేయింపుము. లోనికిం బొమ్ము.

పాపయ్య. - సరి, సీతన్నా, అట్లే కానిమ్ము [సీతన్న నిష్క్రమించి డేరాద్వారము కడకు మరల మరల వచ్చుచుం బోవుచుండును.]

పాపయ్య. - బళీ ! మిరియాల సీతన్న పనిచే బుస్సీ వచ్చి నాపనిం జూచును గాక. వీఁడు నేను లే నప్పుడు గదా, నారాయనిని హతముచేసినాఁడు. నేనిపుడు వీనిని, బంధు మిత్త్ర పరివార బలత్రితయ సమేతుని హత మార్చెదను. వేనవేలు వీరభటులచేతఁ గదా వీఁడు నారాయనింగారులను, ఒంటరులను ఒక్కొక్కని మడియింపించినాఁడు. నేను ఒక్కండన వీనిని వీనిం గావ నేతెంచువారినిం గూడ పరిమార్చెద. హాహాహా ! ఏమి కనబఁడుచున్నది !


              శా. రంగారాయఁడు, వేంగళేద్రుఁ, డనుఁగుల్,
                          రౌతుల్, భటుల్, రక్తది
                   గ్ధాంగుల్ నన్ మిడికన్నులం గనుచు జి
                          హ్వల్ దోఁప నో ళ్ల్వచ్చి, కా


               ళింగుం జూపి, తృషం దదస్ర ఝర పా
                      ళిం దీర్పు మన్సంజ్ఞ గాఁ
               గం, గైదొన్నె ఘటిం త్రయారె! యిదె రం,
                      గా వెంగ, నేఁ దీర్చెదన్. ౭౫

               హా ! మరల ని|దేమి ! హా !
           క. ఈతని ద్రోహమువలనన్
               గాతర లై యగ్నిఁ బడిన కంజాతాస్యల్
               చేతుల సన్నలచే నను
               నీతని మెడఁ గోయు మనుచు నెగచెద రరరే!
౭౬

ఇఁక తడయంజనదు. నిద్రపోవుచున్న యీమూఁకను మదీయ సింహగర్జనముల చే 'ఓరి, వచ్చి మీరాజుం గాచుకొండిరా:' అని పిలుతునా ? వలదు, ; అట్లు చేసిన వీఁడు నారాక యెఱింగి పలాయితుఁడై దాఁగును. కావున లోనికి పోయి వచ్చినపని కావించెద.


           ఆ. ఏనుఁగునకుఁ దుల్య మితని దేహము గాన
               మేటి శిరము వ్రచ్చి మెదడు వడయఁ
               గుత్తుకను బగిల్చి నెత్త్రువాఁకను బొంద
               నేను సింహ మవుదు నీక్షణమున.
౭౭
                                  [అని లోనికిఁ బోవుట నభినయించి, బాకును దూయును.]

[అంతట ఒకసేవకుఁడు కునికిపాట్లు పడుచు, పాదము లొత్తు చుండ, మంచముపై నిద్రితుఁడు రాజు ప్రవేశించును.]

పాపయ్య. - (రాజుం దఱసి) పులి ! పులి ! పులి !

రాజు. - [మేల్కొనుట నభినయించుచు] లేవకయే పొడు పొడు పొడువు.

[సేవకుఁడు పాపయ్యతోఁ గలియఁబడును. పాపయ్య వానిమెడ నొకచేతం బట్టి బయటికిం దెచ్చి సీతన్న చేత దానిం బెట్టును. సీతన్న వాని నట్లే కొని నిష్క్రమించును. పాపయ్య మరల లోనికి పరిక్రమించును.] రాజు. - [ఈయలబలమునకుం బోలె లేచి మంచము దిగి యివలికి వచ్చి కవాచి పై కూర్చుండి] ఏదిరా పులి ? ఎటుపోయినదిరా ? చల్లారామా, ఏమైతివిరా ! హా పులి వానిని వేసికొని పోయినదా ? [అని అన్నివైపుల వెదకుట నభినయించును.]

పాపయ్య. - [ప్రవేశ మభినయించి ఎడమచేతితో రాజును గొంతునం బట్టుకొని కుడిచేత బాకు కొని ఆతని గుండియకుం గదియించి] తప్పించుకొన యత్నించితివా, తక్షణము గటు క్కనిపించెద. రాజా, ఇది అడవి పులిగా దోయి, బొబ్బిలిపులి; దీని పేరు బొబ్బిలి బెబ్బులి తాండ్రపాపయ్య. ఈపులియే చల్లారాముని కొనిపోయినది.

రాజు. - పాపయ్యా, దొంగపోటు పొడువ వచ్చితివా !

పాపయ్య. - నీవు దొంగప్రొద్దున గదా ముట్టడి వేయించితివి ?

[నేపథ్యమున.]

'హా ! నారాయణ ! నారాయణ !'

రాజు. - హా ! హా! చల్లారాముని గొంతు ! [స్వగతము] బయట ఇతనిసిబ్బంది వచ్చియున్నారు గావలయు. (ప్రకాశము) పాపయ్యా, నిన్నుఁ జూచినతర్వాత, ఎంత పరివార మున్నను, ఇంక నేమి ఆశలు ? ఈ బొబ్బిలి నీ కిచ్చెదను, నాప్రాణములు కొనకు పాపయ్యా.

పాపయ్య. - ఆహాహా !


           సీ. బొబ్బిలి యిత్తువా? యబ్బబ్బ శిబి కర్ణ
                       థారాధరులకన్న దాత వైతి !
               నీపాడుప్రాణంబు నేను గైకోనురా,
                       గాలిలోపల నది కలయుఁ జుమ్ము.
               ఉండెఁబొ మ్మామాట ; యూడెనా యోరి నీ
                      ప్రక్కలోపల నున్న బల్లెకోల ?
               వెలికి వచ్చెనొ కంటినలుసు నీ కిప్పుడు ?
                      పరులసొ త్తాశించు ఫలము గంటె ?
           తే. వీఱిఁడికి నీకు జగదేకవీరుఁ డైన
                      రావుపైఁ బగ యన నేమి రా బజీత ?
               వెంగళుని పెండిలికి నన్ను వెడలకుండఁ
                      జేసిన ఫలంబుఁ గుడువు చేసేత నిపుడు.
౭౮

[నేపథ్యమున ఫిరంగియగాదులు]

పాపయ్య. - ఒకమాట కయిన బదులు చెప్పవయ్యా. నాచేతిపట్టుచేత నోటమాట రా కున్నదా యేమి ? పట్టు కొంచెము సడలించెదను. [అని అట్లు చేయును.]

రాజు. - [ఊపిరి త్రిప్పుకొని నిట్టూర్పు నిగిడించి]


           శా. పాపారాయఁడ, రాచపుట్టువను, నీపాదంబులం బట్టితిన్ ;
                నాప్రాణంబులఁ గావు, నిండుకరుణ న్నాపాలిదైవంబ వై.
పాపయ్య. -
               పాపా, వూనితికాదె బాలుఁ గరిచేఁ బాదాన మట్టింపఁగా!
               నీ పాపంబులు నాకుఁ దెల్పినది వానిం దాది కొంపోవుచున్. ౭౯

నీవు నాశము చేయించిన మాకోటను గూడ చూచి వచ్చితిని జుమా. రాజా, మారంగారాయని బంగారపు మంచముమీఁద పరుండెద నని ప్రతిజ్ఞ చేసితివఁట; నేను వచ్చుతఱికి దానిమీఁదనే గదా ఉంటివి, నిన్ను దానిమీఁదనే సుఖముగా పరుండఁ బెట్టి పెద్దనిదురఁ బుచ్చెద. ఇదిగో నిన్నుఁ గొనిపోయెద. పులినాకిన యెద్దా ?

[అంతట - బుస్సీయు హైదరుజంగును ప్రవేశింతురు.]

[పాపయ్య రాజును పిల్లికూనం బోలె ఎడమచేత మెడ పట్టుకొని యున్నవాఁడు, అట్లే కుదిలించుచు, నిష్క్రమించును.]

బుస్సీ. - ఏమియిది! గడ్డి మేటిపాటి మూటను తాటిచెట్టు పాటి జమీను, ఎడమ చేతితో లోనికి కొనిపోవుచున్నాఁడు ! ఈరాజు తన సామా నంతయు తరలించుకొను చున్నాఁడు గావలయు ఆహా ! ఎంతమోసగాఁ డీతఁడు ? పేష్కస్సులు ఎగవేయుటకై మనలనే సంహరింప మనమీఁదికే ఫిరంగులు త్రిప్పినాఁడు !

హైదరు. - [స్వగ.] నాకీ వప్కొన్న లక్షవర్హాలు యెగెయ్యడానికిసహా.

[అంతట ప్రేవులహారాలతో రుధిరస్థానకముతో, అట్టహాసముతో, తాండ్రపాపయ్య ప్రవేశించును.]

పాపయ్య. - [ఇటునటు వికటముగా పరిక్రమించుచు, పరవళ్లు ద్రొక్కుచు,] పూర్వము తాండ్రపాపారాయఁడను, ఇపుడు రాకాసిమన్నీఁడ నయితిని. అయినను నాజూకుగా.


           సీ. రాజనంబులరాశి భోజనార్థఁబుగాఁ
                    దంచుకైవడి వీని దంచినాఁడ,
               పనసకాయను దోరపదనఁ గూరగ వండఁ
                    జెక్కుకైవడి వీని జెక్కినాఁడ,
               పొట్లకాయను దియ్యఁబులుసు దప్పళముకై
                    తఱుగుకైవడి వీనిఁ దఱిగినాఁడ,
               అంటుమామిడిపండు నారగింపునకుఁగాఁ
                    గోయుకైవడి వీనిఁ గోసినాడ,

           తే. యాతనల మ్రగ్గు మని వీని యమునియిల్లు
                    నేర్చితిని ; వీని కిఁక నేమి నేయఁ గలదు ?
               ఇంతచేఁతయు నా చేతి కించుకేని
                     యాఁటదాయె నిఁకేమి నా కాట గలదు ? ౮౦

[అని ఆలోచించుట నభినయించుచుండును.]

బుస్సీ. - హైదర్సాహేబ్, మన మొకటి అనుకొని వచ్చిన, ఇది మఱి యొకటి అయినది. ఇతనిమాటవలననే ఇతఁడు తాండ్రపాపయ్య యని తెలిసినది. ఇతఁడు రాజు వర్ణించినంతకన్న హెచ్చువాఁడుగానే యున్నాఁడు. రాజు చచ్చినాఁడు.


           ఉ. స్తంభమునుండి పై కుఱికి దానవుఁ జీలిచి రొప్పుచున్న యా
               దంభ మృగాధినాధుని విధంబునఁ బేర్చెడి దుర్ని రీక్ష్యుడై,
               కుంభిని నేర్చు రుద్రుని విఘూర్ణన తాండవ చండ సంభ్రమా
               రంభము నూని చూడ్కికి భరం బగునీతఁడు మర్త్యమాత్రుఁడే!

ఇప్పు డీమహావీరుని ఎంతటివాఁ డైనను ఎంద ఱయినను సమీపించు టెట్లు ?

హైదరు. - మాట్లాడకండీ ; ఇనబడితే మనమీదికే వస్తాడు.

పాపయ్య. - నాచేత వీని విజయనగరము కోట నా బొబ్బిలికోటలాగున నేలమట్ట మై, వీని జను లెల్ల మ్రంది, సంజీవిచేత రామసైన్యముంబోలె ఎట్లో మాజనులు మాత్రము అందఱును బ్రదికి, రంగారావు యథాపూర్వము బొబ్బిలిలోను, చినవేంకటరావు యువరాజుగా విజయనగరములో క్రొత్తకోట కట్టించుకొని అందులోను, ఈ జమీనుల నేలుచున్న, నాపగ తీఱును. [వెడవెడ అట్టహాసము చేసి] సరిసరి ! ఏల యీ కానితలంపు ? మఱి కడుపులోని యీ యాందోళనము తీఱు టెట్లు ? ఆ! జ్ఞప్తి యైనది ! ఆ హైదరుగాని చిత్రవధచేత తీఱును. ఈ నడిమిడేరా వాని దఁట. దాని మీఁదనే పోయిపడుదునా? [పరికించుట నభినయించి] ఏల? పరంగిదండు తురకదండును నావైపే వచ్చుచున్నవి ? ఇవి బుస్సీహైదర్ల దండులు గావలయు. ఈరాణువలు నన్ను గుఱిపెట్ట వేమి ? ఆ! తెలిసినది. నావెనుకనుండు తమ స్నేహితునకు రాజునకు వాని దండునకు తగులు నని కావలయు. మఱి యిది నన్ను పట్టుకొన యత్నమా? సాము లగువులు లేవా? ఆహాహా! దండ్లా నాపైకి !


                దండు దండు లటంచు గుండె తల్లడ మేల ?
                కొండంత వామికిఁ గొఱకచ్చు చాలు.
                కట్టెమో పులరాశి గగనంబు ముట్టనీ,
                చిట్టి ని ప్పుక కాల్చి సివమాడుఁ బైని.
                ముక్కంటి నిటలాన మొల కెత్తు మంటకు
                నెక్కువా యేమి యేడేడు లోకాలు? ౮౨

[దండు ప్రవేశించును. పాపయ్యవైపు నడుచును.]

పాపయ్య. - ఆహా ! ఇన్నాళ్లకు నాచేతికి ఆటిన యడవినఱకుఁడు దొరకినది. రండోయి మొనగాండ్రారా, రండి. [ప్రేవుహారములం జూపుచు] తాండ్ర పాపయ్య నయ్యా! మాస్నేహితుఁడు విజయరాముఁడు ఈ మా హారములను దొంగిలించి తమాషాకు తన కడుపులో దాఁచుకొన్నాఁడు ; వీనిని నేను గైకొని తమాషాకే ఆతనిని రాజదండనం బొందు మని యమధర్మరాజుకడకు పంపితిని. రండు మీరును పోయి ఆతమాషా చూతురుగాని.

సిపాయీ లందఱు. - [ఒకరికొకరు] తాండ్రపాపయ్య! పాపయ్య రాజునుచం పొచ్చి ఆవేస మాడుతున్నాడు. మనము రాజుమీదికి వస్తే ఇక్కడ మఱి కోలాగైంది.

[పాపయ్య వారింగూర్చి 'కిల్లల్లల్లల్లా, అని యార్చి, బాహాస్ఫోటనము సేయును. వారు వెఱచఱచుట నభినయించి వెనుకకు విఱుగుదురు.]

పాపయ్య. - అయినదా మీపని ? సముద్రమును చూడఁగానే మీగుండెబ్రద్దలైనది. అడ్డు ఈఁదఁదెగఁబడువాఁ డెవఁడు ? దావాగ్నిం జూడఁగానే లేళ్లు పాఱి పోయినవి, దానిని దాఁటిపోవున దేది! పొండి! పిడికెఁడుకూటికై దేహ మమ్ముకొన్న కక్కూరితిగాండ్రు మీరు. మీ పెండ్లాముబిడ్డల యుసురు నాకేల ? మిమ్ము విడిచి పెట్టితిని. ఏమి ! వెళ్లి రా? ఏ మేని దురాలోచన గలదా మీకు ? అటయిన నిలువుఁడు. మిమ్ము రూపుమాపెదను. [అని నఱకఁబోవును. దండు పలాయిత మగును.]

పాపయ్య. - మఱి యెట్లయ్యా నా డప్పి తీఱుట ? ఆహైదరుగానిం జీల్చి వాని రక్తమును కనులం జూచిననేగాని తీరదే ! వానిం గనుట యెట్లు ! [అని యరయుచుండును.]

ఒక సిపాయి. - [ప్రవేశించి, పాపయ్యం గనకయే వడిగా బుస్సీ హైదరులకడకు బోయి] - సలాం బూసీదొరవారికి.]

[పాపయ్య వినుట నభినయించును.]

సిపాయి. - సలాం హైదర్జంగు బహద్దరువారికి. ఆఫిరంగుల్ రాజా మన్మీదికి కాల్చుచేశినవి గావు. తాండ్రపాపారా వంట, దొర అంట ; ఆయనకీ కింద దళవాయంట, మిరాల సీతన్నంట. ఆయన మీకీ రప్పించడానికి వాటికి కాల్చినా డంట. పగల్డేవు చెయ్యడానికి వెల్లిన రాజాదండూకి నాలుగువందలమందికి సంపి 'వఖరిశాత సావటానికి ఖారణం ఏమి?' అని పొడుచుకొని సచ్చినాడు ఇప్పుడే. -

పాపయ్య. - [స్వగతము] బళి ! సీతన్న నాకన్న ముందే పోయినాఁడు. ఆహా ! హైదరు ఇక్కడనే దొరకినాఁడు ! బుస్సీ యున్నాఁడు బళి బళీ ! [ప్రకాశము] ఓహో ! బుస్సీదొరగారూ ! ఇక్కడికే వచ్చినారా ! వీరే గదా హైదర్జంగు గారు దూదేకులవీరులు.

బుస్సీ. - సలాం పాపాయనివారికి. [హైదరు బుస్సీవెనుక కేఁగును.]

పాపయ్య. - [తటాలున సింహము దుమికినట్లు హైదరుమీఁది కరిగి మెడను ఎడమచేతం బట్టుకొని ఇవలికి ఈడ్చుకొని వచ్చి] రారా దూదేకులవాఁడా ? నిన్ను ఏకెదను. నీవేగదా నౌభత్తు మాన్పు మన్నవాఁడవు, కోట వదలి పొమ్మన్నవాఁడవు. నీపద్దు సాధించితివే ! ఓరీ,


           శా. నీవేబొబ్బిలికోట వౌదువు సుమీ ; నీప్రాణమే రాయఁడౌ ;
                నీ వి ప్డుక్కిరి బిక్కిరిం బడుడు గుండె ల్గొట్టుకొ న్శబ్దమే
                తా వాద్యోత్తమ మైన నౌబ తగు ; హైదర్జంగ, యీబాకునన్
                నీవాద్యంబును జీల్చెదన్ : వెలి కిదే నీరాయనిం దోలెదన్. ౮౩

[బాకెత్తి] తలఁచుకో నీసామిని !

హైదరు. - నీవే నా సామివి ! శరణు శరణు మహరాజ్ ; రచ్చించు రచ్చించు; సామీ రచ్చించు. పాపయ్య. - [ఆశ్చర్యముతో] ఓరీ నీచుఁడా ! ఈ టక్కు ఎక్కడ నేర్చితివి రా! మా రంగారాయని బారిం బడిన యా విజయరాముని భటుల కడ నేర్చితివా?

బుస్సీ. - రాయనింగారూ, శర ణన్న తర్వాత కొట్టుట మీ వెలమనీతులలో లేదే. కావుఁడు దీనుని.

పాపయ్య. - బుస్సీదొరా, నీవు మిక్కిలి దొడ్డవాఁడవు మా చినవేంకటరాయనిం గాచినవాఁడవు ; వీనిచే మోసపోయితివి. నీవు తురుపు ఇచ్చిపంపగా వేంకటలక్ష్మి సామర్లకోటకుఁ బోవుచు మాలపల్లి కడనుండి మాకు సకలవృత్తాంతములను బారికవాని ముఖమునం జెప్పి బంపినది. సలాము నీకు. నీమాటచే వీనిని నాగూరి మీరాసాహెబు టెక్కమునకు బలాదూరుగా విడిచి పెట్టితిని. [అని మెడ విడిచి పాఱవైచును.]

హైదరు. - [స్వగతము] బతికినాను రా బాబూ !

[అని మెడ తడవుకొనుచు, నిట్టూర్పులు నిగుడ్చుచు, పడియే యుండును.]

పాపయ్య. - బుస్సీదొరా, చూచితివా మాబొబ్బిలి వెలమల బీరమును?

బుస్సీ. - చూచితిని, అనుభవించితిని, మెచ్చితిని.

పాపయ్య. - విజయరాముఁడు పంద యని కనుఁగొంటివా ?

బుస్సీ. - నూఱు మార్లు.

పాపయ్య. - ఇఁక నా కిక్కడ పని లేదు. నేను త్వరగాపోయి రంగారావును నా కేల కబురు పంపలేదో అడుగవలయును.

బుస్సీ. - ఆయన పంపినాఁడు. జాబులం దెచ్చు హర్కారులను, రాజుపట్టించి నాఁడు. వారు పోరి చచ్చినంతట ఆజాబులం గైకొన్నాఁడు.

పాపయ్య. - కబు రందియు నేను రాలే దని రంగారాయఁడు నామీఁద కోపగించుచుండును. నేనుపోయి యీసమాధానమును చెప్పుకోవలయును.

బుస్సీ. - బాలుని తక్తు ఎక్కించి నీవు మంత్రివిగా జమీ నేలించుచుండవలయు నని నాప్రార్థన.

పాపయ్య. - ఆపని నీలాద్రిరాయఁడు కావించును. నేనునాకు ప్రేత పిండము వైచుకొంటిని ; ఇఁక నీలోకమున నుండఁజనదు. నేను పోయి విజయరామునికడనే పరమపదించెద. మీదం డ్లన్నియు వచ్చి చూచు నపుడు, రాజుం జీల్చిన పులి యిది యని తెలియవలదా ? [అని తటాలున నిష్క్రమించును.]

బుస్సీ. - హైదర్సాబ్, రాజవధచిత్రమును చూచి వత్తము రా.

హైదరు. - మీరుపోయి సూడండి, కడుపునిండా సూస్కొని రండి, నేను రాను. అక్డ పాపయ్య ఇంకా పొడుచుకొన్నాడో బతికేవున్నాడో? ఈతూరి ఆయన నామెడ్కాయకి నులిమితే, నేను బత్కడం అబ్ధం.

బుస్సీ. - అ టయిన నేను మాత్రమే పోయి చూచివచ్చెదను. [అని నిష్క్ర.]

హైదరు. - అబ్బా ; మెడ పడిపోయిందిరా, నాయెడ్మభాఘం, అంతాచితికి పోయింది. [అని మెల్లగా కష్టముతో లేచి] ఇప్పట్కీ నాకీ పానం దక్కింది, లక్ష వర్హాలు మునిగి పోయినయి. [అని నొప్పి నభినయించుచు, కుంటుచు నుండును.]

బుస్సీ. - [ప్రవేశించి] హాహాహా ! ఏమి ఘోర వధ !


           శా. వేలున్ లక్షలు మాంసరాసులు నభోవిస్తార మౌవిస్తరిన్
               గ్రాలన్, భుక్తికిఁ గూరుచుండి, మును శర్వథ్యాన మం దున్న బే
               తాలుండో యన, రాజమాంసఖల సక్త ప్రేక్ష బద్ధాసనా
               భీలుం, డాత్మహతుండు పాపయ యుఱున్ వీక్షింపఁగా వ్రేఁకమై.

               [నేపథ్యమున కలకలధ్వని - ఓంభాయి, ఓంభాయి, ఓంభాయి]

బుస్సీ. - ఇది, ఓహో - ఆనందరాజు పట్టాభిషేకముకై వచ్చుచున్న కలకలము గావలయును. హైదర్, మనము పోయి ఈతనివలన మనకు రావలసిన ఫేష్కస్సుల నిక్కడనే పుచ్చుకొందము. ఈతఁడు మరల విజయనగరముకోట చేరెనా, మనకు పైకము ముట్టదు.

హైదరు. - ఆలాగే చేజ్దాం. [స్వగతము] ఈగంధర్గోళంలో నా లక్ష ముణిగిపోయింది. [అని అందఱు నిష్క్రమింతురు.]

నవమాంకము సమాప్తము.

____________