బొబ్బిలియుద్ధనాటకము/దశమాంకము

దశమాంకము.

స్థలకము: - గోలకొండ నైజాము దర్బారు.

[నైజాము, వజీరు, బుస్సీదొర, హసేనాలీ, పరివారంబుబు యథోచితము ప్రవేశింతురు.]

నైజాము. - నిన్న హైదరును శిక్షించిన యాగ్రహములో అడుగ నైతిని. . హసేనాలీ, ఇందఱు సర్దారులు గతించిన యీ రణములో, నీవెట్లు బ్రదికి వచ్చితివి ?

హసే. - మహాప్రభూ, నేను రాయనివారి పక్షముగా వాదించినందున నన్ను యుద్ధము చేయ నీక హైదర్జంగు నిలిపినాఁడు.

ప్రతీహారి. - [ప్రవేశించి] బందగానే ఆలీ ; నిన్ననే తెలుపుడు చేసుకొన్న వారు బొబ్బిలిరాజాగారి కుమారుణ్ని తోడ్కొని నీలాద్రిరావుగారూ దాదీ వచ్చి వున్నారు.

నైజాము. - ఓహో ! సమయానకువచ్చినారు. తత్క్షణమే తోడ్కొనిరా?

ప్రతీ. - [నిష్క్రమించి తోడ్కొని వచ్చి] వారే గోలకొండపాదుషాగారు. ఖూర్నీషు సలాములు చేయండి. [అని నిష్క్రమించును.]

[మువ్వురు మోకాలిమీఁద నిలుతురు.]

నీలాద్రి. - బందగానే ఆలీ, మీగులామను, సామర్లకోట నీలాద్రిరాయఁడను సలాము చేయుచున్నాను. [అని సలాము చేసి, చేతులు జోడించుకొని బాలుంగూర్చి] బాబూ నీవు చెప్పు. - "నేను పాదుషాగారి గులామను, బొబ్బిలి రంగారాయనింగారి కుమారుఁడను, చినవేంకటరాయఁడను. సలాం చేయుచున్నాను" అని.

బాలుఁడు. - నేను పాదుసాగారి గులామను, బొబ్బిలి రంగారాయనివారి కుమాలుదను, చినవేంకటలాయదను, తలాము చేస్తున్నాను.

నీలాద్రి. - బాబూ ; ఇట్లు సలాము చేయుము. [అని నేర్పును.]

[బాలుడు సలాము చేసి చేతులు జోడించుకొని యుండును.]

దాది. - నేను రంగారాయనివారి జనానా దాసిని, ఈ చిన్న బాబుగారి చిన్న దాదిని, వేంకటలక్ష్మిని. [అని సలాము చేసి చేతులు జోడించుకొని యుండును.] నైజాము. - నీలాద్రిరావుగారూ, మాకు బుస్సీగారివలన బొబ్బిలి వృత్తాంతమెల్ల తెలిసియున్నది. మీరు వచ్చినపని సంగ్రహముగా చెప్పుకొండి.

నీలాద్రి. - అ టయిన మాపిర్యాదు కరము అంక్షిప్త మైనది. ధర్మరక్షకా, హైదరుజంగు చేసిన ద్రోహమువలన బొబ్బిలిగడ్డలో మిగిలిన మగపురుగు ఈశిశువు ఒక్కఁడే ! స్త్రీలలో వీనిం బాయని యీదాదియొక్క తె మిగిలినది. వీని నోటిముందఱ, సర్కారు పెట్టిన యన్నమును, బొబ్బిలి జమీనును, విజయనగరము దొర ఆనందరాజు అపహరించినాఁడు. ఈబాలుఁడు, హుజూరునకు, వంశక్రమాగతుఁడు, గులాము; వీనికి అన్నము పెట్టుము భూలోక దేవేంద్రా.

నైజాము. - బాలుని రక్షించెదము. ఆదుష్టుని హైదరును దండించినారము. లెండు కూర్చుండుఁడు. [నీలాద్రిరావును బాలుఁడును లేచి కూర్చుందురు.]

నైజాము. - [సభ్యుల నుద్దేశించి] నిన్న వానిపైఁ గలిగిన యాగ్రహములో మిమ్ము అడుగలేదు ; ఇపుడు, చెప్పుఁడు : వానికి విధించిన దండన రాజధర్మసముచిత మా గాదా?

వజీరు. - బందగానె ఆలీ, అంతకన్న నాయ మయిన దండన యుండునా; బొబ్బిలి మహావీరులను హుజూరువారి రాణువను నాశము చేసినందులకు వానికి ఉరి దండన. వాఁడు లంచము గొని, సర్కారు పైకము పోఁగొట్టినందులకు ఇప్పటివఱకు వాఁడు లంచాలచేత చేర్చిన లక్షోపలక్షల ధన మెల్ల సర్కారు ఖజానాకు దాఖలు. మఱి విశేషము. వాని కుటుంబమునకు, యావజ్జీవము, జీవనాంశము. ఇంతకన్నను ధర్మ ముండునా ?

నైజాము. - విజయరామరాజుమీఁదికి కత్తి దూసిన బాలుఁడు ఇతడే ?

బుస్సీ. - ఔను సర్కార్ ;

నైజాము. - ఏమి బాలకా, అట్లు చేసితివా ?

బాలుఁడు. - మాబాబును చంపించిన వాన్ని నేను కొత్తొద్దా ?

నైజాము, వజీరులు. - [హర్షముతో] అరేరే ! అరరే !

నైజాము. - మఱికొట్టితివా ?

బాలుఁడు. - ఈ బూచీదొర అద్దపద్దాడు అందుకోసం కొత్తలేదు.

నైజాము. - ఆయనపెద్దవాఁడే, నిన్నుపొడిచి చంపిన నీవేమి చేయుదువు ?

బాలుఁడు. - చావంతే భయమా ? చావుకి భయపద కూదదని మావాల్లందఱు చెప్తారు. చంపేస్తే మాబాబయ్యకాడికే వెల్తాను, అది నాకు యిష్టమే గదా !

అందఱు. - అరరే ! అరరే ! బాపురే బాలకా! బుస్సీ. - మహాప్రభూ; ఈదాదియే తన చేతినుండి యీబాలుని హరింపవచ్చిన వారిని మన సిపాయీలను నూఱుగురను పరిమార్చినది.

నైజాము, సభ్యులు. - బలారే ! బలారే ! ఏమి వీరభూమి ఆగడ్డ !

నైజాము. - లే దాదీ. లే. నిన్ను మెచ్చినారము.

వేంకట. - ధర్మరక్షకుని కటాక్షము. [అని లేచి నిలుచును.]

నైజాము. - దివాన్ బహద్దర్ టో,గ్రాలీగారూ - కుమారునికి సర్వము యథోచితము జరుపునట్లుగా ఇపుడు ఉత్తర సర్కారులకు దొరలైన యింగ్లీషువారి గవర్నరుగా మదరాసురాజధానిలో నేలుచుండు దొరగారికి మాసిఫారసును జాబువ్రాయుఁడు. ఆ జాబును ప్రత్యేకముగా రవానాచేయుఁడు. దానినకలును వీరికిపుడు మేమిచ్చిన ఫర్మా నాగా మాసికామొహరులనుం బొందించి, సవారిలో ఉంచి దానిని, ఇంక ఈచిన రాజావారికి మేమిచ్చినవిగా అనర్ఘ్యములైన మహారాజోచిత దివ్యభూషణములను ఒకకత్తలాని తేజీని, ఢంకాను, మేళతాళములతోఁగూడ వారి సవారివెంటగొనిపోయి వారిబసలో చేర్పుఁడు. నీలాద్రిరాయనింగారిని మాగొప్పసర్దారులకుందగిన మరియాదలతో సత్కరింపుడు. బాలుని గాచుటచేత మాకు గొప్పమేహనత్తు గావించినప్రభుభక్త శేఖరమణి వేంకటలక్ష్మి చేతికి నవరత్న ఖచితమయినజాలువాపసిఁడితోడా తొడుగుఁడు.


టో,గ్రాలి. - [లేచి] సర్కారాజ్ఞ. [అని కూర్చుండును.]

నైజా. - హసేనాలీ, నీవు వీరితోఁ గూడఁ బోయి, మాఫర్మాన్ బొబ్బిలిలోను, విజయనగరములోను, ప్రకటించి, ఈరాజావారిని బొబ్బిలిజమీనులో కుదురు పఱిచి రమ్ము.

హసేనాలీ. - (లేచి) సర్కార్ ఆజ్ఞ. [అని కూర్చుండును.]

నీలాద్రి, దాది. - మహాప్రసాదము, మహాప్రసాదము.

నీలాద్రి. - బాబూ, 'మహాప్రసాదము' అని చెప్పుము.

బాలు. - మహాప్లసాదము.

[నౌకర్లు పళ్లెములో రత్నాల కటారి పన్నీటి కూజాయును తెచ్చి నైజాముకడ నిలుతురు.]

నైజాము. - కుమారా, చినవేంకటరాయా, ఇటు రమ్ము.

[బాలుఁడు పోయి మోఁకరించి నిలుచును.]

నైజాము. - ఇది మేము మాచేతితో నీ కిచ్చిన యినాము. (అని కటారీఇచ్చి, పన్నీరు చల్లి) పోయి కూర్చుండుము. బాలుడు. - మహాప్లసాదము. [అని సలాము చేసి పోయి కూర్చుండును.]

[నైజాముకనుసన్న చేత దివాను నీలాద్రిరావునకు పన్నీరు చల్లును.]

నీలాద్రి. - మహాప్రసాదము, మహాప్రసాదము !

నైజాము. - ఆదాదియు వీరులలో గణన కెక్కినది. ఈబాలుని కిది తల్లికన్న ఎక్కువ. బాలునిం గాపాడినందున మాకు చాల మెహనత్తు చేసినది.

[అని హసేనాలీకి కనుసన్న చేయును. హసేనాలి దాదికి పన్నీరు చల్లును.]

దాది. - మహాప్రసాదము, మహాప్రసాదము !

నైజాము. - నీలాద్రిరావుగారూ. మీకోరిక తీఱినదా ? ఇంక నే మయినం జేయవలయునా ?

నీలాద్రి. -


            ఉ. వేంకటరాయనిన్ నిసుఁగు వే కయికొంటిరి తల్లి దండ్రులై ;
                యంకిలి యైన ద్రోహి తెగటాఱెను ; వీరులు పద్మనాయకుల్
                బొంకరు కొంక రార్తులను బ్రోతు రటం చెద మెచ్చు కొంటిరే,
                యింకను నేమి గోరుదు నహీనశయాన సమాన తెల్పుఁడా. ౮౫
                                         (భరతవాక్యము.)
           శా. సర్వజ్ఞాంకిత సింహరా ట్ప్రభవ వంశ ప్రాజ్య ముక్తామణుల్
                గర్వోన్నద్ధ సపత్న భూమిధర పక్ష క్షోద నాఖండలుల్
                ఉర్విం బ్రోతురు గాత శేషఫణిబాహు ల్ని చ్చలుం బోషితాం
                తర్వాణీంద్రులు పద్మ నాయకులు పద్మానాయకప్రాభవుల్. ౮౬
                                                       [అందఱు నిష్క్రమింతురు.]
                                
                             బొబ్బిలియుద్ధనాటకము సమాప్తము.


                                          ____________