బారిష్టరు పార్వతీశం - ప్రథమ భాగము/తుదిపలుకు

తుదిపలుకు

అష్టాదశ వర్ణనలు ఉంటేనే కాని ప్రబంథానికి కావ్యత్వ గౌరవము ఉండదన్నారు మన పెద్దలు, 'A book cannot be a book without an introduction' అని వెనక ఇంగ్లీషు గ్రంథకర్త అన్నాడు. అందుకని ఈ రోజుల్లో ఉపోద్ఘాతము ఉంటేనేకాని పుస్తక లక్షణము పూర్తి అయ్యేటట్టు కనిపించదు. అందులో ఈ మధ్య మరీ అది ఒక ఆచారము అయింది. ఏ సుప్రసిద్ధ ఆంధ్రుడినో, లేక ఆంధ్రేతరుడినో ఆశ్రయించి తెలుగునో ఇంగ్లీషునో ఏదో ఒక ఉపోద్ఘాతము వ్రాయించుకోవడము. ఆ సుప్రసిద్ధుడు గ్రంథము పూర్తిగా చదవడానికి తీరికగాని ఓపికగాని లేక చదివిన కొద్ది భాగము తనకు నచ్చక, నచ్చలేదని చెప్పడము ఇష్టం లేక, ఏమి వ్రాయడానికీ తోచక గ్రంథకర్తనీ అచ్చువేసిన వాళ్ళనూ తిట్టదలచుకొన్న తిట్లన్నీ ఆ ఉపోద్ఘాతము వ్రాయడానికి ఒప్పుకొన్నందుకు తననే తిట్టుకొని తప్పనిసరి గనుక గ్రంథకర్తనీ తాను అసంపూర్తిగా చదివిన గ్రంథాన్నీ తన చిత్తమువచ్చినట్లు పొగడడము. తీరా ఇంతా చేస్తే ఆ పొగడ్త గ్రంథము వ్రాసిన ఆయన అనుకొన్నంత చక్కగా ఉండక పోవడము. అందుకని ఈ చిన్న పుస్తకానికి ఉపోద్ఘాతము ఇంకొకరిని బాధించి వ్రాయించుకోవడము నాకు ఇష్టము లేక పోయింది.

అందుచేత విమర్శకులంతా తలోమాటా అనకుండా నా అభిప్రాయం ఏమిటో నేనే చెపితే విమర్శకులందరూ ఏకగ్రీవంగా తమ అభిప్రాయం తెలియపరచవచ్చునని నాపుస్తకకానికి ప్రవేశిక నేనే వ్రాసుకుంటున్నాను.

ప్రపంచములో నూతనోద్యమము ఏది బయలుదేరి నప్పటికిన్ని అది లేత మనస్సులను ఆకర్షించి యువకులకు ఉత్సాహము కల్పించి కార్యరంగములోనికి దిపుతుంది. ఉత్సాహమే కాని వెనకా ముందూ ఈషణ్మాత్రమైనా గమనింతామనే సంగతి వాళ్ళకు తట్టదు. అందులో స్వాతంత్ర్యము లేని దేశములో తక్షణము స్వరాజ్యము సంపాదింతామనే ఆదుర్దాచేత ప్రారంభమంటూ ఒకటి ఉంటుందనే సంగతి మరిచిపోయి కొనాకులు మేస్తారు. ఆంధ్రు లదివర కెలా ఉండేవారో తెలియదుకాని ఆంధ్రోద్యమ మంటూ బయలు దేరినప్పటి నించీ ఆంధ్ర వ్యక్తిత్వము అంటూ ఒక చిత్రమైన ప్రకృతి బయలుదేరింది. ఇది ముఖ్యంగా యువకులైన వాళ్ళలో మూర్తీభవించింది. ఆ స్వరూపమే మన పార్వతీశము. కుర్రవాడు, అల్పజ్ఞుడు, దేశములో స్థితిగతులు ఉండవలసినరీతిగా లేవనీ, ఏదో మార్పుమట్టుకు అవసరమనీ తెలుసుకున్నాడు. ఏమి చేయాలో అతని అల్పబుద్ధికి గోచరించలేదు. అలా అని అంతటితోటి విడిచిపెట్ట లేదు. దాని విషయము పూర్తిగా ఇంకొకళ్ళను అడిగి తెలుసుకోడము న్యూనత అనుకొన్నాడు. మహామహులు నిర్వహించలేని కార్యము తను ఒక్కడే కొనసాగిస్తాననుకున్నాడు. తనీ ప్రయత్నము చేయకపోతే ఇక హిందూ దేశానికి ముక్తి లేదనుకున్నాడు.

ఒక విషయము చెప్పడానికి చెప్పే పద్ధతు లనేకములుంటయి. అందులో అందరికీ నచ్చేది హాస్యరీతి. అది ఎంత నిరుత్సాహపడి నిరాశజెందిన వాడికైనా శరీరానికి ఉత్సాహమున్నూ మనస్సుకు వికాసమున్నూ కలిగిస్తుంది. అందుకని ప్రస్తుతమున్న ఆంధ్రజాతి స్వభావములోని హాస్యజనకమైన విషయాన్ని మాత్రము ఒక వ్యక్తిగాజేసి ఈ కథ వ్రాశాను.

ఇంతవరకూ మన భాషలో హాస్యరస ప్రధానమైన గ్రంథాలు చాలా తక్కువ. అటువంటి పుస్తకము ఒక్కటీ మనభాషలో లేకపోవడమువల్ల హాస్యము చూపించడానికి మన భాషలో వీలులేదేమో ననుకుంటుండేవాణ్ని. పూర్వకవులు బూతులో తిట్లో ఉంటేనే కాని హాస్యము కాదనుకున్నారేమోనని తోస్తున్నది. ఆధునికులలో శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు పంతులుగారు, శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహముగారు, శ్రీ గురజాడ అప్పారావుగార్లు హాస్యగ్రంథరచన చేసి మార్గదర్శకులయ్యారు.

నిత్యమూ మనకు అనుభవమయ్యే ఏ అత్యల్ప విషయాన్నో తీసుకుని చాలా చమత్కారంగా నవ్వు వచ్చేటట్టు చెప్పడము ఆంధ్రలోకానికి నేర్పినవారు శ్రీ చింతా దీక్షితులుగా రొక్కరే. వీరు 'సాహితి' మొదలైన పత్రికల్లో వ్రాసిన కథలు చదివినప్పటినుంచీ తెలుగులో కూడా హాస్య రసము బాగా ఒప్పించవచ్చు నని తెలుసుకున్నాను.

ఈ గ్రంథము వ్రాయడానికి శ్రీ దీక్షితులుగారి కథలే కాకుండా వారు స్వయముగా చాలవరకు ప్రోత్సాహము చేశారు.

తాజాకలం

పై వ్రాసిన పంక్తులు, మొట్ట మొదట ప్రచురించిన ఈ పుస్తకానికి ప్రవేశిక లోనివి. అంతకంటె విశేషించి వ్రాయవలసిన దేమీలేదు. కాని ఒక ముక్క-- ఈ పుస్తకము ప్రారంభించి నప్పుడు పుస్తకం వ్రాదా మను కోలేదు. మద్రాసు వరకూ ప్రయాణం కులాసాగా వ్రాశాను ఏమీ తోచక. మద్రాసులో పార్వతీశాన్ని ఏమి చేయ్యాలో తోచక విదేశాలకు తీసుకు వెళ్ళాను. మీరు కులాసాకు చదివినట్లుగానే నేనూ కులాసాకు వ్రాశాను. మరో దురుద్దేశమేమీలేదు.

ఏకారణం చేతనో ఆంధ్ర రసిక హృదయం, ఆనందించి విశేషంగా నన్నాదరించింది. ఆ ప్రధమ తప్పిదానికి శిక్షగా పార్వతీశం దేశంలో పాతుకు పోయాడు. నేనేం చెయ్యను చెప్పండి! అక్కడికీ అప్పటినుంచీ నేను మట్టుకు మళ్లీ తొందరపడి ఇలాటివి వ్రాయడం లేదు. అయినా ఏవేళకు ఏమి బుద్ధిపుడుతుందో ఏం చెప్పను. పొరపాటున ఏదేనా వ్రాసినా ముప్ఫై సంవత్సరముల నుంచి ఆదరిస్తున్న రసికు లీ నాడు నన్ను విడిచి పెట్టరనే ధైర్యం పూర్తిగా ఉంది. నమస్తే అనే కంటె ఇంకేమి అనలేకుండా వున్నాను. నమస్తే.

--మొ॥న॥శా.