బారిష్టరు పార్వతీశం - ప్రథమ భాగము/అధ్యాయము 7
7
ప్లాటుఫారము మీదికి రైలు వచ్చినట్టుగా, మార్సేల్సులో స్టీమరు సముద్రంలోకికట్టిన ఫ్లాటుఫారము దగ్గిరికి చేరింది. ప్లాటుఫారమునిండా జనము కిటకిటలాడుతున్నారు. స్టీమరుమీద వున్నవాళ్లు కింద ఉన్నవాళ్ళకీ, కింద ఉన్నవాళ్ళు స్టీమరు మీది వాళ్ళకి చేతులూపడము, జేబు రుమాళ్ళు విసరడము, ముద్దులు గిరవాటు వేయడము, వీళ్ళతాలూకు బంధువులంతా వీళ్ళని చూడడానికి వచ్చారుగదా అనుకున్నాను. స్నేహితులు గాని బంధువులుగాని లేనివాణ్ణి నే నొక్కణ్ణే. నర్సాపురమునుంచి నేనెప్పుడింటికి వచ్చినా ముందు ఉత్తరము వ్రాస్తే మా అమ్మ ఎంతపని ఉన్నా వీధిలో నిలుచుని నా రాకకు ఎదురు చూస్తూ ఉండేది. మానాన్న ఏదో పని ఉన్నట్టుగా ఊరు బయటకు నాకెదురుగుండా వచ్చేవాడు. ఇవ్వాళ ఇక్కడెవళ్లూ లేకపోయేటప్పటికి ఎంతో దుఃఖము వచ్చింది. కొత్త ప్రపంచములోకి వెళుతున్నాను కదా! అనుభవము లేనివాణ్ణి, కుర్రవాణ్ణి, వెనక ఆసరా ఎవళ్లూ లేకుండా ఈ దేశములో ఎలా నిగ్రహించుకో గలనా అని భయమువేసింది. ఒక్కొక్కళ్లే దిగి కిందనున్న వాళ్లను కౌగలించుకుని ఆనంద బాష్పములు కారుస్తూ ఉంటే, నాకూ కళ్ళవెంబడి నీళ్ళువచ్చి అట్టే చూస్తూ నిలబడ్డాను. నేనొక్కణ్నితప్ప తక్కిన వాళ్ళంతా దిగారు. ఆఖరుమనిషి వెళ్ళి పోతూండగానే ఒక దొర నాదగ్గిరికి వచ్చి ఇంగ్లీషున పలకరించాడు. ప్రాణము లేచి వచ్చింది. దొరైనా కొంచెము మాట్లాడనైనా మాట్లాడవచ్చును గదా అనుకున్నాను.
'కొలంబోనుంచి వస్తున్నారా?' అన్నాడు దొర. 'అవును ' 'మీ సామా నెక్కడుంది?' 'కింద.' 'ఇక్కడ మీరు ఎరిగున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా?' 'లేరు---మీరెవరు?' 'నేను ధామస్ కుక్ కంపెనీ మనిషిని, మీకేమైనా సహాయము కావలిస్తే చేస్తాను. మీరెక్కడ బస చేయదలచుకున్నారు?'
'నాకేం తెలియదు. నాకీ దేశము కొత్త. మీరు రాకపోయినట్టయితే ఏం చేసేవాణ్ణో తెలియదు. శ్రమ అనుకోక దయచేసి నన్నేదయినా హోటలుకు తీసుకువెళ్ళితే చాలా సంతోషిస్తాను' అన్నాను.
ఒక నిమిషము నన్ను ఎగా దిగా చూసి 'పెద్దహోటలుకు తీసుకువెళ్ళనా? చిన్న హోటలుకు తీసుకు వెళ్లనా?' అన్నాడు.
ఇంగ్లండు వెళుతున్నవాళ్ళము పెద్ద హోటలుకు వెళ్ళకుండా చిన్న హోటలుకు వెళ్ళడమేమి కర్మమనుకుని పెద్ద హోటలుకే తీసుకు వెళ్ళమన్నాను. అతను మళ్లీ ఒకసారి నావంక చూసి పెద్ద హోటలులో చాలా ఎక్కువవుతుంది అన్నాడు, సంకోచిస్తూ. పైకి ఇలా కనపడ్డా నేను చాలా డబ్బుగలవాణ్ని అని వాడు అను కోడానికి చిరునవ్వుతో మరేమీ ఫరవాలేదు, భయపడకండి. తీసుకు వెళ్ళండి అన్నాను.
సరే మీ సామా నెక్కడుందో చెపితే పైకి తెప్పిస్తాను అన్నాడు దొర. ఫలానిచోట ఉందని చెప్పగానే సామాను పైకి తెప్పించి, దయచేయండి వెడదాము అన్నాడు. దర్జాగా స్టీమరు దిగి బయటికివచ్చి బండి ఎక్కి తిన్నగా హోటలుకు వచ్చాము. హోటలు అంటే చెన్నపట్టణములోనూ కొలంబోలోనూ ఉన్నట్లు గానో అంతకంటే కొంచెము బాగానో ఉంటుంది కాబోలు అనుకున్నాను. ఇది పైకిచూస్తేనే చాలా పెద్ద మేడలాగ కనపడ్డది. ఇంతగొప్ప మేడ ఇదివరకెన్నడూ చూడలేదు. బండి ఆగగానే తమాషాగా వేషము వేసుకున్న మనిషి ఒకడు వచ్చి బండి తలుపు తీశాడు. నన్ను చూడముతోనే కొంచెము తల పైకెత్తి ఇంకొకపక్కకి చూడడము మొదలుపెట్టాడు. మళ్ళీ ఒక మాటు నావైపుచూసి నాతోటి ఉన్న దొరకేసి ఇలాంటివాణ్ని ఎందుకు తెచ్చావు, అన్నట్లుగా చూశాడు. ఆ చూపుతోటి నేను సగము కుంగిపోయూను. మేమిద్దరమూ దిగగానే నా సామానుకేసి చూసి ఇంక నక్కడ నుంచోకుండా హోటలు గుమ్మము దగ్గిరకు నడిచాము. వాడి వెనకాలే మేమూ నడిచాము. లోపల ప్రవేశించగానే అడుగు ముందుకు సాగింది కాదు. కేవలము ఇంద్రభవనము లాగనే వుంది. ఎరక్కపోయి పెద్ద హోటలుకి తీసుకువెళ్ళమన్నాను, ఎంతడబ్బు అవుతుందో కదా అనుకున్నాను. ఇప్పుడు వెర్రిమొహము వేస్తే ఏమి లాభమనుకుని నా జీవితమంతా ఇటువంటి హోటలులోనే గడిపినట్లుగా దర్జాగా నడవడము మొదలు పెట్టాను. నా తోటి వచ్చిన దొర అక్కడున్న గుమాస్తాతోటి ఏదో చెప్పాడు. ఆ గుమాస్తా ఒక పెద్ద చిఠా తీసి అందులో నన్ను సంతకము చెయ్యమన్నాడు. మా దొర నన్నొక బంట్రోతుకు ఒప్పజెప్పి, వాడు నాగదికి తీసుకు వెడతాడని చెప్పి నన్ను భోంచేసిన తరువాత వాళ్ళ ఆఫీసుకు రమ్మని చక్కాపోయినాడు.
బంట్రోతు నా సామాను తీసుకువెళ్ళి అక్కడొక చిన్న గదిలో పెట్టాడు. ఆ గదిముందు ఇనప కటకటాల తలుపులు మడవడానికి వీలుగావుండేవి వున్నాయి. గది బొత్తిగా చిన్నదిగా వున్నది. అందులో ఒక చిన్న బల్ల వున్నది. ఇంత చిన్నగదిలో వుండడ మేలాగు అనుకున్నాను. మంచము వేసుకోడానికి స్థలములేదు సరిగదా, బల్లమీద పడుకుందా మనుకున్నా పొడుగు సరిపోయేటట్టు లేదు. గదిలోమట్టుకు దీపము వెలిగించారు. గాలి రావడానికి ఎక్కడా కిటికీ అయినా కనపడదు. ఇంత పెద్ద హోటలులో ఇంత చిన్న గదులేమిటా అనుకున్నాను. అన్నీ ఇలాగేవుంటే తక్కిన వాళ్లంతా ఎలా వుంటారా అనిపించింది. ఒకవేళ నన్ను చూచి లోకువకట్టి ఇంకొకళ్లకు పనికిరానిగది నాకు ఇచ్చాడేమో ననుకున్నాను. నాతక్కువమట్టు కేమిటి? ఈ గదిలోకి వెళ్ళకూడ దనుకున్నాను. సామాను అందులో పెట్టి బంట్రోతు రమ్మన్నాడు. నేను రాను అన్నాను. రమ్మని ఊరికే సంజ్ఞ చేయడము మొదలు పెట్టాడు. వాడి భాష నాకేమీ తెలియడములేదు. ఏమయినా సరే నేనురాను అని గట్టిగా చెప్పాను. వాడికేమో అర్ధముకాక వెర్రిమొహము వేసుకుని నా కేసి చూశాడు. దీని సంగతేమిటో కనుక్కుందామని గుమాస్తాను పిలిచాను. గుమాస్తాకూడా లోపలికి వెళ్ళమన్నాడు. ఈ గది అయితే నాకక్కరలేదు. ఇంకొక హోటలుకు వెళు తాను అన్నాను. వచ్చీ రాని ఇంగ్లీషులో నన్ను లోపలికి దయచెయ్యమన్నాడు. ఆ హోటలులోకి వచ్చినవాళ్ళు ఎవళ్ళో దొరలూ దొరసానులూ, నన్ను చూసి నవ్వడము మొదలు పెట్టారు. నాకా గది అక్కరలేదు. నా సామాను ఇవతల పడవేయమని మళ్లీ చెప్పాను గుమాస్తాతో. ఇంకవాదించి లాభము లేదనుకున్నాడు కాబోలు, నన్ను చేయిపట్టుకుని బలవంతముగా గదిలోకి తీసుకువెళ్ళి తలుపువేశాడు. వేసీ వేయడముతో గదికి గదీ హఠాత్తుగా అంతరిక్ష మార్గములోకి ఎగిరిపోయింది. నేను హడలి పోయి కెవ్వుమన్నాను. ఇంతట్లోకే గది ఆగింది. బంట్రోతు తలుపుతీసి బయటికి నడవమన్నాడు. ఇదేమీ నా కర్ధము కాలేదు. ఇంకా ఏమి వింతలు జరుగుతాయో అనుకుని ఆశ్చర్య పోతూ ఇవతలకు వచ్చాను. బంట్రోతు సామాను తీసుకుని తన తోటి రమ్మని తిన్నగా ఒక గదిలోకి తీసుకువెళ్లి ప్రవేశపెట్టాడు. అప్పటికి ప్రాణము కుదుటపడ్డది. ఇందాకటిది, మేడ శ్రమపడకుండా ఎక్కడానికి ఉపాయముగదా అని తెలుసుకున్నాను. నన్ను చూసి వాళ్లంతా ఎంత నవ్వుకున్నారో గదా అని సిగ్గు పడ్డాను.
ఈ గదికూడా హోటలుకు తగినట్టుంది. విశాలమైన పెద్ద మంచమూ, దానిపైన రెండు పరుపులూ, పైన బాగా రెండు అరచేతుల దళసరిగల పట్టుబొంతా, ఒక పక్కను సోఫా, రెండుకుర్చీలూ, ఒక మేజా, దానిపైన పెద్ద అద్దమూ, ఇంకో మేజాపైన ఒక పెద్ద పింగాణీ బూర్లెమూకుడూ, నీళ్ళసహితంగా రెండు పెద్దకూజాలూ, సబ్బూ, మల్లెపూవులాగ ఇస్త్రీ చేసిన రెండు తువాళ్లూ, ఇంక ఆ గోడలూ, అందమూ వర్ణిండానికి శక్యము కాదు. నేను కండ్లు అప్పగించి గదికేసి చూస్తూంటే బంట్రోతు నా సామాన నక్కడపెట్టి వాడిదారిని వాడు చక్కా పోయాడు. నేనొక్క నిమిషము సోఫామీద కూచుని విశ్రాంతి తీసుకుని సౌఖ్యమన్నా అనుభవమన్నా దొరలదే కాని మనకేముందనుకున్నాను. మన దేశ మెప్పు డిటువంటి స్థితికి వస్తుందో అనుకున్నాను. తలుపు దగ్గిరే గోడని బొత్తాము నొక్కండి అని ఇంగ్లీషున వ్రాసివుంది. ఎందుకలా వ్రాశాడని ఆలోచించి, వచ్చినవాళ్ళంతా నొక్కాలేమోననుకుని నొక్కాను. ఒక నిమిషానికల్లా ఒక బంట్రోతు పరుగెత్తుకుని వచ్చి ఫ్రెంచిలో ఏదో అన్నాడు. నాకు ఊరికే ఆకలి దహించుక పోతున్నది. వీడువచ్చి ఆ భాష మాట్లాడడముతోటే నాకు ఒళ్ళు భగ్గున మండి నీవు మర్యాదగా ఇంగ్లీషు మాట్లాడితే మాట్లాడు లేకపోతే కిక్కురు మనకుండా అవతలికి నడువ మన్నాను. వాడి కింగ్లీషు కొద్దిగా తెలుసునని తోస్తుంది, మీ రెందుకు గంట కొట్టారు అన్నాడు. నేను గంట కొట్టలేదు అన్నాను. చిత్తము, గంట కొట్టినట్లు వినబడితే వచ్చానండీ! తమకే మైనా కావాలా? అన్నాడు. ఆఁ అన్నట్టు భోజనము చెయ్యాలి భోజనాల సావడి ఎక్కడ అన్నాను. అప్పుడే ఏదో జ్ఞాపకము వచ్చి నట్టుగా, వాడు నాకేసి ఒక సారిచూసి మీరు మీగదిలో భోజనము చేస్తారా! అందరితోటీ హాలులో భోజనము చేస్తారా? అన్నాడు. అందరితోటి పాటూ హాలులో భోజనము చెయ్యకుండా నాగదిలో ఎందుకు భోంచెయ్యాలి? అక్కడికే తీసుకు వెళ్ళు అన్నాను. చిత్తము, దయచేయండి అని హాలులోకి తీసుకువెళ్లి ఒక మూల కూచోపెట్టాడు. ఒక దానికంటె మరిఒకటి మరీ వింతగా వుంది. ఇదివరకు అన్ని ఊళ్లలోనూ చూసిన అన్నిటికంటే ఈ హాలు ఎక్కువ అందముగా వుంది. ఇక్కడ బల్లలూ, వాట్లపైన మల్లెపువ్వులాంటి గుడ్డలూ వాటిపైన రంగురంగుల పువ్వులతోటి వున్న రకరకాల కూజాలూ, తెల్లని ఆ పళ్ళాలూ చూస్తే కన్ను చెదిరి పోతున్నది. ఏమి ఈ సౌందర్యము, ఐశ్వర్యము, అని ఆశ్చర్యపోతూ గుడ్లు ఒప్పజెప్పి చూస్తూ కూచున్నాను. హాలు నిండా అనేకమంది దొరలూ దొరసానులు భోజనానికి కూర్చున్నారు. వాళ్ల వేషాలు చూస్తేనే చాలా గొప్పవాళ్లని తెలుస్తున్నది, నాబోటి వాండ్లకు కూడాను. నా కేసి ఒక్కసారి కన్నెత్తి చూసి తల వంచుకుని వాళ్ల ధోరణిన వాళ్లున్నారు. బ్రాహ్మణ భోజన మధ్య మందు ఎదురుగా వచ్చిన పంచముణ్ని చూసినట్టుగా వాళ్ళు నాకేసి చూసినట్టు తోచింది. ఎరక్కపోయి వచ్చాముగదా ఇక్కడికి అనుకున్నాను. బంట్రోతు ఒకడు వచ్చి మాంసపుకూర ఉన్న కంచ మొకటి నా దగ్గిర పెట్టాడు. నేనది తిన నని సూచించాను. ఏం కావాలన్నాడు. నేను శాకాహారి నని చెప్పాను. అంటే ఆ కంచము తీసుకువెళ్ళి ఒక చేపను తీసుకువచ్చి పెట్టాడు. అదీ పనికి రాదంటే, రెండు కోడిగుడ్లు తీసుకువచ్చి పెట్టాడు. ఆశ్చర్యపోతూ ఇవీ సయించవని చెప్పాను. ఏదో కొత్తరకము జంతువును చూసినట్లుగా నాకేసి చూసి, నాలుగు ఉడకేసిన బంగాళా దుంపలూ, చిక్కుడు గింజలూ, మొదలైన కేవలము శాకములు తీసుకువచ్చి అమిత నిర్లక్ష్యంగా పెట్టాడు. బంట్రోతుకు కూడా లోకువయి పోయినాము గదా అని విచారించాను. భోజన మయింది. ఇంక ఒక్కసారి కుక్ వారి కంపెనీకి వెళ్ళి ఇంటి దగ్గిరనుంచి డబ్బేమైనా వచ్చిందేమో కనుక్కుందా మని బయలు దేరాను. మేడ దిగడానికి ప్రొద్దుటి గది కోసము కేక వేద్దా మనుకుని, ఎలా పిలవడమో తోచక మామూలుగా మెట్లు దిగి కిందికి వచ్చాను. నన్ను చూసిన వాళ్ళంతా నవ్వడమే. ఏమిటా ఇలా నవ్వుతా రనుకుని నాబట్టలకేసి చూసుకుని ఈ ఏడురూపాయలన్నర సూటే కారణమై ఉంటుందిగదా అనుకుని తక్షణము కొత్తడ్రస్సు ఏదైనా కొనుక్కుందా మని నిశ్చయము చేసుకుని వీధిలోకి వచ్చాను. వీధిలోకి వచ్చేటప్పటికి చలి గజగజ లాడించేసింది. ప్లానలు సూటు అయినా చలి ఆపలేక పోయింది. ఇంత చలిగా ఉంది కదా అనుకుని మళ్లీ నా గదిలోకి వెళ్ళి పోర్టుసెడ్ లో కొన్న మెడపట్టీ తీసి చెవులకీ మెడకీ చుట్టుకుని దానిపైన దొరటోపీ పెట్టుకుని మళ్ళీ వీధిలోకి వచ్చాను. ఇదివరకు ఎవళ్ళయినా నన్ను చూస్తే కొంచెము చాటుగా నవ్వు కుంటుండే వాళ్ళు. ఇప్పుడు ప్రతివాళ్ళూ నా మొహము చూడడము ఫక్కున నవ్వడము చక్కాపోవడమున్నూ. వెడుతూంటే వెనకాలే పాతిక ముప్ఫైమంది కుర్రాళ్ళు ఈలలువేస్తూ నవ్వుతూ వెంబడించారు.
నా అదృష్టమువల్ల కుక్ వారి కంపెనీ హోటలుకు చాలా సమీపములోనే ఉంది. లోపలికి వెళ్ళగానే అక్కడి గుమస్తాలు విరగబడి నవ్వడము మొదలుపెట్టారు. నాకు ఉడుకుమోత్తనము వచ్చి కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. ఎందుకలా నవ్వుతున్న రంతాను నన్నుచూసి? నాలో ఏమిలోపమో దయచేసి చెపుతే సవిరించుకుంటా నని దైన్యంగా వేడాను. వాళ్ళూ నన్ను చూసి జాలిపడి నా అవస్థ తెలుసుకుని నేనెంతో ఆప్యాయంగా కొనుక్కుని చలిబాధ భరించలేక ధరించిన మెడపట్టీ ఆడవాళ్ళేకాని మొగవాళ్ళు వేసుకోవడము వాళ్ళ దేశాచారము కాదనీ, కొత్తగా ఉండడము మూలాన్ని నవ్వొచ్చిందనీ అందుకు క్షమించమనీ పొద్దున్న నన్ను హోటల్లో దిగ బెట్టిన గుమాస్తా అన్నాడు.
ఇందుకా బాబూ ఇంతగోలా అనుకుని ఇంకా అల్లరికాకుండా ఇప్పుడేనా వాడి ధర్మమా అని చెప్పాడుగదా అని సంతోషించి, నా కృతజ్ఞత తెలియపరచడానికి నా మెడపట్టీ తీసుకువెళ్ళి వాళ్ళ వాళ్ళెవళ్ళకైనా ఇచ్చుకోమని బహుమతిచేశాను. నాకు టిలిగ్రా మేమన్నా వచ్చిందా అంటే లేదన్నాడు. సరే పోనీ రేపు వస్తుందనుకున్నాను. చలి చాలా బాధిస్తూఉంది అన్నాను. ఓవరు కోటు కొనలేదా అన్నాడు గుమస్తా. లేదన్నాను. అయితే ఒకటి కొనుక్కోకపోతే చలికి సహించలేరు అన్నాడు. దయచేసి ఏదేనా బట్టలదుకాణం దగ్గిరికి తీసుకువెళ్లమని కోరాను. పాపం మంచి వాడూ కష్టసుఖాలు తెలిసినవాడూ పిల్లలు కలవాడూ (అనగా పిల్లలున్నట్టు వాడు చెప్పకపోయినా ఉండివుండా లనుకున్నాను) గనుక తక్షణం నా తోటి వచ్చాడు.
ఇద్దరం ఒక పెద్దషాపులోకి వెళ్ళాము. చాలా దర్జాగాఉంది షాపు; చెన్నపట్నంలో షాపుకిమల్లేనే ఉంది; అంతకంటే ఇంకా పెద్దదన్నమాట. దానికి నేలమీద చాలా చక్కని తివాసి ఉంది. చూసి దాని మీద నడవబుద్ధి అయింది కాదు. అందుకని దానిమీద నడవకుండా పక్కన నడుస్తే బాగుంటుందని వట్టినేలమీద అడుగుపెట్టాను. అదేమి నేలో కాని అడుగుపెట్టీ పెట్టడంలో జర్రున జారింది. పడకుండా గాలిని పట్టుకోవలెనని ప్రయత్నంచేసి చేతికిదొరకక పోవడము మూలాన్ని వెల్లకితలా పడ్డాను. పడడముతోటే అక్కడున్న గుమాస్తాలూ బంట్రోతులూ యావన్మందీ ఒక్కసారి ఫక్కున నవ్వారు. నా పక్కనున్న దొర నన్ను లేవతీసి దెబ్బ ఏమీ తగలలేదుకదా అని అడిగి తివాసీమీద నడుస్తే పడకుండా ఉంటానని సలహా చెప్పాడు. అదివరదాకా నవ్వుతున్న వాళ్ళంతా నేను లేచి వాళ్ళకేసి చూడడముతోనే నవ్వడము మానివేసి ఏమీ ఎరగనట్టు నాకేసి చూస్తూ నిలబడ్డారు. నాతోటి వచ్చిన దొర నాకొకకొత్తసూటూ దుంగలాంటి ఓవరుకోటూ కొనిపెట్టాడు. అవి అక్కడే తొడుక్కున్నాను. ఇంటి దగ్గరనుంచి తెచ్చుకున్న సూటుకీ దీనికీ ఎంత తేడా ఉంది! ఇదివరకు నేను తొడుక్కున్న సూటుచూసి నవ్వారంటే ఆశ్చర్యమేముంది! ఇవి తొడుక్కుంటే చలిబాధకూడా చాలా తగ్గింది. బట్టలయితే బాగానే ఉన్నాయి. ఖరీదు చూస్తే మట్టుకు, ఇంత చూచినవాణ్ని నాకే ఆశ్చర్యమయింది.
అక్కడనుంచి నేనూ కుక్ వారి గుమాస్తా ఊరు చూద్దామని బయలు దేరాము. ఆ పట్టణ సౌందర్యమూ మేము చూసిన వింతలూ వర్ణించాలంటే భారతమంత గ్రంథమవుతుంది. నేను దేశాంతరములందు చూసిన వింతలన్నీ వేరే ఒక పుస్తకముగా వ్రాయదలుచు కొన్నాను. పైగా స్వీయచరిత్రలో వర్ణనాంశములు విశేషంగా ఉండకూడ దనుకొని అవేమీ ఇందులో వ్రాయడములేదు. కాని ఒక్క సంగతి మట్టుకు ఇక్కడ రాయ బుద్ధవుతోంది. మేము చూసిన వాట్లల్లోకల్లా గమ్మత్తుది అద్దాల మేడ ఒకటి. అందులో అన్నీ పెద్ద నిలువుటద్దాలు, అద్దాలంటే మామూలు అద్దాలు కాదు. మామూలు వయితే గమ్మత్తు ఏముంది? ఈ అద్దాల తమాషా ఏమిటంటే, ఒకద్దములో మనిషి మామూలుగా కనబడతాడు. ఒకదానిలో అసలుకంటే నాలుగురెట్లు ఎక్కువ లావుగా కనబడతాడు. ఒక దాంట్లో సన్నగా చిక్కి శల్యమైనట్లుంటాడు. ఒకదాంట్లో కంట్లో పాపలో కనపడ్డట్టె బుల్లి బొమ్మలా కనపడతాడు. ఇంకోదాంట్లో చూస్తే ఒక ఫర్లాంగు పొడుగున్నట్లు ఉంటాడు. ఇలా ఎన్నోరకాలు....
మా తోటి కూడా ఇంకో లావాటి దొరా ఒకసన్నని దొరసానీఅతని భార్య అని తోస్తుంది-చూడ్డానికి వచ్చారు. ఆ దొర ఆ అద్దాల్లో మరీగమ్మతుగా ఉన్నాడు. ఆ దొరసాని ఒకటే నవ్వడం. వాళ్లని చూస్తే నాకూ నవ్వు వచ్చింది. మేమిద్దరమూ నవ్వుతుంటే దొరకి ఉడుకుమోత్తనము వచ్చింది. అది కనిపెట్టి నేను చల్లగా అవతలికి నడిచాను.
అక్కడి నుంచి నిమ్మళంగా హోటలుకి చేరుకున్నాము, నాతో ఉన్న దొర ఉదయాన్ని దర్శనం చేస్తానని గుడ్ నైట్ చెప్పి చక్కాపోయాడు. నేను నాగదికి వెళ్లాను. కాని ఆ దొర మర్యాద చూస్తేమట్టుకు నాకు మహా ఆశ్చర్యంగా ఉంది. మన దేశము వస్తే వాళ్లు ఎంతటి వాళ్లనూ లక్ష్య పెట్టరు. ఇక్కడ వాళ్లంతా నన్నొక చిన్న జమీందారుని చూసినట్టు చూస్తున్నారు. దొరలచేత పనిచేయించుకుంటూ వాళ్లదగ్గరనుంచి సలాము లందుకుంటోంటే మహా సంతోషంగా ఉంది.
మధ్యాహ్నము అనుభవ మయింది, గనుక ఈపూట భోజనం నాగదికే తెప్పించుకు తిన్నాను.
ఇంక పడుకోడానికి చొక్కాలు విప్పి మామూలు మల్లు పంచ కట్టుకొని పడుకుంటే చలి ఆగేటట్టు లేదు. అందుకని సూటూ ఓవరుకోటూ తియ్యకుండా జోడుమట్టుకు విడిచేసి మంచము దగ్గిరికి వచ్చాను. ఆ పరుపుపైన ఉన్న పట్టు బొంత చూస్తే దానిమీద పడుకోబుద్ధి అయింది కాదు. బొంత ముద్దొస్తోంది. సరికొత్తదిగా కనబడుతోంది. అది నలిగి పోతుందంటే ఎంత మాత్రమూ మనసొప్పలేదు. నా బొంత తీసి కిందో సోఫామీదో వేసుకుని పడుకుందామా అనుకున్నాను. మళ్లీ ఇంత డబ్బూ ఇస్తూ కింద పడుకోవడము ఖర్మ మేమని మంచము మీదున్న బొంత తీసి కుర్చీమీద మడిచిపెట్టి నా శాలువ కప్పుకుని, మరునాడే నా డబ్బు వస్తుందా రాదా, రాక పోతే మన గతేమి కానని ఆలోచిస్తూ నిద్రపోయాను.
పొద్దున్నే ఒక బంట్రోతు వచ్చి లేపాడు. వాడు నన్ను చూసి ఏదో అని చక్కాపోయాడు. ఇంకొక క్షణాని కింకొకడు వచ్చాడు. వాడూ లోపలికి తొంగిచూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా ఆ హోటల్లో ఉన్న నౌకర్లంతా ఒక్కక్కళ్లే వచ్చి గదిలోకి తొంగిచూడడమూ, నవ్వుకుంటూ పరుగెత్తడమూను, ఇదంతా చూస్తే నాకు వొళ్లు మండుకొచ్చింది. తిన్నగా వెళ్లి గుమాస్తాతోటి చెప్పి అతన్ని పైకి తీసుకు వచ్చాను. మేము వచ్చేటప్పటికి నలుగురైదుగురు బంట్రోతులింకా అక్కడ నుంచుని విరగబడి నవ్వుతున్నారు. మమ్మల్ని చూడడముతోనే వాళ్ళు నవ్వు ఆపేశారు. గుమాస్తా వాళ్లని మందలించి నాకు క్షమాపణ చెప్పి తనూ నవ్వుకుంటూ పోయాడు. ఈ నవ్వు కంతకూ కారణం నా శాలువానేమో ననుకున్నాను.
అవశిష్టాలన్నీ తీర్చుకుని ఫలహరం చేస్తుండగా కుక్ వారి కంపెనీనుంచి, నాకు డబ్బు వచ్చిందని మనిషి వచ్చి చెప్పాడు. ఆ మాట వినడముతోనే ఎక్కడలేని సంతోషమూ వచ్చింది. వెళ్లి ఆ సొమ్ము తీసుకుని హోటలుకు వచ్చి ఆపూటే రైలుందని తెలుసుకుని త్వరగా సామాను సర్దుకుని కిందకు వచ్చాను. గుమాస్తా బిల్లు ఇచ్చాడు. ఆ బిల్లు మొత్తమెంతో ఇప్పుడు చెప్పదలచుకోలేదు. కాని అది వింటేమట్టుకు ఎంత జమీందారుకైనా ఒక్కసారి గుండె కొట్టుకోవడము మానేస్తుందని నానమ్మకము. సొమ్ము చెల్లిస్తోంటే ఇద్దరు నౌకర్లు అక్కడవచ్చి నిలబడ్డారు. వెళ్లిపోతున్నాముకదా వాళ్ళకేమైనా బహుమతిచేస్తే దర్జాగా ఉంటుందని ఆలోచించి వాళ్ళందరికి తలొక అణా ఇచ్చాను. ఇచ్చినందుకు సంతోషించవచ్చునా! ఆ అణాకాసుని ఇటుతిప్పి అటుతిప్పి వాసనచూచి గుమాస్తాదగ్గర ఒక లెన్సు అడిగి పుచ్చుకుని, దానితోటి పరీక్షచేసి మూతి విరుచుకుని అక్కడ పారేసి చక్కాపోయారు. వాళ్ళ పొగరు మోత్తనము చూస్తే మట్టుకు నాకు చాలా కోపము వచ్చింది. డబ్బంటే తేరగా వస్తుందనుకున్నారు కాబోలు! వాళ్ళ కింతకంటే మహా ఎక్కువిచ్చే దెవడు! తీసుకో కేం చేస్తారని నాదారిని నేను రైలుకి వెళ్ళిపోయాను.
కుక్ వారి మనిషి ఫోక్ స్టను కొక టిక్కట్టుకొని ఇచ్చి, పారిసులో రైలు మార్చుకోమనీ మళ్లీ బోలోనులో దిగి స్టీమ రెక్కుతే ఫోక్ స్టను అనే ఊరు చేరుతావనీ చెప్పాడు.
రైలు సామాన్యంగా మన దేశపు రైలుకు మల్లేనే ఉంది. ఎటొచ్చీ పెట్టెలింకా కొంచెము విశాలంగా ఉన్నాయి. మూడవ తరగతి పెట్టెలకు కూడా పరుపులున్నాయి.
తెల్లవారే సరికి పారిసు చేరాము. అక్కడ దిగి దంత ధావనాదికములు కానిచ్చి కొత్త రైలు దగ్గరికి వెళ్ళాను. జనం కిటకిట లాడుతూ ఉన్నారు. రెండు పెట్టెలు మట్టుకు ఖాళీగా ఉన్నాయి. అవీ మూడో తరగతివే కదా అని వెళ్ళి కూచున్నాను. ఇంకో నిముషాని కొక దొరసాని వచ్చి నన్ను చూచి ఒక బంట్రోతును కేకేసి నన్ను దింపమని చెప్పిందని తోస్తుంది. బంట్రోతు నన్ను దిగమన్నాడు. ఫ్రెంచిలో అనేక విధాల ఏమేమిటో చెప్పాడు. ఏమయినా సరే, ఇందులో నుంచి దిగనన్నాను. వాడు వెళ్ళి గార్డును తీసుకువచ్చాడు, వాడు చెప్పినా దిగనన్నాను. కిటికీ తలుపుకేసి చూపించాడు. దానిమీద (Des Dames) అని రాసి ఉంది, అదేమిటో నాకర్థం కాలేదు. బాగానే ఉంది సంతోషించా నన్నాను. దిగమన్నాడు. ఎందుకుచేత నన్నాను. వాడికేమీ తోచక, స్టేషన్ మాస్టరును తీసుకువచ్చాడు. ఆ పెద్ద మనిషికి కొంచెం ఇంగ్లీషు వచ్చు. ఆయన వచ్చి సవ్యమైన భాషలో అది ఆడవాళ్ళ పెట్టె గనుక దిగమని ప్రార్థించి ఖాళీగా ఉన్న ఇంకోపెట్టెలో కూచోబెట్టాడు.
మధ్యాహ్నం బొలోస్ చేరాను. దిగి స్టీమరెక్కాను. ఆ స్టీమరు చాలా చిన్నది. సముద్రమా మహా హడావిడిగా ఉంది. అందుకని ప్రతివాళ్ళకూ వికారమూ, వాంతులూ. అన్నాళ్లు స్టీమరు ప్రయాణం చేసినా ఇంత బాధ ఎప్పుడూ పడలేదు. అందరూ తలో మూలా ప్రాణం పోతున్నట్టు పడుకున్నారు. ఈ అవస్థ ఎప్పుడు వదులుతుందా అనుకొన్నాను. మొత్తంమీద రెండు గంటలకంటె ఎక్కువ పట్టలేదు. కాని ఆ కాస్త సేపూ యుగం లాగ ఉంది.
ఫోక్ స్టనులో దిగేటప్పటికి సుమారు అయిదు గంటలవుతుంది. ఇంగ్లండులో అడుగు పెట్టానన్నమాట జ్ఞాపకం పెట్టుకొని మొదట కుడికాలే పెట్టాను. మనసులో ఒక విధమైన ఆందోళన బయలు దేరింది. గుండెల్లో అదురు పుట్టింది. ఇంతవరకూ మొండి తనంగా కొట్టుకొచ్చాను. ఇక ముందేమో అని ఆలోచన పోయింది. అన్నింటికీ ఈశ్వరుడే ఉన్నాడని ఒక్క దణ్ణం పెట్టుకున్నాను.
మొదటి భాగం
పూర్తి అయింది.